March 29, 2024

విజయ చిత్రములు

రచన : జెజ్జాల కృష్ణ మోహన రావు

 

పరిచయం : ఈమారు చాంద్రమాన ఉగాది ఏప్రిల్ 11, 2013 తారీకు వస్తుంది.  ఉగాది అనే పేరు యుగపు ఆది నుండి పుట్టినది అంటారు.  ఇంటిలో కన్నడము మాట్లాడే మేము ఈ పండుగను యుగాది అనే పిలుస్తాము. ఈ ఉగాది పండుగ తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వాళ్లు, ఉత్తరదేశములో కొన్ని చోటులలో జరుపుకొంటారు. ఈ ఉగాది నాడు విజయ అనే కొత్త సంవత్సరము ఆరంభమవుతుంది.  మన హిందువుల పంచాంగములో అరవై సంవత్సరాలను, అంటే ఐదు పుష్కరాలను ఒక కాలమానముగా భావిస్తారు. పండ్రెండేళ్ల ఒక పుష్కరము గురుగ్రహము సూర్యుని చుట్టు ఒక మారు తిరిగే ఆవర్తన కాలముతో సరిపోతుంది. ఈ అరవై సంవత్సరాల కాలమానము  ప్రభవతో ప్రారంభమై, అక్షయతో అంతమవుతుంది.  ఇందులో ఈ యేడు వచ్చేది విజయనామ సంవత్సరము.  సామాన్యముగా ఉగాది వేడుకలలో కవిసమ్మేళనము కూడ ఉంటుంది.  కొత్త సంవత్సరమును గురించి, వసంతఋతువును గురించి నేను వ్రాసిన కొన్ని చిత్రకవితలను మీకు ఈ వ్యాసములో పరిచయము చేస్తున్నాను.  ఇందులో ఎక్కువగా కందపద్యములే.

తెలుగు సాహిత్యములో కందపద్యానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది.  ప్రాచీన కవులు వ్రాసిన కావ్యాలలో, పురాణాలలో సుమారు మూడింటికి ఒక వంతు కంద పద్యములే.  అంతే కాకుండా సుమతిశతకమువంటి కొన్ని శతకాలు కూడ కందపద్యములో ఉన్నాయి.  గాథ అనే ప్రాకృత ఛందస్సునుండి సంస్కృతములో నవవిధ ఆర్యలు పుట్టినాయి, అందులో ఆర్యాగీతి అనేది మన కందపద్యపు లక్షణాలతో సరిపోతుంది.  ప్రాకృతములో దీనిని స్ఖందఅ అంటారు. మొట్టమొదట కన్నడములో, తరువాత తెలుగులో ఈ కందపద్యము కావ్యాదరణ పొందినది.

కందపద్య లక్షణములు – ఇప్పుడు కందపద్యపు లక్షణాలను గురించి తెలిసికొందామా?  కందపద్యమునకు నాలుగు పాదాలుంటాయి; మొదటి రెందు పాదములవలె చివరి రెండు పాదములు ఉంటాయి.  బేసి పాదాలు (1, 3) కురుచ పాదములు, సరి పాదాలు (2, 4) నిడుద పాదాలు.  కురుచ పాదములలో మూడు చతుర్మాత్రలు, సరి పాదాలలో ఐదు చతుర్మాత్రలు ఉంటాయి. ఒక మాత్ర అంటే ఒక లఘువు, రెండు మాత్రలు ఒక గురువుకు సమానము.  చతుర్మాత్రలు ఐదు, అవి నల (IIII), భ (UII), జ(IUI), స (IIU), గగ (UU).  రెండు పాదాలలో ఎనిమిది చతుర్మాత్రలు ఉంటాయి, అందులో బేసి గణములలో జ-గణము ఉండదు.  చివరి గణమైన ఎనిమిదవ మాత్రాగణములో గుర్వంతమయ్యే సగణమో లేక గగమో ఉండాలి.  ఆఱవ గణము నలమో లేక జ-గణము మాత్రమే ఉండాలి. మిగిలినవి యే గణాలైనా సరియే. అన్ని పాదాలకు ద్వితీయాక్షర ప్రాస ఉండాలి.  ఈ ప్రాస నియమమువలన మరొక షరతు కలుగుతుంది, అదేమంటే మొదటి అక్షరము లఘువయితే, నాలుగు పాదాలను లఘువుతో ప్రారంభించాలి, గురువయితే నాలుగు పాదాలు గురువుతో ప్రారంభమవుతుంది. మొత్తము పద్యములో 64 మాత్రలు ఉంటాయి, అందులో కనీసము రెండు గురువులైనా ఉండాలి (రెండవ, నాలుగవ పాదాల చివరి అక్షరములు).  కనీసము నాలుగు లఘువులైనా ఉండాలి (ఆఱవ గణములు జ-గణము అయినప్పుడు).

చతుర్విధ కందము – నన్నెచోడుడు అనే ఒక శివకవి కుమారసంభవము అనే ఒక గొప్ప ప్రబంధకావ్యమును వ్రాసినాడు.  కొందరు ఈ నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడు అంటారు, కాని ఎక్కువమంది ఇతడు నన్నయ తిక్కనలకు మధ్యయుగములో జీవించినాడని భావిస్తారు.  నా ఉద్దేశములో ఇతడు నన్నయభట్టు సమకాలికుడు.  మన తెలుగు సాహిత్యములో మొట్టమొదట చిత్రకవిత్వమును వాడినవాడు ఈ కవిరాజశిఖామణియే.  ఇతనిని గురించి ఈమాట అనే అంతర్జాలపత్రికలో నేను కవిరాజశిఖామణి, క్రౌంచపదము అని రెండు వ్యాసములను వ్రాసియున్నాను, వీలయినప్పుడు చదవండి.  ఇతడు సృష్టించిన చిత్రకవితలలో చతుర్విధ కందము ఒకటి. అంటే ఒకే కందపద్యములో గణయతిప్రాసలతో నాలుగు నాలుగు కందపద్యములు ఇమిడి ఉండాలి. అలాటి కందపద్యమును మీకు ఈ ఉగాది సందర్భముగా అందజేస్తున్నాను –

హరుసము గలుగును భవముల

సిరిగా నినబింబకాంతి – చెలువము గనగన్

విరబూయు మనసు కలిమిన్

వరమై ఘన విజయ మిడును – వరముల వనధుల్

కొత్త ఏడు కొత్త సూర్యోదయపుకాంతి చూడగా మన పుట్టుకలకు కలిగిన సంపదయో అనేటట్లు ఆనందముతో మనసు విరబూసిపోతుంది, సిరిసంపదలను గొప్పదైన విజయనామ సంవత్సరము మనకు వరముల సముద్రములుగా ప్రసాదిస్తుంది అని దీనికి అర్థము.

ఇది మొదటి కందము, మిగిలిన మూడు క్రింది విధముగా నుంటాయి –

విరబూయు మనసు కలిమిన్

వరమై ఘన విజయ మిడును – వరముల వనధుల్

హరుసము గలుగును భవముల

సిరిగా నినబింబకాంతి – చెలువము గనగన్

 

ఇనబింబకాంతి చెలువము

గనగన్ విరబూయు మనసు – కలిమిన్ వరమై

ఘన విజయ మిడును వరముల

వనధుల్ హరుసము గలుగును -భవముల సిరిగా

 

ఘన విజయ మిడును వరముల

వనధుల్ హరుసము గలుగును -భవముల సిరిగా

నినబింబకాంతి చెలువము

గనగన్ విరబూయు మనసు – కలిమిన్ వరమై

సర్వగురుకందము – సర్వ గురు కందములో ఆఱవ గణమైన జ-గణము తప్ప మిగిలిన మాత్రాగణములు గగములుగా ఉంటాయి. మొత్తము పద్యములో 30 గురువులు, నాలుగు లఘువులు, మొత్తము 34 అక్షరాలు  ఉంటాయి. క్రింద నా ఉదాహరణ –

ఆనందమ్మై వచ్చెన్

గానంగా నందమైన – కామోత్కర్షన్

సూనాలంకారమ్మై

యీనాడే యీ వసంత – మింపై సొంపై

చూచుటకు అందమైన కోరికల శ్రేష్ఠతతో పుష్పములతో శోభించునదై ఈ రోజు ఆనందముగా ఇంపులతో సొంపులతో వసంతఋతువు వచ్చినది. ఇందులో ‘దమైన’, ‘వసంత’ అనే తప్పనిసరి జగణాలు తప్ప మిగిలిన మాత్రాగణములు గురుమయములే.

సర్వలఘు కందము – సర్వలఘు కందములో రెండవ, నాలుగు పాదములలో చివరి అక్షరములైన గురువులు తప్ప మిగిలిన అన్ని అక్షరాలు లఘువులే.  ఇందులో 60 లఘువులు, రెండు గురువులు, మొత్తము 62 అక్షరాలు ఉంటాయి.  క్రింద నా ఉదాహరణ –

విజయము గలుగును మనకిక

నజయుడు జగతికి విజయుని – నలరగ బనిచెన్

నిజముగ నవమగు వరుసము

ప్రజలకు హరుసము నొసగును – ప్రథమ దినమునన్

మనకిక మీద విజయమే కలుగుతుంది, అజయుడైన ఆ దేవుడు విజయుని (అంటే విజయనామ సంవత్సరమును) మనకు పంపాడు. మొదటి రోజే కొత్త సంవత్సరము ప్రజల కందరికీ సంతోషాన్ని ఇస్తుంది అని ఈ పద్యానికి అర్థము.  రెండవ పాదములోని ‘చెన్’, నాలుగవ పాదములోని ‘నన్’ తప్ప మిగిలిన అన్ని అక్షరాలు ఇందులో లఘువులే.

తలకట్టుల కందము – తెలుగుభాషలో చాల అక్షరములకు తలకట్టులు ఉంటాయి, కాని అచ్చులకు (ఈ తప్ప), జ, ణ, బ, ల అక్షరములకు, ఆ, ఇ, ఈ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ లతో ఉండే హల్లులకు (కొన్ని ప్రత్యేకతలు మినహాయిస్తే) తలకట్టులు ఉండవు. క్రింది కందపద్యములోని అక్షరములకన్నింటికీ తలకట్టులు ఉన్నాయి.

చూతము తూర్పున సూర్యున్

నూతన వర్షమందు రండు – నూతన ప్రభగన్

నూతన హర్షము తప్పక

పూతముగ నునుచు నవరస -పూర్ణపు మనసున్

కొత్త కాంతితో తూర్పుదిక్కులో ఉదయించే సూర్యభగవానుని కొత్త సంవత్సరములో చూడడానికి అందరూ రండి, కొత్త సంతోషము మన మనస్సును నవరసపూర్ణముగా పరిశుద్ధముగా ఉంచుతుంది  అని ఈ పద్యానికి అర్థము. ఇందులో ఆ, ఇ, ఈ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ లతో అక్షరాలు లేవన్నది గమనార్హము.

ద్వీపాక్షరములతో కందము – సున్నలతో ఉండే అక్షరాలను నేను ద్వీపాక్షరములు అని పిలుస్తాను.  ఇట్టి అక్షరములతో మాత్రము ఉండే ఒక కందపద్యమును క్రింద చదవండి –

ఆమని యామినిలో హృ-

త్కాముని విరి యమ్ము దూరె – తపితహృదయమున్

ప్రేమోత్సాహము లెందున్

భామాకృష్ణద్వయమయె – ప్రతి స్త్రీపురుషుల్

వసంతరాత్రిలో హృదయములో ఉండే మన్మథుని పూల బాణము తాపముతో మండే హృదయాన్ని గ్రుచ్చుకొనినది, ఎక్కడ చూచినా ప్రేమతో కూడిన ఉత్సహమే, ప్రతి స్త్రీపురుషుల జంట సత్యభామ శ్రీకృష్ణులవలె నుండినది అని దీని అర్థము. ఇందులోని అన్ని అక్షరాలలో సున్నలాటి ఒక ద్వీపాకారము ఉన్న విషయమును గమనించవచ్చును.

జగణ కందము – ఒక కంద పద్యములో ఆఱు జ-గణములకన్న ఎక్కువగా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే మొత్తము కంద పద్యములో ఎనిమిది సరి గణములు ఉంటాయి, అందులో రెండవ నాలుగవ పాదపు చివరి గణములు గగమో లేక స-గణమో అయి తీరాలి.  క్రింద ఆఱు జ-గణములతో ఒక కంద పద్యము –

స్వనములను నింపె పికములు

సునాద రవళుల వినంగ – శ్రుతులకు విందౌ

మన యింటి రంగవల్లుల

గనంగ గన్నులకు విందు – గాదె యుగాదిన్

కోకిలలు కూతలను నింపాయి, ఆ మంచి ధ్వనులను వింటూ ఉంటే అది చెవులకు ఒక విందువంటిదే, అదే విధముగా మన వాకిళ్లముందటి ముగ్గులను చూసే కన్నులకు కూడ అది ఈ ఉగాది సమయములో విందువంటిదే.  ఈ పద్యములోని జ-గణములు –  నునింపె, సునాద, వినంగ, టిరంగ, గనంగ, కువిందు.

గుణిత కందములు – మనము తెలుగు నేర్చుకొనేటప్పుడు, గుణితమును గురించి చదివియున్నాము, ఉదా. క, కా, కి, కీ, మున్నగునవి.  పద్యము వ్రాసేటప్పుడు ఒక హల్లుయొక్క గుణితములు వచ్చేటట్లు వ్రాయవచ్చును.  ఉత్పలమాలవంటి వృత్తాలకు నాలుగు పాదముల ఒక వృత్తము చాలును ఇలా వ్రాయడానికి.  కందము చిన్న పద్యము గనుక, రెండు కందపద్యములలో మ- అక్షరపు గుణితములను పొందుపరచినాను.  క్రింద ఆ పద్యములు –

మఱలన్ మా యిలు నింపును

సిరులన్ గడు మిసిమి మీఱ, – చెన్నుగ మనసుల్

మురియన్ విరులన్ మూటగ

గురియున్ మృదువుగ మెలమెల – కోమలతరమై,

స్వరముల్ మేలుగ మై కం-

పరమొంద మొరయు, విజయయు – వర మిచ్చును సం-

బరముగ నతి మోహనమై,

సరిగమలను మౌరి మ్రోయ – జన మంగళమై

ఈ విజయనామ సంవత్సరము మళ్లీ మా ఇంటిలో సిరులను కాంతివంతమై నింపుతుంది, మెల్లమెల్లగా అతి మృదువుగా మనసులు మురిసేటట్లు గంపలతో పూలను కురిపిస్తుంది, సుస్వరములను మై గగుర్పాటు చెందేటట్లు మ్రోగిస్తుంది, చాల మోహనకరముగా సంబరముతో వరములను ఇస్తుంది, లోకశ్రేయస్సుకై నాదస్వరము సరిగమలను మ్రోగిస్తుంది. ఈ రెండు కంద పద్యాలలో మ, మా, మి, మీ, ము, మూ, మృ, మె, మే,మై, మొ, మో, మౌ, మం అక్షరాలు ఉన్నాయి, మౄ అక్షరముతో ప్రారంభమయ్యే పదము లేదు. ఈ అక్షరాలను ముందు ఉంచి వ్రాస్తే పద్యాలు క్రింది విధముగ నుంటుంది –

మఱలన్

మా యిలు నింపును సిరులన్ గడు

మిసిమి

మీఱ, చెన్నుగ మనసుల్

మురియన్ విరులన్

మూటగ గురియున్

మృదువుగ

మెలమెల కోమలతరమై, స్వరముల్

మేలుగ

మై కంపరమొంద

మొరయు, విజయయు వర మిచ్చును సంబరముగ నతి

మోహనమై, సరిగమలను

మౌరి మ్రోయ జన

మంగళమై

నిరనునాసిక కందపద్యము – ఙ, ఞ, ణ, న, మ అక్షరలను అనునాసికములు అంటారు, అంటే వీటిని పలికేటప్పుడు నాసిక అంటే ముక్కును ఉపయోగిస్తాము.  ఈ శబ్దములు లేకుండ వ్రాసిన పద్యమును నిరనునాసికము అంటారు. ముక్కును కోసివేస్తే కూడ ఇట్టి పద్యములను ముక్కు ఉపయోగము లేకుండ గట్టిగా చదువవచ్చును!  తెలుగులో సామాన్యముగా నామవాచకములు ము-కారముతో అంతమవుతుంది, కొన్ని విభక్తి ప్రత్యయాలలో న-కారము ఉంటుంది.  అనుస్వారము ముందున్న అక్షరములను కూడ ముక్కుతోనే ఉచ్చరిస్తాము. కావున అనుస్వారము కూడ ఇందులో నిషిద్ధమే. వీటిని ఉపయోగించకుండా పద్యము వ్రాయడము కొద్దిగా కష్టమే. క్రింద ఒక నిరనునాసిక కందపద్యము –

ఇది గీతి బాడు వేళయె

ఇది విరులు బూయు వలపుల – ఋతువగు జెలియా

ఇది క్రొత్త యేడు సకియా

ఇది సొబగుల సిరి రసఝరి – యిది హితకరియే

ఒక ప్రేమికుడు ప్రియురాలితో చెబుతాడు – చెలీ, ఈ సమయము పాటలు పాదుకొనే వేళ, ఈ సమయము పూలు పూచే వలపుల ఋతువు, ఇది కొత్త సంవత్సరము సఖీ, ఈ సమయము అందాల కాణాచి, నవరసములకు సెలయేరు, ఎంతయో సౌఖ్యాన్ని కలిగిస్తుంది.  ఇందులో మ-కార, ణ-కారములు, సున్నతో అక్షరాలు లేవు.  న-కారము గీతిలో దాగి ఉన్నది, గీతిన్ పాడు, గీతిఁ బాడు అవుతుంది.

ఓష్ఠ్య కందము – మనము మాట్లాడే సమయములో కొన్ని అక్షరాలను పలికేటప్పుడు పెదవులను ఉపయోగిస్తాము, కొన్ని శబ్దాలను ఉచ్చరించేటప్పుడు పెదవులను ఉపయోగించము.  పెదవులను ఉపయోగించి పలికేవాటిని  ఓష్ఠ్యములు అంటారు, పెదవులను ఉపయోగించకున్నప్పుడు అవి నిరోష్ఠ్యములు అవుతాయి.  ప, ఫ, బ, భ, మ, వ అక్షరాలు, ఉ, ఊ, ఒ, ఓ, ఔ అచ్చులతోడి అక్షరాలు ఓష్ఠ్యములు, మిగిలినవి నిరోష్ఠ్యములు. పెదవులను వ్రేళ్లతో గట్టిగ పట్టుకొని పదాలను పలికితే ఈ విషయము బాగుగా అవగతమవుతుంది.  క్రింద ఓష్ఠ్య కందము ఒకటి –

భువిపై పూవులు బ్రోవులు

భువిపై భవ్యము భవములు – పుష్పర్తువులో

భువిపై ప్రేమకు భావము

భువిపై సొబగుకు సుశోభ – పుష్పర్తువులో

భూమిపైన పూలు రాశులుగా ఉంటాయి, భూమిపైన బ్రదుకులు మంగళకరముగా ఉంటుంది వసంతఋతువులో; భూమిపైన ప్రేమకు అది అర్థమును ఇస్తుంది, భూమిపైన అందానికి శోభ కలుగుతుంది వసంతఋతువులో అని ఈ పద్యానికి అర్థము.  ఇందులో ఎక్కువగా ప, బ, భ, వ కారములు ఉపయోగించబడ్డాయి.  ల, ర, శ, స అక్షరాలు ఉకార, ఒకార, ఓకారములతో మాత్రమే ఉపయోగించబడినాయి, అప్పుడు అవి పెదవులతో పలుకబడుతాయి.

క్రింద రెండు నిరోష్ఠ్య కందపద్యములు –

కిలకిల యనె శారిక లట

కిలకిల యనె కన్నియ లిట – కిలకిల సడియే

గలగల యనె సెలయే ఱట

గలగల యనె హాసిక లిట – గలగల జడియే

అక్కడేమో చిలుకలు కిలకిల మంటున్నాయి, ఇక్కడేమో ఆడపిల్లలు కిలకిల నవ్వుతున్నారు, అన్ని చోటులలో కిలకిల శబ్దమే.  అక్కడేమో సెలయేరు గలగల పరుతుంది, ఇక్కడేమో గలగలమంటూ నవ్వులు, అన్ని చోటులలో వానలా గలగల శబ్దమే.

లలితాలంకృత రసికా

కళాహృదయహర లతాంత-కాలాధికృతా

సలలిత రాగజలనిధీ

యలరగ నిల జేయ రార – హర్షాకరగా

ఓ వసంతుడా, అందముగా అలంకారము చేసికొన్న రసికుడా, కళాహృదయములను జయించినవాడా, వసంతఋతువును అధికారములో నుంచుకొన్నవాడా, అతి మృదువైన ప్రేమకు సముద్రమువంటివాడా, మేము సంతోషించేటట్లు ఈ భూమిని ఆనందానికి యిరవుగా చేయరమ్ము అని దీనికి అర్థము.

పై రెండు పద్యాలలో పెదవులతో పలికే ప-వర్గాక్షరాలు గాని, వ-కారము గాని, ఉ, ఊ, ఒ, ఓ, ఔ అచ్చులతో ఉండే శబ్దాలు గాని లేవు.

షట్పద కందము – నాలుగు పాదముల కంద పద్యమును ఆఱు పాదములుగా కూడ వ్రాయవచ్చును.  నిడుద పాదాన్ని యతిస్థానము వద్ద విరిచి ప్రాసను ఉంచితే ఇది సాధ్యమవుతుంది. అనగా, సరిపాదాలలో యతి, ప్రాసయతి రెండూ ఉండాలి.  ఇలాటి షట్పద కందపద్యములు తెలుగు సాహిత్యములో అరుదు.  క్రింద రెండు షట్పద కందపద్యములు –

కిలకిల యనె శారిక లట

కిలకిల యనె కన్నియ లిట

కిలకిల సడియే

గలగల యనె సెలయే ఱట

గలగల యనె హాసిక లిట

గలగల జడియే

పై పద్యము ఇంతకు ముందే వివరించబడినది.

చివురులు క్రొత్తవి మేయుచు

నవలీలగ పికము బాడె

నవిరళ గీతుల్

రవికాంతికి హిమము కరుగ

ప్రవిమల నదులిల పరువిడె

రవళులతోడన్

చిగురుటాకులను తింటూ, ఎన్నో అరుదైన గీతికలను సునాయాసముగా కోకిల పాడినది.  సూర్యకాంతి వేడికి కరిగి మంచు నదులుగా శబ్దము చేస్తూ పారుతూ ఉన్నది అని ఈ పద్యానికి అర్థము.

కందపద్యముతో మరొక ఆట – కంద పద్య రచనలో పదాలను చక్కగా ఎన్నుకొంటే, ఒకటి, రెండు, మూడు, ఇలా ఎక్కువయే అక్షర సంఖ్యలతో వాటిని అమర్చ వీలగును.  ఉదాహరణకు ఏడు అక్షరాల అమరికలో ఒకటికంటె ఎక్కువ పదాలు ఉండవచ్చును, కాని పదము మధ్యలో విరగరాదు.  అదే విధముగా ఎక్కువ సంఖ్యనుండి తక్కువ సంఖ్యవరకు ఈ అక్షరాల అమరికను సాధించవచ్చును. ఇలా అమర్చి పద్యాలను వ్రాస్తే పదాల అమరిక ఒక సోపానములా ఉంటుంది.  తక్కువ అక్షరాలనుండి ఎక్కువ అక్షరాల అమరికను స్రోతోవాహము అంటారు, ఎందుకంటే నది సన్నగా ప్రారంభమై వెడల్పుగా అంతమవుతుంది.  ఎక్కువ సంఖ్యనుండి తక్కువ సంఖ్యకు జారే అమరికను గోపుచ్ఛము అంటారు.  గోపుచ్ఛము అంటే ఆవు తోక, ఆవు తోక మొట్టమొదట వెడల్పుగా నుండి తరువాత సన్నబడుతుంది.  ఇలాటి అమరికలతో ముత్తుస్వామి దీక్షితులు కృతులనే వ్రాసినారు.  క్రింద రెండు కంద పద్యములు –

స్రోతోవాహ సోపానము –

ఈ మహి యిచ్చెను విజయకు

ప్రేమోత్సాహము లలరగ – వేయి పదమ్ముల్

భామినులు బాడ మేలగు

కామన లింపొంద లోక -కళ్యాణమ్మై

విజయనామసంవత్సరమునకు ప్రేమ, ఉత్సాహము విరియగా స్త్రీలు పాడగా మంచి శుభకామనలు ఇంపొందగా లోకకల్యాణముకోసం వేయి పదములను ఈ భూమి ఇచ్చినది.

ఈ – 1

మహి – 2

యిచ్చెను – 3

విజయకు – 4

ప్రేమోత్సాహము – 5

లలరగ వేయి – 6

పదమ్ముల్ భామినులు – 7

బాడ మేలగు కామన – 8

లింపొంద లోక కళ్యాణమ్మై – 9 (స్రోతోవాహ సోపానము)

గోపుచ్ఛ సోపానము –

పచ్చడి తిందము రండిట

ముచ్చటగా వేగవేగ – ముదము విరియగా

నిచ్చల్ తీరున్ గాదా

పచ్చగ నగు జీవితమ్ము – పరగన్ భువి పై

ఇక్కడకు రండి, ముచ్చటగా తొందరగా ఉగాది పచ్చడి తిందాము, మన సంతోషము పూయగా మన కోరికలు తీరును గదా, మన జీవితము కూడ పచ్చగా ఈ భూమిపైన శోభిస్తుంది.

పచ్చడి తిందము రండిట –  9

ముచ్చటగా వేగవేగ – 8

ముదము విరియగా – 7

నిచ్చల్ తీరున్ గాదా – 6

పచ్చగ నగు – 5

జీవితమ్ము – 4

పరగన్ – 3

భువి – 2

పై – 1 (గోపుచ్ఛ సోపానము)

కందము – గర్భ కవిత్వము – చతుర్మాత్రాయుక్తమైన కందపద్యమును బోలిన వృత్తాలు ఎన్నో ఉన్నాయి.  అట్టి వృత్తములలో ప్రమితాక్షర ఒకటి.  ఈ వృత్తము పాదమునకు 12 అక్షరములు ఉండే జగతీ ఛందములో పుట్టిన 1772వ సమవృత్తము. దీని గణములు – స జ స స, దీని గురు లఘువులు – IIU IUI II-U IIU. రెండు ప్రమితాక్షర పాదములు కందపద్యపు రెండు పాదములకు సరిపోతాయి – IIU IUI IIU / IIU IIU IUI – IIU IIU.  వ్రాసేటప్పుడు రెంటికీ యతిప్రాసలు సరిపోయేటట్లు వ్రాయాలి.  క్రింద ఒక ఉదాహరణ –

విరులెన్నొ బూచె కనవే

తరులన్ సరులై లతాంగి – ధర జంచలమై

కురులందు బెట్టుకొన గో-

చరమౌ సిరులై శిరాన – సరసీజముఖీ

ఓ లతాంగీ, పద్మముఖీ, భూమిపైన చెట్టులలో చంచలముగా నూగుతూ సరములుగా పూలు పూచినాయి.  వాటిని నీ కురులలో అలంకరించుకొంటే నీ శిరస్సుకు సిరిగా కనిపిస్తుంది అని ఈ పద్యమునకు అర్థము.  దీనినే క్రింది విధముగా వ్రాస్తే అది ప్రమితాక్షర  వృత్తముగా మారుతుంది –

ప్రమితాక్షరము – స జ స స, యతి (1, 9)

12 జగతి 1772

విరులెన్నొ బూచె కన-వే తరులన్

సరులై లతాంగి ధర – జంచలమై

కురులందు బెట్టుకొన – గోచరమౌ

సిరులై శిరాన సర-సీజముఖీ

తేటగీతి – గుప్తపాదము – గుప్త పాదము అంటే దాగి ఉన్న పాదము అని అర్థము.  నాలుగవ పాదము మొదటి మూడు పాదములలో దాగిఉంటుంది. మొదటి పాదములోని మొదటి అక్షరము, రెండవ పాదములోని రెండవ అక్షరము, మూడవ పాదములోని మూడవ అక్షరము, రెండవ పాదములోని నాలుగవ అక్షరము, మొదటి పాదములోని ఐదవ అక్షరము, రెండవ పాదములోని ఆఱవ అక్షరము, ఇలా ఈ అక్షరాలను కలిపితే మనకు నాలుగవ పాదము లభిస్తుంది. కంద పద్యములో అన్ని పాదములు ఒకే విధముగా నుండవు కనుక దీనిని తేటగీతిలో వ్రాసినాను.  ఆ పద్యము –

విరళ భోగము లెల్లను – ధరను సరుగు

విజయ రావమ్ము సొంపుల -విమల ఝరులు

సుజయమై మన్కినిండును -సురుచి కళల

విజయ రాగమ్ము నింపును -విరుల సరుల

అరుదైన సౌఖ్యములు భూమిపై వర్ధిల్లుతాయి, విజయనామసంవత్సరపు ధ్వనులు సొబగులతో నిండిన విమలమైన నదులు. విజయవంతముగా మన బ్రదుకులు మంచి కళలతో కాంతులతో నిండి ఉంటాయి.  విజయయొక్క అనురాగము పూలసరములతో నింపుతుంది అని ఈ పద్యానికి అర్థము.   మొదటి మూడు పాదములలోని అక్షరములు ఎలా నాలుగవ పాదపు అక్షరములు అవుతాయో అన్న విషయాన్ని గుప్తపాదము చిత్రములో చూడవచ్చును.

సార్థకనామవృత్తము విజయ – తెలుగులో లగమును (IU) వ-గణమని, గలమును (UI) హ-గణమని పిలవడము వాడుక.  నేను సార్థకనామవృత్తమని ఒక పద్ధతిని కనుగొన్నాను.  అంటే పద్యపు పేరులోనే దాని గణములు కూడ మనకు స్పష్టముగా తెలియాలి.  ఉదాహరణగా కొత్త ఏడు విజయను తీసికొనండి.  ఇందులో వి-జ-య అని మూడు అక్షరాలు ఉన్నాయి. వి అనే అక్షరమునకు మూడు వ-గణములు (వి మూడవ గుణితము కాబట్టి), తరువాత ఒక జ-గణము, దాని తరువాత ఒక య-గణమును ఉంచితే మనకు విజయ అనే పదము వస్తుంది. ఇలాటి వృత్తాలను నేను సార్థకనామ వృత్తములని పిలుస్తాను.  ఈ విజయ వృత్తము పాదమునకు 12 అక్షరములు ఉండే జగతీఛందములో 854వ సమవృత్తము. రెండు విజయ వృత్తములతో ఈ వ్యాసమును ముగిస్తున్నాను –

విజయ – జ ర జ య (IU IU IU IUI IUU), యతి (1, 7)

12 జగతి 854

కనంగ దృశ్యముల్ – కవిత్వము లేచెన్

వినంగ గీతికల్ – విషాదము వీడెన్

అనంగ బాణమో – యనంగను బూచెన్

వనమ్ములో విరుల్ – వసంతములోనన్

దృశ్యములను చూస్తు ఉంటే ఎదలో కవిత్వము లేచినది, పాటలను వింటూ ఉంటే ఎదలోని బాధ మాయమయినది, మన్మథుని బాణము లన్నట్లు ఈ వసంతఋతువులో తోటలో పుష్పములు వికసించినవి అని ఈ పద్యమునకు అర్థము.

ఉగాది నేడెగా – నుషోదయమయ్యెన్

జగాన నిండెగా – సవిత్కరకాంతుల్

జగాధినాయకా – సదా విజయమ్మై

ముగించు మా పనుల్ – ముదాకరమూర్తీ

నేడే ఉగాది, తెల్లవారినది, భూమి సూర్యుని కాంతితో నిండిపోయినది, ఓ జగన్నాయకా, ఆనందమునకు ప్రతిరూపమయినవాడా, మా పనులను ఎల్లప్పుడు విజయవంతముగా చేయుము అని ఈ పద్యమునకు అర్థము.

 

పాఠకుల కందరికీ విజయనామసంవత్సర శుభాకాంక్షలు!

 

 

 

2 thoughts on “విజయ చిత్రములు

  1. Learnt interesting things about Kanda padyam.

    Recently, I came to know a popular saying on Kanda Padyam, that:

    ‘kandam raasina vaade kavi
    pandini pattina vaade banTu.’

    But not sure what’s the so much special with Kandam vs others like tETageethi or campakamaala.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *