April 25, 2024

ఆలోచనలకే అక్షరరూపమిస్తే…

అబ్బబ్బబ్బా! ఈ ఆడాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే  ఉంటారు. ఒక్క ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండలేరు కదా. నలుగు ఆడవాళ్లు కలిసారంటే చాలు ఇక వాళ్ల ముచ్చట్లకు అంతే ఉండదు. బ్రహ్బాండం బద్ధలైనా, సముద్రాలు పొంగి  పొర్లినా వాళ్లకు అక్కరలేదు. ఐనా  ఈ ఆడాళ్లు ఎంత తొందరగా మాట కలిపేస్తారు, స్నేహం చేసేస్తారు. అసలు వీళ్లకు మాట్లాడడానికి ఒక అంశం అంటూ  ఇచ్చే పనే లేదు… పరిచయమైన రెండు నిమిషాలలోనే ఏదో ఒక అంశం మీద మొదలైన ముచ్చట ఎప్పటికి తెగెనో?  ఆవకాయ నుండి అణుబాంబు వరకు, పాలకూర నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు మాట్లాడుకోవడానికి అసలు అక్కరలేని, మాట్లాడటానికి అవకాశం లేని అంశమే లేదు వాళ్లకు..

ఈ డైలాగులన్నీ మీరు అన్నవో, విన్నవో అనిపిస్తుందా??

సాధారణంగా ఆడవాళ్లు పనికిరాని మాటలు, ఊసుపోలు కబుర్లే చెప్పుకుంటారనిపిస్తుంది చాలా మందికి . కాని వాళ్లు నిశ్శబ్దంగా ఉంటే కూడా భరించలేరనేది జగమెరిగిన సత్యం. ఆడవాళ్లకు ఇంటిపని, వంటపని, పిల్లల పని తర్వాత టీవీ, షాపింగ్ తప్ప వేరే ఆలోచనలు ఏముంటాయి?? ఉండడానికి వీలు లేదనే పెద్దమనుషులెందరో ..  అది అబద్ధమని ఇప్పుడు నిరూపితమవుతుంది.  వృత్తి, ప్రవృత్తులతో పాటు తమ మనసులో కదలాడే  ఇతర భావనలకు, ఆలోచనలకు అక్షర రూపమిస్తే అవి అందమైన కవితలుగా మారతాయో, మనసులను కదిలించే కథలే అవుతాయో తెలీదు. కొన్నేళ్ల  క్రితం ముందు మగవాళ్లు చదువుకుని, ఉద్యోగమో, వ్యాపారమో చేసి కుటుంబ పోషణ చూసుకోవాలి, ఇల్లాలు ఇల్లు, పిల్లలు, కుటుంబ నిర్వహణ బాధ్యత చూసుకోవాలని నిర్దేశించారు. కాని కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలు కూడా ఉన్నత విద్యలను అభ్యసిస్తూ పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో తమదైన ప్రతిభతో రాణిస్తున్నారు.  కాని ఇంకా తమలో దాగి ఉన్న అంతర్గత శక్తిని గుర్తించని స్త్రీలెందరో ఉన్నారు. అది గుర్తించి, మెరుగుపరుచుకున్నప్పుడు వారిని మరింత అందంగా, తేజోవంతంగా చేస్తుంది. అన్ని రంగాలలో మాదిరిగానే నేడు మహిళలు రచనా రంగంలో కూడా ఉత్సాహంగా ముందుకు దూసుకెళ్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం కూడా ఎన్నో వెసులుబాట్లు, అవకాశాలు ఇస్తుంది. వాటిని కూడా అందిపుచ్చుకున్న స్త్రీలు తమ ఆలోచనలను, సంఘర్షణలను, భావాలను అక్షరరూపంలో వెలువరిస్తున్నారు. గుండు సూది తయారి నుండి.. అంతరిక్ష ప్రయాణంలో వరకు.. స్త్రీ పని భాగస్వామ్యం లేకుండా..ఏ పని జరగడం లేదు. ఐనా కూడా ఎన్నో ఆంక్షలు. అడ్డంకులు, ఆక్షేపణలు తప్పవు. ఆడవాళ్లకు రాయడానికి, చర్చించుకోవడానికి ఇల్లు, వంట, పిల్లలు, పచ్చళ్లు, తప్ప ఇంకేం విషయాలు ఉంటాయి అని గేలి చేసే స్త్రీ పురుషులెందరికో మా ఆలోచనలను అంతవరకే పరిమితం చేయవద్దు అని తమలోని బెరుకు, భయాన్ని వదిలేసి తమ ఊహలకు రెక్కలు తొడిగి వాటిని అక్షరాలుగా మారుస్తున్నారు మహిళలు. కసవు ఊడ్చే చేతులతోనే  కలం పట్టి  తమ ఆలోచన తరంగాలను అద్భుతమైన కవితలుగా, కావ్యాలుగా, కధలు, నవలలుగా,హాస్య గుళికలుగా మార్చి   చదువరులను అలరిస్తున్నారు.. కొందరి రాతలు మనసుకు సాంత్వన నిస్తే కొందరి రాతలు గుండెలను మండిస్తాయి, కత్తులతో ముక్కలుగా చీల్చేస్తాయి.   వైద్యం, నాట్యం, న్యాయం, సంగీతం,నటనతో పాటు రచనా రంగంలో కూడా తమదైన ముద్రతో  రాణిస్తున్న మహిళలకు   రాబోయే మహిళా దినోత్సవ సంధర్భంగా మాలిక పత్రిక తరఫున మనఁపూర్వక అభినందనలు,

నా ఆలోచనలకు తగినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని వేసి ఇచ్చిన ఉదయ్ కుమార్ గారికి ధన్యవాదాలు..

9 thoughts on “ఆలోచనలకే అక్షరరూపమిస్తే…

  1. అన్యాయంగా ఆడవాళ్ళను ఆడిపోసుకుంటారు కాని,వృధా ప్రేలాపనలతో పొద్దుపుచ్చే మా మగవాళ్ళు కోకొల్లలు.మాట ,మంచి,మర్యాద వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి అబ్బుతాయి.దీనికి ఆడా మగా భేదం ఉండదేమో! దాతృత్వం,ప్రియవక్తృత్వం,ధీరత్వముచితజ్ఞతా…అభ్యాసేన న లభంతే.చత్వారి సహజా గుణాః. చివరగా ఒక్కమాట.తన బిడ్డలకు తొందరగా మాటలు రావాలని వస పోసే అమ్మను మాటల పోగు అనడం సమంజసం కాదు. ….పందిళ్ళ శేఖర్ బాబు.

  2. సంపాదక మహాశయులకు ,

    నమస్కారములు ,

    వాస్తవానికి ఈ ప్రపంచమే ద్వైతం. ఆ ద్వైతం ఏకం అయితే గాని ఏదీ పూర్తి కాదు అన్నది చాలామందికి తెలియదు .
    అందులకే ఆ సృష్టికర్త రెండు జాతులను సృష్టించాడు ఆడ , మగ . ఈ రెండూ ఒకటయితేనే ఏదైనా పూర్తి అవుతుంది
    అని తెలుసుకొనగలిగితే మగవాళ్ళకు , ఆడవాళ్ళే మాత్రం తీసిపోరు అన్నది అనాదిగా ఉన్న ( ఆచారమే )నిజం .
    అది తెలుసుకోకుండా ( మగ )వాళ్ళ అవసరాలకు ( ఆడ )వాళ్ళని అలా అణగద్రొక్కారు ,(ఆ)భరణాల ప్రలోభాలతో ఇన్నాళ్ళూ .ఇప్పుడు ఆ కాలం అకాలమైపోయిందని వెల్లడైంది.

    చాలా బాగా తెలియచేశారు .

    రమాశర్మ

  3. భగవంతుడు అంచెలంచెలుగా ఒక్కోయుగంలో ఒక్కోటి చొప్పున దశావతారాలు దాల్చితే మగువనేడు ప్రతిరోజూ దశావతారాలు దాల్చవలసిందేకదా! ఉదయాన్నే పనిమనిషి, పాలమనిషి, దోభీ, వంటమనిషి, అమ్మ, భార్యామణి, కోడలు ,ఉపాధ్యాయిని, ఉద్యోగిని.ఏఒక్క రూపానికి న్యాయంచేయకున్నా ఆరోజు ఇళ్ళలో సునామీయేగా? చక్కని ఆలోచనకు మరింతచక్కని రూపకల్పన భావనకు రూపం తో ‘ మాలిక ‘ మనోహరంగా ఉంది . శుక్రవారం ఉదయాన్నే సరస్వతీమాత దర్శనం లభించినట్లుగా ఉంది.
    ఆదూరి.హైమవతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *