April 19, 2024

రక్షాబంధనం

రచన: స్వర్ణలతానాయుడు me

 

శ్రావణమాసంలో శుక్లపక్షమి పౌర్ణమి రోజునాడు వచ్ఛేదే రాఖీ పండుగ. భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లని చెప్పడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.అన్నాచెల్లెళ్ళ అనురాగబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుక ఇది.

 

ఈ రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి దైవపూజ కావించుకుని సోదరుల నుదుట తిలకం దిద్ది, మంగళహారతిచ్ఛి  నోరు తీపి చేసి సప్తవర్ణాలను తలపించే రంగురంగులదారాలతో అన్నాతమ్ముళ్ళకు రాఖీ కట్టి  వారి ఆశీర్వాదం తీసుకుంటారు.అదే తమ్ముడైతే అక్క ఆశీర్వదిస్తుంది కలకాలం సోదరుల జీవితాలు ఆనంద మయం కావాలని కోరుకుంటూ తమకు రక్షగా ఉండాలనే భావంతో  బంధనాల దారంతో ముడివేస్తారు. రాఖీ కట్టినందుకు గాను అక్కచెల్లెళ్ళకు ఎవరి ఆర్ధిక స్తోమతను బట్టి వారు విలువైన కానుకలిచ్ఛి వారిని సంతోషపెడతారు. ఈ రోజు బ్రాహ్మణులు పాతజంధ్యాలను తీసివేసి కొత్తజంధ్యాలను ధరిస్తారు తరువాత వేదపఠనం చేస్తారు . అందువల్ల `జంధ్యాల పౌర్ణమీ అని కూడా పిలువబడుతుంది .

 
దేవదానవులు మధ్య జరిగే సమరంలో శచీదేవి తనభర్త ఇంద్రుడికి వీరతిలకం నుదుటదిద్ది మంగళహారతులిచ్ఛి విజయం కలగాలని కోరుకుంటూ రాఖీని కట్టి యుద్దరంగానికి పంపింది. ఇది క్రమేణా ఆడపిల్లలు సోదరులకు కట్టడం ఆనవాయితీగా మారింది .సోదరసొదరీమణులు సిరిసంపదలతో తులతూగాలని జరుపుతూ చేసే వేడుక ఇది.అనాచెల్లెళ్ళ మమకారాన్ని, రక్తసంబంధాన్ని మరువకుండా బంధం బలపడాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఈ పండుగ వైభవంగా జరుపుకుంటారు.గ్రీకు దేశపు రాజు అలెగ్జాండర్ విశ్వాన్ని జయించాలనే ఆకాంక్షతో పురుషోత్తముడిపై యుద్దం తలపెడతాడు.రణరంగంలో పురుషోత్తముడిదే పైచేయి కానున్న సమయంలో అలెగ్జాండర్ భార్య భారతీయ సాంప్రదాయం ప్రకారం తన సేవకులతో రాఖీని పంపి తన భర్తకు ఎలాంటి ఆపద కలుగకుండా కాపాడమని ప్రార్ధిస్తుంది.

 
పురుషోత్తముడు ఆమెను తన సోదరిగా భావించి చెల్లి పసుపుకుంకుమలతో కలకాలం జీవించాలని తలచి అలెగ్జాండర్ వదిలివేయడం జరుగుతుంది.ఆనాటి నుండి అనాదిగా వస్తున్న ఆచారమే ఈ వేడుక. అమ్మలో సగం నాన్నలో సగమై వారి భాధ్యతలను సోదరులు తీసుకుంటారు.స్త్రీలు రక్తసంబంధం లేకపోయినా తాము సోదరుల్గా భావించే వారికి రాఖీలు కట్టి తమ అనురాగాన్ని పంచుకుంటారు. అనుక్షణం అన్న మోములో చిరునవ్వుల వెలుగులు పూయించాలని తపించేదే ముద్దులచెల్లి.బాల్యంలో చెల్లి చేసే ఆకతాయి పనులను సమర్ధిస్తూ తల్లి దండనలను తాను అనుభవించేవాడే అన్న..వెనుక దాగిన అనంతమైన వెలకట్టలేని ప్రేమ. చిన్ననాడు కలిసి ఆడిన ఆటలు , చెల్లి కోరింది కొనడానికి అమ్మను కాకాపట్టి డబ్బులు తీసుకుని కోరిక నెరవేర్చి సంతృప్తి పడే అన్న ప్రేమను చెల్లి ఎన్నటికీ మరువదు.

 
టీనేజీప్రాయంలో చెల్లి కాలేజీకెళ్ళేటపుడు బాడీగార్డ్ గా మారి కంటికి రెప్పలా కాపాడి గమ్యం చేర్చే అన్న ప్రేమ చిరకాలం గుర్తుండే సంఘటనలే. చెల్లి పెళ్ళి చేసి అత్తారింట తన క్షేమాన్ని తలుస్తూ కన్నులు దాటని కన్నీటిని అదిమిపెట్టి మోమున నవ్వులు పులుముకునేవాడే అన్నయ్య. అమ్మా నాన్నల బాధ్యతను తాను తీసుకుని పసుపుకుంకుమలిచ్ఛి పుట్టింటి సాంప్రదాయాన్ని కలకాలం నిలిపి చెల్లి ఎదలో పన్నీటిజల్లుని కురిపించేవాడే అన్నయ్య.

 

 

తోడబుట్టినవాళ్లే కాకుండా సోదర,సోదరీభావం కలిగిన వాళ్లందరూ జరుపుకునే పవిత్రమైన పండగ ఈ రక్షాబంధనం..

1 thought on “రక్షాబంధనం

  1. Awesome lines…………really amazing…………superb ga chepparu RAKSHABANDAN gurinche………………superb superb superb……………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *