March 29, 2024

నిఘంటువులు

రచన : రసజ్ఞ

అన్నమయ్య కీర్తనలలోనూ, పంచ మహా కావ్యాలలోనూ, పురాణాది గ్రంధాలలోనూ అర్థ నిర్ణయం కాని దేశ్యపదాలు అసంఖ్యాకంగా వున్నాయి. ఆయా పదాలకు అర్థ నిర్ణయం చేయగల పండితుల సంఖ్య క్రమంగా మృగ్యమయిపోతోంది. ఒకప్పుడున్నన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవు, కొన్ని పదాలు కాలగమనంలో రూపాంతరం చెందాయి. ఈ తరం పిల్లలకి కొన్ని అక్షరాలు కూడా తెలియవు (ఉదా: ఋ, ౠ, ఌ, ౡ, ఱ, మొ.,) అనటం అతిశయోక్తి కాదు. ఇదే విధంగా కొనసాగుతూ పోతే కొన్నేళ్ళకి మన పద సంపదంతా కరిగిపోయే ప్రమాదముంది. పద సంపద పూర్తిగా తరిగిన నాడు భాష ఉనికే ప్రశ్నార్ధకం. కనుక భాషను, భాష సంబంధిత పదజాలాలను పదిలపరచుకోవడానికి నిఘంటువులు అత్యావశ్యకమయినవి. నిఘంటువులనే కోశములు, అభిధానములు అని కూడా అంటారు.

కోశములు పండితులకీ, నిఘంటువులు సామాన్యులకీ పరిమితమయ్యాయి. నిఘంటువులు పూర్వకాలం నుండీ వున్నా, ముద్రణా యంత్రాంగ పరిజ్ఞానం బాగా విస్తరించాకే పుస్తకాల ప్రచురణ విస్తృతమయినది. దానితో భాషాభిమానులకు, జిజ్ఞాసకులకు నిఘంటువులు రోజువారీ జీవితంలో భాగమయిపోయాయి. కొంతకాలం ఈ నిఘంటు రచన పోటాపోటీగా జరిగేది. ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఆన్లైన్ నిఘంటువుల వైపే జనాలు మొగ్గు చూపడం వలన ముద్రితా పుస్తకాలు తగ్గాయి. నిఘంటు రచన అంత తేలిక కాదు, కొన్ని విశ్వ విద్యాలయాలలో నిఘంటు రచన ఎలా చెయ్యాలో తెలుపుతూ నిఘంటుకారులకు ప్రత్యేకమయిన శిక్షణను కూడా ఇస్తున్నారు. పదాలను వాడుక భాషలో అర్థమయ్యేలా వ్రాయటమే కాకుండా ప్రతీ భాషలోనూ నిఘంటువులు లేనందున ప్రపంచంలోని ఇతర భాషలలోకి కూడా అనువదించి, తద్వారా అన్ని భాషలూ నేర్చుకోగలిగే విధంగా నిఘంటువులని తయారుచేశారు. ఆ విధంగా రూపొందించిన భాషా నిఘంటువులను ఆరు రకాలుగా విభజించారు:

1. సాధారణము: ఈ రకమయిన నిఘంటువులు ఒక పదానికి అర్థము, వాడుక, వ్యాకరణము, శబ్దము, శైలి, విశేషణాలు,మొ., తెలుపుతాయి.

2. ప్రత్యేకము: ఈ రకమయిన నిఘంటువులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను తెలుపుతాయి. పదాలకి వాడే సంక్షిప్త రూపాలు, అనుగణ్యాలు, సామెతలు, మాండలికాలు, ఒక వృత్తికి సంబంధించిన వారికి మాత్రమే అర్థమయ్యే పదాలు, మొ., వాటిని తెలుపుతాయి.

3. ఏక భాషా: అధిక సంఖ్యలో మనకి లభ్యమవుతున్నవి ఇవే.

4. అనువాద – ద్విభాషా లేదా బహుళభాషా: వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు – Active నిఘంటువులు (మన మాతృ భాష నుండీ వేరొక భాషలలోకి తర్జుమా చెసినవి. ఉదా: తెలుగు – స్పానిష్, తెలుగు – ఇంగ్లీష్, తెలుగు – ఫ్రెంచ్, ఇలా) మరియు Passive నిఘంటువులు (వేరే ఏ భాషలోని నిఘంటువునయినా మన మాతృ భాషలోకి తర్జుమా చెసినవి. ఉదా: ఫ్రెంచ్ – తెలుగు, స్పానిష్ – తెలుగు, ఇంగ్లీష్ – తెలుగు, ఇలా)

5. నిర్వచక లేదా వివరణాత్మక: వీటిని విజ్ఞాన సర్వస్వాలుగా చెప్పుకోవచ్చు.

6. ప్రాపంచిక

సమాచారాన్నీ, విజ్ఞానాన్నీ కూడా అందించే విజ్ఞానఖనులైన నిఘంటువుల పరిణామ క్రమాన్ని ముందుగా తెలుసుకుందాం.

 

శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః

అన్నారు. వేదాంగాలలో (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము) ఒకటయిన నిరుక్తమును రచించినది యాస్కుడు (600 – 500 BC). పదాలన్నీ కూడా ధాతువుల నుండీ ఉద్భవించాయని తెలియచేస్తూ, వేద మంత్రాలలో వాడిన ప్రతీ పదానికీ వ్యుత్పత్యార్థం వివరిస్తూ రచించిన శాస్త్రమే నిరుక్తము. ఈ నిరుక్తముకే “వేద శబ్ద వివరణ నిఘంటువు” అని మరొక పేరు. ఆ విధంగా వ్యుత్పత్తుల ద్వారా మాత్రమే పదాలకు అర్థం తెలిసేది. తరువాత, ఒక్కో పదానికీ రెండు అర్థాలు వుంటాయని వివరిస్తూ బాణుడు వ్రాసిన “శబ్ద రత్నాకరము”, శ్రీహర్షుడు, మయూరుడు, మురారి మొదలయిన వారు రచించినవన్నీ “శ్లేషార్థ పదసంగ్రహ” కోవలోకి వస్తాయి.

శబ్దార్ణవ ఉత్పాలినీ సంసారావర్త ఇతి అపి

కోశా వాచస్పతి వ్యాడి విక్రమాదిత్య నిర్మితః

అన్నట్టుగా వాచస్పతి వ్రాసిన “శబ్దార్ణవము లేదా శబ్ద కోశము”, వ్యాడుడు వ్రాసిన “ఉత్పాలిని“, విక్రమాదిత్యుడు వ్రాసిన “సంసారావర్తము” మొట్టమొదటి నిఘంటువులుగా చెప్పుకోతగినవి. కాత్యాయనుడు (3 BC) వ్రాసిన “నామమాల” కూడా వీటికి సమకాలీన నిఘంటువు. ఇప్పటిదాకా చెప్పుకున్న నిఘంటువులన్నీ ఎక్కువగా పదము యొక్క నామవాచక రూపం ఆధారంగా చేసుకుని వివరించినవే!
అమరసింహుడు (నాల్గవ శతాబ్దము) వ్రాసిన “నామలింగానుశాసనం” అనే నిఘంటువులో మొదటిసారిగా పదాల లింగాలను (స్త్రీలింగం/పుల్లింగం/నపుంసక లింగం) వివరిస్తూ నామాల వివరణ కూడా తెలిపాడు. అదేవిధంగా, దీనిలో మొట్టమొదటి సారిగా పదాల వర్గీకరణను కూడా మనం గమనించవచ్చును. ఇందులో, పదాలను మూడు కాండలు (మొదటి కాండ స్వర్గాది, రెండవ కాండ భూవర్గాది, మూడవది సామాన్యాది)గా వర్గీకరించడం వలన చదువుకునేవారికీ, ఒక పదానికి సంబంధించిన అర్థం వెతుక్కునేవారికీ కూడా సులభమయ్యింది. ఇందులో మూడు కాండలు ఉండటం వలననే దీనిని త్రికాండము అంటారు. ఒక రంగము లేదా విభాగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానాన్ని కలిగి వుండే నిఘంటువుని కోశము అంటారు. ఒకరకముగా కోశములన్నీ కూడా నిఘంటువులకి ప్రాధమిక రూపాలుగా చెప్పుకోవచ్చును. ఈ కోశములు రెండు రకాలు: నామమాత్రతంత్ర (నామాలను లేదా పదాలను కలిగి వుండేవి), లింగమాత్రతంత్ర (నామాల లేదా పదాల లింగమును తెలియచేసేవి). ఈ రెండు రకముల కోశ లక్షణాలూ వున్నందువలననే అమరసింహుడు వ్రాసిన నామలింగానుశాసనాన్ని అమరకోశము అంటారు. “అమరము రానివారికి నేనమరను” అని వాగ్దేవి చెప్పిందని పెద్దల విశ్వాసం. అందువలననే ప్రతీ ఒక్కరూ దీనిని చదవాలన్న సదుద్దేశ్యంతో ఈ అమరకోశమును ఒకనాడు మన జాతీయ పాఠ్యపుస్తకం చేశారు. బాగా ప్రసిద్ధి చెంది, మనకి లభ్యమవుతున్న పురాతన నిఘంటువులలో ఇది చాలా ముఖ్యమయినది. ఇంచుమించుగా ఇదే సమయంలో శాశ్వతుడు “అనేకార్థ సముచ్చయ” (ఇది అంతగా చదువరులను ఆకట్టుకోలేకపోవడానికి ముఖ్య కారణం పదాల వర్గీకరణ లేదా విభజన లేకపోవడమే) అనే నిఘంటువును, మహాక్షపణకుడు (10AD అని చరిత్రకారుల అభిప్రాయం) “అనేకార్థ ధ్వనిమంజరి” (ఇందులో నాలుగు అధ్యాయాలు – శ్లోకాధికారము, అర్థ శ్లోకాధికారము, పాదాధికారము మరియు వివిధాధికారము వుంటాయి) అనే నిఘంటువును రచించారు. పురుషోత్తమదేవుడు కూడా “త్రికాండ శేషము“ను వ్రాసి, దానినే కుదించి “హారావళి” (దీనినే హారావళి కోశము అంటారు)ని రచించాడు. ఈ హారావళిలో అప్పటిదాకా వెలువడిన వేరే ఏ నిఘంటువులలోనూ చోటు చేసుకోని (బౌద్ధ) పదాలను ఎక్కువగా చేర్చి, అర్థ వివరణ ఇవ్వటం వలన జనాదరణ పొందినది.

సంస్కృత నిఘంటువులు రెండు రకాలు: సమానార్థ నిఘంటువులు (ఏకార్థ నిఘంటువులు – వీటిలో పదాలు అంశముల క్రమములో అమరి వుంటాయి), నానార్ధ నిఘంటువులు (అనేకార్థ నిఘంటువులు – వీటిలో పదాలు అంత్యాక్షర లేదా ఆద్యక్షర క్రమములో అమరి వుంటాయి). కేవలం నామవాచక రూపంలోనే కాకుండా, ఒక పదానికి క్రియా రూపం, క్రియా విశేషణ రూపం కూడా వుంటాయి, ఆ రూపాలలో పదాల అర్థాలు మారతాయి కనుక వాటిని కూడా నిఘంటువులలో చేర్చాలన్న ఉద్దేశ్యంతో వచ్చినవే అనేకార్థ నిఘంటువులు. వీటిలో హలాయుధుడు (10AD) వ్రాసిన “అభిధాన రత్నమాల” [ఇందులో పదాలను అయిదు (స్వర్గ, భూమి, పాతాళ, సామాన్య పర్యాయపదాలు, సామాన్య నానార్థాలు) కాండలుగా విభజించాడు], యాదవ ప్రకాశుడు (11AD) వ్రాసిన “వైజయంతి” (ఇందులో పదాలను రెండు భాగాలుగా ఏర్పాటు చేసి, మొదటి భాగంలో పర్యాయపదాలను, రెండవ భాగంలో నానార్థాలను వివరించాడు, మొదటిసారిగా ఒక పదాన్ని ఎలా పలకాలో ఇందులో వివరించాడు), ధనుంజయ మహాకవి (1123-1140) వ్రాసిన “పర్యాయ శబ్దరత్న” మరియు “నామమాల” (ఇది 200 శ్లోకాలతో, జనపదాలతో రూపొందించబడింది), అమరకీర్తుడు వ్రాసిన “అనేకార్థ నామమాల” (కేవలం 46శ్లోకాలతో ధనుంజయుని నామమాలను ఆధారంగా చేసుకుని రచించాడు), హేమచంద్ర సూరి (12AD) వ్రాసిన “అనేకార్థ సంగ్రహము” (ఇందులో పదాలను ఆద్యక్షరాలను, అంత్యహల్లులను ఆధారంగా చేసుకుని ఏర్పాటుచేశాడు) మరియు “అభిధాన చింతామయి” (ఇందులో దేవాధిదేవ, దేవ, మర్త్య, భూమి, మొదలైన విభాగాలలో ఒక పదాన్ని ఎన్ని రకాలుగా, ఎలా వాడవచ్చో వివరించాడు), కేశవస్వామి (12AD) వ్రాసిన “నామార్థార్ణవ సంక్షేపము”, మహేశ్వర కవి (12AD) వ్రాసిన “విశ్వ ప్రకాశము”, అభ్యపాలుడు (12AD) వ్రాసిన “నామార్థ రత్నమాల”, మంఖుడు (12AD) వ్రాసిన “అనేకార్థ కోశము”, మల్లభట్టు (12AD) వ్రాసిన “అఖ్యాత చంద్రిక” (ఇందులో క్రియా రూపంలో వున్న పదాలకు అర్థ వివరణ వుంటుంది), ధరణిదాసుడు (12AD) వ్రాసిన “అనేకార్థ సారము”, మేదినీకారుడు (14AD) వ్రాసిన “మేదినీ కోశము” (దీనినే అనేకార్థ శబ్దకోశము అని కూడా అంటారు. ఇందులో పదాలను క-కారాంత, ఖ-కారాంత, గ-కారాంత, ఘ-కారాంత,మొ., క్రమంలో ఏర్పాటు చేశాడు), శ్రీధరసేనుడు వ్రాసిన “విశ్వలోచన లేదా ముక్తావళి” దండాదినాథుడు (14AD) వ్రాసిన “నానార్థ రత్నమాల”, వామనభట్ట బాణుడు (15AD) వ్రాసిన “శబ్ద చంద్రిక” మరియు “శబ్ద రత్నాకరము”, పద్మసుందరుడు (16AD) వ్రాసిన “సుందర ప్రకాశ శబ్దార్ణవము”, అప్పయ్య దీక్షితులు (17AD) వ్రాసిన “నామ సంగ్రహమాల”, తారానాథ తర్క వాచస్పతి (18AD) వ్రాసిన “వాచస్పత్యము” (వేదాంతము యొక్క సనాతన, అత్యాధునిక వ్యవస్థలలో వుండే నిబంధనలు, సిద్ధాంతాలను కూడా వివరించింది) ముఖ్యమయినవి.

కావ్యాలలో ఉపయోగింపబడుతూ, జనవ్యవహారంలో కాలానుగుణమైన మార్పులకు లోనయ్యి, పరభాషా పదములతో చెలిమి చేసి, అరమరికలు లేకుండా ఒదిగిపోయిన మన తెలుగు భాషలో కూడా నిఘంటు రచన మొదలుపెట్టారు. తెలుగు నిఘంటువులు రెండు రకములు: పద్యరూప నిఘంటువులు మరియు పదరూప నిఘంటువులు. పద్యరూప నిఘంటువులలో పదములకు సంబంధించిన వివరణంతా ఒక పద్య రూపంలో వుండటం వలన గుర్తు పెట్టుకోవడానికి, మననం చేసుకోవడానికీ వీలుగా వుంటుంది. ఇటువంటి పద్యరూప నిఘంటువులలో – కవి రాక్షసుడు వ్రాసిన “శబ్దార్థ నిర్ణయము”, గణపవరపు వేంకటకవి వ్రాసిన “వెంకటేశ ఆంధ్రము” మరియు “దేశీయ ఆంధ్ర నిఘంటువు”, ధూర్జటి వెంకటరాయ కవి వ్రాసిన “పద్యరూప అమర కోశము”, పైడిపాటి లక్ష్మణ కవి వ్రాసిన “ఆంధ్ర రత్నాకరము” మరియు “ఆంధ్ర నామసంగ్రహము”, అడిదం సూరకవి వ్రాసిన “ఆంధ్ర నామవిశేషము”, విరపరాజు వ్రాసిన “ఆంధ్ర పదకారం”, ప్రగడకవి వ్రాసిన “నానార్థ నిఘంటువు”, నందపాక పార్వతీశ్వర శాస్త్రి వ్రాసిన “అక్షర మాలికా నిఘంటువు”, జయరామరాయులు వ్రాసిన “జయరామ నానార్థ నిఘంటువు” (ఇది మూడు భాగాలుగా వెలువడింది : నానార్థ నిఘంటువు, అర్థానుస్వార నిఘంటువు మరియు శకటరేఫ నిఘంటువు), కస్తూరి రంగ కవి వ్రాసిన “సాంబ నిఘంటువు”, నుదురుపాటి వెంకటకవి వ్రాసిన “ఆంధ్ర భాషా అర్ణవము” ముఖ్యమయినవి. చౌడప్ప కవి కూడా “36 సీస పద్యాల” రూపంలో ఒక నిఘంటువును రచించారు. ఇన్ని రకాల నిఘంటువులు మనకు అందుబాటులోకి వచ్చినా, అప్పటిదాకా ఉన్నవన్నీ కూడా పద్య నిఘంటువులు కావడంతో, పద నిఘంటు రచనకు పూనుకున్నారు కవులు.

తెలుగులో పదరూప నిఘంటువులు 19వ శతాబ్దంలోనే వచ్చాయి. వీటిల్లో మనకి పాశ్చాత్య దేశ భాషల నిఘంటువుల ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది. అందువలననే, పదరూప నిఘంటువులలో పదాలు వర్ణమాల క్రమములో అమరి ఉండటమే కాకుండా, పాశ్చాత్య భాషల నిఘంటువుల మాదిరిగానే ఆ పదాన్ని ఎలా పలకాలి, కఠినమయిన పదాలకి సామాన్యమయిన అర్థం ఏమిటి, వాటి నానార్థాలు, పర్యాయపదాలు, ఏ భాషాభాగం, సంబంధిత పదాలు ఏమిటి, మొదలయినవన్నీ చేర్చి ఒక సంపూర్ణతను తీసుకునివచ్చారు. తెలుగులో మొట్టమొదటగా చెప్పుకోదగిన నిఘంటువు మామిడి వెంకటరాయ కవి వ్రాసిన “ఆంధ్ర దీపిక” (1816) కాగా మొట్టమొదటి పద నిఘంటువుగా పేరొంది, సులభంగా రూపొంది, అందరికీ అందుబాటులోకి వచ్చిన నిఘంటువు జయంతి రామయ్య పంతులు వ్రాసిన “సూర్యరాయాంధ్ర నిఘంటువు” (1936).

పరవస్తు చిన్నయసూరి వ్రాసిన “చిన్నయసూరి నిఘంటువు” పదాలను ఎలా వాడాలో ప్రామాణిక రచనలను ఆధారంగా చేసుకుని విశదీకరించింది. ఇది ఏడు సంపుటాలుగా వెలువడింది. తరువాత వచ్చిన ఎన్నో నిఘంటువులకి ఇదొక తలమానికగా నిలిచింది. పరవస్తు వెంకట రంగాచార్యులు వ్రాసిన “శబ్దార్థ సర్వస్వం” కూడా చిన్నయసూరి నిఘంటువు ఆధారంగా వెలువడినదే. బహుజనపల్లి సీతారామాచార్యులు వ్రాసిన “శబ్ద రత్నాకరము”, “వైకృత పద దీపిక”, “బాల చంద్రోదయము” (పిల్లల కోసం వ్రాసిన లఘు నిఘంటువు) మరియు “పదార్థ నామకోశము” ఎంతో అపురూపమయినవి. శబ్ద రత్నాకరము లేని ఇల్లు వుండదేమో! ఇందులోని శబ్దముల రూప నిర్ణయం, అర్థ నిర్ణయం శాస్త్ర సమ్మతమయినవి. అక్షర క్రమంలో రచింపబడిన నిఘంటువులలో ఇది అత్యంత శ్రేష్టమయినది. ఓగిరాల జగన్నాథకవి మరియు గురజాడ శ్రీరామమూర్తి వ్రాసిన “ఆంధ్ర పదపారిజాతం”, మహంకాళి సుబ్బారాయుడు వ్రాసిన “శబ్దార్థ చంద్రిక”, పి. శ్రీరాముల రెడ్డి వ్రాసిన “రామచంద్ర విద్యార్థి కోశము” (ముఖ్యముగా పాఠశాలలోని విద్యార్ధినీ, విద్యార్ధుల కోసం వ్రాసినది), తాటికొండ తిమ్మారెడ్డి వ్రాసిన “శబ్దార్థ చింతామణి” (1906, ఇందులో తెలుగు పదాలకు వివరణతో పాటూ ఉర్దూ పదాలను కూడా చేర్చారు), కోట్ర లక్ష్మీనారాయణ శాస్త్రి వ్రాసిన “లక్ష్మీ నారాయణీయం” (1907, ఇందులో జాను తెలుగు పదాల వివరణ వుంటుంది), కోట్ర శ్యామల కామశాస్త్రి వ్రాసిన “ఆంధ్ర వాచస్పత్యము”ల తరువాత జయంతి రామయ్య పంతులు వ్రాసిన “సూర్యరాయాంధ్ర నిఘంటువు” 1936లో వెలువడింది. అటు పిమ్మట శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి, బులుసు వెంకటేశ్వర్లు మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి వ్రాసిన “వావిళ్ల నిఘంటువు” (1949), చెలమచెర్ల రంగాచార్యులు వ్రాసిన “ఆంధ్ర శబ్ద రత్నాకరము”, భమిడిపాటి అప్పయ్యశాస్త్రి వ్రాసిన “శబ్ద కౌముది” (ఆంధ్ర నిఘంటువు), విక్రాల శేషాచార్యులు వ్రాసిన “సంస్కృతాంధ్ర పదార్ణవము”, చిలుకూరి నారాయణరావు వ్రాసిన “సంస్కృతాంధ్ర పదనిఘంటువు”, “అచ్చ తెలుగు నిఘంటువు” మరియు “నన్నయ భారత పదకోశము” వెలువడ్డాయి. ఇవేగాక శబ్దార్థ దీపిక, తెలుగు జాతీయములు – పదబంధ పారిజాతము, మాండలిక పద కోశము, మొదలయినవెన్నో నిఘంటువులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

ఇప్పటిదాకా మనం చర్చించుకున్నవన్నీ కూడా ఏకభాషా నిఘంటువులు. కానీ, అదే సమయంలో మనకి ద్విభాషా నిఘంటువులు కూడా చాలానే వెలువడ్డాయి. ఒక క్రొత్త భాష నేర్చుకోవాలన్నా, ఇతర భాషీయులు మన భాషను చదివి ఆస్వాదించాలన్నా నిఘంటువులు సహకరిస్తాయి. బ్రిటిషు వారు మన దేశాన్ని పరిపాలించిన సమయములో ఆంగ్లేయులు సైతం తెలుగు నిఘంటు రచనకు పూనుకుని ఎన్నో ద్విభాషా నిఘంటువులను మన ముందుకి తీసుకువచ్చారు. వారిలో William Brown (తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు, 1818), A.C.Campbell (తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు, 1821), Morres (తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు (1835) ప్రముఖులు. తెలుగు లిపి సంస్కర్త, ఆంధ్ర భాషోద్ధార బిరుదాంకితుడయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన “బ్రౌణ్య నిఘంటువు” (1852-1854) తో తెలుగు నిఘంటు రచనలో ఆధునిక యుగం ఆరంభమయినదని చెప్పవచ్చు. వీటన్నిటి తరువాత వచ్చిన శంకర నారాయణ తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువు (1891) బాగా జనాదరణ పొందినది. ఆ తరువాత కాలగమనంలో ఎన్నో ద్విభాషా నిఘంటువులు వచ్చాయి.

ప్రపంచీకరణ, ఆధునికతల వలన ప్రతీ భాషా మిగతా భాషలతో కలగలిసి మిశ్రమ భాషగా మారుతోంది. మనం నిత్యం వాడే పదాలలో ఆంగ్లము, హిందీ, ఉర్దూ ఎక్కువగా వుంటాయి కానీ వాటి సరయిన తెలుగు పదాలు తెలియవు. అంతేకాక, ఒకే భాషలోని పదానికి ప్రాంతాలను బట్టీ అర్థాలు మారిపోతుంటాయి. భాషను సజీవంగా వుంచడానికి, భాషలో క్రొత్తగా చేరిన పరభాషా పదాలకీ, ప్రాంతీయ పదాలకీ అనుగుణంగా పదాల నిర్మాణం జరిగి ఒక ప్రామాణిక నిఘంటువు రూపొందాలి. ఈ నిఘంటువులు మన భాషకే పరిమితం కాకుండా ప్రపంచ భాషల అనుసంధానికి ఉపయోగపడే వారధులని గుర్తుంచుకుని, వాటి అభివృద్ధికి సాయపడదాం.

ఆధారాలు:
1. A History of Indian Literature : Indian Lexicography, Claus Vogel, 1979

2. Encyclopedia of Indian literature, Amaresh datta, 1988

3. A Companion to Sanskrit Literature, Sures Chandra Banerji, 1989

4. A History of Sanskrit Literature, A.berriedale Keith, 1993

 

7 thoughts on “నిఘంటువులు

  1. సర్ మాకు ౠ మొదలయ్యే తెలుగు పదాలు కావాలి దయచేసి మాకు పంపించండి

  2. okkate artham nigantuvuku kaani ennarthaalo vivaristhundhi….okkate medhassu andhariki kaani entho anubhavam kaliguntundhi… mee medhassu kooda oka nighantuvuga undhandi..meeku thaggatte rasaaru….rasagna gaaru 🙂

  3. Quite good! For the information of the readers, due to the painstaking efforts by SrI SEshatalapaSAyi and his colleagues, supported by TANA and others, an extensive on-line Telugu dictionary with access to several dictionaries (some of them mentioned in this article) is now available. Also available is a Sanskrit dictionary at the same site. Please use this rich resource and support this venture, that even universities and the AP government failed to do. It is not enough to celebrate world conferences on Telugu and proclaim Telugu is a classical language. The url is http://andhrabharati.com/
    Regards! – mOhana

  4. రసజ్ఞ పరిశోధనాత్మక వ్యాసం చాలా బాగుంది.రసజ్ఞకు కృతజ్ఞతలు.

    టీవీయస్.శాస్త్రి

  5. ‘నిఘంటువు’ గురించి సరైన అవగాహన కల్గించావమ్మా. ఎంత నిశిత పరిశోధన… సమగ్ర వివరణతో చక్కగా విశదపరచారు రసజ్ఞ.
    చాలా బాగుంది. అభినందనలు.

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *