March 30, 2023

సంపాదకీయం : పసలేని (పనికిరాని) ప్రకటనలు

జ్యోతి వలబోజు

 

ఏ వస్తువైనా తయారు చేసాక అమ్మడం ఎంతో ముఖ్యం . అలాగని ఆ వస్తువు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ అమ్మడం  చాలా కష్టం. మార్కెట్లో తయారైన కొత్త వస్తువులగురించి ఎక్కువమందికి తెలియాలంటే ఒకటే దారి ఉంది. అదే వ్యాపార ప్రకటన.. బట్టలు, పిల్లలకు అవసరమయ్యే వస్తువులు, తినే వస్తువులు, వాహనాలు, నగలు, గృహావసర వస్తువులు ఇలా ఏదైనా సరే.. ఆ వస్తువుకు సంబంధించి అందమైన, అర్ధవంతమైన ప్రకటన తయారు చేసి రేడియో, టీవీలలో ప్రసారం చేస్తే ఆ సమాచారం ఎక్కువమంది వినియోగదారులకు చేరుతుంది. ఆ ప్రకటన ప్రభావంతో ఆ వస్తువు గురించి ఎక్కువమందికి తెలిసి అమ్మకాలు  పెరుగుతాయి. కొన్నేళ్ల క్రంద వరకు ఆడవారు ఉపయోగించే సౌందర్య సాధనాలు, వంటింటి సామగ్రి, పిల్లల ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన   వస్తువుల ప్రచారం కోసం ప్రకటనలు ఇచ్చేవారు. అప్పట్లో రేడియో, దిన, వారపత్రికలు తప్ప వేరే దారి లేదు. కాని ఈనాడు  ప్రతీ నట్టింట ఉండే టీవీ ద్వారా  వస్తువుల ప్రచారం కోసం ఖర్చులకు వెనుకాడకుండా ప్రకటనలు తయారవుతున్నాయి. పత్రికలు, రేడియో స్థానాన్ని టీవీ ఆక్రమించింది. ఇక కుటుంబసభ్యులందరినీ మాయచేసి మభ్యపెట్టడానికి ఇరవైనాలుగు గంటలూ ప్రతీ కార్యక్రమం మధ్యలో ప్రకటనలు వస్తున్నాయి. కాలి చెప్పుల నుండి, చాక్లెట్ళు, దుస్తులు, సబ్బులు, బాత్‌రూంలో ఉపయోగపడేవి, వంటింటి సామాను, బంగారు వస్తువులు,  ఇలా ప్రకటనకు అనర్హమైనది ఏదీ లేదు అన్నట్టుగా విభిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి.. ఈ ప్రకటనలను సాదాసీదాగా నిర్మించరు. సినిమా తారలు, ప్రముఖులతో ఖరీదైన ప్రదేశాలలో షూటింగ్ చేసి ఎంతొ ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ఈ వ్యాపార ప్రకటనలు అర్ధవంతంగా, ఉపయోగపడేలా ఉంటే బావుండు. కొన్ని ప్రకటనలు ఎంతో అందంగా, ముద్దుగా, ఆలోచింపచేసేవిగా, చూడగానే పెదవులమీద చిరునవ్వు వచ్చేలా ఉంటాయి. కొన్ని వ్యాపార ప్రకటనలు  చిన్న పిల్లలకు సంబందించిన బిస్కెట్ళు, చాక్లెట్లు, మంచి అలవాట్లను నేర్పించే  విధంగా ఉన్నాయి..అవి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.. కాని చాలా ప్రకటనలు పరమచెత్తగా ఉంటాయి. అర్ధంపర్ధంలేని ఈ  ప్రకటనలు తయారు చేసినవారిది అసలు టాలెంట్ అనాలా, బుర్ర లేదని తిట్టుకోవాలా తెలీదు? ఉదా: ఇద్దరు కొడుకులు తండ్రి పాంటు షాపుకి తీసికెళ్లి చాక్లెట్ తింటూ ఒకరి తర్వాత ఒకరు జానెడు , జానెడు అంటూ కత్తిరించమంటారు. ఇంకో బట్టల సబ్బు వాడేవారు సంస్కారవంతులై , ఎంతో మర్యాదగా ఉంటారట. అసలు మనిషి సంస్కారానికి, బట్టలు ఉతికే సబ్బూ ఏమైనా సంబంధం ఉందా? ఒక డియోడరెంట్ వాడితే ఆడవాళ్లందరూ  పిచ్చెక్కినట్టు ఆ మగవాడి వెనకాలే వెళతారని చూపిస్తున్నారు. ఇలా అర్ధం పర్ధం లేకుండా ఎన్నో వ్యాపార ప్రకటనలు తయారవుతున్నాయి.  ఒక చాక్లెట్ ఐతే సమయం, సందర్భం చూసుకోకుండా మొహం అంతా పూసుకుంటూ నాకుతూ తింటుంటారు. ఆ చాక్లెట్ ధర కూడా తక్కువేమీ కాదు. ఆ ప్రకటన వేసిన మాయాజాలం పడిన పిల్లలు ఇంట్లో పెద్దవాళ్లని సతాయించి మరీ  కొనిపించుకుంటారు. దీనివలన నష్టపోయేది మధ్యతర్గతి వాళ్లే కదా. అంతే కాదు కూల్ డ్రింకులు త్రాగడం మంచిది కాదని , అందులో పురుగులమందులకు వాడే కెమికల్స్ ఉంటాయని తెలిసినా వాటిని తయారు చేస్తూనే ఉన్నారు. ప్రముఖులైన సినీ తారలతో ప్రకటనలు తయారుచేసి జనాలను ఈ కూల్ డ్రింకులు తాగేలా చేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఇందులో పెద్దవాళ్లు కాస్త నిలువరించుకోగలిగినా పిల్లలు వినరు కదా. హానికరమైన వస్తువులను తయారు చేయడం మానడానికి బదులు ఇంకా ఎక్కువగా కొనుగోలు అయ్యేలా ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలతో మోసం చేస్తున్నారు. ఐనా ఇలాంటి ప్రకటనల మోజులో పడి వస్తువు నాణ్యత, అవసరం గురించి ఆలోచించకుండా ఉండాలి. పిల్లలకు కూడా అదే నేర్పించాలి. అర్ధం లేని ప్రకటనలే కాదు అసభ్యంగా, మహిళలను కించపరిచేట్టుగా  ఉండే ప్రకటనలు ఎన్నో వస్తున్నాయి. వాటిని నిరసించి, వ్యతిరేకించి బహిష్కరించే హక్కు వినియోగదారులమైన మనందరి బాధ్యత. ..

4 thoughts on “సంపాదకీయం : పసలేని (పనికిరాని) ప్రకటనలు

  1. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది ప్రకటన కనర్హం న్నట్లు ఉంటున్నాయి నేటి ప్రకటనలు. అంతవరకూ అయితే ఫరవాలేదు. వాటికి సంబంధం ఉన్నా లేకపోయినా అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలు. ఒక వైపు మహిళలు సమన్యాయం కోసం , సమాన హక్కుల కోసం కృషి చేస్తుంటే మరో వైపు అమ్మాయి పెళ్లి అబ్బాయి చదువు అనే ప్రకటనలు మెదళ్ళలోకి చొచ్చుకుపోతూ .. మగవాడిఅంతరంగాన్ని చూసి కాదు అండర్ వేర్ చూసి పడిపోయే అమ్మాయిలు .. ఇదీ మన ప్రకటనల తీరు . ఎటు వెళ్తున్నాం మనం ? ముందుకా ..? వెనక్కా ..?

  2. చాలా బాగా చెప్పారు. అందరు ఒకసారి ఆలోచించాలి .నాకెందుకో చిన్నప్పుడు సినిమావారి సౌన్దర్యరహస్యం “లక్స్’ అన్న పేపర్ ఆడ్ గుర్తుకు వచ్చింది. అప్పటికీ ఇప్పటికి ఎంతతేడా…

  3. ప్రకటనల గురించి మీరు ప్రకటించిన విధానం బాగుంది . ప్రకటనలన్నీ ఆడవారినే బేస్ చేసుకొని వుంటున్నాయి 100 కి 90 నుంచి 95 వరకు . ఇందులో కూడా ఆడవారికి చాలవరకు వివస్త్రకు దగ్గరగా , మగవాడికి పూర్తిగా బట్టలు తొడిగించి చూపిస్తుంటారు .
    వాళ్ళు ప్రకటనలయ్యే ఖర్చు , వస్తువు తయారీ మీద ఖర్చు చేస్తే నాణ్యత చాలా బాగుంటుంది .

  4. చాలా బాగా చెప్పారండి. నిజమే కొన్ని కొన్ని ప్రకటనలకు అసలు అర్ధం పర్ధం ఉండదు. జనాలను ఏదో విధంగా ఆకట్టుకోవడానికి అనేక వ్యాపార సంస్థలు రకరకాలుగా వ్యాపార ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో అది ప్రజల మనస్సును ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వారికి పట్టవు. మార్పు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031