March 29, 2024

ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం

రచన- మధురవాణి

 

“బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ఫలితంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారి సూచన” అంటూ రేడియోలో చెప్తున్న వార్తాహరుడి స్వరం మృదువుగా, ప్రశాంతంగా వినిపిస్తోంది.

సమయం సాయంకాలం నాలుగే అయినప్పటికీ అప్పటికే ఆకాశంలో సూర్యుడు చక్కా సెలవు పుచ్చేసుకోవడం మూలానా, కాలమేఘాలన్నీ గుమిగూడి అత్యవసర సమావేశం పెట్టుకోడం వల్లా అప్పుడే చీకటి తెరలు అలుముకుంటున్నట్టుంది. చెట్లన్నీ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ మరి కాసేపట్లో మొదలవబోయే గాలిదుమారం భీభత్సానికి నాందీ ప్రస్తావన పలుకుతున్నట్టున్నాయి.

ఆ బస్తీలోని ఆడవాళ్ళందరూ వాతావరణ పరిస్థితిని గ్రహించి ఇంటి బయటున్న చెంబూ తపేళాలూ, మంచాలూ, బట్టలూ వగైరాలన్నింటినీ ఇంట్లోకి చేరుస్తూ, అలాగే వీధుల్లో ఆడుకుంటున్న పిల్లల్ని బలవంతంగా రెక్క పుచ్చుకు లాక్కొచ్చి ఇళ్ళల్లో పడేస్తున్నారు.

మరి కాసేపటికి ఈదురు గాలులతో గాలి దుమారం మొదలయ్యేసరికి అందరూ ఇళ్ళల్లోకి చేరి తలుపులు మూసుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆ వీధి వీధంతా నిర్మానుష్యమైపోయింది.

 

‘ఊరందరిదీ ఓ దారైతే ఉలిపి కట్టెదో దారి’ అన్నట్టు ఆ వీధి చివరన ఓ ఒంటిగది రేకులషెడ్డు ముందు ఒక చిన్న కుక్కి మంచంలో ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. ప్రకృతి విలయానికి ఏ మాత్రం చలించకుండా తపస్సును నిర్విఘ్నంగా కొనసాగించే మునిపుంగవుడి మాదిరి ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడతను.

మాసిపోయిన అతని బట్టలు, ఎండిపోయి రేగినట్టున్న అతని తలకట్టు, మంచంలో రెండు చేతులు వెనక్కి ఆనించి కాళ్ళు ముందుకు విసిరేసినట్టు నిర్లక్ష్యంగా కూర్చున్న అతని వాలకం చూస్తుంటే ఇంతకన్నా పెద్ద దుమారమేదో అతని మనసులో చెలరేగుతోందనిపిస్తోంది. అంతటి గాలి దుమ్ము రేగుతున్నా కూడా రెప్ప వాల్చకుండా తదేకంగా ఎటో చూస్తూ కూర్చున్నాడతను.

 

“అయ్యో బాబూ.. పెద్ద వర్షం వచ్చేలాగుందిరా.. యీ వేళప్పుడు బయటికెక్కడికి బయలుదేరావు? పనేమైనా ఉంటే రేపు చూస్కోవచ్చులే. ఇంట్లోకి వచ్చి కూర్చో” అని ప్రేమగా పిలిచి చెప్పే అమ్మ లేదు అతనికి.

“ఉరేయ్! పెద్ద వాన పడేతట్టుంటే యాడికి రా పోతన్నావు యీ యాలప్పుడు. నోర్మూసుకుని ఇంటో గూచ్చోక” అంటూ వాత్సల్యంతో కూడిన అధికారంతో అరిచి చెప్పే అబ్బ కూడా లేడు.

పోనీ వర్షంలో తోడుగా తనతో పాటూ రావడానికి కనీసం తోబుట్టువులైనా లేరు. అతను తిన్నా తినకపోయినా, ఇంట్లో ఉన్నా, వర్షంలో తడిసినా, ఉన్నా, పోయినా కూడా ఎవరికీ పట్టదు. ఎందుకంటే, అతనికి ‘నా’ అనే వాళ్ళెవరూ లేరు.

యీ సువిశాల ప్రపంచంలో అతనో ఒంటరి ప్రాణి. అదే అతని బాధ కూడా!

ఈ క్షణాన అతని మనసులో రేగుతున్న దుమారమేంటో తెలియాలంటే అతని గతం గురించి కొంత తెలుసుకోవాలి మరి!

 

**********

 

అతను ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలీదు. గాలి ఒళ్ళో పెరిగాడు. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ ఆ పనీ యీ పనీ చేసుకుని పొట్ట పోసుకుంటూ ఏ చెట్టు నీడనో వెతుక్కుంటూ బతుకు వెళ్ళబుచ్చుతున్నాడు. ఇహ చదువుసంధ్యల మాటయితే చెప్పనక్కరలేదు.

దాదాపు పదహారేళ్ళ వయసు వచ్చేదాకా కాకా హోటళ్ళలో టీలందిస్తూ, కప్పులు కడుగుతూ గడిపాడు. ముందూ వెనుకా ఎవరూ లేని వాడవటం మూలాన శ్రమకి తగ్గ ప్రతిఫలం కూడా దక్కేది కాదు. పొరపాటున ఏ టీ కప్పో చేజారితే చావబాదేవాళ్ళు హోటలు యజమానులు. అలా ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలిన ప్రతీసారీ పొట్ట చేతబట్టుకుని మరో ఊరు పారిపోవడం, మళ్ళీ ఏదో పనిలో కుదురుకోవడం, మళ్ళీ ఏదన్నా తేడా వస్తే మరోసారి కాళ్ళకి బుద్ధి చెప్పడం.. ఇలా సాగుతూ వచ్చింది అతని జీవితం.

అన్నేళ్ళు అన్నేసి చోట్లా తిరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా తనపైన రవ్వంతైనా దయాదాక్షిణ్యం చూపించగలవారు ఒక్కరైనా ఎదురు పడలేదతనికి.

 

ఒకసారిలాగే పొట్ట చేతబట్టుకుని ఓ కొత్త ఊర్లో రోడ్డు మీద నించుని దిక్కులు చూస్తున్న అతన్ని “కూలీ పని చేయడానికొస్తావా? సాయంత్రానికి యాభై రూపాయలిప్పిస్తా”నన్నాడు ఓ తాపీ మేస్త్రి. యాభై రూపాలయన్న మాట చెవిన పడగానే సరేనని తలూపి ఆ మేస్త్రీ కూడా వెళ్ళాడు. ఆ మేస్త్రి అతన్ని నేరుగా నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవనం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ పని చేస్తున్న ఎంతో మంది మేస్త్రీల్లో అతన్ని తీసుకొచ్చినతను కూడా ఒకడు. ఒక్కో మేస్త్రీ కింద అతనిలాంటి వాళ్ళు ఓ ఇరవై మందైనా ఉన్నారు. ఇటుకలు, సిమెంటు, ఇసుక, కాంక్రీటు లాంటివన్నీ ఇనప బొచ్చెల్లో మొయ్యడం అతనికిచ్చిన పని. పొద్దున్న ఏడింటికి మొదలెడితే సాయంత్రం ఆరున్నర దాటేది పనయ్యేసరికి. ఆ పక్కనే ఉన్న కాకా హోటల్లోనే కాఫీలూ, ఫలహారాలూ, లంచూ, డిన్నరూ సమస్తం గడిచిపోయేవి. రాత్రికి నిద్ర కూడా వాళ్ళు కడుతున్న ఆ భవనంలో జరిగిపోయేది. అన్నీ ఖర్చులూ పోగా ఇంకా చేతిలో మిగిలిన ఇరవై రూపాయలు చూస్తే మహా సంబరంగా ఉండేది అతగాడికి.

 

అలా ఓ మూణ్ణెళ్ళు గడిచేసరికి ఆ బిల్డింగు కట్టడం పూర్తయిపోయింది. ఆ మేస్త్రీ వేరే ఏదో రాష్ట్రం పోతున్నాడట. అతనితో పాటు పని చేసిన చాలా మంది కూలీలు కూడా తలో దిక్కూ వెళ్తున్నారు జీవనోపాధి వెతుక్కుంటూ. వెళ్తూ వెళ్తూ మేస్త్రీ చెప్పాడు ఆ ఊర్లో ఫలానా సెంటర్లో పొద్దున్నే నిలబడితే కూలీల కోసం చాలా మందే వచ్చి తీసుకెళ్తారని. మర్నాడు పొద్దున్నే వెళ్లి మేస్త్రీ చెప్పిన చోట నించున్నాడు.  అతనిలాగే పొట్ట గడవడానికి పనికోసం ఎదురు చూస్తున్నవాళ్ళు చాలామందే కనిపించారక్కడ.

ఇంతలో ఓ వ్యక్తి వచ్చాడు అతను నించున్న గుంపు దగ్గరికి. ఆ వ్యక్తి వయసు దాదాపుగా నలభైయేళ్ళ పైనే ఉండొచ్చు. ఓ మోస్తరు లావుగానే ఉన్నాడు. నున్నగా మెరిసే బట్టతల, నుదుటి మీద కనిపిస్తున్న విభూతి రేఖలు, ముఖాన చిందుతున్న చిరునవ్వు, ఇవన్నీ కూడా చూడగానే ఆ వ్యక్తి మీద గౌరవం కలిగేలా చేస్తున్నాయి. తానొక పెద్ద మేస్త్రీననీ, కూలీకి జనాలు కావాలని చెప్పి దాదాపు ఓ వంద మందిని మాట్లాడుకుని వెంట తీస్కెళ్ళాడు. ఆ వ్యక్తితో పాటు వెళ్ళిన వందమందిలో అతను కూడా ఉన్నాడు. అలా ఆ రోజు ఆ కొత్త వ్యక్తితో కలిసి వెళ్ళిన అతను అప్పట్నించీ ఆ వ్యక్తి కూడానే ఉండిపోయాడు!

 

పనిలో చేరిన కొత్తలోనే అతను అనాథని తెలిసాక ఆ వ్యక్తే చేరదీసి మంచీ చెడ్డా చూడసాగాడు. అతనికి తను ‘బాబాయ్’ లాంటి వాడిననీ, అంచేత తనని ‘మేస్త్రీ’ అని కాకుండా ‘బాబాయ్’ అనే పిలవమన్నాడు. ఆ విధంగా యీ లోకంలో తనవాళ్ళంటూ ఎవరూ లేని అతనికి ఏర్పడ్డ మొట్టమొదటి అనుబంధం ‘బాబాయ్’ తోనే!

బాబాయ్ వచ్చాక అతని జీవితంలో ఇదివరకెరుగని నూతనోత్సాహం వచ్చి చేరింది. కొన్నాళ్ళకు బాబాయ్ సలహా మేరకు ఇద్దరూ కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద పట్టణానికి వెళ్ళారు పని చూసుకోడానికి. బాబాయ్ తాపీ పనిలో బాగా చెయ్యి తిరిగినవాడవడం చేత, మొదట్లో సిమెంటు, ఇసుక మోస్తూ తిరిగిన అతను బాబాయ్ దగ్గర చేరిన కొన్నాళ్ళకే తాపీ పని నేర్చుకోడం మొదలు పెట్టాడు.

వాళ్ళు పనిచేసే చోటికి కొన్ని మైళ్ళ దూరంలో ఊరి బయట విసిరేసినట్టున్న ఓ చిన్న బస్తీలో ఒంటిగది రేకులషెడ్డు ఒకటి అద్దెకి తీసుకున్నారు. రోజంతా కష్టపడి పని చేశాక వాళ్ళిద్దరూ కలిసి ఏ హోటల్లోనో భోజనం కానిచ్చి, ఎప్పుడో రాత్రికొచ్చి ఆ రేకులషెడ్డులో పడుకునేవారు.

పగలంతా కష్టపడి పని చేసే బాబాయ్ రోజూ రాత్రిపూట కల్లు దుకాణం దర్శించనిదే నిద్ర పోయేవాడు కాదు. మామూలుగానే మాటకారి అయిన బాబాయ్ గొంతులో చుక్క పడ్డాక మరిన్ని మాటలు దొర్లించేవాడు. బాబాయ్ ఏం చెప్పినా, ఏం చేసినా ఇష్టంగానే ఉండేది అతనికి.

 

అలా అలా హాయిగా కాలం సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో ఒక పెద్ద మలుపు చోటు చేసుకుంది.

ఓ రోజు అతనేదో పని మీద బజారుకి వెళ్లి వస్తుంటే దూరం నుంచి బాబాయ్ ఎవరో ఒక కొత్త వ్యక్తితో ఏదో మాట్లాడుతూ డబ్బులిస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి పక్కనే ఓణీ వేసుకున్న ఒక పడుచుపిల్ల కూడా నిలబడి ఉంది. అతను వాళ్లకి దగ్గరగా వెళ్ళే సమయానికి ఆ కొత్తవాళ్ళతో మాట్లాడడం ముగించి బాబాయ్ లోపలికెళ్ళిపోయాడు. ఆ కొత్త వ్యక్తీ, ఆ అమ్మాయి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కనిపించారు.

ఆ రోజు రాత్రి మాటల్లో తెలిసింది అతనికి.. బాబాయ్ తనలాగా ఒంటరి వాడు కాదనీ, పొద్దున్న అతను చూసిన అమ్మాయి బాబాయ్ సొంత చెల్లెలి కూతురనీ!

 

బాబాయ్ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కాలం చేశారట. తనకున్న ఒక్కగానొక్క చెల్లెల్ని తానే స్వయంగా చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి తన తాహతుకి మించిన సంబంధం తెచ్చి మరీ పెళ్లి చేశాడట. దురదృష్టవశాత్తూ ఒక పాపకి జన్మనిచ్చిన తరువాత బాబాయ్ చెల్లి చనిపోయిందట. ఆ తల్లి లేని పిల్లకి ఉన్న తండ్రి కాస్తా రెండేళ్ళ కిందట ఏదో జబ్బు చేసి పోయాడట. ఆ తరవాత బాబాయ్ తన మేనకోడలి బాధ్యత తాను తీసుకుందామనుకుని వాళ్ళింటికెళ్తే ఆ అమ్మాయి పెదనాన్న ఒక షరతు పెట్టాడట. పోయిన తన తమ్ముడు చేసిన అప్పులు తీరిస్తేనే గానీ ఆ అమ్మాయిని బాబాయితో పంపించనన్నాడట.

ఆ డబ్బు సంపాదించడం కోసం బాబాయ్ ఇలా ఊరూరా తిరుగుతూ తన చేతిలో ఉన్న విద్యతో సంపాదిస్తూ వీలైనప్పుడల్లా ఆ డబ్బు జమ చేస్తున్నాడట. ఆ రోజు ఉదయం తను చూసింది కూడా వాళ్ళనే అని చెప్పాడు.

 

బాబాయ్ చెప్పిందంతా విన్నాక అతనికి చాలా బాధనిపించింది. నా అన్నవాళ్ళు ఉండి కూడా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్న బాబాయ్ పరిస్థితికి జాలి కలిగింది. తన స్వార్ధం చూసుకోకుండా చెల్లెలి కూతురి కోసం అంత తపన పడుతున్న బాబాయ్ మీద ఎనలేని గౌరవం కూడా కలిగింది. ఆలస్యం చెయ్యకుండా వెంటనే “నీ అవసరం అయితే ఒకటీ, నా అవసరమైతే ఒకటీనా బాబాయ్.. మనిద్దరం కలిసి కష్టపడి సంపాదించి ఆ అప్పు తీర్చేద్దాం” అన్నాడు అతను.

అతని మాటలకి పొంగిపోయిన బాబాయ్ “నీలాంటి మంచి మనసున్న వాడి చేతిలోనే దాన్ని ముడి పెట్టేస్తే నా జీవితానికింక ఏ చింతా ఉండదురా. నీలాంటి కాదురా.. నీ చేతిలోనే పెడతాను. ఏరా.. నా చెల్లెలి బిడ్డని పెళ్ళి చేసుకుంటావురా?” అనడిగాడు బాబాయ్.

బాబాయ్ మాటలకి అతని మనసులో వెల్లువెత్తిన ఆనందం అంబరాన్ని తాకింది. అప్పటిదాకా జీవితంలో తనవారంటూ ఎవరూ లేని అతనికి ఆ క్షణమే భవిష్యత్తు మీద తీపి ఆశలు చిగురించాయి. తనూ, తన భార్యాపిల్లలు, బాబాయ్.. తనదీ అనే ఒక అందమైన కుటుంబం ఏర్పడబోతోందని అతన్ని ఏవేవో తియ్యటి ఊహలు ఊరించాయి.

 

ఆ రోజు మొదలుకుని అతనూ, బాబాయ్ ఇద్దరూ కలిసి రాత్రనకా పగలనకా చాలా కష్టపడి డబ్బు పోగేసేవారు. అలా ఏడాది గడిచింది. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళనుకున్న మొత్తం సిద్ధమైపోతుంది. తనకంటూ ఓ సొంత కుటుంబం ఏర్పడబోతోందని అతను కలలు కంటున్నాడు.

అతను ఎదురు చూస్తున్నట్టే ఆ రోజు రానే వచ్చింది. ఏడాది నుంచీ వాళ్ళు కడుతున్న పెద్ద భవనం పూర్తయిపోయి వాళ్ళకి రావలసిన పెద్ద మొత్తం చేతికందింది. బాబాయ్ డబ్బంతా తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అప్పు తీర్చేసి తన చెల్లెలి కూతుర్ని తీసుకుని మరుసటి రోజుకంతా వచ్చేస్తానని చెప్పాడు.

 

కానీ వారం రోజులు గడిచినా బాబాయ్ తిరిగి రాలేదు. అతని మనసేదో కీడుని శంకించింది. బాబాయికి ఏమైనా ఆపద ఎదురయిందేమోనని భయం వేసింది. మరో రెండ్రోజులు ఎదురు చూసాక అసలు అక్కడేం జరిగిందో తానే స్వయంగా తెలుసుకురావాలని అతను బాబాయ్ చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళ ఊరికి వెళ్ళాడు. బాబాయ్ చెప్పిన వివరాలతో సరిపోలిన వారెవరూ అక్కడ కనిపించలేదు.

ఎంతగా ఆలోచించినా అసలేం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు, తను చెప్పిన వివరాలు సరైనవి కాదా, కాకపోతే తనతో అబద్దాలు ఎందుకు చెప్పాడు, అసలు బాబాయ్ ఏమైపోయాడు?? ఇలాంటి ఎన్నో జవాబులు దొరకని ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతూ ఉండిపోయాడు అతను.

 

అలాంటి అయోమయంలోనే దాదాపు రెండు నెలలు గడిచాక అనూహ్యంగా ఒకరోజు అతని కళ్ళ ముందున్న చిక్కు తెరలన్నీ విడిపోయాయి.

ఒక రోజు బజారులో అతనికి కనపడ్డ ఓ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కాసేపు తీవ్రంగా ఆలోచించాక టక్కున గుర్తొచ్చింది. ఆ వ్యక్తి ఆ రోజున బాబాయ్ మేనకోడలితో సహా వచ్చి బాబాయిని కలిసిన మనిషేనని! వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని దొరకబుచ్చుకుని బాబాయ్ గురించి వాకబు చేశాడు. ఆ వ్యక్తి ద్వారా బాబాయి గురించి తెలిసిన వివరాలు విని అతను అవాక్కైపోయాడు.

ఆ రోజు అతను చూసినమ్మాయి ఈ వ్యక్తి చెల్లెలట. బాబాయికీ, ఈ వ్యక్తికీ ఏ చుట్టరికమూ లేదట. కొన్నేళ్ళ క్రితం ఎప్పుడో బాబాయ్ వాళ్ళ ఊరిలో కొన్నాళ్ళు పని చేసినప్పుడు ఆ మనిషికి కొంత రొక్కం బాకీ పడి అది తీర్చకుండానే చెప్పాపెట్టకుండా ఊరొదిలి వచ్చేసాడట.

అనుకోకుండా ఆ రోజున బాబాయ్ ఎదురుపడేసరికి బాకీ సంగతి గట్టిగా నిలదీస్తే మరి చేసేది లేక అతగాడికి డబ్బిచ్చాడట. అన్నీ మాయమాటలు చెప్తాడనీ, ఏ ఎండకా గొడుగు పట్టే బుద్ధనీ, చేతికందినంతా అందుకుని ఉడాయించే రకమనీ.. ఇంకా ఏవేవో బాబాయ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు.

 

అదంతా విన్నాక అతనికి కాసేపు మెదడు స్తంభించిపోయింది. అతను కన్న రంగుల కలలన్నీ వెలిసిపోయి బోసిగా మిగిలాయి!

చిత్రంగా అతనికి బాబాయ్ మీద కోపం కూడా ఏమీ రాలేదు. అదొకలాంటి విరక్తి కలిగింది. అతని జీవితంలోంచి బాబాయ్ నిష్క్రమించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టైంది. తానున్న స్థితికి తనకే చిరాకేసింది. పనీపాటా మానేసి బయటి ప్రపంచం మొహం కూడా చూడకుండా నాలుగు రోజుల పాటు ఒంటరిగా ఆ ఒంటి గది రేకుల షెడ్డులోనే పడున్నాడు. తిండీతిప్పలు మానేసి శూన్యంలోకి చూస్తూ గడిపాడు.

 

**********

 

అదిగో అలా నమ్మకద్రోహానికీ, ఆశాభంగానికీ గురై పీకల్లోతు నిర్వేదంలో కూరుకుపోయిన అతను ఇప్పుడిలా గాలిదుమారాన్ని సైతం పట్టించుకోకుండా తన ఒంటిగది రేకులషెడ్డు ముందు పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు.

 

ఓ పక్కన గాలిదుమారానికి చెట్లన్నీ ఉద్రేకంతో ఊగిపోతున్నా అతనికి మాత్రం చుట్టుపక్కల సంగతేమీ పట్టినట్టు లేదు. అతని బుర్రలో రకరకాల ఆలోచనలు, భావాలు కలగాపులగంగా వెల్లువెత్తి అతనికి తన జీవితం పట్ల చెప్పలేనంత అసహ్యాన్నీ, విరక్తినీ కలిగిస్తున్నాయి.

తనెందుకు పుట్టాడో, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులెవరో తెలీదు. ఊహ తెలిసిన దగ్గర నుంచీ ఏ ఆలనా పాలనా, ఆప్యాయతా ఎరుగడు. ఏ పూటకాపూట పొట్ట నింపుకోడానికి అవస్థ పడాలి. తనెవరికీ అక్కర్లేని మనిషి. తనున్నా పోయినా ఎవరికీ ఏమీ తేడా పడదు. అసలు తనెందుకు బతకాలి, ఎవరికోసం బతకాలి, బతికి ఏమి సాధించాలి.. ఎవరిని ఉద్ధరించాలి.. ఈ తీరున రకరకాల ప్రశ్నలు అతని బుర్రలో గింగిర్లు తిరుగుతూ అతన్ని తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి.

ఆలోచించినకొద్దీ తన సమస్యకి సరైన పరిష్కారం చచ్చిపోవడమేనని బలంగా అనిపిస్తోంది అతనికి. పుట్టినప్పటి నుంచీ తను పడుతున్న ఈ బాధలన్నీటి నుండి శాశ్వతంగా విముక్తి పొందడానికి అదొక్కటే సరైన మార్గమని తోచింది. ఒక్కసారి అతని మనసులోకి చావాలనే ఆలోచన వచ్చాక ఆ ఆలోచన క్రమంగా ఒక స్థిరమైన నిర్ణయంగా రూపాంతరం చెందడానికి ఎంతోసేపు పట్టలేదు.

 

ఏమీ దిక్కు తోచక ఆలోచనల సుడిలో చిక్కుకుపోయి పరధ్యానంగా ఎటో చూస్తున్న అతని మొహమ్మీద ‘టప్’ మని ఓ వాన చినుకు రాలింది. వెనువెంటనే నాలుగైదు చినుకులు అనుసరించాయి. ఉన్నట్టుండి అతనిలో చలనం వచ్చినట్టుగా మంచంలోంచి దిగ్గున లేచి ఏదో నిర్ణయించుకున్నవాడిలా రేకుల షెడ్డు వారగా పడి ఉన్న డొక్కు సైకిలందుకుని ఆవేశంగా బయలుదేరాడు.

గాలి దుమారం విసురు కాస్త తగ్గి చిటుక్కు చిటుక్కు వాన చుక్కలు కాస్తా చిక్కటి వర్షధారల్లా పెరిగిపోతున్నాయి. మరి కాసేపట్లోనే పెళ పెళమంటూ భారీగా ఉరుములూ మెరుపులతో వాన బాగా జోరందుకుంది. చూస్తుండగానే వర్షం కుండపోతగా కురుస్తూ ఊరిని ముంచేస్తుందేమో అన్నట్టు విజృంభించసాగింది.

అతను మాత్రం వర్షానికి ఏ మాత్రం వెరవకుండా ధృడనిశ్చయంతో ఆ గాలివానలోనే ముందుకి కదిలాడు. ఎక్కడికీ, ఏమిటీ అని తెలీదు. కానీ, తను మాత్రం ఎలాగైనా చచ్చిపోవాలి అంతే.. అని గట్టిగా పదే పదే మనసులో మననం చేసుకుంటూ ఉరుముల్నీ మెరుపుల్నీ సైతం లెక్క చేయకుండా తన ఒంట్లో సత్తువనంతా కూడదీసుకుంటూ ఆ గాలివానలో సైకిలు సవారీ చేస్తున్నాడు. అలా అలా ఊరి పొలిమేరలు పూర్తిగా దాటి బయటి దాకా వచ్చేసాడు.

 

అదొక సన్నటి తారు రోడ్డు. ఆది అంతమూ లేనట్టు కనుచూపుమేరా నల్లగా పాకినట్టు కనిపిస్తోంది. రోడ్డుకి రెండుపక్కలా దట్టంగా పెరిగిన చెట్టూ చేమా, వాటి నిండుగా అల్లుకున్న తీగలూ, ముళ్ళ పొదలూ ఉన్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షపు ధారలన్నీ గుబురుగా పెరిగిన అక్కడి చెట్ల ఆకులపై పడుతూ హోరున శబ్దం చేస్తున్నాయి. ఆ సమయంలో ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా మానుష సంచారం ఉన్నట్టు లేదు.

వర్షాన్నీ, ఈదురుగాలుల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా సైకిలు మీద ఆవేశంగా దూసుకుపోతున్న అతను అకస్మాత్తుగా ఆగాల్సి వచ్చింది. అతని ఆవేశానికి అనుగుణంగా అంత వేగంగా పరిగెత్తలేనన్నట్టు ఆ డొక్కు సైకిలు కాస్తా కదలనని మొరాయించింది.

వెంటనే ఏం చెయ్యాలో పాలుపోక సైకిలు దిగి ఓ పదడుగుల దూరంలో రోడ్డు పక్కనున్న ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళాడు. సైకిలుని ఓ పక్కగా నిలబెట్టి ఆ చెట్టు కిందే నించుని మళ్ళీ తన ఆలోచనాపథంలోకి జారిపోయాడు.

 

అతని బుర్రలో పదే పదే తన చావుబ్రతుకులకి సంబంధించిన అవే ప్రశ్నలు తిరుగాడుతున్నాయి. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి తన జీవితం పట్ల అసహనం పెరిగిపోతోంది. తను అసలు ఎందుకు బతకాలీ అని ఎంతగా ప్రశ్నించుకున్నా ఒక్క సమాధానమూ తోచడం లేదు. ఇక ఆలోచన అనవసరం. చావే శాశ్వత పరిష్కారం అని మరోసారి గట్టిగా అనిపించింది.

అసలు తనెలా చచ్చిపోతే బాగుంటుందో.. అనే సందేహం కలిగింది. ఎలా చావాలా అని రకరకాల ఆత్మహత్యా మార్గాల గురించి చాలాసేపు తర్జన భర్జన పడ్డాడు. ఎంతకీ ‘ఫలానా పద్ధతిలో చస్తే నయం..’ అని ఎటూ తేల్చుకోలేకపోయేసరికి అతనిలో ఆవేశం పెరిగి మరింత కోపం, ఉక్రోషం తన్నుకొచ్చాయి.

ఇంతలో అతని చూపు తను పక్కన నిలబెట్టిన సైకిలు మీద పడింది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి.. ఫలానా చోటకి అని కాకుండా ఎటోకటు అన్నట్టు నిర్లక్ష్యంగా అస్సలే మాత్రం ఆలోచన లేకుండా ఈ డొక్కు సైకిలుని నమ్ముకుని వర్షంలో బయలుదేరాడన్న సంగతి.

“అయినా, ఎలాగూ చావాలని నిర్ణయించుకున్నాక ఇంక ఈ డొక్కు సైకిలుతో మాత్రం నాకేం పని. నడవడం ఆగిపోయిన దీన్ని ఇక్కడే వదిలేసి నేను ముందుకెళ్ళిపోవచ్చు కదా!” అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం చేయకుండా కాలితో ఆ సైకిలుని ఒక్క తన్ను తన్ని విసురుగా కదిలాడు ఆ చెట్టు కింద నుంచి.

 

అతను వడివడిగా నడుస్తూ రోడ్డెక్కి ఓ పాతిక అడుగులైనా వేసాడో లేదో.. వెనక నుంచి ఏదో పెద్ద వెలుగు, దాని వెనకాలే భయంకరమైన శబ్దం వినిపించింది. అంతటి భీకర శబ్దానికి ఉలిక్కిపడిన అతను అప్రయత్నంగా రెండు చెవులూ, కళ్ళూ గట్టిగా మూసుకుని అదాటుగా ఆ రోడ్డు మీదే కూలబడ్డాడు. ఓ నిమిషం తరవాత నెమ్మదిగా కళ్ళు తెరిచి బెరుకు బెరుగ్గా వెనక్కి తిరిగి చూశాడు.

అక్కడ కళ్ళెదురుగా కనపడిన దృశ్యం చూస్తూనే గుండె గుభిల్లుమంది అతనికి.

కొద్ది క్షణాల క్రితం అతను నించున్న చోటులో ఉన్న పెద్ద చెట్టు పిడుగు పాటుకి గురైంది. సగం చెట్టు కొమ్మలన్నీ ఉన్నపళంగా విరుచుకుపడ్డట్టు నిలువునా కుప్ప కూలిపోయి మంటల్లో దగ్ధమవుతూ కనిపించాయి. అక్కడ నేలమట్టం అయిన చెట్టుకి కాదు, స్వయంగా అతనికే ఆ విద్యుదాఘాతం తగిలినట్టనిపించి నివ్వెరపోయి ఏ కదలికా లేకుండా అటుకేసే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.

 

ఆ భీభత్సం తాలూకు దిగ్భ్రాంతిలోంచి తేరుకోడానికి అతనికి చాలాసేపే పట్టింది.

ఈ సంఘటనతో, ఈ నిమిషంలో, ఈ క్షణంలో.. సరిగ్గా ఈ ఒక్క క్షణంలోనే అప్పటిదాకా అతని మదిలో చెలరేగుతున్న దావానలం లాంటి తన చావుబ్రతుకుల సమస్యకి ఏదో సమాధానం దొరికినట్టనిపించింది.

తను ఎలా బ్రతకాలో, బ్రతికి ఏం సాధించాలో, ఎవరిని ఉద్ధరించాలో ఇప్పటికీ అతనికి ఇదమిద్దంగా తెలీకపోయినా తను బ్రతికి తీరాలని మాత్రం స్పష్టంగా అవగతమైనట్టు బలంగా అనిపించింది.

 

వర్షం జోరు కాస్త తగ్గింది. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠాన్ని బుద్ధిగా నేర్చుకున్న అతను మెల్లగా అడుగులేస్తూ ఆ చెట్టు దగ్గరికెళ్ళి కాసేపు తదేకంగా ఆ చెట్టు వంకే చూసి, తర్వాత తన డొక్కు సైకిలందుకుని దాన్ని నడిపించుకుంటూ మెల్లగా చీకట్లో కలిసిపోయాడు.

కానీ.. ఆ చీకటిలోనే కలిసిపోయి అంతమైపోడానికి మాత్రం ఖచ్చితంగా కాదు. ఈ చీకటి రాత్రిని కరిగిస్తూ ఇవాళ్టి రోజుని గతంలోకి నెట్టేసి రేపటి ఒక సరికొత్త సూర్యోదయాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడి తేలికపడిన మనసుతో ముందుకి సాగిపోయాడు.

23 thoughts on “ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం

  1. మంచి ఇతివృత్తం. బాగా రాసావు మధురా!అభినందనలు! బిజీ వల్ల లేటుగా చూసాను:))

  2. లలితా గూడ షేర్ చేసిన వెంటనే ఈ కధ చదివాను. ఆ సాంతం ఏక బిగిన చదివేసాను. కధ హృదయానికి అలా హత్తుకు పోయింది. ఎక్కడో జర్మని లో వుండి ఇక్కడ నేపధ్యంలో ఎంత బాగా రాసావు కధని విషాదాంతం చేయక ఒక’ hope and positive angle ‘ లో ముగించావు. .చాల బావుంది.

    మణి వడ్లమాని

  3. చాలాకాలంతరవాత ఎందుకో ఇది నాకళ్ళ పడింది. నేను కూడా ఆపకుండా చదివేసేను. చాలా బాగుంది కథ. నాకు ఎక్కువగా నచ్చింది పలుకుబడి. అభినందనలు.

  4. కొంచం ఆలశ్యంగా చదివానూ.కధ బావుంది కధలో విషయం చెప్పిన విధానం బావుంది(నాకు బ్రోకర్ సినిమాలో శ్రీహరి గుర్తొచ్చాడు ఎందుకో)

  5. అభినందనలు మధురా
    ప్రతీ వాక్యం ఎంతో శ్రద్దతో కూర్చినట్టున్నావు. సన్నివేశాలూ, పాత్రల స్వరూపం అన్నీ బావున్నాయి .
    కథ ని అతను అని కాకుండా , అతనికి ఒక పేరు పెట్టి చెప్పి ఉంటే ఇంకా బావుండేదేమో అనిపిస్తుంది.
    చావును అతి దగ్గరనుండీ చూసినపుడు కచ్చితంగా ఒక కొత్త జీవితం మొదలవుతుంది. అప్పటివరకూ ఉన్న భయాలూ….బాధలూ అన్నీ అర్ధం లేనివనిపించడం సహజమే .

    1. @ లలిత గారూ..
      అనామకుడిలా బతికిన అతని గురించి కావాలనే పేరు లేకుండా ‘అతను’ అనే చెప్పుకొచ్చాను. కథలో ఎలాగూ ఎక్కువ పాత్రలు లేవు కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదులే అనుకున్నా. మీరు చెప్పింది గుర్తుంచుకుంటాను. Thanks a lot for your feedback! :)

  6. ‘అయినవారి అనుకోని వెన్నుపోటు,
    గుండెలను గుచ్చుతుంది’.
    ‘తప్పి పోయిన ప్రాణాంతక విపత్తు,
    జీవితం మీద తీపి పెంచుతుంది’.
    కథ , కథనం ఎంతో నచ్చాయి.

  7. అతను ఒక అనాధ. జీవితం లో ఎన్నో కష్టాలు పడ్డ అతని లాంటివాడు పెద్దగా జీవితం గురించి రంగు రంగుల కలలు కనడం లాంటివి ఉండవు నాకు తెలిసినంతవరకు. అలాగే అతను అంతకు ముందు జీవించడానికి పడ్డ కష్టాలతో పోల్చుకుంటే -జీవన పయనంలో అతనికి అనుకోకుండా ఎదురయ్యిన ఆ బాబాయి చేసిన నమ్మకద్రోహం అతను చనిపోవాలి అని అనుకునే అంతగా బలహీనుడిని చేస్తుందా?
    సరే చనిపోవాలి అనుకున్న అతను ప్రకృతి బీభత్సం చూసి – పచ్చని చెట్టు అలా కళ్ళ ముందు కూలిపోవడం చూసి, తన నిర్ణయం మార్చుకునేంత చలించే మనసు అతనికి ఉంటుందా? :))
    కథ మాత్రం కొత్తగా ఉందండి ……అభినందనలు!

    1. అనాథగా ఒంటరిగా పెరిగిన మనిషికి ఇప్పుడైనా తన అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండునని ఆశపడటం అత్యంత సహజమే తప్ప అదొక పెద్ద రంగుల కల అని నేననుకోవడం లేదండీ. నిజమే, అతను ఏదోరకంగా బతకడానికి నానా కష్టాలు పడ్డాడు. కానీ, ఇన్నేళ్ళ తన ఒంటరితనం ముగిసిపోయి తనకంటూ ఓ బంధం ఏర్పడుతోందని ఆశపడ్డాడు. బాబాయితో కలిసి బ్రతకడంలో ఒక ఆసరాని, ఆనందాన్ని పొందాడు. అతని జీవితంలో మొట్టమొదటి సారి తన కోసం ఒకరు ఉన్నారన్న భరోసాని, నమ్మకాన్ని సమూలంగా చెరిపేస్తూ అతనికి ఎదురైన నమ్మకద్రోహం, ఆశాభంగం అతనికి బ్రతుకు మీద విరక్తిని పుట్టించాయి. అసలు మనుషులు చేసుకొనే ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం హ్యూమన్ రిలేషన్ షిప్స్, ఎమోషన్స్ కారణంగానే జరుగుతాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది.
      అతని మనసు చలించింది, చావొద్దనే నిర్ణయం తీసుకుంది పచ్చని చెట్టు కూలిపోవడం చూసి కాదండీ.. కాస్త వ్యవధిలో ఆ చెట్టుతో పాటు తను కూడా పిడుగుపాటుకి బలైపోవలసింది అనుకోకుండా తృటిలో తప్పించుకున్నాడు. చావుకి అంత సమీపంగా వెళ్ళొచ్చేసరికి అతనిలో వచ్చిన మార్పు అది. జీవితంలో ఘోరమైన ప్రమాదాలు, సంఘటనలు అత్యంత దగ్గరగా చూసిన వారి దృక్పథంలో మార్పు వస్తుంది. బహుశా చావు కలిగించే భయం, భీభత్సం తాలూకు శక్తేమో అది.
      మామూలుగా మనలాంటి వాళ్ళం దిగులు పడితేనో, డిప్రెషన్ లోకి వెళి తేనో, ఓదార్చి జీవన స్ఫూర్తిని, ధైర్యాన్ని కలిగించడానికి ఎవరో ఒకరు సాయపడొచ్చు. ఎవరూ లేని అతనికి అలాంటి పాఠం ప్రకృతి ఒడిలోనే దొరికింది.

      మీ అభిప్రాయాలని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు.. 🙂

  8. పాపం చచ్చిపోతాడేమో నని దిగులుపడ్డాను. పూర్తయ్యాక అమ్మయ్య చావటం లేదులే అనుకొని తృప్తి పడ్డాను . కథ బాగుంది .

  9. బావుంది.

    మొదటిపేరా చదువుతూనే చిన్నప్పటి ‘రెండో నంబరు ప్రమాదసూచిక ఎగురవేశారు ‘ రోజుల్లోకి వెళ్ళిపోయాను 🙂

    1. థాంక్యూ నిషీ.. నీకు భలే గుర్తొచ్చిందే.. అవును కదా.. నదులకి వరదలు వచ్చినప్పుడు అలానే చెప్తుంటారు ఇప్పటికీ.. 🙂

  10. కథ ఏకబిగిన చదివించేసింది. అభినందనలు..

Leave a Reply to మధురవాణి Cancel reply

Your email address will not be published. Required fields are marked *