May 26, 2024

బియాండ్ కాఫీ – బోల్డ్ అన్డ్ స్ట్రాంగ్

పుస్తక సమీక్ష : కత్తి మహేష్ కుమార్ mahesh

 

 

 అస్తిత్వ వాదాల హోరులో తెలుగుసాహిత్యం పోటెత్తుతున్న సమయంలో సైలెంటుగా సమాజాన్ని సమూలంగా మార్చేస్తున్న  గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ గురించి వచ్చిన కథలు తక్కువనే చెప్పుకోవాలి. అస్తిత్వస్పృహల్ని కూడా తికమకకి గురిచేసే విచిత్రమైన మార్పులు గ్లోబలైజేషన్ తీసుకొచ్చేసింది. “వన్ ఈజ్ మెనీ” అనే మిథికల్ విశాలత్వం “గ్లోబల్ విలేజ్” అనే మరీచిక మాటున మనల్నీ భ్రమలకి గురిచేస్తూవచ్చింది. ఈ ధోరణుల్ని ,పోకడల్ని మానవ సంబంధాల్లో మరీ ముఖ్యంగా స్త్రీ-పురుష సంబంధాల్లో మరియు యాస్పిరేషనల్ ఆర్థిక విధానాలు తెచ్చిన అతలాకుతలాన్ని కుప్పిలి పద్మ లాంటి రచయిత్రులు కథలుగా రికార్డు చేస్తే, ఇప్పుడు అదే గ్లోబలైజేషన్-అర్బనైజేషన్ మనుషుల్లో తెచ్చిన మానసిక విచ్చితిని, డీవియన్స్ ని  రికార్డు  చేసిన  సంకలనం  ప్రముఖ కథకుడు  ఖదీర్ బాబు నుంచీ వచ్చింది. అదే “బియాండ్ కాఫీ”.

   ఎ లాట్కెన్ హ్యాపెన్ ఓవర్ అ కప్ ఆఫ్ కాఫీఅని ఉంటుంది కేఫే కాఫీడేలో. ఆ లాట్ కన్నా ఇంకా ఎక్కువజరిగిపోతున్న మాడ్రన్పోస్టుమాడ్రన్ జీవిత శకలాల్లోని హాలాహలపు చుక్కలని వడగట్టిన డికాషన్ ని, అంతరాలాల్లో మనుషులుగా విరిగిపోయిన మానవత పాలతో కలిపి వండి వార్చిన చిక్కటి కషాయం లాంటి కాఫీ మహ్మద్ ఖదీర్ బాబు బియాండ్ కాఫీకథల సంకలనం.కాలపు వేగంలో నింపకుండా మిగిలిపోయిన శూన్యాలు. జీవితాదర్శాల ప్రమాణాల్లో పావర్టీని విజయవంతంగా తెచ్చిన పోస్ట్ లిబరల్ మార్కెట్ నేపధ్యంలోని నియోరిచ్ రుగ్మతలు. అర్బన్ మిడిల్ క్లాస్ ఎదగాలనే యాస్పిరేషన్లొ కోల్పోతున్న ఆనందాలు. పాల్పడుతున్న డీవియన్సులూ. మనచుట్టు ఉన్న మనుషులు, రోజూ కలుస్తున్న మనుషులు, మనకు బాగా తెల్సిన మనుషులే అన్ని కథల్లోనూ. కానీ వీటి గురించి మనం మాట్లాడం. ఒక ఇబ్బందికరమైన మౌనాన్ని ఆశ్రయిస్తాం. ఆ మౌనాన్ని ఛేధించిన కథలు ఇవి. చదువుతున్నంతసేపూ కొంత ఇబ్బందికి కలిగిస్తాయేమో. కొంత జుగుప్సకూ కారణమౌతాయేమో. కానీ చివరకు, సమకాలీన మానవ చరిత్రను డాక్యుమెంట్ చేసే క్రియేటివ్ ఎండెవర్ గా మిగిలిపోతుందేమో.

బియాండ్ కాఫీ  నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త కోణం. పది కథలు, కొన్ని వేల ప్రశ్నలు. ఒక్కో కథ గురించీ చెప్పాలంటే….1. ఆస్తి: ఆస్తి/డబ్బు ఒక మానసిక రుగ్మత అని ఒక మానవబలహీనతలతో ఆడుకునే  ఫకీరుతో సజెస్ట్ చేయించడం ఒక గొప్ప మతలబు ఈ కథలో. కథనపరంగా అక్కడక్కడా కొన్ని సందేహాల్ని మిగిల్చినా, ముగింపు బలంతో గుర్తుండిపోయే కథ ఇది.

 

2. ఘటన: కొన్ని తెలియని ఘటనలు జీవితాన్ని మళ్ళీ దార్లో పెడతాయి. గమ్యం తప్పినవాళ్ళని గతిలో పెట్టడానికి అప్పుడప్పుడూ అనుకోని ఘటనలే కారణమౌతాయి. వాటికి పెద్ద లాజిక్కులు ఉండవు. అలాంటి ఘటన ఇది.

 

3. టాక్ టైం: టైం లేని కుటుంబ సభ్యులమధ్య కేవలం మొబైల్ ఫోనులోని టాక్ టైం జీవితానికి ఆలంబన అయిన ఒక స్త్రీ జీవితపు శూన్యం కథ ఇది. ఆ శూన్యాన్ని పూరించుకునే డీవియంట్ ప్రయత్నం కథ ఇది. ఒక లోతైన మానసిక విష్లేషణ పెద్ద పదాలు, సాంకేతిక భాషా ఉపయోగించకుండా చేసిన కథ.

 

4. వహీద్: బాల్యచాపల్యపు ప్రేమలగురించి చలం తర్వాత బహుశా ఖదీరే రాశాడేమో. ఇదొక ప్రేమకాని ప్రేమ కథ. మోహం లేని పరవశం కథ.

 

5. మచ్చ: మానసిక రుగ్మతలు మచ్చలుగా బాహ్యశరీరంపైన కనిపిస్తాయంటారు. లోలోపలి అసంతృప్తులు అనారోగ్యాలుగా పరిణమిల్లుతాయంటారు. అలాంటి ఒక మచ్చకథ ఇది. కథలో ఈ మచ్చ ఒక మెటఫర్ కావొచ్చు, కానీ ఈ మచ్చ ఒక నిజానికి వార్నింగ్ లాగానే అనిపించింది నాకు.

 

6. ఏకాభిప్రాయం: లౌక్యం దినచర్యగా మారినప్పుడు అనుబంధాలు కూడా కన్వీనియన్స్ ప్రకారం ఏర్పడిపొతాయి. ఏకాభిప్రాయం కుదరాలేగానీ మేక పులితో స్నేహానికైనా రెడీ అయిపోదూ ! ఖదీర్ ఈ కథలో చాలా చెప్పేసాడు. ఎంతమంది రోజువారీ జనాలు కనిపిస్తారో ఈ బుల్లి కథలో.

 

7. పట్టాయ: పెరిగిన డిస్పోజబుల్ ఇన్ కం తోపాటూ పెరిగిన సెక్స్ ఆకలిని తీర్చే డెస్టినేషన్ బ్యాంకాక్ లోని పట్టాయ. ఆ సెక్స్ టూరిజం వీధుల్లో తీరే ఆకలితోపాటూ ఆ ఆకలితీర్చేవాళ్ళ వెనకున్న ఆకలిని తెలిపే కథ ఇది. పెరిగిన నిడివి, మరీ సా….గతీసిన సంభాషణల్ని తట్టుకుంటే ఇదీ ఒక మోడ్రన్ సాగాయే.

 

8.అపస్మారకం : కామం కళ్ళు కమ్మేసినవేళ స్పృహలోకి రావడానికి ఒక కుదుపు అవసరం. ఆ కుదుపు ఈ కథ. అవసరానికి ఒకరు, ఆశగా మరొకరు ఒకటవ్వాలనుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా స్పృహవస్తే. మంచి కథ. ఎవరికైనా జరగగలిగే కథ. మనం అంత ఈజిగా ఒప్పుకోలేని కథ.

 

9. ఇంకోవైపు: సంసారం సమాజం ఏవైపుకెళ్ళినా స్త్రీకి దక్కే మానసిక శారీరక విఛ్ఛితికి ఉదాహరణ ఈ కథ. అంతగా డైజెస్ట్ అవని కోణం ఇది. నిజంగా తీసుకుంటే కడుపులో దేవేసె కథ. మెటఫర్ గా తీసుకుని కన్వీనియంటుగా పక్కకి తోసేసినా మనసుని కలిచేసే కథ.

 

10. బియాండ్ కాఫీ: మాడ్రన్పోస్టుమాడ్రన్ జీవిత శకలాల్లోని హాలాహలపు చుక్కలని వడగట్టిన డికాషన్ ని, అంతరాలాల్లో మనుషులుగా విరిగిపోయిన మానవత పాలతో కలిపి వండి వార్చిన చిక్కటి కషాయం లాంటి కాఫీ

ఈ కథ అందుకే ఈ కథా సంకలం బియాండ్ కాఫీ అయ్యిందేమో.

 

ఎవరో అన్నట్టు ఇవి బూతులేని బూతుకథలు. అశ్లీలతలేని అశ్లీలకథలు. జుగుప్సని, నిరసనని, అసంతృప్తిని కలిగించి…”కథలేనా ఇవి” అని ప్రశ్నింపజేసుకునే కథలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *