“పంపనార్యుడు” – చారిత్రక సాహిత్య కధామాలిక – 5

రచన: మంధా భానుమతి               mantha bhanumathi

బనవాసి.. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. అక్కడ అడుగిడినప్పటినుండి పంపనార్యుడు పరవశించి పోని క్షణం లేదు. ప్రాసాదంలో రాజుగారికి సలహాదారుగా, పాఠశాల నిర్వాహకునిగా ప్రజలందరి మన్ననలు పొందుతున్నాడు. తను రాయదల్చుకున్న కావ్యానికి కావలసిన శోధన, జ్ఞాన సముపార్జన చేస్తూనే కర్తవ్య నిర్వహణకి బద్ధుడై ఉన్నాడు. మంచిరోజు చూసుకుని, కావ్యారంభం చెయ్యాలని అనుకుంటుండగా రాజుగారి వద్ద నుంచి వర్తమానం.. సంశయిస్తూనే అందుకున్నాడు.

రాజు కబురందుకుని వెళ్లిన పంపనార్యుడు, రాజావారి ఆనతితో కూడిన విజ్ఞాపన శిరసావహించి తన మందిరానికి వచ్చాడు. ఆహారం మీద ఇఛ్ఛ లేకున్నా ఏదో కతికాననిపించి, శయ్యపై శయనించి దీర్ఘంగా నిట్టూర్పు విడిచి సభలో జరిగిన విషయాలు మననం చేసుకున్నాడు.

మాన్యకేతం నుంచి రాష్ట్రకూట చక్రవర్తి మూడవ ఇంద్రుడు అత్యవసర వర్తమానం అంపాడు. వార్తాహరుడు ప్రాసాదంలో ఉండగానే రాజావారి సలహాదారులలో ఒకరైన పంపనార్యుని పిలవనంపాడు రాజు.

“మా పూర్వీకులు కోల్పోయిన రాజ్యాన్ని ఘూర్జర ప్రాతిహారుల నుంచి తిరిగి సంపాదించాలని నిశ్చయించాము. ప్రాతిహార రాజు మహీపాలునిపై  యుద్ధానికి సన్నద్ధులై మమ్ము అనుసరించవలసిందిగా కోరుచున్నాము. ఆరేడు దినములలో ఉత్తర దిక్కుగా పయనిస్తున్నాము.”

వార్తని చదివి వినిపించిన వార్తాహరుడు, చేతులు కట్టుకుని నిలబడ్డాడు.. సమాధానం కోరుతూ.

“పంపనార్యా! మీరే రాజ్యక్షేమం చూసుకోవాలి.. మేము యుద్ధానికేగిన సమయంలో. అంగీకరిస్తే వర్తమానం పంపి, రేపే పయనం సాగిస్తాం.”

పంపన్న ఏమనగలడు? మాటవరసకి అంగీకారం అన్నారు కానీ.. అది ఆజ్ఞే కదా!

తన కావ్యరచన మాటేమిటి?

ఆలోచనల్ని అధిగమిస్తూ కన్నులు మూసి నిద్రకి ఉపక్రమించాడు.

 

అమోఘవర్ష చక్రవర్తి ఆస్థాన పండితుడు జినసేనుడు. జినసేనాచార్యుడు, జైన మత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ రచించిన ఆదిపురాణ కావ్యాన్ని కన్నడంలో రచించి, తండ్రిగారైన భీమనప్పయ్య ఆశయాన్ని కొంతవరకైనా నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు పంపన్న. అప్పటివరకూ, రాజ్యపాలనలో పాల్గొంటునే క్షుణ్ణంగా ఆదిపురాణంలో, పూర్వ పురాణాన్ని, ఉత్తర పురాణాన్ని అధ్యయనం చేశాడు.

తన మీద పడ్డ భాద్యత  నిర్వహిస్తూనే, మరింత అవగాహనతో కావ్యరచన సాగించడానికి అవకాశం వచ్చిందనుకున్నాడు పంపన్న. తను అధ్యయనం చేసిన విషయాలని మరొక్కసారి సింహావలోకనం చెయ్యదలచాడు.

జినసేన ఆచార్యుడు, అమోఘవర్ష చక్రవర్తి అభ్యర్ధనతో ఇరవైనలుగురు తీర్ధంకరుల చరిత్రని సంస్కృతంలో రచించారు. అదే మహాపురాణంగా ప్రాశస్త్యం పొందిన ఆదిపురాణం. అందులో నలభై రెండు పర్వాల పూర్వపురాణం తరువాత కావ్యరచన ఆగిపోతే.. జినసేనుడి శిష్యుడు, గుణభద్రుడు తరువాతి తీర్థంకరుల చరిత్రలను, ముప్ఫై నాలుగు పర్వాలుగా ఉత్తరపురాణం అనే పేరుతో పూర్తి చేశాడు. పంపనార్యుడు, మొదటి తీర్ధంకరుడైన రిషభదేవుని చరిత్రను, ఆయన పది అవతారాలను కన్నడంలో రచింప పూనుకున్నాడు.

సంస్కృత ఆదిపురాణం పూర్తిగా పద్యకావ్యం. పంపనార్యుడు, ఆ కావ్యాన్ని చంపు పద్ధతిలో రచింప నిశ్చయించాడు. అందులో పద్యం, వచనం రెండు ఉంటాయి. వచనంలో వివరణ బాగా ఇవ్వడానికి వీలు అవుతుంది. వర్ణనలు అలవోకగా సాగుతాయి.

రిషభదేవుడిని ఆదినాధుడనీ, ఆదీశ్వరుడనీ కూడా పిలుస్తారు. జైన మతస్థులు, హిందువులు కూడా దేమునిలాగ కొలుస్తారు. హిందువులు ఆయన్ని విష్ణుమూర్తి అవతారంగా, జైనులు మూడు, నాలుగు శతాబ్దాల నుంచీ ప్రధమ తీర్ధంకరుడిగా భావిస్తున్నారు.

(చరిత్రకారులు మొదటి తీర్ధంకరుడైన రిషభదేవునికీ, సింధునాగరికతకీ సంబంధముందని భావిస్తారు. మొహంజాదారో శిల్పాల్లో కనిపించే వృషభాల అచ్చుల్ని రిషభుని రూపాలుగా అన్వయించారు. పురావస్తు శాఖ వారి ఆధారాలని బట్టి, రిషభదేవుడిని, రాతియుగం అంతంలో, వ్యవసాయ యుగం ఆరంభంలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ఆ శిధిలాలలో లభ్యమైన శిల్పాలలో జైనుల ’కాయోత్సర్గ’ యోగాసనంలో ఉన్న అనేక శిలలు కనిపిస్తాయి.)

పంపన్న,  ఆదిపురాణంలో పదిహేనవ పర్వంలో ఉన్న రిషభదేవుని కాయోత్సర్గ యోగ భంగిమ వర్ణనని గుర్తు చేసుకున్నాడు. రిషభదేవుడు నాగరికతని ప్రజలకి పరిచయం చేశాడు. పంటలు పండించడం, కుండలు తయారీ, వండుకుని తినడం, కుటుంబ వ్యవస్థ, శిల్పాలు చెక్కడం.. జంతువులని పెంచడం వంటివన్నీ నేర్పించాడు. మరణించిన వారికి సంస్కారం చెయ్యడం, పర్వదినాల్లో ఇంద్రుడు, నాగదేవత మొదలైన వారిని కొలవడం కూడా అతని ద్వారా సంక్రమించినవే. డెబ్భై రెండు రకాల విజ్ఞాన శాస్త్ర పద్ధతులని నేర్పించాడు. అందులోవే గణితం, పద్య రచన, బొమ్మలు వెయ్యడం మొదలైనవి. ఆధునిక నాగరికతకి ఆద్యుడని చెప్పవచ్చు. అందుకే ఆయన్ని ఆదినాధుడు అని స్తుతించారు.

కోసల రాజ్యాన్ని పాలించిన రిషభదేవుడు అయోధ్యలో నాభిరాజుకి, మేరుదేవికి జన్మించాడని భాగవత పురాణంలోనూ, స్కందపురాణంలోనూ కూడా చెప్పబడింది. రిషభునికి ఇరువు భార్యలు, సునంద, సుమంగళి. నూరుగురు పుత్ర సంతానం ఉన్నా రాజ్యార్హత కలిగినవారు ఇద్దరే, సునంద కుమారుడు బాహుబలి, సుమంగళి పుత్రుడు భరతుడు. భరతుడు అయోధ్య రాజధానిగా ఉత్తరావనిని, బాహుబలి పోదనపురం రాజధానిగా దక్షిణాపథాన్ని పాలించారు.

పంపనార్యునికి మెలకువలో, కలలో, నిదురలో కూడా కావ్యరచన ధ్యానమే.

ఎట్టకేలకు యుద్ధం ముగిసింది. ఘూర్జర రాజధాని కనౌజ్‍ను స్వాధీనం చేసుకుని విజయోత్సాహలతో చక్రవర్తి, మాన్యకేతానికి మరలారు. బనవాసి రాజు కూడా ఆనందంతో తన దేశానికి వచ్చి, పాలనను స్వీకరించారు.

పంపనార్యునికి యుద్ధంలో గెలిచిన ఆనందం కన్నా, అందులో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, దిక్కులేని వారైన వారి కుటుంబాలు, వారి వేదనలు రోదనలు వినిపించ సాగాయి. రాజుగారి అనుమతి తీసుకుని, తను కోరుకున్న కుటీరం దూరంగా కొండ మీద నిర్మించుకుని, కావ్యరచన సాగించారు.

తన కవిత్వం “పరమ జినేంద్ర ముఖచంద్ర వాక్చంద్రికా ప్రసర ప్రసాధోర్ణం” అని పంపనగారు విశ్వసించారు. అది ముమ్మాటికీ నిజమని ఆయన కావ్యాలు పఠించిన వారికి అవగతమే. యుద్ధానంతరం జైన ధర్మాన్ని మరింత ప్రాచుర్యంలోనికి తేవాలని ధృఢనిశ్చయులై, ఆదిపురాణ కావ్యాన్ని పదహారు ఆశ్వాసాలలో మూడు మాసములలో ముగించారు.

రిషభదేవుని పంచ కళ్యాణాలనూ తన కావ్యంలో సవిస్తరంగా కథనం చేశారు. ఆయన కుమారులైన బాహుబలి, భరతుడు రాజ్యంకోసం చేసిన యుద్ధంలో బాహుబలి విజయం సాధిస్తే చిన్నబుచ్చుకున్న తమ్మునికి మొత్తం రాజ్యం ధారాదత్తం చేసి, తాను సన్యాసం పుచ్చుకుని, అహింసా ధర్మాన్ని పాటించి మోక్షాన్ని సాధించినట్లు పంపన్న చెప్పారు. రిషభదేవ కుమారుడైన భరతుని పేరనే భారతావనికి ఆ పేరు వచ్చిందని అంటారు.

పంపనగారు తన ముప్ఫైతొమ్మిదో ఏట ఆదిపురాణ రచన చేశారు. లలిత పదాలతో, కోమలంగా, మృదుసందర్భంగా కావ్యగుణాలతో, వచన రచనలో చతురుడై పంపనగారు బుధజన ప్రియుడయ్యారు.

పంపనార్యుని ఖ్యాతి దక్షిణాపథం అంతా వ్యాపించి వేములవాడ చాళుక్య రాజు అరికేసరి వీనుల చేరింది.

వెనువెంటనే పంపనార్యునికి అరికేసరి ఆస్థానంలోకి ఆహ్వానం అందింది.

చక్రవర్తికి ఆత్మీయులైన చోళరాజు విజ్ఞాపనని కాదనగలడా బనవాసి రాజు!

తాను పెరిగిన ఊరు, ఆటలాడిన వాడ.. తానంటే అంతులేని అభిమానమున్న సోదరుని వద్దకేగ గల చక్కని అవకాశం.. పంపనార్యునికి మాత్రం ఏమభ్యంతరం?

———————

1 thought on ““పంపనార్యుడు” – చారిత్రక సాహిత్య కధామాలిక – 5

Leave a Comment