January 29, 2023

ఐ మెరే ప్యారే వతన్ – పారసీక ఛందస్సు – 6

 రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు      j.k.mohanrao                                                                             


 

 

 

ఈ వారము ప్రముఖ హిందీ చిత్రగాయకుడు శ్రీ మన్నాడే దివంగతులయ్యారు.  తొంభైనాలుగేళ్ల నిండు జీవితాన్ని గడిపి, చివరివరకు సంగీతములో ఆసక్తులైయున్నారు.  వారి ఆత్మశాంతిని కోరుతూ, వారికి నివాళిగా ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను.  ఒకరికి శ్రద్ధాంజలి సమర్పించేటప్పుడు వారి సంపూర్ణ జీవనాన్ని సింహావలోకనము చేసి, వారి యశస్సును కీర్తించడము ఒక పద్ధతి.  అలా చేయడానికి ఎంతో విమర్శనాశక్తి, విద్యాగరిమ, విషయసేకరణ  అవసరము.  ఒక సామాన్య రసికుడైన నాకు ఆ అర్హతలు లేవు. అదియునుగాక, ఈ వ్యాసపరంపరలో నా ఆశయము పారసీక ఛందస్సుకు మన భారతీయ ఛందస్సుకు మధ్య ఉండే సామ్య భేదాలను చూపడము. అందువల్ల నేను మన్నాడే పాడిన ఒక పాటను ఎన్నుకొని దానిని గురించిన వివరాలను అందులోని ఛందస్సును గురించి చర్చిస్తాను.

నేను ఎన్నుకొన్న చిత్రపు పాట బిమల్ రాయ్ నిర్మించిన కాబూలివాలా చిత్రమునుండి.  దీనికి దర్శకుడు హేమేన్ గుప్తా, సంగీత దర్శకుడు నాకెంతో ప్రీతిపాత్రమైన సలిల్ చౌదరి, గీత రచయితలు ప్రేం ధావన్, గుల్జార్. చిత్రములో ఉషా కిరణ్, బల్‌రాజ్ సహానీ, సోను నటించారు. నేను 1956లో SSLC (11th standard) చదివేటప్పుడు మాకు ఆంగ్లములో రవీంద్రనాథ్ టాగూరు వ్రాసిన కాబూలివాలా కథ పఠనీయాంశాలలో ఒకటి. ఈ తరము వాళ్లు ఎందరు చదివారో తెలియదీ కథను?

టాగూరు బెంగాలీలో వ్రాసిన కథను ఆంగ్లములో టాగూరు అనువాదములో ఇక్కడ  చదువవచ్చును.

http://www.angelfire.com/ny4/rubel/kabuliwala.html ),

మహమ్మద్ ఖయూం అనువాదములో ఇక్కడ

( http://dspace.flinders.edu.au/xmlui/bitstream/handle/2328/3401/Kabuliwala.pdf;jsessionid=F64EAC4FB5EA3D37A8B99B3754D1C202?sequence=1

కాబూలు నగరమునుండి ఒక పఠాను కలకత్తాలో సరకులు అమ్ముకొని వచ్చిన లాభముతో దూరదేశములో తన కుటుంబాన్ని కాపాడుకొంటూ ఉంటాడు. ఒక రచయిత (బహుశా టాగూరే ఏమో) ఇంటిలో ఉండే మినీ అనే అతని చిన్న అమ్మాయితో స్నేహము చేస్తాడు ఈ కాబూలీవాలా.  కొన్నాళ్లకు వాళ్లిద్దరి మధ్య ఒక బంధము పెరుగుతుంది. మినీని చూచినప్పుడల్లా పఠానుకేమో తన పిల్ల జ్ఞాపకము వస్తుంది.  కాబూలివాలా తన వద్ద పుచ్చుకొన్న అప్పు నడగడానికి ఒక మనిషి దగ్గరికి వెళ్లితే అతనేమో ఇతడిని చెడామడా తిట్టిపోసాడు. కాబూలీవాలకు కోపము వచ్చి అతడిని పొడిచాడు. కోర్టులో తన తప్పును ఒప్పుకొన్నాడు, అతనికి కొన్నేళ్ల శిక్ష పడినది. అతడిని పోలీసులు తీసికొని వెళ్లేటప్పుడు మినీ చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగగా, నేను అత్తారింటికి వెళ్తున్నానన్నాడు కాబూలీవాలా, అత్తారిల్లంటే కారాగారము అనే అర్థములో. సంవత్సరాలయ్యాయి. ఒక నాడు జైలునుండి విడుదలైన కాబూలీవాలా మినీ ఇంటికి మినీని చూడడానికి వస్తాడు.  మినీ ఇప్పుడు పెరిగి పెద్దదయినది, ఆ రోజు ఆమె పెళ్లి రోజు కూడ. కానీ కాబూలివాలా ఊహలో మినీ ఇంకా పసిపాపయే. “నీవు అత్తారింటికి వెళ్తున్నావా అమ్మా” అని మినీని అడుగుతాడు కాబూలీవాలా. ఉన్నట్లుండి ఎదిగిన మినీని చూడగానే తన కూతురు జ్ఞాపకానికి వస్తుంది అతనికి. తన ఆ చిన్న పిల్ల చేయి ముద్ర ఉండే ఒక కాగితాన్ని చూపిస్తాడు మినీ తండ్రికి.  మినీ తండ్రి తాను అన్ని సౌకర్యములున్న ఒక మధ్యతరగతి కుటుంబీకుడని, అతడు ఒక పేద కాబూలీవాలా అని ఆ క్షణములో మరచిపోతాడు.  ఇద్దరూ తమ కూతుళ్లను ప్రేమించే తండ్రులే కదా అనుకొంటాడు. అతడు పెళ్లిలోని కొన్ని దుబారా ఖర్చులను ఆపి, కొంత పైకాన్ని కాబూలివాలకు ఇచ్చి “నీవు నీ దేశానికి వెళ్లి నీ కూతురితో సుఖంగా ఉండు” అంటాడు. ఇదీ కథాసారాంశము.

ఒక విధముగా ఇది ఇరవైయవ శతాబ్దపు పూర్వభాగములో వ్రాయబడినను, ఇందులోని సంఘటనలు ఈ కాలానికి కూడ వర్తిస్తాయి.  ఆఫ్‌ఘనీస్తానుకు బదులు భారతదేశము, కాబూలీవాలాకు బదులు ఒక కంప్యూటరు టెక్కీ, కలకత్తాకు బదులు సిలికన్ వ్యాలీ. కానీ ఇప్పుడు ఛాయాచిత్రాలు, శ్రవణ యంత్రాలు, స్కైపులు ఉన్నాయి కొద్దిగానైనా బాధ తగ్గించుకొనడానికి.  కాని ఆ కాలములో కాబూలీవాలకు ఇవేమీ లేవు, ఒక్క మాసిపోయిన హస్తముద్ర తప్ప.

దూరదేశములో ఉంటే ఉన్న ఊరు, మన్న ప్రజలు జ్ఞాపకము రావడము సర్వసాధారణమే.  ఇప్పుడు కూడ, నేనున్న ఊరులను, అక్కడి నదులు, గుడులు, గోపురాలు మున్నగువాటిని తలచుకొంటునే ఉంటాను. వాటిపై పాటలను కూడ అప్పుడప్పుడు వ్రాస్తూ ఉంటాను. అలాగే కాబూలీవాలా తన దేశాన్ని గురించి ఊహాగానము చేయడములో ఆశ్చర్యమేమున్నది? చలన చిత్రములో కాబూలీవాలా తన మాతృదేశమును, పుట్టిన గడ్డను తలచుకొంటూ “ఐ మేరే ప్యారే వతన్” అని పాడుతాడు.  ఈ పాట రచయిత ప్రేం ధావన్, గాయకుడు మన్నా డే. మన్నాడే పాడిన పాటలలో అత్యుత్తమమైన మాణిక్యాలలో ఇది తప్పక ఒకటి. ఎంతో ప్రేమతో, గొప్ప అనుభూతితో మన్నా డే పాడిన ఈ పాటకు హృదయాలను పిండివేసే శక్తి ఉన్నది. క్రింద పాటను, దానికి అదే మెట్టులో నా తెలుగుసేతను చదవండి. హిందీలో, ఉర్దూలో హ్రస్వ ఎ-కారము, ఒ-కారము లేకున్నా కూడ పాటలలో దీర్ఘానికి బదులు హ్రస్వమును ఉపయోగించుట సామాన్యము.  పాటను మన్నా డే ఎలా పాడినారో, అలాగే నేను క్రింద వ్రాసాను.

 

ఐ మెరే ప్యారే వతన్, ఐ మెరే బిఛడే చమన్

తుఝ్ పె దిల్ కురబాన్ తూ హీ మెరీ ఆరజూ

తూ హీ మేరీ ఆబరూ తూ హీ మేరీ జాన్ …

 

తేరె దామన్ సే జొ ఆఏ ఉన్ హవాఓఁ కో సలాం

చూం లూఁ మైఁ ఉస్ జుబాఁ కొ జిసపె ఆఏ తేర నాం

సబసె ప్యారీ సుబా తేరీ సబసె రంగీ తెరీ శాం

తుఝ్ పె దిల్ కురబాన్ …

 

మాఁ కా దిల్ బనకే కభీ సీనె సె లగ్ జాతా హై తూ

ఔర్ కభీ నన్హీ సి బేటీ బన్ కె యాదాతా హై తూ

జితనా యాద్ ఆతా హై ముఝకొ ఉతనా తడపాతా హై తూ

తుఝ్ పె దిల్ కురబాన్ …

 

ఛోడ్ కర్ తేరీ జమీఁ కో దూర్ ఆ పహుఁచే హైఁ హం

ఫిర్ భీ హై యే హీ తమన్నా తేరె జర్రోఁ కీ కసం

హం జహాఁ పైదా హుఏ ఉస్ జగహ్ పే హీ నికలె దం

తుఝ్ పె దిల్ కురబాన్ …

 

నాకు ప్రియమగు దేశమా, నేను వదలిన స్వర్గమా

నీవె నా హృదయం

నీవె నాలో ఆశలు

నీవె నాకొక గర్వము

నీవె నాలో జీవము

 

నీదు లోయల లోన వీచు ఆ గాలి కిత్తును వందనం

నీదు పేరిని బల్కు ఆ నోటి కిచ్చెద ముద్దులు

నీ ఉషస్సుల సొబగు రమ్యం సంధ్య రంగులు విచిత్రం

నీవె నా హృదయం

 

కొన్ని వేళల తల్లిగా నన్ను వదలక నుందువు

కొన్ని వేళల నిన్ను నే కూతురనుకొనుచుందును

ఎంత జ్ఞప్తికి వత్తువో అంత హృది బాధించుగా

నీవె నా హృదయం

 

నీదు భూమిని వదలి నేనీ దూర దేశము చేరినా

కాని నాయణు వణువులోన కలదు మాయని కోరిక

నాకు ఆఖరి శ్వాసయౌనా నేను పుట్టిన చోటులో

నీవె నా హృదయం

 

నేను గడచిన నెల మాలిక పత్రికలో రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ అమరికనుగురించి చర్చించినాను.  ఆ లయతో ఉండే తెలుగు ఛందస్సు మత్తకోకిల వృత్తము అని కూడ తెలిపినాను.  మన్నాడే పాడిన ఐ మెరే ప్యారే వతన్ పాట ఛందస్సుకు కూడ పైన చెప్పిన ఛందస్సుతో పోలికలు ఉన్నవి. కొన్ని చోటులలో అదే లయ ఉన్నది, మరి కొన్ని చోటులలో ఒక రెండు మాత్రలు తగ్గించగా వచ్చిన లయ ఉన్నది. ఇది ఏ విధముగా సాధ్యము అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియ బరుస్తాను. మత్తకోకిల గురులఘువులు – UI UII UI UII UI UII UIU. ఇందులో మొదటి ఎనిమిది అక్షరముల గురులఘువుల అమరికవలెనే చివరి ఎనిమిది అక్షరముల గురులఘువులు కూడ.  క్రింది విధముగా వ్రాస్తే ఇది విశదమవుతుంది –

UI UII UIU II

UI UII UIU.

 

మధ్య ఉండే రెండు లఘువులు మొదటి భాగానికి చివరి భాగానికి ఒక వంతెనలా ఉన్నది.  మన్నా డే పాడిన పాట పల్లవిలో ఈ వంతెన లేదు.  దానికి బదులు ఒక విరామము (pause) ఉన్నది. అంటే ఈ పాట రమన్ ముసమ్మన్ మహ్జూఫుకు ఒక చిన్న మార్పు అన్న మాట.  కాని కొన్ని చరణాలలో ఈ వంతెన ఉన్నది. అందువలన ఈ పాట పై ఛందస్సులో చిన్న చిన్న మార్పులతో రచించబడిన పాట అని చెప్పవచ్చును.  ఇప్పుడు పాటను విని అదే సమయములో తెలుగులో కూడ  పాడుకొని ఆనందించండి.

 

1 thought on “ఐ మెరే ప్యారే వతన్ – పారసీక ఛందస్సు – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *