January 29, 2023

“విక్రమార్జున విజయం” – చారిత్రక సాహిత్య కథలు – 7

రచన: మంథా భానుమతి       bhanumathi

 

“భారతమా!”

కొలువులో ఆసీనులయిన విద్వాంసులు కనుబొమ్మలు పైకి లేపి, కించిత్ సందేహంగా మహారాజుని చూశారు.

ఆదిపురాణ కావ్యకర్త పంపనార్య్డుడు క్రీగంట అందరినీ పరికించాడు.

మహరాజు మాత్రం చిరునవ్వును చెక్కు చెదరనియ్యక పంపన్ననే చూస్తున్నారు.

గంధేభ విద్యాధర, ఆరూఢసర్వజ్ఞ, ఉదాత్త నారాయణ ఇమ్మడి అరికేసరి సభ అది. వేములవాడ చాళుక్య రాజులలో బహు ప్రసిద్ధి పొందినవాడు అరికేసరి. రాష్ట్రకూటులకు సామంతుడుగా ఉన్నా, స్వతంత్రంగా తన రాజ్యంలోని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినవాడు.

రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మహారాజు సాహిత్య ప్రియుడు.

ఇమ్మడి అరికేసరి మహా యోధుడు. అనేక యుద్ధాలలో పాల్గొని చక్రవర్తి విజయాలకు కారకుడయ్యాడు. చక్రవర్తి దగ్గరి బంధువు కూడ. తన ఆస్థానంలోని కవులందరినీ ఆదరించి ప్రోత్సహించినవాడు.

పంపకవి నిమేషన్మాత్రమే ఆలోచించాడు. తన ప్రతిభని గుర్తించి, సభలోనున్న కవులందరిలోను తనకి ప్రాముఖ్యతనిచ్చి వ్యాస భారతమును కన్నడ భాషలో పదుగురికీ బోధపడేలా వ్రాయమని మహారాజు అడుగుట తనకి అత్యధిక గౌరవమిచ్చినట్లుగా భావించాడు.

రాజుగారి సముచిత వాంఛని విన్న వెనువెంటనే తన అంగీకారమును తెలిపాడు.

“కవి వ్యాసుడికి సమానుడననే గర్వం నాకు లేదు. అయితే తమరి ఆజ్ఞ అయిన పిదప ఆలోచనకే మాత్రం తావు లేదు. వ్యాసమునీంద్రుని వచనామృత వార్ధిని ఈదుతాను. గుణార్ణవుని సాధు స్వభావం నన్నుకట్టి పడేసింది. నా మనో మందిరంలో ఆ ప్రసన్నవదనారవిందుడిని ప్రతిష్ఠించి ఈ కావ్యాన్ని చెపుతాను. అర్ధపూరితమైన ఈ వాక్యాలతోనే నా కావ్యాన్ని ఆరంభిస్తాను. ఇటువంటి ప్రదర్శన ఎవరికీ అభ్యంతరకరము కాదని ఆశిస్తాను.”

“మహా భారతం పంచమవేదం. కథా వస్తువు బహు క్లిష్టమయినది. ఇంత వరకు భారత కథను స్పష్టంగా, వివరంగా కన్నడ భాషలో చెప్పినవారు లేరు. కథ, కథనం దెబ్బ తినకుండా, వర్ణనలు జోడిస్తూ చెప్పగల వారు పంపనగారే నని అందరం ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం.”

అచ్చట నున్న కవి పండితులందరూ తమ సంతోషాన్ని హర్షధ్వానాలతో తెలియజేశారు.

“మీరందరూ సెలవిస్తున్నందున నేను భారత కథను చెప్పడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. పూర్వకవులు ప్రాచీన రాజుల గుణాలు తమ కావ్య నాయకులలో ఉన్నాయని చెప్తారు. మన ప్రభువు అరికేసరి పూర్వ రాజుల సద్గుణాలన్నీ కలిగియున్నవాడు. అందువలన, మహాభారత కథలో గుణార్ణవుని కథను చేర్చి అర్జనునితో అరికేసరిని పోల్చబోతున్నాను.” స్పష్టంగా చెప్పాడు పంపన.

సభలో చెప్పినట్లుగానే పదహారువందల ఏడు పద్యాలతో, ఒక్క వత్సరం లోపుగా మహాభారత రచన పూర్తి చేశాడు ఆదికవి పంపన.

పంపనగారు వ్రాసిన భారతం “పంప భారతం”గా ప్రఖ్యాతి చెందింది.

పంప భారతంలో ద్రౌపది ఒక్క అర్జనుడినే వివాహం చేసుకుంటుంది. మహా భారత యుద్ధం అయ్యాక, అర్జనుడికి పట్టాభిషేకం జరుగుతుంది. సుభద్ర పట్టపురాణి అవుతుంది. ఒక దశలో అర్జనుడికి అరికేసరి అని బిరుదుకూడా ఇచ్చారు పంపనగారు.

వ్యాస భారతంలో ప్రత్యేకించి కథానాయకుడు లేడు. కృష్ణుడికి అత్యధిక ప్రాముఖ్యత నిచ్చారు వ్యాసమహర్షి.

పంపనగారు కృష్ణ పాత్ర కంటే కిరీటికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఎన్నో సాహస కార్యాలు చేసిన భీముడినీ, ఎన్నో కష్టాలు పడిన ద్రౌపదినీ రెండవ స్థానానికి తీసుకుని వెళ్ళారు.

పంపనగారి భారతంలోని పాత్రలు సంస్కృత భారత పాత్రలకి ప్రతిరూపాలు కావు. అవి వారి హృదయాన్ని బహిర్గత పరచే కవాటాలు.

తన భారతానికి “విక్రమార్జున విజయము” అని పేరు పెట్టారు.

విక్రమార్జున విజయాన్ని అంకితమిచ్చినందుకుగాను అరికేసరి సబ్బినాడు నడుమను ఉన్న ధర్మపురిని పంపనగారికి అగ్రహారంగా ఇచ్చారు. శాసనంగా వ్రాయించారు. ఊరికి ఉత్తరాన ఉన్న వృష్భాద్రిపై ఈ శాసనాన్ని చెక్కారు.

భీమనప్పయ్య వంగిపర్రులోని తాతలనాటి అగ్రహారాన్ని వదులుకుని సబ్బినాడుకు వలస వచ్చినా, ప్రయోజకుడైన పెద్ద కొడుకు పంపన, రాజాశ్రయము పొంది సబ్బినాడులోని ఒక గ్రామానికి అధికారి అయ్యాడు. పుత్రోత్సాహమునకు అంతకు మించిన కారణమేముండ గలదు!

అన్నగారి కావ్యరచనకు, వారికి ఇచ్చిన బిరుదునకు, బహుమతిగా చేకొన్న అగ్రహారానికి తమ్ముడు జిన వల్లభుడు బహు సంతుష్టుడైనాడు.. తమ వంశమును తరతరాలుగా అగ్ర పీఠాన్ని అధిష్టింపజేసిన అగ్రజునకు అతి విలువైన కానుకనివ్వదలచాడు.

అనుజుని కానుక అపూర్వమైనది. విలువ కట్టలేనిది. వెయ్యి సంవత్సరముల తరువాత కూడా ఆ కానుక ద్వారా అన్నగారి వైశిష్ట్యము, తమ వంశ ప్రాముఖ్యము ప్రపంచానికి తెలిసేట్లు చేశాడు.

ధర్మపురి పొలిమేరలో నున్న వృషభాద్రి పై ఒక శాసనాన్ని.. పంపనార్యుని పుట్టుకను, అరికేసరితో అతని అనుబంధాన్ని, తమ వంశ చరిత్రను తెలిపే పద్యాలను తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో చెక్కించాడు.

“త్రిభువన తిలక” అనే పేరుతో ఒక వసతి గృహాన్ని, “మదన విలాస” అను ఒక ఉద్యానవనాన్ని నిర్మించాడు. వృషభాద్రి క్రింద ఒక చెరువును తవ్వించి దానికి “కవితా గుణార్ణవ” అని పేరు పెట్టి, అన్నగారి బిరుదు చిరస్థాయిగా నిలిచేట్లు చేశాడు.

చక్రేశ్వరి దేవిదీ, ఇతర జైన దేవతలవీ విగ్రహాలను చెక్కించి, చక్రేశ్వరి శిల్పం కింద తను చేసిన పనులను చెక్కించాడు.

అన్నగారి కీర్తి అజరామరంగా నిలిచేటట్లు చేశాడు.

ఆదికవి పంపన వార్ధక్యంలో సన్యసించారు.

ఇందూరు సీమలో, బోధన్ వద్ద నున్న పంపన సమాధి, పంపన జనన మరణాలు తెలుగు గడ్డ మీద జరిగాయని సూచిస్తోంది. తెలుగు బిడ్డడయిన పద్మప్ప, పంపనార్యుడిగా కన్నడ సీమలో గౌరవాన్నందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం.

2

వృషభాద్రిపై, జిన వల్లభుడు చెక్కించిన (ధర్మపురి వద్ద) చక్రేశ్వరి, ఇతర జైన దేవతల శిల్పాలు. శాసనము, పద్యాలు.

 

1

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *