April 19, 2024

సంభవం – 2

రచన: సూర్యదేవర రామ్మోహన్ రావుsuryadevara

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/

 

మరో ఇరవై నిమిషాల తర్వాత హైదరాబాద్‌లోని రషీద్ దగ్గర్నించి తలకోన అడవుల్లోని సవ్యసాచికి ఫోన్ వెళ్లింది.
“మనకు అవసరమైన పిల్లి దొరికింది. రేపు మార్నింగ్ ఫ్లయిట్లో తిరుపతి వస్తున్నాను” రషీద్ ఫోన్లో చెప్పాడు.

**************************

న్యూడిల్లీ:
రేస్ కోర్స్ రోడ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అధికార నివాసం.
తెల్లవారుజామున నాలుగు గంటలైంది. అయినా అప్పటికే అక్కడ సందడి ప్రోది చేసుకుని.
విశాలమైన ఆ భవనంలోని ఒక రూంలోంచి బయటికొచ్చింది విశ్వభారతి.
పొడవాటి జుత్తు, విశాలమైన కళ్లు, పచ్చటి దేహం.. పట్టుచీరలో పాతికేళ్ల విశ్వభారతి చకచకా ముందుకు నడుస్తోంది.
అక్కడక్కడ వెలుగుతున్న ఒకటీ, అరా దీపాలు దట్టమైన మంచులో మసకబారి కనిపిస్తున్నాయి.
చేతి గడియారం వైపు చూసుకుంది. అప్పటికే ఆమె అయిదు నిమిషాల లేటు.
ఆమె అడుగుల్లో వేగం పెరిగింది.
“ఏం మహాతల్లీ.. అప్పుడే తయారైపోయావా?” గంభీరంగా వినిపించిన ఆ మాటలతో భారతి కాళ్లకు బ్రేకులు పడ్డాయి.
లాన్‌వైపు చూసింది.
లాన్‌లో అంతవరకూ మార్నింగ్ వాక్ చేసిన ఆ వ్యక్తి..
సాక్షాత్తు దేశప్రధాని!
విశ్వంభరరావు!
డెబ్భై నాలుగేళ్ల విశ్వంభరరావు రాజకీయాల్లో ఆరితేరిన వృద్ధమూర్తి. పచ్చటి శరీరం, ఎన్నెన్నో అనుభవాలకు గుర్తుగా నెరిసిన జుత్తు, అయిదడుగుల  నాలుగు అంగుళాల పొడవు..
దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీస్కెళుతున్న నిరంతర చైతన్యశీలి విశ్వంభరరావు. ఆర్ధికంగా దేశాన్ని అమిత వేగంతో అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ధీశాలి, మేధావి.
“గుడ్‌మార్నింగ్ అంకుల్! ఇవాళ లాన్లో మీరు మార్నింగ్ వాక్ చెయ్యకూడదని చెప్పానా?” ఆయన వైపు నడుస్తూ అంది భారతి.
ఆ సమయంలో విశ్వంభరరావు తెల్లటి లుంగీ, భుజమ్మీద సాదా తువ్వాలుతో చాల సాదాగా వున్నారు. సడన్‌గా ఆయన్నెవరన్నా చూస్తే దేశప్రధాని అని నమ్మరు.
“రాత్రి నువ్వేం చేప్పావ్.. లాన్లో మార్నింగ్ వాక్ చెయ్యొద్దన్నావ్ కదా.. అందుకే చేసాను” హాయిగా నవ్వుతూ వరండాలో వున్న ఈజీ చైర్‌లో కూర్చుంటూ అన్నాడాయన.
“రాత్రంతా మంచు విపరీతంగా కురిసింది అంకుల్. మీకు జలుబు చేస్తే?”
“చూడు భారతి! ప్రతి చిన్న విషయానికి నువ్వు వర్రీ అయిపోతావు. నన్ను చూడు. ఎన్నెన్ని సమస్యలు, దేశ, విదేశీ లావాదేవీలు,  ఆర్ధిక వ్యవహారాలు, దౌత్య సంబంధాలు, పార్టీలో అంతర్గత సంక్షోభాలు, ఫిరాయింపులు, బెదిరింపులు, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాలు, ఇన్నిటిని ఎదుర్కొంటున్నా నేను. వర్రీ అవుతున్నానా చెప్పు?” టవలుతో ముఖన్ని తుడుచుకుంటూ చెప్పుకుపోతున్నాడాయన.
“మీరు వర్రీ కాకుండా వుండటానికి కారణం నేనే కదా!” అనేసి కిచెన్ రూంలోకి వెళ్లి రెండు కప్పుల టీతో బయటికొచ్చి.
ఒక కప్పును విశ్వంభరరావు చేతికందించిందామె.
టీని మెల్లగా సిప్ చేస్తున్నాడాయన. సిప్ చేస్తూ..
“ఏంటి.. కామ్ గా వున్నావ్? ఏదైనా బాంబును పేల్చడానికి సిద్ధంగా లేవా?” సహజమైన ధోరణిలో అడిగాడాయన నవ్వుతూ.
“రోజూ నేను హైరానా పడిపోవడమే తప్ప మీరసలు వింటారా?”  ఆమె గొంతులో చనువుతో కూడిన విసుగు.
“నేను చాలా మొండివాడిని మహాలక్ష్మి!” విశ్వభారతి రకరకాలుగా పేర్లు పిల్చడం ఆయనకు అలవాటు. సరదా.
ఉద్యోగరీత్యా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్‌లో న్యూట్రిషనిస్ట్ విశ్వభారతి. కాని వంటరి ప్రధానికి సర్వస్వం ఆమె.
ప్రధాని విశ్వంభరరావు ప్రపంచంలో ఇద్దరే వ్యక్తుల్ని నమ్ముతాడు. ఇద్దరిలో ఒక వ్యక్తి విశ్వభారతి.
తన కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ విలువ ఇస్తాడామెకు.
దానిక్కారణం ఆమె విశ్వంభరరావు బాల్యస్నేహితుడు ధర్మారావు కూతురు కావడమే.!
“ఇవాల్టి బాంబు ఏంటి తల్లీ?” మళ్లీ అడిగాడాయన.
“మీరు రేపట్నించి టీ మానెయ్యబోతున్నారు” తలెత్తి ఆమెవైపు చూసి పెద్దగా నవ్వాడాయన.
“నేనా. టీ మానెయ్యడమా? విశ్వా.. నా మీద నీకెందుకింత పగ తల్లీ. ఆవకాయ కలుపుకోనివ్వవు. పొట్లకాయ వేపుడు కనిపించనివ్వవు. ఇక నేతి పెసరట్లూ.. నాకదో భ్రమలా మిగిలిపోయింది. ఇప్పటికే నువ్వు మానెయ్యమంటే షుగర్‌లెస్ టీ తాగుతున్నానా? మిల్కు కూడా వద్దంటే మానేసి  డికాషన్‌తో సరిపుచ్చుకుంటున్నానా? నాచేత దేశం కోసం సర్వం త్యాగం చేయించడానికి సిద్ధమైపోయావా?” ఇలాంటి వాదోపవాదాలు వాళ్లిద్దరి మధ్య జరగడం చాలా సహజం.
“అవును. దేశాన్ని రక్షించే  మిమ్మల్ని రక్షించుకోవడమే నా ప్రధానమైన ఉద్యోగం. కాదంటారా?”
“ఆ ఉద్యోగం, కర్తవ్య నిర్వహణ, అలాంటి బరువైన మాటలు మాట్లాడకమ్మా.. ఇన్ని వత్తిడుల మధ్య నేను చిరునవ్వుతో బ్రతక గలుగుతున్నానంటే దానిక్కారణం నువ్వే. ఒక తండ్రికంటే ఎక్కువ నువ్వు నాకు సేవలు చేస్తున్నావు. ఏదో రోజు నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను విశ్వా!” సీరియస్‌గా అన్నాడాయన.
“మీ ఎత్తుగడ నాకు తెల్సులెండి. మీరు సీరియస్‌గా మాట్లాడితే నేను రెండోసారి టీ ఇస్తాననేగా. చచ్చినా ఇవ్వను. ఇప్పటికీ టెన్ మినిట్స్ లేట్.. మీరు స్నానం చేసొస్తే టిఫిన్ రెడీ చేస్తాను” ఆయన చేతిలోని కప్పును తీసుకోబోతున్న భారతి కళ్లలోకి ఒకసారి చూసి.
“విశ్వా.. ఇవాళ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్. ఒక వ్యక్తికి రెండు పదవులు వద్దంటూ పార్టీలో కొంతమంది వ్యక్తులు లేవదీస్తున్న నినాదాన్ని ఉద్యమంగా మలచడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువమంది నన్నే సమర్ధిస్తున్నారనుకో… అయినా ఈ రాజకీయం ఒక రాక్షసి. యాభై ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నెన్నో తుఫాన్లను చూశాను. నేనెప్పుడూ రాజకీయం పేరుతో దుర్మార్గాలు చేయలేదు. ఒక సాధారణ  ఎమ్మెల్యేగా ప్రారంభమైన నా జీవితం .. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా,  పార్టీ అధ్యక్షునిగా కొనసాగడానికి కారణం.. నేను నమ్మిన సిద్ధాంతాలు. సిద్ధాంతం, వ్యక్తిత్వం లేని వ్యక్తులు పొలిటిషియన్లుగా చెలామణి అయిపోతున్నారు. వాళ్లకు ఎదురుగా  అంతర్గత కలహాల్ని ఎదుర్కొంటూ దేశ పురోభివృద్ధి కోసం, ఆర్ధిక స్వాతంత్ర్యం కోసం దేశాన్ని నడిపించడానికి నేను తీసుకుంటున్న చర్యల్లో లోపమేదైనా వుందా విశ్వా?”
తలపండిన రాజకీయ మేధావి విశ్వంభరరావు. అలాంటి విశ్వంభరరావు తన పరిపాలన గురించి ఆయన వయసులో సగం కూడా లేని విశ్వభారతి సలహ అడగడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
“అంకుల్! మీకు తెలీదని నన్ను అడుగుతున్నారా?”
“నాకు తెలీదని కాదు విశ్వా! నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పగల ఏకైక వ్యక్తివి నువ్వే గనుక” లేచి లోపలి రూంలోకి నడుస్తూ అన్నాడాయన.
విశ్వభారతి కళ్లు ఒక్కసారి చెమ్మగిల్లాయి.
ఆయన తన పర్సనల్ రూంలోకి వెళ్లడంతో ఆమె డైనింగ్ హాలు వైపు నడిచించి.
సరిగ్గా నలభై నిమిషాలు గడిచాయి.

***************************************

తూర్పున  వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి.
అయిదు గంటలు దాటి, సరిగ్గా పద్ధెనిమిది నిమిషాలైంది.
ప్రధాని నివాసభవనం ముందు ఓ సిమెంట్ కలర్ జీపు విసురుగా వచ్చి ఆగింది.
అందులోంచి దిగిన వ్యక్తికి దాదాపు ముప్ఫై ఏళ్లుంటాయి. ఉక్కుతో తీర్చిదిద్దినట్టుగా దృఢంగా, బలంగా వుంది అతని శరీరం. అతన్ని చూడగానే సెక్యూరిటీ ఆఫీసర్ నందరాజ్ వినయంగా సెల్యూట్ చేశాడు.
“ఎనీధింగ్ స్పెషల్?” నందరాజ్ వైపు ఆ వ్యక్తి చూస్తూ అడిగాడు.
“ఎవ్విరిథింగ్ నార్మల్ సర్” చెప్పాడు నలభై ఏళ్ల నందరాజ్.
“ఓ.. కె. గుడ్….” హుందాగా తల పంకించి, లోని కడుగేశాడా వ్యక్తి. సెక్యూరిటీ స్టాఫ్‌ని, మెటల్ డిటేక్టర్స్‌ని దాటుకుంటూ జనరల్ విజిటర్స్ హాలు దగ్గరకొచ్చాడు.
అప్పటికే అక్కడ పార్టీ ప్రముఖులు, ముగ్గురు కేంద్ర మంత్రులూ ప్రధాని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.
ఆ వ్యక్తి కేంద్ర మంత్రుల్ని విష్ చెసి ముందుకు కదిలాడు.
పాలరాతి గచ్చుమీద అతని బూటు శబ్దం టక్ టక్‌మని విన్పిస్తోంది.
సరిగ్గా అయిదు నిమిషాలు గడిచాయి.
తనకు దగ్గరవుతున్న ఆ అడుగుల చప్పుడుని గుర్తుపట్టిన విశ్వభారతి పెదవుల మీద చిరునవ్వు విరిసింది.
డైనింగ్ టేబుల్ దగ్గర ఎరేంజ్‌మెంట్స్ లో వున్న భారతి తల తిప్పి డోర్‌వైపు చూసింది.
అప్పుడే లోనికి ప్రవేశించాడా వ్యక్తి.
ఆ వ్యక్తి పేరు రుషికుమార్. దేశ ప్రధాని చీఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్.
“గుడ్‌మార్నింగ్ మిస్టర్ రుషి” విష్ చేసింది విశ్వభారతి. ఏం మాట్లాడలేదతను. ప్రైమ్ మినిస్టర్ లివింగ్ రూంవైపు చూస్తున్నాడతను.
కొంతమంది చిన్నప్పటినుంచి అన్నీ నేర్చుకుంటారు తప్ప. మేనర్స్ గురించి నేర్చుకోరు. ఏదో యూనివర్సిటీలో మేనర్స్ గురించి ఒక సెక్షన్ పెట్టమని చెప్పాలి.” తల తిప్పకుండానే అంది ఆమె.
“అవును! చెప్పు. తెల్లవారుజామున ఆ పెద్దాయనకు అడ్డమైనవన్నీ ఫీడ్ చెయ్యి. నువ్వో మహామేధావివని ఆయన నమ్మకం. ఎక్కడ దొరికావో కానీ భలే దొరికావులే. ముందు నిన్ను యిక్కడ నుంచి పంపించేస్తే పెద్దాయన హేపీగా వుంటారు” గబగబా మాట్లాడుతూ అక్కడే వున్న పేపరుని అందుకున్నాడు రుషి.
రుషి స్పెషాలిటీ అవతలి వ్యక్తికి అర్ధం అవుతుందో, కాదో అని తెల్సుకోకుండా గబగబా మాట్లాడేయడం!
డైనింగ్ టేబుల్ దగ్గర్నించి విసురుగా, అతనికెదురుగా వచ్చి నిల్చుంది భారతి.
“నువ్వు నన్ను ఇక్కడినుంచి పంపించేస్తావా? చూడు పొగరుమోతు పిల్లడా! నేను రికమండేషన్ చేయబట్టే నువ్విక్కడ, ఈ పోస్టులో వున్నావని మర్చిపోకు” అల్లరిగా అందామె.
“నువ్వు నన్ను రికమండ్ చేశావా? కొయ్.. శ్రీకాకుళం కోతలంటే ఇలాగే వుంటాయి. ఊరు గొప్ప, పేరు దిబ్బ అనీ… పెద్దాయన్ని బుట్టలో వేసుకుని, నువ్విక్కడేం చేస్తున్నావో నాకన్నీ తెలుసు. నీ మీద నిఘా పెట్టాను తెలుసా. నువ్వే క్షణంలో ఏం చేస్తున్నావో, ఎవరికి ఏయే సీక్రెట్స్ పంపిస్తున్నావో అన్నీ.. అన్నీ… నా దగ్గరున్నాయి. అయాం వెయిటింగ్ ఫర్ ది టైం. చూడు ఏదో రోజు నిన్ను నేనే అరెస్ట్ చేస్తాను చూడు..”
విసురుగా అతని మీదకొస్తూ..
“చూడబ్బాయ్! తొందరపడకు. నిన్నెప్పుడు. ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. నువ్వు సెక్యూరిటీ ఆఫిసర్ రూపంలో వున్న విలన్‌వని నాకు తెలుసు రానీ.. పెద్దాయన్ని రానీ” కోపాన్ని నటిస్తూ అనేసి.
వెనుదిరిగిన భారతి. గోడకి ఆనుకొని నిల్చున్న వ్యక్తిని చూసి సిగ్గుపడిపోయి డైనింగ్ టేబుల్ దగ్గరకు పరిగెత్తింది.
“బాగానే వుంది విశ్వా! రుషి ఎంతసెపైంది నువ్వొచ్చి? పార్టీలో గొడవలైనా ఎప్పుడైనా చల్లారుతాయేమోగానీ, మీ మధ్య గొడవలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మీ విషయంలో అతి త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు.”
వారికి దగ్గరగా వస్తూ అన్నారు విశ్వంభరరావు. పట్టుపంచె, పట్టు లాల్చీ, భుజమ్మీద కండువా, కళ్లకు గోల్డ్‌ఫ్రేమ్  కళ్లద్దాలతో విలక్షణంగా వున్నారాయన.
“గుడ్‌మార్నింగ్ అంకుల్” ఆయన్ని చూడగానే, ఫోటోకాల్ ప్రకారం స్టిఫ్‌గా నిలబడి సెల్యూట్ చేశాడు రుషికుమార్.
“గుడ్‌మార్నింగ్ మై బోయ్! కాని ఎన్నిసార్లు చెప్పాలోయ్.. ఈ ఫోటోకాల్స్, ఈ పద్ధతులు మీ ఇద్దరకు వర్తించవని” డైనిగ్ టేబుల్ ముందు కుర్చీని లాక్కుంటూ కూర్చుంటూ అన్నాడాయన.
“కానీ అంకుల్..”ఏదో చెప్పబోయాడు రుషి.
“నో మోర్ టాక్స్ రుషి! కమాన్… టిఫెన్ చేసావా?”
“అంకుల్! మీ టిఫెన్లు మిగతావాళ్లు తినలేరు కానీ మీరు చెయ్యండి..” టిఫెన్ వడ్డిస్తూ అంది భారతి.
“చూడయ్యా రుషీ ఇదీ వ్యవహారం. నువ్వయినా చెప్పు.. కారం వుండదు. ఉప్పు వుండదు. దీనికన్నా పచ్చగడ్డి నయం. ఈ పిల్ల నన్ను వేపుకు తినేస్తుందనుకో” నవ్వుతూ అన్నారాయన.
“అతన్ని మీరు సలహా అడగడమా? సరేలెండి” అతని కళ్లవైపు చూస్తూ అంది భారతి.
“అవును కదూ! మీరిద్దరూ పిల్లీ, ఎలుకా టైపని మరిచేపోయాను సుమా.”
“ఇందులో ఎవరట పిల్లి?” అడిగింది భారతి.
“నేనే.. ఎందుకంటే .. ఐయాం ఎ బ్లాక్ కేట్ కమాండోని కనుక. కదా అంకుల్?”
“ఎస్. కరెక్ట్” అన్నారాయన నవ్వుతూ.
“చూడు విశ్వా! ఓ అయిదు రోజులు నీకు లీవిచ్చి. మీ వూరు పంపించేసి, నాకు కావాలసినవన్నీ చేసుకు తినేస్తాను” టిఫెన్ చేస్తూ అన్నాడాయన.
“నేను కూడా మీకు కోపరేట్ చెస్తాను అంకుల్” ఆమె వైపు చూసి కన్నుగొడుతూ అన్నాడు రుషి.
“చేస్తావు. ఎందుకు చెయ్యవూ. అంకుల్ రుషిని మీరెప్పుడూ నమ్మకండి. మీరతనికి బాగా చనువిచ్చేస్తున్నారు. అసలిక్కడున్న విదేశీ గూఢచారి ఇతనేనని నా నమ్మకం. అందుకే నేనెప్పుడూ జాగ్రత్తగా వుంటాను” అందామె.
“అందుకే నువ్వు రుషి దగ్గర జాగ్రత్తగా వుంటావా? రుషి విదేశీ గూఢచారా?”  ఫెళ్లున నవ్వుతూ, పొలబారాడాయన.  భారతి ఆయన దగ్గరగా వేగంగా వెళ్లి నుదురుమీద చిన్నగా కొట్టి, మంచినీళ్ల గ్లాసుని అందించింది.
నీళ్లు తాగాక,
ఇద్దరివైపూ ప్రేమగా, వాత్సల్యంగా చూసి
“మీ ఇద్దరూ లేకపోతే నేనేమైపోయే వాణ్నో గదా” తనలో తను అనుకున్నట్టుగా అన్నాడాయన.
విశ్వంభరరావుకి కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, అందరూ వున్నా ఏ ఒక్కర్నీ నమండాయన.
ఆయనకు నిస్వార్ధంగా ప్రేమను చూపించే వ్యక్తులంటే యిష్టం.
అలాంటి వ్యక్తులు ఆయనకు ఇద్దరే యిద్దరు వున్నారు. ఆ ఇద్దరూ ఆయనతో చిన్నప్పుడు చదువుకున్న వ్యక్తులు. వాళ్లిద్దరిలో ఒకాయన శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో వుంటాడు. ఆయన కుమార్తె విశ్వభారతి. ఇంకొక స్నేహితుడు హైదరాబాదులో వుంటాడు. ఆయన కొడుకు రుషికుమార్. అందుకే విశ్వంభరరావుకి భారతి, రుషి రెండు కళ్లు.
వాళ్లిద్దరిని ఎప్పటికైనా జంటగా చెయ్యాలని ఆయన కోరిక.
దానికో కారణం వుంది. ఆ విషయం భారతికి, రుషికి తెలీదు.
పావుగంట గడిచింది.
రెసిడెన్స్‌లోంచి బయటికొచ్చారు ప్రైమ్ మినిస్టర్ విశ్వంభరరావు.
అప్పటికి సరిగా ఆరుగంటలైంది.
పర్సనల్ అసిస్టెంట్ దేశ్‌ముఖ్ ఆ రోజు ఎంగేజ్‌మెంట్స్ గురించి చెప్పాడు.
అందులో మొట్టమొదటి కార్యక్రమం..
మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రతాప్‌సింగ్‌తో భేటీ.
ప్రతాప్‌సింగ్ తన ఇంటర్వ్యూ కోసం కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాడు.
సింగ్‌తో ఇంటర్వ్యూ తర్వాత అర్జున్‌చౌహాన్‌తో భేటీ.
అర్జున్‌చౌహాన్ మహారాష్ట్ర అధ్యక్షుడు.
తనను రాజకీయంగా విభేదిస్తున్న, బలమైన వర్గాలకు నాయకత్వం వహిస్తున్న నేతలు ప్రతాప్‌సింగ్, అర్జున్‌చౌహాన్.
దేశాన్ని అవిచ్చినంగా పాలిస్తున్న పార్టీకి కీలకమైన అధ్యక్ష పదవి కోసం అంతర్గత ఎన్నికలు జరగడానికి యింకో వారం రోజులు టైముంది.
ఈ సమయంలో వాళ్లిద్దరూ విడివిడిగా తనను తలవడానికి ప్రయత్నిస్తున్నారంటే
ఒక్క క్షణం విశ్వంభరరావు భృకుటి ముడిపడింది.
“ప్రతాప్‌సింగ్‌కి ఫోను చేయండి” పి.ఎ. దేస్‌ముఖ్‌తో చెప్పాడు ఆయన.
“ఆయన మీకోసం గంటనుంచీ ఎదురుచూస్తున్నారు” చెప్పాడు దేశ్‌ముఖ్.
లేచి నిలబడ్డాడు విశ్వంభరరావు.
ఆఫీసు రూంవైపు అడుగులు వేశాడాయన. ఆయన్ని అనుసరించాడు రుషికుమార్.
ఆ వెనక పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్. బ్లాక్ కేట్ కమెండోలు, మిగతా జనం నడిచారు.

*************************

అప్పటికి కొన్ని గంటల క్రితం.
హైదరాబాద్ పంజాగుట్ట ఏరియా.. చిమ్మచీకట్లో నిద్రపోతున్న లేడీస్ హాస్టల్.
ఆ హాస్టల్‌లో తన రూంలో గాఢనిద్రలో వుంది దిశ.
చాలాసేపు ఆమెకు నిద్రపట్టలేదు.
ఏవేవో ఆలోచనలు.. ఆ ఆలోచనలన్నీ సాయంకాలం తన చేటుల్లో నుంచి తప్పిపోయిన ఆస్ట్రేలియన్ పిల్లి మీదే వున్నాయి.
ఆ పిల్లి ఏమయిపోయింది? నేలమీద రక్తం, వెంట్రుకలు తప్ప పిల్లి కనిపించలేదు. అంటే … చిన్న గాయాలతో బయటపడి, భయపడి పిల్లి పారిపోయిందా?
ఎక్కడకు వెళ్లి వుంటూంది?
పిల్లి మాయమైపోయిన దగ్గర్నించి దిగాలుగా కూర్చున్న వార్డెన్ భ్రమరాంబ ముఖమే ఆమెకు గుర్తొస్తుంది.
బూడిదరంగు గీతల పిల్లి.. ఆ పిల్లి కళ్లు.
వాహనాల రొద… మసక మసక చీకటి.. ఆ చీకట్లో మ్యావ్… మ్యావ్… శబ్దాలు..
ఆ శబ్దాలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. నిశ్శబ్దంగా వున్న విశాలమైన హాల్లో సెవెన్ ట్రాక్ స్టీరియో సౌండ్‌లో విన్పిస్తున్నట్టుగా పిల్లి ప్రాణభయంతో అరుస్తున్న అరుపులు.
ఆకాశం నిండా నిండిపోయిన అరుపులు.
కొండల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న అరుపులు.
అడవుల ఆకుల సవ్వడిలోంచి దూసుకుపోతున్న అరుపులు..
ఒక్కసారిగా ….
ఆ అరుపులు ఆగిపోయాయి. తల వేలాడేసిన పిల్లి దూదిబొమ్మలా నిశ్చలంగా పడి వుంది.
వాడి అయిన ఆ పిల్లి చూపులు గోళీకాయల్లా నీల్చిపోయాయి.
ఏవో రెండు చేతులు.
ఆ పిల్లిని పట్టుకున్నాయి. ఆ పిల్లి శరీరం మీది వెంట్రుకల్ని ఎవరో కత్తిరిస్తున్నారు.
ఆ పిల్లి పొట్టమీది చర్మాన్ని కత్తులతో ఎవరో రెండుగా చీలుస్తున్నారు.
రక్తం.. రక్తం.. చివ్వున చిమ్మిన రక్తం..
ఆ రక్త సమూహంలోంచి ఒక బిందువు తటాల్మని ఎగిరింది.
గాఢనిద్రలో వున్న దిశ ఒక్కసారిగా మేల్కొంది అప్రయత్నముగా ఆమె చేతివేళ్లు ఆమె బుగ్గల్ని తాకాయి. ఆమె వేలికి…
చీకట్లో చల్లగా ఏదో తగిలింది.
గబుక్కున బెడ్‌మీంచి లేచి లైటు వేసి మిర్రర్ వైపు పరుగులు తీసింది. ఎడమబుగ్గ మీద ఎర్రగా మెరుస్తూ రక్తపు చుక్క.
కెవ్వున కేకవేసింది దిశ.
ఒక్కసారిగా భయంతో వణికిపోయిందామె. అనుమానంగా నలువైపులా చూసింది.
తన బుగ్గమీదికి రక్తపు చుక్క ఎలా వచ్చింది?
నెమ్మదిగా వెనక్కి వచ్చి రూమ్ నంతట్నీ పరిశీలనగా చూసింది.
రోడ్డుమీద గాయపడిన పిల్లి మళ్లీ వెనక్కి తన గదిలోకి వచ్చిందేమో అనుకుందామె.
లేదు.. పిల్లి రాలేదు.. ఆ పిల్లి మరి రాదు.
గాయపడిన పిల్లి ఎక్కడో శవంగా మారబోతుంది. ఎందుకు?
పిల్లి శవంగా ఎందుకు మారుతోంది?
ఎవరు మారుస్తున్నారు? ఏం జరుగుతోంది?
పదినిమిషాలవైపు చైతన్యరహితంగా వుండిపోయిన దిశ.
నెమ్మదిగా టెబుల్‌వైపు నడిచి…
దైరీని అందుకుంది.
తనకొచ్చిన కలలోని సన్నివేశాన్ని రాయడం ప్రారంభించింది.
సగం వరకూ రాశాక బాల్‌పెన్ను రాయడం మొరాయిస్తే కేప్ విప్పి చూసింది.
రీఫిల్‌లో ఇంకు అయిపోయింది.

********************

అరవై ఏళ్ల ప్రతాప్‌సింగ్ దృఢంగా, పొట్టిగా వుంటాడు. ఆయన జీవితాసయం ఎలాగయినా, ఎప్పతికయినా దేశ ప్రధాని కావడం.
అందుకోసం  గత ఇరవై ఏళ్లుగా కాచుకుని కూర్చున్నాడు.
విశ్వంభరరావు ప్రధాని కాక పూర్వం విడేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా వుండేవాడు. అప్పట్లో ప్రతాప్‌సింగ్ హోమ్ మినిస్టర్.
అప్పటి ప్రధాని సుమంగళ త్రిపాఠీకి ప్రతాప్‌సింగ్ బాగా సన్నిహితుడు.
సుమంగళ త్రిపాఠీ తల్లి, తండ్రి, తాత ఈ దేశాన్ని అప్పటికి పరిపాలించిన ప్రధానులు.
ఆ కుటుంబానికి దేశ ప్రజల్లో గట్టి పట్టు, నమ్మకం వున్నాయి. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆ కుటుంబం చాలా త్యాగాలు చేసిందని దేశ ప్రజలు నమ్ముతారు.
అనువంశిక పరిపాలనలో భాగంగా తల్లి చనిపోయాక దేశప్రదానిగా వచ్చిన సుమంగళ త్రిపాఠీ విదేశీ పర్యటన నుంచి వస్తూ విమాన ప్రమాదంలో మృతుడయ్యాడు.
ఆ సమయంలో దేశంతోపాటు పార్టీలో కూడా జనాకర్షణగల నాయకుడు లేదు.
వృద్ధులందరిలోకి వృద్ధుడు. అపారమైన రాజకీయ అనుభవంగల విశ్వంభరరావు అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశం అరాచకం పాలు కాకుండా తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయిన విశ్వంభరరావు తర్వాత జరిగిన అనేకానేక పరిణామాలను తాపీగా,  ఓపిగ్గా సంయమనంతో ఎదుర్కొని.
పార్టీని, దేశాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకుని తాత్కాలిక ప్రధాని స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగాడు.
ఆయన పదవీకాలం పూర్తి కావడానికి ఇంకా పది నెలలు గడువుంది.
విశ్వంభరరావు చేతిలోకి ప్రధాని పదవి వచ్చాక దేశ ఆర్ధిక పరిస్థిని మెరుగుపరచడం కోసం..
ఎన్నెన్నో ఆర్ధిక సవరణల్ని చేసాడు. విదేశీ మారకద్రవ్యం కోసం ఓపెన్ మార్కెట్ సిస్టంని ప్రవేశపెట్టాడు. ఎన్నో విదేశీ కంపెనీలకు లైసెన్సులిచ్చాడు.
మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆచరణ ఇన్‌స్పిరేషన్‌గా పనిచేసే విశ్వంభరరావు ఆశయం…సామాన్యుని బడుగు జీవితం తన హయాంలో ఆర్ధికంగా చిగురించాలని ..
బడా పెట్టుబడి వర్గం, పారిశ్రామికవేత్తల్ని పక్కకు పెట్టి ప్రాక్టికల్‌గా కామన్‌మెన్ ప్రోగ్రెస్ కోసం కృషి చేస్తున్న విశ్వంభరరావుకి రాజకీయం తెలీదని పార్టీలోని ప్రత్యర్ధి వర్గాల ఆరోపణ.
దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా కుక్కలా కాపలా కాస్తున్నాడు. వచ్చే ఎలక్షన్లలో అతనుంటే తమ వ్యాపార సామ్రాజ్యాలు కూలిపోతాయని బడా వ్యాపార వర్గాల ఆందోళన.
పార్టీలోని ప్రత్యర్ధి వర్గాలు, ప్రతిపక్షాలు, బడా వ్యాపారవేత్తలు సృష్టించిన ఎన్నో ప్రమాదాల్ని ఆయన ఆవలీలగా ఎదుర్కొన్నాడు.
అంతర్గత శత్రువులు,  విదేశీ శత్రువులు అధికారం కోసం నిరంతరము జరిగే పోరాటాలు ఎన్నో.
బలమైన శత్రువర్గాలు తననెప్పుడైనా దెబ్బతీస్తాయని ఆయనకు తెలుసు.
అయినా విశ్వంభరరావు మొండివాడు.
ఇంకా వున్న పదినెలల గడువులో ప్రత్యర్థులకు తనేవిటో, తన సత్తా ఏమిటొ చూపించాలని ఆయన అభిమతం.
ఏసీ రూంలోకి విశ్వంభరరావు ప్రవేశిస్టూనే ఆప్యాయంగా ముఖం మీద చిరునవ్వును పులుముకుని తన ఒకనాటి సన్నిహిత మంత్రివర్గ సహచరుడు ప్రతాప్‌సింగ్‌ను కౌగలించుకుని “బాగున్నారా?” అంటూ పలకరించాడు.
మూడు నిమిషాలసేపు బాగోగుల తతంగం ముగిసింది. ఆ తర్వాత
“విశ్వంభర్‌జీ! మీరిక్కడ వున్నారు కాబట్టి మేం అక్కడ హాయిగా రూల్ చేయగలుగుతున్నాం. మీరే లేకపోతే మేం ఏం అయిపోయేవాళ్లమో మీకు తెలీదు.” బెలూన్లా ఉబ్బితబ్బిబ్బుగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్‌సింగ్.
“నేను లేకపోతే ఈ దేశం ఏమయ్యేది సింగ్ సాబ్? మీలాంటివాళ్లు లేరా? కేంద్రమంత్రిగా మీ పరిపాలనా దక్షత నాకు తెలీదా? మీ కిష్టమైన పార్టీ పదవి దొరకలేదని మీరు అధిష్తాన వర్గం మీద అలిగారు గానీ..” ఆ మాటంటూ ఓరకంట చూశాడు విశ్వంభరరావు.
“నేను అలిగితే ఎంత అలగకపోతే ఎంత.. చెప్పండి… విశ్వంభరరావు సాబ్! కానీ. నా వర్గాన్ని అధిష్టానవర్గం చిన్నచూపు చూసిందని నా బాధ. వాళ్లందరూ పార్టీ మీద ఎప్పుడో ఒకప్పుడు తిరగబడే ప్రమాదం వుంది అందుకే..” తనెందుకొచ్చాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు ప్రతాప్‌సింగ్.
“అంటే.. అసమ్మతివర్గం, అధిష్టానవర్గం అంటే నా మీదే కదూ!” విశ్వంభరరావు నేరుగా అలా అడీగేసరికి వెలవెలబోయాడు ప్రతాప్‌సింగ్.
“ఇవాళ మీ మీద, రేపు నా మీద అనుకోండి. ఈ పాలిటిక్స్ మనకు కొత్తా?, విశ్వంభర సాబ్! ప్రధానిగా, పార్టీ ప్రెసిడెంట్‌గా రెండు పదవుల్ని భరిస్తూ మీరెంత టేన్షన్ ఫీలవుతున్నారో నాకు తెలుసు. అంచేత అ టెన్షన్‌ని నేను కూదా పంచుకుందామని. నేను మీ వాడినే.. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. నాలాంటి బలమైన వ్యక్తి మీ వెనక ఉన్నాడనుకోంది.. నెక్స్ట్ టెన్ ఇయర్స్.. మీ ప్రధాని పదవికి ఢోకా లేకుండా….” ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు  ప్రతాప్‌సింగ్.
“అంటే.. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే మీ అసమ్మతి మాయమై పోతుందంటారు.” పెద్దగా నవ్వుతూ అన్నారు విశ్వంభరరావు.
ఏం మాట్లాడలేదు ప్రతాప్‌సింగ్.
చేతి గడియారం వైపు చూసుకుని లేచి నిలబడ్డాడు విశ్వంభరరావు.
“చూద్దాం సింగ్ సాబ్! మళ్లీ కలుద్దాం” అన్నాడాయన. మధ్యలొ అలా విశ్వంభరరావు లేచిపోవడం ఆయన టేక్నిక్. ఆ టెక్నిక్ గురించి బాగా తెలిసిన ప్రతాప్‌సింగ్ ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రగా మారిపోయింది.
ఏదడిగినా చూద్దాం.. లెటజ్ సీ… దేఖ్‌లేంగే అని ముక్తసరిగా మాట్లాడటం విశ్వంభరరావుకి బాగా అలవాటు. దాని మూలంగా ఆయన ప్రత్యర్థులు తరచూ కంఫ్యూజన్‌కి గురవుతుంటారు. చేస్తాడో తెలీదు. చేయడో తెలీదు. అలా అని ఎదురు తిరుగుదామంటే ఆయనకి దేశవ్యాప్తంగా మంచి ప్రధానిగా పేరు, పలుకుబడి వుంది . అదీ ప్రజల్లో.
ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల మూలంగా అయన దేశానికి అత్యంత ప్రియతమ నాయకుడైపోయాడు.
అలాంటి ప్రధానిమీద ఎదురు తిరిగే తాము ప్రజల దృష్టిలో విలన్స్‌గా కనిపించే ప్రమాదం వుంది.
అందుకే ఏం చేయాలో తోచక పళ్లు నూరుకుంటూ బయటకు నడిచాడు. గోతికాడ నక్కలాంటి ప్రతాప్‌సింగ్. కాని అప్పటికే ఆయన మెదడులో ప్రమాదకరమైన పథకమొకటి క్రమంగ వేళ్లూనుకోసాగింది.

రెడ్ అండ్ బ్లాక్ చెక్స్ కుర్తా, పైజామా, లైట్ గ్రీన్ కలర్ చున్నీ, జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు, గుమ్మడి గింజలా నుదుటన బొట్టు. అద్దంలో తనొకసారి చూసుకుని టేబుల్ మీదున్న వ్యానిటీ బ్యాగ్ తీసుకుని రూంలోంచి బయటకొచ్చింది దిశ.
ఆఫీస్ రూం దాటి బయటికొస్తున్న సమయంలో బయటినుండి లోనికొస్తూ కనిపించింది వసంత.
“పొద్దున్నే ఎటు బయల్దేరావ్?” అడిగింది వసంత.
“నువ్వు రాత్రెటు వెళ్లావు చెప్పు?” తిరిగి ప్రశ్నించింది దిశ.
“స్కైలైన్లో క్లిఫ్ హాంగర్ సినిమాకి.. షకీలాతో లేటైపోయిందని అక్కడే వుండిపోయాను” చెప్పింది వసంత.
“షకీలాతో వెళ్లావో.. లేదో నాకేం తెల్సు.. బాయ్ ఫ్రెండ్ దొరికాడేమోనని భయం” నవ్వుతూ అంది దిశ.
“బాయ్ ఫ్రెండా? నాకా?” వసంతకు బాయ్‌ఫ్రెండ్స్ అంటే ఎందుకో భయం. వాళ్లు ఆడపిల్లల్ని మోసం చేసి మాయమైపోతారని ఆమెకో దృఢమైన నమ్మకం.
“సీయూ. లంచ్‌లో కలుద్దాం..” చెప్పి గబగబా రోడ్డు మీదకెళ్లి బస్టాండ్ వైపు నడవసాగింది దిశ.
సరిగ్గా అదే సమయంలో రోడ్డుకి రెండో పక్కనుంచి వస్తున్నాడు గిరీష్. (రిసెర్చ్ స్కాలర్.. పబ్లిక్ గార్డేన్స్‌లోని మమ్మీని చూడతానికి దిశతో వచ్చిన వాళ్లలో అతనొకడు)
గిరీష్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. పుస్తకాల పురుగు  అతని నిక్‌నేమ్.
“హలో దిశా!” రోడ్డు దాటుతూ పిలిచి ఒక్కక్షణంలో ఇటువైపు వచ్చాడు.
“ఏమిటి… హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు? రెండు మూడు రోజులుగా నిన్నిక్కడ బస్టాపులో చూస్తున్నాను. ఏంటీ విశేషం?” హుషారుగా అడిగింది దిశ.
“ఫ్రెండ్‌ను కలవడానికి.. ఎన్నిసార్లొచ్చినా ఆ ఫ్రెండ్‌ను కలవలేకపోతున్నాను.” అన్నాడు గిరీష్ ఒకింత మొహమాటంగా.
“ఏం?” ఆ మాటకు గిరీష్ వెంటనే జవాబు చెప్పలేదు.
“మిస్ దిశ.. మీకభ్యంతరం లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ నాతో రెస్టారెంట్‌కి వస్తారా?” గిరీష్ ఎర్రటి ముఖమ్మీద చిరుచెమట.. ఆ మాటలంటున్నప్పుడు అతని గొంతులోని మార్పును స్పష్టంగా గమనించింది దిశ.
“ఎందుకు?” వెంటనే అడిగిందామె.
“చాలా ఇంపార్టెంట్ విషయం. మీతో డిస్కస్ చెయ్యాలని మూడు రోజులుగా మీ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నాను” నెమ్మదిగా చెప్పాడతను.
“అంటే .. మీరు కలవాలనుకున్న ఫ్రెండ్‌ను నేనా?” ఆశ్చర్యంగా అడిగిందామె.
“ఎస్!”
“నా దగ్గర మీకు మొహమాటం ఏంటి.. రెండేళ్లుగా మనం కలిసి మెలసి తిరుగుతున్నాంగా” రోడ్డును క్రాస్ చేస్తూ అంది దిశ.
“అంటే?”
గిరీష్ ఏం చెప్పదలుచుకున్నాడు తనతో. రెండేళ్ల తమ పరిచయంలో తనతో ఎప్పుడూ ఒక్క జోకు కూడ వెయ్యని వ్యక్తి. గిరీష్ తనను ప్రేమిస్తున్నాడా?
తన ఆలోచనకి మనసులోనే నవ్వుకుంది దిశ.
ఇద్దరూ రెస్టారెంటులో కూర్చున్నాక తలవంచుకుని కూర్చున్నాడు గిరీష్.
“చెప్పు గిరీష్?” అతని ఎర్రటి పెదవులవైపు చూస్తూ అడిగింది దిశ.
“నా గురించి మీకు బాగా తెలుసు. అంచేత..”
“అంచేత…”
“నేను ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి కూడా నా మీద ప్రేమ వుందనే నేననుకుంటాను. కాని..”
గిరీష్ డొంక తిరుగుడు ధోరణికి నవ్వొచ్చింది దిశకు.
నిన్ను నేను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పలేని మగాడు.. మగాడేలా అవుతాడో దిశకు అర్ధం కాలేదు.
“ఆ అమ్మాయితో మీరు చెప్పలేదా?”
“మీ.. మీతో చెప్తున్నాను గదా!”
“అంటే.. ఆ సన్నివేశాన్ని, ఎలా ఎదుర్కోవాలో దిశకు అర్ధం కావడం లేదు. తను ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంతోమంది బాయ్‌ఫ్రెండ్స్ మధ్య తను తిరిగినా ఎవరూ తనతో ప్రేమా, దోమా అనే విషయం ఎప్పుడూ మాట్లాడలేదు.
“దిశా.. నా మనసులోని మాటను మీతో చెప్తున్నాను. మా ఇంట్లో నేనొక్కణ్నే .. మా బామ్మ వృద్ధాప్యం వల్ల నేను అర్జంటుగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. అంచేత.. ప్లీజ్ చెప్పండి.. మీరు..”
“అది కాదు గిరీష్.. సడన్‌గా ఏంటిది? మీరు.. నన్ను..” కంగారు పడింది దిశ.
“అవును దిశా! ఈ సమయంలో మీరే నాకు దిక్కు. మీరు చెయ్యాల్సిన హెల్ప్. మీ రూమ్మేట్ వసంతను నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను..”
అతని మాటలింకా పూర్తికాలేదు.
పెద్దగా నవ్వింది. కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వింది దిశ. గిరీష్ తనను ప్రేమిస్తున్నాడనుకుని అంతవరకూ సీరియస్‌గా అయిపోయిన ఆమె మనసునిండా అతని అమాయకత్వంపై అభిమానం.
“అంటే వసంతకు రికమెండ్ చెయ్యమని చెప్పడానికా.. ఇంత సస్పెన్స్” నవ్వును అతిప్రయత్నం మీద ఆపుకోడానికి ప్రయత్నిస్తూ అంది దిశ.
“అవును! ఏం.. మిమ్మల్ని నేనేమన్నా కన్‌ఫ్యూజ్ చేశానా?” తొట్రుపడుతూ అన్నాడు గిరీష్.
“అవును! యమ కన్‌ఫ్యూజ్ చేశారు. అది కాదు గానీ, వసంతను రియల్‌గా మీరు పెళ్లి చేసుకుంటారా?”
“గాడ్ ప్రామిస్ దిశా! నేనారాధించే ఆంజనేయుడి మీద ఒట్టు” ఆ మాటకు మరింత నవ్విందామె.
“పెళ్లి గురించి , బ్రహ్మచారి దేవుడు మీద ఒట్టేస్తారేంటి? సరే… నేను మాట్లాడతాను లెండి” బేరర్ తెచ్చిన కూల్‌డ్రింక్‌ని సిప్ చేస్తూ అంది దిశ.
అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చారు.
“నేను ఎల్లుండిలోపు మా వాళ్లకు ఉత్తరం రాయాలి. వసంతను మీరు ఒప్పిస్తారని నమ్ముతున్నాను…” అన్నాడు గిరెష్ అర్ధింపుగా.
“డోంట్ వర్రీ గిరీష్! ఎల్లుండి మార్నింగ్ వసంత తన నిర్ణయాన్ని మీతో చెబుతుంది సరేనా…?”
గిరీష్ ఎర్రటి ముఖం నిండా తెల్లటి వెలుగులాంటి ఆనందం.. దిశ సిటీ బస్సు ఎక్కేంతవరకూ అక్కడే నిలబడ్డాడు గిరీష్.
బస్సులో కూర్చున్నా గిరెష్ మాటలే జ్ఞాపకానికొచ్చి నవ్వుకుంది.
అతను తనను ప్రేమిస్తున్నానని చెప్పి వుంటే.. వుంటే… ఆ ప్రశ్నకు జవాబు కోసం కాసేపు వెతుక్కుంది దిశ.
ఇరవై నిమిషాల తర్వాత బస్సు విజయనగర్ కాలనీలో ఆగింది.
బస్సు దిగి హేండ్‌బ్యాగ్‌లోని విజిటింగ్ కార్డు తీసి చూసుకుంది.

************************

కాలింగ్‌బెల్ ప్రెస్ చేసి నిల్చుంది దిశ.
రెండే రెండు నిమిషాలు – సత్యబ్రహ్మ స్వయంగా వచ్చి తలుపు తీయడంతో ఆశ్చర్యపోయిందామె.
“గుడ్‌మార్నింగ్ సర్..!”
సడన్‌గా వచ్చిన దిశను చూసి ఆయన కూడా విస్తుపోయాడు.
“మార్నింగ్ ఏడు గంటలనుంచి పదిగంటల వరకూ మా ఆవిడ సిటీలోని గుళ్లూ, గోపురాలూ సందర్శిస్తుంది. అందువల్ల..” అంటూ తను తయారుచేసిన టీని రెండు కప్పుల్తో తెస్తూ చెప్పాడు సత్యబ్రహ్మ.
కాసేపు ఆ కబుర్లూ, ఈ కబుర్లూ అయ్యాక…
తనకొచ్చిన కల గురించి చెప్పింది దిశ.
“మీ వార్డెన్‌కు చెందిన ఆస్ట్రేలియన్ పిల్లిని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారా…?”
ఆశ్చర్యం మిళితమైన ఆ గొంతు వెనక ఆమె మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు.
“ఎస్ సర్!”
“ఓల్డ్‌మెన్ షల్ డ్రీమ్ డ్రీమ్స్, యంగ్‌మెన్ షల్ సీ విజన్స్…” సాలోచనగా చెప్పి “మిస్ దిశ! నిన్న నువ్వు నిద్రపోయేముందు క్రయోనిక్స్ గురించి ఆలోచించావా?”
“అవును. మీరా అడ్రస్ చెప్తే.. ఆ సంస్థలో చేరడానికి నేను సిద్ధంగా వున్నాను”
“ఆ సంస్థలో నువ్వు చేరడం వల్ల సమాజానికి ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్లకేవో రూల్స్, రెగ్యులేషన్స్ వుంటాయి. కఠినమైన పద్ధతులుంటాయి. మిలటరీ క్రమశిక్షణ అవసరం. అసలు అందులో చేర్చుకోవటానికే చాలా పరీక్షలు పెడతారు. కాకపోతే నా ద్వారా వెళ్తున్నావు గనుక నీకా ఇబ్బంది వుండదు. అదొక మత్తుమందు. నువ్వు జీవితంలో సుఖాల్నీ, ఆనందాన్ని కోల్పోతావు. ఇంతకీ నువ్వు ఆ సంస్థలో చేరాలని ఎందుకనుకుంటున్నావు?”
ఆ ప్రశ్నకు భారంగా నిట్టూర్చింది ఆమె.
“నా పరిశోధనల్లో మృత్యువు ఒక భాగమని తెలుసు. ఆ మృత్యువును ఏదో ఒకరోజు మనిషి గెలుస్తాడని నా నమ్మకం .. అందుకే…”
మరో ఇరవై నిముషాలు గడిచాయి నిశ్శబ్దంగా.
“నేనివాళే ఫోన్ చేసి చెప్తాను. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో నువ్వు తిరుపతికి వెళ్లు…. హోటల్ భీమాస్‌లో రూం తీసుకో. నిన్నొక వ్యక్తి  కలుస్తాడు సరేనా..
సత్యబ్రహ్మ అలా చెపుతున్న సమయంలో ఆయనకు క్రయోనిక్స్ సంస్థ మృతసంజీవనికి గల అనుబంధం ఏమిటో అడగాలని అనుకుని. కాని ఎందుకో అడగలేకపోయింది.
ఆమె లేచి నిలబడింది.
“ఎప్పుడెల్తావ్ తిరుపతి…?” అడిగాడు సత్యబ్రహ్మ.
“రేపు మధ్యాహ్నం…!”
“ఓ..కె.. బేబీ! విష్ యూ ఆల్ ది బెస్ట్..” ఆ సమయంలో ఆయనకు తెలీదు.
ఆమె క్రయోనిక్స్ సంస్థ మీద కేవలం యింట్రెస్ట్‌తోనే చేరడం లేదని. ఆ సమయంలో ఆమె ఆ సంస్థలో చేరడానికి వెళ్లకపోతే పిచ్చిదానిలా మారిపోయే పరిస్థితి ఏర్పడి వుండేదని ఆమె కొక్కదానికే తెలిసిన నిజం.
అదే సమయంలో ఆమెకు తెలియని యింకొక నిజంవుంది.
దిశ తీసుకున్న నిర్ణయం భారతదేశంలో అతి త్వరలో జరగబోతున్న ఒక అద్భుత సంఘటనకు ఆధారం కాగలదనే విషయం ఆమెకు తెలీదు.

*************************

మహారాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అర్జున్ చౌహాన్ దృఢంగా, ఆరోగ్యంగా, ఆరడుగుల ఎత్తుంటాడు. రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన నేత అతడు. రాష్ట్ర చీఫ్ మినిస్టర్‌గా, సెంట్రల్ మినిస్టర్‌గా చేశాడు.
పార్టీలోని రెండో బలమైన వర్గానికి  బలమైన ప్రతినిధి చౌహాన్. దేశంలోని స్మగ్లర్లు, రౌడీలు, బడా పారిశ్రామికవేత్తలు, అతని గుప్పిట్లో  వున్నారు. ఎప్పటికైనా ఒక నెలరోజులపాటైనా ప్రధాని పదవిలో కూర్చోవాలని అతని కోరిక.
అర్జున్ చౌహాన్ ఆంతర్యం విశ్వంభరరావుక్కు బాగా తెలుసు. అందుకే తగిన పాచికలు ఆయన కూడా సిద్ధంగా వుంచుకున్నాడు.
ఇద్దరి మధ్యా అరగంటసేపు చర్చలు జరిగాయి.
“చూడండి రావు సాబ్! ఆపద సమయంలో మీకు అండగా నిలిచింది నేను. నా వర్గానికి అయిదు కేబినేట్ పోస్ట్‌లు. ఆరు పార్టీ పోస్టులు యిస్తానని ప్రామిస్ చేశారు. నేను దేశభక్తుణ్ని. నాకేం అక్కర్లేదు. మా వాళ్ల గురించి మీకు తెలుసు. సమయం మించిపోకముందే మా వాళ్లను శాంతింపచెయ్యడం చాలా అవసరం. లేదంటే… ” ఆ మాటల వెనకున్న వ్యంగ్యం, బెదిరింపు సులభంగా అర్ధమైంది విశ్వంభరరావుకి.
“చూడు అర్జున్ భయ్యా! నువ్వు కూడా మిగతావాళ్లలా తొందరపడతావని నేననుకోలేదయ్యా…. మీ వాళ్లని శాంతింప చెయ్యాలంటే, ముందు నిన్ను శాంతింప చెయ్యాలని నాకు తెలుసు. రేపు జరగబోయే పార్టీ మీటింగుల వరకూ ఆగు. నీకు నేనేం చేస్తానో చూసి అప్పుడు మాట్లాడు.”
ఆ మాటతో చౌహాన్ పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.
“ఆ రోజు జరిగేది ఈరోజు చెప్తే నా మనసుకి ఏదో తృప్తిగా వుంటుంది కదా..” విశ్వంభరరావుతో పాటు తనూ లేచి పక్కన నడుస్తూ అడిగాడాయన.
విశ్వంభరరావు చౌహాన్ భుజమ్మీద చెయ్యి వేసి..
“ఎవ్వరికీ చెప్పనంటే నీకు చెప్తాను. కనీసం నీ భార్యకు కూడా చెప్పకూడదు. తెలుసా?”
ఆశ్చర్యంగా అలాగేనన్నట్లు తల వూపాడు అర్జున్ చౌహాన్.
నెమ్మదిగా చెప్పారు ప్రధాని విశ్వంభరరావు.
“నీ వర్గానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్టునిస్తాను సరేనా?” ఆ మాటతో చౌహాన్ గుండెల్లో రాయి పడింది.
“నా వర్గానికా.. నాకు రాదా?” భయం భయంగా అడిగాడు.
“నువ్వు అల్లరి చెయ్యకుండా మిగతా విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే…” ఆర్ధోక్తిగా ఆగాడాయన.
“రావు సాబ్! నా గురించి మీకు బాగా తెలుసు. మీ మనసులో ఈ ఆలొచన వుందని నాకు ముందే చెపితే…” అంతటి నాయకుడు పులకించిపోతూ అన్నాడామాట.
“మళ్లీ కలుద్దాం..” గబగబా చాంబర్‌లోంచి  బయటికొచ్చాడాయన.
పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు రుషికుమార్ ఆయన కోసమే చాంబర్ బయట ఎదురు చూస్తున్నాడు.
విశ్వంభరరావు బయటకు రావడంతో కమెండోలు ఎలర్టయ్యారు. వైర్‌లెస్ సెట్స్ ఆపరేషన్ మొదలైంది.
ప్రధాని కారెక్కారు. ఆ కారు అక్బర్ రోడ్‌వైపు మలుపు తిరిగింది. ముందు పైలెట్ జీపు, వెనక సెక్యూరిటీ జీపులు, వాటినిండా బ్లాక్ కాట్ కమెండోస్, పదికార్లు, మోటార్ బైక్స్.
కారులోని విశ్వంభరరావు తనని కలిసిన యిద్దరు నాయకుల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.

*******************

మధ్యాహ్నం రెండు గంటలు దాటింది.
ఆఫీస్ చాంబర్‌లోంచి పర్సనల్ రూంలోకి వచ్చిన ప్రధాని విశ్వంభరరావు చేతి గడియారం వైపు చూసుకున్నారు.
సరిగ్గా  అదే సమయంలో క్యారియర్‌తో లోనికి ప్రవేశించింది భారతి.
ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ భోంచేసే విశ్వంభరరావు మౌనంగా ఆలోచిస్తూ భోజనం చేయడం ఆశ్చర్యంగా వుంది భారతికి.
“ఏంటంకుల్! మీరు నిశ్సబ్దంగా వుండడం నాకు నచ్చలేదు” మెల్లగా అంది భారతి.
“నాకు కూడ నచ్చలేదు” పెదగా నవ్వుతూ అన్నాడాయన.
ఆయన లంచ్ తర్వాత జరగబోయే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుల మీటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. ప్రత్యర్ధి వర్గం లేవనెత్తే ప్రశ్నల పరంపర ఎలా ఎదుర్కోవాలో, ఏ వ్యూహంతో వారిని చిత్తు చెయాలో అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడాయన.
భోజనం చేశాక చేతులు కడుక్కుంటున్న సమయంలో అంది భారతి.
“అంకుల్. మీ మేధస్సును మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో.. మీ వెనుక కోట్లాది ప్రజల అండదండలున్నాయని మరువకండి..” అంది  భారతి ఉత్సాహంగా.
“మేధస్సుకు, రాజకీయానికి సంబంధం లేదమ్మా! రాజకీయానికి మనసుతోనే ఎక్కువ సంబంధం. ఆ మనసును చంపుకున్నవాడే రాజకీయవేత్తగా రాణిస్తాడు” అపప్టికే పి.ఎ.దేశ్‌ముఖ్ లోనికి రావడంతో ఆయన్ను చూశారు విశ్వంభరరావు.
మరో అయిదు నిమిషాల తర్వాత  రూమ్ లోంచి బయటికెళ్తూ  –
“భారతి! మనం యింటికి కలిసే వెళ్దాం.. నువ్వుండు” చెప్పి గబగబా నడిచారు విశ్వంభరరావు..

ఇంకా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *