March 28, 2024

అతడే ఆమె సైన్యం – 2

రచన: యండమూరి వీరేంద్రనాధ్.. yandamoori

ఇస్మాయిల్ ఖాన్ జేబులు తడిమి చూసుకున్నాడు.

అర్ధరూపాయి దొరికింది.

ఆఖరి అర్ధరూపాయి.

ఇస్మాయిల్ ఖాన్ భారత దేశ సైన్యంలో పనిచేశాడు. పది సంవత్సరాల క్రితం అతడు కాశ్మీర్‌లో శత్రుసైన్యానికి పట్టుబడ్డాడు. అతడిని మిలటరీ క్యాంప్‌లో బంధించారు. పది సుదీర్ఘమైన సంవత్సరాలు. అతడిని వాళ్లు ఒకటే కోరేవారు. “నిన్ను వదిలిపెడతాం.. భారతదేశానికి వెళ్లు. తిరిగి సైన్యంలో చేరు. ఈసారి మా గూఢచారిగా పనిచెయ్యి. సంవత్సరానికి లక్షరూపాయిలిస్తాం..” ఇస్మాయిల్ ఒప్పుకోలేదు. అతడు నిజాయితీ వున్న భారత సైనికుడు.

ఫలితంగా పది సంవత్సరాలు జైల్లో వున్నాడు. చివరికి శాంతి ఒప్పందం క్రింద ఖైదీల మార్పిడి జరిగింది. ఖాన్ స్వదేశం వచ్చేశాడు. అప్పటికే అతడి వయసు దాటిపోవటంతో తిరిగి సైన్యంలో ఉద్యోగం లేదు. పించను వస్తుందన్నారు. దానికోసం ఆర్నెల్లనుంచీ తిరుగుతున్నాడు . బ్యూరోక్రసీ అడ్డుపడుతోంది. అయినా అతడెప్పుడూ దేశాన్ని తిట్టుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని రక్షించడం కోసమా నేను చలిలో శత్రువులతో పోరాడింది అనుకున్నాడు. అతడికి పిల్లల్లేరు. భర్య ఎప్పుడో చచ్చిపోయింది.

ఆ రోజే అతడికో మంచి వార్త తెలిసింది. మాజీ సైనికుల కిచ్చే పించను శాంక్షను అయినట్టు. అంతేకాదు! చేనేత కార్యాలయంలో ఉద్యోగం దొరికినట్టు.

అందుకని ఆ రోజు తన దగ్గర వున్న ఆఖరి అర్ధ రూపాయి సగర్వంగా ఖర్చు పెట్టుకోదల్చుకున్నాడు. మిరపకాయ బజ్జీలు కొని పైపు దగ్గర నీళ్లు తాగి, జెండా ఊంచా రహే హమారా అనుకున్నాడు.

బజ్జీల కాగితం పారవేయబోతుంటే కనపడింది ఆ బొమ్మ.

“చైతన్య కోసం విలపిస్తున్న తల్లి” అని

నాలుగు రోజుల క్రితం పేపర్ అది. అప్పటికి చైతన్య ఇంటికి వచ్చి రెండు రోజులైంది.ఇస్మాయిల్ ఆలోచిస్తున్నది దాని గురించి కాదు. ఫోటోని చూస్తున్నాడు. మడతలు పడిన పేపరుని మరింత సాఫీగా చేసి చూశాడు. “రంగనాయకి కదూ” అని గొణిగాడు అతడి మొహం టెన్షన్‌లో ఎర్రబడింది. ‘ఈ వార్త ఆమెకి చెప్పాలి. ఆమెకి చెప్పాలి’ అనుకున్నాడు.

పాకిస్తాన్ జైళ్ళ్లలో  పది సంవత్సరాలు వున్నప్పుడు కూడా అతడింత టెన్షన్ అనుభవించలేదు.

వివరాలు కోసం ఇస్మాయిల్ మరోసారి పేపర్ చూశాడు.

హీరో చైతన్య కనపడకుండా పోవటం  గురించి రకరకాల కథలు అప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. విదేశాలకు వెళ్లిపోయాడని ఒక పేపరు రాసింది. ఫీల్డ్‌లో వున్న టాప్‌స్టార్‌ని పెళ్లాడి హనీమూన్‌కి వెళ్లాడని రూమర్ స్ప్రెడ్ చేసిందొక పత్రిక. అతడి పేరు ప్రఖ్యాతుల్ని చూసి ఓర్వలేక సాటి నటులెవరో కిడ్నాప్ చేయించారని మరో ‘కాకా’ పత్రిక వ్రాసింది. మరో పత్రిక మరింత ముందుకెళ్లి  చైతన్య మరణించాడనీ, ఆ వార్త బయటికి పొక్కనివ్వకుండా చేస్తున్నారనీ వ్రాసింది.

ఇస్మాయిల్ చేతిలో వున్న పత్రిక ముక్కలో మాత్రం చైతన్య కొన్ని రోజుల్నుంచి కనపడటం లేదన్న వార్త మాత్రమే వుంది.

అతడు పేపరు తీసుకుని కొట్టువాడి దగ్గరకెళ్ళి ” ఈ చైతన్య ఎవరు బాబూ?” అన్నాడు.

కొట్టువాడు ఇస్మాయిల్ కేసి విచిత్రంగా చూసి” నువ్వు నన్ను అడిగింది తెలుగులోనేనా?” అన్నాడు.

“అవును! ఏ?” అర్ధం కానట్టు చూశాడు ఇస్మాయిల్.

“తెలుగు సినిమాలు చూడవా నువ్వు?”

తెలుగు సినిమాలు కాదు కదా.. తెలుగుగడ్డను చూసి పది సంవత్సరాలైంది అందామనుకుని “నేను చూడను” అన్నాడు.

“నువ్వు సినిమాలు చూసినా, చూడకపోయినా, కనీసం తెలుగు మాట్లాడటం వస్తే చాలు చైతన్య తెలిసి వుండాలే. చైతన్య తెలుగు తెరమీద టాప్‌స్టార్.”

“ఆయన ఇల్లు ఎక్కడ?”

కొట్టువాడు అడ్రస్ చెప్పాడు.

ఇస్మాయిల్‌కి ఆ ఇల్లు కనుక్కోవటానికి ఎక్కువ సేపు పట్టలేదు. అతడి మనసంతా టెన్షన్‌తో నిండి వుంది.

చైతన్యది చాలా పెద్ద బంగ్లా. ముందు గేటు పది అడుగుల ఎత్తుంది. చుట్టూ చెట్లు, పోర్టికోలో రెండు కార్లున్నాయి. గేటు సందుల్లోంచి చైతన్య కనపడతాడేమో చూద్దామని నలుగురైదుగురు అభిమానులు తొంగి చూస్తున్నారు.

ఇస్మాయిల్ వాచ్‌మెన్‌తో “చైతన్య వున్నాడా?” అని అడిగాడు.

వాచ్‌మెన్ ఇస్మాయిల్ వైపు చిత్రంగా చూశాడు. చైతన్యని వున్నా”డా” అని సంబోధించే మొట్టమొదటి వ్యక్తిని అతను చూస్తున్నాడు.

“నువ్వెవరు?”

“నా పేరు చెప్తే అతనికి తెలీదు. ఉన్నాడా?”

“పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా? బాబుగార్ని వున్నాడా అంటావా? నాలుక కోసెయ్యగలను. పో ఇక్కడనుంచి” కసిరాడు వాచ్‌మెన్.

“సైన్యం నుండి వచ్చాను బాబూ! భాయీ భాయీ అనుకోవటమే తప్ప గౌరవాలిచ్చుకోవటం తెలీదు. చైతన్య నా కొడుకులాంటివాడు. అందుకని ప్రేమగా అలా పలకరించాను. అంతేకాని తేలిక చేయ్యాలనే ఉద్దేశ్యంతో కాదు. ఆయనుంటే ఒకసారి చూస్తాను.”

“ఇంకానయం నా కొడుకుని బయటికి పిలువు అనలేదు. కొడుకులాంటివాడట. ఇలా తండ్రులమని, తాతలమని చెప్పుకుని చైతన్యగారిని పిలవమంటే పిలవటానికి కాదు మాకు జీతాలిస్తున్నది. వెళ్లు.. వెళ్లు..”

“అలా అనకు. ఆ అబ్బాయితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.”

“వెళ్లవయ్యా చెపుతుంటే నీక్కాదూ”

“పోనీ ఆయన అమ్మగారున్నారా?”

వాచ్‌మెన్ ఇస్మాయిల్ భుజం మీద చెయ్యి వేశాడు.

“అయ్యగారి అభిమానినంటావ్. ఆయన లేదనేసరికి అమ్మగారు కావాలంటావు. అసలు ఎవరవిరా నువ్వు?”

“రంగనాయకికి అన్నయ్యలాంటి వాడిని”

ఆ మాటల్లో నిజాయితీకి వాచ్‌మెన్ కాస్త బెదిరాడు. అయినా ఆ విషయం ఒప్పుకోవటం ఇష్టంలేనట్టు “అయితే ఓ వారం రోజుల తరువాత రా పో ” అన్నాడు.

“వారం రోజులు ఎందుకు?”

“అబ్బాయి తిరిగి వచ్చినందుకు అభిషేకం చేయించటానికి అమ్మగారు తిరుపతి వెళ్లారు. వారం రోజుల తర్వాత వస్తారు.”

ఇస్మాయిల్ కాస్త నిరాశ చెందినట్టు కనబడ్డాడు.

“వారం ఆగాలా? ఇంకా వారం ఆగాలా?”

“ఏమిటి నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్?”

“చైతన్యతో నన్నొకసారి కలుపు బాబు! నీకో మంచి బహుమతి లభిస్తుంది.”

“నన్నేం అనుకుంటున్నావు నువ్వు? లంచాలు తీసుకునేవాడిలా కనబడుతున్నానా నేను. అలా డబ్బులు తీసుకుని అభిమానులకి చైతన్య దర్శనం యిప్పించటం మొదలుపెడితే ఇప్పటికి ఆయనకన్నా ఎక్కువ సంపాదించి వుండేవాడిని తెలుసా?”

“అయ్యో నేనా ఉద్ధేశ్యంతో అనలేదు బాబూ.”

“చాల్లేవయ్యా. ఇంకేం మాట్లాడకు వెళ్లు..”

వాచ్‌మెన్ మాటలు పూర్తవుతూ వుండగా గేటు తెరుచుకుంది. చైతన్య కారు బయటకొచ్చి ఇస్మాయిల్ చూస్తుండగానే స్టూడియో వైపు దూసుకుపోయింది.

“వెళ్లు స్టూడియో దగ్గర ప్రయత్నం చెయ్యి. ఆయన మాట్లాడతారేమో..”

“ఊహూ. స్టూడియోకి వెళ్లను. తిరుపతి వెళతాను. చైతన్యకి కాదు. రంగనాయకికి చెప్పాలి ముందు..” అంటూ తనలో తానే గొణుక్కుంటూ వెళ్లిపోతున్న ఇస్మాయిల్ వైపు ఆస్చర్యంగా చూస్తూ వుండి పోయాడు వాచ్‌మెన్.

****************************

“స్త్రీ జీవితంలో ఒకేసారి ప్రేమిస్తుంది మోహన్. మనసూ, తనువూ ఒకరికే అర్పిస్తుంది.”

“అలా అనకు సుజాతా, నువ్వీ వివాహం చేసుకోక తప్పదు. శేఖర్ యోగ్యుడు. పైగా నా స్నేహితుడు.”

“నన్ను క్షమించు భార్గవ్. నీకు నన్ను వివాహం చేసుకోవటం ఇష్టం లేకపోతే  పోనీ. కానీ ఇంకొకర్ని  చేసుకొమ్మని మాత్రం అనకు.”

“అయ్యో సుజాతా నీకెలా చెప్పను. నాకు .. నాకు బ్లడ్ కాన్సర్ సుజాతా”

“కట్” అన్నాడు దర్శకుడు. చైతన్య వచ్చి కుర్చీలో కూర్చుని రిలాక్స్ అయ్యాడు. ఈ సినిమా నాలుగు రోజులకన్నా ఎక్కువ ఆడదని తెలుస్తూనే వుంది. అయినా తన అభిప్రాయం బయట పెట్టకుండా చివరి షెడ్యూల్ చేస్తున్నాడు. అవతల దర్శకుడు పెద్దవాడు. యాభై సినిమాలకు పైగా తీసినవాడు. తను తీసిందే వేదం అని నమ్మినవాడు.

చుట్టూ వందిమాగధులు. ఆయన తీసిన ప్రతి షాటుకీ, చైతన్య చెప్పిన  ప్రతి డైలాగుకి చప్పట్లు కొడుతున్నారు. ఈ హిపోక్రసీ చైతన్యకి విసుగ్గా ఉంది. కాని తప్పదు.

రాత్రి తొమ్మిదింటికి షూటింగ్ పూర్తయింది.

చైతన్య ఇంటికి వెళ్లలేదు. జయసింహ ఇంటికి వెళ్ళాడు.

చాలా పెద్ద ఇల్లు అది. పురాతన కాలపు రాజభవనంలా వుంది. లోపల ఫర్నీచరు మాత్రం ఆధునికంగా వుంది. ప్రతి గదికీ ఎయిర్ కండీషనర్‌లున్నాయి.

“నేనే వచ్చేవాడిని కదా. నాతో పని అంటే ఆశ్చర్యంగా వుంది” అన్నాడు జయసిమ్హ.

“ఫర్వాలేదు”

“మా పిల్లలందరూ మీ ఫాన్స్. వాళ్లు లేరు. బయటకెళ్లారు. ముఖ్యంగా మా పెద్దమ్మాయి మీ ఫాన్. అమ్మాయి ఎమ్మెస్సీ మాత్స్‌లో చేసి, ఐయ్యేయస్‌కి ప్రిపేర్ అవుతుంది”

చైతన్య కాస్త గర్వంగా ఫీలయ్యాడు. మామూలు అభిమానులు వుండతం వేరు. బాగా చదువుకున్న వాళ్లు అభిమానులవ్వడం వేరు.

“మా అమ్మాయికి పజిల్స్ చాలా ఇష్టం.”

“మీకు పెయింటింగ్స్ ఇష్టంలా వుందే” గోడలవైపు చూస్తూ అన్నాడు చైతన్య.

“అవును. అవన్నీ నేనే వేశాను.”

ఇద్దరూ కూర్చున్నారు. రాజా జయసింహ స్కాచ్ ఓపెన్ చేస్తూ “చెప్పండి ఇంత రాత్రిపూట వచ్చారంటే ఏదో పని వుండే వుంటుంది.”

“అవును. ఓ కేసు  వివరణ కోసం వచ్చాను.”

జయసింహ ఆశ్చర్యంగా “కేసా?” అన్నాడు.

“అవును. కొన్నాళ్లపాటు నేను కిడ్నాప్ అయ్యాను తెలుసు కదా…”

“తెలుసు”

“పోలీసులకు వివరాలు చెప్పలేదు నేనే స్వయంగా పరిశోదిద్ధామని.”

జయసింహ ఉత్సుకతో చూశాడు.

“నేనొక ఆస్పత్రిలాంటి  ప్రదేశంలో వుంచబడ్డాను. నిజానికి అది ఆస్పత్రి కాదు. ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకుని నన్ను అందులో వుంచారు.”

“అయితే?”

“ఆ భవనం మీదే జయసింహా!”

ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. దాన్ని చెదురుస్తూ ఆశ్చర్యం నుంచి తేరుకున్న జయసింహ “మైగాడ్ నిజమా?” అన్నాడు. ” ఆ భవనాన్ని ఎవరో నెల రోజులపాటు షూటింగ్ కోసం కావాలంటే ఇచ్చాను. అంతేకాని ఆ దుర్మార్గులు ఇలా మిమ్మల్ని బంధించటానికి ఉపయోగిస్తారు అనుకోలేదు. ఐయాం సారీ.. నిజంగా..”

“ఫర్వాలేదు.”

“నేను మీకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. మీరు ఈ విషయం పోలీసులకి చెప్పి వుంటే నన్ను భ్రష్టు పట్టించి వుండేవాళ్లు. ప్రశ్నలతో చంపి వుండేవాళ్లు.”

“మీరు నాకో సాయం చెయ్యాలి.”

“చెప్పండి.”

“ఈ ఇంటికోసం మీ దగ్గరకు ఎవరొచ్చారో చెప్పండి”

“అతని పేరు జయరాం అని చెప్పాడు. నెలరోజుల అద్దె పదివేలు ముందే ఇచ్చాడు.

“అతడి అడ్రసు?”

“సారీ, తెలీదు.”

“నన్ను పిచ్చివాడిని చెయ్యడం కోసమో, సుబ్బారావ్‌ని అని నమ్మించటం కోసమో దాదాపు యాభైవేళ్లు ఖర్చుపెట్టారు వాళ్లు. ఎందుకో అర్ధం కావట్లేదు. నన్ను చంపటం వాళ్ల ఉద్ధేశ్యం కాదు. అదే అయితే మొదటిరోజే ఆ పని చెయ్యొచ్చు. వాళ్లు పెట్టిన హింసలకి ఇంకొకరయితే పూర్తిగా పిచ్చివాడయిపోయి వుండేవాడే. ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు వాళ్లు?” అది తెలుసుకోవడం కోసమే నేను స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను. పోలీసులు కేవలం క్రిమినల్‌గా ఆలోచించి, ఆ కోణంలో వెళతారు. నా విషయంలో అది కారణం కాదనిపిస్తుంది. వాళ్లు ఏదో ఉపయోగం కోసం నన్ను వాడుకోవాలనుకున్నారు. మధ్యలో అది ఫెయిలైంది. నాకు వాళ్లు దుర్మార్గులుగా, విదేశీ ఏజంట్లుగానూ కనుపించలేదు. అందుకే నాకు ఇంత ఇంటరెస్టు పుట్టింది” అన్నాడు. అతడు ప్రనూషని గుర్తు తెచ్చుకుంటూ ఈ మాటలు మాట్లాడాడని అతని మనసుకు  మాత్రమే తెలుసు. ఒకవైపు ఆమె అందం సూదంటు రాయిలా ఆకర్షిస్తున్నా.. ఆమె తనని పట్టి వుంచిన నాటకం తల్చుకుంటూ వుంటే  ఒళ్లు మండిపోతోంది. ఎలాగయినా ఈ నాటకం తాలూకు రహస్యం కనుక్కుని ఆమెని రెడ్‌హేండెడ్‌గా పట్టుకోవాలని అతడి మనసు ఉవ్విళ్లూరుతోంది.

“నేను మీకే విధంగా సాయపడగలిగినా సంతోషమే” అన్నాడు జయసింహ.

” ఆ జయరాం మీకు గుర్తున్నాడా?”

“ఉన్నాడు. సాధారణంగా ఒకసారి చూస్తే నేను మర్చిపోను”

“మీరొక పెయింటర్. అతడి ఫోటో చిత్రీకరించగలరా?”

జయసింహ స్తబ్దుడై చూశాడు. కానీ క్షణంసేపే. అతడి మొహం విప్పారింది.

“నిజమే. ఇది మంచి ఆలోచనే.”

జయసింహ మరి ఆలస్యం చెయ్యలేదు. స్టాండ్ అరేంజ్ చేసి , పెయింట్ చేయటం మొదలుపెట్టాడు. సరిగ్గా గంట పట్టింది బొమ్మ వేయటానికి.

బొమ్మ పూర్తి చేసి పక్కకి తొలుగుతూ “చూడండి చైతన్యా! ఇతడే జయరాం” అన్నాడు.

చైతన్య ఆ బొమ్మని చూసి ఉలిక్కిపడి “మైగాడ్! ఇతను మీ దగ్గరికి జయరాం అని పేరు పెట్టుకుని వచ్చాడా? నా దగ్గర పాల్ జోసెఫ్ అని పేరు పెట్టుకున్నాడు.” అన్నాడు.

జయసింహ ఆ బొమ్మని చూస్తూ వుండిపోయాడు.

“ఇతడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను” దృఢంగా అన్నాడు చైతన్య.

“అంత అవసరం లేదు. అతడిని నేను తరచు చూస్తూ వుంటాను” వెనుకనుంచి వినపడింది.

ఇద్దరూ చప్పున వెనుదిరిగారు.

గుమ్మం దగ్గర నిలబడి వుంది జయశ్రీ. జయసింహ కూతురు. ఐ.ఏ.యస్.కి తయారవుతున్న అమ్మాయి.

“నిజంగానా! ఎక్కడ చూస్తూ వుంటావు అతన్ని?” తొందర తొందరగా అడిగాడు చైతన్య.

“సిటీ సెంట్రల్ లైబ్రరీలో” అంది జయశ్రీ.

“నేను చాలా సార్లు అతన్ని అక్కడ చూశాను”

“అతడిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాను. నీకు కనపడితే వెంటనే స్టూడియోకి ఫోన్ చేయ్యి.”

“తప్పకుండా” అంది జయశ్రీ.

చైతన్య జయసింహతో కరచాలనం చేసి “థాంక్స్. చాలా సాయం చేశారు. ఒక “క్లూ” దొరికింది. వెళ్లొస్తాను” అన్నాడు.

అతడిని దింపటానికి జయశ్రీ కారు వరకూ వచ్చింది.

చైతన్య కారు కదిలింది.

ఆమె ఒక నిమిషం అలాగే నిలబడి తర్వాత లోపలికి వెళ్లింది. బెడ్‌రూంలోకి వెళ్లి తలుపేసుకుని ఫోన్ డయల్ చేసింది.

“హల్లో ప్రనూషా”

“నేనే మాట్లాడుతున్నాను”

“నువ్వు వూహించింది కరెక్టేనే. చైతన్య ‘ ఆ ఇల్లు అద్దెకి ఎవరికిచ్చారు’ అని వాకబు చేయటానికి మా ఇంటికొచ్చాడు.”

“తర్వాతేమైంది?” అవతలి కంఠంలో టెన్షన్.

” మా నాన్న ఓ పిచ్చిమారాజు. ఆ మనిషి బొమ్మ వేసి చూపించాడు. మధ్యలో నేను కల్పించుకుని అతను లైబ్రరీ దగ్గర దొరుకుతాడని చెప్పాను.”

అవతలి కంఠం రిలీఫ్. “మంచిపని చేశావ్.”

“విష్ యు బెస్ట్ ఆఫ్ లక్”

“థాంక్యూ”

ఫోన్ పెట్టేసి ప్రనూష లేచి డ్రాయింగ్ రూంలోకి వచ్చింది.

ఆ రూంలో వున్న ఫర్నీచర్ దాదాపు యాభై లక్షలు చేస్తుంది. మామూలుకన్నా దాదాపు రెండింతలు ఎత్తున్న పైకప్పు. ఎంతో పనితనంల్తో నగిషీలు చెక్కిన తలుపులు, ఆరడుగుల ఎత్తున్న దంతపు విగ్రహం రాజభవనంలా వున్న ఆ విశాలమైన గది మధ్యలో ఆమె ఒక్కతే ఎడారి మధ్యలో తప్పిపోయిన శిశువులా వుంది.

ఆ గది గోడకి బంగారపు రంగు అద్దకం వున్న లతల ఫ్రేములో రెండు నిలువెత్తు ఫోటోలున్నాయి. రాజవంశీకుల్లా వున్న ఆ దంపతుల్లో భర్త మాత్రం మిలటరీ డ్రస్‌లో వున్నాడు.

అతడు ప్రనూష తండ్రి.

అతడు రాజవంశానికి చెందినవాడు. ఆమె తాతముత్తాతలు సామ్రాజ్యాధీశులు. రాజ్యాలు పోయినా వారి దగ్గర  నిక్షిప్తమైన వజ్రాలే కోట్లు ఖరీదు చేస్తాయని ప్రతీతి. ఎన్ని కోట్లకి అధిపతులయినా, వారు దేశభక్తులు. ప్రనూష తండ్రి భారత సైన్యంలో చాలా పెద్ద పోస్టులో పని చేసి మరణించాడు. ఆమె తల్లి కూడా తండ్రితోపాటే హతురాలయింది. ఆ మరణాలు ప్రనూష గుండెల్లో శాశ్వత చిత్రాలు. ఆమె వాటిని మర్చిపోలేదు.

ఆ ఫోటోల క్రిందగా వున్న డ్రాయర్‌లోంచి ఆమె ఒక కాగితాల కట్ట తీసింది. రకరకాల మ్యాపులూ, వివిధ ఫోటోలు వున్నాయి ఆ కట్టలో. వాటిని కొంచెం సేపు పరిశీలించి తిరిగి లోపల పెట్టేసింది. తలెత్తి తండ్రి ఫోటో వైపు చూసింది. “వచ్చేసింది నాన్నా, ఏ రోజు కోసమైతే నేను ఇన్నాళ్లూ ఎదురు చూస్తున్నానో ఆ రోజు దగ్గర్లోకి వచ్చేసింది” అనుకుంది మనసులో.

**********

ఇస్మాయిల్ తిరుపతి బస్‌స్టాండ్‌లో దిగాడు. బస్‌స్తాండ్ పక్కనే వున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌కి వెళ్లి “చైతన్య అమ్మగారు ఈ వూరొచ్చారంట. ఎక్కడ దిగారో చెప్పగలరా?” అని అడిగాడు.

“చైతన్యగారి సినిమాలు పంపిణీ చేసేది మేము కాదు. పక్క వీధిలో మరో ఆఫీసు వుంది” అని చెప్పారు వాళ్లు. ఇస్మాయిల్  అక్కడికి వెళ్లాడు. చాలా పెద్ద ఆఫీసు అది. పెద్ద హాలు నిండా చైతన్య తాలూకు చిత్రాల రకరకాల ఫోటోలు అతికించి వున్నాయి. వాటిని చూస్తూ నిలబడ్డాడు అతడు. అప్రయత్నంగా అతడి కళ్లు తడి అయ్యాయి. ఏదో తెలియని ఉద్విగ్నత మనసంతా నిండి వుంది.

“చైతన్యా! ఇంత చిన్న వయసులో ఇంత విజయాన్ని సాధించావు.. దీన్నంతా నీ తండ్రి చూస్తూ వుంటే ఎంత సంతోషించేవాడో కదా” అనుకున్నాడు అతను. చైతన్యని దాదాపు పది సంవత్సరాల వయసులో వుండగా చూశాడు. మంచు పర్వతాల మధ్య చిన్న కాలనీ, ఆకాశాన్ని  అంటే సూదిమొన ఆకుల చెట్లు. ఆ ప్రశాంత నిశ్శబ్దాన్ని చెదురుస్తూ బాంబుల చప్పుడు.. యుద్ధం..

“ఎవరదీ?”

ఇస్మాయిల్ వెనక్కి తిరిగి చూశాడు. ఆఫీసు గుమస్తా అడుగుతున్నాడు. ఇస్మాయిల్ అతని దగ్గిరగా వెళ్లి “చైతన్య అమ్మగారు తిరుపతి వచ్చారట కదా. ఆమె ఎక్కడున్నారు?” అని అడిగాడు. చైతన్య ప్రసక్తితో గుమస్తా మొహంలో నమ్రత కనబడింది. “మీరామె బంధువులా?”

అవునూ కాదుల మధ్య తలూపాడు ఇస్మాయిల్.

“రంగనాయకమ్మగారు కొండపైకి వెళ్లారు. ఈ పాటికి బయల్దేరి వస్తూ వుండవచ్చు.”

“ఇక్కడికే వస్తారా?”

“అవును. ఇక్కడికే వస్తారు.కాస్త విశ్రాంతి తీసుకుని ఇక్కడనుంచి వెళతారు. మీరిక్కడే వుండండి..”

ఇస్మాయిల్ ఎదురు చూడటం ప్రారంభించాడు.

******************************

“ప్రేమ నీళ్లు లాంటిది. ఏ హృదయపు సీసాలో పోస్తే ఆ ఆకారం దాలుస్తుంది.”

“కాదు శేఖర్, ప్రేమ పంచదారలాంటిది. కాఫీలో వేస్తే తియ్యగా  వుంటుంది. కాలిస్తే నల్లబడుతుంది. ఎక్కువయితే మొహం మొత్తుతుంది.”

” నా ప్రేమ కాలిస్తే నల్లబడదు. ఎక్కువయినా మొహం మొత్తదు. స్వచ్చమైన పంచదారలా తెల్లగా మెత్తగా వుంటుంది.”

“నువ్వు పంచదారలాంటి వాడివయితే నేను రసం తీసిన బత్తాయిపండులాంటిదాన్ని శేఖర్. బీదతనం తప్ప ఏ అర్హత లేనిదాన్ని.”

“కట్” అన్నాడు డైరెక్టర్. చైతన్య వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నలుగురైదుగురు బెదురుగా వచ్చి నిలబడితే పిల్చి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.

“పిక్చర్ ఎలా వుంది?” వారం రోజుల క్రితం రిలీజయిన తన పిక్చర్ గురించి అడిగాడు.

“బావుంది సార్. యాభైరోజులు పోతుంది” వారిలొ ఒకరు సమాధానం ఇచ్చాడు. వాళ్ల దృష్టిలో యాభైరోజులంటే బాగున్నట్టే. ఆ పిక్చర్ గురించి రకరకాల వ్యాఖ్యానాలు విన్నాడు. తన ప్రతి పిక్చర్ రిలీజ్‌కి ఇది తప్పదు. తన చుట్టూ వున్న వలయం గురించి అతడికి తెలుసు. నిర్మాతలు, దర్శకులు, స్నేహితులు.. ప్రిఫ్యూ చూడగానే అద్భుతం అంటారు. షేక్‌హాండ్లిస్తారు. ఆ సాయంత్రం వేర్వేరు గ్రూపులుగా చేరి మందు ప్రారంభించగానే ఇక విమర్శల పర్వం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క గ్రూపు ఆయా దర్శకుల, నిర్మాతల పట్ల తమకున్న అభిప్రాయాన్ని బట్టి ఆ చిత్రాన్ని శల్య పరీక్ష చేస్తారు. సాయంత్రం షెక్‌హాండ్లిచ్చిన మొదటి నాలుగు రోజులు ఎవరూ టాక్ చెప్పరు. ఇదంతా తనవరకూ రాదు. తనంటే గౌరవం, భయం. “చాలా బావుందంటున్నారు” తో మొదలవుతుంది. మొదటివారం అవగానే ఇన్‌డైరెక్టుగా చెప్పాలని మిగతా నిర్మాతలు, దర్శకుల తపన. “ఏదో కలెక్షన్లు తగ్గినట్టున్నాయంటున్నారే” అంటూ ప్రారంభిస్తారు. కళ్లలో లీలగా ఎక్కడో సంతోషం. అందరూ తనవాళ్లే . కానీ వేరేవాళ్లు తనతో సక్సెస్ తీస్తే తమ విలువ ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయం.

“షాట్ రెడీ సార్” అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పాడు. చైతన్య కెమెరా ముందుకు వెళ్లాడు. సీన్ ప్రారంభమయింది.

“ఈయనే నాన్న. నే చెప్పానే శేఖర్ అని” హీరోయిన్ అంటోంది.

“నమస్కారం అండీ” తను నమస్కారం చేశాడు. కెమెరా రన్ అవుతున్న శబ్దం వినిపిస్తూంది. హీరోయిన్ తండ్రి బొంగురు గొంతుతో అన్నాడు. “వెళ్లమ్మా! తరతరాల్నుంచి మన ఇంటినే అంటిపెట్టుకుని ‘అంబా’ అన్న రెండక్షరాలే ప్రాణంగా, పెరట్లో మనకి సేవ చేస్తున్న ఆవు ‘రామూ పొదుగు నుంచి పితికిన పాలలో, కార్మికుల చెమటతో తడిసిన చెరుకునుంచి పెట్టుబడిదారులూ, బూర్జువాలూ తయారుచేసిన పంచదార వేసి కాఫీ తీసుకురా తల్లీ. మనలాంటి రైతు కూలీల రాత్రింబవళ్లు కష్టపడి పండించిన కాఫీ గింజల పొడి వేయటం మర్చిపోకమ్మా.”

“కట్” అన్నాడు దర్శకుడు.

చైతన్యకి నిస్సత్తువ ఆవరించింది. ఈ చివరి డైలాగ్ మీద మధ్యాహ్నం రెండు గంటలు చర్చ జరిగింది. ఒక్క డైలాగ్‌లోనే సెంటిమెంటు, విప్లవం, వగైరా వగైరాలు సృష్టించగలిగిన రచయిత మేథస్సుకి జోహార్లంటున్నాడు దర్శకుడు. పాపం నిర్మాతకి డైలాగ్ అర్ధం కాక బిక్కమొహం పెట్టి కూర్చున్నాడు. “వెళ్లి కాఫీ తీసుకురా అమ్మా” అని ఒక్క డైలాగ్ చాలు కదా అంటాడు తను. షూటింగ్ ఆగిపోయింది. రచయిత కోసం కారు వెళ్లింది. రచయిత వచ్చి ఆ డైలాగ్ గొప్పతనం ఏమిటో, అలాంటి డైలాగ్‌లు వున్న తన గత సినిమాలు ఎన్నెన్ని ఎక్కడ ఎక్కడ ఎన్ని రోజులు ఆడాయో ఉపన్యాసం ఇచ్చి వెళ్లిపోయాదు. ఒక్క అక్షరం మార్పులేదు.

“సార్ మీకు ఫోన్”

చైతన్య ఆలోచన నుంచి తేరుకుని బయటకు వచ్చాడు.

“ఏమిటీ విషయం?” అడిగాడు.

ఆ అమ్మాయి కంఠంలో టెన్షన్. “పాల్ జోసెఫ్ కనపడ్డాడు” అంది.

చైతన్య చేయి రిసీవర్ మీద బిగుసుకుంది. “ఎక్కడ?” అన్నాడు ఆత్రంగ.

“సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరే”

“లోపలే వున్నాడా?”

“ఉన్నాడు.”

చైతన్య దర్శకుడిని అడిగాడు.”ఇంకా ఎంతసేపు వుంటుంది సీను?”

“నేనిన్ను ప్రేమిస్తున్నాను. అన్న డైలాగ్ హీరో అంటే బావుంటుందో తెలియటం లేదు” అన్నాడు దైరెక్టర్.

“రచయిత ఏం వ్రాశాడు?”

“అదే తెలియడం లేదు.”

చైతన్య దర్శకుడి చేతిలో స్క్రిప్టు తీసుకుని చూశాడు. అందులో ఇలా వుంది.

“హీ. త: (అంటే హీరోయిన్ తండ్రి) నువ్వు మా ఇంటికి రావటం ఎంతో సంతోషంగా  వుంది బాబూ! (కళ్లనీళ్లు తుడుచుకొనును) (క్లోజప్: పరంధామయ్య ఉలిక్కిపడి, తన భ్రమకి తనే పేలవంగా నవ్వుకుని) బ్రతికి వుండగా నీ తడి నేను తుడవలేకపోయాను. చచ్చి నా కన్నీళ్లు తుడుస్తావా విశాలాక్షి (అంటూ తనని తనే తుడుచుకుని లోపలికి వెళ్లిపోతాడు. హీరో హీరోయిన్‌లు మిగులుతారు)

హీ: నేనిన్ను ప్రేమిస్తున్నాను.

చైతన్య దర్శకుడిని “ఏమిటి సమస్య?” అని అడిగాడు. దర్శకుడు స్క్రిప్టు వైపు చూస్తూ “రచయిత ఇక్కడ హీ అని వ్రాశాడు. హీరోనో, హీరోయినో తెలియటం లేదు. ఎవరితో అనిపించను డైలాగు?” అన్నాడు.

“రచయితకి కారు పంపలేకపోయారా?”

” ఆ రచయిత ఇంకో సెట్టింగ్‌కి వెళ్లాడుట. మరో రచయితని పిలిపిస్తున్నాను.”

“ఈలోపు హీరోయిన్ తండ్రి క్లోజప్ తీయండి”

“ఆయన పేలవంగా నవ్వటం ప్రాక్టీసు చేస్తున్నాడు”

చైతన్య చిరాకు అణచుకుని “ఆయన అది ప్రాక్టీసు చేశాక “క్లోజప్” తీసి “ప్యాకప్” చెప్పండి” అని బయటకొచ్చి కారెక్కాడు.

అతడు సిటీ లైబ్రరీకి వచ్చేసరికి ఆరయింది.

మొహానికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్లాడు. తనది చాలా కష్టమైన పని అని అతడికి తెలుసు . చాలా మంది గుర్తుపడతారు తనని.

అతడు ఒక మూల నిలబడీ చుట్టూ చూశాడు. అందరూ పుస్తకపఠనంలో నిమగ్నమై వున్నారు. అంతలో వెనుక నుంచి “చైతన్యగారూ!” అని వినపడింది. చప్పున వెనుదిరిగి చూశాడు. లైబ్రేరియన్ అతని వైపు ఎగ్జయిటింగ్‌గా చూస్తూ వున్నాడు. తెలుగుతెర నెంబర్‌వన్ హీరోని ఆ ప్రదేశంలో అలా చూడటం వల్ల వచ్చిన ఉద్వేగం అది.

“జయశ్రీగారు మీకీ చీటీ  యిమ్మన్నారు…”

“జోసెఫ్ పాల్ వెళ్లిపోతున్నాడు. అతడిని నేను ఫాలో అవటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అతను కార్లోగాని వెళితే ఫాలో అవటం సాధ్యం కాదు. మరోరోజు అతనొచ్చినప్పుడు మీకు ఫోను చేస్తాను” అని వుంది అందులో.

చైతన్యని ఒక్కసారిగా నిరాశ ఆవరించింది. అవును మరి. తనకి వున్నంత  ఇంటరెస్ట్ ఈ కేసులో మరొకరికి ఎందుకుంటుంది? ఆ అమ్మాయి అంత క్యాజువల్‌గా తీసుకోవటంలో తప్పులేదు.

ఇప్పుడిక అక్కడ చేసేదేమీ లేదు. అతడు వెనుదిరుగుతూ వుండగా “ఆటోగ్రాఫు సార్!” అన్నాడు లైబ్రేరియన్. చైతన్య విసుగు అణచుకుంటూ సంతకం పెట్టాడు. మూడ్ ఎలా వున్నా ఈ పనులు తప్పవు. కాస్త విసుగు చూపిస్తే దానికి చిలువలు, వలువలు అల్లబడి పాకిపోతాయి.

చైతన్య లైబ్రరీ మెట్లు దిగి వస్తున్నాడు. ఎత్తయిన భవంతి. చాలా విశాలమైన మెట్లు. దాదాపు పాతిక ముప్పై వుంటాయి.

అతడు నాలుగో మెట్టు దిగుతూ వుండగా..

క్రింద మెట్టు మీదనుంచి పైకి వస్తూ కనిపించింది ప్రనూష.

అతను ఆగిపోయాడు.

ఆమె అతడిని చూడలెదు.

తల వంచుకుని అతడివైపే వస్తోంది.

అతను ఆమె పక్కగా వెళ్లాడు. ఆమె తల వంచుకునే ఇంకా వస్తోంది. అతడు ఆమె వెనుకకి చేరుకుని ఆమెతోపాటు సమాంతరంగా అడుగులు వేయసాగాడు.

ఆమె లైబ్రరీలోకి వెళ్లింది. అయితే లోపలికి వెళ్లలేదు. ముందుగదిలో  లైబ్రేరియన్ దగ్గర వున్న పుస్తకంలో స్తంభం చాటున దాక్కున్నాడు. ఆమె అతడిని గమనించకుండా మెట్లు దిగింది. అతడు చప్పున వెళ్లి రిజిస్టర్‌లో చూశాడు. “కమల” అని వ్రాసి వుంది. అతను విస్మయంతో ఆ పేరువంక మళ్లీ చూశాడు. ఈ అమ్మాయి అసలు పేరు కమలా? లేక అంతకు ముందు “అక్షౌహిణి” అని మోసం చేసినట్లే ప్రనూష  కూడా అసలు పేరు కాదా? అనుమానాలు పక్కన పెట్టి అతను వీధిలోకి వచ్చాడు.

అప్పుడొచ్చింది అతడికి ఇబ్బంది.

మొహాన్నైతే కర్చీఫ్‌తో కప్పుకున్నాడు గానీ, నడకనీ, బాడీ స్టయిల్‌ని ఎలా మార్చగలడు? అతన్ని ప్రజలు ఎన్నో సినిమాల్లో ఎంతో సునిశితంగా గమనిస్తూ వుంటారు. అతని ప్రతీ కదలికా వాళ్లు గుర్తుపట్టగలరు. వెనుక నుంచి చూసినా పోలిక అనుమానించ గలిగేటంత ఫాన్స్ అతడికి వున్నారు.

అతనిలోని నటుడికి అప్పుడే నిజమైన పని ఏర్పడింది. మొహాన్ని అలాగే రుమాలు చాటు చేసుకుని మొత్తం నడక విధానం మార్చి బాడీలో వంపుల్ని మరింత విభిన్నంగా చేసి నడవసాగాడు. అతడికి ఒకటి మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రనూష కోటీశ్వరురాలు అయి వుండాలి. ఆమె తనని పిచ్చివాడుగా నిరూపించే కార్యక్రమంలో లక్షరూపాయలదాకా ఖర్చు పెట్టింది. మరి ఆ అమ్మాయి ఇంత సాదా దుస్తులలో వున్నదేమిటి?

అతడి అనుమానాన్ని బలపరుస్తూ ఆమె ఒక చిన్న ఆఫీసులో ప్రవేశించింది. అతడికి మరో ఆలోచన స్ఫురించింది. లక్ష్మిని తన భార్యగా నటించటానికి వాడుకున్నట్లే, ఈ కమల్ని కూడా ఎవరైనా నాటకానికి ఒప్పించారా?

ఈ ఆలోచన అతడికి అంత ఆనందాన్ని యివ్వలేదు. తన ప్రత్యర్ధి ప్రనూష అయితే బావుండునని అతడు మనసులోనే కోరుకుంటున్నాడు. తలపడితే అంత అందమైన, తెలివితేటలున్న అమ్మాయితోనే తలపడాలి. అతడికి డాక్టర్ పాల్ మొదటినుంచి నచ్చలేదు. ఆ డాక్టరేగాని ఈ రాకెట్‌కి మూలకారకుడయి లక్ష్మినీ, కమలనీ వాడుకున్నట్టు రుజువైతే అతను తన చేతిలో బలమైన దెబ్బ తినబోతున్నాడు.

అంతలో ఆమె బయటకు వచ్చింది. అతడింక ఈ ముసుగులో గుద్దులాట పెంచదల్చుకోలేదు. దగ్గరగా వెళ్లి “హల్లో” అన్నాడు. హఠాత్తుగా వెనుకనుంచి పిలుపు వినబడేసరికి ఆమె ఉలిక్కిపడి చూసింది. ఆమె మొహంలో ఒక్కసారిగా రకరకాల భావాలు కదలాడాయి. ఉద్విగ్నత నిండిన కంఠంతో “మీరు.. మీరు చైతన్య కదూ?” అంది.

అతడు ఆమెవైపు కన్నార్పకుండా చూశాడు.

“చాలా అద్భుతంగా నటిస్తున్నావు సో.. నీ అసలు పేరు కమల అన్నమాట.”

ఆమె అయోమయంగా “అసలు పేరేంటి? నా పేరే కమల. మీరు చైతన్యే కదా.. ఆ విషయం చెప్పండి ముందు.” అంది.

“నాతో అన్ని రోజులు హస్పిటల్లో గడిపినా నీకా విషయం అనుమానంగా వుందా?”

“హాస్పిటల్ ఏమిటి?”

“ఇంకా నటించకు ప్రనూషా.. ఉరఫ్ అక్షౌహిణి.. ఉరఫ్ కమలా..”

ఆమె మొహం ఎర్రబడింది. “మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు.”

“ఆ మాట నేననాలి. చెపు.. ఇంత నాటకం ఎందుకాడావు? నన్ను ఎందుకు ఆస్పత్రిలో పెట్టారు? చెప్పు ప్రనూషా! నాకు లక్ష్మి అంతా చెప్పింది. ఈ గ్యాంగ్‌కి నువ్వే లీడర్‌వని కూడా నాకు తెలుసు. నాకు విషయమంతా చెప్తే సరి. లేకపోతే నిన్ను పోలీసులు పట్టించవలసి వస్తుంది.

“పోలీసులకా? ఎందుకు? నేనేం తప్పు చేశాను?”

“చూడండి. మీరు ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నారో. నేను చిన్న ఏజన్సీ బిజినెస్ చేసుకునేదాన్ని. మా అమ్మా నాన్నలతో కలిసి వుంటున్నాను. మిమ్మల్ని తెరమీద చూడటమే తప్ప ప్రత్యక్షంగా చూడటం ఇదే ప్రధమం. నేను మీతోపాటు ఆస్పత్రిలో వున్నానంటున్నారు. ఆ రోజుల్లో నేను మా తల్లిదండ్రులతో కలిసి ఒరిస్సాలో వున్నాను. ఇవన్నీ మీకు చెప్పవలసిన అవసరం లేదు.  కానీ మీరు చైతన్య అన్న గౌరవంతో మీరేదో అపోహలో వున్నారు కాబట్టి అంతా చెపుతున్నాను. మీకేమైనా అనుమానాలుంటే ఏ సాక్ష్యాలు కావాలంటే అవి పరిశీలించవచ్చు. ఇక మీరు నన్ను వదిలిపెట్టకపోతే నేనే పోలీసుల్ని పిలవవలసి వుంటుంది.” అంది కోపంగా..

ఆమె అంత ధీమాగా చెప్తుండేసరికి అతను కొద్దిగా వెనక్కి తగ్గాడు. “క్షమించండి. మీలాంటి అమ్మాయే ఎవరో నన్ను మోసం చేశారు. మనిషిని పోలిన మనుష్యులుండటం అసహజమే అయినా అసాధారణం  కాదు కదా. పొరపాటు పడ్డాను”

ఆమె మొహం కూడా ప్రసన్నగా మరింది. “సర్లెండి అయిపోయిందేదో అయిపోయింది.” అంది.

“మీకు చిన్నప్పుడే తప్పిపోయిన అక్కగానీ, చెల్లిగానీ వుందా?”

“లేదు. మీ సినిమా కథల్లోలా ఏ ఫ్లాష్‌బ్యాక్ అయినా వున్నదేమో మరి.మా అమ్మా నాన్నలని అడగాలి” అంది నవ్వుతూ.

“మీకు సెన్సాఫ్ హ్యూమర్ బావున్నట్టుందే” అన్నాడు.

“థాంక్స్ …. కాంప్ల్మెంట్‌కి”

“ఇలా జనం మధ్యలో నడవటం నాకు ఇబ్బందిగా వుంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తాను. లైబ్రరీ దగ్గర ఉంది నా కారు.”

“మా ఇంటివరకూ మీ రధం రాదు.”

“ఫర్వాలేదు.”

ఇద్దరూ నడవసాగారు..

“మీరు లైబ్రరీ నుంచి నన్ను వెంటాడుతూ వస్తున్నారా?”

“అవును”

“పత్తేదారు పని చేశారన్నమాట”

“తప్పు దార్లో!”

ఇద్దరూ కారు చేరుకున్నారు. ఆమె ఎక్కింది. అతడు కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు.”ఎటు మీ ఇల్లు?”

“పోనివ్వండి చెప్తాను.”అంది. “మీరు మా ఇంటికి కూడా రావచ్చు. నేను చెప్పిన విషయాలపట్ల ఏవైనా అనుమానాలుంటే మా తల్లిదండ్రులను కూద కలుసుకోవచ్చు.”

“అవసరం లేదు. ఒక పూర్తి ఆస్పత్రి సెటప్ తయారు చేసి నటీనటుల్తో డాక్తర్ల వేషాలు వేయించి నన్ను మతిలేనివాడిగా చిత్రీకరించడానికి ఎంతో కష్టపడ్డ నీకు ఒక పూరింట్లో తల్లితండ్రుల్ని సృష్టించటం పెద్ద కష్టం కాదు. వాళ్లు అక్కడ రెడీగా వుంటారని నాకు తెలుసు.”

“ఏమిటి మీరు మాట్లాడేది?”

“నువ్వు నా కారెక్కేవరకు నేనూ నాటకమాడాను. ఇప్పుడిక నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నిన్ను ప్రైయివేట్ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్లబోతున్నాను. అక్కడ నిజం చెప్పేవరకు నిన్ను వుంచబోతున్నాను. నన్ను పెట్టిన హింసకి ప్రతీకారం.

ఆమె గట్టిగా అంది..”ఇది అన్యాయం. ఎవర్నో పట్టుకుని.. ” ఆమె మాటలు పూర్తిగా కాకుండానే అతడు ఇంకా గట్టిగా అరిచాడు. “ఎవర్నో కాదు. నిన్నే.. నువ్వు నన్ను మోసం చేయలేవు..”

“అంత ధీమాగా ఎలా చెప్పగలరు?”

“మనిద్దరం  కలిసి పిచ్చాసుపత్రి గోడమీద ఎక్కుతుండగా గార్డులు రైఫిల్స్ పేల్చారు. నేను నీకు చెయ్యి అందించాను. అప్పుడు నీ చెతికి గుచ్చుకున్న గాజుపెంకు గాయం ఇంకా నీ చేతిమీద తగ్గలేదు.”

ఆమె చప్పున చేతివైపు చూసుకుంది. అతనన్నాడు. “ఇప్పుడు చెప్పు. నీ అసలు పేరేమిటి? ఈ నాటకంలో నీ భాగం ఎంత? మళ్లీ ఇంకో నాటకం ఆడటానికి ప్రయత్నించావో దాని పరిణామం చాలా తీవ్రంగా వుంటుంది.”

ఆమె మొహం పాలిపోయింది. అతడు తనని అంత సునిశితంగా పరిశీలిస్తాడని అనుకోలేదు. కొద్దిసేపు మౌనంగా వుండి తలెత్తింది. “మా ఇంటికి వెళదాం. అక్కడ అంతా చెపుతాను.” అంది. “మళ్లీ ఇంకో ఎత్తా?” అన్నాడు.

“ఇక వాటి అవసరం లేదు. మీరు నేననుకున్నదానికన్నా చాలా తెలివైనవాళ్లు. మా ఇంటికే వెళదాం.

“మీ ఇంటివరకూ కారు వెళ్లదన్నావ్?”

ఆమె నవ్వింది.” ఊరికనే అన్నాను.పదండి వెళదాం”

“నాకు నమ్మకం లేదు. ఇంకో వలలో చిక్కుకునే ఓపికా, తీరికా నాకు లేవు.”

“ఇక నాటకాలేమీ లేవు చైతన్యగారూ. మీకోసమే నేను లైబ్రరీకి వచ్చాను. మీరు నన్ను ఫాలో అవుతున్నారని తెలిసీ ఈ ఆఫీసుకి వచ్చాను.”

అతడు అమితమైన ఆశ్చర్యంతో “నేను లైబ్రరీకి వస్తున్నానని నీకెలా తెలుసు?” అన్నాదు.

“జయశ్రీ చెప్పింది” అతడు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు.

అతడి భావం గ్రహించినట్టుగా ఆమె అంది.” జయశ్రీ నా స్నేహితురాలు. ఆస్పత్రి బిల్డింగ్ మేము ఎవరి దగ్గర తీసుకున్నామో అని ఎక్వయిరీ చేస్తూ మీరు ఆ ఇంటి యజమాని దగ్గరకు వెళతారని నాకు తెలుసు. డాక్టర్ పాల్‌ని  ఆ విధంగానే మీరు కనుక్కున్నారు. డాక్టర్‌ని తరచూ లైబ్రరీ దగ్గర చూస్తానని జయశ్రీ మీకు అబద్ధం చెప్పింది. తను మీకు ఫోన్ చేసి స్టూడియో నుంచి పిలిపించినప్పుడు నాకు చెప్పగానే నేనే స్వయంగా లైబ్రరీకి వచ్చాను. ఈ నాటకానికి చరమగీతం పలకటానికి.”

“కానీ. కానీ ఎందుకీ నాటకం.? అసలేమిటిదంతా?”

“ఆవేశపడకండి. ఇంకో అయిదు నిమిషాల్లో అంతా చెపుతాను మీకు. అదిగో ఆ కుడివైపు భవంతిలోకి తిప్పండి.”

అతడు స్టీరింగ్ సర్రున కోసాడు.

ఆ భవంతి కనీసం కోటి రూపాయలు పైగా చేస్తుంది. చుట్టూ విశాలమైన తోట. మధ్యలో ఫౌంటేన్.

అతడిని హల్లో కూర్చోబెట్టి, లోపలికి వెళ్లి ఆమె తయారయి వచ్చింది.అతడమెనుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. అప్సరసలా వున్నదామె.

అతడి ఎదుటి సోఫాలో కూర్చుంటూ “చెప్పమంటారా? కాఫీ తీసుకున్నాక మొదలుపెట్టనా?” అని అడిగింది.

“నా సహనాన్ని ఎక్కువ  పరీక్ష పెట్టొద్దు” అన్నాడు కోపంగా.

ఆమె “సరే, చెపుతాను” అంది.   “నీ పేరు?” అడిగాడు గూర్ఖా అనుమానంగా.  ఆ ఇంటి ముందు అతడు చాలా రోజుల్నుంచి తచ్చాడటం గమనించాడు.

“నా పేరు శ్రీరాములు” అన్నాడు ఇస్మాయిల్. అతడికి తను చైతన్య తాలూకు బంధువుని అని చెప్పినట్టు గుర్తుంది. ఇప్పుడు తన అసలు పేరు చెప్తే ప్రమాదమని అలా అన్నాడు.

“అమ్మగారు ఇప్పుడే తిరుపతి నుంచి వచ్చారు.” గేటు తలుపు తీస్తూ అన్నాడు గూర్ఖా “లోపలికి వెళ్లండి”.

గుండె వేగంగా కొట్టుకుంటూ వుండగా, తడబడే కళ్లతో లోపలికి ప్రవేశించాడు ఇస్మాయిల్.

లోపల అంతా ఆధునికంగా వుంది. ఒకవైపు పైకి మెట్లు, మరొకవైపు ఒకేసారి పదిమంది కూర్చోవటానికి వీలుగా పెద్ద సోఫాసెట్టు. మరొకవైపు చైతన్య సినిమాల తాలూకు షీల్దులు.

కుర్రవాడు కాఫీ తీసుకొచ్చి పెట్టాడు.

ఇదంతా తను వాళ్ల బంధువుని అని చెప్పటం వల్ల వచ్చిన గౌరవం అని అతడికి తెలుసు. మామూలుగా అయితే లోపలికి ప్రవేశించమే కష్టం.

తను ఇప్పుడు చెప్పబోయే ఈ రహస్యం.. అది వినగానే ఆవిడ ఎలా ఫీలవుతుంది? ఆనందంతో తబ్బిబ్బు అవుతుందా స్పృహ తప్పి పడిపోతుందా?

ఉద్విగ్నత పట్టలేక ఇస్మాయిల్ చేతులు నులుముకున్నాడు. నుదుటిమీద చెమట తుడుచుకున్నాడు.

అంతలో..

దూరంగా మసీదునుంచి ప్రార్ధన వినిపించింది.

నమాజ్.

యుద్ధభూమిలోనైనా సరే.. ఆ టైమ్‌కి .. ప్రార్ధించటం అలవాటు ఇస్మాయిల్‌కి.

ఆ గదిలోనే ఒక మూల దుప్పటి పరిచి కూర్చొని నమాజ్ చేసాడు.

అతడు కళ్లు విప్పేసరికి ఎదురుగా చైతన్య సెక్రటరీ రాజు వున్నాడు.

“ఎవర్నువ్వు?” కర్కశంగా అడిగాడు. ఇస్మాయిల్ తడబడ్డాడు. ఏం చెప్పాలో తెలియలేదు.

రాజు అతడి భుజం పట్టుకుని లేవదీస్తూ “చైతన్యగారి బంధువునని చెప్పి లోపలికి ప్రవేశిస్తావా? ఎవడ్రా నువ్వు?” అన్నాడు. క్షణాల్లో అక్కడ పరిస్థితి మారిపోయింది. అంత సులభంగా మోసపోయినందుకు గూర్ఖా చీవాట్లు తిన్నాడు.

ఆ కోపాన్ని వాడు ఇస్మాయిల్ మీద చూపించి దాదాపు గెంటుకుంటూ బైటకు వచ్చాడు. “పోలీసులకి ఫోన్ చెయ్యండి సార్” అంటున్నాడు పని కుర్రాడు.

ఇస్మాయిల్ గేటు బయటకొచ్చి పడ్డాడు.

ఆ పరిస్థితుల్లో కూడా చైతన్య తల్లి కనబ్డుతుందేమో అన్న ఆశ.

అతడి కళ్లముందే గేట్లు మూసుకుపోయాయి. ఒక అబద్ధం చెప్పటం ద్వారా.. శాశ్వతంగా ఇక ఆ ఇంటిలో ప్రవేసించే అవకాశం కోల్పోయానని అతడికి తెలుసు.

ఎలా చెప్పాలి? చైతన్య తండ్రి బ్రతికున్నాడన్న సంగతి ఆవిడతో ఎలా చెప్పాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *