కవి మిత్రులు మానాపురం రాజా చంద్రశేఖర్‌తో ముఖాముఖి:

ముఖాముఖి నిర్వహణ: బులుసు సరోజినీదేవి

మాలిక అనే అంతర్జాల పత్రిక ఒక కవిని పరిచయం చెయ్యమని చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చిన కవి శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. కవిత్వం పట్ల అతనికుండే ఆరాధనాభావం నాకు బాగా నచ్చింది. అతనిది కూడా మా ఊరే! కలలకు పుట్టినిల్లైన విజయనగరంలో అతని పరిచయం జరిగింది.

“ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ తరవున గ్రూప్ డిస్కషన్‌లో అనుకోకుండా చంద్రశేఖర్‌గారు కవి అని తెలుసుకున్నాను. నేను తమాషాగా ‘నేను కూడా కవిత్వం రాయవచ్చునా?’ అని అడిగిన ప్రశ్నకు ‘అది అందరి సొత్తు అని బదులిచ్చారు. ఆ తర్వాత కవిత్వం పట్ల నాకుండే ఉత్సుకతతో అతనిని కలిసినప్పుడు కవిత్వాన్ని ఒక్కటొక్కటిగా నాకు వినిపించారు. ఈ ప్రయత్నంలో చిన్నతనం నుండే అతనికి కవిత్వం పట్ల గాఢమైన అభిరుచి, ఆసక్తి చంద్రశేఖర్ అవలీలగా చెప్పిన వాక్య నిర్మాణాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

తన చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రపంచాన్ని, పరిసరాల్ని అతను అనుభవించి, పలవరించి, వ్యక్తీకరించే తీరు నన్ను అమితంగా ఆకట్టుకునేది. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఎంత సరళంగా ఉంటాడో, రాసినవి చదివేటప్పుడు కలిగే ఆవేశం, ఆర్ద్రత, ఎలా వచ్చేవో ఒకపట్టాన అర్థమయ్యేవి కావు. అతని హావభావాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి.  ఒకరి దగ్గర మెప్పు పొందాలనో,   పైస్థాయికి ఎదగాలనో, అందరికంటే గొప్పవాడిగా చిత్రించబడాలనో, అర్థికంగా ఎదిగి గొప్పవాడిగా చలామణి అవ్వాలనో  చంద్రశేఖర్‌లో మచ్చుకైనా కనిపించదు. వీరు ‘ఎదిగే ప్రయత్నాలు ఎందుకు చెయ్యలేద’ని అడిగినప్పుడల్లా మౌనంగా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చేవారు. చాల నిరాడంబరుడు. శుభ్రతను పాటించడమే తప్ప, ఈ కాలపు ఆధునిక ఫ్యాషన్‌లను ఇష్టపడటానికి ఒప్పుకోరు.

కొంతమంది ఒక్కసారి చెప్పితే అందుకునే స్థాయిలో ఉంటారు. మరికొంతమంది రెండు మూడుసార్లు చెబితే అందుకోగలుగుతారు. చాల మంది మనకి, మన సమాజానికి ఎలా ఉపయోగపడాలో, మనని మనం ఎలా రూపుదిద్దుకోవాలో, ఏ దిశగా నడవాలో తెలియని వ్యక్తులకు దారి చూపేది కవిత్వమేనని తెలియ జెప్పినా సరే, దానికి రాజ చంద్రశేఖర్ విముఖతనే ప్రదర్శిస్తాడు. కవిత్వాన్ని వదిలి అందరిలోకి రమ్మని కోరినప్పుడు, నా కవితలు సమాజంలో ప్రయాణించాలే తప్ప నేను కాదు అని చెబుతాడు. చంద్రశెఖర్‌కి ఆలోచనను, సమాజం పట్ల అతనికుండే అభిప్రాయాల్ని, అతని బాధల్ని, సమాజంపై ఖచ్చితంగా ఉండే బాధ్యతల్ని నిబద్ధతతో రచనలరూపంలో చేసే ప్రయత్నాన్ని అతని మాటల్లోనే విందాం.

అతను నా దగ్గరికి ఒకసారి వచ్చి కలవమని పిలిచినప్పుడు, ఇంటర్వ్యూ చేస్తానని కోరినప్పుడు అతను చాల ఆశ్చర్యపోయాడు అతని భావాల్ని అప్పటికప్పుడు రాబట్టడమే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం!

*                                                             *                                                             *

ప్రశ్న    :-        మీకు కవిత్వం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?

జవాబు :-        బాల్యంలో నామీద పడిన అనేక ప్రభావాల నుంచి కవిత్వం మీద మక్కువ ఏర్పడింది.

ప్రశ్న    :-        కవిత్వంలో మీ బాల్యం గురించి చెప్తారా?

జవాబు :-        మా నాన్నగారు నాటకాలు వేస్తుండేవారు. ఆ మూలాల పునాదుల్నుంచే నా కవిత్వం పుట్టిందనుకుంటాను.

ప్రశ్న    :-        మీ నాన్నగారి గురించి కూడా చెబుతారా? వారిలోనూ ఈ ప్రతిభ ఉందన్న   మాట.

జవాబు :-        మా నాన్నగారి పేరు పట్టభిరామయ్య. అతను స్వతహాగా రంగస్థల పౌరాణిక నటులు సాహిత్యకారుడు కాదు.

ప్రశ్న    :-        మరి కవిత్వం రాయాలని ఎందుకనిపించింది?

జవాబు :-        నాలో ఉన్న ఆసక్తి, అధ్యయనం, పరిశీలన కవిగా నన్ను మలిచింది.

ప్రశ్న    :-       మీ మొదటి కవిత ఏమిటి?

జవాబు :-        బామ్మ (చిరునవ్వు)

ప్రశ్న    :-       మీ బామ్మమీదే కవిత్వం ఎందుకు రాయాలనిపించింది?

జవాబు :-  మా నానమ్మ చేసిన అతిగారాబం వలన కావచ్చు, అదే చివరికి కవితగా రూపుదిద్దుకుంది.

ప్రశ్న    :-        ఆ కవితను ఒకసారి వినిపిస్తారా?

జవాబు :-        బామ్మ (కవిత) ******

ప్రశ్న    :-        చాల బాగుంది. మీ కవిత్వ మూలాలకి వేర్లు ఎక్కడున్నాయి?

జవాబు :-        నన్ను ప్రభావితం చేసిన దృశ్యాలు… పరిసరాలు… ప్రేరేపించిన వ్యక్తులు సందర్భాలు అనేకం.

ప్రశ్న    :-        మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులు గురించి వివరిస్తారా?

జవాబు :- మా తాతగారు బగ్గం వెంకట రమణాజీరావుగారు, వెంకన్న-భాస్కర్‌లు, రచయిత శంకర్ తాతయ్య, సాహితీ మిత్రుడు సురేష్, మా గురువుగారు డా!!రామసూరి, ఇంకా అనేకమంది బంధు, సాహితీ మిత్ర ప్రముఖులు.

ప్రశ్న     :-       వాళ్ళ గురించి ప్రస్తావించండి!

జవాబు :-        నా విద్యాభ్యాసం మా తాతగారింట జరిగింది. ఇది నా రెండో దశ. నాకు ఐదేళ్ళ ప్రాయంలోనే రమణాజీగారు వేసే సాంఘిక నాటక పుస్తకాలు చదవడం మొదలు పెట్టేవాణ్ణి. ఆయన చదివే డైలాగ్స్‌ని వెనకుండి విని అనుకరించేవాణ్ణి. దీని వలన ఉచ్ఛారణలో ఉండే అక్షరదోషాల పలుకుబడిని గమనించేవాణ్ణి. అలాగే వెంకన్న-భాస్కర్‌లు నాకు లెక్కలు బోధించే మిత్ర అధ్యాపకులు. వాళ్ళు తమ మాటల్లో తరచుగా సాహిత్యాన్ని గురించి చర్చ చేస్తుండేవాళ్ళు. ఆ ప్రేరణ నాపై పరోక్షంగా పడింది. ఇక పెద్దింటి సూర్యనారాయణగారు అని మా తెలుగు మాస్టారు మరొకాయన ఉండేవారు. తెలుగు పద్యాన్ని అతను రాగయుక్తంగా భావప్రధానంగా చదివే తీరు నాకు బాగా నచ్చేది. నన్ను ప్రోత్సహించే మరో ఆత్మీయ వ్యక్తి మా శంకర తాతయ్య. ఇతను స్వతహాగా రచయిత కూడా. సాహిత్యాభిరుచి మెండుగా కలిగిన వ్యక్తి. ఇక మిగిలింది నా ప్రియ మిత్రుడు సురేష్. మా ఇంటి ముందు భాగంలో అతని గది ఉండేది. అందులో పెద్ద సాహిత్యం లైబ్రరీ ఉండేది. చలం, రవిశాస్త్రి, గోపీచంద్, అడవి బాపిరాజు, కారామాస్టారు, గోరాశాస్త్రి, బీనాదేవి, శ్రీ శ్రీ, తిలక్, శివారెడ్డి, అద్దేపల్లి, చినవీరభద్రుడు, వోల్గా, చెకోవ్, గోపీ, ఠాగూర్, షేక్స్‌పియర్, బెర్నాడ్‌షా వంటి ప్రముఖల రచనలు అందులో కనిపించేవి. నాకు తెలిసినంత మేరకు, అర్థమైనంత వరకూ చదివి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. సురేష్ లైబ్రరీ మీద ‘మిత్రుని లైబ్రరీ’ అనే ఒక కవితను కూడా రాశాను. ఆ తర్వాత సాహిత్యవేత్తగా, లెక్చరర్‌గా డా!!రామసూరితో పరిచయం ఏర్పడింది. ‘యువస్పందన’  అనే సాహిత్య సంస్థను అతని అధ్యక్షతన నడుపుతుండేవాళ్ళం. నెలనెలా ఒకపుస్తక సమీక్ష, కవితాపఠనం జరిపేవాళ్లం. ఇలా ఇంట్లోనూ జిల్లా గురజాడ లైబ్రరీలోనూ ఆది, సోమవార అనుబంధ-దిన పత్రికలు విరివిగా చదువుతుండేవాణ్ణి. ఆ తర్వాత మద్యమధ్యలో మిత్రులతో సాహిత్య చర్చలు, సమావేశాలకు హాజరు కావడం, కవి సమ్మేళనాలలో పాల్గొనడం చేస్తుండేవాణ్ణి. ఈ క్రమంలోనే నన్ను నేను తీర్చి దిద్దుకుంటూ పత్రికల్లో కవిత్వరచన చేస్తుండేవాణ్ణి.

ప్రశ్న:- మూలాలు, ప్రేరణ సరే… కవిత్వం రాయడానికి కావల్సిన అనుభవం, నేర్పు ఎక్కణ్ణుంచి వచ్చింది ?

జవాబు :- నేను చూసిన జీవితం నుంచి. నేను గ్రహించిన వాస్తవాల లోతుల్నుంచి. నేర్చుకున్న అనుభవ పాఠాలనుంచి. సాధన చేస్తునప్పుడు కవిత్వరూపంలో ఇవన్నీ అంతర్లీనంగా నాలోంచి తొంగి చూస్తూనే ఉంటాయి. పైగా నేను డిగ్రీలో స్పెషల్ తెలుగు విద్యార్థిని. మా గురువుగారు డా!యు.ఏ.నరసింహమూర్తిగారు. ప్రముఖ సాహితీవేత్త. వ్యాసాలు రాయడంలో మంచి దిట్ట. రమణయ్య మాస్టారు. సి.వి.సాయినాధశాస్త్రిగార్లు నాకు తెలుగు సహ అధ్యాపకులు. వీళ్ళ కనుసన్నల్లో తిరుగాడిన నేను సాహిత్యకారుడిగా రూపుదిద్దుకోకుండా ఎలా ఉండగలను?

ప్రశ్న :- వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక సంఘర్షణలోకి మీ కవిత్వం ఎలా తొంగి చూసింది?

జవాబు :-        కళ్ళముందు దృశ్యాల్ని చూసి, ఆవేదనలో రగిలి, ఆర్ద్రతతో ద్రవీభవించినప్పుడు ప్రసంచ పోకడలు అవగతమయ్యాయి. అందులోంచి నన్ను నేను తీర్చి దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను.

ప్రశ్న :- మీ బాల్యం గురించి చెప్పారు సరే.  కాని చాలా మంది ఈ జీవితంలో తమ అపురూపమైన బాల్యాన్ని అనుభవించలేక, సరైన పోషణ, విద్య కరువై పసువుల కాపరిగా గడపడంపై మీరు ‘గాయపడ్డ బాల్యం’ అనే కవితను అద్భుతంగా రాసారని అందరూ చెపుతుంటే విన్నాం. దాన్ని కొంచెం చెప్తారా?

జవాబు :-        ‘గాయపడ్డ బాల్యం’ కవిత *****

ప్రశ్న :- మీ చుట్టూ వున్న పరిస్థితులు, పరిసరాలతోపాటు మీరు నడిచే వారా? మీ స్నేహితుల కంటే భిన్నంగా ఉండాలని ఆలోచించేవారా?

జవాబు :-        మిత్రులతో కలిసిమెలిసి పెరిగినా, నా ఆలోచనలు మాత్రం చాలా చురుకుగా, సృజనాత్మకంగా, కళాత్మకంగా సాగుతుండేవి స్వతహాగా తొలిదశలో ఆయిల్ పెయింటింగ్స్ వేస్తుండేవాణ్ణి. అలా కొత్త వస్తువుని దర్శించడలోనూ, పరిశీలించడంలోనూ కొత్తదనాన్ని ప్రయత్నించేవాణ్ణి. అధ్యయన పూర్వకంగా అనుభపూర్వకంగా చాల విషయాలు బోధపడతాయని తెలుసుకున్నాను. అలాగని ‘బిన్నత్వంలోని ఏకత్వానికీ వ్యతిరేకిని కాదు.

ప్రశ్న :- మీరు చదివి రాసిన సాహిత్యానికి చదివిన చదువు ఏమైనా ఉపయోగపడిందా?

జవాబు :- ముమ్మాటికీ…! నేను ఎం.ఏ.లో రాజనీతిశాస్త్రాన్ని అభ్యసించాను. అలాగే పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ చదివిన తెలుగు, ఆంగ్ల పద్యాలు నన్ను బాగా ఆకట్టుకునేవి. వేమన, సుమతి, దాశరధి శతకాలతోపాటు ‘ఒజ్మాండియాస్’ అనే ఆంగ్లపద్యం, విలియం బ్లేక్ రాసిన ‘సింపథి ’ నాకు బాగా నచ్చిన రచనలు. షేక్స్‌పియర్ రాసిన ‘సానెట్స్’ వినడం నాకు చాలా ఇష్టం. తెలుగులోని పేదరాశి పెద్దమ్మ కథలు,  విచిత్ర కాశీమజిలీ కథలు, ఆవు-పులి కథ, నక్క-భూమి కథ,  ఓహెన్రీ కథలు, ఆలిస్  ఇన్ వండర్ లేండ్, ఎంకి, జానపద పాటలు, సంక్రాంతి , దసరా పాటలు, గురజాడ దేశభక్తి గీతం. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చెప్పలేనంత ఇష్టం నాకు. విషయాన్ని విస్తృతపరుచుకుంటేగాని, సానబెట్టుకుంటేగానీ చదివిన చదువుకు సార్ధకత లభించదని నా అభిప్రాయం.

ప్రశ్న :- వర్తమాన పరిస్థితుల మీద మీ అభిప్రాయమేమిటి ?

జవాబు :-        ప్రపంచమంతా వ్యాపార మయమైపోయింది. ఆర్ధిక అవసరాలు సమాజాన్ని, దేశాల్ని పట్టి పీడిస్తూ శాసించే స్థాయికి ఎదిగాయి. చాప కింద నీరులా ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న సామ్రాజ్యవాద సంస్కృతి నలుదిశలా వ్యాపిస్తూ విస్తరిస్తోంది. అంతా ఒక కుగ్రామమైపోయింది. ప్రపంచీకరణ ముసుగులో అన్ని మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి ముడిసరుకులుగా వలసపోతున్నాయి. చివరికి మనిషి జీవితమే యాంత్రికమైపోయింది.

ప్రశ్న :- ప్రపంచీకరణ నేపథ్యం లో కవితలు రాశారా?

జవాబు :-        చాలా రాశాను ‘ముందు వెనుకల ప్రపంచంలోకి…” అనే కవితను ఇప్పుడు ఉదాహరిస్తాను.

“ముందు వెనుకల ప్రపంచంలోకి…” (కవిత) *****

ప్రశ్న :- ఈ ప్రపంచీకరణను దృష్టిలో పెట్టుకోని చూసినప్పుడు ఏఏ రంగాలపై వీటి ప్రభావం పడింది ?

జవాబు :-        అన్ని రంగాలపైనా వుంది. నిజానికి ఇది చేసే మేలుకన్నా, కలిగించే కీడే ఎక్కువ. పరాయీకరణ భావనని పెంపొందిస్తూ వస్తోంది. అభద్రత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక పర్యావరణం, విద్య, వైద్య ఇలా అన్నిరంగాల్లోనూ దీనిదే పై చెయ్యి అవుతోంది. పర్యావరణంలో భాగంగా కాలంతోపాటు మారుతున్న ఈ సామాజిక స్థితిగతులు సాంకేతిక యుగంలో అతి చిన్న ప్రాణుల జీవితాలకు ఎలా ప్రాణసంకటంగా పరిణమించిందో ఈ కవితలో చదవండి ..

‘పిచ్చుకలేని ప్రపంచంలోకి…” (కవిత) ****

ప్రశ్న :- వర్తమాన వ్యవస్థలో గాయాలు మనుషులకే కాదు మనసులకీ తగులుతున్నాయి. ఈ కోణంలో ఈ విశ్లేషణ వినిపిస్తారా ?

జవాబు :-        తప్పకుండా.. కాలమంటేనే ఓ నడిచే గాయాల పుట్ట. ఇందులో ఎదురయ్యే కష్టసుఖాలు విలోమ ఫలితాలనిస్తాయి. సందర్భాలను బట్టి సంతోషపెట్టేవి, గాయపరిచేవి చలించే స్వభావాన్ని, కదిలించే సన్నివేశాన్ని, కాలవేగంలో మనం అందుకోవాలి. అప్పుడే కవిత్వానికి సహజత్వంతో పాటు సహజీవనం చేసే సాటి మనస్తత్త్వాల విశ్లేషణాత్మక ధోరణి లోలోపట దృశ్యంగా రూపుకడుతుంది.

ప్రశ్న :- ఇన్నేళ్ళ మానవ చరిత్రను బట్టి అనుబంధంతో  ముడిపెట్టి చెబితే ప్రధానంగా కనిపించే బలిపశువు ఈ రైతుబిడ్డే. ఈ  పార్శ్వంలో ఆలోచించినపుడు మీ ఆలోచనా సరళి ఏ విధంగా వుంటుంది ?

జవాబు :-        భూమి సమస్య అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆరుగాలం కాయకష్టం చేసి శ్రమించే వ్యక్తి రైతే! దేశం మొత్తానికి వెన్నెముకైన ఈ అన్నదాతకి ‘అన్నమో రామచంద్రా’ అనే దుస్థితి పట్టి, అప్పుల బాధలకి తాళలేక ఆకలి చావులను  పొందడం వెనక చాల విషాదరహస్యాలు దాగి వున్నాయి. దేశంలో అనుసరించిన ప్రపంచీకరణ పద్ధతులు, సరళీకృత ఆర్ధిక విధానాలు, ప్రత్యేక ఆర్త్ధిక మండళ్ళు, పాలకుల అవినీతి, రాజకీయ వ్యవస్థలోని లొసుగులు, ఉత్పత్తి సంబంధాల్లోని అసమానతలు, మితిమీరిన లంచగొండితనం వంటి అంశాలు దేశదేశాలను బ్రష్టుపట్టిస్తున్నాయి. అధోగతికి దిగ జార్చుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే భూమి పుత్రుల బతుకులు మాత్రం ఎప్పటికీ దీపం కింద చీకటే!

ప్రశ్న :- వీటికి సంబంధించిన కవితలు ఏమైన రాశారా ?

జవాబు :-        ఎక్కువే రాశాను. మచ్చుకు ఈ కవితను చదవండి.

‘నాగేటిచాలు కన్నీటిపాట” (కవిత) ****

ప్రశ్న :- గడిచిన కొన్ని దశాబ్దాలు ఉద్యమాలకు, వాదాలకూ నిలయమయ్యాయి వీటి ప్రభావం మీ రచనలపై ఏమేరకు పడింది ?

జవాబు :- భావ కవిత్వం అంతమైన తర్వాత అనేక ఉద్యమాలు, వాదాలు తెలుగు సాహిత్యరంగలో కాలుమోపాయి. వీటిలో అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్త్రీవాద, దళిత, మైనారిటి వాదాలు చాల విసురుగా ప్రవేశించాయి. సామ్రాజ్యవాదంలో భాగంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణలు, ఏకచత్రాధిపత్యాన్ని చలాయిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊపు తెలంగాణా ఉద్యమం రూపంలో ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా ఏవాదంలోనైనా ముందుగా ఆ వేగాన్ని ఒడిసిపట్టుకునేది ఒక్క కవితా ప్రక్రియకే ఉంది. ఎందుకంటే కవిత్వం ప్రధానంగా ఆవేశపూరితమైనది. ప్రతి ఐదు.పదేళ్ళకోసారి కవిత్వం తన రూపురేఖలని మార్చుకుంటోంది. శిల్పపరంగా నవ్యతను అందిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. కాలంతోపాటు వచ్చే ఈ మార్పును ఎప్పటికప్పుడు మనం స్వాగతించాల్సిందే! ఈ దృష్టితో చూస్తే అందరి కవుల్లాగే ఆ ఉద్యమాల ప్రభావం నామీద, నా రచనల మీద పరోక్షంగా పడి, అంతర్లీన చైతన్యానికి ఊపిరి పోసిందనే చెప్పాలి. ఈ స్పృహే కనుక నాలో లేక పోయినట్టయితే కవిగా నేను ఎప్పుడో అదృశ్యమైపోయేవాణ్ణి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాహిత్యకారులు సైతం ఆ ఊపును ఒడిసి పట్టుకోవాలి. కొత్తదనాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మనం మనగా నిలబడి మిగలగలుగుతాం.

ప్రశ్న :- సాధారణంగా కవిత్వం రాసేటప్పుడు మీరు ఎటువంటి భావోద్వేగాలకు లోనవుతారు ?

జవాబు :-        ఇది ఆ సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి, భావ తీవ్రతలను బట్టి, మానసిక ఉద్వేగాన్ని బట్టి  ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక కవి అన్ని సమయాల్లోనూ ఒకేలాగ ఆలోచించలేడు. తాను ఎంచుకున్న వస్తువుపట్ల కవి జాగరూకతతో వ్యవహరించి మెలకువగా  ఉండాలి.  కవిత్వంలోకి ఒకసారి అడుగు పెడితే తీవ్రమైన గాఢతలోంచి స్పష్టమైన ఆలోచన దిశగా కవిత్వ రచనను నడిపించాలి. శైలి, శిల్పపరంగా ఆధునికతను ప్రతిబింబించే విధంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఒక్కోసారి కవిత్వమే మనం అవ్వాలి. అప్పుడే దానికీ మనకి మధ్య బహిరంతర యుద్ధం జరిగి చివరికి రాజీపడతాం. సమన్వయం చేకూరుతుంది. అలాంటి మానసిక సంఘర్షణలకు, అనుభూతులకూ లోనై కవిత్వానికి చేరువై రాసినపుడే మన కవిత్వం బతికి బట్టకట్టడానికి అవకాశమేర్పడుతుంది.

ప్రశ్న :- ఇన్ని విషయాలు తెలిసిన మీరు వర్తమాన కవిత్వ తీరుతెన్నులను ఏ విధంగా అంచనా వేస్తారు ?

జవాబు :-        ఏదైనా కాలంతోపాటు పోటిపడి ప్రయాణించడం నేర్చుకోవాలి. లేదంటే మనం వెనకబడిపోయే ప్రమాదం వుంది. ఆధునిక వర్తమాన సాహిత్యం ఉద్యమ వేగంతో తీవ్ర ఉద్వేగంతో కొనసాగుతూ వస్తోంది. ఇందులో కొన్నిచోట్ల పాతకొత్తల మేలుకలయిక కనిపిస్తోంది. సందర్భాల సారంగా తొంగిచూసే సంఘటనలను సంఘర్షణాత్మకంగా చిత్రించి వర్తమాన కవిత్వంలో ప్రతిబింబించడం పరిపాటి అయింది. కొన్ని చోట్ల సంప్రదాయపు కవిత్వం కూడా వెలుగు చూస్తోంది. అన్ని రకాల ఆలోచనలకు దర్పణం పడుతూ సరళమైన సారవంతమైన సాంద్రతతో కూడిన కవిత్వానికి వేదికగా నిలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి కవిత్వాన్ని అంచనా వెయ్యడమంటే వర్తమాన కాలాన్ని నిలువుటద్దంలో చూపించడమే అవుతుంది. దీనికి నా కవిత్వం మినహాయింపు కాదు.

ప్రశ్న :- అట్టి ప్రతిష్టమైన ముందుతరానికి చెందిన కవుల సరసన పత్రికల్లో మీ రచనలు వెలుగు చూసినపుడు మీ భావోద్వేగాల స్థాయి ఏ రీతిలో ఉంటుంది ?

జవాబు :- ఇది మా మధ్య ఉండే స్థాయీ భేదాల ఆంతర్యాన్ని వ్యక్తపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో నన్ను నేను అంచనా వేసుకోవడానికి దోహదపడుతుంది.  నాలో లోటుపాట్లను తెలుసుకొని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనికి కొంత వ్యవధి అవసరమవుతుంది.   భవిష్యత్తు కాల రచనలకు మార్గదర్శకంగా ఈ ప్రయత్నం నిలుస్తుంది.

ప్రశ్న :- కవిగా మీరు ఎలాంటి కవిత్వాన్ని ఇష్టపడతారు ? తెలుగు-ఆంగ్ల సాహిత్యాల మధ్య  ఉన్న కవిత్వ వ్యత్యాసాన్ని మీ మాటల్లో తెలియజేయండి.

జవాబు :-        ఆంగ్ల కవిత్వం నిర్మాణపరంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రక్రియ. దీనికి ఎల్లల్లేవు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కవుల రచనలు గొప్ప సృజనాత్మకతతో, భావుకతతో, లోతైన చూపుతో, ధ్వని ప్రధానంగా రాస్తారు. ఇందులో అనేక నిజాలు చోటుచేసుకున్నాయి. దీని స్థాయి వేరు. అభివ్యక్తి పద్ధతులు వేరు. కాల్పనిక జగత్తును తలదన్నే విధంగా రచనలు ఉంటాయి. అందుకే ఆంగ్ల కవిత్వ ప్రభావంతో తెలుగులో కవిత్వ రచన చేసేవాళ్ళు చాల మంది ఉన్నారు, అనుకరించేవాళ్ళూ ఉన్నారు. భావచిత్రాలతో, పదబంధాలతో, ధ్వని ప్రధానంగా, ఆవేశపూర్వకంగా, ఆలోచనాయుతంగా, అంత్యప్రాసలతో గేయ, పద్య ఛాయలతో, వచనంతో కూడిన కవితారచనలు చేసే వాళ్ళూ కోకొలల్లు. ఇందులో ఎవరిశైలి వారిది. ఎవరి ఆలోచనా సరళి వారిది.  ఎవరి ధోరణి వాళ్ళది. కానీ అనుకరణ చేసి రాసే కవిత్వం తామరాకు మీద నీటిబొట్టులా జారిపడుతుంది. ఇది ఎక్కువ కాలం నిలబడదు. చెప్పే విషయంలో కొత్తదనం, కొన్నిసార్లు సూటిదనం, కవిత్వాన్ని ఒడిసిపట్టుకునే పద వాక్య నిర్మాణం తెలుగు కవిత్వానికి అవసరం. అది కూడా సొంత గొంతుతో వాస్తవిక దృక్పథంతో ప్రతిబింబించే నేర్పు, కూర్పు కవికి అవసరం. వీటితోపాటు  ఆత్మాశ్రయ ధోరణిని,  వస్త్వాశ్రయ  కవిత్వానికి రూపకల్పన ఇందులో అంతర్భాగాలుగా నిలుస్తాయి. ఇంకా సౌందర్య తాత్త్వికులు చాల మంది మేధావి వర్గాల్లో కనిపిస్తారు మన అనుభూతుల్నీ, భావావేశాల్నీ చేతనా సౌకుమార్యంతో పలికించి అక్షరబద్ధం చేసేవాళ్ళూ ఉన్నారు. కవిత్వాన్ని   ఎలాగైనా రాయవచ్చు. తీవ్ర అనుభూతులు వాటంతటనే వెల్లులికి వచ్చుటే కవిత్వం (Poetry is the spontaneous new flow of powerful feelings) కవి ఎప్పుడూ ఒక పట్టాన స్థిరంగా కూర్చోలేడు. ఒక చోటు నుంచి మరోచోటుకు ఊహల కవిత్వ ప్రయాణం చేస్తుంటాడు. ఇలా ఊగిసలాడే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, పరిసరాల్ని, సమస్యల్నీ గాఢంగా చిత్రించే నైజాన్ని సహజంగానే ఒంటపట్టించుకోవాలి ఇటువంటి కవిత్వాన్ని నేను ఇష్టపడతాను. సమూహంలో ఒకడిగా కలగలిసిపోయే తత్త్వాన్ని అలపర్చుకోవాలి కవి.

ప్రశ్న :- ప్రస్తుతం వస్తున్న కవిత్వంలో బాల్యాన్ని గురించిన ప్రస్తావనలు, సందర్భాలు చాలా వస్తున్నాయి. ఈ కోవలో మీ కవిత్వ ప్రయాణం ఎలా సాగింది?

జవాబు :-        నా వరకూ నేను బాల్యాన్నికి సంబంధించి చాల కవితలు రాశాను. అసలు బాల్య స్మృతులు లేకపోతే కవి బతకలేడు. కవిత్వమూ బతకదు. అలాగని పూర్తిగా “నాస్టాలజీ’కి కట్టుబడి కవితావస్తువుగా ఎంచుకున్నపుడు దాని నుంచి స్పూర్తిని పొంది, వర్తమాన కాలానికి అనువదించి, చైతన్యాన్ని ప్రసాదించడం దీనిలోని అంతర్లీన పరమార్ధం. ఇవాళ మనచుట్టూ అనేక బాల కార్మిక సమస్యలున్నాయి. వీటిని కవితాత్మకంగా వ్యక్తీకరించి  సామాజిక ప్రయోజనాన్ని పొందడం ప్రస్తుత కాలానికి అవసరం. ఇది అనివార్యం కూడా.

ప్రశ్న :- మరి అలాంటి కవితలు మీరు పత్రికల్లో ప్రచురించారా ?

జవాబు :- ‘బాల్యం ఒక ఖరీదైన స్వప్నం’ అనే కవిత ఈ కోవకే చెందుతుంది. దీనిని అక్షరాల రూపంలో మీ ముందు ఉంచుతున్నాను.

‘బాల్యం ఒక ఖరీదైన స్వప్నం’  (కవిత) *****

ప్రశ్న :- జానపద సాహిత్యానికి మన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానముంది. దాన్ని మీ కవితల్లో ఎక్కడైనా ప్రతిబింబించే ప్రయత్నం చేశారా ?

జవాబు :-        ” చేశాను… కొమ్మదాసరి మీద, బుడబుక్కల వాళ్ళ మీద కవితలు రాశాను. నా దృష్టిలో కవిత్వపరంగా అన్నీ సమానమే. కాబట్టే జానపద సంస్కృతి నా రచనల్లో ఒక భాగమైంది.

“బుడబుక్కలోడు” (కవిత) ****

ప్రశ్న :- అనుభూతి ప్రధానమైన కవిత్వంలో ప్రకృతితో మమేకమైన సన్నివేశ దృశ్యాలలో మన మనసుకు హత్తుకునేవి అనేక దృశ్యాలుంటాయి. ఇలాంటి అంశానికి మీ కవిత్వంలో చోటు కల్పించారా ?

జవాబు :- నేను కూడా భావుకుడినే కదండి. ప్రకృతి ఆరాధకుడినే! మనసు అనిర్వచనీయమైన అనుభూతులకు లోనయినపుడు వాటిని అక్షరబద్ధం చెయ్యకుండా విడిచిపెట్టను. అలాంటి ప్రత్యేక సందర్భంలో రాసినదే ఈ ‘వాన కురిసినప్పుడు..!” అనే కవిత. వీలైతే ఆస్వాదించండి.

“వాన కురిసినప్పుడు…!” (కవిత) ****

ప్రశ్న :- జీవితంలో పాట అంతర్భాగమైపోయింది ఈ రోజుల్లో ప్రతి కవీ ఎప్పుడో ఒకప్పుడు ఈ గాన మాధుర్య ప్రవాహంలో తడిసి తరించినవాడే. అటువంటి కవితను ఒకటి రుచి చూపించండి.

జవాబు :-        పాటకి ఎల్లలు లేవు. అది ప్రవహించే జీవనది లాంటిది. దాని నడక హొయలు హొయలుగా సాగుతుంటే ఆ సంతోషమే వేరు. కాబట్టే ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి ” అన్నారు. ఆ నిజాన్ని కవితారూపంలో ఇప్పుడు విందాం’.

‘పాట ప్రవహించినంత సేపూ…” (కవిత) *****

ప్రశ్న :- ప్రతి కవికీ అంతరంగముంటుంది. దీనిని ఆత్మావిష్కరణ చేస్తే మీలో కవి బయట పడతాడు. అలాంటి జీవిత నేపథ్యంలోంచి మీ అనుభవాన్ని కవితగా పరిచయం చెయ్యండి.

జవాబు :-        అది మీరు ప్రత్యేకంగా అడగాలా ? మీరు కవితారంగం నుంచి వచ్చిన వర్ధమాన కవయిత్రే కదా… కవిగా పుట్టడమంటే మనలోపల పొరల్లో దాగివున్న కనీ కనిపించని గుండె చప్పుళ్ళ ఆవేదనని అక్షరస్పర్శతో పైకి తవ్వి వెలుపలకి తియ్యడమే! దీనికి సజీవ ప్రతిబింబం ఈ కవిత.

“కవిగా పుట్టడమంటే…! (కవిత) ****

ప్రశ్న :- ప్రస్తుత కాలం సమస్యల వలయం. ఇందులో వేలు పెట్టడమంటే చీమలపుట్టను అదిలించడమే! ఇలాంటి వాతావరణంలో మీ కవితాయానం ఎన్ని రూపాలుగా సాగింది ?

జవాబు :-        మీరడిగేది… (అనుమానం వ్యక్తపరుస్తూ)

ప్రశ్న :- ఇప్పటివరకూ స్పృశించిన మీ సాహిత్య ప్రక్రియలు గురించి అడుగుతున్నాను.

జవాబు :         కవిత్వంతో పాటు సుదీర్ఘ పుస్తక సమీక్షలు, రేడియో నాటికలు, కొన్ని కథలూ, మరికొన్ని వ్యాసాలూ రాశాను. ఏది రాసినా మనస్ఫూర్తిగా అధ్యయనం చేసే రాశాను.

ప్రశ్న :- మీ రచనలు ఏఏ పత్రికల్లో వచ్చాయి. వాటి వివరాలు కొంచెం చెబుతారా!

జవాబు :-        అన్ని దిన, వార, మాస, పక్ష పత్రికల్లోనూ నా కవితలు అచ్చయ్యాయి. మిసిమి, వాజ్ఞయి, ప్రస్థానం, తెలుగు (అకాడెమి పత్రిక), ఆంధ్రప్రదేశ్, నేటినిజం, స్థానిక పాలన  వంటి పత్రికల్లో నా వ్యాసాలు అచ్చయ్యాయి. అనేక (పదేళ్ళ కవిత్వం-2000-2009) నాన్న, కిరణం, స్పర్శ (రంజన-కుందుర్తి),  అక్షరవృక్షాలు (పర్యావరణ కవితలు), ఇంకా అనేక ఇతర కవితా సంకనాల ల్లో  నా కవితలు వచ్చాయి.

ప్రశ్న :- మీకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక కవితలకు అవార్డులు వచ్చాయని తెలుసుకున్నాం. వాటిని కొంచెం వివరంగా చెబుతారా ?

జవాబు :-        రంజని-కుందుర్తి కవితల పోటీలో అత్యుత్తమ కవితా అవార్డు (2009) ఉత్తమ అవార్డు (2000-2002), అజోవిభో-జి.వి.ఆర్.కల్చరల్ ఫౌండేషన్ కవితల పోటీలో మొదటి బహుమతి (2008), భిలాయివాణి- 2010 ఉత్తమ కవితా పురస్కారం, 2010 ఎక్స్‌రే ఉత్తమ కవితా పురస్కారం, శ్రీ తాండ్ర పాపారాయ ఫౌండేషన్ కవితల పోటీలో ద్వితీయ బహుమతి (2011-హైదరాబాద్), సాహితీ వేదిక-అనకాపల్లి (ప్రధమ బహుమతి-2002), సి.ఇ.టి.యు. శ్రామిక జనకవనంలో (ద్వితీయ బహుమతి – 2010), వేమన సాహితీ కళా వేదిక కవితల పోటీలో బహుమతి (2011), ప్రభుత్వ ఉగాది పురస్కారం (2006), యువజనుల సర్వీసుల శాఖ అవార్డు (2006) అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ-2011 లో కవితా కధా రచన విమర్శనా విభాగంలో బహుమతులు), మానస – శ్రీ శ్రీ వ్యాసరచన పోటీలలో బహుమతి (2011) పొందాను. విశాలాక్షి కవితల పోటిలో-2011 ద్వితీయ బహుమతి పొందాను.

ప్రశ్న :- మీరు పాల్గొన్న ప్రముఖ సమావేశాలు గురించి వివరించండి!

జవాబు :- 1999 నవ రచయితల అధ్యయన శిబిరం-వచన కవిత (రాష్ట్ర సంస్కృతిక మండలి), సాహిత్య అకాడెమీ -(తెలుగు-హిందీ యువ రచయితల సదస్సు-2011-కవితా పఠనం), ఆంధ్ర సారస్వత పరిషత్తు (రాష్ట్ర స్థాయి తెలుగు భాషా సాహిత్య సమ్మేళనం -2010), ప్రపంచ తెలుగు మహాసభలు-2012 – తిరుపతి (ఉపవేదిక-కవి సమ్మేళనం), గురజాడ శతజయంతి ఉత్సవాలు-విజయనగరం (2011-కవి సమ్మేళనం) ‘యువస్పందనా సాహిత్య సంస్థలు ద్వారా అనేక కవి సమ్మేళనాలు నిర్వహణ చేపట్టాను.

నా కవిత ‘గాయపడ్డ బాల్యం’ ‘గాయల్‌బచ్‌పన్’ పేరుతో తెలుగు అకాడెమీ వాళ్ళు హిందీలోకి అనువాదం చేశారు.

ప్రశ్న :- ఇంతవరకూ మీ రచనలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహించి ఆదరించిన ప్రముఖ సాహితీ వేత్తలు, కవి మిత్రులు ఇంకా ఎంతమందిదాకా ఉంటారు?

జవాబు :-        చెబితే  చాలామంది ఉన్నారు. పూలదండలో పైకి కనిపించని దారంలా వీళ్ళంతా పరోక్షంగా నా ఎదుగుదలను కాంక్షిస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు ప్రముఖుల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను.

వీరిలో కె.శివారెడ్డి, డా!!అద్దేపల్లి రామమోహనరావు, ఎం.వి.ఆర్.శాస్త్రి, ఎన్.గోపి, సినారె, వాడ్రేవు చిన వీరభద్రుడు, సుదామ, జగన్నాధ శర్మ, గంటేడ గౌరునాయుడు, డా!!రామసూరి, డా!!యు.ఏ.శిఖామణి, నరసింహమూర్తి, డా!!అద్దంకి శ్రీనివాస్, డా!!చాగంటి తులసి, స్కైబాబా, సిధారెడ్డి, గుడిపాటి, యాకూబ్,  శిలాలోవిత, డా!!ఓలేటి పార్వతీశం, రాధేయ, చేతవోలు రామబ్రహ్మం, ద్వానాశాస్త్రి, బమ్మడి జగదీశ్వరరావు, కుప్పిలి పద్మ, సుధేరా, నిర్మలానంద్, దివికుమార్, చాయరాజ్,  ఆశారాజు, పెన్నా బి.వి.వి.ప్రసాద్, శివరామక్రిష్ణ, బైస దేవదాస్, వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రామతీర్థ, దేవిప్రియ, జగద్ధాత్రి, ఎల్.ఆర్.స్వామి, రామ చంద్రమౌళి, కేతు విశ్వనాధరెడ్డి, ఆకెళ్ళ, దర్భశయనం శ్రీనివాసాచార్య, పెనుగొండ లక్ష్మీనారాయణ, కె.కె.రఘునందన, జి.యస్.చలం, కె.కె.భాగ్యశ్రీ, వారణాసి ప్రసాదరావు, డా!!ఏ.గోపాల రావు తదితరులు ఇస్తున్న ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిది.

ఇంకా సాహితీ మిత్రులలో, సి.వి.బి.శ్రీరామమూర్తి బులుసు-జీ-ప్రకాష్, అదసవిల్లి క్రిష్ణ, ఈతకోట సుబ్బారావు, జియోలక్షణ్, కె.విల్సన్‌రావు, భోజంకి వెంకటరవి, వరప్రసాద్, యెన్నం, ఉపేందర్, చీకోలు సుందరయ్య, మట్టిగుంట వెంకటరమణ, ఎండ్లూరి సుధాకర్, కె.రామారావు, చీకటి దివాకర్, చంద్రిక, మొయిద శ్రీనివాస్, పి.లక్ష్మణరావు, జక్కు రామక్రిష్ణ, రాపాక సన్ని విజయ క్రిష్ణ, బులుసు సరోజినీ దేవి, హెచ్.యం.టి.వి.లక్ష్మణ్, ఆర్.రామక్రిష్ణ, భళ్లమూడి నాగేంద్రప్రసాద్, పి.శ్రీనివాస్ గౌడ్, మౌనశ్రీ మల్లిక్, సాహిత్య ప్రకాష్, సి.హెచ్.వి.బృందావనరావు, డా!!బండి సత్యనారాయణ, మధు, జె.బి.తిరుమలాచార్య, సి.హెచ్.రాం,ఇ.సిహెచ్.సత్యనారాయణ, పాయల మురళీక్రిష్ణ, చింతా అప్పల్నాయుడు, సిరికి స్వామినాయిడు, ర్యావి ప్రసాద్, గుండాన జోగారావ్, మాధవీసనార, మోదు రాజేశ్వరరావు, ఆక. బాలక్రిష్ణ, బి.విజయేశ్వరరావు, వాధూలస, వెంకటయ్య, పి.ట్.యన్.శ్రీనివాస్, కిలపర్తి దాలినాయుడు, దార్ల వెంకటేశ్వర రావు, కె.క్యూబ్. వర్మ, అనంతరావు, చలపాక ప్రకాష్, చిత్తలూరి సత్యనారాయణ, శిఖ-ఆకాష్, సూర్య గరిమెళ్ళ, రెడ్డి రామక్రిష్ణ, తామరాపల్లి రామక్రిష్ణ, రొక్కం కామేశ్వరరావు, యం. విజయభాస్కర్, ఫణీంద్ర భార్గవ్, రెడ్డి శంకర్రావు, నిశితాసి, బగ్గం అప్పాజీరావు, చంద్రకళ, బగ్గాం సత్యవతమ్మ, రాబ చిన్న, విరసం వర్మ, చెళ్ళపిల్ల శ్యామల, ఇనగంట జానకి, లైబ్రరీ శ్రీనివాస్, రొంగలి పోతన్న, ఇల్ల ప్రసన్నలక్ష్మీదేవి.బాల సుధాకరమౌళి, రాజశేఖర్, సావేరి గంగాభవాని, సుధాకర్, సూరిబాబు, శివ, నాయుడు, గవిడి శ్రీనివాస్, చివుకుల శ్రీలక్ష్మి, ఆడిదం శారద, శారదాప్రసాద్, పి.వి.యల్.సుబ్బారావు, శ్రీరాములు, శివాజీ పట్నాయక్, బగ్గాం సురేష్, సరోజా ఆంటీ, జి.శిరీష, శేషన్నయ్య, రవి అన్నయ్య, ఈపు విజయకుమార్, యస్.యస్.యస్.యస్.వి.ఆర్.ఎం.రాజు, కీ.శే.ఆల, దుప్పల రవికుమార్, శేషగిరి, మృత్యుంజయరాం, బగ్గాం సన్యాసిరావు, రాజు అన్నయ్య, అశోక్ కుమార్ పాత్ర, యం.వి.వి.సత్యనారాయణ, పసుమర్తి సన్యాసిరావు, పి.శాంతమ్మ, ఎన్.కె.బాబు, రుద్రమూర్తి, పల్లరోహిణి కుమార్, మల్లిపురం జగదీశ్, అరుణ పప్పు, రవికుమార్ కోసూరి, మడగల రవిచంద్ర, మోకా రతన్‌రాజు, రమణమూర్తి, ఇఫ్లూ ప్రసాద్, జె.వి.యస్.ప్రసాద్, క్రీ.శే.బి.క్రిష్ణాజీరావు, కొల్లూరి పద్మజ, క్రిష్ణారావు, నరసింహస్వామి, నాగార్జున్, నాగరాజు సముద్రాల, మూర్తిబాబు, అన్నపురెడ్డి వెంకటేశ్వరు, శివ శంకర్ ప్రసాద్, పి.యస్.యస్.లక్ష్మి, లక్ష్మీ నరసింహం బద్రి కూర్మారావు, మంత్రి క్రిష్ణమోహన్, ఖాజా మొహిద్దీన్, రాచ పాళెం చంద్రశేఖర రెడ్డి, సడ్లపల్లె చిదంబర రెడ్డి,వాధూలస, కలిమిశ్రీ, జయధీర్ తిరుమలరావు, హృషీకేశం, హెచ్చార్కె, గురుప్రసాద్, గోపి (సత్య), గధాధర్, ద్వారం దుర్గాప్రసాదరావు, డా!!శ్రీకాంత్, బుచ్చి, బసుపోతన, దాకరపు బాబూరావు, అరుణ్ బవేరా, ఆంజనేయకుమార్, రేణుకా అమోల, దామరాజు విశాలాక్షి, కళ్ళు చిదంబరం, చాగంటి ఆనంద్, ఆదెయ్య, విశ్వనాధ సాయి శ్రీనివాస్, విజాదిత్య, యు.వి.ఏ.ఎన్.రాజు..ఇంకా ఎందరో ప్రియ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రశ్న :- మీ గురించి చాల విషయాలు మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారు.

జావాబు :-       మీకు కూడా మా శుభాభినందనలు.

ప్రశ్న :- మళ్ళీ కలుద్దామండి… నమస్కారం!

జవాబు :-        నమస్కారం మేడం!!

 

***

5 thoughts on “కవి మిత్రులు మానాపురం రాజా చంద్రశేఖర్‌తో ముఖాముఖి:

 1. when i first visited maalika patrika website on telugu literature,i felt very happy for the service you are doing for telugu people.. keep it up and i expect more columns on telugu humour.

 2. మా మానాపురం రాజా కవిత్వంతో పాటు తన నేపథ్యాన్ని జతచేసి పరిచయం చేసినందుకు బులుసు సరోజినిదేవి గారికి ధన్యవాదాలు.

 3. Manapuram raja chandrasekhar is a good poet. His poems are always filled with gravity, density of the expression. He is so sincere in writing poems. We used to discuss the best techniques in writing poems. One should understand the present trend of the expressions in poems. Many people simply write with same style. monotony in poems can not give new feel of expression. As we express a feeling in a poem it should always contain new expression. I appreciate Raja for his beautiful poems.I wish him all the success. I thank our guru sri Ramasuri garu for guiding us to write poems with good constructive techniques.
  Congrats Raja,

  Thanks
  Gavidi Srinivas
  (+91)08886174458

Leave a Comment