April 25, 2024

పోరు గీతమై విప్లవిస్తా

రచన: వేంకటేశ్వర చారి chary

రాయల సీమంటే..
ఫ్యాక్షనిజం,
బాంబుల మోతలు,
వేట కొడవళ్ల వీరవిహారం
తెగిపడే కుత్తుకలు, నెత్తుటి ధారలు..
ఇంతే  మీకు  తెలిసింది..
ఇదే మీరనుకుంటున్నది..అంతేకదూ..
కానీ,
ఆ బాంబుల మోతల వెనకాల
ఎన్నో గుండె కోతలున్నాయి
అయిన వారికోసం బరువెక్కిన హృదయాలున్నాయి
పై కెత్తిన కరుకు కొడవళ్ల వెనుక
బాధలతో బరువెక్కిన మానవీయ గాథలున్నాయి
ఆ నెత్తుటి చారికల మాటున దాగి….
అణగారిన  బతుకుల రోదనలు,వేదనలన్నాయి
రత్నాల సీమ రాళ్లసీమగా మారుతుంటే.
మావత్వంతో ధాతృత్వం ప్రకటించిన ధీరోదత్తత దాగి ఉంది
అదేమీ  మీకు తెలియదు..అంతకంటే ఆలోచించరు  మీరు
కానీ..
పదహైదు సంవత్సరాల అనురాగ బందం నాది
రాయల సీమ మట్టితో..
తుంగ భద్రమ్మ జలతారు పైట కొంగుతో
నా కన్నీళ్లు తుడిచి,ఓదార్చిన అనుభవం నాది
కృష్ణమ్మ ఒడిలో సేదదీరిన హృదయం నాది
అన్నా..అంటూ రాలసీమ సోదరులు
అక్కున చేర్చుకుని ఆదరించిన వాన్నినేను
అందుకే సీమ గురించి…
మీకు తెలియని నిజాలు,ఇజాలు చెబుతున్నా..
నా  రాయసీమ అనురాగాల సీమ
రాగ బంధాల సంగమ సీమ
నమ్మితే ప్రాణాలు ఇస్తుంది.
నమ్మించి మోసంచేస్తే..
పగిలిన గుండె రగిలి,
రక్తపుటేరులు పారిస్తుంది
అందుకే ..
నాటి రాయల సీమ రత్నాల సీమ
నేటి రాయల సీమ, రాగాల భామ
చివరిమాట..
రాష్ట్రం విడిపోయింది..పోనిండు
అన్నదమ్ములు విడిపోవడం
వేరు కుంపట్లు పెట్టుకోవడం
మన సంస్కృతిలో ఓ భాగం
బాధలేదు..పడను..
కాని..
రా సీమకు అన్యాయం జరిగితే సహించను
ఆ దేవున్నైనాఎదిరిస్తా..పోరు గీతాన్నై  విప్లవిస్తా..
విభ్రమిస్తా..పరాక్రమం ప్రదర్శిస్తా..
సీమకు న్యాయం జరిగిన తర్వాతే విశ్రమిస్తా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *