April 23, 2024

శ్రీ శాకంబరి అంతర్జాల అష్టావధానం

చింతా రామకృష్ణ: ఓం శ్రీ గురుభ్యోనమః.

అంతర్జాల అష్టావధాన కార్యక్రమమున పాల్గొనుచున్న అవధానిగారికి, పృచ్ఛకమహాశయులకు, నిర్వాహకులకు, మాలిక పత్రిక ద్వారా ఆశ్వాదించుచున్న మహనీయులందరికీ హృదయ పూర్వకనమస్కారములు.

నా పేరు చింతా రామకృష్ణా రావు. విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకుడను. చిత్ర, బంధ, గర్భ కవితాసక్తి కలవాడను. ” ఆంధ్రామృతము’( http://andhraamrutham.blogspot.com ) అనే బ్లాగును నిర్వహించుచున్నాను.ప్రస్తుతము నేను భాగ్యనగరమున నివసించుచున్నాను.

ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ అంతర్జాల అవధానమున అధ్యక్షునిగా, సంచాలకునిగా మరియు నిషేధాక్షరి పృచ్ఛకునిగా బాధ్యతలు అప్పగించియున్నారు. నా బాధ్యతలను సక్రమముగా నిర్వహించుటలో నాకు మీ అందరి పరిపూర్ణ సహాయ సహకారములు అందించ గలందులకు మనసారా కోరుకొనుచున్నాను.

ఇక మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకారము చుట్టుచున్నాను.

అనిల్ కుమార్ గారూ! మీ పరిచయము చేసుకోండి.

డా.మాడుగుల అనిల్ కుమార్ : సాధారణ నామ సంవత్సర వైశాఖ బహుళ అమావాస్య అనగా 1970 జూన్ 3 వ తేది శ్రీమతి సరోజమ్మ కీ.శే . బ్రహ్మశ్రీ మాడ్గుల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అను పుణ్యదంపతులకు అనంతపూర్ లో జన్మించాను. తండ్రి గారు వేదపండితులు మరియు పురోహితులుగా ఉండిరి.తల్లి సంస్కృతాంధ్ర భాషలలో పండితురాలు,సంగీత విద్వాంసురాలు. పెద్దనాన్న గారు బహుగ్రంథకర్త వేదమూర్తులు కీ.శే.బ్రహ్మశ్రీమాడ్గుల వేంకటశివశాస్త్రిగారు,అనంతపురం. శ్రీ విద్యారణ్య ప్రాచ్యోన్నత పాఠశాల,అనంతపూర్ లో ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదివాను. అనంతపూర్ లోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాను. 1987 నుండి 1991 వరకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించాను. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ లో సంస్కృతం లో యం.ఎ చేశాను.కేంద్రీయ విద్యా పీఠం, తిరుపతి లో బి.ఎడ్ చేసి హిందూపురం లో సంస్కృత అధ్యాపకుడుగా కొంత కాలం పనిచేశాను. శ్రీవేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం భూతపూర్వ ఉపకులపతి శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారి పర్యవేక్షణలో 1994 నుండి 2001 వరకు రఘువంశ మహాకావ్యం పై పిహెచ్.డి చేశాను. అవధాన పితామహులు శ్రీ సి.వి.సుబ్బన్నగారి “అవధాన విద్య“ గ్రంథాన్ని చదివి అవధానం చేయడం నేర్చుకున్నాను. అలాగా 1994 నవంబర్ 1న మొదటి అవధానం ప్రారంభించాను. అనేక పత్రికలలో వ్యాసాలు, పద్యాలు ప్రచురితమైనవి.సెమినార్లలో పత్రసమపత్రసమర్పణ చేయటం జరిగినది. ప్రసిద్ధ అవధానుల అవధానాలలో నిషిద్ధాక్షరి , సమస్య అంశాలకు పృచ్ఛకత్వము వహించాను. 1997 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థలలో సంస్కృత అధ్యాపకునిగా చేరి పదోన్నతులతో ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అనగా చదివిన కళాశాలలోనే సంస్కృత ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఇంత వరకు 13 అవధానాలు తెలుగులోనూ, ఒక అవధానము సంస్కృత ఆంధ్రములలోను, ఒక అవధానం అంతర్జాలంలోను మొత్తం 15 అవధానాలు చేశాను. సంస్కృతాంధ్ర భాషలలో 13 పుస్తకముల రచన జరిగింది. నా రచనలు :- 1 . శ్రీ వేంకటేశ్వర అక్షరమాలా స్తోత్రము 2. శ్రీ రాఘవేంద్ర అక్షరమాలా స్తోత్రము 3. అమందానంద మందాకిని 4. శ్రీ వేంకట రమణ శతకము 5.అనిల కుమార శతకము 6. భావాంజలి 7.వసంత కుసుమాంజలిః ( సంస్కృతం లో వివిధ దేవతలపై విభిన్న వృత్తాలలో అష్టకాలు నవరత్నాలు ) 8.రఘువంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః (పిహెచ్ .డి పరిశోధన ప్రబంధము )9. భోజ చరిత్ర (సంస్కృత మూలమునకు అనువాదము ) 10. విక్రమార్క చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము) 11. వాల్మీకి( సంస్కృత మూలమునకు అనువాదము) 12. శ్రీ రామనామ రామాయణము ( నామ రామాయణము లోని నామములకు సందర్భసహిత వ్యాఖ్యానము)13. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము ( పురుష సూక్తానుసారము సంకలనము).

 

ఇది వరకు జరిగినఅంతర్జాల అష్టావధానాన్ని చూసిన దేశ, విదేశాలలోని సామాన్యజనులు సైతం అష్టావధానం అంటే ఏమో ,ఎట్లుంటుందో ఒక అవగాహనానికి రాగలిగారు. అందువల్ల అంతర్జాల అష్టావధానం పూర్తిగా సంతృప్తినిచ్చింది. నిషిద్ధాక్షరి జరుగునపుడు ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూసి ఈ మారు రెండు నిషిధ్ధాక్షరులు ఉండేలా చూసుకున్నాను. అవధానం పైప్రేక్షకులు పూర్తిగా అవగాహనకు రాగలిగితే ఎందఱో అవధానులు కాగలిగే అవకాశం మెండుగా ఉంది. తెలుగు పద్య కవిత్వాన్ని రక్షించాలనే సదాశయం తో అంతర్జాల అవధానాన్ని చేస్తున్నాను. ఈ అవధానానికి మహామహులైన పండితుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని , ఆలోచనను నాకందించిన శ్రీ మాలిక అంతర్జాల పత్రికా సంపాదకులు శ్రీమతి వలబోజు జ్యోతిగారికి , సాంకేతికంగా ఈ అంతర్జాల అవధానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సాంకేతిక నిపుణులు శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి సదా కృతజ్ఞుడను. శ్రీ చింతా రామకృష్ణారావు గారు నాకు అందజేయుచున్న ప్రోత్సహకానికి కృతజ్ఞత ప్రణామాంజలులు.

 

అవధాని శ్రీ మాడుగుల అనిల్ కుమార్. గారూ!శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు అవధానిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

చింతా రామకృష్ణ:

మాడుగులాన్వయా! కవిత, మార్దవ మేదుర భావ రమ్యమై,

చూడగ నాలకింపగను సుందరమై, జన రంజకంబునై,

నేడిది జాల మార్గమున నిత్యులు గాంచుచు మెచ్చునట్టిదై,

వాడల, పల్లెలందును ప్రభావముతో విలసిల్ల చెప్పుడీ!

శాకంబరీ కృపా కటాక్ష లబ్ధ అవధాన నైపుణ్యము ఒప్పారగా మీరు సభా రంజకముగా అవధానమును హృదయోల్లాస జనకముగా చేసి, మీ ధారణా పటిమతో కవుల హృదయాకాశాలలో నిరంతరం విహరించ గలరని ఆశిస్తూ మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ముందుగా పృచ్ఛకులకు స్వాగతం తెలిపి తదనంతరం మీ ప్రార్థన, తదనంతరం పృచ్ఛకుల ప్రశ్నలు క్రమముగా సుధారస ధారగా పెల్లుబికే మీ ఆసుధార నాలుగు ఆవృత్తులలో మేము గ్రోలనున్నాము.

ముందుగా పృచ్ఛకుల స్వపరిచయము, వారికి స్వాగతము పలుకుట.1.మొదట నిషేధాక్షరి నేనే నిర్వహిస్తున్నందున వేరే స్వాగతము, పరిచయము ముందే చేశాను.

ఇప్పుడు రెండవ పృచ్ఛకుల స్వపరిచయము.

2. నిషిద్ధాక్షరి :  శ్రీ ముక్కు రాఘవ కిరణ్ ! శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు నిషిద్ధాక్షరి పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

నమస్సభాయై. అవధానిగారికి, నిర్వాహకులకు నమస్సులు.

రాఘవ: నా పేరు ముక్కు శ్రీరాఘవకిరణ్. ప్రస్తుత నివాసస్థానం అమలాపురం. నేటి అవధానంలో నిషిద్ధాక్షరి అంశానికి పృచ్ఛకునిగా వ్యవహరించబోతున్నాను.

శ్రీ శాకంబరీ అవధాన నిర్వాహకులు అయిన ‘ మాలిక ‘ వారికి, రూపక కర్తశ్రీమతి వలబోజు జ్యోతి గారికి , అనుసంధాన కర్త శ్రీ చింతా రామ కృష్ణారావు గారికి, అవధాని గారు శ్రీ అనిల్ కుమారు గారికి, ఇతర కవి పండితులకునమస్సులు.

రాఘవేతి విజానన్తి కేచిచ్చ కిరణేతి మామ్,

అస్మి ప్రబన్ధవిద్యాయాః పట్టభద్రశ్చ సంప్రతి.

 

పితా త్రినాథశర్మాఖ్యో మాతా కామేశ్వరీ మమ,

పితృభ్యాం పదయోర్భక్త్యా తాభ్యాం పద్యోऽయమర్ప్యతే.

 

ఉపద్రష్టాహ్వయే మణ్డితే పణ్డితై

ర్జగన్నాథాదిభిర్జాతవానస్మ్యహమ్,

కృపారత్నాకరో రామచంద్రో హరిః

కులర్భుష్షోడశీ చేష్టదేవీ మమ.

 

పూర్వపుణ్యవశాద్రక్తిరాన్ధ్రసంస్కృతభాషయోః,

సఙ్గీతే చైవ మాం వక్తుం కిఞ్చిన్నాస్తి త్వితఃపరమ్.

 

చింతా రామకృష్ణ:

మక్కువతో నిషిద్ధమున మంత్ర విముగ్ధుల జేసి శ్రోతలన్,

ప్రక్కన నిల్చి, మాడ్గుల ప్రభావము పెంచ, వధాన వేళలో

చిక్కులు లేక సాగునటు చేయుము నా యభిమాన పుత్రుఁడా!

ముక్కు మహాబ్ధి చంద్ర! గుణ పూజ్యుఁడ! రాఘవ! సత్ కిరణ్ సుధీ!

చిరంజీవి రాఘవా! పిన్నవాడివయ్యు విజ్ఞాన మున్నవాడవు. నీ నిర్వహణలోని నిషిద్ధాక్షరి సభారంజకము కాగలదని ఆశిస్తూ మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పుడు మూడవ పృచ్ఛకుల స్వపరిచయము.

 

3. దత్తపది   :  శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు!

గోలి హనుమచ్ఛాస్త్రి:

నమస్కారములు.

నా పేరు : గోలి హనుమచ్ఛాస్త్రి.నివాసం : గుంటూరువృత్తి : సహాయ సాంకేతిక అధికారి ( ఆం.ప్ర. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ )ప్రవృత్తి : సమస్యలను వెతుక్కొని  పూరించుట,  పద్యములల్లుట.శ్రీ కంది శంకరయ్య గారి ” శంకరాభరణం ” బ్లాగునందు గత రెండు సంవత్సరములుపైగా దాదాపు వారు ప్రతి రోజూ ఇచ్చు చున్నటువంటి సమస్యలను పూరించుచు వారిద్వారా పద్య రచనకు మెరుగులు దిద్దుకొను చున్నాను.

నా బ్లాగులు : సమస్యల ‘ తో ‘ రణం ( ‘ పూ ‘ రణం ),

కవి ‘ తల ‘  అలలు

చింతా రామకృష్ణ:

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు దత్తపది ౧ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

గ్రోలితి మీ కవిత్వ సుధ, గోలి సుధాబ్ధిజ! శాస్త్రి మిత్రమా!

జాల బృహద్వధానమున చక్కని దత్త పదంబులిచ్చి, సం

చాలక వృత్తినున్న నను, సాత్విక పూర్ణు లనిల్ కుమారులన్

తేలగ జేయుఁడయ్య మణి దీపముగా వెలుగొందుడిత్తరిన్.

హనుమచ్ఛాస్త్రి గారూ! మీరు ఇచ్చే దత్తపదితో కవి అసాధారణ పటిమను చూపుతూ అద్భుతమైన పూరణ చేయ గలిగి, ఈ కార్యక్రమానికే వన్నె తేగలగాలని ఆశిస్తూ మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పుడు నాలుగవ పృచ్ఛకుల స్వపరిచయము.

4. దత్తపది2  డా . శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు

నమః సభాయై. నమస్కారములందరికి..ఈ అవధానమున దత్తపది పృచ్ఛకుడుగా నేను ఆహ్వానింపబడియున్నానునా నామధేయము:-కొరిడె విశ్వనాథ శర్మ, నా బ్లాగ్ http:// koride-vishwanathasharma.blogspot.comనా నివాసము:- ప్రిన్సిపాల్, శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలా ధర్మపురి. జిల్లా కరీంనగర్ (ఆంధ్ర ప్రదేశ్ )

నా సాహితీ కృషి:- (1978 నుండి) 35 సంవత్సరములు గా సంస్కృతోపన్యాసకుడను.

ప్రత్యేకతలు* PHD :లింగపురాణము – విమర్శనాత్మక పరిశీలనమ్విశ్వవిద్యాలయం : పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం.సాహిత్య సేవ : -రచయితగా: భర్తృహరి సద్భావ లహరి, (సంస్కృత భాషా ప్రచారసమితి Hyd వారిచే ప్రచురితం)కావ్యము : ధర్మపురీ వర్ణనమ్ { అసంపూర్తి / క్రియమాణ లఘుకావ్యమ్}సుప్రభాతములు : శ్రీ ధర్మపురీ రామలింగేశ్వరస్వామి సుప్రభాతమ్ ,,శ్రీ పెద్దాపురం లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతమ్ {CD Released }అనువాదములు : (1)”లింగపురాణము” {కీ.శే. డా. వి. హన్మాన్ శర్మ గారి తో పాటు}(2) ”గోదావరీమహాత్మ్యము” ( బ్రహ్మపురాణాతర్గతమైన 108 అధ్యాయములకు తెలుగు అనువాదము){కీ.శే. డా. వి. హన్మాన్ శర్మ గారి తో పాటు}వ్యాఖ్యానములు : (1) శ్రీ ధర్మపురీ లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతమ్ { మానాన్న గారి రచన } తెలుగు వ్యాఖ్యనము(2)కాదంబరీ సంగ్రహం ~కీ.శే. బ్ర,శ్రీ తుంగూరి శివరామ శర్మ గారి అసంపూర్తి పద్యకావ్యమునకు తెలుగు వ్యాఖ్యానము(3)భర్తృహరి విజ్ఞాన శతకము తెలుగు వ్యాఖ్యానము.సంపాదకుడుగా: డా. వి హన్మాన్ శర్మ గారి పదవీవిరమణ అభినందసంచికసన్మాన సంఘప్రచురణ 31-08-2009ముందుమాటలు : 1) బహుముఖప్రజ్ఞాశాలి డా. కే. రాజన్నశాస్త్రి.{”మంజూష” ~ డా. కే. రాజన్నశాస్త్రి}2) ”కవితా శ్రీశిలశ్రీనివాస్“తీరుమారాలి ~ శ్రీనివాస్ {విద్యార్థి} కవితల సంపుటి,,AIR Hyd ద్వారా 15 కు పైగా సాహిత్య ప్రసంగాలు ప్రసారితములు.సప్తగిరి, ఆరాధన హనుమ పత్రికల ద్వారా కొన్ని వ్యాసములు ముద్రితములు.భావ కవిత్వాలు కొన్ని ముద్రితాలు. FB ద్వారా కొన్ని ప్రదర్శితాలు.ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ లందు కొన్ని పత్రికా సమర్పణలు.

చింతా రామకృష్ణ:

శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు! శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు దత్తపది౨ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

కొరిడె సుధాబ్ధి చంద్ర! వర కోవిద గణ్యుఁడ విశ్వనాధుఁడా!

మురియగ పాఠకాళి కడు ముచ్చట దత్త పదంబులిచ్చి, స

ద్వరుఁడగు మాడ్గులాన్వయుని ప్రజ్ఞ బహిర్గతమై రహింపగా

సరసతఁ జేయ కోరెదను, సజ్జన పండితపాళి మెచ్చగా.

విశ్వనాధశర్మగారూ! మీరు ఇచ్చే దత్త పది అవధాని పూరణలో అద్భుతమైన పద్య రాజము వెలువడాలని ఆశిస్తూ మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పుడు ఐదవ పృచ్ఛకుల స్వపరిచయము.

5. సమస్య  : శ్రీ యం.నాగగురునాథశర్మగారు

అవధాని గారికి,అధ్యక్షుల వారికి,విద్వద్బృందమునకు నమస్కారములు.నా పేరు నాగగురునాథశర్మ.ఇప్పుడిప్పుడే కవితావ్యాసంగాన్ని కొనసాగించుటనారంభించాను. ప్రస్తుతం అనంతపురములో విద్యాభ్యాసం చేస్తున్నాను.ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జ్యోతి గారికి నమస్కార సహిత శుభాభినందనలు.

చింతా రామకృష్ణ:

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు సమస్యా పూరణము౧ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

నయ గుణ భాస! నాగ గురు నాధ! సమస్య నొసంగి, జాల త

న్మయులుగ సద్వధాన పర మాధురులన్, బొనరింప శ్రోతలన్

నయమున జేయు మీ కవికి, నాకును, యీ యవధాన వేళలో

శ్రియమును గూర్చి వెల్గుమిట. శ్రీకర మాడ్గుల వంశ వర్ధనా!

చిరంజీవీ! గురునాధశర్మా!  ఈ నాటి యీ కార్యక్రమంలో పూరణార్థము నీవొసగే సమస్య మహామహా కవుల మనసులనాకట్టుకోవడంతో పాటు అవధాని నోట ఆణిముత్యములవంటి అక్షర జాలంతో ఒప్పిదమైన పద్యరచనావకాశంతో కడుంగడు రమ్యమై ఒప్పి ఉండాలని ఆశిస్తున్నాను. నీకు నా హృదయపూర్వక అభినందనలు.

ఇప్పుడు ఆరవ పృచ్ఛకుల స్వపరిచయము.

6. సమస్య  : శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు సమస్యా పూరణము౨ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

నారుమంచి వెంకట అనంత కృష్ణ: నా గురించిః     నన్ను నారుమంచి వెంకట అనంత కృష్ణ అంటారు. హైదరాబాదు నివాసిని.ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిలో ఉన్నాను.సాహిత్య కృషిః  చెప్పుకోవటానికేమీ లేదు. పుస్తక పఠన వ్యసనపరుణ్ణి. గురుదేవుల వేనోళ్ల పలకరించి, అమ్మకి అర్చన, అన్నకి (గణపతికి)  ఆరాధన శతకరూపం లో చేసుకున్నాను. ప్రస్తుతం శతపత్రమిత్రుని సూర్యనారాయణ పరబ్రహ్మగా శతపద్యార్చ సేవ జరుగుతున్నది. మహానివేదన మిగిలింది. నా ప్రత్యేకతలుః   నన్ను నేను తెలుసుకునే కృషిలో ‘నాకేమీ తెలియదు’ వరకు తెలుసుకున్నాను.

జటిలంబన్నది కానక

తృటిలో ముడివిప్పివైచు తెరవున్ గాంచన్

ఘటికుండనిలకుమారున

కిటనిత్తు సమస్యనిట్లునిదిగోనయ్యా

 

మహిత యనంత కృష్ణ! కవి మాన్యుఁలు మెచ్చు సమస్యనిచ్చి, స

న్నిహితులు, పండితాళి విని నేర్పరి యీ యవధాని యంచు యీ

మహిని ప్రశంస చేయఁబడ మాన్యతఁ జేయుమ! మాననీయుడా!

సుహితము గూర్చ నీకు సరి చూడగ లేరన తప్పు కాదుగా!

శ్రీమాన్! అనంత కృష్ణ శర్మ గారూ! అనంత ఆకాశంలో ప్రస్తుతము అంతర్జాలం ద్వారా విరాజిల్లుచున్న ఈ అవధానంలో మీరు సమస్యా పూరణ్ము కొఱకు ఇచ్చే సమస్య మహనీయులైన పండితమ్మన్యుల మన్ననలనండమే కాకుండా అవధాని వరుల పూరణతో అది ఈ అవధానానికే వన్నె తేవాలని ఆశిస్తూ మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

 

 

ఇప్పుడు ఏడవ పృచ్ఛకుల స్వపరిచయము.

జ్యోతి: నమస్కారం.. అవధానం గురించి ఎక్కువగా తెలీకున్నా అనిల్ గారి సహకారంతో మాలిక పత్రిక తరఫున మొట్టమొదటిసారి అంతర్జాల అవధాన ప్రక్రియ మొదలుపెట్టాను. అది విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది.

నా గురించి.. నేను బ్లాగర్ ని, ప్రీలాన్స్ జర్నలిస్టును. మాలిక పత్రికకు కంటెంట్ హెడ్ గా ఉన్నాను..నాకు ఇష్టమైన ఆహారం , పద్యాల గురించి అవధానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.శుభం.

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు వర్ణనము పృచ్ఛకులుగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

కర్ణామృతముగ కూర్చగ

వర్ణననిడి సభను నేడు వర్ధిల గనుమో

పూర్ణోజ్వల జ్యోతీ! సం

పూర్ణంబుగ సద్వధాని పూజింపఁబడన్.

అమ్మా! జ్యోతీ! అకుంఠిత దీక్షతో అనంత ఆకాశంలో అతర్జాలంలో మహనీయమైన అవధానమును జరిపించాలనే మీ పట్టుదలను మనసారా అభినందిస్తున్నాను. మీరు నిర్వహించుచున్న వర్ణనాంశము సజ్జన సతక్విరంజకమై అవధాని కంఠమునుండి అమృత ధారవలె వర్ణము స్రవించాలని మనసారా ఆశిస్తున్నాను.

ఇప్పుడు ఎనిమిదవ పృచ్ఛకుల స్వపరిచయము.

8.అప్రస్తుత ప్రసంగం :     శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారు!

కవిపండితులకు నమస్సులు!

నా పేరు కిరణ్, కలం పేరు నల్లాన్ చక్రవర్తుల కిరణ్ అన్న నా పూర్తి పేరుని పొడి అక్షరాలుగా కుదించి “నచకి”. తెలుగు భాష మీద ఆసక్తితోనూ, (పద్యాలు వ్రాసే) మా అమ్మ నుంచి స్ఫూర్తి పొందగానూ, పెద్దల ప్రోత్సాహంతో 2001లో “ఛందస్సు” అన్న యహూ కూటమినేర్పఱచిన పిమ్మట సుప్రభ, మోహనరావు, కామేశ్వరరావు తదితరుల వలననూ పద్యరచన మీద యిప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నాను, గత పది పదిహేనేళ్ళ కృషితో. గతంలో ఱాళ్ళబండి వారికి (2009లో), మేడసాని వారికి (2011లో) న్యస్తాక్షరికి పృచ్ఛకుడిగా ఉన్నాను. సొంత ఊరంటూ ఒకటని చెప్పుకోలేని ద్రిమ్మరిగా గడిపినా రాయలసీమని స్వక్షేత్రంగా భావిస్తాను, నివాసం హైదరాబాదులో. ఉద్యోగరీత్యా హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞానజ్యోతి కర్తృజ్ఞానిక, సాంకేతిక విద్యాసంస్థలో సహ్యాకృతాచార్యుడిగా (Associate Professor VNR , Vignan Jyothi Institution of Engineering and Technology )ఉన్నాను.విజయనామ యుగాది సందర్భంగా నిర్వహించబోతున్న “శ్రీ శాకంబరి” అంతర్జాల అవధానంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది.

 

దీటగు యవధానములో

మాటలె యప్రస్తుతములు, మధురపు పద్యాల్

పోటీగా పఱుగులిడగ

చోటేదీ నాకునిచట, చోద్యము కాదా! 🙂

నచకి

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు అప్రస్తుత ప్రసంగము పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

అవధానంబున చక్రవర్త్యనిలుకా నప్రస్తుతంబందు నీ

యవధానంబున చక్రవర్తి కిరణే. హా! యేమి భాగ్యంబు! నీ

కవకాశంబు రహింప జేయ ననిలున్. కల్యాణ సంధాయివై

భువిలో వెల్గుము జాల మార్గ సుగతిన్.పూజ్యంబుగా మిత్రమా!

 

కిరణ్మహనీయా! చదివే వారికి, వినే వారికి అవధాని వరుల అసాధారణ ప్రతిభా పాటవాలు వ్యక్తం చేయ గలిగిన చక్కని అర్థవంతమైన మనోరంజకమైన మీ ప్రసంగమే అవధానమున శాకంబరీ దేవికి అలంకరించు మణిమాల అనుటలో ఏమాత్రము సందేహము లేదు. మీ విశాల హృదయంతో ఈ కార్యక్రమము రక్తి కట్టే మార్గంలో అవధానివరులను నడుపుటతో పాటు నా అధ్యక్ష స్థానమునకూ వన్నె కూర్చగలరని ఆశిస్తూ ,మనసారా మిమ్ములను అభినందిస్తున్నాను.

ముందుగా.

మొదటి పృచ్ఛకులు  మీకు పూరణాంశమును సూచింతురు. తదనుకూల మైన పూరణమున మొదటి పాదమును వెన్వెంటనే మీరు చెప్పుదురు, తదనంతరము రెండవ పృచ్ఛకులు… ఈవిధముగా కొనసాగ గలదని తెలియజేస్తున్నాను.

ఇక మీరు  ప్రారంభించండి.

అనిల్:

శ్రీ శాకాంబర్యై నమః

శ్రీ శాకాంబరీ అష్టకమ్

జ్ఞానం సమస్తం అశనే నివేశ్య

శాకైశ్చ సర్వైస్సమలంకృతాంబ!

పద్మాక్షి! లోకేశ్వరి ! పార్వతి ! శ్రీ

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే   ll 1 ll

భావం  :- సమస్త జ్ఞానాన్ని ఆహారంలో ఉంచి ఆకుకూరలతో అలంకరింపబడిన , పద్మాక్షివి , లోకేశ్వరివి , పార్వతివి అయిన ఓ తల్లీ ! నిన్ను శరణుగోరుచున్నాను.

జ్ఞాత్వా శిశూన్ తే పరితః క్షుధార్తాన్

క్షామం క్షమాయామవలోక్య సద్యః    l

ఆహార రూపేణ సమాగతా శ్రీ

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే    ll  2  ll

భావం:- భూమిపై ఉన్న కరువును , ఆకలిగొన్న నీ బిడ్డలను చూసి ఆహార రూపంగా వచ్చిన ఓ శాకాంబరి ! నిన్ను శరణుగోరు చున్నాను.

త్వమన్నపూర్ణా చ త్వమేవ దుర్గా

త్వమేవ లక్ష్మీశ్చ సరస్వతీ చ  l

శక్తిత్రయోపేత సుమంగళీ శ్రీ

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే  ll  3  ll

భావం:- అన్నపూర్ణ , దుర్గ , లక్ష్మి ,సరస్వతి ఇట్లా ఎన్ని పేర్లతో పిల్చినా నీవే ముగ్గురమ్మల మూర్తిగా ఉన్నావు. కావున ఓ శాకంబరి !నిన్ను శరణుగోరుచున్నాను.

త్రిలింగభాషా సురభారతీ వత్

ఆవిష్కరోత్యాశు సమస్త భావాన్  l

పాండిత్యమస్యామపి దేహి మాతః !

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే  ll 4  ll

భావం:- ఈ భూమి మీద తెలుగు భాష అనేది ఒకటి ఉన్నది. ఇది కూడా సంస్కృత భాష లాగా వేగంగా మనలోని భావాలను యథా తథంగా వ్యక్తం చేయడానికి అనువైనది. కావున సంస్కృతం కొంత తెలిసిన నేను తెలుగు భాషలో కూడా పాండిత్యాన్ని సంపాదించదలచి తల్లివైన నిన్ను శరణుగోరుచున్నాను.

గీర్వాణ కావ్యాని మనోహరాణి

అనూదితాన్యాంధ్ర వచస్సు మాతః !

జిఘ్రుక్షయా తాని సుబోధకాని

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే   ll 5 ll

భావం:- మనోహరమైన సంస్కృత కావ్యాలను తెలుగు లోనికి అనువదించారు. వాటిని అర్థం చేసుకొనే శక్తి సంపాదించడానికి నిన్ను శరణువేడుతున్నాను.

కవిత్రయం నన్నయ తిక్కయజ్వా

శ్రీ ఎఱ్ఱనేత్యాహురమూన్ త్రిలింగే   l

జిజ్ఞాసయాహం తు జయం అమీషాం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే   ll 6  ll

భావం:- తెలుగు భాషలో నన్నయ , తిక్కన , ఎఱ్ఱన అను ముగ్గురినీ కవిత్రయం అంటారు. వారు జయ అను మారు పేరు గల శ్రీమన్మహాభారతాన్ని రచించారు. వీరి జయ కావ్యాన్ని అర్థం చేసుకొనే శక్తి పొందడానికి నిన్ను శరణుగోరుచున్నాను.

అష్టావధానం హి త్రిలింగభాషా

కళా చమత్కార కవిత్వయుక్తా  l

తస్మిన్ సువర్ణాశ్రిత శ్లోకహారైః

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే    ll 7  ll

భావం:- తెలుగుభాషలో అష్టావధానం అనే చమత్కారమైన సారస్వత పద్య కళ ఒకటి ఉంది. ఇందులో మంచి అక్షరాలతో కూర్చిన పద్యహారములతో నిన్ను పూజిస్తూ శరణుగోరు చున్నాను.

అష్టావధానం మధురం చ క్రీడాం

త్వదీయ నామ్నా పరికల్ప్య పాకమ్

నివేదయన్ తేంబ కవిత్వ రూపం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే  ll  8  ll

భావం:- మధురమైన అష్టావధాన క్రీడ అను పాకాన్ని నీ పేరిట కల్పించి ఆ కవిత్వరూప పదార్థాన్ని నీకు నైవేద్యం చేస్తూ నిన్ను శరణుగోరు చున్నాను.

ఇతి శ్రీ మాడుగుల వంశ పారావార సుధాకరేణ అనిల కుమార శర్మణా విరచిత శ్రీ శాకాంబరీ అష్టకం సంపూర్ణమ్.

//ఓం తత్సత్//

హరిఃఓమ్

శ్రీగురుభ్యో నమః

శ్రీమహా గణాధిపతయే నమః

శ్రీశారదాంబాయై నమః

నమస్సభాయై

సభయందాసీనులైనసభాధ్యక్షులవారికి , మాలికా అంతర్జాల పత్రిక నిర్వాహకులకు , పృచ్ఛక కవిమిత్రులకు సవినయ నమస్కారాలు. శ్రీ శాకాంబరీ అష్టావధాన సందర్భంగా పై విధంగా అమ్మవారిపై అష్టకాన్ని రచించి స్తోత్రం అందజేయుచున్నాను. ముందుగా శ్రీ గణపతి స్తోత్రం తో అవధానాన్ని ప్రారంభిస్తున్నాను.

ఉ. వ్యాసుని లేఖకుండగుచు భారత భవ్య కథాస్రవంతి ను

ద్భాసిత శ్వేత దంతమున వ్రాసె రయమ్ముననేకదంతుడై

దోసములెల్లఁ ద్రోయదగు తొండముగల్గిన తద్గజాస్యుకున్

దాసుడనై కవిత్వము సుధారసమొల్కగనివ్వ గొల్చెదన్            ll

శ్రీసరస్వతీ స్తుతి :

మ. భవదీయాద్భుత పాదపంకజములన్ బంధించి చిత్తంబునన్

కవితాధార సుధారసమ్ము నొసగంగా గొల్తు సద్భక్తితో

అవధానమ్మున జ్ఞాన నేత్రమున నుద్యద్భాను సంకాశవ

వ్వవె కావ్యాత్మ ! సరస్వతీ ! జనని ! వాగ్వ్యాపారమందింపుమా   ll

 

పూర్వఅవధానుల స్తుతి :

చం. అరుదగు ఈ వధానమను అద్భుత క్రీడ తెలుంగు భాషలో

చొరబడె తొల్త మెచ్చగ యశోధనులైరి కవీంద్రులెందరో

నిరుపమ ధారణాన్వితులు , నేర్పరులాద్యవధాన ధీరులం

దరిని నమస్కరించెద ప్రధానమటంచవధాన వేదికన్   ll

 

మాగురువులు కీ.శే. శ్రీ కలపటపు భాస్కర రావుగారిని గురించి :

మ. తలతున్ మద్గురు భాస్కరాఖ్యుడను విద్వాంసున్ మహా తాంత్రికున్

లలితాపాద సరోజ భృంగు కవితా లాలిత్య సంశోభితున్

చలదుత్తుంగ తరంగ సంగత వచస్సంరంభ సంక్షోభితా

ఖిల శాస్త్రార్థ విచార భావనిలయున్ క్షేమార్థినై మ్రొక్కుచున్   ll

మరొకగురువులు మహా మహోపాధ్యాయ శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి గురించి :

చం. అలరగ సంస్కృతాంధ్రములయందవలీలగ పద్యగద్యముల్

ఒలకగ వాక్సుధారసములొప్పగురీతి రచింపజాలుచున్

పలువురు మెచ్చునట్లుగ సభాస్థలమందునుపన్యసించు ధీ

రులయిన లక్ష్మణయ్యను గురూత్తము నే నుతియింతునియ్యెడన్      ll

శ్రీమతి వలబోజు జ్యోతి గారికి :

కం. పలుకులవి తల్లి ప్రేమను

తలపించును పరిగణింప , దాతృత్వముకున్

నెలవై వెలుంగు శ్రీమతి

వలబోజు జ్యోతిగార్కి వందనమిడెదన్      ll

శ్రీచింతా రామకృష్ణా రావు గారికి :

శా. ప్రాచీనాంధ్రకవిత్వ తత్వవిదుడై ప్రజ్ఞా ధురీణుండుగా

నౌచిత్యంబగు చిత్రబంధ కవిగానాశల్ యశోపేతుడై

తా చింతామణియౌచు మిత్రులకు చింతా రామకృష్ణాహ్వయుం

డే చేరన్ సభ చాలకుండగుచు యేనింపారగా మ్రొక్కెదన్  ll

శ్రీకొరిడె విశ్వనాథ శర్మ గారికి :

ఆ.వె. కొరిడె విశ్వనాథ సురభారతీబుధ

సత్తమా! కవీ ! యశస్వి ! మాన్య

చరిత ! నా నవీన శాకాంబరి వధాన

మలర మునుపు మీకునంజలింతు.

శ్రీయుతులుగోలి హనూమచ్ఛాస్త్రి గారికి :

తే.గీ. శ్రీయుతులు హనూమచ్ఛాస్త్రి శ్రీ సరస్వ

తీ కృపన్ గొని నిరతము తేజరిల్లు

పద్యరచనా ప్రసక్తుడై ప్రతిభజూపి

పండితోత్తము నతనికి ప్రణతులిడెద.

శ్రీనారుమంచివేంకట అనంతకృష్ణ గారికి :

ఆ.వె. శ్రీ అనంతకృష్ణ ! శ్రేయస్కరంబైన

న్యాయవాదవృత్తినలరుచుండి

తనరజేయుదు కవితా కన్యకవరింప

మాన్యచరిత ! మిము నమస్కరింతు.

శ్రీముక్కురాఘవకిరణ్ గారికి :

ఆ.వె. వయసునందు చిన్న పాండిత్యమున్ మిన్న

రాఘవ కిరణుడు విరాజమాన

పృచ్ఛకుండునౌచు వేదికనలరించె

వందనమ్ముజేతు ప్రజ్ఞగాంచి.

శ్రీ చక్రవర్తుల కిరణ్ గారికి:

తే.గీ. నోట గఱపెను యాంగ్లమ్ము , తేట తెనుగు

కమ్మనైన పద్యముంగూర్చు కలముఁ బట్టి

చక్రవర్తుల కిరణు విస్తార కీర్తి,

వేంకటేశ్వరుడితని దీవించుగాత!

శ్రీ యం.నాగగురునాథ శర్మ గారికి :

తే.గీ. చదివె సాంకేతవిద్యల నదనుజూచి

సంస్కృతాంధ్రములను నేర్చి చతురుడయ్యె

నాగగురునాథ శర్మ స్వర్ణాక్షరార్చ

నారతునితనిన్ శుభము చేకూరుగాత!

శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి:

తే.గీ. శ్రీ భరద్వాజు గారు తంత్రీ ప్రసార

మగ్నులై అవధాన సన్మార్గమెల్ల

విజయవంతముగాగ కావింత్రు కృషిని

వారికొనరింతు మనసార వందనమ్ము

 

1. నిషేధాక్షరి :  శ్రీ చింతా రామ కృష్ణారావు

అవధానిగారూ! శాకంబరీ జగజ్జననినుద్దేశించి “ఉ ఊ ఒ ఓ  ప ఫ బ భ మ వ” వర్ణములు లేని

కందము (నిరోష్ఠ్య కందము) చెప్పండి.  (ఓష్ఠ్యములు నిషేధిస్తున్నాను.)

నాలుగు ఆవృత్తులలో నాలుగు పాదములు చెప్ప గలరు.

కిరణ్: అవధాని గారూ, గణేశప్రార్థన ప్రశస్తమైనదే కానీ ఏకదంతుడే అయిన గణేశుడు శాకంబారీ దేవి పేరిట జరుగుతున్న అవధానాన్ని ఆస్వాదించగలడంటారా?

అనిల్ : గణేశునికి గడ్డి ( గరక ) ఇష్టమైనప్పుడు శాకంబరీ అవధానానికి వచ్చి ఆస్వాదించడం ఉచితమైనదే కదా !

అనిల్ కుమార్: ఆర్యా ! శాకంబరి బ మినహాయింపు ఉండాలి.

చింతా రామకృష్ణ: సరే కానివ్వండి ఏకోహిదోషో గుణసన్నిపాతఃః

అనిల్ కుమార్:    దో శక్తి గల్గియుడుదు

Kiran: అవధాని గారూ, దోశక్తి అంటే దోశెల పట్ల ఆసక్తి అనుకోవాలా? ఏకదంతుని సంగతి కూడా తేల్చండి. (మీరేదో ఏక్ దో తీన్ పాట పాడుతున్నట్టున్నారు!)

అనిల్ : ఎండాకాలం కదండీ ! దోశ తింటే దప్పిక ఎక్కువ అవుతుందని .

అనిల్ కుమార్: మొదటి పాదం పూర్తీ అయినది.

 

Ragava Kiran Mukku: అయ్యా అవధానిగారూ,

రెండవ నిషిద్ధాక్షరి అంశం. ఇప్పుడు మన చక్రవర్తులవారు తీసుకువచ్చారే ఏకదంతుడు… ఆ వినాయకుడు తన మేనమామగారైన విష్ణుమూర్తిగారి ఇంటికి వెళితే, ఆయింటనున్న అత్తాకోడళ్లు (లక్ష్మీసరస్వతులు) ఆయనకు ఏ విధమైన వంటలతో సంతృప్తుని చేస్తారో మా అందిరికీ చవులూరించేలాగ ఒక కందంలో చెప్పగలరు.

తొలి అక్షరమునకు నిషేధములేదు.

అనిల్ కుమార్:  శ్రీ

Narumanchi Anathakrishna:అవధానిగారు నా సమస్యని అందుకోండి“అండమ్ముల్ ధరియించు హే జనని కామ్యంబిమ్ము శాకంబరీ”

అనిల్ కుమార్:  శ్రీ

శ్రీరాఘవ : వా నిషిద్ధం

అనిల్ కుమార్:  గీ

రాఘవ : ర్వ నిషిద్ధం.

అనిల్ కుమార్: లు

రాఘవ : తరువాతి అక్షరం మీరే పూరించండి.

అనిల్ కుమార్: నిం

చింతా రామకృష్ణ: నాన్నా! రాఘవా! మొదటి పాదం పూర్తయిందా?

రాఘవ : డ నిషిద్ధం.

అనిల్ కుమార్: ట

రాఘవ : ల నిషిద్ధం.

అనిల్ కుమార్: నుం

రాఘవ : డ నిషిద్ధం.

అనిల్ కుమార్: టే ….. మొదటి పాదం పూర్తీ అయినది.

కిరణ్: అవధాని గారూ, గణేశప్రార్థన ప్రశస్తమైనదే కానీ ఏకదంతుడే అయిన గణేశుడు శాకంబరీ దేవి పేరిట జరుగుతున్న అవధానాన్ని ఆస్వాదించగలడంటారా?

అనిల్ : గణేశునికి గడ్డి ( గరక ) ఇష్టమైనప్పుడు శాకంబరీ అవధానానికి వచ్చి ఆస్వాదించడం ఉచితమైనదే కదా !

అవధాని గారూ, దోశక్తి అంటే దోశెల పట్ల ఆసక్తి అనుకోవాలా? ఏకదంతుని సంగతి కూడా తేల్చండి. (మీరేదో ఏక్ దో తీన్ పాట పాడుతున్నట్టున్నారు!)

అనిల్ : ఎండాకాలం కదండీ ! దోశ అంటే దప్పిక ఎక్కువ అవుతుందని . గణపతి పప్పు తినడం మనం చూడలేదు కదండీ . ఆయన గడ్డి తినేటప్పుడు శాకంబరి కి రావడం ఉచితమే.

చింతా రామకృష్ణ: మొత్తం పాదం చదివే భాగ్యం మాకు కలిగించండి అవధానివర్యా!

అనిల్ కుమార్: శ్రీ గీలు నింటనుంటే

చింతా రామకృష్ణ: ఇప్పుడు దత్తపది1 పృచ్ఛకులు  శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి  తన ప్రశ్నము తెలియ జేస్తారు.

కిరణ్: సంచాలకా, అవధాని గారు మొదట నా ప్రశ్నల గడప దాటితే… నాకూ కాస్త మనశ్శాంతి, ఆత్మారామునికి అన్నశాంతి! 🙂

అనిల్ కుమార్: గణపతి పప్పు తినడం మనం చూడలేదు కదండీ . ఆయన గడ్డి తినేటప్పుడు శాకంబరి కి రావడం ఉచితమే.

గోలి హనుమత్ శాస్త్రి: శాకమునీయుము తల్లీ !

శాకంబరి మాత ! నీకు సాగిల బడుదున్

మాకవితల కూరల గొని

చేకూరగ మాకు రక్ష చేయందిమ్మా !

అంతర్జాలంబందున

వింతగ ‘నవ’ ధాన ” జ్యోతి ” వెలిగించంగా

నెంతయు శోభను గూర్పెడి

పంతులగు ‘అనీల్కుమార ‘ వర్యా ! జే ! జే !

శ్రీ శాకంబరి మాత పేరున జరుగు చున్న ఈ అవధానమున  దత్తపదికి కూరలనేయెంచుకొన్నాను. పద్యము కూడా కందము లో అడుగుటయే సముచితమనిభావించుచున్నాను.కనుక శ్రీ అవధాని గారిని ఈ క్రింది కూరలతో కందపద్యమును రామాయణార్థములోచెప్పవలసినదిగా కోరుచున్నాను

దత్తపది ; బీర- దోస- నిమ్మ-  వంగ

కిరణ్: గోలీ (వారి) కూర పద్యమెలా ఉండబోతోందో! 🙂

అనిల్ కుమార్:  తినబోతూ రుచి అడుగుతారే నచకి గారూ

కిరణ్: ”దోశక్తి” అనేసి దోశెల పట్ల మా ఆసక్తిని వెళ్ళ”గక్కించారు” కానీ… మీరు చెప్పనేలేదు, అవధానివర్యా! 🙂

అనిల్ కుమార్: ఎండా కాలం కదా ! దోశలు తింటే దప్పిక అవుతుందని.

కిరణ్: గణపతి గడ్డి తిన్నా గాలి తిన్నా విఘ్నాలను తొలగించేవాడే! 🙂 ఈ లెక్కన నేటి నా సంవాదం ఆయనతోనే! 🙂

అనిల్ కుమార్:  అంతే లెండి ఆయన తోనే సంవాదం జరపవచ్చు  వివాదాలు ఉండవు.

అనిల్ కుమార్: దోసములెన్నడు కైకలొ

చింతా రామకృష్ణ:

కిరణము తాకిన సోలుట

మరచిన కిరణుండు పల్కు మరిమరి పెరిగెన్

పరువిడు కవితల ఝరికిది

వరముగ మారంగ దగును వర్ధిలజేయన్.

ఆర్యా! అవధాని గారూ! మీ పూరణ పద్య పాదం మాకు వ్రాసి చూపిస్తే అది పూర్తయినదని భావించడానికి వీలుంటుంది.

అనిల్ కుమార్: దోసము లెన్నడు కైకలొ     ….

100 టపాలా టపాకాయలా ?

కిరణ్: పేలితే టపాకాయలు, రాలితే టపాలు! 🙂

విశ్వనాధ శర్మ కొరిడె: అవధాని గారికి నమస్కారములు.

దత్తపది : పదములు: టమాట. దోస(కాయ) బీర (కాయ), ఆలు.క్షమించండి ఇద్దరివి ఒకటె ఐనవి. ఐనా చంపకమాలవృత్తం . విషయము : రామాయణమున యుద్ధకాలవర్ణన

గోలి హనుమత్ శాస్త్రి: నిజమే టపాకాయలు లో కాయ రాలితే టపాలు.

అనిల్ కుమార్: అతడట మాట మాట కునునంజలి బట్టకనాయుధంబులన్

విశ్వనాధ శర్మ కొరిడె: ధన్యవాదములు. చాలా చక్కగా టమాట ను ప్రయోగిస్తూ చెప్పారు.

ఇప్పుడు సమస్య1 పృచ్ఛకులు శ్రీ యం. నాగ గురునాథ శర్మతన ప్రశ్నము తెలియ జేస్తారు.

నాగ గురునాధశర్మ మాడుగుల:

సమస్య: పరమాన్నము తిన్నవాడు పాపమునొందున్.

కిరణ్: అన్నం తింటే ఆపం, పరమాన్నం తింటే పాపం… తప్పవు కాబోలు! 🙂

అనిల్ : మరొకరికి పెట్టకుండా తింటే పాపమేగా వచ్చేది .

అనిల్ కుమార్: అతడట మాట మాటకును నంజలి బట్టక నాయుధంబులన్

కిరణ్: తిప్పలంటే గుర్తుకొచ్చింది, అవధాని గారూ, అప్పాలు ఆవపిండి కలిపి చేస్తే యెలా ఉంటాయంటారు?

అనిల్ కుమార్: అప్పాల ఊరగాయ  మీకు సరిపోయేలా ఉంటుంది.

అనిల్ కుమార్: కరి వేపాకున్ దొరకని

రాఘవ : “కరివేపాకున్ దొఱకని” అయ్యుండవచ్చునండీ!

అనిల్ కుమార్: టైపింగ్ ప్రాబ్లం

చింతా రామకృష్ణ: ఇది నారుమంచి అనంత్ కృష్ణగారి సమస్య2. (అంతర్జాల సమస్యవలన నాకు పంపించారు )

”అండమ్ముల్ ధరియించు హే జనని కామ్యంబిమ్ము శాకంబరీ”

చింతా రామకృష్ణ: మీరు మొదటి పాదం వ్రాసి ఉంటే మరో పృచ్ఛకులదగ్గరకు వెళ్తాను.

అనిల్ కుమార్: దండాలమ్మ ! పవిత్ర మాత ! దురమున్ తాడించిపీడించుచున్

కిరణ్: ఈ అప్పాల ఊరగాయ సంగతేమిటండోయ్, కొత్తగా వింటున్నాను!

అనిల్ కుమార్: అది మీరు చేసినదే కదా ! అప్పాలకు ఆవపిండి కలిపారు.

చింతా రామకృష్ణ:

ఇప్పుడు వర్ణన  పృచ్ఛకులు శ్రీమతి వలబోజు జ్యోతిగారు

జ్యోతి : అదేంటోగాని  ఎప్పుడు  ఏ పండగొచ్చినా, ఇంట్లో ఏ పూజ చేసినా ముందుగా గుర్తొచ్చేది. చేసే ప్రసాదం పులిహోర. నాకు చిన్నప్పటినుండి ఈ పులిహోరకు, పులికి సంబంధమేంటబ్బా అని సందేహంగా ఉండేది. ఇంకా తీరలేదు.. అవధానిగారు, కాస్త ఈ పులిహోరకు, శార్దూలానికి గల సారూప్యం వివరించగలరా??

అనిల్ కుమార్: వృత్తం అడగలేదే మీరు.

కిరణ్: అవధాని గారూ, వృత్తమంటే గుర్తొచ్చింది. మన పిండివంటల్లో యెక్కువగా రౌండుగానే ఉంటాయేమిటండీ? ఎంచక్కా దీర్ఘచతురస్రపు ఇడ్లీలో, త్రికోణపు వడలో చేసుకోవచ్చుగా! శాకంబరిని అడిగి సమాధానం చెప్పండి! 🙂

అనిల్ కుమార్: గొంతుకు అడ్డం పడితే ఊపిరాడక చస్తారని  అన్నీ రౌండుగా ఉండేలా చేస్తారులెండి .

చింతా రామకృష్ణ: మీకు నచ్చిన అత్యద్భుతమైన వృత్తంలో వ్రాస్తారని చూస్తున్నామండి.

జ్యోతి : నా ప్రశ్నలోనే వృత్తం వివరాలు ఉన్నాయి కదా..

అనిల్ కుమార్: మీకా దుర్గ యటన్న నెన్న మిగులన్ మేలైన భక్తౌ గదా !

 

చింతా రామకృష్ణ:

అవధానములో 1వ ఆవృత్తి ఇంతటితో పూర్తయింది.

ఇప్పుడు 2 వ ఆవృత్తిలోకి అడుగు పెడుతున్నాము.

2 వ ఆవృత్తి

అనిల్ కుమార్: కాశీనాథుని సతికిని  కరుణా యుతకున్

రాఘవ : మీరే ప్రారంభించండి.

అనిల్ కుమార్: త్యాగుల్

కిరణ్: అయ్యా అవధాని గారూ, కూరలో కరివేపాకు ఆరోగ్యానికి మంచిది… అంత కన్నా రుచికరము, ఆరోగ్యకరము అవధానంలో అప్రస్తుతప్రసంగం అంటాను. మీరేమంటారు?

అనిల్ కుమార్: నచకి గారిని అందునేమో శాకంబరికి అప్రస్తుతానికి కేటాయించారు . నచకి అంటే కిచన్ గుర్తుకు రావాలని . నిజమే కదా ! మీ అప్రస్తుత ప్రసంగం కరివేపాకును మించినదే. కరివేపాకును వాడుకొని పారేస్తారు. మిమ్మల్ని అలా చేయలేదు.

రాఘవ : కొనసాగించండి.

అనిల్ కుమార్: గు

రాఘవ : ర నిషిద్ధం.

కిరణ్: మీ సమాధానాలు రాక నేలచూపులు చూసే మా కళ్ళకి, మా ఆకళ్ళకి మా కాళ్ళే కనిపిస్తున్నాయి. 🙂

అనిల్ కుమార్: ఎప్పుడూ తమ కాళ్ళను మొక్కు కునే వారికి తమ కాళ్ళు కాక ఇంకేమి కనిపిస్తుంది.

అనిల్ కుమార్: ప్త

రాఘవ : ర్థ నిషిద్ధం.

అనిల్ కుమార్: మ్ము

చింతా రామకృష్ణ:

నేల చూపులు చూడగా జాలి వేయు

నింగినున్నది యవధాన భంగిమ, గని

వలయునట్టిది కోరిన వరల నిచ్చు

ననిలు మిత్రులు కిరణుడా! కనుము కృపను.

కిరణ్: మ్రొక్కిన వరమీని వేల్పు గుఱించి చెప్పారు కానీ అప్రస్తుతప్రసంగానికి సమాధానమీని అవధాని గుఱించి శతకకారులు చెప్పినట్టు లేదు!

అనిల్ : అప్పటికి వారికి తెలిసి ఉండదు లెండి . మీరు క్రొత్తగా కనిపెట్టాల్సిందే . ఈ అవధాని అయితే మ్రొక్కకుండానే వరాలు కురిపిస్తాడు.

రాఘవ : కొనసాగించండి.

అనిల్ కుమార్: గా

చింతా రామకృష్ణ:

ఠక్కున పట్టితివయ్యా!

నిక్కముగనీయవస్థ నింగికి నెగసెన్

చక్కగ వేచిన యనిలుడు

నిక్కంబుగ నీకు చెప్పు నిరుపమగతితో.

రాఘవ : ర నిషిద్ధం.

అనిల్ కుమార్: క

అనిల్ కుమార్: ద

రాఘవ : క తీసుకోమంటారా ద నా?

కిరణ్: నిరుపమమో గాదో గతి

సరిగా వీయదిటు గాలి, సరసంబలరన్!

కిరణమునకు యనిలమునకు

త్వరితమ్ముగ తెమలదు యని, పలకరు వారే!

అనిల్ కుమార్: యతి అందువల్ల కద రెండు అక్షరాలు.

రాఘవ: ఓహో, నిజమేనండీ. య నిషిద్ధం.

అనిల్ కుమార్: అప్రస్తుత ప్రసంగులు పద్యాలతో వస్తే నేను పరదా వేసుకోవాలా మీకు పరదా వేయాలా ?

అనిల్ కుమార్: గ

రాఘవ : వ నిషిద్ధం.

అనిల్ కుమార్: గ

కిరణ్: అవధాని గారికి పద్యాలకు మాత్రమే పలుకుతారేమోనని ప్రయత్నించాను లెండి…! పద్యానికి మాత్రమే పలికారు… ప్రశ్నలు అలాగే వదిలేసారు! ప్రశ్నలకు పరదాలు తీసి సరి దాఱిని సమాధానాలు చెప్పేస్తే సరదాగా సాగుతుందని నా ఊహ. 🙂

చింతా రామకృష్ణ:అప్రస్తుతము సరళ సుందర సరస సంభాషణా రూపంలో అవధానిగారినలరించేలాగ వ్రాయ వలసినదిగా కిరణ్ గారికి మనవి.

అనిల్ కుమార్: దగగ

చింతా రామకృష్ణ: నిషిద్ధాక్షరి రెండవ పాదం పూర్తయితే నిషేధాక్షరి నిరోష్ఠ్య కందం మొదటి రెండు పాదాలు చెప్పవలసి ఉన్నదండి.

రాఘవ : డ నిషిద్ధం.

అనిల్ కుమార్: ర

రాఘవ : మ నిషిద్ధం.

అనిల్ కుమార్: కన్

కిరణ్: డ వద్దంటే ర వేస్తే గుర్తుకు వచ్చింది: రడయోరభేదః అన్నారు కదా… మఱి “ఆవకాయ ఊరింది” అనడానికి “ఆవకాయ ఊడింది” అనవచ్చునా, అవధాని గారూ?

అనిల్ కుమార్:  ఆవకాయ ఊడింది అంటే పండ్లూడగొట్టేలా ఉంది అని అర్థం వస్తుంది . ( ఇంకా ఊరాల్సి ఉందని )

చింతా రామకృష్ణ: మీరు ప్రతీ పృచ్ఛకుని యొక్క ప్రశ్నానుకూలముగా పూరించిన నాలుగు పాదాలు వ్రాసి మీ ధారణా పటిమతో సభను రంజింప చేయవలసి యున్నది. వేగము పెంచ వలసినదిగా మనవి.

అనిల్ కుమార్:  మే

అనిల్ కుమార్: నిషిద్ధాక్షరి రెండవ పాదం పూర్తీ అయినది.

విశ్వనాధశర్మ కొరిడె: బాగుంది మీ ప్రశ్న

రాఘవ : అయ్యా అవధానిగారూ, ఇప్పటివఱకూ మీరు పూరించిన రెండవ పాదంలోని అక్షరాలు సెలవిస్తారా? కొంచెం గందరగోళంగా ఉంది. కన్ తరువాత నేను ఇంకా ఏమీ నిషేధించలేదండీ.

అనిల్ కుమార్: మొదటి దత్తపది. రెండవ పాదం : ఆసక్తిగ బీరములను ననకన్ వనముల్

అనిల్ కుమార్: అయితే నిషేధం చేయండి. మీరు నిషేధం చేశారను కున్నాను. వీరు రెండు లైన్ లు నాకే ఇచ్చారు.

రాఘవ : అవధానిగారూ, రెండవ నిషిద్ధాక్షరిలో రెండవపాదపు పూర్తి పూరణ సెలవియ్యగలరు.

అనిల్ కుమార్: వ నిషిద్ధం చేశారు మీరు . తర్వాత మే

అనిల్ కుమార్: త్యాగుల్ గుప్తమ్ముగాక దగ గరకన్ మే

గోలి హనుమత్ శాస్త్రి: అమ్మయ్య … ఇప్పటికి బీర్ కాయలందుకున్నారు. (ఆసక్తిగ బీరములను ననకన్ వనముల్)

విశ్వనాధశర్మ కొరిడె: నా దోసములను ఎంచుతున్నారా?

కిరణ్: శాకంబరి కదా… మధ్యే మధ్యే పానీయమ్ సమర్పయామి అన్నట్టు… కాస్త నాకు కూడా మీ కృపనీయమని వినతి, అవధాని గారూ!

అనిల్ : కృప యిస్తున్నాను తీసుకోండి .

అనిల్ కుమార్: ప్రతిగ నొసంగె బీరముల పద్ధతి కాదని రామచంద్రుడై

అనిల్ కుమార్: సమస్య రెండవ పాదం : కరువౌ ప్రాంతమ్ము నందు కడు ధనికుడునై.

విశ్వనాధశర్మ కొరిడె: దోసములను ఇప్పుడు లెక్కించరా? బాగున్నది 2వ పాద

అనిల్ కుమార్: సమస్య రెండవ దానికి రెండవ పాదం : చండాడందగినావు గాదె నిజమౌ చండీ ప్రసన్నంబుగా

గోలి హనుమత్ శాస్త్రి: అవధాని గారూ ! మా కూరల దరికి వచ్చి వాడకముందే వాడి‘ తరిగి ‘పోయేట్లు చేయండి…

అనిల్ కుమార్: ఆ కోర్కెల్ పులిహోరయందు గనుచున్ వ్యాఘ్రాసనాసీననే

చింతా రామకృష్ణ: అవధాని గారూ! మీ మాటలలో చురుకుదనం కనబడేలాగ వేగంగా పూరించి అందరినీ అబ్బురపరచండి.

అనిల్ కుమార్:

నా శక్తి కొలది కొలతున్

శ్రీ శాకంబరి దయఁ గన జేజేలిడుచున్.

చింతా రామకృష్ణ: ఇక మిగిలినవారి ప్రశ్నలకు కూడా మీ పూరణములను పూర్తి చేసిధారణ కనబరచగలరని ఆశిస్తున్నానండి.

“ఉ-ఊ-ఒ-ఓ-ప-ఫ-బ-భ-మ-వ” నిషేధమన్నాను. మీరు బ అనే హల్లు తప్పదన్నారు. సరే అన్నాను.

మీ పూరణ రెండు పాదములు. నేను కోరిన విధంగా వ్రాసే ఉంటారు ధన్యవాదములు.

అనిల్ కుమార్:

తై గణపతికి నొసంగగ

యే గొడవది లేక పోయె యెన్నిక యగుచున్.

చింతా రామకృష్ణ:

పూరణ ధారణ కలిపి చేసెయ్యండి.

అనిల్ కుమార్:

దత్తపది 3,4 పాదాలు :

ధ్యాసన్ ఆనతినిమ్మని

వాసిన్ కావంగ రామ భద్రుడు వెడలెన్ ll

అనిల్ కుమార్:

దత్తపది కొరిడే గారిది :

కుతకుత దోస పూర్ణుడగు కుత్సితు డా దశ కంఠుడక్కటా

వెతలతొనాలు బిడ్డలను వీడి చనెన్ యమలోకమంతటన్ ll

కొరిడె:

ధన్యవాదములు, బహు సుందరముగా నింపినారు. నా పద్య రచన కూడ చూడండి.

చం కదనము నీటమాట సరికాదు దశాస్యునితో, కపీంద్రులా

ర! దితిజు( వంటి దోసముల రాజును ముట్టడి సేసి, నంతమొం

దు దనుక సేదదీర్చదగదుర్విన బీరము నుప్పరిల్లగన్

మదిని దయాలు  రామవిభుమాత్రమునిండుగ జేసి రండికన్

 

చింతా రామకృష్ణ:

మీ సహనంబు మెచ్చెదను. మీ కవితా మహిమంబు మెచ్చెదన్

మీ సుమ పేశలాన్విత సుమేధను మెచ్చెద, మిమ్ము మెచ్చెదన్

మీ సుగుణాశ్రితంబులగు మేల్పలుకుల్మది నుంచి మెచ్చెదన్.

మీ సములెవ్వరయ్య.తరమే మిము నెంచ ననిల్ కుమారుడా!

దత్తపది :

మూడవ, నాల్గవ పాదాలు.:

కుతకుత దోస పూర్ణుడగు కుత్సితు డా దశకంఠుడక్కటా

వెతలతొ నాలు బిడ్డలను వీడి చనెన్ యమలోక మంతటన్ ll

సమస్య : పరువున్ బోయెడు రీతిగ

పరమాన్నము తిన్న వాడు పాపము బొందున్ ll

6. సమస్య : నండంగా నుతియించు భక్తులకు నిత్యానందవై యుండు , కూ

ష్మాండంబుల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీ ll

విశ్వనాధశర్మ కొరిడె:

చం.    అనిలకుమార! నీ యనుపమాన వచః ప్రవిముక్త పద్యముల్

ననితరసాధ్యహృద్యములు నై నవధానబుధేంద్ర! పృచ్ఛకా

గ్రణుల మనో విలాసముల రంజిలజేసి సరోజగంధ వీ

చినివృతసాంద్రమాలికలచే నలరింపగ జేసినాడవే!

చింతా రామకృష్ణ:

వయసు మీద పడగ వడలిన వృద్ధుడ.

జాలమందు నిలిపి చాలదనక

జాలమెన్ని చేసి జడిపింప తగదయ్య.

వేగ పూర్తి చేసి వెలయుమయ్య.

గోలి హనుమత్ శాస్త్రి:

ధన్యవాదములు.

దోసంబది లేదింతయు

చేసిరి యవధాన మిట్లు ఘనమవ్వంగన్

ధ్యాసగ నిమ్మహి మెచ్చెడు

గ్రాసంబీ రాత్రి వేళ కమ్మగ దొరకెన్.

చింతా రామకృష్ణ:

రెండవ తీగలో నడచి రేయిని మమ్ముల త్రిప్పుటొప్పునా

పండితవర్యుడా! సరస పాండితి మాకపురూపు జేయుదే?

కొండొకతీగమీ కొరకు కోరికతో సృజియించి యుంచగా

దండము పెట్టి మ్రొక్కెదను దారిని మాకు కనంగ జేయుడీ!

ఆర్యా! వర్ణనతో సహా అన్నీ పూరణలు పూరయ్యాయా?

పూర్తి చేసితిరేని పూజ్యుడా భరతవాక్యమ్ము పల్కవచ్చు కమ్మగాను.

జాగు చేయు కొలది ప్రేగులో మాండుట

కనుట తప్పదయ్య కరుణ గనుడి!

స్పందనలేదదేలొ? ఘన సత్కృతితో నవధానమందునన్

ముందుగనున్న మీరు కనుముందర గానగ రారదేలనో?

సుందర భావనామృత ప్రశోభిత సత్కవనాభిరామ! మీ

ముందరనుంటిమా?కనుచు. పూజ్యుడ కానగ రావదేలనో?

పూజ్యులైన అవధానిగారు పూరణ ధారణ కూడా పూర్తి చేసే ఉంటారు.

నా ప్రశ్నకు సమాధానముగా నాపూరణమును మీ ముందుంచుచున్నాను.

జగదాశ్రిత జననీ! నీ  –

యగణిత సజ్జన కటాక్ష హృదయ నిజార్తిన్

జగతిన్నెన్నగనగునా?  –

నిగనిగ కలిగించనేది నేర్చితి నిధిగా!

అనిల్ కుమార్:

ధారణ జరుగుతున్నది.

1. దోశక్తి గల్గి యుండుదు

కాశీ నాథుని సతికిని కరుణా యుతనున్

నా శక్తికొలది గొలతును

శ్రీ శాకంబరి దయఁ గన జేజే లిడుచున్ ll

అమ్మ వారి పేరు నిషిద్ధం లేదు . కావున నిరోష్ఠ్యము స్వీకరించలేదు.

2.నిషిద్ధాక్షరి

శ్రీ గీలు నింట నుంటే

త్యాగుల్ గుప్తమ్ము గాక దగఁ గరకన్ మే

తై గణపతికి నొసంగగ

యే గొడవది లేక పోయె యెన్నికయగుచున్ ll

3.దత్తపది :

దోసము లెన్నడు కైకలొ

ఆసక్తిగ బీరములనుననకన్ వనముల్

ధ్యాసన్ ఆసతి నిమ్మని

వాసిన్ కావంగ రామ భద్రుడు వెడలెన్ ll

4. దత్తపది ;

అతడట మాట మాటకునుయంజలి బట్టక నాయుధంబులన్

ప్రతిగనొసంగె బీరముల పద్ధతి కాదని రామచంద్రుడై

కుత కుత దోసపూర్ణుడగు కుత్సితుడా దశకంఠుడక్కటా

వెతలతొనాలుబిడ్డలను వీడి చనెన్ యమలోక మంతటన్ ll

5.సమస్య :

కరివేపాకున్ దొరకని

కరువౌ ప్రాంతంబునందు కడు ధనికుడునై

పరువున్ బోయెడు రీతిగ

పరమాన్నము తిన్నవాడు పాపము బొందున్ ll

6.సమస్య :

దండాలమ్మ ! పవిత్రమాత ! దురమున్ తాడించి పీడించుచున్

చండాడందగినావు గాదె  నిజమౌ చండీ ! ప్రసన్నంబుగా

నండంగా నుతియించు భక్తులకు నిత్యానందవై యుండు , కూ

ష్మాండంబుల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీ ll

7.వర్ణన :

మీకాదుర్గయటన్ననెన్న మిగులన్ మేలైన భక్తౌ గదా !

ఆ కోర్కెల్ పులిహోరయందుగనుచున్ వ్యాఘ్రాసనాసీననే

చేకొల్వం దగియుంటివమ్మ పుడమిన్ , చిత్తంబునన్ దల్చగా

వీకన్ తా పులిహోర వ్యాఘ్రములు తావివ్వంగ పబ్బంబులన్ ll

చం. సరస కవిత్వయుక్త సువచస్సముపేతులు పృచ్ఛకోత్తముల్

ధరణి ప్రజాళి మెచ్చెడు విధంబుగ సత్సహకారమివ్వగా

వరమొసగంగ శాంభవి శుభంబగునంచు జయమ్ముగల్గెగా

విస్తరమతులైన మీకు మనసార కృతజ్ఞతలందజేసెదన్  ll

 

శ్రీ శాకంబరి అష్టావధానం చేయడానికి అవకాశమిచ్చిన మాలిక అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీమతి వలబోజు జ్యోతి గారికి , మఱియు శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి , పృచ్ఛకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విశ్వనాధశర్మ కొరిడె:

అవధాని గారికి , అధ్యక్షులు శ్రీ చింతా వారికి ,నిర్వాహకురాలైన శ్రీమతి జ్యోతి గారికి భరద్వజ గారికి నన్ను పృచ్ఛకునిగా నెంచుకొన్నందులకు కృతజ్ఞుడను. ధన్యవాదములు.ఒక మంచి కార్యక్రమమున ఆహ్వానించబడినందులకు ఎంతో సంతోషముగానున్నది. నజముగా సరసపద్యరసస్వాదనలచే మృష్టాన్న భోజనముచేసినట్లున్నది. మరొకమారు ధన్యవాదములు.

గోలి హమనుత్ శాస్త్రి:ధన్యవాదములు.

దోసంబది లేదింతయు

చేసిరి యవధాన మిట్లు ఘనమవ్వంగన్

ధ్యాసగ నిమ్మహి మెచ్చెడు

గ్రాసంబీ రాత్రి వేళ కమ్మగ దొరకెన్.

చింతా రామకృష్ణ:అంతర్జాల అష్టావధానమున ఈ నాడు మన అందరి ప్రశంసార్హంగా అవధానిగారు తనకు గల అవధాన నైపుణ్యమును ప్రదర్శించి, ఆబాల గోపాలమును ఆనంద పారవశ్యులను చేశారు. ఆ శాకంబరీ జగజ్జనని యొక్కయు, పద్మావతీ అలమేల్మంగా సమేతుడైన ఆ శ్రీమద్వేంకటేశ్వరులవారి యొక్కయు మహదాశీస్సులనెల్లప్పుడూ కలిగి యుందురు గాక. వారికి నా హృదయ పూర్వకమైన అభినందనలు.

నాతో సహకరించిన పృచ్ఛకాళికి నా కృతజ్ఞతాంజలి. మాలిక పత్రిక యాజమన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమ నిర్వహణలో గుణ దోషములుండక మానవు. గుణములు మీకు తోచెనేని అవి ఈ కార్యక్రమమున పాల్గొనిన అందరి యొక్క సహాయ సహకారములవననే యని మనవి చేయుచున్నాను. ఒకవేళ దోషములే దొర్లినట్లుగా మీదృష్టికి వచ్చినట్లైతే అవి కేవలము నా అజ్ఞానమునకు అనుభవశూన్యతకు గుర్తుగా గమనించి, సహృదయముతో మన్నింతురని ఆశించుచున్నాను. “యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథాక్షీరమివాంబు మిశ్రం”.క్షీర నీర న్యాయమున దొర్లిన గుణ దోషములలో గుణ గ్రహణ పారీణులైన రాజహంసలందరికీ నా కైమోడ్పులు.

నమస్తే.

శుభమస్తు

ధారణ:

శ్రీ రామ

శ్రీ శాకాంబర్యై నమః

శ్రీ శాకాంబరీ అష్టకమ్

జ్ఞానం సమస్తం అశనే నివేశ్య

శాకైశ్చ సర్వైస్సమలంకృతాంబ !

పద్మాక్షి ! లోకేశ్వరి ! పార్వతి ! శ్రీ

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll1ll

భావం :- సమస్త జ్ఞానాన్ని ఆహారంలో ఉంచి ఆకుకూరలతో అలంకరింపబడిన , పద్మాక్షివి , లోకేశ్వరివి , పార్వతివి అయిన ఓ తల్లీ ! నిన్ను శరణుగోరుచున్నాను.

 

జ్ఞాత్వా శిశూన్ తే పరితః క్షుధార్తాన్

క్షామం క్షమాయామవలోక్య సద్యః l

ఆహార రూపేణ సమాగతా శ్రీ

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll2ll

భావం :- భూమిపై ఉన్న కరువును , ఆకలిగొన్న నీ బిడ్డలను చూసి ఆహార రూపంగా వచ్చిన ఓ శాకాంబరి ! నిన్ను శరణుగోరు చున్నాను.

 

త్వమన్నపూర్ణా చ త్వమేవ దుర్గా

త్వమేవ లక్ష్మీశ్చ సరస్వతీ చ l

శక్తిత్రయోపేత సుమంగళీ శ్రీ

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll3ll

భావం :- అన్నపూర్ణ , దుర్గ , లక్ష్మి ,సరస్వతి ఇట్లా ఎన్ని పేర్లతో పిల్చినా నీవే ముగ్గురమ్మల మూర్తిగా ఉన్నావు. కావున ఓ శాకంబరి !నిన్ను శరణుగోరుచున్నాను.

 

త్రిలింగభాషా సురభారతీ వత్

ఆవిష్కరోత్యాశు సమస్త భావాన్ l

పాండిత్యమస్యామపి దేహి మాతః  !

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll4ll

భావం :- ఈ భూమి మీద తెలుగు భాష అనేది ఒకటి ఉన్నది. ఇది కూడా సంస్కృత భాష లాగా వేగంగా మనలోని భావాలను యథా తథంగా వ్యక్తం చేయడానికి అనువైనది. కావున సంస్కృతం కొంత తెలిసిన నేను తెలుగు భాషలో కూడా పాండిత్యాన్ని సంపాదించదలచి తల్లివైన నిన్ను శరణుగోరుచున్నాను.

 

గీర్వాణ కావ్యాని మనోహరాణి

అనూదితాన్యాంధ్ర వచస్సు మాతః !

జిఘ్రుక్షయా తాని సుబోధకాని

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll5ll

భావం :- మనోహరమైన సంస్కృత కావ్యాలను తెలుగు లోనికి అనువదించారు. వాటిని అర్థం చేసుకొనే శక్తి సంపాదించడానికి నిన్ను శరణువేడుతున్నాను.

 

కవిత్రయం నన్నయ తిక్కయజ్వా

శ్రీ ఎఱ్ఱనేత్యాహురమూన్ త్రిలింగే l

జిజ్ఞాసయాహం తు జయం అమీషాం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll6ll

భావం :- తెలుగు భాషలో నన్నయ , తిక్కన , ఎఱ్ఱన అను ముగ్గురినీ కవిత్రయం అంటారు. వారు జయ అను మారు పేరు గల శ్రీమన్మహాభారతాన్ని రచించారు. వీరి జయ కావ్యాన్ని అర్థం చేసుకొనే శక్తి పొందడానికి నిన్ను శరణుగోరుచున్నాను.

 

అష్టావధానం హి త్రిలింగభాషా

కళా చమత్కార కవిత్వయుక్తా l

తస్మిన్ సువర్ణాశ్రిత శ్లొకహారైః

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll7ll

భావం :- తెలుగుభాషలో అష్టావధానం అనే చమత్కారమైన సారస్వత పద్య కళ ఒకటి ఉంది. ఇందులో మంచి అక్షరాలతో కూర్చిన పద్యహారములతో నిన్ను పూజిస్తూ శరణుగోరు చున్నాను.

 

అష్టావధానం మధురం చ క్రీడాం

త్వదీయ నామ్నా పరికల్ప్య పాకమ్ l

నివేదయన్ తేsoబ కవిత్వ రూపం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll8ll

భావం :- మధురమైన అష్టావధాన క్రీడ అను పాకాన్ని నీ పేరిట కల్పించి ఆ కవిత్వరూప పదార్థాన్ని నీకు నైవేద్యం చేస్తూ నిన్ను శరణుగోరు చున్నాను.

 

ఇతి శ్రీ మాడుగుల వంశ పారావార సుధాకరేణ అనిల కుమార శర్మణా విరచిత శ్రీ శాకాంబరీ అష్టకం సంపూర్ణమ్.

//ఓం తత్సత్//

హరిః ఓమ్

శ్రీ గురుభ్యో నమః

శ్రీ మహా గణాధిపతయే నమః

శ్రీ శారదాంబాయై నమః

నమస్సభాయై

సభయందాసీనులైన సభాధ్యక్షులవారికి , మాలికా అంతర్జాల పత్రిక నిర్వాహకులకు , పృచ్ఛక కవిమిత్రులకు సవినయ నమస్కారాలు. శ్రీ శాకాంబరీ అష్టావధాన సందర్భంగా పై విధంగా అమ్మవారిపై అష్టకాన్ని రచించి స్తోత్రం అందజేయుచున్నాను.  ముందుగా శ్రీ గణపతి స్తోత్రం తో అవధానాన్ని ప్రారంభిస్తున్నాను.

 

ఉ. వ్యాసుని లేఖకుండగుచు భారత భవ్య కథాస్రవంతి ను

ద్భాసిత శ్వేత దంతమున వ్రాసె రయమ్ముననేకదంతుడై

దోసములెల్లఁ ద్రోయదగు తొండముగల్గిన తద్గజాస్యుకున్

దాసుడనై  కవిత్వము సుధారసమొల్కగనివ్వ గొల్చెదన్ ll

 

శ్రీ సరస్వతీ స్తుతి :

మ. భవదీయాద్భుత పాదపంకజములన్ బంధించి చిత్తంబునన్

కవితాధార సుధారసమ్ము నొసగంగా గొల్తు సద్భక్తితో

అవధానమ్మున జ్ఞాన నేత్రమున నుద్యద్భాను సంకాశవ

వ్వవె కావ్యాత్మ ! సరస్వతీ ! జనని ! వాగ్వ్యాపారమందింపుమా ll

 

పూర్వ అవధానుల స్తుతి :

చం. అరుదగు ఈ వధానమను అద్భుత క్రీడ తెలుంగు భాషలో

చొరబడె తొల్త మెచ్చగ యశోధనులైరి కవీంద్రులెందరో

నిరుపమ ధారణాన్వితులు , నేర్పరులాద్యవధాన ధీరులం

దరిని నమస్కరించెద ప్రధానమటంచవధాన వేదికన్ ll

 

మా గురువులు కీ.శే. శ్రీ కలపటపు భాస్కర రావుగారిని గురించి :

మ. తలతున్ మద్గురు భాస్కరాఖ్యుడను విద్వాంసున్ మహా తాంత్రికున్

లలితాపాద సరోజ భృంగు కవితా లాలిత్య సంశోభితున్

చలదుత్తుంగ తరంగ సంగత వచస్సంరంభ సంక్షోభితా

ఖిల శాస్త్రార్థ విచార భావనిలయున్ క్షేమార్థినై మ్రొక్కుచున్ ll

 

మరొక గురువులు మహా మహోపాధ్యాయ శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి గురించి :

చం. అలరగ సంస్కృతాంధ్రములయందవలీలగ పద్యగద్యముల్

ఒలకగ వాక్సుధారసములొప్పగురీతి రచింపజాలుచున్

పలువురు మెచ్చునట్లుగ సభాస్థలమందునుపన్యసించు ధీ

రులయిన లక్ష్మణయ్యను గురూత్తము నే నుతియింతునియ్యెడన్ ll

 

శ్రీమతి వలబోజు జ్యోతి గారికి :

కం. పలుకులవి తల్లి ప్రేమను

తలపించును పరిగణింప , దాతృత్వముకున్

నెలవై  వెలుంగు శ్రీమతి

వలబోజు జ్యోతిగార్కి వందనమిడెదన్ ll

 

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి :

శా.  ప్రాచీనాంధ్రకవిత్వ తత్వవిదుడై ప్రజ్ఞా ధురీణుండుగా

నౌచిత్యంబగు చిత్రబంధ కవిగానాశల్ యశోపేతుడై

తా చింతామణియౌచు మిత్రులకు చింతా రామకృష్ణాహ్వయుం

డే చేరన్ సభ చాలకుండగుచు యేనింపారగా మ్రొక్కెదన్ ll

 

శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారికి :

ఆ.వె. కొరిడె విశ్వనాథ సురభారతీబుధ

సత్తమా! కవీ ! యశస్వి ! మాన్య

చరిత ! నా నవీన శాకాంబరి వధాన

మలర మునుపు మీకునంజలింతు.

 

శ్రీయుతులు గోలి హనూమచ్ఛాస్త్రి గారికి :

తే.గీ. శ్రీయుతులు హనూమచ్ఛాస్త్రి శ్రీ సరస్వ

తీ కృపన్ గొని నిరతము తేజరిల్లు

పద్యరచనా ప్రసక్తుడై ప్రతిభజూపి

పండితోత్తము నతనికి ప్రణతులిడెద.

 

శ్రీనారుమంచి వేంకట అనంతకృష్ణ గారికి :

ఆ.వె.  శ్రీ అనంతకృష్ణ ! శ్రేయస్కరంబైన

న్యాయవాదవృత్తినలరుచుండి

తనరజేయుదు కవితా కన్యకవరింప

మాన్యచరిత ! మిము నమస్కరింతు.

 

శ్రీముక్కు రాఘవకిరణ్  గారికి :

ఆ.వె.    వయసునందు చిన్న పాండిత్యమున్ మిన్న

రాఘవ కిరణుడు విరాజమాన

పృచ్ఛకుండునౌచు వేదికనలరించె

వందనమ్ముజేతు ప్రజ్ఞగాంచి.

 

శ్రీ చక్రవర్తుల కిరణ్ గారికి :

తే.గీ.  నోట గఱపెను యాంగ్లమ్ము , తేట తెనుగు

కమ్మనైన పద్యముంగూర్చు కలముఁ బట్టి

చక్రవర్తుల కిరణు విస్తార కీర్తి ,

వేంకటేశ్వరుడితని దీవించుగాత !

 

శ్రీ యం.నాగగురునాథ శర్మ గారికి :

తే.గీ.  చదివె సాంకేతవిద్యల నదనుజూచి

సంస్కృతాంధ్రములను నేర్చి చతురుడయ్యె

నాగగురునాథ శర్మ స్వర్ణాక్షరార్చ

నారతునితనిన్ శుభము చేకూరుగాత !

 

శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి :

తే.గీ. శ్రీ భరద్వాజు గారు తంత్రీ ప్రసార

మగ్నులై అవధాన సన్మార్గమెల్ల

విజయవంతముగాగ కావింత్రు కృషిని

వారికొనరింతు మనసార వందనమ్ము .

 

శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం

1. నిషిద్ధాక్షరి : నిరోష్ఠ్యముతో అనగా పెదవులు తగులు అక్షరములు ఉ , ఊ, ఒ , ఓ , ప , ఫ , బ , భ , మ , వ వర్ణములు లేని కంద పద్యంలో శ్రీ శాకంబరిని స్తుతిస్తూ పద్యం చెప్పాలి.

కం. దోశక్తి గల్గియుండుదు

కాశీ నాథుని సతికిని కరుణాయుతనున్

నాశక్తి కొలది కొలతున్

శ్రీ శాకాంబరి దయఁగన జేజేలిడుచున్ ll

భావము :- బాహుబలము కలదియు ,  కాశీనాథుని భార్యయు  , కరుణగలిగియుండునదియు అయిన శ్రీ  శాకంబరిని నన్ను దయతో చూడమని నా శక్తి కొలది జేజేలు పలుకుతూ కొలుస్తాను. ( అమ్మ వారి పేరుకు మినహాయింపు ఇమ్మని అవధాని కోరాడు )

 

2.నిషిద్ధాక్షరి :- వినాయకుడు తన మామ ఐన శ్రీ మహావిష్ణువు ఇంటికి వెళ్ళాడు.అప్పుడు అత్తాకోడళ్ళయిన లక్ష్మీ సరస్వతులు వంట ఎట్లు వండి పెడతారు?
కం.శ్రీ గీలు నింట నుంటే

త్యాగుల్ గుప్తమ్ము గాక దగ గరకన్ మే

తై గణపతికి నొసంగగ

యే గొడవది లేక పోయె యెన్నికయగుచున్ ll

భావము :- శ్రీ గీలు = త్యాగ గుణము గల లక్ష్మీ సరస్వతులు ( అత్తాకోడళ్ళు )  ఎటువంటి రహస్యము లేకుండా ఇంట్లో ఉండే గరకను గణపతికి ఆహారంగా ఇచ్చినారు. ఇప్పుడు అత్తాకోడళ్ళు వంట చేస్తే ఉప్పూ కారాలలో వికారాలు వచ్చి రుచులు తారుమారైంది అనే దోషం పోయింది. గరకను వండే పని లేనందువల్ల ఎటువంటి గొడవ లేకపోయింది.

 

3.దత్తపది : బీర , దోస , నిమ్మ , వంగ పదాలతో , కందపద్యంలో రామాయణార్థం  వచ్చేలా పద్యం చెప్పాలి.

కం. దోసము లెన్నడు కైకలొ

ఆసక్తిగ బీరములనుననకన్ వనముల్

ధ్యాసన్ ఆనతి నిమ్మని

వాసిన్ కావంగ రామ భద్రుడు వెడలెన్ ll

భావం :- రామునికి కైక అంటే భక్తి ఉంది. అందుకే ఆమె అడవులకు పొమ్మన్నప్పుడు తప్పుగా అనుకోలేదు. ఆమెను ఏమైనా దండించాలనే బీరాలు పలక లేదు. ఆమె అడవికి వెళ్తే అనుమతి ఇవ్వు వెళ్తున్నాను అని అందరినీ రక్షించేందుకు అడవికి వెళ్ళాడు. కైకకు రాముడు భగవత్ స్వరూపము అని తెలుసు. రాక్షస సంహారం జరిగి అందరినీ రక్షించాలని రాముని అడవికి పంపినది.

 

4. దత్తపది ; టమాట , దోస , బీర , ఆలు అనే పదాలతో రామాయణార్థం లో , యుద్ధ వర్ణనతో , చంపక మాల వృత్తంలో పద్యం చెప్పాలి.

చం.  అతడట మాట మాటకునుయంజలి బట్టకనాయుధంబులన్

ప్రతిగనొసంగె బీరముల పద్ధతి కాదని రామచంద్రుడై

కుత కుత దోసపూర్ణుడగు కుత్సితుడా దశకంఠుడక్కటా

వెతలతొనాలుబిడ్డలను వీడి చనెన్ యమలోక మంతటన్ ll
భావము :-  యుద్ధం చేస్తే టప్పుడు పరస్పర దూషణలు ఉంటాయి. రావణుడు ప్రగల్భాలు పలుకుతున్నా బీరాలు పలకక  శ్రీరాముడు ఆయుధాలతోనే అందుకు సమాధానం చెప్పాడు. అప్పుడు కుత్సితుడైన రావణాసురుడు కుతకుత కోపంతో ఉడుకుతూ రామ బాణానికి బలియై ఆలు , బిడ్డలను వదలి చనిపోయాడు.

 

5.సమస్య :- పరమాన్నము తిన్నవాడు పాపము బొందున్ ll

కం. కరివేపాకున్ దొరకని

కరువౌ ప్రాంతంబునందు కడు ధనికుడునై

పరువున్ బోయెడు రీతిగ

పరమాన్నము తిన్నవాడు పాపము బొందున్ ll
భావము :- కరివేపాకు కూడా దొరకని కరువు ఉన్న ప్రాంతంలో ధనికుడైన వాడు దూర ప్రాంతాల నుండి ఆహార పదార్థాలను తెప్పించుకోగలిగి , దానము చేయలేదనే పరువు పోయే విధంగా పాయసం చేసుకొని తింటే వాడు తప్పక పాపాన్ని పొందుతాడు.

 

6.సమస్య : అండమ్ముల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీll

శా . దండాలమ్మ ! పవిత్రమాత ! దురమున్ తాడించి పీడించుచున్

చండాడందగినావు గాదె నిజమౌ చండీ ! ప్రసన్నంబుగా

నండంగా నుతియించు భక్తులకు నిత్యానందవైయుండు , కూ

ష్మాండమ్ముల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీ ll

భావము :-  అమ్మా ! శ్రీ శాకంబరీ ! నీవు యుద్ధంలో శత్రువులను తాడించి , పీడించి క్రోధమూర్తిని వై ఉన్నావు. అటువంటి నీవు నిన్ను భక్తితో ప్రార్థించే వాళ్లకు అండగా ఉంటూ  ఎల్లప్పుడూ ఆనందంతో కనిపించు. కూష్మాండాలను అలంకారంగా కలిగిన ధరించిన ఓ తల్లీ ! కోర్కెలు ఈడేర్చుము.

 

7.వర్ణన :-  పండగలు అంటే పులిహోర గుర్తుకు వస్తుంది.  పులిహోరాకు , శార్దూలానికి ఉన్న సారూప్యాన్ని శార్దూల పద్యం లో చెప్పాలి.

శా. మీకాదుర్గయటన్ననెన్న మిగులన్ మేలైన భక్తౌ గదా !

ఆ కోర్కెల్ పులిహోరయందుగనుచున్ వ్యాఘ్రాసనాసీననే

చేకొల్వం దగియుంటివమ్మ పుడమిన్ , చిత్తంబునన్ దల్చగా

వీకన్ తా పులిహోర వ్యాఘ్రములు తావివ్వంగ పబ్బంబులన్ ll
భావము :- అమ్మా ! మీకు దుర్గాదేవి అంటే భక్తి ఎక్కువగా ఉంది. అందవల్ల వ్యాఘ్రం (పులి ) పై కూర్చొని యున్న అమ్మవారిని తలచుకొంటూ పులిహోర వండుతారు. అందువల్ల అమ్మవారి వాహనమైన పులి , పండుగలకు తగిన నైవేద్యమైన పులిహోర మీ వంటలో సారూప్యాన్ని పొందుతూ ఉంటుంది.

 

శ్రీ గోలి హనుమచ్ఛా స్త్రి:

దోసంబది లేదింతయు

చేసిరి యవధాన మిట్లు ఘనమవ్వంగన్

ధ్యాసగ నిమ్మహి మెచ్చెడు

గ్రాసంబీ రాత్రి వేళ కమ్మగ దొరకెన్ ll

 

శ్రీ చింతా రామకృష్ణ రావు గారు :

మీ సహనంబు మెచ్చెదను. మీ కవితా మహిమంబు మెచ్చెదన్

మీ సుమ పేశలాన్విత సుమేధను మెచ్చెద, మిమ్ము మెచ్చెదన్

మీ సుగుణాశ్రితంబులగు మేల్పలుకుమది నుంచి మెచ్చెదన్.

మీ సములెవ్వరయ్య.తరమే మిము నెంచ ననిల్ కుమారుడా!

 

శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు :

చం.    అనిలకుమార! నీ యనుపమాన వచః ప్రవిముక్త పద్యముల్

ననితరసాధ్యహృద్యములు నై నవధానబుధేంద్ర! పృచ్ఛకా

గ్రణుల మనో విలాసముల రంజిలజేసి సరోజగంధ వీ

చినివృతసాంద్రమాలికలచే నలరింపగ జేసినాడవే!
డా.మాడుగుల అనిల్ కుమార్ శర్మ :

చం. సరస కవిత్వయుక్త సువచస్సముపేతులు పృచ్ఛకోత్తముల్

ధరణి ప్రజాళి మెచ్చెడు విధంబుగ సత్సహకారమివ్వగా

వరమొసగంగ శాంభవి శుభంబగునంచు జయమ్ముగల్గె , వి

స్తరమతులైన మీకు మనసార కృతజ్ఞతలందజేసేదన్ ll

 

శ్రీ శాకంబరి అష్టావధానం చేయడానికి అవకాశమిచ్చిన మాలిక అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీమతి వలబోజు జ్యోతి గారికి , మఱియు శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి , పృచ్ఛకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

//ఓం తత్సత్//

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *