February 21, 2024

ఓహో గులాబి బాలా – పారసీక ఛందస్సు – 1

రచన: జెజ్జాల కృష్ణమోహన రావు

 

 

 

 

 

 

 

 

ఈ వ్యాసము ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారికి స్మృత్యంజలిగా వ్రాయబడినది.  వారికి గజలులు ఇష్టము కనుక అవి కూడ ఇందులో నున్నాయి. శ్రీనివాస్ గారు  సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, బహుభాషాకోవిదుడు, కవి, వాగ్గేయకారుడు, పరిశోధకుడు. వారు పాడిన ఓహో గులాబిబాలా అనే పాట శ్రోతలను ఆకట్టుకొన్న పాటలలో మఱువరానిది. ఈ పాట పల్లవి ఇలా సాగుతుంది –

 

ఓహో గులాబి బాలా – అందాల ప్రేమ మాలా

సొగసైన కనులదానా – సొంపైన మనసుదానా

నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో

ఈ పాట రచయిత దాశరథికి ఉర్దూ పారసీక భాషలతో పరిచయము గలదు.  పై పాట పల్లవి ఛందస్సు ఒక పారసీక ఛందస్సును బోలినది.  దాశరథిగారు దానిని అనుసరించి వ్రాసారో లేక కాకతాళీయముగా ఈ గీతి ఆ ఛందస్సులో వ్రాయబడినదో అనే విషయము మనకు తెలియదు. ఈ ఛందస్సును ముజారీ ముసమ్మన్ అఖ్‌రబ్ అంటారు.

దీని అమరిక ఇలా వివరించబడినది: ==- / =-== // ==- / =-== . మన గురు లఘువుల చిహ్నాలతో ఇది ఇలాగుంటుంది: UUI UIUU – UUI UIUU. ప్రతి పాదములో పూర్వోత్తరభాగములు ఒకే విధముగ నుంటుంది. పాదము మధ్యలో సంస్కృతములోలా విరామయతి (ఆంగ్లములో caesura) ఉంటుంది, అనగా పదము దానికి ముందు విరగాలి.  ఈ ఛందస్సు సూత్రము – మఫఊల ఫాయలాతున / మఫఊల ఫాయలాతున.

సంస్కృత ఛందస్సులో UUI UIUU లేక త-ర-గ గణాలతో భీమార్జనము లేక తరంగ అని ఒక వృత్తము ఉన్నది. దానికి నా ఉదాహరణలు –

భీమార్జనం లేక తరంగ – త-ర-గ

7 ఉష్ణిక్ 21

కాయమ్ము నీకె యిత్తున్

శ్రీయంచు నిన్నె దల్తున్

ధ్యేయమ్ము జూపగా రా

నా యంతరంగమా రా

ప్రాణమ్ములోని శ్వాసై

గానమ్ములోని ప్రాసై

యానమ్ములోని ధ్యాసై

రా నమ్మియుంటి నిన్నే

రెండు తరంగ వృత్తాలను చేరిస్తే మనకు పై పారసీక ఛందస్సు (ముజారీ ముసమ్మన్ అఖ్‌రబ్) లభిస్తుంది. అటువంటి వృత్తము నావద్ద ఉండే 1000 వృత్తాలకు పైగా ఉండే పట్టికలో కనబడలేదు. ఈ నూతన వృత్తమును నేను తరంగమాల అని పిలువదలచాను.  ఈ తరంగమాలకు నా ఉదాహరణలను క్రింద ఇస్తున్నాను –

తరంగమాల – త ర మ జ గగ, యతి (1, 8)

14 శక్వరి 2581

నాముందు వేగ రావా – నాదమ్ము పాడ రావా

మోమోట మేల నీకున్ – మోదంపు పాత్ర తేవా

ఆమోద మాయె నాకున్ – ఆశాతరంగమాలా

ప్రేమాలయమ్ములోనన్ – వెల్గొందు యగ్నికీలా

రాధా ప్రమోదకారీ – రాగస్వరూప హారీ

నాదస్వరూప శౌరీ – నాసాగ్ర రత్నధారీ

శ్రీదేవి చిత్తహారీ – ప్రేమాశ్రయా మురారీ

నీ దీవ్య నామమేగా – నిత్యమ్ము స్వర్గమౌగా

నా యింటి వెల్గు నీవే – నా కంటిపాప నీవే

ప్రాయంపు కోర్కె నీవే – భావాంతరంగ మీవే

నా యెల్గు మాట నీవే – నా గుండె పాట నీవే

నా యిష్ట మూర్తి నీవే – నా మువ్వ నాల్క నీవే

పాటలలో ఈ తరంగమాల ఛందస్సు అలాగే ఉండదు, దాని లయతో మాత్రాగణాలతో పాటలను వ్రాస్తారు కవులు. మాత్ర లేక కళ అంటే ఒక లఘువును ఉచ్చరించు కాలావధి, ఒక గురువు రెండు మాత్రలను ఉచ్చరించు కాలపు అవధి.  పాటలలో చివరి లఘువును గురువుగా సాగించి పాడుట సర్వసామాన్యము.  పై ఛందస్సులో ఈ మాత్రాగణాలు సామాన్యముగా – పంచమాత్ర, త్రిమాత్ర, చతుర్మాత్ర, మళ్లీ పంచమాత్ర, త్రిమాత్ర, చతుర్మాత్ర.  అలాటి గజలు నొకదానిని మీర్జా గాలిబ్ వ్రాసాడు.  ఇది సుప్రసిద్ధమైన ఏ న థీ హమారీ కిస్మత్ అనే పాట.  దీనిని అదే అర్థములో అదే ఛందస్సులో (మాత్రాగణముల తరంగమాల) తెలుగులో అనువదించియున్నాను.  ఆ పాటను విని, దానికి అదే ఛందస్సులో  నా తెలుగు సేతను ఇక్కడ చదివి ఆనందించండి  (http://www.eemaata.com/em/issues/201201/1897.html/5/ ).

మళ్లీ ఓహో గులాబి బాలా పాటను పరిశీలిద్దామా? దాని మాత్రాగణాలు క్రింది విధముగా విరుగుతాయి –

ఓహో గు | లాబి | బాలా | – | అందాల | ప్రేమ | మాలా |

సొగసైన | కనుల | దానా | – | సొంపైన | మనసు | దానా |

నీవారె | వరో | తెలుసుకో

ఈ ఛందస్సులో మఱొక అద్భుతమైన సినిమా పాట – మిస్సమ్మ చిత్రములోని రాజా లీలలు పాడిన రావోయి చందమామా అనే పాట.

చరణాలలో కచ్చితముగా ఈ ఛందస్సు పాటించబడలేదు,  అవి యెక్కువగా చతుర్మాత్రలతో నడుస్తాయి.

రావోయి చందమామా – మా వింత గాథ వినుమా

సామంతముగల సతికీ – ధీమంతుడనగు పతినోయ్

సతిపతి పోరే బలమై – సతమత మాయెను బ్రదుకే

ఈ ఛందస్సులో నేను వ్రాసిన రెండు గజలులతో ఈ వ్యాసమును ముగిస్తాను –

1) నీ కురుల నీడలో నే – నిదురించి కలల గంటి

నీ కనుల జాడలో నే – నెనరుంచి నిలిచియుంటి

రా కవిత స్వీకరించుము – రమ్మెదురు జూచుచుంటి

రా కజ్జలమున నే బలు – రాత్రులను గాంచుచుంటి

ఇంపైన రాత్రి సమయ – మ్మిక నేను సైపనంటి

సొంపైన మత్తు నిండెను – సొలసిల్లి వేచుచుంటి

కంపిచ్చు పూలగందము – కరువలిని వలద నంటి

తెంపీయ తేలిరావా – తెలిమేఘ మనుచునుంటి

2) చాలించు కోకిలా నీ – సరసాల గీతి నింక

ఆలించలేను నే నా – హరుసాల ప్రీతి నింక

గాలించిచూడ నీ హృది – గాయంపు మందు లేదే

కాలాల పాటు నే నీ – గాలమ్ము తీయ నింక

ఎగసేను రక్తధారలు – హృది గుచ్చ నా గులాబి

ముగిసేను కథయు నాయది – పొగ మిగులు భూమి నింక

వగ చేదు వేమువలె నా – పగయాయె విధియు నేడు

జగమందు లేక నీవిట – జ్వలియించు హృదయ మింక

 

3 thoughts on “ఓహో గులాబి బాలా – పారసీక ఛందస్సు – 1

  1. అందమైన అధునాతన సమాజపు పునాదులై …ప్రతిబెరిగిన పదముల సమూహము నేటితరవాసులకు ఇంపైన అమృతభాండం… thankyou for yours bright creation…..

  2. I think I understand now. 5 counts 4 counts 3counts 4counts makes a little clearer than the other explanation for me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *