April 23, 2024

శ్రీమన్మహా భారతము – ఉద్యోగపర్వము -రాయబారములు

రచన: అవధాని రత్న డా.మాడుగుల అనిల్ కుమార్

          మహావీరులైన పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్య వాసాన్ని  , ఒక  సంవత్సరమజ్ఞాత వాసాన్ని చేసి , ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవమును జరిపించి , వివాహమునకు వచ్చిన ద్రుపదుడు మున్నగు బంధువర్గంతో కూడ ఉపప్లావ్యంలో  నివసిస్తున్నారు. ఇప్పుడు రాజ్యాన్ని యుద్ధము వలననా ? లేక సంధితోనా ? ఎలా సంపాదించుకోవాలన్నదే పాండవుల సమస్య. పాండవులు యుద్ధ విముఖులు కారనునది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు నిదర్శనమేమంటే – 1. భీముడు చేసిన ప్రతిజ్ఞలు  2. పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి విరాటనగరానికి వెళ్ళునపుడు యుధిష్ఠిరుడు శ్రీ దుర్గాదేవిని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై –

” మమ ప్రసాదాన్నిర్జిత్య హత్వా కౌరవ వాహినీమ్ l

రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః  l l ”

( నా అనుగ్రహము వలన నీవు కౌరవులను హతమార్చి శత్రువులు లేని రాజ్యాన్ని మరల అనుభవిస్తావు ) అని వరమిస్తూ చెప్తుంది.

అప్పుడు ధర్మరాజు యుద్ధాన్ని కాక శాంతినే కోరుతూ దేవతను ప్రార్థింపవచ్చు , కానీ యుద్ధం దైవికమైనందువలన  ఆయనకా సమయంలో అటువంటి కోరిక కలగలేదు. 3. యుద్ధం తప్పక జరుగుతుందనే ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను తీసుకొని పోయాడు.  4.మరియొక ముఖ్య రహస్యమేమంటే రాజసూయయాగం చేసిన తరువాత జన ప్రళయమగు మహాయుద్ధం జరుగుతందని యుధిష్ఠిరునికి తెలిసియే రాజసూయయాగం చేశాడు. కనుక యుద్ధము తప్పనిసరి. 5. యుద్ధము క్షత్రియ ధర్మమే కాని అధర్మం కాదు. పాండవులు ఈ స్థితిలో ఉంటే దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణం రోజే యుద్ధాన్ని నిశ్చయించి భీష్మాచార్యులతో –

” నాహం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామహ  l

యుద్ధోపచారికం యత్తు తచ్ఛీఘ్రం ప్రవిదీయతామ్  l l ”

( నేను పాండవులకు రాజ్యమివ్వను. కనుక  యుద్ధ ప్రయత్నము చేయుడు ) అనిచెప్తాడు. ఈ ఐదు అంశాల ద్వారా యిరు వర్గాలవారు యుద్ధము చేయడానికి సన్నద్ధులయ్యారని వ్యక్తమౌతోంది. అయినా రోగికి ప్రాణం ఉన్నంతవరకు వైద్యుడు చికిత్స చేసినట్లు జననాశనాన్ని మాన్పించడం ధర్మం , సంప్రదాయం కూడ. అందుకే ఉద్యోగపర్వంలో  రాయబారాలు చేసింది. ఈ రాయబారాలను నలుగురు నిర్వహించారు.

ప్రప్రథమంగా కులీనుడు. ఇతడు వాక్చాతుర్యం ఉన్నవాడు , ధర్మజ్ఞుడు. విద్వాంసుడైన ద్రుపదమహారాజ పురోహితుడు,దూత.  ద్రుపదమహారాజు ఆలోచనతో జరిగిన దౌత్యం లో రెండు ఉపయోగాలున్నాయి –

” భీష్మద్రోణ కృపాదీనాం భేదం సంజనయిష్యతి  l

అమాత్యేషు చ భిన్నేషు యోధేషు విముఖేషు చ  l l

పునరేకత్ర కరణం తేషాం కర్మ కరిష్యతి  l

ఏతస్మిన్నంతరే పార్థ ! సుఖమేకాగ్ర బుద్ధయః  l l

సేనా కర్మ కరిష్యంతి ద్రవ్యాణాం చైవ సంచయమ్  l ”

( భీష్మ ద్రోణ కృపాచార్యాదులు దుర్యోధనునితో విభేదిస్తారు. మంత్రులు అభిప్రాయ భేదాలతో ఉంటారు. యోధులు యుద్ధ విముఖులౌతారు. ధార్తరాష్ట్రులు వీరందరినీ మరల కూడగట్టుకొని ఒక త్రాటిమీదకు తెచ్చే ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఈ మధ్యకాలంలో పాండవులు సుఖంగా సైన్యాన్ని , ద్రవ్యాలను సమకూర్చుకోవచ్చు. ఇంకనూ పాండవుల పరిస్థితిని, వారి ఉద్దేశ్యాన్ని ధృతరాష్ట్రుని దృష్టికి , తక్కిన పెద్దల దృష్టికి తెచ్చుట , వారి ప్రత్యుత్తరం ధర్మజుకు  తెలియజేయుట ) అనునవి.

ద్రుపద పురోహితుడు ధృతరాష్ట్రుని సభలో అందరి ఎదుట పూర్వం ధార్తరాష్ట్రులు పాండవులకు చేసిన అన్యాయాలను విశదీకరిస్తాడు. వాటిని మరచి ధర్మజుడు కౌరవులతో స్నేహాన్నే కోరుతున్నాడని చెప్తాడు. పాండవుల బలపరాక్రమాలు , వారికి సహాయకులుగా వచ్చిన రాజుల దృఢ నిశ్చయాలు తెల్పి –

” తే భవంతో యథా ధర్మం యథా సంయమేవ చ   l

ప్రయచ్ఛంతు  ప్రదాతవ్యం మా వః కాలో s త్యగాదయమ్  l l ”

( మీరు ధర్మాన్ని అనుసరించి జూదంలో ఇచ్చిన మాటను పాటించి , ఆడిన మాట తప్పక వారి రాజ్యాన్ని వారికి ఇవ్వవలసిందని , ఇంకనూ సమయము మించి పోలేదని ) చెప్తాడు. ఈ విధంగా ద్రుపద రాజ పురోహితుడు తనకప్పగించిన కార్యమును సక్రమంగా నిర్వర్తించాడని భావించవచ్చు. ధృతరాష్ట్రుడు  దూతతో – ” మేము సమాలోచన చేసి సంజయుని పాండవుల వద్దకు పంపిస్తాము” అని చెప్పడంతో దూత అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మొదటి రాయబారం ముగిసింది.

ఇక రెండవది సంజయ రాయబారము. ఇందులో ధృతరాష్ట్రుని మనఃప్రవృత్తి తేటతెల్లమౌతుంది గాన ఇది ముఖ్యమైనదిగా పరిగణింపదగింది. భారత సారోద్ధారంలో వర్ణించినట్లుగా  ధృతరాష్ట్రుడు  ధర్మరాజు యువరాజుగా గడించిన ప్రతిష్ఠలను చూసి ఈర్ష్యాసూయలకు లోనై  గాంధార రాజ పురోహితుడైన కణికునితో పాండవులనణచేందుకు మంతనాలు జరుపుతాడు. దుర్యోధనుని సలహాలతో వారణావతం పంపుతాడు. జూదమాడే సమయంలో “తనవారు ఇంకా ఏమి గెలిచారు , ఇంకా ఏమి గెలిచారు ” అని కుతూహలంతో అడుగుతాడు. అటువంటి ధృతరాష్ట్రుని సందేశంతో సంజయుడు పాండవుల దగ్గరకు దూతగా వెళ్తాడు.

ధర్మరాజు కుశలప్రశ్నల తరువాత సభలో సంజయుడు  ధృతరాష్ట్రుని సందేశ  ముఖ్యాంశాలను –  ” మీరు ధర్మవర్తనులు. ధర్మం కొరకు ప్రాణాలైనా వదులుతారు , కాని అధర్మానికి మాత్రం పాల్పడరు. అటువంటి మీరు సైన్యాలను సమకూర్చుకోవడం తెల్లని వస్త్రంపై నల్లని మచ్చలాగా ఉంది. యుద్ధం వలన సర్వనాశనం కాగా జయాపజయాలు రెండూ సమానమే. అక్కడ ఉన్నవారంతా  మీ అన్నదమ్ములు , బంధువులు. వారిని యుద్ధంలో మీరు చంపితే మీరు జీవచ్ఛవాలే. కౌరవసేన కూడ సాటిలేనిది. జయాపజయాలు నిర్ణయించి చెప్పడానికి వీలు కాదు. మీకు శాంతమే ఉత్తమమైనది. అంతే కాక –

“న చేద్భాగం కురవోsన్యత్ర యుద్ధాత్

ప్రయచ్ఛేదంస్తుభ్యమజాత శత్రో  l

భైక్ష్య చర్యామంధక వృష్ణి రాజ్యే

శ్రేయో మన్యే న తు యుద్ధేన రాజ్యమ్  l l ”

( మీకు వారు రాజ్య భాగమివ్వనిచో మీరు అంధకరాజ్యంలోనో , వృష్ణిరాజ్యంలోనో భిక్షమెత్తుకొనిబ్రతకడం మేలు కాని యుద్ధము చేసి సంపాదించు రాజ్యము కోరవద్దు ).  ఇట్లా సంజయుడు అనేక ధర్మపన్నాలను చెప్పాడు. ఈ సందేశాన్ని పరిశీలిస్తే పాండవులు రాజ్యం లేకుండానే యుద్ధం మానుకొని శాంతించాలనే ధృతరాష్ట్రుని  అభిప్రాయం కనిపిస్తుంది. ధర్మజుడు కూడ మాటల మధ్యలో భీష్మ ద్రోణ కృపాదులకు తమపై అభిమానం తగ్గలేదని తెలుసుకుంటాడు. మరల భీమార్జున నకుల సహదేవుల పరాక్రమాలను సంజయుని ముందు వర్ణించి , వారిని కౌరవులు తలుస్తున్నారా ? అని అడుగుతూ తాను కూడ యుద్ధానికి సిద్ధమని చెప్తాడు. అంతే కాక అవిస్థల , వృకస్థల , మాకందీ , వారాణసీ అను నాలుగు గ్రామాలను ఐదవదిగా ఏదేని మరియొక ఊరు ఇస్తే చాలంటాడు. సంజయుడు హస్తినాపురానికి వెళ్లి  యుధిష్ఠిరుని అభిప్రాయాన్ని ధృతరాష్ట్రునికి తెలియజేయడంతో ఈ రాయబారం ముగిసింది.

మూడవ రాయబారం పాండవుల పక్షంలో సర్వసమర్థుడైన  శ్రీకృష్ణపరమాత్మచే నిర్వహింపబడింది. అప్పటికే యిరుపక్షాల వారును సైన్యాలను సమకూర్చుకోవడం , యుద్ధ సన్నాహాలు చేయడం జరుగుతోంది. అట్టి పరిస్థితులలో దౌత్యం సత్ఫలితాన్ని ఇవ్వదని తెలిసి కూడ శ్రీకృష్ణభగవానుడు “ఐనను పోయి రావలయు ” అంటూ ప్రయాణానికి సిద్ధపడ్డాడు. బయలుదేరడానికి ముందుగా పాండవుల అభిప్రాయాలు తెలిసికొనదలచి వారిని ప్రశ్నించాడు. అందులో అనూహ్యమైనవి భీమసేనుని మాటలు. ఆతడు సంధిని కోరుతూ –

” అపి దుర్యోధనం కృష్ణ సర్వ వయమధశ్చరాః  l

నీచైర్భూత్వానుయాస్యామో మాస్మనో భారతానశన్  l l ”

( దుర్యోధనుని అనుసరించి మేము కూడ నేలమీద ప్రాకువారు కావలెనా ? మేము తగ్గిపోయి ప్రవర్తించెదము , మా వలన భరతవంశము నశింపకుండుగాక ! ) అని అంటాడు. ఇంకనూ దుర్యోధనునికి కోపము వచ్చునట్లు నీవు మాట్లాడకు , అన్ని విధాల సంధి కుదురునట్లు చేయుము , ఇదియే దయామయుడైన అర్జునుని అభిప్రాయం కూడ అని చెప్తాడు. ఈ మాటలు విన్న శ్రీ కృష్ణుడు భీముని యుద్ధానికి ఉత్సాహపరుస్తాడు. ధర్మరాజాదులు తమతమ అభిప్రాయాలను తెలియజేస్తారు. సహదేవుడు మాత్రం అన్నల అభిప్రాయంతో ఏకీభవించక యుద్ధం జరగడానికే గట్టి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతాడు –

” యది ప్రశమమిచ్ఛేయుః కురవః పాండవైస్సహ  l

తథాపి యుద్ధం దాశార్హ ! యోజయేథాస్సహైవ తైః  l l

కథం ను దృష్ట్వా పాంచాలీం తథా కృష్ణ సభాగతామ్  l

అవధేన ప్రశామ్యేత మామ మన్యుస్సుయోధనే  l l

యది భీమార్జునౌ కృష్ణ ! ధర్మరాజశ్చ ధార్మికః  l

ధర్మముత్సృజ్యతేనాహం యోకద్ధుమిచ్ఛామి సంయుగే  l l ”

( కౌరవులు పాండవులతో సంధి కోరినప్పటికీ నీవు యుద్ధము జరుగునట్లే చేయుము. ఆనాడు కౌరవ సభలో అవమానింపబడిన పాంచాలిని చూసిన నాకు దుర్యోధనుని చంపనిదే కోపం చల్లారదు. ఒకవేళ ధర్మజ భీమార్జునులు ధర్మానికి కట్టుబడి వున్నామని యుద్ధం మానినప్పటికీ నేను ధర్మాన్ని వదలిపెట్టి అయిననూ యుద్ధం చేస్తాను ) అని యుద్ధం జరగాలనే తన దృఢసంకల్పాన్ని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్తాడు. సాత్యకి సహదేవునికి వంత పాడి  నా కోపం దుర్యోధనుని చావుతో చల్లారుతుందంటాడు.

ద్రౌపది కౌరవ సభలో దుశ్శాసనునితో , అడవిలో సైంధవునితో , విరాట నగరంలో కీచకునితో పరాభవింపబడి  ప్రతీకారానికి ఎదురు చూస్తున్న నాగుపాము. కావున ఈమెకు సంధి ఏకోశాన ఇష్టం లేదు.ఆమె తన రోషాన్నంతా  శ్రీకృష్ణుని ఎదుట వెళ్ళగక్కి ఏడ్చింది. తన దురదృష్టాన్ని దూషించింది. తన ప్రాశస్త్యాన్ని ఏకరువు పెట్టింది –

”  ధిక్ పార్థస్య ధనుష్మత్తాం భీమసేనస్య ధిక్ బలమ్  l

యత్ర దుర్యోధనః కృష్ణ ! ముహూర్తమపి జీవతి  l l

యది తేsహమనుగ్రహ్యా యది తేsస్తు కృపా మయి l

ధార్త రాష్ట్రేషు వై కోపస్సర్వః కృష్ణ ! విధీయతామ్  l l

యది భీమార్జునౌ కృష్ణ ! కృపణౌ సంధి కాముకౌ  l

పితా మే యోత్సతే వృద్ధస్సహ పుత్రైర్మహా రథైః l l

దుశ్శాసన భుజం శ్యామం సంభిన్నం పాంశు గుంఠితమ్ l

యద్యహం తు న పశ్యామి కా శాంతిః హృదయస్య మే  l l ”

(  దుర్యోధనుడు ముహూర్తమాత్రం బ్రతికి ఉన్నా భీమసేనుని భుజ బలమెందుకు ? అర్జునుని ధనుర్విద్యా పారంగతత్వమెందుకు ? ” కర్రి విక్రమంబు గాల్పనే ” . కృష్ణా ! నీకు నా మీద అనుగ్రహం , దయ ఉంటే నీ కోపాన్నంతా ధార్తరాష్ట్రులపై కుమ్మరించు. ఒకవేళ భీమార్జునులు శాంతి కాముకులై సంగ్రామం చేయకాపోతే వృద్ధుడైన  నా తండ్రి తన కుమారుడు , ఉపపాండవులు , అభిమన్యుని సహాయంతో యుద్ధం చేస్తాడు. నల్లటి దుశ్శాసనుని భుజం తెగిపడి  మట్టిలో దొర్లాడుచుండుట చూడనిదే నాకు మనశ్శాంతి ఎక్కడిది ? )  అని ద్రౌపది చెప్తుంది. యుద్ధం జరిగి తీరాలని ద్రౌపది అభిప్రాయం.

శ్రీకృష్ణపరమాత్మకు – దురభిమాని , పాపభీతి ఏమాత్రం లేనివాడు , పెద్దలమాట పెడచెవిన పెట్టువాడు , దుష్టులను వెంటపెట్టుకొని ఉండేవాడు ఐన దుర్యోధనుని ఎదుట దౌత్యకర్మ నిర్వర్తింప వలసి వచ్చింది. శ్రీ కృష్ణుడు అవతారపురుషుడు. ధర్మ రక్షణయే ఆయన కర్తవ్యమ్. సంధి కుదిరినా, సంగ్రామమనివార్యమైనా ఆయనకు  సమానమే. కాని తాను చేయవలసిన పని చిత్తశుద్ధితో చేయాలి. లోకాపవాదానికి గురికాకూడదు. ఈ రాయబారంలో మరియొక ఉద్దేశ్యం కౌరవుల యుద్ధసన్నాహాలు స్వయంగా పరికించడం. శ్రీకృష్ణుడు కౌరవసభలో సామదానభేదాలను ఉపయోగించాడు.

శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వస్తున్నాడనే వార్త తెలియగానే మహాధీశాలి ఐన ధృతరాష్ట్రుడు కుమారునితో ” శ్రీకృష్ణునికి ప్రీతికరమైనవన్నీచేయి. అతడు ప్రీతుడైతే ఆతని దయతో మన కోరికలన్ని తీరుతాయి ” అని చెప్పి తానతనికివ్వదలచిన బహుమానాలను పేర్కొంటాడు. అవి ఏవంటే – ” బాహ్లి జాతికి చెందిన నాలుగేసి గుర్రాలు కట్టిన రథాలు పదహారు , మదించిన ఏనుగులు , పిల్లలు కనని శుభలక్షణాలున్న దాసీలు నూరుమంది , పదునెనిమిది వేల నూలువస్త్రాలు , వేయి జింక తోళ్ళు , రాత్రింబవళ్ళు ప్రకాశించు గొప్పమణి , ఒకరోజుకు పదునాలుగు యోజనాలు వెళ్ళే కంచెర గాడిదలు కట్టిన బండి , అతనికి కావలసినన్ని వాహనాలు , భటుల సంఖ్య ఎనిమిది రెట్లు , తన యింటిలో , దుర్యోధనుని యింటిలో ఉన్న శ్రీ కృష్ణునికివ్వదగినరత్నాలు”.

సూక్ష్మగ్రాహియైన విదురుడు –

”  అర్థేన తు మహాత్మానం వార్ష్ణేయం త్వం జిహీర్హసి  l

అనేన చాప్యుపాయేన పాండవేభ్యో విభేత్స్యసి  l l ”

( ధనంతో శ్రీకృష్ణుని వశపరచుకొని ఏదో ఉపాయంతో అతనికి , పాండవులకును విభేదం కల్పించాలనుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగదు) అని ధృతరాష్ట్రుని కుత్సితాన్ని బయటపెట్టాడు . దుర్యోధనుడు విదురునితో ఏకీభవింఛి శ్రీకృష్ణునికి ఏ బహుమతి ఇవ్వడానికి ఇష్టపడడు. చివరి దశలో కూడ పాండవులను నిరాశ్రయులను చేయాలనే దుర్బుద్ధిని ధృతరాష్ట్రుడు విడిచిపెట్టలేదనే సంగతి ఈ సంఘటనతో స్పష్టమౌతుంది. దుర్యోధనుడు  శ్రీకృష్ణుని బంధిం చాలనుకున్నాడు –

” పరాయణం పాండవానాం నియచ్ఛామి జనార్దనమ్  l

అస్మిన్ బద్ధే విధేయా మే స చ ప్రాతరిహైషతి  l l  ”

( కృష్ణుని బంధిస్తే వృష్ణి వంశం వారు , పాండవులు కూడ నాకు విధేయులౌతారు. యుధిష్ఠిరుడు మరునాడు ప్రొద్దుననే ఇక్కడికి వచ్చేస్తాడు ) అని దుర్యోధనుడు  అనుకుంటాడు. దీనిని బట్టి ధృతరాష్ట్రుని , దుర్యోధనుని ఉద్దేశ్యం ఒకటే కాని కార్యాచరణలో భేదముందని తెలుస్తుంది.

శ్రీకృష్ణుడు సభలో  ధృతరాష్ట్రునికి బోధించవలసినవన్ని బోధించి మరల ఆయనతో –

” త్వయ్యధీనశ్శమో రాజన్ మయిచైవ విశాంపతే l

పుత్రాన్ స్థాపయ కౌరవ్య స్తాపయిష్యామ్యహం పరాన్ l l  ”

( శాంతి నీపై , నాపై ఆధారపడి ఉంది.  నీవు నీ కుమారులను సరిదిద్దితే నేను పాండవులను అదుపులో పెడతాను ) అంటాడు. కానీ ధృతరాష్ట్రుడు ఆపని చేయలేదు. శ్రీకృష్ణుడు దూతగా వచ్చి హద్దుమీరి లోకాపవాదానికి గురయ్యే దండోపాయాన్ని ప్రయోగించలేదు కాని కురువీరులను సరిదిద్దమనే సలహాను మాత్రం ధృతరాష్ట్రునికిస్తాడు.

” తథా దుర్యోధనం కర్ణం శకునించాపి సౌబలమ్  l

బద్ధ్వా దుశ్శాసనంచాపి పాండవేయః పయచ్ఛథ  l l  ”

( దుర్యోధనుని , కర్ణుని , శకునిని , దుశ్శాసనుని బంధించి పాండవులకు అప్పగింపుము ) అంటాడు. నేనే వీరిని పట్టుకుని పాండవుల వశం చేసినా తప్పులేదు ,  కాని  నేనీ కార్యం చేయనని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. సుయోధనాదులు తన్ను బంధించడానికి ప్రయత్నిస్తే విశ్వరూపాన్ని చూపి సభను వదలిపెట్టి వెళ్తాడు. కర్ణునికి , దుర్యోధనునికి పరస్పర వైరం పుట్టించడానికి ప్రయత్నిస్తాడు  కాని ఫలించదు. ఈ విధంగా శ్రీకృష్ణరాయబారం ముగిసింది. దూతగా శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని ఏమాత్రం విస్మరించక శాయశక్తుల నిర్వర్తించినప్పటికీ లోకాపవాదం తప్పిందేమో కాని తన అన్న ఐన బలరాముని అభిప్రాయం మాత్రం శ్రీకృష్ణుడు సంధి చేయలేదనే –

” పాండవా హి యథాస్మాకం తథా దుర్యోధనో నృప l

తస్యాsపి క్రియతాం సాహ్యం సపర్యేతి పునఃపునః l l

తచ్చ మే నాకరోద్వాక్యం త్వదర్థే మధుసూదనః l ”

( పాండవులు మాకెట్లనో కౌరవులు కూడ అట్లే.ఆ విషయం మరల మరల శ్రీకృష్ణునికి చెప్పి వారికి కూడ సహాయం చేయమన్నాను. కాని శ్రీకృష్ణుడు చేయలేదు ) అని బలరాముడు ధర్మరాజుతో అంటాడు. భీమ దుర్యోధనులిద్దరూ తన శిష్యులే కనుక ఏ పక్షంలోను ఉండక తీర్థ యాత్రలకు వెళ్తాడు.

నాల్గవ రాయబారం దుర్యోధనునిచే ప్రేరేపింపబడింది. దూత శకుని కుమారుడైన ఉలూకుడు. ఈ దౌత్యం వేళకు ఇరుప్రక్కలయందు సేనాపతుల నియామకం , సైన్యం కురుక్షేత్రం చేరడం మొదలైన పనులన్నీ పూర్తీ అయినాయి. యుద్ధం ప్రారంభమవ్వడం మాత్రమే మిగిలింది. అట్టి సందర్భంలో కూడ చివరిసారిగా దౌత్యం నిర్వహింపబడింది. బహుశః ఇది సంప్రదాయమో , ధర్మమో , లేక సంధికి చివరి ప్రయత్నమో కావచ్చు. రామాయణంలో కూడ వానరసైన్యం వారధి కట్టి సువేలాద్రి చేరిన తర్వాత విభీషణ శరణాగతి ఇందుకు నిదర్శనం. అట్లే సుగ్రీవుడు రావణుని కిరీటం పడవేసి , మల్లయుద్ధం చేసి వెనుదిరిగిన తర్వాత శ్రీరాముడు అంగదుని రావణాసురుని వద్దకు దూతగా పంపుతాడు. అట్లే దేవీభాగవతంలో దుర్గాదేవి కూడ శుంభ , నిశుంభులతో యుద్ధం చేసే సమయంలో చండ , ముండాసురుల వధానంతరం శివుని శుంభ , నిశుంభుల దగ్గరకు దూతగా పంపుతుంది.

ఉలూకుని రాయబారం దుర్యోధనుని మనోవృత్తిని సుస్పష్టంగా వెల్లడిస్తుంది. కావున ఈ రాయబారం ముఖ్యమైనది.  ” జూదంలో మిమ్మల్ని ఓడించి ద్రౌపదిని సభలో పరాభవించాము. మీరు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము , ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. వాటిని మరచి వీరులు కండు. అశక్తుడైన భీముడు దుశ్శాసనుని రక్తం త్రాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. సామర్థ్యముంటే అతని ప్రతిజ్ఞ నెరవేర్చు  కొనమనుము. భీష్మ , ద్రోణ , కర్ణ , శల్యాది శూరులతో కూడిన మా సైన్యంతో పౌరుషముంటే యుద్ధం చేయండి. జూదంలో ఓడినప్పుడు అర్జునుని గాండీవం ఏమైంది ? భీమసేనుని బలమెక్కడికి పోయింది ? –

‘ త్యక్త్వా ఛద్మత్విదం రాజన్ క్షత్రధర్మం సమాశ్రితః l

కురు కాస్యాణి సర్వాణి ధర్మిష్ఠోsసి నరర్షభ ll ‘

( నీ ధర్మ ప్రవచనాలన్ని కట్టిపెట్టి  క్షత్రధర్మాన్ని ఆశ్రయించి యుద్ధం చేయి ) ” అంటూ పాండవులను రెచ్చగొట్టు సందేశాన్ని ఉలూకునితో చెప్పి పంపుతాడు దుర్యోధనుడు.

జూదంలో ఓడిపోయినప్పటి నుండి దేశం వదలి తనవారితో పడరాని కష్టాలు పడ్డాడు ధర్మజుడు. అట్లే రాజ్యభాగం ఇవ్వక ఆయినా యుద్ధానికి దిగడని దుర్యోధనుని అభిప్రాయం. దుర్యోధనుడు భీష్మ ద్రోణుల బలాన్ని చూసుకొని యుద్ధ సన్నద్ధుడయ్యాడు కాని తన బలాన్ని నమ్ముకొని కాదని సులభంగా చెప్పవచ్చు. అందుకు ప్రత్యుత్తరంగా పాండవులు తాము యుద్ధం చేయడానికే నిశ్చయించుకొనన్నామను ఆలోచితమైన సందేశాన్ని దుర్యోధనునికి  చెప్పి పంపారు. ఈ విధంగా నాలుగవ రాయబారం ముగిసినది. శకుని కుమారుడైన ఉలూకుని దౌత్యకార్యం అందరికీ తెలుయవలెనన్నదే ఈ వ్యాస పరమోద్దేశ్యము.

===============================

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 thought on “శ్రీమన్మహా భారతము – ఉద్యోగపర్వము -రాయబారములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *