June 24, 2024

జీవితపథ సోపాన పుటలు ( పలక – పెన్సిల్ )

సమీక్షకులు: అరిపిరాల సత్యప్రసాద్                                                                            satyaprasad

 

 

 

 

కొన్ని పుస్తకాలుంటాయి. వాటిల్లో ఆత్మకథలుంటాయి. తమ జీవితంలో ఎత్తులు – పల్లాలు, నవ్వులు – ఏడ్పులు, సోత్కర్షలు – పరనిందలు వుంటాయి. లిస్టేసుకుంటే శ్రీపాద నుంచి ముళ్లపూడి దాక చాలానే వున్నాయి.

కొన్ని పుస్తకాలు వుంటాయి. వాటిల్లో ఆత్మకథల్లాంటి కథలుంటాయి. చిన్నప్పడు అమ్మ పెట్టిన గోరుముద్దలు, నాన్న పెట్టిన చీవాట్లు, స్కూలు ఎగ్గొట్టడాలు, సరదాలు సంబరాలు.. నోస్టాల్జిక్ గా వుండి ఒకసారి సొంతవూరు వెళ్ళొచ్చినంత బాగుంటాయి. నామిని, ఖదీర్ బాబు ఈ లిస్టులో చెప్పుకునే పేర్లు.

PalakaFinalFrontCoverBig

ఇంకొన్ని పుస్తకాలుంటాయి. వాటిని ఆత్మకథలనలేము, ఆత్మకథాత్మకంగా రాసిన కథలనలేము. కానీ వాటికి దగ్గరగా వుంటాయి. ఇదిగో పూడూరి రాజిరెడ్డి రాసిన “పలక పెన్సిల్” అదే కోవలోకి వస్తుంది. ఏమిటి వాటికి వీటికీ తేడా అంటే – చాలా వరకూ బయోగ్రఫిక్ కథలు తాము పుట్టిన దగ్గర్నుంచి బతికినంతకాలం తమ చుట్టు పక్కల జరిగిన వాటి గురించో, తమకు పరిచయమైన వారి గురించో రాస్తుంటారు. అంటే ఆ మనిషికి బాహ్యంగా జరిగినవన్న మాట. ఈ పుస్తకంలో వున్నవి దాదాపుగా అన్నీ రచయిత మనసులోనే జరుగుతాయి. అందువల్ల ఇవి బయోగ్రఫిక్ కథలు అనడానికి ఆస్కారం లేకుండా పోయింది. బహుశా “మనో”గ్రఫిక్ కథలు అంటే సరిపోతుందేమో.

అసలు ఇందులో వున్నవాటిని కథలనాలో, వ్యాసాలనాలో, మ్యూజింగ్స్ అనాలో తెలియదు. పైగా “అసలు దాన్ని ఏదో ఒక పరిధిలోకి ఎందుకు ఇమడ్చాలి?” అని ముందుమాటలో రచయితే ప్రశ్నించాడు కూడా. కాబట్టి వాటిని ఏమనకుండా వదిలెయ్యడమే ఉత్తమం. అయితే సౌలభ్యం కోసం వీటిని ఫీచర్స్ అందాము. ఎందుకంటే ఇందులో వున్నవన్నీ (రెండు మినహాయించి) సాక్షి ఫన్ డేలోనూ, ఒకటి ఈనాడు ఆదివారం అనుబంధంలోనూ ఫీచర్స్ గానే వచ్చాయి కాబట్టి.

ఒక రచయిత జీవితం గురించి చదువుతున్నకొద్ది ఆ రచయితతో మనకి పరిచయం ఏర్పడుతుంది. ఆ రచయిత తన ఆలోచనలనీ, వివిధ అంశాల మీద తన అభిప్రాయాలని చెప్తుంటే, అవి చదివి అతన్ని మరింత దగ్గరచేసుకుంటాము. ఏదైనా ఒక విషయాన్ని రాయచ్చా రాయకూడదా అన్న భేషజాన్ని వదిలిపెట్టి నిర్మొహమాటంగా తన మనసులో మాటలు రచయిత చెప్పేస్తే, ఆ ఆలోచనలు చదివే పాఠకుడికి ఆలోచనలతో కూడా కలిశాయంటే ఇక ఆ రచయిత చాలా ఆప్తుడిగా మారుతాడు. సరిగ్గా రాజిరెడ్డి పుస్తకం చదివితే అలాగే అనిపిస్తుంది.

పత్రికల్లో ఫీచర్ సందర్భానుసారంగా వస్తాయి కాబట్టి వస్తు సారూప్యం వుండే అవకాశం తక్కువు. పైగా ఇవి ఒక వరసలో రాసినవి కావు (పదాలు పెదాలు మినహాయించి). అందువల్ల వీటన్నింటిని పుస్తకం వేస్తే కలగాపులగంలా కనిపించే అవకాశం వుంది. అయితే రాజిరెడ్డి ఈ ఫీచర్స్ ని కూర్చిన విధానం వల్లే పుస్తకానికి సొగసు అబ్బింది. పుస్తకం మూడు భాగాలు చేశారు. బాల్యం తాలూకు జ్ఞాపకాలు “బలపం” పేరుతోను, ఆ తరువాత యవ్వనం తాలూకు అనుభవాలు “పెన్సిల్” పేరుతోను, మెచ్యూరిటీతో పుట్టిన ఆలోచనలు “పెన్ను” పేరుతోనూ విభాగం చేశారు. బలపం విభాగంలో ఫీచర్స్ పసివాడి అమాయకత్వం, ఊరి జ్ఞాపకాలు, అమ్మ, బాపు, తమ్ముడు వీరందరి చుట్టూ తిరుగుతాయి. “వయసు పెరిగినకొద్దీ ’ఇన్నోసెన్స్’ తగ్గిపోతుంది” అని రచయిత చెప్పుకున్నట్లే బలపం విభాగం దాటి వెళ్తుంటే తగ్గిపోతున్న “ఇన్నోసెన్స్” స్పష్టంగా తెలుస్తుంది. ముందెక్కడో చెప్పినట్లు ఇవి ఆత్మకథాకథనాలు లాంటివి కాబట్టి నోస్టాల్జిక్ అనుభవాన్ని ఇస్తాయి.

పెన్సిల్ విభాగంలో ఉన్న ఫీచర్స్ చూస్తే అవి “కలం స్నేహం”తో మొదలై “ప్రేమ” మీదుగా, అప్పుడప్పుడే ఎరుకకు వస్తున్న “స్త్రీ “ అనే మిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, పెళ్లి, సంసారం, పిల్లల దగ్గరకు వచ్చి ఆగుతుంది. ముగిసే ముందు కాస్త తాత్విక ధోరణిలోకి వెళ్ళి “నేనెవరిని?” అని ప్రశ్నించుకుంటూ ముగుస్తుంది. ఈ విభాగం ఫీచర్స్ లో మనం రచయిత మనసులోకి ప్రయాణం చేస్తాము. అతని ఆలోచనల తెలుసుకోని మన ఆలోచనలతో బేరీజు వేసుకోని – “అరే అవున్నిజమే.. నేనిలాగే అనుకుంటాను..” అనుకుంటూ ముందుకు సాగుతాము. రచయిత పరిణితి గమనించి గౌరవిస్తాము. ఉదాహరణకి “కోనసీమ వాకిట్లో కొబ్బరాకుల కౌగిట్లో” చూడండి. ఒక తెలంగాణా బిడ్డ కోస్తాంధ్రాలో పెళ్ళికి వెళ్తాడు. చుట్టూ వున్న కొబ్బరిచెట్లు, పచ్చదనం చూసి ముందు “రిచ్ గా కనిపించినా, వ్యవహారంలో అదో పేద కాలనీ” అని గుర్తిస్తాడు. ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితిలో ఒక జర్నలిస్టు ఆ వ్యాఖ్య చెయ్యకపోయినా చెల్లుబాటు అయిపోగలదు. కానీ రాజిరెడ్డి పరిణితితో మాట్లాడతాడు. ఇలాంటిదే మరొకటి “స్త్రీ నుంచి స్త్రీ”కి అనే ఫిచర్ లో – స్త్రీ అనగానే అందమైన నాజూకు అమ్మాయే ఎందుకు గుర్తుకురావాలి? అమ్మో, కూలిపని చేసే సరస్వతో ఎందుకు గుర్తుకురాదు అని అడుగుతాడు. “మధుపం” రచయితకి ఇదో కొత్త దృష్టికోణం.

చివరిభాగం “పెన్ను”లో హైకూ కవితల్లా, జెన్ కథల్లా చిన్న చిన్న వాక్యాల్లో పెద్ద పెద్ద ఆలోచనల్ని అందించే ప్రయత్నం చేశారు. కొన్ని సాదాగా వున్నా కొన్ని చెమక్కులు వాటిని మరిపిస్తాయి. “ఉత్తమ పురుషుడు”లో పెదనాన్న, జడచైతన్యంలో “మల్లయ్య” కళ్ళముందు కదలాడి జ్ఞాపకంగా వుండిపోతారు. అంత పదునుందీ చిన్న కథల్లో.

పూడూరి రాజిరెడ్డి ఇంకా ఎన్నో రాశాడు. వృత్తి పరంగా తప్పక కొన్ని, రాయక తప్పక మరికొన్ని రాశాడు. కొత్త కొత్త ప్రక్రియలు చేశాడు. కథలు రాశాడు. వీటన్నింటిలో కొన్నింటినే ఎంచుకోవడం, వాటిని ఒక తార్కికమైన (లాజికల్) వరసలో పెట్టడం వల్ల పుస్తక రూపం సార్థకమైంది. అదే విషయాన్ని అన్వర్ బొమ్మ అట్టమీదే పట్టి ఇచ్చేసింది. మొత్తం మీద సారంగ బుక్స్ (తెలుగులో)   ప్రయత్నం  కొంత ప్రయోగంలా వున్నా ప్రయోజనకరంగా కూడా వుంది. పలక పెన్సిల్ అంటూ విరుద్ధమైన పేరెందుకు పెట్టారో రచయిత ముందు మాటలో తెలుస్తుంది. అయితే “ఒక మగవాడి డైరీ” అని ఉపశీర్షిక ఎందుకు పెట్టాల్సివచ్చిందో అర్థం కాలేదు. ఆ వ్యక్తీకరణలో (మధుపం జ్ఞాపకం వుంటే) ఇదేదో జండర్ వ్యవహారం అనిపించేలా వుంది.

ఇందులో వున్నవన్నీ ఒక్క ఊపులో చదివేయడం సాధ్యం కాదేమో కానీ అడపాదడపా తీసి అక్కడక్కడ చదువుకున్నా బాగానే వుంటుంది. రాజిరెడ్డిని పరిచయం చేసుకున్నట్లు వుంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా రాజిరెడ్డి కనపడితే మనకి చాలా ఆప్తుడు అనిపిస్తుంది. అంతకు మించి ఈ రచయిత కూడా ఎక్కువ ఆశించినట్లు లేదు.

ఈ పుస్తకం నవోదయలో లభిస్తుంది.

Navodaya Book House
Opposite Arya Samaj Mandir,
Near Kachiguda crossroads, Hyderabad 500027
Phone No: 040 24652387

ఒక్కో పుస్తకం వెల రూ. 75 /- మాత్రమే.

ఇండియా బయట పుస్తకాలు కొనుక్కో దల్చుకున్న వారు అమెజాన్ ద్వారా కొనుక్కొవచ్చు. లేదా సారంగ నేరుగా కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం. సారంగ నుంచి నేరుగా పుస్తకాలు కొనుగోలు చేయదల్చుకుంటే editor@saarangabooks.com కు మెయిల్ చేయండి . అమెరికా లో పుస్తకాల వెల ఒకొక్కటి 6.95 డాలర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *