April 24, 2024

సంభవం

 రచన: సూర్యదేవర రామ్మోహన్ రావు

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/

 

 

మనిషి చనిపోగానే క్రయోనికల్‌గా అతని శవాన్ని సస్పెండ్ చేసి, అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి, తిరిగి అతడ్ని బ్రతికించేందుకు చేస్తున్న అధ్బుత శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన మొట్టమొధటి నవల-

సంభవం

మృత్యువుని జయించటానికి ప్రపంచవ్యాప్తంగా, అతి రహస్యంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన తొలి నవల-

సంభవం

చనిపోయిన మనిషి శరీరాన్ని భద్రపరిచి ప్రాణం పోయగలిగే అవకాశం సైన్స్‌కి లభించినప్పుడు ఆ ప్రాణిలోకి పూర్వపు ఆత్మే ప్రవేశిస్తుందా? లేక కొత్త ఆత్మ ప్రవేశిస్తుందా?

ట్రిలియన్ డాలర్ల ప్రశ్న…

 

జాతస్యహి ధృవో మరణం…

పుట్టినవాడు గిట్టక మానడు

ధృవో జననం మృతస్యచ…

గిట్టినవాడు తిరిగి పుట్టక మానడు

అని చెప్పిన శ్రీ కృష్ణభగవానుడి గీతోపదేశానికి సైన్స్ విసురుతున్న సవాల్ ఎలాంటిది…? అది సవాలా? లేక సైన్స్ చేసే ప్రేలాపనా?

అద్యంతం ఉత్కంఠతో చదివించే అద్భుతమైన నవల-

 

సంభవం

 

THERE IS NO DEATH: THE STARS GO DOWN

TO RISE UPON SOME OTHER  SHORE.

AND BRIGHT IN HEAVEN’S JEWELED CROWN,

THEY SHINE FOR EVER MORE.

 

-JOHN L.Mc Creery.

 

అనంత దిగంత విశ్వగోళం ఎదుట, యుగ యుగాలుగా, సంశోధిత నేత్రంతో నిల్చున్న, చరాచరజీవి మదిలో మొదుల్తున్న ఏకైక ప్రశ్న మృత్యువు…

యుగాంతాల చీకటిలాంటి మృత్యువుకు మూలం, ఉషాంతాల వెలుగులాంటి జనన బీజం… నిశ్శబ్ద, నిర్లిప్త, నిరామయ, నిష్కామ, నిష్కర్మ, సృష్టిలో, నిరంత, చిరంతన జ్వాలాతోరణం మృత్యువు!

గుహలో దివ్వె మాయమై పోవడమేనా మృత్యువు?

తటాల్మని హృదయ కవాటలు మూసుకుపోవడమేనా మృత్యువు?

వెన్నముద్దలాంటి ఆత్మ, విభూతిపండులా మిగిలిపోవడమేనా మృత్యువు?

కదలిక, కలయిక స్తంభించి పోవడమేనా మృత్యువు?

ఏది మృత్యువుకు సిసలైన నిర్వచనం?

సుఖదుఃఖ సంకలిత జీవనపధంలో చివరి మజిలీయేనా మృత్యువు?

జాతస్య చధ్రువో మృత్యు అదేనా?

చరాచర జీవి భయపడే ఆ మృత్యువు తర్వాత… అంతా నిశ్శబ్ద శూన్యమేనా? ఆ శూన్యంలోంచి పుట్టే సృష్టి అంటే మృత్యువేనా?

సృష్టి ఉదయసంధ్యల్లాంటిది… ప్రభాత సంధ్య జననమైతే, ప్రాతస్సంధ్య మృత్యువని చెప్పే ఆర్షవాక్యంలో నిజమెంత?

ఒక మరణం వెనక మరొక జననం వుంటుందా?

యుగాంతం అంటే-ఏమిటి? జననమా? మరణమా? రెండు కలగలిసిన నీరవ నిశ్శబ్దమా?

ఆ నిశ్శబ్దంలోంచి జనించే జీవి, కోల్పోతున్నది ప్రాణాన్నా? ఆత్మనా?

ప్రాణం అంటే జలపాతం లాంటి చైతన్యం…

ఆత్మ అంటే ఆ చైతన్యాన్ని నిలకడగా నిలిపే అంతులేని వెలుగు!

అగాధంలాంటి చైతన్యంలోంచి, అంతులేని వెలుగులోంచి, అనంత ప్రయాణం చేస్తున్న మనిషికి పరమపదం మృత్యువేనా?

కాదు…

మృత్యువు, మనిషి మనుగడకు ఒక ముసుగు మాత్రమేనని ఉద్ఘోషించే భారతీయ తత్త్వధోరణి నమ్ముతున్న పునర్జన్మ ఉందా?

పునర్జన్మ ఒక నిజమా? ఒక నమ్మకమా? ఒక భ్రమా? ఆశావాదమా?

పునర్జన్మల పేరిట జరిగిన, జరుగుతున్న సంఘటనలు ఏ నిజాలకు బీజాలు?

ఆత్మ తనను తాను సృష్టించుకున్న పునఃసృష్టే పునర్జన్మ అయితే భౌతిక శరీరం మాటేమిటి?

మృత్యువు హరించేది ఆత్మనా? శరీరాన్నా?

పునర్జన్మ రూపంలో ఆత్మ బ్రతుకుతున్నప్పుడు, ఆత్మకు ఆవాహన కేంద్రమైన శరీరం ఎందుకు చిద్రమవుతోంది?

మృత్యువుంటే ఆత్మ, శరీరాలు మృగ్యమైపోవడమేనా?

యుగాదిగా ప్రాణజగతి ముందున్న జవాబుల్లేని ప్రశ్నలివి.

జనన మరణాలు, సృష్టి చక్రంలో కేంద్రబిందువులయినప్పుడు, ఆ రెంటిని నడిపే విశ్వశక్తి మూలం ఏది?

అదృశ్యశక్తా? విజ్ఞానశక్తా?

అనాదిగా అదృశ్య శక్తికి, శాస్త్రశక్తికి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే వుంది.

రైలు పట్టాలలాంటి రెండు శక్తుల్ని నమ్మే వ్యక్తుల మధ్య పోరాటం జరుగుతూనే వుంది.

మృత్యువును జయుంచడానికి జరిగే ఈ అనంతసమరంలో విజయం వరించేదెవరికి?

నిజానికి మనిషి మృత్యువును జయించే రోజొస్తుందా?

ఒక్కసారి శాస్త్రీయంగా, అధ్యాత్మికంగా జరుగుతున్న వాదవివాదాల్ని విశ్లేషిస్తే ఆశావాదాన్ని నమ్మి మృత్యువును జయించడానికి జరిగే క్షణాలు ఆసన్నమయితే…?!

నిలకడగా నిలిచిపోయే మానవ కంకాళం, చైతన్యంతో నిలిచి, నడిచే అద్భుత క్షణాల కోసం అనునిత్యం కృషి చేస్తున్న శాస్త్రజ్ఞుల కృషి ఫలిస్తే?

సంభవామి యుగే యుగేకి శాస్త్రీయ రూపకల్పన జరిగే క్షణాలు ఆసన్నమయితే

 

*                      *                      *                      *                                  *

            “శ్రుతులలోని కథాశ్రుతిలో మానవశరీరాన్ని ‘స్థూలశరీరంగా’ అభివర్ణించారు. ఇందులో గల మంత్రాల్లో ఒక మంత్రంలో ‘పురమేకాదశ ద్వారమ్’ అనే మంత్రంలో ఈ స్థూల మానవ శరీరం పదకొండు ద్వారాలు గల పట్టణంగా చెప్పబడింది. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, ఒక నోరు, ఒక మూర్థస్థానము అనగా బ్రహ్మరంధ్రం, ఒక నాభిస్థానం, రెండు మలమూత్ర విసర్జన స్థానములు, కలిసి మొత్తం పదకొండు ద్వారాలు. ఈ ద్వారాల్లో అపాయుద్వారము (మల విసర్జన స్థానం) నుండి ప్రాణాలను కోల్పోయే జీవుడు నరకంలోకి వెళ్తాడు. ఉపస్థద్వారం (రేతో విసర్జన స్థానం) నుండి వెడలిన జీవుడు కామాతురములగు పిచ్చుకలు, పావురములు మున్నగు జన్మములను పొందుతాడు. నాభి ద్వారము ముండి వెడలిన జీవుడు ప్రేత శరీరమును, ముఖద్వారము నుండి వెడలిన జీవుడు… అన్నాసక్తులగు ప్రాణుల శరీరమును పొందుతాడు. శోత్ర ద్వారము నుండి వెడలిన జీవుడు గంధర్వ లోకాన్ని, కుడికంటి నుండి వెడలిన జీవుడు సూర్యలోకాన్ని, ఎడమ కంటి నుండి వెడలిన జీవుడు చంద్ర లోకాన్ని, మూర్ధ ద్వారమును వెడలిన జీవుడు సత్యబ్రహ్మ లోకాల్ని పొందుతాడు” చెప్పటం ఆపి యాభై అయిదేళ్ళ ప్రొఫెసర్ బ్రహ్మ కళ్ళద్దాల్ని సవరించుకుని తన ఎదురుగా కూర్చున్న నలుగురు స్టూడెంట్స్ వేపు చూశాడు. దాదాపు ముప్పై ఏళ్లపాటు రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో వివిధ హోదాల్లో ఉద్యోగం చేసిన సత్యబ్రహ్మ, ఇంకో మూడేళ్ళలో రిటైరవబోతున్నాడు.

తెల్లటి పంచె, లాల్చీ, తెల్లటి శరీరపు చాయలో విలక్షణంగా కనిపిస్తున్న ప్రొఫెసర్ సత్యబ్రహ్మ కళ్ళల్లోకి చూస్తున్నారు ఆ స్టూడెంట్స్ నలుగురు.

వాళ్ళల్లో ఇద్దరు ఆర్కియాలజీ స్టూడెంట్స్, మరో ఇద్దరు ఫిలాసఫీ స్టూడెంట్స్… వాళ్ళు తమ డాక్టరేట్‌కి సంబంధించి సేకరిస్తున్న వివిధ అంశాలకు సంబంధించి సత్యబ్రహ్మను కలవడానికొచ్చారు.

“శరీరం మరణించినా, మృత్యువు మరణించదని అంటారు.. మిజమేనా?” ఆ ప్రశ్న వేసిన అమ్మాయి పేరు దిశ, నల్లగా, విశాలమైన నుదురుతో, అంతలేసి కళ్ళతో సన్నగా, పొడవుగా, ఆకర్షణీయమైన చూపులతో కనిపించే దిశను కళ్ళద్దాలలోంచి చూసి నవ్వాడు సత్యబ్రహ్మ.

“నీ ప్రశ్నలన్నీ జీవులకు, ఆత్మాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఆత్మలంటే నీకు అంత ఇష్టమా నీకు?” గంభీరంగా వుంది సత్యబ్రహ్మ స్వరం.

“ఆత్మలంటే నాకిష్టమో కాదో నేను చెప్పలేను సార్! కానీ మృత్యువంటే నాకిష్టం” నిశ్శబ్ధంగా వున్న ఆ గదిలో దిశ నోటిలోంచి వచ్చిన ఆ మాటకు మిగతా విద్యార్థులు ఉలిక్కిపడి ఆమెవైపు చూశారు.

సత్యబ్రహ్మ భ్రుకుటి ఎందుకో ఒక్క క్షణం ముడిపడింది. అతని పెదాల మీద చిన్న చిరునవ్వు కదలాడిందో క్షణం.

తిరిగి చెప్పడం ప్రారంభించాదు సత్యబ్రహ్మ.

“చూడు బేబీ! శ్వేతాశ్వతరోపనిషత్‌లో ‘జీవుడి’ని ఈ విధంగా నిర్వచించారు.

“వాలాగ్ర శత భాగస్య, శతధా కల్పితస్యచ

భాగోజీవస్య విజ్ఞయస్స చానన్త్యాయ కల్పతే”

“అంటే అర్ధం ఏమిటో తెలుసా? ఒక తల వెంట్రుక  చివరి భాగాన్ని నూరు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని నూరువంతులుగా చేసిన ఎడల, ఎంత సూక్ష్మమైన భాగం ఏర్పడుతుందో, ఆ మహా సూక్ష్మ పరిమాణం గలవాడే జీవుడు. అందువల్ల ఆ జీవుడికి మరణం లేదని వేదరుషులు నిర్వచించారు.

ఆ జీవమే ఆత్మ.. శరీరం మరణించినా ఆత్మ మరణించదు. అందుకే ఆత్మను తెలుసుకున్న జ్ణానికి మరణం వుండదు. మరణించేది శరీరమే తప్ప ఆత్మ కాదు.

అందువల్లనే కొంతమందికి పూర్వవాసనలుంటాయి. అది జ్ఞానానికి సంబంధించి ఉండొచ్చు. శరీరానికి సంబంధించి ఉండొచ్చు. నడవడికకు సంబంధించి వుండొచ్చు. ఉదాహరణలు చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు కుదరదు” నెమ్మదిగా అన్నాడాయన.

“ఒకే ఒక ప్రశ్న సార్! ఆత్మకు చావులేదని చెప్పారు కదా.. ఆ ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించినప్పుడు పూర్వదేహానికి సంబంధించిన జ్ఞాపకశక్తి  వుంటుందంటారా?” దిశ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు సత్యబ్రహ్మ.

“ఆత్మకు జ్ఞాపకశక్తి వుంటుంది”  వెంటనే చెప్పాడాయన.

“లేదు సార్…. ఉండదు… ఉండదని పునర్జన్మ విభాగాన్ని రాసిన మా తాతగారు చెప్పారు” టక్కున చెప్పింది దిశం

“ఆయనిప్పుడు బ్రతికే వున్నారా?”

“లేరు”

“ఎన్నాళ్ళయ్యింది చనిపోయి” అడిగాడు సత్యబ్రహ్మ.

“అయిదేళ్ళు” చెప్పింది దిశం

గాఢంగా నిట్టూర్చాడు సత్యబ్రహ్మ. దిశ కళ్ళల్లోకి కన్నార్పకుండా చూశాడు.

కొంతమంది వ్యక్తులు ఆలస్యంగా పరిచయమవుతారు. వారిలోని అద్భుతమైన ఆలోచనలకు ఆశ్చర్యపోతాం. అలాంటి వ్యక్తుల పరిచయం కొంచెం ముందుగా జరిగితే బాగుండేదని మనం అనుకోవడం సహజం.

మరో పదినిమిషాల తర్వాత సత్యబ్రహ్మ సీట్లోంచి లేచాడు. దిశతో సహా మిగతా స్టూడెంట్స్ కూడా లేచి నిలబడ్డారు.

“మనం ఇప్పుడు రెండువేల అయిదువందల కాలంనాటి మమ్మీని చూడడానికి వెళుతున్నాం” తన చాంబర్‌లోంచి బయటికొచ్చి వరండా మీద నడుస్తూ చెప్పాడు సత్యబ్రహ్మ.

వాళ్ళు నలుగురూ ప్రధానంగా అక్కడికొచ్చింది ఆ మమ్మీని చూడడానికే.

హైదరాబాద్ పబ్ల్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర పురావస్తుశాలలో గత యాభై ఏళ్ళుగా ఒక ఈజిప్టు మమ్మీ భద్రపరచబడి వుందని చాలామందికి తెలీదు.

మనిషి మరణాంతరం శవాన్ని భద్రపరిస్తే దానినే మమ్మీ అంటారు. ఈ మమ్మీలను భద్రపరచడం ఈజిప్తులో ఒకప్పుడు ఒక సంప్రదాయం – ఆచారం.

పబ్లిక్ గార్డెన్స్‌లో ఒకపక్క మూలగా వున్న ఆ భవనంలోకి నడిచాడు సత్యబ్రహ్మ.

విశాలమైన హాలు-  ఆ హాలు మధ్యభాగంలో వెలుగు చేరని ప్రదేశములో పరదాల నడుమ, అద్దాల మధ్య మంచం మీద నిన్నో, మొన్నో మరణించిన మనిషిలా ముసుగులో శవం!

ఆ మమ్మీ వేపు ఆశ్చర్యంగా చూస్తోంది దిశ. ఆమె మనసులో ఎన్నో సందేహాలు.

మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు సత్యబ్రహ్మ…

“ప్రాచీన ఈజిప్టు ప్రజలకు మరణం తర్వాత మృతుని జీవుడు సమాధుల్లో నివశిస్తుందనే నమ్మకం ఉండేది. దాంతో వారు శవాలను భద్రపరచాలనే సంప్రదాయాన్ని పాటించేవారు. మమ్మీలను భద్రపరిచే శాస్త్ర విజ్ఞానం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో వెలసిన ఈజిప్టు రాజవంశీయుల కాలంలో అభివృద్ధి చెందింది. శవాల్ని మమ్మీలుగా తయారుచేసే ఈ శాస్త్రం సుమారు మూడువేల సంవత్సరాలపాటు కొనసాగిందని తెలుస్తోంది” చెప్పి ఆగాడు సత్యబ్రహ్మ.

“శవాల్ని మమ్మీలుగా ఎలా తయారుచేసేవారు?” ఉత్సాహంగా ప్రశ్నించింది దిశ.

“ఈ ప్రశ్న నీ నోటి వెంటే వస్తుందని నాకు తెలుసు” అని నవ్వి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడాయన.

“శవాలను మమ్మీలుగా మార్చడానికి సుమారు డెబ్బై రోజుల వ్యవధి పట్టేది. తొలిరోజుల్లో శవాలను మైనం, తేనె, సుగంధ పరిమళ ద్రవ్యాలతో భద్రపరిచేవారు. కాలక్రమేణా రసాయన ద్రవ్యాల వాడకం జరిగింది. ఆ కాలంలో శవాలను మమ్మీలుగా తయారుచేయడం పెద్ద  వ్యాపారంగా చెలామణి అయ్యింది. మమ్మీ అనే పదం మూమియా అనే పారసీ పదం నుంచి వచ్చింది.”

“ఎక్కడో ఈజిప్టులోని మమ్మీ మన హైదరాబాద్‌కెలా వచ్చింది?” ఇంకో అమ్మాయి ప్రశ్నించింది. ఆ అమ్మాయి పేరు వసంత.

“మన దేశంలో కలకత్తా, లక్నో బరోడాల్లో మాత్రమే ఇలాంటి మమ్మీలు భధ్రపరచబడి వున్నాయి. మన హైద్రాబద్‌లో వున్న యీ అరుదయిన మమ్మీని నజీర్ నవాబ్ జంగ్ 1931వ సంవత్సరంలో వెయ్యిడాలర్లకు కొనుగోలు చేసి నిజాంకు బహుమతిగా యిచ్చారు. అప్పటినుంచి యీ మమ్మీని భధ్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఈ మమ్మీని జాగ్రతగా చూస్తే ఈ శవానికున్న వస్త్రం మీద ప్రాచీన ఈజిప్షియన్ చిత్రాలలో దానికి సంబంధించిన వివరాలుంటాయి” చెప్పటం ఒక్కక్షణం ఆపారాయన.

నలుగురూ వంగి ఆ చిత్రాల్ని పరిశీలిస్తుండగా మళ్ళీ చెప్పాడు సత్యబ్రహ్మ…

“ఈ మమ్మీ ఈజిప్టును పరిపాలించిన ఆరో చక్రవర్తి కుమార్తెదనని, ఈమెకు అప్పటికి పన్నెండు సంవత్సరాల వయసుంటుందని చరిత్రకారుల అంచనా. అసలు ఈ మమ్మీ నిజమైనదా కాదా? అని అనుమానంతో కొన్ని ఏళ్ళ క్రితం కొంతమంది ఈ మమ్మీ కాలి భాగంలో వున్న వస్త్రాన్ని చింపి చూశారు. ఆ కాలి భాగాన్ని చూడండి- మీకు శవం వేలు కనిపిస్తుంది” ఆ భాగాన్ని వేలితో చూపిస్తూ అన్నాడు సత్యబ్రహ్మ.

“నల్లగా, కర్రముక్కలా కనిపిస్తున్నదేనా?” చూస్తూ అడిగింది దిశ.

“అవును. పూర్వకాలంలో మనుషులు శవాల్నే కాదు ఇష్టమైన జంతువులను కూడా అవి చనిపోయాక మమ్మీలుగా మార్చిన సందర్భాలు వున్నాయి.

ఆ మమ్మీ సంప్రదాయం ఆ తర్వాత కొన్నాళ్ళపాటు కొనసాగింది. జగద్విజేత అలెగ్జాండర్ చక్రవర్తి భౌతికకాయాన్ని తేనెలోనూ, లార్డ్ నెల్సన్ శరీరాన్ని బ్రాందీలోనూ, అలాగే లెనిన్, స్టాలిన్, మావో భౌతిక శరీరాలనుకూడా భద్రపరచి వుంచారు. 1980వ సంవత్సరంలో చైనాలో యాంగే రాష్ట్రంలో ఒక స్త్రీ భౌతికకాయం బయటపడింది. ఆ శవానికి కనుగుడ్లు లేవు. మిగతా శరీర భాగంలోని మాంసం చెక్కు చెదరకుండా వుంది. అది ప్రస్తుతం షాంఘై పట్టణంలోని మ్యూజియంలో వుంది.”

మరొక పావుగంట తర్వాత ఆ భవనలోంచి బయటికొచ్చాడు అందరూ. కేంటిన్ వేపు నడిచారు. కేంటిన్లో టీ తాగుతున్న సమయంలో సత్యబ్రహ్మను అడిగింది దిశ–

“ఆ శవాల్ని మమ్మీలుగా భద్రపరచడానికి కారణం ఎప్పటికయినా అవి బ్రతుకుతాయనే గదా? బ్రతికించవచ్చనే గదా?”

“అవును”

“అలా బ్రతికిన సందర్భాలున్నాయా?” మళ్ళీ ప్రశ్నించింది దిశ.

టీని సిప్ చేయబోయి ఆగిపోయాడాయన ఒక్కక్షణం.

“శవాలు బ్రతుకుతాయని నువ్వు అనుకుంటున్నవా?” ఎదురుప్రశ్న వేశాడాయన ఎక్కడో ఆలోచిస్తూ.

“నమ్మడం లేదని అంటానని మీరనుకుంటున్నారు కదూ?”

అలాంటి ప్రశ్నకు ప్రశ్న దిశలాంటి ఇరవై ఏళ్ళ అమ్మాయి వేస్తుందని వూహించని ఆయన సాలోచనగా ఆమెవేపు చూశాడు.

“అంటే?”

వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ మిగతావాళ్లకు ఇంటరెస్టింగ్‌గా వుంది.

“నేను ప్రాచీనతలోని నమ్మకాల్ని విశ్వసిస్తాను. ఏ దేశంలోనైనా నమ్మకం ఆ దేశపు ఫిలాసఫీలోంచే పుడుతుంది. చనిపోయిన మనుషులు బ్రతకడం మన హిందూ పురాణాల్లో వుంది. తమ మరణాన్ని గురించి తాము తెలుసుకొని మరణాన్ని శాసించే మహాభారతంలోని భీష్ముడులాంటి వ్యక్తులు కేవలం పాత్రలు అనుకుంటే పొరపాటు. మునులు చెప్పే శ్లోకాలను ఇవాల్టికి కూడా మనం వేదవాక్కులుగా నమ్ముతున్నాం. వారి శాపాలు మానవుల్ని సజీవంగా ఆకాశంలోకి పంపే వారి ప్రయత్నాల్ని కూడా నమ్ముతున్నాం. ఇందుకు మన పురణాల్లోని విశ్వామిత్రుడు ప్రత్యక్ష ఉదాహరణ. రామాయణంలో దశరధుడు లాంటి వ్యక్తులు పదివేల సంవత్సరాలపాటు రాజ్యాన్ని పాలించడం-ఇవన్నీ తేలికగా కొట్టి వేయగలిగే విషయాలు కావు.”

అల్ట్రా మోడ్రన్‌గా కనిపించే దిశలో ప్రాచీనత పట్ల అంత నమ్మకం పెరగడానికి గల కారణాల్ని వూహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సత్యబ్రహ్మ.

“నువ్వు పురాణాల్ని నమ్ముతావా? సైన్సుని నమ్ముతావా?” సీరియస్‌గా అడిగాడాయన.

“పురాణాల్ని, ఇతిహాసాల్ని కేవలం పుక్కిటి కల్లబొట్టి కబుర్లుగా తీసి పారెయ్యకూడదని నా అభిప్రాయం. అలాగే సైన్సు శాస్రీయ పరిణామాలు సృష్ట్యాది నుంచీ వున్నాయి. కానీ వాటిని మానవజాతి కనుగొన్నాకే ఆ శాస్త్రానికి సైన్సు అని పేరు పెట్టడం జరిగింది. కాదంటారా?”

సత్యబ్రహ్మ అవుననలేకపోయాడు – కాదనలేకపోయాడు.

“ఇంతకీ నువ్వు మమ్మీల గురించి ఏమనుకుంటున్నావ్?” అడిగాడాయన.

“ఆ మమ్మీల విషయంలో మనకు తెలియని ప్రయోగాలు జరిగే వుంటాయి సార్! ఆ శవాలు మళ్ళీ లేచి వుంటాయి – కదలాడే వుంటాయి – మాట్లాడే వుంటాయి” నెమ్మదిగా చెప్పింది దిశ.

“ఆశావాదం మంచిదే కానీ సైన్సుకి ఆధారం కావాలి.”

“మనిషి మృత్యువుని జయించాలని శతాబ్దాలుగా చేసే ప్రయత్నాలే నా ఆధారాలు సార్! పూర్వపు మునులు తపస్సు చేసి మృత్యుంజయులు కాలేదా? హిమాలయాల్లో సంచరిస్తున్నాడని చెబుతున్న యతి మాటేమిటి? కొన్ని వందల సంవత్సరాల మనిషి కాదా? ఆ యతిని, ఆ యతి పాదముద్రలను కొంతమంది చూసినవాళ్ళు యిచ్చిన ప్రెస్ కటింగ్స్ ఒక్కసారి చూడండి. చరిత్ర మొత్తం వాస్తవం కాదు- అలాగే సైన్స్ కూడా- అలాగే భారతీయ ఫిలాసఫీ కూడా.”

పెద్ద పెద్ద మేధవులు తలలు బద్దలు కొట్టుకుంటున్న విషయాన్ని చాల సింపుల్‌గా దిశ చెప్పడంతో విస్తుపోయాడాయన.

సాయంత్రం అయిదు గంటలు దాటింది.

అరగంట్ర క్రితం వరకూ వున్న వెచ్చటి వాతావరణం చల్లగా మారుతోంది.

క్యాంటిన్లోంచి అందరూ బయటికొచ్చారు.

దూరంగా ఆకాశంలోని సూర్యుడు మబ్బుల్లో దాగి తీక్షణతను తగ్గించు కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

“క్రయోనిక్స్ గురించి నీకు తెలుసా?” పక్కనే వున్న చెట్టుకి చేరబడి అడిగాడు సత్యబ్రహ్మ వున్నట్టుండి.

వెంటనే జవాబు చెప్పలేదు దిశ… ఆయనకేసి ఆశ్చర్యంగా చూసింది.

రెండు నిమిషాలు గడిచాక మెల్లగా చెప్పింది…

“తెలుసు! రాబోయే జన్మల కోసం, శవాలని భద్రపరచడమే, క్రయోనిక్స్  అంటే.. కదా సార్?”

“అవును. ఆ శవాల గురించి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్న సంస్ధ ఒకటి ఉంది తెలుసా?”

“ఎక్కడో, ఎప్పుడో చదివాను. అమెరికాలోని, కాలిఫోర్నియాలో” ఏదో చెప్పబొయింది దిశ.

“అలాంటి సంస్థ అమెరికాలోనే కాదు. ఇండియాలోనూ వుంది.”

“ఇండియాలోనా!?” ఆశ్చర్యంతో ఆమె నేత్రలు విశాలమయ్యాయి.

“అవును బేబీ! అలాంటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందంటే, నువ్వు షాక్ తింటావు.”

అంతవరకూ మబ్బులవైపు చూస్తున్న దిశ, ఆ మాటలకు నిజంగా షాక్ తింది.

“ఈజిట్ ట్రూ సార్?!” కలలోని సంఘటన, ఇలలో ఎదురైనప్పుడు మనిషి పొందే అనుభూతిలాంటి ఫీలింగ్ అది.

“ఎస్! ఇట్స్ హాండ్రెడ్ పర్సంట్ ట్రూ… మైడియర్ బేబీ! ఆ సంస్థను స్థాపించి అయిదేళ్ళయింది.”

“ఫైవ్ ఇయర్స్! ఎక్కడుంది ఆ సంస్థ… వేరీజిట్ సార్?” దిశ మెదడులో షాక్ మీద షాక్! అలాంటి సంస్థ గురించి తెల్సుకోవడమేకాదు, అందులో పని చెయ్యాలనే కోరిక ఆమెకు చాలా కాలంగా వుంది.

“అవును! ఆ సంస్థ గురించి నువ్వు నిజంగా తెల్సుకుని ఏం చేస్తావ్?” సత్యబ్రహ్మ నోటినుంచి అలాంటి ప్రశ్న వస్తుందని ఊహించలేదు దిశ.

“ప్రాణాలు కోల్పోయిన శవాలు, ప్రాణాలు పోసుకుని నిలిచి కదలాడే రోజు… అరుదైన ఆ క్షణం… సృష్టి పరిణామంలో అద్భుతమైన ఆ సంఘటన ఈ శతాబ్దంలోనే జరుగుతుందని నా నమ్మకం.”

ఆమె మాటలకు అడ్డొచాడు సత్యబ్రహ్మ.

“ఆ సంఘటన ఈ శతాబ్దంలోనే ఎలా జరుగుతుందనుకుంటున్నావ్?”

సత్యబ్రహ్మ గొంతులోంచి వచ్చిన అ ప్రశ్నకి వెంటనే జావాబు చెప్పలేక పోయింది దిశ.

“ఎలా జరుగుతుందనుకుంటున్నావ్? ఫిలాసఫీని నమ్మే నువ్వు భారతీయతలోని కాల్పనికతను మనసా, వాచా విశ్వసించే నువ్వు, సైన్సు పరిశోధనల గురించి జోస్యం చెప్పడం చిత్రంగా వుంది” చిన్నగా నవ్వాడాయన. ఆ నవ్వుకు కోపం వచ్చింది. అసహనంగా ఆయనకేసి చూసిందో క్షణం.

వాళ్ళకు కొంచెం దూరంలో నిలబడి పూలమొక్కల్ని చూస్తున్న విద్యార్ధులు సత్యబ్రహ్మతో, దిశ ఏ విషయం గురించి అంతసేపు వాదిస్తుందో అర్థం కావడంలేదు. సత్యబ్రహ్మ దగ్గరున్న దిశను, తనతోపాటు తీసుకెళ్ళ డానికి ఆమె స్నేహితురాలు వసంత ముందుకి ఒక అడుగువేసింది.

దిశ నిలబడిన ప్రదేశానికి, వసంత ఇరవై అడుగుల దూరంలో వంది.

“తత్త్వశాస్త్రాన్ని ఇష్టపడే నేను,  సైన్స్ ద్వారా జరిగే మార్పుల్ని అంచనా వెయ్యగలను…” నెమ్మదిగా అంది దిశ.

“అంటే… ఇంతకీ నీ వయస్సు… ఇరవై ఏళ్ళుకూడా దాటలేదు-నీ మాటలు నాకు చాలా విచిత్రంగా వున్నాయి బేబీ!” నిజంగా ఆయనకు దిశ వాగ్దోరణి చాలా విచిత్రంగా వుంది.

ఆ అమ్మాయి మేథస్సును, ఆయన అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

“నీ ఇష్టాన్ని నేను కాదనడంలేదు బేబీ! నిజంగా నీకు క్రయోనిక్స్ మీద నమ్మకం వుంటే… నా రెసిడెన్స్‌కు రా… వస్తావా?” షర్టు జేబులోంచి తన విజిటింగ్ కార్డ్‌ను తీసి ఆమె చేతిలో వుంచాడాయన.

ఆ కార్డువైపు ఒకసారి చూసి, తన హేండ్‌బ్యగ్‌లో ఆ కార్డుని వుంచుకొని తనవైపే వస్తున్న వసంతవైపు ఆందోళనగా చూసి, అప్రయత్నంగా “వసంతా!” అని పరిగెత్తుకుంటూ వెళ్ళిన దిశ, వసంతను పక్కకు తోసేసింది

సరిగ్గా అదే క్షణంలో…

పైనుంచి ఎండిపోయిన చెట్టుకొమ్మ ఒకటి ఫెళఫెళమంటూ పెద్ద శబ్దం చేస్తూ విరిగి కింద పడింది.

ఆ ప్రమాదం నుంచి వసంత తప్పిపోయింది… కానీ ఆ చెట్టుకొమ్మకింద పడిపోయిన దిశ గొంతులోంచి వచ్చిన ఆర్తనాదంతో, ఆ పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి.

అయోమయంగా సత్యబ్రహ్మ ముందుకు పరిగెత్తాడు.

మానవ మనుగడ మాత్రమే కాదు. ఆత్మల మనుగడకు కూడా నమ్మకమే పునాది. అనాదిగా విశ్వగోళమ్మీద జీవించే ప్రతి ప్రాణీ మృత్యువుకు దూరంగా జరగడానికి ప్రయత్నించింది. దిక్కులను పూజించడం, సూర్యుణ్ని ఆరాధించడం, తమ నమ్మకాలకు అనుగుణంగా దైవరూపాల్ని తయారుచేసుకోవడం ఇందులో ఒక భాగమే.

అలాగే చావు తర్వాత వచ్చే కొత్త రూపం, కొత్త జన్మలకు సంబంధించిన చర్చలు, అందుకోసం ముక్తి, సాధన, తపస్సులు, అన్వేషణలు ఇవి ఈనాటి సంఘటనలు కావు.

ఆత్మ శాశ్వతం అని విశ్వసించే మానవజాతి, కొత్త జన్మల కోసం, తమ శవాలని పదిలంగా భద్రపరచుకోవడం జరిగింది. ఈజిప్టులోని మమ్మీలు ఆ ప్రయత్నంలోని ఒక భాగమే. ప్రపంచవ్యాప్తంగా జీవాత్మల కోసం, మానవజాతి ఎంతగా ప్రాకులాడిందో అట్టడుగు చరిత్రలు తిరగేస్తే ప్రతి వారికీ తెలుస్తాయి.

ఆధునిక కాలంలో, సైన్స్ అభివృద్ధి చెందిన ప్రస్తుత దశలో శాస్త్రీయంగా మానవ భౌతికకాయాన్ని, భవిష్యత్తు జన్మలకోసం పదిలంగా భద్రపరచే పద్ధతినే క్రయోనిక్స్ అంటారు. ఒక రకంగా విడమరిచి చెప్పాలంటే ప్రాణంలేని శరీరాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడమే!

ఇది నిజమా?

ఇది సాధ్యమా? చైతన్య రహితమయ్యే శవం చైతన్యవంతమవుతుందా? అవుతుందనే శాస్త్రజ్ఞులు నిరంతరం కృషి చేస్తునారు.

క్రయోనిక్స్ గురించి సీరియస్‌గా కృషి చేస్తున్న వ్యక్తి గారెట్ స్మిత్….

బ్రిటన్‌లోని, పుట్నీ నగరానికి చెందిన గారెట్‌స్మిత్, 1979లో రాబోయే జన్మలకు శరీరాల్ని దాచే క్రయోనిక్స్ పద్ధతి గురించి తెలిపే అరుదైన డాక్యుమెంటరీని చూసి, క్రయోనిక్స్ పట్ల ఆకర్షణను పెంచుకున్నాడు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ క్రయోనిక్స్‌కు చెందిన ఒక సంస్థ వుందని తెలిసి అక్కడకు వెళ్ళాడు.

ఆ సంస్థ పేరు ‘ఆల్కోర్’

అక్కడకు వెళ్ళి అక్కడ సైంటిస్టులను సంప్రదించాడు. తన శరీరాన్ని భవిష్యత్ జన్మలకు రిజర్వ్ చేయించుకోవడానికి లక్ష పౌండ్లు ఖర్చవుతుందని (అంటే సుమారు 50 లక్షల రూపాయలు) తెలుసుకుని, అంత డబ్బు ఆయన దగ్గర లేకపోవడంతో, కేవలం నలభై వేల పౌండ్లు మాత్రమే యిచ్చి తల ఒక్కదాన్నే బుక్ చేసుకున్నాడాయన. క్రయోనిక్స్ సంస్థలో సభ్యత్వం పొందిన వ్యక్తులు బ్రిటన్లో చాలమంది వున్నారు. వీరందరూ నెలకొక్కసారి సమావేశం జరుపుకుంటారు.

గారెట్‌స్మిత్ కూడా ఈస్ట్‌బౌర్న్ సిటీలో ‘ఆల్కోర్ యుకె’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంఘ సభ్యులు ఒక చిన్న షెడ్లో కలుసుకుంటారు. అక్కడకు వెళ్తే అన్ని వయసులవాళ్ళూ, అన్ని వృత్తుల వాళ్ళూ మనకు కన్పిస్తారు-ఆల్కోర్ సంఘ సభులు మరణిస్తే వారి శరీరాల్ని అమెరికాలోని ఆల్కోర్ సంస్థకు పంపుతారు. అక్కడ ఆ శవాన్ని భద్రంగా దాని పెడతారు.

ఈస్ట్‌బౌర్న్‌లోని ఆల్కోర్ యుకె సంఘ భవనలోకి వెళితే చాల విషయాలు తెలుస్తాయి. పోర్టబుల్ ఐస్‌బాక్స్, ప్రయింగ్ రాడ్స్ పైన స్టీల్ లాంప్స్, ఆపరేటింగ్ టేబుల్, దాని క్రింద డ్రెయిన్ హోల్, వీటితోపాటు హార్ట్‌లంగ్ మెషిన్, కార్డియాక్ పుల్మోనరీ రిసస్కిట్‌టర్, బ్లడ్‌గాన్ ఎనలైజర్, ఊండ్ కాటెరైజర్, బ్లడ్ కూలింగ్ సిస్టమ్ అన్నీ వుంటాయి.

అసలు మా అయిడియా అంతా ఒకటే! మెదడుకు ఆక్సిజన్ సరఫరా కొనసాగిస్తూనే శరీరాన్ని అతివేగంగా చల్లబరచడం. ఒక విధంగా చూస్తే, ఇదో రకం హార్ట్‌సర్జరీ లాంటిదే… ఇది చేయడం చాలా తేలిక అని అంటాడు గారెడ్.

శవాలను ఒక చోటనుంచి యుంకో చోటికి పంపించడానికి ముందు చాలా తతంగం వుంటుంది.

ప్రాణం పోయాక శరీరం క్రమంగా చల్లబడుతున్నప్పుడు, శరీరంలోని రక్తాన్ని తొలగిస్తూ, దాని స్థానంలోకి క్రియోప్రొటెక్టెంట్‌ను ఎక్కిస్తారు. ఇదో రకం యాంటీ ఫ్రిజింగ్ అన్నమాట. దీనివల్ల మెదడులోని టిష్యూకు ఐస్‌క్రిస్టల్స్ వల్ల నష్టం జరగదు. తర్వాత శరీరాన్ని పొడిఐస్‌లో, నీట్‌గా ప్యాక్ చేస్తారు. అన్నివైపుల నుంచి గాలి చోరని విధంగా వెల్డింగ్ చేస్తారు. దీన్ని ఒక గ్లాస్ ఫైబర్ పెట్టెలో పెట్టి, విమానం ద్వారా కాలిఫోర్నియాకు పంపించేందుకు సిద్దంగా వుంచుతారు. ఇలాంటి పెట్టెల్ని సిద్ధంచేసే నిపుణుడు అలాస్ సింక్లియార్ అనే వ్యక్తి.

నార్వే, ఆస్ట్రెలియా, అమెరికా తదితర ఎన్నెనో దేశాల్లో ప్రయాణించి, అక్కడ విమానాశ్రయాల్లో భ్యాగేజీని హేండిల్ చేసే వారిని పరిశీలించి, ఈ పటిష్టమైన పద్ధతిని ఆయన రూపొందించాడు.

శవాల్ని క్రయోనిక్స్ మార్చే పద్ధతి వుంటుంది…

మానవ శరీరాన్ని మైనస్ 190 డీగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర శీతలీకరించినప్పుడు, మానవ శరీరంలోని టిష్యులేమీ పాడవవని శాస్త్రజ్ఞులు అంచనా, క్రయోనిక్స్‌లో ఈ ఉష్ణోగ్రతకు చాల ప్రాధాన్యం వుంది. శరీరాన్ని నిలవ వుంచే ఉష్ణోగ్రత యిదే – నిలవ వుంచుతున్న ప్రాణం లేని శరీరాన్ని నిలవ వుంచుతున్న ప్రాణం లేని శరీరాన్ని శాస్త్రజ్ఞులు క్రయోనాట్స్ అంటున్నారు. యాస్ట్రోనాట్స్, ఆర్గోనాట్స్‌లాగ అన్నమాట. ఒకవేళ ఆ ఉష్ణోగ్రత ఏమాత్రం తగ్గినా కూడా శరీరంలోని టిష్యూలు పాడైపోతాయి. కణాలు డిహైడ్రెట్ అవుతాయి – కణాల గోడలు వంపులు తిరిగి, పగిలిపోతాయి. అలాంటి నష్టం వాటిల్లితే దాన్ని సరిచేయడం అసాధ్యం అంటారు శాస్త్రజ్ఞులు. అందుకే అసలు నష్టం సంభవించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

ప్రస్తుతం టిష్యూ కణాలను సరిచేసుకోవడం కష్టం అవుతోంది గాని మరో రెండు శతాబ్ధాల కాలం ఆగి చూడండి-అప్పటికి నానో టెక్నాలజీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెంది వుంటుంది. కణాల స్థాయిలో వుండే మానవ టిష్యూలను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం, అవసరమైన వాటిని పునర్మించడం శాస్త్రజ్ఞులకు చిటికెలమీద అవుతుందని అంటున్నాడు గారెట్ స్మిత్.

గారెట్ ఊహాలోకంలోకి మనమూ తొంగిచూస్తే, అక్కడ నిజంగా అద్భుతాలే కనిపిస్తాయి. వేలాడుతున్న శరీరాలు-వాటి చుట్టూ ఎందరెందరో శాస్త్రజ్ఞులు. ఆ శరీరాల్లో పాడయిన టిష్యూలకు చకచకా మరమ్మతులు చేస్తూ వుండటమే కాదు, ఆ శాస్త్రజ్ఞులు క్రయోనాట్ శరీరాన్ని యవ్వనవంతం చేస్తుంటారు. అప్పటికే పాడయిన శరీర భాగాలను యిట్టే తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమరుస్తుంటారు. అయినా అదంతా వూహాలోకం-నిజంగా అలా జరుగుతుందా అని అనుమానంగా చూసినా, అమాయకంగా ప్రశ్నించినా గారెట్ నవ్వేస్తాడు.

ఎవరు చెప్పగలరు చెప్పండి? అదే తెలిస్తే యిక మనిషి సాధించలేనిది ఏముంటుంది? అని అంటాడాయన.

మనిషి మృత్యువును జయించగలడా?

ఆత్మలను ఆవాహాన చేసుకోగలడా?

ఇదీ ఈనాటి ప్రశ్న కాదు- సైన్సు రూపంలో ఆలోచన మొదలైన క్షణం నుంచి ప్రతి శాస్త్రవేత్త మదిలో కదులుతున్న ప్రశ్న. గత ముపై సంవత్సరాల కాలాన్ని పరిశీలించి చూడండి. శాస్త్రలోకం సాధిస్తున్న విజయలు మనకు అవగతం అవుతాయి. ఒక్కో గదంత సైజులో వుండే కంప్యూటర్లు క్రమంగా చిన్నదవుతూ, ఇప్పుడు కేవలం అగ్గిపెట్టె సైజులోకి చేరుకున్నాయి. ఇక వైద్యరంగలో చూసినా సరే – డి.ఎన్.ఏ.డబుల్ హెలిక్స్‌ను గుర్తించి, 30 సంవత్సరాలు కాకుండానే శాస్త్రజ్ఞులు, కాన్సర్ కణాలకు టీకాల రూపకల్పనలో వున్నారు – మరి రాబోయే కాలం గురించి బాగా వూహించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?

క్రయోనిక్స్ పేరిట మానవ శరీరాన్ని భద్రపరచడం ఎందుకు? కొత్త ఆత్మలు వాటిలో ప్రవేశిస్తాయని-

నిజంగా ప్రవేశిస్తాయా! మనిషికి ఏడు జన్మలున్నాయని, ఆ ఏడు జన్మల్లో మళ్ళీ మానవ జన్మ ఒకటని మన హిందూతత్వం బోధిస్తోంది. చనిపోయిన మనిషి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని పునర్జన్మ శాస్త్రం చెబుతోంది.

‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలకు సంబంధించిన శాస్త్రవేత్తలను ఈ ప్రశ్న వేస్తే మరణాన్ని జయించడమంటే ఆత్మలను ఆహ్వానించడం మాత్రం కాదు. పోయిన శరీరంలోని ప్రాణాన్ని నిలపడం. ఒకప్పుడు భూగోళమంతా దేవుని సృష్టి. కానీ ప్రస్తుతం ఎన్నెన్నో రసాయనిక చర్యల సమ్మిళితం. మాకు ఈ విషయంలో యాభైశాతం వరకూ విశ్వాసం వుంది. ఇంకొదరికి పదిశాతం కూడా నమ్మకం లేదు’ అని అంటారు.

గారెట్‌స్మిత్ మాటల్లో చెప్పాలంటే – మీరే చెప్పండి ఇప్పుడు చనిపొయిన వ్యక్తి ముందున్న మార్గాలేమిటి? ఖననం, దహనం అంతేకదా! ఈ రెండిటి వల్ల ఏం జరుగుతోంది? అలాంటిదే శవాల్ని భద్రపరచి కూడా ఫ్రీజింగ్ పద్ధతిలో శవాల్ని భద్రపరచడంలో మా ఆశ, మనిషి మృత్యువును జయించగలడనే నమ్మకం.

ఈ నమ్మకం ఇవాళ నిజం కాకపోవచ్చు… ఇంకో వందేళ్ళనాటికయినా నిజం కావచ్చు.

ఇదొక కాంప్లికేటెడ్ ఫెయిత్. చనిపోయిన మనుషులు బ్రతికితే ప్రపంచం పూర్తిగా జనాభా మాయమైపోదూ?

ఇదొక చాలా సందేహాల్లాంటి సందేహామా?

వారం రోజులు గడిచాయి.

ఒరిస్సా అడవుల్లో అరుదైన దేవాలయం బయల్పడితే ఆ విశేషాల కోసం వెళ్ళాడు సత్యబ్రహ్మ.

ఈ వారం రోజుల్లో అతను దిశ కోసం ఎదురుచూశాడు. ఆమె రాలేదు.

అంత ఉత్సాహం చూపిన వ్యక్తి మళ్ళీ తననెందుకు కలుసుకోలేదు?

ప్రయాణం నుంచి రాగానే తనే దిశను కలవాలి అని అనుకున్నాడు  ఆయన.

 

*                      *                      *                      *                      *

 

భువనేశ్వర్‌లోని త్రీస్టార్ హోటల్….

రాత్రి 12-05 నిమిషాలైంది.

దిశతో ఆ రోజు హైద్రాబాద్‌లో తన ఆఫీసులో చర్చించిన దగ్గరి నుంచీ సత్యబ్రహ్మ ఆమె గురించే ఆలోచిస్తున్నాడు.

దిశలో అసాధారణ తెలివితేటలు, మేధస్సు, చురుకుదనం ఆయన్ని ప్రధానంగా ఆకర్షించిన గుణాలు, కానీ ఆమె ఆలోచనలే ఆయనకు కొరుకుడు పడడం లేదు.

ఇరవై ఏళ్ళ అమ్మాయి తత్వశాస్త్రం గురించి జీవాత్మలు, నమ్మకాల గురించి వాదించడమే అతనికి విచిత్రంగా వుంది.

అదే కాకుండా ఆరోజు పబ్లిక్ గార్డెన్స్‌లో తనతోపాటు  మాట్లాడుతూ స్నేహితురాలిని చూసి ముందుకెళ్ళిన దిశ-

ఎండిపోయిన కొమ్మ కిందపడడం ముందుగా చూసి స్నేహితురాలిని హెచ్చరించిందా?

ఆ చప్పుడుని ముందుగా పసికట్టి హెచ్చరించిందా?

ఆ చెట్టుకి వెనకగా నిలబడడం వల్ల ఆ కొమ్మ కిందపడడాన్ని దిశ గమనించడానికి వీల్లేదు.

మరి… ఆ చప్పుడికి ఆమె బ్రెయిన్ ఎలర్ట్ అయిందంటే…

ఆ కొమ్మ కిందపడినా దిశ నుదుట మీద చిన్న గాయం తప్ప మరే ప్రమాదం జరగనందుకు మొదట సంతోషించిన వ్యక్తి సత్యబ్రహ్మ. పజిలయిన వ్యక్తి కూడా ఆయనే.

చేతిలోని బుక్‌ని టీపాయ్ మీద వుంచి నిద్రకుపక్రమించాడాయన.

అప్పటికి రాత్రి ఒంటిగంట దాటింది.

*                      *                      *                      *                      *

సరిగ్గా అదే సమయంలో –

హైదరాబాద్‌లో పంజాగుట్టలోని ఓ లేడీస్ హాస్టల్ రూమ్‌లో గాఢనిద్రలో వుంది దిశ.

ఆమె అప్పటికి నిద్రలోకి జారుకుని అరవై ఎనిమిది నిమిషాలైంది.

లైట్ బ్లూకర్ బల్బులో రూమ్ వింతగా మెరుస్తోంది.

ఎక్కడో ఆకాశంలో ఉరుములు… వరసగా ట్యూబ్‌లైట్లు పగిలి పోతున్నట్టు మెరుపులు… వంటిని పాముల్లా చుట్టేస్తున్న వెలుతురు తీగలు.

పెనువర్షం… సుడిగాలి… గునపాలు కిందకు రయ్ రయ్‌మని దిగుతున్నట్టుగా వర్షపు ధారలు…

ఆకాశంలో….

ఏదో తెల్లటి పక్షి వర్షపు ధారల్ని చీల్చుకుంటూ.. రాక్షసపు రెక్కలను ఆడించుకుంటూ…

సుడిగాలిని తప్పించుకుంటూ పెను విహాంగం… ఆ విహాంగం కళ్ళు తెల్లగా, తెలతెల్లగా భీకరంగా మెరుస్తున్నాయి.

పెను రెక్కల్తో చెట్లను రాసుకుంటూ, క్రీచ్ క్రీచ్‌మని అరుస్తూ పరుగులు తీస్తొంది ఆ ధవళ విహాంగం.

కాటుక చీకటి… మెరుపుల వెలుతురు. ఆ వెలుతుర్లో ఆ విహాంగం రెక్కలు ఒక్కటొక్కటీ వూడి పడిపోతున్నాయి. కొబ్బరాకుల్లా వున్న ఆ రెక్కలు సుడిగాలిలో గింగుర్లు కొడుతున్నాయి.

దూరంగా నల్లటి కొండలు.. అంతెత్తున ఆకశంలోకి చొచ్చుకు పోయిన కొండలు…

మరో క్షణంలో…

ఆ ధవళ విహాంగం ఆ కొండల్లో ఒక కొండకు బలంగా ఢీకొని క్రీచ్ క్రీచ్‌మని అరిచింది.

కొండను బలంగా డీకొనడం వల్ల ఆ పెనుపక్షి మెడమీద బలంగా గాయం తగిలింది.

నల్లటి చీకట్లో ఎర్రటి నెత్తురు… చివ్వున చిమ్మిన నెత్తురు… వర్షపు ధారల్లో కలగలసి పోయిన నెత్తురు.

చివ్వున చిమ్మిన ఆ నెత్తురు బిందువులు తన మొహంమీద పడినట్టు అవడంతో…

కెవ్వుమని కేకవేసి కళ్ళిప్పింది దిశ.

ఒక్కక్షణం తనెక్కడుందో ఆమెకు అర్థంకాలేదు.

దట్టమైన నీలపు వెలుతురు కళ్ళముందు ప్రత్యక్షం కావడంతో ఆమె యదార్ధస్థితికి వచ్చింది.

గబుక్కున లేచి కూర్చుంది.

అలసటతోనూ, ఆయాసంతోనూ, భయంతోనూ ఆమె శరీరం కంపించడం ఆమెకు తెలుస్తూనే వుంది.

గబుక్కున టేబుల్ లైటు వేసి గోడ గడియారం వేపు చూసింది,

సరిగ్గా ఒకటి ముప్పై నిమిషాలు.

తనను తాను కుదుటపరచుకోడానికి ఆమెకు పదిహేను నిమిషాలు పట్టింది.

ఆ తర్వాత..

నెమ్మదిగా తనకొచ్చిన కలను జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించిందామె.

తెల్లటి పెద్ద పక్షి…

ఉరుములు… మెరుపులు… ఒక్కొక్క రెక్క వూడి కిందపడిపోతున్న భయానక దృశ్యం.

ఎప్పుడు ఎలాంటి కలవచ్చినా డైరీలో నోట్ చెయడం దిశ అలవాటు.

వెంటనే టేబుల్ మీదున్న డైరీని అందుకుని రాయడం ప్రారంభించింది.

పదినిమిషాలు గడిచాయి.

రాస్తూ రాస్తూ పక్కకు చూసిన ఆమెకు పక్క పేజీలో ఉదయాన్నే రాసుకున్న ఎడ్రస్ కనిపించింది.

ఏవో పనుల వత్తిడిలో వారం రోజులపాటు సత్యబ్రహ్మను కలవలేకపోయిన దిశ ఆయన్ని కలవడం కోసం ఉదయాన్నే సత్యబ్రహ్మ ఇంటికి ఫోన్ చేసింది.

ఒరిస్సా వెళ్ళారని జవాబు రావడంతో ఆయనతో ఫోన్లో అయినా మాట్లాడుదామని అక్కడి అడ్రస్ తీసుకుంది.

సత్యబ్రహ్మ— హోటల్ ఉత్కళ్-భువనేశ్వర్!

ఆ పక్కన హోటల్ ఫోను నెంబరు.

ఆ ఫోను నెంబరు వైపు తదేకంగా చూస్తున్న దిశకు హఠత్తుగా మెదడులో ఏదో మెరుపు మెరిసినట్టయింది.

తనకొచ్చిన కలను విశ్లేషించడం ప్రారంభించింది.

ధవళ విహంగం… ఉరుములు… మెరుపు…

ఉదయాన్నే సత్యబ్రహ్మ ఇంటికి ఫోను చేసిన తర్వాత తను చేసిన పనులు… కలసిన వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకుంది.

ప్రతి కలకూ ఒక కారణం వుంటుంది. ఆ కారణం కోసమే ఆమె అన్వేషిస్తోంది.

తనకీ కల రావడానికి కారణం?

సరిగ్గా ఆ సమయంలో ఆమెకు జ్ఞాపకం వచ్చింది సత్యబ్రహ్మ ఇంట్లో వ్యక్తి చెప్పిన జవాబు.

“ఇవాళ లేట్ నైట్ ప్లైట్‌లో ఆయన బయలుదేరి రావచ్చు…”

లేట్ నైట్ ప్లైట్!

అంటే భునేశ్వర్‌లో ఆ ప్లైట్ ఎన్ని గంటలకు బయలుదేరుతంది?

ఆ ప్రశ్న తలెత్తగానే దిశ ఒక్క ఉదుటున బెడ్‌మీంచి కిందకు దూకి రూంలోంచి బయటికొచ్చి-

ఆఫీసు రూలోకి పరుగెత్తింది.

వెంటనే ఫోన్ అందుకుని హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌కి ఫోను చేసింది.

“భువనేశ్వర్ నుంచి హైదరాబద్ వచ్చే ప్లయిట్ భువనేశ్వర్‌లో ఎన్ని గంటలకు బయలుదేరుతుందో చెప్పగలరా?”

దిశలో ఏదో టెన్షన్!

“టూ థర్టీ…? రిసీవర్‌లోంచి జవాబు వినిపించగానే ఆమె చూపులు చట్టుక్కున గోడ గడియారంవైపు తిరిగాయి.

అప్పుడు సమయం సరిగ్గా ఒంటిగంట యాభై నిమిషాలు.

“కరెక్టు టైంకి ప్లయిట్ హైదరాబాద్ వస్తుందంటారా?”

ఆ ప్రశ్నకు ఎయిర్‌పోర్ట్‌లోని ఆపరేటరు చిన్న నవ్వు నవ్వింది.

“చెప్పలేం మేడమ్… ప్రస్తుతం భువనేశ్వర్లో వెదర్ బాగులేదు..”

“వెదర్ బాగాలేదా? అంటే.. తుఫానా? ఉరుములు.. మెరుపులు.”

దిశ ఏం మాట్లాడుతోందో ఆమెకు తెలీదు. ఆమె మాటల్ని విచిత్రంగా వింటోంది ఆపరేటరు.

మరో ప్రశ్న వేయకుండానే ఫోనుకట్ చేసి టెలిఫోన్ ఎక్సేంజ్‌కి ఫోను చేసింది. లేడీ ఆపరేటరు లైన్లోకొచ్చింది.

“అర్జంట్ కాల్ టు భువనేశ్వర్…. హోటల్ ఉత్కళ్” ఆందోళనగా చెప్పింది దిస.

నిమిషాలు గడుస్తున్నాయి.

దిశ ఉచ్చ్వాస, నిశ్వాసలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆమె మనసులో ఏదో భయం… పాము తనను తాను చుట్టుకుంటున్నట్టుగా .. సత్యబ్రహ్మకు ఏదో ఆపద వాటిల్లబోతోంది.

ఆ ఆపదనుంచి ఆయనను రక్షించాలి… ఎస్.ఐ… మస్ట్ సేవ్ హిమ్…

ఒకటి… రెండు… మూడు.. నాలుగు…

నరాల్లో పెరుగుతున్న రక్తచలనం….

అంతలోనే ఆమెకో సందేహం. తనకొచ్చిన కలకూ, సత్యబ్రహ్మకు వాటిల్లబోయే ఆపదకు ఏమిటి సంబంధం?

తను తొందరపడుతోందా?

లేదు.. లేదు.. తనకొచ్చిన కల నిజంకాక తప్పదు.  అందుకు… అందుకు.. ఏకైక సాక్ష్యం…

ఆ సమయంలో భువనేశ్వర్‌లో కూడా వర్షం. వెదర్ బాగోలేదు.

అది కాకతాళీయం కావచ్చు. ఆమెలో ఉదయించిన మరో ప్రశ్న…

ఆమె ఆలోచనలను పక్కకు నెట్టేస్తూ…

అంతలో గణగణమంటూ ఫోన్ మోగడంతో రిసీవరు అందుకుంది దిశ.

“హోటల్ ఉత్కళ… మాట్లాడండి” ఆపరేటరు లైన్ యివ్వడానికి పూర్తిగా ఒక్కక్షణం సమయం కూడా పట్టదు.

*                      *                      *                      *                      *

సత్యబ్రహ్మ టై సర్దుకుంటూ నిలివెత్తు మిర్రర్‌లో చూసుకున్నాడు.

ఆ సమయంలో అతను-

అకస్మాత్తుగా వచ్చిన ఉధృతమైన వర్షం గురించే ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి పెరిగిపోతున్న వర్షం.

మరో సమయలో అయితే అతను ఆ ప్రయాణాన్ని వాయిదే వేసుకునేవాడు కానీ…

మర్నాడు మార్నింగ్ పదిగంటలకు హైదరాబాద్‌లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌కి హాజరవ్వాల్సిన అవసరం వుంది.

అప్పటికే రెండుసార్లు ఎయిర్‌పోర్ట్‌కి ఫోను చేశాడు. ప్లయిట్ బయలుదేరుతుందో లేదోనని తెలుసుకోవడం కోసం.

“ప్లయిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయలుదేరుతుంది సార్! ఎందుకంటే ఆంధప్రదేశ్ కు చెందిన హోంమినిస్టరు ఆ ప్లయిట్‌లోనే వెళుతున్నారు.”

వర్షంలోనే ప్రయాణం చెయ్యడమంటే సత్యబ్రహ్మకు చికాకు.

రిస్ట్ వాచీవైపు చూసుకుని సూట్‌కేస్ అందుకుని రూమ్‌లోంచి బయటకు వెళ్ళబోతూ-

అప్పుడే నిశ్శబ్ధాన్ని చీలుస్తూ వినిపించిన ఫోనువైపు ఒకసారి చూసి టీపాయ్ వైపు అడుగులు వేసి రిసీవరు అందుకున్నాడు.

“ఎస్” ఆయన గొంతు గంభీరంగా వుంది.

“సర్.. నేను.. దిశ.. ఫ్రమ్ హైదరాబాద్…” దిశ పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు సత్యబ్రహ్మ.

ఈ సమయంలో దిశ నుంచి ఫోను. అందునా హైదరాబాద్ నుంచి తన్నిక్కడునట్టు ఆమెకెలా తెలిసింది?

“సార్! మీరు రెండు నిమిషాలు మాట్లాడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఓ.కె! మీరీ ప్లయిట్‌కి భువనేస్వర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారా?”

“అవును!”

“నో ప్లీజ్ డోంట్ కమ్.”

“వై… వై… మిస్ దిశ.. వాట్ హేపెండ్? ఆయన గొంతులో ఏదో తెలియని అశ్చర్యం.. ఉద్వేగం.

“ఆ ప్లయిట్‌కి ప్రమాదం జరగబోతోంది. ఆ ప్లయిట్ వర్షంలో చిక్కుకుని… ప్లీజ్ సార్! నా మాట వినండి. ప్లీజ్ కేన్సిల్ యువర్ జర్నీ, కమ్ టుమారో మార్నింగ్ సార్!”

సత్యబ్రహ్మకు దిశ ఏం చెప్తొందో ఒక్క మాట కూడా అర్ధం కాలేదు.

“నో మోర్ డిస్కషన్స్ సర్… ప్లీజ్ ట్రస్ట్ మీ.. డొంట్ గో ఇన్ టు డేంజర్… ఐ విల్ టెల్ యూ… ఎవ్విరిథింగ్… ఓ.కె! సార్!” టక్‌మని ఫోను కట్ అయ్యింది.

ఒక్కసారి సత్యబ్రహ్మ బ్రెయిన్ మొద్దుబారి పోయింది.

తను ప్రమాదంలో ఇరుక్కుంటున్నాడా? ఎక్కడో హైదరాబాద్‌లో వున్న దిశకు ఆ విషయం ఎలా తెలిసింది?

తనసలు ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటున్నాడు?

రెండే రెండు క్షణాలు ఆలోచించాడు సత్యబ్రహ్మ.

తను హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌కి ఎటెండ్ కావాలి, తప్పదు. ఒక పక్క దిశ హెచ్చరిక గురించి ఆశ్చర్యపోతూనే రూమ్‌లోంచి బయటికొచ్చి.

పోర్టికోలో టాక్సీ ఎక్కాడు.

వర్షం.. పెనుతుఫానుగా మారిన వర్షం…

రోడ్లమీద వరదలై పారుతున్న మారిన వర్షం… రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లు…

అంతా చీకటి… కటిక చీకటి

అంతటి పెనుతుఫానుని సత్యబ్రహ్మ కూడా జీవితంలో చూడలేదు.

పది నిమిషాల్లో వెళ్ళాల్సిన టాక్సీ ఎయిర్‌పోర్టుకి చేరడానికి ముప్పై నిమిషాలు పట్టింది.

టాక్సీలోంచి సూట్‌కేస్‌తో దిగి ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టాడు సత్యబ్రహ్మ.

 

*                      *                      *                      *                      *

            హైదరాబాద్…

రాత్రి మూడు గంటలైంది… నాలుగు గంటలైంది.

తన రూమ్‌లో వంటరిగా కిటికీలోంచి చీకట్లో బ్లాక్ పెయింటింగ్‌లా కనిపిస్తున్న చెట్లవైపు కూర్చుంది దిశ.

ఆమెకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు.

రూమ్‌లో ఏదో చప్పుడు కావడంతో గబుక్కున కళ్ళిప్పి చూసిందామె…

ఎదురుగా టేబుల్‌మీద, పుస్తకాల వెనక ఏదో ఒక వస్తువు కదులుతున్న వింత చప్పుడు.

ఆ చప్పుడు టేబుల్‌కి ఒక పక్కనున్న తెల్లటి గ్లాస్ చిన్నగా శబ్దం చేస్తోంది.

ఆ చప్పుడుకి ఉలిక్కిపడింది దిశ.

కూర్చున్న కుర్చీలోంచి చికాగ్గా లేచి నిలబడింది. ముందుకడుగు వేసింది.

*                      *                      *                      *                      *

 

“ఏం దిశా… అర్ధరాత్రి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావ్?” పీలగొంతుతో పాటు భారీ ఆకారం రూమ్‌లోకి రావడంతో డోరువైపు చూసి పెదవుల మీద నవ్వును పులుముకుంది దిశ.

వచ్చిన ఆమె భ్రమరాంబ- హాస్టల్ వార్డెన్.

“ఇంపార్టెంట్ మెసేజ్ మేడం! భువనేశ్వర్ ఫోను చెయ్యాల్సి వచ్చింది…” ఆ మాట చెపుతూనే సడన్‌గా సత్యబ్రహ్మ జ్ఞాపకం రావడముతో గబుక్కున ఆఫీస్ రూమ్‌లోకి పరుగెత్తి అక్కడ టేబుల్ మీద పడి వున్న డైలీ పేపర్ని అందుకుని గబగబా తిరగేసింది.

పేపర్లో తనకు కావల్సిన వార్త కనిపించకపోవడంతో ఆమె ముఖం వివర్ణమయి పోయింది.

“వాట్ దిశా? ఏంటి అంత సీరియస్‌గా పేపర్‌ని చూస్తున్నావ్?” ఆమె వెనకే వచ్చి ఆమె ముఖంలోకి సీరియస్‌గా చూస్తున్న వార్డెన్ భ్రమరాంబ వైపు చికాగ్గా చూసింది దిశ.

“భువనేశ్వర్ నుంచి వచ్చే ప్లయిట్ యాక్సిడెంట్ న్యూస్ కోసం”

అలా చెపుతున్న దిశను విచిత్రంగా చూసిందామె.

“ఏక్సిడెంట్ న్యూస్ కోసమా? యాక్సిడెంట్ జరిగిందా? జరుగుతుందా?” జోక్‌గా అడిగిందామె. దిశ తనకొచ్చిన ఒకటి రెండు కలల గురించి కొన్నిసార్లు ఆమెక్కూడా చెప్పడం జరిగింది.

“చూడు దిశా! సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళమని నీకు ఎప్పుడో చెప్పాను. వెళ్ళావా?” టాపిక్ మారుస్తూ అందామె.

పేపర్లో ప్లయిట్ యాక్సిడెంటు న్యూస్ ఎందుకు లేదో దిశకు అర్థం కాలేదు.

ప్లయిట్ యాక్సిడెంటుకు గుర్తుకాలేదా?

లేదు… తనకొచ్చే కలలు అవాస్తవాలు కావు.

పేపర్‌కి ఆ న్యూస్ అందలేదేమో.

ఆ ఆలోచన రావడంతోనే టెలిఫోను వైపు అడుగులు వేసి రిసీవర్ అందుకోబోతూ అప్పుడే పేపరులో లోనికొస్తున్న పేపర్ బోయ్‌ని చూసి ఆగి పోయింది.

“పేపర్ లేట్ మేడం” వార్డెన్ చేతిలో పేపరు పెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయాడు పేపర్ బోయ్.

దిశ చేతిలోని క్రితం రోజు పేపరు కిందకు జారిపోయింది.

వెంటనే వార్డెన్ చేతిలోని పేపరుని తీసుకుని మడతలు విప్పింది. ఫస్ట్ పేజీలో క్రింద-

‘నిట్టనిలువున కూలిన విమానం

హోంమంత్రితో పాటు అరవైమంది మృతి’

ఆ వార్తను చూడగానే దిశ చూపులు ఆ అక్షరాల వెంబడి పరుగులు తీశాయి.

అరవైమంది మృతుల్లో ఇరవైమంది శవాల్నే అధికారులు గుర్తుపట్టారట వాళ్ళ పేర్లే ప్రచురించారు.

మిగతా వ్యక్తులు శవాలను పోలికబట్టే ప్రయత్నంలో వున్నారట అధికారులు.

అంటే…

సత్యబ్రహ్మ తను చేసిన వార్నింగును నమ్మలేదా? అంటే సత్యబ్రహ్మ…

మరింక ఆలోచించలేకపోయింది దిశ.

ఆమె కళ్ళంట చివ్వున కన్నీళ్ళు చిమ్మాయి.

దిశ పరిస్థితి ఏం అర్థంకాని భ్రమరాంబ ఆమెవైపు అయోమయంగా చూస్తోంది.

“ఏంటమ్మాయ్… ఏం జరిగింది?” ప్రశ్నించింది భ్రమరాంబ.

జవాబు చెప్పలేకపొయింది దిశ. టెలిఫోను వైపు నడవబోయి అక్కడ టెలిఫోను పక్కన కన్పించిన ఒక జంతువును ఆశ్చర్యంగా చూసింది.

పిల్లి! తెల్లటి శరీరం మీద బూడిదరంగు గీతల పిల్లి!

ఆ పిల్లిని దిశ చూడడం అదే మొదటిసారి.

ఆ పిల్లి పిల్లిలా లేదు- చిన్నసైజు చిరుతపులిలా పొడవుగా వుంది.

పదినిమిషాల క్రితం తన రూంలో టేబుల్ మీదున్నది ఈ పిల్లేనా?

దిశ ముందుకు నడవడంతో టేబుల్ మీదున్న పిల్లి చెంగున కిందకు దూకింది.

సరిగ్గా అదే సమయంలో-

ఫోను గణగణమని మోగడంతో వెంటనే అందుకుంది దిశ.

“హలో… ఈజిట్ లేడీస్ హాస్టల్?”

“ఎస్… ప్లీజ్!”

“కెన్ ఐ  స్పీక్ టు మిస్ దిశ…”

ఆ గొంతును గుర్తుపటడంతో కెవ్వుమని అరిచి- “సార్… హౌ ఆర్యూ సార్? ఎక్కడ్నించి?” దిశ గొంతునిండా నిండిపోయిన ఉద్వేగం.

డోన్ట్‌వర్రీ! నువ్వు కంగారు పడుతుంటావనే ఫోను చేశాను. అయాం ఆల్‌రైట్!”

సత్యబ్రహ్మ గొంతులో కృతజ్ఞత.

“ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు సార్?” అడిగిందామె.

“భువనేశ్వర్ నుంచి. నీకీ విషయం చెప్పాలనీ, నీతో మాట్లాడాలని పావుగంట నుంచి ట్రై చేస్తున్నాను” చెప్పాడాయన.

“పావుగంట నుంచి ట్రై చేస్తున్నారా?” ఆశ్చర్యంగా భ్రమరాంబ వైపు చూస్తూ అడిగింది దిశ.

“ఎస్ బేబీ! మధ్యాహ్నం ప్లయిట్‌కి వస్తున్నాను. ఓ.కే?” ఫోను కట్టయ్యింది.

రిసీవర్ని క్రెడిల్ మీద వుంచుతూ అడిగింది దిశ..

“మన ఫోను ఉదయం నుంచీ ఖాళీగానే వుంది కదూ?”

“ఎస్ బేబీ!”

“మరి పావుగంట నుంచీ మన ఫోను అస్సలు మోగలేదట?”

“ఫోను మోగలేదా? మా డాలీ రిసీవర్ని డిస్ట్రబ్ చేసిందేమో”

డాలీ అంటే?”

“అదే దిశా! మా పిల్లి… ఆస్ట్రేలియా నుంచి మా కజిన్ వచ్చాడన్నాను కదూ! వాడు తెచ్చిందే అది. ఆస్ట్రేలియన్ రేర్ బ్రీడ్. చాలా అందంగా వుంది కదూ?” కిందనున్న డాలీని ఎత్తుకుని చేతితో రాస్తూ అంది భ్రమరాంబ.

తను పేపరు చూస్తున్నప్పుడు డాలీ ఫోను పక్కనే వుండడం తను స్పష్టంగా చూసింది.

డాలీ.. ది రేర్ బ్రీడ్… ఆస్ట్రేలియన్ క్యాట్!

డాలీ కళ్ళవైపు తేరిపార చూసింది దిశ-దిశను చూసిన డాలీ మ్యావ్ మ్యావ్‌మని అరిచింది.

ఆ అరుపు మామూలు పిల్లులు అరిచే అరుపులా లేదు. గుడ్లగూబ అరుపులా వింతగా, విచిత్రంగా వుంది.

కొన్ని క్షణాలయ్యాక-

చేతిలోని డాలీతో ముందుకు అడుగేసింది భ్రమరాంబ.

డాలీ కళ్ళలోకి సూటిగా, అయోమయంగా, అనుమానంగా చూసింది దిశ.

*                      *                      *                      *                      *

తిరుపతి…

ఇంకా పూర్తిగా చంద్రోదయం కాలేదు. ఏడుకొండల మీద విద్యుత్ దీపాల వెల్లువ, వెలుతురు ప్రవాహంలా వుంది.

కొండమీద నుంచి స్పీకరులోంచి వినిపిస్తున్న తిరుమలేశుని సుప్రభాత గీతికలు కొండ లోయల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఆ తిరుమల కొండలకు-

అయిదుకిలోమీటర్ల దూరంలోని పాపనాశనం తీర్ధం ఆ సమయంలో నిర్జనంగా వుంది.

ఆ పక్కన-

కొండమీద నుంచి దూకుతున్న జలపాతపు హోరు మృదంగ ధ్వనులను మరపింప చేస్తున్నాయి.

ఆ ప్రవాహ ధారల జలపాతం కింద-

ఒక యువకుడు కఠోర తపస్సు చేస్తున్న మునిలా మఠం వేసుకుని కూర్చున్నాడు.

పటిష్టమైన శరీరం, బలమైన కండలు, తెల్లటి దేహఛాయ.

అతడు ఏకాగ్రతతో ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తున్నాడు. ఆ మంత్రోచ్ఛారణ ఆ జలపాతవు హోరులో కలసిపోతుంది.

 

“క్షీణేంద్రి యస్య జీర్ణస్య, సంప్రాప్తోత్ర్కమణస్యచ

ఆస్తి జీవితు మేవా శాస్వాత్మా ప్రియతమో యతః”

 

(ఇంద్రియశక్తి క్షీణించినను, కరచరణాదుల శక్తి తగ్గిపోయినను, పండు ముసలి అయినను, మరణోన్ముఖుడై వున్నను ప్రతి వ్యక్తీ యింకా జీవించాలని కోరుతున్నాడు. కావున ప్రతి ప్రాణికి ఆత్మయే ముఖ్యం.)

ఆత్మకు సంబంధించిన ఆదిశంకరాచార్యుల ఉక్తిని మంత్రంగా పఠిస్తున్న ఆ యువకుని గొంతు గంభీరంగా వుంది.

పావుగంట గడిచింది.

చెట్ల ఆకుల్లొంచి దూసుకొస్తున్న వెన్నెల అతని శరీరం మీద పడి వింతగా మెరుస్తోంది.

కళ్ళిప్పి పరిసరాల వైపు చుట్టూ చూసి స్నానం ముగించుకొని వడ్డుకొచ్చాడు.

చీకటి పోదల్లోకి నడిచాడు.

ఆ పొదల మాటున జిప్సీ జీపు – ఆ జీపు ఫ్రంట్ సీట్లో వున్న టర్కీ టవల్‌ని తీసుకొని-

వల్లంతా తుడుచుకుని, వంటి మీద పంచెను తీసి వెనక సీట్లోంచి విసిరేసి-

బ్రీఫ్‌కేస్‌ని ఓపెన్‌చేసి, లైట్ బ్లూ కలర్ సూటును అందుకున్నాడు.

మరో అయిదు నిమిషాలు గడిచాయి.

డ్రస్ వేసుకున్నాక నాలుగువైపులా ఒకసారి చూసి జీపెక్కాడు.

ఇగ్నీషన్ కీ తిప్పాడు…

మరోక్షణంలో జీపు ఆ ప్రాంతం నుంచి బయటపడి, కొండలోదిగి, గంట తర్వాత ఒకచోట మలుపు తిరిగి తలకోన ఆడవులకేసి దూసుకుపోసాగింది.

ఆ యువకుడు అప్పుడప్పుడు ఆ జలపాతం దగ్గరికి వస్తాడు…. వెళతాడు.

ఆ యువకుని పేరు సవ్యసాచి…

రోడ్డు పాయింట్‌కు దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మార్గంలో పరుగులు తీస్తోంది జీపు.

సరిగ్గా నలభై నిమిషాలు గడిచాయి.

జీపు హెడ్‌లైట్ల కాంతిలో దూరంగా ఓ పురాతన భవనం మసక మసకగా కనిపిస్తోంది.  దానిముందు అప్రమత్తంగా పహరా కాస్తున్న గార్డ్స్.

ఆ భవనంలోకి సవ్యసాచి జీపు ప్రవేశించిన మరుక్షణం ఆ భవనపు గేట్లు మూసుకుపోయాయి.

 

*                      *                      *                      *                      *

 

మూడువైపుల, కొండలమధ్య రహస్య ప్రాంతంలో వున్న ఆ విశాల భవనం, ఒకప్పుడు కార్వేటి నగరం రాజుల విలాస మందిరం.

కానీ ప్రస్తుతం మృత్యువుతో సవాల్ చేయడానికి పూనుకున్న యువ మేధావుల పోరాట సీమ….

బిల్డింగ్ మొత్తం సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ చేయబడి వుంది. హాలు దాటి లోపలకు వెళితే విశాలమైన గ్లాస్ రూమ్. ఆ గ్లాస్ రూమ్‌లో తెల్లటి యూనిఫార్మ్స్‌లో యువ సైంటిస్టులు తమ పనుల్లో మునిగి వున్నారు.

సవ్యసాచి సారధ్యంలో వెలిసిన అదొక మరో ప్రపంచం…

కొన్ని యుగాలుగా మనిషికి, ప్రకృతికి జరుగుతున్న యుద్ధంలో, మానవ జీవితం పరిధిని పెంచడానికి శాస్త్రీయంగా కృషి జరుగుతున్న ప్రదేశం అది. ఆత్మలను ఆహ్వానించడానికి, శవాలను భద్రపరిచే క్రయోనిక్స్ సంస్థ ఆ తిరుపతి ప్రాంతలో వుందనే విషయం దేశంలోని శాస్త్రజ్ఞలకే కాదు, ప్రభుత్వానికి కూడా తెలీదు.

బయట ప్రపంచానికి వనమూలికల పరిశోధన కోసం అడవిలో వెలిసిన సంస్థ అది.

ఆ సంస్థ పేరు ‘మృత సంజీవని’

వనమూలికలతో ఆ సంస్థ ఎలాంటి ప్రయోగాలు చేస్తోందో తెల్సుకోవడానికి కొంతమంది పత్రికా విలేఖరులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటి తమ అసలైన పరిశోధనల విషయం పత్రికలకు తెలియకుండా సవ్యసచి వేయి కళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ప్రాచీన సంస్కృత సాహిత్యంలో అపారమైన పరిచయమున్న సవ్యసాచి పెద్ద డాక్టరని, అక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను తప్ప మరెవ్వరికీ తెలీదు. బయో కెమిస్ట్రీలో కూడా అతను గొప్ప నిపుణుడు. అమెరికా, ఇంగ్లాండ్ లోని అతి పెద్ద హాస్పిటల్స్‌లో కొన్ని సంవత్సరాలు పనిచేసి, అపారమైన అనుభవాన్ని గడించిన మేధావని కూడా చాలా తక్కువమందికే తెలుసు. మృత్యువుకి సమీపంగా వెళ్ళబోయిన ఎందరో రోగగ్రస్తుల్ని తన మేథస్సుతో బ్రతికించిన అతి గొప్ప అంకిత భావమున్న మానవతావాది అతను. అయిదేళ్ళ క్రితం మృతసంజీవని సంస్థ ప్రారంభ సమయంలో సవ్యసాచి ఒక్కడే! ప్రస్తుతం అతనితోపాటు అపారమైన అనుభవమున్న అయిదుగురు డాక్టర్లు, బయాలజిస్టులు, పేథాలజిస్టులు, సర్జికల్ ఆపరేటర్స్- మెడికల్ ఇంజనీర్స్- కంప్యూటర్ ఆపరేటర్స్- లెదర్ కంట్రోల్ టెక్నీషియన్స్- ఎలక్ట్రీషియన్స్- కెమికల్ ఇంజనీర్స్- వంటవాళ్ళు- డ్రైవర్స్- పనివాళ్ళు- ఆటోమోబైల్ మెకానిక్స్ – ఫైనాన్షియల్ కన్సల్‌టెంట్స్- సిస్టర్స్- కాంపౌండర్స్- ఫీల్డ్ వర్కర్స్ వున్నారు.

అందరూ కలిసి సుమారు 120 మంది దాక వుంటారు.

ఆ అందరి ధ్యేయమూ, పట్టుదలా ఒక్కటే… చనిపోయిన మనిషిని ఎప్పటికైనా తిరిగి బతికించే శాస్త్రానికి ఊపిరి పోయటం.

ఆ 120 మంది తమ వ్యక్తిగత సుఖాల్ని, ఆశల్ని, ఆశయాల్ని, ఆ సంస్థలో చేరేముందే త్రికరణశుద్ధిగా త్యాగం చేశారు. బయటి ప్రపంచంతో సంబంధాలను త్రుంచేసుకున్నారు.

చనిపోతే వారు కూడా అక్కడే క్రయోనిక్స్‌గా మారిపోతారు. మార్చబడతారు తప్ప- వేరే అలోచనే వారి మదిలోకి రాదు.

వారందరూ క్రమశిక్షణ గల సైనికుల్లా- తమ కమాండర్ డాక్టర్ సవ్యసాచి కనుసన్నలలో మెదులుతుంటారు. ఆయన మాటంటేనే వారికి వేదవాక్కు.

ప్రాణం వదులుకోవటానికైనా సిద్ధపడతారు తప్ప, తాము ఏపనిమీద నిమగ్నమై వున్నది చెప్పరు.

అదంతా మృతసంజీవని సైన్యం..

అదంతా ఏకవ్యక్తి సైన్యం..

అదంతా సవ్యసాచి సైన్యం..

సవ్యసాచి కోసం- ఆ సంస్థ కోసం వాళ్ళు ఏదైనా, ఎప్పుడైనా చేయటానికి సంసిద్ధంగా వుంటారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోటానికి అప్రమత్తంగా వుంటారు. బయటి ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఆయుర్వేదం పై రీసెర్చ్ చేస్తూ దాని తాలూకు వనమూలికల్ని సేకరించే బృందంగా కనిపిస్తారు.

విశాలమైన గ్లాస్ రూమ్ తెరుచుకుని లోపలకి అడుగుపెట్టాడు సవ్యసాచి. లోపల ఎడం ప్రక్కన వరసగా గ్లాస్ క్యూబిక్స్‌లో ఒకచోట ఒక యువ సైంటిస్టు కంప్యూటర్ ముందు కూర్చుని తన పరిశోధన వివరాలను కంప్యూటరులోకి ఫీడ్ చెస్తున్నాడు.

మరొక క్యూబ్‌లో రకరకాల అడవి పక్షుల మృత దేహాలను ఇంకొక సైంటిస్తు పరిశీలిస్తున్నాడు.

అదొక నిశ్శబ్ద వాతావరణం…

సవ్యసాచి ముందుకు నడిచి ఓ గ్లాస్‌క్యూబ్, గ్లాస్ డోరుని మునివేళ్ళతో తట్టాడు. లోపల –

తన పనిలో నిమగ్నమై వున్న డా!!విజేత తల తిప్పి చూసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే విజేత ముఖం సీరియస్‌గా వుండడంతో సవ్యసాచి డోర్ తెరుచుకుని లోపలకు అడుగువేశాడు.

“వాట్ హేపెండ్ డా!! విజేతా! ఎనీథింగ్ ప్రాబ్లం…?” సవ్యసాచి గొంతులోంచి వచ్చిన ఆ మాటకు వెంటనే జవాబు చెప్పలేకపోయింది డా!!విజేత

దీర్ఘంగా నిట్టూర్చిందామె. ఏ.సి. రూమ్‌లో వున్నా, ఆమె నుదుట మీద చెమట ట్యూబ్‌లైట్ వెలుగులో మిలమిలా మెరుస్తోంది.

డా!!విజేత ముందున్న విశాలమైన టేబుల్‌వైపు దృష్టి సారించాడు సవ్యసాచి.

*                      *                      *                      *                      *

రూమ్ మధ్యలో పొడవాటి టేబుల్ మీద రకరకాల గాజు వస్తువులున్నాయి.

డా!! విజేత ఒక పక్కనున్న కిడ్నీ మిషన్‌పై కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ లిక్విడ్ క్రిస్టల్స్‌ను సరిచేస్తోంది.

టెబుల్ మీద ఒక పక్కన రెండురోజుల క్రితం అడవి నుంచి తెచ్చిన తెల్లటి కుందేలు పిల్ల- ప్రస్తుతం ఆ కుందేలు మృతజీవి.

ఆ కుందేలుని బెడ్‌మీద పడుకోబెట్టింది డా!! విజేత.

దాని కడుపు, చాతీ నీట్‌గా షేవ్ చేయబడ్డాయి. ఆ భాగమంతా తెల్లటి బ్యాండేజీలతో కట్టబడి వుంది. ఆర్టిఫిషియల్ లంగ్ రెస్పిరేటర్‌తో ఆ కుందేలు ఊపిరితిత్తులు మెల్లగా పనిచేస్తున్నాయి.

రెండు మూడు టెస్ట్లు చేశాక..

“పల్మొనరీ ఎడెమా లేదు” అని చెప్పింది విజేత తల పక్కకు తిప్పకుండానే.

మెడికల్ టెర్నినాలజీలో పల్నొనరీ ఎడెమా అంటే శరీరంలో టెంపరేచర్‌ని పెంచేకొద్దీ, లంగ్స్ లో చేరే ద్రవాలు…

“ప్రాంకియాస్ లో డామేజ్, బ్లడ్ గ్రూకోజ్ పెరుగుతోంది. ఎలక్ట్రోలైట్స్ కూడా వింతగా ప్రవర్తిస్తున్నాయి” డా!! విజేత అంది తిరిగి.

“అంటే…” మరిన్ని వివరాల కోసం ప్రశ్న వేశాడు సవ్యసాచి.

“ఎలక్ట్రోలైట్స్ సరిచేశాను. గ్లూకోజ్ కూడా తిరిగి తగ్గుతోంది- ప్రాంకియాస్ విషయమై వర్రీగా వుంది” ఆమె మాట్లాడుతున్నా, ఆమె చేతివ్రేళ్ళు చకచకా కదులుతున్నాయి కొన్ని గంటలుగా ఆమె ఆ అపరేషన్‌ను నిర్వహిస్తోంది.

క్రితంరోజు ఫ్రిజ్‌లోంచి తీసిన కుందేలు బాడీ అది.

డాక్టర్ విజేత జంతువుల ఆపరేషన్లలో ఎక్స్‌పర్ట్. ఆమె స్పేషల్ సబ్జెక్టు కుక్కలు,పిల్లులు, కుందేళ్ళు, తదితర చిన్న జంతువులు.

 

*                      *                      *                      *                      *

మూడేళ్ళక్రితం హైద్రాబాద్‌లో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాన్ఫరెన్స్‌లో సవ్యసాచికి పరిచయమైంది డాక్టర్ విజేత.

ఏ కాన్ఫరెన్స్‌కి వెళ్ళినా, సవ్యసాచి సబ్జెక్టు ఒకటే.

‘క్రయోనిక్స్’

మనిషి మృత్యువును జయించగలిగే రోజు అతి త్వరలో వుందనేది అతని వాదన.

ఎలా? ఆ ప్రశ్నకు అతను జవాబు చెప్పలేకపోతున్నాడు ఒక డాక్టర్‌గా అతను. కొన్ని నెలల కాలంలో సాధించిన విజయాలు వైద్య రంగానికి తెలుసు. ఒక పరిశోధకుడిగా, మానవ జీవశాస్త్రాన్ని విశ్లేషిస్తున్న అతని ధీరీ పట్ల చాలామందికి సందేహాలున్నా, ఎవరూ అతనితో వాదించలేక పోవడానికి కారణం-

“హీ ఈజ్ ఎ డ్రీమర్… మాడ్  మాన్… బట్ క్వాలిఫైడ్ అండ్ ఇంటిలిజెంట్.”

ఆ కామెంట్‌ను విని నవ్వుకుంటాడు సవ్యసాచి.

ఆ రోజు కాన్ఫరెన్స్‌లో మనిషి శరీరంలోని టిష్యూలను చనిపోకుండా చేసే రోజు వస్తుంది. అని తన వాదనను బలంగా, సోదాహరణంగా వివరించాడు.

చాలమంది మనసులోనే నవ్వుకున్నారు. నిజంగా ఆ క్షణంలో సవ్యసాచి చాల బాధపడ్డాడు.

మేదావి ఎప్పుడూ వంటరివాడే!

క్యాంటిన్లో కాఫీ తాగుతున్న సమయంలో “హల్లో”

అన్న పిలుపుకి తలతిప్పి చూశాడు సవ్యసాచి.

ఎదురుగా సన్నగా, పొడవుగా ఒక అమ్మాయి.

“డాక్టర్ విజేత” తనను తను పరిచయం చేసుకుందామె.

“మీరు చెప్పిన క్రయోనిక్స్ థీరీకి నేను బలంగా ఆకర్షితురాలినయ్యాను” ఇంగ్లీషులో చెప్పింది విజేత

మెల్లగా నవ్వాడు డా!! సవ్యసాచి.

“మీకు అభ్యంతరం లేకపోతే మీతో కలిసి పనిచెయ్యడానికి నేను సిద్ధంగా వున్నాను” మళ్ళీ అందామె- ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు తనతో కలిసి పనిచెయ్యడానికి వస్తారని నమ్మకంతో కృషి చేస్తున్న సవ్యసాచి మనసులో ఏదో తెలియని సంతృప్తి.

“నాతో మీరు పని చెయ్యాలంటే, జీవితంలో చాల కోల్పోవాల్సి వుంటుంది” నెమ్మదిగా అన్నాడతను.

ఆ మాటకు ఆమె మాట్లాడని కనులే సమాధానం చెప్పాయి.

 

*                      *                      *                      *                      *

 

రెండు రోజుల క్రితం కుందేలు వెనుక కాళ్ళను ఈడ్చడం గమనించింది విజేత. అందుకు కారణం ఎంజియోగ్రామ్, ఎక్సరేలని  తెలియడానికి ఆమెకు క్షణకాలం కూడా పట్టలేదు.

కుందేలు వంట్లో బ్లడ్ ట్యూమర్, వెన్నెముకపై ఒత్తిడి తెస్తోంది దానివల్ల దాని కలికలు మొదటి రెండు రోజుల పరిశోధనల్లో తగ్గిపోయినట్టుగా తెల్సుకుంది ఆమె.

అంతవరకూ తమ లేబోరేటరీలో జరుగుతున్న పరిశోధనలు వేరు. ఆ కుందేలు పిల్ల పరిశోధన వేరు.

“కుందేలు బాడీని మైనస్ ఇరవై డిగ్రీల దగ్గర ఫ్రీజ్ చేశాను. యాంటీఫ్రిజింగ్ కోసం నాన్ సెల్యూలార్ బ్లడ్ సబ్‌ట్యూట్స్ ఎక్కించాను… చెప్పుతూ లేసర్‌బీమ్‌తో కుందేలు బ్లడ్‌లో వున్న ట్యూమర్ టిష్యూల్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది డా!!విజేత.

కార్లు తదితర వాహనలను రిపేరు చేసేవారు ఇంజన్‌ని ఆఫ్ చేసి పని చేస్తారు. కానీ సర్జరీలో- శరీరం లోపలి భాగాలన్నీ పనిచేస్తున్నప్పుడే ఆపరేషన్ చేయడం, అదీ ఓ శరీరంలో ప్రాణం వుండగా, సర్జరీకి మించిన గొప్ప అనుభవం ఏదీలేదు. పేషెంట్లతో పాటు డాక్టర్లకూ అదొక చెప్పలేని టెన్షన్.

మనిషికైనా, జంతువుకైనా, ఒకటే ఆపరేషన్ ప్రక్రియ, సునిశితంగా, అప్రమత్తంగా ఆ ఆపరేషన్‌ని చేస్తోంది డా!! విజేత.

నిశ్శబ్దంగా ఆ ప్రక్రియను చూస్తున్నాడు సవ్యసాచి.

ఈ ప్రక్రియలో ప్రధానమైన అంశం బ్రతికున్న కుందేలుని నిర్జీవంగా చెయ్యడం. నిర్జీవంగా చేసిన కుందేలును మళ్ళీ బ్రతికించడం!

కొన్ని నెలల తర్వాత మనిషి శవం మీద జరిగే ప్రయోగానికి అది ఒక నాంది మాత్రమే.

మృత్యువును ఎదుర్కోడానికి మనిషి పూర్తిచేస్తున్న విజ్ఞాన శంఖారావం అది!

అయిదు నిమిషాలు గడిచాయి-

కుందేలు బ్రెయిన్ వేవ్స్ ఆగిపోయాయి. అలాగే గుండె కూడా – మెడికల్ టర్మ్‌నాలజీలో దానినే మరణం అంటారు.

వెంటనే విజేత రివార్మింగ్ ప్రోసెస్‌ని మొదలెట్టింది ముందుగా మెంబ్రెయిన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ ప్రోసెస్ మొదలైంది.

క్షణంలో కణాలన్నీ అనుసంధించబడ్డాయి. రేడియో ఫ్రీక్వెన్సీ రివార్మింగ్ ద్వారా బాడీని ఇస్‌లోంచి తియ్యడం, యాంటీఫ్రీజింగ్ ప్రొటెక్షన్ కల్పించిన గ్లిసరాల్స్‌ని వెన్నకి తియ్యడం, చకచకా పనుల్ని చేస్తోంది విజేత.

కుందేలు బాడీని కంప్యూటర్ మానిటర్ మీద స్క్రీన్‌ని రెప్ప వేయకుండా చూస్తోంది ఆమె.

“టెంపరేచరు ట్వంటీ సెవన్ పాయింట్ సెవన్” చెప్పింది ఆమె.

కుందేలుపిల్ల తలకు కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రోడ్స్ స్క్రీన్ వైపు చూశాడు సవ్యసాచి.

సవ్యసచికి బయోకెమిస్ట్రీ గురించి తెలుసు. అందుకే అతని నరాల్లో రక్తచలనం హెచ్చింది.

కొన్నివందల ప్రయోగాలు ఇప్పటివరకూ విఫలమయ్యాయి. పరాజయం ఎప్పుడూ ప్రయోగానికి ఒక ఒడ్డు మాత్రమే. సముద్రంలో ఈదులాడుతునప్పుడు డీకొన్న ఒక అల పరాజయం.  అవతలి తీరానికి చేర్చడానికి మరో అల ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది!

సవ్యసాచి, అతనితో పాటు పనిచేసే వ్యక్తులు నమ్మే ఆశావహ సిద్ధాంతం అది.

ఎలక్ట్రోడ్ స్క్రీన్ మీద గీతలు మెల్లగా కదలడం ప్రారంభించడంతో సంతోషంతో చిన్నగా ఈల వేశాడు సవ్యసాచి ఒక్కసారి.

విజేత ముఖంలో ఆనందం పెల్లుబికింది.

ఆశ్చర్యంగా, ఆనందంగా సవ్యసాచి కళ్ళల్లోకి చూసి, తలతిప్పి మానిటర్ వైపు చూసిన ఆమె ముఖం చిన్నబోయింది.

మానిటర్ బ్లాంక్‌గా అయిపోయింది సడన్‌గా.

ఎలక్ట్రోడ్ స్క్రీన్ మీద గీతలు మాయమైపోయాయి….

రివార్మింగ్ సిస్టమ్ వైపు చూసిన విజేతకు ఏం జరిగిందో అర్ధం కావడానికి కొన్ని సెకన్ల సమయం పట్టింది.

అంతలోనే ఉత్సాహం…

అంతలోనే అంతులేని నిరాశ…

విజేతతోపాటు, సవ్యసాచి చూపులు కుందేలు గుండెమీదున్నాయి.

ఆ గుండె కొట్టుకోవడం మానేసింది.

అంటే.. కుందేలు… శాశ్వతంగా… దీర్ఘంగా చనిపోయింది.

తల పట్టుకుని విసురుగా కుర్చీలో కూలబడిపోయింది. డా!!విజేత.

ఈ ప్రయోగం మీద హాండ్రెడ్ పర్సంట్ నమ్మకం పెంచుకున్న విజేత తనను తానే అవమానించుకున్నట్లుగా బాధపడుతోంది.

సవ్యసాచి గాఢంగా నిట్టూర్చాడు. అతను కూడా కాస్తంత డిప్రెషన్ కి  లోనయ్యాడు.

కొన్ని నిమిషాలవరకు అతను మాటాడలేకపోయాడు.

తర్వాత…

విజేత భుజంమీద చెయ్యి వేసి-

“డోంట్ వర్రీ విజేత… నెక్స్ట్ టైమ్ బెటర్ లక్” నెమ్మదిగా అన్నాడు నెమ్మదిగా తలతిప్పి, సవ్యసాచి వైపు చూసింది విజేత.

అప్పటికే ఆ రూమ్‌లోంచి బయటకు రావడానికి వెనుదిరిగాడు సవ్యసాచి.

 

*                      *                      *                      *                      *

లేడీస్ హాస్టల్ విజిటర్స్ రూమ్‌లో కూర్చున్నారు సత్యబ్రహ్మ, దిశ.

తనవైపే ఆశ్చర్యంగా చూస్తున్న సత్యబ్రహ్మ మనోభావాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది దిశ.

తనను వెతుక్కుంటూ సత్యబ్రహ్మ వస్తాడని ఊహించలేదు దిశ. ఆ సంభ్రమంలోంచి తేరుకోడానికి ప్రయత్నిస్తోందామె.

ఆయన ఎవరో పూర్తిగా ఆమెకు తెలీదు.

“నీకు టెలీపతి తెలుసా?” ఆయన వేసిన ప్రశ్నకు తలెత్తి చూసిందామె.

“తెలీదు” వెంటనే జవాబు చెప్పింది దిశ.

“ప్లయిట్ సంఘటన గురించి అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగావ్?”

“తెల్సింది … చెప్పాను.”

“తెల్సిందా? ఎలా?!”

“జస్ట్ ఇన్ ఎ  డ్రీమ్… ఐకెన్ సీ ఎవ్విరిథింగ్” దిశ గొంతులో కాన్ఫిడెన్స్.

ఆ ప్లయిట్లో ప్రయాణం చేసే ఏ ఒక్కరికీ చెప్పకుండా నాకే ఎందుకు చెప్పావ్?”

“ఆ ప్లయిట్లో ప్రయాణం చేసే వ్యక్తుల్లో మీరే నాకు తెల్సు గనుక. అంతేకాదు! నాకు కలలో కనిపించే దృశ్యం నిజమవుతుంది గనుక. మీ ప్లైట్ షెడ్యూల్ మార్చమంటే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌వారు నమ్ముతారా? వింటారా? నష్టపోతారు. నన్నుపిచ్చిదానిక్రింద జమకడతారు. కాదంటారా?”

ఇద్దరి మధ్యా అగాధంలాంటి నిశ్శబ్దం.

“నీకు కలల ద్వారా తెలిసేది చెడేనా… మంచి కూడానా?”

“చెప్పలేను. మీకు జరిగింది మంచా, చెడా?” తిరిగి పశ్నించింది దిశ.

“మంచే జరిగింది. కానీ…నీ మాటల్ని నేను నమ్మలేదు. అప్పటికే ప్లయిట్ బయల్దేరడం వల్ల నేను బ్రతికిపోయాను.”

అంతవరకూ తను ఫోనుచేసి చెప్పడంవల్ల సత్యబ్రహ్మ జర్నీ వాయిదా వేసుకున్నాడని అనుకుంది. దిశ మదిలో అసంతృప్తి.

అయినా ఆమెలో రేగిన ఆ చిన్న అసంతృప్తి ముందు ఓడిపోవటానికి ఆమె సిద్ధంగా లేదు.

ఆయన ఆమెకేసి పరిశీలనగా చూస్తున్నాడు.

ఆమె మెదడులో ఆలోచనల వేగం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

ఉన్నట్లుండి ఆమె మెదడులో ఒక చురుకైన చిన్న కదలిక…

ఆ వెన్వెంటనే ఆమె ముఖంలో మెరుపు ప్రత్యక్షమయింది.

“నా ఫోన్ కాల్‌ని మీరు రిసీవ్ చేసుకున్న సమయంలో మీరేం చేస్తున్నారు?” దిశ ఎంతో ధీమాగా ప్రశ్నించింది.

ఆయన ఒక్కక్షణం ఆలోచించి-

“అప్పటికే బ్యాగేజీ సర్దుకొని రూమ్‌లోంచి బయటకు వెళ్ళబోతున్నాను” అన్నాడాయన. ఆ ప్రశ్న ఆమె ఎందుకేసిందో అర్థంకాక.

“ఆ తరువాత?”

” ఆ తరువాతేముంది? నీతో ఫోన్లో మాట్లాడి బయలుల్దేరాను.”

“ఫోన్లో నాతో ఎన్ని నిమిషాలు మాట్లాడి వుంటారు?”

“సుమారు ఇదు నిమిషాలు కావొచ్చు… అంతేనా?”

“కాదు.. ఏడు నిమిషాలు” అంది ఆమె స్థిరంగా.

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?” అడిగారాయన.

ఆమె వెంటనే తన వ్యానిటీ బ్యాగ్‌లోంచి చిన్న స్లిప్‌ని తీసి ఆయనకు చూపించింది.

అందులో ఏరోజు, ఎన్నింటికి, ఎన్ని నిమిషాలు, ఎక్కడికి మాట్లాడింది స్పష్టంగా అంకెల రూపంలో ప్రింటయి వుంది.

ఆయనొక్కసారి ఆమెకేసి సంభ్రమంగా చూసి అవునన్నట్లుగా తలూపారు.

“ఆ తరువాత ఏం చేశారు?” అడిగింది ఆమె.

“ఫోను పెట్టేసి క్రిందకెళ్ళి బిల్ పే చేసి టాక్సీ కోసం చూశాను”

“టాక్సీ రెడీగా వుందా?”

“లేదు”

ఆమె కళ్ళు ఒక్కసారి మెరిశాయి.

“ఎందుకు లేదు? హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్ళటానికి మీరు టాక్సీని కుదుర్చుకోలేదా?

“కుదుర్చుకున్నాను. అయినా నీ ఫోను మూలంగా ఏడు నిమిషాలు ఎక్కువసేపు రూమ్‌లోనే వుండిపోయాను. క్రిందకి వచ్చేసరికి పదినిమిషాలై వుంటుంది.  ఆ టాక్సీ డ్రైవరు ఆ పదినిమిషాల ఆలస్యాన్నే భరించలేక వెళ్ళిపోయాడు” అసంతృప్తిని దాచుకుంటూ అన్నాడాయన.

ఆమె మౌనంగా పెదాలు విడివడకుండా నవ్వింది.

“తరువాత?” తిరిగి ప్రశ్నించింది దిశ.

“ఆ తరువాతేముంది? ఆ విషయం రిసెప్షన్‌లో చెబితే వాళ్ళు ఫోన్ చేసి మరో టాక్సిని రప్పించారు. దానిలోనే ఎయిర్‌పోర్టు కెళ్ళాను.”

మరో టాక్సీ రావటానికి ఎన్ని నిమిషాలు పట్టింది?”

“సుమారు 20 నిమిషాలు… అంతా నీ మూలంగానే… లేదంటే… ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయ్యేవాడ్నే? అన్నారాయన ఒకింత నిష్టూరంగా.

ఆమె పైకే నవ్వేసింది.

ఆమె ఎందుకలా నవ్విందో సత్యబ్రహ్మకి ఇంకా అర్థం కాలేదు.

“నా మూలంగానే మీకు అలా జరిగిందా?” అడిగింది ఆమె.

“ఎస్! ముమ్మాటికీ నీ మూలంగానే జరిగింది.”

“ఆర్యూ ష్యూర్ సార్!” రెట్టించి అడిగింది దిశ.

“ఎస్… ఇయామ్ ష్యూర్.”

“టోటల్‌గా ఎంతాలస్యం జరిగింది?”

“మొత్తం ముప్పై నిమిషాలు…”

“అంటే .. నా పోన్ కాల్ మూలంగా మీరు అరగంట టైమ్ వృధా అయిపోయింది. అంతేనా సార్?”

“డోంట్ బీ సిల్లీ… ఇసే” ఒకింత అసహనంగా అన్నారాయన.

“ప్లైట్ డిపార్చర్ అయ్యాక ఎంతసేపటికి మీరు ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు?”

“అరగంట… సరిగ్గా ముప్పై నిమిషాలు… అదీ నీ మూలంగానే” అని అంటూనే ఆయనకేదో స్ఫురించగా ఒక్కసారి ఆయన ముఖంలో రంగులు మారిపోయాయి.

“ఎలా సేవ్ అయ్యారో…ఎందుకు సేవ్ అయ్యారో మీకిప్పటికైనా తట్టిందా సార్?” నవ్వుతూ కూల్‌గా అడుగుతున్న దిశకేసి దిగ్భ్రాంతిగా చూస్తుండి పోయాడు సత్యబ్రహ్మ.

ఆర్గ్యుమెంట్ ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఏ వైపుకి తనని డ్రైవ్ చేసింది!

“అందుకే సార్ మీరు సేవ్ అయ్యారు. నా కల మూలంగానే, నా ఫోన్ కాల్ మూలంగానే సార్ మీరు సేవ్ అయ్యారు. కాదంటారా?” చిన్నపిల్లలా కనిపిస్తున్న దిశ మోములో ఏవో దివ్య తేజస్సు కనిపించినట్లయింది సత్య బ్రహ్మకు.

కొద్ది క్షణాలు ఆయన చేష్టలుదక్కి ఆమెకేసి అలా చూస్తుండిపోయారు.

ఆ షాక్ నుంచి తేరుకోటానికి ఆయనకి చాలాసేపు పట్టింది.

తేరుకుంటూనే ఆమెకేసి కృతజ్ఞతగా చూశాడు. అప్పుడాయన చూపులు ఒక సాధారణ యువతిని చూస్తున్నట్టుగా లేవు. ఒక అద్భుతాన్ని, ఒక ప్రపంచ వింతని చూస్తున్నట్లుగా వున్నాయి.

నిజమే… తనకా సమయంలో దిశ ఫోనుచేయకుండా వుంటే… ఎంగేజ్ చేసుకున్న టాక్సీ వెళ్ళిపోయేది కాదు. వెళ్ళిపోకపోతే ఆ టాక్సీలోనే తను ఏయిర్‌పోర్టుకి వెళ్ళుండేవాడు-

వెళ్ళుంటే? వెళ్ళుంటే ప్లయిట్ మిస్ అయ్యేది కాదు. మిస్‌కాకపోతే?

“ఓ మైగాడ్! ఇట్స్ ఏ మిరాక్యులస్ ఎస్కేప్” పైకే పెద్దగా అన్నారాయన.

దిశ అప్పుడు సంతృప్తిగా, సంతోషంగా చూసింది ఆయనకేసి.

ఆ సంఘటన ఆయన మీద చాలా పెద్ద ప్రభావాన్నే చూపించిదా క్షణాన.

ఎందుకో దిశ ఎదురుగా మరికొంతసేపు కూర్చోలేకపోయారాయన. లేచి నిలబడ్డాడు ఆయన.

ఆయన ఒక నిరంతర ప్రయోగశీలి, తాత్విక దృక్పధానికి, సైన్సుకీ మధ్యన ఆయన వంతెన.

ఆయన చేస్తున్న ప్రయోగాలు ఈ ప్రపంచం తెల్సుకోడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతటి మేధావే జీవితంలో తొలిసారి ఒక తీవ్రమైన ప్రకంపనకి లోనయ్యాడు.

“ఈ విశ్వంలో ఎక్కడ ఏ సమయంలో ఎలాటి సంఘటన జరిగినా నీకు ముందుగా తెలుస్తుందా?” ఆ ప్రశ్న అయనెందుకు వెశాడో ఆయనికే తెలిఈదు.

కొన్ని ప్రశ్నలు అలాగే అప్రయత్నంగా వస్తాయి.

“మంచికి సంబంధించా? చెడుకి సంబంధించా?”

“రెంటికీ” జవాబు చెప్పడు సత్యబ్రహ్మ.

“చెప్పలేను ప్రొఫెసర్! ఒక విషయం మీద నా మనస్సు పూర్తిగా లగ్నమైనప్పుడు, ఆ పర్టిక్యులర్ పాయింట్ నన్ను మానసికంగా వెంటాడినప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు సింబాలిక్‌గా నాకు తెలుస్తాయి. ఆ పాయింట్లను నేను ఎనలైజ్ చేసుకుంటాను.”

“ఎన్నాళ్ళ నుంచి యిలా జరుగుతోంది?”

“నాకు తెలిసి పన్నెండేళ్ళ వయస్సు నుంచి డ్రీమ్స్ గుర్తుపట్టడం నేర్చుకున్నాను. అంతేకాదు ప్రొఫెసర్! ఇలా జరగొచ్చేమో అని నేను స్థిరంగా అనుకున్న సందర్బాలు, పర్‌ఫెక్టుగా నిజమైన ఉదాహరణలు కూడా వున్నాయి” నెమ్మదిగా చెప్పింది దిశ.

“ని…జ…o…గా?” సత్యబ్రహ్మ గొంతు తొట్రుపడింది.

“అందుకో ఉదాహరణ చెప్పగలవా… జ్ఞాపకం వుంటే” తిరిగి అడిగాడాయన.

“చెప్పగలను. నాకప్పుడు పదేళ్ళు. స్కూలు నుంచి ఇంటికొస్తున్నాను. సాయంత్రం అయిదు గంటల సమయం. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. మగవ్యక్తి శవం. ఆ శవాన్ని చూడగానే మా నాన్నకు ఇలా జరిగితే అన్న ఆలోచన… అసహజమైన ఆలోచన వచ్చింది. మరో పదినిమిషాల తర్వాత నేను ఇంటికెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్న సమయంలో మా పాలేరు వచ్చి చెప్పాడు… పది నిమిషాల క్రితం మీ నాన్న అకస్మాత్తుగా హార్టెటాక్‌తో చనిపోయాడని. నేనా విషయం ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. నాలో నేను కుమిలిపోవడం తప్ప. ఆరోజు నేను మా నాన్న శవాన్ని చూడలేదు కూడా” చెప్పి భారంగా వూపిరి పీల్చుకుంది దిశ.

“ఇలాంటి ఆలోచన మంచికి సంబంధించి ఎప్పుడయినా వచ్చిందా?”

“లేదు. ఆ తర్వాత నేను అలాంటి ఆలోచనలను బలవంతంగా అణచుకోడానికి చాల శ్రమపడాల్సి వచ్చింది.”

దిశ కళ్లలోకి సూటిగా చూశాడు సత్యబ్రహ్మ అతని మనసులో ఏదో అనుమానం.

ఆమె చెబుతున్న మాటల్ని ఎంతవరకు విశ్వసించాలో అతనికి తెలీడము లేదు.

“ఎప్పుడయినా సైకాలజిస్ట్ దగ్గరకుగానీ, సైక్రియాస్టిక్ దగ్గరకు గానీ వెళ్ళావా?” సాలోచనగా అడిగాడాయన.

ఆ మాటకు దిశకు కోపం వచ్చింది. అయినా తమాయించుకుని- “లేదు… అయాం నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిసీజ్ మిస్టర్ సత్యబ్రహ్మ!”

బేబీ! నేను నిన్ను అనుమానించడం లేదు. నీలోని శక్తిని విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాను” అని అనునయంగా అంటూ ఆ క్షణంలోనే సత్యబ్రహ్మ ఒక నిర్ణయాని కొచ్చాడు

వెంటనే ఆయన టాపిక్ మార్చాడు.

“నీకు క్రయోనిక్స్ సంస్థ అంటే ఇష్టమా?”

“ఎస్ ప్రొఫెసర్” వెంటనే జవాబిచ్చిందామె.

“ఆ సంస్థ గురించి తెల్సుకుని ఏం చేస్తావ్?”

“వాళ్ళలో నేనూ ఒక భాగస్వామిని అవుతాను”

“ఎందుకు?”

“క్రయోనిక్స్ సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను కనుక.”

“అంటే?”

“ఆత్మ పూర్వ శరీరాన్ని వెతుక్కుని వస్తుంది. అందుకో నిజమైన ఉదాహరణ చెబుతున్నాను. 1969 ఆగస్టు 10వ తేదీ ఆంధ్రపత్రిక న్యూస్ పేపర్ చూడండి. బెంగళూరుకు చెందిన రెండేళ్ళ పసిబాలుడు రవికిరణ్ నూరు రాగాలను ఆలపించి ఏ రాగం ఏమిటో చెప్పాడు. ఆ రాగం పేరు చెప్పడమే కాదు ఏ రాగానికి ఏ స్వరాలు వుండాలో కూడా చెప్పాడు. ఈ బాలుని తండ్రి ఎస్. నరసింహం గోటు వాద్యంలో విద్వాంసుడు. అయితే ఆ పసికందుకు అంతటి జ్ఞానం ఎలా వచ్చిందో అయన చెప్పలేకపోయాడు. కానీ ఆ బాలుని తాత నారాయణ అయ్యంగర్ మహా విద్వాంసుడు. ఆ తాత యొక్క జీవాత్మ మనవడిలో ప్రవేశించింది. అది మీకు తెలుసనుకుంటాను. పిల్లలకు తమ తల్లిదండ్రుల పేర్లు వుంచడానికి కారణం ఇది ఒక కారణం కావచ్చేమో.”

నిజానికి అలాంటి సంఘటనలు సత్యబ్రహ్మకు చాల తెలుసు.

హాస్టల్ సర్వెంట్ రెండు కప్పులతో టీ తెచ్చి వాళ్ళిద్దరికీ యిచ్చి వెళ్ళిపోయింది.

సత్యబ్రహ్మ టీ సిప్ చేస్తున్నాడు.

సరిగ్గా అదే సమయంలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఆ రూంలోకి తోకాడించుకుంటూ వచ్చింది వార్డెన్‌కు చెందిన ఆస్ట్రేలియన్ క్యాట్ డాలీ.

తాగిన టీ కప్పును పక్కన పెట్టి-

ఆ డాలీని అందుకుంది దిశ.

దానివైపు సీరియస్‌గా చూశాడు సత్యబ్రహ్మ.

“ఆస్ట్రేలియాలో పిల్లులకు పునర్జన్మలున్నాయని నమ్మకం ఎక్కువనుకుంటాను కదూ?” అన్నాడాయన అసంకల్పితంగానే.

“అవును… అక్కడ కొన్ని తెగల్లో పిల్లుల్ని పూజిస్తారు. పిల్లుల పెంపకం విషయం వారు ప్రత్యేక శ్రద్ద వహిస్తారు” చెప్పింది దిశ.

“క్రయోనిక్స్‌కి ఈ పిల్లి బాగా వుపయోగపడుతుందనుకుంటా…”

అప్రయత్నంగా అయన నోటి నుంచి వచ్చిందా మాట.

ఆయనలా ఎందుకన్నారో తెలీక విస్తుపోయి చూసింది ఆయనవైపు దిశ.

 

*                      *                      *                      *                      *

 

సరిగ్గా అదే సమయంలో-

తిరుపతికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో వున్న తలకొన కొండల్లో-

క్రయోనిక్స్‌కి చెందిన ‘మృతసంజీవని సంస్థలో’-

ఒక ప్రత్యేక సమావేశం జరుగుతోంది.

మృతసంజీవని ఉద్యమ సారధి సవ్యసాచి ఒక విశాలమైన టేబుల్ ముందు కూర్చున్నాడు.

అతనికెదురుగా ఆ సంస్థలో పనిచేస్తున్న అయిదుగురు డాక్టర్లు కొంతమంది బయాలిజిస్టులు కూర్చున్నారు.

వారి చేతుల్లో అవసరమైన ఫైల్స్ వున్నాయి.

“రెండు గంటల క్రితం మన మరొక పరిశోధన ఫెయిలైంది. మీకు తెల్సనుకుంటాను” ఆ అయిదుగురిలో చివరగా కూర్చున్న డా!! విజేతను చూస్తూ అన్నాడు సవ్యసాచి.

ఆ మాటకు ఎవరూ ప్రతిస్పందించలేదు.

తన ముందున సిమెంటు కలరు ట్రేలోంచి ఒక బ్రౌన్ కలర్ కవర్ని తీసి-

“మైడియర్ ఫెండ్స్! ఎన్నాళ్ళనుంచో కంటున్న మన స్వప్నాలు నిజం కావడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ మెడికల్ రిసెర్చి సంస్థ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ క్రయో బయాలజీ మన మృతసంజీవని సంస్థను అధికారికంగా గుర్తించింది. ఆ సంస్థకు చెందిన ప్రొఫెసర్ స్టీఫెన్ హారిస్ అతి త్వరలో మన సంస్థను విజిట్ చేయనున్నారు…” ఆగాడు సవ్యసాచి.

ఆ వెన్వెంటనే చప్పట్లతో ఆ హాలు మార్మోగిపోయింది.

ఆ బ్రౌన్ కవరు పక్కన పెట్టి సొసైటీ ఫర్ క్రయోబయాలజీ సంస్థ పంపిన ఆరు పేజీల లెటర్ని చదివాడు సవ్యసాచి.

లెటరు చదవడం పూర్తయ్యాక అందరి ముఖాల్లోకి చూశాడతను.

“అంటే మనం ఇకనుంచీ జంతువుల మీద, పక్షుల మీద చేసే రిసెర్చిలను పక్కన పెట్టెయ్యాలన్న మాట” డా!! నవనీత్ అన్నాడు.

“ఎస్ డాక్టర్స్! అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోని క్రయోనిక్స్ సంస్థలు జంతువుల మీద చేసే పరిశోధనలను ఎప్పుడో పక్కకు పెట్టేశాయి. ఆ సంస్థలు తమ ఉద్యమ వ్యాప్తి కోసం రహస్యంగా క్రయోనాట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి.

ఒక వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి శవాన్ని భవిష్యత్ జీవాత్మ ఆవహనం కోసం మనం భద్రపరచుకోవాలి. అందుకోసం యీ సిద్ధాంతాన్ని మనం మరింత విరివిగా ప్రచారం చెయ్యాలి” చెప్పాడు సవ్యసాచి.

“సైన్సు బాగా ఎదిగిన అమెరికాలాంటి దేశాల్లో తమ శవాల్ని భద్రపరచడానికి వప్పుకుంటారుగానీ మనదేశంలో అందులోనూ మన రాష్ట్రంలో ఎవరు ముందుకొస్తారు సార్? ప్రతి క్షణం మూఢనమ్మకాల్ని నమ్మే మన ప్రజలు… ఇంకా అంత స్థాయికి ఎదగలేదు డాక్టర్…!” డా!! విజేత చెప్పింది.

డా!! విజేత, డా!! నవనీత్ క్రయోనిక్స్ మృతసంజీవని సంస్థలో పార్ట్ టైమర్స్‌గా పనిచేస్తున్నారు.

వాళ్ళిద్దరూ తిరుపతి రూయా ఆస్పత్రిలో అఫీషియల్‌గా డాక్టర్స్, మిగతా ముగ్గురూ మెడిసిన్ చేశాక డైరెక్టుగా మృతసంజీవని సంస్థలో ఫుల్ టైమర్స్‌గా చేరారు. అలాగే బయాలజిస్ట్‌లు కూడా ఆ సంస్థలో టైమర్స్-

“ప్రయోగాలెప్పుడూ మూఢవిశ్వాసాలకు ఎదురుగానే వుంటాయి  డా!!విజేతా.. ఎవరో ఒకరు మన ప్రయోగాలకు సహకరించకపోరు.. సహకరించక పోయినా మనం తలచుకుంటే శవాలను సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఏమంటారు?”

సవ్యసాచి మాటలు అక్కడి వాళ్ళకు పూర్తిగా అర్థం కాలేదు.

“ఎలా…?” డా!! వంశీ ప్రశ్నించాడు.

“శవాల్ని దొంగిలించుకుని తీసుకొస్తాం”  టక్‌మని జవాబు చెప్పాడు సవ్యసాచి.

“మిస్టర్ సవ్యసాచీ! మామూలు శవాల్ని తీసుకురావడానికి ఏం యిబ్బంది లేదు. ప్రాణం పోయిన శవాన్ని కొన్ని గంటల లోపుగానే మనం చిల్లర్‌గా మార్చి (క్రయోని పరిశోధనలకు అనువుగా శవాన్ని మార్చడాన్ని చిల్లర్ అని అంటారు. శరీరంలోని టిష్యూలు దెబ్బ తినకుండా చేయడం యిందులో ప్రధానమైన అంశం.) తీసుకురావాల్సి వుంటుంది. ఇదంతా రహస్యంగా జరగాలి. ఎక్కడ ఏ మాత్రం అప్రమత్తంగా లెక్కున్నా, పోలీసులకు మనం దొరికిపోతాం” డా!!సమీర్ అన్నాడు.

“ఎస్ యూ ఆర్ కరెక్ట్ డా!!సమీర్!  మానవజాతిని మృత్యువు నుంచి రక్షించడం కోసం అవసరమైతే మనం దొంగలుగా, క్రిమినల్స్‌గా మారాల్సి వుంటుందేమో… కానీ మిస్టర్ సమీర్ డోంట్‌వర్రీ.

మన సిద్ధంతాన్ని ప్రోపగండా చెయ్యడం కోసం మన ఉద్యమాన్ని మరింత విస్తృతం చెయ్యడం కోసం మనకు కొంతమంది స్టాఫ్ కావాలి. అందుకే మరికొంతమందిని మన సంస్థలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను.”

“మన ఆశయంతో ఏకీభవించేవారు దొరుకుతారని నమ్మకం వుందా?” డా!!నవనీత్ ఆడిగాడు.

“మీరు నాకు దొరకలేదా…ఆలాగే…” నవ్వుతూ అన్నాడు సవ్యసాచి. అందరూ కొద్దినిమిషాలసేపు మౌనంగా ఆలోచిస్తూండిపోయారు.

రెండు నిమిషాల తర్వాత సవ్యసాచి అన్నాడు-

“డా!!వంశీ! ఏ హాస్పటల్‌లోనైనా అనాధ శవాలను ఏం చేస్తారు?”

“మున్సిపాలిటీకి అప్పగిస్తారు సార్!”

“ప్రస్తుతం మనం అనాధ శవాలను సంపాదించడానికి ప్రయత్నం చెయాలి. ఆ రెస్పాన్స్‌బిలిటీ మీది. ఏమంటారు?”

“ఎస్ మిస్టర్ సవ్యసాచీ!” సవ్యసాచి నోటినుంచి వచ్చిన మాటను ఆర్డర్‌గా స్వీకరించే క్రమశిక్షణ క్రయోనిక్స్ మృతసంజీవని సంస్థలో వుంది.

డాక్టర్లు అందరూ లేచి నిలబడ్డారు.

“ఇక నుంచీ మనం ఫండ్స్ గురించి భయపడాల్సిని పనిలేదు.. క్రయోబయాలజీ సంస్థ సెవెంటీ ఫైఫ్ పర్సంట్ ఫండ్స్ ని  అందించబోతోంది…” మీటింగ్ చివరలో కావాలనే అన్నాడు సవ్యసాచి ఆనందంగా.

సవ్యసాచిని కంగ్రాచ్యులేట్ చేసి డాక్టర్లు, బయాలజిస్టులు బయటి కొచ్చేశారు.

డ్యూటి అయిపోయాక వారిని తిరుపతికి పంపించడానికి అవసరమైన ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అక్కడుంది.

తనూ వెళ్ళడానికి నిలబడింది డా!!విజేత

“మిస్ విజేతా!”

తల తిప్పి చూసిందామె.

“మీకో ఇంపార్టెంట్ ఎసైన్‌మెంట్‌ను అప్పగించబోతున్నాను”  చెప్పి తన చేతిలోని ఫైల్‌ను ఆమెకు అందించాడు సవ్యసాచి.

ఆ ఫైల్లో మూడే మూడు బ్రౌన్ పేపర్లున్నాయి. వాటిమీద ఇంగ్లీషులో టైప్ చేసిన మేటర్ వుంది.

ఆ మేటర్‌ని గబగబా చదివింది విజేత.

“మిస్ విజేతా! దిసీజ్ వెరీ కాన్ఫిడెన్షియల్ మేటర్. సోసైటీ ఫర్ క్రయోబయాలజీ సంస్థ… రహస్యంగా ఆస్ట్రేలియన్ కేట్స్‌మీద ప్రయోగాలు చేస్తోంది.

అక్కడి ప్రయోగాలు సెవెన్టీ ఫైవ్ పర్సంట్ విజయవంతమయ్యాయి. మనమూ అలాగే ఆస్ట్రేలియన్ కేట్స్ మీద ప్రయోగం చేసి, విజయాన్ని సాధించాలి. శవాల్ని క్రయోనాట్స్‌గా మార్చి చేసే ప్రయోగానికి ముందు ఆస్ట్రేలియన్ కేట్స్‌మీద మన ప్రయోగం జరగాలి. ఆ ఎక్స్‌పరిమెంట్ ముందు భవిష్యత్ ఆశయానికి పునాది అవుతుందని నా నమ్మకం…”

“ఎస్ సర్! ఆస్ట్రేలియన్ కేట్‌ను మనం బ్రతికించగలిగితే… శవాన్ని కూడా మనం బ్రతికికించగలం. వాటి ప్రాసెస్ ఒకటే…” ఇంతవరకూ ఈ ఆలోచన తనకెందుకు రాలేదోనని ఒక్కక్షణం తనని తాను ప్రశ్నించుకుంది డా!విజేత.

“ఈ ఎక్స్‌పరిమెంట్ కోసం కొన్ని రోజులు మీరు ప్రత్యేక్షంగా కేటాయించగలగాలి.”

“ఎస్ డాక్టర్ మరి ఆస్ట్రేలియన్ బ్రీడ్?” ప్రశ్నించిందామె.

“ఇందుకు వారం రోజులుగా అన్వేషణ జరుగుతోంది మిస్ విజేత. నా ఫ్రెండ్ ఇదే పనిమీద హైదరాబాద్‌లో వున్నాడు. హైదరాబాద్‌లో ఒక నవాబు దగ్గర రెండు ఆస్ట్రేలియన్ కేట్స్ వున్నాయని తెల్సింది. ఇవాళో రేపో మన లేబరేటరీలో ఆ ఆస్ట్రెలీయన్ కేట్ వుండగలదని నమ్ముతున్నాను.”

“నేను నా ప్రయత్నంలో వుంటాను డా!!సవ్యసాచి…!” ఏ.సి.రూమ్‌లోంచి బయటికొస్తూ అంది విజేత.

సవ్యసాచి టెలిఫోను రిసీవరు అందుకున్నాడు.

ఆ ఫోను హైదరాబాద్‌లోని ఒక్ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి పేరు రషీద్!

 

*                      *                      *                      *                      *

 

“క్రయోనిక్స్ సంస్థ ఎక్కడుంది ప్రొఫెసర్?”  అడిగింది దిశ ప్రొఫెసర్ సత్యబ్రహ్మ వెనక గేటు వరకూ వస్తూ.

“మిస్ దిశా! నువ్వెప్పుడు వెళ్ళాలనుకుంటావో ఒకరోజు ముందు చెప్పు. వారం రోజులపాటు నీ పి.హెచ్.డి. వర్కు వుందన్నావుగా” అన్నాడాయన.

“అవును. సరిగ్గా వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తాను” తన చేతిలోని పిల్లిని వేళ్ళతో నిమురుతూ అంది దిశ.

“ఒకసారి నువ్వా సంస్థలోకి వెళ్ళావంటే కొన్నేళ్ళపాటు ఆ సంస్థ నుంచి బయటకు రాలేవు. వాళ్ళకు ఏవో రూల్సూ, రెగ్యులేషన్స్, కాంట్రాక్టులు వున్నాయి.”

“నేను క్రయోనిక్‌గా మారేవరకు రాను… సరేనా…” సీరియస్‌గా జోక్ వేసింది.

ఆయన చిన్నగా నవ్వాడు.

సత్యబ్రహ్మ గేటు ముందున్న జీపెక్కి స్టార్ట్ చేశాడు. జీపు ముందుకు కదిలింది. కానీ ఆయన ఆలోచనలు మాత్రం వింతగా కనిపిస్తున్న ఆస్ట్రేలియన్ కేట్ డాలీమీద వున్నాయి.

సరిగ్గా ఒక గంట తర్వాత దిశ ఊహించని సంఘటన ఒకటి అకస్మాత్తుగా జరిగింది.

ఒక అపరిచిత వ్యక్తి ఆ హాస్టల్‌కి వచ్చి-ఏదో అమ్మాయి పేరు చెప్పి, దిశను మాటల్లో పెట్టాడు.  దిశ మాటల్లో పడి డాలీని మర్చిపోయింది. ఆమె గమనించకుండా ఆ వ్యక్తి ఆమె చేతిలోని పిల్లిని నిమురుతున్నట్లు నటిస్తూ, గట్టిగా దాన్ని గిల్లాడు. అంతే సడెన్‌గా ఆమె చేతుల్లోని పిల్లి కిందకు దూకి రోడ్‌మీద అడ్డంగా పరుగెత్తడం ప్రారంభించింది.

రెండు వైపుల నుంచీ నలభై కిలోమీటర్ల వేగంతో వస్తున్న వాహనాలు…

“డాలీ! డాలీ!” అరుస్తూ ముందుకు పరుగెత్తింది దిశ.

వాహనాలవైపు చూడకుండా రోడ్డుకడ్డంగా వెళ్ళిపోతున్న దిశ చూసి సడన్‌గా బ్రేక్ వేసిన ఓ మారుతీకారు అదుపు తప్పి, పక్కనే వెళుతున్న సైకిల్‌ని ఢీకొంది…

ఆ సైకిల్ ఎదురుగా వస్తున్న లారీ ముందు చక్రానికి ఢీకొని అంతెత్తున ఎగిరింది. ఆ సైకిల్‌మీద వ్యక్తి అరుచుకుంటూ కిందపడిపోవడం… సర్ సర్ సర్‌మని ఒక్కొక్క వెహికల్ ఆగడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ కన్‌ప్యూజన్….

ఆ గందరగోళానికి లారీ వెనుక స్పీడ్‌గా వస్తున్న మారుతీకారుని కంట్రోల్ చెయ్యడానికి డ్రైవింగ్ సీట్లోని వ్యక్తి ప్రయత్నించి సడన్‌బ్రేక్ వెయ్యబోయి…

ముందు చక్రాలవైపు ఎదురుగా వస్తున్న పిల్లిని చూసి స్టీరింగ్‌ను పక్కకు తిప్పబోయాడు.

కానీ అదే సమయంలో…

ఆ కారు చక్రాల కింద ఆ ఆస్ట్రేలీయన్ కేట్ డాలీ పడి ఆఖరిసారిగా అరిచింది. అంతా కొద్దిక్షణాల్లో ఒక మాయలా జరిగిపోయింది.

ఆ సమయంలో ఆ అరుపు ఏ ఒక్కరికీ వినిపించలేదు.. కారు డ్రైవర్‌కు తప్ప.

ఆ కారు డ్రైవర్ పేరు రషీద్. ఆ కారుకి ఓనర్ కూడా అతనే. గబుక్కున కారు దిగి ముందు చక్రాల దగ్గరకొచ్చాడు.

జువాలజిస్ట్ అయిన రషీద్‌కి ఆ పిల్లిని చూడగానే తెలిసిపోయింది.

అదెక్కడిదో.. ఏ జాతికి చెందిందో దాని ప్రాణం ఇంకా పూర్తిగా పోలేదు.

రెండు చేతులతో ఆ పిల్లిని తీసుకుని వెనక్కి నడిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇగ్నీషన్ కీ తిప్పాడు.

కారు స్టార్టయింది.

ట్రాఫిక్ మధ్యలోంచి రేస్ హార్స్‌లా ఆ మారుతి ముందుకు దూసుకు పోతోంది.

ఆ కారు ఆ ప్రాంతం నుంచి కదిలిన రెండు నిమిషాలకు అక్కడ కొచ్చింది దిశ.

రోడ్డు క్రాస్ చేసిన ఆ పిల్లి ఆ వైపు రావడం చూసింది. అంతలోనే పిల్లి ఎటు మాయమైందో ఆమెకు అర్థంకాలేదు. కంగారు నణచుకుంటూ నాలుగు వైపులా చూసింది. అప్రయత్నంగా ఆమె చూపులు నేలమీద పడ్డయి.

కింద నేలకంటుకున్న పిల్లి రక్తం. ఆ రక్తానికి అంటుకున్న గోధుమరంగు వెంట్రుకలు.

కంగారుగా కిందకు వంగిందామె.

 

*                      *                      *                      *                      *

 ఇంకా వుంది…….

 

1 thought on “సంభవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *