March 28, 2024

“కవిత్వంలో ఏకాంతం” — కవితామాలికా సంకలన సమీక్ష

రచన, నిర్వహణ: శ్రీనివాస్ వాసుదేవ్

 

“ఒంటరితనం”, “ఏకాంతం”, “తన్హాయీ” తెలుగు సాహిత్యంలో తరచుగా వినపడే పదాలైనా ఒకదానికొకటి పర్యాయంగా ఉపయోగించుకోలేం. అప్పుడప్పుడు సాహిత్యంలో ఈ పదసంకరమూ చూస్తుంటాం.  వీటిలో “ఏకాంతం” కాస్తంత పాజిటివ్ షేడ్ కలిగి పాఠకుడిని రచన ఆద్యంతమూ చదివించెయ్యగల సత్తా ఉన్న పదం. కవిత్వంలో మరీనూ…సదరు కవిత ఏమాత్రం చదవగలిగేలా రాసినా సరే! మనిషికి తోడు ఎంత  అవసరమో, ఏకాంతమూ అంతే ఆవశ్యం–కనీసం ఆ సహచర్యమెంత అందమో తెలియాలంటే ఏకాంతమూ ఉండాల్సిందేగా!

Kavi-1 - Copy

“ఏకాంతం”– మనలో మనం, మనతో మనం  మాట్లాడుకునే అవకాశం ఉన్న ఓ గొప్ప స్థితి. ఈ ప్రపంచంలో ప్రతీ మనిషీ ఈ ఏకాంతాన్ని అనుభూతించినా  ఏ ఇద్దరూ ఈ మానసిక స్థితిని ఒకేలా ఆస్వాదించరు. ఐతే చాలా కవితా వస్తువుల్లాగానే ఈ ఏకాంతాన్ని కూడా  అందరూ ఒకే స్పెక్టకల్ (దృష్టికోణం)నుంచి చూస్తున్నారా లేక తమ కవిత్వంలో  వేర్వేరు తాత్పర్యాలతో ట్రీట్ చేస్తున్నారా అన్న విషయంపై  కొంత చర్చ జరగాల్సి ఉందని భావించి “కవిత్వంలో ఏకాంతం” అని ఓ థీమ్ ఆధారంగా ఐదుగురు కవియిత్రులని వారి ఇష్టానుసారమైన శీర్షికతో కవితలు రాయమన్నాం (ఇందులో ఐదుగురే ఎందుకు అన్నదానికీ, అందరూ కవయిత్రులే ఎందుకు అన్న ప్రశ్నలకీ “ప్రత్యేకమైన కారణమేదీ లేద”న్నది తప్ప మరే సమాధానం లేదు). మా ఆలోచనకి కారణలేవీ వీరెవ్వరితోనూ చర్చించలేదు. అలాగే వారెవ్వరూ మరే ఇతర షరతులనీ నిబంధనలనీ అడగలేదు. దానికి ముందుగా ఆ ఐదుగురికీ ధన్యవాదాలు. మేం అడిగిన తేదీకల్లా వారి కవితలని మాకందచేసి సాహితీ స్ఫూర్తిని చాటుకున్నారు.

 

ఆ ఐదుగురు : సాయిపద్మ, కవితాచక్ర, పూర్ణిమా సిరి, జయశ్రీ నాయుడు, వనజ తాతినేని.

 

ఇక ఈ ఏకాంతం గురించి ఎవరెవరేమంటున్నారో వారి మాటల్లోనే విందాం.

 

ముందుగా సాయిపద్మగారి కవిత– saipadma

 

(అ)సంభవ ఏకాంత యోగం ..


1.
ఏకాంతం కావాలని అడక్కండి ఎవర్నీ
చివరికి మిమ్మల్ని మీరు కూడా
విఫల ఏకాంత ప్రయోగాలన్నీ నిశ్శబ్దంగా ప్రేక్షకులై
కాస్త ఏకాంతాన్నీ కలగాపులగం చేస్తాయి
2.
ఏకాంతం కోసం ప్రార్ధించకండి ఎవర్నీ
శ్వాస కూడా వ్యాపారమై నలిగే ఆలయ దీపాలలో
చందనాగరు కర్పూర కస్తూరీ ధూపదీప నైవేద్యాలతో
విసిగి నిస్తేజ సమాధి అవుతోంది ఏకాంతం

 

3.
ఏకాంతం లోకి తోయబడకండి దయచేసి
మానవ సమూహాలకి లేని దయ మనమీద మనకన్నా ఉండొద్దా
బలవంతపు ఏకాంతం , బలవన్మరణంరెంటికీ పెద్ద తేడా లేదు
స్వగత అస్తిపంజరాల వొంటికి ఎన్ని స్నానాలూ సరిపోవు

 

4.
ప్రస్తుతం ఏకాంతం సంభవంలా అనిపించే అసంభవ యోగం
ఎందుకంటె
5.
రణగొణ ధ్వన్వాన్విత రాగంలో ఏకాంతం
లింగభేదం లేకుండా వెతికే ఓ పురా చిరునామా
అంచెలంచెలుగా అలవోకగా అవరోహిస్తున్నా
షడ్జమ సంయోగం జరగని ఓ ఒంటరి నిషాదం
—-
సాయి పద్మ

 

సాయిపద్మగారి కవిత్వంలొ కవితా వస్తువేదైనా చదివిన మొదటివాక్యానికె ముచ్చటేసి ఆమె శైలికి అభిమానులవుతాం. ఆమె మనతో మాట్లాడుతూ (“ఏకాంతం కావాలని అడక్కండి ఎవర్నీ“)  తన ‘ఆర్గ్యుమెంట్’ ని చాలా కన్విన్సింగ్ గానే మనకి బదిలీచేస్తారు. ‘మనిషి జీవితంలో ఏకాంతం సహజంగానే సంభవించాలి కానీ బలవన్మరణంలా బలవంతపు, అసహజ ఏకాంతంలో ఆనందం శూన్యం’ అనేది ఈమె వాదన. ‘ఒంటరితనానికీ, ఏకాంతానికీ మధ్య గీసుకున్న ఓ abstract  గీతలాగా ఏకాంతమన్నది అసంకల్పితంగా, మనిషి జీవితంలో సంభవించే ఓ స్థితి’ అన్నది సాయిపద్మగారి ‘ఏకాంత ఫిలాసఫీ’ లా కన్పిస్తోంది. ఏకాంతాన్ని నిర్వచించే ప్రయత్నం లా కన్పించే “ప్రస్తుతం ఏకాంతం సంభవంలా అనిపించే అసంభవ యోగం ” నాలుగో స్టాంజాలో ఓ ఏకవాక్యంగా ప్రారంభమైనా ఐదో ఖండికలో ఓ పరిపూర్ణ రూపం సంతరించుకుని ఆఖరికి, ఏకాంతం  “షడ్జమ సంయోగం జరగని ఓ ఒంటరి నిషాద” మన్న సాయిపద్మగారి డిక్లరేషన్‌‌తో కవిత  భావాత్మకంగానే కాక భాషాపరంగా కూడా ఓ మంచికవితలా ముగుస్తుంది.

శిల్పరీత్యా, భాషరీత్యా ఒకే ప్రామాణిక అనురూపత (సిమ్మెట్రీ) ని అనుసరించకపోవటం సుస్పష్టమైనా ఈ కవిత వస్తుప్రధానమైనది కావున కవితని ఆస్వాదించటంలో అవేమీ పెద్ద అవరోధాలు కావు.

 

 

రెండో కవితగా కవితాచక్రగారి కవిత— kavitha

 

ఏకాంతపు సిరి…!!

 

నీ భావ పరిష్వంగపు పరవశంలో
నన్ను నేను మరిచి,
అల్లరి కవనమేదో అల్లుకుంటానా..
మేఘాల్లా తేలిపోయే ఆలోచనలు,
ఎండల్లో వానలా వచ్చిపోయే క్షణాలు,
అనుకోని అతిథిలా పలకరించి పోయే ఊసులు,
అన్నీ ఇవనీ కలబోసిన,
అందమైన భావపు సిరా
మస్తిష్కపు కలం నుండి, మధురోహల సీమలో
మరో కృష్ణశాస్త్రివై
కవితాక్షరాలు లిఖిస్తావు!
అప్పటివరకు భారమే తప్ప, భావాల్లేని
హృదయ గ్రంధంలో ఉన్నట్టుండీ
భావుకత్వపు కవితాలహరి!!

నీ ఊహా మైమరపు మదిని కమ్మేసిన
తదాత్మ్యతలో
మౌన రాగాలకు బాణీలు కడుతుంటానా..
లేత చినుకు భూమిని చీల్చుకుని
వెళ్ళినపుడు ఎగజిమ్మిన కమ్మని వాసన,
అడవిమల్లి చెట్ల సందుల్లోంచి
రివ్వున వీచే గాలిని
మిళితం చేస్తూ
అంతరంగ రాగా విశ్వంలో
మరో బెథొవెన్ వై స్వరపరుస్తావు!
స్తబ్దుగా ఉన్న గుండె లయలో
ఉన్నట్టుండీ
కోటిరాగాల అనూరాగ ఝరి!!

నిజం!
నా ఏకాంత సామ్రాజ్యమా..
ఈ కాంతకు నువ్వు చెంత ఉంటే
బ్రతికే నైరాశ్యాన్ని తరిమి,
జీవించే జీవితాస్వాదనే నాదవుతుంది!
నువ్వు నన్ను అక్కున చేర్చుకున్న
మధుర క్షణాల్లో..
ఆనంద అంతః పురానికి పట్టపు రాణి
నేనే అవుతాను!
అందుకే నా జీవన ప్రత్యూషంలో నువ్వెప్పుడూ
తుషార స్నాత ప్రభాత స్వప్నానివి!        కవితాచక్ర

 

ఏకాంతాన్ని కీర్తిస్తూ కవితా చక్ర రాసిన “ఏకాంతపు సిరి”లో ఏకాంత ప్రదమైన జీవితం సుఖమయమూ, ఆనంద యోగ్యమైనదనే భావనని చెమ్మగిల్లిన అక్షరాలతో ఓ అందమైన శిల్పాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వచ్చారు. ఏకాంతమనే ఓ పాత్రని సృష్టించి, ఆ పాత్రనే సంభోధిస్తూ భావుకత్వ ప్రధానంగా సాగిన ఈ కవితలో ఆద్యంతమూ కవయిత్రి భాషాపటిమ మనల్ని అసలు విషయాన్నుంచి హైజాక్ చేసి తీసుకెళ్ళినా ఓ మంచి ఆలోచనకి కవితా రూపాన్నివ్వటంలో కృతకృత్యులయ్యారనే చెప్పవచ్చు.

ఏకాంతం ఏకంగా బిథొవెన్ గా మారి జీవితంలో సప్తస్వరాలు పలికించగలిగితే ఆ ఏకాంతపాత్ర ఒకసారి ” భావుకత్వపు కవితాలహరి” గానో మరోసారి ” కోటిరాగాల అనురాగ ఝరి” గానో మారినా ఆశ్చర్యం లేదన్నది కవయిత్రి కితాబు.

ఆఖరున  “నా జీవన ప్రత్యూషంలో నువ్వెప్పుడూ/తుషార స్నాత ప్రభాత స్వప్నానివి” అని ముగించినప్పుడు ఈ   ఏకాంత కీర్తన ఇంకా కొనసాగితే బావుండుననే అభిప్రాయంలో  ఆ కవితని మరోసారి చదివినా ఆశ్చర్యమేం లేదు.

మొత్తమ్మీద ఏకాంతాన్ని ఓ పాజిటివ్ దృక్కోణంలోంచే చూడొచ్చనే భావన కవయిత్రి తీర్పు.

కొన్ని మూస పదప్రయోగాలు ఈ కవితా వస్తువుకి అనవసరమేమో అనిపించటం పాఠకుల తప్పుకాదు. ఉదాహరణగా– “పరిష్వంగపు పరవశం”,  ‘మస్తిష్కపు కలం”, “మధురోహల సీమ”, తుషార స్నాత ప్రభాత స్వప్నం”. వీటిని ఏకాంతానికి అన్వయించటం పాఠకులకి ఓ విన్యాసం.

 

 

మూడో కవితగా పూర్ణిమా సిరి రాసిన ఈ కవిత—poornima

 

 

ఏకాంతంలో ఎదురుచూపులు

 

ప్రతి పొద్దూ ఎదురుచూస్తానా

వెన్నెల లా,మరుమల్లెలా

పారిజాతంలా,పసివాడి హృదయంలా

పలకరించే నీవు వస్తావోస్తావని

ప్రేమ జలతారులో ఆ హర్షపు జల్లులో 

తడిసిపోతానని,తలుకులీనుతానని

 

అలవోకగా ఊహల పొదరిల్లు ఎలా కట్టుతానో తెలీదు

గంటలను క్షణాలుగా అవలీలగా గుటకలేస్తాను

ఆట్టే సూరీడు పడమటి కౌగిలి చేరుతాడు

గోధూళి వేళలో కెంజాయి రంగు పులుముకొన్న 

ఆ నింగి మన కథల వివరాలడుగుతూ కవ్విస్తుంది

 

ఆపొద్దంతా నీరాకకై 

మది బృందావనిలో రాధనవుతాను

 

కలయికల పరవశంతో 

కడలిలా ఊహల పరవళ్ళు తొక్కుతూ 

ఎదురుచూపుల అభిసారికనవుతాను

 

ఎంతకీ నీరాక సంఙ్జలేమీ నను చేరక

క్షణాల అల్లరి ఊసులు మానక

చినుకు కై చూసే చాతకపక్షిలా

గుమ్మంవైపే చూస్తూనే ఉండే ఊర్మిళనవుతాను

 

ఎదురుచూపుల వేడినిట్టూర్పులు

ఆలోచనల సుడిగాలులు

ఇక ఘడియలు గడవడం గగనమవుతుంది

 

అదిగో ముసురుకుంటున్నాయి 

మళ్ళీ దిగులు మేఘాలు

ఇక చీకటైంది మొదలు

రాత్రంతా భోరున ఒకటే వర్షం

 

కానీ తెలుసా చిన్నోడా

 

పగటి వర్షం పరవశింపచేస్తే

రాత్రి వర్షం దిగులురేపుతోంది

 

వర్షపు నీటితో మకిలీనంతా కడిగి

మూడోజాములో మళ్ళీ  మోహనరాగం

ఈ రాతిరికి మరో పగలుందికదా అని 

ఆలోచనల ఆత్మీయ అనునయం

 

నీ ఆలోచనలు కూడా లేని వేళ

అందరిలో ఉన్నాకూడా తెలీని ఒంటరితనం

 

ఊహలా నువుపక్కనున్నా

సమూహంలో కూడా ఏకాంతం  — పూర్ణిమా సిరి

 

గుండెలో ఏకాంతం గూడుకట్టుకున్నప్పుడు ఏకాంతాన్ని ఓ psycho-analytical treatment తో విశ్లేషిస్తూ కవిత్వీకరించిన తీరు ప్రశంసనీయం, ఆ విశ్లేషణని మనకందించటానికి ఉపయోగించిన భాష అభినందనీయం.

వివరణాత్మకంగా, సోదాహరణంగా సాగిన ఈ కవిత ఏకాంతం చేసే అలజడిని కళ్ళకు కట్టినట్లు వివరించారు కవయిత్రి పూర్ణిమాసిరి.

కవిత చదువుతున్నంతసేపూ  కొన్ని ఉపమాలంకారాలు, ఉత్ర్పేక్షాలంకారాలు అవసరమా అన్నసందేహం కలిగినా ఆ metaphors వాడుక గురించి కాకుండా కవితా వస్తువుని ఎత్తుగడనుంచి చివరిదాకా ఓ కథలా మనకి ప్రెజెంట్ చేసే ప్రయత్నంలో అవి ఆమె శైలిలో భాగమే అని కాంప్రమైజ్ కాక తప్పదు. ఏకాంతమే మన తోడయినప్పుడు ఇలా అనిపిస్తుందేమొ “గోధూళి వేళలో కెంజాయి రంగు పులుముకొన్న /ఆ నింగి మన కథల వివరాలడుగుతూ కవ్విస్తుంద“ని. లేదంటే ఇలానూ అనిపించొచ్చు —

క్షణాల అల్లరి ఊసులు మానక

చినుకు కై చూసే చాతకపక్షిలా

గుమ్మంవైపే చూస్తూనే ఉండే ఊర్మిళనవుతాన“ని.

అయినా “ఇక చీకటైంది మొదలు/రాత్రంతా భోరున ఒకటే వర్షం” లాంటి వాక్యాల్ని పూర్తిగా ఎవాయిడ్ చేసిఉండొచ్చు. కానీ ఏకాంతానికి వర్షం ఒక్కటే కాస్తో కూస్తో ఓదార్పునిచ్చే జోడన్నది కవిహృదయమనే భావన పాఠకులకి సాంత్వన. చివరలో  “ఊహలా నువు పక్కనున్నా/సమూహంలో కూడా ఏకాంతం” టిపికల్ ఏకాంత”మనసు” పడే ఆవేదనగా మనం స్వీకరిస్తే కవయిత్రిగా ఆమె మనోవిశ్లేషణాత్మక కవిత మంచి ముగింపుతో అలరించటం ఖాయం… కవయిత్రికి అభినందనలు.

 

ఇక నాలుగో కవితగా వనజ తాతినేని గారు రాసిన ఈ కవిత—vanaja

 

నా ఏకాంతంలో నేను



ఏకాంతమంటే
ఏకాకి తనం అని ఎవన్నారు ?

ఏకాంతమంటే  ..
నాలోకి నేను తొంగి చూసుకునే
శత సహస్ర దర్శనం
ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి
అపురూప దివ్య దర్శనం

ఏకాంతాన్ని  వర్ణించడం  అంటే
ఆలోచనలకి నగీషి పెట్టడం
అక్షరాలకి సొబగులు అద్దటం
చిత్రాలకి వర్ణాలద్దడం  కాదు

దీపాలు మలిగిన వేళ
పూలు నేలరాలే వేళ
వేకువ పువ్వు విచ్చుకునే వేళ
తెలివెన్నెల పరుచుకునే వేళ
ఏకాంతంతో  నా ఏకాంతం
ఏకమయ్యే వేళ

దీపం చుట్టూ కాంతి  వ్యాపించినట్లు
నా చుట్టూనూ నాలోనూ నా ఏకాంతమే
సిగ్గు విడిచిన కలలెప్పుడూ  కాచుకు కూర్చుంటాయి
నా ఏకాంతాన్ని భగ్నం చేయడానికన్నట్లు
వేదనలెప్పుడూ  మనసు పొత్తాన్ని తడిపేసినట్లు
ఏకాంతమెప్పుడూ  వెలుగులోకి రాని  కాసారమే

ఉల్కలు రాలినట్లు రాలే  ఆశలని
ఒడుపుగా పట్టుకున్న కొన్ని అమృత క్షణాలని
పాకుడు పట్టిన  చేదు జ్ఞాపకాలని
గులకరాళ్ళ గా మార్చి
అజ్ఞాన సముద్రంలోకి విసిరేస్తుంది
నన్ను ఒడ్డున పడేస్తుంది

నా మనోరణ్యాన మరొకరి అడుగుజాడ
కనబడనివ్వని  జాణ తనంతో
నన్ను తప్ప మరొకరిని తాకనివ్వని
అంటరానితనం తోనూ
అనంత ఆలోచనల
కసి చాకిరి చేస్తూ ఢస్సిల్లి పోతుంది
భావ విస్పోటనంతో చెల్లా చెదురవుతుంది
స్రావాలుగా జారుతూ
నా బాహ్య ప్రపంచపు గాలిని  పీల్చుకుంటుంది
కాలంతో దొర్లుతూ అవశేషం గా
మిగులుతుంది
భిక్షపాత్రలో రేపటి నా  ఏకాంతానికి
కొంత ఖాళీ ఉంచుతూ
నన్నొక మనీషిగా నిలుపుతూ        వనజ తాతినేని

 

ఓ ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ కవిత ఏకాంతాన్ని  వైయక్తిక ధోరణిలో సమాధానపర్చే ప్రయత్నం అభినందనీయం.

ఏకాంతమంటే  …

నాలోకి నేను తొంగి చూసుకునే

శత సహస్ర దర్శనం

ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి

అపురూప దివ్య దర్శనం

ఇలా ప్రారంభమై ఏది ఏకాంతం కాదో చెప్పటం ఈ కవిత ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సంకలనంలో ఇంతవరకు మరే ఇతర కవయిత్రీ ఈ కోణాన్ని సృశించే ప్రయత్నమే చేయలేదు.

నాలుగో పద్యభాగం అవసరం లేదనిపించినా, ఐదో భాగంలో

 

వేదనలెప్పుడూ మనసు పొత్తాన్ని తడిపేసినట్లు/ఏకాంతమెప్పుడూ  వెలుగులోకి రాని  కాసారమే” అన్న వాక్యాలు ఈ సంకలనాన్ని ఆహ్వానించి మంచి పనేం చేసామనే గొప్ప సంతృప్తినిచ్చాయి.

కవితలు కనీసం రెండురకాలుగా రాస్తారనుకుంటాను–కవిత రాసాక దానికి యోగ్యమైన శీర్షికనివ్వటం లేదా ఒక శీర్షిక అనుకుని కవిత రాయటం. ఇలా ఓ థీమ్ ఆధారిత కవిత్వం రాయటం రెండో రకానికి చెందినదైతే ఓ విధంగా ఈ ప్రయోగం విజయవంతమైనట్టే నని ఈ కవిత ద్వారా అనుకోవచ్చు. ఏకాంతంలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ రాసినట్టున్న ఈ కవితలో మనకి నచ్చే మరో కొన్ని వాక్యాలు

అనంత ఆలోచనల

కసి చాకిరి చేస్తూ ఢస్సిల్లి పోతుంది

భావ విస్పోటనంతో చెల్లా చెదురవుతుంది” అని ఏకాంతాన్ని గుండెకి దగ్గరచేసుకుని మరీ ముద్దుచేస్తున్నట్టుంది. ఓ మంచికవితకి ఎలాంటి  ముగింపునివ్వాలో ఈ క్రింది వాక్యాలు చెప్పకనే చెప్తాయి —

భిక్షపాత్రలో రేపటి నా  ఏకాంతానికి

కొంత ఖాళీ ఉంచుతూ …

నన్నొక మనీషిగా నిలుపుతూ

 

 

ఇక చివరిగా ఐదోకవిత–జయశ్రీ నాయుడు రాసినది. అందరి కంటే ముందుగా ఈ కవిత అందినా మా ఈ వినూత్నప్రయోగానికి ముగింపుగా ఈ కవితని చర్చించాలనే సదుద్దేశ్యమే ఇప్పటివరకూ ఆగింది.jayashree

 

“నేనొక ఏకాంతం”

 

ముసురుకున్న ఒంటరితనపు చలికాలం

ఒక్కో అక్షరాన్నీ

అల్లుతున్న కాలపు ఊలుబంతికి

ఆలోచనల వేడి అద్దుతోంది

 

అక్కడో జ్ఞాపకాల నెగడు

చిరునవ్వూ చిట్టి కన్నీరూ ఒరుసుకుని

చెకుముకి రవ్వల్లా

రాజేశాయి

 

నీలాకాశం నిగూఢత్వం

చీకటిలా చిక్కనై..

చుక్కల్లా మినుకుమంటోంది

గుప్పిట్లోని పాలపుంతల్లా

గుండె చప్పుళ్ళూ

ఊహల దుప్పటి కప్పుకున్న మనసు

కలకళ్ళతో 

ఉదయించని రేపటినీ  చూస్తూ

గుండెలో నిండే వెచ్చదనాన్నీ

ఆస్వాదిస్తూ 

ఇప్పుడే వచ్చిందిలా

నా ఏకాంత కవితలా !          ..  జయశ్రీ నాయుడు

 

కవిత్వంలో క్లుప్తతకీ, చిన్న పద్యాల్లోనే గాఢమైన భావాన్ని పాఠకులకందించే జయశ్రీ సర్వసమ్మతమైన కవయిత్రిగా అందరికీ పరిచయమే. ఎప్పటిలా ఈ చిట్టి కవిత అలంకారప్రాయమైంది. ఉపమాలంకారాల మాటేమైనా అనుప్రాపం (Alliteration) వెంటాడే అందం. ఉదాహరణకి ఈ వాక్యాలు చూడండి

చిరునవ్వూ చిట్టి కన్నీరూ ఒరుసుకుని

చెకుముకి రవ్వల్లా

రాజేశాయి

అలాగే ఇవి కూడా

నీలాకాశం నిగూఢత్వం

చీకటిలా చిక్కనై….”

కవిత చదివిన వెంటనే పాఠకుడికి కలిగే భావన ‘ ఇందులో ఏకాంతం గురించిన ప్రస్తావన లేదు సరికదా, ఈమె దేని గురించి మాట్లాడుతున్నారు’ అనే వాళ్ళు ఉండకపోరు. కొంచెం జాగ్రత్తగా చదివితే ఓ విషయం అవగతమవ్వచ్చు–కవయిత్రి ఏకాంతపు అభివ్యక్తి రూపాల గురించి మాట్లాడుతున్నారా అని.

 

ఏది ఏమైనా ఏకాంత ప్రవేశం గురించి ఆమె రాసిన చివరి వాక్యాలు

ఊహల దుప్పటి కప్పుకున్న మనసు

కలకళ్ళతో

ఉదయించని రేపటినీ  చూస్తూ

గుండెలో నిండే వెచ్చదనాన్నీ

ఆస్వాదిస్తూ…

ఇప్పుడే వచ్చిందిలా”  అని ఏకాంతంతో మన సాంగత్యం గురించి సున్నితంగా కొన్ని మాటల్లో చెప్పి వదిలేశారు. అంతా మన ఊహకే వదిలేశారు జయశ్రీ..

 

 

కానీ మొత్తం  చదివాక ఈ ఏకాంతం గురించి కానివ్వండి, తన్హాయి గురించి కానివ్వండి … ఇలా ఆలోచింపజేసే కవితలు కూడా వస్తే బాగుండేది అనిపించింది. కాని మొదటిసారి, పైగా సమయాభావం వల్ల ఎక్కువమంది పాల్గొనలేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు….ఈ పాట మీకందరికీ తెల్సిందే–సిల్‌సిలా సిన్మా లోని ఈ  పాట తెలియనివారుండరేమొ! కనీసం సాహిత్యంలో ప్రవేశం ఉన్నవాళ్ళు–srinivas

మై ఔర్ మేరీ తన్హాయి

అక్సర్ ఏ బాతే కర్తేం

తుమ్ హోతీతో కైసా హోతా

తుమ్ ఏ కహతీ తుమ్ ఓ కహతీ” ఈ పదాల్ని మనం మనకి తగ్గట్టుగా మార్చుకుంటేనూ…అదేగా మన ఏకాంతం!!

ఇదే పాటలోని కొన్ని వాక్యాలని సాయిపద్మగారు ఇలా అనువదించి ఇచ్చారు. వీటినీ చూద్దాం

నా జీవితపు కౌగిలి లోకి నువ్వలా సిగ్గుగా , సంకోచంగా వస్తుంటే

మేఘాల లోకి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా వస్తున్నట్టు ఉంది

ఈ ఏకాంతం , నువ్వు, నేను …

అందుకేనేమో

భూమి కూడా నిశ్శబ్ద తరంగమైంది

ఇది నిజమేనేమో…ఏకాంతం ఇంత అందంగా ఉంటుందా? ఎవరూ అఖ్ఖర్లేదా? మనకి మనమే ఉందామా? అది కాదేమో..తోడు ఉంటూ మనకి మనం ఉందాం….ఏకాంతంలో ఏకాంతంగా! మనకి మనమే ఉంటూ! ఇదండీ ఏకాంతపు థీమ్ పై కవితా చర్చ. మీకు ఎలా అన్పించిందో చెప్పండేం?– మీ వాసుదేవ్

 

 

***************

 

 

 

 

 

 

 

 

 

28 thoughts on ““కవిత్వంలో ఏకాంతం” — కవితామాలికా సంకలన సమీక్ష

  1. వావ్ ………. ఏకాంత కవిత్వం ఓ చోట చూడ్డం బాగుంది, నాది కూడా ఉండుంటే ఎంత బాగుండు కదా అనిపించింది

  2. ఏకాంతంపై కవిత్వం…చాలా బాగుందీ ప్రయోగం…జ్యోతి గారికి, వాసుదేవ్ గారికి అభినందనలు. కవయిత్రులందరూ చాలా బాగా రాశారు..ఎప్పుడో విన్న ఒక గజల్ షేర్ గుర్తుకు వస్తోంది…Na jany kaun sey guzrey huy lamhon ka saya hai,
    Har ek mehfil main jana aur fir Tanhaiyan likhna…సమూహంలో కూడా వెంటాడే ఏకాంతాలున్నాయి… మంచి కవితా వస్తువు ఎన్నుకున్నారు.. మరోసారి అభినందనలతో
    వాహెద్

  3. అందరూ చాలా బాగారాశారు…… వారి హృదయాల్లో కవితలు రాయడానికి కావాల్సిన ”’సౌకుమార్యం ”…., ”నిండుగా వుంది …..ప్రతిఒక్కరూ వారిమనసుని…..పచ్చికలా పరిచారు ….పావురాల్లా ఎగరేసారు……మనల్ని ఓ మత్తులొముంచి ”భావచిత్రాల్ని” మన గుండెల్లో వేలాడదీశారు ………ఎందుకో కొన్ని కన్నీళ్లు చెలియలకట్టదాటి బుగ్గలమీదుగా పయనించి గుండె గూటినిచేరాయి ..ఇంకేం చెప్పనూ ………..మౌనం లో మునిగాకా ……..భువనచంద్ర (ఆ…. లాంగ్ live జ్యోతీ ).

  4. చెప్పడం మరచాను జ్యోతి గారు మీ కవిత్వం సూపర్.

  5. కవిత్వంలో ఏకాంతం ..బాగుంది. అందరి కవిత్వం బాగుంది ,
    వనజ గారి కవిత్వంలో చాలా లోతైన భావం ఉంది వాసుదేవ్ గారు చెప్పినట్లు మిగతా అందరి కవితల్లో ఏకాంతం కి మూలార్ధం గోచరించలేదు. వనజ గారు అంశాన్ని చక్కగా పట్టుకుని మంచి కవితని అందించారు. ఆమె కవిత్వంలో ఈ కవిత ఒక “మాస్టర్ పీస్”
    వనజ గారు అభినందనలు ఇంకా మంచి కవిత్వం వ్రాసే మూడ్ లో ఉండాలని ఆశిస్తూ

  6. మాలిక తరఫున శ్రీనివాస్ వాసుదేవ్ గారికి, పాల్గొన్న సాయిపద్మ, వనజ, కవిత, జయశ్రీ, పూర్ణిమలకు, టాపిక్ తగిన అందమైన చిత్రాన్ని ఇచ్చిన ఆర్టిస్ట్ కృష్ణ అశోక్ గారికి ధన్యవాదాలు. అభినందనలు కూడా.

    ఈ కవితలు చూడకముందే చిత్రాన్ని చూసిన తర్వాత నాకు కలిగిన ఆలోచన ఈ నాలుగు లైన్లలో .. కాని విచిత్రం ఇధే భావన కవితలో కూడా కనిపించింది. ఈ విభిన్న కోణాలలో ఏకాంతం గురించి చదివిన తర్వాత నేను రాయాలనుకున్నా రాయవలసిందేమీ లేదని అర్ధమైంది..

    అలసి సొలసిన అంగన
    కలత నిదురలో మది ఝల్లన
    చెలికాని గాఢపరిష్వంగనకై చేర
    ఆతని తలపే మదిలోన మ్రోగ..
    తన కౌగిలిలో తానే కరిగే..
    ఏకాంతంలో ఒకరికి ఒకరుగా
    ఒకరిలో ఒకరుగా…!!

  7. ఈ కవితా మాలికని నిర్వహించిన మాలిక నిర్వాహకులకు , శ్రీనివాస్ వాసుదేవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు నాతొ పాటు పాల్గొన్న మిగతా కవయిత్రులకు అభినందనలు. చక్కని అమరికగా ఏకాంతం లో భావాలు ఇమిడిపోయాయి. నావరకు నేను కవితాంశానికి తగ్గట్టు కవిత్వం వ్రాయడం ఇదే మొదటిసారి.ఈ అనుభవం నాకు నవ్యోత్సాహాన్నిఇచ్చింది. అందరికి ధన్యవాదములు.

    అంశానికి తగ్గ చిత్రాన్ని అందించిన Krishna Ashok గారికి ధన్యవాదములు

  8. ఈ ఏకాంతం , నువ్వు, నేను …

    అందుకేనేమో

    భూమి కూడా నిశ్శబ్ద తరంగమైంది”

    ఇది నిజమేనేమో…ఏకాంతం ఇంత అందంగా ఉంటుందా? ఎవరూ అఖ్ఖర్లేదా? మనకి మనమే ఉందామా? అది కాదేమో..తోడు ఉంటూ మనకి మనం ఉందాం….ఏకాంతంలో ఏకాంతంగా! మనకి మనమే ఉంటూ! ఇదండీ ఏకాంతపు థీమ్ పై కవితా చర్చ. మీకు ఎలా అన్పించిందో చెప్పండేం?

    అసలు ఇలా ఆలోచన రావడమే అద్భుతం అండి….చక్కని మీ ఆలోచనకి వన్నె తెచ్చిన పంచ కవయిత్రులు తమదైన శైలిలో అత్యంత చక్కని భావ పటిమని ప్రదర్శించారు అందరికి అభినందనలు

  9. సాయి పద్మగాని కవిత అమోఘం! ఆలోచనీయం!
    ససూచనాప్రాయంగా చాలా మంచి విషయాలు వివరించారు సాయిపద్మగారు… వారికి ధన్య వాదాలు…

    ఏకాంతం దేనైపైనా ఆధారపడదు.
    ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ ఒక్క చిన్న విషయంపై ఆధారపడ్డా ఎకాంతం కాస్తా ఒంటరితంగా మారిపోతుంది (ముఖ్యంగా తోడు ని / సంగం ని కోరినపుడు, ఆధారపడినపుడు) …
    అక్కడినుండి వ్యధ, క్షోభలు మొదలౌతాయి…
    జొరబడేవి జొరనీయండి…వెలిపొయేవి వెలిపోనీయండి…
    సంయోగ వియోగాలని మాత్రం అస్థిత్వానికి అంటనీయకండి చాలు… ఏకాంతం సిద్ధిస్తుంది.
    ఏకాంతం కావాలన్న కోరికున్నా దూరమఔతుంది ఏకాంతం!..
    శాంతించిన మౌనంలోంచి వెన్న లా బయటికొస్తుంది ఏకాంతం!! ..

    ధన్యవాదాలు
    -సత్య

  10. మీ ఈ ప్రయత్నం అభినందనీయం వాసుదేవ్జీ.. ఎన్నుకున్న సబ్జెక్ట్ నా కిష్టమైనది. పాల్గొన్న ఐదుగురు కవులకు అభినందనలు..

  11. ముందుగా

    1. సాయి పద్మ
    ఏకాంతం గురించి చక్కగ చెప్పారు , అది అడిగితే , ప్రార్ధిస్తే , నెట్టబడితే లభ్యమయ్యేది కాదని ,
    సంభవమనిపిస్తూ ,అసంభవంగా యోగంలా మారిందని , చివరగా ఓ
    ఒంటరి స్వరంగా మిగిలిపోతుందని .

    ఏకాంతం కావాలని అడక్కండి ఎవర్నీ
    ఏకాంతం కోసం ప్రార్ధించకండి ఎవర్నీ
    ఏకాంతం లోకి తోయబడకండి దయచేసి
    ప్రస్తుతం ఏకాంతం సంభవంలా అనిపించే అసంభవ యోగం
    అంచెలంచెలుగా అలవోకగా అవరోహిస్తున్నా
    షడ్జమ సంయోగం జరగని ఓ ఒంటరి నిషాదం

    2 . కవితా చక్ర : ఏకాంతం ఓ కంతగా కాకుండా సామ్రాజ్యంగా భావించవచ్చని చక్కగా తెలియచేశారు .
    ఓ(నా)ఏకాంత సామ్రాజ్యమా..
    ఈ కాంతకు నువ్వు చెంత ఉంటే ,
    కోటిరాగాల అనూరాగ ఝరి!!

    3 . పూర్ణిమా సిరి కవితలో పద కూర్పు చాలా బాగుంది .

    పగటి వర్షం పరవశింపచేస్తే
    రాత్రి వర్షం దిగులురేపుతోంది

    ఈ రాతిరికి మరో పగలుందికదా అని
    ఆలోచనల ఆత్మీయ అనునయం .

    ఊహలా నువుపక్కనున్నా
    సమూహంలో కూడా ఏకాంతం

    4 . వనజ తాతినేని కవిత ప్రారంభం నుంచే అమిత చక్కగా వర్ణించారు అనటం కంటే ప్రశ్నించారు
    అనటం సబబు .

    ఏకాంతమంటే
    ఏకాకి తనం అని ఎవన్నారు ?

    ఏకాంతమంటే ..
    నాలోకి నేను తొంగి చూసుకునే
    శత సహస్ర దర్శనం
    ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి
    అపురూప దివ్య దర్శనం

    కాకుంటే , ఈ క్రింద రెండు లైన్లకి పొంతన కుదరలేదు , అనుకున్న భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించ
    లేకపోయారేమో అన్పిస్తున్నది .

    వేదనలెప్పుడూ మనసు పొత్తాన్ని తడిపేసినట్లు
    ఏకాంతమెప్పుడూ వెలుగులోకి రాని కాసారమే .

    5 . జయశ్రీ నాయుడు

    కవిత అంత సులభంగా అర్ధమయ్యే రీతిలో లేదని పరిశీలించిన వారితో ఏకీభవించక తప్పదు .

    సంపాదకులకు ఒక చిన్న మనవి .

    ఈ ప్రచురణలలో కొన్ని అక్షరాలు తప్పులుగా ప్రచురించబడ్డాయి . ఇంకొంచెం శ్రధ్ధ తీసుకుంటే బాగుంటుంది .
    ఇప్పటికే అమిత శ్రమతో 4 పండుగలకే పరిమితమై ,మెల్లగా 6 ఋతువులుగా పరిణతి చెంది మెల్లగా కాదు
    అతివేగంగా 12 మాసములుగా అభివృధ్ధి అయిన మాలిక యాజమాన్యానికి శ్రధ్ధ లేదని నేననను . మన
    తెలుగులో ఒక పొల్లు , ఎక్కువైనా , తక్కువైనా దాని అసలర్ధమే తారుమారవుతుంది అన్నది సంపాదక వర్గం
    అర్ధం చేసుకుంటారనుకుంటున్నాను .
    దీనికి రచయితల భాగస్వామ్యం కూడా చాలా అవసరం .

    1. శర్మగారు మీ సూచనకు ధన్యవాదాలు. సాధ్యమైనంతవరకు అచ్చుతప్పులు రాకుండా చూస్తుంటాము కాని. .. జాగ్రత్తగా ఉంటాము..

  12. ekanthamu guriche vrayalane meeku anepinchinanduku, vrasina kavayitrilaku danyavadalu..nice to read different experiences on ekantham…

    kallaku, kanureppalu ela ekanthanni esthayo, ala ekanthamu somyoganeki esthe manchidani anepistunde .. prati panelo samyogamu, ekanthamu kalasi vunte …aa paneni manchiga enjoy cheyyavachhu ane naa abhiprayam..aa pane nunde, aa observation nunde vachhe kavithalu chala natural ga vuntayi …panegattukune ekanthamloke velle vrase kavithalu kanna ane anepistunde…

  13. ఈ మంచి ప్రయత్నం లో భాగం కావటం , చాలా సంతోషంగా ఉంది .. ఎన్ని మస్తిష్కాలో అన్ని ఆలోచనలు .. ఏకాంతం లో కూడా .. ఏకాంతం ఒక అందమైన స్పృహ అనే భావన కలిగించారు . జ్యోతి గారు, వాసుదేవ్ గారికి నెనర్లు .. మిగతా మిత్రులందరికీ శుభాకాంక్షలు . సాయి పద్మ

  14. చాలా బాగుంది వాసుదేవ్ గారు మంచి ప్రయత్నం /
    ఏకాంతం ఎక్కడుంటుంది మనవెంట ఉన్నదంతా జ్జపకమే అయితే అంటూ రచయిత్రులు అందంగా ఆవిష్కరించిన కవిత్వావాలు చాలా బాగున్నాయి …..

  15. kavitha chakra, manchi padalanu upayoginchavu…… ekanthanne oka patraga chesi chakkaga wrasavu….. niku telugu basha mida unna pattu chakkaga chupinchavu…. simply superb…..

  16. కాంత లైదుగురును కొండంత ఆర్తితో
    ఏకాంత మంటే ఏ కాంతయైనా
    అంతైన తమ మదిని వింతగా కదిల్చి
    తమ వంతుగా పదములను కనువిందుగా కూర్చి
    అంతంత భావములు ఆశ్చర్య పరుచగా
    అల్లిన కదంబమాలికకు అందజేస్తున్నాము
    కవితామ తల్లులకు ఇంపైన వందనం…..

  17. చాలా మంచి ప్రయత్నం. ఏకాంతాన్ని గురించి అందరూ చాలా గొప్పగా రాసారు. మీ విశ్లేషణ కూడ అధ్బుతంగా ఉంది.

Leave a Reply to జ్యోతి వలబోజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238