January 29, 2023

“అన్నదమ్ములు-అనుబంధం” – చారిత్రక సాహిత్య కథామాలిక – 3

రచన: మంథా భానుమతిmantha bhanumathi
పదవ శతాబ్దం..

సబ్బినాడులో (నేటి నిజామాబాద్ ప్రాంతం).. వేములవాడ పట్టణం. రాష్ట్రకూట చక్రవర్తులు దక్షిణా పధాన్ని ఏలుతున్నారు. వారి సామంతులైన చాళుక్యులు వేములవాడని ప్రాంత రాజధానిగా అభివృధ్ధి చేస్తూ, వేములవాడ చాళుక్యులుగా పేరు గాంచుతున్నారు.
కృష్ణా తీరం నుంచి వలస వచ్చిన భీమనప్పయ్య గోదావరి తీరంలో ఉన్న బోధన్ పట్టణం నుంచి, తన పాఠశాలని వేములవాడకి తరలించి, సంస్కృతాంధ్ర, కన్నడ భాషల్లో విద్యా బోధన చేస్తున్నాడు.
భీమనప్పయ్య మొదటి భార్య పరమపదించి సంవత్సరం దాటింది. రెండవ భార్య వబ్బెణబ్బ, సవతి కొడుకు పద్మప్పని స్వంత బిడ్డలాగ చూసుకుంటోంది. చూపరులకు ఆమె బిడ్డేనేమో అనిపిస్తుంది. భవిష్యత్కాలాని కొచ్చేసరికి అందరూ పద్మప్పని వబ్బెణబ్బ కొడుకుగానే గుర్తించారు.
జైన మతస్థుడై, ఆ మత ప్రాచుర్యానికి ఇతోధికంగా తోడ్పడుతున్న భీమనప్పయ్య, తన రెండవ కుమారుడికి ’జినవల్లభుడు’ అని పేరు పెట్టాడు.. ఆ పసివాడి కన్నతల్లి వబ్బేణబ్బ సంతోషానికి అవధి లేదు.. ఎందుకంటే, ఆమె వివాహం భీమనప్పయ్యతో జరిపించడంలో ఆమె తండ్రి సింగన జోస్యుల ముఖ్యోద్దేశమే అది!
ఆరోజు భీమనప్పయ్య, పట్టణానికి వచ్చిన చక్రవర్తిని కలవడానికి తెల్లవారు ఝామునే వెళ్లాడు. శిష్యులందరికీ వల్లించవలసిన పాఠ్యాంశాలు ముందురోజే చెప్పి, సెలవు ప్రకటించాడు.
సూర్యోదయం అయి ఒక ఘడియ దాటింది. ఆదిత్యుని కిరణాలు తమకి ఎదురే లేదన్నట్లు, ఇంటి లోపలికి చొచ్చుకుని వచ్చి, అలికి ముగ్గులేసిన నేల మీద రంగు రంగుల కాంతులతో పరావర్తనం చెందుతున్నాయి. కాసేపు ఆ కాంతులని పట్టుకోవాలని ప్రయత్నించిన జినవల్లభుడు, నెమ్మదిగా లేచి, ముందుకి నడిచాడు.
బుడి బుడి అడుగులు వేస్తున్న జినవల్లభుడు ఠక్కున ఆగిపోయాడు. విప్పారిన కన్నులతో వీధి అరుగు మీద కూర్చుని వ్యాకరణ సూత్రాలను వల్లె వేస్తున్న అన్నగారిని చూసి రెండు చేతులతో ’విద్దెం’ చేస్తూ పిలిచాడు. కళ్లు మూసుకుని ఏకాగ్రతతో తన పనిలో లీనమైన పద్మప్ప వినిపించుకోలేదు.
పసుపు రాసి.. తెల్లని సున్నం, ఎర్రని కుంకంతో రంగు రంగుల తీగెలు, పువ్వులతో అలంకరించిన గడపని నిస్సహాయంగా చూశాడు ఏణ్నర్ధం వయసున్న జినవల్లభుడు. ఇంచుమించుగా తనంత ఎత్తుంది ఆ గడప. నాలికతో సున్నం బొట్టుని రాసి చప్పరించాడు. అన్న కనిపిస్తూనే ఉన్నాడు.. కానీ అందుకోడానికి లేదు. కాలి గజ్జెలు శబ్దం చేశాడు.
ఊహూ.. అకుంఠిత దీక్షతో అర్ధం చేసుకుంటూ కంఠతా పడుతున్న పాఠాల మధ్య ఇంకేదయినా ఆనుతుందా! ఇది పూర్తి చెయ్యగానే అజ్ఞాన తమోనీకారుడైన తండ్రిగారు, నృపతుంగ చక్రవర్తి విరచితమైన చందోగ్రంధం.. “కవిరాజమార్గం” నేర్పిస్తానన్నారు. అప్పుడే కవిత్వం అల్లడానికి సులభమవుతుంది. ఎనిమిదేళ్లు నిండిన పద్మప్పకి ఎంత త్వరగా పెద్దయిపోదామా అని ఉంది.
చిన్నగా ఏడుస్తూ, రెండు చేతులతో కళ్లు నులుముకుంటూ, కష్టపడి ఎత్తు తక్కువగా ఉన్న వంటింటి గుమ్మం దాటుకుని, చల్ల చిలుకుతున్న అమ్మ ఒడిలో దూరాడు.
“ఏమయింది జిన్నా?” కవ్వానికి అంటుకున్న వెన్న ముద్దని పాపడి నోట్లో పెడుతూ అడిగింది వబ్బెణబ్బ.
“అన్న..అన్నా..” అంటూ వీధి కేసి చూపించాడు జినవల్లభుడు.
“ఇంకొక రెండేళ్లాగు. అన్నతో కలిసి నువ్వు కూడా చదువుకోవచ్చు.. ఆడుకోవచ్చు. ఇప్పటికి నే నాడిస్తా కదా! అవునూ.. సున్నం పెళ్ల తినేశావా? అల్లరి కన్నా! నీకు కావల్సినంత వెన్న పెడతా కదా!” కొడుకు చెయ్యి, మూతి కడిగి.. చల్ల కుండ లోపల పెట్టి, జిన్నని ఎత్తుకుని వీధిలోకి వచ్చింది వబ్బెణబ్బ.
దీక్షగా చదువుతున్న పద్మప్పని చూసి, చిన్న కొడుకుని కిందికి దింపి, గడ్డం కింద అరచెయ్య పెట్టుకుని మురిసిపోతూ చూసింది.
“పద్మప్పన్నా! ఫలహారం చేద్దువురా..” ప్రేమగా పిలిచింది.
“పంపన్నా! దా..” చిన్నారి జినవల్లభుడు అన్నగారిని అమ్మ పిలిచినట్లే పిలిచి సిగ్గుతో అమ్మ కుచ్చిళ్లలో తల దాచుకున్నాడు.
మొదటిసారి మూడక్షరాల మాట.. అదీ తనని పిలుస్తూ.. పలికిన తమ్ముడ్ని చూసి పద్మప్పన్న సంబరంగా లేచి వచ్చి తమ్ముడ్ని ఎత్తుకున్నాడు. వబ్బేణబ్బ రెండు చేతులతో ఇద్దరి చెంపలూ సృజించి, నుదుటికిరుపక్కలా ఆనించి మెటికలు విరిచింది.
అప్పట్నుంచే జినవల్లభుడిని అనుకరిస్తూ అందరూ పద్మప్పని ’పంపన్న’ అని పిలవసాగారు. తెలుగు నాట పుట్టి పెరిగి, కన్నడ భాషలో కావ్యాలు రాసి అజరామరమైన కీర్తి నార్జించిన పంపన్నకి ఆ పేరే శాశ్వతంగా చరిత్రలో ఆదికవిగా నిలిచింది.

“పంపన్నా! తమ్ముడికి కూడా తెలుగు, కన్నడ, సంస్కృత భాషలోని అక్షరాలన్నీ వచ్చేశాయి. ఇంక నువ్వే ఈ బుడుతడికి వాక్య నిర్మాణము, వ్యాకరణము నేర్పించాలి. నేను కొన్నాళ్లు కన్నడ దేశంలోని బనవాసి పట్టణానికి వెళ్లాలి. అక్కడ పాఠశాల ప్రారంభించమని రాజాజ్ఞ. అమ్మని కూడా నువ్వే చూసుకోవాలి.” భీమనప్పయ్య పద్మప్పని పిలిచి చెప్పాడు.
“అలాగే నాన్నగారూ! మీ ఆజ్ఞ.”
“మిమ్మల్ని వదిలి ఎన్ని రోజులు కాలక్షేపం చెయ్యగలనో చెప్పలేననుకో..” కొడుకులిద్దరినీ ఒడిలోకి చేర్చుకుని అన్నాడు భీమనప్పయ్య. అతడు నిజగుణ మణి, గుణ రత్నాకరుడు అని పేరు పొందాడు. సౌమ్యుడు. భార్యా బిడ్డలని అత్యంత ప్రేమతో చూసేవాడు.
“మీరేమీ చింతించ వద్దు నాన్నగారూ.. నేను పెద్దయ్యాక, బనవాసి వెళ్లి అక్కడి పనులను చూసుకుంటాను.” పంపన్న వాగ్దానం చేసేశాడు.
వెళ్ల లేక వెళ్ల లేక, వెనుతిరిగి చూస్తూ బనవాసికి కదలి వెళ్లాడు భీమనప్పయ్య.

“జినవల్లభా! నీ బంగారు మొలతాడేది? చోరులెవరూ రాలేదు కదా! అమ్మ క్షేమమేనా?” ఇంటిలోనికి వస్తూనే పంపన్న ఆదుర్దాగా అడిగాడు, ఎర్రని పట్టు పంచ కట్టిన తమ్ముని పచ్చని పట్టు మొలతాడు చూసి.
“నేను క్షేమంగానే ఉన్నా పద్మప్పన్నా.. నీ తమ్ముడినే అడుగు, ఆయనగారు చేసిన ఘనకార్యమేమిటో.” వబ్బెణబ్బ అసహనంగా అంది.
“దిగువ కన్నడ దేశం నుంచి వచ్చి.. రాజుగారి కొలువులో చేరుదామని ప్రయత్నం చేస్తుంటే దర్శనం దొరక్క. నిరీక్షిస్తూ.. తెచ్చుకున్న సొమ్ములు, సంభారాలు అయిపోయి, నిలువ నీడలేకుండా ఉన్నారు కొన్ని కుటుంబాలవారు. మొత్తం పదిహేను మంది వుంటారు. సత్రం యజమాని కూడా నిస్సహాయంగా చేతులెత్తేశారు. అప్పుడు.. నేను..”
“ఇంకెవరు.. ఉన్నాడుగా ఆ కొమటి రేచన్న.. ఇద్దరిద్దరే. దాన కర్ణులు.”  కించిత్ మురిపాన్ని కూడా తల్లి మాటల్లో గమనించిన జిన వల్లభుడు ఉత్సాహంగా చూశాడు.
“అదే పంపన్నా! మల్లియ రేచన్న నేను కలిసి వారికి వసతి గృహం ఏర్పాటు చేశాము. రేచన్న రాజుగారి దర్శనానికి సహాయం చేస్తానన్నాడు. అతని తండ్రిగారు వణిక్ ప్రముఖులు కదా! ఆ కాందిశీకులలో కవులు కూడా ఉన్నారు. రేచన తండ్రిగారు కవిజనాశ్రయులు కూడా కదా మరీ..”
అప్పుడు జినవల్లబుని వయసు పదేళ్లుంటుంది. పదారేళ్ల ప్రాయంలో పంపన్న నవ యవ్వనంతో మిసమిస లాడుతున్నాడు. భీమనప్పయ్య బనవాసిలో పాఠశాలని నిర్వహిస్తూ.. సంవత్సరానికొక్కసారి ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. వేములవాడలో విద్యాలయం సింగన్న గారు, పంపన్న కలిసి సమర్ధవంతంగా నడుపుతున్నారు.
భీమన్నకైతే తిరిగి వేములవాడకి ఎప్పుడెప్పుడెళ్లిపోతామా అని ఉంది. రాజుగారు ఇదిగో.. అదిగో అంటూకాలయాపన చేస్తున్నారు.
పంపన్నకి తాము వలస వచ్చినప్పుడు పడిన అవస్థలన్నీ గుర్తుకొచ్చాయి. తాను ఎంత చిన్న పిల్లవాడయినా.. తన కడుపు నింపి, మంచి తీర్థం తాగి పడుక్కున్న తల్లిదండ్రుల శుష్కించిన వదనాలను మరచిపోలేక పోయాడు. తమ్ముడు చేసిన పని మంచిదే కానీ.. ముందూ వెనుకా చూసుకోవద్దూ?
“ఇంత లేత ప్రాయం నుంచే దాన గుణం మంచిదే కానీ జిన్నా.. జాగ్రత్తతో ఉండాలి సుమా! అవసరం ఉన్నా లేకపోయినా యాచన చేసి.. నిన్ను మోసం చెయ్యగలరు. అపాత్రదానం జరుగకుండా చూసుకో.”
“అలాగే అన్నగారూ. ఇంకనుంచీ జాగరూకతతో ఉంటాను.” జినవల్లభుడు మాట ఇచ్చేశాడు.. అన్నగారిని చూస్తూ.
అయితేనేం.. ఎవరు దీనావస్థలో ఉన్నా చూడలేని తమ్ముడు చేతికందినవి ఇస్తూనే ఉన్నాడు.. అపర దానకర్ణుడని పేరు ఊరికే వస్తుందా మరి!

“పంపన్నగారూ! జినవల్లభుడు చెరువులో మునకలేస్తున్నాడు. పాకుడు మీద జారి లోపలికి వెళ్లిపోయినట్లున్నాడు. మీరు త్వరగా రావాలి.” జినవల్లభుని స్నేహితులు నలుగురు పరుగెత్తుకుంటూ వచ్చారు.
శ్రీవిజయుడు మొదలుగాగల కర్ణాటక కవుల పద్య కావ్యాలని సమ కూర్చుకుని భద్ర పరుస్తున్న పంపన్న చివాలున తలెత్తాడు. ఎక్కడివక్కడ పడేసి పరుగెత్తాడు.
పంపన్న వెళ్లే సరికే చెరువు మధ్యలోనికి జారిపోయాడు జినవల్లభుడు. అప్పటి వరకూ నేల కానిన కాళ్లు తేలిపోసాగాయి. రెండు చేతులూ పైకెత్తుతూ సైగలు చేస్తున్నాడు.
పంపన్న ముందు వెనుక చూడకుండా చెరువులోకి దూకేశాడు..
తనకి కూడా ఈత రాదు.
గొంతు పగిలిపోయేలాగ కేకలు పెడుతూ ముందుకెళ్లాడు. అదృష్టవశత్తూ.. జినవల్లభుని జుట్టు చేతికి దొరికింది. లాక్కుని వస్తుంటే ఆయన కాళ్లు రెండూ తేలిపోయాయి. ఉక్కిరి బిక్కిరౌతూ మునకలేస్తున్నాడు కానీ.. తమ్ముని జుట్టు మాత్రం వదల్లేదు. అంత సేపూ కేకలు పెడ్తూనే ఉన్నాడు.
అంతలో.. ఆ కేకలు విన్న రైతులు కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి, అన్న దమ్ములనిద్దరినీ ఒడ్డుకి చేర్చి, తాగిన నీళ్లని కక్కించేశారు.
రిషభ తీర్ధంకరుని కటాక్షం.. ఇద్దరూ బ్రతికి బైటపడ్డారు.
“అన్నా! పంపనార్యా! ప్రాణ బిక్షపెట్టారు.. మీ ప్రాణాలు లెక్క చెయ్యకుండా. కన్నడ కవి ఐన మీరు తెలుగు వారుగా అందరికీ తెలిసేట్లు శాసనాలు చెక్కిస్తాను. మీ కీర్తి కలకాలం నిలిచిపోయేట్లు చేస్తాను.” పదహారేళ్ల జినవల్లభుడు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అన్నగారికి ఆర్భాటాలు నచ్చవు మరి.

1 thought on ““అన్నదమ్ములు-అనుబంధం” – చారిత్రక సాహిత్య కథామాలిక – 3

  1. చాలా బాగు౦ది భానుమతిగారూ. భాష మీద మ౦చి పట్టు ఉ౦ది. చక్కని స౦స్కృత భూయిష్టమైన భాష లో కథ రాయడ౦ కష్టతరమైనదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *