April 20, 2024

“బనవాసి” – చారిత్రక సాహిత్య కధామాలిక – 4

రచన: మంధా భానుమతి mantha bhanumathi

పదవ శతాబ్దం.. పూర్వార్ధం..

“బనవాసి”.. ఉత్తర కేరళ నుండి, ఉత్తర కర్ణాటక వరకు ఏక ఖండంగా రాజ్యమేలిన కాదంబ రాజుల ముఖ్య పట్టణం. కాల క్రమాన కాదంబ వంశ పాలన క్షీణించి, ఆ ప్రదేశమంతా చాళుక్యుల, ఆ తరువాత రాష్ట్రకూటుల సామంత రాజ్యంగా మారిపోయింది. కాదంబరాజు శివకోటి, యుద్ధాలలో రక్తపుటేరులు పారడం సహించలేక,  జైన మతం స్వీకరిస్తే, అప్పటినుండీ ఆ రాజ్యం జిన సంస్కృతికి మారుపేరుగా నిలిచింది.

భీమనప్పయ్య జైనమతం నుండి మారి, వైదికమతం స్వీకరించడానికి ఇష్టపడకపోతే.. తండ్రిగారూ, తాతగారూ, గ్రామస్థుల ఆగ్రహావేశలని అదుపుజెచెయ్యలేక, ఊరినుండి సకుటుంబంగా పంపివేసి ఇరువది వత్సరాలయింది. సింగనజోస్యుల వారి ఆదరణతో, ఆశీర్వాదంతో వేములవాడలో నిలదొక్కుకుని, ప్రతిభా పాటవాలతో రాజుగారి దృష్టిలో పడి.. బనవాసిలో రాచకార్యాలు విర్వర్తించడం ఆరంభించి పది సంవత్సరాల పైమాటే.

చాలా రోజుల తరువాత పాఠశాలకి పక్షం దినాలు శెలవు ప్రకటించి, ఆ రోజే వేములవాటికకి వచ్చాడు. రాగానే ఇల్లాలు ఆప్యాయంగా వడ్డిస్తుంటే కడుపారా తిన్నాడు. బనవాసిలో రాజుగారి వంట శాలనుంచి పంచ భక్ష్య పరమాన్నాలు వచ్చినా.. ఇంటి వంటకి సాటి వచ్చునా! అందులో కాసింత ప్రేమ, అభిమానం అనే ప్రత్యేక తాలింపు ఉంటుంది మరి.

భోజనం అయ్యాక, వీధరుగు మీద కూర్చుని, భుక్తాయాసం తీర్చుకుంటున్నాడు. జినవల్లభుడు తాటాకు విసిని కర్రతో విసురుతూ సేద తీరుస్తున్నాడు.

వబ్బేణబ్బ తాంబూలం తయారు చేస్తోంది.

అప్పుడే ఒక మాటన్నాడు భీమనప్పయ్య నవ్వుతూ..

“నిజమా! మీరు ఇంక ఇక్కడే ఉండిపోతారా?” జినవల్లభుడు విప్పారిన కన్నులతో ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.

“అందరం ఇక నుంచీ కలిసి ఉంటామన్నాను కానీ, నేను ఇక్కడే ఉంటాననలేదే..” భీమనప్పయ్య చిరునవ్వు నవ్వాడు, చిన్నకొడుకుని దగ్గరగా తీసుకుని.

వాకిలి ముందున్న చెట్టుకి కట్టేసిన గుర్రానికి దాణా పెడుతున్న పంపన్న వెనుతిరిగి చూశాడు.

“అవును పంపన్నా! అందరం బనవాసికి వెళ్లిపోదాం. అక్కడి పాఠశాల నడిపిస్తూ రాజ్యం తీరుతెన్నుల మీద ఒక కన్నేసి ఉంచమని రాజుగారి ఆజ్ఞ. అక్కడి ప్రభువులు జైన మతం స్వీకరించాక యుద్ధవాతావరణం లేదనుకో! అయినా.. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేరు కదా!” తండ్రిగారి మాట విని తల పంకించి గుర్రాన్ని నిమరసాగాడు పంపన్న.

“నాకు ఇక్కడే ఉండాలని ఉంది అప్పా! అన్నీ బాగా నేర్చుకుంటున్నా కూడా..” జినవల్లభుడు బిక్కమొహంతో అన్నాడు. కళ్లు నీళ్లతో నిండి ఏక్షణంలోనైనా రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. పదహారేళ్లు నిండినా పసితనంపోని పుత్రుడ్ని అక్కున చేర్చుకున్నాడు భీమనప్పయ్య.

“అక్కడ కూడా మన పాఠశాలే కదా! తండ్రిగారుంటారు. ఇంకా బాగా నేర్చుకోవచ్చు. చదువేనా.. ఇంకేమైనా కారణం..” పంపన్న తమ్ముడ్ని ఆటపట్టిస్తున్నట్లు చూశాడు.

“ఇంకేమిటి కారణం.. “భ్రుకుటి ముడిచిన తండ్రిని చూసి ఏం ఫరవాలేదన్నట్లు సైగ చేశాడు పంపన్న.

“స్నేహితులు ఉన్నారు.. వదిలి వెళ్లలేనంత గాఢస్నేహం. కోమటిభీమన్నగారి అబ్బాయి మల్లియ రేచన్న. ఇద్దరూ ప్రాణస్నేహితులు.” వబ్బెణబ్బ చిలకలు అందిస్తూ అంది.

“అవునప్పా! ఇద్దరం కలిసి ఛందో వ్యాకరణ సూత్రాలన్నీ కంఠస్తం పట్టాము. కావ్యరచన మొదలు పెడదామనుకుంటున్నాము. ఒకరి కొకరు తోడుంటామని వాగ్దానం చేసుకున్నాము.” జినవల్లభుడు మనసు విప్పాడు.

“నేనొక సలహా ఇవ్వచ్చా నాన్నగారూ!” పంపన్న సందేహిస్తూ అడిగాడు.

ప్రసన్నంగా చూస్తూ తల ఊపాడు భీమనప్పయ్య.

“మీకు మారుగా బనవాసి వెళ్లి అక్కడి వ్యవహాలు చూస్తూ నేను పాఠశాల నడుపుతాను. మీరు ఇక్కడే హాయిగా ఉండండి.. నిశ్చింతగా. ఈ వయసులో అంతంత  సుదీర్ఘ ప్రయాణాలు మంచిది కాదుకూడా.”

“రాజుగారి అనుమతి తీసుకుని అపుడు నిర్ణయిద్దాం.” సాలోచనగా చూస్తూ అన్నాడు భీమనప్పయ్య. రాజుగారి అనుమతనే కాదు, తాము కూడా ఆలోచించాలి కదా! స్ఫురద్రూపియై, నవయవ్వనంతో, ఆరోగ్యంతో.. ఎటువంటి ఆపదనైనా.. ఏ పరిస్థితి నైనా ధీమాగా ఎదుర్కొనగల పంపన్న ఇంకా పాలబుగ్గల పసివాడిగానే కనిపిస్తాడు భీమనప్పయ్యకి.

ఇష్టం ఉన్నా లేకున్నా రాజాజ్ఞ పాలించి తీరవలసిందే! పంపన్న చెప్తున్నట్లు ఇంక విశ్రాంతి తీసుకోవాలనిపించడం సహజమే. అయినా.. తన చేతిలో ఏముంది? వబ్బెణబ్బ కూడా ఒప్పుకోవాలి కదా! పంపన్నని వదిలి ఉండడం తనకీ కష్టమే!

ఆ రోజే పంపన్న బనవాసి ప్రయాణం.

జినవల్లభుడు అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తాను అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. వేములవాటిక లోనే ఉండాలన్న తన అభ్యర్ధన ఈ విధంగా మలుపు తిరుగుతుందని ఊహించలేదు. స్నేహితుడిని విడిచి వెళ్లడం ఇష్టం లేదంటే.. అన్నకి దూరంగా ఉండాల్సి వస్తోంది. పరిస్థితి ఈ విధంగా మారుతుందంటే మౌనమే వహించేవాడు కదా!

భీమనప్పయ్య అడగడమేమిటి చాళుక్య నరసింహుడు వెంటనే అంగీకరించాడు. తండ్రికి సమానమైన పండితుడు. నవయవ్వనంలో ఉన్నవాడు.. నిస్సదేహంగా తండ్రికంటే బలవంతుడు. సకల విద్యా కోవిదుడు. అవసరమైతే అశ్వారోహణ చేసి యుద్ధ భూమికేగ గలడు. అంత కన్నా ఇంకేం కావాలి? జిన ధర్మాన్ని పాటించే చక్రవర్తికి రణమందు ఆసక్తి లేకపోయినా సామ్రాజ్య నిర్వహణలో శత్రు దాడికి సిద్ధంగా ఉండాలి కదా! పంపన్నని జాగ్రత్తగా బనవాసికి చేర్చ వలసిందిగా సేనాపతికి ఆజ్ఞాపించాడు. పదిమంది సైనికులు, అందులో కొందరు బనవాసి వారే.. భీమనప్పయ్యకి సహాయంగా వచ్చిన వారు.. దారిలో ఆహారానికీ, నిద్రకీ సరిపోయే సామాన్లని తగిలించిన గుర్రాలతో సహా తయారై వచ్చేశారు.

పంపన్నకి మాత్రం పరమ ఉత్సాహంగా ఉంది. బనవాసి పట్టణంలో ప్రకృతి గురించి విని ఉన్నాడు. ఆ ప్రశాంత వాతావరణంలో ఏదైనా కావ్య రచన సాగిస్తే.. అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది. చూడాలి. ప్రయత్నం చెయ్యవలసిందే! పైగా ఇంటి బాధ్యతలు కూడా ఉండవు. కాలమంతా తన అధీనంలోనే.

“వ్యవహారంలో పడి ఆహారం విస్మరించకు పద్మప్పన్నా! అక్కడే మంచి కన్యని చూద్దాం.. వివాహమైతే కోడలికి నీ బాధ్యత అప్పగించవచ్చును.” వబ్బెణబ్బ పదోసారి హెచ్చరించింది.

పంపన్న తల ఊపాడు.

“అన్నా! ఇక్కడికి ఎవరు వస్తున్నా వారితో లేఖను పంపుతావు కదూ!” జినవల్లభుడు జీరపోయిన గొంతుతో అడిగాడు. పంపన్న తమ్ముని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు.. ధైర్యం చెప్తున్నట్లుగా!

పాఠశాలలోని విద్యార్ధులు, స్నేహితులు.. అందరూ ఊరి చివరవరకూ వచ్చి వీడ్కోలు పలికారు. పంపన్న అందరిరోనూ సన్నిహితంగా ఉంటాడు.. జన ప్రియుడు.

పంపన్న అనుచరులతో సొన్నాలగి (నేటి శోలాపూర్)పట్టణం చేరేసరికి.. అన్ని రోజుల ప్రయాణం తరువాత అలసట అనిపించింది.. గుర్రాలకీ, మనుషులకీ కూడా. అక్కడ రెండు రోజులు ఆగి విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. ఆ రెండు రోజులూ సత్రంలో ఉన్నారు. ఆ తరువాతి మజిలీ కొల్హాపురం. దారంతా కన్నుల విందు చేసే ప్రకృతిని పరిశీలిస్తూ, ఏటి ఒడ్డున ఆగి స్నానాలు చేస్తూ, చదునుగా ఉన్న చోట గుడారం దింపి విశ్రమిస్తూ సాగిపోయారు. పంపన్నకి జ్ఞానం వచ్చాక అదే అంత సుదూర ప్రయాణం.

బనవాసి చేరుతుండగా అక్కడి ప్రకృతి సౌందర్యానికి కన్నులు తిప్పుకోలేకపోయాడు పంపన్న. కొండలు, లోయలు.. అడవులు.. వరదా నది మూడు ప్రక్కలా చుట్టి ప్రవహిస్తూ ఆ ప్రదేశాన్ని సస్యశ్యామలం చేసింది. ఒడలు పులకరించగా, అశ్వం దిగి కాలి నడకన అంతా పరికిస్తూ నెమ్మదిగా నడవసాగాడు.

సంధ్యాసమయం ఆసన్నమౌతోంది. పడమటి కనుమల మీదుగా కిందికి దిగుతున్న మిహిరుడు నారింజరంగు కిరణాలని త్రోవంతా పరుస్తూ భవిష్యత్కాల మహాకవికి స్వాగతం చెప్తున్నాడు. వివిధ ఫల వృక్షాల, ఆ వృక్షాల నల్లుకున్న పూ తీవల సువాసనలతో ఆ ప్రదేశమంతా సుగంధ భరితమయింది.

“ఓహో.. ఏమి ఈ అందము. అటుగా నున్న ఆ శిఖరము మీద కుటీరము వేసుకుని కావ్యరచన మొదలు పెడితే నిరాటంకంగా సాగించవచ్చు..” ప్రపుల్ల మనస్కుడై రాజభవనం దరిదాపులకి చేరాడు.

ఒక్కసారిగా కర్తవ్యం గుర్తుకొచ్చింది. ముందు రాజాజ్ఞ.. నిశిత దృక్కులతో నలుపక్కలా పరిశీలిస్తూ అశ్వాన్ని అధిరోహించి కోటలోనికి ప్రవేశించాడు పంపన్న. ఆ క్షణం నుంచీ తన జీవితం తనదే! కష్టమొచ్చినా తనే భరించాలి.. సుఖమొచ్చినా తనదే!

సార్వభౌములైన రాష్ట్రకూటులు, సామంతులైన వేములవాడ చాళుక్యులు, దగ్గర బంధువులు. మాన్యకేతం రాజధానిగా దక్షిణాపథాన్నేలుతున్న అమోఘవర్షుడు శాంతి కాముకుడు. జైనమతాభివృద్ధికి పాటు పడ్డవాడు. సాహిత్యాన్ని, సంగీతాన్ని, శిల్పకళలని ప్రోత్సహిస్తాడు. ఎల్లోరా గుహలలో నిర్మిసున్న శిల్పాల వైవిధ్యం ఎంతో ఎన్నదగినదని తండ్రిగారు చెప్తుంటే విని ఉన్నాడు పంపన్న. చెరువులు తవ్వించడంలో, అడవులని పెంచడంలో అశోక చక్రవర్తితో పోల్చతగ్గ రాజు. అమోఘవర్షుడి సామంతులైన బనవాసి రాజులు వర్మలతో, చాళుక్య నరసింహుడికి సత్సంబంధాలున్నాయి. రాకపోకలు.. పండితులు, కళాకారుల ఆగమనాలు మామూలే. “ఆ విధంగానే తండ్రిగారు వచ్చుంటారు” అనుకుంటూ పంపన్న గుర్రాన్ని అశ్వశాల నిర్వాహకుడికి అప్పగించి, రాజుగారిని కలిశాడు.

బనవాసి రాజు, వర్మ ఎదురొచ్చి, పంపన్నని సాదరంగా తీసుకెళ్లి ఉచితాసనంలో కూర్చుండ బెట్టాడు.

“పంపనార్యులకు వందనాలు. మీ వసతి గృహం మా మందిరానికి సమీపంలోనే ఉంది. మీరు పాఠశాల నడపడమే కాదు.. మాకు సలహాదారుగా కూడా వుండాలి. కొన్ని నాళ్లు విశ్రమించి మీ పని ఆరంభింప వచ్చు.”

సహృదయుడైన రాజుగారి మాటలకు ప్రసన్న వదనుడై, నమస్కరించి సెలవు తీసుకున్నాడు పంపన్న.

“ఈ స్నేహభావమే తండ్రిగారిని కట్టి పడేసుంటుంది” అనుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు, వెంట వస్తున్న ఇరువురు సేవకులతో.

అమోఘవర్షుడి తండ్రి మూడవ గోవిందుడు, చాళుక్య నరసింహుడి వంటి సామంతుల సహాయంతో గంగా తీరం వరకు రాజ్య విస్తరణ చేసి ప్రపంచ దేశాల విజేత అలెగ్జాండర్‍కి సాటి అనిపించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడనిపించిన అమోఘవర్షుడు.. ప్రపంచ చక్రవర్తులు నలుగురిలో ఒక్కడనిపించుకున్నాడు.

పంపన్న బనవాసి చేరినప్పటికి మూడవ ఇంద్రుడు రాష్ట్రకూట రాజ్యంలో చక్రవర్తి సింహాసనం అధిష్టించాడు. అతడు, తాతగారైన మూడవ గోవిందుడి వలే, సామ్రాజ్య విస్తరణాభిలాషి.

పంపన్న బనవాసిలో పంపనార్యుడిగా గౌరవం పొందసాగాడు. శిష్యులకు పాఠాలు బోధిస్తూనే.. తను అనుకున్న కావ్య రచన చెయ్యడానికి ఇంకా జ్ఞానసముపార్జన చెయ్యాలని విశ్వసించాడు. కానీ తన మీదుంచిన బాధ్యత కట్టిపడేస్తోంది..  ’శ్రావణబెళగొళలో దేవేంద్రముని సకల శాస్త్రపారంగతుడు’ అని విన్నాడు. ఏదో ఒక విధముగా ఆయన వద్ద సుశ్రూష చెయ్యగలిగితే..

ఆలోచనలు అపారం.. ఎన్నెన్నో చెయ్యాలనుకుంటారు మానవులు. కానీ అన్నీ సాధించగలరా?

కనీసం అధ్యయనం ప్రారంభించాలనుకుని శ్రీవిజయ, కవీశ్వర మొదలైన కవుల పద్యకావ్యాలని ఆకళింపు చేసుకోనారంభించాడు. తన ధ్యేయమునకు అవి చాలవు.. విమలోదయ, నాగార్జున మొదలైన రచయితల గద్యరచనలు క్షుణ్ణంగా చదివాడు. అమోఘ వర్షుడు, (ఈయనే నృపతుంగ చక్రవర్తిగా పేరుపొందాడు) తన ఆస్థాన కవి శ్రీవిజయ సహాయముతో వ్రాసిన చందో వ్యాకరణ గ్రంధము “కవిరాజమార్గం”లోని సూత్రాలు మనసుకి పట్టించుకున్నాడు.

పంపన్న ఇంక కావ్య రచన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాననుకున్నాడు.. ఐదారు సంవత్సరాల కృషి.. నిద్రలో, మెలకువలో. చేసే ఏ పనిలోనైనా అదే దృష్టి. ఎంచుకున్న కావ్యం మహోత్కృష్టమయింది. కొన్ని రోజులు, పతంజలి యోగసూత్రాలను పాటించి మనశ్శరీరాలని నిగ్రహించి, ఏకాగ్రత సాధించాడు.

ఆ పున్నమి నాడు ప్రారంభించడాని ఆయత్తమయ్యాడు..

అయితే అనుకున్నట్లు జరిగితే.. విధి ప్రాముఖ్యమేముంది..

త్రయోదశినాడు రాజుగారి వద్దనుండి కబురొచ్చింది.

రాజదర్శనం చేసుకునొచ్చిన పంపన్న నిట్టూరుస్తూ శయ్య మీద మేను వాల్చాడు.

—————————

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *