May 25, 2024

సంభవం – 5

రచన: సూర్యదేవర రామ్మోహనరావు

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/ suryadevara

 

 

 

 

 

 

క్షణాల్లో… నిమిషాల్లో ఆ వార్త దేశమంతటా పాకిపోయింది.

హత్యా రాజకీయాలు నశించాలి…

కిరాయి హంతకుల్ని మట్టుబెట్టాలి…

టెర్రరిజాన్ని అణగద్రోక్కాలి…

విశ్వంభరరావు అమర్ రహే…

మీ వెనుక మేం వున్నాం పి.ఎమ్…

లాంగ్ లివ్ విశ్వంభరరావు

అనే నినాదాలతో దేశ ప్రజలు పోటేత్తి పోయారు.

పి.ఎమ్. పేరిట దేవాలయాల్లో పూజలు – యాగాలు, మసీదుల్లో, చర్చిలలో ప్రార్ధనలతో దేశం యావత్తు పూనకం వచ్చినదానిలా వూగిపోయింది.

అప్పటికిగాని ప్రతాప్‌సింగ్‌కి, అర్జున్‌చౌహాన్‌కి విశ్వంభరరావుకి ప్రజల్లో వున్న పలుకుబడి, అభిమానం, ప్రేమ, అండదండలు పూర్తిగా అర్థం కాలేదు.

అర్థమవుతూనే డీలాపడిపోయి వెంటనే తమ ఎత్తుగడల్ని మార్చేసుకున్నారు. 

వెంటనే ప్రెస్‌ని పిలిచి హత్యా రాజకీయాలు నశించాలి – హత్యా సంఘటనపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని బల్లగుద్ది మరీ డిమాండ్ చేశారు.

అదే రాజకీయమంటే-

వెనక్కెళ్ళి పొడవటం- ముందుకొచ్చి పరామర్శించటం.

అవన్నీ పేపర్లలో చూసిన విశ్వంభరరావు వేదాంత ధోరణిలో నవ్వుకున్నారు.

మూడురోజులపాటు దేశంలోని దినపత్రికలన్నీ వేరే వార్తల్నే ప్రచురించలేదు.

పి.ఎమ్. పై హత్యాప్రయత్నం వార్త…

అది చేసింది ఎవరై వుంటారన్న ఊహాగానాలు.

విశ్వంభరరావు దేశానికి చేసిన చేస్తున్న నిస్వార్త్ధ సేవల గురించి సంపాదకీయాలు వెల్లువలా వచ్చేశాయి.

నాలుగోరోజుకి సంచలనం ఒకింత సద్ధుమణిగింది.

విశ్వంభరరావు మీద ప్రజల్లో మరింత ప్రేమాభిమానాలు, గౌరవం, సానుభూతి పుట్టుకొచ్చాయి. ఆయన్ని పి.ఎమ్. గానే కాక వ్యక్తిగతంగా కూడా ఆరాధించటం మొదలైంది ప్రజల్లో.

 

*                                  *                                  *                                  *   

 

నాలుగోరోజు సాయంత్రానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రహస్యంగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు పి.ఎమ్.విశ్వంభరరావు.

ఆయన్ని చూస్తూనే చలించిపోయిన భారతి పరుగున వెళ్ళి ఆయన గుండెలమీద వాలిపోయి పొగిలి పొగిలి ఏడ్చింది.

భారతికి తనమీదున్న ప్రేమాభిమానాలకు కదలిపోయారు పి.ఎమ్.

ఆయన కళ్ళవెంటా నీళ్ళు వచ్చేశాయి.

ఆయన ఆప్యాయంగా భారతి తలని నిమురుతూ చాలాసేపు నిశ్శబ్దంలో మునిగిపోయారు.

ఆ దృశ్యాన్ని అలా చూస్తూండిపోయాడు రుషికుమార్. అతని కళ్ళల్లోనూ సన్నటి నీటిపొర.

 

*                                  *                                  *                                  *   

 

ఆ రాత్రే దేశ ప్రజలనుద్దేశించి దూరదర్శన్‌లో ప్రసంగించారు పి.ఎమ్.

తనపట్ల ప్రేమాభిమానాలు కురిపించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారే తప్ప ఏవర్నీ నిందించలేదు. మరెవర్ని అనుమానించినట్లు మాట్లాడలేదు.

ఆయన దేశప్రజలకిచ్చిన సందేశం-

ఉన్న నాయకులు పోతే కొత్త నాయకులు పుట్టుకొస్తారు. నెహ్రూ పోతే లాల్ బహదూర్‌శాస్త్రి రాలేదా? ఆయన పోతే ఇందిరాగాంధీ రాలేదా? ఆమె పోతే మొరార్జీదేశాయ్ రాలేదా? ఆయన దిగితే చరణ్‌సింగ్ రాలేదా? ఆయన దిగితే తిరిగి ఇందిరాగాంధీ రాలేదా? ఆమె పోతే రాజీవ్‌గాంధీ రాలేదా? ఆయన దిగితే వి.పి.సింగ్ రాలేదా? ఆయన దిగితే చంద్రశేఖర్ రాలేదా? ఆయన దిగి- రాజీవ్‌గాంధీ పోతే పి.వి. రాలేదా? నేను పోయినా, దిగినా మరొకరొస్తారు.

నాయకులు కావాలంటే పుట్టాగొడుగుల్లా పుట్టుకొస్తారు. వారిలో ఒక్కరిద్దరైనా నిజంగా దేశానికి, ప్రజలకి మేలు చేసేవారుండకపోతారా?

దేశం ముఖ్యం… దేశమొక్కటిగా వుండటం ముఖ్యం.. ప్రజలు ముఖ్యం… అందరిలో దేశభక్తి వుండటం ముఖ్యం. అంతేకాని నాయకులు ముఖ్యం కాదు.

దేశమొక్కటే – నాయకులే ఎందరో. ఎవరున్నా, పొయినా దేశ భవిష్యత్ ముందుకు దూసుకుపోవటం ఆగదు. కాలం అంతకంటే ఆగదు.

కాకపోతే దేశానికి ఇప్పుడు కావాల్సింది పేడపురుగుల్లాంటి రాజకీయ నాయకులు కాదు-

శేషన్ లాంటి నిజయితీపరులు…

ఖైర్నార్ లాంటి నీతిమంతులు…

రాచెల్ చటర్జీ లాంటి ధైర్యవంతులు…

కిరణ్‌బేడీ లాంటి సాహసవంతులు…

కె.సి.ఎస్.గిల్ లాంటి సింహాలు కావాలి. అలాంటి లక్షణాలున్న వాళ్ళే దేశనాయకులు కావాలి. అప్పుడే మనదేశం బాగుపడుతుంది. మరింత వేగంగా ముందుకెళుతుంది.

అలాంటి వార్ని ప్రోత్సహించండి – పొగడండి – సన్మానించండి – మెచ్చుకోండి – అలాంటివారికి అండగా నిలబడండి.   

అప్పుడే అలాంటి నీతిమంతులు, నిస్వార్థ సేవాతత్పరులు పుట్టుకొస్తారు. అలాంటి వారి పుట్టుకకు మీరు తోడ్పడండి… అని ముగించి చివరగా-

జైహింద్…. జైహింద్… జైహింద్… అని గుండె లోతుల్లోంచి నినదించారు విశ్వంభరరావు.

డైరెక్టుగా టెలీకాస్ట్ అయిన ఆ ప్రసంగం దేశ ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేసింది.

దూరదర్శన్ సిబ్బంది పి.ఎమ్. రెసిడెన్స్ నుంచి వెళ్ళిపోయాక డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చారు పి.ఎమ్. ఆయన కెదురుగా రుషి అక్కడే వున్నాడు.

భారతి భోజనం వడ్డించే ఏర్పాట్లలో వుంది.

రెండు ఎకరాల సువిశాల పచ్చిక మైదానంలో వున్న పి.ఎమ్. రెసిడెన్స్ గంభీరమైన నిశ్శబ్దంలో మునిగివుంది.

సెక్యూరిటీ సిబ్బంది బ్లాక్ కేట్ కమెండోస్ బి.ఎస్.ఎఫ్ జవానుల బూట్ల నాడాల శబ్దం మాత్రం అప్పుడప్పుడూ వినిపిస్తోంది.

భారతి భోజనం వడ్డించినా దాని జోలికి వెళ్ళకుండా పరధ్యానంగా వుండిపోయారు పి.ఎమ్.

ఆయన మొహంలో ఏదో విషాదపు చాయ స్పష్టంగా తొంగి చూస్తోంది.

విషయమేమిటో అర్థంకాక రుషి, భారతి కనుసైగను అర్థం చేసుకుంటూ-

ఎంటంకుల్… ఏమిటలా వున్నారు?” ఒక తల్లిలా అనునయంగా ఆయన గడ్డాన్ని పట్టుకొని అడిగింది.

ఆయన ఒకసారి తలెత్తి ఆ ఇద్దరి వైపు చూసి కళ్ళనీళ్ళు పెట్టుకునారు.

అది చూస్తూనే ఇద్దరూ ఖిన్నులయిపోయారు.

తనపై జరిగిన హత్యా ప్రయత్నం తలుచుకొని భయపడేంత పిరికివారు కాదు విశ్వంభరరావు.

మరి దేనికా కన్నీళ్ళు?

అదే అడిగింది భారతి.

ఆయనొకసారి భారతికేసి చూసి “నా చివరి ఘడియ వరకు నువ్వు నా దగ్గరే వుండి నా నోట్లో నాలుగు తులసినీళ్ళ చుక్కలు పోస్తావమ్మా?” ఆ మాటలంటున్నప్పుడు ఆయన కంఠం ఎందుకో వణికింది.

అది వింటూనే భారతి నిలువునా ద్రవించిపోయింది.

నాకు తలకొరివి నువ్వు పెడతావా బాబూ?” రుషికేసి చూస్తూ అడిగారాయన మసకభారిన కళ్లను తుడుచుకుంటూ.

రుషి, భారతి ఏడుపును ఆపుకోలేకపోయారు.

ఒక్క ఉదుటున లేచి ఆయన పక్కకు వెళ్ళి ఆయన్ని చిన్నపిల్లాడిలా తమ అక్కున చేర్చుకుని బోరుమని ఏడ్చేశారు.

పుట్టి బుద్దెరిగాక కంటితడి పెట్టెరుగని రుషి- కఠోరమైన బ్లాక్ క్యాట్ కమెండో శిక్షణలో అరితేరి, అరివీర భయంకరుడైన రుషి కంటితడి పెట్టటం అదే మొదటిసారి.

అది చూస్తూ పి.ఎమ్ మరింతగా కదిలిపోయాడు.

ఎందుకర్రా అలా చిన్నపిల్లలా ఏడుస్తారు? ఇప్పుడేమయిందని? ఊ… మీలో ఒకరు నాకు కొడుకైతే, మరొకరు కోడలు, కోడలే కూతురు కూడా” అంటూ ఆ ఇద్దర్ని దగ్గరకు తీసుకుని వారి తలల్ని నిమిరారాయన.

అప్పుడర్థమయింది ఆ ఇద్దరికి ఆయనెందుకు బాధపడుతున్నది.

అర్థమయిన ఆ క్షణానే ఆ ఇద్దరూ ఒక నిర్ణయానికొచ్చేశారు- తమ ప్రాణాల్ని, ప్రేమని, అభిమానాన్ని అడ్డుపెట్టయినా ఆయన్ని కాపాడుకోవాలని.

ఆ క్షణానే పి.ఎమ్ ఒక నిర్ణయానికొచ్చేశారు-ఆ ఇదర్ని కలపాలని అందుకే వెంటనే ఆయన తేరుకున్నారు.

చూశావా రుషి! నీ కాబోయే భార్య నాకు బట్టలు కూడా కొని పెట్టడం లేదు…” నవ్వుతూ అలకనటిస్తూ బుంగమూతితో అన్నారు పి.ఎమ్.

క్షణాల్లో అక్కడి వాతావరణం తేలికపడింది.

నాకున్నది నాలుగు జతల బట్టలే! మొన్న హత్యా ప్రయత్నం సంఘటనలో ఒక జత చినిగిపోయింది. అజ్ఞాతవాసంలో నా మతిమరుపుతో ఒక జత పోగొట్టుకున్నాను. ఇప్పుడెలా మరి?”

ఆ ఇద్దరూ నవ్వు, ఏడుపు కలగలసిన తమ కళ్ళను తుడుచుకొని గుండెల్లో పెరిగిపోయిన భారాన్ని తగ్గించుకున్నారు వెంటనే.

ఆయన్ని డైవర్ట్ చేయడం ఆ సమయంలో చాల అవసరం అని ఆ ఇద్దరూ గ్రహించారు.

ఏం పొగరుబోతుపిల్లా… బట్టలెందుకు కొనలేదు? తిండిలో పొదుపు సరే! బట్టల్లోకూడానా? నీలాంటి పీనాసిదాన్ని పెళ్ళి చేసుకుంటే కడుపుకు తిండే కాదు. కట్టుకోడానికి బట్ట కూడా వుండదు” ప్రేమగా కోప్పడ్డాడు రుషి భారతిమీద.

ఈ అంకుల్ పెద్ద ఖతర్‌నాక్. ప్రభుత్వ ఖజానాలోని డబ్బుని దుర్వినియోగం చేయకూడదు. అది దేశ ప్రజలది. మనది కాదని చెప్పింది, చెప్పేది ఈయనేగా? ఇప్పుడు నా మీద నింద వేస్తారా? మీకు రేపుదయం బ్రేక్‌ఫాస్ట్ బంద్” అంది భారతి చిరుకోపంతో.

పెద్దగా నవ్వేశారు విశ్వంభరరావు.

మీ ఇద్దర్నీ ఇలా చూస్తుంటే నాకు కనులపండుగగా వుంది” అని తడిదేరిన కళ్ళను తుడుచుకుని-

నేనీ రోజు నా చేత్తో భోజనం చేయను” అన్నారాయన చిన్నపిల్లాడు మారాం చేస్తున్నట్లుగా.

ఆ ఇద్దరూ నవ్వుకోని అన్నం కలిపి చెరొక ముద్దా తినిపించసాగారు.

 

*                                  *                                  *                                  *   

 

న్యూడిల్లీ- కరోల్‌బాగ్‌లోని ఓ ఖాదీషాపు. ఎవరో తెలీదు. సాక్షాత్తు దేశ ప్రధానికి భారతి ఆ షాపులో దుస్తులు తీసుకుందన్న విషయం అక్కడి వారికి తెలిస్తే?

అందుకే ఆ షాపులోని మేనేజరు అడిగిన ప్రశ్నలకు ఎలా జవాబులు చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు.

ప్రస్తుతం ఆమెకు ఆ ప్రశ్నలే జ్ఞాపకానికొస్తునాయి.

మా అంకుల్ వయస్సు దాదాపు మన ప్రధానిగారున్నారు చూశారూ… అచ్చు.. ఆయనలాగే వుంటారు. అంతే వయసు…” భారతి అలా చెప్తున్నప్పుడే విచిత్రంగా ఆమె ముఖంలోకి చూశాడు ఆ మేనేజరు.

ఎవరి పేరైనా చెప్పొచ్చు.. వయస్సు చెప్పొచ్చు… ప్రధానమంత్రి పేరే ఎందుకు చెప్పిందీవిడ?

కొన్ని ఖాదీ జతలను భారతి ముందుంచి “మీ అంకుల్ కలర్ కూడా మన ప్రధానిగారివంటి కలరేనా అమ్మా…” అనుమానంగా అడిగాడు ఆ మేనేజరు.

అవును” అంది భారతి అనాలోచితంగా.

గుండే గుభేలుమంది ఆ మేనేజరుకి. అతని బ్రెయిన్‌లో ఎక్కడో పెద్ద ముల్లు, చిన్నముల్లు, కలిసి టంగ్ టంగ్‌మని రెండూ ఒకేసారి కొట్టిస్తున్న చప్పుడు…

మూడు జతల బట్టల్ని సెలక్టు చేసింది భారతి.

ఖరీదు విషయంలొ పీచు పీచు బేరమాడింది.

చివరగా డబ్బులిస్తున్న సమయంలో “బిల్లుమీద పేరు రాయాలి. పేరు చెప్పండమ్మా…” అని ఆ మెనేజరు అడగడం, భారతి పరాకుగా-

విశ్వంభరరావు… ప్రైంమినిస్టర్ ఆఫ్ ఇండియా” అని చెప్పెయ్యడం ఆ మేనేజరు ప్రాణాలు పోయిన వాడిలా అయిపోవడం గుర్తుకొచ్చి నవ్వుకుంటూ కారెక్కింది భారతి.

ఆ కారుకి కొంచెం దూరంలో ఆ షాపు మేనేజరు, ఓనరు మిగతా సిబ్బంది మొత్తం వినయంగా నిలబడి భారతివైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నేనప్పుడే అనుకున్నాను సుమీ… ప్రైంమినిస్టరుగారమ్మాయి. చూడు తండ్రిలాగానే, ఆ అమ్మాయి ఎంత సాదాసీదాగా వుందో.. అంతే… ఎంతయినా గాంధీయన్ గదా..” ఓనర్ చలనం లేకుండా అయిపొయిన మేనేజర్‌తో చెప్తున్నాడు.

రెండు మూడు గ్లాసుల నీళ్ళు తాగాకగానీ, మేనేజరు మాట్లాడలేక పోయాడు.

కరోల్‌భాగ్ నుంచి అక్బర్ రోడ్డువైపు వెళ్ళే క్రాస్‌రోడ్స్ దగ్గర రెడ్ సిగ్నల్ చూసి కారు స్లో చేసింది భారత్. ఆ కారుకి కుడిపకన అప్పుడే ఆ క్షణంలోనే అక్కడకు వచ్చి ఆగింది లైట్ బ్లూ కలర్ ఫియట్ కారు.

ఆ ఫియట్ కారులో బేక్ సీట్లో కూర్చున్న వ్యక్తి నెమ్మదిగా కారు గ్లాస్ డోర్‌ని కిందకు దించాడు. షర్టు జేబులో పెన్‌టార్చి సైజులో వున్న మినీ కెమారాను బయటకు తీశాడు.

కుడిచేతి పిడికిట్లో వున్న ఆ కెమెరా, హెడ్‌మీదున్న బటన్‌ని ప్రెస్ చేశాడు.

కెమెరా పనిచేస్తున్న చిన్న చప్పుడు… అంతా అరక్షణంలోనే జరిగిపోయింది.

భరతి చూపు సిగ్నల్ మీదే వుంది.

రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్‌గా మారడంతో కారు సర్రుమని ముందుకు కదిలిపోయింది.

ఫియట్‌కారులోని వ్యక్తి తన చేతిలోని మినీ కెమెరాను జేబులొ వేసుకుని సిగరెట్ తీసి వెలిగించాడు.

ఆ వ్యక్తి-

శోభరాజ్!

 

*                                  *                                  *                                  *   

 

సాయంత్రం నాలుగున్నర దాటింది. జనపధ్ ఏరియాలో శివాలయం ముందు కారాపింది భారతి.

ఆ దారంట వస్తున్నప్పుడు కాసేపు శివాలయంలోకెళ్లి కూర్చోని రావడం భారతికి అలవాటు.

కారు దిగి, నిశ్శబ్దంగా వున్న గుడిలోకి అడుగుపెట్టింది. మండపాల్లో కూర్చుని సాధువులు కబుర్లాడుకుంటున్నారు. గర్బగుడి చుట్టూ ప్రదక్షణం చేసి కాసేపు ఈశ్వరుడ్ని ప్రార్ధించి గుడిమెట్లమీద కూర్చుందామె.

గుడి పైభాగంలో కిటికీల అంచున కూర్చుని పావురాలు చేస్తున్న కువకువలు వింతగా ప్రతిధ్వనిస్తున్నాయి.

ఎందుకో అకస్మాత్తుగా ఆమెకు రుషికుమార్ జ్ఞాపకానిచొచ్చాడు. ఆమె పెదవుల మీద చప్పుడు చెయ్యని సన్నని నవ్వు…

రుషికుమార్ చాలాసార్లు అడిగిన ప్రశ్న ఆమెకు చటుక్కున జ్ఞాపకాని కొచ్చింది.

చూడు భారతి.. నీకు ఎప్పుడైనా, ఏదైనా నీ పర్సనల్ విష్యయం నాతో చెప్పాలనిపిస్తుందా?”

అంటే?”

పర్సనల్ విషయం అంటే తెలీదా?”

అంటే.. ఎలాంటి పర్సనల్ విషయమని?”

దాని గురించే నేనడుగుతోంది. పర్వాలేదు… నేను అనుకోనులే. అంకుల్‌కి కూడా చెప్పనులే.. నాతో చెప్పెయ్.”

ఆ ప్రశ్నకు తను చాలాసేపు ఆలోచించడం జవాబు దొరక్కపోవడం గుర్తుకొచ్చింది భారతికి.

ఎందుకలా అడుగుతున్నాడు రుషికుమార్.

రుషి తనతో ఎప్పుడూ ఏకాంతంగా మాట్లాడలేదు. ఏకాంతంగా మాట్లాడాలని కూడా కోరుకోలేదు.

తను రుషితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటోందా?

ఎందుకు?

రుషి అంటే తను.. తన మనసు యిష్టపడుతోందా?

ఇష్టపడి….”

ఆ తర్వాత మరి ఆలోచించలేకపోయిందామె. చటుక్కున ఒక పావురం వచ్చి ఆమె భుజమ్మీద వాలడంతో ఆలోచనలన్నీ తెగిపోయిన దండలోని ముత్యాల్లా జలజలమని కిందకు రాలిపోయాయి.

చిన్న గోళీకాయల్లా తిరుగుతున్న పావురం కనుబొమలవైపు చూసిందామె.

హలో…”

పావురం హలోఅని పలకరించడం ఆశ్చర్యంగా వుందామెకు.

హలో…. “హలో…”

అప్పుడు తలతిప్పి చూసింది భారతి.

కొంచెం దూరంలో ఠీవిగా నిలబడి తనవైపే చూస్తున్నాడు రుషికుమార్.

నేనిక్కడున్నట్టు నీకెలా తెల్సింది?” ఆశ్చర్యంగా అడిగిందామె.

కలోచ్చింది.. కల్లో నడుచుకుని వచ్చాను. అంతే… ఎదురుగా కలలోని దేవనాయిక…”

రుషి తనను మొట్టమొదటిసారిగా పొగుడుతున్నాడు.

ఏమిటీ.. అబ్బాయిగారి నోటి వెంబడి చిలకపలుకులొస్తున్నాయ్?” చిరుకోపాన్ని నటిస్తూ అంది భారతి.

ముందుకొచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ…

చూడూ పిల్లా! దేవనాయిక అన్నది నిన్ననుకుని పొంగిపోతున్నట్టున్నావ్… సరేలే.. వెనక్కి ఒకసారి తిరిగి చూడు…”

తటాల్మని తలతిప్పి చూసింది భారతి. ఆమె ఆనుకుని కూర్చున్న రాతిస్తంభం మీద అందంగా మలచిన అప్సరస!

సరే.. లే…” అన్నట్టుగా మూతిని మూడు వంకర్లుగా తిప్పి, గబుక్కున చిరుకోపంతో లేచి నిలబడింది భారతి.

ఏమిటీ.. అమ్మాయిగారికి కోపం వచ్చిందా?”

గబగబా కారు దగ్గరకొచ్చి డోరు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుందామె. పరుగు పరుగున వచ్చి డోరుకి ఆనుకుని నిలబడ్డాడు రుషికుమార్.

ఏయ్ భారతీ! ప్రైంమినిస్టర్‌గారు ఇంకో రెండు గంటలసేపు ఆ ఫారిన్ ఎంబాసిడర్స్ మీటింగ్‌లోంచి బయటికి రారు. అందుచేత..”

అందుకే నువ్విలా రోమియాలా తిరుగుతున్నావని నాకు తెల్సు.”

ఏయ్ భారతీ! నువ్వు బుద్ధిగా వింటావంటే ఓ ఇంపార్టెంట్ విషయము చెప్తాను.”

ఏమిటి?” బుంగమూతి పెడుతూ అంది భారతి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ.

నాకు చాలా రోజుల నుంచి ఏదో అనుమానంగా వుంది” అతని ముఖం క్షణకాలంలో సీరియస్‌గా ఆయిపోయింది అనుకోకుండా.

ఎప్పుడూ ఆఫీసుగోలేనా?”

చెప్పొంది విను అమ్మడూ…”

ఏమిటి అనుమానం? అంకుల్‌కి శతృవులు ఎక్కువవుతున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా వుండాలి. నీ ఆఫీస్ స్టాఫ్‌ని జాగ్రత్తగా వుంచుకోవాలి. ఇంతేనా?’

అది కాదులే…”

మరేంటి?”

రాళ్ళల్లోంచి నీళ్ళొస్తాయంటారు నిజమేనా?’

అదా నువ్వడిగేది?”

అవును”

వెళ్ళి ఏ జియాలజిస్టునో అడుగు”

నువ్వే నా జియాలజిస్టువి! ఎందుకో తెలుసా? నన్ను రాతి మనిషినని ఎప్పుడూ నా గొడవే తప్ప, మిగతా హార్ట్ కి సంబంధించిన విషయం నీతో మాట్లాడనని అంటావుగదా? నా అనుమానం ఏంటో తెల్సా… ? ఈ మనిషి కరకు రాతి గుండెల్లో గంగాజలంలాంటి ప్రేమధార పుట్టేసిందేమోనని…”

గబుక్కున కిలకిలా నవ్వింది భారతి.

ఆ నవ్వు వైపే అలా తన్మయతతో చూస్తూ వుండిపోయారు రుషికుమార్ ఒక్కక్షణం.

అయిపోయింది కదా… నే వెళుతున్నా..”

భారతీ ఒక్కమాట! రేపు ఇదే మీటర్లలో ఇక్కడే కలుద్దామా?” నెమ్మదిగా అడిగాడతను.

వాతావరణం బాగుంటే…” యాక్సిలేటర్ నొక్కుతూ అంది భారతి.

ఆ సమయంలో ఆమె మనసు చాలా ఆనందంగా వుంది. రుషికుమార్ సమక్షంలో కొన్ని గంటలు కబుర్లాడుతూ గడపాలని వుంది.

ముందుకు వెళ్ళిపోతున్న కారువైపు చూసి, తన జీప్ వైపు నడిచాడు రుషి. డ్రైవింగ్ సీట్లో కూర్చుని లాక్ ఓపెన్ చేశాడు.

జీప్ ముందుకు కదిలింది. అతన్ని ఆ గుడికెళ్ళేలా చేసింది, భారతిని కలిసేలా చేసింది విశ్వంభరరావే అని భారతికి తెలీదు.

సరిగ్గా అదే సమయంలో…

ఆ దేవాలయంలోని మండపంలో కూర్చున్న సాధువులకు కొంచెం దూరంలో మెట్ల పక్కన చాటుగా కూర్చున్న వ్యక్తి లేచి నిలబడ్డాడు…

ఆ వ్యక్తి శోభరాజ్!

అప్పటికే అతని చేతిలో ఉన్న మినీ కెమరాలో ఉన్న రీల్ మొత్తం భారతి, రుషికుమార్‌ల ఫోటోల్తో నిండిపోయింది.

ఈ అవకాశం కోసమే అతను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు.

తన పని సంతృప్తికరంగా పూర్తిచేసిన శోభరాజ్ దేవాలయంలో నుంచి బయటికొచ్చాడు.

శోభరాజ్ మెట్లమీద కూర్చున్న యువతీ, యువకుల్ని అతి రహస్యంగా ఫోటోలు తీయడం ఆ మండపం మీద కూర్చున్న సాదువుల్లో ఓ సాధువు గమనించాడు.

అతను శోభరాజ్‌ను ఎక్కడ చూసినా గుర్తుపట్టగలడు. శోభరాజ్ ఆకారం ఎందుకో అతని మెదడులో ముద్ర పడిపోయింది. ముప్పై ఏళ్ళ ఆ సాధువు పేరు రూపనీర్…!

 

*                                  *                                  *                                  *   

 

అడవి దారిలో జీపు నలభై మైళ్ళ వేగంతో పరుగులు తీస్తోంది. జీపుని సవ్యసాచి డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక సీట్లో డాక్టర్ నవనీత్, ఆ పక్కన దిశ కూర్చున్నారు. ఎదురుగా వున్న సీటు మీద పొడవాటి ఇన్సులేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్ వుంది. ఆ బ్యాగ్‌లో అరగంట క్రితం చిల్లర్‌గా మారిన సత్యవర్ధన్ శవం వుంది.

సత్యవర్ధన్ శవాన్ని క్రిస్టియన్స్ వాడే శవపేటికలో వుంచితే, ఎవరికైనా అనుమానం రావచ్చునన్న ఉద్దేశ్యంతోనే, ఆ శవాన్ని ఇన్సులేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్లో వుంచారు.

ప్లాస్టిక్ బ్యాగ్‌లో సహజంగా టెంపరేచర్ పెరుగుతుంది. బయట వేడి ఒక్కో డిగ్రీ పెరిగే కొద్దీ, కణాలు మెంబ్రెన్స్‌కి నష్టం జరుగుతుంది.

ఆర్గానిజమ్స్ కణాల పొరలు నాశనం కావడం, ఎంజైమ్ కెమికల్స్ పాడైపోవడం, రీవార్మ్ జరిగేటప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ – అలా ఎందుకు అరుగుతుందో శాస్త్రవేత్తలకు యింతవరకూ అంతుపట్టలేదు.

అదే కాకుండా సత్యవర్ధన్ కరెంట్ షాక్‌వల్ల నరాలు పూర్తిగా కమిలిపోయి, రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి చనిపోయాడు. ఆ బ్లడ్ సెల్స్‌లో మళ్ళీ చైతన్యం కలిగించాలంటే, ఆపరేషన్ జరగడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు.

ఆ విషయాన్నే సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు డాక్టర్ నవనీత్.

మరో నలభై నిమిషాల తర్వాత జీపు మృతసంజీవని ఆఫీసు దగ్గర ఆగడంతో, కిందకు దూకి డాక్టర్ నవనీత్ ఇన్సులేటెడ్ బాక్స్‌ని కిందకు దించాడు. సవ్యసాచి వచ్చి తోడుపట్టగా, ఆ చిల్లర్‌ని లేబరేటరీకి తీసుకుపోయారు.

అప్పటికే అక్కడ చిల్లర్‌ను భద్రపరచడానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసింది డాక్టర్ విజేత. అది పూర్తయ్యాక వెంటనే బయలుదేరి, మూడు గంటలసేపు ప్రయాణించి అడవి మధ్యలో వున్న మృతసంజీవనీ లేబరేటరీలోని స్పెషల్ రూమ్‌లో వుంచారు. ఆ రూమ్‌లో మూడు ఏసీలు, అయిదు నిలువెత్తు ఐస్ బాక్సులూ వున్నాయి.  

చిల్లర్‌గా మార్చిన శవాన్ని, ఆపరేషన్ కోసం సిద్ధం చెయ్యాడానికి మొట్టమొదట చేపట్టే ప్రక్రియ అది.

ఆపరేషన్ ప్రారంభమైంది. డాక్టర్ విజేతతోపాటు, డాక్టర్ నవనీత్ కూడా ఆపరేషన్ రూమ్‌లో వున్నాడు.

నలభై నిమిషాల తర్వాత చెప్పింది విజేత.

రక్తం బాగా పోయింది.”

చిల్లర్‌గా మారిన సత్యవర్ధన్ బ్లడ్‌గ్రూప్ కోసం డాక్టర్ నవనీత్ గబగబా బయటికొచ్చి, స్టోర్‌రూమ్ వైపు నడిచాడు. ఆ స్టోర్ రూమ్ బ్లడ్ బ్యాంక్. మనిషి శరీరంలో వుండే వివిధ గ్రూపుల రక్తాన్ని బాటిల్స్‌లో అక్కడ భద్రపరుస్తారు. వివిధ బ్లడ్ బ్యాంక్స్ నుంచి. ప్రైవేట్ వ్యక్తుల నుంచి, ఆ బ్లడ్‌ని కొనడం జరుగుతుంది. ఆ బ్లడ్ బ్యాంక్‌కి ఒక ఇన్‌చార్జి వున్నాడు.

డాక్టర్ నవనీత్‌ని చూడగానే, విశ్వమొహన్ సీట్లోంచి లేచి విష్ చేశాడు. తనకు కావాలసిన బ్లడ్ గ్రూప్ గురించి చెప్పాడు నవనీత్. ఆరు బ్లడ్ బాటిల్స్ తీసి, రిజిస్టర్లో ఆ విషయం రాసుకున్నాడు విశ్వమోహన్. నవనీత్ ఆ రిజిష్టర్లో సంతకం చేసి, ఆ బాటిల్స్‌ను తీసుకున్నాడు.

ఆపరేషన్ రూమ్‌లోకి రాగానే చెప్పింది విజేత.

డాక్టర్ నవనీత్! అనదర్ ప్రాబ్లం. ఇతని కిడ్నీ ఒకటి పాడైపోయింది. మన ఆపరేషన్‌కి పెద్ద అడ్డంకు కాదనుకోండి. కానీ ఫ్యూచర్ ఆపరేషన్స్ దృష్ట్యా, మనం కిడ్నీస్‌ని కలెక్ట్ చేయాల్సిన అవసరం వుంది.”

వెంటనే అతను ఇంటర్‌కమ్ తీసుకుని, సంబంధిత డిపార్ట్‌మెంట్‌కి ఆర్డర్స్ ఇష్యూ చేశాడు.

ఎస్.. డాక్టర్! మేము ఆ ప్రయత్నంలో వున్నాం.”

సరిగ్గా ఆ సమయంలోనే చనిపోయిన సత్యవర్ధన్ చర్మంలోకి, నీడిల్‌ని ఇంజెక్ట్ చేసి, రక్తాన్ని సిరంజ్‌లోకి తీస్తోంది డాక్టర్ విజేత.

 

*                                  *                                  *                                  *   

 

న్యూడిల్లీ…

ప్రైమ్ మినిస్టర్స్ సెక్యూరిటీ చీఫ్ అఫీసు…

అతి త్వరలో న్యూడిల్లీలో జరగబోయే పార్టీ ప్రతినిధుల సభకు సంబంధించిన ఇంటెలిజన్స్ రిపోర్ట్ కాపీని, సీరియస్‌గా చదువుతున్నాడు రుషికుమార్. మొదట ఎర్రకోటలో దాదాపు పదిలక్షలమంది కార్యకర్తలతో ర్యాలీ సమావేశం. ఆ సమావేశంలో ప్రధాని విశ్వంభరరావు తను గత రెండేళ్ళుగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి సభలో వివరిస్తారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం ఇరవై లక్షలమంది కార్యకర్తల్ని సమీకరించాలని అంచనా.

అప్పటికే అయా రాష్ట్రాలోని పార్టీ ప్రతినిధులు, పార్లీమెంట్ సభ్యులు, మంత్రులు, కార్యకర్తల సమీకరణ ప్రయత్నాల్లో వున్నారు.

సమావేశం తర్వాత, సిరిఫోర్ట్ ఆడిటోరియంలో జరిగే ప్రతినిధులసభలో పార్టీ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు.

ప్రధాని సెక్యూరిటీ కోసం అయిదు వేలమంది స్పెషల్ ఆర్మ్‌డ్ కమెండోస్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

నివాస భవనం దగ్గర్నించి, ఎర్రకోట మీటింగ్ ప్రదేశం వరకూ వెళ్ళే రోడ్స్ అన్నిటినీ, ఆ రోజు క్లోజ్ చేస్తారు. సమావేశం జరగడానికి ముందు, వారం రోజుల నుంచి ఎయిర్‌పోర్ట్స్, రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్ ఇతర ముఖ్య ప్రదేశాల దగ్గర నిఘా పెంచుతారు.

ఆ రిపోర్ట్‌ను జాగ్రత్తగా ఫాలో అవుతున్న రుషికుమార్ చూపులు ఒక వాక్యం దగ్గర ఆగిపోయాయి.

అయినప్పటికీ ఇన్ని లక్షలమంది ప్రజల మీద నిఘా వెయ్యడం చాలా కష్టం. గత రెండు నెలలుగా విదేశీ ట్యూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది. శత్రువర్గాలు, ట్యూరిస్టుల రూపంలో దేశంలోకి ప్రవేశించడానికి ఆస్కారం  వుంది.

ఆ రిపోర్ట్ సారాంశం రుషికుమార్‌కి అర్థమైపోయింది.

ఒక పక్క పార్టీ నాయకుల్లో అంతర్గత కలహాలు… ప్రధానిని పదవిలోంచి దించెయ్యడానికి జరుగుతున్న కుట్రలు… ఆ బలమైన కుట్రల వెనక, బలమైన విదేశీ హస్తం వుండే విషయం వాస్తవం.

శత్రువర్గాలు ప్రధాని విశ్వంభరరావు మీద దాడి చెయ్యడానికి, ఎర్రకోట ర్యాలీ రోజునే ఎంచుకుంటే…

తన అభిప్రాయంతోనే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏకీభవించడంతో, ఆలోచనలో పడ్డాడు రుషికుమార్.

ఆ పరిస్థితిలో తను, తన బలగం అప్రమత్తంగా వుండడం తప్ప మరేమీ చెయ్యలేదు.

దీర్ఘంగా నిట్టూర్చి, సీట్లోంచి లేవబోతూ ట్రేలో వున్న బ్రౌన్ కలర్ కవర్‌వైపు చూశాడు. దానిమీద పి.ఎమ్  ఆఫీస్ క్లర్క్ వేసిన పర్సనల్ అనే స్టాంప్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.

గబుక్కున ఆ కవర్ని అందుకున్నాడు రుషికుమార్, వెంటనే కవరుచించి, లోపల లెటర్ని బయటకు తీశాడు.

తన ఏకైక తమ్ముడు గిరీష్‌కుమార్ నుంచి ఆ లెటర్. వాడికి లెటర్స్ రాయడమంటే చాలా బద్ధకం. ఎప్పుడో, ఏదో అవసరమయితేనే తప్ప – ఫోన్ చేసే మనస్తత్వం.

ఉత్తరమంతా చదివాడు.

గిరీష్ వసంత అనే అమ్మాయిని ప్రేమించడం, స్వంత వూరు తీసికెళ్ళడం… గురించి రాసిన ఉత్తరం అది.

ఊరిలో తాతయ్య తప్ప, తమకెవరూ లేరు. తల్లీ తండ్రీ యాక్సిడెంట్‌లో చనిపోయిన విషయం చటుక్కున గుర్తుకొచ్చింది.

తను అర్త్జంటుగా పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో రాసి-ప్రేమించి, పెళ్ళి చేసుకున్నందుకు, నీకు ముందుగా చెప్పనందుకు కోపగించుకోవు కదూ… అని రాశాడు గిరీష్.

ముందుకు చెప్పి పర్మిషన్ తీసుకుని చేసుకుంటే, అది లవ్ మ్యారేజ్ ఎలా అవుతుందిరా మైడియర్ భాయ్” నవ్వుతూ తనలో తనే అనుకున్నాడు రుషి.

వెంటనే గిరీష్‌కి ఉత్తరం రాసి, కొత్త దంపతులిద్దరూ అర్జంటుగా ఢిల్లీ రావాలని, తన దగ్గర వారం రోజులు గడపొచ్చని రాశాడు. తనే స్వయంగా కవరుని అంటించి ప్యూన్‌ని పిలిచి, అర్జంటుగా ఆ ఉతరాన్ని పోస్టుబాక్స్‌లో వేసి రమ్మన్నాడు రుషి.

ఆ ఉతరాన్ని తీసుకుని పోస్టు చేసి వచ్చాడు ప్యూన్.

రెండు గంటల తర్వాత ఢిల్లీ నుంచి మిగతా ఏరియాలకు వెళ్లే ఉత్తరాల్ని సార్ట్ చేస్తున్న పోస్టాఫీసు సిబ్బందిలోని ఒక స్టాఫ్ మెంబర్ నెల్లూరు జిల్లాకు పంపించాల్సిన తన చేతిలో వున్న రుషికుమార్ ఉత్తరాన్ని ఒకసారి చూసి, దాని కవరు మీదున్న ఎడ్రస్‌ను నోట్ చేసుకుని ఆ ఎడ్రస్‌ను తీసుకుని పబ్లిక్ బూత్ వైపు నడిచాడు.

రిసీవర్ని అందుకుని ఒక నెంబర్‌కు డయల్ చేశాడు.

హల్లో.. నేను సార్! భాటియాని.”

హలో భాటియా… ఎనీ ఇన్‌ఫర్మేషన్…” అవతలి గొంతు ప్రశ్నించింది.

ఎస్ సర్… నేనో అడ్రస్ చెప్తాను… రాసుకోండి…” అని భాటియా గబగబా అడ్రస్ చెప్పాడు.

గుడ్ ఇంఫర్మేషన్! అలాగే ఆ లెటర్లో ఏవుందో చదువు… రాత్రి సిల్వర్ భౌల్ బార్లో కలుసుకో. ఓ.కె…” ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి.

ఆ వ్యక్తి శోభరాజ్.

ప్రధాని విశ్వంభరరావు మర్డర్ కోసం, చాల కాలిక్యులేటెడ్‌గా ఒక్కొక్క పథకాన్నీ అమలు చేస్తున్న శోభరాజ్, తనచేతిలోని పేపర్లో ఉన్న గిరీష్‌కుమార్ అడ్రస్‌వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు.

 

*                                  *                                  *                                  *   

 

కృష్ణాజిల్లా, నందిగామ లైబ్రరీలోకి యిద్దరు కుర్రాళ్ళు ప్రవేశించారు.

ఇద్దరి వయసూ దాదాపు పాతికేళ్ళలోపు.

పోస్టుగ్రాడ్యూయేషన్ పూర్తిచేసి, జాబ్ హంటింగ్‌లో వున్నారు. రోజూ ఓ రెండు గంటలసేపు వారికి లైబ్రరీలో పేపర్ల్లు, మేగజైన్లు చూస్తూ గడపడం అలవాటు.

ఆ ఇద్దరిలో ఒక కుర్రాడి పేరు రమేష్, రెండోవాడి పేరు కామేశ్వర్.

కామేశ్వర్ హిందూ పేపర్ రెగ్యులర్‌గా చదువుతాడు. రమేష్‌కి అన్ని పేపర్లూ ఒకటే. కర్రకుర్చీల్లో కూర్చుని పేపర్లు అందుకున్నారు యిద్దరూ. 

కామేశ్వర్‌కి సైన్స్ వార్తలపట్ల ఆసక్తి ఎక్కువ. మరీ ఇంట్రెస్టు కలిగించే న్యూస్ ఐటమ్స్‌ని ఎవరూ చూడకుండా కట్‌చేసి, ఇంటికి పట్టుకుపోయి ఓ ఫైల్‌లో అతికిస్తాడు. అది అతని హాబీ.

సైన్సు వార్తల కోసం వెతుకుతున్న అతని కళ్ళు చటుక్కున ఒకచోట ఆగిపోయాయి. మొదటసారి ఆ వార్త గబగబా చదివాడు… రెండోసారి ఎక్సయిటింగ్‌గా చదివాడు. మూడోసారి థ్రిల్లింగ్‌గా చదువుతూ, పక్కనున్న రమేష్‌ని మోచేత్తో పొడిచాడు.

ఓరేయ్… రమేష్… నేను చెప్పానా… ఎప్పుడో ఒకప్పుడు నేను చెప్పే విషయం నిజమవుతందని చెప్పానా” అన్నాడు కామేశ్వర్.

ఏమైంది” అతను తల తిప్పకుండానే అడిగాడు.

ముందు ఇది చదువు” అంటూ ఆ వార్తను తనే బయటికి చదివాడు. చదివి- “నీకర్థమైందా” అని అడిగాడు.

లేదు… పూర్తిగా కాలేదు… తెలుగులో చెప్పు…” అతను అన్నాడు.

చచ్చిపోయిన మనిషిని బ్రతికించొచ్చట… ప్రస్తుతం ఆ ఎక్స్‌పరిమెంట్స్ అమెరికాలో విస్తృతంగా జరుగుతున్నాయట. అమెరికాలోని ఒక సంస్థ ఆధ్వర్యంలో ఇండియాలో ఆ పరిశోధనలు జరుగుతున్నాయట… ఇండియాలోని ఆ సంస్థ ఇటీవల ఓ పిల్లి మీద ప్రయోగం చెసి. చచ్చిపోయిన పిల్లిని బ్రతికించిందట.”

చచ్చిన పిల్లిని బ్రతికించారా.. నేనమ్మను” అన్నాడు అతను.

నిజంరా బాబూ… ఈ న్యూస్ చదువు.”

సైన్స్ వార్తల పేరిట అలాంటి వార్తల్ని కొంతమంది క్రియేట్ చేస్తార్రా.. ఈ న్యూస్‌లు నిజంకావు.”

ఇడియేట్… ప్రస్తుతం మన ఇండియాలోని ఆ సంస్థ శవాలమీద ప్రయోగాలు చేస్తోందట.. అతిత్వరలో… ఆ ప్రయోగ ఫలితాలు తెలుస్తాయట.”

శవం… బ్రతుకుతుందా?” పిచ్చింగా నవ్వాడు రమేష్.

నిజంరా… ఏం నువ్వు నమ్మవా నేను నమ్ముతాను.”

నువ్వు నమ్ముతావని నాకు తెలుసుగానీ,నువ్వు నమ్మి ఏం చేస్తావు? ఆ సంస్థ ఎక్కడుందో కనుక్కుంటావా?”

ఒరేయ్ రమేష్! తెలివితక్కువ ప్రశ్న వేసిన ఒక ఐడియా యిచ్చావ్‌రా.. ఆ సంస్థ ఎక్కడుందో… దాని బాసెవడో నేను కనుక్కుంటాను.”

కనుక్కొని?”

రమణారెడ్డి, రేలంగి, ఎస్వీరంగారావుని నేను బ్రతికిస్తాను.”

రమణారెడ్డి, రేలంగి, ఎస్వీరంగారావుల్ని… నువ్వు…” బ్రహ్మానందంలా అభినయం చేస్తూ అన్నాడతను.

అవున్రా! వాళ్ళనే నాకెంత యిష్టమో నీకూ తెలుసు… వాళ్ళని బ్రతికిస్తే…”

ఇంత సడన్‌గా నీకు పిచ్చెక్కుతుందని నేననుకోలేదురా. ఏదో మనిషి పునర్జన్మ. చచ్చిపోయిన మనుషులు మళ్ళీ పుడతారని… ఏవో లెక్చర్లు యిస్తున్నావని సరదాగా విన్నానుగానీ… ఆ మాటలు కూడా పిచ్చికి సంబంధించినవేనని నాకు తెలీదురా. పద… వెళ్ళిపోదాం” అని హిందూ పేపర్ని అతని చేతుల్లోంచి లాగి, టేబుల్ మీద పడేసి, కామేశ్వర్ చేతిని పట్టుకుని, లైబ్రరీలోంచి బయటకు లాక్కొచ్చాడు అతను.

మరో రెండు నిమిషాలయ్యాక మళ్లీ కామేశ్వర్ లైబ్రరీలోకి పరుగెత్తి, అయిదు నిమిషాల తర్వాత గబగబా బయటికొచ్చి, హిందూ పేపర్లోంచి దొంగతనంగా కట్ చేసిన న్యూస్ ఐటమ్‌ని తీసి మళ్ళీ చదివాడు.

ఓర్నాయనోయ్… ఆ పేపర్ కటింగ్‌ని కుళ్ళు కాలవలోకి విసిరేస్తావా… లేదా…” కోపంగా అన్నాడతను.

ఓరేయ్… రమేష్! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వ్ కదా… నన్నర్ధం చేసుకోరా.. చూడు నాన్న… ఎక్కడో దగ్గర డబ్బులు సంపాదిస్తాను. మనం అర్జంటుగా హైద్రాబాద్ వెళదాం” సీరియస్‌గా అన్నాడు కామేశ్వర్.

ఏం…దు…కూ…?”

ఇలాంటి పెద్ద పెద్ద పరిశోధనా సంస్థలన్నీ, అక్కడే వుంటాయి కదరా.. హిందూ పేపర్లో న్యూస్ ఐటమ్ వచ్చింది. ఆ సంస్థ ఎక్కడుందో వాళ్ళకు తెలుస్తుందిరా.”

అయోమయంగా, ఆరు పిచ్చికుక్కలు ఒకేసారి కరిచినవాడిలా కామేశ్వర్ వైపు చూశాడతను.

ఒరేయ్ నువ్వు కాదనకు… నువ్వు కాదంటే మన ఫ్రెండ్‌షిప్ మీద ఒట్టే.”

అలా జాలిగా అడుగుతున్న కామేశ్వర్ వైపు జాలిగా చూశాడు అతను.

హైద్రాబాద్ అనగానే రమేష్‌కి మెంటల్ హాస్పిటల్ జ్ఞాపకానికొచ్చింది. మరీ వీడి పిచ్చి ముదిరితే జాయిన్‌చేసి వచ్చెయ్యెచ్చనే నిర్ణయానికి వచ్చేశాడు.

అలాగేరా… ఎప్పుడూ ప్రయాణం?” అని అడిగాడతను.

రేపు… రేపు వెళ్దాం… ” సాలోచనగా చెప్పాడు కామేశ్వర్.

మర్నాడు వాళ్ళిద్దరూ హైద్రాబాద్‌కు బయల్దేరారు.

 

*                                  *                                  *                                  *   

 

నలభై ఎనిమిది గంటలు గడిచాయి. ఆ నలభై ఎనిమిది గంటలూ క్రయోనిక్ సంస్థలోని ఏ ఒక్కరూ నిద్ర పోలేదు.

డా!! విజేత అయితే లేబరేటరీలోంచి బయటికి రాలేదు.

డా!!సవ్యసాచీ! మనం అనుకున్నంతగా అంతా జరిగితే, చచ్చిపోయిన వ్యక్తిలో మరో గంటలో చలనం రావచ్చు” సవ్యసచితో విజేత చెప్పి నలభై అయిదు నిమిషాలైంది.

మనిషి శవంగా మారిపోయాక శవానికి ప్రత్యేకంగా పేరుండదు. ఫలానా వ్యక్తి శవం అంటాం. కానీ క్రయోనిక్స్ పరిశోధనలో చిల్లర్‌గా మార్చిన ప్రతి శవానికీ ప్రత్యేకమైన కోడ్‌ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే చచ్చిపోయిన శవం బ్రతికినప్పుడు ఆ మనిషి రెండో మనిషి కింద లెక్క. పూర్వపు జ్ఞాపకాలు ఆ వ్యక్తికి వుంటే, అదే పేరును కంటిన్యూ చేయవచ్చు. లేదా కొత్త పేరును పెట్టడానికి వీలుగా-

ప్రస్తుతం ఆ శవానికి పెట్టిన కోడ్ ‘zzz’  త్రిబుల్ జడ్.

విజేతకి ఆ పరిశోధన చాల ఎక్సైటింగ్‌గా వుంది.

ఒకపక్క కంప్యూటర్ స్క్రీన్స్ మెద బ్లూ లైన్స్ చకచకా పరుగులు తీస్తున్నాయి.

అరగంట క్రితం నరాల్లోకి పంప్ చేసిన బ్లడ్ నెమ్మది నెమ్మదిగా దేహమంతా ఆక్రమించుకుంటోంది.

ఆక్సిజన్ సిలిండరుని ఆన్ చేసింది విజేత. మొత్తం హృదయ భాగాన్ని ఎక్స్‌రేలా చూపించే కంప్యూటర్ స్క్రీన్ వైపు కళ్ళార్పకుండా చూస్తోందామె.

క్రయోనిక్ zzz నగ్నంగా వుంది.

హార్ట్ లోకి  ఆక్సిజన్ వెళ్ళటం వల్ల ఆ భాగం పెద్దగా ఉబ్బటం గమనించింది విజేత.

ముక్కు దగ్గర వేలుపెట్టి చూసింది. ఎలాటి గాలీ రావడం లేదు.

ఒన్… టూ… త్రీ… ఫోర్… ఫైఫ్…. సిక్స్… సెవెన్… ఎయిట్…

దూరంగా డా!!నవనీత్, మరికొంతమంది డాక్టర్లు ముళ్ళమీద నిల్చున్నట్టుగా నిల్చున్నారు.

చేతి వాచీ వైపుచూసుకుని శరీరానికి మినిమం టెంపరేచర్‌ని యివ్వటానికి ఏర్పాటు చేసిన వార్మింగ్ మెషిన్ బటన్‌ని నొక్కింది.

సరిగ్గా-

సరిగ్గా-

మూడు నిమిషాల తర్వాత-

ప్రపంచ శాస్త్రజ్ఞుల మెధస్సుకు అపురూపమైన నిదర్శనంలా నిలిచిపోయే అద్భుతమైన సంఘటన ఆ తలకోన అడవుల్లోని ఆ లేబరేటరీలో జరిగింది.

మనిషికి ఏడు జన్మలుంటాయనే సిద్ధంతం ఈనాటిది కాదు. భౌతిక శరీరం మాయమైనప్పటికీ, ఆత్మ గాలిలో తిరుగుతుంటుందనీ, ఆ ఆత్మా మళ్ళీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందనే నమ్మకానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉదాహరణలు యిచ్చేవారు వున్నప్పటికీ, శాస్త్రీయంగా రుజువు చేసేవారు మాత్రం లేరు.

చంద్రమండలం మీద యూరీగగారిన్ కాలుమోపినప్పుడు ప్రపంచము ఎలా ఆశ్చర్యపోయిందో, అంతకంటే వందరెట్లు ఆశ్చర్యం కలిగించే సంఘటన అక్కడ జరగడానికి ఇంకా కొన్ని నిమిషాల టైము మాత్రమే వుంది.

క్రయోనిక్ zzz కి సంక్షిప్త రూపం c zzz

కమాన్! సి త్రిబుల్ జడ్ కమాన్….” విజేత నుదుటి మీద చిరు చెమటలు.

ఆ ఏ.సి.రూంలో లైట్స్ వెలుగు నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది.

కాంతి…

భరించలేని కాంతి…

శవం చర్మం లోపల కెమికల్ రియాక్షన్స్ ఏర్పడే వేడికి తోడు, బయట నుంచి కూడా తగిన వేడిని అందచేసే ప్రక్రియ… పెరుగుతున్న లైట్ల వెలుగు, ఆ లైట్ల వెలుగుని భరించడానికి అనువుగా డా!!కళ్ళకు ప్రత్యేకంగా అమెరికా నుంచి తెప్పించిన గాగుల్స్ వున్నాయి.

లైట్ బ్లూ కలరు కంప్యూటర్ స్క్రీన్ మీద అంతవరకూ వచ్చిన లైన్స్ మారిపోయాయి.

సన్నటి రెడ్ కలర్ లైన్!

సి త్రిబుల్ జెడ్ హార్ట్‌బీట్‌కు నిదర్శనం ఆ రెడ్‌లైన్, ఆ రెడ్ లైన్‌ని చూడగానే విజేత కళ్ళు c zzz గుండెవైపు చూశాయి.

నీటితో నిండిన రబ్బరు ట్యూబ్ కదిలినట్లు హార్ట్ పైభాగంలో చిన్న కదలిక.

డాక్టర్స్! ఉయ్… ఆర్… సక్సెస్… సక్సెస్….” అది అరుపు కాదు.

గెలుపు…!!

మనిషి మరణం మీద సాధించిన గెలుపు!! విక్టరీ ఎగెనెస్ట్‌లైఫ్…

సవ్యసచితోపాటు అందరి కళ్ళూ వింతగా, ఆనందంగా మెరుస్తున్నాయి.

అందరి చూపులూ c zzz మీదే వున్నాయి.

వెంటనే అప్పటికే సిద్ధంగా ఉంచిన వీడియో ప్రొజెక్టర్ ఆన్ చేశాడు సవ్యసాచి

సరిగ్గా అదే సమయంలో-

C zzz కుడికాలు బొటనవ్రేలు… నెమ్మ…దిగా… నెమ్మ…దిగా కదిలింది.

కంప్యూటర్ మానిటర్స్ అన్నీ పనిచేయడం ప్రారంభించాయి.

C zzz శరీరంలోని నాళాల్లో రక్తం నెమ్మదిగా ప్రవహిస్తోంది.

చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం అక్కడ అలుముకుంది. అందరూ ఊపిరి బిగబట్టి, ఏదో తెలీని ఉద్వేగంతో, ఆకాశాన్ని అంటిన ఆనందంతో, కనురెప్ప వేయటం కూడా మర్చిపోయి ఎదురుచూడసాగారు.

సరిగ్గా పదినిమిషాలు గడిచాయి.

 

*                                  *                                  *                                  *   

 

C zzz కి ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

హలో… హలో… హలో! నా మాటలు నీకు వినిపిస్తున్నాయా?”

ఆ మాటలు కోడ్‌గా మారిపోయిన సత్యవర్ధన్‌కి వినిపిస్తున్నాయి. ఆ మాటలు చెవికి చాలా.. చాలా దగ్గరగా వినిపిస్తున్నాయి. తన కనురెప్పల్ని ఎవరో తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.

మిస్టర్! C zzz ! నీఅసలు పేరు నీకు తెలుసా?”

ఎవరో అడుగుతున్నారు.

C zzz గా మారిన సత్యవర్ధన్‌కి అదంతా అన్యూహ్యంగా వుంది.

ఏం జరిగింది తనకీ?

అతని కళ్ళు నెమ్మదిగా తెరచుకున్నాయి. ఎదురుగా.. భరించలేని వెలుగు.  ఆ వెలుగులో మంచులో చిక్కుకుపోయిన బొమ్మల్లా ఎవరో వ్యక్తులు! తన సమీపంలో ఒక వ్యక్తి!

ఎవరా వ్యక్తి?

తను ఎక్కడున్నాడు? ఇంతకీ తనెవరు? ఎదురుగా ఉన్న వ్యక్తుల పెదాల్లోంచి ఏవో మాటలు వస్తున్నాయి. ఆ మాటలు తనకెందుకు వినిపించడం లేదు?

వాళ్ళు చేతుల్తో చేస్తున్న సంజ్ఞలు కనిపిస్తున్నాయి.

ఇంతకీ వాళ్ళెవరు?

తనెందుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో వున్నాడు?

కళ్ళు తెరిచాడు. మనల్ని చూస్తున్నాడు. అతని పేరేంటో అడగండి మిస్ విజేతా!” దూరం నుంచి సవ్యసాచి అన్నాడు ఆనందోద్వేగముతో.

నీ పేరు? వాట్ ఈజ్ యువర్ నేమ్…?” మొదటిసారి, రెండోసారి, మూడోసారి అడిగింది విజేత

ఆ పెదాల కదలిక సత్యవర్ధన్‌కి తెలుస్తూనే వుంది.

c zzz జవాబు చెప్పలేకపోతున్నాడు? తన మాటలు అతనికి వినిపించడంలేదా? అతని చెవులు పనిచేయడంలేదా? ఇంతకీ అతనికి స్పర్శజ్ఞానం వుందా?

ఆ ఆలోచన వచ్చిన వెంటనే గుండుసూదిని తీసుకుని అతని చేతి మీద పొడిచింది.

చర్మం మీద చిన్న నొప్పి, బాధ, కానీ… ఆ బాధను చెప్పలేకపోతున్నాడు c zzz.

సి త్రిబుల్ జెడ్ చెవి దగ్గర గట్టిగా శబ్దం చేసింది విజేత.

ఆ మోత ఆ ఆపరేషన్ థియేటర్లో చాలా పెద్దగా వినిపించింది.

కానీ సి త్రిబుల్ జెడ్‌కి మాత్రం ఏవో లోయలో గంటల శబ్దంలా వినిపించింది. చాతీ కదలికలు, పక్కటెముకల కదలికలు, ఊపిరితిత్తులు పైకి, కిందకూ లేవడం, నరాల్లో రక్తప్రసరణ… ప్రతి ఒక్కింటినీ టెస్ట్ చేస్తోంది డా!!విజేత.

సరిగ్గా అదే సమయంలో-

స్టెతస్కోప్‌తో పరీక్ష చేస్తున్న విజేత ఏదో కొండచిలువ మీద పడ్డట్టుగా ఉలిక్కిపడింది.

డాక్టర్స్… సవ్యసాచీ.. గెట్ ఎవే ఫ్రమ్ హియర్… క్విక్” పెనుకేక పెడుతూ సి త్రిబుల్ జెడ్‌కి వుంచిన కనెక్షన్స్ మెయిన్ కంట్రోల్ సిస్టమ్‌ని ధడాల్మని ఆఫ్ చేసేసింది.

సి త్రిబుల్ జెడ్‌లో ఒక్కసారి కదలికలన్నీ ఆగిపోయాయి. రక్తప్రసరణతో సహా..

డా!! విజేత.. వాట్ హేపెండ్?” కంగారుగా గ్లాస్ డోరు తెరచుకొని లోనికొచ్చాడు సవ్యసాచి. అతని వెనక మిగతా డాక్టర్లు.

మరో క్షణం మనం ఆలస్యం చేస్తే మనం చాలా ప్రమాదంలో పడేవాళ్ళం డాక్టర్… C ZZZ ఎయిడ్స్ పేషెంట్” నెమ్మదిగా చెప్పిందామె.

అంటే… C ZZZ ని చంపేశారా?”

ఎస్ డాక్టర్ తప్పదు. ఏయిడ్స్ రోగిని బ్రతికించడంవల్ల ఉపయోగం లేదు. అందుకే…”

ఇప్పుడేం చేస్తారు?”

మన ఫస్ట్ ఎక్స్‌పరిమెంట్‌కి నిదర్శనంగా లేబరేటరీలో వుంచుదాం.”

మళ్ళీ C ZZZ ని బ్రతికించడానికి వీలుంటుందా?’

ఇట్స్ పాజిబుల్… బట్… ముందు C ZZZ ని ఎయిడ్స్ నుంచి క్యూర్ చెయ్యాలి.”

అదేలా… శవంలో ఎయిడ్స్ రోగాన్ని ఎలా మాయం చెయ్యగలం.”

చేయలేం కనుక చంపేశాను డాక్టర్ సాబ్!” చిన్నగా అంది విజేత.

ఈసారి అప్‌సెట్ అయింది విజేత కాదు. సవ్యసాచి, పక్కనున్న డాక్టర్లు, మిగతా సాంకేతిక బృందం.

ఎయిడ్స్‌కి సరైన మందుకనుగొనబడిన తర్వాతే తిరిగి ఇతడ్ని బ్రతికించే ప్రయత్నం చేయటం బెటరు. అందుకే ఇలా చేశాను” నిట్టూరుస్తూ అంది డా!! విజేత.

మరో ఇరవై నిమిషాల తర్వత C ZZZ కోడ్, సత్యవర్ధన్ శవం చిల్లర్‌గా మారి, అల్యూమినియం సిలిండరులో కెళ్ళిపోయింది. ఆ సిలిండరు స్టోర్‌రూమ్‌లో పెట్టించాక లేబరేటరీలోంచి బయటకు వచ్చింది డా!!విజేత.

 

*                                  *                                  *                                  *   

 

డాక్టర్ సవ్యసాచి దీర్ఘంగా అలోచిస్తున్నాడు. మిగతా డాక్టర్లు కూడా నిశ్శబ్దంగా కూర్చున్నారు.

దిసీజ్ అవర్ హండ్రెడ్ పర్సంట్ సక్సెస్… మీకెందుకలా వరీ అవుతున్నారో నాకర్ధం కావడం లేదు” లోనికెళ్తూ అంది డా!!విజేత. 

లేదు డా!!విజేత… నో డౌట్… ఇట్స్ ఫెంటాస్టిక్… బట్ ఇట్స్ అవర్ బాడ్‌లక్… ప్రపంచ సైన్సు చరిత్రని ఒక్కక్షణంలో సవాల్ చేయగలిగే అరుదైన క్షణాన్ని మనం కోల్పోయాం. అదే నా బాధ…” అన్నాడు సవ్యసాచి నిరాశగా.

నో డాక్టర్! ఇదే మన లాస్ట్ ఫెయిల్యూర్… పిల్లిమీద మనం చేసిన ప్రయోగానికి బాధపడ్డామా… అలాగే ఇది కూడానూ… మనకు అర్జంటుగా శవాలు కావాలి. ఆ విషయం మీరు మర్చిపొయినట్లున్నారు. ఈసారి మనం రెండు మూడు శవాలమీద మనం ఒకేసారి పరిశోధనలు చేయబోతున్నాం” చెప్పింది డా!!విజేత.

అనాధ శవాలపై మనం పరిశోధనలు చేస్తే, ఆ శవాన్ని మనం మనిషిగా చేసినా, మనకు ఉపయోగం లేదు మిస్ విజేతా! ఎందుకంటే మన ఎక్స్‌పరిమెంట్స్ ప్రపంచవ్యాప్తం కావాలంటే మనకు ఫేమస్ పర్సనాలిటీ శవం కావాలి” అన్నాడు నవనీత్.

అంటే మనమే కిల్లర్స్‌గా మారి, ఏ.వి.ఐ.పినో చంపాలంటారు?” జోక్‌గా అంది విజేత. అక్కడ పేరుకుపోయిన వాతావరణాన్ని తేలికపరుస్తూ.

వి.ఐ.పీ శవాలు మనకు కావాలంటే చాలా కష్టం. మన ఫేమస్ పర్సనాలిటీస్ ప్రతి ఒక్కరికీ అంటే పొలిటీషియన్స్, ఇండస్ట్రీయలిస్ట్స్, సోషల్ వర్కర్స్ అందరికీ… ఖననాలమీద, దహనాలమీద నమ్మకం ఎక్కువ. తను దేహాల్ని, హాస్పిటల్స్లో ప్రయోగాలకు అప్పగించే సంప్రదాయంగానీ, దూరదృష్టి గాని మనదేశంలో లేదు” అన్నాడు సవ్యసాచి.

ప్రస్తుతం మన సంస్థ సాదించిన సక్సెస్‌కి ఏదైనా ఆధారం వీడియో కేసెట్, ఆ కేసెట్‌ని రహస్యంగా మనం పాపులర్ చేసి క్రయోనిక్‌గా మారాలనుకునే వ్యక్తుల్ని పట్టుకుంటే…”

కష్టం… ముందు మనల్ని పిచ్చివాళ్ళుగా జమకట్టి, పోలీస్ స్టేషన్లోనో, మెంటల్ హాస్పిటల్లోనో పడేస్తారు. మనకు ముందు రెండైనా, మూడైనా శవాలు కావాలి. అంతేగదా.. శవాల్ని సంపాదించే బాధ్యత నాది. ఓ.కె! డాక్టర్స్” టేబుల్‌మీదున్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపరుని చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు సవ్యసాచి.

డా!!విజేతతో పాటు అందరూ లేచారు. సరిగ్గా అదే సమయంలో లోనికి అడుగుపెట్టింది దిశ.

అయిదు నిమిషాల తర్వాత ఆ రూమ్‌లో సవ్యసాచి, దిశ మాత్రమే వున్నారు. యధాలాపంగా పేపరులోని వార్తల్ని చూస్తున్న సవ్యసాచి ఒక వార్తని రెడ్‌పెన్‌తో మార్క్‌చేసి రెండోసారి చదివాడు. తలెత్తి దిశవైపు చూస్తూ-

దిశా! మనకిప్పుడు శవాలు కావాలి. కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ శవాలైతే… మనకు ఉపయోగపడతాయి. సీ… దిస్ న్యూస్ ఐటెమ్…” ఆ పేపరుని ఆమె ముందుకు తోశాడు అతను.

ఆ వార్తను చదివిందామె.

కానీ…” ఏదో చెప్పబోయింది.

మీ డౌట్ నాకర్ధమైంది దిశా… ఆ వ్యక్తి ఇంకా చనిపోలేదు కదా అని.. కదా…”

అవున్సార్!

సికింద్రాబాద్‌లోని రెండువందల సంవత్సరాల శివాలయానికి ఆయన వంశపారంపర్య పూజారి. అయిదో తరంవాడు. ఎనభై ఏళ్ళ మనిషి ప్రస్తుతం ఆస్పత్రిలో వున్నాడు. అంటే… రేపో, నేడో చనిపోడానికి ఆస్కారం వుంది. ఆ శవాన్ని మనం మేనేజ్ చెయ్యలేమా?”

చెయ్యగలం. కానీ ఆయన బధువులెవరైనా వుంటే?”

లేదు మిస్ దిశా… అతను చచ్చిపోయిన మరుక్షణం ఆ శవాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం.”

అంటే…”

ఎస్… మిస్ దిశా! మానవ కళ్యాణం కోసం శవాల్ని దొంగిలించే దొంగలుగా మారడంలో తప్పు లేదనుకుంటా.”

వెంటనే జవాబు చెప్పలేదు దిశ.

ఓ.కె! సర్… యాజ్ యూ లైక్… ఆ రోజే మీకు చెప్పాను. బాస్ ఆర్డర్ ఈజ్ ఫైనల్ అని” అంది దిశ స్థిరంగా.

బీ రెడీ… రేపు మార్నింగ్ ప్లయిట్‌కి మనం హైద్రాబాద్ వెళుతున్నాం” చెప్పాడు డా!!సవ్యసాచి.

మరో పదినిమిషాల తర్వాత ఆ రూమ్‌లోంచి బయటకు వచ్చింది దిశ.

సికింద్రాబాద్‌లోని ఆ పురాతన శివాలయానికి వంశపారంపర్య పూజారి అయిన ఆ వ్యక్తి పేరు దివ్యానందస్వామి. దివ్యానందస్వామి శవాన్ని దొంగిలించుకుని రావాలన్న సవ్యసాచి ఆలోచన వెనక వున్నది ప్రయోగానికి కావల్సిన శవం ఒక్కటే కాదు. అతని మెదడులో వున్న రెండో ఆలోచనని అతను దిశకు చెప్పలేదు.

 

*                                  *                                  *                                  *   

 

న్యూడిల్లీ…

ప్రధాని రెసిడెన్స్- డైనింగ్ హాల్లో విశ్వంభరరావు, భారతి వున్నారు.

ఏమిటి విశేషాలు?” అలవాటుగా అడిగాడాయన. గత నాలుగైదు రోజులుగా వరసగా విదేశీ గెస్టులతో లంచ్, డిన్నర్లు తీసుకోవడం వల్ల విశ్వంభరరావుతో భారతికి మాట్లాడే అవకాశమే తక్కువైపోయింది.

రెడ్‌ఫోర్ట్‌లో పార్టి ర్యాలీ మీటింగ్ గురించి… రుషి… ఎక్కువ వర్రీ అవుతున్నాడు” నెమ్మదిగా చెప్పిందామె.

అంటే నన్నెవరైనా చంపుతారనా… లేక నా పదవి పోతుందనా?’ ఆ మాటకు బదులివ్వలేకపోయిందామె.

చూడు భారతీ! దేశంలో అత్యున్నత స్థానంలో వున్న ప్రతివ్యక్తికీ, ప్రమాదం ఎప్పుడూ మాటు వేసే వుంటుంది. ఆ ప్రమాదం పేరే పదవీ గండం.. డొంట్‌వర్రీ… పదవి ఎవరికీ శాశ్వతం కాదు, అలాగే ప్రాణాలు కూడా. ఎప్పటికప్పుడు నన్ను దించెయ్యాలని ఎన్ని కుట్రలు జరగలేదు.”

పదవి గురించి కాదు అంకుల్ నేననేది”

ప్రాణాలు గురించా? అంటే మర్డరే” పెద్దగా నవ్వి “చూడమ్మా నేను చాలా మొండివాడిని. నా ప్రాణంకూడా మొండిదే. నన్నెవరయినా చంపినా నేను మళ్ళీ బ్రతికొచ్చి వాళ్లను చంపేసి వెళ్ళిపోతాను.”

సింక్‌లో చేతులు కడుక్కొని, ఆ హాల్లోంచి బయటికెళ్తూ-

ఇలాంటి భయాలన్నీ నీలో ఇంజెక్ట్ చేస్తున్నది ఆ రుషేనా? అయినా మీ యిద్దరు కాకుండా నా గురించి ఇంకెవరు బాదపడతారు చెప్పు. చూడు భారతీ! మీ ఇద్దరూ నా దగ్గరున్నంతకాలం నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. డొంట్‌వర్రీ!”

గబగబా ముందుకెళ్ళిపోతున్న విశ్వంభరరావువైపు అయోమయంగా చూస్తూ నిల్చుండిపోయింది భారతి.

ఆ తర్వాత-

తన అఫీసులోని చాంబర్‌వైపు నడిచింది భారతి.

భారతి ఆఫీసులోకి అడుగుపెట్టడంతోటే ఆమె పి.ఏ.మీరానాయర్ చిరునవ్వుతో విష్ చేసింది.

మిస్ మీరా! ఎనీ న్యూస్?”

ఎస్ మేడం! మీకోసం ఓ పర్సనల్ లెటరొచ్చింది” లేచి ఆ లెటర్ని తీసి భారతికిచ్చింది.

కవరుమీదున్న టైప్‌డ్ లెటర్స్‌ని చూస్తూ చాంబర్‌లోకి అడుగుపెట్టి ఆ కవరుని చింపింది.

గులాబీరంగు పేపరుమీద మూడే మూడు వర్డ్స్-

ఐ లవ్ యూ! ఆ అక్షరాల్ని చూడగానే భారతి బుగ్గల్లో సన్నటి సిగ్గు ప్రవేశించింది. ఎప్పుడూ తీరిక లేకుండా బిజీగా తిరిగే రుషికుమార్ అంత తీరికగా లవ్ లెటర్ పంపడంవల్ల ఆశ్చర్యపోయిందామె.

సిల్లీ గై” మనసులోనే అనుకుంది. పక్కనే వున్న ఫోన్ రిసీవరుని అందుకుని రుషికుమార్‌కి డయల్ చేసింది.

కానీ రుషి అరగంట క్రితమే ఆఫీసు నుంచి బయటకు వెళ్ళిపోయాడని తెలియడంతో ఆమె మనసులో ఎక్కడో చిన్న అసంతృప్తి.

 

*                                  *                                  *                                  *   

 

జనం…

కొన్ని లక్షలమంది జనం….

ఎర్రకోటకు వెళ్ళే విశాలమైన వీధుల నిండా జనం… ఎటు చూస్తే అటు స్పేషల్ కమెండోలు… పెట్రోలింగ్ వ్యాన్లు…

బ్యానర్ల రెపరెపలు… నినాదాల ఘోష… హడావుడిగా వెళ్లిపోతున్న వీఇపీల కార్లు.

ఎర్రకోట ముందున్న విశాలమైనంలో అంతెత్తున ఏర్పాటు చేసిన వేదిక…

అందరి కళ్లూ ఒక వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాయి.

మైక్‌లో ఎవరో పాడుతున్న దేశభక్తి గీతం వినిపిస్తోంది.

ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్లు… ఆ హెలికాప్టర్లలోంచి జల్లు జల్లులుగా కురుస్తున్న పూలవాన.

సరిగ్గా అదే సమయంలో ఆ వేదికకు ఇరవై అడుగుల దూరంలో సర్రమని హారన్ చేసుకుంటూ వచ్చి ఆగింది పైలెట్ వ్యాను- ఆ వెనక స్పెషల్ కమెండోస్ జీపు…. ఆ వెనక మూడు కార్లు- ఆ మధ్య కారులోంచి ఒక వ్యక్తి గంభీరంగా, హుందాగా దిగారు.

ఆయన చుట్టూ స్పెషల్ కమెండోలు, సెక్యూరిటీ స్టావ్!

ఆయన తనకు నమస్కరిస్తున్న రాజకీయ ప్రముఖులకు, విదేశీ ప్రముఖులకు నమస్కారం చేసుకుంటూ గబగబా ముందుకు అడుగులు వేస్తున్నారు.

ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన కాళ్ళకు దండాలు పెట్టబోయారు- మెడలో దండలు వేయబోయారు.

కానీ సెక్యూరిటీ స్టాఫ్ వారిని పక్కక్కు తోసేశారు.

మరో అయిదు నిమిషాల్లో ఆయన వేదిక ఎక్కి మైకు ముందు నుంచున్నారు.

తన ప్రసంగాన్ని కొనసాగించారు…

సరిగ్గా-

సరిగ్గా అదే సమయంలో సన్నటి చినుకులు. కానీ లక్షలాది ప్రజలో ఏమాత్రం చలనం లేదు.

అయిదు నిమిషాలు… పదినిమిషాలు.. ఆయన ఉపన్యాసం అనర్ఘళంగా సాగుతోంది.

సరిగ్గా-

అదే సమయంలో ఆ వేదికకు ముప్పై గజాల దూరంలో వున్న జనంలోంచి ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు.

చాలామంది లేచి నిలబడి పక్కకు వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చోవడం జరిగే ప్రక్రియే కాబట్టి ఆ వ్యక్తిని ఎవరూ గమనించలేదు.

ఆ వ్యక్తి నెమ్మదిగా వడ్డున నుంచున్న జనం దగ్గరకొచ్చి కాసేపు నిలబడి నెమ్మదిగా ముందుకు రాసాగాడు.

వర్షపు చినుకుల ఉధృతి నెమ్మదిగా పెరుగుతోంది… ఒక్కొక్కరూ లేచి నిలబడుతున్నారు.

అయినా వేదిక మీదున్న ఆ వ్యక్తి ప్రసంగం ఆగలేదు.

లేచి నిలబడి అటూ ఇటూ వెళుతున్న వ్యక్తుల్ని రాసుకుంటూ వారి మధ్య నుంచి ఆ వ్యక్తి నెమ్మది నెమ్మదిగా ముందుకు, మున్ముందుకు చొచ్చుకు పోతున్నాడు.

వర్షం ఉధృతి పెరుగుటోంది.

జనం లేస్తున్నారు ఆ వర్షాన్ని తట్టుకోలేక

సరిగ్గా అదే సమయంలో-

ఆ వ్యక్తి అటూ ఇటూ ఒకసారి చూసి తననెవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని తన కుడిచేతిని నడుం దగ్గర ప్యాంటులోకి పోనిచ్చి కొద్ది క్షణాల్లో బయటకు తీశాడు.

కనువిప్పి మూసేటంతలో వేదిక మీద వ్యక్తివైపు ఎయిమ్ చేసి ట్రిగ్గర్ నొక్కాడు.

ధన్… ధన్… ధన్…

అంతే.. మరుక్షణంలో అగ్నిజ్వాలలా అలుముకున్న గందరగోళం.

మహాసముద్రపు కెరటాల్లా లేచిపోయిన జనం.

ఆ జనంలో ఆ వ్యక్తి కలిసిపోయాడు.

వేదిక మీద వ్యక్తి అప్పటికే కుప్పకూలి కిందపడిపోయారు. అప్పటికే ఆయన్ని స్పెషల్ కమెండోలు రౌండప్ చేసేశారు.

ఎటు చూస్తే అటు హాహాకారాలు. తొక్కిసలాటలు… క్షణకాలంలో పోలీసుల బాష్పవాయువులు… లాఠీచార్జీలు… అదొక రణరంగంలా మారి పోయింది.

ఒకరి కాళ్ళకింద ఇంకొక్కరు పడి బాధతో అరుస్తున్న వ్యక్తులు…

అరుపులు… అరుపులు…

 

*                                  *                                  *                                  *   

 

చటుక్కున మెలుకువ వచ్చింది దిశకు.

బెడ్‌మీద గబుక్కున లేచి కూర్చుంది టి.వి.వైపు చూసింది. టీవీని ఆఫ్ చేసి కిటికీ రెక్కలు తెరిచింది.

చల్లటిగాలి రివ్వుమని ముఖానికి కొట్టింది.

చాలారోజులకి మళ్ళీ తనకో కల వచ్చింది.

దేశనేతను ఎవరో మర్డర్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరా నేత? ఆయన్ని మర్డర్ చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?

గత రెండు రోజులుగా చేసిన కార్యక్రమాల్ని జ్ఞాపకం చేసుకుంటోందామె.

శవాల కోసం అన్వేషణలో భాగంగా గత రెండు రోజులుగా చాల న్యూస్ పేపర్స్‌ను తిరగేసిందామె.

ఆ ప్రక్రియలో భాగంగానే శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో ప్రధాని విశ్వంభరరావుపై జరిగిన హత్యాప్రయత్నం…ప్రతిపక్షాలు ఆ ప్రయత్నాన్ని ఖండించడం… మర్డర్ జరగడానికి కారణాలు.. అ ప్రాంతంలోకి మర్డర్‌గా భావిస్తున్న వ్యక్తి రావడం.. ఆ సంఘటన తర్వాత క్షణాల్లో అతను మాయమైపోవడం విషయంలో పత్రికలు ప్రచురించిన ధారావాహిక వ్యాసాలని ఆసక్తికరంగా చదివింది దిశ.

ఆ వార్తల ఫలితమేనా తన డ్రీమ్!

నో… నో… జరిగిపోయిన సంఘటనలు తనకు కలలుగా ఎప్పుడూ రాలేదు ఏదో జరగబోతోంది….

అందుకే దేశంలో జరుగుతున్న రాజకీయాల పరిణామాల వార్తలను నిశితంగా చదివింది.

అతి త్వరలో-

ప్రధాని విశ్వంభరరావు ఆధ్వర్యంలో ఎర్రకోట దగ్గర మీటింగ్ జరగబోతోంది.. ఒక పక్క పార్టీలోని అంతర్గత వర్గాలు ఆయనని పదవిలోంచి దించెయ్యడానికి కుట్రలు చేస్తున్నాయి.

ఆ రెండు వార్తల్ని విశ్లేషించిన దిశ తనకొచ్చిన డ్రీమ్‌కు సంబంధించిన సంఘటనకు డైరీలో నోట్ చేసుకుంది.

తనకొచ్చిన కల గురించి ఎవరితో డిస్కస్ చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు.

చాలాసేపు ఆలోచించిన మీదట ఆ డ్రీమ్ గురించి సవ్యసాచితో డిస్కస్ చేయాలని నిర్ణయించుకుంది.

 

*                                  *                                  *                                  *   

 

 

 

 

 

 

 

12 thoughts on “సంభవం – 5

  1. మీ సీరియల్ నాకు చాల బాగా నచ్చింది……నిజంగా ఎలా జరుగుతుందా సర్…..

  2. ప్రజలకు , ప్రకృతికి మేలు చేసాలా ఉండాలి ఎ ప్రాయోగాలైన

  3. శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలూ చెయ్యకూడదు , సీరియల్ మాంచి సుస్పెన్సుతో సాగుతోంది

  4. ఇలా నిజంగా జరిగితే ప్రపంచం ఏమైపోతుంది ? భూమాత భరించగలద ? ఏది ఏమైనా ఈ సీరియల్ చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *