March 29, 2023

“పద్మప్ప”

రచన:  మంథా భానుమతి.      

“వధ.. వధ.. వందలమంది.. వేలమంది. నరమేధం! ఇదెక్కడి మానవ జన్మం.. ఎవరిచ్చారు అధికారం? ఎక్కడిదీ రుధిరం? ఏరులై పారుతోందే.. గుండె ఢమరుకంలా కొట్టుకుంటోంది. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యగలను? ఒడలంతా చెమటలు.. అలా కారుతూ రుధిర ధారల్లో కలిసిపోతున్నాయి..” కలత నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు భీమనప్పయ్య. ఎటువంటి కలా.. పీడకల అనడం కూడా తక్కువే! సబ్బినాడుకి వచ్చి అప్పుడే రెండు మాసాలవుతోంది.
ఏదో చప్పుడు.. చీపురుతో వీధివాకిలి ఊడుస్తున్న శబ్దం. అప్పుడే తెల్లవారుతోందా.. రెండు ఘడియలు కూడా కళ్లు మూత పడలేదు. పక్కన ఇల్లాలు విశ్రమించిన చాప ఖాళీగా ఉంది. ఎప్పుడు దూరాడో, పద్మప్ప తన పక్కనే ముడిచి పెట్టుకుని పడుక్కున్నాడు. అలికిడి వినగానే కళ్లు తెరిచి తండ్రిని చూసి నవ్వాడు.. అచ్చు ఉదయిస్తున్న బాల భానుడిలా!
విప్పారిన కుమారుని మోము చూడగానే భీమనప్పయ్య హృదయంలో ప్రేమ పెల్లుబికింది. గుండె కొంచెం కుదుట పడింది. పసివాడిని లేపి ఎత్తుకుని వీధి వాకిట్లోకి తీసుకొచ్చాడు.
“అమ్మా!” పద్మప్ప కింది కురికి ఒక్క గెంతులో ముగ్గులు తీర్చి దిద్దుతున్న తల్లి వీపుకానుకుని ఊగ సాగాడు.
భీమనప్పయ్య కుటుంబం ఉన్న సత్రం గోదావరి పాయకి దగ్గరగా ఉంది. అక్కడ్నుంచి నీళ్లు తెచ్చి కళ్లాపు జల్లి శుభ్రం చేసి ముగ్గు వేస్తోంది అతని భార్య. అంత పెద్ద ఆవరణని శుభ్రం చెయ్యడానికి చాలా సమయమే కావాలి.. ఎప్పుడు లేచిందో.. నుదుటిన ఏర్పడ్డ చెమటని కొంగుతో అద్దుకుంటూ, భర్తని చూసి చిరునవ్వు నవ్వింది. భీమనప్పయ్య తప్పు చేసిన వాడి వలె తల దించుకుని, కొడుకుని తీసుకుని నది వద్దకు వెళ్లాడు, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి రావడానికి.
తాను కొంచెం ముందు లేచి, కాసిని నీళ్లయినా తేవచ్చు కదూ! రాత్రిళ్లు ఇటు దొర్లీ, అటు దొర్లీ నిద్ర అనేది కరవైపోయింది. ఉండేది సత్రం అయినా, ఎక్కువ రోజులు ఉంటే మర్యాదగా ఉండదని, తమ వంట తామే వెనుక అరుగు మీద చేసుకుంటున్నారు. మూల్యం చెల్లించకుండా ఉంటున్నందుకు వాకిలి, మండువా శుభ్రం చేస్తుంది అతని భార్య. ఊరు వదిలినప్పుడు తాతగారిచ్చిన రొక్కం అయిపోవచ్చింది.
“నాన్నగారూ! ఇటు చూడండి.. నాకు వచ్చేసింది.” నోటి నిండా నీళ్లు నింపి గడగడ శబ్దం చేస్తూ పుక్కిలించి ఉమ్మేశాడు పద్మప్ప, పెద్ద ఘనకార్యం చేసినవాడిలాగ. మామూలుగా అయితే కొడుకుని గాల్లోకి ఎగరేసి బుగ్గమీద ఒక ముద్దిచ్చేవాడు. కానీ అప్పుడు మాత్రం కాదు.. రేపటి సంగతెలాగ? సంభారాలు ఇంక రెండు మూడు రోజుల వరకూ వస్తే గొప్పే.. అదీ ఇల్లాలి చాకచక్యం వల్ల ఒక నెలకని పంపినవి రెండు వరకూ..
అన్యమనస్కంగా తనయుని ఒడలు అంగవస్త్రంతో తుడిచి, ఇసుకలో కూర్చోపెట్టి, అక్షరాలు దిద్దమని తను నది లోకి దిగాడు. బుంగమూతి పెట్టి తండ్రిని కినుకగా చూసి, అక్షరాలు దిద్దసాగాడు పద్మప్ప.
“ఈ పాపడి మొహంలో భాస్కరుని తేజస్సు ఉట్టిపడుతోంది. అసమాన కీర్తి నార్జిస్తాడు. ఇతని నాలుక మీద చదువులతల్లి నాట్యమాడుతుంది. ఎవరు బాబూ మీరు? మిమ్మల్ని ఈ ప్రాంతాల చూచిన జ్ఞప్తి రావట్లేదే..” పక్షులగానం తప్ప వినిపించని ఆ ప్రశాంత వాతావరణంలో గంభీరమైన కంఠద్వని విని ఒడ్డుకి వచ్చాడు భీమనప్పయ్య. పద్మప్ప లేచి నిలబడి కుతూహలంగా చూస్తున్నాడు.
“అయ్యా.. తమరు..”
“నన్ను సింగన జోస్యులంటారు. ధార్వాడ పరగణాల్లోంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. రెండునెలలుగా.. మా బంధువుల ఇంట్లో శుభకార్యానికి యణ్నికెర గ్రామం వెళ్లి నిన్ననే వచ్చాము. మీరు ఏదైనా కార్యార్ధులై ఇచ్చటికి వచ్చారా?”
“లేదు స్వామీ! మేమునూ మీవలెనే ఇచ్చట ఉండిపోవాలని వచ్చాము.. మాది కృష్ణాతీరం. పుట్టిన ఊరినీ, బంధుమిత్రులనూ, కుటుంబాన్నీ వదిలి రావలసి వచ్చింది.. జిన ధర్మాన్ని పాటిస్తున్నాననీ, వైదిక ధర్మాన్ని వదిలేశాననీ గ్రామస్థులు వెలి వేశారు..”
భీమనప్పయ్య చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు సింగనజోస్యులు.
“మంచి పని చేశారు. ఇక్కడ ప్రజలలో అధికులు జైనులే. నేను కూడ జైన బ్రాహ్మణుడనే. మీ కన్నులలో కాంతిని బట్టి చెప్పచ్చు.. మీరు, మీ పుత్రులు అజరామరమైన కీర్తి ప్రతిష్టలనార్జిస్తారు.”
“సందేహం వద్దు సామీ.. ఈ మహానుభావుడు జ్యోతిష్యశాస్త్ర కోవిదుడు. వీరు చెప్పారంటే ఆ బ్రహ్మదేవుడు రాసి పెట్టుండాల్సిందే.” అప్పుడే వచ్చి వీరి సంభాషణ విన్న సత్రం యజమాని వీరప్ప అన్నాడు.. ఇద్దర్నీ అరాధనగా చూస్తూ.
భీమనప్పయ్య కొత్త ఊపిరి పోసుకున్నట్లు, ఆ ప్రాతఃకాలపు కాంతిలో ఎర్రగా మెరిసిపోయాడు.
అసంకల్పితంగా జినసేనుడు రచించిన పూర్వపురాణ కావ్యంలోని, మొదటి తీర్థంకరుడైన ఋషభనాధుని పంచకళ్యాణాలలో ఒక దానిని గానం చేశాడు. అతని గానాన్ని విని అక్కడికి స్నానానికి వచ్చిన పల్లె ప్రజలందరూ మైమరచి కూర్చుండిపోయారు.
“అజ్ఞాన తమోనీకారుడగు నితడు, గుణ రత్నాకరుడు. ” వెంటనే సింగన జోస్యులు బిరుదు ప్రదానం చేశాడు.
కన్నుల నీరు చిప్పిల్లగా, తన తండ్రి వలె గోచరించిన సింగన గారికి సాష్టాంద దండ ప్రణామము చేశాడు భీమనప్పయ్య.
……………………………
సింగన గారి సహాయంతో గ్రామంలో ఖాళీగా ఉన్న ఇంట్లోకి సంసారాన్ని తరలించాడు భీమనప్పయ్య.
“ఆ గృహస్థు, ధార్వాడ పరగణాకి వెళ్లారు లేవయ్యా! ఆ ఇంటి బాధ్యతని నాకు అప్పగించారు. ఆయన రాజుగారి సైన్యంలో అధికారి. అక్కడ దేశ రక్షణకై పంపారు. నేనిక్కడికి రాలేదూ… పొట్ట చేత పట్టుకుని వెళ్లాల్సిందే ఎవరైనా..” మొహమాట పడుతున్న భీమనప్పయ్యకి సర్ది చెప్పారు.
“మీరు చెప్పాక ఇంక అభ్యంతరమేముంది బాబయ్యగారూ?” పద్మప్పని చంకనేసుకుని వాడి తల్లి సంబరంగా అంది. అవును మరి.. సత్రంలో ఈ చివర్నుంచాచివరికి శుభ్రం చేసే సరికి నడుం నేలకి అతుక్కుపోతోంది.
ఇంటి ముందు నిర్మించిన పర్ణశాలలో విద్యాపీఠాన్ని ఆరంభించాడు భీమనప్పయ్య. సింగన జోస్యులవారే ముహుర్తం పెట్టారు. ఆ నోటా ఆనోటా ఏ విధంగా పాకి పోయిందో గానీ నెల తిరిగే సరికల్లా పదిమంది విద్యార్ధులు చేరారు. అక్షరాలు దిద్దే వారి దగ్గర్నుంచీ, వ్యాకరణ శాస్త్రం అధ్యయనం చేస్తున్న వారి వరకూ ఉన్నారక్కడ.
కొద్దికాలంలోనే పాఠశాలగా రూపు దిద్దుకుని, భీమనప్పయ్యగారు తన సహాయార్ధం కొందరు గురువుల్ని కూడా తన విద్యాపీఠంలో చేర్చుకునే స్థాయికెదిగారు. అతని ఖ్యాతి అనతి కాలంలోనే రాష్ట్రకూట సామ్రాజ్యం అంతా పాకింది.
సింగన జోస్యుల కుటుంబంతో సాన్నిహిత్యం కూడా పెరిగింది.  ఒక రోజు సూర్యోదయానంతరం.. రెండు ఘడియలయింది..
భీమనప్పయ్య కొడుకుతో కలిసి నమోకార మంత్రాన్ని జపించి (జైన ప్రార్ధన), యోగ సాధన కూడా ముగించి, క్షీర పానం చేస్తున్నాడు.
“అరే.. తాతగారు.. అమ్మా! తాతగారొచ్చారు..” పద్మప్ప సంభ్రమంగా లేచి వంటింట్లోకి పరుగెత్తి తల్లిని పిల్చుకొచ్చాడు. భీమనప్పయ్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిల్చున్నాడు.
“అమ్మీ! బాగున్నారా? భీమయ్యా! నిన్నొక కోరిక కోరాలని వచ్చానయ్యా.. మమ్మల్ని కూర్చోపెడతారా లేదా?” సింగన్నగారు సతీ సమేతంగా ఇంట్లోకి వచ్చారు.
“రండి.. రండి. బాబయ్యగారూ! అనుకో లేదు కదా.. అందుకే కాస్త.. కూర్చోండి.” చాప పరిచి, లోనికి వెళ్లి మంచి తీర్ధం తెచ్చి ఇచ్చింది భీమనప్పయ్య భార్య.
పద్మప్ప, సింగన్నతాతగారు తెచ్చిచ్చిన రిషభ తీర్ధంకరుడి చందనం బొమ్మ ఇంటి ముందున్న పాఠశాల లోకి తీసుకెళ్లి, ఒక పీఠం మీద పెట్టి, వివిధ పుష్పాలతో అలంకరిస్తున్నాడు.
చాప మీద అతిథులు ఇద్దరూ ఆసీనులయ్యాక విసినికర్రతో విసురుతూ అడిగాడు భీమనప్పయ్య, “మేం మీ కోరిక తీర్చగల సమర్ధులమా సింగన్నగారూ! ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం..”
“నేనడగబోయేది మీరిద్దరూ తీర్చగలదే! ఏదో ఉపన్యాసాలిచ్చి, నాన్చి చెప్పను. తిన్నగా అడిగేస్తున్నా.. మా అమ్మాయి ’వబ్బెణబ్బ”ని భీమనప్పయ్యకిచ్చి కన్యాదానం చేద్దామని అడగడానికి వచ్చాం. మీరు ఔనంటే సంతోషంగా వెళ్తాం.”
విసినికర్రలు రెండూ ఆగిపోయాయి. నోటమాట రానట్లు, కళ్లు పెద్దవి చేసి చూస్తుండి పోయారు భార్యాభర్తలిద్దరూ.
సింగన్నగారు సబ్బినాడులో మంచి పేరున్నవారు. ధనవంతులు. వారి అమ్మాయిని, పెళ్లయి, ఒక కొడుకున్న వానికి ఇస్తామనడం.. అదీ ఒక్క చిన్ననాణెం చేతలేని వాడికి! తాము వింటున్నది నిజమేనా.. కల కాదు కదా! స్వయంగా వారే వచ్చి..
భీమనప్పయ్యకి ఏమనాలో అర్ధమవలేదు. భార్యని పరికించాడు.
ఆమె నిశ్చేష్ట అయి నిల్చుండి పోయింది. పెదవులు వణుకుతూ.. కళ్లలోనుంచి ఏ క్షణంలో నైనా నీళ్లు రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంత కష్టమైనా.. రోజుల తరబడి గంజి తాగైనా గుండె ధర్యంతో నిల దొక్కుకుంది. పుట్టి పెరిగిన ఊరినీ, కన్న వారినీ.. అత్తింటినీ వదిలి, కట్టుకున్న వాడి వెంట.. కట్టుబట్టలతో వచ్చినప్పుడు కూడా ఏ ఆలోచనా లేదు. కలత చెందలేదు. అది తన కర్తవ్యం అనుకుంది. ఇప్పుడీ పెద్దాయనకి తన సంసారమే దొరికిందా? కాదంటే ఏం చేస్తారో.. తమని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వారు తలుచుకుంటే వారమ్మాయికి సంబంధమే దొరకదా! సవతితో కాపురం..
నిస్సహాయంగా తల దించుకున్న భార్యని చూసి భీమనప్పయ్య కదిలిపోయాడు.
సమాధానం చెప్పడానికి నోరు తెరవబోయాడు..
“ఆగండి.. నా మాటలు విన్నాకా మీ నిర్ణయాన్ని చెప్పవచ్చు. అదీ.. వెంటనే అవసరం లేదు.. ఆలోచించుకుని, నెమ్మదిగా చెప్పవచ్చును. ఒకవేళ మీరు కాదన్నా.. మన స్నేహానికి అదేమీ అడ్డంకి కాదు.” భార్య కేసి చూశారు సింగన్న. ఆమె ఔనన్నట్లు తలూపింది.
“అమ్మీ! ఇది నేను కావాలని చేసింది కాదు. వీరు ఇప్పుడు చెప్పేవరకూ నాకేమీ తెలియదు. నేనా అమ్మాయిని చూడను కూడా చూడలేదు.” ఇంటి లోపలికి వెళ్లబోతున్న ఇల్లాలిని ఆపి అన్నాడు భీమనప్పయ్య.
“అవునమ్మా! అబ్బాయి అమాయకుడు. గుణరత్నాకరుడు. రవి సమానమైన అతని తేజాన్ని, తెలివిని, విద్యని చూసి మేమే చొరవ తీసుకున్నాం. నువ్వు మా అమ్మాయి వంటి దానివే! నీకుఅన్యాయం చేస్తామా?” సింగన్నగారి భార్య అంది.
దెబ్బతిన్న పక్షిలా చూసింది.. తనకి సవతిని ఇస్తామంటున్న వారిని. పైగా అన్యాయం చేస్తామా అట.
“అమ్మాయీ! ఈ భీమనప్పది, పద్మప్పది మహర్జాతకం. వీరు కారణ జన్ములు. ఈ పృధ్వి ఉన్నంతకాలం వీరి యశస్సు నిలిచే ఉంటుది. వీరి కీర్తి తరతరాలుగా నిలిచిపోయేటట్లు ఉండడానికి, వీరు నమ్ముకున్న మతం, సిద్ధాంతం వ్యాప్తి చెందడానికి.. మీ కుటుంబంలోకి ఇంకొక కుమారుడు రావాలి. అదీ మా అమ్మాయి ద్వారానే.. నీ భర్తకి, తనకి పుట్టబోయే పాపడు పద్మప్పకి తోడుగా అతని కనుసన్నులలో ఉంటూ.. రాముడికి లక్ష్మణుడిలా వర్ధిల్లుతాడు.
బాబూ! భీమనప్పా.. నేటి కాల పరిస్థితులలో ద్వితీయ వివాహం అసాధారణమూ కాదు, నిషిద్ధమూ కాదు. త్వరలో రాజధాని వేములవాడకు మారబోతోంది. పిల్లలిద్దరూ అక్కడే పెరిగి పెద్దవారవుతారు. వారు చెయ్యదలచుకున్న కార్యాలు అక్కడే చేస్తారు. పద్మప్ప, రాజాశ్రయం పొంది.. చక్రవర్తికి ఇష్టుడై బిరుదులు పొందుతాడు. అతని సోదరుడు అవన్నీ భవిష్యత్తరాలకి తెలిసేలాగ చేస్తాడు.
ఇంకొక ముఖ్యమైన విషయం..” సింగన్న ఆపి భార్యాభర్తల మొహాలు చూశారు. ఇద్దరి మొహాల్లోనూ అనిశ్చిత స్థితి. నమ్మశక్యంగాని విషయం విటున్నట్లు.. కనుబొమలు పైకి లేపి సావధానులై వింటున్నారు. మంచినీరు తాగి, కండువాతో మొహం మీద చెమట అద్దుకుని మొదలుపెట్టారు. గ్రీష్మ తాపం అప్పుడే మొదలయిందనుకుంటూ..
“వీరశైవులు విజృంభించి, జైనులందర్నీ సామదాన భేద దండోపాయాలతో వైదిక మతానికి మార్చేస్తున్నారు. తప్పని సరై కొన్ని క్రతువులు తమ నిత్య జీవనంలోకి ఆహ్వానిస్తున్నారు జినేయులు. జిన ధర్మం, జిన సాహిత్యం కనుమరుగైపోయే ప్రమాదం పొంచి ఉంది. ముందుతరాల వారికి జైనమత ప్రాశస్థ్యం తెలుపడానికి భీమనప్పయ్య పుత్రులే నడుం కట్టాలి. అది మీరు సహకరిస్తేనే అవుతుంది. మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాం.” సింగన్న దంపతులు లేచి బయటికి నడిచారు.
ఇంటికొచ్చిన అతిథులకి సత్కారం చెయ్యలేదు.. వారికి పానీయం ఏమీ ఇవ్వలేదు. మౌనంగా గోడనానుకుని నిలబడ్డారు భీమనప్పయ్య దంపతులు.
……………………..
“అమ్మా!” పద్మప్ప తల్లి దగ్గరగా వెళ్లబోయి ఆగిపోయాడు.
వంటింట్లో పొయ్యిలో కట్టెలు భగభగా మండుతున్నాయి. పొయ్యి మీద కొర్రబియ్యం కుతకుతా ఉడుకుతోంది. పొయ్యిముందు కూర్చున్న అమ్మ మొహం, కళ్లు కూడా ఆ మంటలాగే ఎర్రగా ఉన్నాయి. ఏమయిందమ్మకి? అరే.. ఏడుస్తోందా! అమ్మ ఏడవడమా! పద్మప్పకి ఏం చెయ్యాలో పాలుపోలేదు.
మాట్లాడకుండా వీధిలోకి వెళ్లి తండ్రిని వెతికి చెప్పాడు. తండ్రి మొహం కూడా ఏదో వింతగా అనిపించింది. ఏదో జరుగుతోంది.. తాను ఎడంగా ఉంటేనే నయం అని ఆ చిన్ని బుర్రకి తోచింది.
సింగన్న దంపతులు వచ్చి వారం రోజులయింది. ఈ వారం అంతా ఇల్లు మూగవోయినట్లయింది. భీమనప్పయ్య మంద్ర స్వరంలో పాడే పాటలు వినిపించడంలేదు.
పాఠశాల మాత్రం మామూలుగా నడుస్తోంది.
భీమనప్పయ్య తల పంకించి ఇంట్లోకి నడిచాడు. పద్మప్ప పెద్ద కళ్లేసుకుని చూస్తూ.. ఇసుకలో సంస్కృతం, కన్నడ, తెలుగు అక్షరాలు దిద్దుతున్నాడు.
“అమ్మీ! మౌనంగా ఉంటే సమస్య సర్దుకోదు. ఏదో సమాధానం చెప్పాలి మనం. నిర్ణయం ఒకసారి తీసుకున్నాక మనం వెనక్కి వెళ్లలేం. తీసుకునే ముందే గట్టిగా ఆలోచించుకోవాలి. ఏం చేద్దాం? ఏ నిర్ణయం తీసుకున్నా మంచీ చెడూ రెండూ ఉంటాయి. సింగన్నగారు చెప్పింది ఒక్కటి నిజం.. జిన ధర్మానికి చేటు కాలం మాత్రం వస్తోంది. జైన సాహిత్యాన్ని ఎక్కడా నిలువనీయట్లేదు. జైనులని బలవంతంగా మార్చేస్తున్నారు. ఇంక మిగిలిన సంగతులు.. అదే.. పద్మప్పకి సోదరుడు కలగడం, ఇద్దరూ ఖ్యాతి పొందడం.. అవన్నీ భవిష్యత్తులోకి చూడడమే.. ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?”
“మీ అభిప్రాయమేమిటి?”
భార్య ప్రశ్నకి నిమేషన్మాత్రం ఆలోచించాడు.
“నాకు ఈ వివాహం మీద ఆసక్తి అయితే లేదు. కానీ ప్రజా సంక్షేమం కోసం, మత ధర్మాన్ని నిలపడం కోసం అయితే తప్పదనే అనుకుంటున్నాను. అదీ నువ్వు సమ్మతిస్తేనే సుమా!”
విరక్తిగా పెదవి విరిచిన భార్యని చూసి గట్టిగా నిట్టూర్చి వెనుతిరిగాడు భీమనప్పయ్య.
“ఆగండి.. సింగన్నగారికి మీ సమ్మతి తెలియజెప్పండి.”
“నిజంగానా? చాలా విషయాలు సర్దుకోవాలి సుమా!”
“అవన్నీ వారం రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నాను. అపర బ్రహ్మ అని పేరు పొందిన సింగన్న జోస్యుల వారి భవిష్య వాణి మీద నాకెటువంటి సంశయమూ లేదు. నా స్వలాభం కంటే వంశ ప్రఖ్యాతి ముఖ్యం. పైగా వబ్బెణబ్బ చాలా మంచి అమ్మాయి. తండ్రి గారి వద్ద సకల శాస్త్రాలు చదివింది. నా కంటే మీకు తగిన ఇల్లాలు. “నేను” అనే భావాన్ని వదులుకుంటే ప్రపంచానికి మేలు జరుగుతున్నప్పుడు.. ఆ పని చెయ్యడమే ఉత్తమం. గృహం కంటే వంశమే ప్రాముఖ్యం కదా!” నాలుగు మాటల కంటే ఎప్పుడూ ఎక్కువ మాట్లాడని భార్యకి ఇంత అవగాహన ఉన్నందుకు ఆశ్చర్య పోయాడు భీమనప్పయ్య.
“ఇంట్లో, నా హృదయంలో నీ స్థానం సుస్థిరం. గృహమందు ఏం జరిగినా నీ అనుమతి తోనే జరుగుతుంది. కానీ ఇంటిలోకి కొత్తగా వచ్చే అమ్మాయిని ఇద్దరం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. సరేనా!” భార్య దగ్గరగా వెళ్లి హృదయానికి హత్తుకున్నాడు.
“అయ్యో! మడి..”
“ఫరవాలేదు.. నేను కూడా మడే!”
అప్పుడే లోపలికొచ్చిన పద్మప్ప రెండు చేతులతో కళ్లు మూసుకున్నాడు.. ఏదో అర్ధమైనట్లు.

 
*————————*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2013
M T W T F S S
« Mar   May »
1234567
891011121314
15161718192021
22232425262728
2930