March 4, 2024

అతడే ఆమె సైన్యం

రచన: యండమూరి వీరేంద్రనాధ్                                                                                     


ఎపిలోగ్ :

సాయంత్రం అయిదయింది. ఆ వీధి అంత రష్‌గా లేదు. అలా అని పూర్తి నిర్మానుష్యంగానూ లేదు. అంజిగాడి పాన్‌షాప్ దగ్గర మాత్రం ముగ్గురు నిలబడి అరటిపళ్ళు తింటున్నారు.

అంజిగాడి మొహంలో బాధలేదు. అలా అని మనసులో బాధ లేదని కాదు. ముగ్గుర్నించి పైసా రాదని తెలుసు.  ఏడవలేక నవ్వుతున్నాడు.

“ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే మూడు పాన్‌లు కట్టు” అన్నాడు ఆ ముగ్గురిలో కాస్త అప్రెంటిసులా వున్నవాడు.  వాడు పిక్ ప్యాకెట్ స్టేజికి పైనా, మర్డర్ల స్టేజికి క్రిందా వున్నాడు. ఇంకో పది సంవత్సరాలు పోతేగాని రాజకీయాల్లో పైకి వస్తాడో లేదో చెప్పలేం.

“హ్హి! తప్పకుండా! ఇంకేమయినా తీసుకుంటారా” అన్నాడు అంజిగాడు అదే విషాద భరితమైన నవ్వుతో, ఎంత తొందరగా వీళ్ళిక్కడ్నుంచి వెళ్ళిపోతారా అన్న ఫీలింగు వాడిలొ కనపడుతోంది.

“ఏం బాస్ – ఇంకా ఏమైనా….” అనబోతున్న చిన్న రౌడీ మాట మధ్యలో ఆగిపోయింది.  ముగ్గురిలోకి పెద్దవాడిగా కనిపిస్తున్న దాదా చూపు నిలిచిన చోటుకి అతను తన దృష్టి సారించాడు.

పాతికేళ్ళ యువతి ఒక పాపని ఎత్తుకుని కొట్టువైపు వస్తోంది.

అక్కడ అకస్మాత్తుగా చాలా ఇబ్బందికరమయిన నిశ్శబ్దం చోట చేసుకుంది. అంజిగాడి చెయ్యి పాన్‌లనీ సిగరెట్ ప్యాకెట్‌ని తొందరగా అందించింది.  అక్కడనుంచి వాళ్ళని పంపెయ్యాలన్న కంగారు ఆ తొందరలో కనబడుతూంది. అయితే ఆ ముగ్గురూ దాన్నీ పట్టించుకోలేదు.  ఎక్స్‌రే కళ్ళతో ఆమెని చూస్తూ నిలబడ్డారు.

ఆమె వచ్చి ‘రెండు అరటి పళ్ళివ్వూ’ అంది. అంజిగాడు డబ్బులు తీసుకొని ఆమెకు పళ్ళు అందించాడు.  అయితే పళ్ళకన్నా ముందు ఆమె చేతికి ఒక ప్యాకెట్ తగిలింది.

“రెండు అరటిపళ్ళు కొంటే ఇది ఒకటి ఉచితం మేడమ్ అన్నాడు ముగ్గురిలో మధ్యస్తంగా వున్న రౌడీ.

ఆమె మొహం సిగ్గుతో వాడిపోయింది.

అరటిపండు పక్కనే నిరోధ్ ప్యాకెట్ సింబాలిక్‌గా, మానవత్వం పక్కన పశుత్వంలా వుంది.

“నేనేమన్న పొమ్మను” అని ఆమె కదలబోతుంటే… “పాప మంచిగున్నది బుగ్గలు బాగున్నయ్‌లే” అంటూ ఆమె ఎత్తుకున్నా పాప చెంపలు నిమిరాడు.

వాడి మోచెయ్యి ఆ యువతి వక్షాలకి సుతారంగా తగిలింది.  ఆమె అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది.

సరిగ్గా అదే సమయానికి సైకిల్ మీద వస్తున్న ఒక వ్యక్తి ఈ దృశ్యం చూసి, దిగి దగ్గరకొచ్చాడు. అతడిని చూసి ఆ యువతి తేరుకుంది.

“ఏమిటి గొడవ?” అన్నాడు. అతడామె భర్తలా వున్నాడు.

“ఏమిలేదు. అత్తయ్యగారు అరటిపళ్ళు కావాలంటే వచ్చా. రండి వెళ్దాం” అంది.  వాళ్ళిద్దరూ వెళ్ళబోతూంటే ఒకడు”… రెండరటిపళ్ళు కొంటే ఒక నిరోధ్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తమంటే తీస్కోటంలే నీ పెళ్ళం” అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

ఆ వ్యక్తి ఆగాడు

“రండి వెళదాం” అందామె భయంగా

“ఏం బే అట్ల చూస్తున్నవ్? ఏంది నీ పేరు?

“సుబ్బారావు”

ఎడ పన్జేస్తున్నవ్?”

“సెక్రటేరియట్‌లో”

“ఏం పని?”

“గుమస్తా”

“సుబ్బారావు పేరెట్టుకున్నవ్.  గుమస్తాగా చేస్తున్నవ్.  గంత పౌరుషము పనికి రాదు బేటా. పో. నీ పెండ్లాన్ని దీస్కపో.

సుబ్బారావు మొహం ఎర్రబడింది. అయినా ఎం చెయ్యలేని నిస్సహాయతతో సైకిల్ మీద చెయ్యి వేశాడు. కాలరు దగ్గర కాస్త చిరిగిన షర్టూ, లూజు పాంటు అతడిని చూసి నవ్వుతున్నట్టున్నాయి.

“బుగ్గలైతే నున్నగున్నయ్ బై” వెళ్లబోతున్న సుబ్బారావు ఆగటం చూసి వాడు నవ్వేడు. “….నీ పెండ్లంవి కావు నీ కూతురువి. పెండ్లానివి నేను నిమర్లే “

అవతలివాడు ఏమీ చేయ్యలేడని తెలిసి ఆడుకుంటున్నట్టు వుంది వాళ్లకి.

“మర్యాదస్తులతో ఇలా మాట్లాడ్డానికి సిగ్గులేదూ” అన్నాడు.

“ఏం? మేం మర్యాదస్తుల్లా కనబడటంలే” అన్నాడు.

అతడు తనలో తనే “తెలుస్తూనే వుంది” అని గొణుక్కుంటూ వెనుదిరిగాడు.  వెనుకనుంచి భుజంమీద చెయ్యి పడింది.

“ఏమంటున్నవ్?”

“ఏమిలేదు.”

రౌడీ అతడి గడ్డం పట్టుకుని చెంపలు రెండు వేళ్ళతో గట్టిగా నొక్కుతూ “ఏమన్నావ్ బే ఇప్పుడు” అన్నాడు.

అంజిగాడు కొట్టులోంచే “వదిలెయ్యరాదన్న పాపం” అన్నాడు. సుబ్బారావు భార్య కంగారుగా దగ్గర కొచ్చింది. అప్రెంటిస్ రౌడీ తన గొప్పతనం సీనియర్ల దగ్గర నిరూపించుకోవటానికి అన్నట్టు ఆమె మెడమీద చెయ్యివేసి

“ఇక్కడా నున్నగానే వుంది బాస్” అన్నాడు.

అప్పుడు కొట్టాడు సుబ్బారావు అతణ్ణి. లోపల్నుంచి తన్నుకొచ్చిన ఉక్రోషం అతడితో ఆ పని చేయించింది. అక్కడున్న అయిదుగురూ ఆశ్చర్యపోయారు.  ఆ చర్యకి.  చెళ్ళుమన్న శబ్దం తప్ప ఆ తరువాత ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

సుబ్బారావుని పట్టుకున్న రౌడీ బలంగా అతడిని వెనక్కి తోశాడు.  కొట్టు క్రిందనుంచి పారుతున్న మురికికాలవలో పడ్డాడు సుబ్బారావు. నల్లటి మురికి వర్షం క్రిందనుంచి పారుతున్న మొహం మీదికి  చిమ్మింది. అతడి భార్య కెవ్వున కేక వేసింది. పాప ఏడవటం ప్రారంభింరింది.  రెండో రౌడీ కాలు అతడి మొహం మీదకు లేచింది. సుబ్బారావు ఆ కాలుని వెనక్కి తోశాడు. అది వూహించని రౌడీ బ్యాలెన్స్ తప్పి తూలటంతో కిళ్ళీకొట్టు తలుపుకి వున్న ఇనుప కొక్కెం కణతకి గుచ్చుకుంది.  అతడు ఆర్తనాదం చేస్తూ కూలాడు.

అనూహ్యమైన ఈ సంఘటన తాలూకు షాక్‌నుండి వెంటనే తెరుకున్నాడు పెద్ద రౌడీ. రెండు చేతులతో అతడిని లేపాడు. మెరుపుకన్నా వేగంగా జేబులోంచి కత్తి తీశాడు. తన ప్రాణాలు పోవటం ఖాయమని సుబ్బారావుకి తెలిసిపోయింది. భార్యవైపు చూశాడు. ఆమె ఏడుస్తోంది. తనని పట్టుకున్న రౌడీవైపు సుబ్బారావు చూశాడు.

ఆ వేగం ఎక్కణ్ణుంచి వచ్చిందో తెలీదు. చూపుడు వేలు, మధ్యవేలు చాకులా చేసి, ప్రత్యర్ధి కత్తికంటే వేగంగా అతడి మొహంవైపు పోనిచ్చాడు. కత్తి తన చేతిని తాకేలోపులో అతడి వ్రేళ్ళు ప్రత్యర్ధి కళ్ళని పొడిచేశాయి.

రెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ రెండు సంఘటనలకీ జూనియర్ రౌడీ మొదట్లో విచలితుడయినా వెంటనే తేరుకొని అతడి మీదకు దూకాడు. అది అతడి పరువుకి సంబంధించిన సమస్య.  సుబ్బారావుకి ప్రాణానికి సంబంధించిన సమస్య.

ఇద్దరూ ఆ బురదలో పందుల్లా కొట్టుకుంటున్నారు. వాటికన్నా మేమేమి తక్కువ హీనంకాదు అన్నట్టు. చుట్టూ జనం కేవలం ప్రేక్షకుల్లా నిలబడ్డారు “సమాజంలో ఎవరికీ భద్రతలేదు. ఒకరెవరైనా ఆ హక్కుకోసం పొరాడినా, మిగతా వాళ్ళెవరూ సాయం చెయ్యరు” అన్నది అక్కడ నిరూపణ అవుతోంది.

పరువు భయంకన్నా ప్రాణభయమే గెలిచింది. సుబ్బారావు ఆ కుర్రరౌడీని కూడా అధిగమించి నిలబడ్డాడు. బురదలో అచ్చొత్తిన బొమ్మలా వున్నాడు అతడు. భార్యవైపు చూసి నవ్వాడు. ఆ ఆనందంలో వెనుకనుంచి వస్తున్న ప్రమాదం గురించి తెలుసుకోలేదు. ఇనుప వూచమీద పడిన మొదటి రౌడీ లేవటం, కొట్టు ముందు వరుసలో వున్న సోడా బాటిల్ తీసుకుని సుబ్బారావు తలమీద మోదటం క్షణాల్లో జరిగిపోయాయి.

చుట్టూ వున్నవాళ్ళు హాహాకారాలు చేశారు.

రెండు చేతుల్తో తల పట్టుకుని కూలిపోయాడు సుబ్బారావు. తలనుంచి రక్తం ధారగా కారుతూండగా అతడికి స్పృహ  తప్పింది

పది నిమిషాల తరువాత అక్కడికి అంబులెన్స్ వచ్చింది.

అసలు కధ అప్పుడు ఆరంభమయింది.

 

 

అతడే ఆమె సైన్యం

 

ఆస్పత్రి మందుల వాసన తెలుస్తూంది.

“అదృష్టం బావుంది.  తలలో ఎముకలేవీ విరగలేదు.”

అతడు కళ్ళు విప్పాడు. దూరంగా ఒక డాక్టర్ స్కల్ ఎక్స్‌రే పరీక్షిస్తున్నాడు. ఇంకో ఇద్దరు పక్కన నిలబడి వున్నారు. అతడు కళ్ళు తెరవడం నర్స్ గమనించింది. అందరూ దగ్గరగా వచ్చారు. డాక్టర్ మరొకసారి పరీక్షించి మళ్ళీ అదే చెప్పాడు. “అదృష్టం బావుంది”.

అతడు పక్కమీద లేచి కూర్చున్నాడు. తలకి బ్యాండేజ్ తెలుస్తోంది.

“మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు. బలమైన దెబ్బవల్ల సృహ తప్పిందంతే. ఒక పదిరోజులపాటు వచ్చి బ్యాండేజ్ కట్టించుకొండి.

“ధాంక్స్ డాక్టర్!”

“బయట్ మీ భార్య వెయిట్ చేస్తోంది.”

అతడు మొహం చిట్లించి “నాకు భార్యేమిటి? నాకింకా పెళ్ళికాలేదు” అన్నాడు.

అందరూ మొహం చూసుకున్నారు.

“నా పేరు చైతన్య”

అంతా నిశ్శబ్దం.

“మీరంతా అలా ఎందుకున్నారు? నా గురించి ఎవరూ రాలేదేమిటి?” చుట్టూ చూస్తూ అడిగాడు.

“మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు?”

“ప్రొడ్య్సూసర్లు, టెక్నీషియన్లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టాలేదా? నేను  చైతన్యని.”

“అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్‌లో ఒకరయిన చైతన్య మీరని మీ ఉద్దేశ్యమా?”

“ఉద్దేశ్యమేమిటి నాన్సెన్స్ – నేనే చైతన్యని.”

ఒక నర్స్ నవ్వాపుకోలేక మొహం పక్కకి తిప్పుకుంది. కానీ అనుబవజ్ఞుడయిన డాక్టర్ ముఖంలో విషాదం తొంగిచూసింది. సానునయంగా అన్నాడు – “చూడు బాబూ, నీ పేరు సుబ్బారావు. బయట నీ భార్యా, కూతురూ వున్నారు. నీ బ్రెయిన్ సెల్స్ పూర్తిగా చచ్చిపోకముందే ఆక్టివేట్ చేయడానికి ప్రయత్నించు.”

అతడు మంచం మీదనుంచి చటుక్కున దిగాడు.  “నాకు కాదు. మీకు మతిపోయింది. దాదాపు ప్రతిరోజూ నా ఫోటో పడుతూనే వుంటుంది.  మీరు నన్ను గుర్తుపట్టలేకపోవటం ఏమిటి – ఫోన్ ఇవ్వండి.”

“దేనికి?”

“మా ఇంటికి ఫోన్ చేస్తాను. లేకపోతే అన్నపూర్ణాకో, రామానాయిడి స్టూడియొకో చేసి నా డైరెక్టర్‌ని రమ్మంటాను.”

“మీ ఇంటి నెంబరెంత?”

“9344392”

“అది సెక్రటేరియట్ నెంబరు.”

డాక్టర్ తాపీగా అన్నాడు.

“నో” అరిచాడు.

డాక్టరు అతడి అరుపు పట్టించుకోకుండా స్టాఫ్ వైపు తిరిగి “టు స్కాన్ ది బ్రెయిన్, అరేంజ్ టు సెండ్ హిం టు మెంటల్ హాస్పిటల్” అన్నాడు.

“నాన్సెన్స్” ఈసారి మరింత గట్టిగా అరిచాడు అతను. ” ఆ నెంబర్ నాదే.  నన్నొక్కసారి ఫొన్ చేసుకో…..” అతడి మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.  పాప నెత్తుకుని అతడి భార్య లోపలికి ప్రవేశించింది.  జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసినట్టులేదు.  భర్త మామూలుగా వుండటం చూసి సంతోషంగా దగ్గరికి వచ్చింది.

“చూడు సుబ్బారావ్! నువ్వు సెక్రటేరియట్‌లో గుమాస్తావి. ఈమె నీ భార్య.”

“కాదు! నేను చైతన్యని. ఏ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.”

“ఏమండీ – ఏమైందండీ మీకు?” అంటూ ఆమె మరింత దగ్గరగా వచ్చింది. ఈ లోపులో నర్సు అతడికి ఇంజెక్షన్ ఇచ్చింది.

అతడి కళ్ళు మూతలు పడసాగాయి.

“9344392 సెక్రటేరియట్ నెంబరు కాద్సార్. అది హీరో చైతన్యగారి నెంబరే” నర్సు అంటోంది.

“నీకెలా తెలుసు?”

“నేను ఆయన ఫాన్‌ని సార్.”

స్పృహ తప్పుతూ వుండగా అతడికి వినిపించిన చివరి మాటలు అవి.

తిరిగి అతడికి స్పృహ వచ్చేసరికి ఒక విశాలమైన గదిలో ఉన్నాడు. దూరంగా నిలబడి పనిచేసుకుంటున్న నర్సు అతడికి మెలకువ రావడం చూసి దగ్గర కొచ్చింది.

“నేనెక్కడ వున్నాను?”

“మెంటల్ హాస్పిటల్‌లో.”

అతడా గదిని పరిశీలనగా  చూశాడు.

“మీరు తెలుగమ్మాయేనా సిస్టర్?”

“అవును.”

“సినిమాలు చూస్తారా?”

“చూస్తాను.”

“నా సినిమాలు ఏమైనా చూశారా?”

ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే బయట అలికిడి వినిపించింది. నలుగురు డాక్టర్లు లోపలికి వచ్చారు.

“హౌ ఆర్యూ మిస్టర్ సుబ్బారావ్?” అందర్లోకి పెద్ద వయసున్న వ్యక్తిలా కనబడుతున్న డాక్టర్ అడిగాడు.

“మీరెవరు?” తిరుగు ప్రశ్న వేశాడు అతను.

“నేనీ హాస్పిటల్ సూపర్నెండెంట్‌ని.”

“చూడండి. క్రింద హాస్పిటల్ వాళ్ళు చెప్పింది నమ్మనవసరంలేదు మీరు. నేన్ము నిజంగా సుబ్బారావుని కాదు. నా పేరు చైతన్య. గర్వంగా చెప్పుకుంటున్నాననుకోకపోతే నన్ను గుర్తు పట్టని వాళ్ళు ఆంధ్రదేశంలో దాదాపు లేరు. భ్రేక్‌డాన్స్, డూప్ లేకుండా నేను చేసే ఫైట్స్, యువతలో నాక్రేజ్ పెంచాయి.  వాళ్ళలో ఒక్కసారి ఎవర్నన్నా పిలిపించండి. లేదా మీలో ఎవరన్నా సరే …. ఒక్కరూ నన్ను గుర్తుపట్టటం లేదంటే నేను నమ్మను. పోనీ మా ఇంటి అడ్రసు చెపుతాను. మా తల్లిని ఇక్కడకు పిలిపించండి  ఆవిడా కూడా నన్ను గుర్తుపట్టకపోతే మీరు చెప్పినదంతా నుమ్ముతాను. నాకు పిచ్చెక్కిందని ఒప్పుకుంటాను.”

“తప్పకుండా అలాగే చేద్దాం. కానీ దానికి ముందు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి.  విజయనగరంలో ఒక పదహారేళ్ళ కుర్ర్రవాడికి జ్వరం వచ్చింది.  జ్వరంలో నేను చైతన్య ఫాన్‌ని, ఆయన్ని చూడాలి అని అంటున్నాడు.  వాళ్ళ డాక్టర్ వచ్చి మీతో ఆ విషయం చెప్పాడు. చెప్పండి. మీరు వెళతారా?”

“విజయనగరం- అంతదూరం- షూటింగ్‌లు వదులుకుని…” అతడు సందిగ్ధంగా అన్నాడు.

“అందులోనూ మామూలు జ్వరానికి” డాక్టర్ అందించాడు.

“అవును మామూలు జ్వరానికి….” అతడు నవ్వేడు. ” పైగా ఇలా అందరిళ్ళకీ వెళ్ళడం మొదలు పెడితే నా టైమంతా ఊళ్ళు తిరగటానికే సరిపోతుంది.”

“మరటువంటప్పుడు పిచ్చాసుపత్రిలో ఎవరో సుబ్బారావు, నేనే చైతన్యని అని అంటే ఆ డాక్టర్ వెళ్ళి చైతన్య తల్లిగారిని రమ్మని పిలిస్తే బావుంటుందా?”

అతడి మొహం వివర్ణమైంది. అతికష్టంమీద తమాయించుకుని “నాకోసారి ఫోను చేసుకునే చాన్స్ ఇస్తే మీకేం నష్టం?” అన్నాడు.

“మీ ఇంట్లో ఎవరెవరుంటారు?”

“నేను, మా అమ్మా, మిగతా పనివాళ్ళు, నా సెక్రటరీ..”

“సరే ఫోను చేయండి.”

9344392

ట్రింగ్…ట్రింగ్…

అవతల్నుంచి రిసీవర్ ఎత్తిన చప్పుడు.

“హల్లో.”

“ఎవరు మాట్లాడేది?”

అట్నుంచి విసుగ్గా “మీకెవరు కావాలి?” అని వినిపించింది.

“అమ్మగారిని పిలువు.”

“ఏ అమ్మగారు?”

“చైతన్య తల్లిగారు”

“మీరెవరు?”

“నేను చైతన్యని.”

“ఎవరూ?”

“త్వరగా అమ్మని పిలువు.”

నిమిషం తరువాత మరో గొంతు లైన్‌లోకి వచ్చింది.

“ఎవరు మాట్లాడేది?”

“సుబ్బరాజు.”

సుబ్బరాజంటే చైతన్య సెక్రటరీ. అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.

“నేను చైతన్యని.”

“ఏం కావాలి చెప్పండి.”

“అమ్మ లేదా?”

“అమ్మగారు వారం రోజుల క్రితమే కాశ్మీర్ వెళ్ళారు. చైతన్యగారితో కలసి.”

“సుబ్బరాజూ-నేను చైతన్యని.”

“అవును చెప్పారుగా” ఇంకో చైతన్య ఎవరో అన్నట్లు విసుగ్గా అన్నాడు.

అతడు కోపం అణుచుకుంటూ- “నిన్న షూటింగ్‌కి బయలు దేరినప్పుడు అమ్మ నాకు టిఫిన్ కూడా యిచ్చింది.  వారం రోజుల క్రితం కాశ్మీర్ వెళ్ళటం, ఏమిటి? అసలు నువ్వు సుబ్బారాజువేనా?” అంటూండగా..

అవతల్నుంచి ఫోన్ కట్ అయింది. సినిమా యాక్టర్లకి ఇలాటి ఫోన్లు మామూలే.  అతడు నిస్సహాయంగా ఫోన్ పెట్టేసి వెనుదిరిగాడు. డాక్టర్ ఏమి మాట్లాడలేదు.  అతడు తన గదివైపు నడిచాడు. లోపలికి ప్రవేశిస్తూ ఆగిపోయాడు డాక్టర్ అతని భార్యని అడుగుతున్నాడు.

“ఏమ్మా! మీ ఆయనకి చైతన్య అంటే చాలా ఇష్టమా?”

“చాలా ఇష్టం డాక్టర్‌గారూ! ఇంటినిండా ఆయన ఫోటోలే అతికించుకుంటూ  వుంటారు. ఈ వయసులో కూడా తలుపులన్నీ వేసుకుని బ్రేక్ డాన్సులు చేస్తుంటారు.”

“అదీ విషయం” మరో డాక్టర్ అన్నాడు.  “ఇట్సె క్లియర్ కేస్ ఆప్ పారానాయిడ్ సైకాలజీ. అమ్మవారు పూనినప్పుడు భక్తులు “నేనే పోలేరమ్మనీ” అని చిందులు తొక్కుతారు.  ఇదీ అలాంటి కేసే, మన పేషెంట్  చైతన్య ఫాన్, చైతన్య సెక్రటరీ పేరు, ఫోన్ నెంబరుతో సహా కంఠతా పట్టినంత భక్తుడు. తలమీద ఈ గాయంతో, he entered the shoes of Chaitanya.”

మిగతావాళ్ళు తలూపారు.

“డాక్టర్‌గారూ! ఆయన బాగుపడతారా? ఇద్దరి తరపునా పెద్దవాళ్ళు ఎవరూలేని సంసారమండీ మాది” ఏడుస్తూ అంటోంది ఆమె. బయటినుంచి ఇదంతా వింటున్న అతను ఒక్క ఉదుటున లోపలికి వెళ్ళాడు.  ఆమెని పట్టుకుని విసురుగా తనవైపు తిప్పుకున్నాడు. “ఏమిటీ నువ్వు నాభార్యవా? నా పేరు సుబ్బారావా” ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు. మొగాడివైతే పాతేసి వుండేవాడిని.”

డాక్టర్లు అతడిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్ళారు.

“ఆమె అబద్దం చెపుతోంది.  ఆమె ఎక్‌స్త్ట్రా ఆర్టిస్టు” గింజుకుంటూ అన్నాడు.

“మిస్టర్ సుబ్బారావ్! నీ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నారా?”

అతను ఆగాడు. డాక్టర్లు అతడి చేతుల్ని వదిలేశారు. దూరంగా గోడకి నిలువుటద్దం.

అతను అందులో తనని తాను చూసుకున్నాడు.  మార్పేమీ లేదు. కాస్త నొక్కుల జుట్టు, అందంగా విప్పారిన కళ్ళు, బలమైన చెంపలు… ఎందరో యువకుల పుస్తకాల మధ్యలోనూ,  యువతుల హృదయాల్లోనూ దాచుకోబడిన రూపం అది.  రెండురోజుల అలసటవల్ల కాస్త గెడ్డం మాసిందంతే.

“మీది చాలా అందమైన పర్సనాలిటీ సుబ్బారావ్! మీ పారానాయిడ్ సైకాలజీకి అది కారణం అయింటుంది. ‘చైతన్యకన్నా నేను అందగాడినీ అన్న భావం మీలో ఏమూలో వుంది . అది నిజమే! మీరు పిక్చర్ ఫీల్డులో వుండి వుంటే బహుశా చైతన్య నెంబర్ వన్ హీరో అయి వుండేవాడు కాదేమో.”

“నాన్సెన్స్! నేనే చైతన్యని.”

“మీ ఫోటో తరుచూ పేపర్లో పడుతూ వుంటుంది కదూ?”

“దాదాపు రోజూ ఏదో ఒక అడ్వర్టయిజ్‌మెంట్…” అన్నాడు అతడు.

దాక్టర్ అసిస్టెంట్ వైపు తిరిగి-“ఈ రోజు పేపరు పట్రా” అన్నాడు. అయిదు నిమిషాల్లో పేపర్ వచ్చింది. అతడు అన్నాడు-

“చివరి పేజీ చూడండి. ఈ రోజే నా పిక్చర్ రిలీజ్.  ఫుల్‌పేజీ ప్రకటన వుంటంది” అతడి కంఠంలో ‘ఇక ఈ అయోమయానికి ముగింపు దొరకబోతోంది కదా’ అన్న రిలీఫ్ కనబడుతోంది.

డాక్టర్ దృష్టి దానిమీద పడింది.  అడ్డుగా వున్న డాక్టర్ తల క్రమక్రమంగా, నెమ్మదిగా వెనక్కి తొలగుతూన్న కొద్దీ పైనుంచి కనబడుతుంది.

“అతడే ఆమె సైన్యం”

హీరోయిన్ ఫోటో-

వెనుక మిషన్‌గన్ పట్టుకుని అందమైన హీరో ఫోటో.

తను కాదు, వేరే ఎవరో,

“ఇతను చైతన్య కాదు” అరిచాడు అతను. “నేనే చైతన్యని.  అతడే ఆమె సైన్యం’ సినిమాలో హీరోని నేనే.”

అతని వైపు జాలిగా చూస్తూ సూపర్నెండెంట్ నెమ్మదిగా అన్నాడు- “లాభంలేదు.  షాక్ ట్రీట్‌మెంట్ ప్రారంభించండి.”

సుబ్బారావు భార్య రోదించటం మొదలు పెట్టింది.

 

2

అతడి మెదడులో ఫిరంగులు పేలుతూన్న హోరు! లయబద్ధంగా తలమీద ఒకే బీట్‌లో ఎవరో కొడుతున్న భావన!! తన నుంచి తాను విడిపోయి వెయ్యిరూపాలుగా విశ్వరూపం ప్రదర్శిస్తూ నాట్యం చేయాలన్న కోర్కె! రకరకాల రంగుల విశ్లేషణాలు శరీరం మీద పాములా జారిపోతూంటే తాండవించాలన్న తపన! తపోభంగమైన ఋషిలా వుంది అతని పరిస్థితి. నెమ్మదిగా అతడికి స్పృహ వచ్చింది. చేతులూ కాళ్ళూ స్వాధీనంలోనే లేవు. చుట్టూ చూశాడు. అదే పక్క. అదే హాస్పిటల్ వాతావరణం.

తనకి కరెంట్ షాక్ ఇచ్చి, ఆ తరువాత తిరిగి పక్కమీదకు చేర్చారని అర్ధమైంది.

అందుకే ఇంత నిస్సత్తువ! షాక్ తరంగాల వత్తిడివల్ల కంటినుంచి నీటిచుక్క చెంపమీద జారింది. అతడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏమిటిది? అసలేం జరుగుతోంది? తను సుబ్బారావేంటి? తను ఇప్పుడీ పిచ్చాసుపత్రిలో వుండటం ఏమిటి” అక్కడ తన షూటింగ్‌లు ఎలా జరుగుతున్నాయి? తాను నటిస్తున్న చిత్రాలు దాదాపు అయిదున్నాయి. ఆ నిర్మాతలు ఎంత టెన్షన్ అనుభవిస్తూ వుండి వుంటారు.  ముఖ్యంగా – ఇంకో నెలరోజుల్లో రిలీజ్ కానున్న రెండు కోట్ల ప్రాజెక్టు నిర్మాత రెడ్డి – ఆయన కసలే బి.పి. ఆయన ప్రస్తుతం ఏం చేస్తూ వుండి వుంటాడు? తను ‘తప్పిపోయిన విషయం పేపర్లో వచ్చి వుంటుందా? రాష్ట్రంలో తన అభిమానులు ఆ వార్తకు ఎలా స్పందించి వుంటారు? తన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా వుండి వుంటుంది? పోలీసులు ఏం చేస్తూ వుండి వుంటారు?

అతడి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పక్కనే పేపర్ నవ్వుతూ కనబడింది. విప్పి చూశాడు. ఎక్కడా తన ప్రసక్తే లేదు.  చివరిపేజీలో మామూలుగానే చైతన్య ఫోటో…

‘అతడే ఆమె సైన్యం’ అడ్వర్‌టైజ్‌మెంట్….

“నేడే పదో రోజు” అని

ఎదురుగా అద్దంలో తన ప్రతిబింబం వెక్కిరిస్తూ.

రెంటికీ పోలికే లేదు.

అతడు బలంగా నిట్టూర్చబోతుంటే ‘హలో’ అని వినపడింది.  ఒకాయన లోపలికి వచ్చి, ‘కొత్తగా వచ్చార్టగా’ అన్నడు చొరవగా కూర్చుంటూ.

చైతన్యకి ఒళ్ళు మండింది.  అదేదో ఆఫీసు అయినట్టు, తను అప్పుడే అందులో చేరినట్టు ఆయన విష్ చేయడం చూసి.

“ఎవరు మీరు?” అని అడిగాడు.

ఆయన అటూ ఇటూ చూసి- “నేను అల్లు రామలింగయ్యని” అన్నాడు

చైతన్య అదిరిపడి అతనివైపు చూశాడు. అతనికి యాభై అయిదేళ్ళుంటాయి. సన్నగా, పొట్టిగా వున్నాడు. “నేనే అల్లు రామలింగయ్యని అంటే వీళ్ళు నమ్మటంలేదు.  ఎస్వీ రంగారావుగారూ, నేనూ కలిసి నటించిన చిత్రాల్లో విషయాలు వివరంగా చెప్పినా కూడా వీళ్ళు నమ్మటంలేదు.”  అరగంటసేపు తన ఫామిలీ గురించి చెప్పాడు.

“నేను రామలింగయ్యనని మొదట్లో ఎవరూ నమ్మలేదు. చివరికి మా అబ్బాయి అల్లు అరవింద్ గుర్తుపట్టాడు. నెలనెలా వచ్చి పళ్ళూ అవీ తెచ్చి ఇస్తూ వుంటాడు.  తొందరగా కోలుకొమ్మని విష్‌చేస్తూ వుంటాడు. నాకు విషయం పూర్తిగా అర్ధమైంది. నాకు పిచ్చిలేదు. ఇంకేదో ఆస్పత్రిలో నేను బాధ పడతానని ఇలా చెప్తునారు” అతనికి నవ్వొస్తూంది. బలవంతంగా ఆపుకున్నాడు. ఆయన నెమ్మదిగా అన్నాడు. “నాకు నా వారందర్నీ చూడాలనుంది కానీ నా కోసం ఎవ్వరూ రారు. రాత్రంతా ఒంటరిగా కూర్చుని కిటికీలోంచి బైటకు చూస్తూ కూర్చుంటాను. చీకటి తప్ప ఇంకేమీ కనపడదు నాకు” ఆయన కంఠం రుద్ధమైంది. ‘అతనికి’ కూడా కళ్ళు తడి అయ్యాయి.

“పాపం నా నిర్మాతలు ఏమయ్యారో అక్కడ, నేనేమో ఇక్కడ వుండి పోయాను.”

అతను అదిరిపడ్డాడు.

తను మనసులో అనుకున్న మాటే ఆయన భైటికి అన్నాడు. అప్పుడే ఆయన దృష్టి పేపరుమీద పడింది. చివరిపేజీ ప్రకటన చూపిస్తూ “ఇదిగో ’అతడే ఆమె సైన్యం’.  ఇందులో కూడా నేను ’యాక్ట్’ చేశాను. ఇదే నా ఆఖరి సినిమా. ఇదే నా ఫోటో” అంటూ చూపించాడు. ఇది (నిజం) అల్లు రామలింగయ్యది. అతడు ఆయన వైపు జాలిగా చూశాడు. అంతలో బయట గుమ్మం దగ్గర అలికిడి అయింది. అతడు తల తిప్పి చూశాడు.

తన జీవితంలో అంత అద్భుతమైన అందాన్ని అతడు అంతకు ముందెన్నడూ చూడలేదు. తూర్పు నుంచి వచ్చే సూర్యుడు థాయ్‌లాండ్ పూల సొగసుని, ఉత్తరం నుంచి వచ్చే గాలి మంచు ధృవపు తెల్లదనాన్ని పశ్చిమనుంచి ఇంటికొస్తూన్న పక్షి ఈజిప్టు పిరమిడ్ల నునుపుదనాన్ని తెచ్చి ఆమెకిచ్చి నట్టున్నాయి.

ఆమె లోపలికి వచ్చి మృదువుగా “మీరిక్కడ వున్నారా? మీకోసం హాస్పిటల్ అంతా వెతికాను” అంది.

“నేను రాను. వస్తే ఆ చేదు మందిస్తావు” అరిచాడు ఆయన.

“ఇవ్వను. రండి. మీ అబ్బాయిగారు వచ్చారు.”

ఆయన అబ్బాయి పేరు వినగానే లేచాడు. అరవింద్ వచ్చాడని తెలియగానే అతడు ఉద్వేగంతో లేచి “సిస్టర్” అని అరిచాడు. ఆమె ఆగింది.

“మీ పేరు?”

“అక్షౌహిణి.”

ఆ పేరులోని విలక్షణతకి అతడు ఆశ్చర్యపడ్డాడు. తన ఆశ్చర్యాన్ని అణుచుకుని “నాకో సాయం చేస్తారా?” అని అడిగాడు.

ఆమె చిరినవ్వుతో ‘చెప్పండి’ అంది.

“ఒకసారి అరవింద్‌ను కలుసుకోవాలి నేను” అన్నాడు.

ఆమె మౌనంగా తలూపి అక్కణ్ణుంచి ఆయన్ని తీసుకువెళ్ళిపోయింది.  రెండు నిమిషాల తరువాత డాక్టర్ వచ్చి “అరవింద్‌ని కలుస్తావా?” అన్నాడు.

అతను చప్పున లేచి తలూపాడు. అరవింద్‌ను కలుస్తే ఈ సమస్య క్షణాల్లో తేలిపోయినట్టే.

ఇద్దరూ కారిడార్లో వెళుతూ వుండగా డాక్టర్ అన్నాడు- “అరవింద్ చాల పెద్ద ప్రొడ్యూసర్ అనుకుంటాను! నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంతగా తెలీదు.”

అతను ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. దూరంగా ఒక యువకుడు ఆయనకి పండ్లు ఇస్తున్నాడు.

“అతను అరవింద్ కాదు.”

ఈసారి డాక్టర్ నిరాకరించలేదు.  “అవును-కాదు” తాపీగా అన్నాడు. “ఇక వెనక్కి వెళదామా?”

ఇద్దరూ గదికి చేరుకున్నాక డాక్టర్ అన్నాడు- “నీ దగ్గర కొచ్చినాయన పేరు రామస్వామి. చిన్నప్పట్నుంచి ఆయన పేరనాయిడ్! ఆడవాళ్ళలాగా జుట్టు పెంచుకోవటం, దుస్తులు వేసుకోవటం చేసేవాడట. మళ్ళీ ఈ ముసలి వయసులో ఆ వ్యాధి తిరగబెట్టింది. కుటుంబంలో ఏవో గొడవలొచ్చాయి. మీకన్నా తీవ్రమైన కేసు. కొడుకుని చూడకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనన్నాడు. ఈ ఆస్పత్రిలోనే పనిచేసే ఒక డాక్టరుని అరవింద్‌లా వారానికొకసారి పంపిస్తూ వుంటాం.”

దాక్టర్ ఆగి, తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. “మీకన్నా తీవ్రమైన కేస్ ఇది.  మిస్టర్ సుబ్బారావ్! కనీసం మీ ఫోటోని మీరు గుర్తుపట్టగలిగారు. ఆయన రామలింగయ్య ఫోటోని చూపించి అది తనే అంటాడు. ‘లూనసీ’ లో అది పరాకష్ట.”

అతని మొహం కోపంతో ఎర్రబడింది. డాక్టర్ దాన్ని పట్టించుకోకుండా అన్నాడు- ” ఆ ముసలాయన్ని నేనే మీ గదికి ఏదో వంకపెట్టి పంపించాను! సుబ్బారావ్… మీరు పరిస్థితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి మీది కేవలం ఆక్సిడెంట్ మాత్రమే.  మీరు కూడా మాతో సహకరిస్తే-నేనే చైతన్యని అన్న హెలూసినేషన్ – అంటే భ్రాంతి నుంచి త్వరగా బయటకొస్తారు.”

అతను జవాబు చెప్పలేదు. న్యూస్‌పేపర్ ఆఖరి పేజీ గాలికి రెపరెపలాడుతోంది.  కళ్ళముందు ముసలాయన కదలాడుతున్నాడు. అతడికి మొదటిసారి తను సుబ్బారావ్‌నేమో అన్న అనుమానం, వచ్చింది.

*     *    *    *    *

 

“మీ కోసం ఇన్‌స్పెక్టర్ గారొచ్చారు.”

అతడు చటుక్కున లేచి నిలబడ్డాడు. ఇన్‌స్పెక్టర్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. వార్డ్ బోయ్ బయటికి వెళ్ళాక ఇన్‌స్పెక్టర్ అతనివైపు తేరిపార చూస్తూ “మీరు చైతన్యననీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్‌వన్ స్టార్‌నని చెప్పుకుంటున్నారనీ ఈ హాస్పిటల్ సూపర్నెండెంట్ చెప్పారు. నిజమేనా?” అన్నాడు.

అతను సమాధానం చెప్పలేదు. ఒకే జావాబు చాలమందికి చెప్పి చెప్పి అతడు మానసికంగా అలసిపోయి వున్నాడు.

“మీరు చైతన్య అని ఋజువులు ఏమయినా వున్నాయా?” ఇన్‌స్పెక్టర్ అడిగాడు.

అతని మొహంలో ఒక్కసారిగా కళ వచ్చింది.  “థాంక్స్ ఇన్‌స్పెక్టర్. మీరొక్కరడిగారు ఈ ప్రశ్న. సినిమా ప్రపంచానికి సంబంధించిన ఒక ప్రముఖుడి నెవర్నయినా పిలిపించండి చాలు. అతను కాదంటే నేను మీరేం చెబితే దానికి ఒప్పుకుంటాను.”

“మీరేం చదివారు?”

“గ్రాడ్యుయేట్‌ని ఇన్‌స్పెక్టర్.”

“కాదు. నువ్వొక డబుల్ గ్రాడ్యుయేట్‌వి” ఇన్స్‌స్పెక్టర్ అతనివైపు సూటిగా చూస్తూ నవ్వేడు.

“చాలా గొప్ప ప్లాన్ వేశావు మిస్టర్ సుబ్బారావ్! హాట్స్ఆఫ్ టు యూ” అంటూ ఫైల్‌లోంచి కాగితాలు బయటకు తీసి, అతడి ముందుకు తోశాడు

ఆంధ్రా యూనివర్సిటీ సర్టిఫికేట్ అది. సుబ్బారావు ఏడు సంవత్సరాల క్రితం ‘లా’ డిగ్రీ పొందినట్లు సర్టిఫికేట్.  అతడు దానివైపు అయోమయంగా చూశాడు.

“నీ భార్య యిచ్చింది మీ ఇంట్లో వెతికి-” అని ఇన్‌స్పెక్టర్ చెప్పడం ప్రారంభించాడు. “మంచి తెలివితేటలు నీవి. ఈ విధంగా పిచ్చి ఎక్కినట్టు నాటకమాడితే నీ మీదకు ఏ నేరమూ రాదని ఈ ఎత్తు వేశావు కదూ?”

“నేరం ఏంటి? నేనే నేరం చేశాను?”

“మూడు రోజుల క్రితం నీ చేతిలో దెబ్బతిన్న రౌడీల్లో ఒకడు మొన్న ఆస్పత్రిలో మరణించాడు. అదీ నేరం.”

“నాన్సెన్స్” కాలితో నేలని గట్టిగా కొడుతూ అతను అన్నాడు. “అదంతా షూటింగ్. ఆవిడా నా భార్య కాదు.  ఎగస్ట్రా ఆర్టిస్టు. కొత్త పిక్చర్లో నా పాత్ర పేరు సుబ్బారావు. సీను షూట్‌చేస్తూ వుండగా, ఆ ఫైటర్ నిజంగానే నా తలమీద కొట్టాడు నాకు స్పృహ తప్పింది.”

అతడి అరుపుల్ని ఇన్‌స్పెక్టర్ పట్టించుకోలేదు.

“ఇండియన్ పీనల్ కోడ్‌లో ఒక సెక్షన్ వుంది సుబ్బారావ్. దాని ప్రకారం పిచ్చి తగ్గేవరకు నేరస్తుల్ని శిక్షించకూడదు. లా గ్రాడ్యూయేట్ వైన నీకు ఆ విషయం తెలుసు.  అందువల్లే ఇంత నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు”. ఇన్‌స్పెక్టర్ లేచాడు. “ఓ.కే.! నిన్ను ఎలా దారికి తీసుకురావాలో మాకు తెలుసు. నీకు షాక్‌ల మీద షాక్‌లు యిస్తారిక్కడ. దీనికన్నా కోర్టులో అసలు విషయం ఒప్పుకోవడమే మంచిదనిపించే స్టేజికి నిన్ను తీసుకొస్తాను. అప్పటివరకూ నేను విశ్రమించను. గుడ్‌బై-” అంటూ వెళ్ళిపొయాడు.

అతడు వెళ్ళిన పది నిముషాలకి డాక్టర్ వచ్చాడు.  అతడిలో ఇదివరకంతటి సౌమ్యత కనపడలేదు. బహుశా ఇన్‌స్పెక్టర్ విషయమంతా చెప్పివుంటాడు.

“మొత్తం మమ్మల్నందర్నీ ఫూల్స్‌ని చేశావు సుబ్బారావ్. చైతన్య అనే నటుడి మీద వున్న విపరీతమయిన అభిమానంతో నువ్విలా మారావని జాలిపడ్డామే తప్ప, న్యాయస్థానాన్ని అధిగమించటానికి పిచ్చాసుప్రతిని ఆయుధంగా వాడుకున్నావని అనుకోలేదు” అన్నాడు.

ఆ క్షణంనుంచీ అతడికి నరకం ప్రారంభమయింది. షాక్ ట్రీట్‌మెంట్ పేరుతో అతడిని హింసించడం మొదలు పెట్టారు. వార్డ్‌ బోయ్‌తో సహా అతడిని అందరూ ఒక హంతకుడిగా చూసేవారు. రెండురోజుల్లో అతడి చర్మం కమిలిపోయింది.  సూదులు గుచ్చీ గుచ్చీ జబ్బలు రాటుదేలిపోయాయి. రోజుకి ఒకపూటే తిండి.  ప్రొద్దున్నే ట్రీట్‌మేంట్ మొదలయ్యేది. భయంకరమైన ట్రీట్‌మెంట్.

దాని గమ్యం ఒక్కటే.

“నువ్వు సుబ్బారావ్ వని వప్పుకో…”

 

*                            *                           *                         *

 

 

“నిన్ను చూస్తూంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది” అన్నాడు హాస్పిటల్ సూపర్నెండెంట్.  “విదేశీ గూఢచార్లని హింసించే లెవల్లో నిన్ను బాధలు పెట్టాం.  అయినా నిన్ను మానసికంగా ‘బ్రేక్’ చేయలేకపోయాం, నీతో నిజం చెప్పించలేకపోయాం! నీకు నిజంగా పిచ్చెక్కి వుంటే మా షాక్స్‌కి అది వదిలిపోయి వుండాలి.  నీవుగానీ నాటకం ఆడుతూ వుండి వుంటే ఈపాటికి నిజం చెప్పేసి వుండాలి. రెండూ జరగలేదు. ఎందుకో మాకు అర్థంకావటంలేదు!”

“కారణం నేను నిజంగా చైతన్యని కాబట్టి” అన్నాడతను. “ఒకసారి నేను నమ్మిన విషయాన్ని బ్రహ్మరుద్రులు వచ్చినా మార్చలేరు.  శరీరాన్ని అదుపులో వుంచుకోకపోతే నటుడు ప్రేక్షకుల్ని అలరించలేడు. మనసుని కంట్రోల్‌లో వుంచుకోలేక పోతే నటుడిగా రాణించలేడు. శరీరమూ మనసూ చెప్పినట్టు వుండకపోతే ఫీల్డులో నెంబర్ వన్ అవలేడు.”

“నువ్వు సెక్రట్రియేట్‌లో గుమాస్తాగా కన్నా, యుద్ధంలో కమేండర్‌గా బాగా పనిచేస్తావు. శత్రువుల చేతికి చిక్కినా, నీ నుంచి ఒక్క రహస్యం బయటికి పొక్కదు.”

వీరి సంభాషణ జరుగుతూ వుండగా ఆమె వచ్చింది.  అదే వెలుగు. గదంతా ఒక మెరుపు తీగె నిండినట్టు.

ఆమె… అక్షౌహిణి. లోపలికి వచ్చి “సర్, గాంధీనగర్ ఏరియా ఇన్‌స్పెక్టరు వచ్చారు” అంది.

అతని బాధంతా ఒక్కసారిగా ఎవరో చేత్తో తీసేసినట్టు పోయింది.  గాంధీనగర్ అంటే తన ఏరియా. తన ఇల్లు వుండే ప్రదేశం. ఒక హీరో ఇల్లు వుండే ప్రదేశపు  ఇన్‌స్పెక్టర్‌కీ- అతనికీ చాల దగ్గిర సంబంధాలుంటాయి.  అభిమానుల్ని కంట్రోల్ చేసే విషయంలోనూ, లా అండ్ ఆర్డర్ విషయంలోనూ పోలీస్ అవసరం చాలా వుంటుంది.

అతడు ఆత్రంగా చూస్తూ వుండగా ఇన్‌స్పెక్టర్ లోపలికి వచ్చాడు. “గుడ్‌మార్నింగ్ డాక్టర్!” అన్నాడు.

“ఇదిగో ఇతనే ‘చైతన్య’నని చెప్పుకునే సుబ్బారావు” అన్నాడు డాక్టర్.

అప్పటివరకూ మౌనంగా వున్న ‘అతను’  కదిలి, “వెంకట్రావ్ ఏమయ్యాడు” అన్నాడు.

“వెంకట్రావ్ నీకు తెలుసా?” ఇన్‌స్పెక్టర్ తిరుగుప్రశ్న వేశాడు.

“వెంకట్రావ్, గాంధీనగర్ ఏరియా ఇన్‌స్పెక్టర్. చైతన్య అభిమాని ఎన్నిసార్లు డబ్బిచ్చినా పుచ్చుకునేవాడు కాదు. చైతన్యకి ప్రొటెక్షన్ ఇవ్వటం తన అదృష్టంగా భావించేవాడు.”

“వెంకట్రావుకి ట్రాన్స్‌ఫరయింది.  అతని స్ధానంలోకి నేనొచ్చాను” ఇన్‌స్పెక్టర్ సమాధానమిచ్చాడు.

“ఆయన్నొకసారి రమ్మనండి. ఈ మిస్టరీ విడిపోతుంది.”

“అవసరం లేదు. నేనే నిన్ను చైతన్య ఇంటికి తీసుకువెళతాను.” అతడికి రిలీఫ్‌గా అనిపించింది. ముందు తన తల్లిని చూడాలి. సుబ్బరాజు తనతో అలా ఎందుకు మాట్లాడాడో కనుక్కోవాలి. అతడు లేచి, “థాంక్స్, వెంటనే వెళదాం పదండి” అన్నాడు.

“నే నొప్పుకోను” అన్నాడు డాక్టరు. అతడు చప్పున డాక్టర్‌వైపు చూసి “ఏం?” అన్నాడు.

డాక్టర్ అతడి ప్రశ్నని పట్టించుకోకుండా ఇన్‌స్పెక్టర్‌వైపు తిరిగి, “ఇతను మా పేషెంట్. మా అనుమతి లేకుండా తీసుకువెళ్ళడానికి వీల్లేదు” అన్నాడు.

“ఇతను మీ పేషెంట్ కాదు. ఒక క్రిమినల్, పిచ్చివాడిలా నటిస్తున్నాడు. ఇతనిమీద కేసు వుంది.  ఆ కేసు ఇన్వ్‌స్టిగేట్ చేసే బాధ్యత మా డిపార్ట్‌మెంటుది.  చైతన్య ఇంటికి ఇతడిని తీసుకెళ్ళి, ఇతడి రియాక్షన్ గమనించటం మా ఎంక్వయిరీలో ఒక భాగం. దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా?”

డాక్టర్ మరేమీ మాట్లాడలేకపోయాడు.

అతనయితే అసలు ఈ సంభాషణే వినడంలేదు. ఎప్పుడు వెళదామా అని మనసు తహతహలాడుతోంది.

అందరూ లేచారు.

అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న ఆమె, “సర్! నేనూ వీళ్ళతో వెళతాను” అంది. అందరూ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశారు.

“చైతన్యగారిని ఈయన చూసినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక ఏమైనా రియాక్షన్స్ వస్తే, పక్కన నర్సుగా నేనుండటం మంచిదనుకుంటాను.

అతడామె వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు. తన గురించి ఆలోచించేందుకు ఎవరో ఒకరు వుండటం ఎంతో సంతోషంగా అనిపించింది. తను చైతన్య అవనీ, సుబ్బారావు అవనీ- అది వేరే సంగతి.

“థాంక్స్” అన్నాడు ఆమెకి మాత్రమే వినిపించేటట్టు. ఆమె నవ్వి వూరుకుంది. ఇంద్రధనస్సు మీద తెల్లమేఘం బంగారుపుటంచు అద్దినట్టు ఆ నవ్వు. ఎందరు స్త్రీలతో సాన్నిహిత్యం వున్నా, ఈ పరిమళాన్ని అతడు అంతకుముందు అనుభవించలేదు.

రెండు నిమిషాల తర్వాత గమనించాడు అతడు జీపు గాంధీనగరం వైపు వెళ్ళటం లేదని.

“ఇటెక్కడికి?” అని అడిగాడు. ఎవరూ సమధానం చెప్పలేదు. జీపు ఒక పాత గోడౌన్‌లోకి వెళ్ళి ఆగింది. “దిగు సుబ్బారావ్” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

“ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను?”

ఇన్‌స్పెక్టర్ నవ్వుతూ కేప్ తీసేశాడు. పోలీసులు కూడా అదేపని చేశారు. మరో ఇద్దరు గూండాలు లోపల్నుంచి వచ్చి వారితో చేరారు.

“మా మనిషిని అంజిగాడి కిళ్ళికొట్టు దగ్గిర చంపావు.  పోలీసులూ, కేసులూ, వీటిమీద మాకు నమ్మకం లేదు సుబ్బారావ్! కత్తికి కత్తి – ప్రాణానికి ప్రాణం, అదే మా రూలు. ఎవడో నీ మీద కేసు పెట్టడం-కోర్టులో శిక్షపడటం-అంతవరకూ మేం వూరుకోలేం. ఊరుకుంటే మావాడి ఆత్మ శాంతించదు” అంటూ కత్తి తీశాడు.

అతడింకా అయోమయం నుంచి తేరుకోలేదు. ఆ అయోమయం, పోలీసుల వేషంలో వచ్చిన రౌడీల్ని చూసి కాదు. కిళ్ళీకొట్టు దగ్గిర చనిపోయిన మనిషి గురించి.

“మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థంకావటంలేదు. అదంతా షూటింగ్‌లో ఒక భాగం”.

అతడి మాటలు వినిపించుకోకుండా ముందుకొచ్చాడు రౌడీ. ఆమె కెవ్వున అరిచింది.  అతడు ఆగి, “ఒహో నువ్వూ వున్నావు కదూ” అని నవ్వేడు. పక్కనున్న ఇద్దరు గూండాలు వచ్చి ఆమెను పట్టుకోబోయారు. తన ముందున్న కత్తిని పట్టించుకోకుండా అతడు ముందుకు కదిలాడు. ఒకటే దెబ్బ. ఆమెని లాగబోతున్న ఒక గూండా మొహం ఆ దెబ్బకి పచ్చడయింది. రెండో గూండా గాలిలో ఎగిరి అతడిని తన్న బోయాడు.

తను చైతన్యా? సుబ్బారావా?

డాక్టర్ అన్నట్టు ఇదంతా భ్రాంతా?

తను చైతన్యే అయితే డూప్ లేకుండా ఇలాంటి ఫైట్స్ చేయగలడు. తను సుబ్బారావే అయితే భయపడి లొంగిపోతాడు.  “కమాన్ చైతన్యా – కమాన్. ఇది నీకో లెక్కకాదు” అంటూ అతడు తనని తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నాడు.

తన మీదకి వస్తున్న కాలుని అతను అలాగే గాలిలోకి పైకి ఎత్తి మెలిక తిప్పాడు. అక్కడినుంచి క్రిందపడ్డ రౌడీచేసిన ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. ఆమె అతనివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.  అతనేదో అనబోతూంటే వెనుక ఎవరో కదిలినట్టయింది.  అతడు చప్పున ముదుకు వంగి, వెనుకనుంచి వస్తున్న రౌడీని అలాగే లాగి, మెడమీద కొట్టాడు. ఆమె బయటకు పరుగెత్తింది.

అక్కడొక అయిదు నిమిషాలపాటు భయంకరమయిన పోరాటం జరిగింది.  బ్రతుక్కీ చావుకీ మధ్య పోరాటం, బ్రతుకే గెలిచింది.  అతడు వాళ్ళని కొట్టి పడెయ్యబోతుంటే బయట వ్యాన్ చప్పుడు వినిపించింది.  ఆమె ఆందోళనగా లోపలికి పరిగెత్తుకు వచ్చింది. వెనుకే హాస్పిటల్ స్టాఫ్.

తిరిగి ఆ నరకకూపానికి వెళ్ళాలి అనుకోగానే అతడు నిజంగా పిచ్చివాడయ్యాడు. చెల్లాచెదురుగా పడివున్న శరీరాల మధ్య నుంచి అదే వూపులో బయటకు పరుగెత్తబోయాడు, ఎవరు పట్టుకున్నారో తెలీదు. ఎవరు గుచ్చారో తెలీదు. ఇంజక్షన్ సూది అతడి శరీరంలో ప్రవేశించింది.

 

*                 *               *                    *

 

 

ఆతడికి నెమ్మదిగా స్పృహ వచ్చింది.

ఇదంతా కలా? నిజంగా జరుగుతూ వుందా? ఏమి అర్థంకావడంలేదు. అతను రెండుగా విడిపోయాడు.

ఒకటి సుబ్బారావు భార్యా, పిల్లవాడు. తను సెక్రటేరియట్‌లో పని చేస్తున్నాడు. కిళ్ళీకొట్టు దగ్గ్గర గొడవైతే ఒక రౌడీని కొట్టాడు. తనకి తలమీద దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆ రౌడీ మరణించేసరికి పోలీసులు తనమీద కేసు పెట్టారు. ఆ రౌడీ తాలూకు మనుషులు వేషాలేసుకొచ్చి తన ప్రాణం తీద్దామనుకున్నారు. ఇదొక కథ.

తను చైతన్య. ఆంధ్రుల అభిమాన నటుడు. షూటింగ్‌లో ప్రమాదవశాత్తు దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేర్చారు. “నేను చైతన్యని”  అన్నా ఎవరూ ఒప్పుకోవటంలేదు, ఇది రెండో కథ.

ఈ రెండు కథలూ చెపితే- అందరూ మొదటిదానికే ఓటు వేస్తారు. ఇంతమంది చెపుతున్నా, న్యూస్ పేపర్ చూపిస్తున్నా, అది తన ఫోటో కాకపోయినా- ఇంకా తను చైతన్యననటం… నిజంగా తనకి మతిభ్రమించిందా? తన భార్యని గుర్తుపట్టలేకపోతున్నాడా?

ఓ.కే.!

తను నిజంగా సుబ్బారావే అయితే-ఆ రౌడీని చంపినందుకు ఆనందంగా శిక్ష అనుభవిస్తాడు కానీ దానికన్నా ముందు తనొక సారి చైతన్యని కలవాలి. తనని అంత ఫారనాయిడ్‌ని చేసిన చైతన్య ఎవరో ఒకసారి చూడాలి. డాక్టర్ చెప్పినట్లు, చైతన్యని చూసిన ఉద్వేగంలో తనకి తిరిగి గతం గుర్తుకు రావచ్చు.

అతడు దినపత్రికవైపు చూశాడు.

“అతడే ఆమె సైన్యం”.

క్రింద చైతన్య ఫోటో-

చాల మామూలుగా వున్నాడు ఫోటోలో.  సిగరెట్ కంపెనీకి మోడలింగ్ చేసే వ్యక్తిలా వున్నాడు. ఇతడేనా చైతన్య? ఇతడేనా అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమాన నటుడు? ఇతడికీ తనకీ పొలికలు లేనేలేవు. అతడి తల్లిని చూస్తే బావుండును.

అతడు ఆలోచనల్లో వుండగానే ఆమె లోపలికి వచ్చింది-భొజనం ట్రేతో! అదే నవ్వు. హంస రెక్క విరుచుకున్నట్టు.

“మీరు సినిమాలు చూడరా?” ఆమె భోజనం పెడుతుంటే అడిగాడు.

“చూస్తాను” మెల్లిగా అంది.

“నాకీ షాక్ ట్రీట్‌మెంట్, ఇంజెక్షన్‌లూ వద్దు! మీరు చెపితే నమ్ముతాను చెప్పండి. నేను చైతన్యనా? సుబ్బారావ్‌నా?

ఆమె సమధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. తరువాత వచ్చి టాబ్లెట్లు యిచ్చి వెళ్ళింది.  టాబ్లెట్ వేసుకుని కాగితం పారేయబోతూ ఆగాడు. దానిమీద చిన్న అక్షరాల్తో వుంది. “మీరు చైతన్యే, ఈ రాత్రి పన్నెండింటికి మీరు పారిపోవటానికి ఏర్పాటు చేస్తాను. సిద్ధంగా వుండండి- అక్షౌహిణి.”

ఆ ఉత్తరం అతడి చేతిలో వణికింది! కోటి చేతులు ఒక్కసారిగా సితారులు మీటిన భావం!

ఒక అయోమయం స్థితినుంచి బయటపడ్డట్టు వుంది. తనని ఇంతకాలం ఎందుకు సుబ్బారావని భ్రమింపచేశారో, కారణాలు వెతికే ఓపిక కూడా లేదు. ఆమెని కలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరసాగింది. అయితే ఆమె కనపడలేదు.

టైం ఎంత నెమ్మదిగా కదుల్తుందో అతడికి మొదటిసారి తెలిసింది.  షూటింగ్‌ల్లో అయితేనేం, ఇంటిలో అయితేనేం – అతడికి టైం చూసుకునే అవసరం (అవకాశం) వుండేది కాదు. అతిథులు, అభిమానులు ఎప్పుడూ చుట్టూచేరి, అతడి సమయాన్ని తినేస్తూ వుండేవారు.

క్రమంగా చీకటి పడింది.

ఆమె కనపడలేదు.

అతడికి అనుమానం వచ్చింది.  ఇదికూడా ఈ నాటకంలో ఒక భాగమేమో అని!

ఆస్పత్రి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.

పదిన్నర.. పదకొండు.. పదకొండున్నర.

అయిదు నిమిషాల తక్కువ పన్నెండు.

తన మనసుని స్వాధీనంలో వుంచుకోవటానికి అతడు ప్రయత్నించసాగాడు. తను మొట్టమొదటిసారి కెమేరాముందు నిలబడటం గుర్తొచ్చింది.  స్టార్ట్.. సౌండ్… క్లాప్… యాక్షన్… తడబాటు… ఓ.కే…

పన్నెండు గంటలకు ఒక్క నిమిషం తక్కువగా వుందనగా తలుపు తెరుచుకుంది.  ఆమె లోపలికి వచ్చింది  అతడు చప్పున ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏదో అనబోతూ వుంటే ఆమె “…ష్” అని సైగ చేసింది.  ఇద్దరూ నిశ్శబ్దంగా బయటకు కదిలారు.

వరండా చివర్లో ఒక నర్సు కునికిపాట్లు పడుతూంది. తన అడుగుల చప్పుడే తనకి డ్రమ్‌బీట్స్‌లా వినపడుతున్నట్టు అనిపించింది.  నర్సుని దాటుకుని మెట్ల దగ్గరికి వచ్చారు ఇద్దరూ. అక్కడికి చలిగాలి రివ్వున వీస్తూంది.

క్రిందికి మెట్లు దిగారు. అద్దాల అవతల చీకటి ఆ నిశ్శబ్దానికి తోడై ఎంతటి ధైర్యవంతుడినైనా భయపెడుతూంది. దానికి తోడు చలిగాలి.

బిల్డింగ్‌కి వంద గజాల దూరంలో ఎత్తయిన ప్రహరీగోడ వుంది. గేటు దగ్గర సెంట్రీలు యిద్దరున్నారు. ఆ ఆవరణ అంతా వెలుతురు నిండి వుంది.  అతడి దృష్టి సెంట్రీల పక్కనున్న కుక్కలమీద పడింది.

అంతకు ముందురోజే అతడు వాటిని చూశాడు. కానీ అవి ఎందుకో అర్థంకాలేదు.

ఆమె అది గమనించి అంది- “ఆస్పత్రిలో కొందరు ప్రమాదకరమైన పేషెంట్లు వున్నారు. వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళితే, మర్డర్లు, మరిన్ని నేరాలు చెయ్యవచ్చ్చు. అందుకని ఇంత జాగ్రత్తగా కాపలా” అర్థమైనట్టు అతడు తలూపి మరింత నిశితంగా చూశాడు.

ఆమె అన్నది- “నేనూ మీతో రావల్సి వుంటుంది. సాయంత్రం డ్యూటీ అయిపోయాక నేనిక్కడే వుండిపొయాను. నేను వుండిపోయినట్టు ఎవరికీ తెలీధు.”

“థాంక్స్!”

సెంట్రీలు ప్రతీ అయిదు నిమిషాలకీ చెరోపక్కకీ వెళ్ళి రావటం అతను గమనించాడు. తిరిగి రావటానికి మరో అయిదు నిముషాలు పడుతుంది.  కానీ ఆ టైంలో కుక్కలు అక్కడ కాపలా కాస్తునాయి.

అతడు రెండు నిముషాల ఆగి, సెంట్రీలు దూరంగా వెళ్ళగానే చేతిలో బ్రెడ్ కుక్కల దగ్గరికి విసిరాడు. చీకట్లోంచి వచ్చిపడిన రొట్టెముక్కల్ని ఆత్రంగా తిని – నెమ్మదిగా నడుము వాల్చాయి అవి.

“ఏమిటిది? ఎలా జరిగింది?” అని అడిగింది ఆమె.

“ఇలాంటి అవసరం ఏదో వస్తుందని తెలుసు. సాయంత్రం మీనుంచి ఉత్తరం అందేక, రొట్టె తినకుండా దాచి వుంచాను” అన్నాడు.

“కానీ అవి తిని, ఆ కుక్కలు మత్తు లోకి ఎలా జారుకున్నాయి?”

“పెథిడ్రిన్ ఇంజెక్షన్ బాటిల్ కాజేసి దాచేసి వుంచాను. ఆ బ్రెడ్‌లో అది కలిపాను.”

ఆమె కళ్ళు విప్పారితం చేసి అతనివైపు చూసింది. “ఇంత దూరదృష్టి మామూలు మనుష్యులకు వుండదు. మీరు సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోయే”

అతనికి పొగడ్తలు అంతగా నచ్చవు. తన చుట్టూ వున్న జనం నోట ఆ పొగడ్తలు వినీ వినీ విసుగెత్తి వున్నాడు.

“మీ పేరు బావుంది. అక్షౌహిణి. ఎవరు పెట్టరు?” అన్నాడు మాట మారుస్తూ.

“మా నాన్నగారు మిలటరీలో కల్నల్. అక్షౌహిణి అంటే సైన్యం. అందుకే ఆ పేరు పెట్టారు.”

అతడు ఆశ్యర్యంగా “కల్నల్ కూతురైయుండి నర్సుగా చేస్తున్నారా?” అన్నాడు.

“ఏం తప్పేముంది? అదేమీ తక్కువ ఉద్యోగం కాదే.”

“ఐయామ్ సారి! నా ఉద్దేశ్యం అదికాదు”

పడిపోయిన కుక్కల సంగతి చూసుకోకుండా సెంట్రీలు మళ్ళి రౌండ్స్‌కి వెళ్ళారు.

“క్విక్” అన్నాడు అతడు. ఇద్దరూ ద్వారం దగ్గరికి పరుగెత్తారు. గేటు పక్కనే వున్న చెట్టుకొమ్మని పట్టుకుని ఒక్క స్వింగ్‌లో అతడు పైకి చేరుకున్నాడు. అంత టెన్షన్లో కూడా ఆమె ఆ అద్భుత విన్యాసానికి నివ్వెరపోయింది.  గోడమీద గాజుపెంకులున్నాయి. చెప్పులతో నిలబడితే ఫరవాలేదు కాని చెయ్యి ఆనిస్తే కష్టం. ఆమెని వదిలిపెట్టి వెళ్ళటం అతనికి ఇష్టంలేదు. తన కోసం అంత రిస్క్ తీసుకున్న ఆమెకి, తనవల్ల ఉద్యోగం పోవటం సహించలేడు. అతడు గోడ అంచుమీద వంగి, క్రిందకి చేయి సాచేడు. పూర్తిగా పడుకుంటేగానీ ఆమె చెయ్యి అందటం లేదు.

దాంతో అతడి శరీరం అంతా గాజుపెంకులు గుచ్చుకుని రక్తం ప్రవించసాగింది. అక్షౌహిణి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.

“తొందరగా…. చెయ్యి అందివ్వు” అని అరిచాడతడు. ఆమె చెయ్యి అందించింది. ఆమె బరువుకి పెంకులు మరింత లోపలికి వెళ్ళాయి, బాధని అదిమిపెట్టి, పెదాలు బిగపట్టి ఆమెని పైకి లాగసాగాడు! చివరివరకూ వచ్చాక ఆమె చెయ్యి గోడ చివరి అంచు పెంకుమీద ఆని, ఆమె బాధతో కెవ్వున అరిచింది.  అతడు వారించబోయే లోపులోనే ఆ కేక గాలిలో కలిసిపోయింది.  సెంట్రీలు పరుగెత్తుకు రాసాగారు.

అతడు రెండు చేతులతోనూ ఆమె భుజాలు పట్టుకుని పైకి లాగటానికి ప్రయత్నం చేయసాగాడు. సెంట్రీ విజిల్ వూదాడు. ఆమె అతడితో పాటూ పైకి రావటానికి ప్రయత్నం చేస్తోంది.

“ఆగండి-స్టాప్‌దేర్” రెండో సెంట్రీ అరుస్తున్నాడు.

ఈ అవకాశం పోతే మరి రాదని అతడికి తెలుసు. తన గాయాన్ని కూడా లెక్కచేయటం లేదతడు. అతడి గాయాలనుంచి  ప్రవిస్తూన్న రక్తం ఆమె మీద బొట్లు బొట్లుగా పడుతూంది.

హెచ్చరికగా సెంట్రీ గాలిలోకి రైఫిల్ పేల్చాడు. అక్కడి నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరింది.  ఆస్పత్రి ఆవరణలో వున్న చెట్లమీద విశ్రాంతి తీసుకుంటున్న పక్షులన్నీ ఆ అర్థరాత్రి శబ్దానికి ఒక్కసారిగా రెక్కలు టపటప కొట్టుకుంటూ పైకి లేచాయి.

గోడమీద కాలుపెట్టి ఒక్క అంగలో పైకి రావచ్చు కానీ భయంవల్లా టెన్షన్‌వల్లా ఆ పని చేయలేక పోతూంది. ఆమెని వదిలి అతడు వెళ్ళిపోవచ్చు కానీ కృతజ్ఞత భావంవల్ల అతడా పని చేయలేకపోతున్నాడు.

అదే ఆ ఇద్దరి పాలిట శాపంలా పరిణమించింది.

ఒక రైఫిల్ బుల్లెట్ అతని పక్కనుంచి దూసుకుపోయింది. అంత పరిణామాన్ని అతడు వూహించలేదు. ఒక పిచ్చాసుపత్రి నుంచి పేషెంట్ పారిపోతుంటే అతడిని పట్టుకోవటానికి అలా రైఫిల్స్ పేల్చనవసరం లేదు, గేటు బైటికొచ్చి గోడ ఇవతల్నించి పట్టుకోవచ్చు. అతడు రెండు చేతులతో ఆమెని పట్టుకుని పైకి లాగుతూండగా అప్పుడు వినిపించింది.  రెండో బుల్లెట్ శబ్దం. దానితోపాటు ఆమె ఆర్తనాదం.

సెంట్రీ రైఫిల్ నుంచి వెలుపడిన బుల్లెట్ ఆమె వెన్నులోంచి దూసుకుపోయింది. క్షణాల్లో ఆమె శరీరం తోటకూర కాడలా వాడిపోయింది.  నేలమీద కుప్పగా కూలిపోయింది. అతడామె తలని వళ్ళోకి తీసుకున్నాడు. ఆమె ఏదో చెప్పబోయింది.  నోటినుంచి మాట రాలేదు.

అమె తల పక్కకి వాలిపోయింది.

అతడింకా దిగ్ర్భమనుంచి కోలుకోలేదు. జరుగుతున్నదంతా కలో నిజమో తెలియటం లేదు. క్షణం క్రితం వరకూ తన ముందు సజీవ ప్రతిమలా తిరుగుతూ, తన కళ్ళల్లో మెరుపుల్ని పండించిన ఓ అద్భుత సౌందర్యరాశి రెప్పపాటు కాలంలో నిర్జీవంగా మారటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అతడా అచేతనామయవస్థలో వుండగానే తన మొహంమీద ఏదో ద్రవం చల్లబడినట్లు అనిపించింది. జూలో జంతువులు బోనులో నుంచి పొరపాటున బయటకొస్తే వాటిని వెంటనే మత్తులోకి పంపే ద్రవం అది.

 

3

 

ఏటవాలుగా ఒక సూర్యకిరణం మొహం మీద చురుక్కుమని పడటంతో అతడికి మెలకువ వచ్చింది.

కళ్ళు విప్పి చుట్టూ చూశాడు. అదే హాస్పిటల్ రూమ్.

అతడికి మెలకువ రావటం చూసి, వరండా లోంచి వెళుతూన్న డాక్టర్ లోపలికి వచ్చాడు. “గుడ్‌మార్నింగ్ సుబ్బారావ్.”

“నేను సుబ్బారావ్‌ని అవనీ,  చైతన్యని అవనీ నా మూలంగా ఒక అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది. దానికి నేను శిక్షార్హుణ్ణి” అన్నాడు.

“నీ మూలంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఏమిటి?”

“నిన్న రాత్రి జరిగిన సంఘటన-”

“ఏం జరిగింది సుబ్బారావ్?”

ఏం జరిగిందో ఆ డాక్టర్‌కి తెలిసి వుండకపోవచ్చు. అతడు జరిగినదంతా చెప్పేడు.. డాక్టర్ మొహంలో రంగులు మారాయి. “మైగాడ్” అని గొణుక్కున్నాడు అంతలో ఆ గదిలోకి సూపర్నెండెంట్ వచ్చాడు. డాక్టర్ ఆయన్ని దూరంగా తీసుకువెళ్ళాడు.

“నిన్నరాత్రి నుంచి పేషెంట్‌కి హెలూసినేషన్ (భ్రాంతి) స్టార్ట్ అయినట్టు అనుమానం సార్.”

“పారనాయిడ్ ప్రవర్తనకి తోడు హెలూసినేషన్ కూడానా – ఐ పిటీ హిమ్.”

ఎంత తక్కువ గొంతులో మాట్లాడుకున్నా ఆ మాటాలు అతని చెవిన పడ్డాయి. గాలిలా వాళ్ళ మధ్యకు వెళ్ళి “మీరేమనుకుంటున్నారో నాకు అర్థంకావటంలేదు. నిన్నరాత్రి నేనీ ఆస్పత్రి నుంచి పారిపోవాలనుకున్నాను. ఒకామె నాకు సాయం చేయటానికి సిద్ధపడింది. ఆ ప్రయత్నంలో ఆమె సెంట్రీల రైఫిల్ గుళ్ళకి బలి అయింది” అన్నాడు.

“సెంట్రీల గుళ్ళకా?” ఆశ్చర్యంగా అడిగాడు సూపర్నెండెంట్.

“అవును. ఆ విషయం మీకింతవరకూ తెలియకపోవటం ఆశ్చర్యకరం.”

“మీకు కలవచ్చి వుంటుంది సుబ్బారావ్.”

అతన్ని లాగిపెట్టి కొట్టాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాడు అతడు. “కలకాదు. నిజం. మీ సెంట్రీలని ఎంక్వయిరీ చేయండి.”

“అక్కర్లేదు. ఇది ఆర్మీ క్యాంప్ కాదు. పిచ్చాసుపత్రి.  పారిపోయే రోగుల్ని కాల్చడానికి ఇక్కడ సెంట్రీలు, వాళ్ళ దగ్గిర రైఫిల్సూ వుండవు.”

అతడు షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. “ఇతడిని జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. చాలా విచిత్రమయిన కేసు” అని పాల్ అంటూ వుండటం దూరం నుంచి వినిపించింది.

 

*                                  *                                  *

 

అతడు ఆ ఒంటరి గదిలో రెండు గంటలు నరకం అనుభవించాడు.

ఆమె రూపం అతడి కళ్ళముందు నుంచి తొలగిపోవటం లేదు. తనని బయటకు పంపే ఆమె ప్రయత్నం, చెయ్యి అందిస్తూ వుండగా ఆమె వెన్నులో బుల్లెట్స్ గుచ్చుకోవటం, ఆమె తన వైపు చూసిన ఆఖరి చూపు అతడికి కదిలించి వేస్తున్నాయి. అందరికన్నా అతీతమైనదేదో వుంది ఆమెలో. ఒక రకమైన గ్రేస్ అది. బహుశా కల్నల్ కూతురవటం వల్ల వచ్చిందేమో అది. అందుకేనేమో యుద్ధంలో సైనికుడిలా మరణించింది-ఆఖరి చిరునవ్వుతో.

మనసంతా చీకటి కమ్మినట్టు ఒక ఆర్థ్రభావం.

అతడు కవికాదు. కానీ ఒక నిజమైన అభిమానాన్ని మాటల్లో వ్యక్తీకరించటానికి కవిత్వం అవసరంలేదు. జ్ఞాపకం వచ్చే పెదవి నవ్వు ఆనందభైరవి అయితే, జ్ఞాపకం మిగిల్చే కంటిచుక్క శివరంజని…! కాలం కడగలేని ఒకే ఒక వస్తువు – జ్ఞాపకం. ఆమెతో అతడి పరిచయం కొన్ని గంటలు మాత్రమే. పేరే గమ్మత్తయినది “అక్షౌహిణీ”.

పైకి లాగటం కోసం తనామెకి చెయ్యి అందిస్తూంటే కనీసం తననైనా ప్రాణాలు దక్కించుకొమ్మన్ని అర్థిస్తూ ఆమె చూసిన చూపు అతడిని వేదనాపూరితుడిని చేస్తోంది. ఆ గదిలో ఒంటరితనం ఆవేదనకి మరింత సాంద్రత కలిగిస్తోంది. అతడికి కవిత్వం రాదు.

ఏ కవి అన్నాడు?

–          స్వప్న సంగీతాలు నేను గానవిస్తూంటే నీ చుట్టూ వున్న సౌండ్ ప్రూఫ్ నిశ్శబ్దాని కెంత నిర్దయ? ఈ నిశ్శబ్ద హిమసుమం కోసం ఇవ్వాళ ఉదయించని నిన్నటి సూర్యుడా! నిన్ను ప్రేమించిన నేరానికి, నువ్వు మిగిల్చిన సంధ్య రక్తాన్ని నీ గుర్తుగా చీకటి పాదాలకి పూస్తోంది ఈ ప్రపంచం.

ఆత్మహత్యించుకుంటున్న నిన్నటి స్వప్నాల డెడ్‌బాడీస్ మీద నుంచి చెయ్యిపట్టి లాక్కెళుతున్నాడు నేటి సూర్యుడు.

ఎన్ని ఓదార్పుల శస్త్రచకిత్సలు కావాలో – చీలిన నా హృదయాన్ని అతకటానికి.

రాత్రి పత్రంమీద వెన్నెల కిరణాల కలంతోనే రాసిన మౌనాక్షారాల నక్షత్రాలు, ప్రత్యూషంలో హిమబిందువులై, అపరాహ్ణంలో దాహార్తితో అరిచే పక్షుల దీనరవాలై, సాయం సంధ్య మసకల్లో చీకట్లుగా కలిసిపోతున్నాయి.

కేవలం ఉదయపు వాస్తవ విషాదాన్ని దర్శించటం  కోసం, నిన్ను తల్చుకుంటూ, రాత్రి అంచుల మీద ప్రయాణిస్తాను.

పరిచయం కానంతకాలం నిన్ను పోగొట్టుకున్నాను. పరిచయం ఆయాక నన్ను పోగొట్టుకున్నాను.

నా నిస్తేజపు కళ్ళనుంచి నీ అద్భుత సౌందర్యానికి చేసిన వంతెన మీద నడిచే నిర్దయ సైనికులు నా చుట్టూ వున్నవారు.

ఒక శరద్రాత్రి, ఏటవాలు క్షణాలమీద నిటారుగా నిలబడి, వెన్నెల తీవెల్ని మీటగల అనుభవాన్ని ఇచ్చేదే ప్రేమ. కనురెప్పల మైదానాల మీద కలల వితనాలు జల్లి, అనుభూతుల పంట పండించేదే ప్రేమ. కొబ్బరితాడు చేదా, తియ్యటి నీళ్ళు, మిద్దెలో వుంచిన మామిడి పళ్ళ వాసనా, తాటాకులమీద తొలకరి జల్లుల చప్పుడు కలిస్తే ప్రేమ, మనసుకు మాట్లాడే అనుమతి ఇచ్చేది ప్రేమ. నీ అద్భుతంలో, నీ అనంతంలో, నీ అద్వితీయంలో  సర్వస్వం విలీనమవ్వటం ప్రేమ.

కార్తీకమాసపు చిరుచలి రాత్రంతా కుప్పగా పోసే వెన్నల నీవైతే, ఆకాశం అంచున సూర్యుడు వెళ్ళిపోతూ వ్రాసే కవితాపంక్తి నీ స్నేహమైతే,

నిన్నే నిన్నే తలుచుకుని

నిద్దుర పొద్దులు మేలుకుని

వేచాను నువ్వొస్తావని

నువ్వొస్తే ప్రాణం వొస్తుందని.”

 

*                                              *                                              *

ఏదో శబ్దమవటంతో అతడు తన స్వాప్నికావస్థనుంచి తేరుకున్నాడు. వరండాలో ఇద్దరు డాక్టర్లు వెళుతున్నారు.

అప్పుడే వచ్చింది అతడికో ఆలోచన.

టేబుల్ పక్కనున్న నీళ్ళసీసా భళ్ళున బ్రద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి డాక్టర్లు వెనుదిరిగారు.

అతడు గాలిలా దూసుకువెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఏం జరుగుతూ వుందో తెలుసుకునే లోపులోనే ఒక డాక్టర్ మెడమీద ఆ సీసా అంచుని కత్తిలా ఆంచి, అతడిని పట్టుకుని తన గదిలోకి లాక్కొచ్చాడు.

ఈ దృశ్యం చూసి సిబ్బంది పరుగెత్తుకు రాసాగారు.

“ఖబడ్దార్! ఎవరైనా నా గదిలోకి రావటానికి ప్రయత్నిస్తే ఈ డాక్టర్ ప్రాణాలు పోతాయి. అంతేకాదు! అక్షౌహిణి శవాన్ని మీరేం చేశారు? ఆ విషయం అయిదు నిమిషాల్లో పోలీసుల్ని పిలిపించి మీరు చెప్పాలి. లేకపోయినా ఈ డాక్టర్ ప్రాణాలు మిగలవు.”

అతడి చేతుల మధ్య డాక్టర్ వణికిపోతున్నాడు.

అంతలో అక్కడికి సూపర్నిండెంట్ పరుగెత్తుకు వచ్చాడు.

“వదులు సుబ్బారావ్! మా డాక్టర్ని వదిలెయ్యి.”

“వదల్ను. ఆమెని చంపిన సెంట్రీల సంగతి తేల్చండి ముందు.”

“ఆమె ఎవరు?”

“అక్షౌహిణి”.

“అంటే?”

“అదికూడా మీకు తెలిదా? ఆమె మీ ఆస్పత్రిలో పనిచేసే నర్సు.

“మెదడుకి తార్కికంగా ఆలోచించడం నేర్పు సుబ్బారావ్. అక్షౌహిణి అనే పేరు ఎవరికయినా వుంటుందా?”

అతను కాస్త షాక్ తిన్నాడు.  అయినా తమాయించుకున్నాడు. “నేను చెప్పేది మధ్యాహ్నం నాకు మందిచ్చిన నర్సు గురించి.”

డాక్టర్లు మొహమొహలు చూసుకున్నారు. “నువ్వు చెప్పేది ప్రనూష గురించా?”

“ప్రనూష ఎవరు?”

“ఎవరైతేనేం? చంపేసేరుగా?”

“ప్రనూష చనిపోవటం ఏమిటి? అదిగో-”

ఒక చలనచిత్రం స్లోమోషన్‌లో కదిలినట్టు అతడు తల తిప్పి చూశాడు.  కిటికీ ఊచల్ని పట్టుకొని తనవైపే భయం భయంగా, దిగులుగా చూస్తున్న ‘ఆమె’ కనపడింది. అతడికెంత షాక్ అంటే- అచేతనావస్థలో చేతిలో సీసా వదిలేశాడు.

అయితే అతడిని ఎవరూ పట్టుకోవడానికి రాలేదు. అతడి చేతుల్లో అప్పటివరకూ బందీగా వున్న డాక్టర్ కూడా అతడివైపు సానుభూతిగా చూస్తూ అక్కడే వుండిపోయాడు.

ఆమె అందమైన కళ్లలో అతడి స్థితిపట్ల ఆర్ద్రతతో కూడిన జాలి.

“అక్షౌహిణి” అన్నాడు అస్పష్టంగా.

“కాదు. ఆ అమాయి పేరు ప్రనూష” అన్నాడు డాక్టర్ పాల్. అందరూ క్రమంగా అక్కడనుంచి వెళ్ళిపోసాగారు.

“ప్రనూష చాలా అందమైనది సుబ్బారావ్! ఇక్కడ చాల మంది డాక్టర్లే మతులు పోగొట్టుకున్నారు. నీ మనస్తత్వం నువ్వు అనలైజ్ చేసుకో, మతిస్థిమితానికి అదే అన్నిటికన్నా పెద్దమందు నువ్వే హీరోవి అన్న భ్రమ నీది. హీరోలా ఆపదలో పడ్డాననుకున్నావు. ప్రనూష నిన్ను రక్షించాలనీ, ఆ ప్రమాదంలో తన ప్రాణాలు పోగొట్టుకోవాలనీ సినిమా కధలా రాత్రంతా ఆలోచించావు. అదే భ్రమ. హెలూసినేషన్. అంతా నిజంగా జరిగినట్లు నీ కనిపించింది. అందుకే భ్రమలోంచి బయటికిరా సుబ్బారావ్.”

డాక్టర్ పాల్ వెళ్తూ వుంటే ఆమె అతడిని అనుసరించింది.

“నాకాయన ఏం పేరు పెట్టారు డాక్టర్?”

“అక్షౌహిణి అట.”

“భలే వుందే… అంటే?”

“సైన్యం అని అర్థం.”

వరండా చివర్లో వాళ్ళ మాటలు మాయమయ్యాయి.

అతడు మాత్రం అలాగే శిలాప్రతిమలా నిలబడివున్నాడు.

వరండాకి ఇటు చివర అతడి భార్య నిలబడి వుంది బిడ్డనెత్తుకుని … కళ్ళనిండా నీళ్ళతో.

అతడు నెమ్మదిగా తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యివేసి, “నన్ను క్షమించు” అన్నాడు.

ఆమె ఆశ్చర్యంగా తలెత్తింది.

“అవును! నాకు ఏది నిజమో, ఏది అబద్ధమో అర్ధంకావడం లేదు. జరిగిన విషయాలన్నీ చూస్తూంటే ఈ డాక్టర్లు చెప్పేవన్నీ నిజమేనేమో అనిపిస్తూంది. అదే నిజమయిన పక్షంలో నా అంత దురదృష్టవంతుడు మరెవరూ వుండరు. నీ పేరుతో సహా, నాకేమీ గుర్తులేదు.”

ఆమె కళ్ళలో నెమ్మదిగా వెలుగొచ్చింది. కళ్ళలో నీళ్ళు అలాగే వుండగా, పెదాలమీద నవ్వు అందంగా కదలాడింది. ఇన్నాళ్ళూ పడ్డ వ్యధ అంతా ఆ క్షణం తొలిగిపోయినట్టు అనిపించింది. మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆనందం ఆమెని మాట్లాడినివ్వలేదు. డాక్టర్ని కలుసుకోవటం కోసం వడివడిగా వెళ్ళింది. ఆమె దూరంగా డాక్టర్‌తో మాట్లాడటం వినిపిస్తూంది. అంతా విని డాక్టర్ అన్నాడు..

“ఇప్పటి వరకూ తన భ్రమలో వున్నాన్నన్న విషయం అతనికి తెలియటం శుభసూచకమే! కానీ ఆ కాస్తా సరిపోదు. అతడికి తన గతం పూర్తిగా గుర్తు రావాలి మొత్తం మీద ఇది మంచి పరిణామమే”

ఆమె అతడికి నమస్కారం చేసి కదిలింది.

ఆమె వెళ్ళిపోయిన తరువాత డాక్టర్ అతని వద్దకు వచ్చాడు.

ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోలేదు. నిశ్శభ్దాన్ని చీలుస్తూ డాక్టరే అన్నాడు.  “మనస్తత్వశాస్త్రం, మానసిక పరిణామం చాల క్లిష్టమైనవి సుబ్బరావ్! నాకీ వైద్యంలో పాతిక సంవత్సరాల అనుభవం వుంది. మనిషి అంత క్లిష్టమైన ప్రవర్తన గల జంతువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నేనుకొన్ని వేలమంది రోగుల్ని ఈ ఆస్పత్రిలో ట్రీట్‌చేసి పంపించాను. కానీ ఇంతకు పదిరెట్లు “పేషెంట్లు” బయటి ప్రపంచంలో వున్నారని నాకు తెలుసు. పైకి నవ్వుతూ కనిపిస్తూ ఇంట్లో రాక్షసులుగా ప్రవర్తించే వాళ్ళూ, కొద్ది ఓటమికే ఆత్మహత్య గురించి ఆలోచించేవాళ్ళూ, తాము నమ్మిందే నిజమని భ్రమించి కొంతకాలానికి అది అవాస్తవికమని తెలిసినా ఆ భ్రమనుంచి బయటపడలేనివాళ్ళూ, బాధల్ని మర్చిపోవటానికి తాగుడిని ఆశ్రయించేవాళ్ళూ – వీళ్ళంతా పిచ్చి వాళ్ళు కాక మరేమిటి? నువ్వు ఆరాధించే నటుడు చైతన్యనే తీసుకో! వసూళ్ళలో అతను పెద్ద అని అందరికీ తెలుసు. అకస్మాత్తుగా మరొక నటుడి పిక్చర్ హిట్ అవుతుంది. తనే ఒక నంబర్‌వన్ అంటాడు. రచయితల్లో కూడా అంతే! ఇదంతా పబ్లిసిటీ కోసమయితే పర్వాలేదు. కానీ ఆ వ్యక్తులు కూడా దీన్ని మనస్పూర్తిగా నమ్ముతారు. చుట్టూ వున్న వాస్తవాల్ని, స్టాటిస్టిక్స్‌ని, తమ పొజిషన్నీ గుర్తుపెట్టుకోరు. ఇలా తమకి ఆనందం ఇచ్చే ఒక అబద్దాన్ని ‘మనస్పూర్తిగా” నమ్మటమే పారనాయిడ్ సైకాలజీ. నువ్వు తొందర్లోనే అందులోంచి బయట పడటం నాకు ఆనందంగా వుంది. నెమ్మదిగా నీ గత జీవితం గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించు. దానికి నీ భార్య సాయం తీసుకో” అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అతడు చాలాసేపు మంచంమీద అలాగే పడుకున్నాడు.

ఎక్కడో ఏదో సంతృప్తి.

…..అతడి కళ్ళముంది తన భార్య కదలాడింది. ప్రనూష గోచరించింది. ప్రనూష గుర్తొచ్చినప్పుడు ఒక అందమైన మెరుపు తీగె కదలాడిన భావం. భార్య గుర్తుకొచ్చినప్పుడు-తప్పు చేస్తున్నానేమో అన్న భావం.

ప్రనూషని చూడగానే తనలో కదలాడిన ప్రేమభావమే-ఆ రాత్రి ఆమెతోసహా పారిపోవటానికి చేసే యత్నంగా కలొచ్చిందా?

కలలో కూడా ఎంత లాజిక్?

అక్షౌహిణి.

సైన్యం.

ఒక స్త్రీకి సహాయపడాలనే కోరిక, పురుషుడిలో అంతర్గతంగా అలాగే వుంటుందికాబోలు. తనే ఆమెకి సైన్యంగా ఈ ఆస్పత్రి నుంచి తప్పించుకోవాలన్న కోరికకి ప్రతిరూపమే ఆ కల అయివుండవచ్చు. ఆమె తనని చైతన్యగా గుర్తించడం, తనలోని (ఆమెచేత) గుర్తింపబడలన్న కోరికకి నిదర్శనం. ఒక సుబ్బారావుగా ఆమె తనని గుర్తించకపోవచ్చు. చైతన్య అదృష్టవంతుడు. ప్రనూషలాంటి ఎంతోమందిచేత గుర్తింపబడుతున్నాడు.

అయినా ఇదంతా తనకి అనవసరం!

తన భార్యకి అన్యాయం  చేయకూడదు.

-అతడు తన భార్యని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. తన కొడుకుని, తన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు. జరిగినదంతా నిజమైతే తన భార్య ఎంత మానసిక క్షోభ అనుభవిస్తూ వుండి వుండాలి. గతం మర్చిపోయిన భర్త కన్నా నరకం ఏముంది?

అసలు తన తల్లిదండ్రులెవరు? తను ఏ కాలేజీలో చదివాడు?

తలుపు దగ్గర అలికిడి అవడంతో అతడు తలతిప్పి చూశాడు. అతడి భార్య గుమ్మం దగ్గర నిలబడి వుంది. చేతిలో బాబు.

అతడు లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. కొడుకుని చేతుల్లోకి తీసుకుని “నన్ను క్షమించు. నిజంగా నాకేమీ గుర్తులేదు” అన్నాడు. కొంచెం ఆగి, “… గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాను” అని మళ్ళీ అన్నాడు.

అతడిలో వచ్చిన ఆ కాస్త మార్పుకే ఆమె కదిలిపోయినట్టు కనిపించింది. ఇన్నాళ్ళ దిగులు, ఒంటరితనం ఏమవుతుందో అన్న భయం ఆమె చుట్టూ స్తబ్దతని పేర్చాయి. ఈ ఓదార్పుకి అది కరిగింది.

అతడి భుజాలమీద తల ఆంచి వెక్కివెక్కి ఏడవటం ప్రారంభించింది. అతడు అనునయంగా ఆమె తల నిమిరాడు.

“నువ్వేమీ అనుకోకపోతే నా గురించి కొద్దిగా చెప్పు. ఏదయినా ఒక పాయింటు దగ్గర నాకు అంతా గుర్తు రావచ్చు. ముందు నీ పేరు చెప్పు.”

“లక్ష్మి”

“బాబు పేరు?”

“చైతన్య”

అతడు వులిక్కిపడ్డాడు. “అవునండీ! మీరు చైతన్యగారి అభిమాని. మన ఇంటినిండా ఆయన ఫోటోలే. బాబుకి కూడా ఆయన పేరు పెట్టారుఔ

“నేను బాగుపడి మన ఇంటికి రాగానే ఆ ఫోటోలన్నీ తీసేద్దాం. అభిమానం వుండటం మంచిదేగానీ, ఫోటోలు  బెడ్‌రూంలో పెట్టుకొనేటంత అవసరం లేదు. నేను ముందు ఈ చైతన్య “అబ్సెషన్” నుంచి బయటపడాలి. దానికి మనం ఏర్పాటు చేసుకోవాలి.”

“మీ ఇష్టం.”

ఆ తరువాత అతడికి అతడిని గురించిన వివరాలు చెప్పింది ఆమె. కిళ్ళీ కొట్టుముందు గొడవ, తలకి దెబ్బ తగలటం వగైరా. ఆమె వెళ్ళిపోయాక అతడు డాక్టర్‌తో మాట్లాడాడు.

“నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు డాక్టర్?”

“ఎందుకు అలా అడుగుతున్నావ్?”

“ఇంటి పరిసరాలు చూస్తే గతం గుర్తొచ్చే సూచనలున్నాయి అని మీరే అన్నారుగా-”

డాక్టర్ తటపటాయించి, “ఇందులో కొద్దిగా యిబ్బంది వుంది సుబ్బరావ్. నీ జబ్బు నయమైంది అన్న సర్టిఫికేట్టు మేమిస్తే-వెంటనే పోలీసులు నిన్ను అరెస్టు చేస్తారు. ఆ ప్రమాదం వుంది.”

“కాని నేను ఆత్మరక్షణ కోసమే ఆ రౌడీని కొట్టాను.”

“ప్రమాదం పోలీసుల్నించి కాదు. చనిఫొయిన రౌడీ తాలూకు మనుష్యులనుంచి.”

“ఆ ప్రమాదం ఎప్పుడూ వుంది” అన్నడు.  “నేనూ జీవితాంతం ఎలాగూ వుండలేనుగా.”

“సరే నీ ఇష్టం”.

ఆ తరువాత అతడు చాలాసేపు స్తబ్ధంగా పక్కమీద పడుకుని వుండిపోయాడు. సముద్ర కెరటాలు ఒడ్డుని కొట్టినట్టు ప్రనూష ఆలొచన్లు మనసుని తాకుతున్నాయి.

అతనికి నిద్రపట్టడం లేదు. మధ్యాహ్నం నిద్ర అతడికి అలవాటు లేదు. దూరంగా ఎక్కడో ఒక పక్షి దాహంతో అరుస్తొంది. అతడు విసుగ్గా పక్కమీద నుంచి లేచాడు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడసాగాడు. ఎండ ఏటవాలుగా పడుతోంది. బిల్డింగ్ చుట్టూ చెట్లు. దూరంగా ప్రహరీగోడ. గోడ అవతల రోడ్డు. పెద్ద రష్ గా లేదు. ఒక సైకిలిస్ట్ నెమ్మదిగా వెళుతున్నాడు. బహుశ ఆస్పత్రి వూరి చివరగా వుండి వుంటుంది. అందుకే అంత నిశ్శబ్ధంగా వుంది.

అతడు తిరిగి పక్క దగ్గరకు రాబోతూ ఆగిపోయాడు.

దూరంగా-

కొమ్మల మధ్యనుంచి – చెట్ల ఆకుల వెనుకనుంచి-

మసగ్గా-

అస్పష్టంగా కనబడుతూంది సినిమా వాల్‌పోస్టర్ బ్యానరు.

నేడే విడుదల-

“అతడే ఆమె  సైన్యం.”

అదే

తనకి పదిరోజుల క్రితం ప్రొడ్యూసర్ చూపించింది.

ఇది కూడా భ్రమేనా?

అతడు కళ్ళు నలుముకున్నాడు.

ఆ వాల్‌పోస్టర్ మీద హీరో – హీరోయిన్‌లు వున్నారు.

ఆకారాలు స్పష్టంగా కనిపించడంలేదు.

ఎవరా హీరో?

చైతన్య కదూ, న్యూస్ పేపర్లో చూశాడు సరే… కానీ పోస్టర్‌లో.

ఎలా వుంటాడు అతడు? తనని ఇంత ప్రభావితం చేసిన ఆ నటుడు ఎంత అధ్బుతమైన అందంతో, అపరాజితమైన మొగతనంతో విలసిల్లుతూ వుండి వుంటాడు? ఒకప్పుడు తను అతడి ఫాన్. మతిపోతే, గతం మర్చిపోయి, అతడినే తనుగా వూహించుకునేటంత వీరాభిమానిగా తనని చేసిన ఆ హీరో ఎలా వుంటాడు? న్యూస్ పేపర్‌లో చూపించిన ఫోటో సంతృప్తికరంగా లేదు. ఎలా ఆ వాల్‌పోస్టర్ చూడటం?

అతడు కిటికీలోంచి ముందుకు వంగి చూడటానికి ప్రయత్నం చేశాడు. కొమ్మలు మరింత అడ్డు వచ్చాయి.

అతడిలో పట్టుదల ఎక్కువైంది.

గదిలో చుట్టూ చూశాడు.

అతడి దృష్టి గాజుగ్లాసు మీద పడింది.

వెళ్ళి గది తలుపు వేసి వచ్చాడు. గ్లాసు అడుగు బ్రద్ధలు కొట్టి దాని క్రింద భాగాన్ని ‘లెన్స్’ గా తయారు చేశాడు. న్యూస్ పేపర్ గుండ్రంగా మడిచి, దాన్నొక రూళ్ళకర్రగా చేసి, మరోగాజు ముక్క రెండోవైపు అమర్చాడు. ఒక చిన్నసైజు అశాస్త్రీయమైన టెలిస్కోప్ తయారయింది. అయిదు నిమిషల అడ్జెస్ట్‌మెంట్ తరువాత దూరపు దృశ్యాలని స్పష్టంగా కనిపింపచేసే ఫోకస్ వచ్చింది. దాంతో వాల్‌పోస్టర్‌ని చూశాడు.

చెట్ల అవతల్నించి దృశ్యం మరింత స్పష్టంగా కనిపించింది.

అతడి నుదుట చెమట పట్టింది.

‘అతడే ఆమె సైన్యం” అన్న అక్షరాల మీద నిలువెత్తు ఫోజుతో నిలబడ్డ చైతన్య.

–          తనే.

4

అతడు చాలాసేపు ఆ కిటికీ దగ్గర అలాగే నిలబడి వుండిపోయాడు.

వీళ్ళంతా ఎవరు?

తనని ఎందుకిలా మోసం చేశారు?

తన భార్యగా నటించిన స్త్రీ ఎవరు? ఆస్పత్రి సూపర్నెండెంట్‌తో సహా ఎందుకింత నాటకం ఆడుతున్నారు?

అతడి మళ్ళీ ఇంకో అనుమానం కలిగింది.

ఇది కూడా భ్రమేనేమో, డాక్టర్ చెప్పినట్టు పారనాయిడ్ మనస్తత్వంలో ఇదీ ఒక భాగమేమో.

అతడు ఆ రకమయిన అలోచనల్లో వుండగా తలుపు చప్పుడైంది. సూపర్నెండెంట్ లోపలకి వచ్చాడు. “కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సుబ్బారావ్! మీరు మీ గతం గుర్తించడం మొదలుపెట్టారట కదా-”

“అవును. ఆ నర్సు-ఆ అమ్మాయి పేరేమిటి?”

“ప్రనూష.”

” ఆ ప్రనూష సంఘటనతో నాకు నిజంగా పిచ్చెక్కిందని అర్ధమయింది.”

“దాన్ని పిచ్చి అనకండి. గతం మర్చిపోయారంతే! పిచ్చి అంటే ఇన్‌సేనిటీ. మీది లాస్ ఆఫ్ రిమెంబరెన్స్.”

“మీ డాక్టర్లు ప్రతిదానికి ఒక కొత్త పేరు పెడతారు. లేకపోతే వైద్యశాస్త్రమే వుండదు కదా.”

అదో పెద్ద జోకయినట్టు డాక్టరు నవ్వేడు.

“నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చా?”

“నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు సుబ్బారావ్. కనీసం ఇంకో వారం రోజులు ట్రీట్ చేసి వదిలేస్తాం.”

“నాకీ రూమ్ లో బోర్ కొడుతోంది. కనీసం వరండాల్లో అయినా తిరగొచ్చా?”

“హాయిగా తిరగొచ్చు. కానీ రకరకాల పిచ్చివాళ్ళుంటారు. వీలైనంత వరకూ తిరగకపోవటమే మంచిది.”

“కనీసం ఒక అరగంట అయినా మీతో తిరగనివ్వండి డాక్టర్. లేకపోతే నిజంగానే ఈ గదిలో పిచ్చెక్కేట్టే వుంది నాకు.”

మళ్ళీ బిగ్గరగా నవ్వి “ఓకే నాతో రండి” అని కదిలాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. విశాలమైన కారిడార్. అంతకుముందు చూసిందే మెట్లు దిగి క్రిందికి వచ్చారు. చెట్లు అలాగే వున్నాయి. అదే గేటు-అదే దారి- అతడు చాలా క్యాజువల్‌గా నడుస్తున్నట్టు వున్నాడేగానీ, చూపులు మాత్రం నిశితంగా పరిశీలిస్తున్నాయి.

చివరకి కావల్సింది దొరికింది.

గోడమీద-

ఎర్రగా-

మరక!

ప్రనూష (తన పేరు అక్షౌహిణి అని అబద్ధం చెప్పిన అమ్మయి గోడ ఎక్కుతూ పడిపోయింది అక్కడే!)

అది రక్తం మరక కాదు. అయిటే ఈ పాటికి ఎండి జిగురు వర్ణంలోకి మారిపోయి వుండేది. రంగు కలిపి నాటకం ఆడారు. ప్రనూష, గార్డులు, డాక్టర్లు అందరూ కలిసి నాటకం ఆడారన్నది నిర్వివాదాంశం.

అతడు మొహంలోకి ఏ భావాలూ బయటకు కనపడనివ్వలేదు.  డాక్టర్‌తో కలసి వెనక్కి తిరిగి వచ్చాడు. రూమ్‌లోకి వెళ్ళబోతూంటే డాక్టర్‌ని ఆపి “ఇంకో వారంరోజులు నేనిక్కడే వుండాలంటే… “అని ఆగి కాస్త తటపటాయించి, “నా భార్యని నాతో వుంచుకోవచ్చా?” అన్నాడు.

ఈసారి డాక్టరు నవ్వలేదు. కాస్త సంశయించాడు.

అతడు నొక్కి చెపుతున్నట్టు “నా భార్యతో నేనుండటానికి మీకేమిటి అభ్యంతరం డాక్టర్? అదీగాక ఈ వారంరోజులూ నా గతం గురించి తెలుసుకునే అవకాశం కూడా వుంటుంది కదా” అన్నాడు.

“సరే అయితే” అన్నాడు సూపర్నెండెంట్. అతడి మొహం కాస్త అప్రసన్నంగా వుంది.

 

 *                                             *                                              *

రాత్రి ఎనిమిదింటికి వచ్చింది ఆమె.  అతడు నవ్వి “ఇంకా వారంరోజులు వుండాలట, ఇక్కడ నాకేమో ఒంటరిగా బోర్ కొడుతోంది. అదీగాక నీ నుంచి నా గతం గురించి తెలుసుకుంటే మరింత తొందరగా బాగుపడతానని డాక్టర్లు చెప్పారు. అందుకే రాత్రికి నిన్ను పంపమని చెప్పాను. నీకేమీ అభ్యంతరం లేదు కదా” అన్నాడు.

“అయ్యో నాకేమిటండీ అభ్యంతరం? భర్త దగ్గరికి రావటానికి భార్య కెందుకు అభ్యంతరం?”

అతడు ఆమెవైపు సూటిగా చూశాడు.  ఆమె కళ్ళల్లో అదోలాటి అమాయకత్వం, దీనత్వం ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఆ దీనత్వం దిగులువల్ల వచ్చింది కాదు. కారణం తెలీదు. ప్రనూషది ప్రళయకాల ఝంఝామారుతంలాంటి అందమయితే లక్ష్మిది సెలయేటి పాయలాటి అందం.

ఇద్దరూ కలిసి భోజనం చేశారు.

బాగా చీకటి పడింది.

“మన పెళ్ళి ఎప్పుడైంది?”

“ఎనిమిది సంవత్సరాల క్రితం.”

“నా తల్లిదండ్రులు?”

“ఇటీవల నాన్నగారు పోయారు. అమ్మగారు మీ చిన్నప్పుడే పోయారు.”

“నాకు అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు?”

“ఎవరూ లేరు”

“ఒక్కడే కొడుకునా? ఇంకా ఎవరో వున్నట్టు గుర్తే.”

ఆమె తడబడి- “ఒక చెల్లెలు వుండేది – పోయింది.”

“ఎంతకాలమైంది?”

“ఆరేళ్ళు -వినాయకచవితి రోజు.”

“అప్పటికి తనకి పెళ్ళయిందా?”

“లేదండీ! అప్పటికి తన వయసెంతనీ? పధ్నాలుగు”

ఇటుకలు కట్టినట్టు ఆమె ఆడుతున్న అబద్ధాలు వింటూంటే అతడి కోపం కట్టలు తెగుతోంది.

“అమ్మ పోవటం నాకు గుర్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రోజే తెలిసింది ఆ మరణవార్త. నువ్వేమో చిన్నపుడే పోయిందంటున్నావు.”

లేదండీ! చిన్నప్పుడే పోయారు. మీకు ఆరేళ్ళ వయస్సులో….”

అతడు పక్కమీద వాలుతూ ” ఈ రోజుకి ఈ ‘గతచింతన’ చాల్లే, పడుకుందాంరా” అన్నాడు.

“నేనుక్రింద పడుకుంటాను” ఆమె బెదురుగా అంది.

“అదేం?”

“మొన్నటి యాక్సిడెంట్‌లో మీ వెన్నముక్కకి దెబ్బ తగిలింది. కొంతకాలం దూరంగా వుండమన్నారు డాక్టర్లు”

“సుమంగళి సిన్మాలోలా రాత్రిళ్ళు చన్నీళ్ళు స్నానాలు చేస్తూ వుండాలన్నమాట నువ్వు. పాపం చాల కష్టం వచ్చిందే. అయినా ఈ దెబ్బలేంటో? అన్నీ నా ముఖ్యమైన భాగాలమీదే తగిలినట్టున్నాయి. మెదడు, వెన్నుముక, వగైరా. అన్నట్టు నా ఇంకే అంగాలు ఈ ఆక్సిడెంట్లో పాడాయ్యాయో చెప్పగలవా?”

 

ఆమె మాట్లాడలేదు.

“గుడ్‌నైట్! పడుకో”.

ఆమె క్రింద పక్క వేసుకుని పడుకుంది.

రాత్రి ఒంటిగంట అవుతూ వుండగా పక్కన ఎవరో కదుల్తున్నట్టు అనిపించి ఆమెకి మెలకువ వచ్చింది.

“నేనే” అన్నాడు.

“ఏమిటిది వదులు-వదలండీ.”

“ఇప్పుడే బాత్‌రూమ్‌కెళ్ళి ఒళ్ళంతా పరీక్షించుకున్నాను. అన్నీ బాగానే వున్నాయి. నువ్విక సుమంగళిలోలా బ్రతకనవసరం లేదు.” ఆమె అతడి చేతుల మధ్య గింజుకుంటూంది.

అతడామె కుచ్చిళ్ళమీద చెయ్యి వేశాడు.

ఆమె అరవబోయింది

అతడి పెదవులు ఆమె నోటిని నొక్కిపట్టాయి.

ఆస్పత్రి నిద్రపోతోంది

అతడామె కుచ్చిళ్ళు లాగేశాడు. ఆమె రోదిస్తూంది, అతడు పట్టించుకోలేదు. అతడి చేతులు ఆమె పొత్తికడుపుని నిమిరాయి.

అంతే!

క్షణాల్లో అతడు మాములు మనిషి అయ్యాడు. మొహం దూరంగా జరిగింది. లేచి వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. అతడిలొ వచ్చిన ఆకస్మికమైన మార్పుని చూసి ఆమె అశ్చర్యపోయింది,

అతడు తాపీగా “ఇప్పుడు చెప్పు” అన్నాడు.

ఆమె నిరత్తురాలై చూసింది.

“నీకు పిల్లల్లేరని నీ కడుపు చూస్తేనే తెలిసింది. కథలు కూడా సరిగ్గా అల్లలేవని నీ మాటలద్వారా అర్థమైంది. నీ లెక్క ప్రకారం నా తల్లి చచ్చిపోయిన ఆరేడేళ్ళకు నా చెల్లి పుట్టింది అవునా?” ఆమె బిత్తరపోయింది. అతడు నవ్వేడు.

“నేను చైతన్యని అని నాకు ఋజువుల్తోసహా తెలిసింది. నన్నెందుకు ఆ సాలేగూడులోకి ఇరికించారు? ఈ నాటకంలో నా పాత్ర ఎంతవరకు”

ఆమె జవాబు చెప్పలేదు.

“చూడూ – నువ్వు కాస్తో కూస్తో చదువుకున్నదానిలా కనపడుతున్నావు. నేను స్పృశించగానే నువ్వు తడబాటు పడిన విధానం చూస్తుంటే నీకింతవరకు పురుష స్పర్శలేదని అర్థమంది. మొత్తం కథంతా చెపుతావో ఈ రాత్రి శీలం పోగొట్టుకుంటావో నీ ఇష్టం. ఈ గదిలో నిన్ను నేనేంచేసినా ఎవరూ పట్టించుకోరు. అవకాశం దొరికినా నేను నిన్నేమీ చేయటం లేదు. ఆ కృతజ్ఞత నీకుంటే, నీ పవిత్రత మీద నీకు విలువుంటే-నిజం చెప్పు. అసలీ సుబ్బారావెవరు? నా భార్యగా నువ్వెందుకు నటిస్తున్నావు?”

ఆమె చాలాసేపు ఏడుస్తూ వుండిపోయింది. అతడు ఆమెని అలాగే వదిలేశాడు. ఆమె వీళ్ళ మనిషి కాదని తెలుస్తూనే వుంది. లేకపోతే ఇంత తొందరగా బెదిరిపోయి దారికిరాదు. అతడి అంచనా నిజమయింది.

“నేను వీళ్ళ మనిషిని కాను” అంది ఆమె నెమ్మదిగా.

“అసలెవరు వీళ్ళు?”

“నాకు తెలీదు. సినిమాల్లో చిన్న వేషాలు వేసుకునేదాన్ని నేను. మీతో వేషం అనగానే పొంగిపోయాను. ఆ ముందురోజే మా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారు. షూటింగ్ టైంలో మీకు నిజంగానే యాక్సిడెంట్ జరుగుతుందనీ, అంబులెన్స్‌లో వీళ్ళొచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారనీ నాకుముందే తెలుసు. మీకు షూటింగ్‌లోనే జాగ్రత్తగా వుండమని చెపుదామనుకున్నాను. కానీ నా తమ్ముడి ప్రాణాలకు ప్రమాదమని చెప్పలేదు.”

“సుబ్బరావ్ అనే వాడెవడూ లేడా?”

“లేడు,”

“అతడే ఆమె సైన్యం సినిమా ప్రకటన పేపర్‌లో పడింది, అందులో నా ఫోటో లేదే.”

“మీ కోసం డమ్మీ పేపరు తయారు చేశారు వాళ్ళు,”

“ఇంత బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చదువుకున్నావు?”

“బి.ఏ. పాసయ్యాను చైతన్యగారూ. మాది పెద్ద కుటుంబం. సినిమాల్లో వేషాలేసి పోషిస్తూ వుంటాను”.

“నీ తమ్ముడి జాడ తెలీదా?”

“తెలీదు. ముందు లక్షరూపాయలిస్తామని ఆశ పెట్టారు నేను వినలేదు. దాంతో మా తమ్ముడిని కిడ్నాప్ చేసారు.”

“ఈ గ్యాంగ్ మూలస్థంభం ఎవరో తెలుసా నీకు?”

“తెలుసు”

“ఎవరు?”

“ప్రనూష”

చైతన్య అదిరిపడ్డాడు.

“నువ్వు చెప్పెది నర్సు ప్రనూష గురుంచే?”

“ఆమె నర్సు కాదు. నా దగ్గరికి కాడిలాక్ కారులో వచ్చింది.”

“విదేశీ గూఢచారిణా?”

“ఏమో, నాకు తెలీదు.”

“ఒక సినీయాక్టర్ని ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయడంలో ఆమె ఉద్దేశ్యం ఏమై వుంటుంది?” సాలోచనగా అన్నాడు.

ఆమె జావాబు చెప్పలేదు.

“ఈ హాస్పిటల్ సూపర్నెండెంట్ ఎవరు?

“ఆమె మనిషే.”

“పోలీస్ ఇన్‌స్పెక్టర్? ఆ గుండాలు?”

“అంతా వాళ్ళే”

“ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ అన్నమాట”

అతడు కొద్దిసేపు మౌనంగా వుండి “ఏ ధైర్యంతో నాభార్యగా ఈ రాత్రి లోపలికి వచ్చావ్?” అని అడిగాడు.

“నాకేమీ కాదని వాళ్ళు చెప్పారు. నా అరోగ్యం సరిగ్గా లేదని చెప్పమన్నారు. మీ వెన్నెముకకి దెబ్బ తగిలిందని చెప్పమన్నారు. నా తమ్ముడి కోసం నేనిదంతా చేయక తప్పలేదు చైతన్యగారూ! నన్ను క్షమించండి.

“ఓ.కే. అయిందేదో అయిపోయింది. నాకిదంతా చెప్పినందుకు కృతజ్ఞతగా నీ తమ్ముడిని ఆ గ్యాంగ్ బారినుండి రక్షించి నీ కప్పగిస్తాను. ఆ ప్రనూష అంతు తేలుస్తాను. ఈ రాత్రికి హాయిగా నిద్రపో.”

పది నిమిషాల్లో అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇన్నాళ్ళ టెన్షన్ లేకపోవడంతో హాయిగా నిద్రపట్టింది.

 

5

అప్పటికి చైతన్య కనపడక పదిరోజులు దాటింది.

మొత్తం సినీరంగమంతా పారలైజ్ అయిపోయింది. చైతన్యకి సంబందించిన నిర్మాతలూ, టెక్నీషియన్సే కాకుండా పరిశ్రమలో అందరూ దిగ్బ్రాంతిలో వుండిపోయారు. సాధారణంగా ఏ సమస్య అయినా రోజులు గడిచేకొద్దీ చల్లబడుతుంది. కానీ చైతన్య అదృశ్యమైన విషయం రోజు రోజుకీ తీవ్రమవసాగింది.

షూటింగ్ జరుగుతూ వుండగా హీరో తలమీద దెబ్బ తగిలింది. అయిదు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. మిగతవారి నెవరినీ ఎక్కించుకోకుండా కేవలం చైతన్యనే తీసుకెళ్ళారు. నిర్మాతతో సహా మిగతా అందరూ ఆస్పత్రికి వెళ్ళేసరికి, అంబులెన్స్ ఎంతసేపటికీ రాలేదు. గంట గడిచి రెండు గంటలయ్యాయి. మిగతా ఆస్పత్రుల్లో ప్రయత్నించారు. అంబులెన్స్‌కి ఆక్సిడెంట్ జరిగిందేమో అని వాకబు చేశారు. ఫలితం లేదు.

అంబులెన్స్ జాడ తెలీలేదు.

మరుసటి రోజునుంచీ అది సెన్సేషనల్ వార్త అయింది. అభిమాన సంఘాల వాళ్ళ అలజడి, కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అయోమయం, ఆగిపోయిన షూటింగ్‌లు…

ఇవన్నీ ఒకవైపు–

చైతన్య తల్లి పరిస్థితి మరో వైపు.

అతడి జాడ తెలియడం లేదనగానే ఆవిడ స్పృహ తప్పిపోయింది. కొడుకంటే ఆమెకు ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. పాతిక సంవత్సరాల క్రితం కాశ్మీర్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చింది తల్లి. ఆమె భర్త యుద్ధానికి సంబంధించిన రాడారు శాఖలో పనిచేసేవాడు. యుద్ధంలో ఆయన మరణించిన తర్వాత వచ్చే పింఛను డబ్బులతో కొడుకుని చదివించింది. వాళ్ళుండే చోటుకి ఒకసారి అవుట్‌డోర్ షూటింగ్ నిమిత్తం ఒక సినిమా కంపెనీ వచ్చింది. షూటింగ్ మధ్యలో ఒక కుర్రాడు కావల్సి వచ్చాడు. ఆ వేషానికి చైతన్యని తీసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఒక మంచి దర్శకుడి దృష్టి చైతన్యమీద పడింది. తన తర్వాత చిత్రంలో వేషం కోసం చైతన్య తల్లిని కలుసుకున్నాడు. తల్లికి ఇష్టంలేదు.  కానీ దర్శకుడూ నిర్మాత కలిసి ఒప్పించారు.  ఆ చిత్రం కేవలం చైతన్య వల్లే బాగా ఆడింది.

పధ్నాలుగో ఏడునుంచి చైతన్యకి సినిమా ఛాన్సులు రావటం మానేశాయి. సాధారణంగా ఆ వయసులో అది సహజమే! తిరిగి ఇరవై రెండో ఏట అతను మళ్ళీ రంగప్రవేశం చేశాడు. రొమాంటిక్ సబ్జెక్ట్ అది. పదిహేనేళ్ళ అమ్మాయితో రొమాంటిక్ స్టోరీ! ఇరవై అయిదు వారాలు ఆడింది.

అతడికి విపరీతంగా ఛాన్సులు రావటం మొదలు పెట్టాయి. అయితే తొందర్లోనే అతడొక విషయం తెలుసుకున్నాడు.

ప్రేక్షకుల టేస్టు మారుతుంది. కేవలం రొమాంటిక్ హీరోగా నిలదొక్కుకోవటం కష్టం.

అతడు ఫైట్స్‌లోనూ, డాన్స్‌లోనూ ఏకాగ్రత చూపించటం ప్రారభించాడు. అది బాగా లాభించింది. చిత్ర పరిశ్రమకి థర్డ్ డైమెన్షన్ లభించనట్టయింది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఫైట్స్ చేసేటప్పుడు మొహంలో ఎక్స్‌ప్రెషన్… ఆ కసి, క్రౌర్యం- యువకులని ఉర్రూత లూగించింది.

ఏ రంగంలో అయినా-ముందువాడిని అనుసరించేవాడు, రెండోవాడిగానే మిగిలిపోతాడు. కొత్త పంథా వెతికేవాడే ముందుంటాడు. ఒకసారి ముందుకు వచ్చాక, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి కృషి అవసరం. ఈ రెండు లక్షణాలు చైతన్యలో పుష్కలంగా వున్నాయి. అతడి విజయాన్ని గెలవగలిగేది ఒక్కటే! అతడి వయసు! అంతవరకూ అతడు నిర్విరామంగా పనిచేస్తూ వుంటాడనేది నిర్వివాదాంశం.

ఈ విజయం వెనుక వున్న స్త్రీ అతడి తల్లి! పైకి చాలా మామూలుగా కనపడే వ్యక్తిత్వం ఆమెది. కానీ చాలా లోతయినది, క్లిష్టమైనది. కష్టాల్ని పళ్ళబిగువున అదిమిపెట్టి కోట్లు సంపాదించాక కూడా అలాగే వున్నది ఆమె వ్యక్తిత్వం. ప్రేమ ఎంత గొప్పదో, జీవితంలో ఎంత కష్టపడిందో, ఎంత పోగొట్టుకున్నదో తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒకరు-ఆమె కొడుకు!.

 

*                                        *                                  *

 

హాస్పిటల్ సూపర్నెండెంట్ పాల్ మొహంలో అంత కౄరత్వం ఎప్పుడూ కనపడలేదు. మొహం వికృతంగా మారింది. ఆమె రెక్క పట్టుకుని విసురుగా లాగుతూ “ఎక్కడకు వెళ్ళాడు? ఎప్పుడు పోయాడు?” అని అరిచాడు.

లక్ష్మి బెదిరి “నేను నిదురపోయాను” అంది.  అంతలో అక్కడికి ప్రనూష వచ్చింది. పాల్ ఆమెకి పరిస్థితి చెప్పాడు. ఇప్పుడు అతను సూపర్నెండెంట్‌లా, ఆమె నర్సులా లేరు. ఒక అధికారిణి ముందు చేతులు కట్టుకుని మాట్లాడే సేవకుడిలా వున్నాడు పాల్. విషయం తెలుసుకున్నా ప్రనూష పాల్‌లా కంగారుపడలేదు.

“మనం ఇంతమంది కాపలా కాస్తుండగా ఎలా తప్పించుకోగలడు పాల్? మన ప్రహారీ గోడలు చాల ఎత్తయినవి. మన కుక్కలు చాలా చురుకైనవి” అంది ఇంగ్లీషులో.

“ఈ కాంపౌండ్‌లోనే అతను ఎక్కడో వుండి వుంటాడు.”

“వెతికించండి మరి! మొత్తం అందరినీ ఈ పనిలో ప్రవేశపెట్టండి.”

పాల్ జోసఫ్ హాడావుడిగా బయటకు వెళ్ళాడు. బయట కలకలం మొదలైంది లోపల లక్ష్మి ప్రనూషని అడిగింది-“ఇకనైనా నా తమ్ముడిని వదిలిపెడతారా?”

“తమ్ముడేమిటి?”

లక్ష్మి మొహం వెలవెలబోయింది.  “నా తమ్ముడిని కిడ్నాప్ చేసి నన్ను బలవంతంగా ఇందులోకి దించి ఇప్పుడు  నాకేమీ తెలియదని బుకాయిస్తున్నారా?” రోదించడం మొదలుపెట్టింది.

అంతలో జోసెఫ్ తిరిగివచ్చాడు. అతడి చేతిలో చిన్నగుడ్డ ముక్క వుది. చైతన్య పడుకునే బెడ్‌షీట్ తాలూకు ముక్క అది. ” ఈ గుడ్డల్ని తాడులా కట్టి గోడదూకి పారిపోయినట్టునాడు మేడమ్! ఈ ముక్క చెట్టు దగ్గర కనబడింది” అన్నడు.

“గోడ దగ్గర చెట్లేవీ లేవే! ఎలా దూకాడు?” అంది ప్రనూష.

“అవన్నీ ఆలోచిస్తూవుంటే మనకి ప్రమాదం. అతనీపాటికే పోలీసుల్ని తీసుకొస్తూ వుండి వుంటాడు.”

“అవును. మనం తొందరగా ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి. సామానులు వదిలెయ్యండి” అంటూ అక్కణ్ణుంచి బయటకు వెళ్ళింది. లక్ష్మి ఆమెతోపాటే తన తమ్ముడి గురించి అడుగుతూ అనుసరించింది. జోసెఫ్ కూడా ఆమె సూచనలు అమలు జరపటానికి పరుగెత్తాడు. ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, మంచం అడుగునుంచి లేచాడు చైతన్య. అతను అప్పటివరకూ అక్కడే, ఆ గదిలోనే వున్నాడు. ఆ గదిలో వెతకాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.

ప్రనూష కొచ్చిన అనుమానం కరక్టే. ఎటువంటి తాడు సాయంతో నైనా ప్రహరీ గోడ దూకి బయటకి వెళ్ళడం దుర్లభం. ఆ విషయం చైతన్యకి తెలుసు. అసలు అతడా ప్రయత్నమేమీ చేయలేదు కూడా! అర్థరాత్రి లక్ష్మి నిద్రపోయాక చిన్న బెడ్‌షీట్ ముక్క కత్తిరించి చెట్టు మొదట్లో పారేసి వచ్చి దాక్కునాడు. మిగతా అంతా అతను అనుకున్నట్టే జరిగింది.

బయట హడావుడి ఎక్కువైంది.

చైతన్య కిటికీలోంచి బయటకు చూశాడు. అతడికి కొద్దిగా ఆశ్చర్యం కూడా కలిగింది. బయట ఎంతోమంది జనం వుంటారనుకున్నాడు. గార్డులతో కూడా కలిపి పదిమందికన్నా ఎక్కువలేరు. కొందరు వ్యాన్ ఎక్కుతున్నారు. ప్రనూష కారు దగ్గర వుంది. వీళ్ళంతా తనకోసమే – తన ఒక్కడికోసమే ఇంత నాటకం ఆడారంటే అతడికి ఆశ్చర్యంగా వుంది. తను వెళ్ళి పోయాడని తెలియగానే అందరూ ఖాళీ చేస్తున్నారంటే కేవలం తనకోసమే ఈ ఆస్పత్రి నాటకం…

అతడు ముందు వరండాలోకి వచ్చాడు.

మొట్టమొదటసారి అతడికి పక్కగదులు చూసే అవకాశం కలికింది. కేవలం గుమ్మం దగ్గరికి స్క్రీన్‌లు వున్నాయంతే! లోపల మంచాలూ కుర్చీలూ ఏమీ లేవు. గదులన్నీ ఖాళీగానే వున్నాయి.

ప్రనూష తన నెంత  మోసం చేయనీ, ఎన్ని బాధలు పెట్టనీ ఆ క్షణం మాత్రం ఆమె తెలివితేటల్ని మెచ్చుకోకుండా వుండలేక పోయాడు. కేవలం పదిమంది మనుష్యులతో, నాలుగు స్టెతస్కోప్‌లతో, గుమ్మం కర్టెన్లతో, ఒక పెద్ద ఆస్పత్రి వాతావరణం సృష్టించింది. తనకి నిజంగానే మతిభ్రమించిందేమో అన్నంత అనుమానం కలిగించింది. హేట్సాఫ్ టు హర్.

కానీ ఇదంతా ఎందుకు?

అతడికి వాళ్ళమీద వైరభావంకన్నా, ఇదంతా ఎందుకు చేశారో అన్న అనుమానమే ఎక్కువ వుంది.

మనిషి పనిచేసే ప్రొఫెషన్ యొక్క ప్రభావం అతని మనస్తత్వం మీద ఎక్కువ వుంటుంది. చైత్తన్య చాల సినిమాల్లో హీరోగా నటించాడు. ఎనో కథలు అతని చుట్టూ అల్లబడ్డాయి. హీరోలు పోలిసుల్ని ఆశ్రయించరు. వీలైనంతవరకు ఒంటరిగానే పోరాడతారు. విలన్ని చావబాదాక హీరోయిన్ తమ్ముడో, కమేడియనో పోలీసుల్ని పిలుచుకు రావటం జరుగుతూ వంటుంది. ఈ రకమైన మనస్తత్వమే బహుశ అతడిని అంతర్లీనంగా ఆ పనికి ప్రేరేపించి వుంటుంది.

ఆ గదిలో వుండి అవతలివాళ్ళకి తను పారిపోయానన్న భ్రమ కలిగించటం నిజంగా అతడి తెలివితేటలకి ఉదాహరణ.

అందరూ క్రిందికి వెళ్ళారని నిశ్చయించుకున్నాక అతడు బయటకి వచ్చాడు. జనం వ్యానులో ఎక్కి వెళ్ళిపోతున్నారు. బయట మరో రెండు కార్లున్నాయి.

చైతన్య చెట్ల చాటునుంచి ఒక కారు వెనక్కి చేరుకున్నాడు. అదెవరిదో తెలీదు. వెనుక సీటు క్రింద కూర్చుని- ఎవరైనా తలుపు తెరుస్తే అటాక్ చెయ్యటానికి సిద్ధంగా వున్నాడు. మరో అయిదు నిముషాల తరువాత కారు కదిలింది. ముందు సీట్లో ఎవరో డ్రైవ్ చేస్తున్నారు.

చైతన్య లేచే ప్రయత్నమేమీ చేయలేదు. అతను బయట పడాలనుకుంటే ఆ క్షణమే డ్రైవరు మీద అటాక్‌చేసి బయటకు రావొచ్చు కానీ అతడి ఉద్దేశ్యం అదికాదు.

కారు ఆగిన కొద్ది నిమిషాలకి అతను తలెత్తి చూశాడు. ఒక పాడుబడిన బిల్డింగ్ ముందు వుంది అది. అతను తలుపు తెరుచుకుని బయటకి వచ్చాడు. నిర్మానుష్యంగా వుంది. అతడు బిల్దింగ్ వైపు వెళ్ళి కిటికీలోంచి చూశాడు.

డాక్టర్ పాల్ జోసెఫ్ ఎవరితోనో వైర్‌లెస్‌లో మట్లాడుతున్నాడు.

“అవును. ఆపరేషన్ ఫెయిల్ అయింది. అతను తప్పించుకున్నాడు. ప్రనూష వెళ్ళిపోయింది” అంటున్నాడు.

చైతన్య నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. బయట కనబడినంత పాడుబడినదిగా లేదు ఆ బిల్డింగ్ లోపల. అతడి దృష్టి కుడివైపు గదిమీద పడింది.

కిటికీలోంచి కుర్రవాడు కనపడుతున్నాడు. బహుశ లక్ష్మి తమ్ముడయి వుంటాడు. గుమ్మం బయట తాళం వేసి వుంది.

చైతన్యకి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో పదిమందికి తక్కువ కాకుండా కాపలాదారులు, అనుచరులు వుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఆర్భాటాలూ ఏవీ కనబడటం లేదు. జోసెఫ్ వైర్‌లెస్ ఆఫ్‌చేసి, మెడదగ్గర వూపిరి వెచ్చగా తగలడంతో వెనుదిరిగాడు.

అంత దగ్గరగా, అంత అకస్మాత్తుగా, అనూహ్యమైన రీతిలో చైతన్యని చూసి అదిరిపడ్డాడు జోసెఫ్ పాల్.

“చెప్పండి సూపర్నెండెంట్‌గారూ! ఎమిటిదంతా?”తాపీగా అడిగాడు చైతన్య. జోసెఫ్ ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదు.

“చెప్పండి. ఇంత నాటకం ఎందుకాడారు? నా మీద మానసికంగా ఇంత వత్తిడి తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నించారు?”

సమాధానం చెప్పకుండా జోసెఫ్ గాలిలా కదిలాడు ఊహించని వేగంతో చైతన్య మీదకు వచ్చాడు. ఇంకెవరైనా అయితే ఆ అనుహ్యమైన వేగానికి క్రిందపడి పోవాల్సిందే. అయితే చైతన్యకి డూప్‌లేకుండా ఫైట్లలో తప్పించుకోవడం అలవాటే, సెకండ్‌కి ఇరవై నాలుగు ఫ్రేములు తిరిగే కెమెరాకి అందకుండా మొహం తిప్పుకోగలగాలి. అలాగే, ట్రిక్స్ ఏమీ లేకుండా సమ్మర్‌సాల్ట్ చెయ్యగలిగి వుండలి. లేకపోతే ప్రేక్షకులు గ్రహించే స్థితిలో వున్నారు. రోజుకి రెండు గంటలు ఇవి ప్రాక్టీసు చేస్తాడు చైతన్య. జోసెఫ్ నుంచి తప్పించుకోగలగటం అతడికి పెద్ద సమస్య కాలేదు.

అయితే జోసెఫ్ పాల్ అంత తొందరగా ఓడిపోలేదు. చైతన్య మెడమీద కిక్ ఇచ్చాడు. అంత టెన్షన్‌లోనూ చైతన్యకి ఆశ్చర్యం వేసింది. “ఇతడు వృత్తిరీత్యా  డాక్టర్ కాదు నిశ్చయంగా” అనుకున్నాడు. రెండు నిమిషాలపాటు ఇద్దరి మధ్యా ద్వంద్వ యుద్ధం సాగింది. చివరికి చైతన్య అతడిని లొంగదీసుకున్నాడు. చేతులు వెనక్కి విరిచి పట్టుకుని “ఇప్పుడు చెప్పు” అన్నాడు.

“అతడిని విడిచిపెట్టు చైతన్యా! లేకపోతే ఈ కుర్రాడి ప్రాణాలు దక్కవు” అని దూరంనుంచి వినిపించింది.

లక్ష్మి తమ్ముడి మెడచుట్టూ చేతులువేసి ఒక రౌడీ నిలబడి వున్నాడు. ఆ కుర్రవాడు గింజుకుంటూ ఏడుస్తున్నాడు. జోసెఫ్‌తో జరిగే ఘర్షణలో ఆ రౌడీ ఎప్పుడు తలుపుతీసి కుర్రవాడిని బయటకు తీసుకువచ్చాడో చైతన్య చూసుకోలేదు.

వాళ్ళమధ్య కొని క్షణాలు నిశ్శబ్దంగా కదిలాయి.

“వదుల్తావా? ఈ కుర్రవాడిని చంపెయ్యమంటావా”

చైతన్య జోసెఫ్ డోక్కలో గుచ్చాడు.  “నువ్వా కుర్రాడిని చంపేస్తే ఇక్కడ నీ బాస్ వీపులో ఆరు గుళ్ళు దూసుకుపోతాయి. కుర్రవాడిని వదులు.”

అటు జోసెఫ్, ఇటు అనుచరులు నిర్విణ్ణులయ్యారు.

“రెండూ క్షణాలు టైమ్ ఇస్తున్నాను మా బాస్‌ని వదిలెయ్యి.”

“నువ్వు కాదు, రెండు క్షణాలు టైమ్ నేనిస్తున్నాను” చైతన్య అన్నాడు “చూడూ… ఆ కుర్రాడు ఎవరో నాకు తెలీదు. నాకేమీ కాడు కూడా. అతనికోసం నీ బాస్‌ని వదలటం అసంభవం. చెప్పు… వదుల్తావా? ట్రిగ్గర్ నొక్కమంటావా?”

జోసెఫ్ కల్పించుకుని “వదిలెయ్” అన్నాడు కంగారుగా.

అనుచరుడు వదిలెయ్యగానే కుర్రవాడు కారు దగ్గరికి పరిగెత్తాడు. అతడు చైతన్య దగ్గిరకు వచ్చివుంటే బావుండేది. అతడిని సురక్షిత స్థానంలో వుంచి చైతన్య వాళ్ళని అటాక్‌చేసి వుండే వాడు. ఇప్పుడిక ఏం చేసినా, జోసెఫ్ డొక్కలో గుచ్చింది దువ్వెన అని తెలిసిపోతుంది.

చైతన్య కూడా జోసెఫ్‌ని షీల్డ్‌గా చేసుకుని కారు దగ్గిరకు వెళ్ళాడు.

 

 

6

 

            అంత గొప్ప ఆహ్వానాన్ని అతడు జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు, అనుభవించలేదు.

అతడు డైరెక్టుగా స్టూడియోకి వెళ్ళాడు. శ్మశాన నిశ్శబ్దంతో పడివున్న స్టూడియో అతడి రాకతో చైతన్య వంతం అయ్యింది. ఆనకట్ట తెగిన నదీ ప్రవాహం అయింది. కన్నీళ్ళూ, కౌగిలింతలూ…. అతడు విచలితుడయ్యాడు. అందరూ ప్రొఫెషనల్సే.. కానీ వారి మనుసుల్లో తను ఇంతటి స్థానం సంపాదించుకున్నాడని తెలీదు. తప్పిపోయాడనుకున్న కుటుంబసభ్యుడు తిరిగి వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఫీలవటం….

ఆ ఆర్ద్రతకి అతడి మనసు ద్రవించింది.

తల్లి అతడిని చూసి పక్కమీదనుంచి లేచి వచ్చింది. అతడిని చేతులమధ్య తీసుకుని, అతడి చేతులమధ్య స్పృహ తప్పిపోయింది. అతడి చిన్నతనమునుంచీ వాళ్ళిద్దరే ఒకరికొకరిగా బ్రతికారు. తండ్రి లేడు. ఆమెకి అతడంటే ప్రాణం. అతడు తప్పిపోయాడని, జాడ తెలియడంలేదనీ తెలిసిన క్షణంనుంచీ ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు.

రెండు రోజులపాటు హడావుడి. పోలీసులు దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించి వెళ్ళారు. అతడు చాల విషయాలు చెప్పలేదు. అవసరమయినంతవరకే చెప్పాడు. పోలీసులు లక్ష్మిని కూడా ప్రశ్నించారు. కానీ ఏ వివరాలూ తెలియలేదు.

పేపర్లలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. గత కొన్ని రోజుల్నుంచి సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన సుఖాంతమైనందుకు ఎడిటోరియల్స్ కూడా వ్రాయబడ్డాయి. తను లేని రోజుల్లో పత్రికల్లో పడిన రకరకాల వార్తలు చదివాడు. చాలా రకాలుగా సర్క్యులేషన్ పెంచుకోవటానికి దాదాపు అన్ని పత్రికలూ ట్రై చేశాయి. అతడి దృష్టి ఒక పత్రికలో ఫోటో మీద పడింది. తన తల్లి ఫోటో అది. తను లేనప్పుడు ఆవిడ నిస్త్రాణగా ఎలా పడివున్నదీ వేశారు. అతడి కళ్ళల్లో తడి కదలాడింది. తనని బంధించినప్పుడూ, హింసించినప్పుడు కోపం రాలేదు. ఇప్పుడొస్తూంది. అతడు వివరాలన్నీ పోలీసులకు చెప్పనిది అందుకే, ఈ విషయం తనే స్వయంగా తేల్చుకోవాలి. ముఖ్యంగా, సెక్రట్రియేట్‌లో సుబ్బారావు అనేవాడు ఎవరూ లేడని తెలిసిన తర్వాత అతడిది ప్రాక్టికల్ జోక్ అనేది అర్థమైంది. ప్రనూష మీద అతడికి కోపం రావటంలేదు. ఒక కోటీశ్వరురాలు తనమీద అంత పెద్ద నాటకం ఎందుకు ఆడించిందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ అవుతూంది. వాళ్ళు తననుంచి ఎక్కువ ఆశించలేదు అనిపిస్తోంది. తను తప్పించుకుపోయాడని తెలిశాక వాళ్ళు ఆ హాస్పిటల్‌ని ఖాళీచేసి అక్కడునుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలా అని ఆలోచించారే తప్ప తనని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఆస్పత్రి బిల్డింగ్ నెలరోజులపాటే అద్దెకి తీసుకున్నారంతే….

ఒకటి మాత్రం నిజం!

నెలరోజుల తర్వాత తనని ఎక్కడికో తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్నారు వాళ్ళు.

లేదా తాను చైతన్య అనే విషయం పూర్తిగా మర్చి పోయేలా చేసి, పిచ్చివాడిగా మార్చి పంపించి వుండేవారు. తన రంగంలోవున్న ప్రత్యర్థులు చేసిన పనా ఇది? అదృష్టవశాత్తు సినిమారంగలో అంత దారుణాలు చెలరేగటంలేదు.

అయినా ప్రనూషని చూస్తూంటే అంత దారుణమైన ఆలోచన వున్న అమ్మాయిలా అనిపించలేదు. లక్ష్మి తమ్ముడిని కిడ్నాప్ చేసి వుంచిన చోట కూడా వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేదు.  కొన్ని విషయాల్లో ఎంత పకడ్బందీగా ప్రవర్తించారో, మరికొన్ని విషయాల్లో అంతే తేలిగ్గా వున్నారు.

రోజులు గడుస్తున్నాయి. క్రమక్రమంగా ఈ విషయం అందరూ మర్చిపోతున్నారు. అతడు మర్చిపోలేదు. తనకి జరిగిన విషయాలని అంత తొందరగా మర్చిపోయే స్వభావంకాదు అతడిది.

ఒకరోజు లక్ష్మి వచ్చింది. ఆ రోజు ఎవరో ఆమెకి పోస్ట్‌లో డ్రాఫ్ట్ పంపారు పాతికవేలకి! చిన్న థాంక్స్ కార్డుకూడా వుంది. లక్ష్మి తనకది చూపించగానే ‘ఇదేదో విదేశీ వ్యవహారం కాదు ముందు వూహించినట్టు ప్రాక్టికల్ జోకే! తన ఫాన్ ఎవరో లక్షలు ఖర్చుపెట్టి వేసిన ప్రాక్టికల్ జోక్!’ అనుకున్నాడు.

“పాతికవేలు వచ్చాయిగా, బీ. హాపీ” అన్నాడు నవ్వుతూ.

ఆమె నొచ్చుక్కుంటూ “నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను” అంది-దానికి ఈ పాతికవేలు బహుమతి కాదు అన్న నిష్ఠూరంతో.

అంతలో అతడి తల్లి వచ్చింది. లక్ష్మిని ఆమెకు పరిచయం చేశాడు “అమ్మా ఈ అమ్మాయే లక్ష్మి, నన్ను అయోమయంలో పడేసిన వాళ్ళల్లో మొదటిది.”

లక్ష్మి విషణ్ణవదనంతో “నా తమ్ముడు” అంటూ ఏదో అనబోయింది. అతడు బిగ్గరగా నవ్వి “నేను చెపుతున్నది నీ నటన గురించి” అంటూ తల్లివైపు తిరిగి, “ఎలా వుందమ్మా-వచ్చే సినిమాలో నా హీరోయిన్?” అని అడిగాడు.

లక్ష్మికి ముందు అర్థకాలేదు. అర్థమవగానే, మల్లెపూల పరిమళం చుట్టుముట్టినట్టయింది.

“నిజమా?” అంది తను వింటున్నది అబద్ధమేమో అన్న అనుమానంతో.

“నిజమే. ఈ రోజే ప్రొడ్యూసర్‌తో మాట్లాడాను. జూన్‌లో సినిమా ప్రారంభమవుతుంది. బహుశా నీ దగ్గరికి రేపొస్తారు వాళ్ళు” అన్నాడు.

ఆమెకు లోపల్నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది. ఆనందం మితిమీరగా వచ్చిన దుఃఖం అది. దాన్ని దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదామె. అతడి తల్లి ఆమె తలమీద అనునయంగా చెయ్యి వేసింది.  పేపర్లో ఫస్ట్‌క్లాస్ చూసుకుని ఏడ్చే చిన్నపిల్లలా ఏడ్చి, ఏడ్చి, కొంచెంసేపటికి ఆమె తేరుకుంది.

“ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను.”

“ఏం? నీకేం తక్కువ? ఒక స్టేజిలో నువ్వు నా భార్యవే నేమో అని నాకే అనుమానం వచ్చింది. అంత బాగా నటించావు”అన్నాడు.

లక్ష్మిని అతడి తల్లి లోపలికి తీసుకువెళ్ళి చాలసేపటివరకు ఆమె గురించిన వివరాలు అడిగింది. లక్ష్మి వెళ్ళిపోయాక కొడుకుతో “ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా వుందిరా చైతూ” అంది.

“నీ మెచ్చుకోలు సంపాదించిందంటే నిజంగానే మంచి అమ్మాయి అయివుండాలి” అన్నాడు అతను తేలిగ్గా. ఆవిడ మట్లాడలేదు. లక్ష్మికీ, తనకీ దగ్గర పోలికలున్నాయి అనుకుంది. ఒక చిన్న పావురం బలహీనమైన రెక్కల్తో ఒక గూడుని నిలబెట్టడానికి ప్రయత్నించినట్టు ఆ అమ్మాయి ఎక్‌స్ట్రా వేషాలు వేసి కుటుంబాన్ని పోషిస్తోంది.

ఒకప్పుడు తను అంట్లు తోమి కొడుకుని చదివించినట్టుగా.

 

                                              *         *          *

2 thoughts on “అతడే ఆమె సైన్యం

  1. ee story chinnappudu andhra Bhoomi lo chadivinattu gurtu. Andaru rachayitalu and cinema vallu telangana basha ni rowdilaki matrame pedataredunko artham kaledu naku.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *