May 25, 2024

అతడే ఆమె సైన్యం – 3

రచన: యండమూరి వీరేంద్రనాథ్     yandamoori

“కాశ్మీర్ లోయవైపు నా ప్రయాణం ఒక అందమైన అనుభవం” ప్రనూష ప్రారంభించింది.

అతడు ‘టీ’ తాగుతూ వింటున్నాడు. ఆ విశాలమైన హాలు, ఎత్తైన గోడలు, తైలవర్ణ చిత్రాలు, ఖరీదైన సామాగ్రి, అన్నీ ఆమె చెప్పబోయే కథకోసం ఎదురుచూస్తున్నాయి.

“డిల్లీనుంచి జమ్మూవరకూ నేను ప్రయాణించే రైల్లో నాకోసమొక ప్రత్యేకమైన కంపార్ట్‌మెంట్ రిజర్వ్ చేయబడింది. కేవలం నేనూ, నా ఆయా. మరో కంపార్ట్‌మెంట్‌లో మరో ఇద్దరు నౌకర్లు..” ఆమె ఆగి అన్నది.

“ఇదంతా నేనెంత డబ్బుగలదాన్నో చెప్పుకోవడానికి కాదు చైతన్యా! నా తండ్రి నన్ను ఎలా పెంచాడో, ఎంత అపురూపంగా చూసుకుంటూ వుండేవాడో చెప్పటానికి! నేలమీద కాలు పెడితే అరిగిపోయే అంత సుకుమారంగా పెంచాడు. అలా అని చదువు, గేమ్స్, రైఫిల్ షూటింగ్ మొదలయిన విషయాల్లో లోపమూ చేయలేదు. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నా తండ్రి ఆర్మీలో ఒక పెద్ద ఆఫీసరు. కోట్ల కొద్దీ ఆస్తి వున్నా, ఒక మాజీ సంస్థానాధీశుల వంశానికి చెందినవాడయినా డేశం కోసం సైన్యంలో చేరి ఉన్నతపదవిని అధిగమించిన దేశభక్తుడాయన. జమ్మూలో ఒక మిలటరీ జీపులో ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు. రెండ్రోజుల తరువాత  రాబోయే నా పుట్టినరోజున నా తల్లిదండ్రులతో గడపడం కోసం వెళ్లాను”

“వెల్‌కం టు కాశ్మీర్” అన్నారాయన చేతులు సాచి.

నవ్వాను.

“పరీక్షలు బాగా వ్రాసావామ్మా?”

తలూపాను.

జమ్మూనుంచి శ్రీనగర్.. మిలటరీ జీపులో ప్రయాణం. గతుకుల రోడ్డు. ఆయన నా బాధని గమనించి నవ్వేడు. “జమ్మువరకూ నా కూతురివి. అక్కడనుంచీ ఒక సైనికాధికారికి అతిథివి..” అన్నాడు.

“చైతన్యా! ఆయన వ్యక్తిత్వం గురించి ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటాను. అందుకే ఆయనంటే చాలా ఇష్టం. చాలామంది నీతులు చెబుతారు. కొద్దిమంది ఆచరిస్తారు. అందులో నా తండ్రి ఒకరు. జీవితం అంటే ఏమిటో, ఎలా జీవిస్తే పరిపూర్ణమైన  ఆత్మానందం కలుగుతుందో, ‘అచీవ్‌మెంట్’కి అర్ధం ఏమిటో  ఆయన ద్వారానే తెలుసుకున్నాను. ఆనందంగా బ్రతకటం వేరు.. ఆత్మానందంతో బ్రతకడం వేరు. డబ్బుగానీ, కీర్తిగానీ ఆత్మానందాన్ని ఇవ్వవు. కేవలం మన ప్రవర్తనే ఇస్తుంది. క్షమించండి. అనవసర విషయాలు మాట్లాడుతున్నట్టున్నాను.”

“లేదు. చెప్పు”

“అబ్సెషన్ అన్న పదానికి సరియిన అర్ధం నాకు తెలీదు గానీ, నా తండ్రి అంటే నాకెంత అభిమానమో, అబ్సెషనో చెప్పడానికి పై ఉపోద్ఘాతం అంతా” అంది. ప్రనూష తరువాత కొనసాగించింది.

“శ్రీనగర్ వరకూ కాశ్మీర్ లోయ అందాలు చూసిన నేను, శ్రీనగర్ దాటగానే మరో వాతావరణాన్ని చూశాను. అక్కడ పచ్చదనం, రక్తవర్ణంతో పోటీ పడింది.

ప్రకృతి మీద మానవ నిర్మితమైన కందకాలు, యుద్ధం మనిషి ఆనందాన్ని, భగవంతుడి సృష్టిని గూడా కలుషితం చేయగలదన్న నిజాన్ని నిరూపిస్తున్నట్టుంది కాశ్మీర్. ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం మాట. అప్పటికే పాకిస్తాను – భారతదేశంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ప్రచ్చన్న  యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. మా క్యాంపు శ్రీనగర్ దాటాక వంద కిలోమీటర్ల అవతల. సరిహద్దు పక్కగా వుంది.

ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించాం. అమ్మా తమ్ముడూ అక్కడే వున్నారు. తమ్ముడు డెహ్రాడూన్‌లో చదువుకుంటూ, వేసవి సెలవులకి అక్కడికొచ్చాడు. దాదాపు ఆర్నెల్ల తర్వాత మేమందరం కలుసుకున్నాం. గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి.

మరుసటి రోజు  శ్రీనగర్ వెళదామనుకున్నారు నాన్నగారు. అంటే  మేమున్న క్యాంప్‌కి వంద కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలి. “శ్రీనగర్ వద్దు.. ఆర్మీ క్యాంపులో విశేషాలు చూడటానికి వెళదాం” అన్నాను. ఆయన నా వైపు విచిత్రంగా చూశారు. “అవును నాన్నగారూ,  శ్రీనగర్ నేనెప్పుడయినా ఎక్స్‌కర్షన్‌కి రావచ్చు.  నాకు ఆర్మీ విషయాలు తెలుసుకోవాలని వుంది” అన్నాను.

“నువ్వు మళ్లీ వచ్చేసరికి శ్రీనగర్ మన దేశంలో కలిసి వుండకపోవచ్చు” అన్నారు.

“అదేమిటి?” అన్నాను ఆశ్చర్యంగా.

“అది స్వతంత్ర రాజ్యం అవ్వాలని  చాలామంది అక్కడివారి కోరిక”

“ఎవరి కోరిక? కాశ్మీర్ పండిట్స్‌దా? పాకిస్తానీ ముస్లీంలదా?” కోపంగా అడిగాను.

ఆయన నవ్వి, “నువ్వింకా చిన్నపిల్లవిలే. నీకు తెలియదు” అని సమాధానం దాటేశారు. కానీ నా కోరిక తీర్చటం కోసం ఆయన నన్ను క్యాంప్ లోపలికి తీసుకువెళ్లారు. చాలామంది ఆఫీసర్లు, దేశం కోసం ఏదో చెయ్యాలన్న  దీక్ష, తహతహ ఉన్న సైనికాధికార్లు.. నాన్నంటే వారందరికీ ఎంతో గౌరవం. అది వారి కళ్లలో నాకు కనపడింది. నేను నా దేశం అంటే ఎంతో గర్వపడాను అన్న భావానికి అసలైన అర్ధం తెలిసింది. నేనడిగిన యుద్ధ సంబంధమైన ప్రశ్నలన్నింటికీ ఓర్పుగా సమాధానం చెప్పారు.

దూరంగా వున్న చెక్క కట్టడాలను చూపించి అదేమిటని అడిగాను. సమాధానం చెప్పటానికి నాన్న అంత ఉత్సాహం చూపించలేదు. పక్కనున్న మరొక ఆఫీసర్ చెప్పాడు.. అది ప్రిజనర్స్ సెల్ అని. దొరికిన శత్రు సైనికుల్ని అక్కడ బంధించి, ఇంటరాగేట్ చేస్తారని తెలిసింది. శత్రువులకి దొరికిపోతే నిజంగా ఆ జీవితం దుర్భరం. సైనిక రహస్యాలు చెప్పేవరకూ ప్రాణాలు తోడేస్తారని ఎక్కడో చదివాను. ఆ విషయమే నాన్న గారిని అడిగాను.

“ప్రనూషా! అవసరమైనంతవరకూ తెలుసుకో చాలు. అనవసరమైన విషయాల జోలికి పోకు” అన్నారాయన గంభీరంగా. అంతలో ఆ జైలు కట్టడాల్లోంచి ఒక మిలటరీ జీపు బయట కొచ్చింది. ఆ జీపు ముందు రెండు మోటార్ సైకిళ్ళు, వెనుక సైనికులు.. ఆ దృశ్యం చూస్తుంటేనే నాకెందుకో జీపులో వ్యక్తి ఎవరో అసాధారణమైన మనిషిగా అనిపించాడు. నాన్నగారి పక్కనున్న ఆఫీసర్లందరూ అప్రయత్నంగా టెన్షన్‌తో క్షణకాలం పాటు  వున్నట్టు అనిపించింది.

“ఎవరు నాన్నా అతను?” వస్తున్న జీపును చూసి అడిగాను. నాన్న మాట్లాడలేదు. కనీసం నా వైపు చూడలేదు. జీపు మా దగ్గరకు రాగానే నాన్నని చూసి డ్రైవర్ వాహనాన్ని “స్లో” చేశాడు. నాన్న వెళ్లమన్నట్టు సైగ చేశాడు. జీపు వెనుక భాగంలో నలుగురు దృఢమైన సైనికాధికారుల మధ్య కూర్చుని వున్నాడు అతడు. బోనులో సింహంలా  వున్నాడు. మూర్తీభవించిన క్రూరత్వంలో వున్నాడు.

చైతన్య బాబూ! ఒక్క చూపుతో మనుషుల్ని అర్ధం చేసుకోవటం కష్టం అంటారు. స్వోత్కర్ష అనుకోకపోతే నా తెలివితేటల మీద, అర్ధం చేసుకునే శక్తిమీద నాకు చాలా నమ్మకం వుంది. జీపు”స్లో” అయినప్పుడు అతడు మా వైపు చూసిన చూపు… నాకెందుకో లిప్తకాలంపాటు వెన్నులో చలి పుట్టింది. భయంతో చలి జలదరించింది. అది భయం కాదు. ఎ సెన్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ కమ్యూనికేషన్! ఏదో జరగబోతూంది అన్న సూచన. చిన్న అవహేళన. జీపు వెళ్లిపోయింది.

నాన్న కొంచం సీరియస్‌గా వుండటం గమనించాను. తరువాత పక్క ఆఫీసర్‌ని అడిగాను అతనెవరని.

“అజ్మరాలీ”

అ…..జ్మ…రా…లీ

పేరు విచిత్రంగా, భయానకంగా ధ్వనించింది.

“ఎవరతను?”

“పాకిస్తాన్… ఈస్ట్‌వింగ్ – కమాండర్ – ఇన్ – చీఫ్..”

కమాండర్ – ఇన్ – చీఫ్.. భారత సైన్యపు ఆధీనంలో..

నాకు నమ్మశక్యం కాలేదు.

నా అనుమానం అతను గ్రహించినట్టున్నాడు. గర్వంగా చెప్పాడు. “అన్ని వైపుల్నించి చుట్టుముట్టాం మేడం? దొరికిపోయాడు”.

నాకు నమ్మకం కుదరలేదు.

ఏదో అనుమానం..

ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. మళ్లీ ఒకసారి. ఇంకొక్కసారి అతడిని చూడాలనిపించింది.

అజ్మరాలీ…

అతడిని కలుసుకోవాలి. ఎందుకో తెలీదు. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారేమో..

అక్కడి సైనికాధికారులకన్నా నేను తెలివైనదాన్ని కాదు. యుద్ధం గురించిగానీ, మనస్తత్వ శాస్త్రం గురించి గానీ నాకేమీ తెలీదు.  కాని నా మనసెందుకో ప్రమాదాన్ని శంకించసాగింది.

అర్ధరాత్రి దాటింది. బయటకొచ్చాను.

హిమాలయాల మీదనుంచి వచ్చే చల్లటిగాలి శరీరాన్ని వణికిస్తుంది. వెన్నెల్లో మంచుపర్వతాలు తెల్లగా కనబడుతున్నాయి.

నెమ్మదిగా అడుగులు వేయసాగాను.

నా జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన వైపు అడుగులు వేస్తున్నానని నాకు ఆ క్షణం తెలీదు. మరో వంద గజాలు నడిచి వుంటాను. “కౌన్ హై” చిన్న కేక వినిపించింది. ఆగాను. ఒక సైనికాధికారి నా దగ్గరకు టార్చిలైట్‌తో వచ్చాడు. “అజ్మరాలీ” అన్న పేరు నాకు చెప్పిన ఆఫీసరే. నన్ను గుర్తించి సెల్యూట్ చేశాడు. “ఇంత రాత్రిపూట ఇలా బయట తిరగటం అపాయకరం మేడం” అన్నాడు.

నేను విషయం దాచదల్చుకోలేదు. “నాకు అజ్మరాలీని చూడాలని వుంది” అన్నాను. బహుశా నాకు మతిభ్రమించి వుంటుందని అనుకుని వుంతాడు. అయినా నాన్నగారి మీద వున్న గౌరవంతో నమ్రతగా మాట్లాడాడు.

“ఇది సైనిక శిబిరం మేడం! (మీ వంటిల్లు కాదు.. అన్నట్టు నాకు ధ్వనించింది) అజ్మరాలీ మామూలు ఖైదీ కాదు. ఈస్ట్‌వింగ్ కమాండర్ ఇన్ – చీఫ్. అతడిని రెప్రొద్దున్నే సరిహద్దునుంచి దూరంగా తీసుకువెళుతున్నాం. దాదాపు పదిమంది ఆఫీసర్లు, వందమంది సైనికులు అతడికి కాపలా వుంటారు. అనుమతి లేనిదే మా సైనికాధికారులకు కూడా అతడితో మాట్లాడే అధికారం  లేదు. (నీవెంత?)”

“కానీ…”

“వద్దు మేడం. మీరిక్కడ ఎక్కువసేపు మట్లాడటం కూడా మంచిది కాదు. గూఢచారి శాఖకి అనుమానం వస్తే ప్రమాదం” ఇక ఎంత వాదించినా లాభం వుండదని నేను నిరాశతో వెనుదిరిగాను. తిరిగి మా బంగ్లాకి వచ్చేటప్పటికి అయిదు నిమిషాలు పట్టి వుంటుంది. అప్పుడు వినిపించింది చిన్న మూలుగు.

చీకట్లోంచి, దూరం నుంచి..

దట్టంగా నిశ్శబ్దం వ్యాపించి వుండబట్టి వినిపించింది అది.

ఒక్కక్షణం తటపటాయించాను. ఆ సందిగ్ధంలో లోపలికి వెళ్లి నాన్నగార్ని హెచ్చరించాలన్న ఆలోచన రాలేదు. అనుమాన నివృత్తి కోసం ఆ శబ్దం వినిపించిన వైపు వెళ్లాను.

పొదలచాటున పడి వున్నాడు. నాతో మాట్లాడిన ఆఫీసర్! వియత్నాం గొరిల్లా యుద్ధ పద్ధతిలో అతడి మెడ కత్తిరించబడి వుంది. క్షణాల క్రితం నాతో మాట్లాడిన మనిషి అంతలోనే అంత దారుణంగా నిర్జీవుడై పోవటంతో నేను షాక్ తిన్నాను. కనీసం వెనక్కి వెళ్లి మా గార్డులని హెచ్చరించాలని కూడా తోచలేదు.

దూరం నుంచి బ్యాటరీ లైటు వెలుగుతూ ఆరుతూ కనిపించింది. ఎవరో కోడ్‌లో సందేశం  పంపుతున్నారు. అప్రయత్నంగా అటు నడిచాను. గార్డులందరూ నిద్రలో వున్నట్టు పడి వున్నారు. అక్కడి వాతావరణంలో అదో రకమైన వాసన మిళితమై వుండటం గమనించాను. చాలా కొద్ది సేపు క్రితమే ఒక విషవాయువు ప్రయోగింపబడి వుండాలి.

నలుగురు విదేశీ సైనికులు సెల్ వైపు వెళ్తుతున్నారు. వారి మొహాలకి గ్యాస్ మాస్కులున్నాయి. ఎంతో ప్లాండ్‌గా జరిగినట్టుంది ఈ వ్యవహారం. అజ్మరాలీ క్షణాల్లో బంధవిముక్తుడయ్యాడు. అయిదుగురూ కలిసి ఇనుప తీగెలవైపు వెతుకుతున్నారు. అకస్మాత్తుగా నన్నెవరో మేల్కొలిపినట్టు అయింది. స్పృహలోకి వచ్చినట్టు కదిలాను. ఇనుప తీగెల కంచె అవతల జీపు సిద్ధంగా వుంది. స్పృహ తప్పి పడి వున్న సైనికుడి పక్కనే మెషీన్‌గన్ వుంది. నాకు రైఫిల్ షూటింగ్ తెలుసు కానీ మెషీన్‌గన్ ఎలా ఉపయోగించాలో తెలీదు అయినా ప్రయత్నించదలుచుకున్నాను. ఎక్కువ టైం కూడా లేదు. వాళ్లు వెళ్ళిపోవడానిక్ ఇంకొద్ది సెకన్లే వుంది. జీప్ డ్రైవర్‌తో కలిపి మొత్తం ఆరుగురున్నారు. అజ్మరాలీ తప్ప మిగతా అందరి దగ్గర ఆయుధాలున్నాయి. ఆయుధాన్ని ఉపయోగించడంలో ఏ మాత్రం తప్పు జరిగినా, లేదా ఆయుధం  పేలకపోయినా నా జీవితం అంతటితో సరి అని తెలుసు.

అప్పటికి గాలిలో విషవాయువు ప్రభావం తగ్గినట్టుంది. స్వచ్చంగా వీస్తోంది. అజ్మారాలీ జీపు ఎక్కబోతున్నాడు. గురి చూసి పేల్చాను. వరుసగా పది రౌండ్లు.

అక్కడి ప్రశాంతత ఒక్కసారిగా భగ్నమైంది. నిశ్శబ్దపు మంచుకొండల్లో మిషన్‌గన్ శబ్దం మార్మోగింది. అక్కడి భూమి కంపించినట్టయింది. జీపు అంటుకుని మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఈ ఆకస్మిక పరిణామానికి అజ్మరాలీ నిశ్చేష్టుడైనట్లు కనిపించాడు. అతడి అనుచరులందరూ రక్తపు మడుగులో పడి వున్నారు. నేను చీకట్లోంచి వెలుగులోకి వచ్చాను.

అతడు నన్ను ఆ సమయంలో ఊహించలేదు. ఎవరో సైనికుడు అనుకున్నట్టున్నాడు. ఒక స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అంతలోనే వంగి అనుచరుడి పక్కనే పడివున్న రైఫిల్ అందుకోబోయాడు. అంత సరిగ్గా గురి చూడగలనని నాకు తెలీదు. అతడి చేతిపక్కనుంచి దూసుకువెళ్లిన గుండు రైఫిల్‌ని దూరంగా తోసింది. అంత దారుణమైన పరిస్థితిలో కూడా అతడు విభ్రాంతుడై చూశాడు.

రైఫిల్ షూటింగ్ కన్నా మిషన్‌గన్ సులువని అర్ధమైంది. నా మీద నాకు నమ్మకం పెరిగింది.

అంతలో దూరంగా కలకలం వినిపించసాగింది. మత్తులో వున్న సైనికులు క్రమక్రమంగా లేవసాగారు. బూట్ల చప్పుడు వినిపిచింది. నాన్న హడావిడిగా వచ్చాడు. ఆయనింకా షాక్ నుంచి తేరుకోలేదనిపించింది. అందులో చిత్రమేమీ లేదు. ఒక సైనికి శిబిరం నుంచి శత్రువు అంత సులభంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని ఎవరూ కలలో కూడా వూహించి వుండరు. నాన్న నన్నూ, నా చేతిలో మిషన్‌గన్‌నీ చూస్తూ వుండిపోయారు. ఈలోగా ఆఫీసర్లు అజ్మారాలీని చుట్టుముట్టి బందీని  చేశారు. కొందరేమో, మరణించిన శత్రు సైనికుల శరీరాల్ని ఒకచోటకి చేరుస్తున్నారు. స్వేచ్చగా తప్పించుకో బోయే  ఆఖరి క్షణంలో అంతా తారుమారయ్యేసరికి కలిగే కోపం, ఆవేశం అజ్మారాలీ మొహంలో కనపడ్డాయి. అతడి కళ్ళకేగానీ శక్తి వుంటే నన్నాక్షణమే దహించి వేసేవి. ఎంతో జాగ్రత్తగా వేసిన ప్లాను, రక్షణశాఖతో ఏమాత్రం సంబంధం లేని ఒక సాధారణ అమ్మాయివల్ల అలా పాడయినందుకు అతను ఉడికిపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఆఫీసర్లు అతడికి పిస్తోళ్ళు గురిపెట్టి తీసుకెళుతున్నారు. నా పక్కనుంచి నడుస్తూ అతడు ఆగి… “బదులు తీర్చుకునేవరకూ ఈ విషయం మర్చిపోను బేబీ..” అన్నాడు.

“అప్పటివరకు ఆవేశాన్నీ, కోపాన్నీ, నిస్సహాయతనీ నొక్కిపెట్టి, ఆజ్ఞలు జారీచేస్తున్న నాన్న.. ఇక కంట్రోల్ చేసుకోలేక పిడికిలి బిగించి లాగిపెట్టి అతడి గెడ్డం మీద బలంగా కొట్టాడు. అంత దృఢకాయుడు  వెనక్కి విరుచుకుపడ్డాడు. అతడి పళ్ల సందులోంచి రక్తం స్రవించసాగింది. వేళ్లతో తడిమి రక్తాన్ని చూసుకున్నాడు. అలాంటి పరాభవం జరగటం అదే ప్రధమంలా. ” ఈ విషయం కూడా మర్చిపోను” అన్నాడు. నాన్న మళ్ళీ ముందుకు వెళ్లబోయారు. మిగతావాళ్లు ఆపుచేసి అతడిని తీసుకువెళ్లారు. ఆ రాత్రి చాలాసేపటివరకు అధికారులందరూ కలిసి భద్రతా చర్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని చర్చలు జరిపారు. మావైపు మరణించింది ఒక సైనికుడే. కానీ వాళ్ల వైపు అయిదుగురు. అందువల్ల మావాళ్లు సంతొషంగా వున్నారు. యుద్ధంలో జీవితాలు కన్నా అంకెలు బాగా తృప్తినిస్తాయి.

మరుసటిరోజు ప్రొద్దున్నకల్లా గూఢాచారి వర్గాలద్వారా విశేషమైన వార్త తెలిసింది. అజ్మరాలీని తీసుకువెళ్లడానికి వచ్చిన నలుగురూ విశేషానుభవం వున్నవాళ్లు. విదేశీ గూఢచారి శాఖలో చాలా పెద్ద పొజిషన్‌లోని కమాండోలు..

ఈ వార్త తెలిసేసరికి నాకు ఉన్నట్లుండి గౌరవం పెరిగిపోయింది. దేశానికి దూరంగా వున్న ఆ ఆర్మీ క్యాంప్‌లో అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయి వుంటారు. ప్రొద్దున్నించీ నాకు అభినందనల పరంపర మొదలైంది.

ఆ రోజు నా పుట్టినరోజు.

ముందు చిన్నదిగా చేద్దామనుకున్నారు. కానీ ఈ విజయంతో పెద్ద పార్టీ కావాలన్నారు.

ఇంటి బయట, గార్డెన్‌లో పార్టీ ఏర్పాటు చేశాము. దాదాపు ఆఫీసర్స్ అందరూ వచ్చారు.

సాయంత్రం అయిదయింది.

కేక్ కోస్తూ వుండగా విమానాల శబ్దం వినిపించింది

అందరం  తలెత్తి చూశాం.

మేము ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. విమానాల్లోంచి బాంబుల వర్షం కురవసాగింది.

పుట్టినరోజు కోసం ఏర్పాట్లు చేసినవన్నీ చెల్లాచెదురయ్యాయి. మా సైనికాధికారులకి ఏం జరుగుతూ వుందో అర్ధం కాలేదు. సరిహద్దు దాటి శత్రువిమానాలు ఇంతదూరం ఎలా వచ్చాయి? మన రాడార్లు ఏం చేస్తున్నాయి? అంటే ఎవరో మాలోనే శత్రువులకు సాయం చేస్తున్నారు.

నాకు విషయం అర్ధమైంది.

అజ్మరాలీ పట్టుపడటం అంతా ఒక నాటకం! చాలా హై లెవెల్లో మాలో ఎవరితోనో సంప్రదింపులు జరపటం కోసం అతను వచ్చాడు. తన పని పూర్తిచేసుకుని వెళ్ళిపోబోతుండగా దురదృష్టవశాత్తు నా కంట పడి దొరికిపోయాడు.

అతడు దొరికిపోయినప్పుడు కూడా అంత ధైర్యంగా ఎందుకున్నాడో నాకు తెలుస్తోంది.

నాకు ‘కుదించుకుపోతున్న’ భావం  కలిగింది. మన రోడ్డు గతుకుల్లో నిండిపోతుంటే, మనం బస్సులు తగలబెడుతూ ఆవేశంగా ఆనందిస్తాం. రిజర్వేషన్‌లు క్యాష చేసుకుందామని కొందరు ప్రయత్నిస్తే వారి వెనుక భజన్లు చేసుకుంటూనో, వారికి వ్యతిరేకంగా ఆత్మాహుతులు చేసుకుంటూనో ఆనందాన్ని పొందుతాం. మనలో చాలామందికి ‘పని’ పట్ల ఆసక్తి లేదు. ఒక ఫీలింగ్ లెదు. ఏ దేశంలో వ్యక్తులు ఈ విధమైన గుణాన్ని కలిగి వుంటారో, ఆ దేశంలో ప్రజలకి దేశంలో వుణ్డటం కన్నా దేశంనుంచి విడిపోవటంలో ఎక్కువ ఆనందం వుంటుంది. దేశం కన్నా ఎక్కువగా ‘ఆకలి’ గురించి ఆలోచిస్తారు. ఆ దేశపు సైన్యంలోకి విదేశీయులు చాలా సులభంగా ప్రవేశించగలరు. తమకి ఇష్టం వచ్చినప్పుడు రాగలరు. ఇష్టం లేనప్పుడు పోగలరు. అది అక్షరాలా నిరూపించాడు అజ్మరాలీ! మాలో వున్న కొన్ని స్వార్ధపూరిత శక్తుల ఆకలిని అజ్మరాలీ సంతృప్తి పరచాడన్న విషయం తెలుస్తూనే వుంది.

ఈ ఆలొచన అంతా క్షణాల్లో జరిగింది. విధ్వంసం కూడా ఆ క్షణాల్లోనే జరిగింది.

అంతా హాహాకారాలూ, ఆర్తనాదాలూ.

వేసిన టెంట్ కూలిపోయింది. రక్తం ధారగా ప్రవహిస్తూంది. పొగతో ఎవరు మరణించారో, ఎవరు బ్రతికి వున్నారో తెలియటం లేదు. దూరం నుంచి శతఘ్నుల ధ్వని వినిపిస్తూంది.

 

కూ(ప్) అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను.

నేలలోంచి పుట్టుకొచ్చినట్లు పారచూట్స్‌లోంచి దిగుతున్నారు శత్రు సైనికులు. మనవాళ్లూ పోరాడుతున్నారుగానీ అది ఊహించని పరిణామం అవటం వల్ల పూర్తిగా ప్రిపేర్ అయిలేరు.

కొద్దిసేపట్లోనే ఆ ఏరియా శత్రువుల వశమైంది. తరువాత అదే ఆక్రమిత కాశ్మీర్‌లో భాగం అయింది. అది వేరే సంగతి.

బహుశా మా వైపు మిగిలి వున్నది మేము ముగ్గురమే అనుకుంటాను.

నేనూ, అమ్మా, నాన్నగారూ …. కొద్దిగా సైనికులు..

చుట్టూ శత్రు సైనికులు వలయంగా తుపాకులు గురిపెట్టి వుండగా, మధ్యలో మేము ముగ్గురమూ నిలబడి వున్నాం.

అప్పుడు నవ్వేడు అజ్మరాలీ. అతను నవ్వటం మొదటిసారి చూశాను. విజయగర్వంతో నవ్విన నవ్వు అది.

నా తండ్రితో అతనన్నాడు. “నన్ను నిన్న రాత్రి నువ్వు కొట్టావు. నా మీద చెయ్యి ఎత్తిన వాడెవడూ ప్రాణాల్తో బ్రతికి బట్ట కట్టలేదు. చెప్పు నిన్ను ఏ రకంగా చంపను”

“నన్ను ఎలా చంపినా ఫర్వాలేదు. కానీ చనిపోబోయే ముందు నా ఒక్క అనుమానం తీర్చు చాలు. మాలో నీకు సహాయపడిన ఆ ఉన్నతాధికారి ఆ దేశద్రోహి ఎవరు?” నా తండ్రి అడిగాడు.

దానికి అజ్మరాలీ సమాధానం చెప్పకుండా నావైపు, నా తల్లివైపు పరిశీలనగా చూసి “నాకూ ఒక అనుమానం పట్టి పీడిస్తోంది. దాన్ని తీర్చు. నీ భార్య అందమైనదా? నీ కూతురు అందమైనదా?” అని అడిగాడు.

నాన్న మొహం ఎర్రబడింది.

అజ్మరాలీ అన్నాడు..”టాస్ వెయ్యి. ఇద్దరిలో ఎవరు అందమైనవారో టాస్ వేసి, వాళ్లని అనుభవిస్తాను.”

అతని మాట పూర్తికాలేదు. నాన్న ఒక్క  ఉదుటున ముందుకెళ్లి అతడిని పట్టుకోవాలనుకున్నాడు. పక్కనున్న వాళ్లు బలంగా పట్టుకుని ఆపకపోతే అంతపనీ జరిగేదే. ఒక తుపాకీ మడమ నాన్నని వెనుకనుంచి బలంగా కొట్టింది. నాన్న మోకాళ్ల మీద వాలిపోయారు. నా కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి.

“లే.. లేచి టాస్ వెయ్యి” అన్నాడు అజ్మరాలీ.

రక్తం చిమ్మే కళ్లతో నాన్న అతనివైపు చూశాడు. అతనన్నాడు. సరిగ్గా నిముషాం టైమిస్తున్నాను. టాస్ వేసి ఇద్దరిలో ఎవర్ని అనుభవించాలో నువ్వు నిర్ణయిస్తావు. లేదా ఇద్దర్నీ చంపేస్తాను. నువ్వు ఏమాత్రం తెలివయిన వాడివయినా టాస్ వేసి ఇద్దరిలో ఒకర్ని రక్షించుకుంటావు.”

మనుషుల్లో అంత శాడిస్టులుంటారని నాకు తెలీదు. నీ భార్యనీ అనుభవించనా? నీ కూతుర్ని అనుభవించనా? టాస్ వేసి చెప్పు.. ఇంతకన్నా అవమానకరమైన, నీచమైన పరీక్ష మరొకటి వుంటుందా?

నాన్న కదల్లేదు.

అజ్మరాలీ చేతిలో పిస్టల్ పేలింది. టపటపా రెండు బుల్లెట్లు ఇద్దరు సైనికుల శరీరాల్లోంచి దూసుకుపోయాయి. కుప్పకూలిపోయారు.

నేనెలాంటి వాడినో నీకు అర్ధమైందనుకుంటాను. కేవలం అది చూపించడానికే నీ సైనికులిద్దర్నీ చంపాను. ఇంకా అయిదు సెకన్లే టైం వుంది. కనీసం ఒకర్ని చంపమంటావా? ఇద్దర్నీ బలిస్తావా?”

అమ్మ వణికిపోతుంది. నేను అచేతనురాలినై నిలబడి వున్నాను. నాన్న కంపించే వేళ్లతో అతడి చేతిలో నాణాన్ని తీసుకున్నాడు. ఆత్మాభిమానం కోసం, ఆత్మీయుల్ని బలి పెట్టకూడదన్న అత్యంత అవమానకరమైన నిజాన్ని ఒప్పుకుంటూ, అవహేళనా పూరితమయిన అతడి మొహం ముందు నాణేన్ని ఎగరేసాడు.

బొమ్మ పడితే కూతురు… బొరుసు పడితే తల్లి”

నాణెం పడే నాలుగు క్షణాలు నాలుగు యుగాలు.

అజ్మరాలీ నవ్వుతున్నాడు. అతడి పక్కనే పడివున్న నిర్జీవమైన సైనికులు అతడి శాడిజానికి ప్రతీకల్లా వున్నారు.

నాణెం నేలమీద పడింది.

నాన్న కళ్లు రెండు గట్టిగా మూసుకున్నాడు.

అజ్మరాలీ దానివైపు చూస్తూ  లేచాడు.. “బొరుసు” అన్నాడు. అమ్మ కూలిపోయింది.

లోపలికి తీసుకెళ్లి వుంచండి. వీళ్ల సంగతి తేల్చి నేను వస్తాను” అంటూ మావైపు తిరిగాడు. “నేను ఆడిన మాట తప్పను. నీ కూతుర్ని బలిపెడతాను. నీ భార్యని అనుభవిస్తాను. ఇకపోతే నిన్నేం చేయను? ఆలోచించి చెప్పు.”

ఆ క్షణం నాన్న ఏం ఆలోచించాడో చెప్పటం కష్టం. ఆయన చేతుల్లోకి అంత బలం ఎలా వచ్చిందో.. ఒక్క ఉదుటున తనని పట్టుకున్నవాళ్లని వదిలించుకుని వెళ్లాడు. అజ్మరాలీ ఏం జరిగిందో గ్రహించే లోపులో అతడి నడుముకున్న రివాల్వర్ లాక్కుని అదే వేగంతో అమ్మవైపు తిరిగాడు. అప్పటికే హాహాకారాలు చేస్తున్న అమ్మని వందగజాలు  లాక్కెళ్లారు వాళ్లు. గురి తప్పకుండా పేల్చటం నాన్నకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్య అమ్మని చంపటానికి ఉపయోగపడింది.

అమ్మ ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. అదే వేగంతో నాన్న నా వైపు తిరిగాడు. తల్లి కూతుళ్లని ఆ కిరాతకులకి బలి పెట్టడం కన్నా తుపాకీకి బలి చెయ్యడమే మంచిదనుకున్నాడో ఏమో రెండో సారి నావైపు పేల్చాడు.

విధికి అది ఇష్టం లేకపోయింది.

టప్మన్న శబ్దంతో పిస్టల్ ఆగిపోయింది. అందులో బుల్లెట్ లేదు.

అప్పటివరకూ జరిగినదంతా నిశ్చేష్టులై చూస్తున్నవాళ్లు  నాన్న మీద పడ్డారు. కనురెప్పపాటు కాలంలో జరిగిన ఆ సంఘటనకు అజ్మరాలీ కూడా వెంటనే తేరుకోలేకపోయాదు. ఎప్పుడయితే నాన్న చేతిలో బుల్లెట్ లేదని తెలిసిందో అప్పుదు కదిలాడు. వెనుకనుంచి ఎగిరి తన్నాడు. నాన్న ముందుకు పడిపోయాడు. అయితే నాన్న సైన్యంలో వున్నవాడు. అదే వేగంతో వెనుదిరిగి అజ్మరాలీ మీదకు దూకబోయాడు.

షూట్” అరిచాడు. పిస్టల్స్, రైఫిల్స్ చప్పుళ్ళు.

నాన్న శరీరం జల్లెడ అయింది.

నేను కెవ్వున అరుస్తూ ముందుకు వెళ్లాను.

బుల్లెట్ గాయం రక్తం చిందిస్తుండగా అమ్మ వచ్చి నాన్నకు నాలుగు అడుగుల దూరంలో  మరి శక్తిలేనట్టు కూలిపోయింది.  ఆమె ప్రాణం పోయింది. నాన్న నా వైపు కళ్లెత్తి చూశాడు. ఆయన శరీరం చిద్రమైంది. కళ్ళలో మాత్రం కాస్త జీవం వుంది. ఏదో తెలియని సందేశం అందులోంచి నాకు ప్రవహించింది. తరువాత ఆ కళ్లు నిర్జీవమయ్యాయి. దుఁఖించటానికి కూడ స్పృహ కావాలి. అదీ లేనట్టు వుండిపోయాను. అజ్మరాలీ దగ్గరకు వచ్చాడు.

నా మీద చెయ్యి ఎత్తినవాడు చూశావా ఎలా చచ్చాడో అన్నాడు.

ఆవేశాన్నీ, దుఃఖాన్నీ ఆపుకుంటూ దుర్మార్గుడా! నువ్వు ఇంతకంటే కుక్కచావు చస్తావు అన్నాను.

అజ్మరాలీ నవ్వాడు.

లేదు. నేను నా దేశపు సైన్యపు జనరల్‌నవుతాను. సైనిక వందనంతో మరణిస్తాను.”గర్వంగా అన్నాడు.

నేను బ్రతికుండగా అది జరగనివ్వను. ఎక్కడున్నా వెతికి వేటాడి చంపుతాను.

నీ పేరేంటి? ప్రనూష కదూ, నీ ధైర్యం నాకు ముచ్చటగా వుంది. ఇంత జరిగినా నీకు బ్రతుకుతాననే ఆశ వున్నదా? బ్రతికినా నువ్వెక్కడా? నేనేక్కడా? నన్ను మా దేశం వచ్చి వెతికి వేటాడి చంపుతావా? హా..హా.. తల్చుకుంటేనే నవ్వొస్తుంది. ఒక ఆడపిల్ల తన దేశం నుంచి మా దేశం వచ్చి అందులోనూ మా సైనిక గుడారాల్లోకి ప్రవేశించి నన్ను వెతికి చంపటం..

ఇంకా పూర్తిగా వీడని నా తండ్రి ఆత్మసాక్షిగా చెపుతున్నాను. బ్రతికంటూ వుంటే నీ బ్రతుకు అంతం చూస్తాను.

అతడి మొహంలో నవ్వు మాయమైంది. సరే, ఇదేదో సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. ఇంతవరకూ నాతో ఇలా ఛాలెంజ్ చేసిన వాళ్లెవరూ లేరు. నిన్ను వదలాలా లేదా అన్నది రేపు చెప్తాను. వదుల్తే మాత్రం ఇదే మన ఛాలెంజ్. అదీగాక నా తెలివితేటలు గురించి, నేను మీ భూభాగం ఆక్రమించిన విధానం.. మ కోటలో పాగా వేసిన విధానం మీ వాళ్లతో చెప్పటానికి  ఒకరైనా బ్రతికి వుండాలి కదా. రేపు ఆలోచిస్తాను అని అక్కడనుండి వెళ్లిపోయాడు.

నన్నొక గదిలో బంధించి వుంచారు. ఆ రాత్రి చాలా సేపటివరకూ, అమ్మనీ, నాన్ననీ తలుచుకుంటూ ఏడుస్తూ వుండిపోయాను. అర్ధరాత్రి దాటుతూ వుండగా బయట చప్పుడైంది. కిటికీ సందుల్లోంచి చూశాను. ఒక  కాపలాదారు రక్తపు మడుగులో పడి వున్నాడు. మరొకరితో ఎవరో పోరాడుతున్నారు. చావుకీ, బ్రతుక్కు మధ్య పోరాటం.

శత్రు సైనికుల చేతిలో బాకు వుంది. అతడితో పోరాడే వ్యక్తిని గుర్తుపట్టాను. అతడి పేరు పాల్. మా యూనిట్ లో డాక్టరు. అతడికి పోరాడడం తెలీదు. అయినా సరే ప్రాణాలకు తెగించి చేస్తున్నాడు. మరో నిముషానికి రెండో కాపలాదారు కూడా నేలకొరిగాడు. డాక్టర్ పాల్ కూడా బాగా గాయాలయ్యాయి. అలాగే వచ్చి తలుపు తీశాడు. నేనేదో మాట్లాడబోతుంటే వద్దని సైగచేసి, చీకట్లోకి తీసుకెళ్లాడు. దూరంగా కాపలాదారుల లైట్లు కనబడుతున్నాయి. వాళ్లకి కొత్త అవటం వల్ల ఇంకా టోపోగ్రఫీ తెలియదు. మేము బయటపడటం కష్టం కాలేదు. దాదాపు ఇరవై నాలుగ్గంటలు ప్రయాణం చేసి ఇవతలగా వున్న మా క్యాంపుని చేరుకున్నాం. ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాలైంది ఆమె ఆగింది. పక్కనే గ్లాసులో మంచినీళ్లు తాగింది. చైతన్య ఆమెవైపు చూస్తూ వున్నాడు. ఆమె అంది..

నాన్న పోవటంతో కోట్ల ఆస్తి, ఒంటరితనం, మనసంతా దిగులు, పగా మిగిలాయి. ఆ క్షణం అమ్మకతను చేసిన  పరాభవం, నాన్నని చంపిన విధానం, అజ్మరాలీతో నేనన్న మాటలూ గుర్తు రాసాగాయి. అతడిని చంపాలి. లేకపోతే నాకు శాంతి లేదు. అతడి గురించి ఎంక్వయిరీ ప్రారంభించాను. ఎక్కడో శత్రు సైన్యంలో ఒక అధికారి గురించి వివరాలు సంపాదించటమంటే అంత సులభం కాదు. విదేశీ సైన్యంలో కొంతమందిని లోబర్చుకున్నాను. యాభైలక్షల దాకా ఖర్చయింది. అయితేనేం? నాన్న ఆస్ధికి ఇంతకంటే సద్వినియోగమైన పని ఇంకొకటి ఏముంటుంది. మన సైన్యం గూఢచారి శాఖ సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించాను. ఆ మ్యాపుల ముంధు కూర్చుని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అజ్మరాలీ ఎక్కడుంటాడో మాత్రమే కాదు. ఏయే సైనికాధికారి ఎక్కడుంటాడో, వాళ్ల కాలనీ ఎక్కడో, అతడు శలవుల్లో ఎక్కడికి వెళతాడో, అతడి ప్రియురాలు ఎవరో.. మొత్తం వివరాలన్నీ నా వేళ్ల చివర వున్నాయి. ఆరువందల రోజులు కష్టపడి సేకరించిన వివరాలు అవి.

చైతన్య ఆమెవైపు బ్లాంక్ గా చూశాడు. ఆమె అతడివైపు చూడటం లేదు. శూన్యంలోకి చూస్తూ అన్నది.

నేను ఆ దేశం వెళ్లాలి. ఆ సైనిక శిబిరాల్లోకి చొచ్చుకు పోవాలి. అతడిని పట్టుకుని నుదుటి మీద పిస్టల్ పేల్చాలి. నా తండ్రి శరీరాన్ని అతడు చేసినట్టు, అతడి శరీరాన్ని నేను ఛిద్రం చేయాలి. నా తల్లి ఆర్తనాదాల్ని మించిపోయేలా ప్రాణం పోతుంటే అతడు అరవాలి. అదే నా జీవితాశయం. కానీ ఇదంతా ఎలా సాధ్యం? ఒక స్త్రీ విదేశీ సైనిక శిబిరాల్లోకి ప్రవేశించి ఒక ఉన్నతాధికారిని చంపటం అనేది కలలో కూడా ఎవరయినా ఊహించగలరా? కానీ చేయాలి. మనిషి తల్చుకుంటే చేయలేనిది ఏమున్నది? కాని నాకో తోడు కావాలి. .. వెతకసాగాను. అఫ్పుడు నా దృష్ఠి మీ మీద పడింది.

చైతన్య.

ఆంధ్రుల ఆరాధ్య నటుడు.

సారీ. అది కాదు మీ క్వాలిఫికేషన్. నాక్కావలసింది నటుడు కాదు. కృషి, పట్టుదల ఉన్న మనిషి. నాకెవరో చెప్పారు. చైతన్య ఫైట్స్ లోనూ, డాన్స్ లోనూ ప్రేక్షకులను వుర్రూతలూగిస్తాడని, వరుసగా చూడటం మొదలుపెట్టాను. అంధరూ ఈలలూ, చప్పట్లూ వేస్తుంటే నేను మాత్రం  ఆ నటుడి వెనుక వున్న వ్యక్తిని గమనించసాగాను. ఎంతో పట్టుదల, దీక్ష వుంటేగానీ ఈ స్ధాయికి చేరుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. నాకు కావలసింది సరిగ్గా అలాంటి మనిషే. ఒకటి చెయ్యాలనుకుంటే, అధి పూర్తయ్యేవరకు ఆగని తపన నాకు చైతన్యలో కనపడింది. ఈ ఆపరేషన్ లో పాల్గొనాలంటే నటనతో పాటు చురుకుదనం, చొరవ కూడా రావాలి. అవన్నీ చైతన్యలో వున్నాయి. అయితే, ఒక్కసారి శత్రు శిబిరంలో ప్రవేశించాక ఎన్నో చిక్కులు ఆకస్మికంగా వస్తాయి. అఫ్పుడు మనోధైర్యం కోల్పోతే? రహస్యాలు కనుక్కోవటానికి శత్రువులు ఎన్నో రకాలుగా మానసికమైన వత్తిడులు కలుగచేస్తారు. అప్పుడు విషయం చెప్పేస్తే.. నేను ఇన్నాళ్లుగా పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. తెరమీద చైతన్య ధృఢశాలి. నా దృష్టిలో చైతన్య చైతన్యవంతుడు. కానీ వ్యక్తిగతంగా అతనెంత ధీమంతుడు? కొంతమంది సుఖాల్లోనే ఉజ్వలంగా ప్రకాశిస్తారు. కష్టమొస్తే నీరుకారిపోతాడు. చైతన్య ఏ వర్గానికి చెందిన మనిషి?

ఇది తెలుసుకోవటం కోసం అతడిని కష్టాల్లో పడేశాను. దాదాపు అయిదు లక్షల ఖర్చుతో ఒక రంగస్ధలాన్ని సృష్టించాను. డాక్టర పాల్ నాకు సహకరించాడు. లక్ష్మి అనే ఒక నటిని అద్దెకు తెచ్చాం.

తరువాత కధ మీకు తెలిసిందే.

చైతన్యగారూ, ప్రతీ పరీక్షలోనూ మీరు నెగ్గారు. మామూలు మనుషులైతే ఈ పరీక్షకి పిచ్చెక్కిపోయి వుండేవారు. నాక్కావల్సిన వ్యక్తి మీరే. మీరు, నేనూ కలిస్తే ఆ పనిని సాధించగలం. మీరు నాతో వస్తారా?

ఆమె చెప్పటం ఆపింది. చైతన్య కుర్చీ వెనక్కి వాలి అయిందా? అన్నాడు.

ఆమె అర్ధం కానట్టు చూసింధి.

అతనన్నాడు. నాకు సంస్కారం వుంధి కాబట్టి వూరుకున్నాను. ఇంకెవరయినా అయితే లాగిపెట్టి కొట్టి వుండేవారే.

ప్రనూష మొహం వాడిపోయింది. నే… నేనేం చేశాను?” అంది.

నీ ఇష్టం వచ్చిన ఒక వ్యక్తిని పట్టుకుని అతడిమీద రకరకాల ప్రయోగాలు చేయడానకి నువ్వేం సైంటిస్టువా? ఆ వ్యక్తేమన్నా కుందేలా? నీ పట్టుదలకి నా జోహార్లు. కానీ నీ తెలివితేటల పట్లే నాకు అనుమానంగా వుంది. ఒక మనిషి మానసిక హింసలకి తట్టుకోగలడా లేదా అన్న విషయం తేల్చుకోవటం కోసం ఒక మెంటల్ హాస్పిటల్ నాటకమాడి మరీ పరీక్షిస్తావా? దీనివల్ల నా ఎన్ని విలువైన దినాలు వృధా అయ్యాయో తెలుసా నీకు?

మీరెంత నష్టపోయారో అంత డబ్బు నేనిస్తాను.

షటప్! డబ్బు గురించి కాదు. నీవు వృధా చేసిన సమయం గురించి మాట్లాడుతున్నాను. అసలు ఒక పనికి నన్ను ఎన్నుకునేటప్పుడు దానికి నేను ఒప్పుకుంటానా లేదా అని ఆలోచించనవసరం లేదా? నీ ఇష్టం వచ్చినట్టు పరీక్షలు చేసెయ్యటమేనా?

నా కధంతా తెలిస్తే మీరు ఒప్పుకుంటారనుకున్నాను.

నిజంగా నీది హృదయాన్ని కదిలించే కధే. కాని పరిష్కారం కోసం నువ్వు ఎన్నుకున్న విధానమే సరి అయినది కాదు. వెళ్లొస్తాను అని లేచాడు.

చైతన్యగారూ! మీరీ పనికి ఒప్పుకుంటే ఎంత కావాలంటే అంత యిస్తాను. ఇరవై.. ముప్ఫై ..ఎన్ని లక్షలు కావాలంటే అన్ని.. చైతన్య మొహంలో అంత కోపం ఎవరూ ఇంతకు ముందు చూసి వుండరు. అతికష్టం మీద తమాయించుకుని… అది నా నెలరోజుల సంపాదన అని అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

 ప్రనూష అటువైపే చూస్తూ వుండిపోయింది. ముక్క మీద ముక్క పెర్చి అతికష్టం మీద కట్టిన పేక మేడ చివరి అంతస్తు దగ్గర కూలిపోతే ఎలా వుంటుందో అలా వుంది ఆమెమొహం.

ఆమె అలా నిలబడి వుండగానే వెనుకనుంచి డాక్టర్ పాల్ వచ్చాడు.

“ఏమైంది? ఏమన్నాడు?”

“ఒప్పుకోలేదు మనమీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వనందుకు సంతోషించమన్నట్టు మాట్లాడాడు.”

“పోన్లే.. ఇతను కాకపోతే మరొకడు. అయినా నేను ముందే చెప్పానుగా అమ్మాయ్. అంత ఆదాయాన్ని వదులుకుని అతడు ఆ మృత్యుముఖంలో అడుగుపెట్టడు అని..”

ఆమె మాట్లాడలేదు. ఆమెకెందుకో చైతన్య తప్ప ఇంకెవరూ ఈ పని చేయలేరనిపిస్తోంది. డాక్టర్ పాల్ చెప్పింది నిజమె కావొచ్చు. కోరి కోరి ఎవరు కష్టల్ని కొని తెచ్చుకుంటారు? బలమైన కారణం వుంటే తప్ప!

చైతన్యని చూసిన మరుక్షణం అతడా కష్టాలకు ఒప్పుకుంటాడు అనిపించింది. దానికి బలమైన కారణం – తను

అని భ్రమపడింది.

 

  * * * * * * * * * * *

 

పుష్కరాలు.

మామూలుగానే వేలాది జనం స్నానాలకి వస్తారు. ఆ రోజు లక్షల సంఖ్యలో వున్నట్టున్నారు. ఎంత రహస్యంగా వుంచినా ఆ వార్త వూరంతా పొక్కిపోయింది.

చైతన్య ఆ రోజు వస్తున్నాడన్న వార్త.

పదేళ్ళ పిల్లల్నుంచి, యాభై ఏళ్ల వాళ్లవరకూ తొక్కిసలాట.

పోలీసులు లాఠీలతో బారికేడ్లు నిర్మించి జనాన్ని కంట్రోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

రంగనాయకి కొడుకుతో సహా అక్కడికి చేరుకుంది. అక్కడినుంచి నది ఒడ్డువరకూ పోలీసులు చేసిన దారి  మధ్యలోంచి నడిచి వెళ్లాడు చైతన్య. తద్దినపు బ్రాహ్మణుడు వారి కోసం ఎదురు చూస్తున్నాడు. అతడి ముందున్న పీట మీద కూర్చున్నాడు చైతన్య. “కొడుకంటే ఇలా వుండాలి! అంత పెద్ద స్థాయిలో వుండి కూడా, తండ్రి పోయిన ఇన్నేళ్ళకు పుష్కరాల కోసం ఇంత దూరం వచ్చాడు” దూరం నుంచి ఎవరో అంటున్నారు.

“చైతన్యకీ”

“జై”

“స్టార్.. స్టార్”

“జిందాబాద్”

అరుపులు ప్రజ్వరిల్లుతున్నాయి. నటుల అవస్థే అది. తండ్రికి నిర్మలమైన మనసుతో తద్దినం కూడా పెట్టుకోనివ్వరు. ఆ స్థితిలొ కూడా అతడిని తాకాలని కొందరు తాపత్రయ పడుతున్నారు. అతడు తమ వైపు చూడాలని చేతులు వూపుతున్నారు. రకరకాల  తాపత్రయాలతో, తమకంతో, పిచ్చి అభిమానంతో వెర్రెక్కిపోతున్న ఆ జనం మధ్య ఒకే ఒక వ్యక్తి నిజమైన  కోరికతో, నిజమైన తాపత్రయంతో తనువెల్లా వూగిపోతున్నాడు.

అతడు ఇస్మాయిల్.

రెండ్రోజుల క్రితమే అతడికి చైతన్య ప్రోగ్రాం సంగతి తెలిసింది. చైతన్యని మామూలుగా కలుసుకోవటం అసాధ్యమని తెలిసిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చాడు. ఆ రాత్రి నది ఒడ్డునే పడుకున్నాడు. ప్రొద్దున్నే లేచి కూడా అక్కడ నుంచి కదల్లేదు. కానీ దురదృష్టం…

ముందు పోలీసులు వచ్చారు. జనాన్ని అక్కడి నుంచి తోసి వేశారు. చైతన్య వచ్చే సమయానికి అతడు మరింత దూరం తోసి వేయబడ్డాడు.

అక్కడనుంచి అతడు అంగుళం అంగుళం కదులుతూ ముందుకు ప్రయాణించాడు. బట్టలు నలిగిపోయాయి. జుట్టు రేగిపోయింది. చెప్పాలి.  చైతన్యకి చెప్పాలి.

అతడు కాస్త  దగ్గరగా వచ్చాడు. దూరంగా రంగనాయకి కనబడుతూంది. ఇస్మాయిల్ ఆమెనే చూస్తున్నాడు. ఎంత వడిలిపోయింది. కాలమూ, దుఃఖమూ అకారణంగా ఆమెను ఎంత బలి చేశాయి. నుదుటిమీద సూర్యుడిలాంటి బొట్టుతో మొహం మీద వెన్నెలలాంటి నవ్వుతొ వెలిగే ఈమె ఎలా అయిపోయింది?

ఇస్మాయిల్ మరో అడుగు వేశాడు.

బ్రాహ్మణుడు పిండాలు తయారు చేస్తున్నాడు. ఇస్మాయిల్ మరింత ముందుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే చైతన్య సెక్రటరీ సుబ్బరాజు దృష్టి అతడిమీద పడింది. రాజు భృకుటి ముడిపడింది.

ఇక్కడ ఈ జనం మధ్య ఇతను.

ఎందుకీ ముసల్మాను చైతన్యని ఇంతలా వెంబడిస్తున్నాడు? బంధువని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ..

చైతన్యకి ఏదైనా అపాయం తలపెట్టటానికా?

ఆ ఊహ రాగానే రాజు ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వెళ్లాడు. చెవిలో ఏదో చెప్పాడు. ఇన్‌స్పెక్టర్ తలూపి ఇస్మాయిల్ వైపు పరిగెత్తాడు. వెనుకనుంచి ఎవరో పట్టుకోవటంతో తల తిప్పి చూసిన ఇస్మాయిల్‌కి ఇన్‌స్పెక్టర్ కనిపించాడు. అది ఊహించకపోవడంతో గింజుకున్నాడు. దానితో ఇన్‌స్పెక్టర్ అనుమానం ధృవపడింది. లాఠీతో బలంగా కొట్టాడు.

సరిగ్గా అదే సమయానికి బ్రాహ్మణుడు చైతన్య చేతిలో పాలప్రస్తోక్యం పెడుతూ “పిండప్రధానం చేయి బాబూ” అంటున్నాడూ.

తలమీద నుంచి కారే రక్తాన్ని చేత్తో అదిమిపట్టే  ప్రయత్నం చేస్తూ స్పృహ తప్పి కళ్ళు మూతలు పడుతూ వుండగా ఇస్మాయిల్ అరిచాడు.

బాబూ చైతన్య! పిండప్రధానం చెయ్యకు. నీ తండ్రి బ్రతికే వున్నాడు.”

జనం కేకల మధ్య, ప్రజల అరుపుల మధ్య ఆ మాటలు చైతన్యకి లీలగా రంగనాయకికి స్పష్టంగా విన్పించాయి.

పోలీసుల చేతుల మధ్య వాలిపోయిన ఇస్మాయిల్ మొహం రంగనాయకి చూసింది.

జ్ఞాపకాల పొరలు చీల్చుకుని పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్లిన స్మృతి..

ఇ..స్మా..యి..ల్… భాయ్!

పోలీసులు అతన్ని తీసుకుపోతున్నారు.

సుబ్బరాజు అతన్ని ఆపు” అరిచింది ఆమె.

తల్లిని చూసి చైతన్య ఏమీ అర్ధం కాక లేచాడు. జనం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు.

పుష్కరపు నది హోరు తప్ప అంతా నిశ్శబ్దం.

 

* * * * * * * * *

 

పాకిస్తాన్ శత్రు సైన్య నిర్బంధశాల.

ఎత్తయిన రాతి కట్టడాల మధ్య ఒక రాత్రి!

జగదీష్ ప్రసాద్ ఆ కిటికీలోంచి బయటకు చూశాడు. అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ కిటికీ, ఆ పరిసరాలూ అంతా అతడికి పాతిక సంవత్సరాలుగా గుర్తు  ప్రతి అంగుళమూ అతడికి పరిచయమే. ఆ చీకటి గదిలో అతడు పాతిక సంవత్సరాలుగా వుంటున్నాడు. అవన్నీ వరుస గదులు. ముందు వరండా కిటికీలోంచి పడే వెలుతురు తప్ప అంతా చీకటే. గదుల్లోకి ఎంతోమంది బందీలుగా వస్తూ వుంటారు. దూరంగా అప్పుడప్పుడూ తుపాకీ శబ్దాలు వినిపిస్తూ వుంటాయి. కొంతమంది కనపడకుండా పోతారు. పరస్పర యుద్ధఖైదీలు మార్పిడి ఒప్పందం క్రింద కొంతమందిని రెండు దేశాలు మార్చుకుంటాయి.

జగదీష్ ప్రసాద్ మాత్రం పాతిక సంవత్సరాలుగా ఆ ఖైదులొనే వుండిపోయాడు. ఆక్కడే అతడు వృద్ధాప్యం అంచుకు చేరుకున్నాడు. అతడిని ఖైదీలందరూ గౌరవంతో చూసుకునేవారు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు.

పాతిక సంవత్సరాలుగా అతడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక మునిలా, యోగిలా వుండిపోయాడు. అతడితో మాట్లాడించటానికి అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతడు భారతదేశపు తోటి ఖైదీలతో కూడా నోరు విప్పలేదు.

జగదీష్ ప్రసాద్ సరిహద్దు ప్రాంతాల్లో రాడార్ క్యాంప్‌లో పనిచేసేవాడు. అప్పుడే అతడొక విలక్షణమైన సిద్ధాంతం కనుక్కున్నాడు. ఆ “బీం వైబ్రేటర్”ని విమానంలో అమరుస్తే, ఆ విమానాన్ని పట్టుకోవటం రాడార్‌కి సాధ్యం కాదు. శత్రుదేశపు రాడార్‌లని అయోమయపరిచే పరికరాలు మన విమానాల్లో అమర్చి సరిహద్దు అవతలికి పంపి, శత్రు సైనిక శిబిరాలను ధ్వంసం చేస్తే అవి ఏ ఆటంకము లేకుండా తిరిగి రావచ్చు. ఈ పరికరం ద్వారా సైన్యం సాంకేతిక పరంగా వంద సంవత్సరాలు ముందుకు  వెళుతుంది.

తను కనుక్కున్న ఈ అపురూపమైన పరికరం గురించి జగదీష్ పై అధికారికి చెప్పి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో మరికొన్ని పరిశోధనలు చేస్తే దీనికి పరిపూర్ణత్వం వస్తుందని అన్నాడు. అంత చిన్న వయసులో అతడు సాధించిన ఈ విజయం పై ఆఫీసర్‌లో అసూయ రేపింది.

జగదీష్ ఆ రోజుల్లో భార్య  రంగనాయకి, ఏడాది నిండని కొడుకు చైతన్యతో ఆ క్యాంపులోనే సరిహద్దుకి కొంత దూరంలో వున్న రాడార్ క్యాంపులో వుండేవాడు. తమ రీసెర్చి పూర్తి చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలుపగానే జగదీష్ ఆనందంతో పొంగిపోయాడు. ఆ రాత్రి అతడు భార్యతో అన్నాడు “నెలరోజుల్లో తిరిగి వస్తాను. ఇన్నాళ్ళూ నీ భర్త రాడార్‌లో పని చేసే చిన్న ఉద్యోగి మాత్రమే. త్వరలో దేశం గర్వించదగ్గ వ్యక్తి అవుతాడు.”

నేను కూడా మీతో డిల్లీ వస్తానండీ. ఈ నెలల కుర్రవాడిని పెట్టుకుని నేనీ కొండలమధ్య వుండలేను.”

లేదు రంగనాయకీ, నాకు ఏకాంతం కావాలి. రాత్రిబవళ్లు పని చేయాలి. మీరుంటే ఆ పని సాగదు. నేను దాదాపు అంతా కనుక్కున్నాను. తుది మెరుగులు మాత్రమే మిగిలి వున్నాయి. ఎంత? కేవలం నెల రోజులు . అంతే..”

బయట హారన్ వినిపించింది.. అతడు కొడుకు చెంప మీద ముద్దు పెట్టుకుని వచ్చి వ్యాన్ ఎక్కాడు. ఆ తరువాత హెలికాప్టర్‌లో అతడు రీసెర్చి సెంటర్‌కి తీసుకురాబడ్డాడు. అధునాతనమైన సాంకేతిక పరికరాల మధ్య అతడు దాదాపు రెండు నెలలు బయట ప్రపంచాన్ని మర్చిపోయి శ్రమించాడు. అతడికి అన్ని వసతులు కల్పించబడ్డాయి. అతడి కృషి నిర్విఘ్నంగా సాగింది. అతడి శ్రమ ఫలించింది. అతడు కనుక్కున్న పరికరాన్ని విమానంలో అమర్చారు. విమానం గాలిలోకి ఎగిరింది కాని రాడార్ వచ్చి పట్టుకోలేకపోయింది.

సక్సెస్” చిన్నపిల్లాడిలా అరిచాడు అతను. దేశానికి అతడిచ్చిన విలువైన కానుక అది.

రిసెర్చి సెంటర్ చీఫ్ వచ్చి జగదీష్‌ని అభినందించాడు. “దేశం గర్వించదగ్గ వ్యక్తివి నువ్వు . సాంకేతికరంగంలో  అత్యున్నత బహుమతికి నీ పేరు రికమెండ్ చేస్తున్నాను.”

జగదీష్ ఆలోచనలు అక్కడ లేవు. భార్యతో ఈ వార్త పంచుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతోంది.

ఏవీ ఆ ఫార్ములా కాగితాలు?” చీఫ్ అడిగాదు.

క్షమించండి. వాటిని ప్రధాని ద్వారా జాతికి అంకితం చేయాలనుకుంటున్నాను.” అన్నాడు జగదీష్.

అధికారులు మొహాలు చూసుకున్నారు. “తప్పకుండా అలాగే చేద్దురుగానీ.  ప్రధానితో మీటింగ్ ఏర్పాటు చేయిస్తాను” అన్నాడు చీఫ్.

ఆ సాయంత్రం అతడి గౌరవార్ధం పార్టీ జరిగింది. పార్టీలో ఈ ప్రసక్తి మళ్లీ వచ్చింది.

జగదీష్ అన్నాడు. “కాగితాలూ అంటూ ఏమీ లేవు. ఆ ఫార్ములా ఎంత విలువైనదో శత్రువుల చేతిలో పడితే అంత హానికరమో నాకు తెలుసు. మొత్తం వివరాలన్నీ నా మనసులోనే ముద్రితమై వున్నాయి.”

చీఫ్ అన్నాడు. “నువ్వు ప్రధానికి ఏం చెప్తావో.. ఈ సెంటర్ అత్యున్నతాధికారిగా నాకు ముందు తెలియాలి.”

“నేనేం చేశానో మీరు చూశారు కదా?”

“చూసినా వివరాలు తెలియాలి కదా..”

“మీరింత చిన్న విషయానికి ఎందుకంత పట్టుపడుతున్నారో నాకు అర్ధం కాలేదు.”

“అదే ప్రశ్న నేనూ  వేయగలను. నీ తోటి సైంటిస్టులకు అంతా వివరంగా చెప్పు. నివేదిక తయారు చేయ్యి. దాన్ని ప్రధానికి అందచేద్దాం.”

“క్షమించండి. ఈ వివరాలన్నీ తోటి సైంటిస్టులతో చర్చించేవి కావు. ఒక విభాగం చేసే పని మరో డిపార్టుమెంట్‌కి తెలియకుండా ఈ పరికరం తయారు  కావాలి. అసెంబ్లింగ్ చేసే వ్యక్తికి మాత్రం చివరి విషయం తెలియాలి. ఈ విధమైన ఏర్పాట్లు లేకపోతే ఈ రహస్యం బయటికి పొక్కే అవకాశం వుంది. అందుకే “ప్రధాని” అంటున్నాను. దయచేసి ఈ విషయంలో మీరు నన్ను వత్తిడి పెట్టొద్దు.” నమ్రతగా అన్నాడు.

అధికారి మొహంలో రంగులు మారాయి. అప్పటివరకూ వున్న ప్రసన్నత పోయింది. జగదీష్ మెడ పట్టుకుని దగ్గరకి లాగాడు. విసురుగా మొహం పైకెత్తుతూ “ఎలా చెప్పవో చూస్తాను. గూఢచారి విభాగం గురించి తక్కువ అంచనా వేసినట్టున్నావు. ఎలాంటి నిజానన్నాయినా కక్కించగల్గే సామర్ధ్యం వాళ్లకుంది” అన్నాడు.

జగదీష్ విస్మయంతో, “మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు?” అన్నాడు.

“నువ్వున్నది ఇండియాలో కాదు. పాకిస్తాన్‌లో! అర్ధమయ్యిందా?”

జగదీష్ మీద పిడుగు పడినట్లయింది. “అంటే.. అంటే… నేనీ రిసెర్చి  చేసింది శత్రుదేశంలోనా? నేనున్నది డిల్లీలో కాదా?” తడబడుతూ పిచ్చెక్కినవాడిలా అన్నాడు.

“కాదు రిసెర్చి సెంటర్ చీఫ్‌ని కూడా నేను కాదు. నా పేరు అజ్మరాలీ. సైన్యంలో అధికారిని. నిన్ను ఇండియన్ సరిహద్దు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నీతో రహస్యం  చెప్పించే బాధ్యత నా మీద పెట్టింది ప్రభుత్వం.”

జగదీష్ ప్రసాద్ మొహం వాడిపోయింది. ఏమీ తోచనివాడిలా నిశ్చేష్టంగా వుండిపోయాడు. అజ్మరాలీ అతడి దగ్గరికి వచ్చాడు. “మీ దేశంలో నువ్వు కలలో కూడా ఊహించని సౌఖ్యాలు ఇక్కడ అమరుస్తాను. నీ భార్య, పిల్లల్ని ఇక్కడీకి తెచ్చే బాధ్యత నాది. చెప్పు”

నేను చెప్పను” క్లుప్తంగా అన్నాడు ప్రసాద్ అన్నాడు. అజ్మరాలీ వెళ్లిపోయాడు. మిగతావాళ్లు అతడికి ఎన్నో విధాల నచ్చచెప్పారు. అతడు వినలేదు. ఆ తర్వాత మొదలైంది నరకం. అతడిని  రకరకాలుగా హింసించడం ప్రారంభించారు. కలలో కూడా ఊహించని బాధలు పెట్టారు. అతను చెప్పలేదు.

అతడిని ఒక చీకటి గదిలో బంధించారు. మిగతా వాళ్లతో సంబంధం లేకుందా వుంచారు. చిత్రహింసలు పెట్టారు. అతడి కళ్లు గాజు గోళాల్లా నిస్తేజమయ్యాయి. అతడి శరీరం శుష్కించి పోయింది. ఒక్కటే మాట. “మీరు చంపినా చెప్పను”

పదేళ్ళు గడిచాయి. సుదీర్ఘమైన ప..దే..ళ్లు.. అతడు వుడకబెట్టిన దుంపలా తయారయ్యాడు. మరింకెంతో కాలం బ్రతకడనిపించేలా తయారయ్యాడు.

అజ్మరాలీ సైన్యం నుంచి తిరిగి ఈ డిపార్టుమెంట్‌కి వచ్చాడు. జగదీష్ ప్రసాద్ పరిస్థితి చూసి మిగతా ఆఫీసర్లని తల వాచేట్టు చివాట్లు పెట్టాడు. అతడిని మిగతా ఖైదీల్లో కలిపి వుంచమని ఆజ్ఞ యిచ్చాడు. అతడితో అన్నాడు. “పది సంవత్సరాలుగా  నువ్వీ రహస్యం చెప్పలేదంటే మరిక చెపుతావని నాకు నమ్మకం లేదు. మామూలు పరిస్థితుల్లో అయితే నిన్ను చంపెయ్యాలి? సైన్యం సంగతి నీకు తెలియనిదేముంది? మనకు దక్కనిది పరాయివాడికి దక్కకూడదు అన్న సిద్ధాంతం. అయితే ఒక సైంటిస్ట్‌గా నీ మీద నాకు గౌరవం వుంది. అందువల్లే నిన్ను చంపేయకుండా వుంచుకున్నాను. అయితే జీవితాంతం నీకు స్వేచ్చ మాత్రం వుండదు.

అజ్మరాలీ  మోసం తెలియక అదే గొప్ప వరంగా అజ్మరాలీ వైపు కృతజ్ఞతతో చూశాడు జగదీష్. అతడు మిగతా భారతీయ సైనికులతో కలుపబడ్డాడు. యుద్ధ ఖైదీలు అందరూ ఒకే కుటుంబంలా కలిసి వుండేవారు. స్వదేశానికి దూరంగా, భార్యాబిడ్డల్ని ఎప్పుడూ కలుసుకోలేమన్న నిరాశా నిస్పృహలతో జీవచ్చవాలుగా బ్రతికే ఆ ఖైదీలకి కేవలం తమ తోటి ఖైదీల మధ్య వున్నామన్న ఆశ ఒక్కటే చీకట్లో చిరుదీపం. జగదీష్ అంటే వారికి గౌరవం. అతడి విజ్ఞానాన్ని వాళ్లు గౌరవించేవారు. అతడు కనుక్కున్న విషయం సామాన్యమైనది కాదని వాళ్లకి తెలుసు. జగదీష్ వున్న సెల్‌లోనె ఇస్మాయిల్ కూడా వుండేవాడు.

శాంతి ఒప్పందం క్రింద అప్పుడప్పుడు ఖైదీల మార్పిడి జరిగేది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రెండు దేశాల యుద్ధ ఖైదీలు విడుదల అయ్యేవారు. భారతదేశం వచ్చిన ఖైదీలు, అక్కడ చెరసాలలో వున్న జగదీష్ గురించి ప్రభుత్వానికి చెప్పారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. ఆ పేరు మీద  ఎవరూ లేరన్నారు. అది అబద్ధమని అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇండియా నుంచి వచ్చిన పది సంవత్సరాల క్రితం సరిహద్దునుంచి దొంగతనంగా జగదీష్‌ని పాకిస్తాన్‌కి రవాణా చేసిన అధికారిని మార్షల్ లా క్రింద ఉరి తీశారు. జగదీష్ భార్యకి, ఆమె భర్త బ్రతికి వున్నట్టు తెలియజేయటానికి ప్రయత్నించింది  ప్రభుత్వం. ఆమె అనాధ అనీ, ఎక్కడ వుందో తెలీదని అధికారులు తెలియజేశారు.

ఈ టైంలో పాకిస్తాన్ జైల్లో ఒక సంఘటన జరిగింది. ఇస్మాయిల్, జగదీష్ వున్న సెల్‌లో వరుణ్ అనే యుద్ధఖైదీని వుంచారు. అతను ఈస్టరన్ సెక్టార్ నుంచి పట్టుబడ్డాడు. రెండు రోజుల పరిచయం తరువాత అతను విషయం చెప్పాడు. “నేను ఆర్మీ నుంచి రాలేదు! ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను. మిమ్మల్ని తీసుకుపోవటానికి సైనికుడిగా నటించి  యుద్ధంలో దొరికిపోయాను.”

వారం రోజుల  తరువాత వాళ్ల ఆపరేషన్ పూర్తయింది. వరుణ్ మొత్తం వివరాలన్నీ సేకరించాడు.

ఒక వర్షం కురుస్తున్న చీకటి రాత్రి వాళ్లు ముగ్గురు ఆ ఆర్మీ క్యాంప్ నుంచి తప్పించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు సరిహద్దు దాటకుండానే దొరికిపోయారు.

వాళ్లు పారిపోవటం గమనించిన గార్డులు వెనుకనుంచి రైఫిల్ పేల్చారు. భారతదేశపు సరిహద్దు కొండల అవతల కనిపిస్తూ వుండగా జగదీష్ కూలిపోయాడు. అతడి కాలులో గుండు దిగబడింది.

కాస్త ఓపిక తెచ్చుకోండి. అరగంటలో సరిహద్దు దాటేస్తాం” చెయ్యి అందిస్తూ అన్నాడు వరుణ్.

లేదు బాబూ. ఈ వయసులో నేనిక శక్తి సమకూర్చుకోలేను. మీరిద్దరూ వెళ్లండి.”

నేను వెళ్లను” అన్నాడు ఇస్మాయిల్. “మిమ్మల్ని ఇలా వదిలి వెళ్లను. గార్డులు చంపినా సరే.”

అదికాదు…”జగదీష్ చెప్పబోయాడు.

మీరింకేమీ చెప్పొద్దు” ఇసమయిల్ దృఢంగా అన్నాడు.

జగదీష్ వరుణ్ వైపు తిరిగి “నువ్వు పారిపో. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ మనిషివని తెలిస్తే వాళ్లు నిన్ను బ్రతకనివ్వరు.” అన్నాడు.

ఎలాగయినా సరే నేను మిమ్మల్ని తీసుకువెళతాను” దృఢంగా అన్నాడు వరుణ్.

అది అయ్యే పని కాదు. గార్డులు నాలుగు వైపులనుంచీ చుట్టుముడుతున్నారు. కనీసం నీ ప్రాణాలయినా దక్కించుకో.”

దూరం నుంచి రైఫిల్ చప్పుడు ఇంకా వినిపిస్తుంది.

వరుణ్ లేచాడు. “జగదీష్‌గారూ మనిషి కన్నా ముఖ్యం దేశం. మా డిపార్ట్‌మెంట్‌లో చెప్పే మొదటి పాఠం అది. సైన్యంలో కూడా ఇదే చెబుతారు. ఇక్కడ సెంటిమెంట్స్‌కి విలువ లేదు. ఈ ఫార్ములా మన దేశానికి ఎలాగయినా చేరాలి. నేను ప్రాణం పోయేవరకూ మీతోనే వుండి మిమ్మల్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాను. చస్తే ఇద్దర్మ చద్దాం. ఇస్మాయిల్ మాత్రం సరిహద్దు దాటి వెళ్లిపోతాడు. అతడి ద్వారా ఫార్ములా పంపించేద్దాం.”

జగదీష్ మొహంలో వెలుగు కనపడింది. దాదాపు పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి ఆశ.

వరుణ్ అన్నాడు. “ఇస్మాయిల్ సరిహద్దు దాటి వెళ్లేవరకూ మనం ముగ్గురం ఇక్కడే వున్నామన్నా భ్రమ అవతలి వాళ్లకు కలగజెయ్యాలి. మీరు తొందరగా ఆ ఫార్ములా వ్రాయండి. నేను గార్డులని ఏమార్చే ప్రయత్నంలో వుంటాను” అంటూ కాగితం ఇచ్చి అక్కణ్ణుంచి చీకటిలో మరోవైపు వెళ్లి అక్కణ్ణించి లోయలోకి రాళ్లు విసరసాగాడు. కాల్పులు అటు మళ్లాయి. అయిదు నిమిషాలు గడిచాయి.

జగదీష్ సగం ఫార్ములా వ్రాశాడు.

అంతలో చెట్ల వెనుక చప్పుడైంది. నలుగురు గార్డులు ఊహించని రీతిలో బయటకొచ్చారు. ఇస్మాయిల్ చేతులు ఎత్తి నిలబడ్డాడు. వరుణ్ ప్రాణాలకు తెగించినట్టు వాళ్లవైపు పరిగెత్తాడు. ఒక గార్డుని కూలద్రోసి రైఫిల్ లాక్కుని మిగతా వాళ్ల మీద ఎక్కుపెట్టాడు. నలుగురు గార్డులూ సరెండర్ అయ్యారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

వీళ్ల గురించి మీరు ఆలోచించకండి. వ్రాయటం పూర్తి చేయండి” అన్నాడు వరుణ్.

అప్పటికే జగదీష్ తను వ్రాసిన కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు.

వరుణ్ మొహం వాడిపోయింది. “ఏమిటిది?” అన్నాడు.

జగదీష్ అన్నాడు. ” నువ్వు పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెంటువి.. అవునా?”

అక్కడ సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం. దాన్ని ఛేదిస్తూ “ఏం మాట్లాడుతున్నారు మీరు?” అన్నాడు కంగారుగా వరుణ్.

నువ్వు గార్డులతో ప్రవర్తించిన  విధానం చూస్తే నాకు అనుమానం వచ్చింది. మనల్ని చూడగానే గార్డులు ఎందుకు ఆగిపోయారు? నువ్వు దగ్గిరకు వెళుతుంటే వాళ్లు ఎందుకు కాల్పులు సాగించలేదు.  జగదీష్ ఆగి మళ్ళీ అన్నాడు. “పది సంవత్సరాలు నన్ను ఒంటరిగా వుంచి హింసించినా నేను మీకేమీ చెప్పలేదు. అందుకే బహుశా మీరీ కొత్త ఎత్తు వేసి ఉంటారు. నన్ను మామూలు ఖైదీల్లో కలిపి అదే సెల్‌లోఖి వచ్చిన యుద్ధ ఖైదీలా నువ్వు నటించావు. దేశభక్తి అనే సింటిమెంట్ మీద నాటకమాడి నాతో ఈ ఫార్ములా విషయం చెప్పించటానికి ప్రయత్నించారు అవునా?”

వెనుకనుంచి చప్పట్లు వినిపించాయి. చెట్ల చాటునుంచి అజ్మరాలీ వచ్చాడు. “సరిగ్గా గ్రహించావు జగదీష్. నేను రాగానే చేసిన పని అదే. నీతో నిజం చెప్పించటానికి వేసిన ఎత్తు ఇదిగో ఈ విధంగా వీరివల్ల ఫెయిలయింది.” అంటూ జేబులోంచి పిస్టల్ తీశాడు.

ఆ అడవిలో అతడి చేతిలో పిస్టల్ నాలుగు సార్లు  ప్రతిధ్వనించింది. నలుగురు గార్డులూ నేల కూలారు.

తమ పోర్షన్ సరిగ్గా వెయ్యలేని పాత్రధారులు రంగస్థలం మీద అనవసరం” పిస్టల్ జేబులో పెట్టుకుంటూ అన్నాడు అజ్మరాలీ.  వరుణ్ భయంగా అతడివైపు చూస్తూ “సారీ సార్! ఒక్కసారిగా నలుగురొచ్చేసరికి నేనేం చేయాలో అర్ధం కాలేదు” అన్నాడు. “నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఏదయినా చేస్తే  అది ఇతడితో రహస్యం చెప్పించగలగటమే.”

ఇక ఆ విషయం మాకు వదిలిపెట్టండి” వరుణ్ అన్నాడు.

(అతడి అసలు పేరు ఖాన్ అని తరువాత తెలిసింది)

ఇస్మాయిల్‌నీ, జగదీష్‌నీ తిరిగి ఆర్మీ క్యాంప్‌కి తీసుకొచ్చారు. ఖాది ఇది తన ప్రిస్టేజిగా తీసుకున్నాడు. ఎన్నో రకాలుగా జగదీష్ చేత రహస్యం చెప్పించ్చడానికి పూనుకున్నాడు.

జగదీష్ చెప్పలేదు. అసలు మాట్లాడలేదు.

అసలెవరితోనూ మాట్లాడలేదు. తనవాళ్లు, పరాయివాళ్లు, శత్రువులు, మిత్రులు ఎవరితోనూ మాట్లాడలేదు. ఒక మునిలా, నిశ్శబ్దంగా, మౌనంగా వుండిపోయాడు. తను నోరు విప్పి ఒక్క అక్షరం మాట్లాడినా దాన్ని శత్రువులు డీ కోడ్చేస్తారేమో అన్నట్టు పెదవి పదపలేదు. దాహంతో గొంతు ఎండిపోతున్నా నీళ్లుఅని అడగలేదు. పది సంవత్సరాల నుంచి అతడి స్వరం ఉచ్చారణని మర్చిపోయింది. ఒకచోట ఒంటరిగా కూర్చోవటం, గార్డులు ఏదైనా పెడితే తినటం, లేకపోతే అలా వుండిపోవటం.

అతడి కళ్ళు నిస్తేజాలయ్యాయి.

అతడిని వృద్ధాప్యం ఆక్రమించిది.

ఒక జీవచ్చవంలా .. మరణం కోసం ఎదురు చూస్తూ అలా శత్రు శిబిరంలో వుండిపోయాడు.

ఇంకా అలాగే వున్నాడు.

 

* * * * * * * * * *

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *