March 29, 2024

ఇంటర్వ్యూ – ఇన్నర్ వ్యూ (హాస్యకధ)

రచన : శర్మ జీ ఎస్ Sharma G S

“వార్  గారూ  నమస్తే .”
“నమస్తే రండీ , రండి , కూర్చోండి .”
“థాంక్యూ .”
“మీరెక్కడనుంచి వచ్చారు ?”
“మేం ‘అదరహో ‘మ్యాగజైన్ నుంచి వచ్చాం . మీ ఇంటర్వ్యూ కావాలి .”
“అలాగే , ఆ మధ్య మీ సంపాదక మహాశయులు నాతో ఈ ప్రస్తావన తెచ్చారు . అయితే ఫలానా సమయంలో అని మాత్రం చెప్పలేదు .”
“మీ పేరు ? ”
“నాకు చాలా పేర్లున్నాయి . అందులో ఏ పేరు చెప్పమంటారు ? ”
“మీకు  మీ వాళ్ళు పెట్టిన పేరు . ”
“మా వాళ్ళు పెట్టిన పేర్లా . అయితే వ్రాసుకోండి .”
“చెప్పండి “ అంటూనే వ్రాసుకోవటం ప్రారంభించారు .
“మా తాతగారికి నన్ను చూస్తే వాళ్ళ తాతగారు గుర్తొస్తారుట. అందుకని ఆయన పేరు కలిసొచ్చేటట్లుగా , ఈ కాలానికి తగ్గట్లుగా సీతారామ్  అని పేరు పెట్టారు.”
“అలాగా !  అన్నాడు విలేఖరి .”
“మా నాయనమ్మ గారికి నాలో వాళ్ళ అత్తగారు కనపడ్తున్నారట. ఆమె గారి జ్ఞాపకార్ధం రామసీత అని పేరు పెట్టేసింది . ”
“రెండు పేర్లు ఒకే రకంగా ఉన్నాయి . వాళ్ళిద్దరి అభిరుచులు ఒకే రకంగా వుండేవాండి .”
“అభిరుచుల దాకా పోయారు , అసలు రుచులలోనే చెప్పలేనంత తేడా వున్నది . ఒకరికి బెండ యిష్టమంటే , మరొకరికి దొండ ఇష్టం . ఆమె హా బీర అంటే  , అహా సొర అంటాడాయన . చిక్కుడు అంటే , గోరుచిక్కుడు అంటారింకొకరు . గోంగూర అంటే తోటకూర అంటారు . పోనీ పండ్లలో నైనా ఇరువురిదీ ఒకటే రుచా అని అనుకొంటే  యాపిల్ అంటే పైన్ యాపిల్ అంటారు . గ్రీన్ గ్రేప్స్ అంటే పర్పుల్ గ్రేప్స్ అంటారింకొకరు .  ఇలా అన్నింటా వాళ్ళ అభిరుచులే వేరు లెండి .”
“అలాగాండి .”
“ఇక మా నాన్నగారు నాకు పెట్టిన పేరు పరశు రామ పవన పుత్ర మారుతీ అని . ”
“ఈ పేరు పెట్టటానికి కూడా ఏమైనా విశేషమున్నదాండి . ”
“అక్కడకే వస్తున్నా . పరశురామ పేరు పెట్టడానికి పరశురాముడు తనను కన్న తల్లితండ్రులు కడతేరిన తర్వాత , అత్యంత భక్తి శ్రధ్ధలతో  అంత్యక్రియలు పూర్తిచేశాడంట . ఇక పవనపుత్ర అని పెట్టడానికి ఆగ(ని)మేఘాలను దాటి ఎక్కడకైనా వెళ్ళగల సామర్ధ్యం కలవాడు ఆంజనేయస్వామి కనుక , ఆ పేరుపెడితే కనీసం విదేశయానమైనా  చేస్తాననుకొన్నారుట . స్వదేశీయానం కూడా పూర్తిగా చేయలేకపోయాను. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానన్నదిట.  అలా అయింది చివరికి .
ఇక మా అమ్మగారు తనకు వాళ్ళవాళ్ళు పెట్టుకొనాలనుకున్న పేరు తనకు పెట్టలేకపోయారుట ( కారణం తను మగపిల్లవాడుగా పుట్టకుండా ఆడపిల్లగా పుట్టినందుకుట ) ఆందుకని తను నాకు నాగేశ్వర్ అని పేరుపెట్టిందట . ”
“అంటే మీ పూర్తి పేరు సీతారామ్ రామసీత పరశురామ పవనపుత్ర నాగేశ్వర్ అంటారు . ”
“అది రికార్డులకే పరిమితం . నేను మాత్రం నాగేశ్వర్ కి ఇంగ్లీష్ స్పెల్లింగు Nageswar లోని war మాత్రమే తీసుకొని మిగిలినది మరుగున పరిచాను . అదే నా ( కలం ) పేరు .”
“ఓ అదా అసలు విషయం!  ఇంతదాకా పాఠకులు , మీ కలం పేరుని బట్టి మీరు పొట్టిగా వుంటారనుకుంటున్నారు . ఈ ఇంటర్వ్యూతో మీరు మీ పేరుకు తగ్గట్లు మీరు పొట్టివారు కాదని , పొడుగువారని అర్ధం చేసుకుంటారులెండి .
“మీ ఊరు ఏదండి?“
“మా ఊరు అంటే నేను పుట్టినదా ? మా మమ్మీ , డాడీలు పుట్టిన ఊళ్ళా ? లేక మా తాత ముత్తాతలు పుటిన ఊళ్ళా ?”
“వాళ్ళందరివి అవసరం లేదులెండి”
“అలాగైతే నేను పుట్టినది పోరుమామిళ్ళ ”
“మీ స్వస్థలమ్?”
“పెంటపాడు”
“మీరెంతవరకు చదివారు?”
“జీవించటానికి సరిపోయే చదువు మాత్రమే చదివాను .ఏదో ఆ రోజుల్లో అక్కడికే ఎక్కువై పోయిందన్నారు మా పెద్దవాళ్ళు. అదే సెవెన్త్ ఫారం .”
“మీ కాలేజీ అనుభవాలేమైనా వున్నాయా?”
“అసలు కాలేజీలే లేవు , ఇంక అనుభవాలెక్కడ్నించి వస్తాయి .”
“మీ రచనారంగానికి ఏ వయసులో నాంది పలికారు?”
“నిజానికి అది కవిత్వమని నాకు తెలియదు , అలా చెప్తూ పోతుండేవాడిని . విన్నవాళ్ళు బాగుంది , భలేగుంది అంటూ వుంటున్నా . ఓ మారు నా 16వ ఏట అనుకుంటాను , మా ఊరికి ఓ సినీ నిర్మాత వచ్చి నా గురించి విని నన్ను తన వద్దకు పిలిపించుకొని తాను తీయబోయే సినిమాకు పాటలు  వ్రాయమన్నారు”
”వ్రాశారా ? ”
“వ్రాశాను”
“ఏ సినిమాకు వ్రాశారు? ”
“నాకూ తెలియదు. ఆ సినీ నిర్మాత ఈనాటి వరకు సినిమా తీయలేదు .”
“మరేదైనా సినిమా నిర్మాతకు యిచ్చి వుండాల్సింది . ”
“మళ్ళీ అలాంటి ఛాన్స్ మరి రాలేదు . మనంగా మనం ప్రయత్నించటానికి మనకంత లేదు .”
“మూడు తేదీలున్నాయి. ఏ తేది చెప్పమంటారు ? ”
“మీరు పుట్టిన తేది?”
“అంటే ? ”
“ఇంగ్లీష్ దా, తెలుగుదా ? లేక రికార్డులలో పొందుపరచినదా ? ”
“ఇంగ్లీష్ దే చెప్పండి .”
“అక్టోబర్ 2 .”
“అది గాంధీజి పుట్టినరోజు కదండి .”
“అవును ఆ తేదీన మరెవ్వరూ పుట్టగూడదంటారా ? నేను కూడా ఆ తేదీనే  పుట్టాను . ”
“మీకిష్టమైన రచయిత ఎవరండి ? ”
“చాలామంది వున్నారు .”
“అందరి పేర్లు వద్దండి . ఒకరిద్దరు పేర్లు చెప్పండి .”
“మల్లాది, యఱ్ఱంశెట్టి సాయి .”
“మీకిష్టమైన రంగు .”
“అందరిలా ఒకటి, రెండు కాదు. ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు ఇష్టమే .”
“మీ హాబీస్ ఏమిటండి ? ”
“హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు, సమయానుకూలంగా  ఫ్యామిలీతో కలసి సరదాగా గడపటమే .”
“మీకిష్టమైన ప్రదేశం?”
“ఈ ప్రపంచం”
“మీకిష్టమైన ఆహారం ఏమిటండి ? ”
“సాత్వికమైన శాకాహరం ”
“జీవితమంటే? ”
‘పుడతామని ఎవరికీ ముందు తెలియదు. పుట్టాం గనుక జీవించాలి.  జీవిస్తున్నాం కనుక నలుగురిని  కనాలి. పదిమంది మెప్పు పొందాలి. ఎందరికో ఆదర్శం కావాలి.’
“భేష్ భేష్ భలే చెప్పారు . ఇతరులలో మీకు నచ్చేవేమిటి ? ”
“నన్ను విమర్శించని వారందరూ నాకు నచ్చుతారు”
“సాహిత్యం మీద మీ అభిప్రాయం”
“మన అభిప్రాయాలను సాహిత్యం ద్వారా సమాజంలోకి ధైర్యంగా పంపేటందులకు అనువైన సాధనం .”
“మీ సహజ ప్రవృత్తి ఎటువంటిది? “
“నిజ ప్రవృత్తి ఎవరు చెప్తారు . అందరూ అన్నీ అబధ్ధాలే చెప్తుంటారు . నేను స్వతహాగా సరస సంభాషుడను . నలుగురిని నవ్విస్తూ , నలుగురితో అ నవ్వుల్లో పాలు  పంచుకొంటూ  ఉంటాను .”
“థాంక్స్ అండి , రేపు ఆదివారం వచ్చే వారపత్రికలో మీ ఇంటర్వ్యూ ప్రచురితమవుతుంది . ఇక మేం వస్తాము . “
వాళ్ళు వెళ్ళిపోగానే లోపలనుంచి వాళ్ళావిడ వచ్చి “అదేంటండి ఇంటర్వ్యూ వాళ్ళతో అన్నీ అబధ్ధాలే చెప్పారు “అన్నది .
“ఇంటర్వ్యూ పేరుతో వచ్చి, మన ఇన్నర్ వ్యూని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారీ పత్రికల వాళ్ళు , ఛానల్లవాళ్ళు . అందుకేనే అలా చెప్పింది  . లేకుంటే నిజాలు చెప్తారటే , నాకు కోపం ఎక్కువని , నలుగిరితో మంచిగా ఉండనని , భార్యను అనుమానిస్తానని , పిల్లల్ని కోప్పడతానని , గొడ్డు కారం తింటానని , కామానికి కామా పెట్టనని , చుట్టాలను దెయ్యాలలా చూస్తానని ఇలాంటివన్ని చెప్పి పాఠకులను బాధించకూడదే . ఎందుకంటే వాళ్ళను మనం పాఠకదేవుళ్ళుగా చూసుకోవాలి . వాళ్ళు అలా వేలం వెఱ్ఱిగా చదువుతున్నారు కనుక మన జీవితం మనం అనుకున్నట్లు , మూడు పువ్వులూ ఆరు కాయలుగా కాకుండా ఇరవై కాయలు ఇరవై అయిదు పూలుగా చెలామణీ అవుతున్నది . పిచ్చిమొఖమా!  వున్నది వున్నట్లు వ్రాయకూడదే . నేనే కాదు ఎవరూ వ్రాయరు, వ్రాయకూడదు.  జ్యోతిశ్శాస్త్రం లోనే కాదు , అన్ని శాస్త్రాలలో కూడా ఇదే ఆచరణలో వున్నది . ఆచార్య ఆత్రేయగారు అపుడెపుడో చెప్పారు “‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి ‘అన్నారు .”
“అంతేనాండి , ఇలా అబధ్ధాలు చెప్పి అందరూ గొప్పోళ్ళు అయిపోతారన్నమాట “అన్నది .
“అన్నమాట కాదే వెఱ్ఱిమొఖమా ఉన్నమాటేనే , సమాజంలో చెల్లుబడి అవుతున్నద

** సమాప్తం **

2 thoughts on “ఇంటర్వ్యూ – ఇన్నర్ వ్యూ (హాస్యకధ)

  1. దీన్నేమంటారు….?….ఈ సంచిక మెనూలో నాటిక అని శీర్షిక….తగునా..? మధ్యలో కొంత టెక్స్ట్ మిస్సింగ్., అయినా క-*థ* అని కదా వాడుక…..మొత్తం మీద ఈ కథ ఏమిటో ఎందుకో మాలిక స్థాయికి తగునో లేదో అర్ధం కాలే…క్షంతవ్యుడను.

Leave a Reply to bv lakshmi narayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *