April 19, 2024

సంభవం – 3

రచన: సూర్యదేవర రామ్మోహనరావు              suryadevara

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/

 

సరిగ్గా మూడు గంటల తర్వాత…

పార్టీ ఆఫీస్ నుంచి యింటికెళుతున్న ప్రధాని విశ్వంభరరావు మనసు చాలా చికాగ్గా వుంది. అసహనంగా వుంది.

ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న భారతివైపు చూస్తూ “భారతీ! ఈ వాతావరణంలోంచి అర్జంట్‌గా బయటపడాలమ్మా! ఏం చేద్దాం చెప్పు..?” అనడిగారు చిన్నపిల్లాడిలా.

“మీ ఇష్టం అంకుల్” పార్టీ మీటింగ్‌లో రెండు పదవుల విషయమై పాలిట్ బ్యూరో సభ్యులు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించడం, పార్టీ పదవిని వదులుకొమ్మని డిమాండ్ చెయ్యడం, ఆ విషయంలో విశ్వంభరరావు బదులు పలకకపోవడం,  ఆ విషయాల్ని అప్పటికే భారతి తెలుసుకుంది.

మరో అయిదు నిమిషాల తరువాత..

ఇంట్లో కెళ్ళాక,

“చూడు భారతి,  రేపుదయాన్నే మనం శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు టూర్‌కి వెళుతున్నాం” అన్నారాయన సడన్ గా.

అంత సడన్‌గా ఆ టూర్‌కి వెళ్లడానికి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అర్ధం కాలేదు ఆమెకి.

పి.ఏ.ద్వారా ఆ విషయం ఇంటెలిజెన్స్ వర్గాలకు వెళ్లడం, అక్కడ నుంచి వివిధ వర్గాలకు అది చేరిపోవడం, ప్రధాని ఆకస్మిక పర్యటన విషయమై ఊహాగానాలు చెలరేగడం క్షణాల్లో జరిగిపోయింది.

రాజధానిలో ప్రతిక్షణం రాజకీయాలు మారుతున్న తరుణంలో విశ్వంభరరావు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలీక, పొలిటికల్ వర్గాలు కూడా బెంబేలెత్తిపోయాయి.

అక్కడున్న ఒక బాబాగారిని కలవడానికి వెళుతున్నారని కొన్ని పత్రికలు ఊహాగానాలు చేశాయి.

ఆ రోజు సాయంత్రం మంచి మూడ్‌లో ఈ విషయాన్ని అడిగింది భారతి.

దానికి ఆయన జవాబు చెప్పలేదు.

“నాక్కొంచెం మనశ్శాంతి కావాలమ్మా! ఇవాళ పార్టీ మీటింగ్‌లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్టును అర్జున్ చౌహాన్‌కి ఇస్తున్నానని తెలిసి ప్రత్యర్ధి వర్గం అర్జున్‌కి ఈ పోస్ట్ యిస్తే పార్టీని రెండుగా చీల్చేస్తామని హెచ్చరించారు. ఆ హెచ్చరికకు నేను భయపడననుకో…”

“అర్జున్ చౌహాన్‌కి డిప్యూటీ ప్రైంమినిస్టర్‌గా పోస్టు ఇస్తున్నారా?” ఆశ్చర్యపోయింది భారతి.

చిన్నగా నవ్వాడాయన.

“లేదమ్మా! బుజ్జగించడానికి అలా అన్నాను. అంతే.  అర్జున్ చౌహాన్ ఈజ్ ఎ జాకాల్. ఐ నో దట్.  పాలిటిక్స్ అంటే తెరలేని డ్రామాలు” లోపలికెళ్తూ అన్నాడాయన.

సరిగ్గా ప్రధాని విశ్వంభరరావు నోటినుంచి అర్జున్ చౌహాన్ ప్రసక్తి వస్తున్న సమయంలో.

న్యూట్రిషనిస్ట్ భారతి పి.ఎ రమానాయర్ ఏదో విషయం గురించి అక్కడకొచ్చి, రూంలోకి వెళ్లబోయి మనసు మార్చుకుని మళ్లీ వెనక్కి వచ్చేసింది.

ప్రధాని రెసిడెన్స్‌లోనే కుడిపక్క విశాలమైన బంగ్లాలో వుంటోంది భారతి.

భారతి పి.ఎ. రమానాయర్ గబగబా ఆ బంగ్లాలోకొచ్చి తన సీటు వైపు నడిచి అటు ఇటూ ఒకసారి చూసి, టెలిఫోన్ అందుకుని. ఓ నెంబర్ డయల్ చేసి అయిదు నిమిషాలసేపు మాట్లాడింది.

**********************

న్యూడిల్లీ నుంచి హర్యానాకు వెళ్ళే దారిలో మెయిన్‌రోడ్‌కి ఆరు కిలోమీటర్ల దూరంలో..

చుట్టూ పచ్చని తోటల మధ్య వుందా ఫార్మ్ హౌస్.

ఒకప్పుడు ముస్లీం చక్రవర్తులకి చెందిన ఆ భవనానికి ప్రస్తుత అధికారి వీరేంద్ర అజనీష్. యాభై ఏళ్ల అజనీష్ గత ప్రధానమంత్రి కుటుంబానికి చాలా సన్నిహితమైన వ్యక్తి. అపారమైన దైవశక్తి సంపన్నుడుగా గుర్తింపు పొందిన అజనీష్‌కి ప్రపంచ వ్యాప్తంగ అతి ఖరీదైన శిష్యులున్నారు.

భారతీయ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి, హిందుత్వాన్ని నిలబెట్టడం కోసమే  తను జన్మించానని చెప్పుకునే అజనీష్‌కు కోట్ల అస్తులున్నాయి.

ఎక్కడకు వెళ్లినా స్వంత విమానంలోనే వెళ్ళే అజనీష్‌కు, కాశ్మీర్ సరిహద్దులో విలాసవంతమైన ఒక ఆశ్రమం వుంది.

ఆ ఆశ్రమంలో అధికారికంగా ఆయన దేశ విదేశీ శిష్యులకు యోగసాధనను, ముక్తిభోదనను నేర్పుతాడు. కానీ ఆ ఆశ్రమం ద్వారా ఆజనీష్ అక్రమంగా ఆయుధ వ్యాపారం చేస్తుంటాడని ఇంటెలిజెన్స్ వర్గాలు ఒకసారి ఆలోచించి, ఆ ఆశ్రమం మీదకు దాడి చేశారు.

ఆ దాడి చేసిన అధికారులు నెలరోజుల్లోపలే తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రస్తుతం ఆ అధికారులు ఆ ఆశ్రమంలోనే సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లో పని చేస్తున్నారు.

బడా పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్, రాజకీయ వర్గాలకు గురువు, దైవం, మార్గదర్శి అయిన వీరేంద్ర అజనీష్ దేశంలో రాజకీయాల్ని పరోక్షంగా నడిపే ప్రధానమైన వ్యక్తి.

అలాగే భారతదేశంలోని భక్తిని, ఆధ్యాత్మికతను పెంచడానికి ఉద్యుక్తులైన కొంతమంది మఠాధిపతులకు, పీఠాధిపతులకు ప్రధాన సలహాదారుడు.

ఆ విశాలమైన భవనం ముందు ఓ మారుతీ కారు ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు ఒకరివైపు ఒకరు చూసుకుని, ముందుకు నడిచారు.

ఆ ఇద్దరు ప్రతాప్‌సింగ్, అర్జున్‌చౌహాన్.

మెటల్ డిటెక్టర్లు దాటుకుని వస్తున్న వాళ్లిద్దరివైపు నడిచాడు అజనీష్ సెక్యూరిటీ ఆఫిసర్.

“అజనీష్ సాబ్ ఇంపార్టెంట్ డిస్కషన్‌లో వున్నారు. పది నిమిషాలు మీరు వెయిట్ చేయాల్సి వుంటుంది” అని చెప్పి వాళ్లని విజిటర్ రూంలోకి సాదరంగా తీసికెళ్లాడు.

అదే సమయంలో అజనీష్..

పర్సనల్ రూంలో పట్టు పీతాంబరాల్లో, విశాలమైన ఆసనమ్మీద కూర్చున్నారు.

ఆయనకు కొంచెం దూరంలో..

ఒక మఠాధిపతి కూర్చున్నారు.

“ఈ దేశంలో హిందుత్వానికి రానురాను భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితుల్ని మనం ఎదుర్కోకపోతే, మన వునికికి ప్రమాదం ఏర్పడుతుంది. మన చేటుల్లోంచి ప్రజలు జారిపోతే, మన మనుగడ దుర్భరమైపోతుంది.” చివరిసారిగా తన ఆందోళనను వ్యక్తం చేశాడాయన.

“వేదాచార్య! భయపడకండి. నేనున్నాను. అనాదిగా ఈ దేశ రాజకీయవేత్తలు కాదు పరిపాలిస్తున్నది మనం. మనం తల్చుకుంటే రాజకీయ నాయకులు ముక్కలైపోతారు. ఈ దేశంలో భక్తితత్వం, మూఢవిశ్వాసాలు తగ్గకుండా, మరిన్ని మూఢవిశ్వాసాల్ని పెంచే పూచీ నాది.  మీరు నాకు అప్పగించిన ప్రతి పనీ విజయవంతమవుతుంది. నా మాట నమ్మండి” గంభీరమైన స్వరంతో హామీ యిచ్చాడు అజనీష్.

దేశంలోని ఆధ్యాత్మిక వాదానికి బలమైన వర్గంగా నిలిచిన వేదాచార్యులు  లేచి నిలబడ్డాడు.

“చూడండి  వేదాచార్య. మీ మఠాల నుంచి రావల్సిన నా వాటా ఇంకా నాకు అందలేదు.” జ్ఞాపకం చేసాడాయన.

“ఈ నెలాఖరులోపుగా పంపుతాను” అన్నాడా మఠాధిపతి వినయంగా వేదాచార్యను దగ్గరుండి సాగనంపి.

అర్జున్‌చౌహాన్, ప్రతాప్‌సింగ్‌లు వున్న విజిటింగ్ రూంలోకి అడుగుపెట్టాడు అజనీష్.

అజనీష్‌ని చూడగానే వాళ్లిద్దరు లేచి నిలబడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా అర్జున్‌చౌహాన్ ఆయన కాళ్లమీద పడ్డాడు.

 

*******

 

నాంపల్లి  రైల్వేస్టేషన్.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి యింకా పదిహేను నిమిషాల టైముంది.

తనకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన గిరీష్ వైపు, వసంత వైపు చిరునవ్వుతో చూసింది దిశ.

“గిరీష్! నీ ప్రపోజల్‌ని వసంత యింత అర్జంటుగా వొప్పుకుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఎనీహౌ.. నేనో మంచి  పని చేసి వెళుతున్నందుకు ఆనందంగా వుంది” అంది దిశ.

“మళ్లీ నువ్వెప్పుడొస్తావ్  హైదరాబాద్?” అడిగింది వసంత.

“చెప్పలేను.”

“అంటే మా పెళ్ళికి రారా?” గిరీష్ అన్నాడు..

“మీ పెళ్లికా? మీరు పిలిస్తే తప్పకుండా వస్తాను” చెప్పింది దిశ.

“అవును గిరీష్! నీది నెల్లూరే కదా. నెల్లూరొచ్చినప్పుడు తిరుపతి రాగూడదూ..”

“ముందు నువ్వు మా పెళ్ళికి రా. తరువాత తిరుపతి వస్తాం” వసంత అంది.

స్టేషన్లో హడావుడి మొదలైంది.

మరో రెండు నిమిషాల తర్వాత ట్రైన్ నెమ్మదిగా కదిలింది. తన మనసులోని కోరికకు ఆకృతి కల్పించిన దిశ వైపు కృతజ్ఞతతో చూస్తూ వీడ్కోలిచ్చాడు గిరీష్.

ఆ తర్వాత గిరీష్, వసంత నెమ్మదిగా స్టేషన్లోంచి బయటికొచ్చారు.

గిరీష్‌ని తను అదే ఆఖరుసారి చూడడమని పాపం దిశకు తెలీదు.

 

*****************

 

రంగస్థలం, హర్యానా రోడ్డులోని ఫారం హౌస్…

“రెండు విభిన్న ధృవాలు కలిశాయంటే..  ప్రళయమో, అద్భుతమో ఏదో ఒకటీ జరగక తప్పదు. నేనారోజే చెప్పాను. మీ ఇద్దరూ కలిసి నా దగ్గరకొచ్చే రోజొకటీ వస్తుందని..” అన్నాడు అజనీష్ గర్వంగా తలెగరేస్తూ..

“రాక తప్పదుగా..” అర్జున్ చౌహాన్ అన్నాడు మెల్లగా.

“అంటే?”

“కడుపు చేత్తో పట్టుకుని పాలిటిక్స్‌లోకొచ్చాం. ముప్పై ఏళ్ళ నా రాజకీయ జీవితం నాకేమిచ్చింది గురూజీ? చెప్పండి.. మీకు చేతకాకపోతే ఏ పాకిస్తాన్ గాణ్నో నమ్ముకుంటాను..”కోపంగా అన్నాడు ప్రతాప్ సింగ్.

“అవును అజనీష్ సాబ్! ఆ ముసిలోడు, విశ్వంభరరావుతో మేం విసిగిపోయాం. గడ్డివాము దగ్గర కుక్కలా కాపలా కాసే ఆ విశ్వంభరరావు చేస్తున్న పాలన గురించి మీకు వేరే చెప్పక్కర్లేదు. అతను తినడు. మమ్ములను తిననివ్వడు. ఎంతసేపూ నా దేశం.. నా ప్రజలు.. వారి బాగోగులు అంటాడు. రైతే దేసానికి వెన్నెముక అంటాడు. నిధులన్నింటినీ వ్యవసాయానికి, గ్రామసీమలకి, ఇరిగేషన్‌కి కేటాయించేస్తున్నాడు. మన విలాసానికి, మన ఎలక్షన్ ఖర్చుకి  నిధులిచ్చే పారిశ్రామికవేత్తలు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు. పైసా అంటే పైసా తిననివ్వడం లేదు. ఇలా అయితే ఎలా? ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి?

“పదవి నుండి దించెయ్యాలి” టక్కున జవాబిచ్చాడు అజనీష్.

“అదే.. ఎలాగని..? ఎప్పటికప్పుడు మా ప్రయత్నాలు మేము చేస్తూనే వున్నాం. అదృష్టం అతన్ని కాపాడుతోంది. ప్రతిపక్ష పార్టీల అంతర్గత మద్దతుతో ప్రధానిగా నిలుస్తున్నాడు తప్ప పార్టీలో వున్న శక్తివల్ల కాదు. దానికితోడు అతను చేసే పిచ్చి పిచ్చి నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్..ఓపన్ మార్కెట్ సిస్టమే. బ్యూరోక్రాట్స్ తోకల్ని కత్తిరించటం, లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం, పబ్లిక్ రంగాన్ని ప్రయివేట్ పరం చేయడం. ఇలా చేస్తూ పోతే ప్రజలే రాజులవుతారు తప్ప – పొలిటిషియన్స్ చేతుల్లో ఏమీ వుండదు. అన్ని మంచి పనులు చేస్తే యీ ప్రజలు మా మాట వినరు. అందుకే..”

“ఇప్పుడా సిస్టంస్ గురించి చర్చ ఎందుకు మైడియర్ ఫ్రెండ్? పార్టీలో అసమ్మతి ద్వారా అతన్ని మీరు పడగొట్టలేరు. అంతేనా?”

“అవునండి బాబూ..! ఉత్తరాది మన చేతిలో వున్నా, దక్షిణాది ఆయన గుప్పిట్లో వుంది. వచ్చె టర్మ్ కూడా అతనే  ప్రధాని అని కొన్ని వర్గాల కథనం. అందుకే..”

“ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి.” నునుపైన గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు అజనీష్.

“నిన్నటి రాజకీయాలు  సావదానభేదాల వల్ల నడిచేవి. నేటి రాజకీయాలు దండభేదం వల్ల నడుస్తున్నాయి. సో.. ఈ రాజకీయాలకు ఒక మంచి వ్యక్తినే సరదాగా బలిస్తే బావుంటుంది కదా.” ప్రతాప్‌సింగ్ అన్నాడు.

“బావుంటుంది” వంత పలికాడు అర్జున్ చౌహాన్.

రెండు నిమిషాలసేపు గంభీరంగా ఆలోచించాడు అజనీష్.

“గుడ్.. వేరీగుడ్! ఈ ప్రపోజల్ వల్ల, ఈ దేశంలో కొంచెం శాతం వున్న మంచి రాజకీయాలు కనుమరుగైపోతాయి. అయితే నాకేంటి లాభం?”

అజనీష్ హఠాత్తుగా వేసిన ప్రశ్నకు ముఖాముఖాలు చూసుకున్నారు ప్రతాప్‌సింగ్, అర్జున్‌లు.

“మేం అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని మీ పాదాక్రాంతం చేస్తాం.” అన్నాడు అర్జున్.

“ఈ డేశం ఫుట్‌బాల్ కాదు మై ఫ్రెండ్..” అన్నాడు అజనీష్ నవ్వుతూ..

“అధికారం, అండదండలు, సంపద, కోరుకున్న సుఖాలూ, మీ పాదాక్రాంతం అయ్యేలా చేస్తాం”

“వెరీగుడ్! మీరు చెప్పిన పాయింట్లు నాకు నచ్చాయి. కానీ యీ టెంపరరీ సెటప్పుల వల్ల నేను సంతోషించలేను.”

“మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి…” ఇద్దరూ ఒకేసారి అడిగారు.

“ఈ దేశం దేని మీద నడుస్తోంది?” ప్రశ్నించాడు అజనీష్.

వాళ్లిద్ద్దరూ వెంటనే జవాబు చెప్పలేకపోయారు.

“అజ్ఞానం మీద.. ఈ దేశంలో ప్రజలకి అజ్ఞానమే లేకపోతే .. మాలాంటివాళ్లు నాయకులుగా మనగలిగే వాళ్లు కారు. ఆ అజ్ఞానానకి కారణం ఏమిటి? మూఢనమ్మకాలు, భక్తితత్వం, ఆధ్యాత్మిక  చింతన, మతం, మతం నిషా, ఈ దేసంలో వుండబట్టే ఎన్నెన్నో మతాల వ్యాప్తికి మన దేశాన్ని ఎంచుకున్నారు. అంచేత రాన్రాను మత ప్రాబల్యం తగ్గిపోతే యీ దేశం ఏమవుతుంది?”

“మనుషులు శాస్త్రవిజ్ఞానం వైపు, ఆధునిక పద్ధతులవైపు మొగ్గు చూపుతారు” చెప్పాడు అర్జున్.

“యూ ఆర్ కరెక్ట్! అంచేత.. మూఢవిశ్వాసాల నీడలో ప్రజలు మరింతగా బ్రతకగలిగేటట్టు చెయ్యాలి. మతం అనే నిషా వ్యాప్తికి మనం పరోక్షంగా కృషి చేయాలి. ఒక చిన్న గ్రామంలో ఒక స్కూలుంటే, పది దేవాలయాలు వుండేటట్లు చూసుకోగలగాలి. అలాగే విదేశాల్లో జరిగే ఆధునిక పరిశోధనల్లాంటి పరిశోధనలు యీ దేశంలో జరగకూడదు. ఇప్పటికే వర్క్ చేస్తున్న విజ్ఞాన శాస్త్ర పరిశోధనలన్నింటికీ మంగళం పాడెయ్యాలి. ఆ సంస్థల్ని మూత వేసెయ్యాలి. ఇటీవల కాలంలో ఇంకో ప్రమాదకరమైన ధోరణి మన ఇండియాలో ప్రారంభమైందని నాకు తెలిసింది..”

“ఏమిటి గురూజీ అది?”

“క్రయోనిక్స్ మూవ్‌మెంట్..”

“అంటే?” ఇద్దరూ అర్ధం కానట్లుగా పెట్టారు ముఖాలు.

“చచ్చిపోయిన మనుషుల్ని బ్రతికించాలని చేసే ప్రయోగాలు..” ఇద్దరి కళ్లలోకి చూస్తూ చెప్పాడు అజనీష్.

“చచ్చిన మనుషుల్ని బ్రతికించడమా? ఎవరో పిచ్చివాళ్ల గోల అయుంటుంది గురూజీ!”

“కాదు ఫ్రెండ్! అంత తేలికగా కొట్టి పారేసే ఉద్యమం కాదు. అమెరికాలోనూ, బ్రిటన్‌లోనూ రహస్యంగా మహా శాస్త్రజ్ఞులు శవాన్ని బ్రతికించడానికి చేస్తున్న ఉద్యమం అది. అక్కడి సంస్థలు ఇండియాలో పనిచేసే సంస్థలకు ఫండ్స్ అందిస్తున్నాయి. ఆ ఫండ్స్‌తో యిక్కడి యువ శాస్త్రవేత్తలు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారని   నాకు ఖచ్చితమైన రహస్య సమాచారం అందింది”

“దానివల్ల మనకేమిటి నష్టం?” ప్రశ్నించాడు అర్జున్.

“శవాలు బ్రతకడం వల్ల భూభాగం జనాభాతో నిండిపోతుందని నేను చెప్పడం లేదు అర్జున్! విదేశాల్లో అలాంటి ప్రయోగాల వల్ల పెద్ద యిబ్బంది వుండదు. ఇక్కడే.. శవాల్ని బ్రతికించే ఉద్యమం వల్ల ప్రజలు దానికి ఎట్రాక్ట్ అవుతారు. ప్రజల్లో ఒక కొత్త ఆలోచన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా పాపభీతి నశించిపోతుంది. మనిషి పుట్టుకకు, చావుకి దేవుడు కారణంగా ఒక నమ్మకం సడలిపోతుంది. ప్రజలు సైన్స్‌నే విశ్వసిస్తారు. అప్పుడు మతం, దేవుడు, మూఢవిశ్వాసాలు  వీటినన్నింటిని ప్రజలు నమ్మరు” చెప్పుకుపోతున్నాడు అజనీష్.

“ఇంతకీ ఆ ఎక్స్‌పరిమెంట్స్ సక్సెస్ అయితేనే కదా?” అన్నాడు ప్రతాప్ సింగ్.

“నేలమీద విత్తనం పడకూడదు. మెదడులో మృత్యువుని జయించాలని ఆలొచన రాకూడదు. ఈ దేశంలోని ప్రజలు పదికాలాలపాటు మన గుప్పిట్లో వుండాలంటే, ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వుండాలి. అందువల్ల ఆ క్రయోనిక్స్ ఉద్యమాన్ని నాశనం చేయించండి. అందులో పని చేస్తున్న శాస్త్రజ్ఞుల్ని  రహస్యంగా పట్టుకుని మాయం చేసెయ్యండి” చెప్పాడు అజనీష్.

“ఇంతే కదా.. అది చిటికెలో పని” హుషారుగా అన్నాడు అర్జున్ చౌహాన్.

” ఆ పరిశోధనల విషయం ప్రజల్లోకి రాకముందే, పత్రికలకు ఎక్కకముందే మనం ఆ స్థావరాన్ని పట్టుకోవాలి. దాన్ని సర్వనాశనం చేయాలి. ఇమ్మీడియేట్‌గా జరగాల్సిన పని అది..” కసిగా, కోపంగా అన్నాడు అజనీష్.

“మీరు చెప్పినట్టుగా చేసే బాధ్యత  నాది.. నా దగ్గర చాకులాంటి కుర్రాళ్లున్నారు.. నరహంతకులున్నారు.. గూండాలున్నారు.. చివరికి మాఫియా ముఠా కూడా నా మాట వింటుంది. వాళ్లలో ఒకర్ని ఆ పనికి వినియోగిస్తాను”

“ఆ డిటైల్స్ ఎప్పటికప్పుడు నాకు కావాలి” అన్నాడు అజనీష్.

అందుకు వొప్పుకున్నాడు ప్రతాప్ సింగ్.

“నేను చెప్పిన ప్రాబ్లం చాలా ప్రధానమైన ప్రాబ్లం! నేనెందుకు చెబుతున్నానో మీకీవేళ తెలీదు. దానికోసం ఎంత డబ్బయినా ఖర్చు చెయ్యి. నీకు కావలసిన యితర సహాయం ఏదైన్నా చేస్తాను. సరేనా? కమింగ్ టు కరంట్ పాయింట్! మీ ప్రధాని మారుమూల జిల్లాల్లో మారు మూల గ్రామానికి వెళుతున్నాడు గదూ?”

ప్రధాని విశ్వంభరరావు మారుమూల పల్లెకు వెళుతున్నాడనే విషయము వాళ్లకు అంతవరకూ తెలీదు. అలాగే ఇంటలిజెన్స్ వర్గాలకు కూడా తెలీదు. అలాంటీ విషయం అజనీష్‌కి ఎలా తెల్సిందో అర్ధం కాలేదు వాళ్లిద్దరికీ.

“ఆ పర్యటనకు, పార్టీ మీటింగ్ జరగడానికి మధ్య రెండు రోజుల గడువు వుంటుంది కదూ?”

“ఎస్ గురూజీ!” ఇద్దరూ సంతోషంగా చెప్పారు.

“ఓ.కే! ఆ విషయం నాకు వదిలేయండి” అభయమిచ్చాడు అజనీష్.

“మీ హామీ వింటేనే నా వళ్లు పులకరించిపోతోంది” గలగలా నవ్వుతూ అన్నాడు అర్జున్‌సింగ్.

“ఎప్పుడు జరుగుతుంది ఆ సంఘటన? మర్డరా? యాక్సిడెంటా?”

“అంతా బ్రహ్మరహస్యం. మీ ప్రయత్నాల్లో మీరుండండి” లేచి నిలబడ్డాడు అజనీష్.

ఇద్దరూ ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆ రూంలోంచి బయటకొచ్చారు.

బయటికి వెళ్లిపోతున్న వాళ్లిద్దరి వైపు చూసి మనసారా నవ్వుకున్నాడు మహా రాజకీయ మాంత్రికుడు. తాంత్రిక బ్రహ్మ వీరేంద్ర అజనీష్.

 

************************

 

తిరుపతి..

హోటల్ భీమాస్.. స్పెషల్ సూట్లో అసహనంగా తిరుగుతోంది

అప్పటికే ఆమె తిరుపతికి వచ్చి మూడుగంటలైంది. తన దగ్గరికి వచ్చి కలిసే వ్యక్తి కోసం అత్రుతగా ఎదురుచూస్తోంది.

టెన్షన్.. టెన్షన్‌గా ఉందామెకు.

సరిగ్గా ఆ సమయంలో ఫోను మోగింది. వెంటనే రిసీవర్ అందుకుందామె.

“దిశా హియర్!”

“మిస్ దిశా! మీరు మీ హోటల్ రూంలోంచి అయిదు నిమిషాల్లో కిందకు రండి. ఎ.ఎ.పి 1166 అంబసిడర్ కారు మీకు కనిపిస్తుంది. మౌనముగా ఆ కారెక్కి కూర్చోండి. ఆ డ్రైవర్‌కి మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసు. మీరు ఆ డ్రైవర్‌తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సీ యూ”

ఫోన్ కట్ అయ్యింది.

గంభీరమైన మగ గొంతుక.. ఎవరై వుంటారో ఆలోచిస్తూ గబగబా హేండ్‌బ్యాగ్‌ని అందుకుని రూంకి తాళం వేసి కిందకు దిగింది.

పొర్టికోలో ఆమెకు ఆహ్వానం పలుకుతూ అంబాసిడర్ కారు…

మూడు గంటల తర్వాత మదనపల్లి అడవుల్లోకి వెళ్ళే డొంక దారెంట వెళ్లిన కారు ఒక గ్రామంలో అగింది.

“ఇదే నెరబైలు. మీరిక్కడే దిగాలి” చెప్పాడు డ్రయివరు. అంతసెపు అతనితో అస్సలేమీ మాట్లాడలేదు దిశ.

ఒక టీ బడ్డీ, ఆ పక్కన పాన్ షాపు, మట్టిరోడ్డు పక్కన చిన్న బస్సు షెల్టర్. అక్కడ ఇద్దరు గ్రామీణ మహిళలతో పాటు ఒక వృద్ధుడు కూర్చున్నాడు.

” ఆ బస్సు షెల్టరులో మీరు నుంచోండి” చెప్పి వెళ్లిపోయాడు ఆ డ్రయివరు.

చాలా గమ్మత్తుగా వుంది దిశకు

అయిదు నిమిషాలు గడిచాయి.

తనని రిసీవ్ చేసుకోవడానికి ఎవరొస్తారోనని ఎక్సయిటింగ్‌గా ఎదురు చూస్తోందామె.

మరొ పది నిమిషాలు గడిచాయి.

పక్కనే అంతవరకూ కూర్చున్న వృద్ధుడు సడన్‌గా లేచి నిలబడ్డాడు. దిశ సమీపంలోకొచ్చి

“దిశ .. నువ్వేనా?” అడిగాడు ఆ వృద్ధుడు.

“అవును..” అంది దిశ ఆశ్చర్యంగా ఆ వృద్ధుడికేసి చూస్తూ.

“నాతోరా..” భుజమ్మీద కండువాను మెల్లగా సవరించుకుంటూ ముందుకు అడుగేశాడతను.

అతన్ని అనుసరించింది దిశ. ఆమెకంతా అయోమయంగా వుంది.

ఇరవై నిమిషాలు గడిచాయి.

గ్రామానికి చివర ఒక పాడుబడ్డ బావి వుంది. ఆ పక్కన వూడలు విరబూసిన మర్రిచెట్టు. ఆ మర్రిచెట్టు కింద ఒక నీలపు రంగు జీప్ వుంది.

అక్కడవరకు వెళ్లాక ఆ వృద్ధుడు తన చెతిలోనున్న ఓ గుడ్డని తీసి ఆమెకిచ్చి.

“కళ్లకు కట్టుకుని జీపెక్కి కూర్చో” అన్నాడు గంభీరంగా..

ఆ వృద్ధుడు చెప్పినట్టే చేసింది దిశ. రెండు నిమిషాల తర్వాత దూరం నుంచి వచ్చాడు సవ్యసాచి.

సవ్యసాచి ఇచ్చిన వంద రూపాయల నోటుని తీసుకుని ఆ వృద్ధుడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

జీపులో కూర్చున్న దిశవైపు ఒకసారి చూసి స్టీరింగు ముందు కూర్చున్నాడు సవ్యసాచి.

జీపు ముందుకు కదిలింది.

రాన్రానూ జీపు వేగం పెరగడం దిశ గమనిస్తూనే వుంది

 

****************************

 

టేబుల్ మీదున్న ఆస్ట్రేలియన్ క్యాట్ డాలీ శవం వైపు కన్నార్పకుండా చూస్తోంది డా.విజేత.

కుందేలు పిల్ల విషయంలో జరిగిన విషయం ఆమెకు పదే పదే గుర్తుకొస్తోంది.

ఆ ఓటమిని ఆమె భరించలేకపోయింది.

అందుకే సర్వశక్తులూ కేంద్రీకరించి డాలీకి ఆపరేషన్ చేసింది.

ముఖ్యంగా విజేత కనిపెట్టిన ట్రాన్స్ గ్లిసరల్స్ వల్ల కణాలను చల్లబరిచిన సమయంలో వాటిల్లోని నీరు ఆవిరిగా మారడానికి అవి తోడ్పడతాయి.

అసలు శరీరంలోని ముఖ్యమైన భాగాలు కణాలే. ప్రతి ప్రాణి ప్రధానమైన కదలికకు, జ్ఞాపకశక్తికి కారణం కణాలే.

కణాల్లో ఫ్రీజర్ బర్న్ కాకుండా చూస్తేనే తన ప్రయోగం సక్సెస్ అవుతుందని భావించిన విజేత అందుకోసం కృషి చేస్తోంది.

ఫ్రీజర్ బర్న్ అంటే నీరు వ్యాకోచించడం వల్ల కణాలు బద్ధలు కావడం. అవి ఐస్ ముక్కల్లా తయారై మెంబ్రీన్స్‌ని కోసేస్తాయి. నీరు నిండిన  బెలూన్ టప్‌మని పగిలిపోయే ప్రక్రియలాంటి ప్రక్రియ ఇది.

ఆ ప్రయోగం కుందెలు పిల్ల విషయంలో చెయ్యలేదు. కుందేలు క్ అణలౌ ఆ ప్రక్రియకు తట్టుకోలేకపోవడం.. ఆస్ట్రేలైయన్ క్యాట్ కణాలు ఎక్స్‌పరిమెంటుకు తట్టుకుని నిలవడం సంతొషంగా ఉందామెకు.

ఆర్టిఫిషియల్ రెస్పిరేటర్ వాల్వ్స్‌ని తీసెసి డాలీ ముక్కు దగ్గర ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టి పంపి చేస్తూ మానిటర్లో వేవ్స్ వైపు చూస్తోంది విజెత.

ఆమె గుండె గడియారంలా కొట్టుకుంటోంది.

ఆ ప్రయోగం సక్సెస్ ఆవుతుందని ఆమెకు బాగా నమ్మకం వుంది.

అందుకు కారణం గత నాలుగురోజులుగా రాత్రీ, పగలూ ఎన్నో బుక్స్ రిఫర్ చేసింది.

ప్లాస్టిక్ బ్యాగ్‌లోంచి సన్నగా వీస్తున్న గాలి శబ్దం వింతగా వినిపిస్తోంది.

డాలీ బ్రతకాలి..

డాలీ బ్రతికినా రండు మూడు గంటలకంటే ఎక్కువసేపు బ్రతకదని ఆమెకి తెల్సు.

మృత్యువును జయించే మొదటి అధ్యాయంలో ఒక చనిపోయిన జీవికి వూపిరి పోయడమే ప్రధమ విజయం.

డా.విజేత నరాల్లో రక్తం పరుగులు తీస్తోంది ఉద్వేగంతో.

సరిగ్గా అదే సమయంలో హ్హ్హ్హ్హ్హ్

మూడు రూంల తర్వాత వున్న ఏసీ రూంలో తన సీట్లో కూర్చున్నాడు డా. సవ్యసాచి.

దిశకు అంతా వింతగా వుంది.. ఆశ్చర్యంగానూ, అద్భుతంగానూ వుంది.

“మృత్యువు మీద మీ అభిప్రాయం ఏమిటి?” అడిగాడు సవ్యసాచి.

“మానవజాతికి శత్రువు” చెప్పింది దిశ వెంటనే.

“అంటే”

“బలవంతుడు శత్రువును ఎదుర్కోగలడు. అలాగే విజ్ఞానశాస్త్రం ఆ మృత్యుశత్రువుని సవాల్ చేయగలదని నా నమ్మకం.

“మీకు పునర్జన్మ మీద నమ్మకం వుందా?”

“ఉంది”

“ఎలాంటి నమ్మకం?”

“హిందూ ఫిలాసఫీని నేను విశ్వసిస్తాను. ఏడు జన్మల థీరీని నేను నమ్ముతాను. చనిపోయిన మనిషి మరో జన్మ ఎత్తుతాడని నా నమ్మకం. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనిషిగా జన్మించామని నా నమ్మకం.”

“ఫిలాసఫీకి, సైన్స్‌కి సంబంధం లేదు కదా.. ఒకటి నమ్మకం, రెండోది ప్రయోగం.. కాదంటారా?”

“ఫిలాసఫీ కూడా ఒక సైన్సే! సైన్సుకి ఆధారం కల్పించే ఊహ. కాదంటారా? మన ప్రాచీన పురాణాల్లోని వ్యక్తులు, విమానాల్లో తిరిగేవారని మనం చదువుకున్నాం. సైన్స్ ఆ నమ్మకాన్ని ప్రయోగం ద్వారా నిజం చేసింది కదా.. అందువల్ల మృత్యువుని మనిషి జయించే రోజొస్తుందని నేను నమ్ముతాను” దిశ తన పాయింట్‌ని కరెక్టుగా, సూటిగా చెప్పడం నచ్చింది సవ్యసాచికి.

మృతసంజీవని సంస్థను నడుపుతున్న సవ్యసాచి పేరును సత్యబ్రహ్మ ద్వారా వినగానే బట్టతల, తెల్లటి శరీరం, వృద్ధాప్యం వీటితో ఒక ఆకారాన్ని ఊహించుకున్న దిశ ఎంతొ స్మార్ట్‌గా కనిపిస్తున్న సవ్యసాచిని చూసి ఆశ్చర్యపోయింది.

“వెల్.. మీకు తెలుసుగా.. మా సంస్థ బ్లడ్ బ్యాంక్‌లా, ఐ బ్యాంక్‌లా, డెడ్ బాడీస్ బ్యాంక్.  ఇక్కడ సంస్థలో పనిచేసేవాళ్లు అటు ప్రభుత్వానికి, ఇటు దొంగబాబాలకు, మత ఛాందసవాదులకు దొరక్కుండా చాలా జాగ్రత్తగా పరిశోధనలు జరపాల్సి వుంటుంది. అలాగే చాలా సిన్సియర్‌గా పనిచేయాల్సి వుంటుంది. ఒక్కోప్పుడు మనకు శవాలు దొరక్కపోతే మనమే శవాలుగా మారి ప్రయోగాలకు ఉపయోగపడే డెడికేషన్ ఇక్కడ కావాలి. ఇందుకు మీరు వొప్పుకుంటారా? సీరియస్‌గా అడిగాడు సవ్యసాచి.

“నేను శవంగా మారడానికి రెడీ.  పొటాయిషయం సైనైడ్‌ని కనిపెట్టిన వ్యక్తి దాన్ని రుచి చూసి చనిపోయాక గాని దాని విషయం ప్రపంచానికి తెలియలేదు. ఐ హేవ్ నో ఫియర్ సార్. మీరేం చెప్పినా నేను చెయ్యడానికి రెడీ” చెప్పింది దిశ.

దిశలోని తెలివితేటలు, మాటకారితనం సవ్యసాచికి నచ్చాయి.

“ప్రస్తుతం ఇక్కడ మన పరిశోధనలు జంతువుల మీద జరుగుతున్నాయి. ఆ పరిశోధనల్ని మానవ శవాలవైపు అతిత్వరలో మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన ఆర్గనైజేషన్‌కు శవాలు కావాలి. ఆ శవాలను మీరు పట్టుకోవాలి. మన మూవ్‌మెంట్ గురించి రహస్య ప్రచారం  చేసి కొంతమందిని మన ఉద్యమం వైపు ఆకర్షింప చెయ్యాలి. మా ఆఫీసు తిరుపతిలో వుంటుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మీకు అందే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు పనిచెయాల్సి వుంటుంది. ఒక సిద్ధాంతం కోసం మీరు పనిచెస్తున్నాననే విషయం మీరెప్పుడూ మరచిపోకండి. ఈ సంబంధంగా  జరిగే ప్రయోగాల్ని గాని, వే ఆఫ్ ఆపరేషన్స్ గురించి గాని ఇక్కడ టోపోగ్రఫీ గురించి గాని, మీరేమాత్రం లీక్ చెసినా మిమ్మల్ని రికమెండ్ చేసిన సత్యబ్రహ్మగార్ని కూడా లెక్క చేయకుండా మిమ్మల్నే క్రయోనిక్‌గా మార్చిపడేయటం జరుగుతుంది” సూటిగా చూస్తూ చెప్పాడు సవ్యసాచి. అప్పుడతని కంఠంలో సీరియస్‌నెస్ స్పష్టంగా తొంగి చూసింది.

ప్రస్తుతం జంతువుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి అనే మాట సవ్యసాచి నోటి వెంబడి వినగానే దిశకి  వార్డెన్ ఆస్ట్రేలియన్ పిల్లి డాలీ గుర్తొచ్చింది.

“మన ఉద్యమం మీద నాకు నమ్మకముందు సార్! ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిరాశకు గురి కాను. పెన్సిలిన్‌ని కనిపెట్టిన ఫ్లెమింగ్‌ని లోకం అవహేళన చేసిన విషయం నాకు తెలుసు. భూమి బల్లపరుపుగా లేదని , గుండ్రంగా వుందని చెప్పిన గెలీలియోని పిచ్చివాడని తిట్టిన లోకంలో మనం బ్రతుకుతున్నామని నాకు తెలుసు సార్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. అలాగే  మీ నియమనిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తానని ప్రామిస్ చేస్తున్నాను” స్థిరంగా, కాంఫిడెంట్‌గా  అంది దిశ.

దిశలోని ఉత్సాహం పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు సవ్యసాచి.

దిశకు డాలీ పదేపదే గుర్తుకువస్తోంది. ఆ విషయం సవ్యసాచిని అడగాలని  ఉద్యుక్తురాలౌతున్న సమయంలో..

డోరు తీసుకుని పరు పరుగున వచ్చింది డాక్టర్ విజేత.

“మిస్టర్ సవ్యసాచీ! సక్సెస్.. అవర్ ఎక్స్‌పరిమెంటీజ్ సక్సెస్..”

చిన్నపిల్లలా వగరుస్తూ చెప్పింది విజేత.

గబుక్కున కుర్చీలోంచి లేచి, ఆ రూంలోంచి లేబరేటరీ క్యూబక్స్ వైపు పరుగులు తీశాడు సవ్యసాచి.

ఆపరేషన్ రూంలోకి వెళ్లాడు. అతని వెనక విజేత, మిగతా డాక్టర్లు, ఆ వెనక దిశ.

అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద చిన్నగా కదులుతూ, మెల్లగా మూలుగుతూ ఆస్ట్రేలియన్ పిల్లి  డాలీ..

డాలీని చూడగానే దిశ నిర్ఘాంతపోయింది.

పిల్లిని చూడగానే ‘సక్సెస్’ అని పెద్దగా వుత్సాహంతో అరిచాడు సవ్యసాచి.

“చనిపోయిన పిల్లిని బ్రతికించడంతో మృత్యువు మీద మన యుద్ధం ప్రారంభమైంది” ఆనందంగా అన్నాడు సవ్యసాచి.

పిల్లి చనిపోయి బ్రతికిందా? నిజమా?

ఆ నిజాన్ని నమ్మడానికి దిశకు చాలా సమయం పట్టింది.

 

********************

 

న్యూఢిల్లీకి వంద కిలోమీటర్ల దూరంలో వుందా రోడ్డు. ఆ రోడ్డు నిర్మానుష్యంగా వుంది. ఆకాశమ్మీద మెల్లగా పరుగెడుతున్న నల్లటి మబ్బులు..

ఆ ప్రదేశంలో కూలిపోతున్న అలనాటి పెద్ద భవనం ముందు పిచ్చి పిచ్చి మొక్కలు.. దట్టమైన పొదలున్నాయి. ఆ పొదల వెనుక రాతి అరుగు మీద ఒంటరిగా, అసహనంగా కూర్చున్నాడు వీరేంద్ర అజనీష.

ఎవరికోసమో ఎదురుచూస్తున్న గుర్తుగా తన చేతి గడియారాన్ని పదే పదే చూసుకుంటున్నాడు.

“డామిట్… ఎగ్జాట్లీ ఫైవ్ కల్లా వస్తాడని చెప్పాడు. అసలు వస్తాడా?”

చిరాకుపడ్డాడు. అదే సమయంలో చెట్ల వెనుక ఆకులమీద ఎవరో నడిచి వస్తున్న శబ్దం.

తలతిప్పి చూశాడు అజనీష్.

అప్పుడే ఆకుపచ్చటి కొమ్మల్ని తప్పించుకుని బయటకొస్తూ కనిపించాడో మనిషి.

ఆరడుగుల పొడవు, సిల్విస్టర్ స్టాలిన్‌లా కండలు తిరిగిన శరీరం. సూటిగా, కత్తిలా పదునుగా చూసే చూపులు.

ఆ వ్యక్తి మెల్లగా అజనీష్ దగ్గరకొచ్చి “ఐయామ్ నాట్ గ్లాడ్ టు సీ యూ మిస్టర్ అజనీష్” అన్నాడతను బేస్ వాయిస్‌లో.

అలా పలకరించమని ఫోన్లో చెప్పింది అజనీష్.

అతన్ని చూడగానే తను అప్పగించిన పని హండ్రెడ్ పర్సెంట్ చేయగలడని నమ్మకం అజనీష్‌కి కుదిరింది.

“మిస్టర్ అజనీష్.. నా పేరు..”

“తెలుసు మిస్టర్ శోభరాజ్! ప్రపంచం మొత్తం మీద అరవీర  భయంకరమైన సీక్రెట్ సంస్థలో ట్రైనింగ్ అయ్యావని, అది ఇజ్రాయిల్‌కి చెందిన మసాద్ సంస్థని, అసాసినేషన్స్‌లో నీది గురి తప్పని కన్నని అంతర్జాతీయ స్థాయి కిరాయి హత్యలు చేయటంలో  గొప్ప నేర్పరివని. ఎన్నో ఆ స్థాయి హత్యలు చేశావని నీ గురించి నాకంతా తెలుసు. మరి నేనెవరో తెలుసా?”

నవ్వాడు శోభరాజ్.

“తెల్సు.. అజనీష్ గురూజీ! ఇండియాని అమెరికాకో, పాకిస్తాన్‌కో అమ్మకానికి పెట్టడానికి రెడీ చేస్తున్నవాడివని నాకు తెలుసు. ప్రస్తుతం నన్ను పిలిపించింది ఆ పని మీదేనని నాకు తెలుసు.”

అతని బ్రెయిన్ షార్ప్‌నెస్‌ని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు అజనీష్.

ఇన్నాళ్లకి తనకో కరెక్ట్ కాండిడేట్ దొరికాడని అజనీష్‌కి చాలా తృప్తిగా వుంది.

శోభరాజ్ లాంటివాళ్లని పదిమందిని సంపాదిస్తే చాలు. తన ఆశయం నెరవేరిపోతుంది.

“సీ మిస్టర్ శోభరాజ్! ఇంటర్‌పోల్‌కి కూడా అందకుండా నువ్వు నేరాలు చేయాగలవని, చేసావని నాకు తెలుసు. అసలు నువ్వెలా వుంటావో కూడా  పోలీసులకు తెలీదని కూడా తెలుసు. నీ కోసం ప్రపంచవ్యాప్తంగా పోలీసులు గాలిస్తున్నారని నాకు తెలుసు.”

చికాగ్గా చూశాడు శోభరాజ్ అజనీష్ వైపు.

“నాకు టైం వేస్ట్ చేయ్యడం ఇష్టం వుండదు.”

“ఓ.కె! నువ్వు చెయ్యాల్సిన పని..” ఏదో చెప్పబోతుండగా..

“ప్రాణాలు తియాలని నాకు తెలుసు.. ఎవరి ప్రాణాలో.. ఎప్పుడు తియ్యాలో.. ఆ ప్రాణం ఖరీదెంతో చెప్పు. నస నాకు కుదరదు..”

తన నోటినుంచి ఆ మాట వస్తే శోభరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని సందేహిస్తున్నాడు అజనీష్.

“చూడు మిస్టర్ అజనీష్! నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఎంత పెద్ద పనినైనా వంటి చేతితో వంటరిగా చెయడమే నా అలవాటు. అది మర్డరయినా, దోపిడీ అయినా, ఐ హెవ్ నో టైం! తొందరగా విషయం చెప్పండి” తొందరపెట్టాడు శోభరాజ్.

ఒక్కక్షణం ఆలోచించి శోభరాజ్ ఎవర్ని మర్డర్ చెయ్యాలో చెప్పాడు.

శొభరాజ్  ఆశ్చర్యపోలేదు.

“నాకు తెలుసు గురూజీ! మీలాంటి గురూజీలు తక్కువ స్థాయి మర్డర్లను చేయించరని. నేను ప్రెసిడెంట్ అనుకున్నాను. నువ్వు ప్రైంమినిస్టర్ పేరు చెప్పావు. ర్యాంక్ ఒక్కటే కదా” అంటూ నవ్వాడు శోభరాజ్.

అతను నవ్వుతున్నప్పుడు పై పెదవి పైకి లేవడం అక్కడ ఒక పన్ను లేకపోవడం స్పష్టంగా గమనించాడు అజనీష్.

“ఓ.కే. గురూజీ! మరి ఫీజ్?” జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించి పొగ వదులుతూ అడిగాడు శోభరాజ్.

“చెప్పు”

“వన్ క్రోర్”

ఆ ఎమౌంట్‌ని ముందే వూహించాడు అజనీష్.

“ఓ.కే” అతని కళ్లవైపు చూస్తూ అన్నాడు అజనీష్.

శోభరాజ్ శక్తి గురించి చాలా విన్నాడు అజనీష్.

ఆ నాలుగు అక్షారాలు వింటేనే టాప్ అఫీషియల్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల వరకూ అతని చేతుల్లో హతులైపోయినవారే. అతనికి తెల్సిన ఒకే ఒక నీతి ‘డబ్బు’.

“నువ్వు చంపబోతున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తో నీకు తెలుసు. హై రిస్క్.. టాప్ సెక్యూరిటీ. చాలా కాలిక్యులేటెడ్‌గా నువ్వీ పని చేయాలి. నా అఫేరు అసలు బయటకు రాకూడదు.” భయంగా అన్నాడు అజనీష్.

“నేనిప్పటికే యాభై హత్యలు చేశాను. ఆ హత్యలు  చేసిన వ్యక్తి ఎవరో పోలీసులకిప్పటీకీ తెలీదు. ఆ జగ్రత్తలు నాకు కొత్త  కాదు. ముందు డీల్  ఒప్పుకున్నట్టేనా?” అసహనంగా అడిగాడు శోభరాజ్.

తన పక్కన నేలమీదున్న సూట్‌కేసుని శోభరాజ్‌కిచ్చాడు అజనీష్.

“ఎంత?”

“యాభై లక్షలు. పని పూర్తయ్యాక మిగతా సగం..”

“ఇట్సాల్‌రైట్! నాకు కొన్ని డిటైల్స్ కావాలి. ప్రధాని వెనక ఎంతమంది కమెండోలుంటారు? అయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటాడా. ఆయన ఎలాంటి ఆహారం తింటాడు? ఆయన పర్సనల్ స్టఫ్. ఎంతమంది ఆయన వెనక వుంటారు? ఆయన ట్రిప్‌కి వెళ్ళే ఫ్లయిట్ ఎన్ని గంటలకు ఎక్కడినుండి బయలుదేరుతుంది. ఆయన పర్సనల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వయసు. వివరాలు.. ఎక్స్‌పీరియన్స్.. వాళ్లు తీసుకునే సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్.. వాళ్ల దగ్గరుండే వెపన్స్…”

తన ప్రొఫెషన్లో శోభరాజ్ ఎంత ప్లాండ్‌గా వుంటాడో తెల్సీ విస్తుపోయాడు అజనీష్.

“రైట్ మిస్టర్ శోభరాజ్! నీక్కావలసిన డిటైల్స్ రేపటికల్లా రెడీ చేస్తా”

ఓ కార్డు తీసిచ్చాడు అజనీష్.

“నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ నంబరుకి ఫోను చెయ్యి. ఇది సీక్రెట్ లైన్ కాబట్టి ప్రాబ్లం వుండదు.”

ఆ కార్డుని ఒక్క క్షణం పాటు చూసి ఆ నెంబరు మైండులో రిజిస్టర్ కాగానే జేబులోంచి లైటర్ తీసి దానికి అంటించాడు శోభరాజ్.

మండిపోతున్న కార్డువైపు విచిత్రంగా చూస్తూ  శోభరాజ్ చర్యకు ఇంకా విస్మయం చెందాడు అజనీష్.

కార్డు పూర్తిగా కాలిపోయాక శోభరాజ్ కిందకు వంగేప్పటికే తను కాల్చి పారేసిన సిగరెట్ బట్స్‌ని ఏరి జేబులో వేసుకున్నాడు.

జేబులోంచి ఓ స్ప్రేయర్ లాంటిది తీసుకుని తాను నుంచున్న ప్రదేశంలో గడ్డి మీద ఏదో కెమికల్ స్ప్రే చేశాడు.

ఘాటు వాసన ముక్కుపుటాలకు సోకుతుంటే అడిగాడు అజనీష్.

“ఏంటిది?” అని

పాము పిల్లలా నవ్వాడు శొభరాజ్.

‘సేఫ్టీ మెజర్స్! మనమిక్కడ మీట్ అయినట్లు ఎవిడెన్సులు కాదు కదా చిన్న ట్రేసెస్ కూడా మిగల్చడం నాకిష్టం లేదు. అందుకే అన్నీ క్లియర్ చేశాను. క్యాచ్ డాగ్స్ వచ్చినా కనుక్కునే వీల్లేకుండా స్మెల్లింగ్ కెమికల్ స్ప్రే చేశాను. చెప్పానుగా నా ప్రొఫెషన్లో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని”

ఆ మాటలు వింటున్న అజనీష్‌కి వెన్నులోకి సన్నగా చలి పాకింది.

ఒక భయంకరమైన డెత్ ప్లాట్‌కి అంకురార్పణ జరిగిన గుర్తుగా ఒక్కసారిగా ఆకాశం వురిమింది. భయంగా తలెత్తి ఆకాశంవైపు చూశాడు అజనీష్.

కాసేపయ్యాక వాళ్లిద్దరూ విడిపోయారు. రహస్యంగా చెట్ల పొదల మాటున వుంచిన వాహనాలెక్కారు.

 

*********************

 

న్యూడిల్లీ..

ప్రధానమంత్రి రెసిడెన్స్..

పరుగులాంటి నడకతో లోనికొచ్చాడు రుషికుమార్. అదే సమయంలో ఎదురుగా వస్తూ భారతి కనిపించింది.

“అంకుల్ లేరా?”

“ఉన్నారని, నిద్రపోతున్నారని నీకు తెలుసు. తెలిసి నన్నెందుకు అడుగుతున్నావో నాకు తెల్సు” నవ్వును బిగపట్టుకుంటూ అంది భారతి.

“ఎందుకట?” అడిగాడు రుషికుమార్.

“నాతో ఎలాగోలా మాట్లాడాలని. అందుకే ఈ టైంలో నువ్వు వచ్చేది కూడా.”

“చాల్చాలు ఆపవమ్మా తల్లీ! ఇంతోటి బ్యూటీక్వీన్ ప్రపంచంలో మరెక్కడా లేనట్లు.. నేను తలుచుకుంటే… విజిల్ వేస్తే.. ఇరవైమంది క్యూలో నుంచుంటారు తెలుసా?”

“ఎవరట పాపం?”

“అమ్మాయిలు”

“అయితే ఒకమ్మాయిని సంపాదించి నాకు చూపించు చూద్దాం. ఆ అమ్మాయి చేత నా ఎదురుగా నిన్ను ప్రేమిస్తున్నాని నీతో చెప్పాలి.”

“అలా చెప్పిస్తే ఏమిస్తావ్?”

“నువ్వు ఏదడిగితే అది”

“ఓ.కే. నెలరోజుల్లోపల నువ్వు కోరినట్లుగా అమ్మాయిని పట్టి నీ ఎదురుగా పెట్టి, నన్ను ప్రే..” హాల్లోకి వచ్చిన వ్యక్తిని చూడగానే గొంతు తడారిపోయిందతనికి.

స్టిఫ్‌గా నిలబడి సెల్యూట్ చేసాడు రుషికుమార్.

“సర్! మీతో ఒక్క నిముషం పర్సనల్‌గా మాట్లాడాలి” ఆ గొంతులో ఇందాకటి చిలిపితనం లేదు. ఆ గంభీరతకు భారతి ఆశ్చర్యపోయింది.

“ఏమిటి రుషీ… ఏమిటి స్పెషల్?” పక్క రూంలోకి నడుస్తూ అడిగారాయన.

“సర్! ఇప్పుడే ఇంటలెజెన్స్ రిపోర్టు వచ్చింది. పొలిటికల్ వర్గాలు మిమ్మల్ని ఎలాగయినా పదవిలోంచి దించెయ్యాలని కుట్ర జరుగుతోంది. అదే కాకుండా హర్యానా రోడ్డులోని వీరేంద్ర అజనీష్ రెసిడెన్స్ దగ్గర మన పార్టీ  ప్రముఖుల కారు కంపించిందంట.

” ఇంతేనా…నన్ను మర్డర్ చెయ్యడానికి ఎవరూ కుట్ర పన్నడం లేదు గదా? డోంట్ వర్రీ యంగ్‌మేన్! పదవిలొ వున్నవాడిని  పదవిలోంచి దించెయ్యడానికి కుట్ర చేస్తారు. లేనివాళ్లను దించరు గదా! అలాగే వీరేంద్ర అజనీష్ దగ్గర కారు.. ఎలక్షన్లు వస్తున్నాయి కదా! గురూజీ దగ్గరకు అన్ని  పార్టీలవాళ్లు ఆశీస్సుల కెళ్ళడం సహజం. నా మీద కుట్ర ఏదయినా జరిగితే అజనీష్ నాకు ఫోన్ చేసి చెప్తారు”

“నో సర్! ప్రతి విషయం మీకు సిల్లీగా, నేచురల్‌గా కనిపించొచ్చు. ఇంటలెజెన్స్ రిపోర్ట్ మీరొక్కసారి చూస్తే..”

“నువ్వు చూశావు కదా.. చాలు. రేపటి ప్రయాణానికి అన్నీ రెడీ అయ్యాయి కదా?”

“ఎస్సర్! బట్.. ఇందిరాజీ.. రాజీవ్‌గాంధీ. ప్రేమదాస్.. సంఘటనల్ని తలుచుకుంటే టెన్షన్‌గా వుంది సార్. అందుకని” ఆపైన నసిగాడు రుషి.

ప్రధాని నవ్వారే తప్ప సమాధానం ఇవ్వలేదు.

“మామూలు విలేజ్‌కి మరీ ఎక్కువ సెక్యూరిటీతో వెళ్లడం బాగోదు. సీ రుషి! కమెండోల్ని సగానికి సగం తగ్గించేయ్…” చెప్పేసి గబగబా తన  ఆఫీస్ రూంలోకి నడిచాడాయన.

అక్కడ నుంచి బయటకొస్తున్న రుషికుమార్ వరండా మీద ఒక వ్యక్తి తారట్లాడుతుండటం చూసి..

గబుక్కున పరుగెత్తి అతన్ని పట్టుకున్నాడు.

అతను గార్డెనర్ రాజవేలు!

గార్డెనర్‌కి అక్కడ  పనేమిటో అర్ధం కాలేదు రుషికుమార్‌కి.

“ఎందుకొచ్చావ్?” అతని భుజం పట్టుకుని అడిగాడు రుషి.

వెంటనే జవాబు చెప్పలేదతను.

చంపమీద ఒక్కటి లాగి యిచ్చాడు.

“ఇది ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ అనుకున్నావా? పబ్లిక్ పార్కనుకున్నావా? సెక్యూరిటీ మెజర్స్ ఆ పెద్దాయనకి అక్కర్లేదు. ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్‌కి అక్కర్లేదు…”గబగబా వాడిని నాలుగు ఉతికేసి, సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరకు తీసుకొచ్చి…

“పి.ఎం. లివింగ్ రూంలకి ఇతన్నెందుకు ఎంటర్ చేశారు?” కోపంగా అడిగాడు రుషి.

“అతను వెళ్లడం నేను చూడలేదు సార్!”

అసలే కోపంగా ఉన్న రుషికుమార్ ఆ సెక్యూరిటీ గార్డుకి ఒక్కటిచ్చుకున్నాడు.

“విత్ అవుట్ మై పర్మిషన్! డోంట్ ఎలౌ ఇన్‌సైడ్…”

విసురుగా తన ఆఫీస్ రూంలోకి వెళ్లిపోతున్న రుషిని, అతని కోపాన్ని కిటికీలోంచి చూస్తున్న భారతికి అసలేం జరిగిందో అర్ధం కాలేదు.

రుషిలో అంత కోపాన్ని చూడడం భారతికి అదే మొదటిసారి.

రుషికి అంత కోపం ఎందుకొచ్చింది.? ఆ విషయం గురించే చాలాసేపు ఆలోచించింది భారతి.

 

*********************

 

తిరుపతి రుయా హాస్పిటల్.

డ్యూటీ రూంలోంచి వార్డులోకి వెళ్లడానికి వరండాలోకొచ్చిన విజేతకు తను క్రయోనిక్స్ ఆఫీస్ నుంచి బయటికొస్తున్నప్పుడు డా. సవ్యసాచి చెప్పిన విషయం గుర్తొచ్చింది.

“ఇవాళ్టి నుంచీ మీ అన్వేషణ శవాల గురించి. ఎలాంటి శవమైనా మీరు వదలకండి. ఎంత డబ్బయినా యిచ్చి కొందాం. మీరు యిక నుంచి  ఎలాంటి  ఇన్ఫర్మేషనైనా మిస్ దిశ ద్వారా పంపించొచ్చు…” చెప్పి దిశను పరిచయం చేశాడు సవ్యసాచి.

డాక్టర్‌గా తన బాధ్యత పేషెంట్లను మృత్యువు నుంచి తప్పించడం. క్రయోనిక్స్ సైంటిస్ట్‌గా శవాల కోసం వెతకడం.. తన పరిస్థితికి నవ్వుకుంటూ వార్డులోకి అడుగుపెట్టింది డాక్టర్ విజేత.

వరసగా బెడ్స్, ఆ బెడ్స్ మీద రకరకాల బాధలతో ఉస్సురుస్సురంటున్న పేషెంట్స్..

ఒక మూల ఒక యాభై ఏళ్ళ వ్యక్తి కాలికి తగిలిన పెద్ద గాయం వల్ల గట్టిగా కేకలేస్తున్నాడు.

“నర్సమ్మా! అర్జంటుగా ఆ మత్తుమందు ఇయ్యమ్మా! అర్జంట్… ఈ బాధ నేను భరించలేను..”

ఇంజక్షన్ ఇవ్వడానికి నర్సు ప్రయత్నం చేస్తున్న దృశ్యం.

ఎడం పక్కన రెండో బెడ్ మీద పాతికేళ్ల యువతి నిద్రపోతోంది. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సందర్భంలో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. పోలీసులు ఎడ్మిట్ చేసిన కేసది. రెండుసార్లు ఆ యువతి అయిదేళ్ళ కొడుకును చంపడానికి ప్రయత్నం చేసింది. ఒకసారి నిద్రమాత్రలు యిచ్చి, మరోసారి తలగడను ముఖమ్మీద అదిమి.  ఆ యువతికి స్పృహ వస్తేనే కొడుకును ఎందుకు చంపడానికి ప్రయత్నించిందో, తనెందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసిందో తెలుస్తుంది. ఆ అమ్మాయి బెడ్ పక్కనున్న చార్ట్‌ను ఒకసారి చూసి పక్కనున్న రూంలోకి అడుగుపెట్టింది.

ఆ రూంలోని వ్యక్తిది ఇంకో చిత్రమైన కేసు. కత్తి తెగుతుందో లేదో పరీక్షించడానికి చేతి నరాల్ని తెగకోసుకుని ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆ పక్కన వరసగా యిద్దరు టీనేజ్ గర్ల్స్! ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ రాలేదని సూసైడ్ ప్రయత్నం చేసి ప్రస్తుతం కోలుకుంటున్నారు.

ఆ రూంలోనే చివరి బెడ్ మీద యాభై అయిదేళ్ల పేషెంట్ రమాదేవి పడుకొని వుంది. రెణ్డేళ్లగా బ్రెస్ట్ కాన్సర్‌తో బాధపడుతోంది ఆమె. వ్యాధి ముదిరిపోవడం వలన అంకాలజీ( కేన్సర్‌కు సంబంధించిన )వార్డులో చేరింది. ఆమె బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. కీమోథెరపీ  మూడుసార్లు చేయడం వల్ల ఆమె తల మీద జుత్తు లేదు.

డాక్టర్ విజేతను చూడగానే చిన్నగా నవ్విందామె. నవ్వి..

“చూడమ్మా డాక్టర్.. ! ఎన్నాళ్ళని ఇలా ట్రీట్‌మెంట్స్‌తో బ్రతికుండగానే చంపుతారు? వీటికంటే చావే బెటరనిపిస్తుంది. ఆ రేడియేషన్ వల్ల ఒళ్ళంతా మచ్చలు, బాధా .. నేను చచ్చిపోయే మందు ఏదయినా ఇయ్యి తల్లీ…”

ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే రమాదేవి అవాళ అంత నిరాశగా మాట్లాడటం చాలా ఆశ్చర్యమనిపించింది విజేతకు. రమాదేవి అంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ పేషెంటు.

“మీకేం కాదు రమాదేవి! డోంట్‌వర్రీ..” కుర్చీలో కూర్చుంటూ అంది విజేత.

“ఏం కాదు. చచ్చిపోతాను అంతే..”

“మీరు చాలా కాలం బ్రతుకుతారు రమదేవిగారూ!”

“ఎవరికోసం బ్రతకాలమ్మా. అందరూ వుండి, ఎవరూ లేని దాన్నయ్యాను. నా ఆస్తీ, డబ్బూ లాక్కుని నా కొడుకులు నన్ను తగలేశారు. రేపు నేను చచ్చినా నా శవాన్ని ఏ మున్సిపాలిటీ వాళ్ళో తగలెయ్యాలి తప్ప..”కళ్ళనీళ్లు పెట్టుకుందామె.

“అంత పరిస్థితి వస్తుందని ఊహించుకోవడం మంచి పద్ధతి కాదు రమాదేవిగారూ”

“అమ్మా విజేతా! నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా? నా దగ్గరున్న పదివేల రూపాయలు నీకిస్తాను. నేను చచ్చిపోయాక ఆ  హాస్పిటల్ బిల్లిచ్చి, నా శవాన్ని దహనం చెయ్యడానికి ఏర్పాటు చేస్తావా?” జాలిగా, ప్రాధేయపడుతూ అడిగిందామె.

ఏం జవాబు చెప్పలేదు విజేత.

“ఏవమ్మా. నాకా హెల్ప్ చెయ్యలేవా? మళ్లీ అడిగిందామె.

“అలాగేలెండి.. కానీ.. మీరు చచ్చిపోరు. నేను హామీ యిస్తున్నాను కదా..” లేచి ముందుకెళ్తూ అందామె.

“నేనిన్నాళ్లూ బ్రతికి ఎందుకున్నానో తెలుసా? ఎవరైనా నన్ను దహనం చేస్తారని హామీ  యిస్తే, ఆ సంతృప్తితో చచ్చిపోదామని..” ముందుకెళుతున్న డా. విజేతకు ఆ మాటలు స్పష్టంగా విన్పించాయి. విజేతకు బాగా తెలుసు రమాదేవి బ్రతికే అవకాశం లేదని.

ఒక్కొక్క పేషెంట్‌ది ఒక్కొక్క బాధ. నడుస్తున్న విజేతకు ఒక్కసారి డా. సవ్యసాచి మాటలు గుర్తుకొచ్చాయి.

“ఎలాంటి శవమైనా మీరు వదలకండి. ఎంత డబ్బయినా యిచ్చుకుందాం.” ఈ రమాదేవి చనిపోతే, ఆమె శవాన్ని మృతసంజీవని ఆఫీసుకు తరలిస్తే ..?

ఎలా తరలించడం.. ఒకవేళ రమాదేవి తన డ్యూటీ అవర్స్‌లో చనిపోతే. ఎవరికీ చెప్పకుండా ఆ విషయాన్ని రహస్యంగా వుంచుతుంది.

రాత్రి సమయంలో ఆ శవాన్ని బయటకు పంపించే ఏర్పాటు చేస్తుంది.

అకస్మాత్తుగా రమాదేవి ఏమైపోయిందని ఎవరైనా ప్రశ్నిస్తే..

హాస్పిటల్ నుంచి పారిపోయిందేమో.. అనే అబద్ధం ఆడితే..!

ఇద్దరు ముగ్గురు పేషంట్లను చూస్తూ కూడా రమాదేవి గురించి ఆలోచిస్తోంది డా. విజేత.

ఒకసారి హాస్పిటల్ నుంచి రమాదేవి శవాన్ని తప్పిస్తే, బయట ఎవరూ ఆమె గురించి ప్రశ్నించే వారుండరు. ఎందుకంటే ఆమె కోసం ఎవరూ రారు గనుక. అందరూ వున్నా అనాధ గనుక.

తను మనిషి శవానికి చేసే ఆపరేషన్ సక్సెస్ కావాలంటే అర్జెంటుగా తనకో మనిషి శవం కావాలి.!

ఇరవై నిమిషాఅ తర్వాత రౌండ్స్ పూర్తి చేసుకుని రమాదేవి రూం మీదుగా వస్తూ అప్రయత్నంగా ఆమె బెడ్‌వైపు చూసింది డ. విజేత.

రమాదేవి ప్రక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఆమె ముఖం కనిపంచడం లేదు.

ముందుకు అడుగువేసి , బెడ్ పక్కన వేలాడుతున్న ఆమె చేతిని చూసి ఏదో అనుమానంతో గబగబా ముందుకెళ్ళింది.

అక్కడ కనపడిన దృశ్యానికి చలించిపోయింది విజేత.

రమాదేవి నోటినిండా బెడ్ పక్కన రక్తం. నెత్తురు కక్కుకుని చనిపోయింది.

స్టెతస్కోప్‌తో పరీక్ష చేసింది.

రమాదేవి చనిపోయింది. రమాదేవి చనిపోయిన విషయం ఆమెకు తప్ప మరెవరికీ తెలీదు.

వెంటనే అలర్టయింది విజేత. రక్తపు మరకల దుప్పటిని, తలగడను తీసేసి, పక్కనే వున్న యింకో దుప్పటిని ఆమె తల వరకూ కప్పింది.

అప్పుడు సాయంత్రం అయిదు గంటల సమయం.

ఇంకో రెండు గంటల తర్వాత చీకటి పడ్డాక శవాన్ని నెమ్మదిగా మార్చురీకి తరలించి, అక్కడినుంచి బయటకు తరలించాలి.

ఆ విషయాన్ని వెంటనే సవ్యసాచికి ఫోన్ చెసి చెప్పాలి

గబగబా రూంలోంచి బయటికొచ్చి రూం డోర్‌ని తీసి, అటూ యిటూ చూసి ఫోన్ వైపు పరుగెత్తింది.

సవ్యసాచికి ఫోన్ చేసింది.

సవ్యసాచి ఆఫీసులో లేడు. మదనపల్లి వెళ్లాడు. గంటలో రావొచ్చు.

ఫోన్ రిసీవర్ని పెట్టేస్తూ తనని పలకరించిన వ్యక్తిని చూసి షాక్ తిన్నట్టుగా అయిపోయింది డా. విజేత.

డా. నాగరాజ్.. అంకాలజీ స్పెషలిస్ట్.. ఆ పక్కన ఇంకో వ్యక్తి.

“హలో విజేతా!! ఆ రమాదేవి ఎలా వున్నారు? చచ్చిపోతాను. చంపెయ్యండి.. చంపెయ్యండని అందర్నీ బెదిరిస్తున్నారా?”

“ఎస్ డాక్టర్. ఆవిడ..” ఏదో చెప్పబోయింది ఆమె.

“బైదిబై హీ ఈజ్ మిస్టర్ రమేష్ బాబు. రమాదేవిగారి పెద్దబ్బాయి. అసలు తల్లికి యింత సీరియస్‌గా వుందని ఎవరూ చెప్పలేదంట. ఎలాగో తెల్సి, ఇవాళే అమెరికా నుంచి వచ్చారు. కొంచెం రమాదేవి దగ్గరకు తీసికెళతారా?”

ఆ మాటకు విషం చేతిలోకి తీసుకున్నదానిలా వణికిపోయింది ఆమె.

అప్రయత్నంగా ఆమె వంటికి చెమటలు పట్టేశాయి.

ఓరకంట రమేష్‌బాబు వైపు చూసి ముందుకు కదిలింది.

అదే సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

వరండా మీదగా జోరుగా వస్తున్న నర్స్..

“మేడం! ఆ రమాదేవి చనిపోయారు. ఆ రూంలో కెళితే…”

ఆ మాటల్ని వినగానే గుండెల మీద నుంచి ఏదో బరువు సగానికి సగం దిగిపోయినట్లనిపించింది ఆమెకు.

తర్వాత  జరగాల్సిన తతంగం జరుగుతున్నంతసేపూ, మౌన ప్రతిమలా నిలబడిపోయిందామె.

రమేష్‌బాబు రాకపోతే.. ఆ శవం తనకు దక్కేది. తను ఆపరేషన్ స్టార్ట్ చేసేది.

నెక్స్ట్ టైం బెటర్ లక్.. నిట్టూరుస్తూ అనుకుందామె. ఎంతో నిరాశను అణుచుకుంటూ..

 

********************

 

 

 

5 thoughts on “సంభవం – 3

Leave a Reply to Manyam devender Cancel reply

Your email address will not be published. Required fields are marked *