May 19, 2024

అనగనగా బ్నిం కధలు

కూర్పు: ఝాన్సీ bnim

నా కథల వెనక కథ – బ్నిం

అనగనగా నాకు 16వ ఏటనుండీ కథలు రాయడం చేతనయిందని…’ఆంధ్రపత్రిక’  వీక్లీవాళ్లు అచ్చేసి సర్టిఫై చేశారు. ఆ తర్వాత ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ కూడా అవునంది. అ దరిమిలా చాలా తక్కువే రాశాను. అప్పుడు క్రేజీ ఇంట్రస్టూ.. కార్టూన్ రూట్లో ఉండేది. ఆ తర్వాత ‘ఆంధ్రభూమి’ డైలీలో సన్‌డే స్పెషల్ (ఆదిత్య హృదయం సెక్షన్)లో ఉద్యోగం చేసినప్పుడు కార్టూన్లే కాక వ్యాసాలూ, కవితలూ,కాప్షన్లతో బాటు కాసిన్ని కథలు రాశాను. మారుపేర్లతో రాశాను. దాదాపు 26 పేర్లు… రచించి కథలు గట్రాలు అన్ని కాలమ్స్‌లోనూ వడ్డించాను.

ఆ తర్వాత ఇంకో రెండు పత్రికల్లో ఉద్యోగం వెలగబెట్టి, తిప్పి తిప్పి మళ్లీ ఆంధ్రభూమి వీక్లీలో అడుగెట్టా. అప్పుడు ‘వేరే పత్రికలకి రాయకూడదు’  అని కొన్ని కట్టుబాట్లు ఉండేవి. దాంతో అదే సంస్థలో దినపత్రికకి రాసినా, మాసపత్రికకి రాసినా మారు పేరు ముసుగు మస్ట్! కార్టూన్స్ కూడా తక్కువే వేశాను. కారణం క్రేజీ ఇంట్రస్టూ ఎలక్ట్రానిక్కేసి చూస్తుండటం! ఏతావాతా ఓ శుభముహూర్తాన ఉద్యోగపర్వం ముగించేసి సీరియల్స్ రాసే యుద్ధభేరి మోగించా. ఇదంతా ఓ మూడు దశాబ్దాల గతం..

ఒకసారి ఎందుకో ఆంధ్రభూమి వీక్లీ ఆఫీసుకి వెళ్లాను. చాలా మారిపోయింది. మా కాలంలో వున్నట్లు కాక కార్పొరేట్ ఆఫీసులా వుంది. (అప్పట్లో ఎడిటర్ గారి రూంలా) సెక్షనంతా చల్లగా ఉంది. ఆ మంచి వాతావరణంలో శ్రీమతి A.S.లక్ష్మి ఎడిటర్జీలా కనిపించారు. సరస్వతీలక్ష్మిలా ప్రశాంత హసిత ప్రభతో.. ఆ మాటా ఈ మాటా అయ్యాక ‘పోనీ ఫీచర్ రాస్తా మ్యూజింగ్స్‌లా’ అన్నా..’అబ్బే కథలే రాయాలి’ అన్నారు ఆవిడ. ‘వీక్లీ ఫీచర్ అంటున్నారు. అన్ని కథలు బుర్రలో ఎలా పుడతాయి. తీరా చేసి పాతిక కథలేనా రాయలేకపోతే.. పైగా వారానికొకటి .. ‘నసిగా… సణిగా… గొణిగా.. విసుగేసి.. సరే అన్నా.

ఆవిడ విజయగర్వంతో నవ్వుకున్నారు. నేను కొండంత గుబుల్తో బైట పడ్డాను. నిజంగా రెండు కథలు రాశాను. బుర్రలో వండుకోలేదు. ఉత్తరం రాసినట్లు, సంతకం పెట్టినట్లు ఎనిమిది పేజీలు పూర్తవకుండా కథయిపోయింది. సింగిల్ సిటింగ్‌లో ఎలా సాధ్యమయిందో నాకిప్పటికీ తెలీదు. అక్షరం నేను కొట్టలేదు. ఆవిడ మార్చనూ లేదు. ఆమెకి తన మీద నమ్మకం పెంచేసాను. నేను భయం పెంచేసుకున్నాను.

రెండేళ్లపాటు కొనసాగింది ఈ కథన కుతూహలం. ఆఖరి నిముషంలో హడావిడిగా కథ పూర్తి చేసి ఆటోలో వెళ్లి సెక్యూరిటీ నుంచి పైకి పంపేసి వచ్చేవాణ్ని లేదా ఎవర్నైనా పంపించేవాణ్ని. ఎదురుగా ఆ రెండేళ్లు లక్ష్మిగారికి నేను కథ అందించలేదు. కథ అందిన అరగంట తర్వాత ‘ఆ. బావుంది’ ఆ మాటే ఎక్కువసార్లు అనేవారు. మొత్తం మీద అప్పట్లో 6 సార్లు నా కథ లేకుండా వీక్లీ వచ్చింది. 4 సార్లు ఆమెకి ‘ఆ కథ’ నచ్చక రెండుసార్లు నా అలసత్వం వల్ల.

హాస్యం కథలు కావు. మొత్తంలో 5,6 మాత్రం తేలికగా వున్నా, మిగిలినవి బరువైన కథలే. రాశాక రెండ్రోజులు కథలో విషాద భావనకి పడిన పదబంధాల్లోంచి బైటకి రాలేకపోయేవాణ్ని.  బరువుగానే ఆ ఫీచర్ లాగాలని అనుకుని కమిట్టయ్యాక వ్యంగ్యమో, హాస్యమో రాద్దామనిపించేది కాదు. ఆ వారం , ఆ వారం నడిచిపోతుంటే చుట్టూ నలిగే మనసులు కనిపించకపోతే మా స్నేహితులను ఏదైనా పాయింట్ చెప్పమని అడిగేవాణ్ని. తనికెళ్ల సూరిబాబుగారని (అవును భరణి బ్రదరే) ఆయనో పాయింట్ విసిరేవారు. దాన్ని పట్టుకుని, ఓన్ చేసుకుని, నా భాషలో అనువదించడానికి పరకాయ ప్రవేశం చేసినంత పనయ్యేది. ఆ పాయింట్ని ఎక్కడో చేపలు పట్టేవానికి అతికిద్దామా? గుళ్లో పూజారిగారికి పూసేద్దామా? అనుకుని  ఆ విషయానికి ఈ కేరక్టరయితే బావుంటుంది అనుకోవటంతో మనమే సముద్రం తవ్వుకుని, నీళ్లు నింపి, ఈతరాక దూకి ఎదురు రావటానికి చేసే పిచ్చి ఎక్సర్సైజ్. నాకు అద్భుతమైన పేరు తెచ్చింది. ఈ ప్రయత్నం!

ఒక భాష గెలిచింది. ఒక వేగం నిలబెట్టింది. ఒక దుఃఖం ఆనందాన్నిచ్చింది. నిజానికి నాకే కామెడీ సీరియల్స్, కార్టూన్ బొమ్మలూ వేసే బ్నిమ్ములో ఇంకో ఏంగిల్‌ని చూపెట్టింది.

ఈ కథా శతకాన్ని నాలుగు పుస్తకాలుగా ప్రచురించాను. ఎంతో మంచి స్పందన వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. నా అభిమాన రచయితలు ఎందరో మెచ్చుకున్నారు. బాపు, రమణగార్లయితే ఎంతగానో సంతోషించారు. అనగనగా బ్నిం కథలు, మరి కొన్ని కథలు, ఇంకొన్ని కథలు, మరిన్ని కొత్త కథలు అని నాలుగు సంకలనాలు వేశాను. అన్నింటికీ బాపుగారి అభిమానమే ముఖచిత్రాలు అయ్యాయి. అప్పుడు ఈ కథలు చదివిన ఒక మిత్రుడు కృతజ్ఞతా సూచకంగా ఈ కథలు ఇలా కొన్ని సిడిలు ముద్రించి ఇచ్చారు.

ఈ శబ్దకథాసంకలనంలో ముఖ్యమైనది గాత్రదానం చేసిన మిత్రబృందం ప్రశస్తి. వాళ్లందరూ నా ఫ్రెండ్స్. మేం ఈ కథలు చదువుతామని ముచ్చటపడి వచ్చినవాళ్లు. సుమ, పుష్ప, వినోద్‌బాల, గణేష్. అందరూ ఇష్టపడి చదవటానికి వచ్చారు. మరో మిత్రమణి ఝాన్సీ కథలు ఎంపికలోనూ, ఎవరితో ఏ కథ చదివించాలో ఎన్నికలోనూ పాల్గొనే సంపాదకత్వం వహించింది. తను కొన్ని కథలు దాచేసుకుని చదివి నా అభిమానం మరీ దోచేసుకుంది!

ఆ కథలు రాసినప్పుడు పడిన మానసిక సంఘర్షణ అంతా ఈ కథలు చదువుతున్నప్పుడు వాళ్ల గొంతుల్లో పలుకుతుండటం చూసి నేనే ఫీలయ్యాను.

 

ఇందులో మొదట వేస్తున్న ‘చిలకాకు పచ్చరంగు చీర’ ఊహిస్తున్నప్పటి ఆలోచనలో లేనిది.. కొత్తగా రాస్తున్నప్పుడు ప్రవేశించినదీ అక్క పాత్ర! అక్క పుట్టడంతో కథకి స్టీరింగు దొరికింది. కాస్త ఓపిగ్గా, కాస్త ప్రాక్టికల్‌గా మంచి మనసుతో ఆ కథని నడిపించిన అక్క ఈ కథకి దిక్కైంది కదూ! చాలా రాసేశాను. సారీ! కథ వినాలిగా.. సరే .. బై ..

మీ… బ్నిం…

4 thoughts on “అనగనగా బ్నిం కధలు

  1. తిననట్టు నటించింది … తినినట్టూ నటించింది …. హాట్స్ ఆఫ్ … పుస్తకాలు మన అందరి నేస్తాలు … వాటిని చదువుతాం … periodical గా చదూతునే ఉంటాం … అదే వింటే … అది ఇంకొక ఆనందం … … బ్నిం గారు రాసిన కథ ఝాన్సి గొంతుతో వింటే ఎంతో బావుంది … చదువుతుంటే మనం అనుభవించే ఫీల్ … ఇలా వింటుంటే ఇంకా బావుంటుంది … ఒక togetherness ఉంటుంది అందులో … అంతకు ముందు రేడియో లో ఒక specific టైం లో ఒక పుస్తకం ధారావాహికం గా చదివే programme వచ్చేది … అది ఎంతో ఇష్టం గా వినేవాడిని … ఆ రోజులు మళ్ళీ గుర్తుచేశారు … ధన్యవాదాలు …

  2. మీ ప్రయత్నం బావుందండీ. బ్నీం గారి కథ, ఝూన్సీ గారి గొంతునుంచి వినటం చాలా బావుంది.
    రికార్డింగ్ క్లారిటీ కూడా బావుంది. ఎకో కొంచెం తగ్గిస్తే మరింత నాచురల్ గా వుంటుంది అనిపించింది.
    ఎప్పుడో రేడియో విన్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

  3. కథ ని ఇలా వినడం మంచి అనుభూతినిచ్చింది . కథ గురించి చెపుదామంటే ….. హుమ్మ్….మాటలకి అందని భావన ఏదో గొంతు పెగలనీయకుంది 🙁

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *