March 29, 2024

అతడే ఆమె సైన్యం – 4

రచన : యండమూరి వీరేంద్రనాధ్  yandamoori

“అదీ భాబీ జరిగింది” పూర్తిచేశాడు ఇస్మాయిల్.

రంగనాయకి నిశ్శబ్ద రోదన ఆ గదిలో శబ్దాన్ని భయపెడుతూంది. చైతన్య మోకాళ్ళ మీద చేతులాన్చి మొహాన్ని అరచేతుల మధ్య దాచుకుని చాలాసేపు వుండిపోయాడు.

నిమిషం తరువాత ఆవేశంగా లేచాడు. “మొత్తం ప్రభుత్వాన్ని కదుపుతాను. నాకున్న పలుకుబడి అంతా ఉపయోగిస్తాను. డబ్బు వెదజల్లుతాను. నా తండ్రిని అక్కడనుంచి వెనక్కి రప్పిస్తాను.”

ఇస్మాయిల్ అడ్డంగా తలూపుతూ, “ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసింది. ఎందరో సీక్రెట్ ఏజెంట్స్‌ని పంపింది. కానీ, లాభంలేదు. అటువంటి సైంటిస్టు ఆ దేశానికి ఎంత అవసరమో, మన దేశానికి అతడు “దక్కకపొవటం” శత్రువులకి అంతే అవసరం. మనం ప్రభుత్వం మరీ ఎక్కువ వత్తిడి తెస్తే అతన్ని చంపేసి, రికార్డుల్లోంచి శాశ్వతంగా పేరు చెరిపెయ్యవచ్చు కూడా! జగదీష్ ఎప్పటికైనా నోరు విప్పుతాడన్న ఆశతోనే వాళ్ళు అతన్ని బ్రతికి వుండనిస్తున్నారు.”

“నేను వెళతాను. బాంబులు వేసి ఆ జైళ్ళు బ్రద్ధలు కొట్టయినా సరే, నా తండ్రిని వెనక్కు తెస్తాను.”

“అదంత సులభం కాదు బాబూ!నీ కన్నా సమర్థవంతులు, ఇటువంటి విషయాల్లో ఏంతో అనుభవం వున్న భారత గూఢచారులూ చాలా ప్రయత్నించి విఫలమయ్యారు.”

“అంటే… అక్కడికి చేరుకోలేకపోయారా? నా తండ్రిని కలుసుకోలేక పోయారా? ఆ జైళ్ళు అంత దుర్భేద్యమైనవా?”

దుర్భేద్యమైనవే. అయినా అదికాదు సమస్య.”

“మరి?”

“నీ తండ్రి నమ్మడు. అసలు మాట్లాడనే మాట్లాడడు. ఇండియన్ ప్రెసిడెంట్ స్వయంగా ఉత్తరం వ్రాసి సంతకం పెట్టి ‘ఇతడు మన సీక్రెట్ ఏజెంట్’ అని చెప్పినా, నువ్వు స్వయంగా వెళ్ళి ‘నేను మీ కొడుకునీ అని చెప్పినా నమ్మడు. ఇందులో ఆయన్ని తప్పుపట్టలేం. జరిగిన సంఘటనలు అలాంటివి. అనాడు సీతకోసం రాముడు పంపిన గుర్తులాంటిది ఏదైనా వుంటే తప్ప ఆయన్ని నమ్మించటం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అలాంటి గుర్తుని కూడా నమ్మడు.”

ఆ గదిలో చాలసేపు నిశ్శబ్దం తాండావించింది.

ముగ్గురూ ఏమీ తోచనట్టు అలాగే మౌనంగా వుండిపోయారు. చైతన్య పచార్లు చేస్తున్నాడు. చాల అసహనంగా, చిరాగ్గా, మధ్య మధ్యలో తనలో తానే ఏదో గొణుక్కుంటూ తల విదిలిస్తూ… నడుస్తున్నవాడల్లా చటుక్కున ఆగాడు.

అతడి దృష్టి తన తల్లిమీద పడింది.

తల్లి!!!

తన తండ్రి నమ్మే ఏకైక గుర్తు.

“నేను నాతోపాటు అమ్మని తీసుకు వెళతాను”

అతడు క్లుప్తంగా అన్న మాటలు అర్థం కావటానికి ఇస్మాయిల్‌కి క్షణాలు పట్టింది.

ఇస్మాయిల్ దిగ్భ్రమతో లేచాడు.

“ఏమిటి నువ్వంటున్నది?” అన్నాడు అయోమయంగా. ” ఆ కిరాతకుల మధ్యకి.. ఆ శతృ శిబిరాల్లోకి వృద్దురాలయిన నీ తల్లిని తీసుకు వెళతావా? మామూలు సీక్రెట్ ఏజంట్స్‌కే సాధ్యం కాని ఆ విషవలయంలోకి నీ తల్లితో కలిసి ప్రవేశిస్తావా?”

“అవును” దృఢంగా అన్నాడు చైతన్యవరప్రసాద్. అంతకన్నా వేరే మార్గంలేదు. “ఏం అమ్మా –  నువ్వేమంటావ్?”

రంగనాయకి తలెత్తి అన్నది- “ఆయన బ్రతికి వున్నారన్న ఒక్క మాటతోనే నా కడుపు నిండిపోయింది బాబూ! ఆయన్ని ఒక్కసారి చూడగలనన్న ఆశ తీరటంకోసం ప్రాణాలయినా అర్పించగలను.” అతడు వినటం లేదు. తల్లి  ఏం చెపుతుందో అతడికి తెలుసు. అతడి ఆలొచన అంతా, ఎలా అక్కడికి చేరుకోవటమా అని! ఈ విషయంలో ప్రభుత్వం నిస్సహాయమని అతడికి తెలుసు. శత్రుసైన్య శిబిరంలోకి ఒక సీక్రెట్ ఏజెంట్ వెళ్ళటమే కష్టం! దానికితోడు తల్లిని తీసుకెళ్ళడమంటే…

అసలు కలలోనయినా జరిగే విషయమేనా ఇది?

ఎలా ఆ దేశం వెళ్ళటం?

ఎలా ఆ సైనిక శిబిరాలని చేరటం?

చేరినా.. ఎలా లోపలికి తల్లితో సహా ప్రవేశించటం.

అజ్మరాలీ, ఖాన్‌లాంటి కిరాతకుల బారినుంచి ఎలా బ్రతికి బయటపడి తండ్రిని తీసుకు….

….అతని ఆలోచనలు అక్కడే ఆగిపోయినాయ్!

అ…జ్మ…రా…లీ…

ఆ పేరు స్ఫరణకి రాగానే వెంటనే జ్ఞాపకం వచ్చిన మరో పేరు…

ప్రనూష!

ఇద్దరి గమ్యమూ ఒక్కటే!

అవును! ప్రనూష తనకి సాయపడగలదు.

కొన్ని సంవత్సరాలుగా ఆమె అజ్మరాలీ మీద శోధనలు జరుపుతూ వుంది. వాళ్ళ గురించి అన్ని వివరాలు సేకరించింది. అజ్మరాలీని చంపటం కోసం జీవితాన్ని ధారపోసింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.  పట్టుదలే ఊపిరిగా బ్రతికింది. అటువంటి ఆమెకు తాను సాయపడితే?

ఆమె ఒంటరి యుద్దానికి తను సైన్యంగా మారితే?

ఆ ఆలొచన రాగానే అతడు లేచాడు.

ఒక కొత్త అధ్యాయానికి అది ప్రారంభం.

 

*                                  *                                  *

 

“ఇదేం ప్రపోజల్? నాకేం అర్థంకావటంలేదు” అంది ప్రనూష.  “నేను మిమ్మల్ని అడిగింది అజ్మరాలీని చంపటానికి నాకు సాయపడమని! మీ తండ్రిని వెనక్కు తీసుకురావటం అన్నది దానికి తోడయితే నాకేమీ అభ్యంతరం లేదు.. కానీ అందుకోసం మనతోపాటు మీ అమ్మగార్ని తీసుకు వెళ్ళటం అంటే… ఇదెలా సాధ్యం? నేను వూహించలేకపోతున్నాను.”

చైతన్య కోపం అణుచుకుంటూ అన్నాడు. “నేనూ వూహించలేకపోయాను… ఒక ఆడపిల్ల నన్ను పిచ్చివాడిగా ఆస్పత్రిలో చేరుస్తుందనీ, అటువంటి ఆడపిల్లతో మళ్ళీ చేతులు కలుపుతాననీ నేనూ వూహించలేకపోయాను. మనం వూహించలేదని జరగాల్సింది జరక్కపోదు. కాబట్టి నీ వూహేమిటో నాకనవసరం. నువ్వు నీ మాటల్లో “నాకేమీ అభ్యంతరం లేద”న్నావు. దీనిని బట్టి నువ్వేదో సైన్యాన్ని నడిపించే మహారాణివి అనీ, నేను నీ క్రింద పనిచేసే నౌఖర్ననీ నువ్వు భావిస్తూ వుంటే అది చాలా తప్పు. నేనిక్కడికి వచ్చింది కేవలం నీకు అక్కడి పరిస్థితులన్నీ తెలుసనే ఉద్దేశ్యంతో. నువ్వు కాదంటే నేను వెళ్ళి అక్కడినుంచి నా తండ్రిని విడిపించుకు రాగలను. పోతే కొంత ఆలస్యం అవుతుందంతే.”

ఇస్మాయిల్ మధ్యలో కల్పించుకుని “కలిసి పని చెయ్యవలసిన మీరిద్దరూ ఇలా మొదటినుంచీ దెబ్బలాడుకుంటే అసలు పని జరగదు. జరగవలసింది ఆలోచించండి” అన్నాడు.

“ఒక వృద్ధురాలు ఆ శత్రు సైనికి శిబిరాల్లోకి ప్రవేశించటం అసాధ్యం. ఆ విషయం ఆయనకి చెప్పండి” అంది ప్రనూష.

“ఒక స్త్రీ ప్రవేశించటం కూడా అసాధ్యమే. ఆ విషయం తను తెలుసుకుంటే మంచిదని చెప్పండి.”

ప్రనూష లేచి “సరే మీ యిష్టం.  మీ తల్లిగారిని తీసుకురండి. కానీ ఒక్క విషయం. అవకాశం దొరగ్గానే అజ్మరాలీని నేను చంపేస్తాను. అసాధ్యమైన పనుల కోసం నేను ఆగను. అది మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలించబోని కండిషను” అన్నది.

 

“నా కండీషను కూడా అదే. నా తండ్రి దొరగ్గానే నేను ఆ దేశం నుండి బయటపడే ప్రయత్నం చేస్తాను. అజ్మరాలీ మరణం వరకూ ఆగను. ఇది నా కండిషను.”

ఇస్మాయిల్ ఇద్దరివైపు చూస్తూ అనుకున్నాడు. “ఇంత ఎడమొహం, పెడమొహాలతో వీళ్ళు అసలు ఈ కార్యం సాధించగలరా?”

“మనం ఆ దేశం ఎలా వెళ్ళాలో నేను ప్లాన్‌చేసి వుంచాను” అంది ప్రనూష. “మీరొప్పుకుంటే రేపే బయల్దేరవచ్చు.”

“ఏం ప్లాన్‌చేసి వుంచావు?”

“హెలికాప్టర్ మాట్లాడాను. బోర్డరు సరిహద్దుల్లో మనల్ని అది దింపుతుంది. అక్కడనుంచి రహస్యంగా మనం బోర్డరు దాటుతాం.”

“నువ్వు ఇంగ్లీషు సినిమాలు బాగా చూస్తావనుకుంటానే?”

ఆమె మొహం రక్తవర్ణంతో ఎర్రబడింది. “ఏం నేనేమన్నాను?”

“బోర్డరు దాటి ఎక్కడికి వెళతాం? ఎలా వెళతాం? ఎంత దూరం వెళతాం? ఈ లోపులో ఆ సైనికులు మనని పట్టుకోరా? అక్రమంగా సరిహద్దు దాటామన్న ఒక చిన్న కారణం చాలు- మనల్ని ఉరితీయడానికి. అయినా ఆ అజ్మరాలీ వుండే ప్రదేశం, అదేనా తండ్రినిని వుంచిన జైలు ఎంత దూరం వుంది సరిహద్దుకి.”

“దాదాపు అయిదొందల కిలోమీటర్లు.”

“మరి? అయిదొందల కిలోమీటర్లు ఎలా వెళతాం? అదీ పాస్‌పోర్టు లేకుండా అనధికారంగా ఆ సైనికుల మధ్యలో?”

ఆమె సమాధానం చెప్పలేదు. అతనన్నాడు- “ప్రసావన వచ్చింది కాబట్టి ఇప్పుడే చెబుతున్నాను. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రతీ ప్లానూ నేనే వేస్తాను. నువ్వేమైనా సలహా యివ్వొచ్చు. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం నాదే.” అని ఆగి, అన్నాడు.

“ఒక గ్రూపుగా ఇక్కణ్ణుంచి విదేశాల్లో ప్రోగ్రాం యివ్వటానికి మనం వెళతాం. నేను ఎలాగూ నటుడినే కాబట్టి ఎవరికీ అనుమానం రాదు. ముందు ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మనం చేరవలసిన చోటుకి చేరుకున్న తరువాత మిగతా ప్లాను ఆలోచిస్తాం.”

“ఈ ప్లాను బాగానే వున్నట్టుంది.”

“ఈ ప్లాను గురించి నువ్వేమీ సర్టిఫికెట్టు ఇవ్వనవసరం లేదు.”

“మన గ్రూప్‌లో నా తరవు నుంచి డాక్టర్ పాల్ వుంటారు. మీకు గుర్తుందా? సైనిక శిబిరం నుంచి నన్ను తప్పించిన వ్యక్తి ఆయనే. సైన్యంలో పనిచేశాడు కాబట్టి ఆయన మనకి సాయపడవచ్చు.”

“కానీ అజ్మరాలీ అతడిని గుర్తుపట్టవచ్చు. దానివల్ల మొదటికే ప్రమాదం.”

“ప్రమాదం అంటూ వస్తే నాతోనే వస్తుంది. అజ్మరాలీ నన్ను బాగా గుర్తుపడతాడు. అందువల్ల పాల్‌ని మనతో తీసుకెళ్ళటం వల్ల కొత్తగా వచ్చే ప్రమాదం అంటూ ఏమీలేదు.”

చైతన్యకి ఆమె వాదన కరక్టే అనిపించింది. పాల్ సైన్యంలో పని చేశాడు. అనుభవం వుంది-అది తమకి పనికి రావొచ్చు. ఎలాగూ వెళుతున్నది ట్రూపే కాబట్టి అభ్యంతరం వుండే అవసరంలేదు. అప్పటికి నలుగురయ్యారు. చైతన్య, అతడి తల్ల్లి, ప్రనూష, డాక్టర్ పాల్.

“మీ కభ్యంతరం లేకపోతే నేనూ వస్తాను” అన్నాడు. ఇస్మాయిల్- “జగదీష్ ఎక్కడుంటాడో, ఆ యుద్ధఖైదీల నివాస ప్రదేశ వివరాలేమిటో నాకు బాగా తెలుసు. అదీగాక మా పూర్వీకులు ఆ దేశంనుంచి వలస వచ్చారు కాబట్టి నాకు బాగా తెలిసిన వాళ్లు అక్కడ కొందరున్నారు- వాళ్ళ సహాయం మనకి అవసరం పడవచ్చు.”

ప్రనూష చైతన్య వైపు చూసింది.

అంతలో పక్కగదిలో ఫోన్ మ్రోగింది. ప్రనూష వెళ్లి మాట్లాడి “చైతన్యా! మీకు ఫోన్” అంది. చైతన్య పక్కగదిలోకి వెళ్ళేసరికి రిసీవర్ పెట్టేసి వుంది. చైతన్య ఆశ్చర్యంగా చూశాడు.

ఆమె నవ్వి, “ఫోన్ నా మిత్రురాలి నుంచి నా కోసం. నేను మాట్లాడి పెట్టేశాను. ఇప్పుడు మిమ్మల్ని పిలిపించింది ఇస్మాయిల్ మనతో రావటం గురించి ఒంటరిగా మీతో చర్చించటానికి” అంది. ఆమె అనుమానం చైతన్యకి అర్థమైంది. ఇస్మాయిల్ “ఆ” దేశానికి సంబంధించినవాడు. ఇప్పుడతనిని తమతో తీసుకువెళ్ళటం ప్రమాద హేతువేమోనని ఆమె ఆలోచిస్తున్నది. దానితో చైతన్య అన్నాడు- “ఇస్మాయిల్ భారతదేశ సైన్యంలో పని చేసినవాడు. మనదేశం అతనిమీద పెట్టిన నమ్మకం మనకి అతనిమీద వుండకపోవటం తప్పు.”

“కానీ అతడు కొంతకాలం విదేశీ జైల్లో వున్నాడు. అతడు అక్కడినుంచి ఎలా బయటకు వచ్చాడో మనకి తెలీదు. పైగా అజ్మరాలీ తెలివితేటలు నేను స్వయంగా చూశాను. మీ తండ్రిగారితో నిజం చెప్పించటానికి అతడు ఖాన్ అనే అనుచరుడికి వరుణ్ అన్న పేరుపెట్టి భారతదేశపు ఏజెంట్‌గా నాటకం ఆడించాడు. గుర్తుందా?”

చైతన్య తలూపాడు. ఆమె కొనసాగించింది.

“అన్ని నక్క జిత్తులు నటింపజేయగల అజ్మరాలీ ఈ ఇస్మాయిల్‌ని మన దగ్గరకు ఎందుకు పంపి వుండకూడదు?”

“నా తండ్రి ఎటువంటి పరిస్తితుల్లోనూ నిజం చెప్పటం లేదనీ, అతడిని స్వయంగా ఎంత బాధపెట్టినా లాభంలేదనీ, నా తల్లిని ఈ వుచ్చులోకి లాగటం కోసం అజ్మరాలీ ఈ నాటకం ఆడాడంటావా? నా తల్లిని చిత్రహింసలు పెట్టటం ద్వారా ఈ రహస్యం నా తండ్రినుంచి బయట పెట్టించటం కోసం ఇస్మాయిల్‌ని పంపించాడంటావా?”

తను చెప్పదలుచుకున్నది అతడు సరిగ్గా గ్రహించినట్టు తలూపింది. అతడొక క్షణం ఆలోచించి అన్నాడు.

“ఇది నిజం కాకపోవచ్చు. ఇస్మాయిల్ గురించి నేను ఎంక్వయిరీ చేశాను. యుద్ధఖైదీల మార్పిడిలో అతడు మనదేశం వచ్చి సంవత్సరం కావొస్తుంది. నా తల్లిని పరాయి దేశానికి తీసుకువెళ్ళటానికి వచ్చిన గూఢచారి అయితే సంవత్సరం పాటు ఊరుకోడు. వెంటనే మమ్మల్ని చేరుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంకో ఉదాహరణ ఏమిటంటే అతడు ఒకరోజు మా తల్లిని వెతుక్కుంటూ వచ్చి లోపల ప్రవేశం కోసం మా బంధువునని చెప్పాడు. అలా చెప్పినవాడు ఆ విషయం మర్చిపోయి ఆ రోజు శుక్రవారం అవటంతో హాలు మధ్యలో నమాజ్ చేస్తూ నా సెక్రటరీకి దొరికిపోయాడు. అతడు నిజంగా గూఢచారి అయితే ఇంత చిన్నచిన్న తపు చేయడు. ముఖ్యంగా అతడు మనదేశం వచ్చి సంవత్సరం ఆగటం అన్నది అన్ని అనుమానాల్నీ దూరం చేస్తూంది.” ప్రనూష అతనివైపు మెచ్చుకోలుగా చూసింది. తను కేవలం ఆలోచించిందంతే. అతడు ఆలోచించి వూరుకోకుండా దాని గురించి ఎంక్వయిరీ చేసి కొన్ని నిజాలు సేకరించి ఒక అభిప్రాయానికి వచ్చాడు. దూరదృష్టి, ప్రాక్టికాలిటీ ఒకేచోట కలిసిన మనిషి యితడు. తన ఎంపిక తప్పు కానందుకు ఆమె సంతోషించింది. ఆ ఉత్వాహంలో” మనం ఎప్పుడు బయల్దేరుతున్నాం?” అని అడిగింది.

“సరిగ్గా ఈ రోజునుంచి ఆర్నెల్ల తరువాత.” ఆమె భరించలేనంత విస్మయంతో “ఆర్నెల్ల తరువాతా?” అంది.

“అవును. అన్నాడు చైతన్య. “మనం వెళుతున్నది మామూలు పనిమీద కాదు.. ఎన్నో ప్రమాదాల్ని ఎదుర్కోవాలి. ఎంతోమందితో తలపడవలసి రావచ్చు. నేను ఏ పనిమీద వచ్చానో తెలుసుకోవటం కోసం విదేశీ సైన్యం నన్ను చిత్రహింస పెట్టవచ్చు. వీటన్నిటికీ నేను తట్టుకోవాలి మిమ్మల్ని వదిలి నేను ఆ పద్యవ్యూహంలోకి ప్రవేశించాక ఏ సాలెగొడులో ఇరుక్కుంటానో-దానికిముందే సర్వవిధాల ప్రిపేర్ అయ్యి వుండాలి కదా?”

కొంచెం ఆగి కొనసాగించాడు.

“షూటింగ్‌లో పాల్గొనడానికి శరీరాన్ని కంట్రోల్‌లో వుంచుకోవటం వేరు. యుద్ధానికి బయలుదేరే ముందు తీసుకోవలసిన ట్రైనింగ్ వేరు.”

ఆమెకు అపుడు అర్థంకాలేదు.

అర్నెల్లపాటు అతడిని గమనించాక అర్థమైంది.

అది ట్రైనింగ్ కాదు.

తపస్సు!

చేతిలో వున్న షూటింగ్‌లు నెలరోజుల్లో పూర్తి చేశాడు.

తరువాత దీనిమీద ఏకాగ్రత నిలిపాడు. రోజుకి నాలుగు గంటలపాటు ఎక్సర్సైజు. సముద్ర తీరంలో పరుగెత్తటం-గంటల తరబడి అరచేతుల్ని చేతులమీద కొట్టటం-ఒక మిషన్‌లా తయారయ్యాడు. మెడిటేషన్ మనిషికెంత సాయపడుతుందో ఆమె పుస్తకాల్లో చదివింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది. జలపాత ప్రవాహపు ధార నెత్తిమీద పడుతూంటే ఒంటికాలిమీద నిలబడటం, ప్రొద్దున్న నాలుగింటికి లేచి రెండు గంటలపాటు జాగింగ్ చేయటంతో అతడి దినచర్య ప్రారంభమయ్యేది.

చైతన్య అకస్మాత్తుగా తన చిత్రాల్ని తగ్గించుకోవటం పరిశ్రమలో కలవరం రేపింది. అసలు కారణం తెలిసినవారు నలుగురే. చైతన్య, ప్రనూష, ఇస్మాయిల్, రంగనాయకి.

ఆ ఆర్నెల్లూ రంగనాయకి మానసిక స్థితి వర్ణనాతీతం.

నుదుట కుంకుమ ధరించే అవకాశం లేదు. అది రకరకాల అనుమానాలకి దారితీస్తుందని ఆమె బొట్టు పెట్టుకోలేదు. మరో వైపు అక్కడ శతృ శిబిరంలో భర్త ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో అన్న వేదన. భర్త గురించి తెలియకపోవటం వేరు. భర్త మరణించలేదనీ, సంవత్సరం క్రితంవరకూ బ్రతికే వున్నాడని తెలిసి ఇప్పుడు ఎలా వున్నాడో తెలియకపోవటం వేరు. ఈ అయోమయ స్థితిలో ఆమె ఆర్నెల్లు నరకయాతన అనుభవించింది.

ఆ ఆర్నెల్లలో చైతన్య శరీరంలో వచ్చిన మార్పు ప్రనూషనే ఆశ్చర్యంలో నింపింది. అతడి శరీరం ఉక్కులా మారింది. ముఖంలో కొత్త వర్చస్సు వచ్చింది.

కళ్ళు మరింత తీక్షణతని సంతరించుకున్నాయ్.ఇతరులతో మాట్లాడటం పూర్తిగా తగ్గించాడు. ప్రనూష దగ్గర వున్న వివరాలన్నీ దాదాపు కంఠతా వచ్చాయతడికి. భారతదేశం నుంచి డాన్స్‌ ట్రూప్ విదేశాల్లో నెలరోజులపాటు ప్రోగ్రామ్స్, యివ్వటానికి ప్రభుత్వం అనుమతి యిచ్చింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ మొదలయిన పట్టణాల్లో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. చైతన్య లాంటి స్టార్ ఈ దేశం తరపున వెళ్ళటం అభిమానులకు చాలా సంతోషాన్నిచ్చింది. అసలు కారణం ఎవరికీ తెలీదు.

“మనతోపాటు పిస్టల్ లాంటి ఆయుధాలు తీసుకువెళ్ళొద్దు. అక్కడికెళ్ళి వాటిని కొనుక్కుందాం. ఆ దేశంలో మనకి కావలసినంత విదేశీ కరెన్సీ కోసం నేను ఎర్పాటు చేశాను. దాని సంగతి సరే, నువ్వు మాత్రం నీ ఆకారం, మేకప్ అన్నీ పూర్తిగా మార్చుకోవలసి వంటుంది. ఏ సందర్భంలోనైన అజ్మరాలీ మనకు తారసపడవచ్చు. అతడు నిన్ను గుర్తుపట్టకూడదు.” ఆమె తలూపింది. ఇంకో పదిరోజుల్లో ప్రయాణమనగా అతడి తల్లి అతడిని అడిగింది-“చైతన్యా! మనతో పాటు ఎవరొస్తున్నార్రా?” చైతన్య చెప్పాడు డాన్సర్స్, బాకీ ట్రూప్, మానేజర్ వగైరా. “నా తరపు నుంచి నేను ఒకర్ని తీసుకురావచ్చా బాబూ!” అడిగింది.

చైతన్య తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో “ఎవరమ్మా?” అన్నాడు. అతడికి ఆమె చెపుతున్నది కొంచెంసేపు అర్థంకాలేదు. ఇదేదో చిన్నపిల్లల వ్యవహారంలా తల్లి భావిస్తున్నదేమో అని కూడా అతడు అనుకున్నాడు. మనం వెళుతున్నది పిక్నిక్‌కి కాదమ్మా అని అందామనుకుని మళ్ళీ తల్లి బాధపడుతుందేమో అని వూరుకున్నాడు.

అక్కడే అతడు తప్పుగా ఆలోచించాడు. అతడికి తెలియని కథ వెనుక వేరే వుంది. తాము ప్రవేశిస్తున్నది, మృత్యుముఖంలోకి అని ఆమెకి తెలుసు. తన భర్తకోసం ఆమె దాన్ని చిరునవ్వుతో స్వీకరించింది. కొడుకుని కూడా ఆయత్తం చేసింది. ఎ ప్రయత్నంలో ఇద్దరి ప్రాణాలు పోయే అవకాశం వుందని తెలిసినా ఆమె వెనుదీయలేదు. లక్ష్మిని మాత్రం ఏం చేయాలో ఆమెకు తెలీదు. నెలరోజులపాటు విదేశీ టూర్‌కు వెళ్తున్నారని తెలియగానే లక్ష్మి ఆమె వద్ద చేరి తాను కూడా వస్తానన్నది. రంగనాయకి ఎంత చెప్పినా వినలేదు. చివరికి రంగనాయకి ఆ అమ్మాయికి మొత్తం కథంతా చెప్పింది. అలా చెప్పటంలో ప్రమాదం ఏమీ కనపడలేదు. వాళ్ళు ఏ పనిమీద వెళుతున్నారో తెలిశాక లక్ష్మి పట్టుదల మరింత ఎక్కువ అయింది. తనని కూడా తీసుకువెళ్తామని మాట ఇచ్చేదాకా వదలలేదు. అందుకే రంగనాయకి కొడుకు మీద ఇంత వత్తిడి తీసుకు వచ్చింది. చైతన్య ఒప్పుకున్నాడు.

అక్కడివరకూ వెళ్లాక తను ఎలాగూ ట్రూప్ నుంచి విడివడి ట్రూప్‌ని వెనక్కి పంపించి వేస్తాడు. లక్ష్మి రావటంలో అభ్యంతరం ఏమీలేదు. తాము ఏ పనిమీద వెళుతున్నామో రంగనాయకి లక్ష్మికి చెప్పేసిందన్న సంగతి చైతన్యకి తెలీదు.

 

11

 

వెల్‌కమ్! వెల్‌కమ్ టు అవర్ కంట్రీ” విదేశాంగమంత్రి నవాబ్ ఆలీఖాన్ చేయి సాచుతూ అన్నాడు. భారత రాయబారి కూడా విమానాశ్రయానికి వచ్చాడు. దాదాపు ఇరవై మంది ట్రూపు. ప్రముఖుల్ని చైతన్య పరిచయం చేశాడు. డాక్టర్ రాయన్, ఇస్మాయిల్, సుబ్బరాజు తన తల్ల్లి, లక్ష్మి, ప్రనూ… తనని రిసీవ్ చేసుకోవటం కోసం భారత రాయబారి రావటం గర్వంగా అనిపించింది చైతన్యకి. అతడికి బాగా ఆశ్చర్యంగా అనిపించింది మాత్రం ప్రనూష ఆకృతిలో చేసుకున్న మార్పు. ఆమెని భారత దేశంలో చూసినవారు ఇప్పుడు చూస్తే వెంటనే గుర్తుపట్టలేరు. ఆ విషయంలో చైతన్య చాలా సంతృప్తిగా ఫీలయ్యాడు. ఆ సాయంత్రం ఇండియన్ ఎంబసీ వారిచ్చిన డిన్నర్‌లో పాల్గొనారు. ఆ దేశంలో పనిచేసే భారత రాయబారి పేరు శ్రీవాత్సవ. చాల కలుపుగోరు మనిషి. తమిళుడు. “మా పిల్లలందరూ మీ ఫాన్సు. దాదాపు మీ చిత్రాలన్నీ తమిళంలోకి డబ్బింగ్ అవుతాయనుకుంటాను.”

“అవుతాయి. కానీ ఈ దేశంలో మీకు ఎక్కడ దొరుకుతాయి అవి?”

“స్మగ్లింగ్. భారతదేశంలో తయారయ్యే ప్రతిదీ దాదాపు ఇక్కడికి స్మగుల్డ్ అవుతుంది. పూర్వం ఇక్కడి ప్రొడ్యూసర్లు కేవలం హిందీ సినిమాలు మాత్రమే చూసి కాపీ కొట్టేవారు. ఇపుడు దక్షిణ భారతదేశపు సినిమాలు కూడా చూస్తున్నాను… పనికొస్తాయేమోనని.”

“మా వాళ్ళూ తక్కువ తినలేద్లేండి. మంచి పాకిస్తానీ కథ దొరుకుతే క్షణాల్లో అది మనదేశంలో సినిమాగా తయారవుతుంది” సంభాషణ కొనసాగిస్తూ అనాడు. ఆ సాయంత్రం భారత రాయబారి ఆ ట్రూప్‌కి విందు యిచ్చాడు. విదేశీయిలు కూడా వచ్చారు. “ఈ రెండు దేశాల సంబంధాలు ఎలా వున్నాయి?” అడిగాడు చైతన్య.

“పైకి చాల సుహృద్భావంతో వున్నట్టు వుంటారు. కానీ ఎవరి ప్లాన్స్ వారికి వుంటాయి. నిర్మొహమాటంగా చెప్పాలంటే పక్కదేశంతో వైరం ఎల్లప్పుడూ కొనసాగాల్సిందే. రాజకీయాలకి అది ముఖ్యం. అప్పుడే ప్రజలు స్వదేశీ సమస్యలు కొంత వరకూ మర్చిపోతారు.”

“మళ్ళీ యుద్ధం వస్తుందంటారా?”

“బహుశా ఇప్పట్లో రాదు. పాకిస్తాన్ తన వ్యూహం మార్చుకుంది. డైరెక్టు యుద్ధం కాకుండా- సరిహద్దు రాష్ట్రాల్లో కల్లోలం రేపటం ద్వారా అలజడి సృష్టిస్తూంది. మన దేశం బంగ్లాదేశ్‌ని విడగనొట్టింది. ఆ ప్రతీకారం తీర్చుకోవటం కోసం అని ఆ దేశం వాదన… పైకి చెప్పకపోయినా వారి వుద్దేశ్యం అదే.”

“భారతదేశం నుంచి రాష్ట్రాలు విడిపోతే అది పక్కదేశానికి ఏం లాభం?”

“చాలా లాభాలున్నాయి. ఇన్‌కంటాక్స్. రైల్వే, విమాన,(విదేశీ యాత్రికుల) రెవిన్యూ తగ్గిపోయి-సెంట్రల్ బలహీనం అవుతుంది. అసలివన్నీ పక్కన వుంచండి. ఎవరూ ఊహించని ప్రమాదం మరోవైపు నుంచి వస్తూంది. మన దేశంలో ఫామిలీ ప్లానింగ్ పట్ల మనవాళ్ళు బాగా మొగ్గుచూపుతున్నారు. యాభై సంవత్సరాల తర్వాత హిందూ జనభా నిష్పత్తి బాగా తగ్గిపోతుంది. ఈ విషయం చాలమంది గుర్తించటంలేదు.”

“మీరు బి.జె.పి.ని సపోర్టు చేస్తున్నాట్టున్నారే? నవ్వుతూ అన్నాడు చైతన్య.

“కాదు. ఉన్న విషయాలు చెబుతున్నాను. నిజానికి ఒక రాయబారిగా నేనీ విషయాలన్నీ మాట్లాడగూడదు. కానీ ఇవన్నీ గుండెలు మండిపోయే విషయాలు. మతంకన్నా దేశం ముఖ్యం అనే భావం మనుషుల్లో కలగడం లేదు. అదే బాధ.

“యుద్ధం వస్తే చాలామంది పట్టుబడతారు కదా. వారినేం చేస్తారు?” టాపిక్‌ని జాగ్రత్తగా తనకి కావలసిన మార్గంలోకి తీసుకొస్తూ అన్నాడు చైతన్య.

“రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. కొంత మందిని చంపేస్తారు. పరస్పరం యుద్ధఖైదీల్ని మార్చుకోవటం కూడా జరుగుతుంది.”

“మన సైనికులు ఇంకా ఎవరయినా వున్నారా బందీలుగా-”

“ఇప్పుడా? ఇప్పటికివరకూ ఎవరుంటారు? యుద్ధం జరిగి చాలా సంవత్సరాలయిందిగా?”

“సరిహద్దు దాటుతూ పట్టుబడినవాళ్ళు వుండవచ్చు. గూఢచారి చర్యలు సాగిస్తూ దొరికిపోయిన వాళ్లు వుండవచ్చు. లేదా యుద్ధంలో దొరికి తిరిగి మన దేశానికి ఇవ్వటానికి వీలులేని మేధావులు వుండొచ్చు.”

“కరెక్టే. వాళ్ళని రహస్యంగా జైళ్ళలోనే వుంచుతారు. ముఖ్యంగా మీరు చివర్లో చెప్పిన మేధావుల వివరాలయితే అసలు తెలియనివ్వరు. వాళ్ళు బ్రతికి వున్నట్టు, ఖైదీలుగా వునట్టు, మనకు తెలుస్తుంది. కానీ మనం ఏమీ చేయలేము. ఆ పేరుగల వ్యక్తి అసలు మాకు దొరకలేదని వాదిస్తారు.”

“అలాంటి కేసులు ఏమైనా వున్నాయా.”

“ఉదాహరణకి జగదీష్ అనే రాడార్ స్పేషలిస్ట్ ఒకాయన వుండేవారు.”

చైతన్య మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. ఆవేశాన్ని ఉత్సుకతనీ అతికష్టంమీద కంట్రోల్ చేసుకొని మామూలుగా కనపడటానికి ప్రయత్నించాడు. “ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం అతడు శత్రుసైన్యానికి చిక్కాడు. అతడు బందీగా ఉన్నట్టు మన సైనికులు చెప్పారు. కానీ మనం ఏమీ చెయ్యలేకపోయాం. ఐక్యరాజ్యసమితి కూడా ఏమీ సాధించలేక పోయింది”

“మన గూఢచారులు?”

“అవన్నీ సినిమాల్లోనే సాధ్యం. ఆ జైళ్ళలోకి వెళ్ళటమే సాద్యంకాదు. మనం ఎక్కువ వత్తిడి చేస్తే జగదీష్‌ని చంపేసే ప్రమాదం కూడా వుంది. అందుకని ఇక ఆ ప్రయత్నం విరమించుకుంది మన ప్రభుత్వం.”

“జగదీష్ బ్రతికే వున్నాడని రూఢీగా తెలిసిందా?” కంఠం క్యాజువల్‌గా వుంచుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

“తెలీదు. ఈ మధ్యకాలంలో ఖైదీలెవరూ విడుదల కాలేదు. అందువల్ల అతడి వివరాలు బయటకు రాలేదు” అంత కన్నా ఎక్కువ ప్రశ్నలడిగితే అనుమానం వస్తుందని టాపిక్ మార్చేశాడు చైతన్య.

రెండు రోజుల తర్వాత వాళ్లు తమ మొదటి ప్రోగ్రాం ఇచ్చారు. ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ఒక గొప్ప డాన్స్ డైరెక్టర్ చేత మద్రాసులో ప్రత్యేకంగా కొరియోగ్రఫీ తయారు చేయించాడు చైతన్య. ఆ బాలేలో అతడితోపాటు లక్ష్మీ, పదిమంది డాన్సర్లు, ప్రనూష పాల్గొనారు. రంగనాయకి ముందు వరుసలో కూర్చుంది. ఆమె మనసిక్కడలేదు. ఎప్పుడు భర్తని కలుసుకోగలనా అని తపించిపోతూంది. అయినా అంత ఉద్వేగంలో కూడా కొడుకు నాట్యం చూసి చలించింది. తెరమీద చూడటమే తప్ప చైతన్య అంతబాగా డాన్స్ చేయగలడని ఆమెకి తెలీదు. ఈ కార్యక్రమం పట్ల సంతోషించని వ్యక్తి ఎవరయినా వుంటే అది ప్రనూషే. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. అనవసరంగా సమయం వృధా అవుతుందని ఆమె వుద్దేశ్యం. ప్రోగ్రాం పూర్తయాక చైతన్య గ్రీన్‌రూమ్‌వైపు వెళుతుంటే ఒక వ్యక్తి అతడిని ఢీకొన్నాడు. పొడవుగా, లావుగా వున్నాడు. కనీసం సారీ కూడా చెప్పలేదు. బొంగురు గొంతుతో “ప్రోగ్రాం బావుంది” అన్నడు పొడిపొడిగా. చైతన్య భుజానికి బలంగా తగిలింది దెబ్బ. ఆ నొప్పి ఓర్చుకుంటూ “థాంక్స్” అన్నాడు.

మరో రూమ్‌లో ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు ప్రనూషని నిలువెల్లా పొగడ్తలతో అభినందిస్తున్నారు. చైతన్య అక్కడికి ఏరుకున్నాడు. “మీరు మా క్యాంప్‌లో కూడా ప్రోగ్రాం ఇస్తే సంతోషిస్తాం” ఒక ఆఫీసర్ అడిగాడు.

“తప్పకుండా” అన్నాడు చైతన్య.  “మీ పై అధికారుల్నించి అనుమతి తీసుకోండి.”

“ఆయనే దీన్ని అడగమన్నారు. మాది ఈస్ట్రన్ సెక్టార్.”

ప్రనూష చప్పున చైతన్య వైపు చూసింది. చైతన్య ఆమెకి మాత్రమే తెలిసేలా నవ్వేడు. ఆమెకు అర్థమైంది వాళ్ళని ఈ ప్రోగ్రాంకి పిల్చింది కూడా అతనేనని ఊహించింది. చదరంగంలో మొదటి ఎత్తు ఆ విధంగా పూర్తయింది. ఆమెకు పట్టలేనంత సంతోషం కలిగింది. చైతన్య వాళ్ళతో ఏ యే తేదీల్లో వీలవుతుందో చెపుతున్నాడు. సైన్యంలో ఉన్నతాధికారులకి కుటుంబాల్తో సహా చూడటానికి ఒక ప్రోగ్రాం. సైనికులకి విడిగా ఒక ప్రోగ్రాం ఇస్తే బావుంటుందని అంటున్నాడు. రెండు దేశాలమధ్య మంచి బాంధవ్యం నెలకొనటానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ సాయపడతాయని భారత రాయబారి చెబుతున్నాడు. ఆమె అదేమీ వినటంలేదు. దాదాపు ఈ అపరేషన్ పూర్తయినట్టే.

“నిన్నెక్కడో చూసినట్టుందే?”

ఆమె వెనుకనుంచి వినపడింది కంఠం. ఆమె వెనక్కిచూసింది. ఇస్మాయల్‌ని ఎవరో ప్రశ్నిస్తున్నారు.

ఆమె వెన్నులోంచి జలదరింపు ఒళ్ళంతా పాకింది.

ఆ కంఠం ఆమెకి పరిచితమే!

నిద్రలోనయినా గుర్తుపట్టగలదు.

ఆమె చప్పున మొహం తిప్పుకుని స్తంభం పక్కకి తప్పుకుంది.

చైతన్య ఇదంతా గమనిస్తూనే వున్నాడు.

ఉన్నట్టుడి ప్రనూష ఆ విధంగా ఎందుకు భయపడిందో అర్థంకాలేదు. అతడి అనుమానాన్ని నివృత్తి చేయటానికా అన్నట్టు ఇంతలో ఒక ఆఫీసర్ “మిస్టర్ చైతన్యా” అని పిలిచాడు. చైతన్య అటు చూశాడు.

అతడిని గ్రీన్‌రూమ్ దగ్గర ఢీకొన్న వ్యక్తిని పరిచయం చేస్తూ “ఈయన మా చీఫ్-అజ్మరాలీ” అన్నాడు ఆఫీసర్.

ఒక్కసారిగా ఆ హాలంతా చల్లబడినట్లు అనిపించింది చైతన్యకి. ఇలాంటి సమయం వస్తుందని తెలుసుగానీ మరీ ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అప్రయత్నంగా చేయి సాచాడు.

ఎదుటి మనిషి అజానుబాహువు. మొహంలో క్రూరత్వం నిండి వుంది. అదో రకమైన సాడిస్టిక్ నవ్వు. వికృతంగా వుంది. చైతన్యతో చేయి కలిపి కూడా అతడు ఇస్మాయిల్‌నే చూస్తున్నాడు.

“ఎక్కడ చూశాను నిన్ను?” మళ్ళీ అడిగాడు.

ఇస్మాయిల్ ఏం చెప్పాలో తోచనట్టు చైతన్యవైపు చూశాడు. ఆ బాధ్యతను తను తీసుకున్నాడు చైతన్య

“అతడి పేరు ఇస్మాయిల్. నా సెక్రటరీ” అన్నాడు. “పూర్వం సైన్యంలో పనిచేశాడు.”

అజ్మరాలీ మొహం విప్పారింది.”కరెక్ట్. మేం యుద్ధంలో బంధించాము ఇతడిని. తర్వాత మీ దేశానికి వదిలేశాం! అఫ్‌కోర్స్ చాలామందిని అలా వదిలేశామనకో. అబ్బో ఆ రోజుల్లో వేల సంఖ్యలో దొరికారు మీ సైనికులు.”

చైతన్య మొహం ఎర్రబడింది. సరి అయిన సమాధానం చెపుదామనుకున్నాడు. కానీ అది సమయం కాదని వూరుకున్నాడు.

ఈ లోపులో మరో ఆఫీసర్ అజ్మరాలితో “సార్! మీరు చాలా బాగా డాన్స్ చేసిందని మెచ్చుకున్నారు ఈ అమ్మాయే” అన్నాడు. ఆ మాటలకి స్థంభం వెనుకనుంచి ప్రనూష బయటికి రాక తప్పలేదు.

రక్తం యింకి తెల్లగా పాలిపోయిన మొహంతో ప్రనూష ముందుకి అడుగువేసింది.

అజ్మరాలి ఆమెవైపు తిరిగాడు.

చైతన్య ఊపిరి బిగపట్టాడు.

గ్రీన్ రూమ్‌లోంచి పడుతున్న వెలుతురు ఆమె మొహం మీద ప్రతిబింబిస్తూంది.

ప్రనూష వేరే గెటప్‌లో ఉంది. అయినా సరే పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె అజ్మరాలీ వైపు కన్నార్పకుండా చూస్తోంది. ఆ చూపులో, వీలైతే అతడిని అక్కడిక్కడే చంపేద్దామన్నంత కసి కనబడుతోంది. ఆమె ఆ భావాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చేయటంలేదు. చైతన్యకి ఆమె అక్కడినుంచి తొందరగా వెళ్ళిపోతే బావుణ్ణు అనిపిస్తోంది. ఆమె మాత్రం అటువంటి ప్రయత్నం చేయకుండా నవ్వుతూ “మా ప్రోగ్రాం మీకు నచ్చిందా?” అంది.

“అద్భుతం. నిజంగా అద్భుతం” అన్నడు. అతడి కళ్ళల్లో కాంక్ష స్పష్టంగా కనిపిస్తూంది. చైతన్యకి సంతృప్తి కలిగింది… అతడి కళ్ళల్లో కాంక్ష మాత్రమే వుంది. అనుమానం లేదు. అందుకు…!” ఈ లోపులో అజ్మరాలీ ప్రనూష భుజంమీద చేయి వేసి దూరంగా తీసుకెళ్ళాడు. చూసేవాళ్ళకి అది, ఒక తండ్రి తన కూతుర్ని దగ్గరగా చేయివేసి తీసుకెళ్ళినట్టు వుంటుందిగానీ, అందులో కాంక్ష సునిశితమైన దృష్టి వున్నవాళ్లకి వెంటనే అర్థమవుతుంది. ఇలాంటి చర్యలు వయసు మీరిన దేశనాయకుల్లోనూ, మఠాధిపతుల దగ్గరా, వృద్ధ నటుల విషయంలోనూ గమనించవచ్చు.

అయితే చైతన్య ఇదంతా ఆలోచించటంలేదు. ఆమెతో అతడు ఏం మాట్లాడుతున్నాడా అన్న అనుమానంతో చైతన్యగుండె వేగంగా కొట్టుకుంటూంది.

“అమ్మాయ్! నువ్వు మా సెక్టార్ కొచ్చి మా సైనికులకి నీ అపురూపమైన నాట్యం చూపించాలి.”

“మీ క్రింద ఆఫీసర్లు అడిగారు. సరే అన్నాను” అంది ప్రనూష. భుజంమీద పాములా పడిన చెయ్యిని తొలగించే ప్రయత్నం చేస్తూ.

“రెండు మూడు రోజుల్లో ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాము.”

ఆమె తెల్లబోయి, “రెండు మూడు రోజుల్లోనా? మాకు రావల్పిండిలో ప్రోగ్రామ్స్ వున్నాయే” అంది. అతడు తెలిగ్గా, “కాన్సిల్ చేయిద్దాం” అన్నాడు.

అతడి మాటల్లో “మా దేశంలో సైన్యం తల్చుకుంటే చేయలేనిది ఏముంది?” అన్న అర్థం ధ్వనించింది.

ఆమె క్లుప్తంగా, “సరే మీ యిష్టం” అంది. ఆమె వెనుదిరిగి వస్తూంటే, “అమ్మాయ్ నీ పేరు” అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేకుండా “ఝాన్సీ” అని అక్కడినుండి వచ్చేసింది.

ఆమె దగ్గరకి వచ్చాక చైతన్య అడిగాడు. ఆమె జరిగినదంతా చెప్పింది.

“అతడికే మాత్రమూ అనుమానం రాలేదంటారా?”

“రాలేదు. ఆ విషయం నేను నిశ్చయంగా చెప్పగలను.”

అతడు మరి రెట్టించలేదు.

హొటల్ కొచ్చేసరికి పదకొండు దాటింది.

మరుసటిరోజు ప్రొద్దున ఎనిమిదింటికి ప్రనూషకి ఎవరో విజిటర్ వచ్చాడని కబురొచ్చింది. అంతలోనే తలుపు లోపలకి రావటం కూడా చూసింది. ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. ఆ వచ్చింది అజ్మరాలీ! అది పంచతార హోటల్ కాబట్టి ముందు వేరే సిటౌట్ వుంది. అక్కడ కూర్చుని ఆమెకోసం ఎదురు చూస్తున్నాడు అతడు. ఆమెకి పాలుబోలేదు. తన రూమ్‌నుంచి చైతన్యకి ఫోన్ చేసింది. “ముందుగదిలో అజ్మరాలీ కూర్చుని వున్నాడు. నిన్నంటే పూర్తి మేకప్‌లో వున్నాను కాబట్టి తెలియలేదు. ఇప్పుడు ఇబ్బంది వస్తుందేమో” అంది.

“ఫేషియల్‌కి ముందు మొహానికి వేసుకునే ‘ఫేమ్’ లాటిది రాసుకో, ఒక గంటవరకూ దాన్ని తీయటానికి వీలుపడదని ఇబ్బందిగా రెండు నిమిషాలు కూర్చో. అతడిని తొందరగా వదిలించుకున్నట్టు వుంటుంది. నిన్నూ అతడు గుర్తుపట్టలేడు” అన్నాడు చైతన్య ఫోన్‌లో.

అంత తొందరగా, తడబాటు లేకుండ అతడు పరిష్కారం ఆలోచించి చెప్పిన విధానం ఆమెని సంభ్రమంలో ముంచింది. ఒక స్త్రీ మగవాడిలో మాటకారితనాన్ని ఇష్టపడవచ్చు. దానికి వ్యతిరేకంగా మరో స్త్రీ మితభాషత్వాన్ని ఇష్టపడవచ్చు.

ఒక స్త్రీ మగతనాన్ని ఇష్టపడవచ్చు లేదా దానికి వ్యతిరేకంగా మరో స్త్రీ నాజూకుతనాన్ని ఇష్టపడవచ్చు.

ఒక స్త్రీ అందాన్ని ఇష్టపడవచ్చు లేదా మరో స్త్రీ మొరటుగా ఉండటం ఇష్టపడవచ్చు.

ఇన్ని విషయాల్లో ఇన్ని వ్యతిరేకతలు వున్న ప్రతీ స్త్రీ మగవాడిలో నిర్ద్వందంగా ఇష్టపడే ఒకే ఒక గుణం. ఇంటిలిజెన్స్!

 

*                                  *                                  *

ప్రనూష ఫోను మట్లాడి పెట్టేసాక చైతన్యకి ఇబ్బందిగా అనిపించింది. నిన్నరాత్రి ఫంక్షన్‌లో కలిసిన అజ్మరాలీ, మరుసటిరోజు ప్రొద్దున్నే హోటల్‌కి ఎందుకొచ్చాడు? కేవలం ఆ అమ్మాయిపట్ల ఆకర్షితుడయ్యా? లేక ఏదైనా అనుమానం వచ్చా?

అతడు తన గదిలో కూర్చోలేక పోయాడు. అక్కడ ప్రనూష ఏం ఇబ్బంది పడుతూందో అని ఆమె గదికి బయల్దేరాడు.

ఆమె రూమ్‌లో తలుపు పూర్తిగా వేసి లేదు. సందులోంచి ప్రనూష కనబడుతూంది. అతడు సూచించిన విధంగానే మొహానికి క్రీమ్ రాసుకుని ఇబ్బందిగా మట్లాడుతూంది. అజ్మరాలీ ఆమె కష్టాన్ని గమనించినట్టు లేదు. తీరుబడిగా కూర్చుని కబుర్లు చెపుతున్నాడు.

“నీకు నాట్యంలో ఎంతకాలం నుంచి ప్రవేశం వుంది?”

“చిన్నతనం నుండీ…”

“చక్కని పర్సనాలిటీ నీది. నాట్యానికి సరిపోతుంది! ఈ చైతన్య నీకు ఎంతకాలంగా తెలుసు?”

“ఆయన అక్కడ సినిమాల్లో హేరో, నా నాట్యం చూసి ఈ ట్రూప్‌కి రమ్మని ఆహ్వానించారు. నేను సరే అన్నాను.”

“మీ నాన్నగారు ఏం పనిచేస్తూ వుంటారు?”

“కలెక్టరు”

ఆ సమాధానానికి అజ్మరాలి మొహంలో భావాలు ఎలా మారతాయో అని చూడటానికి ప్రయత్నించాడు చైతన్య. కానీ కనపడలేదు.

“మీ అమ్మగారు కూడా ఉద్యోగం చేస్తూ వుంటారా?”

“లేదండి”

ఇక ఆ ప్రశ్నల పరంపర ఆగదని చైతన్య లోపలికి అడుగుపెట్టాడు. అజ్మరాలీ అతడిని చూసి చేయి అందిస్తూ “రేపే మీ ప్రయాణం. రేపురాత్రి మా ఆర్మీ క్యాంప్‌లో ప్రోగ్రామ్” అన్నాడు.

చైతన్య అభ్యంతరం చెపుతున్నట్టు “కానీ రేపు రావల్పిండిలో మాకు…” అంటూ ఏదో చెప్పబోయాడు. అజ్మరాలీ అతడి మాటలుమధ్యలో కట్‌చేస్తూ “ఆ ప్రోగ్రామ్ కాన్సిల్ చెయ్యమని నిన్నరాత్రే కబురు చేశాను” అని లేచి “వెళ్ళొస్తాను” అన్నాడు.

అతడు వెళ్ళిపోయాక ప్రనూష చైతన్యవైపు చూసి నవ్వింది “బ్రతికించారు. పది నిమిషాల నుంచీ తింటున్నాడు” చైతన్య నవ్వలేదు. “నిన్నింకా అతడు ఏం అడిగాడు?” అన్నాడు.

“లోకాభిరామాయణం.. మా కుటుంబ విషయాలు వగైరా…” తేలిగ్గా అంది ప్రనూష. “ఏదో ఒక మిషమీద మరి కాసేపు కూర్చోవాలని అతడి ఇంటరెస్టు.”

“నా కెందుకో అతడిని చూస్తూంటే అలా అనిపించటంలేదు. ఒక అనుమానాన్ని తీర్చుకోవటం కోసమో, లేకపోతే అంతా తెలిసి, నిన్ను ఆట పట్టించటం కోసమో నీ చుట్టూ తిరుగుతున్నాడని నా ఉద్దేశ్యం.”

“అలా అనుమానంతో వచ్చినవాడు ఇంతసేపూ ఎందుకు వూరుకుంటాడు? మనల్ని చూసిన వెంటనే నా పాస్‌పోర్టు పరీక్ష చేస్తే అసలు విషయం తెలిసిపోతుందిగా అంది.

వాళ్ళు బయలేరేముందు ప్రనూష పాస్‌పోర్ట్‌లో తండ్రి పేరు మారేలా చేద్దామన్నాడు చైతన్య. ప్రనూష అక్కర్లేదండి. ఎక్కడో వున్న అజ్మరాలీకి తన పాస్‌పోర్ట్ వెతికే అవసరంగానీ, దాన్ని చూసి తనెవరో నిర్ధారించుకునే అవసరంగానీ రాదనుకుంది. ఆ విషయమే అతడితో వాదించింది. అప్పట్లో చైతన్యకి ఆమె వాదన కరెక్టనిపించింది. నిజంగా అజ్మరాలీ ఆమెను గుర్తుపడితే ఇక పాస్‌పోర్ట్ పరీక్షచేసే అవసరమే అతడికి లేదు. గుర్తుపట్టకపోతే పాస్‌పోర్ట్ తనిఖీ చేసే ఆలొచనే అతడికి కలగదు.

వాదన వరకూ ఇది బాగనే వుందిగానీ-

ఎక్కడో ఏదో తెలియని ఇబ్బంది!

అతడా సాయంత్రం వరకూ ఆ ఆలోచనతోనే కొట్టుమిట్టాడాడు. ఆ సాయంత్రం అతడు హోటల్‌నుంచి బయటకు వచ్చి పబ్లిక్ ఫోన్‌నుంచి హోటల్‌కి ఫోన్ చేశాడు.

భారతదేశంలో ప్రనూష అతడితో ఈ పని గురించి చెప్పినప్పటి నుంచీ అతడు సిస్టమాటిక్‌గా కొన్ని అభ్యసించాడు. మంచులో నడవటం నుంచీ మిషన్‌గన్ ఆపరేషన్ వరకు అందులో వున్నాయి. అలాంటి వాటిలో ఒకటి “ఉర్దూ” స్వచ్చంగా మాట్లాడటం.

అదే ఇప్పుడు అతడికి ఉపయోగపడింది. అజ్మరాలీ పోలికవున్న అధికార స్వరంతో అతడు హొటల్‌కి ఫోన్ చేసి “ఎవరూ ఆపరేటరేనా?” అని అడిగాడు.

“అవును సార్” అట్నుంచి వినిపించింది.

“హోటల్ నుంచి బయటకు వెళ్ళే ఫోన్‌కాల్స్ మీదా, కొన్ని గదులకు వచ్చే కాల్స్‌మీద నిఘావేసి వుంచమని చెప్పాం కదా.”

“అవును సార్”

“ఏమైనా కాల్స్ వెళ్ళినాయా?”

“లేదు. ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు ఏ ఫోనూ రాలేదు.” చైతన్యకి భూమి కంపిస్తున్నటు అనిపించింది.

“ఏ గదిని ‘వాచ్’ చేయమన్నానో గుర్తుందిగా.”

“ఉంది సార్. ప్రనూషది. 314 గది.”

చైతన్య నుదుట చెమట పట్టింది. బింకం సడలకుండా ఆఖరి ప్రశ్న అడిగాడు “నేనీ విధంగా సూచనలు ఇచ్చినట్లు ఎవరికీ తెలియనివ్వకు. ఇంతకీ నేనెవర్ని మాట్లాడుతున్నానో తెలుసుగా?’

“తెలుసు. అజ్మరాలీ సాబ్.”

చైతన్య ఫోన్ పెట్టేశాడు.

అజ్మరాలీ ప్రనూషని గుర్తుపట్టేశాడని అర్థమైపోయింది. అంతకు ముందురోజు స్టేజిమీద ప్రోగ్రాం ఇస్తున్నప్పుడే అతడు ఆమెని గుర్తుపట్టి హొటల్ వారికి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి వుంటాడు.

పులి మేకను చంపేటప్పుడు, ఆ మేక ఇక ఎటు వెళుతోంది నిశ్చయించుకున్నాక వెంటనే చంపకుండా దానితో ఆడుకుంటుంది!!!

ఆ విధంగా ప్రనూషతో ఆడుకోవటం మొదలుపెట్టాడేమో!

ఆ ఆలోచన వచ్చేసరికి చైతన్య మరి ఆగలేదు. ఆఘమేఘాలమీద హోటల్‌కి బైలు దేరాడు. అతడు ఫోన్‌చేసిన పబ్లిక్‌బూత్ హోటల్‌కి కాస్త దూరంలోనే ఉంది కాబట్టి టాక్సీరాదు. అతడు నడవవలసి వచ్చింది. దాదాపు పరుగెత్తాడు. విచిత్రంగా చూసే జనాన్ని పట్టించుకోలేదు. గడుస్తున్న ప్రతి నిమిషమూ ప్రనూషని మరణానికి దగ్గరగా చేరుస్తున్నట్లు ఫీలయ్యాడు.

అతడు హోటల్ దగ్గరికి చేరుకునేసరికి హోటల్ పోర్టికోలో రెండు మిలటరీ వ్యాన్‌లు, రెండు కార్లు వున్నాయి. అతడి ట్రూప్ అప్పటికే వ్యాన్ ఎక్కి అతడికోసం ఎదురుచూస్తూ వుంది. కార్లో అతడి తల్లికూర్చుని వంది. లక్ష్మి అతడి దగ్గరికి వస్తూ, “రండి మీ కోసమే వెయిటింగ్” అంది.

అతడు అదుర్దాగా, “ప్రనూష ఏది?” అని అడిగాడు.

“అజ్మరాలీగారు ఆయన కార్లో తీసుకెళ్ళారు”

చైతన్య వెన్ను జలదరించింది.

 

                                                                    * * *

గంటకి వంద కిలోమీటర్ల వెగంతో కారువెళ్తోంది. అజ్మరాలీ డ్రయివ్ చేస్తున్నాడు. ప్రక్కనే ప్రనూష కూర్చుని వుంది. మొహంనిండా కూలింగ్ గ్లాస్, తలకి స్కార్ఫ్.

ఆమెకి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థంకాలేదు. మరుసటిరోజు ఆర్మీ కాంప్‌లో డాన్స్ ప్రోగ్రాం వుందంటే- అందరితో కలిసి బయల్దేరవచ్చు అనుకుంది. ఆ సాయంత్రమే అజ్మరాలీ ఇలా వావానాలు ఏర్పాటుచేసి తమని తీసుకు వెళతాడని ఊహించలేదు.

అందులోనూ తనని ప్రత్యేకంగా, “ఓంటరిగా కారులో బయల్దేర తీస్తాడని అనుకోలేదు. ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదు. రోడ్డు కిరువైపులా చెట్లు, పొలాలు, సరిహద్దువైపు వెళుతోంది కారు. దాదాపు నాలుగు గంటల ప్రయాణం.

అజ్మరాలీ మిలటరీ డ్రస్‌లో వున్నాడు. కారు బయలుదేరి నప్పటినుంచీ ఆపకుండా మాట్లాడుతున్నాడు. ఆమె జవాబు చెప్పటం లేదు. “ఏమిటి? మీ వాళ్ళు రావటం లేదే అని కంగారుపడుతున్నావా? వాళ్ళే వస్తారులే” అంటూ నవ్వేడు.

“అటువంటిదేమీ లేదు.”

“టీ తాగుతావా?”

“ఊహూ”.

“వెనుక సీట్లో ఫ్లాస్క్ వుంటుంది పోసివ్వు.”

ఆమె వెనుతిరిగి ఫ్లాస్క్ తీసుకుంది. అలా తిరిగినప్పుడు అతడి దృష్టి తన కడుపు ముడతమీద నిలిచినట్టు ఆమె గుర్తించీ, గమనించనట్టు వుండిపోయింది. అతడు కారు వేగం తగ్గించాడు. తగ్గిస్తూ అన్నాడు- “మీ దేశం అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. సై అంటే సై అనేట్టూ వుంటారు. కాస్త పొగరు కూడ వుంటుంది. ఆడాళ్ళకి ఆ మాత్రం పొగరుండటం మొగాడికి చాలా బావుంటుంది. ముఖ్యంగా నాలాంటి సైనికాధికారికి.”

ఆమె జవాబు చెప్పలేదు.

“కొన్ని సంవత్సరాల క్రితం ఒకమ్మాయి కలిసింది. మీ దేశం అమ్మాయే. భలే పొగరులే. నన్ను చంపుతానని చాలెంజ్ చెసింది. పాపం ఎక్కడుందో?”

కారు రోడ్డుపక్కకి తీసి ఆపుచేశాడు.

బెల్టులోంచి పిస్టల్ తీశాడు.

ప్రనూష పిడికిళ్ళు బిగించింది.

ఎలాగూ మరణం తప్పనప్పుడు పోరాడి చావడం మంచిది. కానీ ఒక్కటే విచారం. తన ప్రతిజ్ఞ తీరకుండానే మరణించవలసి వస్తోంది.

ఆమె ఆలోచనలో వుండగానే అతడు పిస్టల్‌ని ఇద్దరిమధ్య సీట్లో పెట్టాడు. కారు దిగుతూ, “ఇప్పుడే వస్తాను జాగ్రత్త. పిస్టల్ లోడైవుంది” అంటూ చెట్టు వెనక్కి వెళ్ళాడు. ఒక్క సారి బరుపు తొలగినట్టు ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.

అతడికి తనమీద అనుమానం లేదు. అది ఋజువైంది. అంతే చాలు అనవసరంగా చైతన్య ఏమేమో అలోచించి కంగారు పడ్డడ్. తనమీద ఏ అనుమానమూ లేదు కాబట్టి అజ్మరాలీ ఇలా తన దగ్గర పిస్టల్ వదిలేసి వెళ్ళగలిగాడు.

పిస్టల్ ఆలోచన వచ్చేసరికి ఆమె దృష్టి అతడు వెళ్ళిన వైపు పడింది. చెట్టు వెనుకనుంచి అతడి కాళ్ళు కనపడుతున్నాయి.

మళ్ళీ పిస్టల్‌ని చూసింది.

దాన్ని చేతుల్లోకి తీసుకుంటే…

అతడు వస్తూండగా వరుసగా మూడు గుళ్ళు… అంతే.

తన శపధం నెరవేరుతుంది! తన తల్లిదండ్రుల మరణానికి తగిన జవాబు చెప్పగలుగుతుంది.

పెద్ద కష్టం కూడా కాదు. కార్లో అత్యాచార ప్రయత్నం చేస్తూ వుండగా, చంపేనని చెప్పవచ్చు. బుల్లెట్స్ పేల్చి ఇట్నుంచి ఇటే భారత రాయబారి కార్యాలయానికి వెళ్లటమే! అక్కడ ఆశ్రయం దొరుకుతుంది. ఆ తర్వాత భారతదేశం వెళ్ళిపోవచ్చు.

అతడు బెల్టు సర్దుకుంటూ వస్తున్నాడు.

ఆమె చెయ్యి పిస్టల్‌వైపు సాగబోయి… ఆగిపోయింది.

తను పిస్టలు పేలిస్తే…

మరిక చైతన్యకి అతని తండ్రిని విడిపించుకునే దారే వుండదు. అన్ని దార్లూ మూసుకుపోతాయి. ఈ వార్త పేపర్ల కెక్కగానే అందరి దృష్టి ఇటే కేంద్రీకృతమవుతుంది. చైతన్యా, అతడి తల్లీ వెలుగులోకి వస్తారు. ఇంతవరకూ సజావుగా జరిగిన ప్లాన్‌ని తన స్వార్థంకోసం పాడు చేసినట్టు అవుతుంది.

“అజ్మరాలీ కనపడగానే చంపేస్తాను” అని ఒకప్పుడు అన్నది తనే! కానీ ఇప్పుడు అనలేదు.

ముందు చైతన్య ఆశయం నేరవేరాలి! తర్వాత తనది!!

ఆ ఆలోచన రాగానే ఆమె తన చేతిని వెనక్కి తీసుకుంది. అజ్మరాలీ వచ్చి కారెక్కాడు. పిస్టలు తీసి బెల్టులో పెట్టుకోబోతూ ఆగి “నీకు బాతుమాంసం అంటే ఇష్టమేనా” అని అడిగి ఆమె సమాధానం కోసం ఆగకుండానే దూరంగా పొలం పక్క కాలువలో ఈదుతున్న బాతుకేసి గురిచూసి పిస్టల్ పేల్చాడు.

అది పేలలేదు.

ఆమె పళ్ళు బిగపట్టి చూస్తోంది. అతడు కూడా అర్థంకానట్టు పిస్టల్ విప్పి చూసి బిగ్గారగా నవ్వాడు. “చూసేవా నాది ఎంత మరిమరుపో! లోపల గుళ్ళు పెట్టడం మరిచిపోయాను” అంటూ కారు స్టార్ట్ చేశాడు.

ఆమె ఇంకా దిగ్భ్రమనుంచి తేరుకోలేదు.

ప్రమాదం ఎంతలో తప్పిపోయిందో తల్చుకుంటే ఆమె చేతులు వణకసాగాయి. తొందరపడి పిస్టల్ పేల్చి వుంటే ఈ పాటికి మృత్యుముఖంలో వుండేది.

కారు వేగం పుంజుకుంది.

ఆమె సీటు వెనక్కి తలవాల్చి భారంగా విశ్వసించి, నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.

ఆ నిశ్చింత తాత్కాలికమని ఆమెకి అరగంట తరువాత తెలిసింది.

 

*                                  *                                  *

 

తన మిగతా ట్రూప్‌తో ఆర్మీ క్యాంప్ చేరుకునే వరకూ చైతన్య కంగారుగానే వున్నాడు. ఏ వార్త వినవలసి వస్తుందో అని గాభరాపడుతూ వున్నాడు.

అజ్మరాలీ కారులో ప్రనూష వెళ్ళిన అరగంటకి చైతన్య అక్కడికి చేరుకున్నాడు. ఒక ఆర్మీ బిల్డింగ్ వాళ్ళకి విడిదిగా యిచ్చారు. లోపలి గదిలో ప్రనూష కనపడగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.

“ఏం జరిగిందో తెలుసా?” అంటూ హుషారుగా చెప్పబోతున్న ప్రనూషని కళ్ళతోనే వారించి బయటకి తీసుకొచ్చాడు. చుట్టూ ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక అన్నాడు-“ఆ బిల్డింగ్‌లో మనం ఏం మాట్లాడుతున్నామో వినటంకోసం రహస్యంగా మైక్రోఫోన్‌లు అమర్చి వుంటారని నా అనుమానం.”

“ఎందుకా అనుమానం?”

“నువ్వేవరో అజ్మరాలీకి తెలిసిపోయింది” అంటూ హోటల్‌లో ఆమె ఫోన్ ట్రాప్ చేయబడిన విధానం గురించి చెప్పాడు. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది.

“నేను ప్రనూషనని అతడికి తెలిసిపోయిందా?” స్వగతంగా అనుకుంది. “మరి ఆ పిస్టల్ అలా ఎందుకు వదిలాడు?”

“పిస్టల్ వదలటం ఏమిటి?”

ఆమె కార్లో జరిగిన సంఘటన గురించి చెప్పింది. “నన్ను అనుమానించినవాడు కార్లో నా పక్కనే తన పిస్టల్ ఎందుకు వదిలి వెళతాడు?”

“అనుమానించాడు కాబట్టే పిస్టల్ వదిలి వెళ్ళాడు” అన్నాడు చైతన్య. “అందులో గుళ్ళు లేవని అతడికి ముందే తెలిసి వుండవచ్చు. నువ్వా పిస్టల్ పేల్చటానికి ప్రయత్నించి వుంటే ఆట పట్టించినట్టు నవ్వుకునేవాడు.”

“మైగాడ్!నేనిదంతా ఆలోచించలేదు” అంది ప్రనూష.

“బహుశా అతడికి నీతో ఇలా ఆడుకుంటూ వుండటం ఒక సరదాగా వుందనుకుంటాను. నువ్వు ఇబ్బంది పడేకొద్దీ అతడు సంబర పడతాడు.”

“ఎంతకాలం?”

“ఇంకో రెండు రోజులు”.

“ఆ తరువాత?”

“ఆ తరువాత మనం ఎవ్వరం ప్రాణాలతో మిగలమని నా ఉద్దేశ్యం. మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చి వెళ్ళే ఈ రెండు రోజుల్లో ఏదో ఒక క్షణం మనకి ముప్పు తప్పదు. ఇదంతా అతడి సామ్రాజ్యం. పదిమంది మనుష్యుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసినా ఇక్కడ అతడిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి మనం వెళ్ళేలోపులోనే ముప్పు తప్పదంటున్నాను”.

“మరెందుకు ఇంత తెలివితక్కువ ప్లాన్ వేసి ఇలా చిక్కుకు పోయాం?” తప్పు అతడిది అన్నట్టుగా అంది ప్రనూష.

“అతడిని నువ్వు చంపాలనుకున్నావు. ఏ ప్లాన్ వేసినా ఏదో ఒక టైమ్‌లో అతడికి ఎదురు పడకపోవు. ఇక అందులో తెలివితక్కువతనం ఏముందు? నువ్వు కార్లో అతడితోపాటు వెళుతున్నప్పుడు ఏదో ఒక ఆయుధంతో అతడిని చంపేస్తే నీ పగ చల్లారేదిగా.”

“మీ గురించే ఆలోచించాను.”

“థాంక్స్!” అన్నాడు చైతన్య. “నా గురించి వదిలిపెట్టు. నీ శపథం నేరవేరటానికి ఇంకో ప్లాన్ ఏదైనా వుందా?”

ఆమె జవాబు చెప్పలేదు. అతడు వివరిస్తున్నట్లు అన్నాడు. “మనిషి ఆలోచనా విధానం అతడు కష్టాల్లో వున్నప్పుడే బయటపడుతుంది. అప్పుడే బ్యాలెన్స్‌డ్‌గా వుండాలి! అతడి చక్రబంధంలో మనం ఇరుక్కుపోయాం అని తెలియగానే నువ్వు కంగారుపడ్డావు. మనం తప్పుచేశామేమో అని నిందించసాగావు. కానీ దీన్నీ వేరే కోణంలోంచి ఆలోచించు, మనం ఇంత తొందరగా అతడిని కలుసుకుంటామని కలలో కూడా ఊహించామా? ఇంత తొందరగా ఆ జైలు దగ్గరికి వెళ్లగలుగుతామని అనుకున్నామా? లేదే! అన్నీ ఇంత బాగా జరుగుతున్నాయంటే దానికి మన ప్లానే కారణం. నువ్వు అజ్మరాలీని చంపే వీలువుండే కేవలం నా గురించే ఆలోచించి వదిలేశానన్నావు! అసలీ ప్రోగ్రాంలో నువ్వే లేవనుకో! అజ్మరాలీ నా మీద ఏమీ అనుమానం వచ్చేది కాదుగా. అతడి క్యాంప్‌కి నిరాఘాటంగా నేను నా తల్లితో సహా వచ్చేవాడిని కదా. కాబట్టి నేను చెప్పేదేమిటంటే కాస్త కష్టం రాగనే తప్పంతా అవతలివాళ్ళ మీదకు తోసేసే సాధారణ మనస్తత్వం నీది కాదనుకుంటున్నాను. నా నమ్మకం నిలబెట్టు” అన్నాడు.

ఆమె అతడివైపే నిమిషం కన్నార్పకుండా చూసి “ఐయామ్ సారి!” అంది మనస్పూర్తిగా.

ఇదరూ తిరిగి భవంతివైపు నడవసాగారు. అతన్నాడు. “రేపు సాయంత్రంవరకూ మనకి ఏ ప్రమాదమూ రాకపోవచ్చు. ఈ లోపులో ఒక రకంగా నువ్వు నీ ప్రాణాలు రక్షించుకోవచ్చు.”

“ఎలా?”

“రాత్రికి రాతే కార్లో వెనక్కి వెళ్ళిపోయి తెల్లవారేసరికల్లా విమానాశ్రయం చేరుకోవటం ద్వారా! నువ్వేమయ్యావో మాకు తెలీదని చెపుతాం. తనని చూసి బెదిరిపోయావని అజ్మరాలీ అనుకుంటాడు.”

“నేనా పని చచ్చినా చేయను. అజ్మరాలీని చంపే ఇక్కడి నుంచి ప్రయాణం. ఆ ప్రయత్నంలో నేను మరణించినా సరే.”

చైతన్య నవ్వి, “ఊరికే అన్నాన్లే నీ పట్టుదల ఏమిటో తెలుసుకోవాలని” అన్నాడు.

ఇద్దరూ మెట్లు ఎక్కుతూ ఆ సంభాషణ ఆపుచేశారు.

 

 

                                     * * *

 

 

ఆ రోజు ప్రోగ్రాం సైనికులకోసం, మరుసటిరోజు సైనికధికారుల కోసం, మొత్తం రెండు ప్రోగ్రాంలు.

ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. అది అయ్యాక అజ్మరాలీ కాక్‌టైల్ పార్టి యిచ్చాడు. చైతన్య తల్లి రాలేదు. మిగతా ట్రూప్ అంతా హాజరయ్యారు. చాలామంది సైనికాధికారులు కూడా వచ్చారు. అంత కోలాహలంగా వుంది.

చైతన్య ఒక విషయం గమనించాడు. అజ్మరాలీ క్రితంలోలా ప్రనూష చుట్టూ తిరగటంలేదు. ఆమె గురించి ఇక తెలుసుకోవలసిందేమీ లేనట్టు  నిర్లక్ష్యంగా వున్నాడు.

ప్రస్తుతం అతడు లక్ష్మితో సంభాషణలో పడ్డాడు.

పచ్చటి దీపపుకాంతిలో లక్ష్మి మెరిసిపోతూంది. ఇంతవరకూ ఆ దృష్టితో చూడలేదు కాబట్టి చైతన్యకి ఆ విషయం తెలియలేదు. అతడికి తెలియని విషయం మరొకటి కూడా వున్నది.

అంతవరకూ లక్ష్మికి జీవితంలో బాధలు మాత్రమే తెలుసు. చైతన్య తల్లి ఆ అమ్మాయిలో కొత్త ఆశలు రేపింది. ఆ ఆశలు ఆమెలో కొత్త అందాన్ని రేపాయి.

అజ్మరాలీ ఆమెతో విడవకుండా మాట్లాడుతున్నాడు. అక్కడికి డాక్టర్ పాల్ కూడా చేరాడు. అజ్మరాలీ వేసిన జోక్‌కి లక్ష్మి విరగబడి నవ్వుతూంది. చైతన్య మనసులో అస్పష్టమైన చిరాకు. అది కేవలం చిరాకేనా.. కాస్త కోపం, మరికాస్త ఈర్ష్య.. తన మనిషి… తన శత్రువుతో కలిసి నవ్వటం- అయినా ఆమెకి తెలీదుగా అజ్మరాలీ తన శత్రువని- కానీ ఎందుకు తనకిలాంటి ఈర్ష్యలాంటి ఫీలింగు?

లక్ష్మి చుట్టూ చేయివేసి అజ్మరాలి ఆమెని డిన్నర్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు.

చైతన్యకి ఏదో తెలియని విసుగు!

కాస్త డబ్బుకోసం ఆమె త్తన భార్యగా నటించినపుడే ఆమె మీద చులకన భావం కలిగింది. తన జాలికథ కమనీయంగా చెప్పుకుని తల్లిదగ్గర సానుభూతి సంపాదించింది. మరి ఇప్పుడీ సైనికాధికారితో చిరునవ్వులు చిందిస్తోంది.

అతడు ఆలోచనల్లో వుండగానే డిన్నర్ పూర్తయింది. ఒక్కరొక్కరే వెళ్ళిపోతున్నారు. అజ్మరాలీ లక్ష్మితో కలిసి చైతన్య దగ్గరికి వచ్చాడు. “మీ లక్ష్మి మా ఆవరణ అంతా చూస్తానంటోంది. వెళదాం రండి” అన్నాడు.

“నేనెందుకు?” అన్నాడు చైతన్య విసుగ్గా.

“మీర్రాకపోతే తను రానంటూంది. ఈ ట్రూప్‌కి లీడర్ మీరు కదా! రండి వెన్నెల్లో ఆరుబయట ఆడపిల్లతో షికారు బావుంటుంది” అంటూ బయల్దేర తీశాడు.

తలవొంచుకుని నడుస్తూన్న లక్ష్మి ఒకచోట ఆగి “అదేమెటి?” అంది.

“యుద్ధఖైదీల జైలు…” అని బిగ్గరగా నవ్వుతూ “మీ దేశం వాళ్ళే” అన్నాడు.

“అది చూపించరా?” గోముగా అడిగింది. చైతన్య విభ్రమంతో ఈ సంభాషణ వింటున్నాడు.

“ఇంత రాత్రపుడా.. రేపు వెళదాంలే.”

“ఊహూ. ఇప్పుడే చూడాలి” అంది అతడి మోచేతిని తన వేళ్ళతో సుతారంగా తాకుతూ. యుద్ధభూమిలోనైనా స్త్రీదే కధా విజయం.

“సరే-” అన్నాడు అజ్మరాలీ.

చైతన్య ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు! ఏదో కలలో నడుస్తున్నవాడిలా వారివెంట నడిచాడు.

“తలుపు తెరువ్” అధికార యుక్త కంఠంతో అడిగాడు అజ్మరాలీ.

సెంట్రీ తలుపు తెరవగానే ముగ్గురూ లోపల ప్రవేశించారు. లోపల విశాలమైన మైదానం వెన్నెలలో మెరుస్తూంది. దూరంగా పొడవాటి సెల్స్ వున్నాయి. వరండా చివర్లు చీకట్లో కలిసిపోయి మరింత పొడవుగా భయంకరంగా కనపడుతున్నాయి.

దాదాపు పావుగంటసేపు ఆ ఆవరణ అంతా చూపించాడు. అర్థరాత్రి కావొస్తూండడంతో ఖైదీలందరూ సెల్స్‌లో నిద్ర పోతున్నారు. అంతా, చీకట్లో అసలు ఆ జైలులోకి ప్రవేశం దొరకటం దుర్లభం. కానీ వచ్చింది సైనికాధికారి కావటంతో ఎవరూ ఎదురు చెప్పటం లేదు.

అంతా తిరిగి వస్తూండగా ఒకచోట అజ్మరాలీ ఆగాడు. “మీతో పాటు ఇస్మాయిల్ అనే ఒక యుద్ధ ఖైదీ వచ్చాడే- అతను కూడా ఒకప్పుడు ఇక్కడే అదిగో ఆ సెల్‌లోనే వుండేవాడు. మేము దయతల్చి తిరిగి మీ దేశానికి అప్పగించాం” గర్వంగా అన్నాడు.

ఆ సెల్‌వైపు చూస్తూ “ఆయనెవరు? ఇంత అర్థరాత్రి ఇంకా మెలకువగా వుండి ప్రార్థన చేస్తున్నాడు” అని అడిగింది.

“అతని పేరు జగదీష్ ప్రసాద్”.

అజ్మరాలి మాటలు పూర్తికాలేదు. అంతా తొందరగా వస్తుందని ఊహించని క్షణం – భావమై -అనుభవమై అంటార్కిటికా పవనం ఘనీభవించి గ్రీష్మ తాపంతో ఉడికిపోతున్న సహారాని చుట్టుముట్టినట్లు విరుద్ధభావ సంచలనంతో కదిలిపోయి చైతన్య అటు చూశాడు.

సెల్ పైనున్న గవాక్షంగుండ ఏటవాలుగా పడే వెన్నెల కిరణం మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చుని వున్నాడు తన తండ్రి!

పాతిక సంవత్సరాల ఒంటరితనాన్ని మెడిటేషన్‌తో గెల్చే ప్రయత్నంలో ఋష్యత్వాన్ని సిద్ధించుకున్న తండ్రిని అతడు అర్థ్రనయనాలతో చూశాడు. చేతులు సాచి ముందుకు పరుగెత్తి సెల్ తాళాలు బ్రద్ధలు కొట్టి తండ్రిని కౌగిలించుకున్న భావన. ఎవరి కోసమైతే ఇన్నివేల మైళ్ళు ప్రయాణించి వచ్చాడో – ఎవర్ని ఈ జైలు బంధాలనుంచి విముక్తి చేసి తన తల్లి నుదుట కుంకుమగా దిద్దాలనుకున్నాడో –  ఆ వ్యక్తి అతికష్టం మీద నిగ్రహించుకున్నాడు.

“ఇక వెళదామా” అజ్మరాలీ మాటలకు తెప్పరిల్లి చైతన్య కదిలాడు. ముగ్గురూ వెనక్కి బయల్దేరారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఇంకా ఆ భావోద్వేగం చైతన్యని వదల్లేదు. నిద్రలో నడుస్తున్నట్టే కదుల్తున్నాడు.

“గుడ్‌నైట్” అని చెప్పి అజ్మరాలీ వెళ్లిపోయాడు.

అతడు లక్ష్మితో కలిసి తమ విడిదివైపు నడుస్తూ వుండగా లక్ష్మి అడిగింది. “ఎలా వున్నారు మీ నాన్నగారు?”

పక్కలో విస్ఫొటనం చెందినట్లు అదిరిపడ్డాడు. కళ్ళముందు నక్షత్రాలు కదులుతూ వుండగా “నీకు.. నీకు నా తండ్రి గురించి ఎలా తెలుసు?” అన్నాడు తడబడుతూ.

“మిమ్మల్ని మీ తండ్రిగారితో కలవటం కోసమే నేను ఇదంతా చేశాను చైతన్యబాబూ” అంది తలవంచుకుని.

అతడింకా అయోమయావస్థ నుంచి తేరుకోలేదు. విశ్వమంతా తనచుట్టూ గిర్రున తిరుగుతున్నట్టు అనిపించసాగింది.

“నా తండ్రి గురించి నీకెవరు చెప్పారు?”

“మీ అమ్మగారు చెప్పారు.”

“మైగాడ్” గొణుక్కున్నాడు. కసి, కోపం, నిస్సహాయత.

“మీరెంతో రహస్యంగా వుంచుదామనుకున్నది నాకు తెలిసిందని బాధపడుతున్నారా?”

“నీతోపాటు ఎందరికి తెలిసిందా అని.”

“నా ఒక్కదానికే…” అన్నదామె. “మీరు ఇస్మాయిల్ని నమ్మినట్టే మీ అమ్మగారు నన్ను నమ్మారు. మనిషిని మనిషి నమ్మటానికి అంతర్జాతీయ నిబంధనలు ఏమీ లేవుగా.” అతడు అప్రతిభుడై ఆమెవైపు చూశాడు. ఆమె ఇంకా తలదించుకునే వుంది.

“రాముడికి ఒక చిన్న ఉడుత సాయం చేసినట్టు నేను మీకేమి చేయగలనా అని ఇంతకాలం ఆలోచించాను. మన ట్రూప్‌లో నేను ఏకాకిగా వుండటం చూసి డాక్టర్ పాల్ చొరవ తీసుకున్నా సహించాను. అజ్మరాలీ నా మీద చెయ్యివేసినా సహించాను. అంతేకాదు, సంతోషించాను కూడా. డబ్బుకోసం కెమెరా ముందు నటించే ఎగస్ట్రా ఆర్టిస్టుని! కాస్త బెదిరిస్తే మీ భార్యగా కూడా నటించటానికి సిద్దపడ్డ జూనియర్ నటిని!!! అజ్మరాలీతో స్నేహం నటిస్తే నేను కొత్తగా కోల్పోయేదేమీ లేదుకదా. ఈ రోజు పార్టీలో అజ్మరాలీతో నా ప్రవర్తన చూసి మీరు నన్ను అసహ్యించుకుంటారని నాకు తెలుసు. “ఒకప్పుడు ఈమెనేనా నా హీరోయిన్‌ని చెయ్యాలనుకున్నది” అని ఏవగించుకుంటారని కూడా తెలుసు. కానీ నా ఉద్దేశ్యం ఒక్కటే, మీరూ, మీ అమ్మగారూ అంత అభిమానం నా మీద చూపించినందుకు- నేను మీకు కొద్దిగానైనా సాయపడాలని. మీ తండ్రిగారు ఎవరో, ఎక్కడున్నారో మీరు స్వయంగా చూస్తే మంచిదని! అందుకే అజ్మరాలీని ఆ యుద్ధఖైదీల సెల్స్ చూప్పించమని కోరాను. అతడి చేతల్నీ, చేతుల్నీ సహించాను. నాకు చాల సంతోషంగా వుంది చైతన్యగారూ! స్నేహం, ప్రేమ, అప్యాయత అన్న మూడు గీతలు రాముడి చేతివేళ్ళలా మనసుని స్పృశించనంత సంతృప్తి.”

ఆమె చీకటిలో నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయింది.

అతడలాగే శిలాప్రతిమలా వుండిపొయాడు.

 

ఇంకా ఉంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *