April 20, 2024

ఛుపాలో యూఁ దిల్ మేఁ ప్యార్ మేరా – పారసీక ఛందస్సు – 3

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు                     j.k.mohanrao

 

గణముల పరిచయము –

అరబ్, పారసీక, ఉర్దూ మున్నగు భాషలలోని ఛందస్సు వివరాలను కొన్నిటిని వివరించుటకు ప్రయత్నిస్తాను. సంస్కృత, తెలుగు మొదలగు భాషలలో గణములు (metrical feet), తమిళములో శీరులు ఉన్నట్లే  ఈ భాషలలో అర్కాన్ ఉన్నాయి. అర్కాన్ అనే పదము రుక్న్ (స్తంభము) పదమునకు బహువచనము. అంటే ఇవి బహర్ (బెహర్) అనగా ఛందమునకు లేక వృత్తమునకు స్తంభములవంటివి. ఈ గణములను క్రింది విధముగా వివరిస్తారు. లఘువు లఘ్వక్షరముగా, గురువు గుర్వక్షరముగా ఉండుట ఇందులోని ఒక ప్రత్యేకత. మన గురు-లఘువుల చిహ్నములను కూడ సులభముగా బోధపడుటకై పక్కనే ఇచ్చియున్నాను.

అర్కాన్ (గణములు) –
ఫ-ఊ-లున్ -> – = = IUU
ఫా-ఇ-లున్ -> = – = UIU
మ-ఫా-ఈ-లున్ -> – = = = IUUU
ముస్-తఫ్-ఇ-లున్ -> = = – = UUIU
ఫా-ఇ-లా-తున్ -> = – = = UIUU
ము-త-ఫా-ఇ-లున్ -> – – = – = IIUIU
మ-ఫా-ఇ-ల-తున్ -> – = – – = IUIIU
మఫ్-ఊ-లాత్ -> = = = – UUUI

పైన చెప్పబడిన గణములను అదే విధముగా నుపయోగించగా మనకు సాలిం లేక సంపూర్ణ గణములు లభిస్తాయి. వీటిని మాత్రాగణములుగా ఉపయోగిస్తే అది ముజాహిఫ్ అవుతుంది. ఒకే విధమైన అర్కానులను ఉపయోగిస్తే మనకు ముఫర్రిద్ (ఒంటరి) బహర్ లభిస్తుంది. వాటిని కలిపి వాడితే మనకు మురక్కబ్ (మిశ్రితము) బహర్ లభిస్తుంది.  ఉదాహరణకు ఫ-ఊ-లున్ / ఫ-ఊ-లున్ / ఫ-ఊ-లున్ / ఫ-ఊ-లున్ అనేది ఒక  ముఫర్రిద్ బహర్. ఇది మన భుజంగప్రయాతమును బోలినది.  ఫా-ఇ-లా-తున్ / ఫా-ఇ-లా-తున్ / ఫా-ఇ-లా-తున్ / ఫా-ఇ-లున్ అనే ఛందస్సు మన మత్తకోకిలను బోలినది. ఇది ఒక మురక్కబ్ బహర్.

 

వాహిని  –

ఇప్పుడు మీకు ఒక క్రొత్త వృత్తమును పరిచయము చేస్తున్నాను. దానికి వాహిని అని పేరు పెట్టాను.  ఈ మూడు పద్యములు నిజముగా ఒక గజలు రూపములో వ్రాయబడినది.
వాహిని – జ భ జ భ జ భ జ భ, యతి (1, 13)
24 సంకృతి 14114166

భరించ లేనిట రమించ లేనిట – స్వరాల వాహిని కరమ్ము నిమ్మిట
వరించ నా యెద తరించు నీ యిల – పదాల మోహిని బిరాన రమ్మిట
విరించి వ్రాసిన విచిత్ర రేఖల – విలాసమా యిది యెఱుంగకుంటిని
చరించుచుంటిని బికారిగా నిట – జవమ్ము నీయగ బిరాన రమ్మిట

ఇదా ప్రపంచపు వ్యధార్ద్ర రాగము – ఇదా మనస్సున విరాగ గీతము
ఇదా నిధాఘపు మరీచి కాంతులు – హృదిన్ స్పృశించగ బిరాన రమ్మిట
ముదమ్ముతో చిర వసంత రాగము – పునర్నవమ్ముగ హసించి మ్రోగునొ
మదాలసా సఖి మృదంగ నాదము – మదిన్ ధ్వనించగ బిరాన రమ్మిట

తమస్సె నాకిక జగమ్ముగా నయె – తపించుచుంటిని స్మరించి నే నిను
హిమాలయమ్మయె మదీయ చిత్తము – హితమ్ము నీయగ బిరాన రమ్మిట
సమీర మయ్యెను విషమ్ముగా వని – సదా భ్రమించితి దలంచి నే నిను
ప్రమోద మీయగ ప్రశాంతి నీయగ – ప్రహర్షిణీ చెలి బిరాన రమ్మిట

 

పొలాల నన్నీ హలాల దున్నీ  –

శ్రీశ్రీ వ్రాసిన ప్రతిజ్ఞ అనే ఒక ఖండికలో ఈ వృత్తపు జాడలు ఉన్నాయి.  ఉదాహరణకు ఒక రెండు పంక్తులు –

 

పొలాల నన్నీ హలాల దున్నీ

ఇలాతలంలో హేమం పిండగ

జగానికంతా సౌఖ్యం నిండగ

విరామ మెరుగక పరిశ్రమించే

బలం ధరిత్రికి బలి కావించే

కర్షక వీరుల కాయం నిండా

కాలువ కట్టే ఘర్మజలానికి

ఘర్మ జాలానికి ధర్మ జలానికి

ఘర్మ జాలానికి ఖరీదు లేదోయ్

 

ఇందులో “పొలాల నన్నీ హలాల దున్నీ ఇలాతలంలో” వరకు వాహిని వృత్తపు నడక ఉన్నది. తరువాత ఎదురు నడకకు బదులు మామూలు నడకలో వ్రాసినాడు శ్రీశ్రీ. అదే విధముగా “విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి” పదాలకు ఈ నడక ఉన్నది.

 

ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్  –

వాహినీవృత్తమును ఒక జాతి పద్యముగా చేద్దామా?  జాతి పద్యముగా ప్రతి పాదములో ఎనిమిది గణములు ఉంటాయి. అందులో బేసి గణములు (1,3,5,7) అన్నియు జ-గణములు.  సరి గణములు ఎదురునడక లేని చతుర్మాత్రలు (నల, స, భ, గగ). వీలైనంతవరకు జ-గణమునకు సరిపోయే పదములను ఉంచాలి.  సామాన్యముగా కవులు ముందు గణపు పదములను జ-గణముతో చేర్చి వ్రాస్తారు.  అక్కడక్కడ అలా ఉంటే పర్లేదు, కాని పాటంతా అలా ఉండరాదు.  అప్పుడే ఈ ఛందస్సు ప్రతిబింబము మనకు బాగుగా కనబడుతుంది.  ఇవి ద్విపదలు, ప్రాస ఉండాలి. ఐదవ గణముతో యతి చెల్లుతుంది.  ఇట్టి ఛందస్సును పారసీక-ఉర్దూ భాషలలో ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్  అంటారు.  దీని సూత్రము ఫఊల్ ఫేలున్ ఫఊల్ ఫేలున్ ఫఊల్ ఫేలున్ ఫఊల్ ఫేలున్ (-=- == -=- == -=- == -=- ==).  గజలులలో ఈ ఛందస్సును వాడుతారు.  ఇలా మాత్రాఛందస్సులో నేను వ్రాసిన ఒక గజలును క్రింద చదువ వీలగును –

వినీల సుందర విహారి నీ ధ్వని – వినంగ గోరితి సదా సురావా
మనస్సు నీకై తపించుచున్నది – మనోజవమ్మున బిరాన రావా

చలించె నాకులు నిశీథిలో మది – చలించె నటులే దలంచి నిన్నే
జ్వలించుచున్నది విషాద హృదయము – ఫలించ కోరిక బిరాన రావా

సుమాల మాలల రచించితినిగా – సుశీల హృదయా సుసంధ్యలో నే
నమంద గతితో పదమ్ము పాడుచు – నపార హరుసము నొసంగ రావా

సరస్సులో ప్రతిఫలించె చంద్రుడు – చరాచరమ్ములు సుషుప్తిలో బడె
మఱేల రావో కనంగ వేళయె – మనోజ్ఞ రూపా బిరాన రావా

మనస్సులో మందిరమ్ము గట్టితి – మదీప్సితమ్మను ప్రసూన మిదిగో
అనూహ్యమైనదిగదా ప్రమోద – మ్మరణ్యరోదన వినంగ రావా

విపంచి మీటెద నపూర్వ రాగపు – విరాట్స్వరూపము వెలుంగు నీకై
పిపాస నాయది యనంతమైనది – ప్రియా సుధారస మియంగ రావా

చిత్రగీతములు –

ఈ ఛందస్సులో వ్రాయబడి చిత్రీకరించబడిన పాట ఒకటి నాకు అత్యంత ప్రీతికరమయినది. అది – ఛుపాలో యూఁ దిల్ మేఁ ప్యార్ మేరా కే జైసే మందిర్ మేఁ లౌ దియే కీ.

దీనిని   లతా మంగేష్కర్, హేమంత కుమార్ “మమత” అనే హిందీ చిత్రమునకు రోషన్ సంగీత దర్శకత్వములో పాడారు. ఇక్కడ ఒక విషయమును గుర్తులో నుంచుకోవాలి. హిందీ భాష అక్షరమాలలో హ్రస్వ ఏ-కారము, హ్రస్వ ఓ-కారము లేకుండినను పాటలలో కొన్నిటిని హ్రస్వములుగా (అనగా తెలుగులోని ఎ, ఒ ల వలె) పలికెదరు.  ఇంకొక రెండు పాటలు –

 

తుంహారీ నజరోఁమే హంనే దేఖా (ఆశా భాఁస్లే, కుమార్ సాను) –

 

తుం ఇత్నా జో ముస్కురా రహే హో (జగ్‌జిత్ సింగ్) –


జగ్‌జిత్ సింగ్ పాటలో కొన్ని చోటులలో మొదటి లఘువుకు బదులు గురువు గలదు, ఇట్టివి సామాన్యము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *