April 20, 2024

సరిగమలు – గలగలలు – 1

రచన : మాధవపెద్ది సురేష్ చంద్ర  suresh

 

 

అంకురార్పణ….

 

‘సంగీతం’ మనకున్న మానసిక రుగ్మతలని పోగొట్టే గొప్ప సాధనం, 1967 నుండి 1973 వరకూ ఎన్నో ప్రోగ్రామ్స్ విజయవాడలో, భావనా కళా సమితిలో హార్మోనియం ఎకార్డియన్ వాయించే వాణ్ని. 1974 నుండి 1990 ఎకార్డియన్ ప్లేయర్‌గా, తరువాత కీబోర్డ్ ప్లేయర్‌గా ఎన్నో సినిమాలకీ, కచేరీలకీ వాయించటం జరిగింది. అలాగే 1988 నుండి సంగీత దర్శకుడిగా సుమారు 58 సినిమాలు పూర్తి చేసాను. నంది అవార్డ్స్ (1996) తో సహా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. గొప్ప సంగీత దర్శకులతో, వాయిద్య కళాకారులతో, గాయనీ గాయకులతో నా పరిచయం, ఎన్నో అనుభవాలన్నీ క్రోడీకరించి మీ ముందుంచటానికి ప్రయత్నిస్తున్నాను.

 భవదీయుడు

మాధవపెద్ది సురేష్ చంద్ర

 

 

saluri

ఇంటిపేరులోనే షడ్జమం, రిషభం ఇముడ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుగారి కుటుంబంతో మాధవపెద్ది కుటుంబాలకి 50 ఏళ్లకి పైగా అనుబంధం ఉంది.

మా చిన్నాన్నగారు గోఖలే గారికి ఆయన పాటలన్నా,మాటలన్నా ఎంతో ఇష్టం. ఇంకో చిన్నాన్నగారు సత్యంగారు ఎన్నో మంచి పాటలూ, పద్యాలు ఆయన సంగీత దర్శకత్వంలో పాడారు. అన్నయ్య రమేష్‌కి రాజేశ్వరరావుగారు ఒక బంగారు అవకాశం ఇచ్చారు, అది ‘రాం-రహీం’ చిత్రంలో మధుర గాయకుడు మహ్మద్‌ రఫీతో కలిసి పాడడము. బహుశా మహ్మద్ రఫీగారితో పాడిన ఏకైక గాయకుడు (తెలుగులో) అన్నయ్యే అవటం ఈ జన్మలో మరచిపోలేని అనుభూతి. తరువాత కూడా ఎన్నో మంచి పాటలూ, పద్యాలూ అన్నయ్యచేత పాడించారు. మా అత్తగారు కస్తూరిగారికి రాజేశ్వరరావుగారి ప్రైవేట్ సాంగ్స్ అంటే ప్రాణం. ఆవిడ కూడా మంచి గాయకురాలు. మా అమ్మగారికీ, నాన్నగారికీ కూడా ఆయన పాటలంటే ప్రాణం.

 

నాకు రాజేశ్వరరావుగారి కుటుంబంతో 1970 నుంచే పరిచయం. నేనూ, అన్నయ్యా విజయవాడలో ‘భావనా కళాసమితి’ లో  ‘లైట్ మ్యొజిక్ ప్రోగ్రామ్స్’ చేసే రోజుల్లో అన్నయ్యకున్న పరిచయంతో వాసు (ఇప్పటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు వాసూరావు; రాజేశ్వరరావుగారి మూడో అబ్బాయి) మాకు ఎలక్ట్రిక్ గిటార్ వాయించటానికి మద్రాస్ నుండి వచ్చేవాడు. అప్పుడప్పుడు మాష్టారి రెండో అబ్బాయి పూర్ణచంద్రరావు కూడా ఎలక్ట్రిక్ గిటార్ వాయించటానికి వచ్చేవారు. గిటారు అద్భుతంగా ప్లే చేసేవారు.

saluri3

నాకన్నా ముందు 1970 ప్రాంతాల్లో అన్నయ్య, మద్రాసు వచ్చాడు ప్లేబాక్ సింగర్‌గా స్థిరపడటానికి. నేను మా నాన్నగారు చనిపోయాక 1973 డిసెంబర్ 4వ తేదిన మద్రాసు వచ్చాను, ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్‌గా సెటిల్ అవటానికి. అయితే యాదృచ్ఛికంగా ఆ రోజు ఘంటసాలగారి జన్మదినోత్సవం అవటం నేను మరచిపోలేను.

మొట్టమొదట సినిమాల్లో ఎకార్డియన్ ప్లేయర్‌గా టి.చలపతిరావుగారు అవకాశం ఇచ్చారు. (మా అన్నయ్యకి కూడా తొలి అవకాశం ఆయనే ఇచ్చారు) రాజేశ్వరరావుగారింటికి రెగ్యులర్‌గా వెళ్తూండేవాణ్ని అవకాశాలకోసం.  1974లో ఒక చిత్రం రి-రికార్డింగ్‌లో వాయించటానికి నన్ను పిలిపించారు. ఆయన చాలా సంతోషించారు. అప్పుడు ఆయన దగ్గర ఎకార్డియన్ షోళాపూర్ రామారావుగారు, మంగళమూర్తిగారు వాయిస్తూండేవారు. అప్పుడప్పుడు జాయ్, బెన్ కూడా వాయిస్తుండేవారట. తరువాత అపుడప్పుడు రికార్డింగ్స్, రి-రికార్డింగ్స్‌కి వాయిస్తుండేవాణ్ని, సుమారు 30, 40 కాల్‌షీట్స్ వర్క్ చేసాను.

అప్పుడు నాకు ఆయన ఆర్కెస్ట్రాలో కృష్ణయ్యర్, రాజగోపాల్‌గారు (రాజేశ్వరరావుగారి అసిస్టెంట్స్) వయొలిన్ ప్లేయర్ అప్పికొండగారు, ఫ్లూట్ ప్లేయర్ సంజీవిగారు, క్లే వయోలిన్ ఆదిశేషుగారు, కంపోజింగ్ ప్లేయర్ తబలా మణిగారు, ఇటివంటి ప్రసిద్ధ కళాకారులతో పరిచయం అయింది!

అవన్నీ మధురానుభూతులే.

ఇప్పటికీ కృష్ణయ్యర్ గారూ, నేనూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం.

రాజేశ్వరరావుగారి మ్యూజికల్ నైట్స్‌లో నేను పాల్గొనేవాణ్ని. 1975లో కాకినాడ, విజయ నగరంలో భారీఎత్తున జరిగిన ఆయన ప్రోగ్రామ్స్‌లో అన్నయ్య, రాజేశ్వరరావుగారు రాం-రహీం పాటలు కలసిపాడటం ఎలా మరచిపోతాను?

అలాగే మద్రాసులో కొంతకాలం తరువాత కళాసాగర్ ఆధ్వర్యంలో డా. సినారెగారి కంపీరింగ్‌లో అందరు గాయనీ గాయకులతో మద్రాసు యూనివర్సటీ సెంటెనరీ ఆడిటోరియంలో ఎక్స్‌ట్రార్డినరీ ప్రోగ్రాం ఇచ్చారు. బాలుగారు, రాజేశ్వరరావుగారూ ‘మల్లీశ్వరి’ చిత్రంలోని ‘ఆకాశవీధిలో’ పాటను ఎంతో హృద్యంగా పాడారు. ఆ పాటలో మాస్టారు చాలా ఇంప్రోవాయిజ్ చేసి పాడారు (ఒక ఆలాపన) అధ్బుతం!

rajeswararao

 

నేను సంగీత దర్శకుణ్ని అవటానికి కొద్ది రోజుల ముందు సినీ సంగీత ప్రపంచానికి సంబంధించిన మాహామహుల ఆశీర్వాదాల్ని తీసుకోవటం జరిగింది.

 

నా మొదటి సినిమా ‘హైహై నాయకా’ రికార్డింగ్‌కి (మొదటి పాట-ఇది సరిగమలెరుగని రాగము – రచన : జొన్నవిత్తుల) పాటవిని, మనస్పూర్తిగా ఆశీర్వదించారు. పైగా జంధ్యాలతో ఒక మాటన్నారు, ఇతను మంచి ‘కీబోర్డ్ ప్లేయర్‌గా’ పేరు సంపాదించాడు. భవిష్యత్తులో ఉత్తమ సంగీత దర్శకుడిగా అద్భుతంగా రాణిస్తాడని. ఎంతో స్పందించాను ఆయన ఆశీర్వాదానికి, ఆయన్ని మేమంతా నాన్నగారని పిలిచేవాళ్లం. నన్నుకూడా వారి పెద్ధ కుటుంబంలో ఒక అబ్బాయిగా స్థానం ఇచ్చారు. తరువాత నా సంగీత జీవితానికి తిరుగులేని పునాదివేసిన విజయావారి ‘బృందావనం’ పాటల ఆవిష్కరణకి ఆయనే చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

ఇంకో విషయం – రాజేశ్వరరావుగారిని మాధవపెద్ది వంశం మరచిపోదు. ఎందుకంటే మాధవపెద్ది వంశంలో పేకాటకి చాలా ప్రాముఖ్యత వుంది. చిన్నవాళ్లూ, పెద్దవాళ్లూ, ఆడా, మగా అందరూ పేకాటాడతారు. మా మామ్మ అనేది ‘మన పిల్లలు పుడుతూ ‘కేర్ కేర్’ అనర్రా, ‘పేక్ పేక్ అంటారని. అటువంటి పేకాట గురించి కొసరాజుగారు అద్భుతంగా రచించగా రాజేశ్వరరావుగారు ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే‘ అనే పాటని మాధవపెద్ది సత్యంగారు, పిఠాపురం గార్లచే పాడించటం విశేషం, దైవ సంకల్పం.  మాస్టారి ఆర్కెస్ట్రాలో వారి పెద్దబ్బాయి రామలింగేశ్వరరావుగారు పియానో, కీబోర్డ్ వాయించేవారు. మాస్టారి అల్లుడు వెంకటేష్‌గారు ప్రఖ్యాత మాండోలిన్ ప్లేయర్, కె.వి. మహదేవన్‌గారి వద్ద ఆస్థాన విద్వాంసుడు. వెంకటేష్‌గారి అబ్బాయి రాజు ఇవాళ మంచి కీబోర్డ్ ప్లేయర్. ‘బైరవద్వీపం’ విడుదల తరువాత ఒకరోజు నాన్నగారు ‘చాలా బాగా కంపోజ్ చేసారు మీరు’ అన్నప్పుడు నేషనల్ అవార్డ్ పొందిన అనుభూతిని ఎలా మరచిపోతాను? మాస్టారుగారు అందర్నీ ‘ఏవండీ’, ‘సార్’ అని పిలిచేవారు. ప్రైవేట్ సాంగ్స్‌కి ఒరవడి లాంగ్విటీని ఇచ్చారు. ఎంతో విద్వత్తున్న మనిషి. అప్పట్లోనే ‘చంద్ర లేఖ’అనే ఒక మోడర్న్ మ్యూజిక్ ఇచ్చారు. ‘భక్త జయదేవ’లో ప్రణయ పయోనిధి పాటకి పది రాగాల్లో అద్భుతంగా కంపోజ్ చేసారు. వీణ పాటలు ఆయన ప్రత్యేకత. ప్రపంచంలో ఎంతోమంది ఆయన భక్తులు. ఆయన కుమారుల అభివృద్ధిని చూసుకున్నారు. అప్పుడప్పుడూ ఆశీర్వాదంకోసం ఆయన వద్దకు వెళ్లేవాణ్ని ఇప్పుడు ఆయనా, అమ్మగారూ ఇద్దరూలేరు. ఆ యింటికి వెళ్లాలంటే మనస్సులో ఎంతో వెలితి. కానీ ఆయనతో పనిచేసిన అనుభూతులు ఎప్పుడూ మరచిపోలేను. నాకు తెలిసినంత వరకూ తెలుగు సినీ సంగీత ప్రపంచంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిగార్లు ఎవరో కాదు ఘంటసాలగారు,పెండ్యాల గారు, సర్వశ్రీ రాజేశ్వర రావుగారు .

 

శ్రీ సాలూరి రాజేశ్వరరావుగారి అసిస్టెంట్ శ్రీ కృష్ణయ్యర్ గారు అనుభవాలు :

 

రాజేశ్వరరావుగారు చేసిన మొదటి వీణపాట ‘ఏమని పాడేదనో’ సింధుబైరవి. తరువాత ‘పాడమని నన్నడగవలెనా‘ ఇత్యాది పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆయనకి నౌషాద్ గారంటే చాలా ఇష్టం. అలాగే ఎస్.డి.బర్మన్‌గారు, శంకర్-జైకిషన్, లక్ష్మికాంత్-ప్యారేలాల్ అన్నా చాలా ఇష్టం. సైగల్ గారితో చాలా అనుబంధం వుంది. సైగల్‌గారు కలకత్తాలో హార్మోనియం ఇచ్చారు. మాష్టారికి 1955-1876 వరకూ ఆయన అన్ని సినిమాలకీ అసిస్టెంట్‌గా పనిచేసారు కృష్ణయ్యర్‌గారు. రాజగోపాల్ గారు చాలా వేగంగా ‘నొటేషన్స్’ రాసేవారు. ఎందుకంటే మాష్టారు హర్మోనియం మీద కానీ, పియానో మీదకానీ చాలా ఫాస్ట్‌గా కంపోజ్ చేసేవారు. కండక్టింగ్ కూడా రాజగోపాల్ గారే చేసేవారు. సింగర్స్‌కి పాటలు నేర్పేపని కృష్ణయ్యర్ గారు చేసేవారు. రాజేశ్వరరావుగారికి వయొలిన్స్ అన్నా, ఫ్లూట్, వీణ, సితార్ అన్నా చాలా ఇష్టం. ఫ్లూట్ మొదట్లో ‘ముత్తు’ గారు వాయించేవారు. తరువాత విజయా సంస్థలో ‘గోవిందస్వామి’ వాయించేవారు. తరువాత సంజప్పగారు వాయించేవారు. పియానో దివాకర్‌గారు వాయించేవారు. తరువాత మాష్టారి పెద్దబ్బాయి రామలింగేశ్వరరావు గారు వాయించేవారు. వీణ ముందు శర్మ బ్రదర్స్ వాయించేవారు (ఒకరు వయొలిన్, ఒకరు వీణ వాయించేవారు). పిలచిన బిగువటరా (మల్లీశ్వరి) వీరు వాయించినదే. తరువాత రంగారావుగారు (ప్రఖ్యాత సంగీత దర్శకులు) వాయించేవారు. అయితే ఎక్కువగా ‘చిట్టిబాబు’ గారు వాయించారు (ముఖ్యమైన వీణ పాటలన్నీ), సితార్ అన్నపూర్ణగారు మొదట్లో వాయించేవారు, తరువాత అప్పుడప్పుడు అహ్మద్ హుస్సేన్ ఖాన్ వాయించేవారు. తరువాత ‘జనార్దన్’గారు ఎక్కువ పాటలకీ రీ-రీకార్డింగ్స్‌కి వాయించేవారు. ఈమని శంకరశాస్త్రిగారు కూడా ఒకటి, రెండు పాటలకి వీణ వాయించారు. మాష్టారికి భీంప్లాస్, మోహన, శుద్దసావేరి ఇత్యాది రాగాలంటే చాల ఇష్టం. మోహనరాగంలో శుద్దమధ్యమం వాడినది (చాల సమ్మోహనకరంగా) బహుశా మాష్టారే.  ఎక్కువగా భరణి,  జెమిని (కోటేశ్వరరావుగారు సౌండ్ ఇంజినెర్) లతో రికార్డ్ చేసారు. వాహిని (కృష్ణయ్యర్, శివరాం గార్లు సౌండ్ ఇంజినీర్స్) తో కూడా రికార్డ్ చేసేవారు. అప్పుడు కె.విశ్వనాథ్‌గారు అసిస్టేంట్ సౌండ్ ఇంజినీర్ (వాహిని లో). రాజేశ్వరరావుగారి పాటలు వినటానికి సులభంగా వున్నా పాడటానికి కొంచెం కష్టపడాలి. కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. అందుకే ఆయన్ని అర్థంచేసుకున్న నిర్మాతలూ, దర్శకులే ఆయనచేత సంగీతం చేయించుకునేవారు. పనికి కొంచెం ఆలస్యంగా వచ్చేవారుట. సింధుబైరవిలో ‘ఏమిటో ఈ మాయా’ (పి.లీల గారు) పాటకీ, ‘ఏమని పాడేదనో’ (పి.సుశీలగారు) పాటకీ ఎంతో వైవిధ్యం చూపించారు. ఎక్కువ పాటలు ఘంటసాల గారు, లీలగారు, సుశీలగారే పాడారు.

 

ఎస్.రాజేశ్వరరావుగారి కొన్ని హిట్స్:

నిలువుమా! నిలువుమా! నీలవేణి…

నిలువుమా!
నిలువుమా ! నిలువుమా! నీలవేణీ
నీ కనుల నీలినీడ
నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ.

అడుగడుగున ఆడే లే నడుము సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా

సడిసేయక ఊరించే…
సడిసేయక ఊరించే వయ్యరపు ఒంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

నా ఊర్వశి రావే రావేయని పిలువనా
ఆ సుందరి నెరనీకు నీ గోటికి సమమౌనా
రా చెలీ నినుమదీ దాచుకోనీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ.

చిత్రం : అమరశిల్పి జక్కన్న
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సముద్రాల సీనియర్

 

జగమే మారినది మధురముగా ఈ వేళ

జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదే చేరేను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత
జగమే మారినది మధురముగా ఈ వేళ
విరజాజుల సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుకా … ఆ… ఆ,,, ఆఆఆఆఆఆ ఆ….
విరజాజుల సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుకా
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి
అనురాగాల తేలి
కమ్మని భావమే కన్నీరై చిందెను
కమ్మని భావమే కన్నీరై చిందెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ

చిత్రం: దేశద్రోహులు
గానం: ఘంటసాల
రచన:ఆరుద్ర

 

 

నేరుతునో లేదో

పల్లవి :

నేరుతునో లేదో ప్రభు నీ పాటలు పాడ
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా
నిదురరాదు కనులకు శాంతిలేదు మనసుకు
మదిలో వేదన ఏదో కదలె రాధకు
ఇది చల్లని వేళైన…

చరణం : 1

నీ దయలాగున వెన్నెల జగమంతా ముంచె
నీ మధుర ప్రేమ యమున కడలంతా నించె
మరి మరి ముల్లోకములను మురిపించే స్వామీ
మనసు చల్లబడ దాసికి కనిపించవేమి…
ఇది చల్లని వేళైనా…

చరణం : 2

నీ వేణువు కోసం బ్రతుకంతా వీనులాయె
నీ దరిశనమునకై ఒడలంతా కనులాయె
బడలే బ్రతుకున ఆశలు వెలిగించే దేవా
సడలే వీణియ తీగలు సవరించి పోవా…
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా

చిత్రం: పూజాఫలం
గానం: పి.సుశీల
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

 

వినిపించని రాగాలే

వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే…

తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు
వినిపించని రాగాలే…

వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
వినిపించని రాగాలే…

వికసించెను నా వయసే
మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే…
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే…

తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు
వినిపించని రాగాలే…

వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
వినిపించని రాగాలే…

వికసించెను నా వయసే
మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే…
వినిపించని రాగాలే….

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
గానం : పి.సుశీల
రచన : దాశరధి

3 thoughts on “సరిగమలు – గలగలలు – 1

  1. మధురమైన అనుభవాలు, మరపురాని మహనీయుల సంగతులను మాతో పంచుకుంటున్నందుకు మాధవపెద్ది గారికి ధన్యవాదములు.. చక్కనిపాటలను గుర్తు చేసి మరొక్క మారు ఆస్వాదించటానికి వీలుగా లంకెలందించిన జ్యోతి వలబోజు గారికి ధన్యవాదములు
    సుబ్రహ్మణ్యం

  2. ఇదో అద్భుత ప్రక్రియ…..ఎన్నెన్నో ఊసులకు మరెన్నో దృశ్యాలు జోడించి కమనీయ సుధారస కావ్యాన్ని ఇలా అందించిన మాలిక కు శుభాభినందనలు…..సాహిత్యంత పాటు క్లిప్పింగ్ లు జతచేయడం అదిరిందిహో……సురేష్, జ్యోతి లకు వీక్షకుల తరఫున ధన్యవాదములు

Leave a Reply to జ్యోతి వలబోజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238