February 21, 2024

‘ఏమి హాయిలే హలా!’

రచన: నండూరి సుందరీ నాగమణి

 

నవంబరు నెల మూడో  వారం. చలి పులిలా వణికిస్తోంది.

మా హైదరాబాద్ లో చలి మరింత ఎక్కువ. స్వెట్టర్ వేసుకొని, మఫ్లర్ కట్టుకొని, రగ్గు కప్పుకున్నా కూడా వణుకు ఆగటంలేదసలు. తెల్లవారిపోయినట్టుంది. మా వాళ్ళందరి మాటలు వినబడుతూనే ఉన్నాయి. రగ్గును మొహం మీదికి లాక్కుంటూ, బద్ధకంగా ప్రక్కకు తిరిగి మళ్ళీ పడుకున్నాను.

నా పేరు పరిమళ. కూకట్ పల్లి లోని ఒక బ్యాంక్ లో పని చేస్తున్నాను. మావారి ఆఫీస్ రామచంద్రపురంలో ఉండడంతో, కూకట్ పల్లి లోనే ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాం. మా అబ్బాయి శశాంక టెంత్ చదువుతున్నాడు.

పదిహేను రోజుల క్రితమే నాకు మేజర్ ఆపరేషనయి, ప్రస్తుతం సికింద్రాబాద్ లోని మా అత్తగారింట్లో బెడ్ రెస్ట్ తీసుకొంటున్నాను. నాకు తల్లిదండ్రులు లేకపోవటం వల్ల, ఉన్న తోబుట్టువులిద్దరూ దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఈ సమయంలో నాకు మా అత్తగారిపై ఆధారపడక తప్పలేదు.

మా అత్తగారికి ముగ్గురే సంతానం. మా బావగారు రైల్వేలో పని చేస్తున్నారు. మా తోడికోడలు శ్రీవల్లి మంచి గృహిణి. ఆమె పిల్లలు మాన్య, అనన్య ఒకరు డిగ్రీ లోను, మరొకరు ఇంటర్ లోను ఉన్నారు. మా ఆడపడుచు సునీతకు ఇంకా పెళ్ళి కాలేదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉంది. ఐదు సంవత్సరాల క్రితమే మా మామగారు పోయారు. స్వంత ఇంట్లోనే వీళ్ళంతా కలిసి ఉంటున్నారు.

హాస్పిటల్లో ఉన్న పది రోజులూ పగటి పూట మా శ్రీవల్లక్కయ్య, సునీత రాత్రి పూట మా వారు ఈశ్వర్ నా దగ్గర ఉండేవారు.  నన్ను పసిపాపలా, కంటికి రెప్పలా చూసుకున్నారు. కుట్లు విప్పిన తర్వాత ఇంటికి తీసుకు వచ్చారు. ఇక్కడ ఇల్లు చిన్నది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశ్యంతో మొదట మా ఇంటికే  వెళ్ళిపోవాలని అనుకున్నాను కాని, అక్కడ ఇంకా లిఫ్ట్ పెట్టకపొవడం వల్ల మెట్లు ఎక్కవలసి వస్తుందనే భయంతో  కొంతా, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఫర్వాలేదని కొంతా, అత్తయ్య గారి దగ్గరకే వచ్చాను.  అదీ గాక, నేను నీరసం నుండి కోలుకొని శక్తి పుంజుకోవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, నా శలవు పూర్తి అయేంతవరకూ ఇక్కడే ఉండమని అత్తయ్య గారు కూడా చెప్పటంతో ఇక కాదని అనలేకపోయాను.

చెబితే అతిశయోక్తిలా ఉంటుందేమో కాని, ఇది మా అమ్మగారిల్లులానే  అనిపిస్తుంది నాకు ఎప్పుడూ… వాళ్ళ అభిమానాలు అలాంటివి మరి. వచ్చింది మొదలు స్నానానికి, బాత్ రూంకి వెళ్ళటానికి తప్ప మంచం దిగనివ్వటం లేదెవ్వరూ. అన్నీ మంచం దగ్గరకే తీసుకువచ్చి తినేదాకా ప్రాణాలు తీస్తారు. ఉదయమే అల్పాహారం పెట్టటం, మందులు ఇవ్వటం మా సునీత పని. మధ్యాహ్నం ఆ డ్యూటీ అక్కయ్య తీసుకుంటే, రాత్రికి ఆ బాధ్యతను పిల్లలిద్దరూ పంచుకున్నారు. ఓవరాల్ గా అన్ని విషయాలూ అత్తయ్య గారు పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళ ఆప్యాయతకు ఒక్కోసారి కళ్ళలొ నీళ్ళు తిరుగుతాయి. పుట్టింటినే మరపింపజేసే అత్తగారిల్లు ఉండటం ఎంత అరుదైన వరం మరి!

ఉదయం ఆరుగంటలకే  హడావుడి మొదలౌతుందీ ఇంట్లో. నేను పడుకున్న చిన్న బెడ్రూంకు ఎదురుగా ఉంది, ఇంటికంతటికీ ఒకే ఒక్క బాత్ రూం. దాన్ని ఆనుకొని లావెట్రీ. బెడ్రూంని ఆనుకొని కిచెన్ ఉంటుంది. ఉదయం నుంచీ ఒకరి తర్వాత మరొకరు లావెట్రీ లోకి, తర్వాత స్నానానికి బాత్ రూం లోకి వెడుతూ ఉంటారు. అక్కయ్య, బావగారు, పిల్లలు, సునీత, అత్తయ్య అందరూ వరసగా స్నానాలు చేసి రెడీ అయిపొతూ ఉంటారు. గబగబా టిఫిన్స్ తినేసి, బాక్సులు సర్దుకొని బావగారు ఆఫీసుకి, పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు.

అప్పుడు పిలుస్తారు నన్ను వచ్చి స్నానం చేయమని. కొంచెం ఆగి చేస్తానంటే ఒప్పుకోరు. ఎందుకంటే, అందరి స్నానాలూ పూర్తి అయ్యాక, అదే బాత్ రూం లో బట్టలుతికే  కార్యక్రమం ఉంటుంది. అందరి విడిచిన బట్టల్నీ అక్కయ్య, సునీతా కలిసి ఉతికి, మేడ మీద ఆరేస్తూ ఉంటారు.

***

‘చిన్నొదినా, బాత్రూంలో నీళ్ళు పెట్టేసాను రా…’ అని సునీత పిలవటంతో మెల్లగా లేచాను. సునీత ఆసరాతో బాత్రూంలోకి వచ్చాను. అప్పటికే ఉతికిన టవల్, నైటీ వైర్ మీద వేసి రెడీ గా పెట్టింది నాకోసం. బకెట్ లోని వేడి నీళ్ళ పరిమాణం చూడగానే నా మనసు దిగులుగా మూల్గింది. ఎక్కడో అడుగున క్రిందనుంచి, మూడంగుళాల ఎత్తు వరకూ మాత్రమే వేడి నీళ్ళున్నాయి. కుళాయి తిప్పుకొని బకెట్ లొ సగం వరకూ చన్నీళ్ళు నింపేసరికి, ఆ వేణ్ణీళ్ళ ఉష్ణోగ్రతా స్థాయి, గోరువెచ్చనిదనం కన్నా తగ్గిపోయింది.

చాలా అసంతృప్తి గా స్నానం అయిందనిపించి, డ్రెస్ చేసుకొని బయటకు వచ్చాను.

అసలు విషయం ఏమిటంటే, నాకు చిన్నతనం నుంచీ వేడివేడిగా సెగలు గ్రక్కేలా నీళ్ళు పెట్టుకొని, అందులో తగు మాత్రంగా చన్నీళ్ళు కలుపుకొని ఒంటికి సేద దీరేలా, కాస్త వేడిగానే  ఉండే నీళ్ళతో స్నానం చెయటం అలవాటు.

నా చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద, సిల్వర్ తప్పేళా నిండా నీళ్ళు పెట్టి, మసిలేలా కాచి, పిల్లలందరికీ బకెట్లో పోసి ఇస్తూ ఉండేది. అందరికీ ఒక తప్పేళాడైతే, నాకు మాత్రం స్పెషల్ గా రెండు తప్పేళాల నీళ్ళు కాచి ఇచ్చేది. ఇప్పుడు మా ఇంట్లో ఐతే, ఉదయం ఐదున్నరకే గీజర్ ఆన్ చేసి ఉంచుతారు ఈశ్వర్. నిద్ర లేవగానే, బాత్ రూం లోకి వెళ్ళి, బ్రషింగ్ చేసుకొని, అలాగే  అరగంట సేపు వేడి వేడి నీళ్ళతో  జలకాలాడి వస్తూంటాను. ఆ తర్వాతే, కాఫీ టిఫిన్లైనా, వంటైనా… నడివేసవిలో కూడా వేడి నీళ్ళతో తప్ప చన్నీటి స్నానం చేయలేను నేను.  అలాంటిది, మా అత్త గారింటికి ఎప్పుడు వచ్చినా ఈ పాట్లు తప్పటం లేదు నాకు…

వీళ్ళింట్లో మరచెంబుకి, కూజాబిందెకి మధ్యస్థ పరిమాణంలో ఓ బుల్లి స్టీలు బిందె ఉంది. దాంట్లో ముచ్చటగా మూడే మూడు చెంబుల నీళ్ళు పడతాయి. కరెంటుతో పనిచేసే ఇమ్మర్షన్ హీటర్ ను ఆ బిందెలోని నీళ్ళలో పెట్టి, ఆన్ చేసి, కాగాక ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తారు వీళ్ళు. ఒక్కొక్కరికీ ఒక్కో బిందెడు నీళ్ళు… రేషన్ అన్న మాట. పొరపాటున కూడా  కొంచెం పెద్ద పాత్రతో  పెట్టటం కానీ, గ్యాస్ స్టవ్ మీద నీళ్ళు కాచటం కాని చేయనే చేయరు. అసలు ఈ వేణ్ణీళ్ళు కాచుకోవటం, వాటితో స్నానాలు చేయటం అంతా కేవలం శీతాకాలం లోనే. ఫిబ్రవరి నెల దాటిందా, ఇక ఇంటిల్లిపాదీ చన్నీటి స్నానాలే…

నేను అత్తయ్యతో, సునీత తో కూడా రెండు మూడు సార్లన్నాను. ‘నాకు చలి ఎక్కువ కాబట్టి, కొంచెం వేణ్ణీళ్ళు ఎక్కవగా కావాలని ‘ అప్పటికి ‘సరే’ అని అన్నా, మర్నాడు పని హడావుడిలో షరా మామూలే. నేనూ, మొహమాటం వల్ల గట్టిగా అడగలేకపోతున్నాను.

రోజులు గడిచే కొద్దీ ఇదే రొటీన్… స్నానం చేసినా, ఒళ్ళంతా చిరాగ్గా ఉంటోంది. చలి వల్ల చర్మం పొడి బారి, దురదలు మొదలయ్యాయి. అరకొర నీళ్ళతో, ఆదరా బాదరా స్నానం చేసి రావటం వల్ల మెడంతా నల్లగా తయారైంది. మోచేతులు, పాదాలు చెమట పట్టి, మట్టి సన్నని లేయర్ గా మాదిరి గా ఫార్మ్ అయి, లైట్ గా ఒళ్ళంతా అదో వాసన వేస్తున్న భావన కలుగుతోంది.  పరిమళ అన్న పేరు పెట్టుకున్నందుకు నాకే సిగ్గేస్తోంది.

ఒకరోజు అక్కయ్య పెట్టిన చపాతీలు తింటూ, క్యాజువల్ గా అన్నాను, “ఇంట్లో గీజర్ ఉంటే బావుంటుంది కదక్కయ్యా?…” అని.

“గీజరా? అంత ఖరీదైన వస్తువు మాకెందుకమ్మా? ఇంచక్కా హీటరుంది కదా?”

“చలికాలం కదక్కయ్యా? బకెట్ నిండా వేడి నీళ్ళతో స్నానం చేస్తె బావుంటుందిగా? గీజరుంటే, స్విచ్ వేసి ఉన్నంతసేపూ వేణ్ణీళ్ళు వస్తూనె ఉంటాయి ఎంచక్కా…”

“ఆ, అప్పుడు పిల్లలు, పెద్దాళ్ళు గంటల తరబడి బాత్ రూం లోనే తిష్ట వేసుకొని ఉండిపోతారు. పనులవద్దూ?” అని ఆవిడ తేలిగ్గా అనేయటంతో అప్పటికేమీ మాట్లాడలేకపోయాను.

మరొకరోజు సునీత తో చెప్పాను. నాకు నీళ్ళ వేడి ఏ మాత్రమూ సరిపోవటం లేదని…

“అబ్బ, అంత వేడి నీళ్ళు పోసుకోకూడదులే వదినా, గోరువెచ్చగా ఉంటే చాలు…” అంది సునీత.

అత్తయ్య కల్పించుకొంటూ, “చలికాలంలో బాగా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల చర్మం పాడైపోతుందమ్మా…” అని చెప్పటంతో నాకు నవ్వాలో, ఏడవాలో తెలియలేదు.

రోజు రోజుకీ నా పరిస్థితి మరీ దుర్భరమైపోతూ ఉండటంతో, మా అత్తయ్యను, అక్కయ్యనూ, బాబు మీద బెంగగా ఉందనీ, ఇంటికి వెళ్ళిపోతాననీ రోజుకోసారి  అడగసాగాను.

“ఆదివారం ఆదివారం ఈశ్వరూ, శశాంకూ వస్తూనే ఉన్నారు కదమ్మా, మరీ చోద్యం చెబుతావు… వెళ్దువు గాన్లే, నీకు కొంచెం ఓపిక రానివ్వు… సునీత నీకు సాయం గా వచ్చి, నీ లీవ్ అయిపోయేవరకూ నీకు తోడుంటుంది…” అని అత్తయ్యా, “వచ్చే వారం ఎలాగూ చెకప్ కి వెళ్ళాలి కదా, డాక్టర్ ని కలిసి, మందులవీ రాయించుకొని, వెళ్ళిపోదువు గాన్లే పరిమళా… కొంచెం ఓపిక పట్టు…” అని అక్కయ్యా అంటూ ఉంటే, మొండి పట్టు పట్టి బలవంతంగా వెళ్ళిపోవటానికి మనసు రాలేదు నాకు.

అదీగాక ఇంకా నీరసమూ తగ్గలేదు పూర్తిగా… ఇంటికి వెళ్ళి, వంట పనీ, ఇంటి పనీ చేసుకొనే శక్తి లేదు. పుట్టింట్లో కన్నా అపురూపమైన వైభవంగా ఉందిక్కడ నాకు.. దీన్ని వదులుకొని వెళ్ళాలంటే ఎంత కష్టం? కానీ నా బాధ ఎవరికి అర్థం అవుతుంది? బొత్తిగా స్నాన సుఖం లేదిక్కడ… పోనీ వేసవి కాలమైనా కాదాయె… ఎవరైనా వింటే ‘ఇదీ ఓ సమస్యేనా?’ అని నవ్వుకుంటారేమో నాకు తెలియదు కాని, అనుభవిస్తున్న నాకే తెలుసు ఇది ఎంత నరక సదృశ్యమో…

***

వావ్… ఎంత బావుందో… లేతాకుపచ్చ రంగు బాత్ టబ్ లో హాట్ వాటర్ నింపి, దాంట్లొ లిక్విడ్ సోప్ ఒంపి, తలకు షవర్ క్యాప్ బిగించి, నురగలు తేలే ఆ నీళ్ళలో మునిగి స్నానం చేస్తూ ఉంటే, ‘ఆహా, నా రాజా… స్వర్గమంటే ఇదే కదా…’ అనిపిస్తోంది.     అలా చేప పిల్లకు మల్లే ఈదుతూ… వేడి నీటిలో నానుతూ ఉంటే, ఎంత హాయిగా ఉందో చెప్పటానికి మాటలు రావటం లేదు…

ఎక్కడినుంచో ఫోను మ్రోగుతున్న ధ్వని… ‘అబ్బా… ఈ తీయని స్నానం అర్థాంతరంగా ముగించి, లేచి వెళ్ళి ఆ డొక్కు ఫోన్ కాల్ అటెండ్ అవాలా?’ అయిష్టంగానే లేచి, ఒళ్ళు తుడుచుకొని…బాత్రూం గడియ…

“పిన్నీ, నీ సెల్ ఆగకుండా మోగుతోంది… మీ ఆఫీస్ వాళ్ళెమో చూడు…” అంటూ లేపేసింది, అనన్య. మంచి కల కాస్తా హటాత్తుగా కరిగిపోయింది.  నా నిద్ర ఎగిరిపొయింది… ఈ లోగా ఫోన్ మోతా ఆగిపోయింది.

అబ్బ, ఎంత తీయని కల! టబ్ లో స్నానం భలే బావుంది… ‘స్వంత ఇల్లు కట్టుకుంటే, దాంట్లో పెద్ద బాత్ రూం, అందులో చక్కని బాత్ టబ్, మంచి గీజర్… తప్పకుందా అమర్చుకొవాలి…’ గట్టిగా నిశ్చయించుకున్నాను.

మొత్తానికి నాలుగు రోజుల తర్వాత, డాక్టర్ని కలిసిన వెంటనే మా  శ్రీవారు వచ్చి, కారులో నన్నూ, సునీతని మా ఇంటికి తీసుకువెళ్ళటానికి ఖరారైంది.

***

కారు మా అపార్ట్ మెంట్ లోనికి ప్రవేశిస్తూ   ఉంటే, కన్న తల్లి ఒడిలోనికి చేరుకున్న భావన… ఏదో తెలియని ఉద్వేగం, సంతోషం… ముందు సునీత నడుస్తూ ఉండగా, మెల్లగా శ్రీవారి చేయి పట్టుకొని మెట్లెక్కుతూ, ఫస్ట్ ఫ్లోర్ లోని మా ఫ్లాట్ కి వచ్చాను. అప్పటికే మా బాబు స్కూల్ కి వెళ్ళిపోయాడు. జాగ్రత్తలు చెప్పి ఈశ్వర్ కూడా ఆఫీసుకు వెళ్ళిపోయారు.

ఆయన బయలుదేరగానే, నేను చేసిన మొదటి పని… బాత్ రూం దగ్గరకు వెళ్ళి, గీజర్ స్విచ్ ఆన్ చేయటం…

ఇంట్లోనే తిఫిన్లు తినేసి, మధ్యహ్నానికి కూడా లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాం కాబట్టి మాకు వేరే పని ఏమీ లేదు. సునీత టీవీ ముందు సెటిల్  అయిపోయింది.

పావుగంట తర్వాత,

టవల్ తీసుకొని, నేను బాత్ రూం వైపు నడుస్తుంటే ఆశ్చర్యంతో నోరు తెరిచింది సునీత.

***

“ఉదయమే స్నానం చేసావుగా, మళ్ళీనా?” అంది వింతగా చూస్తూ… నేను నవ్వేసి, మెల్లగా నడచుకుంటూ బాత్ రూం లోకి ప్రవేశించాను. నాబ్ ని హాట్ వాటర్ ఔట్ లెట్ వైపు తిప్పి, టాప్ ఆన్ చేయగానే జల జల మంటూ పొగలు కక్కే వేడి నీళ్ళు జలతరంగిణీ నాదంతో బకెట్లో పడసాగాయి. బంగారం కరిగి నీరై ద్రవ రూపంలో పడుతున్నట్టు ఎంతో విలువైనవిగా, అపురూపమైనవిగా అనిపించాయి ఆ నీళ్ళు..

‘జలకాలాటలలో… కలకల పాటలలో….

ఏమి హాయిలే హలా! అహ ఏమి హాయిలే హలా!’

అప్రయత్నంగా నా పెదవుల మీదికి పాట వచ్చేసింది.

అరగంట సేపు తనివి తీరా స్నానం చేసాక నాకు కలిగిన ఆ తృప్తి, హాయి, సుఖం నిజంగా అనిర్వచనీయం…

***

ఆ ఏడాది  మా అక్కయ్య పుట్టినరోజుకు పెద్ద గిఫ్ట్ పాకెట్ తీసుకువెళ్ళి, చేతివ్వకుండా [బరువు కదా మరి!] ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతుంటే, ఆ వస్తువును చూసి మా వాళ్ళంతా విస్మయంతో నోళ్ళు తెరిచారు.

అది చీర కాదు…ఆభరణాలు కావు… స్టీలు పాత్రలూ కావు… ఔను… అది ‘గీజర్ ‘ …

ఎవ్వరూ ఇలాంటి బహుమతిని ఇవ్వరని తెలుసు నాకు… కానీ నేను అత్తయ్య గారింటికి వచ్చినప్పుడు సంతోషంగా వాళ్ళతో గడపాలంటే, ఈ వస్తువు ఇవ్వటం తప్పనిసరి అని నాకనిపించింది. ఇదంతా నా స్వార్థమే కావచ్చు, కానీ ఇకపై వాళ్ళింట్లో నేను  ఏ అగచాట్లూ పడనక్కరలేదుగా?

సునీతా, అక్కయ్యా ముఖ ముఖాలు చూసుకొని నవ్వు దాచుకొంటుంటే, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు?’ అన్న దేవులపల్లి వారి పంక్తులు గుర్తుకు వచ్చాయి నాకు…

‘సుఖ స్నాన ప్రాప్తి రస్తు!’ అంటూ నాలోని ఉష్ణ జల ప్రియురాలు నన్ను విష్ చేస్తూ ఉంటే,  ఆపుకోలేనంత ఆనందం చిరునవ్వుగా మారి నా పెదవులపై విరిసింది.

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *