May 19, 2024

వినిపించని రాగాలే – పారసీక ఛందస్సు – 4

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు                     j.k.mohanrao

 

సామాన్యముగా పాటలలోగాని, పద్యాలలో గాని అనాదినుండి చతుర్మాత్రల ఉపయోగము ఎక్కువ. తెలుగు కన్నడ భాషలలో ఖ్యాతి కెక్కిన కందపద్యము చతుర్మాత్రాయుక్తమైనదే. అలాగే రామదాసు, త్యాగరాజువంటివారి  కృతులలో కూడ  మనకు చతుర్మాత్రలు పదేపదే కనబడుతాయి.

 

పారసీక ఛందస్సులో హజజ్ ముసమ్మన్ అఖ్రబ్ అనే ఒక ఛందస్సు గలదు. దానిని ఇలా వివరిస్తారు: ==- / -=== // ==- / -=== . మధ్యలో పదచ్ఛేద విరామయతి ఉండాలి. పాదములో రెండు భాగములు ఒకే విధముగా త-య-గ గణములతో నుంటాయి.  దీని గణములు –  త య గ త య గ లేక త య మ స గగ. ఈ గణములతో వృత్తము లేకపోయినా, ఇందులో సగమైన త-య-గ గణములతో వేధా అనే వృత్తము గలదు. వేధా (బ్రహ్మ లేక విష్ణువు అని అర్థము) వృత్తమునకు క్రింద ఉదాహరణలు –

 

వేధా – త య గ, యతి లేదు

7 ఉష్ణిక్ 13

 

వేధా తలపై నేదో

గాథల్ బలు వ్రాసేవే

ఆధారము నీవేగా

నీ ధారుణి జీవించన్

 

వేళాయెను రారాదా

నీ లాస్యము జూడంగా

నే లెస్సగ బాడంగా

పాలాయెనుగా జ్యోత్స్నల్

 

రెండు వేధావృత్తములను ప్రక్క ప్రక్కన ఉంచితే మనకు పైన చెప్పబడిన పారసీక ఛందస్సు లభిస్తుంది. దానిని విభాత అని పిలువ దలచాను. క్రింద ఉదాహరణలు –

 

విభాత – త య మ స గగ  UUI IUUU / UUI IUUU, యతి, విరామయతి (1, 8)

14 శక్వరి 1549

 

ఆనంద విభాతమ్మే – ఆనంద విభావమ్మే

ఆనంద విలాసమ్మే – ఆనంద వికాసమ్మే

ఆనంద పయోజమ్మే – ఆనంద పరాగమ్మే

ఆనంద మలోలమ్మే – ఆనంద మనంతమ్మే

 

విభాతను పరిశీలిస్తే పూర్వోత్తర భాగాలలో ప్రతి దానిలో మూడు చతుర్మాత్రలు ఉన్నాయి.  పదములను చతుర్మాత్రలుగా విడదీసి వ్రాసిన ఉదాహరణ నొకటి వ్యావహారిక భాషలో క్రింద ఇస్తున్నాను –

 

చూడా కుసుమారామం – చూడా భ్రమారావాసం

చూడా అరుణాకాశం – చూడా ఖగసంచారం

చూడా సికతాక్షేత్రం –  చూడా జలకల్లోలం

చూడా జనసందోహం – చూడా రసికానందం

 

ప్రేమే మన కానందం – ప్రేమే మన కారాధ్యం

ప్రేమే మన కాకాశం – ప్రేమే మధురక్షేత్రం

ప్రేమే ప్రియ సంగీతం – ప్రేమే నవ సద్గీతం

ప్రేమే మృదులారావం – ప్రేమే మృతసంజీవం

 

ఇలాటి ఛందస్సులో పాటలను వ్రాయాలంటే మనము మాత్రాఛందస్సులో వ్రాయాలి.  మూడు చతుర్మాత్రలు, విరామము, మళ్లీ మూడు చతుర్మాత్రలుగా ఉన్న అమరికతో పాటలు రాణిస్తాయి.  దానికి ఉదాహరణ –

 

ఎటు జూచిన పుష్పములే – ఎటు జూచిన వర్ణములే

ఎటు జూచిన మధుపములే – ఎటు జూచిన మధురములే

ఎటు జూచిన గీతములే – ఎటు జూచిన ప్రీతములే

ఎటు జూచిన చూతములే – ఎటు జూచిన పూతములే

 

ఎటు జూచిన మాలికలే – ఎటు జూచిన తూలికలే

ఎటు జూచిన నీలిమలే – ఎటు జూచిన శుక్లిమలే

ఎటు జూచిన నృత్యములే – ఎటు జూచిన ముత్యములే

ఎటు జూచిన నందములే – ఎటు గన నానందములే

 

పై విభాత వృత్తమును మాత్రాఛందస్సులో ఆఱు చతుర్మాత్రల అమరికతో పదవిచ్ఛేద యతితో, అక్షర యతితో క్రింద రెండు గజలులను వ్రాసినాను –

 

1) నిను జూచిన తక్షణమే – నెఱ యయ్యెను నా హృదయము(యం)

కను లెత్తుము కల్పలతా – కడు సొంపగు నా హృదయము(యం)

 

ప్రణయాద్భుత నాదమ్మే – ప్రణవమ్ముగ మ్రోగెనుగా

అణిమాదు లనవసరమే – యరవిందమె నా హృదయము(యం)

 

కనకాంబరధారిణి నే – కనకమ్మును గాంచితిగా

వినువీథిని తారకలే – వెలిగించెను నా హృదయము(యం)

 

అనిలమ్ముల గంధముతో – నలరారెను సంధ్య గదా

తను వూగే నూయెలగా – తకతైయనె నా హృదయము(యం)

 

2) విధి యాడెడు కేళికలో – ప్రియ నే నొక పావేనా

ముద మెప్పుడొ యీ మదిలో – పులకించగ నా కౌనా

 

నదిలో మన మిర్వుర మా – నాడతి యానందముగా

పద మాలాపించితిమే – స్వరముల నది యిక నౌనా

 

పున్నమి చంద్రుని గాంచుచు – బూవుల నాఘ్రాణించుచు

వెన్నెలలో విహరించుచు – బ్రియ ముద్దాడగ నౌనా

 

క్రొన్నెల వెల్గుల భ్రమలో – గుసగుస మాటల నాడుచు

మిన్నున తారల నెంచుచు – మృదువుగ నవ్వగ నౌనా

 

ఈ ఛందస్సు ప్రత్యేకత మూడు చతుర్మాత్రలు పక్కపక్కన రావడము, తరువాత విరామము, మళ్లీ మూడు చతుర్మాత్రలు.  మూడు చతుర్మాత్రలు 12 మాత్రలకు సమానము. ఈ 12 మాత్రలను 6, 6 మాత్రలుగా కూడ విడదీయవచ్చును. అప్పుడు అది రూపక తాళానికి సరిపోతుంది.  పై రెంటికి పాటలను ఉదహరిస్తున్నాను.

 

మొదటిది చదువుకున్న అమ్మాయిలు అనే చిత్రములోని సుశీల పాడిన వినిపించని రాగాలే అనే పాట ( http://www.youtube.com/watch?v=ezM9GCfc_VQ ).

హిందీలో (ఉర్దూలో) బారాదరి చిత్రానికి నాషాద్ దర్శకత్వములో (నౌషాద్ కాదు) తలత్ మహమ్మద్ పాడిన తస్‌వీర్ బనాతా హూఁ తస్‌వీర్ నహీఁ బన్‌తీ అనే పాట (  http://www.youtube.com/watch?v=Ob3MPqXlSoI  ) ఈ ఛందస్సుకు ఒక చక్కని ఉదాహరణ.

 

కర్ణాటకసంగీతము నభ్యసించేటప్పుడు పాడే వరవీణా మృదుపాణీ గీతము (  http://www.youtube.com/watch?v=-ZqZQYYw53w  ) 6, 6 చేర్చగా వచ్చిన 12 మాత్రలతో శోభిల్లే పాట. ఈ పాట సామాన్యముగా సరస్వతిపైన అనుకొంటారు, కాని ఇది లక్ష్మీదేవిపైన పాట.

 

 

1 thought on “వినిపించని రాగాలే – పారసీక ఛందస్సు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *