April 16, 2024

నమో భూతనాథా – పారసీక ఛందస్సు – 2

j.k.mohanrao

రచన: జెజ్జాల కృష్ణమోహన రావు

 

 

 

 

 

 

 

 

 

సత్యహరిశ్చంద్ర చిత్రములోని (తెలుగులో రామారావు

 

కన్నడములో రాజకుమార్

ఈ పాటను అందఱు వినే ఉంటారు. ఇది ఘంటసాల గంభీరముగా పాడిన ఒక చక్కని పాట. ఇందులో మొదట శివుని చంద్రచూడ అని సంబోధించిన తరువాత, నమో భూతనాథ అనే పాట మనకు వినిపిస్తుంది. అది –

నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజా

భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్ల బ్రోవా ప్రభూ నీవె గావా
నమో పార్వతీవల్లభా, నీలకంఠా

దీనిని కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులోని గురులఘువుల అమరిక క్రింది విధముగా నుంటుంది –

నమో భ | క్తపాలా | నమో ది | వ్యతేజా
IUU IUU IUU IUU, అనగా నాలుగు య-గణములు. ప్రతి పాదమునకు వరుసగా నాలుగు య-గణములు ఉంటే దానిని లాక్షణికులు భుజంగప్రయాతము అంటారు.

ఇప్పుడు భుజంగప్రయాతమునుగుఱించి ఒక చిన్న కథ విందామా?  శేషనాగుడు అనే ఒక నాగచక్రవర్తి సముద్రములో నివసిస్తూ ఉండేవాడు. ఇతడే కొందరు సంస్కృతములో మనకు లభ్యమయ్యే మొదటి ఛందోగ్రంథకర్త యయిన పింగళనాగుడు అంటారు. సముద్రమునుండి బయటికి వచ్చి హాయిగా ఇసుక తిన్నెలపైన పడుకొని వెచ్చదనాన్ని ఆనందిస్తున్నాడు. ఇదే సమయములో ఆకాశములో గరుత్మంతుడు ఎగురుతున్నాడు.  అతని సూక్ష్మదృష్టికి ఈ నాగుడు కనబడ్డాడు.  అంతే, శేషనాగుడిని ముక్కుతో కరచుకొని తినడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు శేషనాగుడు  “అయ్యా గరుత్మంతా, నీవు నన్ను తినడానికి ముందు నేను చెప్పేది కొద్దిగా వింటావా? నేను ఛందశ్శాస్త్రముపైన ఒక గొప్ప గ్రంథమును వ్రాస్తున్నాను. ఈ సత్కార్యము నేను తప్ప మరెవ్వరు చేయలేరు. నేను ఈ గ్రంథాన్ని ముగించిన తరువాత నీవు నన్ను కబళించు, నాకేమి అభ్యంతరము లేదు. నీకు సందేహముగా ఉంటే నేను ఆ సూత్రాలను వల్లిస్తాను, నీవే వ్రాయి. నేను నిన్ను మోసబుచ్చడము లేదు, నీతో చెప్పకుండా ఇక్కడనుండి పారిపోను” అని అంటాడు పాము రూపములోనున్న శేషనాగుడు. గరుడుడేమో, ఈ మహత్కార్యానికి తాను అడ్డు పడితే ఆ పాపము తన్ను చుట్టుకుంటుంది కదా, ఎందుకులే అలాగే చేద్దాము అనుకొని సరేనని అంగీకరించాడు. ఛందస్సుపైన ఎన్నో అంశాలను, సూత్రాలను వివరించగా వాటిని గరుడుడు వ్రాస్తాడు. గ్రంథము సాంతముగా ముగిసింది. అప్పుడు శేషనాగుడు భుజంగప్రయాతః భుజంగప్రయాతః భుజంగప్రయాతః భుజంగప్రయాతః అని అన్నాడు. ఇలా చెప్పిన తరువాత సముద్రములో మాయమవుతాడు. గరుత్మంతునికి కోపము వచ్చి “నీవు నన్ను ఏమార్చావు” అంటాడు. “లేదే నేను భుజంగప్రయాతః అని చెప్పి వెళ్లాను, నీవేమి అడ్డు పెట్టలేదు. భుజంగప్రయాతః అంటే పాము నడుస్తుంది అని కదా అర్థము. నీకు చెప్పాను, నీ మౌనమును అంగీకారము అనుకొని వెళ్లాను” అంటాడు నాగుడు. ఇది భుజంగప్రయాతపు కథ. కథ కంచికి, ఈ వ్యాసము ఇంకా ముగియలేదు, ముగిసిన తదుపరి మనము కాఫీకి!

క్షేమేంద్రుడు సువృత్తతిలకములో ఒక్కొక్క వృత్తమును వ్రాయుటలో ఒక్కొక్క కవి ఎలా గొప్పవాడో అని చెబుతాడు.  భారవి వంశస్థమును, రత్నాకరుడు వసంతతిలకమును, భవభూతి శిఖరిణీవృత్తమును, కాళిదాసు మందాక్రాంతమును, రాజశేఖరుడు శార్దూలవిక్రీడితమును వ్రాయుటలో అందె వేసిన చేయి అంటాడు. భుజంగప్రయాతమును గురించి అతడు చెప్పలేదు, కాని ఈ వృత్తమును వ్రాయుటలో నిస్సందేహముగ ఆదిశంకరులదే అందె వేసిన చేయి. అతడు ఈ వృత్తములో ఎన్నియో దైవములపైన స్తోత్రములు వ్రాసినాడు, వాటిని నేడు కూడ భక్తులు చదువుతారు, పాడుతారు. సుబ్రహ్మణ్య భుజంగము, శారదాభుజంగము, మున్నగునవి ఇట్టివే. వీరు దశశ్లోకీ అని పది భుజంగప్రయాత వృత్తములను వ్రాసారు –

అందులోనుండి ఒకటి నాట్యరూపంలో

న భూమిర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః .
అనేకాంతికత్వాత్ సుషుప్త్యేకసిద్దః
తదేకోఽవషిష్టః శివః కేవలోఽహం
దశశ్లోకి 1

(నేను భూమిని కాను, జలమును కను, అగ్నిని కాను, గాలిని కాను, ఆకాశమును కాను. నేనే వస్తువును కాను, వాటినుండి పుట్టలేదు. దీర్ఘనిద్రావస్థలో కలిగిన అనుభూతివలన మాత్రమే నా ఉనికిని గుర్తించ వీలగును. అది, ఆ అవశేషము, శుభకరమయినది, అది మాత్రమే నేను)

ముతకారిబ్ ముసమ్మన్ సాలిం అనే పారసీక ఛందస్సును ఇలా విశదీకరిస్తారు: -== / -== / -== / -== . గురులఘువుల పద్ధతిలో ఇది IUU IUU IUU IUU అవుతుంది. అంటే ఇది మన భుజంగప్రయాత వృత్తమునకు సరిపోతుంది. క్రింద నేను వ్రాసిన ఒక ఉదాహరణములో పద్యపు పేరు కూడ పద్యములో నున్నది, దీనిని ముద్రాలంకారము అంటారు.  –

భుజంగప్రయాతము – య య య య, యతి (1, 7)
[తెలుగులో దీనికి ఎనిమిదవ అక్షరముతో యతి చెల్లిస్తారు, సంస్కృతములో యతి లేదు]
12 జగతి 586

భుజంగప్రయాత-మ్ము జూడంగ సొంపే
నిజమ్మై సుమమ్ముల్ – నిసర్గంపు టింపే
భజించంగ భక్తిన్ – పదమ్ముల్ శివమ్మే
సృజించంగ గీత-ప్రియోక్తుల్ నవమ్మే

గజలు రూపములో వ్రాసిన ఒక పాటను క్రింద ఇస్తున్నాను –

ఇదే జీవనమ్మా – ఇదే మారణమ్మా
ఇదే శాపమేమో – ఇదే నా వరమ్మా

ఇదే పంకజమ్మా – ఇదే పంకిలమ్మా
ఇదే శృంఖలమ్మా – ఇదే నా వరమ్మా

ఇదే క్రీడితమ్మా – ఇదే పీడితమ్మా
ఇదే సాధనమ్మా – ఇదే నా వరమ్మా

ఇదే నందనమ్మా – ఇదే కాననమ్మా
ఇదే నిర్జరమ్మా – ఇదే నా వరమ్మా

ఇదే భావనమ్మా – ఇదే జీవనమ్మా
ఇదే ఆశయమ్మా – ఇదే నా వరమ్మా

దీనిని మాత్రాఛందస్సుగా వ్రాసేటప్పుడు ఒక విషయమును గుర్తులో నుంచుకోవాలి – య-గణమునకు బదులు న-గము, జ-లము వాడవచ్చును, కాని స-లమును వాడరాదు. ప్యాసా హిందీ చిత్రములో సాహిర్ లూఢియాన్వీ వ్రాసిన యే మహలోఁ యే తఖ్తోఁ యే తాజోఁ కీ దునియా (గాయకుడు మొహమ్మద్ రఫీ, సంగీత దర్శకత్వము – సచిన్ దేవ్ బర్మన్,   ఈ ముతకారిబ్ ముసమ్మన్ సాలిం ఛందస్సునకు చెందినదే.



1 thought on “నమో భూతనాథా – పారసీక ఛందస్సు – 2

Leave a Reply to Sankisa Bharadwaja Sankar Cancel reply

Your email address will not be published. Required fields are marked *