June 14, 2024

జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి -శ్రీ రావూరి భరద్వాజ గారు

రచన: టీవీయస్.శాస్త్రి  tvs shastry

 

తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో,ప్రతిభా పాటవాలతో ఎదిగిన గొప్ప రచయిత శ్రీ రావూరి భరద్వాజ. శ్రీ రావూరిగారు తాను అనుభవించిన కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అభిశంసలను, నిరాదరణలను, అనుభవాలను,  అనుభూతులను,కథా వస్తువులుగా మలుచుకున్నారు. ‘పాకుడురాళ్ళు’. కాదంబరి’ నవలలు–“అధోజగత్సహోదరుల కథా సరిత్సాగరం…”అని మహాకవి శ్రీశ్రీ నుండి అభినందనలు అందుకున్నట్టి రచయిత శ్రీ రావూరి వారి’జీవన సమరం’వంటి  ఒక యదార్ధ గాధా సంపుటం–“ఒక్క భారతీయ భాషల్లోనే కాదు, నాకు తెలిసిన ,ఏ విదేశీ భాషలోనూ ఇలాంటి స్మృతి సాహిత్యం ఇంతవరకూ రాలేదు”అని శ్రీ పురిపండ అప్పలస్వామి గారిచేత ప్రశంసలు అందుకున్న మహామనీషి శ్రీ రావూరి వారు.చాలా కాలం,అంటే రమారమి 25 సంవత్సరములు నాస్తికుడిగా ఉన్న ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది. జీవితమంతా, తెలుసుకుంటూ,తెలుసుకుంటూ ప్రయాణం సాగించాలి అనే వారు. అలా వారు వ్రాసిన పుస్తకం ‘తెలుసుకుంటూ, తెలుసుకుంటూ’  అనే దాన్ని వారి అమ్మానాన్నలకు అంకితమిస్తూ,ఎంత  వి(స)లక్షణముగా చెప్పారో చూడండి—

ravuri_bharadwaja

అవినీతికన్నా,అధర్మంకన్నా
మించిన దరిద్రం మరోటి లేదుఅని విశ్వసించి,
పరంగా,సుసంపన్నంగా జీవించిన
మా
నాన్న
కు
తన కన్నీటిని దాచుకొని,
బాధితుల కన్నీటిని తుడవటమే
జీవిత పరమార్ధంగా భావించిన
మా
అమ్మ
కు
తమ జీవితాశయాలనే పాఠాలుగా
నాకు నేర్పినందుకుఅంకితం.

శ్రీ రావూరి భరద్వాజగారు  తెలుగు కథారచయితగా, నవలారచయితగా, రేడియోలో రచయితగా పేరు తెచ్చుకున్నారు. రావూరి భరద్వాజ 24 కథా సంపుటాలు, తొమ్మిది నవలలు, నాలుగు నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించారు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడురాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది.ఈ నవలకే వీరికి జ్ఞానపీఠంవారి పురస్కారం లభించింది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. ఒక బీద కుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నారు. ఆ తరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించారు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవారు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనినించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నారు. తొలిరోజుల్లో తెనాలిలో ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించారు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడై ,, ఒకసారి ఆత్మాభిమానం కించపరచే ఒక సందర్భంలో తాళలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌ గా పనిచేశారు. అక్కడ కూడా యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో కళాకారునిగా చేరి చివరకు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేసారు.భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉన్నది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాసారు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందె వేసినచెయ్యి అనిపించుకున్నారు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాసారు.రావూరి భరద్వాజ రమారమి 150 రచనలు చేశారు..రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం( కళాప్రపూర్ణ) చేసి గౌరవించాయి.
వారి భావ పరంపరలు కొన్ని….
1.ప్రభువును పూజించి, ధ్యానించి, ప్రార్ధించి ఏమేమో కావాలని అర్దించే వారిని చూస్తే, నాకు జాలి వేస్తుంది. నీకేమి కావాలో, ఏమిస్తే నీవు చుక్కలదాకా ఎదుగుతావో, ఏమిస్తే నీవు దిశాంతాల దాకా విస్తరిస్తావో, ఏమిస్తే నీవు చండభాస్కరునిలా వికసిస్తావో, ప్రభువుకు తెలుసు. తన బిడ్డ ఏడుపును విన్న తల్లి వెంటనే గ్రహిస్తుంది. అది తన కోసం ఏడుపా? ఆకలి ఏడుపా? భయపడిన ఏడుపా? మరేదయినానా-అని! తనకు తెలియదనుకొని, కోరికల పట్టీని తనముందుంచే వారి అమాయకత్వానికి చూసి ప్రభువు నవ్వుకోడా? జాలి పడడా?
2.ఉన్నచోటనే ఉండిపోకుండా, కొంచెం ఎత్తుకెళ్ళిన మాట నిజమే! ఇలా వెళ్ళటం నా ప్రతిభాపాటవాలకు నిదర్శనమని మీరనటంలో మీ అభిమానం ద్యోతకమవుతున్నంతగా సత్యం గోచరించటంలేదు. ఒక నిచ్చెన లేకపోతే నేనెలా ఎక్కగలను? నా బరువంతా తనమీద మోపుతున్నా కిక్కురుమనకుండా భరించగల మంచి నిచ్చెనను, నాకందచేసిన దయామయులే లేకపోతే–నేనేమయి ఉండేవాణ్ణి!
3.”నాలో ఉన్నవన్నీ నా కవసరమైనవి కావు.కోపం,అసూయ,అసహనం,ద్వేషం లాంటివి.ఏదో ఒక శాతంలో,నాలోనూ ఉన్నాయి.ఇవి–నాకెందుకూ పనికిరావటం లేదుగదా!అయినా ఎందుకున్నట్టు?”అన్నాడతను.”అవెందుకూ పనికి రావన్న పరమ సత్యం,అనుభవ పూర్వకంగా నీకు తెలియటం కోసం ఉన్నాయి”అన్నారు స్వామి పరమానంద (రామకృష్ణ మిషన్)

ఇలా సాగుతుంటాయి వారి భావపరంపరలు!

శ్రీ రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠంవారి పురస్కారం లభించిన సందర్భంలో వారికి అభినందనలు! భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటున్నాను.

 

అనుభవాలను మించిన మహాకావ్యం మరొకటి ఉండదని నిరూపించిన మహర్షి ఆయన!

(శ్రీ రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠం వారి పురస్కారం లభించిన సందర్భంలో, వారికి అభినందనలు తెలియచేస్తూ  ‘ఆకాశవాణి’హైదరాబాద్ కేంద్రం వారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ రావూరి భరద్వాజ గారి అనుభూతిని ప్రసారం చేసారు.ఆ రేడియో ప్రసంగాన్ని జతచేస్తున్నాను.)

 

 

7 thoughts on “జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి -శ్రీ రావూరి భరద్వాజ గారు

 1. మీ వద్ద రావూరి భరద్వాజ గారి తెలుసుకుంటూ… తెలుసుకుంటూ… పుస్తకం ఉందా….

 2. శ్రీ రావూరి భరద్వాజగారి గురించి శాస్త్రి గారు వ్రాసిన వ్యాసం క్లుప్తంగా, చక్కగా వుంది, ధన్యవాదాలు. శ్రీ రావూరి భరద్వాజగారు కోరినట్లు వచ్చేజన్మలో మరల ఆకాశవాణి ఆవరణలో గడ్డిపుచగా పుట్టాలని కోరుతూ
  నాగయ్య, హైదరాబాద్

  1. రావూరి భరద్వాజ గార్కి జ్ఞానపీఠ అవార్డునిచ్చి గౌరవించడం- తెలుగువారందరినీ గౌరవించడమే.
   మన శాస్త్రిగారు తమ వ్యాసానికి “జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి -శ్రీ రావూరి భరద్వాజ గారు” అనే
   మకుటాన్ని ఇవ్వడమే రావూరికి వ్యాసకర్త ఇచ్చిన సముచిత గౌరవంగా భావిస్తాను; ఎందుకంటే – రావూరి
   రచనలకి వారి జీవితానుభవాలే ప్రేరణ గనుక. ఎప్పటిలానే- శాస్త్రిగారు రావూరివారి జీవిత విశేషాలను
   మనముందుఉంచడంలో శ్రద్ధను కనబరచి వీలయినంత తక్కువ నిడివిలోనే ఎక్కువ సమాచారాన్ని
   ఇచ్చే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. రావూరివారికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చిన సందర్భంలో ఆకాశవాణి,
   హైదరాబాదు కేంద్రంవారు ప్రసారంచేసిన “అనుభూతి” ని ఈ వ్యాసానికి జతచేజేయడం ఎంతో సముచితంగా ఉంది.
   ఈ సందర్భంగా వ్యాసకర్తకి నా హృదయపూర్వక అభినందనలు.

   -మొహమ్మద్ అబ్దుల్ వహాబ్.

   1. సమగ్రంగా,చక్కని విశ్లేషణతో ఉన్న మీ సుస్పందనకు కృతజ్ఞతలు వహాబ్ భాయ్!
    టీవీయస్.శాస్త్రి

 3. మీ సుస్పందనకు కృతజ్ఞతలు విజయలక్ష్మి గారు.

  టీవీయస్.శాస్త్రి

  1. చాలా బాగుంది మీ స్పందన.కృతజ్ఞతలు నాగయ్య గారు.

   టీవీయస్.శాస్త్రి

 4. శ్రీ రావూరి భరద్వాజ గారిని గురించి చక్కని వ్యాసాన్ని వ్రాసిన శ్రీ టీవీయస్.శాస్త్రి గారికి ధన్యవాదాలు.

  విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *