June 19, 2024

కాళిదాస కవితా సౌందర్యము

రచన : అష్టావధాని , సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిల్ కుమార్   anil madgula

 

సంస్కృతమను భాష ఒకటుందని తెలిసిన వారెవరికైనా వాల్మీకి , వ్యాసుల తదనంతరం గుర్తుకు వచ్చేది కాళిదాసే. ఈయన పురాణాలనాధారంగా చేసుకొని కావ్యాలను జనరంజకంగా రచించాడు. 1. రఘువంశము 2. కుమార సంభవము 3. ఋతు సంహారము 4. మేఘ సందేశము అనే శ్రవ్య కావ్యాలను ; 1. మాళవికాగ్నిమిత్రము 2. విక్రమోర్వశీయము 3. అభిజ్ఞాన శాకుంతలము అనే దృశ్యకావ్యాలను మహాకవి కాళిదాసు రచించాడు. వీటిలో రఘువంశ , కుమార సంభవ కావ్యాలు రెండు కూడ సంస్కృత పంచమహాకావ్యాలలో చోటు సంపాదించుకున్నాయి. ఇవి కాక 1. శ్యామలా దండకము 2. కాళీ అష్టకము 3. గంగాష్టకము 4. మంగళాష్టకము 5. శృంగార తిలకము 6. నలోదయము 7. లంబోదర ప్రహసనము 8. పుష్పబాణ విలాసము 9. జ్యోతిర్విదాభరణము 10. చిద్గగన చంద్రిక 11. ఉత్తర కాలామృతము మొదలగు మఱి కొన్ని గ్రంథాలను కాళిదాసు కృతులుగా చెప్తున్నారు. వీటిలో శ్యామలా దండకము , శృంగార తిలకము , జ్యోతిర్విదాభరణము , పుష్పబాణ విలాసము , ఉత్తర కాలామృతము చాలా ప్రసిధ్ధిగాంచినవి. ఇవి తప్ప తక్కినవి కాళిదాసు రచనలు కావనే విమర్శ కూడ వుంది.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే l

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ll     ర.వం. 1-1

అను ఈ శ్లోకం ఎవరు వ్రాసినదీ అందరికీ తెలియక పోవచ్చు కానీ మంగళ శ్లోకంగా వివాహ ఆహ్వాన పత్రికలలో చోటు సంపాదించి బహుళ ప్రచారాన్ని పొందింది. సుందరమైన ఉపమాలంకారము , ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందటానికి చేసిన ప్రార్థన ప్రాధాన్యతను సంతరించుకోవడమే అందుకు కారణము. పార్వతీపరమేశ్వరులకు నమస్కారమనటంలో ఆ వాక్యానికి వచ్చే సౌందర్యమేమీ వుండదు. ‘ అర్థము , మాట ఒండొకటి కలిసియున్నట్లు కలిసియున్న , జగత్తునకు తలిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కారము ‘ అనటంలో అత్యద్భుతమైన ఉపమాలంకార సౌందర్యం వుంది. ఇటువంటి సౌందర్యవంతమైన ఉపమాలంకారాన్ని ప్రయోగించే చాతుర్యం ఒక్క కాళిదాసుకు మాత్రమే వుంది. అందుకే ‘ ఉపమా కాళిదాసస్య ‘ అనే నానుడి కూడ యేర్పడింది. ఉపమాలంకారం కూడ కాళిదాసుకే అంకితమైంది. మహాకవి కాళిదాసు కూడ కవికుల గురువుగా కీర్తించబడినాడు.

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః l

నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్ ll

అని సూక్తి. రససిద్ధులైన కవులు జన్మిస్తూనే వుంటారు. వారి కీర్తిశరీరానికి ముదుసలితనము , చావు అన్న భయం వుండనే వుండదు. అట్టి వారిలో వాల్మీకి , వ్యాసుల తరువాత స్థానం కాళిదాసుదే. అందుకే –

పురా కవీనాం గణనా ప్రసంగే

కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా l

అద్యాపి తత్తుల్య కవేరభావాత్

అనామికా సార్థవతీ బభూవ ll

అని చెప్పారు పెద్దలు. సంస్కృతంలో చిటికెన వ్రేలును ‘ కనిష్ఠికా ‘ అంటారు. ఉంగరము వ్రేలును  ‘ అనామికా ‘ అంటారు. అనామికా అంటే పేరు లేనిది అను అర్థం కూడ వుంది. పూర్వమొకసారి ఎవరో మహాకవులెవరెవరని చిటికెన వ్రేలు వద్ద నుండి లెక్కిస్తూ ‘ కాళిదాసు ‘ అని వ్రేలు ముడుచుకున్నారు. ‘ అనామిక ‘ ( ఉంగరము వ్రేలు ) దగ్గరికి వచ్చు సరికి కాళిదాసు తరువాత అంతటి కవి ఎవరూ ఆయనకు ఊహకందలేదట. కాళిదాసు అంతటి కవి యిప్పటి వఱకు లేనందువలన ‘ అనామిక ‘ సార్థక నామధేయాన్ని పొందినది. అలాగే ఒకానొక సాహిత్య పిపాసి –

కాళిదాసకవితా , నవం వయో ,

మాహిషం దధి సశర్కరం పయః  l

ఐణమాంస , మబలా చ కోమలా

సంభవంతు మమ జన్మ జన్మని ll

‘ ప్రతిజన్మలోను నాకు కాళిదాసు కవిత్వము , యౌవనము , బఱ్ఱె పెరుగు , చక్కర వేసిన పాలు, దుప్పి మాంసము , సుందరియగు యువతి అనునవి లభించాలి ‘ అని కోరుకున్నాడట. అంత సుందరమైనది కాళిదాస కవిత్వము. అది ఎంత సౌందర్యమంటే –

పుష్పేషు జాతీ పురుషేషు విష్ణుః

నారీషు రంభా నగరీషు కాంచీ

వీరేషు రామః విమలీషు పూషా

కావ్యేషు మాఘః కవి కాళిదాసః  ll

‘ పూవులలో జాజిపూలు , పురుషులలో విష్ణువు , స్త్రీలలో రంభ , నగరములలో కంచి , వీరులలో రాముడు , నక్షత్రాలలో పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , కావ్యములలో మాఘుడు రచించి మాఘము అని పిలువబడు శిశుపాల వధ మహాకావ్యము , కవులలో కాళిదాసు ‘ ఉత్తమములని ఒక కవి పేర్కొన్నాడు.

కాళిదాసుకు ప్రజలంటే చాల యిష్టం. వారి కోసమే సుమధురమై , సరళమైన కావ్యాలను రచించాడాయన. అందుకే విదేశీయులు కూడ కాళిదాసు కావ్యాల కోసం యెగబడుతున్నారు. అంత ప్రసిధ్ధి పొందినందుకే –

కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ l

పర్వతే పరమాణౌ చ పదార్థత్వం వ్యవస్థితమ్ ll

‘ కవులంటే కాళిదాసు మొదలైన వారు. మేము కూడ కవులమే. పదార్థము అంటే పర్వతము పదార్థమే , పరమాణువూ పదార్థమే. పర్వతానికీ పదార్థానికీ ఎంత వ్యత్యాసముందో కాళిదాసాదులకు , ఇతర కవులమైన మాకు అంత వ్యత్యాసముంది ‘ అని కుమారిల భట్టు అనే ప్రఖ్యాత కవిపండితుడు , మీమాంసా శాస్త్ర ప్రవర్తకుడు సవినయంగా వక్కాణించాడు.

కాళిదాసు రచన చదువు కొలదీ యిష్టమైన పదార్థాన్ని జుఱ్ఱుకొంటున్నట్లుగా పాఠకులు మఱింత ఆస్వాదనాసక్తులౌతారు. మల్లినాథసూరి అనే గొప్ప సంస్కృత వాఙ్మయ వ్యాఖ్యాత మన ఆంధ్రీయుడే. ఆయన –

కాళిదాసగిరాం సారం కాళిదాసస్సరస్వతీ l

చతుర్ముఖోsథవా సాక్షాత్ విదుర్నాన్యే తు మాదృశాః ll

‘ కాళిదాసు మాటలలోని సారం కాళిదాసుకు , సరస్వతికి , బ్రహ్మదేవునికి మాత్రమే తెలుసు. మా వంటి వారికెట్లా తెలుస్తుంది ? ‘ అన్నాడు. అంతటి గొప్ప వ్యాఖ్యానకారుడే కాళిదాసు కావ్యాలలో అంతరార్థాలున్నాయి , నా వంటి వారికి కూడ తెలియదన్నాడంటే నామ మాత్రంగా తెలిసిన మనమెట్లు మెలగ వలెనో కదా !  మఱియొక అజ్ఞాత కవి నూటికి నూరు శాతం నిజమైన మాటను –

కవిరమరః కవిరమరుః కవిరభినందశ్చ కాళిదాసశ్చ l

అన్యే కవయః కపయః చాపలమాత్రం పరం దధతే ll

‘ అమరకుడు , అమరసింహుడు , అభినందుడు , కాళిదాసు అనే కవులే కవులంటే. ఇతర కవులన్నచో కవులు కారు కపులు = కోతులు. అందువలననే కోతులకు చపలస్వభావము వున్నట్లు తాము కూడ కవిశబ్దవాచ్యులు కావలెనని కుప్పిగంతులు వేస్తున్నారు ‘ అని తెలియజేశాడు. ఇక్కడ ఒక విషయం లోతుగా ఆలోచించదగినది. మహాకవి , కవికుల గురువు అయిన కాళిదాసు వాల్మీకి , వేదవ్యాసుల విషయంలో వినయంగా వ్యవహరించాడు. ఇతర కవుల కావ్యాలలో జోక్యం చేసుకొని దోషైకభుక్కు కాలేదు. కాళిదాసు ఇతర కవులు , విద్వాంసుల యందు కనబరచిన వినయాన్ని పరిశీలిస్తే మనము ముక్కున వ్రేలు వేసుకొనవలసిందే.

ఆపరితోషాద్విదుషాం న సాధు మన్యే ప్రయోగ విజ్ఞానమ్ l

బలవదపి శిక్షితానామాత్మన్యప్రత్యయం చేతః ll        అ.శా. సూత్రధారుడు

‘ పండితులు చూసి మెచ్చుకొనునంత వఱకు నేను చేసిన ప్రయోగము సరియైనదని నమ్మను. పనిలో ఎంతటి నేర్పరియైనను తన పని మీద అతనికి సరిగా వున్నదను నమ్మకము(ఆత్మతృప్తి) కలుగదు. దానిని యితరులు చూసి మెచ్చుకొనినప్పుడే ఆత్మవిశ్వాసము కలుగుతుంది ‘ అని అభిజ్ఞాన శాకుంతలంలో సూత్రధారునితో పలికిస్తాడీ శ్లోకాన్ని కాళిదాసు.  అలాగే –

తం సంతః శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః l

హేమ్నః సంలక్ష్యతేహ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా ll         ర.వం. 1-10

‘ గుణదోషముల వివేకము కలిగిన విద్వాంసులే నా కావ్యమును వినదగినవారు. బంగారము యొక్క స్వచ్ఛత లేక మాలిన్యము ( నైర్మల్యము లేక యితర లోహముల కలయిక ) బంగారమును నిప్పులలో వేసి కరగించినప్పుడే కదా తెలుస్తున్నది ‘ అని రఘువంశ మహా కావ్యంలో కాళిదాసు మిక్కిలి వినయంగా చెప్పాడు. ఇటువంటి జనరంజకమైన అర్థాంతర విన్యాసాలతో పాఠకుల హృదయాలను ఆకట్టుకొంటుంది కాళిదాస కవిత్వము. పై రెండు శ్లోకాలను వినయంగా విన్నవించుకొన్న కాళిదాసు కొన్ని సందర్భాలలో –

పురాణమిత్యేవ న సాధు సర్వం

న చాపి కావ్యం నవమిత్యవద్యమ్

సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే

మూఢఃపరప్రత్యయనేయబుద్ధిః ll          మాళవికాగ్నిమిత్రము.1-2

‘ కావ్యము ప్రాచీనమైనదైనచో అది మంచిదని , నవీనమైనదైనచో అది ఆదరింపరానిదని నిర్ణయించటం తగదు. కావ్యము ప్రాచీనమైనదైనను , నవీనమైనదైనను అందులోని గుణదోషాలను సమర్థులైన విద్వాంసులు పరిశీలించి నిర్ణయిస్తారు. మూర్ఖుడు యితరుల నిర్ణయాలను విని  దానినే ప్రమాణంగా స్వీకరిస్తాడు ’ అని ఆత్మవిశ్వాసాన్ని కూడ ప్రదర్శించాడు. కాళిదాస రచనలలో మాళవికాగ్నిమిత్రము మొదటి రచన అని పెద్దలమాట. తన మొదటి రచనలోని మొదటి శ్లోకములో విమర్శకులకు గడుసైన సమాధానం చెప్పాడు.  కుమారసంభవంలో –

అనంతరత్న ప్రభవస్య యస్య

హిమం న సౌభాగ్య విలోపి జాతమ్ l

ఏకో హి దోషో గుణ సన్నిపాతే

నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ll               కు.సం. 1-2

‘ ఎన్నో రత్నరాశులకు , వృక్షరాజాలకు నిలయమైన హిమవత్పర్వతంలో మంచు నిండియుండటమనే ఒక దోషం లెక్కింప దగినది కాదు. అదెట్లంటే చంద్రునిలోని మచ్చ చంద్రుని తెల్లని కిరణాలతో కలసిపోయినట్లు మంచి గుణాల గుంపులో కలసిపోతుంది ‘ అని చెప్పాడు. ఎవరైనను మూర్ఖులు కావ్యంలోని ఏదేని ఒక దోషాన్ని వేలెత్తి చూపవచ్చు. అటువంటి దోషమెక్కడున్ననూ అనంత గుణరాశిలో లీనమౌతుందనే వ్యంగ్యార్థమిందులో మనకు కనిపిస్తుంది. అందుకు తగినట్లే దరిద్రాన్ననుభవిస్తున్న ఒకానొక అజ్ఞాత కవి –

ఏకో హి దోషో గుణసన్నిపాతే

నిమజ్జతీందోరితి యో బభాషే l

నూనం న దృష్టః కవినాపి తేన

దారిద్రదోషో గుణరాశి నాశీ ll

‘ చంద్రునిలోని మచ్చ చంద్ర కిరణాలలో కలసిపోతుందని చెప్పిన కాళిదాసుకు దరిద్రమంటే ఏమో తెలియదు. దానిని ఆయన అనుభవించలేదు కాబట్టి అదియే ఆయనలోని దోషము ‘ అని కాళిదాసును వ్యాజస్తుతి చేశాడు.

ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవమ్ l

దండినః పద లాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః ll

అను ప్రసిద్ధ శ్లోకముంది. కాళిదాస కవిత్వంలో ఉపమాలంకారాలు ఎక్కువగా వున్నాయి.  ఉపమాలంకారాన్ని కడుసుందరంగా మలచడంలో కాళిదాసు సిద్ధహస్తుడు. అలాగే భారవి అర్థానికి , దండి పదలాలిత్యానికి ప్రాధాన్యతనిచ్చారు.

 

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ

యం యం వ్యతీయాయ పతింవరా సా l

నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే

వివర్ణ భావం స స భూమిపాలః ll                       ర.వం.6-67

‘ రాత్రి సమయంలో సంచరించు దీపపు శిఖ వలె రాజుల వరుసలో వరుని వరించు ఇందుమతి యే యే రాజులను వదలి వెళ్ళుచున్నదో ఆ రాజుల ముఖాలు  దీపపు శిఖ వెళ్ళిపోయిన తరువాత రాజమార్గంలో భవనాలు వెలవెల బోయినట్లు కాంతివిహీనాలైనాయి ’. ఇందుమతీ స్వయంవర సందర్భంలోనిదీ శ్లోకము. ఆ కాలంలో రాత్రులందు రాజవీధులలో నడిచేటప్పుడు దివిటీలు తీసుకువెళ్ళేవారు. అప్పుడు దీపపు కాంతి భవంతులపై పడి కాంతివంతాలయ్యేవి. దివిటీని ముందుకు తీసుకువెళ్ళిన తరువాత వెనుకనున్న భవంతులు వెలవెలబోయేవి. రాజుల ముఖాలను రాజమార్గంలోని భవంతులతోను , ఇందుమతిని దీపపు శిఖతోను పోలుస్తూ ఇంత అద్భుతమైన ఉపమానాన్ని చెప్పినందుకు కాళిదాసుకు “ దీపశిఖా కాళిదాసు “ అను బిరుదు వచ్చింది.

మఱియొక సుందరమైన ఒకే వర్ణన రఘువంశ , కుమార సంభవాలలో ప్రయోగించాడు కాళిదాసు.

బాలార్క ప్రతిమేవాప్సు వీచి భిన్నా పతిష్యతః l

రరాజ రక్షఃకాయస్య కంఠచ్ఛేద పరంపరా ll              ర.వం.12-100

‘ రక్తాన్ని కారుస్తూ నేలపై పడుతున్న రావణుని తలల వరుస మహానదులలో ప్రతిఫలించే బాలసూర్యుని ప్రతిబింబాల వలె ప్రకాశించింది ‘. నదులలో పెద్ద తరంగాలు వచ్చినపుడు  ఎఱ్ఱని బాలభానుని ప్రతిబింబాన్ని తరంగములు ఒకదాని వెంట మఱియొకటి తీసుకొనిపోతూ ఎఱ్ఱదనంతో ఉన్నట్లు ప్రకాశించినదని భావం. ఇదే వర్ణననే కాళిదాసు –

గగనాదవతీర్ణా సా యథా వృద్ధ పురస్సరా l

తోయాంతర్భాస్కరాళీవ రేజే ముని పరంపరా ll         కు.సం.6-49

‘ సప్తర్షులు శివునికి పార్వతినిమ్మని అడిగేందుకు హిమవంతుని దగ్గరకు వస్తున్నారు. ఆకాశం నుండి హిమవత్పర్వతము మీదకు దిగుతున్న మునుల వరుస నీటిలోని సూర్య బింబాల వలె ప్రకాశించింది ‘ అని కుమార సంభవంలో కూడ ఉపయోగించాడు. కాళిదాస కావ్యాలనన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే సౌందర్యవంతమైన వర్ణనలను ఒక కావ్యంలో వర్ణించిన దానిని మఱియొక కావ్యంలో వర్ణిస్తూ రసికులను ఆనంద సాగరంలో ముంచాడని స్పష్టమౌతుంది.

హృదయవిదారకమైన వర్ణనలను యథా తథంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించటం కాళిదాసు నైజం. గ్రీష్మర్తువులో ఎండలకు తాళలేక ఆహారాన్ని సరిగా తీసుకొనలేక పోవడం మనకు అనుభవమే. ఎండవేడిమికి నోటి వద్దనున్న పామును తినలేని నెమలిని , ఎండవేడిమికి తాళలేక శత్రువును సైతమాశ్రయించిన పామును –

రవేర్మయూఖైరభితాపితో భృశం

విదహ్యమానః పథి తప్త పాంశుభిః l

అవాఙ్ముఖోs జిహ్మగతిః శ్వసన్ముహుః

ఫణీ మయూరస్య తలే నిషీదతి ll            ఋ.సం.1-13

‘ సూర్యకిరణాలు మొదట మాడ్చినాయి. తరువాత దారిలోని వేడి ధూళులు కాల్చినాయి.  ప్రాకడం మాని తలవంచి నిట్టూరుస్తున్న పాము నెమలి పురి నీడ క్రిందకు చేరుకొన్నది ‘ అంటూ కాళిదాసు అద్భుతంగా వర్ణించాడు. వైరి జంతువులు స్నేహంగా మెలగుతున్నాయని తెలిస్తే అదొక ఆశ్రమమని తలుస్తాము. కాని దారిలో ఎండవేడికి తట్టుకోలేక వైరి ప్రాణులు తమ శత్రుత్వాన్ని మఱచి మెలగినాయని సహజమైన ప్రకృతిని కండ్లకు కట్టినట్లు యిలా వర్ణించటం  కాళిదాసుకు మాత్రమే సాధ్యమైంది.

కుబేరుడు శివపూజకై పూలు తెమ్మని యక్షుని ఆదేశించాడు. ప్రియురాలిపై మనసు నిలిపిన యక్షుడు బాధ్యతను మరిచాడు. దీనిని తెలుసుకున్న కుబేరుడు ‘ సంవత్సర కాలం పాటు నీ ప్రియురాలిని యెడబాసెద ‘ వని యక్షుని శపించాడు. యక్షుడు ప్రియురాలి విరహమనుభవిస్తూ ఎనిమిది నెలలు చిత్రకూట పర్వతంపై గడిపాడు. ఆషాఢమాసంలో కొండ చరియలను క్రమ్ముకొని ఆయనకొక మేఘం కనిపించింది. యక్షుడా మేఘంతో ప్రియురాలికి సందేశాన్ని పంపుతాడు. ఇది ఎక్కడైనను సంభవమా ? అనే సందేహం మనకుదయిస్తుంది. ఇదే సందేహాన్నే కాళిదాసు కూడ వ్యక్తం చేస్తూ –

ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః

సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః

ఇత్యౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యకస్తం యయాచే

కామార్తా హి ప్రకృతి కృపణాశ్చేతనాచేతనేషు ll                 మే.సం.1-5

‘ పొగ , నిప్పు , గాలి – అను వాటి సముదాయ రూపమైన మేఘమెక్కడ ? మనుషులచే పంపనగు సందేశమెక్కడ ? ప్రియురాలిపై అనురాగంతో యిటువంటి ఆలోచన చేయని యక్షుడు మేఘముతో ప్రియురాలికి సందేశం పంపాడు. ఈ పని తగినదే. ఎందుకంటే కాముకులకు చేతనమేది? అచేతనమేది అని ఆలోచించే పరిజ్ఞానముండదు ‘ అని సమాధానం చెప్పాడు.

ఈ ఒక్కమాటనాధారంగా చేసుకొని సందేశాన్ని వస్తువుగా స్వీకరించి నగరాలనన్నిటినీ పరిచయం చేయడం కాళిదాసు వర్ణనా నైపుణ్యానికి నిదర్శనంగా భావించవచ్చు. అంతే కాక సందేశ కావ్యాలలో మేఘ సందేశమే మొదటి కావ్యంగా గమనింపదగినది. అట్లే రామగిరి నుండి అలకా పట్టణానికి వెళ్ళు మార్గంలో ఉజ్జయినీ నగరము లేకపోయినను తనకిష్టమైన  స్థలమైనందుకు మేఘుని దారి మళ్ళించి ఉజ్జయినీ నగరం మీదుగా వెళ్ళమని చెప్పి ఆ నగర శోభను వర్ణించాడు.

వక్రః పంథా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం

సాధోత్సంగప్రణయవిముఖో మాస్మభూరుజ్జయిన్యాః

విద్యుద్ధామస్ఫురితచకితైర్యత్ర పౌరాంగనానాం

లోలాపాంగైర్యది న రమసే లోచనైర్వంచితః స్యాః ll          మే.సం.1-28

‘ ఓ మేఘుడా ! ఉత్తర దిశకు వెళ్ళుచున్న నీకు ఉజ్జయినీ మార్గము వంకరైనను ఉజ్జయినికి వెళ్ళుము. అచ్చట స్త్రీలు నీ మెఱుపులను చూసి భయపడెదరు. అప్పుడు వారి బెదురుచూపులు చాలా సుందరంగా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని చూడనట్లైతే నీ జన్మ వ్యర్థమౌతుంది ‘ అని చెప్పి మేఘుని ఉజ్జయిని మీదుగా మళ్ళించాడు. దీనితో ఉజ్జయినిపై కాళిదాసుకున్న మమకారం వ్యక్తమౌతున్నది.

వేద , పురాణాలలోని కథలను మార్పు చేర్పులు చేసి కాళిదాసు కావ్యాలను రచించాడు. అట్లాగావించిన వాటిలోనే అత్యంత మనోహరమైన ‘ విక్రమోర్వశీయము ‘ అను త్రోటకము ( రూపక భేదాలలో మరొక ఉపభేదము ) ఒకటి. సంధ్యావందనం చేసుకొనుటకు వెళ్ళిన పురూరవుడు చిత్రలేఖ , ఊర్వశి అను అప్సరసల ఆక్రందనలను విని , కేశి అను రాక్షసుడు వారినపహరించుకుని పోతున్నాడని తెలిసికొని వాయవ్యాస్త్రముతో రాక్షసుని చంపి అప్సరసలను విడిపించాడు. అప్పుడు ఊర్వశీ పురూరవుల మధ్య అనురాగమావిర్భవించింది. విక్రమాన్ని చూపి ఊర్వశి హృదయం గెలుచుకొన్నందుకు ‘ విక్రమోర్వశీయము ‘ అను నామధేయమేర్పడింది. కాళిదాసు కావ్యాలలో సూక్తులు చాలా ప్రసిధ్ధి వహించాయి. అటువంటి సూక్తులు విక్రమోర్వశీయంలో అనేకంగా వున్నాయి.

యదేవోపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరమ్ l

నిర్వాణాయ తరుచ్ఛాయా తప్తస్య హి విశేషతః ll      విక్ర.3-21

‘ దుఃఖం తరువాత కలిగే సుఖం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎండలో మాడిన వానికే చెట్టు నీడ విలువ తెలుస్తుంది. ‘ పురూరవుని వద్దకు ఆలస్యంగా వచ్చిన ఊర్వశి అందుకు సంజాయిషీ యిచ్చుకుంటుంది. అప్పుడు పురూరవుడు ఊర్వశిననుయయిస్తూ ఈ మాటంటాడు. సందర్భానుసారంగా యిటువంటి సుందరమైన లోకోక్తులను గుప్పించడం మహాకవి కాళిదాసు కావ్యాల ప్రత్యేకత. అలాగే –

భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్దూర విలంబినో ఘనాః

అనుధ్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణామ్  ll              అ.శా.5-13

‘ పండ్లు కాపుకు వచ్చిన తరువాత చెట్లు యితరులు వాటిని తీసుకోవడానికనుకూలంగా క్రిందకు వంగుతాయి. క్రొత్త నీటిని మోసుకొని వచ్చిన మేఘాలు మిక్కిలి క్రిందకు వంగుతూ అధికంగా వర్షాన్నిస్తాయి. కాబట్టి సత్పురుషులు యెంత సంపదలు లభించినా గర్వించక వినయంగా వంగి వుంటారు ‘ అనే సుప్రసిద్ధమైన ఈ సుభాషితం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం లోనిదే.

కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా l

తత్రాపి చ చతుర్థోంsకః తత్ర శ్లోక చతుష్టయమ్ ll

అనే ప్రసిద్ధమైన శ్లోకమొకటుంది.’ సంస్కృత కావ్యాలలో నాటకం మనోహరమైనది. నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలము , అందులోను  మరల నాలుగవ అంకము , దానిలో నాలుగు శ్లోకాలు రమ్యమైనవి ‘.  ఈ నాలుగు శ్లోకాలలో –

యాస్యత్యద్య  శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా

కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషం చింతా జడం దర్శనమ్

వైక్లబ్యం మమ తావదీదృశమహో  స్నేహాదరణ్యౌకసః

పీడ్యంతే గృహిణః కథంను తనయా  విశ్లేష దుఃఖైర్నవైః  ll    అ.శా. 4.5

అను శ్లోకం మొదటిది. ‘ ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళునని నా హృదయం మిక్కిలి దుఃఖంతో కూడుకొన్నది. కన్నీటిని అణచుకొన్నందుకు గొంతు డగ్గుత్తికతో వుంది. చింత వలన చూపానటం లేదు.  పెంచిన అమ్మాయిని అత్తవారింటికి పంపుటకు అరణ్యవాసినైన నాకే  ప్రేమ వలన  యిట్టి అధైర్యము కలిగితే యిక గృహస్థులు , కని పెంచిన వారు తమ కుమార్తెను క్రొత్తగా భర్త యింటికి పంపుటకు యెంతటి వియోగ దుఃఖాన్ననుభవిస్తారో ‘ – ఇదీ శకుంతలను దుష్యంతుని వద్దకు పంపునపుడు ఆమె పెంపుడు తండ్రియైన కణ్వమహర్షి దుఃఖించిన తీరు. ఆయన ఒక చోట     ‘ వనౌకసః సంతోsపి లోకజ్ఞా వయమ్ ‘ – అడవులలో తిరుగువారైనప్పటికీ మేము లోకం  తెలిసినవారమంటాడు. ఒక లౌకికమైన అమ్మాయి తండ్రి కూతురును భర్త యింటికి పంపునప్పుడు కన్నీరు మున్నీరయ్యే  బాధను తపస్వియైన , అరణ్యవసియైన కణ్వమహర్షి అనుభవించి చూపాడు.

మేఘ సందేశంలో యక్షుడు మేఘంతో సందేశం పంపాడు. ఇక్కడ కణ్వమహర్షి చెట్లతో మాట్లాడుతున్నాడు.

పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా

నాదత్తే  ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్

ఆద్యే  వః  కుసుమప్రసూతిసమయే యస్యా భవ త్యుత్సవః

సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతామ్ ll    అ.శా. 4.8

నాల్గవ అంకంలోని నాలుగు శ్లోకాలలో యిది రెండవ శ్లోకం. కాళిదాసు తన కావ్యాలలో చెట్లకు చాలా ప్రముఖ్యతనిచ్చాడు. ఈ శ్లోకంలో కణ్వమహర్షి  చెట్లతో మాట్లాడుతూ – ‘ మీకు నీళ్ళు పోసి మీరు త్రాగిన తర్వాతనే శకుంతల నీరు త్రాగుతుంది. అట్లా కాక ఆమె ఒకరోజైనను నీరు త్రాగలేదు. ఆమెకు అలంకారాలంటే యెంత యిష్టమున్నను మీపై ప్రేమచే చిగురాకైనను కోయలేదు. మీకు తొలిపూత వచ్చినప్పుడు ఆమె గొప్ప పండుగ చేసుకొనేది. అటువంటి శకుంతల నేడు అత్తవారింటికి వెళ్ళుతున్నది.  కనుక మీరు ఆనతినివ్వండి ‘  అంటాడు. ఆశ్రమ వాసులకు చెట్లు , జంతువులతోనే కదా సాంగత్యము. ఆయన వాటితో అంత కలసిపోయాడు మఱి. అందుకే వాటితోనే తన బాధ వెళ్ళబోసుకుంటున్నాడు. అదే సహజత్వమంటే.

దుష్యంతునికి సందేశాన్ని పంపునపుడు కణ్వమహర్షి యెంతో హుందాగా వ్యవహరించాడు. ఒక వైపు ఆయన చక్రవర్తి. మఱియొక వైపు తనకు అల్లుడు. పెండ్లి ప్రత్యక్షంగా పీటలపై చేసినది కాదు. ఆయనకు తెలియకుండా శకుంతలను గాంధర్వ వివాహమాడి చూలాలిగా చేసి వెళ్ళాడు. అగ్నిహోత్రం వలన ఆ విషయం తెలుసుకొన్న కణ్వమహర్షి యోగ్యుడైన భర్తను పొందావని శకుంతలను అభినందిస్తాడు. అది ఆ విధంగా జరగవలసి వున్నదని తపస్సంపన్నుడైన ఆయనకు తెలిసే వుంటుంది. అలాగే దుష్యంతునికి సందేశాన్ని పంపుతూ –

అస్మాన్ సాధు విచింత్య సంయమధనానుచ్చైఃకులం చాత్మనః

త్వయ్యస్యాః  కథమప్యబాంధవకృతాం స్నేహ ప్రవృత్తిం చ తామ్

సామాన్య ప్రతిపత్తిపూర్వక మియం దారేషు దృశ్యా త్వయా

భాగ్యాయత్త మతఃపరం న ఖలు త ద్వాచ్యం వధూబంధుభిః ll     అ.శా.4.16

‘ నేను తపస్సే ధనముగా కలవాడను. నీవు ఉత్తమకుల సంజాతుడవు. బంధువులు కల్పించుకొనక నీవై నీవే ఈమెను ప్రేమించి పెళ్ళాడితివి. దీనినంతయు గుర్తుంచుకొనుము. ఈమెను తక్కిన నీ భార్యలయందొకతెగా చూసుకొనుము. అటుపై ఈమె అదృష్టాన్ని బట్టి వుండగలదు. అమ్మాయి వైపు వారు యింతకన్నను ఎక్కువ మాట్లాడరాదు ‘ అని విన్నవిస్తాడు. ఈ శ్లోకం ప్రసిద్ధ శ్లోక చతుష్టయంలో మూడవది. ఇందులో ఒకవైపు దుష్యంతుని భయపెట్టడం , మఱియొక వైపు మాకు తెలియకుండా వివాహమాడితివనడం , వినయంగా బ్రతిమాలడం వంటివన్నీ ద్వంద్వార్థంగా కనిపిస్తాయి. తపస్సంపన్నుడైన ఆయన  తలచుకుంటే ఒక్కసారి శపించగలడు. కాని కూతురు పరిస్థితి అడ్డు వస్తున్నది. ఇటువంటి పరిస్థితులు నేటి సమాజంలో అనేకంగా కనిపిస్తున్నాయి. నీవు ఉత్తమకుల సంజాతుడవనడంలో వ్యతిరేకంగా నడచుకొనవు అను వ్యంగ్యార్థం యిమిడి వుంది. బంధువులు కల్పించుకొనక ప్రేమించి పెండ్లాడావనడంలో మాకు చెప్పక మా అమ్మాయిని వలలో వేసుకొన్నావు అని యెత్తిపొడిచినట్లుంది. నీవీమెను ప్రత్యేకంగా చూడవలసిన పని లేదు , నీ యితర భార్యలలో ఒకతెగా చూడమనటంలో శకుంతలను ఆయనకు భార్యగా గుర్తింపు తెప్పించాలనే ఆరాటముంది. కన్య తండ్రి యింతకన్నను యెక్కువ మాట్లాడరాదు , తదుపరి ఈమె అదృష్టమనటంలో ‘ అన్నీ తెలిసి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ‘ కనిపిస్తుంది. లౌకిక జనులు పడే యింతటి మానసికాందోళన కణ్వమహర్షి కనబరుస్తాడు.

కణ్వమహర్షి శకుంతలకు తల్లి , తండ్రి కూడ తానై పెంచాడు. కూతురునత్తవారింటికి పంపునపుడు తల్లి మెట్టినింట్లో నడుచుకోవలసిన పద్ధతిని తెలియజేస్తుంది. ఆ మాటలను కణ్వమహర్షి యెంత సుమధురంగా చెప్పాడో –

శుశ్రూషస్వ గురూన్ , ప్రియసఖీవృత్తిం  సపత్నీజనే ,

భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మ  ప్రతీపం గమః ,

భూయిష్ఠం  భవ దక్షిణా పరిజనే , భాగ్యేష్వనుత్సేకినీ ,

యాంత్యేవం గృహిణీపదం యువతయో , వామాః  కులస్యాధయః ll    అ.శా.4-18

అనే ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ఇది శ్లోక చతుష్టయంలో నాల్గవ శ్లోకము. ‘ అత్తమామలకు సేవలు చేయి. సవతులతో స్నేహంగా మెలగుము. భర్త నీకయిష్టమైన పని చేసినను కోపపడకుము. భర్తకు విరుద్ధంగా నడచుకొనవద్దు. పరిజనులతో దయకలిగి వుండుము. సంపదలు కలిగినందుకు పొంగిపోవద్దు. యువతులు ఈ విధంగా నడచుకొని మంచి ఇల్లాళ్ళని పేరు తెచ్చుకుంటారు. అట్లా నడచుకొనని యువతులు పుట్టినింటికి , మెట్టినింటికీ కూడ మనోవ్యథను కలిగిస్తారు ‘ అని కణ్వమహర్షి శకుంతలకుపదేశిస్తాడు. పై శ్లోకాలు చదివిన వెంటనే యెంతటి వారి గుండె అయినా ద్రవించి కంట నీరు కారవలసినదే. మెట్టినింటికి వెళ్ళు అమ్మాయికి ఇంత మధురంగా ఉపదేశం చేయడం నేటి వారికి సాధ్యమగునా ?. అది మహాకవి కాళిదాసు కణ్వమహర్షి నోట పలికించాడు.

దుష్యంతుడు శకుంతల చెలికత్తెలను పరిచయం చేసుకొని శకుంతలను గూర్చి తెలుసుకున్న తరువాత యిద్దరిలోనూ అనురాగామంకురించినది. రాజు శకుంతలను వదలిపెట్టి తన విడిదికి వెళ్ళబోతూ –

గచ్ఛతి పురశ్శరీరం ధావతి పశ్చాదసంస్తుతం చేతః l

చీనాంశుకమివ కేతోః ప్రతివాతం నీయమానస్య ll      అ.శా.1-29

‘ రథానికి కట్టిన జెండా ఎదురుగాలికి ముందు భాగము వెనుకకు వుండునట్లుగా ఎగురుతుంది. అదే విధంగానే నా శరీరం ముందుకు వెళ్ళుచుండగా మనస్సు మాత్రము జెండా వలె వెనుకకు మల్లుచున్నది ‘ అని తలపోస్తాడు. దుష్యంతుని మనస్సు ఒకచోట , శరీరమొక చోట వుంది. శరీరమేమి చేస్తున్నదో తెలియక మనస్సు వెనుకకు మళ్ళుచున్నది. ఇచ్చట దుష్యంతుని మనస్సుకు జెండా కు చెప్పిన ఉపమానమెంతో సహజంగా వుంది.

ఒక కన్యను ఎన్ని రకాల మనోహరంగా వర్ణించవచ్చో మహాకవి కాళిదాసు యొక్క-

అనాఘ్రాతం పుష్పం , కిసలయమలూనం కరరుహై

రనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసమ్

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం

న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః ll  అ.శా,2-10

అనే శ్లోకంలో చూడవచ్చు. ‘ శకుంతల రూపం యింకనూ వాసన చూడని అప్పుడే పూసిన పూవు.  మాయని , గోటితో గిల్లని క్రొత్త చిగురు. ఇంకనూ రంధ్రము వేయని తీర్చిన ముత్యము. ఇంకనూ తీపు చవి చూడని క్రొత్త పూదేనె. మనోహరమైన , పరిపూర్ణమైన పుణ్యాలకు ఫలము. అటువంటి శకుంతలననుభవించడానికి బ్రహ్మ యెవరికి రాసి పెట్టాడో నాకు తెలియకున్నది ‘ అని  అంత వఱకు యెవ్వరునూ ముట్టనిది , ఎవరూ అనుభవించనిది , పుణ్యాలకు ఫలమైనది మొదలైన వాటికంతా మధురమైన ఉపమానాలను ఈ శ్లోకంలో కూర్చాడు కాళిదాసు. అంతేకాదు ‘ పుణ్యం కొద్దీ పురుషుడు ‘ అని తెలుగులో ఒక నానుడి వుంది. అట్లే ‘ పుణ్యం కొద్దీ స్త్రీ ‘ అని కూడ ఇక్కడ కాళిదాసు వర్ణనలో మనకు కనిపిస్తుంది. శకుంతలను పొందాలనుకొనువాడు అంత పుణ్యం చేసుకొని వుండాలని కాళిదాసు చెప్తున్నాడు.

మనము వెండితెరపై నాయకుడు ఒక్కొక్కమారు అభినయించే తొట్రుపాటును చూస్తుంటాము. అటువంటిదే కాళిదాసు దుష్యంతుని పాత్రలో చూపాడు. దుష్యంతుడు తాను శకుంతలయందనురక్తుడైన విషయాన్ని విదూషకునికి అంతకు ముందొకసారి తెలియజేశాడు. పరిస్థితిని బట్టి విదూషకుని అంతఃపురానికి పంపవలసివస్తుంది. అప్పుడు చపలుడైన విదూషకుడు అంతఃపుర స్త్రీలకు తన రహస్యాన్ని బహిరంగ పరుస్తాడనే భయంతో అంతకు ముందు శకుంతలను తాను ప్రేమిస్తున్నట్టు చెప్పిన విషయం అసత్యమని దుష్యంతుడు విదూషకునికి తెలియజేస్తూ –

క్వ వయం క్వ పరోక్ష మన్మథో

మృగశాబైస్సమమేధితో జనః l

పరిహాస విజల్పితం సఖే !

పరమార్థేన న గృహ్యతాం వచః ll               అ.శా.2-31

‘ మిత్రమా ! నీతో యింత వఱకు నేను చెప్పినదంతా తమాషాకు మాత్రమే , నిజం కాదు. నేనెక్కడ ? మన్మథుడెక్కడ ? జింక పిల్లల మధ్యలో పెరిగిన ఆమె ఎక్కడ ? ఇదంతయు నమ్మవద్దు ‘ అని చెప్తాడు. ఇందులో దుష్యంతుడు కనబరచిన తొట్రుపాటును కాళిదాసు కండ్లకు కట్టినట్టుగా వర్ణించాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే మహాకవి కాళిదాసు ప్రతి శ్లోకమూ గ్రాహ్యమే. ఆయనకు వివిధ శాస్త్రాలలో వున్న అభినివేశము అపారము. ఆలోచిస్తే వాల్మీకి , వేదవ్యాసులను విష్ణువు అవతారాలుగా పేర్కొన్నట్లు కాళిదాసు కూడ భగవదవతారాలలో ఒకడనిపిస్తుంది. అంతటి లోకజ్ఞానము , శాస్త్ర జ్ఞానము కాళిదాసు కవిత్వంలో కనిపిస్తుంది. అందుకే కాళిదాసు కవికుల గురువైనాడు. కాళిదాసు గుఱించి పేర్కొనే ప్రతి ఒక్కరూ గ్రంథ విస్తార భీతినెదుర్కొన వలసిందే. ఈ వ్యాసము కేవలము స్థాలీపులాక న్యాయముగా పొందుపరచినది మాత్రమే. అరగదీసిన కొలదీ గంధపు చెక్క సువాసనలను వెదజల్లుతుంది. మహాకవి కాళిదాసు కవితాసౌందర్యం కూడ అట్టిదే అనటంలో అతిశయోక్తి లేదు.

 

జై హింద్

 

2 thoughts on “కాళిదాస కవితా సౌందర్యము

  1. చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యాసం ఒక మంచి సినిమా చూసిన దానికన్నా కూడా మించిన ఆనందాన్ని పొందాను ఈ వ్యాసం చదవడం ద్వారా. చాలా చక్కటి వివరణ. రచయితకు మరియు ప్రచురణకర్తలకు నా ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *