April 25, 2024

పాటే (మాటే) మంత్రము

రచన: వెంకట్ హేమాద్రిబొట్ల

ఇంద్రధనస్సు లో ఏడు రంగులు ఉంటాయి.  కలైడోస్కోప్ లో ఎన్నో రంగులు మారుతూ ఉంటాయి.  చిన్నప్పుడు బయోస్కోపు అనే ఈ బండి అద్దం ముందు, ఒక చేయి కంటి దగ్గిర గొట్టంలా పెట్టుకుని చూస్తుంటే, ఆ బండి అతను హాండిల్ తిప్పుతూ ఉంటే, ఒకట తరువాత ఒకటి  చిత్రాలు వచ్చేవి.  అవి ఎన్నో రంగులు మారుతూ,  దగ్గిరగా దూరంగా, పెద్దగా చిన్నగా వివిధ ఆకారాలుగా మారుతూ ఉండేవి.  అలా చూస్తూ అబ్బురపడేలోపు ఆ చిత్రం అయిపోయేది.  “మళ్ళీ చూపించు” అంటే “మళ్ళీ డబ్బులు” అనేవాడు అతను.

అందరూ అలా ఆసక్తిగా చూసే ఆ యంత్రంలో ఎలా అయితే రంగులు మారుతాయో, అదే విధంగా, ప్రతీ ఒక్కరి పయనంలో కూడా అలా అనుభవాలు మారుతూ ఉంటాయి అన్న మాట.

“ఆహ, అలాగా”? – అవును అలాగే.

ఈ విషయంలో నేను చాలా చాలా పరిశోధనలు చేసాను.  ఇప్పుడు అవన్నీ చెపితే మీరు చదవరు కానీ, దాదాపు అందరి జీవితంలో జరిగే సంఘటనలను, అనుభవాలని రంగరించి, వాటిని అధ్బుతమైన గేయాలుగా మలిచి, ఎంతో మంది కవులు తెలుగు చలన చిత్రాలలో అందించిన పాటల గురించి ఇవాళ తెలుసుకుందాం.  ఈ గేయాలకు తమదైన శైలి లో బాణీలు సమకూర్చి జనరంజకంగా అందచేసారు సంగీత దర్శకులు.  వెరసి, అవి అందరినీ అలరించే ఆణిముత్యాలుగా వెలుగొందాయి.

ఈ గేయాలు ఎన్నో గాయాలు మానేందుకు దోహద పడ్డాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ప్రతీ ఒక్కరూ వారి ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు ఒడిదుడుకులు ఎదురుకునే ఉంటారు.  అలా జరిగినప్పుడు, కొంత మంది పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ, క్రుంగి పోతూ ఉంటారు.  అలాంటప్పుడు వారికి కావలసినది అండగా నిలిచేవారు, వారు చెప్పే ఒక మంచి మాట.  సరిగ్గా, అటువంటి అండగా నిలుస్తూ, ధైర్యాన్ని నూరిపోసి, ఉత్తేజపరిచే పదాలను రంగరించి, వాటిని ఉల్లాసమైన రీతిలో అందించే అద్బుతమైన ఔషదం పేరే “పాట”.

ఆత్మన్యూన్యత, అలసట, వేదన, ఆవేదన, దుఖం అనేవి పటాపంచలం అయిపోయేలా ఈ పాటలు వినేవారిలో ఉత్సాహం నింపుతాయి.  నిరాశగా కూర్చున్న వారిని తట్టి లేపుతాయి, ముందుకు నడవమని ప్రభోదిస్తాయి, అందుకు కావలసిన శక్తిని కలిగిస్తాయి.

అవునండి – పాట – కేవలం వినిపించేది, మురిపించేదే కాదు, ముందుకు నడిపించేది కూడా.  ఈ రోజు అలాంటి పాటలలో కొన్నింటిని చూద్దాం,

నిరాశ నిస్పృహల తో కొట్టు మిట్టాడుతున్న వారికి  మొట్ట మొదట నీవు తెలుసుకోవాల్సిన విషయం “కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు” అని ఒక  పాట చెప్తుంది.  చీకటి అలుముకున్నదని బాధ పడుతూ, కలతలకే లొంగిపోయి కలవరిస్తూ కూర్చునే కంటే – సాహసమనే జ్యోతిని చేకొని సాగు అని చెప్పే అధ్భుతమైన పాట ఇది.   అలా చేసిననాడు, ఆ చీకటి ఉండదు, కలతలు ఉండవు.  అగాధమైన జలనిధి లో ఆణిముత్యము ఎలా అయితే దాగి ఉంటుందో, సుఖం అనేది కూడా శోకాల మరుగున దాగి ఉంటుంది.  అయితే, ఏది నీకు “ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను” అంటూ రాదు, దానిని శోధించి సాధించాలి, అదే ధీరుని యొక్క గుణం అని చెప్పే పాటతో ఈ వ్యాసం మొదలు పెడదాం.

అలాగే, ఇంకొక అధ్భుతమైన పాట – “ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం”.  వింటూనే నర నరాలలో ఉత్తేజం నింపే పాట.  నిరాశను పూర్తిగా పారద్రోలే పాట.  “గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు”.   నీ గమ్యం చేరే దాకా ఎక్కడా అగొద్దు, అసలు అలుపు అనే మాట రావొద్దు అని భుజం తట్టి ముందు నడిపే పాట.  కష్టాలు కన్నీళ్లు రానీ ఏమైనా కానీ, ఎదురు ఏదైనా రానీ, ఒడి పోవొద్దు, ఎట్టి పరీస్తితులలో రాజి పడొద్దు, నీ గమ్యం చేరేవరకు నిదుర పోవొద్దు, ఆ నింగే నీ హద్దుగా సాగు అని దిశా నిర్దేశం చేస్తుంది ఈ పాట.  అలా సాగిన నాడు ఆ వచ్చే “విజయాన్ని నీ పిడికిలి లో చూడాలి, ఆ గెలుపు చప్పట్లు గుండెల్లో మ్రోగాలి” అంటూ నుదుటిపై సంతకం చేసి, యెదలో చిరునవ్వు చిరునామాగా నిండి, వీడని నీడలా నీ వెంటే ఉంటా నేస్తం, పద ముందుకు అని ప్రోత్సహించే ఆ పాట నిజం గా అద్భుతం.  “నమ్మకమే మనకున్న బలం”, ఆ బలం తో “నీలి కళ్ళల్లో మెరుపు మేరవాలి, కారు చీకటిలో దారి వెతకాలి, గాలి వానలో ఉరుమి సాగాలి” అని చెప్పే ఈ పాట, ఈ గమనం లో తగిలే గాయాలలో నీ ధ్యేయం పొందు అంటుంది.  ఈ పాట ఒక్కటి ఉంటే చాలు, దానినే నేస్తం గా చేసుకుని, ఆ పలుకులే మననం చేసుకుంటూ, నిరాశా నిసృహలలో నుండి బయటపడి, తమ గమనం వైపు ఎంతో మంది దూసుకెళ్లారు అనేది నిజం.

 

ఎక్ల చొలో… ఎక్ల చొలో… ఎక్ల చొలోరే!  అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్.  నీవు సరియైనదని నమ్మి, సాగిస్తున్న బాటలో ముందుగా ఎవరూ నీతో కలిసి నడవక పోవచ్చు.  అంతే కాక, నిన్ను ఎన్నో సూటి పోటీ మాటలతో నిరుత్సాహ పరచడానికి కూడా ప్రయత్నిస్తారు కొందరు.  అయితే, ఇవేవి లెక్క చేయక పట్టుదలతో ముందుకు సాగిననాడు క్రమంగా ఎంతో మంది నీతో కలిసి వస్తారు.  అంతకు ముందు విమర్శించిన వారు, అదే నోటితో నీకు జేజేలు పలుకుతారు.  ఇదే అర్ధం స్పురించే పాట, “ఎవరేమ్మనను, తోడురాకున్ననూ పోరా బాబు పో, నీ దారి నీదే, సాగి పోరా నీ గమ్యం చేరుకోరా” అని.  “నీకు వంద మంది కనపడుతూ వుండొచ్చు, నాకు మాత్రం ఒక్కరే కనపడుతున్నారు, యుద్ధం అంటూ స్టార్ట్ చేసాక నీకు కనపడాల్సింది టార్గెట్ మాత్రమే”  అని ఒక హీరో ఈ మధ్య అన్నట్టుగా, సూటిగా నీ గమ్యం వైపు సాగిపో అని చెప్పే పాట ఇది.   అలాగే  “బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య” అని ఒక చెల్లి అడిగినప్పుడు “సూటిగా చుక్కాని పట్టి నావ నడపవే చెల్లెలా” అని సమాధానం చెప్పాడు ఆ అన్నయ్య.   ఎపుడైనా ఒంటరిగా ఫీల్ అవుతుంటే “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం సూన్యం నాదే” పాట గుర్తు తెచ్చుకుంటే ఎక్కడి ఒంటరితనం అక్కడ ఎగిరిపోతుంది.  ఈ మహా విశ్వం లో మనం కూడా భాగము అన్న భావన కలుగుతుంది.

“మౌనం గానే ఎదగమని మొగ్గ నీకు చెపుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది” – ఇంక ఇంత కంటే క్లియర్ గా ఏమి చెప్పనక్కరలేదు అనుకుంటాను?  “చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో” అంటూ పట్టుదలతో శ్రమిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పిన పాట ఇది.  మొదట్లో ఆ బ్రహ్మ అందరి రాతలు సరిగ్గా రాసేవాడు.  తరువాత తరువాత జనాభా ఎక్కువైపోయి, ఆయనకీ టైం దొరక్క, ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు రాసి బూమ్మీదకి పంపేయడం మొదలు పెట్టాడు.  అందుకు చక్కటి సూచన ఉంది ఈ పాటలో.  “తోచినట్టుగా అందరి  రాతలు బ్రహ్మే రాసాడు, నీకు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి” అని.

“మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ” అని “కృషి ఉంటే మనుషులు ఋషులుతారు, మహా పురుషులౌతారు” అని ఎలుగెత్తి చాటిన గీతం ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు.

ఇందాక “మౌనం గురించి మాట్టడుకున్నాం” కదా – అదే విషయం చెప్పిన ఒక అధ్భుతమైన వాక్యం “గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు” అన్నపాటలో ఉంది.  ఆ వాక్యమే – “కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు, మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు, దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు”.  అనవసరంగా మాట్లాడడం, గట్టి గట్టిగా అరిచి ఆయాసం తెచ్చుకోవడం, తద్వారా ఎన్నో జబ్బులను “కొని” తెచ్చుకోవడం – ఇవన్నీ అవసరమా?  అందుకే అంటాను నేను – “పేషన్స్ ఉన్నవాడు పేషెంట్ కాడు” అని.  ప్రతీ దానికి ఓ తెగ ఫీల్ అయిపోయి బి.పి. తెచ్చేసుకునే బదులు ఓర్పు, సహనం అలవరచు కోవాలి అని ఎంత చక్కగా చెప్పారు ఈ పాటలో.   అలాగే, ఈ పాటలో ఇంకో వాక్యం లో,  ప్రపంచం లో అదరూ మోసం చేసే వారే అని మీకనిపించినప్పుడు, నిజమే, అయితే,  అ సంగతి పక్కన పెట్టి, ఎక్కడైనా చిన్న పాజిటివ్ ఉంటే అది చూడు అని చెప్తుంది – “జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు”.   నిజంగా అమూల్యమైన మాట కదా!

“ఏ సిరులేందుకు, ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే” – ఈ వాక్యం ఒక్కటి చాలు, ఇంక ఈ వ్యాసం ఆపెయొచ్చు.  “జానకి సహనము రాముని సుగుణము ఇలలో ఆదర్శము” అని చాటి చెప్పే ఈ పాట “చీకటి ముసిరినా వేకువ ఆగునా”? అని ప్రశ్నిస్తుంది.  “కలిమి లోన లేమి లోన పరమాత్ముని తలుచుకో” అని భార్య చెప్పిన మాటలు విని అప్పటి వరకు “చిరాకులు, అసహనాలు“ గా ఉన్న ఆ హీరో అవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతాడు.  ఇంతకంటే వేరే కోన్సేల్లింగ్ సెషన్స్ ఎందుకండి?  మీరే చెప్పండి?  ఏవేవో డిగ్రీలకి, మానసిక రోగ నిపుణులకు కూడా అందని జ్ఞానం ఎంతో ఈ పాటలో ఉంది అంటే కాదంటారా?

జీవన సారం అంతా నింపుకుని ఉన్న ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో!

ఈ మధ్య వచ్చిన “వైశాలి, ఐ అం వెరీ వెరీ సారీ”  పాటలో “సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే సుఖపడే యోగం లేనే లేనట్టే” అని హితవు చెప్తాడు హీరో.   “నలుగిరితో కలవందే బరువేగా బ్రతుకంతా, గిరి గీసి కూర్చుంటే వదిలేయరా జనమంతా” అని హీరోయిన్ కి మంచి చెప్తాడు.  పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు, ఆస్ట్రిచ్ పక్షి భూమిలో తల దాచేసుకుని తనని ఎవరూ చూడట్లేదు అనుకునేటట్టు, “కళ్ళ కేమో గంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లెద్దూ ఒసే మొద్దు” అన్న ఒక వాక్యం ఉంది ఈ పాటలో.  మన ఆటిట్టుడ్, మన దృక్పధం ఎలా ఉందో మనకి లోకం అలా కనపడుతుంది. మనం పాజిటివ్ గా ఉంటే మన చుట్టూ పక్కల కూడా అలాగే ఉంటుంది,  మన దృక్పధమే నెగటివ్ గా ఉంటే అంతా నెగటివ్ గా కనపడుతుంది.  అదే విధంగా “తగువెప్పుడు తెగే దాకా లాగావంటే లాస్ అయిపోతావే” అని హెచ్చరించి, “అపుడపుడు సరేనంటూ సర్దుకుపోతూ ఐస్ అయిపోవాలే” అన్న వాక్యాలు నిజంగా ఆలోచించవలసినవి.  ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి, అంటే – కూర మాడింది అని, చీర కొనలేదని, సినిమాకి తీసుకెళ్ళలేదని, కాఫీ వేడిగా లేదని – విడాకులు వరకు వెళుతున్న యంగ్ కపుల్స్ కి ఇవి కనువిప్పు కలగించక మానవు.   “ఉన్నదోకటే కదా ఎదవ జిందగీ, దాన్ని ఏడిపించకు మాటి మాటికి” అని  చెప్తుంది ఈ పాట.

“సత్తె ఏ గొడవా లేదు, సత్తె ఏ గోలా లేదు పుట్టే పతీవోడూ సత్తాడొయ్” ఇది నేను అంటున్నది కాదు, ఒక పాట పల్లవి.  “కలకాలం కాకులా ఉంటే ఏమొస్తుంది, హంసల్లె దర్జాగుండాలోయ్” అని ప్రభోదించే ఈ పాట,  కష్టాల్, నష్టాల్ వచ్చాయ్ అంటే, రానీ, వాటి గురించి ఆలోచించకు అంటుంది.  “అందమైనది ఈ లోకం, అది చూడకుంటే నీ లోపం, పగలు రేయి లేకుండా రోజే అవదు, ఏ కష్టం నష్టం రాకుండా లైఫే అనరు” అని క్లియర్ గా చెప్తుంది.   అంతే కాదు.  మనం ఏదైనా పని మొదలు పెడతాము అనుకోండి. వెంటనే ఆ పని అవదు.  లేకపోతే ఏదో పొరపాటు అవుతుంది.  అంతే, ఇంక ఆ పని మానేసి కూర్చుంటాము.  అలా కాదు, అలా మానకూడదు, వైఫల్యాలే విజయానికి సోపానాలు అని చెప్పే వాక్యాలు ఈ పాటలో  – “చేయాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు, చేసిన తప్పు మళ్ళీ చేస్తే అది తప్పు, ఏ తప్పు చేయకపోతే ఇంకా తప్పు”.

జీవితం.  ఈ పదం చాలా సామాన్యం గా ఉపయోగించేస్తాం.  అయితే, జీవితం పదంతో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి.   “జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు” అన్న పాట వింటుంటే ఎవరికైనా ఉత్సాహం కలుగక మానదు.  “పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందేట్టు, బండలు రెండుగా పగిలేట్టు తలపడు నరసింహ” అని సాగే ఈ పాటలో ఆశావహ దృక్పధం ప్రతీ పదం లోనూ కనిపిస్తుంది.  ఎంతటి కష్టం అయినా, ఎదిరించి పోరాడితే విజయం నీకు తప్పక దక్కుతుంది అని తెలుపే పాట ఇది.

“జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం సాగని పయనం” ఒక్క వాక్యం లో ఎంతో అర్ధం దాగి ఉంది కదా!

ఆఫీస్ లో అందరూ మీటింగ్ పెట్టుకుని కూర్చుని ఆలోచిస్తున్నారు.  గంటలు గంటలు.  ఇంతలో లంచ్ టైం అయ్యింది.  లంచ్ అయ్యాకా మళ్ళీ సమావేశం అవుదామని అనుకునేంతలో ఒకరు లేచి “ఎవరో ఒకరూ ఎపుడోఅపుడు నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు” అన్న పాట చెప్పి, తను ఇంక మీటింగ్ కి రానని ఆ సమయం లో అయ్యే పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేస్తానని వెళ్ళిపోయాడు.   ఎంత సేపూ తర్జన బర్జనులు అర్జున గర్జనులతో, ఇలా చేస్తే బావుంటుందా, అలా చేస్తే ఏమవుతుంది అనుకునే బదులు కొంచెం పని కూడా చేస్తే బాగుంటుంది, ఒక నాంది ఇంకా ఎంతో పురోగతికి హేతువు అవుతుంది  అని చెప్పే పాట ఇది.  “మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ”, “కదలరు ఎవ్వరూ వేకువ వొచ్చినా అనుకోని కోడి కూత నిదరపోదుగా,  జగతికి మేలుకొల్పు మానుకోదుగా,  మొదటి చినుకు సూటిగా దూకిరానిదే, మబ్బు పొంగు చాటుగా వొదిగి దాగితే వాన ధార రాదుగా నేల దారికీ, ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ”  లాంటి వాక్యాలు నిండి ఉన్న పాట ఇది.  ప్రతీ ఒక్కరు ఆద్యంతం చదవాల్సిన పాట ఇది.

“ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేలా ఆఆ” – నాకు ఎంతో ఇష్టమైన ఇంకొక పాట..  అనుకోని సంఘటనలో కాలు పోగొట్టుకుని నడవడమే కష్టమైన ఒక నర్తకి యదార్ధ గాధ ఇది.  చివరికి ఎలాగో కృత్రిమ కాలు అమర్చి నడవడం వరకు చేయగలిగిన వైద్యులతో ఆమె అన్న మాటలు – “నేను తిరిగి నృత్యం చేయాలి”, అని.  దానిని ఆ వైద్యులు కూడా సవాలు గా తీసుకుని అటువంటి కాలు అమర్చడం, ఆ నర్తకి అకుంఠిత దీక్ష తో సాధన చేసి తిరిగి నృత్య ప్రదర్సన ఇవ్వడం నిజంగా అందరికీ స్పూర్తిదాయకం.  తానూ కష్టాల్లో ఉన్నప్పుడ్డు వదిలి వెళ్ళిపోయిన మనిషి ఇదంతా చూసి స్వార్ధం తో తిరిగి వచ్చినప్పుడు వచ్చే పాట ఇది.  ఇక తనకి ఎవ్వరి ఆసరా, సానుభూతి అవసరం లేదని,  నృత్య సాధన చేస్తూ సాగే పాటలో ఈ వాక్యాలు చూడండి – “నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదిక గా నటన మాడనా, అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా” – ఈ అనంత ప్రపంచం జయించినంత ఉత్సాహం అంతా ఆ వాక్యాల్లో ప్రతిబంబిస్తుంది.

ఒక పని చేయాలి అని నిశ్చయించుకున్న తరువాత, అదే అయిపోతుందిలే అని కూర్చుంటే ఆ పని అవుతుందా?  ముమ్మాటికి కాదు.  నిరంతర శ్రమ, సాధనతో మాత్రమే అది సాధ్యమవుతుంది.  అది ఎలా ఉండాలి అంటే “చెయ్ జగము మరిచి జీవితమే సాధన, నీ మదిని తెరిచి చూడటమే శోధన” అన్న పాట మనకి దారి చూపుతుంది. “ఆశయమన్నది నీ వరమైతే, ఆ అంబరమే తలవంచుతుంది, నీ కృషి నీకు ఇంధనం లా పని చేస్తుంది, అది కావాలి సాగర బంధనం” అని చెప్పే ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకం.

మంచి పాటకి భాష తో సంబంధం లేదని మన అందరికీ తెలుసు కదా.  కొన్ని హిందీ పాటలు కూడా చూద్దాం.  “జిందగీ తో బేవఫా హైన్ ఎక్ దిన్ టుక్రాయేగి, మవుత్ మెహబూబా హై అప్ని సాత్ లేకర్ జాయేగీ” – జీవితం మోసగత్తె ఒక రోజు నిన్ను వదిలేస్తుంది, చావు నీ ప్రియురాలు లాంటిది తనతో పాటు నిన్ను తీసుకెళ్తుంది.  “రోతే హుయే ఆతే హాయ్ సబ్ హస్తా హు జో జాయేగా వొహ్ ముకద్దర్ కా సికందర్ జానేమన్ కేహ్లాయేగా” – అందరూ ఏడుస్తూ ఈ ప్రపంచం లోకి వస్తారు, నవ్వుతు వెళ్ళేవాడే అసలైన హీరో.    ఏవంటారు, కాదంటారా?

“జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్నే జానా”  – జీవితం ఒక అందమైన ప్రయాణం లాంటిది, ఈ ప్రయాణం లో రేపు ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోగలిగారు చెప్పండి? అన్న పాట ఇది.  సరే, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియక పోయి ఉండొచ్చు, కానీ ఇవాల్టి సంగతి ఏంటి?  ఎప్పుడో సంగతి ఎందుకు?  ఈ రోజు ఏం చేయాలో ఆ సంగతి ఆలోచించచ్చు కదా!  అలాగే, ఈ పాటలో “సఫర్” అనే పదాన్ని హిందీ లో కాక ఆంగ్లం లో అర్ధం చేసుకుని, సఫర్ అని ఓ బాధ పడిపోయి, ఇతరులను బాధపెట్టి   మధన పడిపొయే వారి గురించి ఏం చేస్తాం చెప్పండి.  బాబు, భాషని, అందులోని భావాన్నీ సరిగ్గా అర్ధం చేసుకోండి అని చెప్పగలం అంతే.

“జిందగీ కైసి హైన్ పహేలీ హాయ్, కభి ఏ హసాయే కభి ఏ రులాయే” – జీవితం అనేది ఒక చిక్కుముడి, అంతుపట్టని ప్రహేళిక, ఒక సారి నవ్విస్తుంది, ఇంకోసారి ఏడిపిస్తుంది.  “సుఖ్ కే సబ్ సాతి, దుఃఖ మే నా కోయి” – నువ్వు బావున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, నీతో మాట్టాడుతారు.  అదే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడ్డు ఒక్కరూ నీ మొఖం చూడరు.  “మేరే రాం, మేరే రాం, తేరా నామ్  ఏక్ సాచ దూజ న కోయి” – రామా – నీ నామమోకటే సత్యం, నీ కన్నా నాకెవ్వరు దిక్కు, నిన్ను తలుచుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి.  అవును, నిజం.

“చాహత్ కే ధో పల్ భి మిల్ పాయె దునియా మే ఏ భి కం హై క్యా?” – ఇటీవలి “సేనోరిటా”  పాట ఇది.   సంతోషం  ఏదో ఎక్కడో ఉంది, దాన్ని వెదకాలి, అలా వెదకడం అనే ఎండమావి వెనక పరుగెత్తాలి అని కాకుండా, నువ్వున్న చోటులోనే ఒక క్షణం హాయిగా ఉంటే చాలదా అని అడుగుతోంది ఈ పాట.

ఇక మళ్ళీ మన తెలుగు పాటల్లోకి వస్తే –

“ఏరువాక సాగారో” పాట.  ఆనాటికి, ఈనాటికి “కల్లా కపటం ఎరుగని వాడు, లోకం పోకడ తెలియని వాడు” ఎవరంటే రైతన్న.  ఎన్నో దశాబ్దాల నాటి పాట ఈ రోజుకీ అప్లై అవుతుంది.  “పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు”, అలాగే “పల్లెటూళ్లలో చెల్లనివాళ్లు, ఎందుకు కొరగాని వారు ఏంచేస్తారు అంటే పాలి“ట్రిక్స్” తో బ్రతుకుతారు.  “పెజా సేవ, పెజా సేవా” అని పగలు లేచినప్పటి నుంచి అరిచే వీరు, మరి పని చేయండి అంటే మాత్రం “వొళ్లు వంచి చాకిరికి మళ్లరు” అని చెళ్ళున కొట్టే పాట ఇది.  ఇది అప్పటి ఎప్పుడో సంగతి కాదు.  ఈ రోజు జరుగుతున్న దానికి నిలువెత్తు నిదర్శనం.  ఇంకేంటి, నేను పదవి లోకి వచ్చేసాను, నాకింక ఎదురు లేదు అని కొందరు  అనుకున్నారు. కోట్లు సంపాదించారు. ఆ క్రమం లో రైతన్నని మరిచారు.  ఆ తరువాత ఏమైందో అప్పటి పాటలో ఈ వాక్యాలు, ప్రతీ పదము నిజమయ్యింది చదవండి:  “పదవులు తిరమని బ్రమిసే వాళ్లే, కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే, నీవే దిక్కని వత్తురు పదవోయ్”.  అవును, అన్ని రోజులు ఒకలా ఉండవు.  మారుతాయి.  మారాయ్.  అయితే, కొద్దిమందికి ఇది తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయిందేమో?  అందుకే, ఎప్పుడూ దేశానికి వెన్నుముక అయిన రైతన్నని మరవకూడదు.

గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం దానితో పాటు మనుషులు అందులోని మనసుల కాలుష్యం – ఎక్కడ చూసినా ఇదే పరీస్తితి.  మరి ఎం చేయాలి?  చాలా సింపుల్.  అందుకు సమాధానమే ఈ పాట – “పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకం లో కన్నీరింక చెల్లు, చిన్ని చిన్ని గూటిలోనే స్వర్గముందిలే, చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకా చిలుకకు చీరలెందుకు … అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట”.  ఏదో చేయాలన్న తాపత్రయం లో మనిషి విచక్షణా రహితంగా చెట్లు నరికేస్తున్నాడు, అడవులు అంతరించి పోతున్నా పట్టించుకోవట్లేదు, ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి అన్న ధ్యాసే తప్ప ఇంకేమి కనపడని, వినపడని స్టేజి లోకి వెళ్ళిపోయాడు.  అసలు ఇవి ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అన్న సత్యం గుర్తించ లేక పోతున్నాడు. “అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం, మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం”.   ఇలా ఒక దానితో ఇంకొకటి, వాటికి ఉన్న అనుబంధం, వాటన్నిటితో పాటు తనకు ఉన్న అనుబంధం తెలుసుకున్న నాడు “బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం”.

“యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే,  యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే” – జోరుగా సాగే పాట.  “కళ్ళల్లో కలలుంటే, గుండెల్లో దమ్ముంటే రోజూ రంగేళి లే” అని చెప్పే పాట.  “జనమందరిలో మనమేవ్వరంటే” వాటోమాటిక్ గా తెలియాలి, ఒక విలువుండాలి, ఘన చరితలు గల ఆ కొందరి లిస్టు లో మన పేరు కూడా ఉండాలి, అనుదినం కొత్తగా, ఒక ఫ్రెష్ రోజులా ఉన్నప్పుడు, బ్రతకడం అప్పుడే పండుగ అంటుంది ఈ పాట.  ఈ లోకం లో ఉంటూ, యాంత్రికంగా చుట్టూ ప్రపంచాన్నీ చూస్తూ, “జీవించడమే” అంటే తెలియని వాళ్ళని చూస్తె జాలి పడుతుంది.  కనిపించని తల రాతని, అర చేతులలో గీతని పట్టుకు వెళ్ళాడి, అవే బ్రతుకును నడిపిస్తాయని నమ్మే వాళ్ళని ఏం చేయాలి?, అహ, అసలు ఎం చేయాలి? అని అడుగుతుంది ఈ పాట.  ఏం చేసినా తప్పు లేదంటారా?  ఊరికే ఊహల్లో తేలుతూ ఉండడం కాకుండా,   నువ్వు అనుకున్నది నిజం చేసుకో, నింగి లో నిలిచిపో తారలా అని క్లియర్ కట్ గా చెప్తుంది చివరలో.

నలుగురిలో మనకి ఒక స్పెషల్ ఆధార్ కార్డ్ ఉండాలి అనే విషయం పూలరంగడు కూడా చెప్తాడు “ఏక్ దో  తీన్ చార్ చార్” పాటలో.  “బ్రతుకంటే వార్ వార్ పోరాడారా” బ్రదర్ అంటూ “కృషి ఉంటె యార్ యార్ ఋషులయ్యి పోతార్” అన్న అన్నగారి మాటని నమ్ముకుని ముందుకెళ్ళే ఈ హీరో,  “నీ లైఫ్ కి నువ్వే బిగ్ బాస్” అని చెప్తాడు.  నమ్మినట్టు ముందుకు వెళ్ళు, నచ్చినట్టు దూసుకువెళ్ళు “కండలు, గుండెలు ఉంటె కొండలైనా అడ్డుకోవురో” అని అంటాడు.  లైఫ్ అన్నది నీడ లాంటిది లైట్ లేకపోతే అది రాదు – ఆ వెలుగు నువ్వు కావాలి – ఎంత మంచి అర్ధం ఉంది ఈ వాక్యంలో.  అలాగే కష్టమన్నది నీకు ఒక తోడు లాంటిది అది నిన్నెప్పుడు వీడిపోదు అని చెప్తాడు.  ఇక్కడ మళ్ళీ లిస్టు గురించి వస్తుంది.  “కష్ట పడ్డ వాళ్ళ లిస్టు లో చేరాలి ఆ లిస్టు లో ఫస్ట్ రాంక్ కొట్టాలి” అంటాడు.  ఈ పాటలో ఇంకొక ముఖ్యమైన కొన్సుప్ట్ ఉంది.  అప్పు చేయడం మంచిది కాదు, నాకు అప్పు చేయడం అంటే ఇష్టం ఉండదు అంటూ ఉంటారు కొంత మంది.  ఇప్పుడు, దేశాలే అప్పు తీసుకుంటున్నాయి.  కేవలం నీ దగ్గర ఉన్న ఎమౌంట్ తో అన్నీ చేయాలి అంటే అవ్వని పని.  అందుకని అప్పు చేసే అవసరం రావొచ్చు.  అయితే, చేసిన ఆ అప్పుని సద్వినియోగ పరుచుకుని, దానితో ఏదైనా పనికొచ్చే పని చేసినప్పుడు, అది ఆ రూపాయి తో పాటు ఇంకొక రూపాయి సంపాదించినప్పుడు, అటువంటి అప్పు చేయడం లో తప్పు లేదు అంటాడు.  “రస్క్ లేనిదే చాయి లో రిస్క్ లేనిదే లైఫ్ కిక్ లేదురో”, అయితే ఆ రిస్క్ తీసుకునే వాళ్ళ లిస్టు లోకి ఎక్కినా, వాళ్ళు నీకు సలాం కొట్టేలా ఎదగాలి అంటూ పాజిటివ్ ఆలోచనలు నింపే పాట ఇది.  “ఆకాశం నీ హద్దురా” అన్న పాటలో “నిలబడి తాగే నీళ్ళు చేదురా, పరుగెతైనా పాలే తాగరా” అని ఎప్పుడో చెప్పారు కదా.

ఇందాక ఒక సందర్భం లో చెప్పాను   – “పేషన్సు లేకపోతే పేషెంటే” అని.  అయితే, ఇది యూత్ కి వర్తించదు.  ఒక మంచి పని చేయాలి అనుకున్న వారు – అది ఎంత తొందరగా పూర్తి అవుతుంది అన్నట్టు ఉండాలి.  చదువుతున్నారు అనుకోండి, అది ఏంత త్వరగా పూర్తి  చేయాలి అన్నట్టు ఉండాలి, రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఎంత త్వరగా పూర్తి  చేయాలి అని ఉండాలి కానీ, హాస్టల్ వసతి మెస్సు ఫుడ్డు – ఇదే బావుంది, మెల్లిగా ఎలాగోలా ఒక అయిదు పదేళ్ళు లాగించేద్దాం అని ఉండకూడదు కదా.    ఇలాంటి తొందర ఉండడం “ఆశావహ అసహనం” అంటాను నేను.   పలికే గోరింకకి అదే చెప్తుంది ఒక పాటలో ఒక అమ్మాయి.  తను “ఎదురు చూసే దీపావళి పండుగ ఎప్పుడో కాదు నేడే రావాలి” అంటుంది.  పైగా, రేపటి సత్యాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయునే అంటుంది.  పగలే వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లె వస్తే నేరమా – ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళని చూస్తె ముచ్చట వేస్తుంది.  కొంచెం ఆశ, కొన్ని కలలు కలియకే జీవితమంటే – నువ్వు అట్లీస్ట్, కనీసం ఓ వంద కలలను కంటే, వాటిలో ఆరు అయినా నిజం అవుతాయి – అంతే కానీ కళ్ళు మూసుకు పడుకుంటే ఒరిగేదేమిటి అని అడుగుతుంది.  రేపు అన్నది దేవునికి, నేడు అన్నది మనషులకు అంటూ “బ్రతుకే బ్రతికేందుకు” అంటుంది.  మనిషి గా పుట్టడం వీజీ కానీ, మనిషి గా బ్రతకడం చాలా కష్టం అని “ఒక అద్భుతః సినిమా” లో డైలాగ్.  అలాగే, “బ్రతుకే బ్రతికేందుకు” – ఇదేమిటి, వేరే చెప్పాలా అంటే, అవును ఈ రోజుల్లో చెప్పాల్సి వస్తోంది.  ఎందుకంటే, ఆ బ్రతకడం మానేసి, ఎంతసేపు తెగ ఆలో”చించేస్తూ” ఉంటాం కదా?   అందుకే అన్నారు – “ఎస్టర్డే ఇస్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ఏ గిఫ్ట్ డట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ప్రెసెంట్ – నిన్న అన్నది చరిత్ర, రేపు అన్నది మనకి తెలీనిది, ఇవాళ అనేది మాత్రమె నీకు తెలిసినది, నీ చేతులలో ఉన్నది, అందుకే దాన్ని ఒక బహుమానం అన్నారు.

ఒక బంగారం లాంటి పాటతో ముగిద్దాం.  “ఎవరు ఆహా అన్నా, ఎవరో ఓహో అన్నా, నీవు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకం లోనా నువ్వే అసలు బంగారం” అన్న పాట.  ఒక్క సారి మాట ఇస్తే ఆ మాట తప్పకు అని, ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పే పాట.  ఎవ్వరి జోలికీ పోకుండా నీ పని నువ్వు చేసుకో.  కానీ, అలా చేసుకుంటున్న నీ పనికి ఎవరైనా అడ్డువస్తే మాత్రం, వచ్చిన వాడి “టాపు లేపి మరి చూపారా” అని కూడా చెపుతుంది.  మనం “మంచి మంచి” అని ఉంటాం.  కానీ ఆ మంచిని చేతకానితనంగా కానీ, లేక ఆ మంచిని వారి స్వార్ధం కోసం ఉపయోగించుకుందాం అనుకునే వారిని  కానీ ఉపేక్షించ వద్దు అని చెప్పే సాంగ్ ఇది.  ఇది ఈ రోజుల్లో చాలా అవసరం.

ఇలా, ఎన్నెన్నో పాటలు, అక్షర లక్షలు చేసేవి, జీవిత సత్యాలు తెలిపేవి.  అందులో కొన్ని మనం చూసాం.  వీటి నుంచి స్ఫూర్తిని పొందిన నాడు, అవి మనలో మార్పు కలిగించి, మన మన  లక్ష్యాలను చేరుకునేనుందుకు తప్పక దోహదపడుతాయి అనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు.

మీరేమంటారు?

32 thoughts on “పాటే (మాటే) మంత్రము

  1. మీ టాపిక్ మీ అదేలెండి మన భాషలో/పాటలో చెప్పాలంటే ..అదుర్స్ ..ఆ అ అ అదుర్స్
    నేను కూడా ఎప్పుడూ సమయానికి తగ్గట్టు పాడుకోవడమే తప్ప ,ఇందులో ఇన్ని అర్ధాలు నేను అసలు కనిపెట్టలేదండీ .
    మొత్తానికి ఈ టాపిక్ తో మీరు
    ” అట్టాంటి ఇట్టాంటి రైటర్ ని కాను నేను” అంటూ
    ” మరి ఎట్టాంటి ఎట్టాంటి రైటర్ తమరు ?” అని
    అడిగే అవసరం లేకుండా పాటలలోని అర్ధాలను మాకు విడమర్చి చెప్పి …
    “విరించినై విరచించితిని ఈ కవనం
    విపంచినై వినిపించితిని ఈ గీతం ”
    అని మాకు అన్ని రకాల పాటలలోని మాధుర్యాన్ని చూపించారు .

    ఇంక ఆఖరిగా చెప్పాలంటే ” చల్ చల్ చలో చల్ రె చల్ చలో సరదాగా ఉండాలి చలో ” అంటూ మీరు రాసే ఈ టాపిక్ మళ్ళీ అదరగొట్టేసారని చెప్తూ ..
    ఇంతటితో మీ వ్యాసాలని ఆపకుండా ..ఇంకా ఇలాంటి ఆణిముత్యాలను మాకందించి మమ్మానందింపచేయమని మదీయవిన్నపము .

    “ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా ”

    ఈవిధంగా మీరు ముందుకు సాగిపొండి ..(ఇందులో “రా” అనేది పాటలో ఉందండోయ్ )

    1. 🙂 thank you very very much … avunu … at one point of time i thought this would be my last article so to say … because i felt after this i have nothing more to write … but then i would indeed write something … but this article would remain very special … and indeed so will be the comments of all of you … they would remain very special too … thank you very much …

  2. very nice & feel good article.
    extracting a nice song from a mass movie(dondalaku donga),extreemly wonderful.

    1. oh thank you so much … the attempt was to have that feel good effect throughout the article … and the other point you mentioned is also very interesting … about the mass songs … i have picked up the lyric for it’s worth … with the underlying point that one needs to listen to the good wherever it might be coming from … so they included songs of all genres … i actually had a couple of “item” songs too to be mentioned … 🙂 atleast one stanza of those songs too had good message … thanks once again for your feedback

  3. You made a cocktail of life in a simple, straight and direct manner, but easier said than done…….I call it a power of your prayer.Prayer generates good currents and produces tranquility of the mind. It can move mountains, can work miracles. You have freely opened the chambers of hearts. As I call this work of yours a prayer, may the inner eye of intuition be opened in you through your prayer…….My comment may seem strange…but this is what I felt and shared…….venkat garu……

    1. yes… i can understand what you are trying to put across … the power of prayer, the power of meditation can reveal many a things indeed …. about the cocktail i made … that is what it is all about … isn’t it? … that’s why i said it’s akin to kaleidoscope in the very beginning … 🙂 thank you

  4. తెలుగు చిత్రగీతాల గురించి చాలా చక్కని విశ్లేషణ! ఉదాహరణలు కూడా తగినట్టుగా అందంగా ఇచ్చారు. ఆభినందనలు వెంకట్ గారూ!!

    1. Yes 🙂 the examples ought to be apt … the song and the point should complement each other … that’s what the effort was throughout the article … glad you liked it … thanks so much Rajesh gaaru …

  5. andaru nee rachana gurinchi raasaaru. naa kantha sakthi ledu. kaani 2/3 chinna anumaamaalu theerchu.
    EE TOPIC ELAA THATTINDI?
    Intha sodhinchi raasi saadhincha daaniki Samaya melaa sampaadinchaavu?
    Indulo nee sreemathi paatra entha?
    Article A+ Ani nenu vere pratyekamgaa cheppa nakkara ledu.

    1. first article meeku nachhinanduku dhanyavaadaalu … ika topic yelaa tattindi? eppati nuncho anukuntunna topic idi … ade topic gurinchi Jyotakka rayamanagaane ventane modalu pettanu … 2. enta samayam pattindi – paatalu list tayaaru chesukodaaniki ekkuva time patta ledu … 3. samayam … rojuu raatri koorchuni rasevanni … one week patti undochhu … ayithe ivi annee krodeekarinchi oka kramamaina paddhatilo petti … manchi intro ivvadaaniki maatram chaalaa aalochincha valasi vachhindi … 4. last and most important sreemathi paatra … entainaa … antaaa … ayithe article rasetappudu maatram tanaki cheppaledu … i wanted to keep it a surpise … thanks so much once again for your comments and best wishes …

  6. EE patala rachayitala perlu koodA vrAsta BAgundedi ani anipistunnadi. Idea chAlA Bagundi. Thanks.

    1. thank you for liking the article andi … yes meeru annadi correcte … each of the writers are great in their own way … and many of them are my favourites too … but then naming them or any other details, much as i wanted to do so, would take the topic away from the feel … in whatever little way … rather i wanted the underlying theme to dominate throughout … so the solution was to give the hyperlink to each of the song … and the discerning reader would indeed go to that link and learn more … thanks once again … venkat.

  7. ఎప్పటిలాగే అదర గొట్టేసావ్ బాబాయ్…
    ఎటువంటి వాళ్ళనైనా ఎలాంటి ఒడిదుడుకులులో ఉన్నా…. ఎవరు దగ్గర ఉన్నా… లేకపోయినా
    ఆ కష్ట సమయంలో వెంట ఉండి నడిపే నేస్తమే సంగీతం… అన్న విషయం అందంగా చెప్పావ్!!
    చాలా మంచి పాటలు ఉదహరించావు… గ్రేట్!!

    1. 🙂 avunu… you got the point … exactly that’s what songs do to us … they are like friends … this is the point i was trying to bring about … thanks so much for your comments

  8. ఒక బంగారం లాంటి పాటతో ముగిద్దాం. “ఎవరు ఆహా అన్నా, ఎవరో ఓహో అన్నా, నీవు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకం లోనా నువ్వే అసలు బంగారం” అన్న పాట. ఒక్క సారి మాట ఇస్తే ఆ మాట తప్పకు అని, ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పే పాట. ఎవ్వరి జోలికీ పోకుండా నీ పని నువ్వు చేసుకో. కానీ, అలా చేసుకుంటున్న నీ పనికి ఎవరైనా అడ్డువస్తే మాత్రం, వచ్చిన వాడి “టాపు లేపి మరి చూపారా” అని కూడా చెపుతుంది. మనం “మంచి మంచి” అని ఉంటాం. కానీ ఆ మంచిని చేతకానితనంగా కానీ, లేక ఆ మంచిని వారి స్వార్ధం కోసం ఉపయోగించుకుందాం అనుకునే వారిని కానీ ఉపేక్షించ వద్దు అని చెప్పే సాంగ్ ఇది. ఇది ఈ రోజుల్లో చాలా అవసరం……enta baagundi…bangaramlaanti aksharaalato…mutyaala sarame koorchaaru….chakkati padaalato chaalaabagaa raasaavu venkat…thank you so much..manchi article andinchi nanduku 🙂

    1. thank you so much sunder priya gaaru … yes … these days we have got to be very careful … friendly but at the same time be cautious too … very glad you liked the article … all these songs are indeed the favourites for all of us …

  9. పాటల గురించి బాగా వ్రాసావు. ఏమని వర్ణించను ? పాటల తోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి.

    1. Avunu … nijamgaa … kevalam paadukovatame kaakundaa veeti nunchi nerchukovaali koodaa … alaa anukunte nerchukunenduku entho untundi veetilo … Thanks Annayya for liking the article

  10. Superb andi,chala chala baga vrasaru,nijamgane,jeevitamlo enno sandharbhalalo…santoshamlo,dukhamlo,premalo,nirasalo,ila enno samayallo,paatala lo aa anubhootini pondutumtamu,manassantini pondutuntamu,pata oka nestam laga ooratanistundi…….its really an interesting n fantastic article.

    1. Thank you very much Rama Devi Gaaru …. Avunandi … meeru annadi aksharaalaa nijam … I tried to bring the same feel in the article … glad you liked it …

      1. “అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం, మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం”. ఇలా ఒక దానితో ఇంకొకటి, వాటికి ఉన్న అనుబంధం, వాటన్నిటితో పాటు తనకు ఉన్న అనుబంధం తెలుసుకున్న నాడు “బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం”….
        వహ్ …పాటలోని బలం అదే…. ఒక విషయాన్నీ ఒక గంట సేపు సినిమాగా చూపించటానికి కుదరకపోతే …ఒక పాటలో 4 నుండి 5 నిమిషయ లో వివరంగా చెప్పేయ గలిగేది పాట రూపలోనే …అదే 4, 5 నిమిషాల పాటను విశ్లేషించటానికి మళ్ళి గంటలు గంటలు రాసినా/మాట్లాడినా /చదివినా విసుగు కలగదు …చక్కని పాటల అంశం తో విపులంగా విశ్లేషించిన మీకు అభినందనలు…..అందులోను మన తెలుగు పాట ” మంచి ముత్యాల పేట…మధురామృతాల తేట ” -Msrk

        1. avunu sir … paate kadaa manaku praanamu … msrk gaaru … chakkagaa chepparu … avunu – oka paata lo entho ardham imidi untundi … thank you very much

  11. Superbbbbbbbb article Venkat Hemadribhotlagaru. Patalu vati aunnatyam gurinchi Meeru raa ee vyasam nijamgaa chaala bagundi and thanks for sharing with us.

  12. wah lot of feel good songs and meaning ful ones…sir well said by u how songs will give refresh and boost when we down…..

    1. yes indeed vinayaka prasad gaaru … nijamgaa paatalu alaa pani chestaayi kadaa … very happy that you liked the article

  13. superrrrrrrrrrr..writing abt telugu Film songs…needs lot of analytical talent …u hve venkatji ..keep it up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *