June 19, 2024

అతడే ఆమె సైన్యం – 5

రచన: యండమూరి వీరేంద్రనాధ్ yandamoori

 

 

 

 

ఆ మరుసటి రోజు ప్రోగ్రాం సైనికాధికారుల కోసం!

మధ్యాహ్నం మూడింటికి అజ్మరాలీ వచ్చి చైతన్యని స్టేజి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. లైట్స్ అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. సైనికులు ఖైదీలతో ఏర్పాటు చేయిస్తునారు. కొందరు యుద్ధ ఖైదీలు తెరలు కడుతున్నారు. మరికొందరు స్టేజీమీదకు దూలాలు మోసుకు వెళుతున్నారు. పూర్వకాలం రోమన్ రాజులు బానిసలతో పనులు చేయించినట్లు సైనికులు ఆ ఖైదీలతో పనులు చేయిస్తున్నారు. అజ్మరాలీ నవ్వేడు… “మీ దేశపు సైనికులే.. పాపం యుద్ధంలో దొరికిపోయి ఇలా బానిసల్లా బ్రతుకుతున్నారు.”

“మీ వాళ్ళూ మాకు దొరికి వుంటారు. ఇలా బానిసల్లా బ్రతుకుతూ వుండి వుండరు. ఖైదీల్లా బ్రతుకుతూ వుండి వుంటారు” అన్నాడు చైతన్య.  అజ్మరాలీ మొహం వాడిపోయింది. చైతన్యే మళ్ళీ అన్నాడు- “అంతర్జాతీయ సైనిక నిబంధనల ప్రకారం యుద్ధఖైదీల మార్పిడి వుంటుందనుకుంటాను.”

“అవును! ఖైదీల్ని మార్పిడి చేసుకోవాలి. అప్పుడప్పుడు చేసుకుంటాం. మీ ట్రూపుతోపాటు వచ్చిన ఇస్మాయిల్ మా దగ్గర్నించి వెళ్ళినవాడే…”

తన దగ్గర భారతదేశపు యుద్దఖైదీలు ఎందరున్నారో చూపించటం కోసమే అజ్మరాలీ ఇలా ప్రవర్తిసున్నాడని చైతన్య గ్రహించాడు. అంతలో ఎవరో ట్రూప్ మెంబర్ వచ్చి చైతన్యతో రహస్యంగా మట్లాడాడు. చైతన్య మొహం వాడిపోయింది.

“ఏం జరిగింది?” అన్నాడు అజ్మరాలీ.

“మా ట్రూప్‌లో వేషం వేసే ఒక నటుడు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. ఇప్పుడెలా?”

“చాలా ముఖ్యమైన నటుడా?”

“అవును! వాల్మీకి అని- ముని వేషం. పెద్దగా డైలాగులుండవు. కానీ- క్యారెక్టరు మాత్రం నాటకానికి చాలా అవసరం.”

“డైలాగులు ఎక్కువ లేకపోతే మా వాళ్ళలోనే ఎవరో ఒక్కళ్ళతో వేయించండి”

“మీ సైనికుల్తోనా-”

“అవును.”

“లేదు. చాలా సన్నగా, పొడుగ్గా వుండే వృద్దుడు కావాలి.”

“అయితే మీ ఖైదీల్లో చూడండి.”

“అది మంచి ఆలోచన” అంటూ చైతన్య మళ్ళీ సంశయంగా “ఆ ఖైదీలు ఒప్పుకుంటారో లేదో” అన్నాడు.

అజ్మరాలీ బిగ్గరగా నవ్వి, “వాళ్ళు ఒప్పుకునేది ఏమిటి? మనమే ఒప్పిద్దాం” అన్నాడు. చైతన్య చుట్టూ చూసి “అదిగో ఆయన పనికి వస్తాడు” అన్నాడు. దూరంగా స్టేజీమీదకు విగ్రహాన్ని మోసుకు వెళుతున్న ఒక వృద్ధుడు. ఏళ్ళ తరబడి జైల్లో వుండటంవలన శరీరం శుష్కించి పోయి వుంది. అయినా కళ్ళల్లో తేజస్సు ఉట్టిపడుతూంది. అతడే జగదీష్ ప్రసాద్.

‘పదండి మనం వెళదాం. వాడిని మా వాళ్ళు తీసుకొస్తారు” విడిది వైపు నడుస్తూ అన్నాడు అజ్మరాలీ. ఇద్దరూ నడుస్తుండగా అజ్మరాలీ చెప్పాడు. “వచ్చే సంవత్సరం మళ్ళీ రావాలి మీరు. కొత్త ‘బాలే’ తో…”

“తప్పకుండా.”

“ఈసారి నేను కథ చెపుతాను. నాటకంగా మీరు తయారు చేస్తారా?’

చైతన్య నవ్వి “కథ బావుంటే తప్పకుండా చేస్తాను” అన్నాడు.

“చాలా బావుంటుంది. ష్యూర్ సక్సెస్.”

“కథ చెప్పండి. మీరే సక్సెస్ అనుకుంటే ఎలా?” నవ్వుతూనే అన్నాడు.

“ఒకమ్మాయి ఒక వ్యక్తిని చంపాలనుకుంటుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అతడు వేరే దేశంలో వుంటాడు. కుదరదు. అప్పుడొక యువకుడిని అద్దెకు తీసుకుని అతడు తనకి సరిపోతాడా లేదా అని రకరకాల పరీక్షలు పెడుతుంది. అన్నిటిలోనూ అతడు నెగ్గుతాడు. అతడిని తీసుకుని తన శత్రువుని చంపటానికి బయల్దేరుతుంది. అతనొక్కడినే అన్నమాట. టైటిల్ గురించి కూడా ఆలోచించే వుంచాను… అతడే ఆమె సైన్యం”

అజ్మరాలీ మొదటివాక్యం చెపుతుండగానే చైతన్య మొహంలో నవ్వు మాయమైంది. అయితే అది భయంవలన కాదు.. అతడికి భయం వేయలేదు. ప్రనూషని అజ్మరాలీ గుర్తుపట్టాడని తెలిసినప్పుడే భయం వేసే స్టేజి దాటిపోయాడు. ఇప్పుడు అశ్చర్యం.. అసలిదంతా ఎలా తెలిసింది అన్న ఆశ్చర్యం…

అజ్మరాలీ ప్రనూషని గుర్తుపట్టి వుండొచ్చుగాక! కానీ ఇదంతా తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా మెంటల్ హాస్పిటల్‌లో తనకి పరీక్ష పెట్టిన విధానం!

అంతలోనే అతడికి మరో సందేహం. వణికిపోయాడు!

తన తల్లితండ్రుల విషయంకూడా ఇతడికి తెలిసిపోయిందా?

ప్రనూష సంగతి తెలిసిన తరువాత కూడా ఎలా తెలియనట్లు నాటకమాడాడో అలాగే తన తండ్రి సంగతి తెలిసి కూడా నాటకం ఆడుతున్నాడా? చైతన్య మనసులో రకరకాల ఆలోచనలు ఈ విధంగా కదలాడుతూంటే- “ఏం మిస్టర్ చైతన్యా! నేను చెప్పిన కథ బాగోలేదా? మాట్లాడటం లేదేమిటి?” అని అడిగాడు అజ్మరాలీ.

తాడు తెగేవరకూ లాగటం మంచిది కాదంటారు. ఎలాగూ తెగుతుందని తెలిసినప్పుడు లాగటమే మంచిది. వస్తువు చేతికి దొరికే చాన్సు కాస్తయినా వుంటుంది.

“కథ బాగానే వుంది. కానీ ఆ సైనికుడు ఆవిడతో కలిసి ఎందుకు వెళతాడు? తన ప్రాణాల్ని ఎందుకు రిస్కులో పెట్టుకుంటాడు?” చైతన్య అడిగాడు.

అజ్మారాలీ బిగ్గరగా నవ్వి”అంత పెద్ద యాక్టర్‌వి- ఇంత చిన్న విషయం తెలీదా?’… హీరోయిన్ అందంగా వుంటుంది కాబట్టి” అన్నాడు.

చైతన్య గాఢంగా ఊపిరి వదిలాడు. కనీసం తన తండ్రి విషయం ఇతడికి తెలీదు. అది నయం…

“ఏమిటి ఆలోచిస్తున్నావు?”

“ముగింపు చెప్పలేదు మీరు.”

“నాటకానికి ముగింపు ఏముంటుంది? సుఖాంతమే” అంటూ ఉండగా అజ్మరాలీ మొహం కౄరంగా మారింది. “వాస్తవానికీ, నాటకానికీ తేడా వుంటుంది కదా. చాలామందికి నాటకం సుఖాంతం కావాలి. నాలాటి వాడికి వాస్తవం విషాదాంతం కావాలి.

“మా దేశం విభిన్న సంస్కృతుల నిలయం! రకరకాల జాతులు. మతాలు, దేవుళ్ళు విశ్వాసాలతో విలసిల్లే ఏకైక విశాల ప్రజాస్వామిక దేశం!” చైతన్య తన డాన్స్ బాలే తాలూకు ముఖ్యాంశాన్ని ఇంగ్లీషులో వివరిస్తున్నాడు. “ఇప్పుడు మీరు చూడబోయేది మా దేవుడైన శ్రీరాముడి కథ.”

జనవాక్య పాలన కోసం తన భార్యని అడవులకు పంపుతాడు శ్రీరాముడు. కొన్ని సంవత్సరాల ఎడబాటు తరువాత వారిని తిరిగి కలుపుతారు కుశలవులు. బుర్రకథ, హరికథ, కూచిపూడి, జవాలకుల కథ, తోలుబొమ్మలాట లాంటి వివిధ ప్రక్రియల్లో ఈ రామయణం రచింపబడింది. మీరు చూడబోయే ఈ “బాలే” – ఆధునిక యక్షగానంలో ఉత్తర రామాయణం….” చప్పట్లు.

ఓపెన్ ఎయిర్ థియేటర్ అది. దాదాపు వెయ్యిమంది సైనికాధికారులు వున్నారు. తెర లేచింది.

సూత్రకారుడు పాట ప్రారంభించాడు. వాల్మీకి తపస్సు చేస్తూండగా సీత ప్రవేశం! గార్డులు కాపలా కాస్తున్నారు. చైతన్య తాలూకు ట్రూపు స్టేజిమీద ప్రదర్శన రక్తి కట్టిస్తున్నారు. స్టేజి మీద జగదీష్ ప్రసాద్ తన పని చేసుకుపోతున్నాడు.

సూత్రధారుడు కుశలవుల జననాన్ని వర్ణిస్తున్నాడు.

జగదీష్ వింగులోకి వచ్చాడు. అక్కడ తనలాంటి మేకప్‌లోనే ఉన్న మరో వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. గార్డులకి అనుమానం రాకుండా రెండో వాల్మీకి స్టేజీమీదకు ప్రవేశించాడు.  గార్డులు అతడినే కాపలా కాస్తున్నారు. జగదీష్‌కి జరుగుతున్న దేమిటో అర్ధంకావటంలేదు. క్షణాల్లో మేకప్‌మాన్ అతడి ఆహార్యం మార్చేశాడు. ఇప్పుడు అజ్మరాలీయే అతడిని గుర్తుపట్టలేడు.

సూత్రధారుడు వాల్మీకి పాత్రలో రాముడికి చెప్పిస్తున్నాడు- “రామా! ఇదంతా కర్మ, కర్మకి మించినదీ, కర్మని ఎదుర్కొన గలిగేదీ వేరొకటి లేదు. ఇన్నాళ్ళు నీ భార్య ఎడబాటు కూడా కర్మఫలమే. ఏ దురదృష్టకరమైన క్షణమో నీ జీవితంలోకి విషాదాన్ని తీసుకొచ్చింది. దాని గురించి మర్చిపో. నీ భార్య ఇక్కడే వుంది. వీళ్ళు నీ పుత్రులు, అనాడు గర్భవతి అయిన నీ భార్యని వదిలేశావు. గుర్తుందా? ఇదిగో- నీ పిల్లలు పెద్దవాళ్లయి, సమర్ధవంతులై నీ ముందు నిల్చున్నారు చూడు. సకల గుణాభిరాముడివైన నీకు జన్మించిన నీ పిల్లలు నీ అందాన్ని పుణికిపుచ్చుకున్నారు. తెలివితేటల్తో, ధనుర్విద్యతో నీకు వారసులయ్యారు. భార్యావియోగంతో కలతబారిన నీ మనసు సేద తీర్చటానికి, కేవలం తమ తల్లితండ్రులిద్దర్నీ కలపటానికి, వారిద్దరే ఒక సైన్యంగా మారి యుద్ధం చేస్తారు. ఇదే కర్మఫలమంటే.. ఫలాన్ని అనుభవించు.  ఇంతకాలం నీకు ఉన్న సంశయాలు తీరిపోయాయనుకుంటున్నాను.” వింగులోంచి రంగనాయకి బ్యాక్ కర్టెన్ వెనక్కు వచ్చింది.

గార్డులు ప్రదర్శన చూడటంలో మునిగిపోయి వున్నారు.

స్టేజీమీద పడుతున్న డిమ్మర్ వెలుగులోంచి ఒక కిరణం చీలి బ్యాక్ స్టేజీమీదకు రిఫ్లెక్ట్ అవుతూంది.

సూత్రధారుడు మంగళవాక్యం పలుకుతున్నాడు.

అప్పుడు పడింది జగదీష్ దృష్టి రంగనాయకి మీద!!

ఆ వృద్దుడి కళ్ళల్లో – ఇది కలా? నిజమా అన్న అనుమానం… మొదటి క్షణం సంశయమై – రెండో క్షణం సంభ్రమమై మూడవ క్షణానికి సంతోషానికి సుప్రభాతమైంది.

చైతన్య ఇద్దర్నీ చూస్తున్నాడు. కళ్ళకి అడ్డుపడిన తడి నీటిపొరలో తల్లిదండ్రులిద్దరూ అతడికి మసగ్గా కనపడుతున్నారు. ఎర్ర దీపపుకాంతి తల్లి నుదుటిమీద సూర్యుడిలా మెరుస్తూంది. తీరిన తల్లి నుదుటి వెలితి – సేదతీరిన హృదికి మందారమల్లి హారతి! ఒకదానికొక్కటి సంబంధం లేని ఆలోచనలు. గోదావరి పుష్కరానికి తండ్రికి తర్పణం వదలబోతుంటే వారించిన ఇస్మాయిల్!! సాటి సైనికుడి ప్రాణాల్ని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి తమతో వచ్చిన ఆ ఇస్మాయిల్‌వైపు కృతజ్ఞతగా చూశాడు చైతన్య. ఇస్మాయిల్ కూడా నీళ్ళునిండిన కళ్ళతో ఆ దంపతులవైపే చూస్తున్నాడు.

జగదీష్ భార్య చేతులు పట్టుకున్నాడు.

పరాయి సైనికులు పంచలో పాతిక సంవత్సరాలు ప్రాణంలేని బొమ్మలా బ్రతికిన ఆ రాడార్ టెక్నీషియన్‌కి – ఇన్నాళ్ళకి అందిన తొలి శుభవార్త. తరంగాలు తరంగాలుగా పెదవులమీద నవ్వుగా వెలిసింది. ఆమె భుజాలమీదుగా చైతన్యని చూశాడు. స్వంత రక్తాన్నీ, పేగు తెంచుకు పుట్టిన బిడ్డనీ గుర్తించడానికి ఏ రాడారూ అవసరంలేదు. రంగస్థలం మీద ఆఖరి అంశం జరుగుతుంది. వాల్మీకి వేషధారి వింగులోకి వచ్చాడు. అతడిని గార్డులు అప్పుడు గుర్తు పట్టారు. అప్పటివరకూ తాము గార్డ్ చేసింది వేరే వ్యక్తినని తెలుసుకున్నారు. ఈ లోపులో చైతన్య తన తల్లిదండుల్ని స్టేజివెనక్కి తీసుకెళ్ళాడు. అక్కడంతా చీకటిగా వుంది. రంగస్థలానికి కావల్సిన వస్తువులు తీసుకురావటం కోసం ఏర్పాటు చేసిన మిలటరీ వ్యాన్ అక్కడవుంది. డ్రైవర్ మెడమీద వెనుకనుంచి బలంగా కొట్టి, క్రిందకి లాగేసి, వాళ్ళని ఆ బ్యాన్‌లో ఎక్కించాడు.

వాల్మీకి వేషధారిని గార్డులు ప్రశ్నిస్తునారు. ఇస్మాయిల్ వారి వెనుకనుంచి నీడగా పాక్కుంటూ ముందుకు వెళుతున్నాడు. ప్రనూష స్టేజ్ ప్రాపర్టీస్‌లో రహస్యంగా దాచిన అమ్యూనేషన్ బయటకు తీస్తోంది.

ఒక్కసారి ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమ్రోగింది. తెర క్రిందకి జారుతోంది.

గార్డుల్లో ఒకడు స్టేజి బయటకు పరుగెత్తబోయాడు. సరిగ్గా అదే సమయానికి లోపలికి రాబోతున్న చైతన్య అతడి గడ్డం కింద బలంగా కొట్టాడు. అది చూసి రెండో గార్డు గన్ ఎత్తాడు. ఇస్మాయిల్ అతడిమీదకు లంఘించాడు. ఈ హడావుడికి లక్ష్మి అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చింది.

లోపల ఏదో గొడవ జరుగుతూందని అజ్మరాలీ గ్రహించాడు. ఒక్క ఉదుటున కుర్చీలోంచి పైకి రాబోయాడు. సరిగా అదే సమయానికి ప్రనూష స్మోక్‌బాంబ్ విసిరింది.

క్షణాల్లో అక్కడ వాతావరణం మారిపోయింది. దట్టంగా పొగలల్లుకొనడంతో షార్ట్‌సర్కూట్ అనుకున్నాడు. ఈ లోపులో లక్ష్మిని చూపిస్తూ “టేక్ హర్ టు ది వాన్” అని డాక్టర్ పాల్‌కి సూచనలు యిచ్చి చైతన్య మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్‌ని షూట్ చేశాడు. లక్ష్మిని డాక్టర్ పాల్ దాదాపు వ్యానులోకి విసిరేసి తనూ వెళ్ళి కూర్చున్నాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.. ఆ చీకట్లో రైఫిల్స్ చప్పుళ్ళు మొదలయ్యాయి. “యూ బాస్టర్డ్స్… షూట్! కిల్‌దెమ్” అరుస్తున్నాడు అజ్మరాలీ.

ప్రనూష వేసిన మరో బాంబ్‌కి స్టేజి అంటుకుంది.  “థాంక్స్ టు అఫ్ఘనిస్థాన్ బోర్డర్ పీపుల్” అనుకుంది. అక్కడ స్మగ్లర్స్ నుంచి కొన్న బాంబులు చాలా బాగా పనిచేస్తున్నాయి.

చైతన్య పరుగెత్తుకువెళ్ళి డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. బుల్లెట్ ఫ్రూఫ్ వ్యాన్ అది. స్టేజీ మంట తాలుకు వెలుగు తప్ప అక్కడంతా చీకటిగా వుంది. నాటకం చూడటం కోసం వచ్చిన సైనికాధికారులు ఈ అనూహ్య పరిణామాన్ని ఊహించక పోవడంతో కంగారుపడుతున్నారు. సైనికులు వెనుక వరుసలో వున్నారు. వాళ్ళు అక్కడినుంది పేలిస్తే ముందువున్న అధికారులకు ప్రమాదం. ఈ లోపులో ఇస్మాయిల్ ఇంకో జీప్ ఎక్కి స్టార్ట్ చేశాడు. హెడ్‌లైట్స్ వెలిగించి ముందుకి దూకించాడు.

పొగ మధ్యలోంచి జీప్ దూసుకుపోయింది. తుపాకి ప్రేలుళ్ళ మధ్యనుంచి బుల్లెట్‌లా సాగిపోయింది.

“ఫైర్” అన్నాడు అజ్మరాలీ… “ఫాలో దట్ జీప్… స్మాష్ దట్” అని అరిచాడు.

చైతన్య తన వ్యానులోనే కూర్చుని వున్నాడు. వ్యాను కదిలించే ప్రయత్నం చేయలేదు. పాకిస్తానీ సైనికులు స్టేజి వెనక్కు పరుగెత్తుకు రావటం కనిపించింది. ఆ ఆపరేషన్‌లో అతి కీలకమైన ఘట్టం అది! చైతన్య ఊపిరి బిగపట్టాడు.

సైనికులు వ్యాను వెనక్కి పరుగెత్తుతున్నారు. వ్యానులో వున్న వాళ్ళందరూ వెంట్రుకవాసి కూడా కదలకుండా వంగి కూర్చుని వున్నారు. సైనికులకి తమకి కావల్సిన వ్యక్తులు ఆ “వ్యాను”లోనే వున్నారన్న అనుమానం రాలేదు.

మిలటరీ వ్యానులన్ని స్టేజి వెనుక దూరంగా పార్క్ చేయబడి వున్నాయి. అక్కడికి పరుగెత్తుతున్నారు వాళ్ళు. రెండు క్షణాల్లో అవి స్టార్ట్ అయ్యాయి. వరుసగా ఒకదాని తరువాత ఒకటి బయల్దేరాయి.

వ్యాన్స్‌కీ, సైనికాధికులకీ మధ్య మండుతున్న స్టేజివుంది. సైనికాధికారుల దృష్టి అంతా వెళ్ళిపోయిన జీపుమీదే వుంది.

సైనికుల మోటార్‌సైకిల్సూ, వ్యాన్సూ బాణాల్లా ముందుకు దూకాయి. చైతన్య మరో రెండు నిమిషాలు ఆగాడు. ఆఖరి వ్యాను తనని దాటగానే, తనదీ ముందుకు పోనిచ్చాడు.

శత్రు సైన్యపు వ్యాన్స్ చివర అతడి వ్యానుకూడా సాగిపోయింది. అద్భుతమైన ఆలోచన అది. చరిత్రలో ఏ కమాండో ఇంతవరకూ సాధించలేని ‘ప్లాన్’ అది. ఏ మెర్సనీర్ ఇంతవరకూ వూహించని వ్యూహం అది. ముందొక చిన్న ఎరని పంపి, శత్రువులు దాన్ని వెటాడుతూ వుండగా వాళ్ళలో కలిసిపోయి అక్కడనుంచి బయటపడటం!

అయిదు నిమిషాల ప్రయాణం సాగింది.

ఇస్మాయిల్ నడుపుతున్న జీపు దగ్గర పడింది. దాన్ని వెంటాడే వ్యానులనుంచి మెషిన్‌గన్స్ మొరగసాగాయి.

ఇక్కడే చైతన్య జ్ఞాపకశక్తికి అసలైన పరీక్ష! సంవత్సరాల తరబడి ప్రనూష సేకరించిన ప్లాన్స్ అన్నీ అత్యంత ఏకాగ్రతతో అతను స్టడీ చేశాడు. ఏయే దారి ఎటు వెళుతుందో అతడికి కంఠతా వచ్చేసింది. ముందు వాళ్ళకి అనుమానం రాకుండా తన వ్యానుని నెమ్మది చేసి, కుడివైపుకి తిప్పాడు.

చీకట్లో అది కొండ పక్కకి తిరిగి ఆగింది. అక్కడ ఆపుచేసి అతడు వేచి వున్నాడు.

ఈ లోపులో జీపుని మరింత వేగంగా పోనిచ్చి, ఆక్సిలేటర్ మీద బరువుపెట్టి ఇస్మాయిల్ క్రిందకు దూకేశాడు. వెనకాల వ్యానులు అక్కడికి చేరుకునే లోపులో తుప్పల చాటుకి వెళ్ళిపోయాడు. జీపు వేగంగా వెళ్ళి రాయికి కొట్టుకుని, ఆ వేగానికి పక్కకి తిరిగి క్రింది లోయలోకి జారిపోయింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకి బ్రహ్మాండమైన వెలుగుతో అది విస్ఫోటనం చెందింది.

అప్పటికే వెనుకనుంచి వస్తున్న వ్యాన్‌లన్నీ అక్కడికొచ్చి ఆగాయి. లోయలోకి దొర్లిపోవటం అధికారులు ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళ ఉద్దేశ్యంలో చైతన్య తాలూకు సభ్యులందరూ ఆ జీప్‌లోనే వున్నారు. అంత వేగంగా జారిపోయిన జీప్‌లోంచి అంతమందీ బయటపడటం అసాధ్యం.

అత్యంత శక్తివంతమైన లైట్లులోయలోకి ఫోకస్ చేయబడ్డాయి. సైన్యం లోయలో దిగటం ప్రారంభించింది. జీప్‌ని చేరుకుని లోపల ఎంతమంది మరణించారో చూడటానికి కనీసం పావుగంట పడుతుంది. అందులో ఎవరూ లేరని అది ఖాళీ అని తెలుసుకోవటానికి మరో అయిదు నిమిషాలు. అది చాలు.

ఇస్మాయిల్ వచ్చి ఎక్కగానే చైతన్య వ్యాన్‌ని అడ్డదారిలోకి తిప్పాడు. దాదాపు రెండు గంటలు ప్రయాణం చేశాక వ్యాను ఆపుచేశాడు. ఇస్మాయిల్ వైపు చూసి నవ్వాడు. “ఇక్కడి వరకూ సక్సెస్…” అన్నాడు రిలాక్స్‌డ్‌గా!

ముందుసీట్లో వాళ్ళిద్దరే కూర్చుని వున్నారు. మిగతా వాళ్ళంతా వెనుక వున్నారు. మధ్యలో ఇనుప పార్టీషన్ వుంది.

“నేను చెప్పిన ప్లాను చాల కరెక్ట్‌గా అమలు జరిపావు. థాంక్స్ అండ్… కంగ్రాచ్యులేషన్స్” అన్నాడు చైతన్య.  “పద వెనుకవాళ్ళని పలుకరించి వద్దాం. అసలేం జరుగుతుందో తెలియక వాళ్ళు కంగారు పడుతూ వుంటారు.”

“ఈ ప్లాను సంగతి వాళ్ళకి తెలీదా?”

“నీకూ, నాకూ, ప్రనూషకి తప్ప ఇంకెవరికీ తెలీదు.”

“ఏం?” ఆశ్చర్యంగా అడిగాడు ఇస్మాయిల్.

“మన ప్రతీ విషయమూ అజ్మరాలీకి తెలిసిపోయింది. మన మొదటి డాన్స్ ప్రోగ్రామ్స్‌కి అతడు ప్రత్యేక అతిథిగా వచ్చాడు! ప్రనూష హోటల్ గది మీద నిఘా ఏర్పాటు చేశాడు. సరే-అదంతా అలా వుంచు. ప్రనూష నన్ను మెంటల్ హాస్పిటల్లో పరీక్షించిన విధానం కూడా అతడికి తెలిసిపోయింది. అంటే-మొట్టమొదటినుంచీ ఆమెమీద ఎలాగో నిఘావేసి వుంచాడన్నమాట. చాలా అదృష్టకరమైన విషయం ఏమిటంటే-నా తండ్రి జగదీష్ ప్రసాద్ అని అతనికి తెలియకపోవటం! కేవలం ప్రనూష కోసమే నేను వచ్చాననుకున్నాడు. నేనెందుకు వచ్చానో తెలుసుకునే లోపులోనే ప్లాను పూర్తి చేయాలనుకున్నాం. అందుకే అంతా హర్రీ చేశాం. విషయం ఎక్కడనుంచి ‘లీక్’ అవుతుందో తెలీదు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఒక్క నీకు తప్ప!”

ఇస్మాయిల్ కళ్ళు చెమర్చాయి. “నన్ను యింత నమ్మకంలోకి తీసుకున్నందుకు-” అంటూ ఏదో చెప్పబోయాడు కృతజ్ఞతతో అతడి కంఠం బొంగురుపోయింది.

“ఇందులో నమ్మకం ప్రసక్తేమీ లేదు ఇస్మాయిల్. చాలా చిన్న తర్కం అంతే! నా తండ్రి గురించీ నీ ఒక్కడికి తెలుసు. అజ్మరాలీకి ఈ విషయం ఇప్పటివరకూ తెలియలేదంటే-నువ్వు మా మనిషివన్నమాట.”

ఇస్మాయిల్ ఆప్యాయంగా చైతన్య భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని- “నాకు మీ రామాయణం గురించి బాగా తెలీదు సాబ్! కొద్దిగా తెలుగు వచ్చు. ఇందాక స్టేజీమీద చెపుతూంటే అర్థమైంది. నీలాంటి సమర్ధవంతమైన కొడుకున్నందుకు నా దోస్త్ సైంటిస్టు జగదీష్‌ప్రసాద్ అదృష్టవంతుడు. తెలివి తేటలు అతని దగ్గర్నుంచి పుణికి పుచ్చుకున్నావు నువ్వు” అన్నాడు.

చైతన్య మొహమాటంగా భుజం మీద నుంచి అతని చెయ్యి తీసేస్తూ “పద వెనక్కి వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడదాం” అన్నడు టాపిక్ మార్చి. ఇద్దరూ వెనక్కి వచ్చి వ్యాను వెనుక తలుపు తట్టారు. లక్ష్మి తీసింది.

మొట్టమొదట దిగింది జగదీష్‌ప్రసాద్! తండ్రికి చెయ్యి అందిస్తూంటే చైతన్య అప్రయత్నంగా వణికాడు. తరువాత తల్లిని దింపాడు. ఒక్కొక్కరు దిగారు.

“ఇక్కడినుంచి వ్యాను ముందుకు తీసుకువెళ్ళటం ప్రమాదకరం. ఈ పాటికి వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయి వుంటుంది. పాకిస్తానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి మేసేజ్ వచ్చేసి వుంటుంది. ఇక్కడ నుంచి మనదేశపు సరిహద్దు మరో పది కిలోమీటర్లు వుంటుంది. తెల్లవారేసరికల్లా మనం అక్కడికి చేరుకోవాలి” అన్నాడు చైతన్య.

“అవును తెల్లవారగానే హెలికాప్టర్లు సెర్చి ప్రారంభం కావొచ్చు. ముందు మనం ఈ వ్యానును నామరూపాల్లేకుండా చేయాలి” ఇస్మాయిల్ అన్నాడు. చైతన్య చుట్టూ చూశాడు. అంతా అడవి! చీకటి నల్లగా, కాటుకలా అడవిమీద పరుచుకుని వుంది. తన మెదడులో నిక్షిప్తమై వున్న మ్యాపుని గుర్తు తెచ్చుకుంటున్నాడు అతడు. ఆ అడవిలో నిశ్శబ్దం కూడా శబ్దంతో మిళితమై వుంది. కీచురాళ్ళ శబ్దం… దూరంగా ఆగి ఆగి వినిపించే గుడ్లగూబ వికృతమైన అరుపు… దాదాపు వంద అడుగుల ఎత్తున చెట్లు-దూరంగా మంచుకొండల మీదనుంచి వచ్చే చల్లటిగాలికో తెలియని భయానికో సన్నగా వణికే శరీరం…

ఆ దట్టమైన అడవిమీద కాటుకలా పరుచుకున్న చీకటి. భయంతో కదిలిపోయేలా, నిశ్శబ్దం కూడా జలదరిస్తూ పగిలి పోయేలా-డాక్టర్ పాల్ అడిగాడు. “అన్నట్టు ప్రనూష ఏది? మనతో రాలేదా?”

 

పిడుగుపడ్డట్టు వినిపించిన ఆ మాటలకి అందరూ ఒకర్నొకరు చూసుకున్నారు.

వాళ్ళ మధ్య ప్రనూష లేదు!

చైతన్య ఆలొచన్లు రాకెట్‌కన్నా వేగంగా పరెగెత్తున్నాయి. ఏం జరిగిందో అతడికి అర్థమవుతూంది. అనుకున్న పథకం ప్రకారం అయితే, ఇస్మాయిల్ ముందు జీపులో సాగిపోతూ, శత్రు సైనికుల దృష్టి తనవైపు మళ్ళించుకోవాలి. శత్రువుల వ్యాన్‌లతోపాటు తమ వ్యాన్ కూడా బయటకు సాగిపోవాలి. అంతవరకూ బాగానే వుంది కానీ ప్రనూష ఎక్కడ ఎక్కాలో ముందే నిర్ణయించుకోలేదు. అందరూ వ్యాన్ వెనుక భాగంలో ఎక్కిన తరువాత డాక్టర్ పాల్‌ని వ్యాన్ వెనుక భాగం నుంచి రెండుసార్లు శబ్దం చేయమన్నాడు. కాని తప్పు ఎక్కడ జరిగిందంటే… డాక్టర్ పాల్, ప్రనూష ముందు సీట్లో తనతోపాటు కూర్చుని వుంది అనుకున్నాడు.

చాలా చిన్న చిన్న విషయాలుకూడా ప్లాన్ చేయకపోతే, మొత్తం ఆపరేషన్ ఎలా ఫెయిల్ అవుతందో చెప్పటానికి అది ఉదాహరణ. విజయం చేతివేళ్ళ అంచులవరకూ వచ్చి ఒక్కసారిగా జారిపోయింది.

‘కమెండో’ ఆపరేషన్ అంటే ఎంత జాగ్రత్తగా వుండాలో, ప్రతీ చిన్న విషయం ఎంత జాగ్రత్తగా, సునిశితంగా ప్లాన్ చేయాలో అతడికి అర్థమయింది.

గుండెల్నిండా గాలి పీల్చుకుని వదుల్తూ “నేను వెనక్కి వెళతాను” అన్నాడు.

అందరూ అమోమయంగా అతడివైపు చూశారు. అతడు చెప్పేది వాళ్ళకి అర్థమవటానికి కొన్ని క్షణాలు పట్టింది.

డాక్టర్ పాల్ అన్నాడు- “వెనక్కి వెళ్ళి ప్రనూషని తీసుకొస్తారా?”

“తీసుకురాగలనో లేదో నాకు తెలీదు. వెళ్ళటం మాత్రం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.”

“వెళ్ళి….”

“వెళ్ళి ఏమీ చేయలేకపోవచ్చు. నేను వెళ్ళేవరకూ ప్రనూషను వాళ్ళు ప్రాణాలతో వుంచకపోవచ్చు. అయినా వెళ్ళటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.”

అప్పటివరకూ మౌనంగా వున్న ఇస్మాయిల్ ముందుకు కదిలి, “మళ్ళీ ఇంకోసారి ఆలోచించు బాబూ! మనం సరిహద్దు అంచుల్లో వున్నాం. విజయానికి చేరువల్లోకి చేరుకున్నాం. పోనీ నువ్వు వెళ్లటం వల్ల అక్కడ ఆమె అపాయం నుంచి ఏమైనా బయట పడుతుందా అంటే అదీ లేదు. చుట్టూ సైనికుల వలయం. ఆ వలయాన్ని చేదించుకోని ఒకవేళ కష్టపడి నువ్వు లోపలకి వెళ్ళినా కేవలం అది ఆమె మృతదేహాన్ని చూడటానికే! కానీ దానికోసం నువ్వు తీసుకుంటున్న రిస్క్, ఇక్కడ మీ తల్లిదండ్రుల్ని ఈ కొండల మధ్య ఒంటరిగా వదిలిపెట్టడం – ఇదంతా దేనికో నాకు అర్థంకావడంలేదు” అన్నాడు.

డాక్టర్ పాల్ ఇస్మాయిల్‌ని చూస్తూ “కరెక్ట్” అన్నాడు.

చైతన్య జగదీష్ వైపు తిరిగి, “మీ అభిప్రాయం ఏమిటి నాన్నగారూ?” అని అడిగాడు.

జగదీష్ తలెత్తి చూశాడు. ఆ వృద్ధుడి కళ్ళల్లో అదోలాంటి తేజస్సు కనపడుతూంది. “నువ్వు నన్ను ఇది అడుగుతున్నది ఓటింగ్ గురించా?” అన్నాడు.

“ఇది అందరికీ సంబంధించిన విషయం కాదు. ఓటింగ్ అవసర మేమున్నది?” అన్నాడు చైతన్య.

“నేను నీ స్థానంలో వుంటే ఇలా అందరి అభిప్రాయాలూ కోరను. ఆ అమ్మాయి కోసం వెంటనే వెనక్కి వెళతాను.”

చైతన్య నిరుత్తరుడయ్యాడు.

“అవును చైతన్యా! ఈ పనిమీద ఇద్దరూ కలిసి వచ్చారు. నీ కోసం తను ఎనో ప్రమాదాల్ని ఎదుర్కొంది. ఆమె కోరిక చిన్నది. కేవలం నీ తండ్రిని విడిపించటం కోసమే ఆమె ఇంత శ్రమ తీసుకుంది. అటువంటి ఆమెనక్కడ కష్టాల్లో వుంటే నేనైతే ఇలా చర్చిస్తూ కూర్చోను. ఆమె కోసం ప్రాణంతో వుందా, పూర్తిగా మరణించి వుంటుందా అని వేచి వుండను. వెంటనే బయల్దేరతాను”

చైతన్య కళ్లు మెరిసాయి. కృతజ్ఞతగా తండ్రివైపు చూశాడు. తాము వెంటనే సరిహద్దు దాటకపోతే తల్లి, తండ్రి ప్రాణాలకెంత రిస్కో అతనికి తెలుసు. కానీ ఇక్కడ సమస్య తల్లి, తండ్రి, మిత్రురాలు-ఇవికావు. తమతో వచ్చిన ఒక మెంబరు శత్రువుల మధ్య వుండిపోవటం జరిగింది-వెళ్ళాలి అంతే!

అతడు సూచన్లు ఇవ్వటం మొదలుపెట్టాడు.

 

 *****

 

ప్రనూషకి ఏం చెయాలో తోచలేదు.

ఆ రాత్రి… అప్పటివరకూ అంతా అనుకున్నట్లే జరిగింది. ముందు ఇస్మాయిల్ జీపు బయల్దేరింది. తను స్మోక్ బాంబులు విసిరేసి సృష్టించిన అయోమయంలో సైనికుల వ్యానులు పొగని చీల్చుకుంటూ ముందుకు సాగాయి. చైతన్య వెళ్ళి వ్యాను ఎక్కటం, మిగతా వాళ్ళందరూ అంతకుముందే వ్యాను వెనుక భాగంలో వెళ్ళి చేరుకోవటం చూసింది. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవటంతో అంతా చీకటి ఏర్పడింది. పొగ మధ్యలో బ్యాటరీ లైటు కాంతి చీకటిని పారద్రోల లేకపోతోంది. రైఫిల్స్ చప్పుడు దూరంనుంచి వినిపిస్తోంది.

ఇస్మాయిల్ జీపు చక్రబంధాన్ని చీల్చుకుని దూసుకుపోవటం ఆమె చూసింది. ఆమె సంతృప్తిగా వ్యాను వైపు వెళ్ళబోతూంటే-అప్పుడు జరిగింది ఆ సంఘటన.

చీకట్లోంచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు అజ్మరాలీ!

అతడి చేతిలో పిస్టల్ వుంది. అయితే ప్రనూష భయపడలేదు. పిస్టల్ రేంజికి అందనంత దూరంలో వుంది ఆమె.

అజ్మరాలీ పరుగెత్తుకుంటూ ఆమెవైపు రాసాగాడు. ఆమె ఆలోచనలు మెరుపుకన్నా చురుగ్గా సాగాయి. ఆ పరిస్థితుల్లో ఆమె వ్యానువైపు వెడితే-అజ్మరాలీ దృష్టి దానిమీద పడుతుంది. ఇక అందరూ ఆ వ్యానునే ఫాలో అవుతారు. ఇంతవరకూ చేసినదంతా వృధా అవుతుంది.

అందువల్ల ఆమె చీకట్లోకి పరుగెత్తింది. ఆమె ఉద్దేశ్యం ప్రకారం వ్యానుని అటువైపు నుంచి చేరుకుంటే అజ్మరాలీకి తను చీకట్లో ఎటు వెళ్ళిందీ తెలీదు.

ఆమె బాణంకన్నా వేగంగా పరుగెత్తింది. దూరంనుంచి అజ్మరాలీ రావటం తెలుస్తూంది. వ్యానులన్నీ వరుసగా నిలబెట్టి వున్నాయి. మిలటరీ క్రమ శిక్షణలో ఒకదాని తరువాత ఒకటి బయల్దేరుతున్నాయి. వాటికి సమాంతరంగా చెకట్లో వెళ్తూంది ఆమె.

చైతన్య వున్న వ్యాను ఇంకొక వంద గజాల దూరంలో వుంది.

బ్యాటరీలైట్ల వెలుతురులో అది అస్పస్టంగా కనిపిస్తూంది.

ఆ కొద్ది దూరం ఎలాగయినా చీకట్లో ప్రయాణించి వ్యాను చేరుకోగలిగితే వెళ్ళిపోవచ్చు.

ఆమె వేగం హెచ్చించింది.

వ్యాను ఇంకో యాభై గజాల దూరంలో వుందనగా ఆమె స్పష్టంగా విన్నది. రెండుసార్లు వెనుకనుంచి కొట్టిన చప్పుడు.. అందరూ వచ్చినట్టు, ముందున్న డ్రయివర్‌కి వెనుకనుంచి డాక్టర్ పాల్ కోడ్… దాంతో చైతన్య వ్యానుని మందుకు దూకించాడు.

ప్రనూష శిలా ప్రతిమలా నిలబడిపోయింది.

కదులుతూన్న వ్యాను వెనుకవైపు కిటికీలోంచి డాక్టర్ పాల్ తనని చూడటం ఆమె గమనించింది.

అయినా వ్యాను సాగిపోయింది.

డాక్టర్ పాల్ వ్యానుని ఆపే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆమె అయోమయంగా అటువైపే చూస్తూ వుండిపోయింది.

ఆమె ఒక్కటే అనుకుంది. బహుశా డాక్టర్ పాల్ అజ్మరాలీని గమనించి వుంటాడు. అజ్మరాలీ తన వెనుక వున్నాడు. కాబట్టి తనకా విషయం రూఢీగా తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో తను వ్యాను ఎక్కడం అజ్మరాలీ గమనిస్తే మొత్తం అందరి ప్రాణాలకూ ప్రమాదం. తన ఒక్కదాని కోసం అందరి ప్రాణాలూ రిస్క్ లో పెట్టడం ఎందుకని డాక్టర్ పాల్ అనుకుని వుంటాడు.

సరయిన నిర్ణయమే!

కానీ-

తనని మృత్యుద్వారం ముంగిట నిలబెట్టిన నిర్ణయం!

తనకి మరణం తప్పదని ఆమెకి తెలిసిపోయింది. ఆమెకి భయం వేయలేదు. బాధ కలుగలేదు. నవ్వొచ్చింది.

చదరంగం ఆటలో ఎటునుంచి ఏ పావు వచ్చి మనల్ని కబళిస్తుందో తెలీదు. అలానే జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా తను కష్టపడింది. ధనం వెచ్చించింది. వివరాలు సేకరించింది. ప్రతీ క్షణమూ పగతో, ప్రతీకారంతో ఊగిపోయింది. చైతన్యని ఎన్నుకుంది. అతడి తండ్రి బందీగా వుండటం కలిసొచ్చింది- కానీ చివరికి అతడి కార్యం నెరవేరింది. అతను వెళ్ళిపోయాడు. తను మిగిలిపోయింది.

‘అలాగే నిలబడు. కదిలావంటే కాల్చేస్తాను.”

ఆమె కదల్లేదు. ఆ మాటల్ని ఎప్పుడో ఒకప్పుడు వినక తప్పదన్నట్లు అలాగే నిలబడి వుండిపోయింది. సైనికుల వృత్తాకారంలో చుట్టుముడుతున్నారు. ఎవరో జనరేటర్ బాగుచేయటంతో ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా కాంతివంతమయింది.

“పద స్వీట్ బేబి. ఇక ఈ నాటకం పూర్తయింది” భుజం మీద చేయివేస్తూ అన్నాడు అజ్మరాలీ. ఆమె విదిలించుకోవటానికి ప్రయత్నించింది. అతడు బిగ్గరగా నవ్వుతూ మరింత దగ్గరకు లాక్కున్నాడు.

“ఎన్ని సంవత్సరాలయింది మనం పందెం వేసుకుని? ఆ పౌరుషం ఇంకా నీలో తగ్గలేదు సుమా.”

సైనికులు ఆమెవైపు తుపాకులు గురిపెట్టి నడుస్తూ వుండగా అతడు ఆమెని తన జీపువైపు తీసుకెళ్ళాడు. “నిన్ను చూసిన మొట్టమొదటి క్షణమే గుర్తుపట్టాను. నేను గుర్తుపట్టనట్టు నటిస్తుంటే, నాకు తెలిసిపోయిందేమో అన్న నీ కంగారు… భలే గమ్మత్తుగా అనిపించింది. చివరికి కారు సీట్లో నీ పక్కన పిస్టల్ పెట్టాను. గుర్తుందా..? ఖాళీ పిస్టల్… అప్పుడే దాన్ని నువ్వు తీసుకుని పేలుస్తావనుకున్నాను. అప్పుడు పేల్చకపోవటం నీ అదృష్టం. లేకపోతే అప్పుడే దొరికిపోయేదానివి… రెడ్‌హాండెడ్‌గా.”

ప్రనూష అతనివైపు సూటిగా చూసింది. ” నామీద నీకు అనుమానం వచ్చిందని మాకు ఎప్పుడో తెలుసు అజ్మరాలీ. హోటల్లో నా రూమ్‌కి వచ్చే ఫోన్‌కాల్స్‌ని నువ్వు అబ్జర్వేషన్‌లో పెట్టినప్పుడే.”

అజ్మరాలీ మొహంలో విస్మయం కనబడింది. “ఓహో.. అది కూడా మీకు తెలిసిందన్నమాట” అన్నాడు ఆశ్చర్యంగా, వెంటనే తన విస్మయాన్ని కప్పిపుచ్చుకుంటూ నవ్వాడు. “యుద్ధంలో ఎవరెవరెప్పుడు నెగ్గారు అన్నది కాదు ప్రశ్న! అంతిమ విజయం ఎవరిదా అన్నది లెక్క, నువ్వు దొరికావు. అదీ నా విజయం…”

“నేను మరణించినా ఫర్వాలేదు. కానీ జగదీష్‌ని భారత దేశం పంపగలిగాను. అది చాలు అంతిమ విజయాన్ని నా డైరీ ఆఖరి పేజీలో వ్రాసుకోవటానికి” గర్వంగా అంది.

అజ్మరాలీ ఒక్కక్షణం అయోమయంగా చూశాడు. “జగదీష్-జగదీష్- ఎవరో నీకు తెలుసా?” అని అడిగాడు తడబడుతూ.

“తెలుసు. రాడార్ సైంటిస్ట్! భారతదేశం సైనిక పటిమని సాంకేతికంగా పది సంవత్సరాలు ముందుకు తీసుకు వెళ్లగలిగే రాడార్ ఫార్ములాని కనుక్కున్న సైంటిస్ట్!” ఆమె ఆగి అంది- “నీ గుండె ఆగిపోయే ఇంకో విషయం చెపుతాను విను అజ్మరాలీ… చైతన్య ఎవరో కాదు- జగదీష్ కొడుకు. రంగనాయకి ఆయన భార్య!”

అజ్మరాలీ ఒక్కక్షణం నిశ్శబ్దంగా వున్నాడు. తనలో తానే అనుకుంటున్నట్లు అన్నాడు- “అందుకే అన్నమాట. ఆ ముసలి వాడు అంత నమ్మకంగా వాళ్ళతో వెళ్ళిపోయాడు.

“అవును. చైతన్య వచ్చింది కేవలం తన తండ్రిని తీసుకువెళ్ళటానికి! ఈ డాన్సు ట్రూపూ, ఇదంతా ఒక నాటకం. ఈ పాటికి వాళ్ళు భారతదేశపు సరిహద్దు చేరుకుంటూ వుండి వుంటారు. చెప్పు అజ్మరాలీ విజయం నీదా? నాదా?’

అజ్మరాలీ కళ్ళెత్తి చూశాడు. నెమ్మదిగా అతడి పెదవులమీద చిరునవ్వు విచ్చుకుంది.  “విజయం నాదే ప్రనూషా! ఇప్పుడు నీ గుండె ఆగిపోయే విషయం నేనూ చెపుతాను విను… ఇంత కాలం నీ కుడిభుజంగా పనిచేసిన డాక్టర్ పాల్ నా మనిషి. మా దేశపు గూఢచారి.”

లక్ష ఓల్టుల కరెంట్ ఒంట్లో ప్రవేశించినట్టు ఆమె అదిరి పడింది. వెయ్యి అగ్ని పర్వతాలు బ్రద్ధలయినట్లు కనిపించింది.

అజ్మరాలీ అన్నాడు- “కాశ్మీర్‌లో మనిద్దరం మొదటిసారి కలుసుకున్న రాత్రి గుర్తుందా ప్రనూషా? మీ అందరికి చాలా అనుమానాలు వచ్చాయి…. మీ సైనికాధికారులు ఎలా చనిపోయారు? నన్ను జైలునుంచి ఎవరు తప్పించారు? మీ సైన్యంలో నాకు సాయం చేస్తున్న వ్యక్తి ఎవరు… ? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియక మీరు తలలు బ్రద్ధలు కొట్టుకున్నారు. ఇప్పుడా ప్రశ్నలకు సమాధానం చెపుతున్నాను. అతను డాక్టర్ పాల్. మీ సైన్యంలో ఉన్నతాధికారి. కానీ మా దేశపు ఏజెంటు” అతడు నవ్వి అన్నాడు.

“నేను నీ తల్లిదండ్రుల్నీ బంధించి తీసుకెళ్ళి వాళ్ళని చంపేసేను గుర్తుందా? అప్పుడు నువ్వు చాలెంజ్ చేశావు… ఎలాగయినా నన్ను చంపుతానని…! నాకు నవ్వొచ్చింది. ఒక దేశపు సైనికాధికారిని వాళ్ళ దేశంలో వాళ్ళ శిబిరంలోకి ప్రవేశించి చంపటం నీకు తోలుబొమ్మలాటలా కనిపించటం చూసి నవ్వుకున్నాను. నీ చాలెంజ్ చూస్తే ముచ్చటేసింది కూడా! ఆ రాత్రే నిన్ను మా జైల్లోంచి తప్పించుకుపోయేలా చేశాడు డాక్టర్‌పాల్! నువ్వూ సరిహద్దు దాటి మీ దేశం వెళ్ళిపోయావు. నీకు తెలియనిదల్లా డాక్టర్ పాల్ నా మనిషని…”

ప్రనూష నిశబ్దంగా వింటోంది.

“…. మా దేశపు గూఢచారిగా అతను నీతోపాటు వుండి పోయాడు. అలా సంవత్సరాల తరబడి పరాయి దేశంలో వుండిపోయే వారిని “ప్లాంటర్స్” అంటారు. నువ్వు ఎప్పుడెప్పుడు ఏయే పనులు చేస్తున్నావో, నా గురించి ఏ యే వివరాలు సేకరిస్తున్నావో అతను నాకు సమాచారం పంపేవాడు. చెప్పానుగా.. నువ్వు పట్టువదలకుండా నన్ను నాశనం చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ వింటూంటే నాకు ముచ్చట వేసేది” మళ్ళీ నవ్వేడు.

“చివరికి నువ్వు చైతన్య అనే సినిమా యాక్టర్‌ని చూసి ముచ్చటపడి మెంటల్ హాస్పిటల్ సెటప్ చేశావు.  ఆ సంగతి నాకు తెలిసింది. అతడిని ‘నీ సైన్యం’ గా నియమించుకుని, నాట్యపు ట్రూపుని తీసుకుని రావటం గురించి డాక్టర్ పాల్ నాకెప్పుడో చెప్పాడు. నీతో సరదాగా ఆడుకోవటానికి మరో చాన్స్ దొరికిందనుకున్నాను. అన్నట్టు నీకో విషయం తెలుసా? నీకు చైతన్య భార్యగా నటించడనికి ఒకమ్మాయి కావల్సి వచ్చింది. లక్ష్మి దానికిముందు వప్పుకోలేదు. ఆమె తమ్ముడిని కిడ్నాప్‌చేసి ఆమెని బెదిరించి ఈ పనికి వప్పించింది కూడా డాక్టర్ పాల్.”

వింటూన్న ప్రనూష ఉలిక్కిపడింది. తనకి ఇంతవరకూ తెలియని విషయాలు కూడా ఇతను చెపుతున్నాడంటే, తన వ్యవహారాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాడో అర్థమవుతూంది.

ఆమె ఉలికిపాటు చూసి అజ్మరాలీ నవ్వేడు. “ఈ సెటప్‌లో నాకు తెలియనిదల్లా.. చైతన్య తన తండ్రి కోసం వస్తున్నాడని, తన తండ్రితో సహా అతను వెళ్ళిపోయాడు. అంతే కాదు. ఈ ప్లాన్ సంగతి డాక్టర్ పాల్‌కి కూడా తెలియకపోవటంతో నన్ను ముందే హెచ్చరించలేకపోయాడు. ఒక నటుడికి ఒంట్లో బాగోలేదనీ, జగదీష్‌కి వేషం వేయించినప్పుడు కూడా డాక్టర్ పాల్‌కి అనుమానం రాకపోవటం దురదృష్టకరం. అయినా నష్టంలేదు. వాళ్ళతో పాటు ఉన్న నా మనిషి, డాక్టర్ పాల్ వైర్‌లెస్‌లో మాకు వాళ్ళెక్కడున్నదీ చెపుతాడు” అగి అన్నాడు.

“ఈ రాత్రి హాయిగా నిద్రపో ప్రనూషా! అడవిలో మా వాళ్ళు మీ వాళ్ళని ఎలా వేటాడి చంపిందీ రేప్రొద్దునకల్లా చెపుతాను. అంతవరకూ గుడ్‌నైట్.”

 

******

 

చైతన్య బయల్దేరబోయేముందు ఒక్క సారిగా తల్లిదండ్రుల్ని చూసుకున్నాడు. తాను తిరిగి రాకపోతే, అదే ఆఖరి చూపు ఆ విషయం తల్లిదండ్రుల చూపులలోనూ కనపడుతుంది.

తండ్రితో అన్నాడు. “నేను వెళ్ళేవరకూ ప్రనూష బ్రతికి వుంటే, ప్రాణాలు అడ్డుపెట్టి అయినా తనని తీసుకొస్తాను. దురదృష్టవశాత్తు ఆమెకి ఏ అపాయమైనా ఈ పాటికే జరిగివుంటే, ఆ అజ్మరాలీని మాత్రం ప్రాణాలతో వదలను.”

జగదీష్ ప్రసాద్ కొడుకువైపు కన్నార్పకుండా చూశాడు. అతడు చెప్పిన రెండింటిలో ఏది జరిగినా కొడుకు ప్రాణాలకే ముప్పు అని అర్థం చేసుకోలేనంత అమాయకుడేం కాదు ఆయన.

మృత్యుముఖంలోకి అడుగు పెడుతూన్న కొడుకువైపు చూస్తూంటే రంగనాయకి కళ్ళలో నీళ్ళు ధారాప్రవాహంగా కారుతున్నాయి. ఇంతకాలం భర్తకోసం దుఃఖించింది. ఇప్పుడు భర్త లభించాడనుకుంటే ఇక కొడుకు కోసం దుఃఖించాలా అని ఆమె ఆందోళన!

“నేను లేనంతసేపూ డాక్టర్ పాల్, ఇస్మాయిల్ జాగ్రత్తగా చూసుకుంటారు మిమ్మల్ని” అని చెప్పి బయల్దేరాడు. దూరంగా అతని కోసం డాక్టర్ పాల్, ఇస్మాయిల్ నిలబడి వేచివున్నారు. వాళ్ళ దగ్గరకి వెళ్ళి అన్నాడు- “నా కోసం కేవలం ఇరవై నాలుగ్గంటలు చూడండి. నేను రాకపోతే ఎలాగయినా నా తల్లిదండ్రులని తీసుకుని సరిహద్దు దాటండి. వాళ్ళని సురక్షితంగా మనదేశం చేర్చే బాద్యత మీ మీద పెడుతున్నాను.”

“నువ్వు నిశ్చితంగా వెళ్ళొచ్చు” అన్నాడు ఇస్మాయిల్. వాళ్ళతో కరచాలనం చేసి వ్యాన్ ఎక్కాడు చైతన్య. క్రమక్రమంగా చీకటిలో కలిసిపోసాగింది అతని వ్యాన్. అటు చూస్తున్న పాల్ మొహంలో సన్నగా నవ్వు కదలాడింది.

 

*****

 

 

దాదాపు ఆరుగంటలు వ్యానులో ప్రయాణం చేశాడు చైతన్య.

తూర్పున ఎర్రటి వెలుగురేఖలు విచ్చుకుంటూ వుండగా, దూరంగా సైనికి శిబిరం కనబడింది.

“ఈ పాటికి వాళ్లకి జరిగిందేమిటో అర్థమైపోయి వుంటుంది” అనుకున్నాడు. యుద్ధ ప్రాతిపదిక మీద తమకోసం వెతుకుతూ వుండి వుంటారు. తమ వాహానాల్లో ఏ వ్యాన్ కనపడటంలేదో కూడా తెలిసిపోయి వుంటుంది. అందువల్ల తను వచ్చిన వ్యాన్‌ని అక్కడే వదిలిపెట్టెయ్యటం మంచిది. వెలుగులో ప్రయాణం మంచిదికాదు.

అతని వ్యాన్‌ని రోడ్డు పక్కనుంచి తప్పించి గుట్టల వెనక్కి తీసుకెళ్ళాడు. అక్కడ అది ఎవరికీ కనపడదన్న నమ్మకం కుదిరాక దాన్ని వదిలి కాలినడకన తిరిగి రోడ్డుమీదకు వచ్చి, సైనిక శిబిరాలవైపు నడవసాగాడు. సూర్యుడు మరింత పైకి రావటంతో అక్కడంతా వెలుగు పరుచుకుంది.

క్రితం రాత్రి తాలూకు విధ్వంసం అంతా అక్కడ స్పష్టంగా కనిపిస్తూంది.

దాదాపు పావుగంట నడిచాడు. శిబిరాల చుట్టూ ముళ్ళ ఫెన్సింగ్, ప్రతీ వందగజాలకీ మంచెమీద గార్డులూ వున్నారు. ఆ లోపల ప్రనూష వున్నది నిజం కాకపోతే, ఈ పాటికి తమ దేశంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వుండి వుండేవాళ్ళు. తన తండ్రి తిరిగి రావటం అనేది పెద్ధ సంచలన వార్త అయి వుండేది.

నడుస్తూన్న చైతన్య అక్కడ నుంచి తుప్పల్లోకి తప్పుకున్నాడు. ఇక అక్కడ నుంచి రోడ్‌మీద నడవటం మంచిదికాదు. దూరంగా మెయిన్‌గేట్ కనపడుతూంది.

అతనికి విపరీతంగా నిద్రవస్తోంది. రాత్రంతా కొండల మధ్య అడవిలో డ్రైవ్ చేయటంవల్ల అవయవాలు స్వాధీనం లేవు. అయిన విశ్రాంతికి సమయం లేదు. ఆలస్యమయ్యే ప్రతి నిముషమూ అక్కడ ప్రనూషని మృత్యువు దగ్గరగా తీసుకు వెళుతుంది.

ఏం చెయ్యాలా అని అతడు ఆలోచిస్తూ వుండగా దూరం నుంచి నాలుగు వాహనాలు వస్తూ కనిపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో కొండమలుపు దిగి యిటే వస్తున్నాయి.

చైతన్య ఆలస్యం చేయకుండా పరుగెత్తాడు. దాదాపు అయిదొందల గజాలు పరుగెత్తి చిన్న గుట్ట ఎక్కి నాలుగయిదు బండరాళ్ళని దారిమీదకు తోశాడు. మామూలు రాళ్ళే. అయిదారు గుమ్మడికాయల సైజులో వున్నవి. పల్లంలోకి సులభంగా జారి రోడ్డుమీదకొచ్చి ఆగిపోయాయి. దూరంనుంచి చూస్తే అవరోధంగా కనిపిస్తాయి. అది చాలు.

అతనూహించినట్టే వాహనాలు దగ్గరకొచ్చి ఆగాయి. ముందు మిలటరీవ్యాను, వెనుక రెండు కార్లు, చివరిది మళ్ళీ వ్యాను.

ముందున్న మిలటరీ వ్యాన్‌లోంచి ఇద్దరు సైనికులు, దాని వెనుక వున్న కార్లోంచి ఒక సైనికాధికారి దిగారు.

తుప్పల చాటునుంచి తల పైకెత్తి ఆ వాహనాలవైపు చూసిన చైతన్య గుండె ఒక్కక్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది.

ఆ వ్యాన్‌ల మధ్యవున్న రెండో కారుమీద భారత జాతీయ పతాకం రెపరెప ఎగురుతూంది.

“నిన్నటి బాంబు పేలుడికి రాళ్ళు ఇక్కడకు కూడా వచ్చిపడ్డాయన్నమాట” అంటున్నాడు ఒక అధికారి.

“ఇండియన్స్… బ్లడీ ఇండియన్స్…” గొణుగుతున్నాడు ముందు కార్లోంచి దిగిన ఆఫీసర్. ఇద్దరు ముగ్గురు సైనికులు రాళ్లని తొలగిస్తున్నారు. చైతన్యకి వాళ్ళ తెలివితేటలు చూసి నవ్వొచ్చింది. నిన్నరాత్రి తమ వాహానాన్ని వెంటాడుతూ వాళ్ళ వ్యాన్లూ ఆ దారిమీదే వెళ్ళి వుంటాయి అన్న ఆలోచన రాలెదు వాళ్ళకి.

సైనికులు రాళ్ళని తొలగిస్తూ వుండగా, అతడు చివరనున్న వ్యాన్ వెనక్కి చేరాడు. వెనుక చక్రాల క్రింద వెల్లకిలా పడుకుని, రాడ్‌కి కాళ్ళూ చేతూలూ మెలివేశాడు.

రెండు నిమిషాల తరువాత కార్లు కదిలాయి. ఐదునిముషాలు ప్రయాణం చేసి సైనిక శిబిరం చేరుకున్నాయి. అతడు తల పక్కకు జరిపి చక్రాల సందుల్లోంచి చూశాడు. అజ్మరాలీ కార్లవైపు వస్తున్నాడు. భారత రాయబారి కార్లోంచి దిగాడు.

ఇద్దరు ఏదో మాట్లాడుకుంటునారు. అజ్మరాలీ కోపంగా ఏదో అరుస్తున్నాడు. భారత రాయబారి మొహం పైకి భావరహితంగా వున్నా, కళ్ళ వెనుక ఆనందం కనిపిస్తూంది. అజ్మరాలీ చెప్పే దానికన్నా, ఇంకా ఏదో పెద్ద నష్టమే జరిగిందనీ, అది చెప్పటానికి అతడు ఇష్టపడటంలేదని భారత రాయబారి గుర్తించినట్టున్నాడు. అందుకే అనందిస్తున్నాడు.

అంతలో చైతన్య దృష్టి వ్యాన్‌వైపు వస్తున్న మనుష్యుల మీద పడింది. అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు

ఇంతసేపూ వారి కోసమే బాధపడ్డాడు.

తనతోపాటు భారతదేశం నుంచి వచ్చిన ట్రూపు కళాకారులు వాళ్ళు!

శత్రుదేశంలో, తాము వెళ్ళిపొయాక భారత రాయబార కార్యలయం వారి గురించి శ్రద్ద తీసుకుంటుందని అతడు అనుకున్నమాట నిజమే కానీ, ఇంత తొందరగా రంగంలోకి దిగుతుందని భావించలేదు.

“మొత్తం ఆరుగురు తప్పించుకుపోయారు” అంటున్నాడు అజ్మరాలీ. అంటే.. తను, ఇస్మాయిల్, డాక్టర్ పాల్, ప్రనూష, లక్ష్మి, తన తల్లి… ఆరుగురి గురించే చెపుతున్నాడు. తన తండ్రి గురించి చెప్పటం లేదు.

ప్రనూషని కూడా కలిపి చెప్పేడంటే, ఆమె గురించి జవాబు దారి అతను వహించలేదన్నమాట.

“మా సైనిక రహస్యాలు తెలుసుకోవటానికి వచ్చిన ఆరుగుర్నీ మేము వదిలిపెట్టము. అంతేకాదు, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయబోతున్నాము కూడా.”

“ఆ పని మేమే చెయ్యబోతున్నాము అజ్మరాలీ! మా దేశపు ట్రూపుని మీ శిబిరాలకి పిలిచింది మీరు. ఇక్కడ నాటకం వేయమన్నది మీరు. మా వాళ్ళలో ఇప్పుడు కొంతమంది కనపడకపోతే అందుకు మీరే బాధ్యత వహించాలి. ముఖ్యంగా మా దేశపు ఒక ప్రాంతానికి చెందిన సూపర్‌స్టార్ ఇక్కడ కనపడకపోతే.. మా దేశంలో ఎంత సంచలనం జరుగుతుందో నేను వుహించగలను. ఈ విషయమై మేము మీ ప్రెసిడెంట్‌తో మాట్లాడతాము.” చైతన్య ఈ సంభాషణ జరుగుతూ వుండగా వ్యాన్ కింద నుంచి దొర్లి పక్కనే వున్న నీటి కుండీలోకి చేరుకున్నాడు.

ఆ తరువాత కొంతసేపటికి రాయబారి కారు,  తన వాళ్ళని తీసుకువెళ్ళిన శబ్దం వినిపించింది.

ప్రనూష ఎక్కడుందో తెలియలేదు.

 

*****

 

 

చైతన్య వెళ్ళిపోయాక మిగతా అయిదుగురూ ఆ రాత్రి అక్కడే వుండడానికి నిర్ణయించుకున్నారు. అడవిలోనే మంచి ప్రదేశం ఎన్నుకుని విశ్రమించాలనుకున్నారు.

జగదీష్‌ప్రసాద్, రంగనాయకి వృద్ధులు కాబట్టి వారికి శ్రమ ఇవ్వదలుచుకోలేదు. మిగతా ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు కాపలా కాయాలి అని నిశ్చయించుకున్నారు ముందు పాల్ వంతు.

ఎంత సైన్యంలో పనిచేసినా, వయసు ఎక్కువ అవటంవల్ల ఇస్మాయిల్ కూడా తనవంతు వచ్చాక లేపమని చెప్పి నిద్రపోయాడు. లక్ష్మి కూడా కళ్ళు మూసుకుంది.

అరగంట గడిచాక, మిగతా అందరూ నిద్రపోయారని నిశ్చయించుకుని డాక్టర్ పాల్ తుప్పల్లోకి వెళ్ళాడు. వ్యాన్‌లోంచి తీసి జాగ్రత్తగా దాచిని వైర్‌లెస్‌లో ఆర్మీ క్యాంప్‌ని కాంటాక్టు చేశాడు.

“అజ్మరాలీ…”

“స్పీకింగ్…”

“నేను డాక్టర్ పాల్‌ని మాట్లాడుతున్నాను.”

“మీ మెసేజ్ కోసమే ఎదురుచూస్తున్నాము పాల్! ఎక్కడికి చేరుకున్నారు?”

“దాదాపు బోర్డర్ దగ్గరికి…! ఐయామ్ సారీ సర్… చివరి నిమిషము వరకూ వాళ్ళు ఈ విషయం నాకూ తెలియకుండా దాచారు. లేకపోతే ఇంతదూరం వచ్చి వుండేది కాదు.”

“ఫర్వాలేదు డాక్టర్ పాల్! ఇందులో నువ్వు చెయ్యగలిగింది ఏముంది? ప్రనూషని వదిలిపెట్టి వెళ్ళగలిగేలా చేశావు అంతే చాలు! చైతన్య ఎక్కడున్నాడు?”

“ప్రనూష కోసం మీ దగ్గరకే తిరిగి వచ్చాడు. ఇంకో నాలుగయిదు గంటల్లో అక్కడికే చేరుకోవచ్చు.”

“రానీ, ఒక వినూత్న పద్ధతిలో స్వాగతం పలుకుతాను.”

“నాతో ఉన్న ఈ నలుగుర్నీ చంపెయ్యమంటారా?”

“వద్దు, ఆ జగదీష్ ప్రాణాల్తో కావాలి. అతడితో రహస్యాలు చెప్పించటానికి అతడి భార్య కూడా కావాలి. ఇంతకాలం నోరు విప్పనివాడు ఇప్పుడెలా చెప్పడో చూస్తాను. ఇస్మాయిల్‌ని చంపెయ్యి. వాడు సైన్యంలో వున్నవాడు. ఎప్పటికయినా ప్రమాదమే… ఆ ఇంకో అమ్మాయి…”

“లక్ష్మి…”

“అదే… లక్ష్మి.. నీ యిష్టం” అన్నాడు.

పాల్ కొంచెం ఆగి అన్నాడు. “మేము ఎక్కడున్నామో చెప్పమంటారా?’

“చెప్పు. రేప్రొద్దున్నే ఆర్మీని పంపుతాను.”

పాల్ చెప్పసాగాడు. అయిదు నిమిషాల్లో టోఫోగ్రఫీ చెప్పాడు. అంత విని అజ్మరాలీ అన్నాడు. “గుడ్‌నైట్ పాల్! రేపు మధ్యాహ్నం కలుసుకుందాం.”

పాల్ వైర్‌లెస్ సెట్ ‘ఆఫ్’ చేశాడు.

చెట్లచాటునుంచి లక్ష్మి విన్నదని అతడికి తెలీదు.

అతడు తిరిగి యధాస్థానానికి వచ్చి చూశాడు. దూరంగా జగదీష్ అతడి భార్య నిద్రపోతున్నారు. మరోవైపు ఇస్మాయిల్.

అతడు లక్ష్మి దగ్గరగా నడిచాడు. ఆమె పక్కకి తిరిగి పడుకుని వుంది. భుజంమీద పైట నేలమీదకు జారిపోయి వుంది. నడుము దగ్గర మెలిక స్పష్టంగా తెలుస్తూంది. అతడు ఆమె అందాన్ని ఓ క్షణం కన్నార్పకుండా చూసి, మోకాళ్ళ మీద నెమ్మదిగా కూర్చున్నాడు. కాళ్ళమీద చెయ్యివేసి నెమ్మదిగా పైకి జరుపుతూ నడుము దగ్గర ఆపి వేళ్లతో వత్తాడు.

ఆమె కళ్ళు విప్పి చప్పున లేచి కూర్చుంది.

అప్పుడే అతడిని గమనించినట్టు “మీరా?” అంది. అతడు కూడా మామూలుగా సర్దుకుని “నా టైమ్ అయింది. ఇక నీ వంతు” అన్నాడు.

ఆమె బద్ధకంగా వళ్ళు విరుచుకుని “తెల్లవారటానికి ఇంకా ఎంత టైముంది?’ అని అడిగింది.

“మూడు గంటలు.”

“మీరు పడుకోండి నేను కాపలా కాస్తాను” అంది.

“నాకూ నిద్ర రావటంలేదు. నీకు తోడు వుంటాన్లే” ఓరగా చూస్తూ అన్నాడు. అతడి చూపులో భావం గ్రహించీ గ్రహించనట్టు “అయితే మీరు మెలకువగా వుండండి. నేను పడుకుంటాను” ఆమె తిరిగి వత్తిగిల్ల బోయింది.

“లేదు. లేదు. నువ్వు వుండు” అంటూ అతను నేలజారేడు.

ఆమె కొంచెం సేపు మెలకువగా వుండి, అందరూ నిద్ర పోయారని నిశ్చయించుకున్నాక లేచి, చెట్ల వెనక్కి వెళ్ళింది. అక్కడ తుప్పల్లో వెతకసాగింది.

డాక్టర్ పాల్ నిజానికి నిద్రపోలేదు. అమెనే గమనిస్తున్నాడు. అతడిలో కోరిక క్షణక్షణానికీ పెరిగిపోతోంది. అతడు ఓరకంటితో చూస్తూ ఉండగా, ఆమె చెట్ల చాటుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వైర్‌లెస్ సెట్‌కోసం ఆమె వెతుకుతూంది. వెనుకనుంచి అతడు చప్పుడు చేయకుండా దగ్గరకొచ్చి “ఏం కావాలి?” అని అడిగాడు. అంత దగ్గర్నుంచి హఠాత్తుగా అతని కంఠం వినిపించేసరికి ఆమె అదిరిపడి ముందుకు పరుగెత్త బోయింది. అతడు ఒక అంగలో ముందుకు దూకి ఆమెని పట్టుకున్నాడు.

ఆమె గింజుకోసాగింది.

“ఏం కావాలి? ఏం వెతుకుతున్నావు చెప్పు?” వెనుకనుంచి చేతులు బిగించి అడిగాడు.

ఆమె సమాధానం చెప్పకుండా అతడి పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది. ఆమె ప్రయత్నించేకొద్దీ అతడి పట్టు మరింత బిగుసుకోసాగింది.

ఆమె ఉనట్టుండి ప్రతిఘటించటం మానేసి “వదులు. నీతో మాట్లాడాలి” అంది.

ఈసారి ఆశ్చర్యపోవటం పాల్ వంతయింది. “ఏమిటి నువ్వు మాట్లాడేది?” అన్నాడు.

“ముందు నన్నొదులు. ఎక్కడికీ పారిపోన్లే.”

అతడు ఆమెని వదిలి “ఏమిటి నువ్వు చెప్పదల్చుకున్నది?” అన్నాడు.

“నేను నీతో ఓ బేరం పెట్టదల్చుకున్నాను.”

“ఏమిటిది?”

“ఇంకొంచెం సేపట్లో మా సైనికులు ఇక్కడికి వస్తారు. నువ్వు నన్నేమీ చేయకుండా వదిలేస్తే మా వాళ్ళు నిన్నేమీ చేయకుండా నేను హామీయిస్తాను.

అతను నుదురు చిట్లించి “ఎవరు నువ్వు? ఇంకొంచెం సేపట్లో సైనికులు వస్తారని నీకెలా తెలుసు?” అన్నాడు.

“నేను “సా” తాలూకు మనిషిని” ఇంగ్లీషులో అంది. ‘సా’ అంటే పాకిస్తాన్ సీక్రెట్ ఏజన్సీ. (PSA)

 

*****

 

అతను బిగుసుకుపోయాడు. ఆమె అంది – “మిమ్మల్నందర్నీ తిరిగి తీసుకువెళ్ళటానికి మా వాళ్ళు వస్తున్నారు.”

“నేనూ పాకిస్తాన్ ఏజెంట్‌నే. ఇంతకాలం ఒకేచోట పనిచేసి కూడ ఒకరికొకరం తెలియకపోవడం విశేషం” అన్నాడు.

ఆమె మొహం చిట్లించి “కోడ్‌వర్డ్ చెప్పు” అంది.

“నేను ‘సా’ మనిషిని కాను. ఆర్మీ ఇంటలిజెన్స్… అజ్మరాలీ తరవున భారత సైన్యంలో చేరి, అక్కడ ప్లాంటర్‌గా వుండిపోయాను.”

“ఏ విషయం మీద?”

“ప్రనూష కార్యకలాపాలు ఎప్పటికప్పుడు అజ్మరాలీకి చేరవేయటం కోసం.”

“అందరూ పాకిస్తాన్‌కి వస్తున్నారని నువ్వు ముందే అతనికి తెలియ చెప్పలేదా?”

“చెప్పాను. అందుకే తన ఆర్మీ క్యాంప్‌లో నాటకం ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు.”

“ఇదేం చిన్నపిల్లలాట అనుకున్నాడా? శత్రువు మన దేశంలో ప్రవేశించాడని తెలిశాక అతడిని ఏదో ఒక మిషమీద అరెస్ట్ చేయించటం పోయి, సరాసరి సైన్యపు శిబిరంలోకే ఆహ్వానిస్తాడా? ఈ విషయం ఒక్కటి చాలు అతన్ని కోర్టు మార్షల్ చేయటానికి.”

పాల్ జవాబు చెప్పలేదు.

“ప్రనూషనీ, చైతన్యనీ మన దేశంలోనే చంపుతాం. జగదీష్‌ని వెనక్కి తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, అదలా వుంచు… రాత్రి జరిగిన విధ్వంసానికి జవాబుదారీ ఎవరు వహిస్తారు?”

దీనికి కూడా పాల్ సమాధానం చెప్పలేదు. అజ్మరాలీ పిల్లి లాంటివాడనీ ఎలుకలతో చెలగాటం అతనికి యిష్టమనీ ‘సా’ ఏజెంట్‌తో ఎలా చెప్పగలడు?

‘సరే. ఇవన్నీ మన సమస్యలు కావు. మిలటరీ అధికారులు చూసుకుంటారు.” ఆమె అంది.

అతడు పిస్టల్ చేతిలోకి తీసుకున్నాడు. “ముందు ఆ ఇస్మాయిల్‌ని చంపాలి” అన్నాడు.

ఆమె మొహం చిట్లించి “ఎందుకు?” అంది.

“అతనికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. అజ్మరాలీని అడిగాను. చంపేస్తే తనకేం అభ్యంతరం లేదన్నాడు. పైగా ఇస్మాయిల్ సైన్యంలో పనిచేసినవాడు. అతను మనతో వుంటే రేపొద్దున్న వరకయినా ప్రమాదమే” అతడు పిస్టల్ పట్టుకుని వాళ్ళు పడుకున్నవైపు వెళ్ళసాగాడు.

“వద్దు ఆగు” అంది.

పాల్ తలతిప్పి ఆమెవైపు చూసి “ఇది ఆర్మీ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన విషయం. ‘సా’ కి సంబంధించింది కాదు. ‘సా’ తరపున ఇండియాలో మీకక్కడ ఏం పనో నేను అడగలేదు. అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వుంటే మంచిది” అన్నాడు సీరియస్‌గా.

ఆమె నవ్వి “నేను ఆగమన్నది అందుకు కాదు” అంది.

“మరి?”

“వాడిని చంపగానే ఇక రాత్రంతా ఆ ముసలాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. మనకి జాగారం తప్పదు. ఆ చంపే పనేదో తెల్లవారు ఝూమునే చేసుకోవచ్చు మన పని పూర్తయ్యాక.”

“ఏం పని?”

“ఆర్మీ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తూ అదికూడా అర్థంకాలేదా? “ సమ్మోహనంగా చూస్తూ అంది.

“అయింది” దగ్గరికి వస్తూ అన్నాడు.

ఆమె అతడి భుజాలమీద చేయివేసి, అరికాళ్ళు పైకెత్తి, అతడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. అతడు ఆమెని దగ్గరగా హత్తుకున్నాడు. ఆమె కొద్దిగా వెనక్కి వెళ్ళి, అతడి చేతుల మీద నుంచి తన చేతులు క్రిందికి జరిపి బెల్ట్ హుక్ తీసింది. ఆ తర్వాత కూడా చేతులు అక్కడినుంచి తియ్యలేదు. అతడు సన్నగా మూలిగి, “ఇంత విద్య ఎక్కడ నేర్చుకున్నావ్” అని అడిగాడు.

ఆమె రెండు చేతుల్నీ అతడి నడుము చెరోవైపుకి వేసి పాంటు క్రిందకి జరుపుతూ, “ఉద్యోగం అన్నాక తప్పదు కదా” అంది.

“ఏం ఉద్యోగం సీక్రెట్ సర్వీసా?” ఆమె పైట తొలగించబోతూ అన్నాడు. అతడి ప్రయత్నాన్ని అవరోధిస్తూ “జూనియర్ ఆర్టిస్ట్”అంది.

“అదేమిటి?”

“నటించటం” అతడి ముందు మోకాళ్ల మీద కూర్చుంటూ అంది.

“నువ్వు తియ్యవేం?” జాకెట్ తొలగించబోయాడు. ఆమె సుతారంగా అతడి చేతులు పక్కకి తపిస్తూ. “అవసరంవస్తే తప్పకుండా” అంటూ అతడి ఆఖరి ఆచ్చాదన కూడ తొలగించి వున్న ఆమె చేతులు అతడి కడుపు మీదనుంచి క్రిందికి జారేయి.

ఒక్కక్షణం తర్వాత అతడు పెట్తిన కేక అడవిలో మార్మోగింది.

గాఢనిద్రలో వున్న ఇస్మాయిల్, మగతనిద్రలో వున్న జగదీష్ దంపతులు అడవిలో అన్ని జీవాలూ ఆ కేకకి నిద్ర లేచాయి. చెట్లమీద వున్న పక్షులన్నీ ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకోవటంతో అక్కడ నిశ్శబ్దం భయంకరంగా చెదిరింది.

ఇస్మాయిల్ పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి, ఆ దృశ్యం జలదరించేలా వుంది.

పడగ వదిలేస్తే పాము ఎక్కడ కాటువేస్తుందో అన్న భయంతో విషాన్ని పిండినట్లు ఆమె అతని ప్రాణాలు తోడేస్తుంది. అతడి కేకలు, క్రమంగా క్షీణమయ్యాయి. కాళ్ళూ చేతులూ కొట్టుకోవటం కూడా ఆగిపోయింది. నెమ్మదిగా నిర్జీవమయ్యాడు. అతడి ప్రాణాలు వున్నాయా పోయాయా అనికూడా ఆమె చూడలేదు. ఆమె ఆ క్షణం ఒక హిస్టీరియా పేషెంట్‌లా వుంది.

ఇస్మాయిల్ అప్పటికి తేరుకున్నాడు. ఒక్క ఉదుటున చెట్ల వెనుకనుంచి దగ్గరగా వెళ్ళి ఆమెని విసురుగా వెనక్కి లాగుతూ “లక్ష్మీ ఏమిటిది?” అని అరిచాడు.

ఆమె ఆవేశం తగ్గగానే, దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఎందుకో కారణం తెలీదు. “ఇతను… ఇతను పాకిస్తాన్ ఏజెంట్” అంది వెక్కుతూ. ఇస్మాయిల్ నిరత్తరుడయ్యాడు. ఆమె చెప్పింది ఒక పట్టాన అర్థంకాలేదు. ఆమె అంది. “మిమ్మల్ని చంపేసి, వాళ్ళని వెనక్కి పాకిస్తాన్ తీసుకు పోవాలని ప్లాన్ వేశాడు. అజ్మరాలీతో మాట్లాడుతూ వుంటే విన్నాను.”

క్రమక్రమంగా ఇస్మాయిల్‌కి అర్థమైంది. డాక్టర్ పాల్‌కి కొద్ది దూరంలో పిస్టల్ అలాగే వుంది. లక్ష్మి ‘ఆ పనిని’ ఎటువంటి పరిస్థితుల్లో చేసిందో కూడ అర్థమైంది. తనని రక్షించటం కోసం ఆమె ఏం కోల్పోవటానికి సిద్ధపడిందో తెలియగానే అతడు కదిలిపోయాడు.

ప్రనూష వ్యాన్ ఎక్కకముందే అది ఎందుకు కదిలిందో ఇప్పుడు అతడు స్పష్టంగా వూహించగలిగాడు. ఇంకో రెండు గంటలు ఆలస్యమై వుంటే తమ ప్రాణాలు ఎంత నిశ్శబ్దంగా ఈ అడవిలో సమాధి కాబడేవో వూహించి, ఆమెపట్ల కృతజ్ఞతతో తలమీద చేయివేశాడు. ఆమెకూడా క్రమంగా తేరుకుంది.

“ఒక పాకిస్తాన్ ఏజెంట్ కూడా నమ్మేటంతగా నాటకం ఆడి, ఈ సాహసానికి పూనుకున్నావంటే నమ్మలేకపోతున్నాను…”

“మరేం చేయను? అతడికి ఆలోచించుకునే టైమ్ ఇవ్వకూడదు. ధైర్యం తెచ్చుకున్నాను.”

“ధైర్యం గురించి కాదు నేను మాట్లాడేది. త్యాగం గురించి” అన్నాడు.

ఇస్మాయిల్ డాక్టర్ పాల్ నగ్న శరీరంవైపు చూస్తూ “నీ పరిస్థితుల్లో ఎవరున్నా ఈ పనిచేయగలిగి వుండేవారు కాదేమో.”

ఆమె నెమ్మదిగా తల పైకెత్తి, తడికళ్ళతో అతనివైపు చూసింది. “అవును. చేయగలిగి వుండేవారు కాదేమో.. నటిని కదా.. నటించటం సులభమై వుంటుంది. జూనియర్ ఆర్టిస్టిన్‌ని కదా.. పైట తొలగించటం అలవాటై వుంటుంది” అంది.

*****

 

ఉదయం తాలూకు వెలుగు ఆ మైదానంనిండా పరుచుకోవటం ప్రారంభించి చాలా సేపయింది.

అజ్మరాలీ అక్కడికి వచ్చేసరికి ప్రనూషని బందీగా తెచ్చి వుంచారు. అతడు ప్రనూషని చూసి నవ్వాడు.

“మీ భారత రాయబారి మిగతా వాళ్ళందర్నీ తీసుకువెళ్ళిపోయాడు. చైతన్యతో కలిసి నువ్వు మాకు మిగిలి పోతావన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే, బ్రతికున్న ఖైదీల లిస్టునుంచి నీ అడ్రస్ కొట్టివేయబడుతుంది. అర్థమైందా?”

ఆమె సమాధానం చెప్పలేదు.

“నీకు తెలుసుకదా.. యుద్దంలో దొరికిన సైనికులపట్ల గెలిచిన వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో” నవ్వేడు… “అలాగే శత్రుదేశంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే, ఇక ఆ సైనికులకి పండగే.  కోళ్ళు… గొర్రెలు… ఆడపిల్లల్లు…”

నవ్వు ఆపి, అతడు అన్నాడు “నేను చెప్పిన ఒక పని చేస్తే నిన్ను సకల మర్యాదలతో మీ దేశ రాయబారి కార్యాలయానికి పంపుతాను.”

ఆమె తలెత్తి చూసింది.

మా సైనికులందరూ చూస్తూండగానే నన్ను ముద్దు పెట్టుకోవాలి. చిన్న ముద్దు… అంతే నిన్ను వదిలేస్తాను.”

“ప్రాణం పోయినా నేనా పని చేయనని నీకు తెలుసు.”

“సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల గురించి నీకు చెప్పానుగా, మొహం వాచిపోయి వుంటారు. చూడు మా వాళ్ళు నీ వైపు ఎలా ఆకలిగా చూస్తున్నారో. నేను చిన్న సైగ చేశానంటే నెలరోజులు నేలమాళిగలో పెట్టి రోజుకి పదిమందికి తక్కువ కాకుండా అనుభవిస్తారు. అది మంచిదా, ఓటమి ఒప్పుకుని నన్ను ముద్దు పెట్టుకోవటం మంచిదా?’

అంటూ జేబులోంచి కాయిన్ తీశాడు. “నీకు గుర్తుందో లేదో కొన్నేళ్ల క్రితం నీకు నీ తల్లికీ మధ్య – ఎవర్ని అనుభవించాలో అని ఒకసారి టాస్ వేశాను. ఇప్పుడు నీ ముద్దుకీ – శీలానికి మధ్య టాస్ వేస్తాను” అంటూ నాణేన్ని గాలిలోకి ఎగరేశాడు.

ఆమె కళ్ళు మూసుకుంది. ” బొమ్మ పడితే నాకు ముద్దు, బొరుసు పడితే మా వాళ్లకి విందు…”

అజ్మరాలీ మాటలు గాలిలో ఆమెకు వినిపించాయి. ఆ తర్వాత చిన్న చప్పుడు.

“బొరుసు… ” అజ్మరాలీ అన్నాడు. ఆమె ఇంకా కళ్లు తెరవలేదు. అడుగుల చప్పుడు దగ్గరైంది.

అజ్మరాలీ ఆమె దగ్గరగా వచ్చి ఆమె గడ్డం పైకెత్తి మొహం దగ్గరగా వంగాడు. పెదాలమీద పెదాలు ఆంచి ముద్దు పెట్టుకోబోయి ‘నో’ అంటూ దూరంగా జరిగి నవ్వేడు.

“…నాకు ప్రిన్సిపుల్స్ వున్నాయి. మాటమీద నిలబడతాను. బొరుసు పడితే మా వాళ్ళకి విందన్నాను. నా అదృష్టం బావోలేదు. మా వాళ్ళ అదృష్టం బావుంది” అంటూ నీళ్ళటాంకు పక్కగా వచ్చాడు.

ఇంకా కళ్ళు మూసుకుని వున్న ప్రనూషకి అప్పుడు మరో శబ్దం వినిపించింది. నీళ్ళు జారిన శబ్దం, ఎవరినో కొట్టిన ధ్వని. క్రిందపడిన చప్పుడు. అప్పటికే ఆమె కళ్ళు తెరిచింది.

అంత వేగాన్ని ఆమె తన జీవితంలో అంతకుముందు ఎన్నడూ చూడలేదు. నీటి ట్యాంకులోంచి బయటకు దూకిన చైతన్య రెప్పపాటుకాలంలో అజ్మరాలీని సమీపించటం, ఒకే దెబ్బతో అతన్ని నేల కరిపించటం, గాలిలో డైవ్‌చేసి ప్రనూష పక్కనున్న సైనికుడి రైఫిల్ లాక్కుని, అదే వేగంతో తలమీద కొట్టటం జరిగిపోయింది. ఇదంతా ఎంత ఫాస్ట్‌గా జరిగిందంటే,  చుట్టూ వున్న సైనికులు తమ ఆయుధాలు సరి చేసుకునే లోపులో అజ్మరాలీ నేలమీద వున్నాడు. పక్క సైనికుడి నుంచి లాక్కున్న రైఫిల్‌తో చైతన్య అతని పక్క గురిపెట్టి నిలబడ్డాడు.

తను చూసింది కలో నిజమో అర్థంకాని పరిస్థితిలో వుండి పోయింది ప్రనూష.

ఈ పనిమీద బయల్దేరబోయేముందు చైతన్య కొన్ని నెలలు టైమ్ కావాలని అడిగినప్పుడు ఆమె ఎందుకని అన్నది. చైతన్య రకరకాల ట్రైయినింగ్‌లు పొందటం, ఇసుకలో పరుగెత్తటం మొదలైనవి చూసి ఆమె ఇదంతా అనవసరమైన టైమ్ వృధా అనుకుంది. “మనం సైనికులకి దొరికిపోతే ఎలాగూ బ్రతకనివ్వరు. ఈ పరుగెత్తటాలూ, జలసంభన విద్యలూ ఎందుకు?’ అని అనుకుంది.

దాని విలువ ఏమిటో ఇప్పుడు కళ్ళారా చూసింది. ప్రతీ కండరాన్ని స్వాధీనంలో వుంచుకోవటం అంటే ఏమిటో ప్రత్యక్షంగా గమనించింది. చుట్టూ వున్న సైనికులు యింకా తేరుకోకముందే చైతన్య కంఠం ఆ ప్రదేశంలో మార్మోగింది. “ఎవరైనా కొద్దిగా కదిలినట్టు కనిపించినా మీ కమాండర్ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి జాగ్రత్త.”

అక్కడ గాలి తప్ప ఇంకే శబ్దమూ వినపడటంలేదు. ఏం చెయ్యాలో తోచనట్టు అందరూ నిశ్చేష్టులుగా నిలబడి వున్నారు. అప్పుడే స్పృహ లోకి వచ్చిన దానిమల్లే ప్రనూష తేరుకుని, తనని బంధించి వుంచిన మరో సైనికుడి దగ్గిర్నుంచి రైఫిల్ తీసుకుంది.

అజ్మారాలీ భుజం పట్టుకుని పైకి లేపి, వ్యాన్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు చైతన్య. దూరంగా నిలబడివున్న సైనికులతో బిగ్గరగా అన్నాడు. “మేము సరిహద్దు దాటేవరకూ ఇతను మా బంధీగా వుంటాడు. మాకే మాత్రం అపాయం తలపెట్టినా ఇతడు ప్రాణాల్తో మిగలడు.”

ఎవరూ మాట్లాడలేదు. ఇదంతా తమ కళ్లముందే జరుగుతూ వుందనీ, తమ నాయకుడి బందీ అయ్యాడనీ స్వయంగా చూస్తున్నా నమ్మె స్థితిలో లేరు వాళ్ళు. అంతా అయోమయంలో వున్నారు.

ప్రనూష డ్రైవ్ చేస్తూ వుండగా వ్యాన్ కదిలింది. చైతన్య అజ్మరాలీ నుదుటికి ఇంకా తుపాకీ గురిపెట్టే వుంచాడు. ఏ విధమైన రిస్కు తీసుకోదల్చుకోలేదు అతడు.

“ఒక చెడువార్త” అంది ప్రనూష ఎలా ప్రారంభించాలో తెలియనట్టు.

“ఏమిటి?”

“డాక్టర్ పాల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ గూఢచారి.”

పెద్ద గుంటలో పడి వ్యాన్ పైకి లేచింది. చైతన్య మొహం వివర్ణమైంది. అతని చేతిలో తుపాకి వణికింది. అజ్మరాలీ బిగ్గరగా నవ్వాడు.

“ఈపాటికి అక్కడ అంతా జరిగిపోయి వుంటుంది చైతన్యా! ఇస్మాయిల్‌ని పాల్ చంపేసి వుంటాడు. లక్ష్మిని…” పైన హెలికాప్టర్ చప్పుడు వినిపించటంతో మాటలు ఆపుచేశాడు. చాల దగ్గిర్నుంచి వ్యాన్ మీదుగా వెళ్ళి పోయింది అది. అజ్మరాలీ సంతోషంగా అన్నాడు.

“మా వాళ్ళు నన్ను ఎలా రక్షించాలా అని చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ప్రాణాల్తో వదలరు. అక్కడ పాల్ మీ వాళ్ళని చంపేసి వుంటాడు. ఇక్కడ మా వాళ్ళు మిమ్మల్ని…” అతడి మాటలు పూర్తికాలేదు. హెలికాప్టర్ ఒకసారి రౌండ్ కొట్టి మళ్ళీ వెనుకనుంచి వచ్చింది. వ్యాన్ దగ్గరకి రాగానే బుల్లెట్ల వర్షం కురిపించింది. జరుగుతున్నదేమిటో అర్థమై అజ్మరాలీ మొహం తెల్లగా పాలిపోయింది. ఆర్మీ చీఫ్ నుంచి ఆర్డర్లు వచ్చి వుంటాయి. “మన కమాండర్ చచ్చిపోయినా పర్వాలేదు. వాళ్ళని మాత్రం ప్రాణాలతో వదలకండి” అని- దాని పర్యవసానం ఇది.

ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత మూర్ఖుడు కాదు అజ్మరాలీ. అతడి పెదవులు బిగుసుకున్నాయి. ప్రాణభయం కాదు. అవమానం… ఇంతకన్నా అవమానం ఏ సైనికాధికారికీ జరిగి వుండదు.

ప్రాణాలు పోబోయే ఆ స్థితిలో కూడా చైతన్యకి సంతోషం కలిగింది. ఓరగా అజ్మరాలీవైపు చూశాడు. అతడు కట్టెలా – నిశ్చలంగా వున్నాడు. తన ప్రాణాలకి పై అధికారులు ఏ మాత్రం విలువ ఇవ్వలేదని అర్థమైంది అతడికి.

“నీ శాడిజమే నిన్ను ఈ పరిస్థితుల్లోకి తోసింది అజ్మరాలీ” అన్నాడు చైతన్య. “….శత్రువుని ఆర్మీ కాంప్‌లోకి ఆహ్వానించి మరీ నాటకాలాడించినందుకు నీ పై అధికారులు ఈ రకమైన శిక్ష విధించి వుంటారు. నీకు నువ్వు లేకుండానే నీ మీద కోర్ట్ మార్షల్ జరిగి వుంటుంది.”

“నేను మరణించినా ఫర్వాలేదు. నాతోపాటు మీరు చస్తారు. అది చాలు” అన్నాడు. అజ్మరాలీ పైకి అలా అన్నాడేగానీ, లోపల చాలా కలత చెందుతున్నాడని అతని ముఖ భంగిమే చెపుతోంది.

చైతన్య వ్యాన్ కిటికీలోంచి తల బయటపెట్టాడు. హెలికాప్టర్ తిరిగి దగ్గరగా వస్తోంది. రెండుసార్లు రైఫిల్ పేల్చాడు. ఒక గుండు  విండ్‌షీల్డ్‌ కి   తగిలింది. మరొకటి పైలెట్ చెవి పక్కనుంచు దూసుకుపోయింది. అద్దాలు గాలిలో చెల్లాచెదురయ్యాయి.

హెలికాప్టర్ దూరంగా వెళ్ళింది.

వేగంగా కదులుతున్న వ్యాన్‌లోంచి హెలికాప్టర్‌ని షూట్ చేసిన వ్యక్తి సామాన్యుడు కాదని పైలెట్‌కి అర్థమై వుంటుంది. రిస్కు తీసుకోకుండా పక్షిలా పైనుంచి గమనిస్తూ వ్యాన్‌తోపాటే నడపసాగాడు. ప్రనూష దగ్గర్నుంచి స్టీరింగ్ తను తీసుకుని వేగం పెంచాడు చైతన్య.

బుల్లెట్ల వర్షం తాత్కాలికంగా ఆగటంతో కాస్త వూపిరి పీల్చుకున్నాడు.

దాదాపు రెండు గంటలపాటు క్రింద వ్యాను, పైన హెలికాప్టరు ప్రయాణం చేశాయి.

ఎవరి ఆలోచన్లో వాళ్ళున్నారు. చైతన్య మనసులో టెన్షన్‌తో కూడిన బాధ. టెన్షన్ తన గురించికాదు. డాక్టర్ పాల్ చేతిలో తన తల్లిదండ్రులు ఏమయ్యారోనని…

ప్రనూష్ కూడా ఆ విషయమే ఆలోచిస్తూన్నది. వ్యాన్ కొండ మలుపు తిరుగుతూ వుండగా సడెన్‌గా బ్రేక్ వేశాడు చైతన్య. ఎదురుగా రోడ్ ప్రక్కనుంచి ఇస్మాయిల్ ముందుకు వచ్చాడు. దూరంగా వున్న తల్లిదండ్రుల్నీ, లక్ష్మినీ చూడగానే చైతన్య మొహం విప్పారింది.

ఇస్మాయిల్ సుశిక్షితుడైన సైనికుడు కాబట్టి – మాటల్తో సమయం వృధా చేయకుండా అందర్నీ వ్యాన్ ఎక్కించాడు. మళ్ళీ వ్యాన్ కదిలింది. చాలా క్లుప్తంగా డాక్టర్ పాల్ విషయం ఏం జరిగిందో వివరించాడు ఇస్మాయిల్. అజ్మరాలి స్థాణువు అయ్యాడు.

లక్ష్మి వెనుక సీట్లో కూర్చుని వుంది. అంతా విని ప్రనూష వెనుతిరిగి, లక్ష్మితో “కంగ్రాచ్యులేషన్స్. గ్రేట్ జాబ్” అంది. చైతన్య ఏమీ మాట్లాడకుండా అద్దంలోంచి వెనక్కి చూశాడు. అతడి కళ్ళలో అభినందన అందుకున్నట్టు లక్ష్మి తలదించుకుంది.

మరో పావుగంట ప్రయాణం చేశాక వ్యాన్ ఆపుచేశాడు.

ఎదురుగా చిన్న నదిపాయ. కొండల్లోంచి వేగంగా ప్రవహిస్తూంది. రావి, సట్లెజ్ – చినాబ్ – ఏ నదో ప్రనూషకి గుర్తురాలేదు. నదులకీ పర్వతాలకీ ఎల్లలు లేవని నిరూపిస్తూ ఒక దేశంలోంచి ఇంకో దేశంలోకి స్వచ్చందంగా ప్రవహిస్తున్నాయి.

నదిమీద చిన్న బ్రిడ్జి వుంది.

కానీ….

దానిమీద వ్యాను వెళ్ళదు. జీపులు మాత్రమే వెళ్ళగలిగేటంత వెడల్పుంది ఆ బ్రిడ్జి.

తమని వెంటాడుతూన్న హెలికాప్టరు ఎందుకు ఫైర్ చేయలేదో ఇప్పుడు అర్థమైంది చైతన్యకి. ఎలాగూ తమ వ్యాన్ ఇక్కడితో ఆగిపోతుంది కాబట్టి. అనవసరంగా కోటిరూపాయల రిస్కు తీసుకోదల్చుకోలేదు వాళ్ళు.

“ఏం చేద్దాం?” ఇస్మాయిల్ అడిగాడు.

“ఇక్కడ నుండి కాలినడకన సరిహద్దు దాటాలి. ఇంకో మార్గం లేదు” అన్నాడు చైతన్య.

పర్వాతాలవైపు చూస్తూ ప్రనూష గాఢంగా విశ్వసించింది. ఈ వృద్ధులతో ఆ కొండలు ఎక్కి దిగి, అవతలివైపుకి చేరుకోవటం దాదాపు అసంభవం.

“ఈ దారి ఎక్కడికి వెళుతుంది?” ఇస్మాయిల్ అడిగాడు.

“ఇంకో కిలోమీటరు ముందుకు వెళ్ళి కొండ అంచున ఆగిపోతుంది. ఆ తరువాత ఏమీలేదు. క్రింద రాళ్ళు, కొండలమీద మంచు…”

“సరిహద్దు ప్రాంతాల్లో సైనికి శిబిరాలు లేకపోవటం చిత్రంగా వుంది” చుట్టూ చూస్తూ అన్నాడు జగదీష్ ప్రసాద్.

“పేరుకి రెండు గంటల ప్రయాణం చేశామన్న మాటేగానీ, మనం వచ్చింది పది కిలోమీటర్లే. అంత దుర్భరమైన ప్రదేశం ఇది! అందుకే రెండు దేశాలకీ ఈ ప్రాంతంమీద ఇంటరెస్ట్ లేదు. దూరంగా కనబడుతున్న ఆ కొండల వెనుక భారత సరిహద్దు వుంది. నిజానికి ఈ నది అవతలివైపు వరకూ కూడా భారత ప్రాంతమే.” బ్రిడ్జి అవతల కనపడుతూన్న పాడుబడిన శిబిరాలని చూపిస్తూ చైతన్య అన్నాడు… “అవి మన సైనిక శిబిరాలే. ఒకపుడు మన పోస్ట్ వుండేది అక్కడ. కేవలం ఈ కొద్ది ప్రదేశాన్ని స్వాధీనంలో వుంచుకోవటానికి కొండల కివతల ఆర్మీ పోస్ట్‌ వృధా అని మనవాళ్ళు వెనక్కి తగ్గారు. ఆ పర్వతాలు దాటి భారతసైన్యం ఇటు రాదని పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలుసు. అందుకే బ్రిడ్జి దాటాక ఆ కొండలవరకూ రోడ్డు వేసి వదిలేశారు. ఈ రకంగా యీ రెండు దేశాలమధ్యా ఇది స్వభావసిద్ధమైన నో-మాన్స్-లాండ్ (NO MAN’S LAND) గా మారింది.”

అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని, సరిహద్దు రేఖల్నీ అంత బాగా ఆకళింపు చేసుకున్న చైతన్య వైపు అజ్మరాలీ దిగ్భ్రాంతితో చూశాడు. తన సైన్యంలో పనిచేసే చాలమందికి ఆ వివరాలు తెలియవని అతడికీ తెలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *