February 21, 2024

బుల్లి ‘తెర’పెన్నుతో బ్నిం

 

1981లో పత్రికల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలోకి టైటిల్స్ రాసిచ్చే పనితో ఎంటర్ అయ్యాను. కధేంటి? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అంటూ… అడిగి, తగిన కార్టూన్ బొమ్మలు వేసి ఇచ్చిన అప్పటి టైటిల్స్ ఒక కొత్తదనంతో వుండేది. బ్లాక్ పేపర్ మీద తెల్లటి అక్షరాలు రాయడం చేతకాక తెల్లకాగితం మీద నల్లటి అక్షరాలు రాసిచ్చేవాణ్ని. మీర్ గారిలాంటి ఒకరిద్దరు మహానుభావులు దాన్ని వాళ్ళకి కావలస్నినట్టు టెక్నాలజీని వుపయోగించుకుని మార్చుకునే వాళ్ళు. మిగిలిన వారికోసం రంగులు, రంగుకాగితాలు, కలర్ స్కేల్, పెన్నులు, కటింగ్ పెస్టింగ్‌లతో మాయచేసి, మంచిగా వున్నాయి అనిపించుకునే వాణ్ని.

అంతకు ముందే కార్టూన్లు, కధలు రాయడం వచ్చిన నేను, ఓ కార్టూన్‌ని కామెడీ సింగిల్ ఎపిసోడ్‌లా దూరదర్శన్‌కి రాశాను. అప్పుడు C.V.L. నరసింహారావు, అశొక్‌కుమార్ అందులో నేను రాసిన కొన్ని డైలాగులు వాడుతూ స్పాంటేనియన్‌గా చెప్తూ… చక్కగా నటించారు. నాకు మంచి పేరు తెచ్చి పెట్టారు. నన్ను డైలాగులు రాయమని ప్రేరేపించి, ప్రేమించిన  C.V.L. నరసింహారావుగారికి ఆ తర్వాత కృతజ్ఞతా సూచకంగా చాలా చిన్నా చితక పెద్ద పనులు చేసి పెట్టాను.

నాకు TV ఇండస్త్రీలో బొల్డంత నచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మీర్ గారు. ఆయన చాలా మంది డైరెక్టర్లని తయారు చేశాడు. ఇన్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆయన దగ్గరి కొచ్చే కొత్త డైరెక్టర్లు ఆయన దగ్గర షాట్ డివిజన్ నేర్చుకుని స్క్రిప్ట్ మధ్యలో గీతలు కొట్టడం, గ్రూపా..క్లోజా-? సజెషనా… అనే వాటికి స్పెల్లింగ్స్ నేర్చుకుని రెండు ఎపిసోడ్స్ అయ్యాక మధ్య మధ్యలో ట్రాలీరాయాలని Zoom in and Zoom Back కూడా రాయచ్చని వాటి అవసరం, సందర్భోచితం కాకపోయినా మధ్య మధ్యలో వాడాలని కొండ గుర్తులు పెట్టుకోవడం గమనించాను.

ఇలాంటి డైరెక్టర్స్ వల్ల నేను తెలివైన వాణ్ని అనే ధైర్యం నాకు ఎక్కువ అవుతూ వచ్చింది. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా నాకోసం యాక్షన్ పార్టు, డైలాగ్ వెర్షన్ రాయటం అలవాటు అయింది. అది కొంతమంది డైరక్టర్లకి చాలా ఉపయోగపడింది.

ఇహ ప్రొడ్యూసర్ల కధ మహత్తరం. రెమ్యునరేషన్ ఎంతివ్వాలో వాళ్ళకి తెలీదు. మనం ధైర్యం చేసి అంతకు ముందాయన ఇంతిచ్చాడంటే… ఎంత ఎగ్గొటచ్చో మాత్రం బాగా తెలుసు.

సో కాల్డ్ డైరెక్టర్ ఎవరో తెలియకుండా… కధ, మాటలు ‘స్క్రీన్ ప్లే’ రాయించుకున్న ప్రొడ్యూసర్లు నాకు చాలా మందే తగిలారు. ఆ తర్వాత డైరెక్టరు స్క్రిప్ట్ మీద షాట్ డివిజన్ గీతలు గీసుకుని దాన్ని స్క్రీన్ ప్లే అంటారు కాబోలు.

ఎపిసోడ్లు టెలికాస్టులు జరిగిపోయాయి. ప్రొడ్యూసర్ కధ చెప్తున్నప్పుడు వేలు పెట్టకపోయిన వేళ్ళు పెట్టిన సందర్భాలు నాకు చాల జోక్‌గా వుండేది.

ఒకానొక కాబోయే మెగాస్టార్ అనుకుంటున్న ఓ ప్రొడ్యూసరు నా దగ్గర కొచ్చారు. తన భార్య నగా, నట్రా తాకట్టు పెట్టి సింగిల్ ఎపిసోడ్ తీస్తున్నానని 22 నిమిషాల ఎపిసోడ్‌లో 20 నిమిషాలైనా తను కనిపించేలా కధ రాయమని 1000 రూ… అడ్వాన్స్ ఇవ్వబోయాడు. నాకు అతన్ని చూస్తే తల దువ్వుకునే పది సెకన్లు కూడా అద్దం ముందు నిలబడగలడా అనిపించింది. ఎవరి ముఖం వాళ్లకు ముద్దేమో… కానీ ప్రేక్షకులు అంతసేపు వారిని చూడగలరా అని నా బెంగ… అప్పుడో కధ చెప్పా…. వీధి మొదట్లో ఓ స్టాచ్యూ– దాని ముందు జరిగే సంభాషణ విని – నిగ్రహ ఆత్మఘోష.. (లిప్ మూవ్‌మెంట్ కూడా ఉండకుండా..) ఉంటుంది అని… నా అయిడియా ఆయనకి నచ్చక… వెళ్ళిపోయాడు-

ఇంకో డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌కి కధచెప్తున్నా ఆయనతో జరిగిన సంభాషణ… నాకిప్పటికీ గుర్తొస్తూ వుంటుంది!! డైరెక్టర్ పేరు -ఎ- నేను – బి – (ఎలాగా బ్నిం కదా)

బి..      ఒపెన్ చేసేటప్పటికి విమానం లాండ్ అవుతుంది – ఎయిర్ పోర్ట్‌లోవున్న తల్లితండ్రుల ఆనందం-

ఎ..      ఎయిర్‌పోర్ట్‌లో షూటింగ్ చాలా కాస్ట్లీ-

బి..      పోనీ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి కారు వస్తుంది- దాన్ని ఫాలో అవుతాం! దాని మీద   వాయిస్ – లేదా కార్లో క్లోజులు –

ఎ…     ఔట్‌డోర్ వద్ధండీ – బైటకెళ్లే రెండుగంటలు మినిమమ్ వేస్టు- ఇలా బేంబేలెత్తి పోయి ఏడుమ్మొహాన్ని     కెమేరాముందు కాక పోవడంవల్ల సులువుగానే అభినయించాక…..

బి..      సర్లెండి! ఇంట్లో కాలింగ్ వెల్ మోగుతుంది- లోపలున్న వ్యక్తి (తండ్రి) ఇంకా మేకప్ పూర్తవకుండా లోపలున్న వ్యక్తితో (తల్లి) “ఇదిగో నీ చీరకట్టుడు ఇంకా కాలేదు గాని అమెరికా నుంచి అబ్బాయొచ్చేశాడు… బైటకిరా!”

అయ్యా! ఇలా… ప్రొడ్యూసర్‌కి సమస్త విధాల అని విభాగాలవాళ్లూ చీప్-చీపర్-చీపెస్టు టెక్నిక్కు వాడి ఒక కధారచయితని, మాటల గాణ్నీ- బాగాతీద్దామనుకున్న కెమెరాగార్లనీ ఇంక అసలైన శ్రీ స్క్రీన్ ప్లే ధర్శకత్వంగారినీ ఉల్లకల్లోం చేస్తారు- ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూచున్నాక.. ఎన్నిషాట్లకి కాంప్రమేజయ్యామో. సదరు దర్శకుడు కెమీర్లు అనుకుంటారు. రైటర్ కొడుకు సంగతి చెప్పక్కర్లే అసలా మూడు అదికాదు… అని లబలబా.. ప్రతీ టీవీ చూసేవాడింటికి వెళ్లి…”అంచేత నేననుకున్నది ఇలాక్కాదు… అసలు ఆ డైలగ్ ఆ మాడ్యులెషన్లోనే ఛమక్కువుంది- మట్టిలో.. కలిపేసాడు భీం” అని వీడిగోడుని– వివరించి చెప్పలేడుకదా! నిజంచెప్తున్నా కధ-మాటలు బ్నిం అని వేసిన చాలాసార్లు సిగ్గుపడి పేరు వచ్చినప్పుడు మిత్రుల్ని చూడకుండా మొహం తిప్పేలా నేనేసిన కొత్త బొమ్మో, బాపూ గారేసిన లేటెస్టు బొమ్మో వాళ్ల ముందుకు తోస్తుండేవాణ్ణి. ఇదో సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్. నాకు తెలిసి నా రచనలకే మొదటిసారి స్టార్ట్‌ కెమెరా అన్నవాళ్లు నలుగురు సినిమా డైరక్టర్లు అయ్యారు. శ్రీ వరాముళ్లపూడి, శ్రీ గాంధీ మనోహర్, శ్రీ ఫణిప్రకాశ్, శ్రీ వెంకీ, ఏవోయాడ్ ఫిలిమ్స్ (టీవీకే) చేశారు. నేను ఓ సింగిల్ ఎపిసోడ్‌కి డైరెక్టగా డైరెక్షన్ వెలగబెట్టాను. మా ఫ్రెండ్స్ చాల మంది చేసిన సీరియల్స్‌కి నేను షూటింగుల్లో పాల్గోనడం ముఖ్యంగా డబ్బింగ్ కార్యక్రమాలు (డైరెక్టరు గారు పర్మిషన్ ఇస్తే) దగ్గరుండి చేయించుకోడాలు నాకు సరదా. నేను డబ్బింగ్ చేయించగలనని నాకు నమ్మకం ఎక్కువే. బాపుగారు శ్రీ భాగవతం తీస్తున్నప్పుడు తరచుగా డబ్బింగ్ కెళ్లేవాణ్ని- నా అబ్జర్వేషన్ ఆయనకి నచ్చి… ‘మీరు డబ్బింగ్ చెప్పిస్తారా-రమణగారి భాషపై అవగాహన ఉందికదా’ అని అన్నారు. బ్రహ్మానంద పడిపోయాను. కానీ నిర్మాతలు ‘అన్ని పన్లూ మీరే స్వయంగా చేస్తారు కదా…’ అని నసిగారుట- బాపుగారు నాతో మొహమాటంగా చెప్పారు-కానీ నాకు అదో మంచి ప్రశంసగానే అనిపించింది- ఇంకో మహత్తరమైన మాట చెప్పి (అహం పెరగకుండా) ముగిస్తాను-

ముళ్లపూడి వెంకటరమణగారి కధల్ని ‘అనగనగా ఓకధ’ పేరుతో జెమినీకి సీరియల్ చేసాం! రమణగారి అబ్బాయి వరముళ్లపూడి డైరక్టర్- ‘ఆచేతి చేత’ బాపురమణలు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసిచ్చారు- ‘భూషణం వైరాగ్యం’ – ‘వరలక్ష్మీవ్రతం’ నేను రాశాను–! అందులో భూషణం వైరాగ్యంలో నేను స్వామీజీ వేషం వేశాను వరగారి బలవంతంతో – అందులో మహప్రభో…మాటలు అల్లింది నేనే అయినా— ఒక్కోషాట్ అరడజనుకు తక్కువకాకుండా టేకులు తిన్నాను.

ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే 10 డైలాగ్స్‌కీ 4,5, గంటలు తిన్నాను- ఏతావాతా… చెప్పొచ్చే నీతేంటంటే… అందర్నీ వేళాకోలం చేస్తాం గానీ… మనం గురివింద గింజలమే- ఆ మాట చెప్పుకుంటే ఎలా…

 

————-బ్నిం/-

ఇంకా బోల్డు విషయాలు చెప్పాలిగానీ.. ఇప్పటికే జ్యోతిగార్ని నేను చాలా అబద్ధాలకోరునని నమ్మించాను. లేజీ ఫెలోని కాను బిజీ ఫెలోనని ఓవర్‌యాక్షన్ చేసాను. ఇంక రాసి-ఆపేద్దాం ఈ సారికి–

 

 

 

 

 

 

1 thought on “బుల్లి ‘తెర’పెన్నుతో బ్నిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238