February 9, 2023

పాడమని నన్నడగవలెనా – పారసీక ఛందస్సు – 5

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు   j.k.mohanrao                                                                             

 

 

 

 

రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ అమరిక పారసీక, ఉర్దూ భాషలలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఛందస్సు.  దీనిని ఈ విధముగా వ్రాస్తారు: =-== / =-== / =-== / =-= .  దీనికి సరిపోయే గురు లఘువుల అమరిక UI UU UI UU / UI UU UIU. ఈ అమరిక గల వృత్తమును దేవప్రియ అంటారు.  క్రింద దేవప్రియకు ఒక ఉదాహరణము –

 

దేవప్రియా – ర-త-మ-య- ర, యతి (1, 9)

15 అతిశక్వరి 8739

 

పాలవెల్లీ మేల్మి మల్లీ  – ప్రాణవల్లీ ప్రేయసీ

కాలి మువ్వై చెల్మి పువ్వై  – కందు నవ్వై రా శశీ

పూలతోటై మేలి బాటై  – ముద్దుగా దేవప్రియా

మాల వేయన్ లీల లీయన్  – మంచి జేయన్ రా ప్రియా

 

ఇందులో చతుర్మాత్రయైన గగమునకు బదులు భ-గణమును (UII) ఉపయొగిస్తే సుప్రసిద్ధమైన మత్తకోకిల వృత్తము మనకు లభిస్తుంది.  ఈ మత్తకోకిల పుట్టు పూర్వోత్తరాలను నేను మత్తకోకిల కథ [1] అనే వ్యాసములో  సవివరముగా తెలిపియున్నాను.  దానిని తప్పకుండ చదువమని పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

 

ఈ మత్తకోకిల లయ మిశ్రగతి.  త్ర్యస్ర, చతురస్ర, ఖండ గతులు మూడు, నాలుగు, ఐదు మాత్రాగణాలకు సరిపోతాయి.  ఈ మిశ్రగతిలో రెండు విధములయిన మాత్రాగణములు ఉంటాయి.  మత్తకోకిల లయలో మూడు, నాలుగు మాత్రలు పదేపదే వస్తాయి.  ఈ వృత్తము దక్షిణ భారత దేశములో తమిళ, కన్నడ భాషలలో మొదట ఉపయోగించబడినది.  కన్నడములో, మలయాళములో దీని పేరు మల్లికామాలె(ల).  కాని తెలుగులో ఇది మత్తకోకిలగా నన్నెచోడుని కాలమునుండి వ్యవహరించబడుచున్నది.  సంస్కృతములో దీని పేరు విబుధప్రియా లేక చర్చరీ.  చర్చరీ ఒక నాట్యవిశేషము.  బహుశా ఈ నాట్యము చేసేటప్పుడు ఈ లయతోడి పాటలను పాడే వారేమో?

 

క్రింద మత్తకోకిలకు నా ఉదాహరణ –

 

వందనమ్ముల నిత్తు నే – భవ  – బంధనమ్ముల ద్రుంచరా

సింధుజాహృదయేశ్వరా – సిరి  – చిందుతో కరుణించరా

నందనందన పుష్పముల్ – నవ  – నందనమ్మున బూఛెరా

అందగాడని యందురా – హరి  – యందమౌ మది వేచెరా

 

మూడు, నాలుగు మాత్రల మిశ్రగతిలో ఎన్నో విధములైన పద్యములు ఉన్నవి, అందులో కొన్ని – మత్తకోకిల, అదే లయతో ఉండే యితర వృత్తములు, వృషభగతిరగడ, భామినీషట్పది, యక్షగానములలోని త్రిపుటరేకులు, గురజాడవారు ప్రచారములోనికి తెచ్చిన ముత్యాలసరము, ఇత్యాదులు. గురజాడ అప్పారావేమో తాను ముత్యాలసరమును పారసీకమునుండి గ్రహించానని చెప్పారు. కాబట్టి రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ ముత్యాలసరమునకు మాతృక అని చెప్పవలసి ఉంటుంది. ఈ మాత్రాగణముల లయతో వ్యావహారిక భాషలో కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకమును [2] వ్రాసినాడు.  అందులోనుండి ఒక పద్యము –

 

నిన్న రాతిరి చవికలోపల – నీవు చెలి కూడుంటిరా

ఉన్న మార్గము లన్నియును – నేనొకతె చేతను వింటిరా

విన్న మాత్రము గాదురా నిను – వీధిలో గనుగొంటిరా

కన్నులారా దనుజమర్దన – కందుకూరి జనార్దనా

రుద్రకవి జనార్దనాష్టకము – 4

 

ఇట్టి లయలో ఉండే జాతి పద్యమునకు నేను కోకిలస్వరము అని పేరుంచాను.  ఈ లయతో, జనార్దనాష్టకపు స్ఫూర్తితో కృష్ణుడిపైన ఒక అష్టకమును ఒకప్పుడు వ్రాసినాను.  దానిని ఇక్కడ చదువవచ్చును –

 

మాత్రా మత్తకోకిలయైన కోకిలస్వర జాతిపద్యములో శ్రీకృష్ణాష్టకము –

 

కాలి గజ్జెలు ఖంగు మంచన – కవిత పొంగెను నా మదిన్

లాలి పాడుచు నుంటి నీకని – లాస్య మాడుచు నుంటి నేన్

గోల చాలుర లీల లాపర – గోప నందన నిదుర పో

కేల దట్టెద కలలు గానర – కృష్ణమోహన నిదురలో – (1)

 

బొంకు మాటల పలుక కింకను – మోసపోతిని నేనిటన్

ఱంకులాటలు చాలుచాలుర – రాత్రి యెక్కడ నుంటివో

వంకలను నే వినను చాలిక – వట్టి మాటల కట్టరా

కింకిణీస్వరములకు వేచితి – కృష్ణమోహన తృష్ణతో – (2)

 

చెంగుచెంగున గంతు లేయుచు – చేయి కలుపగ రమ్మురా

రంగురంగుల పూలమాలను – రక్తితో నే వేతురా

సంగతుల నే గూర్మి మీఱగ – సరసమాడుచు చెప్పనా

రంగ రారా కృష్ణమోహన – రాసకేళికి వేళయెన్ – (3)

 

భారమాయెను బ్రదుకు ధరలో – బర్హిపింఛము కానకన్

దూరమాయెను మంచి రోజులు – దోర వయసున క్రుంగితిన్

క్రూరుడ హృచ్చోరుడా నా – కోరికల క్రొమ్మారుడా

క్షీరఫలమధుశర్కరాదుల – కృష్ణమోహన యిత్తు రా – (4)

 

గానగంగను ముంచి తేల్చెద – గమ్మనగు నా పదములన్

వీణ మీటెద తానములతో – వినగ నిదె తొందరగ రా

ప్రాణమున బ్రతి యూర్పు నీదే – పాహి యని నే వేడెదన్

క్షీణ మయె నీ కోర్కె దివ్వెయు – కృష్ణమోహన చూడరా – (5)

 

గీత ముపదేశించు గురువా – ఖేలనాక్రియలోలుడా

నూతనస్వర సృజన కిరవా – నొవ్వు దీర్చెడు మందువా

చేతనమ్ముల కల్పతరువా – చింతనమ్ముల చిత్రమా

గీత యేదిర నాదు బ్రదుకున – కృష్ణమోహన తెలుపరా – (6)

 

వేయి కన్నులతోడ నిచ్చట – వెదకుచుంటిని నిన్ను నేన్

మాయ చాలుర మర్మ మేలర – మాధవా నను జూడరా

చేయి కలుపర చిన్మయా నా – చింత లెల్లను దీరురా

గేయముల నాతోడ బాడర – కృష్ణమోహన యిప్పుడే – (7)

 

నిన్న రేతిరి వస్తివా యని – నేను వేచితి నిజముగా

కన్నె బహుమతి తెస్తివా యని – కాచి నిల్చితి కన్నయా

వెన్నముద్దుల నిస్తువో యని – వెన్నెలలలో వేచినా

గిన్నెపాలను పిల్లి తాగెను – కృష్ణమోహన రావిదేం – (8)

 

ఆశ లన్నియు నీవెరా నా – యంతరాత్మయు నీవెరా

పాశములతో బంది యైతిని – ప్రక్కరా ముద్దీయరా

లేశమైనను నిన్ను మఱువర – లీన మయ్యెద నీ హృదిన్

క్లేశహారీ వనవిహారీ – కృష్ణమురళీధర హరీ – (9)

 

మిశ్రగతి నడకలో మత్తకోకిల లేక పారసీక ఛందస్సు రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ వీటిని అనుసరించిన చిత్రగీతాలు ఎన్నో ఉన్నాయి.  క్రింద కొన్ని ఉదాహరణలను మీ ఆనందానికై ఇస్తున్నాను –

 

తెలుగులోని పాటలలో [3] సంతానం చిత్రములో లతా మంగేష్కర్ పాడిన “నిదురపోరా తమ్ముడా” మూడు, నాలుగు మాత్రలతో సాఫీగా సాగుతుంది.
క్రింద ఒక రెండు పంక్తులు –

 

నిదుర పోరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా

నిదురలోనా గతమునంతా నిముసమైనా మఱచిపోరా

కరుణ లేని ఈ జగాన కలత నిదురే మేలురా

కలలు పండే కాలమంతా కనులముందే కదలిపోయే

లేత మనసుల చిగురుటాశా పూతలోనే రాలిపోయే

 

డాక్టర్ చక్రవర్తి చిత్రములోని “పాడమని నన్నడగవలెనా” పాటలో మత్తకోకిల లయ ఉన్నది –

 

పాడమని నన్నడగవలెనా పరవశించీ పాడనా

నీవు పెంచిన హృదయమే యిది నీవు నేర్పిన గానమే

నీకు గాకా ఎవరికొరకూ నీవు వింటే చాలు నాకూ

 

ఈ దశాబ్దములో విడుదలైన గోదావరి చిత్రములోని “రామ చక్కని సీతకి” అనే పాటలో కూడ మత్తకోకిల లయ గలదు. అందులో నుండి ఒక చరణము-

 

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లును ఎత్తె నా రాముడే

ఎత్తగలడా సీత జడనూ తాళీ గట్టే వేళలో

 

కన్నడములో ఈ అపూర్వమైన లయతో రెండు పాటలు ఉన్నాయి [1]. అవి  (i) గోపాలకృష్ణ అడిగ వ్రాసిన “యావ మోహన మురళి కరెయితొ” (ఏ మోహన మురళి పిలిచెనొ – మైసూరు మల్లిగె – గాయని రత్నమాలా ప్రకాశ్ ,


అమెరికా అమెరికా – గాయకులు – రాజు అనంతస్వామి, సంగీతా కట్టి . ఒకే లయతో, తాళముతో ఉండే పాటలను ఏ విధముగానైనా, ఏ రాగములోనైనా పాడవచ్చునని మొదటి ఉదాహరణ తెలుపుతుంది.

(ii) జ్ఞానపీఠ పురస్కారమును పొందిన కె. వి. పుట్టప్ప వ్రాసిన “దోణి సాగలి ముందె హోగలి”. ఈ పాటలో యాదృచ్ఛికముగా మత్తకోకిల అనే పదము కూడ దొరలినది. కువెంపు పాటను నేను అదే మెట్టులో తెలుగులో తర్జుమా చేసాను. దానిని మత్తకోకిల కథలో  [1]చూడగలరు.

 

హిందీ చిత్రాలలో కూడ రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ ఛందస్సులో ఎన్నో పాటలు ఉన్నాయి.  క్రింద రెండు గజలు ఉదాహరణలను ఇస్తున్నాను –

(i) అన్‌పఢ్ చిత్రములో లతా పాడిన సుప్రసిద్ధమైన “ఆప్కీ నజరోఁ నే సమఝా ప్యార్ కా కాబిల్ ముఝే”,

(ii) జిందగీ ఔర్ మౌత్ చిత్రములో మహేంద్ర కపూర్ ,

ఆశా భాఁస్లే పాడిన “దిల్ లగా కర్ హం యే సంఝే జిందగీ క్యా చీజ్ హై” .

 

మొదటి పాటను (ఆప్కీ నజరోఁ నే సమఝా ) నేను అదే మెట్టులో అదే అర్థములో తెలుగులో అనువాదము చేసినాను [4].  ఆ పాటను వింటూ తెలుగులో పాడుకొనండి –

 

నీదు కన్నులు దెలిపె ప్రియ నా ప్రేమ నీ సంతసముగా

ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

 

ఔను నీ సమ్మతి యది నాకు అతి ఆనందము

చెప్పె చూపులు నిజముగా వందనమ్ముల దెలుపుచు

నవ్వుతూ నా జీవితములో జేరితివిగద హాయిగా

ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

 

నీకు గమ్యము నేనెగాదా నాకు గమ్యము నీవెగా

నాకు లేదుగ భయము లేవియు నీవు పక్కన ఉండగా

గాలివానకు తెలియజేయుడు నాకు ప్రియుడిట దొరికెగా

ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

 

పడెగదా నా యెడదపైన నీదు నీడల మాయలే

దిక్కుదిక్కుల మ్రోగెగా వంద నాదస్వరములే

రెండు జగముల ముదము లన్నియు నేడె నాకే దొరికెగా

ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

 

ఒకే లయను స్వతంత్రముగా ఎందరికి సృష్టించవలెనని ఊహ కలుగుతుందో అనే విషయము ఈ ఛందస్సు విషయములో అక్షరాల నిజము.  పారసీకములో రమల్ ముసమ్మన్ మహ్జూఫ్, తెలుగులో మత్తకోకిల, కన్నడ మలయాళములలో మల్లికామాల, తమిళములో ఏళు శీర్ విరుత్తం, సంస్కృతములో చర్చరీ – అందుకే నాకు మత్తకోకిల అంటే  ఎంతో యిష్టము!

 

అంకితము – ఇటీవలే దివంగతులయిన నా అన్నగారు జెజ్జాల కృష్ణమురళీధర్‌గారి స్మృతికి అంజలిగా యీ వ్యాసమును ప్రేమాభిమానాలతో నేనర్పిస్తున్నాను.

 

గ్రంథసూచి –

 

[1] మత్తకోకిల కథ – ఈమాట జూలై 2012 – http://www.eemaata.com/em/issues/201207/1964.html?allinonepage=1

 

[2] జనార్దనాష్టకము – కందుకూరి రుద్రకవి – http://www.eemaata.com/em/issues/201207/1972.html

 

[3] చిత్రగీతములలో ఛందస్సు – తానా జ్ఞాపిక సంచిక తెలుగు పలుకు 2013 – ఈమాట జూలై 2013 – http://www.eemaata.com/em/library/tana2013/2172.html?allinonepage=1

 

[4] ఈమాట జనవరి 2012 – నాలుగవ అభిప్రాయము – http://www.eemaata.com/em/issues/201201/1878.html

 

 

1 thought on “పాడమని నన్నడగవలెనా – పారసీక ఛందస్సు – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *