June 19, 2024

రఘువంశం – 3

రచన: Rvss శ్రీనివాస్       rvss

ముందుగా చదువరులకు రాబోయే దేవీ నవరాత్రుల  శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

రెండవ భాగంలో సీతారామ కళ్యాణం వరకు చెప్పుకున్న రఘువంశాన్ని ఈ భాగంలో ముగించాలని అనుకుంటున్నాను. మరి చదవండి ఈ మూడో భాగాన్ని.

 

దశరథ మహారాజు తన నలుగురు పుత్రులతో, కోడళ్ళతో , బంధుమిత్రులతో అయోధ్యకు పయనమయ్యాడు. సుదూర ప్రయాణంలో కొంత దూరం వెంటవచ్చి సాదరంగా వీడ్కోలు పలికారు జనకుని పరివారం. ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు జరిగాయి. నదులు వాగులు పొంగసాగాయి. గరుత్మంతుడు నాగుపాము పడగ చీల్చగా గుండ్రంగా చుట్టుకొని ఉన్న పాము మధ్యలో జారిన మణిలా కనిపించాడట ఆ దినమణి(రవి). ఒక్కసారి ఊహించండి. చుట్టలుగా చుట్టుకున్న నాగు మధ్యలో నాగమణి . ఒక వలయంలో కనబడుతున్న సూర్యుడిని ఎంత చక్కగా వర్ణించాడో కాళిదాసు. ఇంకా ఎన్నో అపశకునాలు కనబడి దశరథుని కలవరపెట్టాయి. వెంటనే పురోహితులు కీడు పోయేందుకు శాంతులు చేసారు. ఇంతలో ఒక మెరుపు మెరిసినట్లు ఒక మహాపురుషుడు వాళ్ళముందు సాక్షాత్కరించాడు. ఆతనే పరశురాముడు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ అందరినీ భయకంపితులను చేసాడు. ఆయనను చూడగానే దశరథుడు భయాందోళనలకు గురి అయ్యాడు.   వెంటనే ఆయనకి అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. యుద్ధకాంక్షతో ఉన్న పరశురాముడు రఘురాముని వైపు చూసాడు. “21సార్లు క్షత్రియ సంహారం చేసి నాకెదురు నిలిచే క్షత్రియుడు లేకుండా చేసుకున్న నాకు ఇప్పుడు మళ్ళీ నీపై శత్రుభావం కలిగింది. భార్గవరాముడిని నేను ఉండగా మరొక రాముడు ప్రసిద్ది పొందడం నాకు అవమానకరం. నీవు విరిచిన శివుని విల్లు విష్ణువు తేజస్సుతో ఏనాడో ప్రభావం కోల్పోయింది. ఇదిగో ఇది విష్ణు ధనుస్సు. దీనిని ఎక్కుబెట్టి బాణం తొడిగి చూపు. అప్పుడు మాత్రమే నేను ఓడినట్లుగా ఒప్పుకుంటాను” అంటాడు పరశురాముడు.

మందహాసంతో తను గత అవతారంలో చేపట్టిన విల్లుని అందుకున్నాడు రఘురాముడు.

అప్పుడు తొలకరిలోని కరి మబ్బుతో కూడిన ఇంద్రధనస్సులా కనిపించాడట ఆ రాముడు. విల్లుని హరివిల్లుతో,  రాముని నల్లని మబ్బుతో పోల్చాడు కాళిదాసు. ఎక్కుబెట్టిన బాణాన్ని చూడగానే పరశురాముడు కాంతిహీనుడౌతాడు. అవతారం అవసానదశకి చేరుకున్నపుడు జరిగే ప్రక్రియగా భావించి రాముని చూసి ఇలా అంటాడు. అవతార పురుషుడవని తెలిసే వచ్చాను రామా. నీవు చేసే శత్రు సంహారానికి ఈ ధనుష్టంకారమే ఒక హెచ్చరిక… అంటూ తన కాళ్ళకు నమస్కరించిన రాముని దీవించి వెళ్ళిపోతాడు ఆ భార్గవరాముడు.

అయోధ్య చేరుకున్న దశరథుడు ఏళ్ల తరబడి రాజ్యాన్ని పాలించాడు . వృద్ధాప్య చాయలతో నెరిసిన వెంట్రుకలు చెవికి తగుల్తూ రాముని పట్టాభిషేకం గురించి కైకకు తెలియకుండా రహస్యంగా చెప్పాయట. ఎంత చమత్కారమో. దశరథుడు రామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసాడు. అంబరాన్నంటే సంబరాలతో అయోధ్య ఉల్లాసంగా ఉంది.

కైకకి దుర్బుద్ధి పుట్టింది. కోపగృహంలోనికి వెళ్ళింది.  పుట్టలోనుంచి ఒకేసారి బైటికి వచ్చిన విషనాగుల్ని పోలిన కోర్కెలు రెండు అడిగింది. తన కుమారుడికి పట్టాభిషేకం రామునికి వనవాసం. అంతే! మొదలు నరికిన చెట్టులా మూర్చిల్లాడు దశరథుడు. దేవాసుర సంగ్రామం లో ఆమె చేసిన సహాయానికి ఇస్తానన్న వరాలు తనకి ఈనాడు శాపాలు అవుతాయని ఊహించలేదు. రామునికి కైకే దశరథుడిగా మారి ఆదేశమిచ్చింది. రాముడు వనవాసానికి బయలుదేరాడు. అయోధ్య అంతా విలపించింది రాముని కోసం. పితృవాక్య పరిపాలన చేస్తూ రాముడు, పతి ఎక్కడుంటే అక్కడే తనకి స్వర్గం అని సీత, అన్నమాట జవదాటని లక్ష్మణుడు అడవికి బయలుదేరారు. ఆ ముగ్గురూ  నారచీరెలు చుట్టుకున్న త్రేతాగ్నుల్లా కనిపించారు అందరికీ.  అంతట వారు పంచవటి చేరుకున్నారు.  అక్కడ శూర్పణఖ రాముని చూసి మోహించింది సీతని వదిలి తనను పెండ్లాడమన్నది. అంతే లక్ష్మణుని కోపానికి గురయ్యింది. ముక్కు చెవులు కోసి వదిలాడు లక్ష్మణుడు.  ఖరదూషణులను వెంటబెట్టుకుని వచ్చింది. అందరినీ అలవోకగా సంహరించాడు రాముడు.

శూర్పణఖ మాటలు విన్న ఆమె అన్న రావణాసురుడు ఆమెకి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని మాయలేడిగా మారీచుని పంపి సీతని అపహరించుకుపోతూ దారిలో అడ్డగించిన జటాయువుని సంహరిస్తాడు. రామ లక్ష్మణులు సీతను వెదుకుతూ హనుమను కలిసి సుగ్రీవునితో  మైత్రి  చేస్తారు. వాలిని సంహరించి సుగ్రీవుని వానర రాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడు శ్రీరామ చంద్రుడు. హనుమ లంకానగరానికి వెళ్లి సీత జాడ తెలుసుకొని, లంకా నగరాన్ని కాల్చి వచ్చి శ్రీరామచంద్రునికి సీత జాడ తెలియజేస్తాడు. వానర సైన్యంతో వెళ్లి వారధి కట్టి లంకానగరం చేరుకొని రావణ సంహారం చేసి అగ్నిపునీత అయిన సీతను పరిగ్రహిస్తాడు శ్రీరామచంద్రుడు.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోనవలసినది ఒకటి ఉంది.“ఉపమా కాళిదాసస్య” అన్నప్పటికీ సాగరానికి, ఆకాశానికి, రామ రావణ యుద్ధానికి మాత్రం పోల్చేందుకు మరేమీ ఉపమానాలు లేవంటాడు కాళిదాసు. లంకా నగరానికి విభీషణుని పట్టాభిషిక్తుని చేసి పుష్పకవిమానంలో అయోధ్యకు బైల్దేరతాడు శ్రీరాముడు. దారిలో కనబడే దృశ్యాలను వర్ణిస్తూ రహస్యంగా సేత చెవిలో చెప్తాడు ఆయన. మేఘం నీరు తాగేందుకు వంగితే మరింత సుడులు తిరుగుతాడు అంటాడు కాళిదాసు. ఆ సముద్రపు ఆవిరి మేఘంగా మారడాన్ని అలా చెప్తాడు. నీటి పాముల పడగల మీద మణులను సూర్య కాంతితో మెరిసే కెంపులుగా వర్ణిస్తూ పగడాలను సీతాదేవి పెదవులతో పోటీపడుతున్నాయని శ్రీరాముడు పరిహాసమాడతాడు. ఐరావతం మదజలాల సుగంధాన్ని మోసుకు వచ్చే మందాకినీ వీచికలు సీతాదేవి చిరు చెమటలను ఆర్చుతున్నాయట. ఇక్కడొక అద్భుతమైన వర్ణన ఉంటుంది. మేఘాలను చీల్చుకొని పోతున్న పుష్పక విమానంలో బైట పెట్టిన సీతమ్మ హస్తానికి తనలో ఉన్న మెరుపుతీగను ఆమె చేతికి కంకణంగా అలంకరిస్తున్నాడట. ఊహకే ఎంత బాగుందో?

యమునతో కలిసిన గంగానదిని ఇంద్రనీలాలు కలిసిన మౌక్తిక హారంలాగా, నల్లకలువలతో  కలిసిన తెల్ల తామరల మాలిక లాగా కనిపిస్తుందని రాముడు సీతాదేవికి చూపిస్తాడు. యమునా నల్లగా ఉంటుందని , గంగ తెలుపని, ఆ సంగమ దృశ్యం నలుపు తెలుపుల సంగమం అని చమత్కరిస్తాడు కాళిదాసు. యమునానది వలన వీడిన జల వాహినులతో ఆ గంగానది జడలతో ఉన్న భస్మాన్ని అలముకున్న శివునిలా ఉందంటాడు.

ఇలా ప్రయాణం సాగించి అయోధ్య చేరుకొని, పట్టాభిషిక్తుడై అయోధ్యను చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు రాఘవుడు. ఇంతలో సీతమ్మ గర్భవతి అవుతుంది. తన తొడపై కూర్చుండ బెట్టుకొని అడుగుతాడు రాముడు. నీకేమి కోరికలు ఉన్నాయో చెప్పమంటూ.  ముని వాటికలు దర్శించాలని ఉన్నదని చెప్తుంది సీతమ్మ. ఒకరోజు రాజ్యంలో ఒక చాకలివాడు తన ధర్మపత్ని సీతమ్మ మీద నిందవేస్తూ తన పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నట్లు వేగు ద్వారా తెలుసుకొని సీతను అడవులలో వదిలి రమ్మని లక్ష్మణుని ఆదేశిస్తాడు రాముడు. మునివాటికల పేరుతో అడవులకి తీసుకెళ్ళి వదిలేస్తాడు లక్ష్మణుడు. ఆ అరణ్యంలో సీతమ్మ రోదన విని వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి తీసుకొని వెడతాడు. అక్కడ లవకుశులు జన్మిస్తారు.

ఇంతలో అయోధ్య సమీపాన ఉన్న మునుల ఆశ్రమాలలో లవణాసురుడు అనే రాక్షసుడు యజ్ఞ యగాదులకి విగ్నం కలిగిస్తున్నాడని  తెలిసి శత్రుఘ్నుని ఆ రాక్షసుని మీదకు యుద్ధానికి పంపిస్తాడు రాముడు. వెళ్ళేదారిలో వాల్మీకి ఆశ్రమంలో విడిది చేసిన శత్రుఘ్నుడు లవకుశుల జన్మ వృత్తాంతం తెలిసి సంబరపడతాడు. కొంత కాలం గడిచాక శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధయాగం చేయాలని సంకల్పిస్తాడు. పత్ని లేకుండా ఆ యాగం వీలు కాదని స్వర్ణ సీతతోనే యజ్ఞమారంభిస్తాడు.

వాల్మీకి మహర్షి శిక్షణలో రామాయణం ఔపోసన పట్టిన లవకుశులు అయోధ్యలో రాముని ఎదుటనే రామకథాగానం చేస్తారు.వారికి ఎవరు నేర్పారని అడిగి, విషయం తెలిసిన పిమ్మట వాల్మీకి మహర్షి ఆశ్రమానికి  వారిని వెంటబెట్టుకొని వెడతాడు శ్రీరామచంద్రమూర్తి. అక్కడ వాల్మీకి మహర్షి వలన వారిద్దరు తన పుత్రులని తెలుసుకొని సీతాదేవి అయోధ్యప్రజల సమక్షంలో తన శీలాన్ని ఋజువు చేసుకొనవలసి ఉందని అంటాడు రాముడు. అంతట సీతాదేవి కాషాయవస్త్రాలు ధరించి యాగశాల వద్దకు వస్తుంది. మనసా వాచా భర్త తప్ప అన్య పురుష సంపర్కం లేని దాననైతే నన్ను నీలో చేర్చుకొమ్మని ప్రార్ధిస్తుంది భూమాతను. భూమి రెండుగా చీలిపోవడం సీతను తన తొడపై కూర్చుండబెట్టుకొని భూమాత అదృశ్యం కావడం క్షణాలలో జరిగిపోతుంది. తన కుమారులలో సీతమ్మను చూసుకుంటూ లవకుశులకు, తన తమ్ముల సంతానానికి వివిధ రాజ్యాలకి అభిషిక్తులుగా చేసి తమ్ములతో సరయులో “గోవ్రతరణం” అనే చోట ప్రవేశించి అవతారం చాలిస్తాడు రఘురాముడు. కుశావతీ పట్టణాన్ని పరిపాలిస్తున్న కుశ మహారాజుకి ఒకనాటి రాత్రి ఒక అందమైన యువతి తన ఎదురుగా నిలిచి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెని ఎవరని అడుగగా “ నేను అయోధ్యను. నీ  తండ్రి వెడుతూ వెడుతూ పుర ప్రజలను కూడా స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రజలు లేక పట్టణం పాడు పడిపోయింది” అంటూ ఆ పట్టణ దుస్థితిని వర్ణిస్తుంది ఆమె.

పురివిప్పి ఆడిన మయూరాలు అడవిలోని కార్చిచ్చుకు పింఛములు రాలి దీనంగా ఉన్నాయి. తరుణుల పాదాల పారాణి ముద్రలతో కనబడే సోపానాలు లేళ్ళను చంపిన పులి నెత్తుటి అడుగుజాడలతో ఉన్నాయి. తామరతూండ్లను తిన్న మదపుటేనుగులు సింహాల పంజా దెబ్బలకు కుంభస్ధలాలు పగిలి దీనంగా ఉన్నాయి. భవనాలలో అలంకరించిన ప్రతిమలపై పాములు విడిచిన కుబుసాలు రవికెలవలే ఉన్నాయి.(అద్భుతం కదూ ఇలాంటి కల్పన). సాలెపురుగులు అల్లిన గూళ్ళే గవాక్షాలకు తెరలుగా ఉన్నాయి. చలువరాతి  మేడలు చంద్రకిరణాలను ప్రతిఫలించడంలేదు అంటూ చెప్పిన ఆమె కోరిక మన్నించి కుశావతిని వేదవిద్యాకోవిదులైన బ్రాహ్మణులకు దానమిచ్చి తన అపర సేనావాహినితో అయోధ్యకి చేరుకుంటాడు కుశ మహారాజు.  తన శిల్పులను ముందుగానే పంపి ఆ నగరానికి పూర్వ శోభను తీసుకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. వారు ఆ నగరాన్ని సర్వశోభాయమానంగా తీర్చిదిద్దిన తర్వాత నగరప్రవేశం చేస్తాడు కుశుడు.

శ్రీరామచంద్రుడు ఏక పత్నీవ్రతుడు. కుశునికి పరాక్రమంలో రామునితో సముడే. కానీ పత్నులు మాత్రం ఎక్కువే.  గ్రీష్మ ఋతువులో ఆయన జలక్రీడలను వర్ణిస్తాడు కాళిదాసు. ఘనమైన స్తనాలతో,  జఘనాలతో ఉన్నప్పటికీ ఉత్సాహం వలన నీటిని తమ చేతులతో చరుస్తూ ఆ తుంపరల ముత్యాలు తమ స్తనాలపై పడడంతో తాము ధరిచిన ముత్యాల హారాలు తెగినా గమనించని స్థితిలో ఉన్నారట కుశుని రాణులు. వారి నాభులని ఆవర్తాలతో, కనుబొమలని అలలతో, ఉరోజాలని చక్రవాకాల జంటలతో పోలుస్తాడు కాళిదాసు. కుశుడు వారితో జలక్రీడలలో ఉన్నపుడు ఇంద్రనీలమణి కాంతులతో ప్రకాశించారట ఆ అంతఃపుర కాంతలు. రంగు రంగుల నీళ్ళు జల్లుతున్న కాంతలతో భిన్న ప్రవాహాలతో , ధాతువులతో  ప్రకాశిస్తున్న పర్వతరాజులా ప్రకాశించాడని అంటాడు కాళిదాసు. ఇలా జల క్రీడలాడుతుండగా తన తండ్రికి అగస్త్య మహాముని ప్రసాదించిన చైత్రాభరణాన్ని పోగొట్టుకుంటాడు కుశుడు. ఆ నగ ధరించి యుద్ధానికి వెడితే విజయం వేరొకరికి దక్కదని తెలిసిన కుశుడు సరయులో సంచరించే కుముదుడు అనే నాగాకుమారుడు హరించాడని సందేహించి ఆతనిపై గరుడాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అంతే నదీజలాలను అల్లకల్లోలం చేసుకుంటూ ఒక అందమైన కన్యతో కుముదుడు కుశుని ముందుకి వస్తాడు. తన చెల్లి ఆటలాడుతుండగా ఈ ఆభరణం దొరికిందని చెప్పి కానుకలు ఇస్తూ తన సోదరిని కూడా పరిగ్రహించవలసినదని వేడుకుంటాడు. అతని ప్రార్ధన మన్నించి కుముద్వతిని  పరిణయమాడతాడు కుశుడు. కుశ కుముద్వతులకు జన్మించిన బాలుడే అతిథి. దేవేంద్రుని పీడిస్తున్న దుర్జయునితో యుద్ధానికి వెళ్లి దుర్జయుని సంహరించి తాను కూడా వీరమరణం పొందుతాడు కుశుడు. చనిపోతూ చెప్పిన మాటల ప్రకారం అతిథిని రాజ్యాభిషిక్తుని చేస్తారు వేదపండితులు. అతిథి జనరంజకంగా ప్రజలను పరిపాలిస్తూ తన పూర్వీకులను మరిపించాడు. ఈయన రాజాన్ని ఎలా పరిపాలించాడో రాజనీతిని ఎంత చక్కగా ఆకళింపు చేసుకున్నాడో వాటిని కూడా తనదైన ఉపమానాలతో వర్ణిస్తాడు కాళిదాసు. అశ్వమేధ యాగం చేసి రాజాధిరాజు అనిపించుకుంటాడు అతిథి.

అతిథికి నిషదుడు అనే కుమారుడు కలిగి రాజ్యాన్ని తన తండ్రిలాగే పరిపాలిస్తాడు. నిషదుని తనయుడు నలినాక్షుడు అద్భుతమైన పరాక్రమ సంపన్నుడు. ఆతని పుత్రుడు నభుడు. నభుని పుత్రుడు పుండరీకుడు. పుండరీకుని పుత్రుడు క్షేమధ్వనుడు. ఆతని పుత్రుడు దేవానీకుడు. దేవానీకుని పుత్రుడు ఆహీనగుడు. ఇతను పరాక్రమశాలే కానీ ప్రియవచనాలకు లొంగిపోయేవాడట. ఆహీనగుని పుత్రుడు పారియాత్రుడు. పారియాత్రుని పుత్రుడు శీలుడు. శీలుడు పేరుకి తగినట్లుగానే సత్ప్రవర్తనతో అందరి మన్ననలు పొందిన మహా పరాక్రమశాలి. పారియాత్రుడు వయసు పైబడుతున్నా భోగలాలసా ప్రియత్వం వలన రాజ్యం వదలలేదు. పూర్తిగా వృద్ధాప్యం వచ్చాక శీలునికి పట్టాభిషేకం చేస్తాడు. శీలుని కుమారుడు ఉన్నాభుడు(లోతైన నాభి కలవాడు అంటాడు కాళిదాసు). ఉన్నభుని కుమారుడు వజ్రనాభుడు. వజ్రనాభుని కుమారుడు శంఖణుడు. శంఖణుడి కుమారుడు వ్యుషితాశ్వుడు. ఈయన కాలంలో అశ్వ సంపదను బాగా వృద్ది చేసాడు. గణపతి వరప్రసాదంతో విశ్వసహుడనే పుత్రుని పొందుతాడు. విశ్వసహునికి విష్ణువు అంశతో పుట్టిన హిరణ్యనాభుడు చక్కని పరిపాలనను అందిస్తాడు ప్రజలకు. హిరణ్యనాభుని సుతుడు కౌసల్యుడు. కౌసల్యుని కుమారుడు బ్రహ్మిష్టుడు. ఆతని కుమారుడు సత్పుత్రుడైన పుత్రుడు. పుత్ర మహారాజు తనయుడు పుష్యుడు. మరో పుష్యానక్షత్రం భూమి మీద పుట్టిందేమో అనిపించిందట. పుష్యుని కుమారుడు ధ్రువసంధి. ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు. కుమారుడు పురిటిలో ఉండగానే ధ్రువసంధి వేటకు వెళ్లి సింహం చేతిలో మృత్యువాత పడతాడు.

సుదర్శనుడికి చిన్నప్పుడే పట్టాభిషేకం చేస్తారు. బాలుడైనప్పటికీ చక్కని పరిపాలనతో అందరినీ ఆకట్టుకుంటాడు సుదర్శనుడు. కత్తి పట్టకుండానే యుద్ధాలలో గాయపడకుండానే రాజ్యలక్ష్మి ఆతని పాలనలో సురక్షితమైంది. యవ్వనుడైన సుదర్శనునికి నచ్చిన కన్యలతో వివాహాలు జరిపిస్తారు. సుదర్శనుని పుత్రుడే అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడు తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని మంత్రుల చేతిలో పెట్టి తాను మాత్రం రమణులతో గడుపుతూ అతి కాముకుడైపోతాడు. ఋతు భేదం లేకుండా, కాల భేదం లేకుండా పగలు రాత్రి  అని లేకుండా నిరంతరం స్త్రీ సుఖాసక్తుడై ఉంటాడు అగ్నివర్ణుడు.యీతని కామకేళీ విలాసాలను ఆ స్త్రీల చేష్టలను వర్ణిస్తాడు కాళిదాసు.

(అది ఇక్కడ అప్రస్తుతం అనిపించి వాటిని ఉదహరించడం లేదు). ఇలా చాలకాలం గడిచాక క్షయవ్యాధిగ్రస్తుడై కృశించి మరణిస్తాడు అగ్నివర్ణుడు. ఎంతమందితో కూడినా అప్పటికి ఎవరి వలన సంతానం కలగలేదు. గర్భంతో ఉన్న ఒక రాణిని గుర్తించి ఆమెనే రాణిగా చేస్తారు మంత్రులు పూరోహితులు. ఆమె చాలాకాలం రాజ్యాన్ని పరిపాలించింది.  వీరులు, కారణజన్ములు, అవతార పురుషులు పాలించిన భూమి చివరకు ఒక సరైన పాలకులు లేని స్థితికి వస్తుంది.

.. స్వస్తి ..

 

వాల్మీకి రామాయణం మూలంలో  అయితే యుద్ధ కాండతో పూర్తి అయిపోతుంది. ఉత్తర రామచరిత్ర వాల్మీకి విరచితం కాదు. అది గల్పిక అని అంటారు. రాముని పుత్రులు లవకుశులు తప్ప మిగిలిన వారి వివరాలు మనకి ఎక్కడా కనబడవు రఘువంశంలో తప్ప. నేను సేకరించిన పుస్తకాలలో విషయాలు మీకు నాదైన శైలిలో అందించే ప్రయత్నం చేసాను. వీలైతే వచ్చే సంచికలో కుమార సంభవం లేదా మేఘసందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తాను…

నమస్సులతో …@శ్రీ (9425012468)

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *