April 24, 2024

ఏ నావదే తీరమో…

రచన: సురేశ్ పెద్దరాజు.

 

మ్రోగే మొబైల్ ఫోనుపైనున్న లాండ్ లైన్ నెంబర్ చూసి ఎవరు చేశారా అనుకుంటూ తీసి హల్లో అన్నాడు రఘురామ్. ఎవరూ మాట్లాడక పోయేసరికి ఇంకోసారి హల్లో అన్నాడు.

మరికొన్ని సెకన్ల తరువాత “నేను హారికను” అని చిన్నగా వినిపించింది అటువైపునుంచి.

“హేయ్ హారిక ఎక్కడికి పోయావు వారంరోజుల నుంచి? ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది. మీ ఆఫీసుకు వెళ్తే రావట్లేదని చెప్పారు. ఏమయ్యావు? ఇక నేనే మీ ఇంటికి వద్దామని డిసైడ్ అయ్యాను. ఇంతలో నువ్వే చేశావు. అవునూ… లాండ్ లైన్ నుంచి చేస్తున్నావు. మీ ఇంటిది కూడా కాదు. నీ సెల్ ఫోన్ ఏమైంది? ప్రశ్నల వర్షం కురిపించాడు రఘు.

“రఘు ముందు నేను చెప్పేది విను. ఇకపై మనం కలవడం కుదరదు. ఇంట్లో నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.”

“మరి మన ప్రేమ??”

“మరచిపోవడమే. నేను వారంరోజులుగా అదే ప్రయత్నంలో వున్నాను. నువ్వు కూడా నన్ను మరచిపో. ఇది చెప్పడానికే ఫోన్ చేశాను.”

“లేదు హారికా….అలా ఫిక్స్ అయిపోకు. నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను.”

“వేస్ట్…ఇంటర్ కాస్ట్ మ్యారేజికి మా ఇంట్లో చచ్చినా ఒప్పుకోరు. అందులోనూ మాకన్నా తక్కువ కులం వాడవివని నిన్ను అవమానిస్తారు.”

“అన్నీ తెలిసే ప్రేమించావుగా నీవు…ఇప్పుడిలా మాట్లాడుతావేంటి?”

“తెలుసో, తెలీయకో ప్రేమించాను. కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా మావాళ్ళకు వ్యతిరేకంగా నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను.”

“అలా అనకు హారికా…ఓసారి కలసి కూర్చొని మాట్లాడుకుందాం. ఈరోజు సాయంత్రం కాఫీడేలో కలుద్దాం సరేనా?”

కాసేపు మౌనం తరువాత “నాకు రావడం కుదరదు. నేను చెప్పాల్సింది చెప్పాను. వుంటాను…గుడ్ బై!” అని ఫోన్ కట్ చేసిన శబ్దం వినపడింది.

ఆందోళనకు గురైన రఘు తిరిగి అదే నెంబరుకు తన ఫోన్ నుంచి చేశాడు. ఫోన్ తీసిన వాడు. ఇది పబ్లిక్ టెలిఫోన్ అని, ఇప్పుడే ఓ అమ్మాయి మాట్లాడి వెళ్ళిపోయిందని చెప్పాడు.

పిచ్చి కోపంతో ఫోనును నేలకేసి కొట్టాడు. ఆ శబ్దానికి పక్కగదిలో వున్న రఘు వదిన భవాని తన గదిలోకి వచ్చింది.

కింద పడిన సెల్ఫోన్ భాగాలను ఒకొక్కటి ఏరుతూ “ఎందుకంత కోపం? ఎవరిమీద?” అంటూ అడిగిందామె.

కళ్ళల్లోని కన్నీటిపొరను చూపలేక తల పక్కకు తిప్పుకున్నాడు రఘు.

“రఘు… ఏమైంది?”

ఏమీ మాట్లాడక మౌనంగా వుండిపోయాడు.

“అరే అడుగుతోంది నిన్నే…అంటే నాతో చెప్పకూడదా?”

“నీతో కాక నేను ఇంకెవరికి చెప్పుకుంటాను వదినా నా బాధలు” అంటూ ఇందాక హారిక ఫోన్ సంగతి చెప్పాడు.

రఘు, హారిక రెండేళ్ళ క్రితం జరిగిన జాబ్ మేళాలో మొదటిసారి కలిశారు. ఇద్దరూ వేర్వేరు కంపెనీలలో ఉద్యోగం సంపాదించారు. అలా ఏర్పడిన పరిచయం మొదట స్నేహంగా మారి ఆరునెలల్లో అది ప్రేమకు దారితీసింది. మూడు నెలల క్రితం వరకూ సినిమాలు, షికార్లతో బాగానే గడిపారు. ఇక ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్ళికి ఒప్పిద్దామనుకునేంతలో అనుకోని మలుపు. అంతవరకూ బెంచ్ పై వున్న రఘు ఉద్యోగం కంపెనీ ఇచ్చిన పింక్ స్లిప్ తో వూడింది. తరువాత ఉద్యోగానికై చాలా ప్రయత్నాలే చేశాడు…చేస్తున్నాడు కానీ పొందలేకపోయాడు. రాను రాను హారిక అతనికి దూరం జరగసాగింది. ఆమెలో వస్తున్న మార్పును గమనించి ఉద్యోగంలో జాయినయితే అన్నీ సర్దుకుంటాయిలే అని సరిపుచ్చుకున్నాడు. ఇప్పడు వున్నట్టుండి హారిక ఇచ్చిన ఈ ట్విస్ట్ ను భరించలేకున్నాడు.

వీరి ప్రేమ సంగతి రఘు ఇంట్లో అతని వదినకు తప్ప ఇంకెవరికీ తెలీదు.

“ఏంటి వదిన తను ఇలాంటి డెసిషన్ తీసుకుంది.” అడిగాడు రఘు ఏడుపు మొఖంతో.

“ఈ కాలపు అమ్మాయిలు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు రఘు. ముందులా గుడ్డిగా అబ్బాయిల వెంట నడవట్లేదు. నీకు జాబ్ వుంటే కులం వేరైనా ఇంట్లో ఒప్పించవచ్చు అనుకుంది. నీకు జాబ్ పోయేసరికి అది కష్టం అనిపించి వుండొచ్చు. ఇక ఇంట్లో కూడా ప్రెషర్ వుండిడొచ్చు. ఈ బాధలన్నీ ఎందుకు హాయిగా ఇంట్లో వాళ్ళు చూపించిన వాడిని చేసుకోక అని డిసైడయి పోయుంటుంది.”

“నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తావా వదినా…మీ అడవాళ్ళంతా ఇంతే” నిష్టూరమాడాడు రఘు.

“నేను తనని సపోర్ట్ చేయట్లేదు. నీకు వాస్తవం వివరిస్తున్నాను. నీకు మళ్ళీ జాబ్ వచ్చేంతవరకు తను వేచి వుండే పరిస్థితి వుండకపోవచ్చు. తను ఈ నిర్ణయానికి రావడానికి నిన్ను కలవని ఈ వారం రోజులు ఆలోచించి వుంటుంది.   ఈ కాలం ఆడపిల్ల పెళ్ళి విషయంలో, జీవిత భాగస్వామి నిర్ణయించుకోవడంలో చాలా ఆలోచిస్తుంది రఘు”

“ఆ… అవును ఆడపిల్లలకే వుంటాయి మరి…మాకు ఏ ఆలోచనలు వుండవు. తనతో కలసి జీవించబోయే జీవితాన్ని ఎంతగా వూహించుకున్నాను. ఇలా మధ్యలో వదిలేసి వెళ్తాదని వూహించలేకపోయాను.” అంటూ మూగగా రోదించాడు.

“ఛ..ఆడపిల్లాలా అలా ఏడవడమేంటి? నేను కలసి మాట్లాడేదా తనతో” అడిగింది భవాని.

ఏమీ సమాధానం ఇవ్వలేక కిటికీ గుండా బయటకు అలాగే చూస్తుండిపోయాడు రఘు.

తరువాతి రెండురోజుల్లో హారికను కలవడానికి భవాని చాలా కష్టపడవలసి వచ్చింది. అప్పటికే తనకి నిశ్చితార్థం జరిగిపోయిందని, ఆ నిశ్చితార్థం రోజే చివరిగా రఘుతో మాట్లాడిందని తెలిసింది.

షాక్ నుంచి కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది రఘుకు. తల్లిదండ్రులు, అన్నావదినలు ఎన్నోరకాలుగా చెప్పాక తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నెలరోజులకి ఒక చిన్న కంపెనీలో జాబ్ సంపాదించాడు. అలా తను జాబులో బిజీ అయిపోయి తిరిగి గాడిలో పడ్డాక అతనికి పెళ్ళిసంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లోవాళ్ళు.

చాలా రకాల వడబోతల తరువాత కొన్నింటిని సెలెక్ట్ చేసి ఫోటోలను రఘుకు చూపించారు. మీరు వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అన్నాడు రఘు. చివరికి బలవంతం మీద మొదటిసారి పెళ్ళిచూపులకు వచ్చాడు.

ఆమ్మాయి పేరు ప్రవల్లిక. బియస్సీ చదివింది. బాగానే వుందనిపించింది అందరికి. నీవేమంటావ్ అన్నట్టు చూసింది రఘుని అతని వదిన. ఏమీ మాట్లాడకపోయేసరికి తనుతో మాట్లాడతావా అని అడిగింది. ఊహు అని రఘు అడ్డంగా తలూపుతుండగా ఇంతలో…

‘ఇద్దరిని వదిలేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం అలా కాస్త బయట వరండాలోకి వెళ్దామంటూ లేచాడు’ రఘు అన్న ఈశ్వర్. నిముషంలో అందరూ గది బయటకు వెళ్ళారు.

రఘు, ప్రవల్లిక మిగిలారు అక్కడ. ఇద్దరి మద్య కాసేపు మౌనం. ముందుగా రఘునే మాట్లాడుతూ , “మీరు పీజీ చెయ్యాలనుకుంటున్నారా? లేకపోతే  ఇక్కడతోనే ఆపేస్తారా?” అడిగాడు.

“ఇంకా చదవాలనివుంది” అంది ప్రవల్లిక.

అలా అయిదునిముషాల పాటు తనకి తోచిన ప్రశ్నలు అడిగాడు. తనకు తోచింది మాట్లాడాడు. కాని తనంతకు తానుగా ఒక్క మాట మాట్లాడలేదు. అడిగిన వాటికి కూడా ముక్తసరిగా సమాధానమిచ్చింది. బిడియస్తురాలిగా అనిపించిందతనికి. ఇక తరువాత మాట్లాడడానికి ఏమీ తోచక బయటకు వచ్చేశాడు రఘు.

వెళ్ళిన తరువాత ఏ విషయం తెలియజేస్తామని వచ్చేశారు.

తరువాత మిగతా వాళ్ళని కూడా చూశాక మొదట చూసిన అమ్మాయే రఘుకు సరైన జోడి అనుకున్నారు అందరూ. నీవేమంటావ్ రఘు అడిగింది భవాని. ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రఘు.

మరుసటి రోజు ప్రవల్లిక తల్లిదండ్రులకు  ఫోన్ చేసి ‘మాకూ, మాఅబ్బాయికీ  మీ అమ్మాయి నచ్చింది. మరి మీకు, మీ అమ్మాయికి మావాడు నచ్చాడా?’ అడిగారు. ‘నచ్చకపోవడానికేముంది, మీ సంబంధం మాకు అన్నివిధాల నచ్చిందంటూ మిగిలిన విషయాలు మట్లాడుకోవడానికి తొందరలో మీ ఇంటికి వస్తామన్నారు అమ్మాయి వారు.

ఆ తరువాత నుంచి రఘులో వచ్చిన హుషారుని గమనించారు ఇంట్లో వాళ్ళు. పెళ్లికళ వచ్చేసిందని ఆటపట్టించారు అతన్ని. అన్నీ మంచి శకునములే అని మురిసిపోయారు.

రఘు ఆఫీసులో సిస్టం ముందు కూర్చోని పని చేసుకుంటున్నాడు. ఇంతలో “రఘు, మిమ్మల్ని కలవడానికి మిస్ ప్రవల్లిక వచ్చారు” అంటూ రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి చెప్పింది.  విని ఆశ్చర్యపోయిన రఘు ఎందుకు వచ్చిందా అనుకుంటూ రిసెప్షనుకు వచ్చాడు.

ప్రవల్లికను నవ్వుతూ పలకరించి రండి కాంటిన్ వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తనని తీసుకెళ్ళాడు.

తనని ఓ టేబుల్ దగ్గర కూర్చుండబెట్టి ఏమి తీసుకుంటారు అని అడిగాడు. తనకేమీ వద్దంది ప్రవల్లిక. అలాగెలాగ ఏదోకటి తీసుకోవాలి అంటూ వెళ్ళి రెండు కాఫీ కప్పులతో వచ్చి కూర్చొని తనకి ఒకటి అందిస్తూ “చెప్పండి ఏమిటిలా వచ్చారు? ఏదైనా మాట్లాడాలా?” అడిగాడు రఘు.

“మీరు నన్ను ఓకే చేశారు కదా ….కానీ నా కిష్టం లేదు మిమ్మల్ని చేసుకోవడానికి” సూటిగా వచ్చింది ఆమె నుంచామాట.

పెదవుల మధ్య పెట్టుకున్న కప్పులోని కాఫీ లోనికి తొణికి రఘు నాలిక సుర్రుమంది. కొన్ని క్షణాల మౌనం తరువాత “ఈ విషయం మీ ఇంట్లోనే చెప్పొచ్చు కదా…నాదాక రావడం ఎందుకు?” అన్నాడు.

“ఇంట్లో చెప్పలేకే కదా మీ దగ్గరకు వచ్చింది”

“అంటే..ఇప్పుడు మీరు నాకు నచ్చలేదని మీవాళ్ళకు చెప్పాలి…అంతేనా!”

“అంతే!”

“సరే అయితే…. ఇలా నాతోనే చెప్పించడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా!”

“నేను ఇంకొకరి ప్రేమిస్తున్నాను. పెళ్ళి చేసుకోవడానికి కాస్త సమయం కావాలి. తను ఇంకా సెటిల్ అవ్వలేదు. అయ్యాక మా ఇంట్లోవాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది.”

ఖిన్నుడైన రఘు తనకు జరిగిన అనుభవం తలుచుకున్నాడు. దానికి పూర్తీ వ్యతిరేకంగా వుంది ఈమె వ్యవహారం. ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకోవాలని, ప్రేమను గెలిపించుకోవాలన్న ఆమె సంకల్పాన్ని మనసులోనే అభినందిస్తూ మళ్ళీ తన పరిస్థితి మొదటికి వస్తున్నందుకు చిన్నగా నిట్టూర్చాడు.

“మరి ఆరోజు మనమిద్దరం వున్నప్పుడే చెప్పిండొచ్చు కదా..విషయం ఇంతదాకా వచ్చుండేది కాదు.”

“మీకు నేను నచ్చనులే అనుకున్నాను. నచ్చానని చెప్తారనుకోలేదు”

అవును నాదే  తప్పు …మీ అమ్మాయిలున్నారే…ఎందుకులే…హ్మ్ అని మనసులోనే వగరుస్తూ… “మీరు నిశ్చింతగా వుండండి. మీరు చెప్పమన్నట్టే చెప్తాను. మీ ప్రేమకు ఆల్ ద బెస్ట్!” చెప్పాడు రఘు.

“థాంక్స్” చెబుతూ వచ్చినపని అయ్యిందని పైకి లేచింది ప్రవల్లిక.

“కాఫీ తీసుకోండి!”

“నో థాంక్స్! ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ…..అసలు నేను కాఫీ తాగను” అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

ఇంటికెళ్ళాక జరిగినది ఇంట్లో వాళ్లకి చెప్పి తనకు ప్రవల్లిక నచ్చలేదన్న విషయం వారిచేత ఫోన్ చేయించి చెప్పించాడు రఘు.

“అప్పుడేమో ప్రాక్టికల్గా ఆలోచిస్తారన్నావు. మరి దీనికేమంటావ్ వదినా!” అని అడిగాడు భవానిని.

“ఏమంటాను…లవరికి చేసిన ప్రామిస్ నిలబెట్టుకోవడం అంటాను!”

“చూశావా మళ్ళీ ఈమె విషయంలో కూడా తనవైపునే మాట్లాడుతున్నావ్. మీ ఆడవాళ్ళంతా ఇంతే ఎప్పుడూ మగవాడిని దోషిని చేయాలనే చూస్తారు”

“ఏది జరిగినా మన మంచికే అనుకోవాలబ్బాయ్. ఇన్ని తప్పిపోతున్నాయంటే ఏ అపరంజి బొమ్మనో నీకోసమే పుట్టించి వుంటాడు దేవుడు…తను నీరాకై ఎదురుచూస్తున్నదేమో ”

“ఆ..ఆ సరే ఇక మీరు ఏ అపరింజిని, పుత్తడిని వెతక్కండి. అయినప్పుడు అవుతుంది. కాకపొతే ఇలాగే వుంటా!” అంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు రఘు.

వెళుతున్న రఘుని చూస్తూ ఎక్కడ, ఎవరితో రాసిపెట్టుందో అనుకుంటూ నిట్టూర్చింది భవాని.

తరువాత నెల రోజులకు వచ్చిన మాఘమాసంలో రఘు చుట్టాల పెళ్ళికై రాజమండ్రి దగ్గరున్న పట్టిసీమకు వచ్చారందరూ. రాను రానని అంటున్నా రఘును కూడా లాకొచ్చారు.

దాదాపు పుష్కరకాలం తరువాత ఆ వూరోచ్చాడు రఘు. అది వారి అమ్మమ్మ వూరు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నా రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ప్రతి సెలవలకి ఆ వూరు వచ్చేవాళ్ళు. అమ్మమ్మ పోయాక మళ్ళీ ఈ వూరివైపే రాలేదు. తిరిగి ఇన్నాళ్ళ తరువాత దూరపు చుట్టం. మామయ్య వరసయ్యే కూతురి పెళ్ళికి రావడం. ఆయనికి ఇద్దరి కూతుళ్ళు. ఇప్పుడు పెళ్ళవుతోంది వారి పెద్దమ్మాయికి.

గోదారిని చూస్తుంటే చిన్నప్పుడు గట్టుపక్కన ఆడుకున్న సంగతులన్నీ గుర్తుకురాసాగాయి రఘుకి. అలా గత స్మృతులను నెమరేసుకుంటున్నాడు.

ఇంతలో “హాయ్ బావ” అన్న గట్టిగా అరిచిన పిలుపుకి వులిక్కిపడి తిరిగి చూశాడు.

మొదట గుర్తుపట్టలేదు తనని. ఎవరీ అమ్మాయి అని ఆలోచిస్తూండగా “నేను బావ మధుని. మర్చిపోయావా? అన్నది.

“మధూలిక కదూ ఆ… ఆ గుర్తొచ్చింది!” నవ్వుతూ బదులిచ్చాడు.

మధూలిక పెళ్ళికూతురి చెల్లెలు. అంటే రఘుకు వరసకి మరదలు.

“అంతేలే పట్నమోడివి కదా చిన్నప్పటి స్నేహితులను మరచిపోవడం మామూలే!”

“అబ్బా అది కాదులే మధు. ఇన్నేళ్ళ తరువాత చూస్తున్నా కదా వెంటనే స్ట్రైక్ అవ్వలేదు అంతే!”

ఇక అక్కడున్న ఆ మూడురోజులు ఒకటే కబుర్లు. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ అరమరికలు లేకుండా మాట్లాడే మధూలికను చూసి అందరికీ ముచ్చటేసింది. రఘు అమ్మ ఈ అమ్మాయి తన కోడలైతే బాగుండునని, అతని వదిన తన తోడికోడలు బాగుండునని ఒకేసారి అనుకున్నారు.

ఇక వుండబట్టలేక చివరికి మధూలికను అడిగేసింది భవాని “మా రఘును పెళ్ళిచేసుకుంటావా అని.

“వాడినా నేనా?…ఏదో చిన్నప్పటి నుండి తెలుసు పైగా దూరపు చుట్టం అని కాస్తా చనువుగా వున్నంత మాత్రాన ఇష్టపడుతున్నట్టు మీకు మీరే అనుకొని పెళ్ళి చేసుకుంటావా అని అడగడం బాలేదు అక్కా…హ్మ్” అంటూ చిరాగ్గా మొహం పెట్టుకొని వెళ్ళిపోయింది మధూలిక.

హ్మ్…ఏమో అనుకున్నాను. బాగానే వుంది టెక్కు. నా మరిది కంటే మంచివాడు దొరుకుతాడా…పెద్ద బడాయి పోతోంది అనుకుంది భవాని.

పెళ్ళి తరువాత అందరూ సీతారాముల దర్శనానికి లాంచిలో భద్రాచలం బయలుదేరారు. రఘు వాళ్ళ కుటుంబం కూడా వారితో వెళ్ళింది. ఇక అక్కడునుండే హైదరాబాద్ రావాలని ప్లాన్ చేసుకున్నారు.

సీతారాముల దర్శనం తరువాత ఏటి గట్టుకు వచ్చారందరూ. రఘు వాళ్ళు హైదరాబాదు బయలుదేరడానికి ఇంకా మూడుగంటలు వుంది. అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. వారిని వదిలి రఘు అలా తీరం వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాడు.

“బావా వుండు నేనూ వస్తున్నాను” అంటూ మధు వెనకనుండి పరిగెట్టుకు వచ్చింది.

“ఎందుకలా పరిగెట్టుకు రావడం. చిన్నగ రావొచ్చు కదా!”

“చిన్నగా వస్తే నువ్వందవు కదా”

ఆమె మాటలో ఏదో కొత్త అర్థం ధ్వనించింది అతనికి. క్షణంపాటు ఆగి తలతిప్పి తనని ఓసారి చూసి మళ్ళీ నడక ప్రారంభించాడు. సూర్యుడు నెమ్మదిగా పడమర దిక్కుకు వాలుతున్నాడు. ఏటిపై నుండి వచ్చే పిల్లతెమ్మరులు వారిని తాకుతున్నాయి. ఆహ్లాదకరంగా వుంది వాతావరణం.

పక్కన నడుస్తున్న మధూలిక కాసేపయ్యాక “బావా నిన్నొకటి అడగాలని వుంది” అన్నది.

“ఊ.. అడుగు ఇంకెందుకు ఆలస్యం”

నడుస్తున్న ఆమె ఆగిపోయి “బావా నన్ను పెళ్ళిచేసుకుంటావా!” అన్నది

నడుస్తున్న రఘు ఆగి వెనక్కి తిరిగి అమాయకమైన ఆమె మొహంలోకి అలాగే చూస్తుండిపోయాడు.

ఎంతకీ మాట్లాకపోయేసరికి “ఏం బావ…ఈ పల్లెటూరి పిల్లను చేసుకోవడం ఇష్టం లేదా?”

“ఛ అలాంటిదేమీ లేదు మధు. నీకేంటి స్వాతిముత్యనివి. ఇష్టమున్న దానివి  మరి వదినతో ఎందుకలా చెప్పావంట”

“ఓ.. అదా వూరకే చిన్న జలక్ ఇచ్చాను. నా ఇష్టాన్ని నేరుగా నీకే చెబుతామని” చిలిపిగా నవ్వుతూ అన్నది.

మళ్ళీ తనే మాట్లాడుతూ “బావా నువ్వంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం తెలుసా! అక్క పెళ్ళయ్యాక నేనే నాన్నను అడుగుదామని అనుకున్నాను. అదృష్టం బాగుండి మీరందరూ పెళ్ళికి వచ్చారు. ఈరోజు విషయం ఆటో ఇటో తేలిపోవాల. ఇంకా నీ గురించి ఆలోచిస్తూ ఊహల్లో తెలిపోలేను బాబు!”

ఆమె మాటలు వింటుంటే రఘుకి ఆశ్చర్యమేసింది. నా గురించి ఇంతగా ఆలోచించే ఆడపిల్ల వుందా అదీ ఎప్పటినుంచో.. తలుచుకుంటుంటే గర్వమేసింది అతనికి

కానీ వాస్తవం చెప్పాలని ప్రేమ, పెళ్ళి విషయంలో తనకు ఇంతకుముందు జరిగిన రెండు అనుభవాలను చెప్పాడు.

విన్న మధూలిక చాలా తేలిగ్గా తీసుకొని “వారికి నిన్ను చేసుకొనే అదృష్టం లేదు బావ. ఆ అవకాశం నాకు కల్పించారమో ఆలోచించు” అన్నది.

ఆలోచిస్తుంటే అవును నిజమే తనకోసమే నాకు ఇంకెవరితో పెళ్ళవకుండా అట్టిపెట్టాడేమో దేవుడు అనిపించింది అతనికి.

“నన్ను చేసుకోవడం ఇష్టమేనా? పర్లేదు బావా చెప్పు! నువ్వు అవునన్నా కాదన్నా పెద్దగా ఇదవ్వను. ఆ ఇద్దరిలాగే నాకూ అదృష్టం లేదనుకుంటాను”

రఘు ఓసారి చుట్టూ పరికించి, తిరిగి తన కళ్ళలోకి చూస్తూ “ఇష్టమే” అన్నాడు.

“ఆ… ఆ మళ్ళీ ఓసారి చెప్పు!”

“మధూ నిన్ను పెళ్ళిచేసుకోవడం నాకు ఇష్టమే!”

విన్న మధూలిక బుగ్గలు ఎరుపెక్కాయి. పడమటి దిక్కున ఆకాశం కూడా అదే రంగును పులుముకుంది. మరో అందమైన రాత్రికి స్వాగతం చెబుతూ క్షితిజరేఖ దిగువుకి చేరుకుంటున్నాడు సూరీడు. వర్ణశోభితమైన ఆ దృశ్యాన్ని ఆమె కళ్ళు తిలకిస్తూ వుంటే, చెవులు సంధ్యారాగాన్ని ఆలకిస్తూండగా, ఆమె గుండె నిండు గోదారిలా చిందులేయసాగింది.

ఆయ్…బావ ఒప్పేసుకున్నాడు అని సంబరపడిపోతూ థాంక్యూ బావ అని చెయ్యందించి వెంటనే వెనుతిరిగి ఈ విషయం తన వాళ్లకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ పోయింది

గట్టున సైకిలుపై వెళుతున్నతని రేడియో నుండి “ ఏ నావదే తీరమో…ఏ నేస్తమే జన్మ వరమో” మార్దవం నిండిన గొంతులో ఏసుదాసు పాట వినపడుతోంది.

తనని సరైన దరికి చేర్చినందుకు, తన చిన్ననాటి స్నేహాన్నే జీవిత భాగస్వామి అయ్యే వరం ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా కొండపైని ఆ సీతారాముడికి దండమెట్టుకున్నాడు రఘురామ్.

 

________________________________________________శుభం!______________________________________

10 thoughts on “ఏ నావదే తీరమో…

    1. thanks kranthi garu, yea..its simple & sweet story. అలా వుండాలనే వ్రాసింది. thanks for your feedback..తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాను…:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *