April 20, 2024

“కవితా గుణార్ణవుడు”- చారిత్రక సాహిత్య కధామాలిక – 6

రచన: మంధా భానుమతి

mantha bhanumathi

 

ప్రకృతి అందాలకు ఆలవాలమైన బనవాసి పట్టణంలో.. సభ నిండుగా కొలువు తీరింది. రాజు, కలత చెందిన మదితో సభలోనికి అడుగిడి ఆసనమలంకరించాడు. రాజావారికొక్కరికే ఆ విచారం పరిమితి కాలేదు. సభలోనివారందరూ అవనత వదనులై చింతా క్రాంతులై ఉన్నారు.

ఒక్కసారిగా కలకలం..

ఆచార్యులవారు ఏతెంచుచున్నారు.. గుసగుసలు.

రాజుగారితో సహా అందరూ లేచి నిలుచున్నారు. రాజుగారు, పంపనార్యునికి ఎదురేగి, పూలమాలాలంకృతుని చేసి, తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు.

“రాజా! ఏమిది..” పంపన్న బిడియంగా సభని పరికించాడు. అక్కడి వారంతా జేజేలు కొట్టారు.

“కవిరాజుకి తగిన సత్కారం.. రాజావారికి అభినందనలు. జైనమతం వర్ధిల్లుగాక!”

“ఆచార్యా! ఆదిపురాణ కావ్య ఆవిర్భావానికి ఇది చిరు నివేదన. మా రాజ్యాన్ని, బనవాసిని మీ కావ్యం ద్వారా ఆచంద్రార్కం నిలిచేలాగు చేశారు. మీరు మా రాజ్యంలో ఈ కావ్య రచన సాగించడం మా అదృష్టం. మీరు మరిన్ని కావ్యాలు ఇచ్చటనే రచించాలని మా కోరిక. కానీ.. సాంబరాంకుశుడు, ఆరూఢ సర్వజ్ఞుడు, ఉదాత్తనారాయణుడు అయిన అరికేశరి ప్రభువుల ఆజ్ఞ శిరసావహించక తప్పదు కదా! మీ వంటి సర్వజ్ఞులను వదులుకోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. మరల ఏనాటికైనా మిమ్ములను చూడగలమని ఆశిస్తున్నాను.” రాజుగారి అభిమానానికి, ఆప్యాయతకి పంపన్నకి ఉద్వేగంతో కన్నీరాగలేదు.

మహా యోధులు.. మేధావులు.. వారు ఇరువురూ గాడ పరిష్వంగంలో చిన్నపిల్లల్లా కన్నీరు కార్చారు.

ఒక్కొక్కరుగా వచ్చి అందరూ ఆచార్యునికి ప్రణామం చేసి ఆశీర్వచనాలందుకున్నారు.

 

* * * *

 

పంపనార్యుడు బనవాసి రాజు అనుమతి తీసుకుని వేములవాడకు పయనవడానికి ఆయత్తమౌతున్నాడు. వెనువెంట నలుగురు సాయుధులైన భటులు.. ముందు ఇరువురు, వెనుక ఇరువురు తోడుగా వెడలవలెనని రాజాజ్ఞ.

ఆదిపురాణ కావ్య కర్తకి ఆ మాత్రం రక్షణ అత్యవసరమే.. అతను ఎంతటి యోధుడైనా! అడవి దొంగలకి విచక్షణ ఉండదు కదా! ఇమ్మడి అరికేసరికి ఇష్టుడైన మహా కవికి ఏదైనా ఆపద వాటిల్లితే.. బనవాసి రాజుకి పెక్కు ముప్పులెదురవక తప్పదు.

భటులు గుర్రాలను శుభ్రం చేస్తూ.. వాటికి కావలసిన ఆహార సామగ్రి కూడా చూసుకుంటున్నారు. తమకి త్రోవలో అవసరమైన గుడారాల సామాన్లు, వంట సామగ్రి, ఆహార పదార్ధాలు సమకూర్చుకున్నారు. దారిలో విశ్రాంతికి ఎన్నుకున్న ప్రదేశాలను గుర్తు పెట్టుకున్నారు.. వార్తాహరులు వారం ముందుగానే వెడలి అచ్చోట ఏర్పాట్లు చేస్తున్నారు.

బనవాసికి వచ్చిన ఆచార్యుడు వేరు.. తిరిగి వేములవాడ రాజాస్థానానికి వెడలుతున్న వ్యక్తి వేరు. ఇతను మహాకవి. జైన మత ప్రాశస్త్యాన్ని వివరించడానికి, విస్తరించడానికి పుట్టిన మహాపురుషుడు.

అంతలో.. వాకిట ఒకటే సందడి. పదిమంది పైగా జనం.. ఒకే సారిగా ఆచార్యునికి జయజయ ధ్వానాలు చేస్తున్నారు.

పంపన్న వాకిలి గవాక్షం తీసుకుని బయటికి వచ్చాడు.

పాఠశాల విద్యార్ధులు బారులు తీరి నిల్చున్నారు. వారందరికీ పంపనార్యుడు ఆరాధ్య దైవం. వ్యాకరణ సూత్రాలను నేర్పడంలో, పురాణాల అంతరార్ధాన్ని వివరించడంలో ఎంతటి నిష్ణాతుడో కత్తి యుద్ధంలోని మెళకువలను నేర్పడంలోనూ, వ్యూహరచనలు చెయ్యడంలోనూ కూడా అంతటి నేర్పరి తమ ఆచార్యుడు. అందరికీ కన్నుల నీరు ఉబికి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది.

“ఆచార్యా! తాము మరల..” గొంతు పూడుకొని పోగా మాట బయటికి రాక ఆపేశారు, ముందు వరుసలో నున్న ఇద్దరు విద్యార్ధులు.

“ఏం చెప్పగలము.. చాళుక్య ప్రభువు ఆజ్ఞ ఏ విధంగా ఉండునో తెలియదు కదా. మీకు కొత్త ఆచార్యుని ఏర్పాటు చెయ్యమని రాజుగారికి చెప్పాను. మీరు కోరుకున్నది మీకు లభించాలనీ, మంచి పేరు తెచ్చుకోవాలనీ ఆశీర్వదిస్తున్నాను.”

విద్యార్ధులు అందరూ వరుసగా వచ్చి, ఆచార్యులకు ప్రణామం చేసి సెలవు తీసుకుని భారమైన మనసులతో వెనక్కి మళ్లారు.

బనవాసి రాజు, మహాకవికి దారిలో అవసరమైన సంభారాలన్నీ సమకూర్చి సాగనంపారు.. భారమైన మనసుతో.

 

* * * *

 

వేములవాటిక.. అచ్చటి నేలమీదికి అడుగిడగానే అశ్వాల నడక లయబద్ధంగా సాగింది. పంపనార్యుడు, వేగాన్ని తగ్గించమని అనుచరులకి సైగ చేశాడు.

ఆ గాలి పీలుస్తుండగానే ఒకింత హాయి కలిగి ఒడలంతా పులకరించింది. అల్లంత దూరాన కనిపిస్తున్న వృషభాద్రి పంపనార్యునికి స్వాగతం పలుకుతోంది. తాను ఆడి, పాడి నడయాడిన నేల.

అంతలో..

దారి కనిపించనంత పెద్ద దుమ్ము పైకి లేచింది. అందులోనుండి మసక మసకగా ఆకారాలు. పంపనార్యుడు, అతని పరివారం కళ్లు చికిలించారు.

ఎదురుగా.. పదిమంది సాయుధులు అతివేగంగా వస్తున్నారు. వారి సవ్వడికి జింకలు, కుందేళ్లు బెదిరి చెదరిపోతున్నాయి. చెట్లమీది పక్షులు ఒక్కసారిగా కిలకిలారావలు చేస్తూ ఎగిరిపోయాయి.

పంపన్న వెంటనున్న సైనికులు. ఒరనుండి కత్తులను తీశారు. అంతవరకూ.. అడవుల్లో.. కొండల్లో, కోనల్లో క్షేమంగా వచ్చేశారు. మధ్యలో తుంగభద్ర నదీ తీరంలో మాత్రం నలుగురు బందిపోటులు దాడి చేశారు. చేసి విచారించారు కూడా!

ఆచార్యులవారితో సహా అందరూ యుద్ధ విద్యలో ఆరితేరినవారే. వీరి ధాటికి తట్టుకోలేక వెనుతిరిగి చూడకుండా పారిపోయారా చోరులు.

మరి ఇప్పుడు..

తమ స్వంత నేల మీద.. రాజుగారి ఆహ్వానాన్ని అందుకుని వస్తున్న తరుణంలో, ఎవరు వీరు?

“స్వామీ! ఎదుర్కుందామా?”

“తొందర పడవద్దు. వారి సంఖ్య ఎక్కువ.. వారు కూడా యుద్ధ విద్యలో ఆరితేరినట్లే ఉన్నారు. మనం పక్కకి తొలగి దారి ఇద్దాం. ఎచటికి వెళ్తున్నారో ఏమో!” పంపన్న గుట్టల వెనుకకి గుర్రాలని మళ్లించాడు.

చిత్రంగా సాయుధుల వేగం తగ్గిపోయింది. పంపనాదులున్న స్థలానికి రాగానే, గుర్రాలని ఆపి, నలుదిక్కులా చూస్తున్నారు. వారి నాయకుడు, శిరస్త్రాణం తీసి చేత పట్టుకుని, ఒక చేత్తో కళ్లాన్ని లాగుతూ అశ్వాన్ని ఆపుతున్నాడు. సకిలిస్తూ ఆగిపోయింది గుర్రం, యజమాని ఆజ్ఞని పాలిస్తూ.

“స్వామీ వారు మనకోసమే వచ్చినట్లున్నారు..”

పంపన్న నవ్వుతూ తల పంకించాడు. “గుర్రాలని వారి వద్దకి నడిపించండి.”

“అన్నా!” సాయుధుల నాయకుడు పంపన్నని చూసి గుర్రం మీదినుంచి దూకాడు.

“జినా!” పంపన్న కూడా అశ్వం దిగి ఎదురేగి తమ్ముడ్ని ఆలింగనం చేసుకున్నాడు. తను వదిలి వెళ్లినప్పుడు జినవల్లభుడు ఇంకా బాలుడే.. ఇప్పుడు నవయౌవనుడు. ఆజానుబాహుడు. సింగనజోస్యుల ముఖ వర్చస్సు, భీమనప్పయ్య గాంభీర్యం కలిసి ఠీవిగా నడచి వచ్చిన తమ్ముడ్ని చూసి పంపన్నకి ఆనంద భాష్పాలు ఆగలేదు. వెల్లువలా ప్రవహించాయి.

అన్నదమ్ముల కలయికని చూసిన సైనికులు అందరూ గుర్రాలు దిగి జయజయ ధ్వానాలు చేశారు. అన్న పాండిత్యానికి, శౌర్యానికి దీటైన తమ్ముని గురించి వినే ఉన్నారు వారు.

“నా ఊహ సరైనదే అన్నా! ఈ రోజు వస్తారని.. స్వాగతం చెప్పాలని బయలుదేరాము, నేనూ..” జినవల్లభుని మాట పూర్తి కానే లేదు..

“మల్లియ రేచన్నా.. కుశలమా?” జినవల్లభునికి అడుగు దూరంలో చిరునవ్వుతో నిలబడిన మరో యువకుడిని పలుకరించాడు పంపన్న.

రేచన్న ముందుకు వచ్చి, పంపన్న పాదాల నంటి నమస్కరించాడు.

“అమ్మగారు, అప్పగారు నీ రాకకై ఎదురు చూస్తున్నారన్నా.. ” తమ్ముని హెచ్చరిక విని అశ్వాన్ని అధిరోహించాడు పంపన్న.

మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించిన రాజమార్గంలో నెమ్మదిగా గుర్రాలని నడుపుతూ ఇంటికి చేరారు పంపనాదులు. పారాణి పళ్లెంతో దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లింది వబ్బెణెబ్బ తనయుడ్ని. భీమనప్పయ్య కించిత్తు గర్వంగా కుమారుని కౌగలించుకుని పక్కన కూర్చుండ బెట్టుకుని క్షీర పాత్రని చేతబట్టి తాగించ సాగాడు.

ఒక్కసారిగా పదేళ్ల ప్రాయంవాడైపోయాడు పంపనార్యుడు.

 

* * * *

 

అంగరంగ వైభవంగా అలంకరించారు సభాప్రాంగణమంతా. రంగు రంగుల రంగ వల్లులతో తీర్చిదిద్దారు వీధులన్నీ.

గుణనిధి, గుణార్ణవుడు, శరణాగతుడు, వజ్రపంజర.. ఇత్యాది బిరుదులున్న వేములవాడ చాళుక్య మహారాజు ఇమ్మడి అరికేసరి సభలో కొలువుతీరి ఉన్నాడు. సభలోని వారందరూ తమకున్న చీనిచీనాంబరాలన్నీ ధరించి, ఆభరణాలు అలంకరించుకుని ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. తెరచాటున అంతఃపుర కాంతలు కూడా కన్నులు విప్పార్చి చూస్తున్నారు.

అదిగో.. రానే వచ్చాడు ఆదిపురాణ కావ్యం కన్నడ భాషలో రచించిన ఆదికవి పంపన్న. ఒక ప్రక్క తండ్రి భీమనప్పయ్య, ఇంకొక ప్రక్క ఒక్కడుగు వెనుకగా సోదరుడు జినవల్లభుడు. ముగ్గురూ త్రిమూర్తుల వలే భాసిల్లుతున్నారు. ఆ తేజస్సు, ఆ ఠీవి, ఆ దర్పము.. సాక్షాత్తూ వ్యాస, వాల్మీకి, వశిష్ఠులు మువ్వురూ ఒక్కసారిగా ప్రత్యక్ష్య మైనట్లుగా వస్తున్నారు. అసంకల్పితంగా సభలోని వారందరూ లేచి నిలుచున్నారు.

ఐదవ శతాబ్ది ఆదిగా కొన్ని శతాబ్దాలు దక్షిణాపధం మూడువంతులు పైగా ఏకఖండంగా కాదంబ, రాష్ట్రకూట, చోళాది  చక్రవర్తులచే పాలింపబడింది. ఉత్తరాన కనౌజ్ నుండి, దక్షిణాన తంజావూరు వరకూ, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున బంగాళా ఖాతం వరకూ ఒకే సామ్రాజంగా ఉండేది.. మధ్య మధ్య కొన్ని రాజ్యాలు పోయినా, మరల గెల్చుకునే వారు. సంస్కృత, తమిళ, కన్నడ, తెలుగు భాషలన్నింటిలో పండితులకి, ప్రజలకి ప్రావీణ్యత లేదా ప్రవేశం ఉండేది. అందువల్లనే కవులు అంతటా సంచరించుతూ తమ పాండిత్యాన్ని పంచుతూ ఉండేవారు.

పంపకవి కూడా కన్నడ, ఆంధ్ర దేశాల ముద్దుబిడ్డడిగా మన్ననలందుకున్నాడు.

రాజ సింహాసనం ప్రక్కనే ఏర్పరచిన ఉన్నతాసనం పై కూర్చుండబెట్టారు పంపనార్యుని. అరికేసరి స్వయంగా లేచి వచ్చి, మహాకవి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకుని, మెత్తని వస్త్రముతో వత్తి పైకి లేచాడు. మహాకవిని పుష్పమాలాలంకృతుని చేసి, కిరీటం అలంకరించాడు.

వెనువెంటనే పంపన్న కూడా లేచి రాజుని పుష్పమాలాలంకృతుని చేసి ఆ కవిజన ప్రియునికి, తన ఆదిపురాణ గ్రంధాన్ని అందించాడు.

ఆ బృహత్ గ్రంధాన్ని అపురూపరంగా అందుకుని, కన్నుల కద్దుకుని తన ఆసన మలంకరించబోయే ముందు అన్నాడు రాజు..

“మహాకవీ! జైనుల పవిత్ర గ్రంధమైన పూర్వపురాణంలోని రిషభ తీర్ధంకరుల చరిత్రను అందరికీ అవగతమయ్యే విధంగా వాడుక భాష అయిన కన్నడంలో రచించి, జిన ధర్మాన్ని వ్యాపింప చేయుటకు ప్రోత్సహించిన మీకు “కవితా గుణార్ణవ” అనే బిరుదును ప్రదానం చేస్తున్నాను.”

సభ అంతా కరతాల ధ్వనులతో దద్దరిల్లి పోయింది.

“పంపనార్యా! మీ ఆదిపురాణ కావ్యం లోని విశేషములు వివరించవలసిందిగా కోరుతున్నాను.” గుణార్ణవుడు అరికేసరి, కవితా గుణార్ణవుడు పంపన్నని అడిగాడు.

“మహారాజా! జినసేనాచార్యుని పూర్వపురాణంలోని రిషభ తీర్ధంకరుని చరిత్రను చంపూ విధానంలో రచించాను. మానవ జీవితం, మానవ సమాజం, మానవ సంబంధాల గురించి విపులంగా వివరించాను. ఆదినాధుని పూర్వ దశ జన్మలూ పూర్వపురాణంలో జినసేన ఆచార్యులు చెప్పారు. కానీ ఒక జన్మకీ, ఇంకొక జన్మకీ సంబంధం కానీ పోలిక కానీ లేదు. నేను ఆ జన్మలకి కొంత కారణం, కర్తవ్యం ఉండేట్లు చిత్రించాను. మొదటి ఐదు జన్మల్లోనూ విషయ లాలస, భౌతిక ఇఛ్ఛ, సుఖజీవనం కనిపిస్తాయి.. అంటే వాటిని అధికంగా చూపించాను. తరువాతి ఐదు జన్మల్లోనూ నెమ్మదిగా ఐహిక వాంచలమీద విరక్తి, ఆధ్యాత్మిక చింతన, ఆత్మ పరిశీలన, మోక్ష సాధన కనిపిస్తాయి.

ఇందులో ప్రశ్నలకి జవాబులు ప్రస్థుత సమాజ పరిస్థితులలోనే గోచరిస్తాయి. ఎందుకంటే కష్ట నష్టాలని ఎదుర్కునే శక్తి కూడా ఈ కావ్య పఠనంలో లభ్యమవుతుంది.”

అరికేసరి ప్రసన్నవదనంతో ఆచార్యుని పరికించాడు.

“ఆర్యా! ఈ కావ్యం నిడివి ఎంత?”

“మహారాజా! ఇందులో పదహారు ఆశ్వాసాలున్నాయి. వెయ్యిన్నీ ఆరువందల ముప్ఫై పద్యాలున్నాయి. మధ్యలో వర్ణనలు, వివరములూ వచనంలో చెప్పబడ్డాయి. పద్యాలన్నీ వివిధ ఛందస్సుల్లో ఉన్నాయి. శైలి కొంత మార్గ, కొంత దేశి పద్ధతిలో ఉంది. ఈ కావ్యం చదివిన వారికి జైన ధర్మం పూర్తిగా అర్ధమవుతుంది తప్పక.”

సభలో మరల కరతాళ ధ్వనులు.

“ధన్యోస్మి మహాకవీ! మాదొక చిరకాల వాంఛ.. మన్నిస్తారని ఆశిస్తున్నాను.” అరికేసరి అభ్యర్ధించాడు.

“అవశ్యం.. ఆజ్ఞాపించండి మహారాజా!”

“మహా భారతం కన్నడంలో చదవాలని నా కోరిక. ఆ గ్రంధాన్ని మీరొక్కరే కన్నడీకరించగలరు. మీరే సమర్ధులు కవితా గుణార్నవా! మీరెప్పుడంటే అప్పుడు.. మీకు కావల్సిన ఏర్పాట్లు చేయించగలము. అది పంపభారతంగా ప్రఖ్యాతి గాంచగలదు.”

“పంప భారతమా!”

“అవును ఆదికవీ! వ్యాసభారతం సంస్కృతమైతే.. పంప భారతం కన్నడం. అంతే..” అరికేసరి అదాటుగా పలికేశాడు.

 

 

*——————–*

 

1 thought on ““కవితా గుణార్ణవుడు”- చారిత్రక సాహిత్య కధామాలిక – 6

  1. శైలీ, శిల్పం అద్భుతం…..అయితే ఏదో కొరత…..పెరుగన్నం మిస్సయిన విందు భోజనంలా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *