December 3, 2023

సంపాదకీయం : మనమేం చేయగలం??

 

ఈనాడు ప్రపంచవ్యాప్తంగా  చాలా అభివృద్ధి చెందాం. అన్ని రంగాలలో స్త్రీ పురుషులు సమానంగా పని చేస్తున్నారు. వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు అంతరిక్షంలోకి కూడా దూసుకువెళ్తున్నారు.

శభాష్!!!….

ఇది వినడానికి చాలా బావుంటుంది. సంతోషంగా, గర్వంగా కూడా ఉంటుంది. ఆడపిల్లకు చదువెందుకు? అనే రోజులు పోయి చదువు ఎందుకు వద్దు. చదవాలి . తనకంటూ ఒక గుర్తింపు, ఆర్ధిక స్వావలంబన ఉండాలి అంటున్నారు. అమ్మాయిలు కూడా చదువుకుని ధైర్యంగా పోటీప్రపంచంలో దూకుతున్నారు.  ఉన్నత విద్యావంతులై అన్ని రంగాలలో…  డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, జర్నలిస్టులుగా, ఇంజన్ డ్రైవర్లుగా, హోటల్ ఓనర్లుగా, పత్రికాధిపతులుగా, వ్యాపారవేత్తలుగా, ఉపాధ్యాయులుగా , సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తమదైన ప్రతిభ చూపిస్తున్నారు. బాగు బాగు..

కాని….

ఈ మధ్య తరచూ వింటున్న లైంగిక వేధింపులు, మానభంగాలు ఒక్కసారిగా భయాన్ని పుట్టిస్తాయి. సృష్టికి మూలమైన ఆడపిల్లలను పుట్టకముందు , పుట్టినతర్వాత, కట్నం కోసం, ఉద్యోగం, చదువులుకోసం బయటకెళ్లినపుడు .. అన్ని చోట్లా వేధిస్తున్నారు. చంపేస్తున్నారు. మరి ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఈ నేరాలకు పాల్పడినవాళ్లకు వెంటనే శిక్ష అమలు అవుతుందా అంటే అదీ లేదు. వాళ్లే నేరం చేసారని తెలిసినా జైలులో ఉంచి ఏళ్లకు ఏళ్లు విచారణ చేస్తారు. చివరకు చట్టంలో ఉన్న లొసుగులతో కొందరు చిన్న శిక్షలతో తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటివి చూసినప్పుడు ఎంతో కోపం వస్తుంది. ఆ నేరస్తులను అక్కడికక్కడే చంపేయాలనిపిస్తుంది.. ఇలా ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగిన వారం రోజుల వరకు హడావిడి ఉంటుంది. తర్వాత అందరూ మర్చిపోతారు. అంతా ఆ పోలీసులే చూసుకుంటారు. చట్టం, న్యాయం తన పని చేసుకుంటుంది. మనమేం చేయగలం అని చాలా మంది అనుకుంటారు. పూర్తి సమాజాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. అధికారం, డబ్బుతో ఎవరూ మారరు. కనీసం మన ఇంటినుండే మన పిల్లలతోనే ఈ మార్పులు మొదలుపెట్టవచ్చు.

 

ముందుగా ఈ విషయంలో తల్లి తండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుండి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించాలి. అబ్బాయిలు, అమ్మాయిలు అని వేరుగా చూడవద్దు. చిన్నపిల్లలు.. వాళ్లకేం తెలుసు, వాళ్లకు చెప్పే అవసరం లేదు అని అనుకోకుండా ప్రతీ  ముఖ్యమైన విషయం చెప్తుండాలి. చర్చించాలి. వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటివారు. వాళ్ల స్నేహితులతో బయట తిరగనివ్వకుండా ఇంటికే పిలవండి. ఇక్కడ కూడా అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలు చూపడం మంచిది కాదు. యువతీయువకులకు  లేని అనుమానాలు పెద్దలే సృష్టిస్తున్నారు. స్నేహితులైనా, కొలీగ్స్ అయినా. వాళ్ళ ఫ్రెండ్స్, ఆఫీసు ముచ్చట్లు అడుగుతుండాలి. మరీ అన్ని కాకున్నా చాలా విషయాల్లో వాళ్ళ విషయాల్లో మనని, మన విషయాల్లో వాళ్ళని భాగస్వాములను చేయాలి. ఒకవేళ వాళ్ళు ప్రేమలో పడితే మనం భయం పెడితే చెప్పలేరు. అదే మనం మంచిగా, బుజ్జగించి అడగాలి. అసలు ప్రేమంటే ఏంటి?. వాళ్లకు అవతలి వ్యక్తి గురించి ఏం తెలుసు? , ఎందుకు ఇష్టపడుతున్నారు వంటి విషయాలు తెలుసుకోవాలి. తప్పేదో, ఒప్పేదో అర్ధం చేయించాలి. ఇలా ఉంటే పిల్లలు తల్లితండ్రులతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వేరే దారి లేక వేరే వారి మీద ఆధారపడతారు. వారికి సరైన దారి చూపించేది వారి సమవయస్కులా? అనుభవమున్న పెద్దలా? ఈరోజు ప్రేమించడం అనేది సర్వసాధారణమైపోయింది.

 

పిల్లలు ప్రేమించాం అన్నపుడు పెద్దలు కూడా ఆలోచించాలి. మొండికేయకుండా వారివైపు నుండి ఆలోచించాలి. లేదంటే ఆత్మహత్యలు.. అదే విధంగా ప్రేమ పేరుతో వేధించే అబ్బాయిల నుండి తల్లితండ్రులే తమ కూతురికి రక్షణ కల్పించాలి. ఒకవేళ తమ అబ్బాయి ఏ దారుణమైనా చేస్తే తల్లితండ్రులు అతడిని సమర్ధించకుండా చట్టానికి అప్పగించాలి. . ఇక్కడ ఆ వ్యక్తి తమ కన్నకొడుకు, భర్త అనే దానికంటే అతడొక దుర్మార్గుడు. ఒక అమ్మాయిని గాయపరిచాడు. హత్య చేసాడు అని ఆలోచించాల్సింది పెద్దలే. నేరం చేసినవాడిని సంఘంలో హాయిగా తిరగనివ్వడం వల్లనే మరి కొందరు ఇటువంటి నేరాలు చేయడానికి ఆస్కారం అవుతుంది. అసలైతె ఇలాంటి దారుణానికి ఒడిగట్టినవాన్ని తల్లితండ్రులే  తగిన శిక్ష విధించాలి. ప్రతి రోజు తను చేసిన తప్పు గుర్తు చేసుకుని పశ్చాత్తప పడేలా చేయాలి. అది వారి చేతిలో ఉన్న పనే. అమ్మో నా కొడుకు అనుకుంటే .. ఎవరేం చేయలేరు.

 

ప్రతి ఆడపిల్ల ముందుగా తమని తాము గౌరవించడం నేర్పించాలి. అబ్బాయిలను కూడ అమ్మాయిలను గౌరవించేలా పెంచాలి. అది చిన్నప్పటినుండి జరిగితేనే మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. అమ్మాయిలు సుకుమారులు, సున్నిత మనస్కులైనా తమని తాము మానసికంగా శక్తివంతులుగా చేసుకోవాలి. ఎటువంటి వేధింపులు ఎదురైనా ఒంటరిగా ఎదుర్కునేలా ఉండాలి. భయపడితే లాభం లేదు. ఎవరో వస్తారని ఎదురు చూసే బదులు తామే ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. ఒంటరిగా ఎదుర్కోలేము అనుకుంటే తోటివారిని కలుపుకుని గుంపులా ఎదురుదాడి చేయండి. భయంతో వెనకకు వేసే బదులు ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేయండి. తోకముడుచుకుని పారిపోతారు. మీలోని ఆత్మవిశ్వాసమే మీకు కొండంత అండ.. ఈ స్వభావం చదువుకున్నప్పుడే కాదు. జీవితంలో ఎదురయ్యే అన్ని క్లిష్టపరిస్థితుల్లో కూడా ఉండాలి. ఆడది ఆప్యాయతనిచ్చే అమ్మగానే కాక అవసరమైతే ఆదిశక్తిలా కూడా మారగలదు అని నిరూపించాలి..

 

ఆడవారికి ప్రతీ చోట అవమానాలు తప్పడంలేదు. కాలేజీకెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఎంత విధ్యాధికులైనా ఆడవారిని హేళన చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం తమ జన్మహక్కు అనుకునే నీచులు ఎంతోమంది మన సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. వారిని ఏమీ అనలేము. ఎందుకంటే వారు మానసిక వికలాంగులు కాబట్టి. మనమే దయచూడాలి. శృతి మించితే చెప్పు దెబ్బల రుచి చూపించాలి.

 

నేను చెప్పిన మాటలు సినిమా డైలాగులు, ఏదో స్త్రీవాద పుస్తకంలోని మాటలు కాదు. నేను నమ్మేవి, మా పిల్లలకు కూడా చేప్పేది.. ప్రతీ తల్లి ఇలా మారితే కొంతవరకైనా ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మారతాయి. పిల్లల వ్యక్తిత్వం, సంస్కారం ఎటువంటిదో తల్లితండ్రులకే ఎక్కువ తెలుస్తుంది కదా. ప్రేమతో లాలించాలి, దారి తప్పితే దండించాలి…. ఆ పని చేయకుండా అవతలివాడిని నిందించడం అన్యాయం.

2 thoughts on “సంపాదకీయం : మనమేం చేయగలం??

  1. బాగుంది కానీ ఇదంతా పోర్నోగ్రఫీ సైట్స్ వల్ల ఎక్కువ authondi -దీని వాల్ ఏమి చెయ్యగలం – అరికతగల్ మర్గాలున్నాయా మీ శైలి గొప్పగా వుంది idi modati sari nenu rayadam

  2. బాగుంది కానీ ఇదంతా పోర్నోగ్రఫీ సైట్స్ వల్ల ఎక్కువ authondi -దీని వాల్ ఏమి చెయ్యగలం – అరికతగల్ మర్గాలున్నాయా మీ శైలి గొప్పగా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30