December 3, 2023

రఘువంశము -2

రచన: Rvss Srinivas

క్రిందటి భాగంలో  నూరు అశ్వమేధ యజ్ఞాలఫలం దిలీపునికి లభించేలా రఘుమహారాజు చేసినట్లుగా చదివాము.మరి ముందు కథ చూద్దామా …

raghu

రఘు మహారాజు ఇంద్రునితో యుద్ధం చేసిన విషయం విన్న శత్రురాజులు రఘువు సింహాసనమధిష్ఠించిన వెంటనే తమంత తామే వచ్చి లొంగిపోయారు.సాధారణంగా యుద్ధానికి అనువైన ఋతువు శరదృతువు. ఇంద్రుడు ఎత్తిన ధనువు దించిన వెంటనే రఘువు ధనువు ఎత్తేవాడు.ఇక్కడ రెండు ధనువుల ప్రయోజనం వేరైనా ఎంత చక్కగా చమత్కరించాడో చూడండి కాళిదాసు. శ్వేతకమలాలు గొడుగులుగా, రెల్లుపూల వింజామరల శరదృతువులా శోభిల్లుతున్నాడని వర్ణిస్తాడు కాళిదాసు.

రఘువు జైత్ర యాత్రలో రేగిన రధధూళి  అంబరానికి ఎర్రరంగు పూసింది. సేనలోని మదగజాలు ఆకాశంలోని నల్లమబ్బులతో దీటుగా కనిపిస్తూ చలనంలో కూడా వాటినే తలపిస్తున్నాయి. శివుని జటాజూటంనుండి దిగి భగీరధుని వెంట వెళ్ళిన గంగా ప్రవాహంలా నదీ ఉందట రఘు మహారాజు ఆధ్వర్యంలో నడుస్తున సేన. నదీ ప్రవాహానికి ప్రబ్బలి చెట్లు వంగినట్లు శత్రురాజులు రఘువు పరాక్రమానికి లొంగిపోయారు. ఏనుగులను వరుసగా నిలబెట్టి వాటిపైనుంచి కపిశా నది దాటి వెళ్లారు. గజసేనాయుద్దంలో నిపుణుడైన కాలింగ రాజుపై అపరాజితుడైన రఘువు సునాయాసంగా విజయం సాధించాడు.

దక్షిణాన ఉన్న కావేరీనదిలో సైనికులు యధేచ్చగా స్నానాలు చేసారు. ఏనుగుల మదజలాన్ని కడిగి శుభ్రపరిచారు. సైనికులు పూసుకున్న వీరగంధం, గజమదజలం కలిసి కావేరీనదీ సుగంధభరితమైనది. దక్షిణ సముద్రం దాకా వ్యాపించిన ఏనుగులను చూసి, కొత్త పరిమళాలు ఆఘ్రాణించిన సముద్రునికి కావేరీనదిపై సందేహం కలిగింది. అంత గొప్పవాడైన సముద్రుని అనుమానపు భర్తతో పోల్చాడు కాళిదాసు. ఎత్తుగా ఉన్న త్రికూట పర్వతం విజయ స్తంభాన్ని తలపిస్తుంటే పర్వతంపై సేనలోని ఏనుగులు తమ దంతాలతో పొడిచిన గుర్తులు రఘువు విజయగీతికల వలే ఉన్నాయి. సైనికులు తమలపాకులలో త్రాగిన కల్లు శత్రువు కీర్తిపానంతో పోల్చాడు కాళిదాసు.ఈ పోలికలు ఎంత అద్భుతమో చూడండి.

ఇలా నలుదిశల రాజులను ఓడించి తన రాజ్యం చేరుకొని ‘విశ్వజిత్’ యజ్ఞాన్ని చేసి తాను జయించి తెచ్చిన సంపదను తన దగరున్న ధనాన్ని అందరికీ దానం చేసాడు రఘువు. ఇంతలో కౌత్సుడనే ముని తాను గురుదక్షిణగా చెల్లించాల్సిన మొత్తం (14 విద్యలకి 14 కోట్లు ) రఘువుని  అడగాలని వస్తాడు. రఘువుని చూసి ఏమీ అడగకుండానే వెనుదిరిగుతాడు. రఘువు ఏమి కావాలని అడిగి, మా వంశంలో ఇప్పటిదాకా రిక్త హస్తాలతో ఎవరినీ పంపలేదు అంటూ మంత్రించిన రథంలో కుబేరుని దానం అడుగుదామని బయలుదేరాలని నిశ్చయించుకుంటాడు రఘువు. రాత్రి అదే రథంలో నిద్రిస్తాడు. తెల్లవారి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే కోశాధ్యక్షుడు వచ్చి రాత్రి బొక్కసంలో కనక వర్షం కురిసిందని చెప్తాడు. కౌత్సునికి కావలసిన ధనాన్ని ఇచ్చి సాగనంపుతాడు. పుత్రోదయం అవుతుందని వరమిచ్చి బయలుదేరతాడు కౌత్సుడు.

వర ప్రభావంతో కలిగిన పుత్రునికి అజుడని నామకరణం చేస్తాడు రఘువు. యుక్తవయస్కుడైన అజుడు స్వయంవరంలో పాల్గొనాలని విదర్భకు బయలుదేరి వెళ్లేదారిలో గజరూపంలో ఎదిరించిన ప్రియంవదుడనే గంధర్వుని శాపవిముక్తుని చేసి సమ్మోహనాస్త్రాన్ని పొందుతాడు అజుడు.

స్వయంవర సభలో ఇందుమతీదేవి ఒక్కొక్క రాజును తిరస్కరిస్తూ, వారి హావభావాలను బట్టి, కదలికలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ ముందుకి సాగిపోతోంది. రాజభవనంలో దీపం తీసుకొని ముందుకి పోతుంటే వెనుకనుండే ప్రదేశాలు చీకటిలో మునిగిపోయినట్లు ఇందుమతి ముందుకి సాగిపోతుంటే ఆమె దాటి వెళ్ళిన రాకుమారుల ముఖంలో చీకట్లు అలుముకున్నాయంటాడు కాళిదాసు. దీని గురించి మొదటి భాగం ఉపోద్ఘాతంలోనే మనవి చేసి ఉన్నాను.

అజుని చూసాక మరి ముందుకి సాగానన్నాయి ఇందుమతీ దేవి పాదాలు. అజుని వరించి వరమాలను వేసింది. ఇందుమతిని పెండ్లాడి తిరిగి వచ్చే సమయాన దారికాచి మూకుమ్మడిగా స్వయంవరంలో తిరస్కరించబడ్డ రాజులు యుద్ధానికి రమ్మని పిలుస్తారు . చెట్లనుండి పళ్ళను రాల్చినంత సులువుగా శత్రుసైనికుల తలలు నరికేస్తాడు అజుడు. ప్రియంవదుడు ఇచ్చిన సమ్మోహనాస్త్రంతో శత్రుసేనని మూర్చిల్లేలా చేసి నెత్తుటిబాణంతో వారి ధ్వజాలపై “రఘుకుమారుడు మీ కీర్తిని మాత్రమే హరించాడు. ప్రాణాలను వదిలేసాడు” అని వ్రాసి ఇందుమతితో తన రాజ్యం చేరుకుంటాడు అజుడు.

(ఉత్తర గోగ్రహణం లో గోవులమందలను తరలించుకు పోయే కురుసైన్యంపై సమ్మోహనాస్త్రం ప్రయోగించి వారి తల పాగాల కుచ్చులను కోసి ఉత్తరకి బహూకరించడం గుర్తొచ్చి ఉంటుంది ఇది చదివాక )

రాజ్యాభిషిక్తుడైన అజునికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థాశ్రమం  స్వీకరిస్తాడు రఘువు. అజునికి ఇందుమతి వలన కలిగిన సంతానమే దశరథుడు. అకస్మాత్తుగా భార్యావియోగం కలుగుతుంది అజునికి. కుమారుని పెద్ద జేసి భార్యా వియోగంలో  మనోవ్యాధితో కృశించి సరయూ సంగమస్థలంలో ప్రాణ త్యాగం చేస్తాడు అజుడు. దశరథుని పాలన ప్రారంభమైంది. తన తాత తండ్రులని మించిన శౌర్యంతో పరిపాలన చేస్తున్న దశరథుని కోసల, మగధ, కేకయ రాకుమార్తెలు వరించారు. దశరథుని నాటిన బంగారు యూపస్తంభాలతో సరయూనదీ తీరం నిండిపోయింది .

దశరథుడు రథమెక్కి ధనుస్సు ధరించి యుద్దానికెడితే సూర్యాభిముఖంగా రేగిన ధూళి రాక్షసుల రక్తంతోనే అణగారేది అంటాడు కాళిదాస మహాకవి. వేటంటే దశరధునికి ప్రాణం.* ఇప్పటి యుద్ధ సైనికులు పరిసరాలకి తగిన రంగు దుస్తులు ధరించడం గురించి చదువుకున్నాము కదా. ఇది ఇప్పటి విషయం కాదు. వేటకి వెళ్లే దశరథుడు చెట్ల రంగులో కలిసిపోయేలా ఆకుపచ్చని కవచాన్ని ధరించినట్లుగా కాళిదాసు చెప్తాడు. అంటే ఆయన కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయని దీనిని బట్టి తెలుస్తుంది మనకి. పులులను, సింహాలను, అడవిపండులను యధేచ్చగా వేటాడాడు. ఖడ్గమృగాల కొమ్ములు నరికి వాటి పోగరు అణిచాడు. వేటలో వినోదించి అలసి సొలసి విశ్రమించాడు.

మరుసటిరోజు మరల వేటకి బయలుదేరతాడు దశరథుడు. తమసా నదీతీరంలో బుడబుడమని వచ్చిన శబ్దాన్ని విని ఏనుగు నీరు తాగుతున్న శబ్దంగా భావించి శబ్దభేది విద్యలో నేర్పరి అయిన దశరథుడు బాణాన్ని వదులుతాడు ఆదిశలో. రణభూమిలో తప్ప వేరెక్కడా ఏనుగుని చంపరాదనే ధర్మశాస్త్ర నియమాన్ని అతిక్రమించి అకృత్యానికి పూనుకున్నాడు. బాణం వదిలిన మరుక్షణమే ‘హా తండ్రీ’ అనే ఆర్తనాదం విని ఆ దిశగా వెళ్ళిన ఆతనికి బాణం గుచ్చుకున్న మునికుమారుడు కనిపిస్తాడు. ఆ ముని కుమారుని వారి తల్లిదండ్రుల వద్దకి తీసుకెడతాడు దశరథుడు.ఆ ముని దుఃఖించి క్రోధించి “నీవు వృద్ధాప్యంలో పుత్రశోకంతో మరణింతువని  శపిస్తాడు. ‘మహాత్మా!పుత్ర సంతానం లేని నాకు పుత్రుడు కలుగుతాడని మీ శాపం వలన తెలిసింది’ అంటూ  సంతోషిస్తాడు దశరథుడు.

వశిష్టుని సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం చేసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పుత్రులుగా పొందుతాడు దశరథుడు.నలుగురు పుత్రులతో నాలుగు దంతాల ఐరావతంలా, ఫలసిద్ధిలో చతురోపాయాలతో గూడిన నీతిలా, నాలుగు బాహువులతో ప్రకాశించిన శ్రీహరిలా ప్రకాశించినట్లుగా అభివర్ణిస్తాడు కాళిదాసు.

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు యుక్తవయస్కులై విద్యాభ్యాసాలు పూర్తి చేసుకున్నారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి యాగసంరక్షణకు రాముని తనతో పంపమని అడిగిన వెంటనే దశరథుడు అవసరమైతే తానే వస్తానని రాక్షస సంహారం బాలురవలన అయ్యే పని కాదని వేడుకుంటాడు.    చివరికి వశిస్టులవారు నచ్చజెప్పడంతో ఆయన వెంట పంపడానికి  సరేనంటాడు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెడుతుంటే సూర్యమార్గాన్ని అనుసరించే చైత్ర వైశాఖాల్లా ప్రకాశించారని కాళిదాసు వర్ణన. వాళ్ళు చేతులు కదుపుతూ నడుస్తుంటే వర్షాకాలంలో గట్లను తమ అలలతో కోస్తూ విస్తరిస్తూ ముందుకి సాగే నదులలా ఉన్నారట. దారిలో ఆకలి దప్పులు లేకుండా బలవర్ధకమైన బల,అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాడు విశ్వామిత్రుడు. దివ్యాస్త్రాలు పొందిన పిమ్మట తన ఆశ్రమానికి తీసుకెళతాడు విశ్వామిత్రుడు. అక్కడ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్న రాక్షసులను సంహరిస్తారు రామ లక్ష్మణులు.

ఇక్కడ మాత్రం కథలో కాస్త మార్పు కన్పిస్తుంది రామాయణానికి, రఘువంశానికి. మిథిలాధీశుడు అయిన జనకుడు ఒక యజ్ఞం తలపెట్టి విశ్వామిత్రునికి ఆహ్వానం పలుకుతాడు. ఆ రాజు వద్ద ఉన్న శివధనస్సుని చూడాలని రామలక్ష్మణులు ముచ్చట పడతారు. వారిని తీసుకొని మిథిలకు పయనమయ్యాడు విశ్వామిత్ర మహర్షి. దారిలో రాముని పాదధూళి  తాకిన రాయి శాపవిమోచనంతో అహల్యగా మారుతుంది. పురవీధుల్లో నడిచివేడుతున్న కొదమసింగాల వంటి రాకుమారులని ప్రజలంతా రెప్పలార్పే  సమయాన్ని  వృధా చేయకుండా తదేకంగా చూసారు. యాగం పూర్తి అయిన తరువాత శివధనుస్సు చూపమని అడుగుతాడు విశ్వామిత్రుడు జనకుని. రాముడు బాలుడు, కోమలమైన శరీరంతో ఉన్నవాడు. విల్లు వంచిన వారికే ఇచ్చి వివాహం చేస్తానని తాను ఎందుకు శపథం చేసానా అని బాధ పడతాడు జనకుడు. ఎందరో వీరులు ఎత్తలేని విల్లుని ఈ రాముడు ఎలా ఎత్తగలడని సందేహిస్తాడు జనకుడు. రాముని బలం నీకు తెలియదని విశ్వామిత్రుడు మందలిస్తాడు జనకుని. ఇంద్రధనువుని సృష్టించడానికి మేఘాలను ఆజ్ఞాపించినట్లుగా జనకుడు తన భటులను ఆజ్ఞాపించాడు శివధనువును తెమ్మని. యాగ మృగాన్ని వెంబడించే శరాన్ని ఈ ధనువునుంచే ప్రయోగించాడు శివుడు. ఆ తర్వాత ఆ ధనువును మరెవరూ వాడనందున ఆ విల్లు నిద్రిస్తున్న సర్పరాజులా ఉందంటాడు కాళిదాసు. అనేక మంది భటులు మోసుకొచ్చిన విల్లుని అవలీలగా అందుకున్నాడు రాముడు. మదనుడు పూల విల్లుని వంచి నారి కూర్చినట్లుగా ఆ శివధనువుకి అల్లెతాటిని కూర్చాడు రాముడు (ఎంత చక్కటి ఉపమానమో చూడండి. సౌందర్యానికి మదనుడితో సమానంగా రాముని పోల్చాడు). ఎక్కుపెట్టిన వెంటనే పిడుగులా ధ్వనిస్తూ ఫెళ్లుమని విరిగింది శివధనువు. ధనువు ముక్కలు కాగానే జనకుడి ముఖంలో ఆనండం తాండవించింది. వెంటనే దశరథునికి కబురు పెట్టాడు జనకుడు. కుమారుల క్షేమ సమాచారాలు విన్న దశరథుడు సంతోషించి మిథిలకు పయమవుతాడు కుమారులిద్దరినీ తీసుకొని. దశరథ జనకుల కలయిక ఇంద్ర వరుణుల కలయికను తలపించేదిగా ఉందంటాడు కాళిదాసు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి సీత,ఊర్మిళ, మండవి(మాళవి),శ్రుతకీర్తి లతో  వివాహం జరుగుతుంది….

స్వస్తి ….

4 thoughts on “రఘువంశము -2

  1. రఘు వంశం ఇప్పుడే చదివాను, కథ, అందులోని సన్నివేశాలు , కథా వర్ణన చాలా బాగుంది. రచయితకు అభివందనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031