May 26, 2024

సంభవం – 4

రచన: సూర్యదేవర రామ్మోహనరావు                                suryadevara

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/

 

తలకోనలోని మృతసంజీవని ప్రయోగశాల…

ఆస్ట్రేలియన్ పిల్లి డాలీకి అమర్చిన హార్ట్‌ లంగ్ మెషిన్‌ని తీసేసింది డా.విజేత

దాని బ్రెయిన్ వేవ్ స్టడీగా వుండటంతో ఎంతో సంతృప్తిగా వుందామెకు.

ఆ పిల్లి తన సీట్లో నెమ్మదిగా కదులుతోంది. దానిని అక్కడ నుంచి బయటకు రప్పించడానికి సవ్యసాచి ప్రయత్నిస్తున్నాడు.

“హాయ్ కమాన్! కమాన్! గెటప్…” ఆ పిల్లి ముందు నిలబడి చిటికెలు వేస్తున్నాడతను.

డాలి ఇదివరలోలా ఉత్సాహంగా లేవడం లేదు- దుమకడం లేదు.

దూరంగా నిల్చొని ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తోంది దిశ.

హైదరాబాద్‌లో తన చేతిలోంచి దుముకి పారిపోయిన పిల్లి నిజంగా చనిపోయిందా? నిజంగా చనిపోయిన పిల్లిని డా. విజేత బ్రతికించడం జరిగిందా?

డాలీ ఎంత యాక్టివ్‌గా వుండేదో, దిశకు మాత్రమే తెలుసు.

ఆ పిల్లి సవ్యసాచివైపు, చుట్టూ పరిసరాలవైపు చూస్తున్నా మగతగా చూస్తోంది.

“డా.విజేత! ఈ పిల్లికి ఏదైనా గుర్తుంటుందంటారా?” అని అడిగాడు సవ్యసాచి.

“అంటే జ్ఞాపకశక్తి కోల్పోయిందనా మీ ఉద్దేశ్యం?” అనేక పరీక్షల అనంతరం ఆమె కూడా అదే నిర్ణయానికి వచ్చింది.

కొన్ని బ్రెయిన్ ఆపరేషన్స్‌లో మెటబాలిజం (శరీరంలోని అంగాలు రక్తం వగైరాల పని తీరు) తగ్గించడం కోసం కూల్ చెయ్యడం ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అప్పుడు మానిటర్‌పై బ్రేయిన్ తరంగాలు ఫ్లాట్‌గా వుంటాయి. అలా ఫ్లాట్‌గా వుంటే దశలోని చైతన్యరహిత దశ అని అంటారు. కానీ మళ్ళీ రీవార్మ్ చేస్తే అన్నీ సర్దుకుంటాయి.

ఆ బ్రెయిన్ తరంగాలు ఫ్లాట్‌గా మారే దశనే మానవ ప్రపంచంలో మరణంగా భావించడం జరుగుతోంది. మరణం తర్వాత యింకో దశ వుంటుందని, మనిషి ఎప్పుడూ ఊహించకపోవడం వల్ల శవాలని ఇంట్లో వుంచి పరీక్షలు చేయడం అనే ప్రక్రియ జరగలేదు. ఆధునిక మానవుడు తనకు చెందిన ఓ బంధువు మరణిస్తే వెంటనే ఆ శవాన్ని సంప్రదాయ పద్ధతిలో పూడ్చడమో, ఖననం చెయ్యడమో చేసి తన బాధ్యతను దింపేసుకుంటాడు. కానీ ఆదిమ తరగతికి చెందిన కొంతమంది మనుషులు మరణించిన తన సమీప బంధువులు శవాలను యింట్లో వుంచి రక్షించేవారు. శరీరంలోంచి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ తిరిగి వస్తుందని వారి నమ్మకం.

అలాగే ఇంటినుంచి స్మశానానికి శవాలను తీసుకెళుతున్న సమయంలో కొన్ని శవాలలో చైతన్యం కలగడం, లేచి మేల్కొనడం, తాము చచ్చిపోయిన మళ్ళీ బ్రతికామని ఆ వ్యక్తులు చెప్పడంలాంటివి గత కొన్ని దశాబ్దాలలొ నిజంగా జరిగిన సంఘటనలు.

“ఈ పిల్లి రెండు మూడు రోజుల్లో లేచి నడుస్తుంది. పరుగెడుతుంది కూడా…” చెప్పింది విజేత కాన్ఫిడెంట్‌గా.

“మెమరీ పవర్ ని ఎలా రికవర్ చేసుకుంటుంది?” అడిగాడు సవ్యసాచి.

“ఇంతకుముందు అది ఏ ఇంట్లో వుండేదో, ఆ వ్యక్తులు కనిపిస్తే… ఆ జ్ఞాపకశక్తి త్వరగా అభివృద్ధి చెందే అవకాశం వుంటుంది…విజేత చెప్పిన మాటలను విని వులిక్కిపడింది దిశ.

డాలీ తనను గుర్తుపడుతుందా?

“దీనికో మంచి పేరు పెట్టాలి డాక్టర్!” అన్నాడు సవ్యసాచి. ఆ సమయంలోనే దిశ ముందుకు నడిచింది.

“డాలీ అని పేరు పెట్టండి డా. విజేత!” సలహా యిచ్చింది దిశ.

“ఏ పేరైనా ఒకటే… ఆ పేరు తన పేరుగా ఆ పిల్లి గుర్తిస్తే చాలు… మన ప్రయత్నం ఫలిస్తుంది” అని చెప్పి… “హలో డాలీ! డాలీ! హౌ ఈజ్ యువర్ హెల్త్… కమాన్ బేబీ” పిల్లి చుట్టూ తిరిగి ముడుచుకుని పడుకున్న దానిని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సవ్యసాచి.

“డాలీ! డాలీ! గెటప్… గెటప్…” సవ్యసాచితో పాటుశృతి కలిపిన దిశ గొంతును గుర్తుపట్టిన డాలీ ముఖం చటుక్కున తిప్పి ఆమెవైపు చూసి తోకాడించింది.

ఆ మార్పును వెంటనే పసికట్టింది డా. విజేత…

“మిస్ దిశా! డాలీ ఇంతకుముందు మీకేమైనా తెలుసా…?!” అని అడిగింది.

ఎందుకో జవాబు చెప్పలేక పోయింది దిశ.

అరగంట గడిచింది

డా. సవ్యసాచి ఎదురుగా వున్న మృతసంజీవని, క్రయోనిక్స్ సంస్థ సభ్యులందరివైపూ చూశాడతను.

అందరి కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతోంది.

డా. విజేత కృషిని అందరూ అభినందిస్తున్నారు.

“మన పరిశోధనా ఫలితాలు మన మధ్యే వుండడం వల్ల వుపయోగం లేదు డా.సవ్యసాచి” డా. వంశీ అన్నాడు.

“అంటే…?

“మన పరిశోధనా ఫలితాలు ప్రపంచానికి తెలియాలి.  చనిపోయిన పిల్లిని మన సంస్థ బ్రతికించగలిగిందని, ఆ పిల్లి ఫోటోను తద్వారా మన పరిశోధనా ఫలితాలు పత్రికల్లో ప్రచురిస్తే…” డా. సమీర్ అన్నాడు.

        “లేదు మిస్టర్ సమీర్! పిల్లిని బ్రతికించడం ద్వారా మనం చేసిన ప్రయోగం గొప్ప విషయం కాదు. ఎందుకంటారా ? అది ఎన్ని గంటలు బ్రతుకుతుందో, ఎన్ని రోజులు బ్రతుకుతుందో మనకు తెలీదు. ఇంకా పరిశోధనలు జరగాల్సి వుంది. ఈ పిల్లిని బతికించగలిగినా, దాని జ్ఞాపకశక్తిని తిరిగి తేలేకపోయాం. అది కూడా చాలా అవసరం. అదే కాకుండా అమెరికాలోని మన సంస్థను స్పాన్సర్ చేస్తున్న సంస్థ అనుమతి లేనిదే మన ప్రయోగాలకు సంబధించిన ఆ విషయాలు బయటకు రావడానికి వీల్లేదు.”

“ఓ.కె. డాక్టర్! మనకిప్పుడు మనుషుల శవాలు కావాలి. ఒక శవాన్ని మనం బ్రతికించగలిగిననాడు మన సిద్ధాంతం నిజంగా ఊపిరి పోసుకున్నట్టు లెఖ్ఖ” చెప్పింది . విజేత పట్టుదలగా.

“ఎస్ విజేత! మనం ప్రస్తుతం శవాల అన్వేషణలోనే వున్నాం. మిస్ దిశ ఆ ప్రయత్నంలోనే వుంది. అదే కాకుండా, అనాధ శవాలను గుర్తుపట్టి, మన సంస్థకు చేర్చడానికి ప్రత్యేకమైన సీక్రెట్ సర్వీస్‌ను నేను ఏర్పాటు చేస్తున్నాను. ఒక వారం రోజుల తరువాత నుంచి మనం మన పరిశోధనల్ని విస్తృతం చేయాలి. అందుకు మీరు ప్రస్తుతం చేస్తున్న వుద్యోగాలను వదిలిపెట్టి, పూర్తి టైం మృతసంజీవని సంస్థలో పని చేయాల్సి వుంటుంది. ఇందుకు మీరందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నాను.”

      ఇతరత్రా చేస్తున్న జాబ్స్‌ని వదిలేసి, పూర్తిగా తమ పరిశోధనల్ని, సేవల్ని మృతసంజీవని సంస్థకే కేటాయించడానికి అక్కడి డాక్టర్లు తమ అనుమతిని తెలిపారు.

ఆ మాటకు సవ్యసాచి సంతృప్తిని వ్యక్తం చేశాడు.

అందరూ వెళ్లిపోయాక సవ్యసాచి ఎదుట దిశ మాత్రమే వుంది.

“ఎలా వున్నాయి మా పరిశోధనలు?” అడిగాడు అతను.

“చాల ధ్రిల్లింగ్‌గా వుందీ అనుభవం… నిజంగా చచ్చిపోయిన పిల్లిని విజేత బ్రతికించిందా?” ఆమెకు ఆ విషయం యింకా సందేహంగానే వుంది.

“నమ్మలేకపోతున్నారా! డాలీని శవంగా మీరు చూసి వుంటే ఇప్పుడీ ఆపరేషన్ నిజమని నమ్మేవారు మీరు. అవునా?” నవ్వుతూ అన్నాడు సవ్యసాచి.

“డాలీ గాయపడడం నాకు తెలుసు.. చచ్చిపోవడం నాకు తెలీదు” చెప్పింది దిశ.

ఆ మాటకు ఆశ్చర్యపోయాడతను.

“డాలీ.. ఇంతకుముందు మీకు తెలుసా?” సంభ్రమంగా అడిగాడు సవ్యసాచి.

తనకు డాలీ ఎలా తెలుసో… డాలీ తనని ఎందుకు గుర్తుపట్టడానికి ప్రయత్నం చేసిందో చెప్పింది దిశ.

అది వింటూనే అనూహ్యమైన ఆనందోద్వేగానికి గురుయ్యాడతను. అంటే కొంతలో కొంత జ్ఞాపకశక్తిని కూడా తిరిగి రప్పించటం సాధ్యమేనన్నమాట. ఆ ఆలోచన వస్తూనే సవ్యసాచి పొందిన ఆనందం బహుశా అతని జీవితంలోనే చాల అరుదుదైనది.

చాలా సేపయ్యాక-

“మిస్ దిశా! మీ కార్యక్రమాన్ని మీరెక్కడ నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు?” ప్రశ్నించాడు సవ్యసాచి నూతనోత్సాహంతో.

“మన ప్రయోగాలకు మనకిప్పుడు శవాలు కావాలి. లేదా క్రయోనిక్స్ పట్ల నమ్మకమున్న వ్యక్తులైనా కావాలి. అలాంటి వ్యక్తుల్ని పట్టుకోవాలను కుంటున్నాను.”

దిశ అలా చెప్పడం ఆశ్చర్యంగా వుందతనికి.

“క్రయోనిక్స్ సంస్థ పట్ల నమ్మకముండి తాము చనిపోయాక, బ్రతకాలనే కోరికతో మనకు తమ భౌతిక శరీరాలను యిచ్చే వ్యక్తులు వుంటారా?”

“వుంటారు డాక్టర్! పునర్జన్మ మీద నమ్మకమున్న వ్యక్తులుంటారు. వాల్ట్ డిస్నీలాంటి వ్యక్తి సైన్స్ టెక్నాలజీల్ని మాత్రమే విశ్వసించే, వాల్ట్ డిస్నీ 1966 డిసెంబర్ 15న లంగ్ కేన్సర్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో చనిపోయాడు. ఆ తర్వాత ఆయనకు అంత్యక్రియలు జరిగినట్టుగా అనుకున్నారే తప్ప ఆయన శవం ఏమైందో… ఆ విషయాలు ఇప్పటికీ ప్రపంచానికి తెలీవు.

అంటే అప్పటికే ఆయనకు క్రయోనిక్స్ గురించి తెలిసి వుండాలి. తను మళ్ళీ జన్మించాలనే కోరికతో, తన శవాన్ని క్రయోనిక్స్‌గా మార్చుకునే ప్రయత్నం చేశాడని కొంతమంది అంటారు. పైగా వాల్ట్‌ డిస్నీకి భారతీయ ఫిలాసఫీ అంటే చాల ఇష్టం. పునర్జన్మల్ని విశ్వసించినప్పుడు, ఆ నమ్మకంగల మన వాళ్ళని, మన సంస్థపట్ల ఆకర్షింపచేయడం కష్టపడితే జరిగే పననే నా నమ్మకం” అంది దిశ దృఢంగా.

సవ్యసాచి దిశ వైపు దిగ్భ్రాంతిగా ఛూశాడు.

“క్రయోనిక్స్ ఉద్యమానికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఫ్రీజ్ చేయబడిన వ్యక్తి, గ్లెండెల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రొఫెసర్. లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి ఆ శవాన్ని క్రయోనిక్స్‌గా మార్చారు. వాల్ట్ డిస్నీ చనిపోయిన కొన్ని వారాలకే ఆ సంఘటన జరిగింది. క్రయోనిక్స్‌గా మారిన ఆ వ్యక్తే వాల్ట్ డిస్నీ అని, ఆయన శవం దొరక్కపోవడం వల్ల చాలామంది భావించారు.

కానీ దానికి ఆధారం కానీ, రికార్డు కానీ లేదు. అయితే విచిత్రంగా గ్లెండెల్ ప్రాతంలోనే డిస్నీ సమాధి కూడా వుండడం, పైగా మొట్టమొదటి సారిగా ఫ్రీజ్ కాబడిన వ్యక్తి అక్కడి ప్రొఫెసర్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఆ విషయంలో సంచలనం చెలరేగింది.

క్రయోనిక్స్ సంస్థ, క్రయోనిక్స్ మూవ్‌మెంట్ గురించి ప్రపంచానికి తెల్సింది అప్పుడే…” సవ్యసాచి ఎక్కడో ఆలోచిస్తూ అన్నాడు.

“ఒక గొప్ప వ్యక్తి శవాన్ని మనం క్రయోనిక్స్‌గా మార్చి, బ్రతికించ గలిగిననాడే… మన సంస్థ గురించి ప్రపంచానికి తెలుస్తుందంటారు అంతేనా?”

“ఎస్ మిస్ దిశా! యూగాట్ మై పాయింట్… ప్రపంచానికి మన పరిశోధనల గురించి తెలియడం ఒకటే కాదు మన లక్ష్యం. ప్రపంచం విశ్వసిస్తున్న ఒక నమ్మకాన్ని చేధించడం, శారీరక శైధిల్యం వేరు, మృత్యువు వేరు అని చెప్పడం, ఏ వయసువారైనా, ఏ ప్రాణి అయినా, మృత్యువుకు భయపడాలసిన పనిలేదని చెప్పడం-మృత్యువు అనే భయంకరమైన ఒక ప్రమాదం లేదని తెల్సిననాడు- భూగోళంలోని మనుష్యులే కాదు, విశ్వగోళంలో ఆయా గ్రహాల్లో వుంటున్న జీవుల గురించి కూడా మనకు తెల్సుకోడానికి వీలవుతుంది” తన మనసులోని వుద్దేశ్యాన్ని చెప్పి-

“అందుకే మామూలు మనుషుల శవాలు మనకు ప్రయోగాలకు వుపయోగపడితే మన ఫలితాలు విశ్వవ్యాప్తం కావడానికి, ఒక గొప్ప వ్యక్తి శవం వుపయోగపడుతుంది. మిస్ దిశా! నీ శవ అన్వేషణలో ఈ విషయాన్ని నువ్వెప్పుడూ మరచిపోవద్దు.”

క్రయనిక్స్ థీరీని అంచెలంచెలుగా తెల్సుకుంటున్న దిశ మనసులో అంతర్గతంగా చెలరేగుతున్న సంచలనం, ఆమెలో రూపుదిద్దుకుంటున్న స్పష్టమైన లక్ష్యానికి చేరువవుతోంది.

“సీయూ… సార్” సీట్లోంచి లేవబోతున్న దిశ పక్కకు తిరిగి చూసింది.

పక్కన ఎప్పుడు లేచి వచ్చిందో తెలీదు. డాలీ ముందు కాళ్ళతో దిశ కూర్చున్న కుర్చీని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తోంది.

  *                                            *                                  *                                  *

ఎవరితోనో ఫోన్‌లో సీరియస్‌గా మాట్లాడుతున్న ప్రతాప్‌సింగ్ లోపలికి వస్తున్న అర్జున్ చౌహాన్‌ని చూసి టక్‌మని లైన్‌ని కట్ చేసి-

“ఆయీయే… ఆయీయే.. భాయి సాబ్! నీ కోసమే ఎదురు చూస్తున్నాను” లేచి చిరునవ్వుతో ఎదురెళ్ళాడు ప్రతాప్‌సింగ్.

ఆ ఫోన్ లైన్‌ని ప్రతాప్‌సింగ్ సడన్‌గా డిస్‌కనెక్టు చెయ్యడం గమనించిన అర్జున్‌చౌహాన్-

ఒక్కక్షణం అతని కళ్ళల్లోకి చూసి-

“పద! లోపలికెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ పక్కరూమ్ వైపు నడిచాడతను.

ఇప్పుడే అజనీష్ ఫోను చేశాడు. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయట. రేపు సరిగ్గా..” అటూ ఇటూ చూసి గొంతును తగ్గించి మిగతా విషయాన్ని చెప్పాడు.

“అజనీష్ ఏం చేసినా సిస్టమాటిక్ గా చేస్తాడు. అతగాడిమీద నాకు నమ్మకం వుంది. నాకు నమ్మకం లేనిది…”

“నామీదే అంటావ్! చూడూ… పక్కాగా మనిద్ధరం ఒకమాట అనేసుకుంటే, అనుమానాలు తగ్గుతాయిగా” అన్నడు ప్రతాప్‌సింగ్.

    “అయితే చెప్పు! విశ్వంభరరావు గొడవ రేపటితో వదిలిపోతుంది. అతగాడి మరణవార్త ధృవపడిన మరుక్షణం, పార్టీ నన్ను నాయకుడిగా ఎన్నుకుంటుంది. ఆ తర్వాత..”

“మరి నా సంగతేమిటి నువ్వు పార్టీ లీడర్‌వై పోయి. ప్రైమ్ మినిస్టరై పోతే నాకేంటి లాభం?” ప్రతాప్‌సింగ్ గొంతులో అంతులేని నిరాశ.

“నువ్వు హోమ్ మినిస్టర్ పోస్ట్ తీసుకో. ఈ టర్మ్ ప్రధానిని నేను. నెక్స్ట్ టర్మ్ ప్రధానివి నువ్వు. ఇదే మనిద్దరి మధ్యా అండర్ స్టాండింగ్” అన్నాడు అర్జున్ చౌహాన్.

“అది కాదు అర్జున్‌భాయ్! ప్రధాని పదవికోసం,ఎన్నాళ్ళ నుంచి కలలు కంటున్నానో నీకు తెలుసు. నీ కంటే వయసులో పెద్దవాడ్ని. ఆ పదవి నాకొదిలేయ్. నెక్స్ట్ టర్మ్ నువ్వు తీసుకో. నేను ప్రధానినైనా, పవర్స్ అన్నీ నీవే.. నీ వర్గం వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఈసారి నాకు నువ్వు అండగా వుండు” అర్జున్‌ చౌహాన్ రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు ప్రతాప్‌సింగ్.

ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు అర్జున్‌చౌహాన్.

ఒక వ్యక్తిని సీట్లో కూర్చోపెట్టి, ఆ సీట్లోని వ్యక్తిని, సరైన సమయంలో కిందకు లాగేసి, తొక్కెయ్యడం అర్జున్‌ చౌహాన్‌కి వెన్నతో పెట్టిన విద్య.

సీట్లో వుండి అధికారం అనుభవించడంకన్నా సీట్లో లేకుండా అధికారం అనుభవించడంలోనే అసలైన మజా వుంది.

విశ్వంభరరావు మృతి విషయంలో ఎంక్వయిరీలు, గొడవలు ఇవ్వన్నీ చల్లబడేసరికి ఎలాగూ ఆరునెలలు పడుతుంది. అప్పుడు అసమ్మతి బాణం ఎలాగూ వుంది. ప్రతాప్‌సింగ్ సత్తా కూడా తెల్సిపోతుంది. అని ఒక్కక్షణంలోనే ఆలోచించుకున్న అర్జున్‌చౌహాన్ పెదవుల మీద చిరునవ్వును వులుముకుని-

“ఓ.కె.ప్రతాప్‌భాయ్! నీ మాట నేనెప్పుడు కాదన్నాను, విశ్వంభరరావు వ్యవహారం ముగిసాక, మనం అజనీష్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి గుర్తుంచుకో” సలహా ఇచ్చాడు అతను.

“మనిద్దరం చేతులు కలిపితే దేశం మన గుప్పిట్లో వుంటుందన్న విషయం తెలుసు” పెద్దగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్‌సింగ్.

అర్జున్‌చౌహాన్ ఫోను వైపు నడిచాడు.

అప్పటికి ప్రదాన మంత్రి విశ్వంభరరావు మారుమూల పల్లెకు టూర్‌కు వెళ్ళడానికి సరిగ్గా పదిగంటల సమయం వుంది.

  *                                *                                  *                                  *

మర్నాడు ఉదయం…

సరిగా అయిదూ యాబై అయిదు నిమిషాలు. ప్రధాని రెసిడెన్స్ మంత్రులతోనూ, అధికార, అనధికార ప్రముఖులతోనూ నిండిపోయి వంది.

ముఖ్యమైన పార్టీ సమావేశం యింకా ఇరవై నాలుగ్గంటల్లో జరగాల్సి వుండగా ప్రధాని విశ్వంభరరావు అంతగా ప్రాముఖ్యం లేని ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల పల్లెటూరుకు వెళ్ళడం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

విశ్వంభరరావు పర్ననల్ ట్రిప్‌గా అధికారిక వర్గాలు చెబుతున్నా అసమ్మతి వర్గం మాత్రం ఆ విషయాన్ని ససేమిరా నమ్మడం లేదు.

ఆ మారుమూల పల్లెటూరు ప్రధాని వెళుతున్నాడంటే, ఏ అమెరికా నుంచో, రష్యా నుంచో  ఏజెంట్లు అక్కడకు వస్తున్నారేమో! ప్రధాని తన పదవిని నిలుపుకోడానికి అంతర్జాతీయ శక్తుల్ని ఆశ్రయిస్తున్నాడేమో!

రకరకాల ఊహాగానాలు…

రుషికుమార్‌కు కూడా ఏ విషయం అంతుబట్టడం లేదు. ప్రధాని పర్యటన గురించి భారతి కూడా పేదవి విప్పడం లేదు.

ప్రస్తుతం పి.ఎమ్ మానసిక పరిస్థితి ఏం బాగాలేదు. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో …

రుషికుమార్ ఆలోచనలు అంతవరకూ వెళ్లినా, ఎక్కడ ఎలాంటి సిట్యువేషన్ ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు.

సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు-

మంత్రివర్గ సహచరుల వీడ్కోలు అనంతరం ప్రధాని విశ్వంభరరావు హెలిపాడ్ వైపు నడిచారు.

మొదట విశ్వంభరరావు ఎక్కి హెలికాప్టర్‌లో కూర్చున్నారు.

ఆయన ప్రక్కన కూర్చున్న వ్యక్తి పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ రుషికుమార్.

సరిగా తొంభై నిమిషాలు గడిచాయి.

హైదరాబాద్ ఎరోడ్రోమ్‌లో హెలికాప్టర్ ఆగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, తదితరులతో ముచ్చటించాక, విశ్వంభరరావుతో ప్రయాణించటానికి తన అభిమతాన్ని వ్యక్తం చేశాడు సి.ఎమ్.

“నో మిస్టర్ వెంకట్రామ్‌రెడ్డి! ఇది నా పర్సనల్ ట్ర్రిప్…! మీరు నాతో రావాల్సిన పనిలేదు” స్థిరంగా అన్నారు పి.ఎమ్.

ఆ మాటలకు చీఫ్ మినిస్టర్, మిగతా మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు.

మరో అయిదు నిమిషాల తర్వాత ప్రైమినిస్టర్ హెలికాప్టరు గాలిలోకి లేచింది.

అయినా-

అప్పటికే ప్రొటోకాల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని టూర్‌కి వెళ్తున్న ఆ గ్రామాన్ని చుట్టుముట్టేశారు.

ఆ గ్రామం పేరు కొత్తపలెం!

ఆ ఊరిలో ఉన్నది కేవలం వెయ్యి గడపలు మాత్రమే!

  *                                *                                  *                                  *

కొత్తపాలెం ఆ సమయంలో నిశ్శబ్దంగా వుంది.

మట్టిరోడ్డుకి అటూ ఇటూ పూరిగుడిసెలు, ఆ రోడ్డు చివర శిధిలమైన రామాలయం.

ఆ రామాలయానికి దూరంగా విశాలమైన చెరువు, ఆ చెరువు పక్కన అంతెత్తున పెరిగిన చెట్లు, చేమలు, కొండలు, కోనలు.

రామాలయం రచ్చబండ దగ్గర కూర్చుని దేశ రాజకీయాలు మాట్లాడుకుంటున్న అయిదారుగురు వ్యక్తులకు-

సడన్‌గా ఆ ఊళ్ళోకి పోలిసు జీపులు, కార్లూ ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదు.

కొద్దిరోజుల క్రితం వరకు చీకట్లో మగ్గిపోయిన ఆ గ్రామంలో రాత్రికి రాత్రి కరెంటు స్తంభాలు, విద్ర్యుత్ లైట్లు వచ్చేశాయి.

రాత్రంతా ఎవరో మున్సిపల్ అధికారులు మెయిన్ రోడ్ నుంచి ఆ గ్రామంలోకి వచ్చే రోడ్డును చదును చేసే కార్యక్రమంలో వున్నారు.

గ్రామం నిండా తోరణాలు వెలిశాయి.

పార్టీ కార్యకర్తల హడావిడితో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.

పోలీస్ ఉన్నతాధికారులకు, ఇంటెలిజెన్స్ వర్గాలకూ ఒక్కటే అనుమానం…

అక్కడకు ప్రధాని ఎందుకొచ్చినట్టు? ఎవర్ని కలవడానికి?

ఆ ప్రశ్నకు జవాబు ఎవరికీ తెలీదు.

ఒక ప్రధానమంత్రి విశ్వంభరరావుకి తప్ప!

అప్పటికప్పుడు కొత్తపాలెం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరములో హెలిపాడ్ యేర్పాటయింది.

ఆ హేలిపాడ్ దగ్గర, రాష్త్ర ప్రభుత్వం తరవున ప్రధానిని ఆహ్వానించడనికి జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్, తదితర అధికారులు, రాజకీయ నాయకులు చేతుల్లో దండలతో ఎదురుచూస్తున్నారు.

  *                                *                                  *                                  *

సరిగ్గా పదకొండూ ఇరవై అయిదు నిమిషాలు.

ఊరికి ఒక ప్రక్కగా ఉన్న కొండల సమీపంలోకి ఒక జీపొచ్చి ఆగింది.

ఆ జీపు డ్రవింగ్ సీట్లోంచి దిగిన ప్రొఫెషనల్ కిల్లర్ శోభరాజ్ నలువేపులా చూసి, వళ్ళు విరుచుకుని, కొండలవైపు నడిచాడు. కొండ సగభాగం వరకూ ఎక్కి బైనాక్యులర్సు తీసుకుని, గ్రామంవైపు నిశితంగా చూడ సాగాడు.

అప్పటికప్పుడు అతని మెదడులో ఒక పధకం రూపుదిద్ధుకుంది. హేండ్ బ్యాగ్స్‌లో సిద్దంగా వుంచుకున్న పోలీస్ ఖాకీ యూనిఫారమ్‌ని తీసుకుని, టోపీని పెట్టుకొని, జేబులో రివాల్వరు సర్దుకుని, కొండల మీంచి కిందకు దిగాడు.

చెరువు పక్క నుంచి పొదలచాటున నడవటం ప్రారంభించాడు అతను.

  *                                *                                  *                                  *

పదకొండూ ముప్పై అయిదు నిమిషాలు.

హెలీపాడ్ దగ్గర ఆగిన హెలికాప్టరులోంచి ప్రధాని విశ్వంభరరావు కిందకు దిగారు.

అక్కడున్న వందలాదిమంది జనానికి నమస్కరిస్తూ, ముందుకు నడుస్తూ పక్కనే నడుస్తున్న రుషికుమార్ వైపు తిరిగి-

“మిస్టర్ రుషీ! దిసీజ్ మై పర్సనల్ ట్రిప్…! ఇ డోంట్ వాంట్ ఎనీ ప్రొటోకాల్స్… లెట్ మీ గో ఫ్రీలీ… ఓకే…”

విశ్వంభరరావు ఇష్టప్రకారం ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.

కలెక్టరు కారులో ప్రధాని ఒక్కరే ఆ గ్రామంలోకి బయలుదేరారు. కమెండోలు, పోలీస్ అధికారులు దూరంగా ఆగిపోయారు.

నేరుగా ఆ కారు ప్రధాని ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు రామలయం పక్కన వున్న ఓ పూరిగుడిసె ముందు ఆగింది.

కార్లోంచి దిగిన ప్రధాని విశ్వంభరరావు నలువైపులా ఒకసారి చూసి పూరిగుడిసె ముందు వంగి-

“ఒరే శ్రీరాములూ.. శ్రీరాములూ.. ఒరేయ్ రామచంద్రమూర్తీ” అని గట్టిగా పిలిచారు.

లోన్నుంచి డెబ్భై నాలుగేళ్ళ వ్యక్తి నెమ్మదిగా చేతికర్ర సాయంతో బయటికొచ్చి-

“ఎవరూ… నాకు సరిగ్గా చూపు కనబడదు బాబూ! నీ పేరు…?”

“నేనేరా… విశ్వంభరాన్ని! నీతో చిన్నప్పుడు… స్కూల్లో అయిదో క్లాసు చదువుకున్న కుర్రాడ్ని…” విశ్వంభరరావు ప్రేమగా శ్రీ రాములు చేతిని పట్టుకున్నారు.

విశ్వంభరం.. అంటే విశ్వంభరరావు.. అంటే… భారతదేశ ప్రధాని.. తనతోపాటు ఎప్పుడో స్కూలు బల్లమీద కూర్చుని చదువుకున్న భారతదేశ ప్రధాని, తనని గుర్తుపెట్టుకుని రావడం.. ఆయనకు నమ్మశక్యంగా లేదు.

అస్పష్టంగా కనిపిస్తున్న చూపుతో, కళ్లను పూర్తిగా విప్పి, ఆ వ్యక్తిని పోల్చుకోవటానికి ప్రయత్నిస్తూ, ఏదో పోలిక గుర్తుపట్టి-

“ఒరేయ్.. నువ్వు… నువ్వు… నా విశ్వానివా? మాతోపాటు చదువుకున్న అల్లరి విశ్వానివి… నువ్వేరా? ఒరేయ్ విశ్వం… రా.. రా… ఈ పేదింటికి రారా..” సముద్రంలాంటి అభిమాన తరంగాలు ఆ కళ్ళల్లో కన్నీళ్ళుగా మారుతున్నాయి.

వంగి లోనికి నడిచారు విశ్వంభరరావు.

ఆ ఊరివాళ్ళకు ఆ దృశ్యం చాలా విచిత్రంగా వుంది.

ఆ ఊరిలో ఒంటరిగా బ్రతుకుతున్న శ్రీరాములుతో దేశప్రధాని విశ్వంభరరావు ఒకప్పుడు కలిసి చదువుకున్నాడని వాళ్ళకు తెల్సినా, వాళ్ళెప్పుడూ ఆ విషయాన్ని నమ్మలేదు!

తినటానికే తిండి లేనివాడు, దేశ ప్రధనితో చదువుకోవడం ఏమిటి? దూరంగా చెట్టు దగ్గర నిలబడి, ఆ దృశ్యాన్ని చూస్తున్న రుషి కుమార్ కళ్ళల్లో కన్నీటి బిందువులు కదలాడాయి.

విశ్వంభరరావులోని మానవతా వ్యక్తిత్వాన్ని మొదటిసారిగా చూశాడు రుషికుమార్.

“ఒక చిన్ననాటి స్నేహితుడ్ని చూడటానికి నువ్వొస్తావని నేనెప్పుడూ అనుకోలేదు.  విశ్వం… విశ్వం.. నా ఇంటికొచ్చిన నీకు కనీసం టీ నీళ్ళివ్వడానికైనా ఆర్ధిక స్తోమత లేని నా దురదృష్టానికి సిగ్గుపడుతున్నాన్రా విశ్వం! నన్నుక్షమించవూ…” కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు శ్రీరాములు.

వాళ్ళిద్దరి మధ్యా మరపురాని అనుభూతుల్ని పంచే చిన్ననాటి ముచ్చట్లు దొర్లుతున్నాయి.

నలభై నిమిషాలు గడిచాయి.

శ్రీరాముల్తో సహా బయటికొచ్చారు విశ్వంభరరావు. ఇప్పుడాయన మనస్సెంతో ఉల్లాసంగా వుంది.

ఊర్లోని జనమంతా మట్టిరోడ్డు కటూ, ఇటూ నుంచున్నారు. దూరంగా కలెక్టరు, మిగతా పోలీసు ఉన్నాతాధికారులు. చేతిలోని దండలతో జిల్లా రాజకీయ ప్రముఖులు…

“నిరంతరం వత్తిడుల మధ్య, సమస్యల మధ్య చిక్కుకునే నాకు నువ్వు జ్ఞాపకానికొచ్చావు. మరుక్షణం వచ్చేశాను. ఇప్పుడు నా మనసెంతో ప్రశాంతంగా, ఆనందంగా వుంది. వస్తాన్రా శ్రీరాములు… ఇకనుంచి నువ్వు ఆర్థికంగా బాధపడకుండా ఏర్పాటు నేను చేస్తాన్లే” హామీ ఇచ్చి చిన్ననాటి స్నేహితుడ్ని మనసారా కౌగలించుకుని కళ్ళల్లోకి చూసి వెనుదిరిగాడాయన.

అప్పటికే అక్కడ చాల కోలాహలంగా వుంది.

గబగబా ప్రైం మినిస్టర్ దగ్గరకొచ్చాడు రుషికుమార్.

“సర్…”

“ఎస్…”

“పార్టీ ప్రముఖులు మీకు దండలు వెయ్యాలని కోరుకుంటున్నారు. మీరు ఒప్పుకుంటే…”

“వైనాట్ విత్ ప్లజర్.”

అంతకుముందే మెటల్ డిటెక్టర్స్‌తో చెక్ చేసిన దండల్ని ఒక్కొక్కరే అందిస్తుంటే చిరునవ్వుతో స్వీకరిస్తున్నారు విశ్వంభరరావు.

కొంతమంది దండలు, మరికొంతమంది వినతిపత్రాలు అందిస్తున్నారు.

వరసగా రెండు వరసల్లో జనం నుంచున్నారు.

ఆ వెనక కొంచెం దూరంలో ఏటవాలు ఎత్తయిన గుట్టమీద పొంచి వున్న శోభరాజ్ తన చేతిలోని టెలీస్కోపిక్ గన్‌ని పి.ఎమ్ విశ్వంభరరావుకి ఎయిమ్ చేశాడు.

హి ఈజ్ వెయిటింగ్ ఫర్ టైమ్…

ముందుకి చిరునవ్వులు చిందిస్తూ ఒక్కొక్క అడుగూ వేస్తున్నారు విశ్వంభరరావు.

కరెక్టుగా టార్గెట్ పాయింట్లో ఫిక్సయి పోయింది విశ్వంభరరావు తల.

శోభరాజ్ కుడిచేయి చూపుడువేలు టిగ్గర్‌ని నొకడానికి ముందుకు జరుగుతోంది.

అప్పుడు చూశాడు సెక్యూరిటీ చీఫ్ రుషికుమార్. గుట్టలచాటున ఒక మానవాకారం నీడ, నేలమీద కదలాడడం.. వెంటనే అతని కమెండో బ్రెయిన్ కంప్యూటర్‌లా వర్క్ చేయడం ప్రారంభించింది.

ఏదో డేంజర్ సిగ్నల్… డేంజర్.. డేంజర్.

కన్నుమూసి తెరిచేలోగా రెస్పాండయాడతను. రుషికీ, విశ్వంభరరావుకి మధ్య పదడుగుల దూరం వుంది.

అలాంటి పల్లెటూర్లో ప్రధానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లడానికి ఆస్కారం వుండదని అనుకోవడమే అతని పొరపాటు.

రుషికుమార్ కుడికాలు, చిరుతపులి పాదంలా పైకి లేచింది.

ఆ సమయంలో అతను పెద్దగా అరవాలనుకుని, దానివల్ల మరింత గందరగోళం చెలరేగుతుందని ఆ ప్రయత్నాన్ని తనలోనే అణిచేసుకుని ముందుకు లంఘించాడు. మూడే మూడు అంగల్లో పి.ఎమ్.ని చేరుకుంటూనే ఆయన్ని పక్కకు తోసేశాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అప్పటికే శోభరాజ్ చేతిలోని గన్ నిప్పులు కక్కింది. ఆ బుల్లెట్ రివ్వుమని బాణంలా వచ్చి విశ్వంభరరావు తలని రెండుగా చీల్చేసేదే! కానీ రుషి కుమార్ బలంగా విశ్వంభరరావుని పక్కకు తోసేసి, తను కిందకు వంగాడు. అయినా శోభరాజ్ గన్ నుంచి వరసగా రివ్వురివ్వుమని వస్తున్న బుల్లెట్ల వర్షానికి జనం చెల్లా చెదురయి పోయారు.

హాహాకారలు చెలరేగడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

బిత్తరపోయారంతా… ఏం జరిగిందో, ఏం జరుగుతోందో అంతా అనూహ్యామైన పరిస్థితి.

పోలీస్ వర్గాలు ప్రధానిని చుట్టుముట్టేశాయి.

ఎటు చూసినా భయం. వెర్రి ఆందోళన.. అరుపులు… పరుగులు రుషి ఆజ్ఞ మేరకు కమేండోస్ ప్రధానిని కవర్ చేసేసి కారువైపు తీసికెళుతున్నారు.

“లీవ్ ది ప్లేస్ ఇమ్మీడియట్లీ.. హేండిల్ ద సిట్యూయేషన్… ఫాస్ట్” అరచుకుంటూ ముందుకు పరుగెత్తాడు రుషికుమార్.

చెరువు పక్కనుంచి గుట్టలవైపు పరుగెడుతున్నాడతను.

  *                                *                                  *                                  *

తన గురి తప్పిందనగానే శోభరాజ్ గబుక్కున కిందకు పరుగెత్తాడు. టైమ్ వేల్యూ అతనికి బాగా తెల్సు.

పొదల పక్కనుంచి చెట్లమధ్యలో వున్న జీపువైపు పరుగెత్తాడు.

మరొక్క క్షణంలో జీపు స్టార్టయింది.

ఆ ప్రదేశం నుంచి ఆ జీపు క్షణాల్లో మాయమైపోయింది.

గుట్టలమీదకెక్కిన రుషికుమార్‌కి ఏదో జీపు, స్పీడుగా వెళుతున్న చప్పుడు తప్ప దారి కాని, జీపు కాని కనబడలేదు.

రుషికుమార్ వెంటనే వెనక్కి వచ్చేశాడు. అప్పటికే ఇంటెలిజెన్స్ ఇ.జి. వైర్‌లెస్ సెట్లో మెసేజ్ పంపెందుకు తన ఏర్పట్లలో తానున్నాడు.

“ఆ ఫారెస్టులోంచి దారెటు వెలుతుంది” అడిగాడు రుషికుమార్.

“కళింగపట్నం సముద్రం దగ్గరికి” ఒక పోలీస్ అధికారి సమధానమిచ్చాడు.

“ఎరేంజ్ ద వెహికల్.. కమాన్ కమ్ విత్ మి” ముందుకు పరుగెత్తాడు రుషికుమార్, అతని వెనక ఇంటెలిజెన్స్ ఇ.జి. పరుగెత్తాడు.

మరో రెండు నిమిషాల్లో వాళ్ళిద్దరూ ఓ జీపులో కూర్చున్నారు.  ఆ జీపు కళింగపట్నం సముద్రతీరం వైపు దూసుకుపోయింది.

సరిగ్గా అరగంట గడిచింది.

సముద్రతీరం ముందుజీపు ఆగడంతోనే అతను జీపులోంచి దూకి పరుగెత్తాడు.

అప్పటికే కొన్ని క్షణాలు ఆలస్యమైపోయింది.

సముద్రానికి పైభాగంలో మూడువందల అడుగుల ఎత్తులో హెలికాప్టరు ఎగురుతోంది.

క్రింద నేలమీద ఓ జీపు మంటల్లో పడి మసైపోవడానికి సిద్ధంగా వుంది.

హెలికాప్టర్లో వున్న శోభరాజ్ తను తప్పించుకున్నందుకు ఆనందంగానే వున్నా తన ప్రయత్నం ఫెయిల్ అయినందుకు అసహనంగా వున్నాడు.

పైనుంచి బైనాక్యులర్స్‌లోంచి కిందకుచూస్తున్న అతను స్పష్టంగా అదరాబాదరాగా కాలుతున్న జీపువైపు పరుగెడుతున్న రుషికుమార్‌వైపు చూశాడు.

“ఎవరతను” పక్కనున్న పైలట్‌ని అడిగాడు శోభరాజ్.

“ప్రైమ్ మినిస్టరు పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ – బ్లాక్‌కాట్ కమెండో రుషికుమార్” చెప్పాడు పైలట్.

“రుషికుమార్…” ఆ పేరు శోభరాజ్ మెదడులో రిజిస్టరై పోయింది.

కాలిపోతున్న జీపుని నిశితంగా పరిశీలించాడు రుషికుమార్.

అది కిరాయికి తెచ్చిన జీపు అని అతనికి సులభంగానే తెలిసింది.

కింద పడిపోయిన నెంబరు ప్లేటుని చేత్తో అందుకున్నాడు. ఆ నేంబరు ప్లేటుమీద అంకెలు తడితడిగా అతని చేతివేళ్ళకు తగిలాయి,

అది ఫాల్స్ నేమ్ ప్లేటు అని, దానిమీద నెంబరు కొన్నిగంటల క్రితమే రాయబడిందని రుషికుమార్ గుర్తించాడు.

“సెండ్ ద మెసేజస్ టు ఎవ్వెరీ వేర్.. ఇమ్మీడియట్లీ…” ఇంటెలిజెన్స్ ఇ.జి.వైపు వస్తూ అరిచాడు రుషికుమార్.

న్యూఢిల్లీ…

పార్టీ పాలిట్ బ్యూరో అనధికార సమావేశంలో తనని నాయకునిగా ఎన్నుకోవడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నాడు ప్రతాప్‌సింగ్.

అక్కడ పనిచేసిన పవర్‌వుల్ వెపన్ – డబ్బు-

అరవైశాతం మెంబర్సును తనవైపు తిప్పుకోవడానికి ఒక్కొక్కరికీ ఒక కోటిరూపాయల చొప్పున సూట్‌కేసులు వెళ్ళిపోయాయి.

రాజకీయ వర్గాల్లో తెలియనై టెన్షన్… కేబినెట్ మంత్రుల ఇళ్ళల్లోని టెలిఫోన్లు విరామమెరుగకుండా పనిచేస్తున్నాయి.

సడన్‌గా ప్రతాప్‌సింగ్, అర్జున్ చౌహాన్ వర్గాల మనుషులు, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడ్నీ పర్సనల్‌గా కలుస్తున్నారు.

విశ్వంభరరావు వర్గానికి అంతా అయోమయంగా వుంది.

సరిగ్గా-

అదే సమయంలో హైదరాబాద్ నుంచి యు.ఎస్.ఇ. వార్తా సంస్ధ పంపిన న్యూస్ మెసెజ్‌లో రాజధానిలోని రాజకీయ వర్గాలు గందరగోళంలో మునిగిపోయాయి.

ఆ మెసెజ్-

“ప్రధాని విశ్వంభరరావు పై మారుమూల గ్రామంలో హత్యా ప్రయత్నం! నిందితుడు తప్పించుకున్నాడు. కానీ ప్రధాని ఎక్కడున్నదీ, ఎమైందీ ఎవరికి తెలీదు.”

క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మార్తున్నాయి.

ప్రధాని విషయం ఎవరికీ, ఏ ఒక్కరికీ తెలీదు. అంతటా ఉద్విగ్నత.

ఆఖరికి భారతికి కూడా పి.ఎమ్. ఏమైందీ- ఎక్కడుందీ తెలీలేదు.

ఆమెకది పెద్ద షాక్! ఆ షాక్!నుంచి తేరుకోవడానికి ఆమెకి చాలాసేపు పట్టింది

పి.ఎమ్. బ్రతికున్నారా! ఉంటే ఏ స్థితిలో వున్నారు? గాయపడా? మృత్యువుతో పోరాడుతూనా? ఎవరికి ఫోను చేయాలి? ఎలా వివరాలు తెలుసుకోవాలో తెలియని భారతి రోధిస్తూ దేవుడి గదిలో కూర్చుండిపోయింది.

  *                                *                                  *                                  *

న్యూడిల్లీ రైల్వేస్టేషన్‌లోని సెకెండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్ ప్రశాంతంగా వుంది.

వీరేంద్ర అజనీష్ ఆ సమయంలో అక్కడ వుంటాడని ఎవరూ అనుకోరు.

అయినా-

అజనీష్ పేరుని తప్ప అతన్ని గుర్తుపట్టేవాళ్ళు చాలా తక్కువమంది.

ఎప్పుడూ స్వంత విమానాల్లో ప్రయాణం చేసే అజనీష్ రైల్వేస్టేషన్‌ల్లోని ఒక సాదారణ వెయిటింగ్ రూమ్‌లో వుంటాడని ఎవరూ వూహించరు.

అందుకే-

అజనీష్ తనని కల్సుకోవాలని ఫోను చేసిన శోభరాజ్‌కి సెకండ్‌క్లాస్ వెయిటింగ్ రూమ్‌లో కల్సుకోమని చెప్పింది.

ప్రస్తుతం అజనీష్ కాషాయాంబరధారిగా లేడు. బ్యాగీ ఫ్యాంటూ, లూజ్ టీ షర్టు, కళ్ళకు రేబాన్ సన్‌గ్లాసెస్…

సీరియస్‌గా విదేశీ మాగజైన్‌ని తిరగేస్తున్నాడతను.

“గుడ్‌మార్నింగ్…” ఆ పలకరింపుకి తలెత్తి చూశాడు అజనీష్. ఎదురుగా శోభరాజ్.

ఆ సమయంలో శోభరాజ్ పఠాన్ వేషంలో వున్నాడు. ముందు గొంతునీ, తర్వాత మనిషినీ గుర్తుపట్టాడు అజనీష్.

“ఏం జరిగింది నెమ్మదిగా అడిగాడతను.

“గురి తప్పింది” సిగరెట్ వెలిగిస్తూ బదులిచ్చాడు శోభరాజ్.

“ఒకసారి మిస్సయిన దానిని మళ్ళీ పొందడం చాలా కష్టం. ఆ విషయం నీకు బాగా తెల్సనుకుంటాను.”

“గురూజీ! మిస్సయింది బుల్లెట్ మాత్రమే… లక్ష్యం కాదు.”

“అంటే?”

“వారం రోజులు గడువివ్వు చాలు”

“వారం రోజులు… అందరూ జాగ్రత్త పడిపోయాక.. ఇంటెలిజెన్స్ వర్గాలు వేటకుక్కలా అన్వేషణ ప్రారంభించాక నువ్వేం చేస్తావ్? ఈ లోపల ఆ ముసలాడు చేయాల్సింది చేసేస్తాడు. వారం రోజులు కుదరదు.. మూడు రోజులు.. బస్” గంభీరంగా అన్నాడు అజనీష్.

“ఓన్లీ త్రీ డేస్… అంటే సెవెంటీ టూ అవర్స్.”

“ఎస్”

ఓ.కె.”

“ఎలా చేస్తావు పని?”

“ఈసారి మీరు నాకే ఇన్వ్‌ఫర్‌మేషనూ ఇవ్వక్కరలేదు. ఏం చేస్తానో చూడండి” ధీమాగా, కసిగా అన్నాడు శోభరాజ్.

“ఈసారి మిస్సయితే?” అడిగాడు అజనీష్.

“నామీద అపనమ్మకం ఏర్పడిందా?” ఆ గొంతులోని కోపాన్ని గుర్తించాడు అజనీష్.

“అపనమ్మకం కాదు – ఈసారి నువ్వు మిస్సయితే ఒక రహస్యం జీవిత కాలం రహస్యంగా మిగిలిపోడానికి నీ ప్రాణాల్ని నువ్వు కోల్పోవాల్సి వుంటుంది” లేచి ఒక్కసారి శొభరాజ్ కళ్ళల్లోకి సూటిగా, కోపంగా చూసి గబగబా ముందుకు అడుగులేశాడు అజనీష్.

వెళ్లిపోతున్న అతనివైపు గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయాడు ప్రొఫెషనల్ కిల్లర్ శోభరాజ్

రాజకీయం పదునైన కత్తి. అది వ్యక్తుల కోసం ఆగదు. కాలం కంటే వేగంఘా పరుగెడుతుంది.

  *                                *                                  *                                  *

సూటిగా రైలు చీకటిలో దూసుకుపోతోంది.

కంపార్ట్‌మెంట్స్‌లోని ప్రయాణీకులు అందరూ నిద్రపోతున్నారు.

ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్‌లోని ఒక క్యూబిక్‌లో మాత్రం చిన్న లైటు వెలుగుతోంది.

ఆ క్యూబిక్‌లో-

పక్క పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు.

“టైమెంతయిందో తెలుసా? నా కళ్ళల్లో ఏవున్నాయని అలా చూస్తున్నారు?” అడిగింది ఆ అమ్మాయి. అ అమ్మయి పేరు వసంత.

“నీ కళ్లల్లోనా కృష్ణశాస్త్రి అన్నట్టు… అనంతాంబరపు నీలినీడలు వున్నాయి. లేవా?” ముందుకు వంగి ఆ కనురెప్పల మీద ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించాడతను. అతని పేరు గిరీష్.

మనిద్దరం ఇలా దంపతులమవుతామని నేనస్సలు అనుకోలేదు. దిశ చొరవ తీసుకోకపోతే నువ్వెక్కడో, నేనెక్కడో కదా” అంది వసంత.

“అందుకే మనుషులు చొరవ తీసుకోవాలని నేనంటాను” అమెకు దగ్గరగా జరుగుతూ ఆమె నడుమ్మీద చెయ్యివేసి అన్నాడతను.

“ఇది ట్రైనండీ బాబూ! అయినా ఎన్నిసార్లు చొరవ తీసుకుంటారు?” సిగ్గుపడుతూ అంది వసంత.

“ఏం నేను చొరవ తీసుకోవడం నీకిష్టం కాదా?” ప్రేమగా అడిగాడతను.

“కా…దు..” అంటూ కిలకిలా నవ్వుతూ అతని గుండెల్లో తల వాల్చేసుకుంది వసంత. వసంత జడలోని సంపెంగ పువ్వు జారి కిందపడి పోయింది.

కింద పడిపోయిన సంపెంగ పువ్వుని చేతిలోకి తీసుకుని వాసన చూస్తున్న గిరీష్ ఓరగా తీసున్న డోరు పక్కన ఏదో నీడ కదలాడడంతో గబుక్కున అతని కళ్ళు ఆ నీడవైపు చూశాయి.

ఒకే ఒక్క క్షణం…

డోరు తెరుచుకోవడం, ఒక వ్యక్తి లోనకు ప్రవేశించడం, గిరీష్‌ని ఎడం చేతితో ముందుకు లాగి కుడిచేతిలోని పెద్ద కత్తితో అతను పొడవడం, గిరీష్ విహ్వలంగా అరుస్తూ నేలమీద పడిపోవడం, వసంత భయంతో అరవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

గిరిష్ శరీరంలోంచి చివ్వున చిమ్మిన రక్తం వసంత మంగల సూత్రాల మీద పడింది.

మరుక్షణంలో ఆ వ్యక్తి కత్తితో వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. కంపార్ట్‌మెంట్లో కోలాహాలం.. వరుసగా వెలుగుతున్న లైట్లు.

  *                                *                                  *                                  *

ఎవరో కుదిపి లేపినట్లుగా మెలుకువ వచ్చింది దిశకు.

చివ్వున చిమ్మిన రక్తం కళ్ళల్లో పడినట్ల్లుగా వుందామెకు. భయం భయంగా లేచి కూర్చుందామె.

పనుల వత్తిడివల్ల గిరీష్, వసంతల పెళ్ళికి తాను వెళ్ళలేకపోయింది. ఆ విషయమై నిద్రపోయే ముందు వసంతకు లెటర్ రాసి పడుకుంది దిశ.

ఆ వుత్తరం వైపు చూసింది. టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద ఆ లెటర్ రెపరెపలాడుతోంది.

తనకొచ్చిన కలలో వసంతను, గిరీష్‌ను స్పష్టంగా గుర్తుపట్టిందామె.

వాళ్లిద్దర్నీ ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. నో…నో… వాళ్ళిద్దరికీ శత్రువులెవరున్నారు?

తనకొచ్చిన కల నిజమవుతుందా? ఇప్పటి వరకూ తనకొచ్చిన కలలన్నీ నిజమయ్యాయి.

నిద్రలో తనకొచ్చిన కల జరిగిందా? జరగబోతోందా?

తనిప్పుడు ఏం చేస్తుంది?

గదిలో అసహనంగా పచార్లు చేస్తొంది దిశ.

ఎలా? వాళ్ళిద్దర్నీ రక్షించడం ఎలా?

పెనుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నట్లు ఆమె హృదయం కొట్టుకుంటోంది.

ఆ దంపతుల్ని తను ప్రమాదం నుంచి ఎలా రక్షించగలదు? దిశ చాలాసేపు అదే విషయమై ఆలోచిస్తూ నిద్రపోలేదు.

రెండు గంటలు గడిచాయి.

ఆలోచనతో కూర్చోవడంకన్నా ఆ ప్రమాదం నుంచి వారిని ఎలాగయినా రక్షించాలి.

ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం రూమ్‌లోంచి బయటికి వచ్చింది దిశ.

అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు దాటింది.

రోడ్డుకి చివరున్న పబ్లిక్ టెలిఫోను బూత్‌వైపు నడిచింది.

ప్రొఫెసర్ సత్యబ్రహ్మకు ఆ విషయం చెప్పి ఎలాగయినా వాళ్ళని రక్షించాలనుకున్న దిశ-

సత్యబ్రహ్మకు ఫోను చేసింది. వెంటనే రిసీవర్ అందుకున్నారు ఆయన.

“హౌ అర్యూ మిస్ దిశ? సీరియస్‌గా నీ వర్క్‌లో నువ్వు మునిగి పోయావట గదా! మీ బాస్ చెప్పాడులే.”

ఆ మాటతో సవ్యసాచికి, సత్యబ్రహ్మకు మంచి కాంటాక్ట్స్ వున్నాయని చప్పున గ్రహించింది దిశ.

“సార్! వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక గంట క్రితం…” తనకొచ్చిన కల గురించి చెప్పి ఎలాగయినా వసంతని, గిరీష్‌ని ఆ ప్రమాదం నుంచి రక్షించమని కోరింది దిశ.

“ప్రస్తుతం వాళ్లిద్దరూ సిటీలో లేరమ్మా. గిరీష్ వసంతతోపాటు తన స్వగ్రామం వెళ్లాడు.”

  “ఎప్పుడు?” వెంటనే ఆదిగింది దిశ.

“రెండ్రోజులయింది” చెప్పాడాయన.

“గిరీష్‌ని మనం ఫోన్‌లో కాంటాక్ట్ చెయ్యలేమా?”

” ఆ వూరికి ఫోను సౌకర్యం లేదనుకుంటాను.”

ఒక్కక్షణం ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. మళ్ళీ ఆయనే అన్నాడు.

ఓ.కె! దిశా… ఆ వూరు నేనే వెళ్తాను. ఆ ప్రమాదం నుండి వాళ్ళిద్దర్నీ కాపాడడానికి ప్రయత్నిస్తాను.”

“థాంక్యూ ప్రొఫెసర్! మీ హెల్ప్ నేను మరిచిపోలేను.”

“నేన్నీకు రెండు రోజుల తర్వాత ఫోను చేస్తాను. సరేనా… గుడ్ నైట్.”

ఫోన్ కట్ అయింది.

ఫోన్ బిల్లు డబ్బుని తీసుకుంటూ కౌంటర్లోని వ్యక్తి దిశవైపు ఆశ్చర్యంగా చూడడం గమనించింది ఆమె.

దానికి కారణం తనకో కలొచ్చిందని, తన ఫ్రెండ్స్‌ని ఒక అపరిచిత వ్యక్తి మర్డరు చెయ్యడానికి ప్రయత్నించాడని, అలా జరక్కుండా చూడమని హైదరాబాద్‌లోని ఎవరో వ్యక్తికి చెప్పడం.

ఆ కౌంటర్‌లోని వ్యక్తికి వింతగా వుంది.

ఆ వ్యక్తికి ముప్పై ఏళ్ళుంటాయి. అతని పేరు సత్యవర్థన్.

దిశ చేతికి చిల్లర ఇస్తూ “డ్రీమ్స్ నిజమౌతాయా మేడం…” అని అడిగాడతను.

“ఏదైనా… నమ్మకం వుంటే నిజమౌతుంది” చెప్పింది దిశ.

“నేనడిగేది డ్రీమ్స్ గురించి…” మళ్ళీ ఆదిగాడతను.

“నిజమౌతాయని నేను నమ్ముతాను.”

“నేను నమ్మను… Those who dream by night in the dusty recesses of their minds wake in the day to find that it was vanity. But the dreamers of the day are dangerous men. For they may act their dreams with open eyes to make it possible” గడ గడ చెప్తున్న అతని మాటల్ని సంభ్రమంగా వింటోంది దిశ.

ఆ మాటలకు నవ్వు కూడా వచ్చిందామెకు.

“ఎవరి నమ్మకాలు వాళ్ళవి” చెప్పేసి వెనుదిరిగిందామె.

“మేడమ్.. ప్లీజ్ వెయిట్” ఆమె వెనకే వచ్చాడతను.

“మై నేమీజ్ సత్యవర్థన్… ఎమ్.ఏ. పారాసైకాలజీ.. ఇక్కడ పార్ట్ టైమర్‌గా పనిచేస్తున్నాను. నేను డ్రీమ్స్ మీద ఒక బుక్ రాస్తున్నాను. దానికి మీ కోపరేషన్ కావాలి. నేను వెతుకుతున్నది మీలాంటి వ్యక్తి కోసమే-ఇఫ్ యూ డొంట్ మైండ్.”

“నేనెవరో మీకు తెలుసా?” అడిగింది దిశ.

“తెలీదు… రోజూ ఈ దారంట మీరెళ్ళడం చూస్తుంటాను.”

ఇద్దరూ రోడ్డు పక్కన నుంచున్నారు. అతను సీరియస్‌గా డ్రీమ్స్ బుక్ కోసం తను కలుసుకున్న వ్యక్తులు, సేకరించిన వివరాలు గురించి చెపుతున్నాడు.

ఆ విషయాలన్నిటినీ ఆసక్తిగా వింటోంది దిశ.

రోడ్డు పక్కన ఎలక్ట్రిక్ స్తంభం వుంది.

మాట్లాడుతూ, మాట్లాడుతూ సత్యవర్థన్ తన ఎడం చేతిని ఆ స్తంభమ్మీద వేశాడు యధాలాపంగా.

అంతే!

పెద్దగా కేక వేశాడు.

పైన వైరు తెగిపోయి ఆ స్తంభంలో విద్యుత్ ప్రవహిస్తోందని అతనికి తెలీదు.

హెల్ప్ మీ.. సేవ్ మీ… సేవ్ మీ.. స్తంభానికి అంటుకుపోయి అతను కేక లేస్తున్నాడు.

అతన్ని రక్షించడానికి ఏం చెయ్యాలో తోచని దిశ, నిర్జనంగా వున్న రోడ్డు మీద కేకలేసుకుంటూ పరిగెత్తింది.

సమీపంలో సినిమాహాలు దగ్గరున్న వ్యక్తులు పరుగు పరుగున వచ్చారు.

అప్పటికే సత్యవర్థన్ స్పృహ తప్పి కిందపడిపోయాడు.

అతన్ని వెంటనే దగ్గర్లో వున్న ప్రైవేట్ హాస్పిటల్లో ఎడ్మిట్ చేసింది దిశ.

ఆరోజు రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు.

  *                                *                                  *                                  *

కొత్తపాలెంలో రక్షించబడిన పి.ఎమ్. ఒక సురక్షితమైన స్థలానికి రహస్యంగా తరలించబడ్డారు. ఆ స్థలం గురించి కేవలం ఇద్దరికే తెలుసు. ఒకరు రుషికుమార్, రెండవ వ్యక్తి స్టేట్ ఇంటెలిజెన్స్ ఇ.జి.

వెంటనే పి.ఎమ్‌ని. న్యూడిల్లీకి తీసుకెళ్ళిపోవాలని అధికారులు, రుషికుమార్ ప్రయత్నించినా నాలుగు రోజులపాటు ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలని ప్రధాని గట్టిగా కోరటంతో ఆ ఏర్పాట్లు చేయక తప్పలేదు.

ఆయన మనసులో మరో ఆలోచన కూడా వుంది. తను దేశ రాజధానిలో లేనప్పుడు తన ప్రత్యర్థులు వేసే ఎత్తుల అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆయనకు పట్టుదలగా వుంది. వాళ్ళ స్వార్ధబుద్ధులు, కుహానా రాజకీయాలు ప్రజల దృష్టికి, ప్రెస్ దృష్ట్రికి రావాలని కూడా వుంది.

అందుకే ఆయన అజ్ఞాతవాసాన్ని కోరుకున్నాడు. దాని మూలంగా దేశ రాజకీయాల్లో, పవర్ లాబీల్లో కనీవినీ ఎరగని సంచలనం, పుకార్లు చెలరేగాయి.

*                                  *                                  *                                  *

మృతసంజీవని సంస్థ ఆధ్వర్యంలో, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు, ప్రయోగాలు, ప్రజల్లోకి ఆ ఉద్యమాన్ని తీసికెళ్ళడానికి సంకల్పించిన వ్యూహాలు, అందుకు కావల్సిన ఫండ్స్ ఎస్టిమేషన్ వాటి గురించి అమెరికాలోని ఆల్కోర్ సంస్థకు పంపడానికి రిపోర్టు సిద్ధం చేశాడు సవ్యసాచి.

ఆ రిపోర్టును తనే స్వయంగా టైప్ చేసుకున్నాడు.

అప్పటికి అతను ఆల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్‌కి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్టీఫెన్ హారీస్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాల విషయంలో హారీస్ చాల సంతృప్తిని వ్యక్తం చేయడంతో సవ్యసాచి చాల వుత్సాహంగా వున్నాడు.

సరిగ్గా ముప్పై ఆరుగంటల క్రితం సవ్యసాచి .స్టీఫెన్ హారిస్‌కి ఫోను చేసి ఆస్ట్రేలియన్ కాట్ డాలీ పరిశోధనల గురించి చెప్పాడు. డాలీ డే టుడే డెవలప్‌మెంట్సను వీడియో కేసెట్‌లో రికార్డు చేసి అర్జంటుగా పంపమని కోరాడు .హారిస్.

ఆ లెటరుతోపాటు ఆ కేసెట్‌ను కూడా పంపడానికి ఏర్పాట్లు చేశాడు సవ్యసాచి.

లెటరు టైపింగ్ పూర్తిచేశాక తన సీట్లోకొచ్చి కూర్చున్నాడు సవ్యసచి. సరిగ్గా ఆ సమయంలో-

నవనీత్ వచ్చి డాలీకి సంబంధించిన విషయం చెప్పడంతో ఒక్కక్షణం నిశ్చేష్టుడైపోయాడతను.

గబుక్కున  సీట్లోంచి లేచి లేబరేటరీలోకి పరుగెత్తాడు.

గ్లాస్ డోరు తీసి లోనికి అడుగుపెట్టగానే అక్కడి పరిస్థితి అర్థమై పోయింది సవ్యసాచికి.

టేబుల్ మీద తల పక్కకు వాల్చేసిన డాలీని, ఆ పక్కన నిస్తేజంగా విషాదంగా కూర్చున్న విజేతను చూసి షాక్ తిన్నాడు.

“సారీ డాక్టర్…” వెలవెలబోతూ అంది విజేత.

“టేకిట్ ఈజీ డాక్టర్.. బాధపడకండి.. ఓసారి ఓడినంత మాత్రాన ఓడినట్లు కాదు. ఓటమిని ఓడించలేకపోతేనే ఓడినట్లు. ఓటమిని ఓడించే వరకూ పోరాడుతూనే వుంటాం… మన బేసిక్ ప్రిన్సిపల్‌ను మీరు మర్చిపోగూడదు” సరిగ్గా హారీస్‌కి లెటరు పంపడానికి సిద్ధమైన క్షణంలోనే డాలీ చనిపోవడం నిజంగా సవ్యసాచికి షాక్. ఆ షాక్ నుంచి అతను బయటపడడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తున్నాడు.

“మన లేబరేటరీలో బ్రతికి, చచ్చిన మొదటి ప్రాణి… డాలీ.. సో మిస్ విజేత… మేక్ హర్ యూజ్ చిల్లర్… వ్యూచర్ ఎక్స్‌పరిమెంట్స్‌కి పనికొస్తుంది” చెప్పేసి బయటికొచ్చేశాడు సవ్యసాచి. అతన్ని నవనీత్ అనుసరించాడు.

డాలీ మళ్ళి చనిపోవడానికి కారణం- ఆపరేషనులో బాగా రక్తం పోవడమే.

అప్పటికే డాలీని బ్రతికించడానికి శాయశక్తులా ప్రయత్నించి విఫలమయింది విజేత.

బాధగా ముందుకి కదిలింది విజేత.

డాలీని చిల్లర్‌గా చేసే కార్యక్రమం చేపట్టింది. ఇరవై రెండు డిగ్రీల అతి శీతల వాతావరణంలో లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్లో వుంచి పైభాగాన్ని పూర్తిగా కవర్ చేసేసి ప్రత్యేకంగా తయారుచేయించిన గ్లాస్ బాక్స్‌లు పెట్టి, ఆ గ్లాస్ బాక్స్‌ని డెడ్‌లీ ఫ్రీజింగ్ ప్రిజర్వేషన్ చాంబరుకి తరలించే ఏర్పాట్లు చేసి డాలీకి సంబంధించిన ఫైలును పట్టుకుని తన క్యూబిక్‌లోంచి బయటికొచ్చింది .విజేత.

*                                  *                                  *                                  *

మన డాలీకి ఆఖరు జన్మ ఇదేనేమో…” సాలోచనగా అన్నాడు సవ్యసాచి.

ముభావంగా అతని ఎదురుగా కూర్చున్న విజేత తలెత్తి చిన్నగా నవ్వింది.

అనుకోని విధంగా జరిగినప్పుడు సవ్యసాచి అక్కడి సైంటిస్టుల మూడ్స్‌ని మార్చడానికి చాల రకాలుగా ప్రయత్నిస్తాడు.

ఆ విషయం విజేతకు బాగా తెలుసు.

“మిస్ విజేతా! మొక్కలకు అంటుకట్టి, ఇంకో మొక్కని తయారు చేసినట్లుగానే, మనిషికి అంటుకట్టి, అలాంటి మరో మనిషిని తయారు చేయొచ్చని ఆ మధ్య ఎక్కడో చదివాను. మీతో చెప్దామనుకొని మరిచే పోయాను..” జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు సవ్యసాచి.

“మనిషికి అంటుకట్టడమా. అదెలా…?” అంత విషాదంలోనూ ఆమెలో ఏదో ఆశ్చర్యం, ఉద్వేగం!

“1978లో అ సంఘటన నిజంగా జరిగింది ఆమెరికాలోని ఒక బిలియనీర్ కోట్లు, కోట్లు ఖర్చుపెట్టి, తనలాంటి వ్యక్తిని సృష్టించుకున్నాడట. అది సైంటిఫిక్‌గానే జరిగింది. డేవిస్ కోరవిక్ రాసిన ఇన్‌హిజ్ ఇమేజ్ అనే బుక్ మీరు చదివారా?”

“లేదు”

“మనిషిని అంటుకట్టి, డూప్లికెట్ మనిషిని సృష్టించడానికి కొంత టైమ్ పట్టొచ్చు. కానీ.. కప్పల్ని, ఎలుకల్నీ అంటుకట్టి, అలాంటి రకానికి చెందిన కప్పల్ని, ఎలుకల్ని తయారుచేశారట. అవన్నీ స్తనప్రాణులు. వాటి ఆధారంగానే మనిషి కూడా స్తనప్రాణి కాబట్టి, మనిషి మీద ప్రయోగాలు జరిగాయి.

పరాగ సంపర్కం లేకుండానే మొక్కలకు అంటుకట్టి, వేరొక మొక్కల్ని తయారుచేయడం జరుగుతోంది. ఆ విషయం మనకు తెల్సు. వితనాలతో పనిలేకుండా అలా అంటుకట్టడాన్ని వైజ్ఞానిక పరిభాషలో క్లోనింగ్ అంటారు.

  మొదట కప్పకు సంబంధించి క్లోనింగ్ చేసిన వ్యక్తి .జె.బి.గోర్డన్! ఒక కప్ప అండాన్ని తీసుకుని, దాని న్యూక్లియస్‌ను నష్టపరిచాడు. ప్రతి కోశాణువులోనూ న్యూక్లియస్ వుంటుంది. దానిలో ఒక ప్రత్యేక సంఖ్యలో గుణ సూత్రాలుంటాయి. న్యూక్లియస్ శుక్రాణువులలోని గుణసూత్రాల కలయిక వల్ల గుణసూత్రాల సంఖ సంపూర్ణత చెంది, గర్భధారణం జరుగుతుంది. అలా ఆ జాతికి చెందిన కొత్త మొక్క పుట్టడానికి అవకాశం యేర్పడుతుంది.

న్యూక్లియస్, శుక్రాణువులలో తప్ప, మిగతా కోశాణువులన్నింటిలోనూ, గుణసూత్రాల సంఖ్య పూర్తిగా వుంటుంది. దాని ఆధారంగానే కప్ప విషయంలో ప్రతిసృష్టి చేశాడు గోర్డన్.

అలాగే స్విట్జర్లాండ్‌కు చెందిన కార్ల్ ఇలీమెన్సీ, పీటర్ పెచాన్ అనే సైంటిస్టులు ఎలుక క్లోన్‌ను తయారుచేశారు. వారు ఒక బూడిదరంగు ఎలుక గర్భంలో నుండి భ్రూణ కోశాణువులను గ్రహించి, వెంట్రుకల కంటే పలుచనైన పిప్పెట్స్ సహాయంతో ఆ కోశాణువులలోని న్యూక్లియస్‌లను తీసుకుని, ఒక నల్ల ఎలుక గర్భధారణ జరిగిన వెంటనే దాని అండాన్ని తీసుకుని, దానిలోని న్యూక్లియస్ శుక్రాణువుని తొలగించి, ఆ స్థానంలో భ్రూణకోశాన్నుంచి తీసిన న్యూక్లియస్‌ని వుంచారు. అండాల్ని నాలుగు రోజులవరకూ పోషక ద్రవంలో పెరగనిచ్చారు ఆ తర్వాత దానిని ఒక తెల్ల ఎలుక గర్భంలో వుంచారు. ఫలితంగా బూడిదరంగు ఎలుక జన్మించింది.

సైంటిస్టులు మొత్తం 363 సార్లు ఆ ప్రయోగాలు చేయగా, కేవలం మూడే మూడుసార్లు వారు సక్సెస్ అయ్యారు…” చెప్పటం ఆపి విజేత వైపు చూశాడు సవ్యసాచి.

“మీరిప్పుడు ఆ కథ ఎందుకు చెప్పారో నాకర్థమైంది” నవ్వుతూ అంది విజేత.

“మీరు నమ్మడం లేదా? ఇట్స్ ట్రూ విజేతా! ఆ కారణంగానే.. అంటే ఆడ, మగా కలయిక లేకుండానే… ఒక ఎలుక, ఒక కప్ప పుట్టినప్పుడు, ఇతర ప్రాణులు కూడా పుట్టడానికి ఆస్కారముందని సైంటిస్టులు కృషి చేస్తున్నారు. మానవుల క్లోన్ తయారయ్యిందంటే.. మనం బోస్‌ని గాంధీని, నెహ్రూను, జె.అర్.డి. టాటాని, ఇందిరాగాంధీని, పటేల్‌ని, రాజీవ్‌గాంధీని, ఐన్స్‌స్టీన్‌ని, చార్లీ చాప్లిన్‌ను, అంబేద్కర్‌ను సృష్టించుకోవచ్చు” చాల ఎక్సయింటింగ్‌గా చెప్పాడు సవ్యసాచి.

“రెండోసారి పుట్టిన ఆ మానవుల క్లోన్‌లకు చావుండదా?”

అలాంటి ప్రశ్న విజేత వేస్తుందని ఊహించని సవ్యసాచి తడబడ్డాడు.

“గ్లోబ్ ఈజ్ రౌండ్ మిస్ విజేతా! మళ్ళీ మనం మృత్యువు దగ్గరకే వచ్చాం…” నవ్వుతూ అన్నాడు సవ్యసాచి.

అతని నవ్వుతో శృతి కలిపింది.

“మిస్ విజేతా..! మనం డాలీ విషయంలో చేసిన పరిశోధనలకు సంబంధించిన డిటైల్స్‌ను అమెరికా పంపుతున్నాను. బహుశా మన పరిశోధనలకు సంబంధించిన న్యూస్ అమెరికన్ టాబ్లాయడ్స్ కవర్ చేయవచ్చు.”

“అంటే.. మన సంస్థ పేరు, అడ్రస్ ఆ న్యూస్ ఐటెమ్స్‌లో వస్తుందా?” కంగారుగా అరిచింది విజేత.

“రాదు.. ఆ విషయంలో హారిస్ చాల జాగ్రత్తలు తీసుకుంటాడు.”

అతని వాక్యం ఇంకా పూర్తికాలేదు. టేబుల్ మీద ఫోన్ మోగడం, సవ్యసాచి రిసీవర్ అందుకోవడం వెంటనే జరిగిపోయింది.

“హలో దిశా! ఎక్కడనుంచి?” పలకరించాడు సవ్యసాచి చేతి గడియారం వైపు చూసుకుంటూ.

అప్పుడు ఉదయం 9.45 నిమిషాలైంది.

సత్యవర్ధన్ అనే వ్యక్తి పరిచయం కావడం, అతనికి తగిలిన ఎలక్ట్రిక్ షాక్ అంతా చెప్పి-

“పది నిమిషాల క్రితం అతను చనిపోయాడు. అతనికెవరూ లేరు. అతని శవాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు” అంది దిశ ఉద్వేగాన్ని అణచుకుంటూ.

“ఓకే దిశా! ఐ విల్ సెండ్ నవనీత్! హి విల్ మేక్ హిమ్ యూజ్ చిల్లర్! ఒన్ ఇంపార్టెంట్ థింగ్… ఆ శవాన్ని నర్సినంగ్‌హోం నుంచి ఇమ్మెడియట్‌గా తిరుపతిలోని మన ఆఫీస్‌కి తీసుకెళ్లండి. ఏవరికీ అది శవంగా తెలియకూడదు. చిల్లర్‌గా మార్చిన తర్వాత మన లేవరేటరీకి దానిని నేనే స్వయంగా తీసుకోస్తాను. ఓ.కె…” అని ఫోను పెట్టెశాడు సవ్యసాచి. వెంటనే ఇంటర్‌కమ్ బటన్‌ని ప్రెస్ చేశాడు.

మరో మూడునిమిషాల తర్వాత .నవనీత్ అక్కడకొచ్చాడు.

“మిస్టర్ నవనీత్…! ఇకనుంచీ నువ్వు బిజీ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి” అన్నాడు సవ్యసాచి సాలొచనగా.

ఏం సార్… శవం దొరికిందా?” వెంటనే ఆడిగాడతను.

“ఎస్ మై ఫ్రెండ్…” ఏం చెయ్యాలో చకచకా చెప్పసాగాడు సవ్యసాచి.

మనిషి ప్రాణాలు పోయి శవంగా మారినప్పుడు, ఆ శరీరాన్ని మైనస్ 190 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వరకూ శీతలీకరించి వుంచితే, ఆ శరీరంలోని టిష్యూ లేవీ పాడయి పోకుండా వుంటాయి. భవిష్యత్తు ప్రయోగాలకు ఆ శరీరం వుపయోగ పడుతుంది.

మానవ శరీరం శవంగా మారిన సమయంలో, శరీరంలోని రక్తాన్ని తొలగిస్తూ, దాని స్థానంలోని ‘క్రియో ప్రొటెక్టెంట్’ను ఎక్కిస్తారు. దాని వలన మెదడులోని టిష్యూకు, ఐస్ క్రిస్టల్ వలన నష్టం జరగదు… తర్వాత లోపలికి గాలి వెళ్ళకుండా, శరీరాన్ని పొడి ఐస్‌లో భద్రంగా ప్యాక్ చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా పెట్టెల్ని తయారుచేస్తారు. బయటివాళ్ళకు ఆ పెట్టెలు శవాల పెట్టెల్లా మాత్రం కనిపించవు. మరణించిన వ్యక్తి శవాన్ని రెండు మూడు గంటల లోపుగానే క్రయోనిక్‌గా మార్చాల్సి వుంటుంది. లేని పక్షంలో టిష్యూలు పాడైపోవడానికి ఆస్కారం యేర్పడుతుంది. శవాన్ని క్రయోనిక్‌గా మార్చే విధానంలో స్పేషల్ ట్రైనింగ్ పొందిన వ్యక్తి  నవనీత్ మాత్రమే.

అతనికి ముందు జాగ్రత్త చర్యగా ఆ శిక్షణను బ్రిటన్‌లో ఇప్పించింది సవ్యసాచి.

“మిస్టర్ నవనీత్! బీ కేర్‌వుల్…” చిల్లర్‌గా మర్చాటానికి అవసరమైన పరికరాల్ని తీసుకుని జీపు ఎక్కుతున్న నవనీత్‌తో అన్నాడు సవ్యసాచి.

“డొంట్ వరీ సార్” జీపు ముందుకు కదిలింది.

వెంటనే తన పక్కనున్న విజేతవైపు తలతిప్పి-

“రేపటినుంచీ మీకు చేతినిండా పనే! కదా…” అన్నాడతను.

ఆమె మాట్లాడలేదు. ఆలోచనలో మునిగిపోయింది.

*                                  *                                  *                                  *

కొత్తపాలెంలో ప్రధానిపై హత్యా ప్రయత్నం జరిగిన మరుసటి రోజు అర్థరాత్రి రుషికుమార్ నుంచి భారతికి ఫోనొచ్చింది.

పి.ఎమ్.కి ఏమీ కాలేదని క్షేమంగా వున్నారని, హత్యా ప్రయత్నం షాక్ నుంచీ తేరుకోవటానికి పి.ఎమ్.ని ఒక రహస్య స్థలంలో వుంచటం జరిగిందని-అది త్వరలోనే పి.ఎమ్. దేశ రాజధానికి రాబోతున్నారని చెప్పాడు.

అప్పటికిగాని భారతి మనసు కుదుటపడలేదు. అంత ఆలస్యంగా ఆ వార్త చెప్పినందుకు ఆమె ఫోనులోనే రుషికుమార్‌ని అలుపెరగకుండా తిట్టిపోసింది.

రుషి నవ్వుకున్నాడే తప్ప బదులివ్వలేదు.

ప్రస్తుతం తాము ఎక్కడున్నది చెప్పకుండానే అతను ఫోన్‌ని డిస్కనెక్ట్ చేశాడు.

*                                  *                                  *                                  *

5 thoughts on “సంభవం – 4

  1. నవల చాలా నచ్చింది , టెన్షన్ గా ఎదురు చూస్తున్నాం

  2. ఈ సీరియల్ అద్భుతంగా ఉంది . నిజంగా చనిపొఇన మనిషిని బ్రతికిన్చాగాలరా ? అప్పుడు దేవుడి ఉనికి ?????

  3. సీరియల్ అద్భుతంగా ఉంది నిజంగా చనిపొఇన మనిషని బ్రతికిన్చాగాలరా ?????!!!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *