April 24, 2024

నిత్య జీవితంలో హాస్యం

     రచన: “ అష్టావధాని “

 డా. మాడుగుల అనిల్ కుమార్ 

తిరుపతి

       ఎవరో ఒక సినిమా పాటల రచయిత వ్రాసిన  పాట గుర్తుకు వచ్చింది ‘ సిరిమల్లె పూవల్లె నవ్వు , చిన్నారి పాపల్లె నవ్వ్వు , నవ్వు నవ్వు నవ్వు ….. ‘ అంటూ. పాట చాలా బాగుంది . అయితే నవ్వును గురించి ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే నా నోటి నుండి –

కం. నవ్వనివాడజ్ఞుండగు

నవ్వని సదసద్వివేక నాణ్యత తగ్గున్

నవ్వగ వలయును మనుజులు

నవ్విన రోగంబులెల్ల నయమగు తండ్రీ !

అంటూ పోతన రచించిన చదవని వాడజ్ఞుండగు అనే పద్యానికి అనుకరణ పద్యం ( పేరడీ ) ఆశువుగా వెలువడింది. ఆ వెంటనే –

ఉ.  నవ్వును జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్

దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్

పువ్వుల వోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే

నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్  ll

అంటూ మహాకవి గుఱ్ఱం జాషువా చెప్పిన పద్యం గుర్తుకు వచ్చింది. మనుషుల లాగానే జంతువులు కూడ నవ్వుతాయి. మనిషి మనఃప్రవృత్తికి అద్దం పట్టే దీపం నవ్వు. పువ్వుల లాగ వికసించి ప్రేమామృతాన్ని పంచేవి పరిశుద్ధమైన నవ్వులు. నవ్వులు దుఃఖాలను , రోగాలను కూడ దూరం చేసే మహౌషధం వంటివి.

నవ్వితే రోగాలన్నీ మటుమాయమౌతాయంటున్నారు శాస్త్రజ్ఞులు . అందుకే దేశ విదేశాల్లో లాఫింగ్ క్లబ్బులు , లాఫింగ్ థెరపీ లు పుట్టుకొచ్చాయి. మన పెద్దలు కూడ ఓ కాలం నాడే  ‘ నవ్వుతూ బతకాలిరా ‘ అన్నారందుకే. జగదీశ్ చంద్రబోస్ అనే మన శాస్త్రజ్ఞుడైతే చెట్లకు కూడ భయము , క్రోధము , దుఃఖము , ఆనందము మొదలైన భావోద్వేగాలున్నాయని , చెట్లు కూడ నవ్వుతాయని కనుగొన్నాడు. ‘ నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ‘ అని మరో సినీ కవి అన్నాడు. ఇలా కన్నీళ్లు వచ్చేలా నవ్వడం కానీ  ఏడ్చడం కాని చేస్తే మానసిక వత్తిడి మాయమౌతుంది. ఐతే ఎవరూ కూర్చొని ఏడ్చాలనుకోరు. కావున నవ్వే అన్నింటికన్నా శ్రేష్ఠమైనది.

కొందరు ఛాదస్తులు నవ్వాటాన్ని న్యూనత్వంగా భావిస్తుంటారు. అది తప్పు.  నవ్వు అందరికీ అవసరమైనది. అందుకే ఒక ప్రాచీన కవి –

ఉ. వాసన లేని పువ్వు , బుధవర్గము లేని పురంబు , నిత్య వి

శ్వాసము లేని భార్య , గుణవంతుడుగాని కుమారుడున్ , సద

భ్యాసము లేని విద్య , పరిహాస ప్రసంగము లేని వాక్యముల్

గ్రాసము లేని కొల్వు , కొఱ గానివి పెమ్మయ సింగధీమణీ !

సుందరంగా వున్నా సువాసన లేని పువ్వు , అన్ని సౌకర్యాలు వుండీ మంచి బుద్ధులు చెప్పే పండితులు లేని పట్టణము , అందంగా ఉన్నప్పటికీ భక్తి , విశ్వాసాలు లేని భార్య , ఎంత గొప్పవాడైనా సద్గుణాలు లేని కొడుకు , ఎంత ఎక్కువ చదివినా మంచి ప్రవర్తన నేర్పని చదువు , ఎంత ఎక్కువ సమయం మాట్లాడినా కొంచెమైనా నవ్వించే గుణం లేని మాటలు , ఎంత సేవ చేసినా కూడు పెట్టని సేవ అనే ఇవన్నీ ప్రయోజనం లేనివి అన్నాడు.

“ శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః  l

బీభత్సాద్భుత శాంతాశ్చ కావ్యే నవరసాః స్మృతాః  ll “

శృంగారము , హాస్యము , కరుణ , రౌద్రము , వీరము , భయానకము , బీభత్సము , అద్భుతము , శాంతము అని శ్రవ్య కావ్యాలలో నవ రసాలు వున్నాయని భరతముని నాట్య శాస్త్రం లో తెలియజేశాడు.

“ రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సహౌ భయం తథా  l

జుగుప్సా విస్మయశమాః స్థాయీభావాః ప్రకీర్తితాః  ll “

రతి , హాసము , శోకము , క్రోధము , ఉత్సాహము , భయము , జుగుప్స , విస్మయము , శమము  అని క్రమంగా  ఈ నవరసాలకు స్థాయి భావాలను కూడ తెలియజేశాడు. హాస్య రసానికి హాసము స్థాయి భావము. స్థాయి భావము అంటే మనుషుల హృదయాలలో స్థిరంగా ఉండేది. అది ఆయా సన్నివేశాలను చూసినప్పుడు బయటకు వెలువడుతుంది. చక్కెర తిన్నప్పుడు తీయగాను , పులుపు తిన్నప్పుడు పుల్లగాను ఎట్లనిపిస్తుందో అట్లే రసానుగుణంగా స్పందన ఉంటుంది. అదే స్థాయి భావము.

హాస్యం ఒక కళ.

“ వికృతాకృతి వాగ్వేషైరాత్మనోs థ పరస్య వా  l

హాసః స్యాత్ పరిపోషో s స్య హాస్యస్త్రి ప్రకృతిః స్మృతః  ll “

ధనంజయుని దశరూపకము.4.75

తమ వికృత వేష , భాషాదుల వలన కాని ; ఇతరుల ఆకార వేష , భాషాదుల వలన కాని కలిగెడు స్థాయి భావమే హాసము.

“ స్మితమిహ వికాసినయనం , కించిల్లక్ష్యద్విజం తు హసితం స్యాత్ l

మధురస్వరం విహసితం , సశిరఃకంపమిదముపహసితమ్   ll

అపహసితం సాస్రాక్షం , విక్షిప్తాంగం భవత్యతిహసితమ్  l

ద్వే ద్వే హసితేచైషా జ్యేష్ఠే మధ్యే s ధమే క్రమశః  ll “

ధనంజయుని దశారూపకము.4.76 , 77

పై శ్లోకాల వలన  1.స్మితము  2.హసితము  3.విహసితము  4.అవహసితము 5.అపహసితము 6.అతిహసితము అని నవ్వు ఆరు విధాలుగా వుందని తెలుస్తున్నది.

1.స్మితము :- దంతములు కానరాకుండా కన్నులను , చెక్కిళ్ళను వికసింపజేసి నవ్వుట.

2. హసితము :- కొద్దిగా దంతములు కనబడునట్లు నవ్వుట.

3.విహసితము :- కంఠగతముగా మధురధ్వని చేస్తూ ఓరకంట చూస్తూ నవ్వుట.

4.అవహసితము :-భుజాలు ఎగురవేస్తూ , తలను వంచి ముక్కుపుటాలు పెద్దగా చేసి నవ్వుట.

5.అపహసితము :- తగిన కారణం లేకుండానే అవయవాలు అదరునట్లు , కన్నీరు కారునట్లు నవ్వుట.

6. అతిహసితము :- చేతులలో డొక్కలు పెట్టుకొని , కన్నీరు కారుస్తూ గట్టిగా నవ్వుట.

హాస్యం అంటే నవ్వు పుట్టించేది ఏదైనా కావచ్చు. హాస్య రస సన్నివేశాలను చూడటం , హాస్యరసంతో కూడిన పుస్తకాలను చదవటంతో మానసిక వత్తిడిని దూరం చేసుకోవచ్చు. మన దేశ మాజీప్రధాని  కీ.శే. శ్రీ పి.వి.నరసింహారావు గారు కూడ మానసిక వత్తిడిలో వున్నప్పుడు తాను హాస్యనట నాయకుడు రాజేంద్ర ప్రసాద్ చిత్రాల విడియోలను చూస్తానని ఒక సభలో వెల్లడించారు.

ఇక హాస్య రసాన్ని పులిమే మొక్కపాటి లక్ష్మీనరసింహశాస్త్రి గారి ‘ బారిష్టర్ పార్వతీశం ‘  నవల చదివి నవ్వని వాడు ఎవడైనా ఉన్నాడంటే మనం వాడి వైపు విచిత్రంగా చూడవలసిందే. మొక్కపాటి లక్ష్మీనరసింహశాస్త్రి గారు ‘ బారిష్టర్ పార్వతీశం ’  నవలలోఅమాయకత్వం , గడుసుతనంతో కూడిన పార్వతీశం పాత్రను ఆద్యంతం హాస్యరసంతో చిత్రీకరించారు. తెలుగు హాస్య రచనకు ఉపక్రమించిన ‘ హాస్యకిరీటి ‘ మునిమాణిక్యం నరసింహారావుగారు ‘ మన హాస్యం ‘ అన్న పేరుతొ ఆరు ప్రకరణాల గ్రంథాన్ని రచించారు. వీరు రచించిన ‘ కాంతం కథలు ‘ ఆయన ప్రత్యేకతను తెలియజేస్తుంది.  పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ‘ సాక్షి ‘ అన్న పేరుతో వ్యాస సంపుటిని కూర్చారు. వీరు రచించిన ఈ వ్యాసాలు గ్రాంథిక భాషలో వుండి అర్థం చేసుకొనుటకు కష్టమైనప్పటికీ అర్థం చేసుకున్న వారిని కడుపుబ్బ నవ్విస్తాయి. శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారికి వృద్ధాప్యం వల్ల మతిమరుపు వచ్చింది. ఆ సమయం లో కూడ వారి గొప్పతనం తెలిసిన ఒక సంఘం వారు వారికి  సన్మాన సభ  ఏర్పాటు  చేశారు. సన్మాన సభలో అధ్యక్షులు మాట్లాడుతూ పానుగంటి వారికి ఈ బహుమతులు అందజేస్తున్నాము అని అన్నారట. వెంటనే పానుగంటి వారు కల్పించుకుని ఉన్న ఒక్క మతి పోయి నేనేడుస్తుంటే వీరిచ్చే బహుమతులేల ? అని చమత్కరించారట. అప్పుడా సభంలోని వారంతా గొల్లున నవ్వారట. తెలుగు భాషలో ఎన్ని నవలలు ఉన్నప్పటికీ ‘ బారిష్టర్ పార్వతీశం ‘ ను  మించిన హాస్య నవల మరొకటి లేదని తెలియజేస్తూ –

కం. క్షితిలో బారిష్టరు పా

ర్వతీశమును చెప్పి పిదప పలుకవలె గదా

కితకితల కితరులను , భా

సిత సిత సుశ్లోకుడతడు సిరిసిరిమువ్వా  ll

అన్నాడు మహాకవి శ్రీశ్రీ.

మన పూర్వ కవుల కావ్యాలలో హాస్యరసం లేదనడానికి వీలు లేదు. వారు ధ్వని వ్యంగ్య రూపంగా , శబ్దవైచిత్రితో సందర్భశుద్ధిగా హాస్యాన్ని పండించి పండిత పాఠకుల మెప్పువడసినారు. ప్రాచీన నాటకాలలో విదూషకుని పాత్ర చాల ప్రధానమైనది. విదూషకుడు లేకపోతే నాటకమే లేదు. నాటకంలో నాయకుని వెంట విదూషకుడు తప్పకుండా వుండవలసినదే. “ హాస్యప్రాయో విదూషకః “ అని విదూషకుని లక్షణం. విదూషకునికి నాయకునితో ఎక్కువ చనువు వుంటుంది. అతడు రాజును ఒక్కొక్కసారి వేళాకోళం చేస్తాడు. ఒక్కొక్కసారి రాజు చేత తిట్లు తింటాడు. అప్పుడప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. ప్రధాన మంత్రి తరువాత స్థానం విదూషకునిదే. ఈ పరంపరనే ప్రస్తుతం మనం వెండితెర పై కూడ చూస్తున్నది.  వెండితెర విదూషకులంటే రాజబాబు , రేలంగి , పద్మనాభం , రమణారెడ్డి , మాడ, నగేష్ లను మొదలుకొని నేటికాలం హాస్యనటులు బ్రహ్మానందం , గుండు హనుమంతరావు మొదలైన వారి వఱకు. వీరు లేనిదే చిత్రాలు విజయవంతం కావు.

ప్రాచీన సంస్కృతాంధ్ర సాహిత్యం లో హాస్యాన్ని పండించే పద్యాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి.

ఒకసారి భోజ కాళిదాసుల మధ్య మనః స్పర్ధ వచ్చింది. తనను అవమానించిన భోజుడు మరల ఆహ్వానించే వఱకు రాజ్యంలో ఉండకూడదని ధారానగరాన్ని వదలి వెళ్ళిపోతాడు కాళిదాసు. కాళిదాసు లేకుండా కాలం గడపలేని భోజుడు ఆయనను వెదకడానికి గూఢచారులను పంపి పొరుగుదేశంలో సన్యాసి వేషంతో తిరుగుతున్నాడని తెలుసుకుంటాడు. మరుసటి రోజే భోజుడు మారువేషంతో కాళిదాసును వెదకడానికి పొరుగురాజ్యం వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి భోజునికి కనిపించాడు. ఆయన కాళిదాసు లాగే వున్నాడు. అందువల్ల భోజుడు ఆయనను అనుసరించాడు.  ఇది గమనించిన మారువేషం లో వున్న కాళిదాసు భోజుని ఆట పట్టించాలనుకుని ఒక మాంసపు కొట్టులోనికి వెళ్లి మాంసాన్ని బేరం చేయసాగాడు. భోజుడు ఆశ్చర్యపోయి ఆ సన్యాసితో సంభాషించాడు. ఆ సంభాషణ ఒక శ్లోక రూపంగా మారింది –

శ్లో .  భిక్షో ! మాంస నిషేవణం కిముచితమ్ ? కిం తేన మద్యం వినా

మద్యంచాపి తవ ప్రియం ? ప్రియమిదం వారాంగనాభిస్సహ   l

వారస్త్రీ రతయే కుతస్తవ ధనం ? చౌర్యేణ ద్యూతేన వా !

చౌర్య ద్యూత పరిశ్రమోsస్తి  భవతః ? భ్రష్టస్య కా వా గతిః    ll

భోజుడు : అయ్యా ! నీకు మాసం తినడం ఇష్టమా ?

కాళిదాసు : మద్యం లేకుండా మాంసంతో లాభమేమిటి ?

భోజుడు: మద్యపానం కూడ నీకిష్టమా ?

కాళిదాసు: వేశ్యాస్త్రీలతో కూడ మద్యపానం నాకిష్టం .

భోజుడు: వేశ్యలతో పొందుకు నీకు డబ్బెలా లభిస్తున్నది ?

కాళిదాసు: దొంగతనం చేసి లేదా జూదమాడి సంపాదిస్తాను.

భోజుడు: నీకు చౌర్యంలోను , జూదం లోను కూడా ప్రవేశమున్నదా ?

కాళిదాసు: భ్రష్టుడైన వానికి ఇంతకన్నా వేరే వుపాయమేమున్నది.

ఇక్కడ భ్రష్టుడు అంటే దిగజారిపోయినవాడు అనే అర్థం వస్తుంది. నేను నీ రాజ్య భ్రష్టుడినైనాను. నేను ఎట్లా పోతే నీకెందుకు? అనే ధ్వని కూడ వుంది. ఈ సంభాషణలో కాళిదాసు చాతుర్యాన్ని పసిగట్టి యితడు పూర్తిగా కాళిదాసే అన్న నమ్మకానికి వచ్చాడు భోజుడు. వెంటనే కాళిదాసుకు క్షమాపణ చెప్పి ఆయనను బ్రతిమాలి మరల ధారానగారనికి పిలుచుకుపోయాడు భోజుడు.

మరొక హాస్య సంభాషణ ఎలా వుంటుందో చూస్తాము –

ఇద్దరు యువతులు చాల రోజుల తర్వాత కలుసుకొని తమ భర్తల గొప్పతనాన్ని గుఱించి చెప్పుకుంటున్నారు. అదీ ఒక శ్లోక రూప సంభాషణమే.

శ్లో . చతురస్సఖి మే భర్తా స యల్లిఖతి తత్ పరో న వాచయతి  l

తస్మాదపి చతురో మే స్వయమపి లిఖితం స్వయం న జానాతి  ll

అందులో మొదటి యువతి : ఓ సఖీ ! నా భర్త చాల నేర్పరి. అతడు ఏమి వ్రాసినా దానిని మరొకడు చదవలేడు.

రెండవ యువతి : సఖీ ! ఇంత మాత్రమేనా . నా భర్త అంతకంటే చాలా నేర్పరి , ఆయన తాను వ్రాసినది తానే చదవలేడు.

ఇది ఎంత చమత్కార జనకమైన సంభాషణో చాశారా ? మఱొకటి –

ఒకానొక పండితుడు ఒక గ్రామాధికారి దగ్గరకు వెళ్లి తనకు ఏదైనా  ఉద్యోగం ఇవ్వమని అడిగాడు. అందుకా గ్రామాధికారి పండితుని కసురుకొని పంపివేశాడు. ఐతే ఆ పండితుడు రాజధానికి వెళ్లి ఏదో విధంగా కష్టపడి రాజదర్శనం చేసుకుని తన ప్రతిభ చూపి రాజాస్థానంలో ఉద్యోగం సంపాదించాడు.

ఒకరోజు రాజుకు వసూలైన  కప్పం కట్టడానికి వెళ్ళిన గ్రామాధికారికి పండితుడు ఎదురుపడ్డాడు. అప్పుడా గ్రామాధికారి ‘ నీవు ఇక్కడ కూడ వచ్చావా ? ‘ అని ప్రశ్నించాడు.  అప్పుడా పండితుడు –

కం. పెక్కావులిచ్చుచుండగ

బక్కావొకటివ్వకున్న పాడికి కొదవా ?

పెక్కుదొరలివ్వగానొక

కుక్కలకొడుకివ్వకున్న కూటికి కొదవా ?

అని పద్యం చెప్పాడు. ఈ పద్యం లో పండితుని చమత్కారమే కాదు ఆత్మవిశ్వాసం కూడ తొణికిసలాడుతోంది. ‘ నారు పోసిన వాడు నీరు పోస్తాడు ‘ అని నానుడి. తెలివి వున్నప్పటికీ బ్రతుకు దెరువు దొరకలేదని  బాధపడే వారికి ఈ పద్యం నిండైన ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది. అంతే కాక ఇందులో సున్నితమైన హాస్యం కూడ మిళితమై వుంది. ఇక తెనాలి రామకృష్ణుని హాస్య పద్యాలకు కొదవే లేదు. హాస్యానికి తెనాలి రామలింగని పేరు చెప్పడం పునరుక్తే అవుతుంది.

తెలుగు భాషలో జోకులకు కొదవలేదు.

ఒక విద్యాశాఖాధికారి ఒక పాఠశాలకు పర్యవేక్షణకు వెళ్ళాడు. ఒక తరగతిలోని విద్యార్థులను “ మన జాతీయ పక్షి ఏది ? “ అని ప్రశ్నిస్తూ ఒకరైన తర్వాత ఒకరిని చెప్పనివారిని నిలబెట్టుతూ వెళ్ళాడు. చివరి వరుసలో ఒక విద్యార్థి నిద్రపోతూవుండటం గమనించిన అధ్యాపకుడు త్వరగా వెళ్లి ఆ విద్యార్థి జుట్టు పట్టుకొని గట్టిగా లాగాడు. ఆ విద్యార్థి నొప్పి తాళలేక పీకాకు పీకాకు ( నెమలి ) అని గట్టిగా అరిచాడు. ఇక్కడ పీకాకు అంటే జుట్టు పీకవద్దు అనే అర్థానికి బదులు నెమలి అనే అర్థం కూడ సందర్భోచితంగా వచ్చింది. చివరి వరుసలో నుండి ఈ మాట వినపడి  విద్యాశాఖాదికారికి చాలా సంతోషమైంది. ఆ బాలుని పిలచి అభినందించాడు.

మరొక చోట విద్యాశాఖాధికారి పర్యవేక్షణకు వెళ్ళాడు. తరగతిలో విద్యార్థులను

“ దశరథుని చిన్న భార్య పేరు ఏమి ? “ అని ప్రశ్నించాడు. ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక్కొక్కరిని నిలబెడుతూ పోతున్నాడు. ఇది వరకు లాగానే చివరి వరుసలో ఒక ముస్లిం విద్యార్థి నిద్ర పోతున్నాడు. అధ్యాపకుడు అది గమనించి అతని దగ్గరికి వెళ్లి గట్టిగా తట్టి లేపాడు. ఆ ముస్లిం విద్యార్థి ఉలిక్కిపడి లేచి నిద్రలోనే “ కైకా “ అని గట్టిగ అరిచాడు. కైకా అంటే ఎందుకు నన్ను తట్టి లేపావు అని , దశరథుని చిన్నభార్య పేరు కైకా అని  రెండర్థాలు వస్తుంది. వెంటనే విద్యాశాఖాధికారి అతనిని అభినందించాడు. ఇక్కడ కూడ సందర్భోచితమైన హాస్యం ఉట్టిపడింది.

ఇలా హాస్యం మానవ ప్రాణికి జీవనౌషధం. తాను నవ్వుతూ , ఇతరులను నవ్విస్తూ వుండటం ఒక కళ. అది అందరికీ అంత సులభ సాధ్యమైనది కాదు. ఏడుస్తూ పుట్టిన మానవుడు చనిపోయే వఱకు నవ్వుతూ , నవ్విస్తూ బ్రతకాలి. అదే జీవిత పరమావధి.

 

జై హింద్

 

8 thoughts on “నిత్య జీవితంలో హాస్యం

  1. >>శృంగారము , హాస్యము , కరుణ , రౌద్రము , వీరము , భయానకము , బీభత్సము , అద్భుతము , శాంతము అని శ్రవ్య కావ్యాలలో నవ రసాలు వున్నాయని భరతముని నాట్య శాస్త్రం లో తెలియజేశాడు<<
    నాట్యశాస్త్రంలో పేర్కొన్నది అష్టరసాలేననుకొంటానండి. బహుశా మీరు ధ్వన్యాలోకాన్ని ప్రస్తావించారనుకొంటాను. ఏమైనా చక్కని వ్యాసం.'కైక ','పీకాక్ ' లు బాగా పేలాయి. 🙂

    ఇంకా 'అస్థివత్ బకవత్ చైవ చల్లవత్ తెల్లకుక్కవత్ ' ను ప్రస్తావిస్తారేమోనని చూశాను. 🙂

    ఈ వ్యాసానికి రెండవభాగాన్ని నీలకంఠవిజయచంపువు, తెనాలి రామకృష్ణుడు ఇత్యాదులతో వ్రాస్తారేమోనని నాకొక దురాశ.

    1. రవి గారు ! కావ్యే నవరసాః స్మృతాః = శ్రవ్య కావ్యాలలో అనే నేను కూడ పేర్కొన్నాను. అది భరతముని పేర్కొన్నదే అని నా మాట నే మీరు తెలియజేశారు. అష్టౌ నాట్యే రసాః స్మృతాః అని భరత మునియే దృశ్య కావ్యాలలో అయితేనే ఎనిమిది రసాలు అని పేర్కొన్నాడు. శాంత రసం చూపుటకు వీలు కాదు కాబట్టి. మీ మాట నా మాట ఒకటే ఉంది . తరచి చూడండి. నాపై అభిమానం తో అంత శ్రద్ధగా వ్యాసాన్ని చదివినందుకు ధన్యవాదాలు.

      1. నిజమే అనిల్. నేనే పొరబడినాను. శ్రవ్యకావ్యాలలో అని మీరు చెప్పిన తర్వాత గుర్తుకు వచ్చింది. శాంత రసం మీద ధనంజయుడు చేసిన సుదీర్ఘ చర్చ తలలో కూరుకుని ఉంది. అదీ కారణం.:))

  2. క్షమించండి . అనవసరమైన నా వ్యాసం గురించి క్రింద లైన్ లో వచ్చింది. దానిని రిమూవ్ చేయగలిగితే బాగుంటుంది. నేను గమనించకూండా వచ్చింది.

  3. నమస్కారమండి.
    హాస్యం గురించి డా. మాడుగుల అనిల్ కుమార్ అవధాని గారు బాగా చెప్పారు. సంస్కృత సాహిత్యం లో ప్రహేళికల రూపములో చాలా హాస్య రచనలు కనబడుతాయి. మనహాస్యం పేరిట కీ.శే. మునిమాణిక్యం గారు ఒక లక్షణగ్రంథమే వ్రాసారు. వారు ప్రాచీనకావ్య నాటకాలలో హాస్యానికి కవులు పెద్ద పీఠ వేయలేదన్నరు. అది నిజమే కావచ్చనిపిస్తుంది. హాస్యమే ప్రధనమైన రచన అంతగా కనబడదు. మాళవికాగ్నిమిత్రం లో విదూషకుని పాత్రకున్నప్రాముఖ్యం శాకుంతలం లో ఇవ్వలేదు కవి. కేవలం అంగరసం గానే కవులు వినియోగించుకొన్నారని అనిపిస్తుంది. ఐతే భోజప్రబంధకారుడు భోజుని కథలలో అక్కడక్కడ కాలిదాసపాత్రద్వారా హాస్యాన్ని చిందించారు. అట్లే ప్రహేళికలలో చాలా హాస్యరచనలు కనబడుతాయి. వాటిని కూడా మనం సమయాన్ని బట్టి సహృదయపాఠకులకు అందించుచు అలరించవచ్చు. అనిల్ గారికి ధన్యవాదములు.

    భవదీయులు
    కొరిడె విశ్వనాథ శర్మ

    1. బ్రహ్మశ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారికి నమస్సుమాంజలులు. అప్పటికే నా వ్యాసం అప్పటికే తొమ్మిది పుటలు దాటినందువలన వ్యాస విస్తరణ భీతిచే టూకీగా వ్రాయవలసి వచ్చినది. మరికొంత పెరిగితే పుస్తకం కాగలదు అనే భయం కూడ. మనకు చాటువులకు కొదవ లేదు కదా ! మంచి సూచన చేసినందులకు అనేక ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238