April 19, 2024

సంపాదకీయం… ‘మారుతున్న ఆప్యాయతలు, విలువలు?……

రచన: కోసూరి ఉమాభారతి

 

 

Thanks to the Artist Krishna Ashok

“ఆడపిల్లకే… ఆప్యాయతలు, అనురాగాలు తెలుస్తాయి.  సానుకూలంగా స్పందించే మనసున్నది కూడా ఆడదానికే,” అని అనాదిగా ఉన్నదే, మనం విన్నదే.  ఆనాటి ఆ స్త్రీ పెదవి విప్పేది కాదు.  దురుసుగా మాట్లాడేది కాదు.  చాటుగా అణకువుగా ఉంటూ, కుటుంబానికి అమృత హస్తంతో సేవలు మాత్రం అందించేది.  వెలుగు నిస్తూ కరిగే కొవొత్తితో పోల్చేవారు ఆమెని.

మరి ఈనాడు, ఇంచుమించు ప్రతి యింట ఆడపిల్ల చదువుల సరస్వతే  .  కలవిడిగా మాట్లాడ్డం, అరమరికలు లేకుండా కలసిపోవడం, సామర్ధ్యంగా ఎన్నో క్లిష్టమైన పనులని సాధించుకు రాగలగడం నేర్చింది. అందుకే రెండువైపులా పదునున్న కత్తితో పోలుస్తున్నారు ఈనాటి వనితని.

మగపిల్ల వాడే వారసుడు, వృద్ధిలోకి వచ్చి కుటుంబానికి చుక్కాని అవుతాడు – అని నమ్మే వ్యవస్థ నుండి కొంతవరకు  సమాజ దృక్పథం మారిందనే అనుకోవచ్చు.  ఈ రోజుల్లో ఎందరో ఆడపిల్లలు, కుటుంబాలకి మార్గదర్శకులవుతున్నారు.   అన్నిటా స్వాతంత్ర్యం,  చొరవ, చూపేది కూడా ఎక్కువగా ఈ రోజుల్లో ఆడపిల్లలే.   బయట ప్రపంచంలో అడుగిడి, పురుషునితో సమానంగా సంపాదించి, తమ వారికి కూడా మంచి జీవనాన్ని కల్పించే సహృదయులు ఆడపిల్లలు ఎందరో ఉన్నారు, ఉండబోతారు కూడా.

విద్యా విజ్ఞానాలు, అందిపుచ్చుకొనే అవకాశాలు, మారుతున్న ఆర్ధిక పరిమాణాలు, నేటి ‘స్త్రీ’ ఎదుగదలకి ఎంతో తోడ్పడుతున్నాయి.  అయితే వీటి వల్ల ‘స్త్రీ’ వ్యక్తిత్వంలో,  ధృక్పదంలో, నడతలో కూడా మార్పు ఏర్పడుతుంది. తప్పదు.

చక్కగా బాధ్యతగా జీవితాన్ని సమన్వయ పరుచుకుంటే తనకి, తన వారికి వెన్నెల వంటి చల్లని జీవితాన్ని ఏర్పరుచుకోగలదు నేటి వనిత.

కొందరిలో ఆ నేర్పు స్వతహాగా ఉంటుంది.  ఎంత వృద్ధిలోకి వచ్చినా స్త్రీ సహజమైన ఓర్పు, సహనం, జాలి, ప్రేమ ఆమెలో మిగిలిపోతాయి.

మరి కొందరిలో కొంత కరుకుదనం,  మితి మీరిన క్రమశిక్షణ, స్వార్ధం చోటు చేసుకుంటున్నాయి.  అవి  ఆమె లోని ఆప్యాయతల్ని,  మమకారాల్ని కప్పేస్తున్నాయేమో.

ఆంధ్రా అయినా అమెరికా అయినా ఏమీ తేడా లేదు…మనిషి – మనస్తత్వం ఒకటే, భావం – అనుభవం ఒకటే, తరాలు – అంతరాలు ఒకటే.

మొత్తానికి, ఈ తరం స్త్రీ మారింది.  కాలాన్ని బట్టి  ఆమె ఆలోచన, విలువలు, ఆప్యాయతలు, మమతలు, మమకారాలు మారాయి.  ఎన్నిటికో నిర్వచనాలు మారాయి.

ఇలా రకరకాలుగా ఆలోచింపజేసే ఈ తరం స్త్రీ నడత,  ఆమె ధృక్పదం అర్ధం చేసుకోవాలనే,

నేను కనుగొన్న, విన్న, కొన్ని క్లిష్టమైన విషయాలు గురించి కొంత ఆలోచించాను.  మా ‘కిట్టిక్లబ్’ స్నేహితురాళ్ళతో విభేదించి, వాదించి, మరిన్నిటితో  ఏకీభవించాను కూడా.  అందరిని ఆలోచింపజేసేవే ఇటువంటి  విషయాలనుకుంటాను.

‘నేటి ‘స్త్రీ’ జీవన విధానంలో, ఆలోచనా స్రవంతిలో,  శైలిలో మార్పు వచ్చింది.’ అన్న చర్చలో ఉండిపోయాము.  ఎన్నో సంఘటనలు ప్రస్తావించుకున్నాము.

మా ఎరుకలోని ఓ కుటుంబంలో జరిగిన  సంఘటన –  ఎలాగైనా ఉన్నతమైన జీవితాన్ని సాధించాలని కన్నవాళ్ళతో  అప్పు చేయించి పై చదువలకి అమెరికా చేరిన వారి అమ్మాయి, చదువు ముగించి సంపాదన మొదలెట్టినా అప్పు తీర్చాలన్న సంగతి వదిలేసింది.

“నా సంపాదనలో సగభాగం మీదే డాడీ,” అని చెప్పి వెళ్ళిన చిన్నారి కూతురు తన చదువు కోసం అయిన అప్పు, దాని తాలూకా వడ్డీ గురించి మరిచిపోయింది.  పాపం ఆ తండ్రి కనీసం వడ్డీలన్నా కట్టమని అడిగి విసిగి పోయాడు.   “నా పెళ్ళికి బంగారం కొనుక్కుంటున్నాను  డాడీ,” అన్న అమ్మాయి వద్ద చులకన పడలేక తన రిటైర్మెంట్ నుండి పెద్ద మొత్తం తీసి ఆ అప్పు తీర్చేసాడు, ఇక ఆ అమ్మాయి తమని ఆదుకుంటుందన్న ఆశలు వదిలేసిన ఆ మధ్య తరగతి తండ్రి.

 

*****

తల్లి పట్ల కూడా దయ లేని మరో కూతురు కథ విని నేనూ ఆశ్చర్యపోయాను – భర్త దూరమయ్యాక పుట్టింట జేరి, స్థితిమంతురాలైన అక్కని సహాయం కోరి,  తల్లి తండ్రులతో వాదమాడి, అక్కతో జగడమాడి,  బ్రతుకంతా అవసరాలు తీర్చుకుంది ఓ మహిళ.   కుటుంబ సహాయంతో ఎంతో కష్టపడి కూతురిని ఇంజినీరింగ్ చదివించింది ఆమె.  పంతాలతో, పస్తులతో అక్కని ఒప్పించి, డబ్బు ఇప్పించుకొని ఆ కూతురిని అమెరికా చేర్చింది కూడా.   కొన్నాళ్ళకి కూతురు స్థిరపడ్డాక ఆ తల్లి సంతోషంగా అందరి దగ్గర తన కూతురి గొప్పతనం వేనోళ్ళ పోగిడేది.

ఇక తాను కూతురి ఇంట విశ్రాంతిగా గడపాలని సంసిద్ధమౌతున్న సమయంలో….

“అమ్మా, నీవు అమెరికాలో ఇమడలేవు. ఇక్కడ అందరూ కష్టపడి పని చేసుకుంటారు.  నీకు ఏ పనీ అలవాటు లేదు.  ఒత్తిగా కూర్చుంటే కుదరదు.  నీకు అక్కడే సరి.  నేనే వచ్చి చూసి పోతుంటానులే,” అని నిక్కచ్చిగా చెప్పింది పాతికేళ్ళ  కూతురు.  అంతే కాదు యాభై రెండేళ్ళ తల్లిని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఉంటే తాను కాస్త డబ్బైతే సాయం చేస్తానని కూడా అన్నదట ఆ ఇంజినీరు కూతురు.

ఎటువంటి ఆలంబన లేని ఆవిడ ఎలా మనగలదు?

ఆ మధ్యనే మోకాళ్ళు రెండు సర్జరీ చేయించుకొని తేరుకుంటున్న ఓ పెద్దావిడ కథ –

“మా పిల్లలిద్దరినీ చూసుకోడానికి ఆయాని పెట్టినా కష్టంగా ఉంది మమ్మీ.  అందుకే నీ దగ్గరికే మూవ్ అవుదామని అనుకుంటున్నాము.  నువ్వైతే మాకు ధైర్యంగా ఉంటుంది. పిల్లల్ని నీ వద్ద వదిలి మనశ్శాంతిగా పనికి వెళ్ళగలను,” అందిట ఆమె కూతురు.

సంబరపడిపోయింది ఆ తల్లి.   అన్న ప్రకారమే ఆరు నెలలకి అమ్మాయి అల్లుడు వాషింగ్టన్ నుంచి ఆస్టిన్ కి మారారు ఇద్దరు పిల్లలతో.

ఆమె ఎంతో ప్రేమగా, ఓపిగ్గా చూసుకునేదిట  మనమల్ని.  నాలుగేళ్ల పాప, రెండేళ్ళ బాబు.  తన యోగా, మెడిటేషన్, ఆర్ట్ క్లాస్ అన్నీ మానేసి శ్రద్ధగా గారాబంగా పిల్లల్ని చూసుకునే అమ్మమ్మకి నానా విధాలుగా మనక్షోభ కలిగించేదట ఆమె సొంత కూతురు.  పిల్లలకి అన్నమెందుకు పెట్టావని ఓ సారి,  ఇంత తొందరగా మందెందుకు వేసావని మరోసారి,  ఎండలో పార్క్ కి ఎందుకెళ్ళావని,  వెళ్ళకపోతే “రోజంతా ఇంట్లోనే ఉంచేసావేమ్మా” అంటూ, ఇలా అన్నిటికి గొడవ పెట్టేదట.

కిందా మీద పడి, పిల్లలిద్దరికీ తిండి పెట్టి, స్నానాలు చేయించి, ఆడించి, నిద్రపుచ్చి ఇలా వాళ్ళ  పనులతోనే గడిచిపోయేదట  పెద్దావిడ  సమయమంతా.   తన కోసం, తన భర్త కోసం కనీసం వంటకి కూడా సమయం ఉండేది కాదట.

ఓ సారి నాలుగు రోజుల పాటు పసి వాళ్ళని వదిలి ఊరు వెళ్లారట కూతురు, అల్లుడు. పిల్లల్లో పసివాడికి జ్వరమొచ్చిందట.   అహర్నిశలు వాడిని చూసుకొని అమ్మమ్మ ఆరోగ్యం చెడిందట కూడా.   కక్కటిల్లి ఏడుస్తున్న పిల్లవాడిని గుండెల మీద వేసుకొని పడుకున్న అమ్మమ్మ  అలాగే నిదుర పోయిందట.

అర్ధరాత్రివేళ ఇంటికొచ్చిన కూతురు, అది చూసి గొడవ పెట్టి తెగ విసుక్కుందట.  తన తల్లి అలా పిల్లవాడికి ఎత్తు నేర్పి మీదేసుకొని పడుకున్నందుకట.  తన తల్లి పెంపకంలో పిల్లలు అడ్డమైన అలవాట్లు చేసుకుంటున్నారని,  అసలు క్రమశిక్షణ లేకుండా అయిపోయారని తెగ అరిచేసిందట.   అసలే జబ్బు పడి నీరసించిన ఆ పెద్దామె  కూతురి దెబ్బకి ఖయిలా  పడి నెల రోజులకి కూడా కోలుకోలేదట.

ఆ వయస్సులో భర్త బాగోగులు కూడా పక్కన పెట్టి, మమకారంతో మనమల పెంపకంలో మునిగిపోయిన ఆ తల్లి పట్ల ఆ యువతికి కృతజ్ఞతా భావం లేక పోగా,  తిట్లు అవమానాలే మిగిలాయిట ఆ పెద్దామెకి.

అంతే కాదు అసలా  ఊరి నుండే మళ్ళీ మారిపోయారట కూడా కూతురు కుటుంబం.  క్రమశిక్షణ లోపించిన తన తల్లి పెంపకం నచ్చలేదట ఆ నేటి యువతికి.  ఎంతగానో కృంగిపోయింది కూతురి ప్రవర్తనవల్ల ఆ తల్లి.

 

*****

 

నేటి ‘స్త్రీ’ లో సహనం, ఓర్పు, మమత నశిస్తే ఓ డబ్బు సంపాదన యంత్రంలా మిగిలే అవకాశం ఉంది.  అలాగని అందరూ అలా ఉన్నారని కాదు సుమా!  తల్లిని తల పైన పెట్టుకుని చూసుకొనే కూతుళ్ళు ఉన్నారు, తూలనాడి అవమానపరిచే వారూ ఉన్నారు.

‘మార్పు’ అనేది నిరవధికం. నిరంతరం జరిగే ప్రక్రియ.  ఏమైనా, మారుతున్న సమీకరణాలని, ప్రేమ ఆప్యాయతలని, బాధ్యతలని బేరీజు వేసుకుని తనకి అనుకూలంగా మలుచుకుంటే మాత్రం నేటి ‘స్త్రీ’ అసమానమైన జీవితం సాగించవచ్చు.

 

‘హ్యాపి మదర్స్ డే’. ‘మాతృదినోత్సవ శుభాకాంక్షలు’

 

2 thoughts on “సంపాదకీయం… ‘మారుతున్న ఆప్యాయతలు, విలువలు?……

  1. బాగుందండీ …
    కొత్త కోణంలో చెప్పారు …మరిన్ని ఆశిస్తున్నాము ..
    బొమ్మ చాల బాగుంది ..
    ఆది గణేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *