April 16, 2024

సంభవం – 6

 

suryadevara

రచన: సూర్యదేవర రామ్మోహనరావు

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/

 

 

 

తిరుపతి నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకి వెళ్ళే రోడ్డుమీద ఒక బ్లాక్ కలర్ అంబాసిడర్ కారు నలభై మైళ్ళ వేగంతో వెళుతోంది.

అప్పటికే తనకొచ్చిన డ్రీమ్ గురించి రెండోసారి వివరిస్తుంది దిశ.

“ఎర్రకోట దగ్గర జనంలో కూర్చున్న వ్యక్తి లేచి, వేదికమీద కూర్చున్న వ్యక్తిని షూట్ చేశాడా?”

“ఎస్ డాక్టర్…!”

“హౌ కెన్ ఇట్ బి పాజిబుల్ దిశా! అంత టైట్ సెక్యూరిటీ మధ్య ఆ పొలిటికల్ పర్సనాలిటీని చంపడం సాధ్యమవుతుందంటావా?”

“లక్షలాది జనప్రవాహాంలో మనం దేశభక్తుల్నీ గుర్తించలేం… అలాగే మర్డర్స్‌నీ గుర్తించలేం” అంది దిశ.

“ఇంతకీ ఆ పొలిటికల్ పర్సనాలిటీ ఎవరంటావ్?”

“అలాంటి హ్యూజ్ మీటింగ్స్‌ని ఎడ్రస్ చేసే వ్యక్తులు, దేశ ప్రధాని కావచ్చు లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు.”

“ప్రతిపక్ష నాయకుడ్ని చంపడం వల్ల పార్టీవారికి తప్ప ఎవరికీ ఉపయోగం వుండదు. బహుశా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు కదా?” సవ్యసాచి అన్నాడు.

“ఎస్! డాక్టర్ నేనూ అదే అనుకుంటున్నాను.”

కారు రేణిగుంట గ్రామం దాటి, చెక్‌పోస్ట్ దగ్గర మలుపు తిరుగుతోంది.

సరిగ్గా ఆ సమయంలో దిశ నోటి వెంబడి వచ్చిన మాటకు ఆశ్చర్యంగా ఆమెవైపు చూశాడు డా!!సవ్యసాచి.

“ప్రైమ్ మినిస్టర్‌ని ఆ మర్డర్ ఎటెమ్ట్ నుంచి మనం రక్షించలేమా డాక్టర్?”

అతను గట్టిగా నవ్వాడు. అతనలా ఎప్పుడూ నవ్వలేదు. ఆ నవ్వును చూసి విస్తుపోయింది దిశ.

“ఏం డాక్టర్! అలా నవ్వుతున్నారు?”

“ప్రధాని విషయంలో అలాంటి మర్డర్ ఎటెమ్ట్ జరిగితే ఆయన పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ వున్నారు. స్పెషల్ కమెండోలున్నారు. మనమే అయన్ని రక్షించాల్సిన అవసరం లేదు. అది మనకు సాధ్యం కూడా కాదు”.

ఆ మాటకు దిశకు కొపం వచ్చింది.

“జాన్ కెనడీనిగాని, లాల్ బహదూర్‌శాస్త్రినిగాని, మహాత్మాగాంధీని కాని, ఇందిరాగాంధీనికాని, రాజీవ్‌గాంధీని కాని ఆఖరకు మన రాష్ట్రంలో జరిగిన ఓ ఎక్స్ మినిస్టర్‌గాని, ఆ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్‌గాని, కమెండోలు గాని, ఎందుకు సేవ్ చెయ్యలేకపోయారు డాక్టర్?” అడిగింది దిశ.

“ఎందుకు! నువ్వే చెప్పు?” అన్నాడు సవ్యసాచి.

“తెలీదు గాబట్టి… వాళ్ళు ఆ విషయాన్ని ఊహించలేరు కాబట్టి.”

“నీ పాయింట్ నాకు అర్థమైంది దిశా! కానీ నువ్వెలా ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ స్టాఫ్‌ని ఎలర్ట్ చేయగలవు? చేసినా నిన్నెలా వాళ్ళు నమ్ముతారు?”

“నాకొచ్చిన డ్రీమ్ గురించి చెప్తాను.”

“నిన్నో పిచ్చిదాని కింద జమ కడతారు.”

“డాక్టర్! యూ ఆర్ ఇన్‌సల్టింగ్ మీ…”

“నో దిశా! సిన్సియర్లీ నాట్…” దిశ మాటలమీద అతనికి నమ్మకం వున్నా ఈ కేసుని ఎలా డీల్ చెయ్యాలో అర్థంకావడం లేదు.

కారు ఎయిర్‌పోర్టులో ఆగింది దిగి ఇద్దరూ లోనికి నడుస్తున్న సమయంలో దిశ అంది…

“డాక్టర్! ఈ డ్రీమ్ విషయంలో మీరు నమ్మలేకపోతున్నారు కదూ?” అడిగింది దిశ.

నిజమే!

డా!! సవ్యసాచి మనసు మూలల్లో ఎక్కడో అనుమానం… అందుకే దిశకు ఏమీ బదులు చెప్పలేకపోయాడతను.

అప్పటికే రేణిగుంట నుంచి మద్రాసు మీదుగా హైద్రాబాద్ వెళ్ళడానికి ముప్పై నిమిషాల సమయం మాత్రమే వుంది.

*                            *                                  *

సికింద్రాబాద్‌లోని ఆ గవర్నమెంట్ హస్పిటల్, మిగతా గవర్నమెంటు హాస్పిటల్స్‌లాగే అల్లకల్లోలంగా వుంది.

ప్రవేటు వ్యక్తుల బిజినెస్సుకు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఓక హెడ్ ఆఫీసు…

అక్కడ మెడిసిన్స్ దగ్గర్నించి, శవాల మాయం వరకూ ఏదైనా జరగడానికి ఆస్కారం.

మెట్లెక్కి రిసెప్షనిస్ట్ వైపు నడిచాడు డా!!సవ్యసాచి. తెల్లటి కుర్తా పైజమా, నుదుటున బొట్టు, మెడలో రుద్రాక్షలు, తనవైపే వస్తున్న ఆ వ్యక్తి అందంవైపు నిశితంగా చూసింది ఆ రిసెప్షనిస్ట్.

“చెప్పండి….” తన సమీపంలోకొచ్చిన సవ్యసాచిని అడిగిందామె ఆసక్తిగా.

“దివ్యానందస్వామిగారు…” ఆ పేరు వినగానే ఆమె ముఖం చిట్లించింది.

“మీరు కూడా ఆయన కోసమే వచ్చారా? ఒక వ్యక్తి కోసం ఇంతమంది ఎంక్వయిరీ చేయడం.. టూ హారిబుల్… ఆన్సరు యివ్వలేక చచ్చిపోతున్నాను. మనుషులకు తోడు.. కంచినుంచి, కాశీనుంచి ఫోన్లొకటి?” విస్సుక్కుందామె.

“ఇంతకీ ఆయన ఏ బెడ్‌మీద వున్నారు?”

‘మీకు తెలీదా…?”

“ఏమిటి…?”

“అరగంట క్రితం ఆయన చనిపోయారు. మీరు డా!!అంజయ్యని కలవండి” చెప్పి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుందామె.

డా!! అంజయ్య!

మూదు నిమిషాల తర్వాత డా!! అంజయ్య చాంబర్లో వున్నాడు డా!! సవ్యసాచి.

“స్వామిగారు చాలా పుణ్యాత్ముడు! ఆయనకు రాష్ట్రం నిండా అపారమైన శిష్యగణం వున్నారు. ప్రస్తుతం ఆయన శవాన్ని ఎవరికి అప్పగించాలో నాకు అర్థం కావడం లేదు. ఒకపక్క దేవాలయ ట్రస్ట్ సభ్యులు ఆ శవానికి తమ ఆధ్వర్యంలో దహన విధులు నిర్వహిస్తామంటున్నారు. మరోపక్క తమ గురువుగారి శవాన్ని తమకే యివ్వమని వారి శిష్యగణం అడుగుతున్నారు. కానీ ఆయన మనవడు అమెరికాలో వున్నాడుట. అతని గురించే మేం ఆలోచిస్తున్నాం. అతనొచ్చి మా తాత శవాన్ని వాళ్ళకెందుకిచ్చారని గొడవ పడితే…”

డా!అంజయ్య తనకు తెలియకుండానే అతనికి ఒక క్లూ యిచ్చాడు.

దాంతొ అతని బ్రెయిన్ ఎలర్టయిపోయింది.

“అందుకే మిమ్మల్ని కలవడానికొచ్చాను డాక్టర్!”

“అంటే…?”

“దివ్యానందస్వామిగారు మా తాతగారు…”

ఆ మాటకు చాలా రిలాక్స్‌డ్‌గా ఫీలయ్యాడు డాక్టర్.

“ప్రాబ్లం సాల్వ్ చేశారండి బాబూ! శవాన్ని మీరెప్పుడు తీసికెళతారు? శవాన్ని ఎక్కడ దహనం చేస్తారు?”

“మా వూళ్ళో….” టక్కున జవాబు చెప్పాడు సవ్యసాచి. ఆ వూరు ఏ వూరని అడిగితే అతను యిబ్బంది పడేవాడే కానీ డాక్టరు ఆ ప్రశ్న వెయ్యలేదు.

  “రాత్రి ఏడుగంటలకొస్తాను” లేచి నిలబడ్డాడు సవ్యసాచి.

“ఆ టైమ్‌లో నేనుండను. మీకోసం గేట్ పాస్ సిద్ధం చేసి వుంచుతాను. రిసెప్షన్లో కలెక్ట్ చేసుకోండి. బైదిబై మీ పేరు?”

“స్వామి కుమారానంద…” తడుముకోకుండా చెప్పాడు సవ్యసాచి.

పేరుని, ప్రిస్కిప్షన్‌ని పేడ్‌మీద రాసుకున్నాడు డాక్టరు. అతని చాంబర్‌లోంచి సవ్యసాచి బయటికొస్తున్నప్పుడు కొంతమంది పురోహితులు అదే చాంబర్‌వైపు వెళ్ళడం గమనించాడతను.

ఆ హాస్పిటల్లోంచి బయటికొచ్చి కారెక్కాడు. కారు నేరుగా లకడికాపూల్ ఏరియాలోని ఒక హోటల్‌ముందు ఆగింది.

అప్పటికే అతని కోసం ఎదురుచూస్తోంది దిశ.

తన డ్రీమ్ గురించి సత్యబ్రహ్మతో మాట్లాడాలనుకుంది దిశ. కానీ సవ్యసాచి ఇన్‌స్ట్రక్షన్స్ గుర్తొచ్చాయి.

“దిశా! మనం మారుపేర్లతో హోటల్లో దిగుతాం… అందుకే మన ఆకారాల్ని కూడా ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రతలు తీసుకుందాం. హోటల్ నుంచి ఎవరికీ ఫోన్ చేయడానికి కూడా వీల్లేదు. మరీ ముఖ్యంగా సత్యబ్రహ్మకు. మన వలన ఇంకొకరు రిస్క్‌లో పడకూడదుగదా.. బీ కేర్‌వుల్.”

అందుకే సవ్యసాచి ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు దిశ పట్టుచీర, జాకెట్ వేసుకుంది. నుదుటిమీద పెద్ద బొట్టు పెట్టుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంటుండగా సవ్యసాచి రూమ్‌లోకి అడుగుపెట్టాడు.

*                            *                                  *

సరిగ్గా రాత్రి ఏడుగంటలు…

ఇద్దరు వ్యక్తులు మార్చురీలోంచి దివ్యానందస్వామి శవాన్ని తెచ్చి కారు బ్యాక్ సీట్లో పెట్టారు.

ఆ ఇద్దరు వ్యక్తుల చేతుల్లో చెరో వంద రూపాయల నోటు పెట్టాడు సవ్యసాచి. కారులో ముందు సీట్లో డ్రయివర్ పక్కన కూర్చున్నాడు సవ్యసాచి. అతని పక్కన దిశ కూర్చుంది.

కారు హాస్పిటల్ పోర్టికోలో నుంచి రెండు నిమిషాల తర్వాత బయలుదేరింది.

సరిగా రెండు గంటల తర్వాత….

దివ్యానందస్వామి శవం విషయంలో ఆ హాస్పిటల్లో గందరగోళం చెలరేగింది.

పనుల వత్తిడి వలన తను ఇండియా రాలేకపోతున్నానని తాతగారి శవాన్ని దహనం చేసేందుకు దేవాలయ ట్రస్ట్ సభులకు పూర్తి అధికారాలు అప్పగిస్తున్నానని అమెరికా నుంచి దివ్యానందస్వామి అసలయిన మనవడు కుమార్ శ్రీరాజ్ పంపిన టెలెక్స్ మెసేజ్‌ను, అది తెచ్చిన ట్రస్ట్ సభ్యుడు వైపు చూస్తూ నిరుత్తరుడయాడు డాక్టర్ యాదగిరి.

“కుమారనందస్వామి అని ఆయన మనవడు…” ఏదో చెప్పబోయాడు యాదగిరి.

అక్కడ రాఘవేంద్రాచార్య్తులతో పాటు పాతికమంది జనం వున్నారు.

బాధ్యతారహితంగా, ఎవరో అనామకుడిగా దివ్యానందస్వామి శవాన్ని అప్పగించిన విషయంలో డాక్టర్‌కూ, వారికీ మధ్య గొడవ జరిగింది. కోపోద్రేకంతో యాదగిరిని వాళ్ళు కొట్టారు. కాసెపట్లో…

హాస్పిటల్ రణరంగంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేశారు.

కేసునంతా విన్న తర్వాత సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అబ్దుల్ గవూర్ తనలో తను ఒక ప్రశ్న వేసుకున్నాడు.

“శవాన్ని ఎవరు ఇంత ప్లాన్డ్‌గా తీసుకెళ్ళారు? ఎందుకు? దివ్యానంద స్వామి శవమే వారికెందుకు కావల్సి వచ్చింది?”

వైర్‌లెస్ సెట్ల్స్‌లో, సిటీ అవుట్ స్కర్ట్స్‌లోని పోలీస్‌స్టేషన్స్‌కి ఇన్‌ఫామ్ చేశాడతను సిటీ నుంచి బయటికెళ్ళే కార్లను చెక్ చేయమని.

కానీ…

అప్పటికే…

సవ్యసాచి ఎక్కిన అద్దెకారు విజయవాడ సమీపంలో వుంది.. ముందు జాగ్రత్తగా ఆ కారును మార్చాడు సవ్యసాచి.

అయినా అతనిలోంచి భయం ఇంకా పూర్తిగా పోలేదు.

*                            *                                  *

సవ్యసాచి తన ఎదురుగా కూర్చున్న డాక్టర్స్‌ను ఉద్దేశించి చెప్పడము ప్రారంభించాడు.

“దేవుడున్నాడా, లేడా అనే సమస్యను గురించి మతస్తులకంటే, మతతత్త్వ శాస్త్రజ్ఞులు ఎక్కువ కృషి చేసారు. మతతత్వ శాస్త్రజ్ఞులు దేవుడు వున్నాడని రుజువులు చేయడానికి వివిధ సిద్ధాంతాల ద్వారా ప్రయత్నించారు. అందులో మొదటిది విశ్వశాస్త్ర సిద్దాంతం. దానిని COSMOLOGICAL ARGUMENT అంటారు. రెండవది కేవలం సత్తా సిద్ధాంతము. దానిని ONTO LOGICAL ARGUMENT అంటారు. మూడవది అత్యవసర సత్తా సిద్ధాంతం. దానిని IDEA OF NECESSARY BEING అంటారు. నాలుగవది నమూనా సిద్ధాంతం. దానిని IDEA OF DESIGN అంటారు. తర్వాతది అంతిమ లక్ష్య సిద్ధాంతం. దానిని TELEOLOGICAL ARGUMENT అంటారు. ఆరవది కదలిక భావ సిద్ధాంతం. దానిని ARGUMENT FROM MOTION అంటారు.

మానవునికన్నా భిన్నమయిన ఒక సృష్టికర్త ఒకడున్నాడని, అతడే మనిషిని సృష్టిస్తున్నాడని మనిషిలో ప్రాణాన్ని పంపుతున్నాడని, మతతత్త్వ వాదులు నమ్ముతారు.

మనిషిని, ప్రకృతిని సృష్టించింది భగవంతుడే గనుక ఈశ్వరాజ్ఞ లేనిదే చీమ చిటుక్కుమనదనే నమ్మకం మనకుంది గనుక, మనిషి సృష్టించిన…  సృష్టిస్తున్న సైన్స్ కూడా భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే జరుగబోతున్నది. సైన్స్ కూడా భగవంతుడి సృష్టేనని కూడా ఒక వాదముంది. దాని ప్రకారమయితే మనచేత ఈ ప్రయోగాలు చేయిస్తున్నది. మనల్ని సృష్టించిన ఆ భగవంతుడే.

ఏది ఏమయినా దివ్యానందస్వామి శవం మాయం కావడం పై ఆధ్యాత్మిక వాదులు కొంత గొడవ చేస్తారు… ఎందుకంటే దివ్యానందస్వామి ఆ వర్గాల్లో పేరుపొందిన వ్యక్తి కనుక ఆ ఆధ్యాత్మిక వర్గం మత విశ్వాసాలు రక్షించడానికి నియమింపబడినవారు కనుక-” అతను చెపుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా వింటున్నారు అక్కడి సైంటిస్టులు. మరీ ముఖ్యంగా డాక్టర్ విజేత.

ఆమె మనసెందుకో ప్రమాదాన్ని శంకిస్తోంది.

దివ్యానందస్వామి శవం మాయం పెద్ద గొడవకు దారితీస్తే ప్రభుత్వం, పోలీసులు తమ గురించి ఆచూకీ మొదలెడితే? తమ ప్రయోగాలకు అంతరాయం ఏర్పడితే? ఇన్నాళ్ళ శ్రమ వృధా అయిపోతుంది.

ఆమె పక్కన కూర్చున్న దిశ మాత్రం సవ్యసాచి ఉపన్యాసాన్ని వినడం లేదు. ఆమె తనకొచ్చిన కలను విశ్లేషిస్తోంది. గంటలు గడుస్తున్న కొలదీ ఆమె నరాల్లో తెలియని ప్రకంపనం.

ఈ దేశానికి ఏదో ఆపద వాటిల్లబోతోంది. ఆ విషయం తనకు సృష్టంగా తెల్సినా కూడా తను ఏం చేయలేకపోతోంది.

ఏదయినా చేయాలి.. చేయాలి.. ఆమె శరీరం ఆ కాన్ఫరెన్స్ హాల్లో వున్నా, మనసు మాత్రం ఎర్రకోట చుట్టూ పరిభ్రమిస్తోంది. సరిగ్గా సరిగ్గా అదే సమయంలో ఆమెకు సత్యబ్రహ్మ గుర్తుకొచ్చాడు.

ఆయనకు ఫోన్‌చేసి విషయం చెప్తే… ఆ ఆలొచన రావడంతోటే మరొక్క క్షణం ఆమె అక్కడ వుండలేకపోయింది. గబగబా లేచి కాన్ఫరెన్స్ హాల్లోంచి బయటికొచ్చి రిసెప్షన్‌లోకి నడిచింది.

ఫోన్ రిసీవర్ని అందుకుని హైద్రాబాద్‌లోని సత్యబ్రహ్మకు ఫోన్ చేసింది.

కాన్ఫరెన్సె హాల్లోంచి బయటకు వెళుతున్న దిశవైపు సాలోచనగా ఒకసారి చూసి సవ్యసాచి తన వుపన్యాసాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు.

“సో మైడియర్ ఫ్రెండ్స్! దివ్యానందస్వామిని మనం బ్రతికించడం ద్వారా మనిషి శరీరంలోని ప్రాణం ఒక ద్రవరాశి కాదని, అనేకానేక జీవకణాల కదలికని ఆ కలయికలోంచి పుట్టేదే చేతన శక్తి అని మనం ప్రపంచానికి రుజువుల ద్వారా నిరూపించగలగాలి.

ఈ దెబ్బతో ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక వాదులు వేస్తున్న ముసుగు తొలగిపోతుంది. సైన్స్‌పట్ల, మానవ మేధసుపట్ల మనిషికి నమ్మకం ఏర్పడుతుంది… ఏమంటారు?”

ఎవరూ మాట్లాడలేదు.

డాక్టర్ విజేత వైపు చూస్తూ “మనం మన ఆపరేషన్‌ని రేపటి ఉదయం నుంచి ప్రారంభిద్దాం” లేచి నిలబడ్డాడు సవ్యసాచి.

సైంటిస్టులందరూ తమ పర్సనల్ రూమ్‌లోకి నడిచారు.

డాక్టర్ సవ్యసాచి దిశ కోసం రిసెప్షన్‌లోకి వచ్చారు. అక్కడ ఫోన్ పక్కన వర్రీగా కూర్చుంది దిశ.

తను సత్యబ్రహ్మకు ఫోన్ చేస్తున్న విషయం, ఆయన నెంబర్ కలవక పోవడం గురించి చెప్పింది సవ్యసాచితో దిశ.

“ఈ విషయంలో సత్యబ్రహ్మ ఏమీ చేయలేరేమో”

“ఏం?!” ఆశ్చర్యంగా అడిగిందామె.

“ఎందుకంటే ఆయన ఇండియాలో లేరు కాబట్టి, తన పరిశోధనల గురించి మూడు నెలలపాటు ఆస్ట్రేలియాలో పర్యటించడానికి వెళ్ళారు కాబట్టి.”

ఆ విషయం సవ్యసాచికి ఎలా తెలుసో అర్థంకాక షాకింగ్‌గా అతనివైపు చూస్తూ వుండిపోయింది దిశ.

మరో పదినిమిషాల తర్వాత చాంబర్లో ఎదురుగా కూర్చున్న సవ్యసాచి వైపు చూసి…

“సార్! మీరు నా డ్రీమ్‌ని నమ్మడంలేదా? కావాలిస్తే ఇవాల్టి పేపర్ చూడండి… దేశా ప్రధాని చుట్టూ ప్రమాదకరమయిన పరిస్థితులు నెలకొన్నాయని ఈ పేపర్ రాసింది” తన ముందున్న పేపర్ని సవ్యసాచి ముందుకు తోసిందామె.

“మిస్ దిశా! నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. ఎందుకంటే- మీ బ్రెయిన్ పవర్ని నేను విశ్వసిస్తున్నాను గనుక. కానీ మనమేం చేయగలం? ఆఫ్ట్రాల్ ఉయార్ సైంటిస్ట్స్. అందులోనూ మన ప్రయోగాలన్ని రహస్యంగా మాత్రమే జరుపుకుంటున్న వ్యక్తులం.”

“లేదు డా!!సవ్యసాచీ! మనం తలచుకుంటే ఏదైనా చేయగలం. పార్టి మీటింగ్ జరగటానికి కొన్ని రోజులే సమయముంది. ఆ మీటింగ్‌కు కొన్ని లక్షలమంది ప్రజలొస్తారు. ఆ మీటింగ్‌లో దేశప్రధాని మాత్రమే ఉపన్యసిస్తారు. ఆ మీటింగ్ ఎర్రకోట ప్రాంతంలోనే జరగడానికి కేంద్ర ప్రభుత్వ పార్టీ నిర్ణయించింది. నాకు కలలో వచ్చిన విషయాల్లో యాభైశాతం కరెక్ట్. కావలిస్తే పేపరు చూడండి.”

అయిదు నిమిషాలసేపు పేపర్ వెయిట్‌ని తిప్పుతూ ఆలోచించాడు డా!!సవ్యసాచి.

సరిగ్గా అదే సమయంలో సవ్యసాచి బ్రెయిన్లో ప్లాష్‌లా ఓ ఐడియా వెలిగింది.

దిశ ఊహ నిజమైతే.. నిజమైతే… నిజమైతే… తన మెదడులోని ఆలోచనను దిశకు అతను చెప్పలేదు.

“ఓ.కే దిశా! నీకు నేను కోపరేట్ చెయ్యడానికి సిద్ధంగా వున్నాను చెప్పు ఏం చేయాలో?”

దిశ లేచి నిలబడింది.

“ప్రస్తుతానికి ఏమీ అక్కరలేదు. మళ్ళీ మిమ్మల్ని ఈవెనింగ్ కలుస్తాను” అంది దిశ గంభీరంగా.

“ఎక్కడికి వెళుతున్నావ్?” అడిగాడు సవ్యసాచి.

“తిరుపతికి”

“ఎందుకు?”

“నాకొచ్చిన డ్రీమ్‌ని డైరెక్ట్ గా ప్రధానికి తెలియచేస్తాను” గబుక్కున వెనుదిరిగింది దిశ.

రాబోట్ చర్యల్ని చూసి చిన్న పిల్లాడు ఆశ్చర్యపోయినట్టుగా అయిపోయాడు సవ్యసాచి.

కానీ…

ఆ సమయంలో అతనికి దిశ కలమీద పూర్తిగా నమ్మకం కలగలేదు.

*                            *                                  *

వేదాచార్య…

విశాలమైన ఆయన నుదుటి మీద విభూతి గీతలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి. చెవులకు కుండలాలు, చేతిలో త్రిశూలం, పులిచర్మం మీద అపర శివునిలా కూర్చున్నాడాయన.

ఆయన ఎదురుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పదిమంది గురూజీలు, స్వాములు వున్నారు.

వేదాచార్య నెమ్మదిగా పెదవి విప్పారు.

“నిజమే.. మీరన్నది నిజమే! మేమనుకున్నదీ నిజమే! ఇలాంటి ఆపద మన సమాజానికి వస్తుందని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, మన ప్రయత్నాలని అడ్డుకోలేకపోతోందని నాకు తెలుసు.”

“ప్రభుత్వాన్ని వదిలేయండి! మనమేం చేస్తున్నాం? చచ్చిపోయిన మనిషిని బ్రతికించడం అసాద్యం. కానీ… చలనం లేని జీవిలో చలనం కలిగిస్తే, ఇన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వులు ఏ మత ధర్మాలని వ్యాప్తిలోకి తెచ్చారో, ఏ ఆధ్యాత్మిక సమాజాన్ని నమ్మకం పునాదులమీద నిలబెట్టారో, ఆ నమ్మకమే ప్రజల్లో సడలపోతే, మనల్ని యూ సమాజం గుర్తించదు. మన పవిత్రతకు విలువ వుండదు. దేవాలయాలు ధర్మసత్రాలుగా మారిపోతాయి. దైవ విగ్రహాలు రాళ్ళయిపోతాయి” ఒక స్వామీజీ ఉగ్రంగా సంస్కృత భాషలో తమ ఆవేదనను వెలిబుచ్చారు.

“దివ్యానందస్వామి శవాన్ని రహస్యంగా మాయం చేసింది ఆ శాస్త్రజ్ఞులే! వాళ్ళెందుకు దివ్యానందస్వామి శవాన్నే మాయం చేశారో మనకు తెలుసు. అర్జంటుగా ఆ శవం ఎక్కడుందో మనం కనుక్కోవాలి. ఆ శాస్త్రజ్ఞుల ఉనికిని తెలుసుకోవాలి. ఈ విషయం ప్రజలకు తెలిస్తే మనం ఇంకా ఉపేక్షిస్తే, మన హిందూమతం హిందూ మహాసముద్రంలో కలిసిపోతుంది” ఇంకోక గురూజీ బెంగాలీ భాషలో అన్నారు.

మళ్ళీ వేదాచార్య పెదవి విప్పారు.

“పీఠాధిపతులారా…! కంగారు వలదు. కాగల కార్యాన్ని మనం ఎప్పుడూ గంధర్వుల చేతే చేయించాలి. ఇలాంటి ప్రమాద పరిస్థితి గురించి నేను ముందుగానే జాగ్రత్తపడ్డాను. మనుషుల్ని బ్రతికించడానికి పూనుకున్నా ఆ సంస్థ గురించి త్వరలో మనకు తెలుస్తుంది.

“మన దివ్యానందస్వామి శవం మనకు అర్జంటుగా కావాలి.”

“ఆ శవం ఎక్కడకూ పోదు. మన ధర్మపీఠాన్ని కదిలించడానికి ఏ ఒక్కరికీ దమ్ముల్లేవు. ఒక్క నిమిషం…” వేదాచార్య లేచి తన బెడ్ రూమ్‌లోకి నడిచారు.

ఫోన్ అందుకుని ఓ నెంబర్‌కి డయల్ చేశారు.

ఢిల్లీ నుంచి హర్యానాకు వెళ్ళే దారిలో ఉన్న రాజప్రాసాదవు బెడ్ రూమ్‌లో ఫోన్ మోగింది.

వీరేంద్ర అజనీష్ ఫోన్ ఎత్తాడు.

“నేను… వేదాచార్యను.”

“వేదాచార్యా! నీ నుంచి ఫోనొస్తుందని నాకు తెలుసు. దివ్యానంద స్వామి శవం మాయం వార్తని నేను పేపర్లో చదివాను.”

“ఉపేక్షిస్తే లాభంలేదు వీరెంద్రా! ఎక్కడ మాయమైందో అక్కడకు ఆ శవం అర్జంటుగా రావాలి. లేకపోతే… మా మూసిన పిడికిలి తెరుస్తాము. ఈ రాజకీయ నాయకుల అంతు చూస్తాం…” హెచ్చరించాడు వేదాచార్య.

ఫోన్లోనే మెల్లగా నవ్వాడు వీరేంద్ర అజనీష్.

“చూడు వేదాచార్యా! ఆధ్యాత్మిక గురువుల్ని కాదని ఈ రాజకీయ నాయకులు ఎక్కడకెళ్తారు చెప్పు….! డోంట్ వర్రీ! మనవాళ్ళను శాంతపరచు. అతి త్వరలో మనం పర్సనల్‌గా కలుద్దాం.  ఓ.కె…” ఫోన్ పెట్టేసి, తన ఎదురుగా కూర్చున్న శోభరాజ్ వైపు చూశాడు వీరెంద్ర అజనీష్.

“విశ్వంభరరావు పనిని ఎంత త్వరగా ముగించేస్తే అంత మంచిది. నీకు ఇంకో ఎస్సైన్‌మెంట్ అప్పగించబోతున్నాము.”

“ఏంటిది?” గంభీరంగా అడిగాడు శోభరాజ్.

“విశ్వంభరరావు చావు వార్త తెలిసిన వెంటనే చెప్తాను” కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు అజనీష్.

శోభరాజ్ ఆ బిల్డింగ్‌లోంచి బయటికొచ్చాడు.

అప్పటికి ఎర్రకోట దగ్గర ప్రధాని మీటింగ్ జరగడానికి డెబ్బై రెండు గంటల టైముంది.

తిరుపతిలోని తన రూమ్‌కి దిశ మొట్టమొదట చేసిన పని ప్రధాని విశ్వంభరరావుకి లెటరు వ్రాయడం..

తనని తాను పరిచయం చేసుకుని, తనకొచ్చిన కల, న్యూస్ పేపరులో వచ్చిన ఎర్రకోట దగ్గర పార్టీ మీటింగ్… గంటలు, నిమిషాల వారీగా ఎప్పుడు ఏ సంఘటన జరగడానికి ఆస్కారముందో స్పష్టంగా పేర్కొందామె.

*                            *                                  *

దిశ పేర్కొన్న వివరాల ప్రకారం-ఆదివారం ఉదయం సరిగా 12-34 నిమిషాలకు దేశం యావత్తూ దిగ్బ్రాంతికి లోనయ్యే ఆ సంఘటన జరగడానికి ఆస్కారముంది.

సర్! నా రిక్స్వెస్ట్‌ను మన్నించి. ఆ రోజు ఆ పార్టీ మీటింగ్‌కి మీరు హాజరుకాకండి. అపురూపమైన మేధావిని శతృవుల బుల్లెట్స్‌కు బలి కాకుండా చూడండి.

దిశ ఇంగ్లీషులో రాసిన లెటర్లో చివరి వాక్యం అది!

పోస్టాఫీసుకెళ్ళి తనే స్వయంగా కవరు మీద ప్రధాని రెసిడెన్స్ అడ్రస్ రాసి, స్పీడ్ పోస్ట్ చేసింది.

మరో పన్నెండు గంటల తర్వాత ఆ కవరు ఢిల్లీలోని ప్రైంమినిస్టర్ రెసిడెన్స్‌కు చేరుకుంది.

మీటింగ్‌కి కొన్ని గంటల ముందైనా ప్రధాని విశ్వంభరరావు ఆ లెటర్ని చూసినా చాలు.

ప్రమాదం నుంచి ఆయన బయటపడతారు.

లెటరు డ్రాప్ చేశాక తిరుపతిలోని ఓ డైలీ న్యూస్ పేపర్ ఆఫీస్‌కు ఫోన్ చేసింది దిశ.

తనకు కావల్సిన వివరాల గురించి అడిగిందామె.

“ఏంటమ్మా? నీకే ఇన్ఫర్మేషన్ కావాలి…? ప్రైంమినిస్టర్ ఆఫ్ ఇండియాకి పర్సనల్‌గా, చాలా సన్నిహితంగా వుండే వ్యక్తులెవరనా?”

“అవున్సార్! ఎమ్.ఫిల్‌లో నా సబ్జెక్ట్! పి.ఎమ్. పర్సనల్ స్టాఫ్ అండ్ దైర్ రెస్పాన్స్‌బులిటీస్…”

“ఇలాంటి సబ్జెక్ట్ మీద కూడా ఎమ్.ఫిల్లులు, పి.హెచ్.డీలూ చెయ్యొచ్చన్న మాట… చూడమ్మా! పి.ఎమ్.కి చాలా సన్నిహితంగా వుండే వ్యక్తుల్లో పి.ఎ.లు, పిఎస్‌లు, స్పెషల్ ఎడ్వయిజర్స్… చాలా మందుంటారు.”

“వాళ్ళందరిలో చాల దగ్గరగా, రోజూ దగ్గరగావుండే వ్యక్తులెవరు?”

“అలాంటి వాళ్ళలో అయితే.. పర్సనల్ డాక్టర్, న్యూట్రిషనిస్ట్, అండ్ పర్సనల్ సెక్యూరిటీ చీఫ్.”

“వీళ్ళ ముగ్గురిలో మరింత సన్నిహితంగా ఎవరుంటారు?’

“ఏంటమ్మా! అంత డిటైల్డ్‌గా మాకెలా తెలుస్తాయి చెప్పు. నేను ఢిల్లీలో న్యూరోలో పనిచేశాను కాబట్టి.. ఈ మాత్రమైనా చెప్పగలిగాను.”

“అందుకే అడుగుతున్నాను సార్! ప్లీజ్ సార్.”

“మన విశ్వంభరరావుగారికి బాగా సన్నిహితులైన వ్యక్తులు. ఇద్దరే ఇద్దరున్నారమ్మా. ఒకరు న్యూట్రిషనిస్ట్ భారతి. రెండు పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ రుషికుమార్.”

“వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా సార్?”

“వాళ్ళతో నువ్వు మాట్లాడతావా.. ఎందుకు?’

“ఇంటర్వ్యూ కోసం.. “టక్కుమని అబద్దమాడేసింది దిశ.

“అసాధ్యురాలివే! పి.ఎమ్. ఫోన్ చేస్తే.. “థాంక్స్ కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేసేసింది దిశ… ఆమె అంత ఉద్రిక్తతో వుంది.

ఆ తర్వాత…

కౌంటర్‌లో వున్న వ్యక్తిని టెలిఫోన్ డైరెక్టరీ అడిగి పి.ఎమ్. రెసిడెన్స్ నెంబర్ తీసుకుని మళ్ళి ఎస్.టి.డి. టెలిఫోన్ బూత్‌లోకి అడుగుపెట్టింది.

*                            *                                  *

దిశ టెలిఫోన్ బూత్‌లోకి అడుగుపెట్టినప్పుడు కరెక్ట్‌గా టైమ్ 12.35 నిమిషాలు.

అంటే సరిగ్గా నలభై ఎనిమిది గంటల తర్వాత ఆమె కల నిజమవుతుందని అనుకుంటే, ప్రధాని విశ్వంభరరావు మీద మర్డర్ యత్నం జరుగుతుంది.

ఆ రోజు శుక్రవారం…

మొదట ఢిల్లీ ఎస్‌టిడి కోడ్‌ని 011 ప్రెస్ చేసి.. ఆ తర్వాత ప్రైంమినిస్టర్ రెసిడెన్స్ నెంబరు 3015556 … ఒక్కొక్క నెంబరుని నెమ్మదిగా ప్రెస్ చేసింది.

ఎంగేజ్… రెండోసారి మళ్ళీ ట్రై చేసింది… మళ్ళీ ఎంగేజ్…

సరిగా అదే సమయంలో ఢిల్లీలో ప్రైంమినిస్టర్ రెసిడెన్స్‌లోని న్యూట్రిషనిస్ట్ భారతి తన రెసిడెన్స్ కమ్ ఆఫీసులోకి అడుగుపెట్టింది.

ఆమె చేతిలో ఇంపార్టెంట్ ఫైలుంది.. ఆ ఫైల్లో ఆదివారంనాడు జరిగే మీటింగ్‌లో ప్రధాని వుపన్యాసానికి సంబంధించిన పేపర్స్ వున్నాయి. ప్రతిసారీ ప్రధాని విశ్వంభరరావు తన వుపన్యాసానికి సంబంధించిన నోట్స్‌ను స్వయంగా తయారుచేసుకుంటారు.

దానిని ఒక ఆర్డర్‌లో పెట్టి టైప్ చేసిచ్చే రెస్పాన్స్‌బిలిటీ భారతిది. భారతి లోనికి రాగానే. ఆమె అసిస్టెంటు రమానాయర్ విష్ చేసింది. రమానాయర్  పార్టీ మీటింగ్స్‌కి సంబందించి విశ్వంభరరావు పర్సనల్ ఫ్రెండ్స్‌కి ఇన్విటేషన్ పంపించే హడావుడిలో వుంది.

భారతి గబగబా లోనికి నడిచి తన చేతిలోని ఫైల్‌ని బీరువాలో పెట్టింది.

ఉదయం నుంచీ పి.ఎమ్. వుండటంవల్ల ఆమెకు చాల అలసటగా వుంది.

సాయంత్రం వరకూ ఆమెకసలు ఏ అపాయింట్‌మెంట్సూ లేవు.

తలారా స్నానం చెయ్యాలనుకుని బాత్‌రూమ్‌లోకి అడుగుపెట్టింది.

బాత్‌రూంలోని గీజర్ ఆన్ చేసింది. టి.విని కూడా ఆన్ చేసింది.

మ్యూజిక్ టి.విలో స్పేషల్ మ్యూజికల్ ప్రోగ్రామ్ వస్తోంది.

 తలకు షాంపూ పట్టించుకునే కార్యక్రమంలో వుంది. సరిగ్గా అదే సమయంలో బాత్‌రూమ్‌లో వున్న ఇంటర్‌కమ్ గరగరమని శబ్దం చేసింది.

భారతి ఆఫీసు సెక్షన్‌కు వచ్చే ప్రతి ఫోనుకాల్ రమానాయరు దగ్గరున్న మెయిన్ ఫోనుతో పాటు, భారతి బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో కూడా మోగుతుంది.

డే టైమ్‌లో సాధారణంగా ఆ ఫోన్లకు రమానాయరు ఎటెండవుతుంది… మరీ  ఎమర్జన్సీ కాల్స్ అయితే భారతికి కనెక్షన్ యిస్తుంది.

సరిగ్గా పది సెకండ్లు మోగి, ఫోను కట్ అయింది.

*                            *                                  *

ఏంటి ప్రైంమినిస్టర్ ఆఫీసుకి సెలవులిచ్చేశారా?” తనలో తనే జోక్ వేసుకుని మళ్ళీ ట్రై చేసింది దిశ.

చటుక్కున ఎవరో ఫోన్ రిసీవరు ఎత్తడంతో ఎలర్టయిందామె.

“పి.ఎమ్ రెసిడెన్స్ ప్లీజ్…!”

“కెన్ ఐ స్పీక్ టు మిస్ భారతి- న్యూట్రిషనిస్ట్.. చాలా అర్జంట్”

“వారికి డైరెక్ట్ నెంబరుంది. ఈ నెంబరుకి ఫోను చెయ్యండి” ఆ నెంబరు చెప్పింది ఆపరేటర్.

దిశ మళ్ళీ ఆ నెంబరుకి ట్రయ్ చేసింది.

మొదట వచ్చిన ఫోన్‌ని రిసీవ్ చేసుకున్న రమానాయరు. ఆ ఫోను ఆమెకే రావడంతొ మాట్లాడి పెట్టేసింది.

దిశ చేసిన ఫోను రెండో ఫోన్…

“హలో” బోలియే…”

“ఈజిట్! న్యూట్రిషనిస్ట్ భారతీస్… రెసిడెన్స్….”

“ఎస్…!”

“మేడమ్! అయామ్… దిశ ఫ్రమ్ తిరుపతి… వెరీ అర్జంట్ మెటర్.”

“మీరు భారతిగారి ఫ్రెండా…?”

“నో! నో! బట్ అర్జంట్లీ.”

“వాట్స్ ద మేటర్…?”

“రిగార్డింగ్… ప్రైమ్ మినిస్టర్… ఎస్సాసినేషన్స్”

“ప్రైమ్ మినిస్టర్స్ ఎస్సాసినేషన్స్…?! పక్కలో బాంబుపడినట్లు ఉలిక్కి పడింది రమానాయర్.

అది ఇన్‌ఫర్మేషనో, హెచ్చరికో ఆమెకు అర్థం కాలేదు… అలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే లైన్ కట్ చేసెయ్యాలని స్ట్రిక్టు ఇన్‌స్ట్రక్షన్స్…

వెంటనే లైన్ కట్ చేసేసి తన పనిలో తను మునిగిపోయింది రమానాయర్.

*                            *                                  *

లైన్ వెంటనే ఎందుకు కట్ అయింది? అలాంటి న్యూస్‌ని సడెన్‌గా చెప్పడం వల్ల అవతలి వ్యక్తి కంగారుపడిందేమో.

తను చేసిన పొరపాటు అర్థం చేసుకున్న దిశ మళ్ళీ ఫోను చేసింది.

మూడు క్షణాలు… అయిదు క్షణాలు… పది క్షణాలు…

మళ్ళీ రిసీవరు ఎవరో ఎత్తిన చప్పుడు…

“మేడమ్… అయామ్ దిశ ఫ్రమ్ తిరుపతి… ప్లీజ్ డోంట్ కట్ ది లైన్… నేను అతి ముఖ్యమైన సమాచారాన్ని మీకందచేస్తున్నాను. ప్లీజ్ కైండ్లీ నోటిట్‌డాన్ అండ్ పాసాన్ టు ప్రైంమినిస్టర్….” గబగబా చెప్పింది దిశ.

“చెప్పండి…” రైటింగ్ పాడ్‌ను దగ్గరగా లాక్కుంటూ అంది రమానాయరు.

“రేపటి సండే రెడ్‌ఫోర్ట్ దగ్గర పార్టీ మీటింగ్ జరుగుతోంది కదా! అక్కడ సరిగ్గా పన్నెండూ ముప్పై అయిదు నిమిషాలకు… ప్రధాని విశ్వంభరరావుగారిమీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. సో… ” ఆ హత్యను ప్రధాని తప్పించుకోవాలంటే ఏం చేయాలో చెప్పింది దిశ.

దిశ చెప్తున్న ఒక్కొక్క మాట తూటాలా రమానాయర్ బ్రేయిన్లో పని చేస్తోంది.

“మీటింగ్ జరగనివ్వండి పర్వాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్‌లో మాట్లాడే టైమ్‌ని మార్చండి చాలు. అంటే ర్యాలీ పన్నెండు గంటలకు ప్రారంభమవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ మూడు గంటలకు రెడ్‌ఫోర్టుకి వస్తారు. మూడున్నరకు ఆయన డయాస్ ఎక్కుతారు. ఆయన ప్రోగ్రామ్‌ని సడన్‌గా మార్చడం వల్ల మనం ఆయన్ని రక్షించుకోగలుగుతాం” ఉద్వేగంగా చెప్పింది దిశ.

“ఇంతకీ ఈ ఇన్‌ఫర్మేషన్ మీకెలా తెల్సింది?” రమానాయర్ గొంతులో ఏదో కంగారు.

“నో మేడం! ఆ ఇన్‌ఫర్మేషన్ నాకెలా తెల్సిందో ఒక ప్రధాన మంత్రికి మాత్రమే నేను చెపుతాను. అదీ ఆయన సురక్షితంగా పార్టీ మీటింగ్ నుంచి బయటపడ్డాక…” చెప్పి- “మేడమ్! డోంట్ టేకిట్ ఈజీ బీ కేర్ వుల్.”

దిశ ఫోన్ కట్ చేసింది. ఇప్పుడామెకు ఎంతో సంతృప్తిగా వుంది. డోరు తెరుచుకుని బయటికొచ్చి బిల్లు సొమ్ము చెల్లించి కౌంటర్‌లోని వ్యక్తి తనకిచ్చిన రసీదువైపు చూసింది.

సెవెన్ మినిట్స్!

తను ఫోన్లో సెవెన్ మినిట్స్ మాట్లాడిందా? గగబా రోడ్డెక్కింది దిశ.

*                            *                                  *

   తను రైటింగ్ పాడ్ మీద షార్ట్ హేండ్‌లో రాసుకున్న ఆ ఇన్ఫర్‌మేషన్‌ని మళ్ళీ మళ్ళీ చదివింది రమానాయర్.

ఆమె వంటినిండా ఎందుకో చెమటలు పట్టేశాయి.

అలాంటి కాన్ఫిడెన్షియల్ మేటర్స్‌ని రమానాయర్ అందుకోగానే ఇమ్మీడియట్‌గా చెప్పాల్సిన వ్యక్తి భారతి.

కానీ రమానాయర్ ఆ పని చెయ్యలేదు. అటూ ఇటూ ఒకసారి చూసింది. సీట్లోంచి లేచి భారతి వుండే రూమ్ దగ్గరకు వెళ్ళింది. వరండా డ్రాయింగ్ రూమ్… హాలు లోన.. బెడ్ రూమ్…

భారతి ఇంకా బాత్‌రూమ్‌లోనే వుందనే విషయం నిర్ధారణ చేసుకుని గబగబా ఫోన్ దగ్గరకొచ్చి, భారతి రూమ్‌లో వున్న ఇంటర్‌కమ్‌లో స్విచెస్‌ని ఆఫ్ చేసి మెయిన్ ఫోన్ రిసీవర్ అందుకుని ఒక నెంబరుని ప్రెస్ చేసింది.

సరిగ్గా పది సెకండ్ల తర్వాత ప్రైమ్‌మినిస్టర్, రెసిడెన్స్‌కి ఎక్కడో తిరుపతి నుంచి వచ్చిన ఆ విషయాన్ని చెప్పిందామె.

“గుడ్… ఆ న్యూస్ నీ దగ్గరనుంచి మరెక్కడకూ వెళ్ళకూడదు” హెచ్చరించినట్లుందా కంఠం.

“తెలుసు సార్!”

“నువ్వు డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చేసరికి నీ నజరానా నీకు సిద్దంగా వుంటుంది. బైదిబై… ఎందుకైనా మంచిది. రెండ్రోజులు నువ్వు ఆఫీసుకి సెలవు పెట్టు… సరదగా గోవా వెళ్ళు. ఓ.కె.!’

“ఎస్ సర్!” వినయంగా అంది రమానాయర్. ఫోన్‌కి ఆవలివైపున నున్న వ్యక్తి ప్రతాప్‌సింగ్ అని ఆమెకు, మరేవరికీ తెలీదు.

సరిగ్గా ఆ సమయంలో డ్రెస్ చేసుకుని బయటికి రాబోతూ సరదాగా రుషికుమార్‌ని పలకరించాలని ఇంటర్‌కమ్ అందుకుని నెంబరు ప్రెస్ చేసింది భారతి.

కానీ ఆ ఇంటర్‌కమ్ డెడ్ అయి వుండడంతో ఆమెకేమీ అర్థం కాలేదు. రెండుసార్లు ట్రైచేసి పక్కన పడేసి బెడ్‌రూమ్‌లోంచి డ్రాయింగ్ రూమ్‌లో కొచ్చింది.

సరిగ్గా ఆ సమయంలోనే రమానాయర్ ఫోన్ కట్ చేసి రిసీవర్ని యధాస్థానంలో వుంచేసి గుండెలమీద చేతులు వేసుకుని హాయిగా వూపిరి పీల్చుకుంది.

రైటింగ్ పాడ్‌లోంచి గబగబా తాను రాసిన మెసేజ్ పేపరుని లాగి, ముక్కలు ముక్కలుగా చేసి పక్కనున్న డస్ట్‌బిన్‌లో పడేసింది.

సరిగ్గా ఆ కాగితాల్ని రమానాయర్ డస్ట్‌బిన్లో పడేస్తున్న సమయంలోనే అక్కడ కొచ్చింది భారతి.

“రమా.. ఇంటర్‌కమ్ డెడ్ అయి వుందేమిటి?” ఆ ప్రశ్న వేస్తుందని వూహించని రమానాయర్ భారతి ముఖంవైపు వెలవెలబోతూ చూసింది. అయినా క్షణాల్లో తేరుకుని..

“మీరు స్నానం చేస్తున్నారని నేనే కట్ చేశాను మేడమ్.. డిస్ట్రబెన్స్ ఎందుకని?”

“నాకేవైనా ఫోను వచ్చాయా?”

“లేదు మేడమ్!”

మూడు నిమిషాల తర్వాత భారతి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది.

అప్పుడు….

లెటర్ పాడ్‌మీద లీవ్ లెటరుని టైప్ చేయడం మొదలెట్టింది రమానాయర్.

*                            *                                  *

గాంధీనగర్ మార్కెట్ వరకూ వచ్చిన దిశ చటుక్కున ఆగిపోయింది.

తన ఇన్ఫర్‌మేషన్‌ని భారతి నిజంగా నమ్మిందా? ఆమె ఫోన్లో యిచ్చిన మెసేజ్‌ని అందుకున్న వ్యక్తి భారతే అని అనుకుంటోంది దిశ. ఆమె బేసిక్‌గా నమ్మాల్సిన అవసరం లేదు. ఆర్డినరీ ఫోన్‌కాల్‌లా కొట్టి పారేస్తే? ఆ ఆలోచన రావడంతోటే వెనుదిరిగి మళ్ళీ వెనక్కి అడుగువేసింది దిశ.

మళ్ళీ టెలిఫోన్ బూత్‌వైపు వస్తున్న దిశవైపు ఆశ్చర్యంగా చూశాడు ఆ కొంటరులోని వ్యక్తి.

అప్పుడు రుషికుమార్‌కి ఫోన్ చేయాలని నిర్ణయించుకుందామె. ప్రైమ్‌మినిస్టర్ పర్సనల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు కాబట్టి తనిచ్చిన ఇన్‌ఫర్మేషన్‌ని గాలి ఇన్‌ఫర్‌మేషన్‌గా అతను కొట్టెయ్యకపోవచ్చు.

ఫోన్ రిసీవరు అందుకుంటూ ఎందుకో చేతి గడియారంవైపు చూసింది దిశ.

సరిగ్గా 1-40 నిమిషాలు.

ఢిల్లీలోని ప్రైమ్‌మినిస్టరు రెసిడెన్స్‌కి రెండోసారి ఫోను చేస్తుందామె ఉద్వేగాన్ని అణచుకుంటూ..

*                            *                                  *

సరిగ్గా 1-40 నిమిషాలు.

ఆ సమయంలో రుషికుమార్ తన ఆఫీసు నుంచి రెసిడెన్స్‌లో వున్న భారతితో మాట్లాడుతున్నాడు.

ఆదివారంనాడు మీటింగ్‌కి వెళ్ళే సమయంలో ప్రధాని వేసుకునే డ్రెస్ గురించి మాట్లాడుతూ…

“మిస్ భారతీ! బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్.. మరచిపోవద్దు. నేను చెబితే నాది జాగ్రత్తని కొట్టిపారేస్తారు. చెడ్డవాళ్లకు శతృవులుంటారుగాని, మంచివాళ్ళకెందుకుంటారని, నా మాటని ఆయన లెక్కచేయరు. రాజకీయాల్లో మంచివాళ్ళకే శతృవులెక్కువ. నువ్వే ఎలాగో ఒప్పించు” హెచ్చరించాడు రుషికుమార్.

“ఇందుకేనా ఫోన్ చేసింది… ఎప్పుడూ ఆఫీసు గొడవేనా?” చిరాకును నటించింది భారతి.

ఆ సమయంలో రుషికుమార్ చాలా సీరియస్‌గా వున్నాడు. అతని మనసెందుకో చికాగ్గా వుంది.

అతని సిక్స్త్‌సెన్స్‌లో ఏదో తెలీని ఉద్వేగం.. అతని నరనరానా టెన్షన్.

“ఏంటీ?” మళ్ళీ అడిగాడతను.

“అదే.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గారూ! మరీ అంతా డ్యూటి మైండెడ్‌గా వుంటే మంచిది కాదేమో… ఈవెనింగ్ సరదాగా రాజ్‌కపూర్ సినిమాకెళదాం. సరేనా?” ఉడికించాలనే అంది భారతి.

“బుల్‌షిట్… రాజ్‌కపూర్ సినిమా? నేను ఖాళీ సమయాల్లొ కలలు కనడానికి, సినిమాలకు వెళ్ళడానికి, కాలేజీ స్టూడెంటుని కాదు… మైండిట్” సీరియస్‌గా అనేశాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న భారతి..

“సారీ రుషీ!” అంది ఎపాలజిగ్గా, వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు రుషి.

“కొన్ని రోజులాగు బేబీ! నిన్ని ఎక్కడకు తీసుకెళతానో చూడు” రుషి స్వరం మారింది.

“ఎక్కడకు తీసికెళతావ్?”

ఎవరికీ వినిపించకుండా నెమ్మదిగా చెప్పాడు రుషి.

“చీ!” భారతి బుగ్గలు ఎరుపెక్కాయి.

“సీ యూ…” ఫోను పెట్టేసి సెట్లోంచి లేచి నిలబడి తన అసిస్టెంటుకి ఇన్‌స్ట్రక్షన్ యిచ్చి చాంబర్‌లోంచి బయటకు వచ్చాడు రుషికుమార్.

ప్రధాని ఆఫీసు నుంచి ఇంటికొచ్చే టైమ్ అది.

రుషికుమార్ జీపు, ప్రధాని ఆఫీసు మార్గం పట్టింది.

*                            *                                  *

అంతవరకూ ఎంగేజ్, ఎంగేజ్‌గా వున్న ఫోనులో గణగణమని శబ్దం వినిపించడంతొ ఆ ఫోను రిసీవర్ని అందుకున్న వ్యక్తితో తనకెవరు కావాలో చెప్పింది దిశ.

“సారీ మేడమ్! ఆయనిప్పుడే ప్రైమ్‌మినిస్టర్ ఆఫీసుకి వెళ్ళారు.”

“మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తారు?”

“తెలీదు మేడమ్!”

“ఎనీ మెసెజ్ ప్లీజ్…”

“దిశ… ఫ్రమ్ తిరుపతి.. మళ్ళీ ఫోను చేస్తానని చెప్పండి.”

“ఇంతకీ విషయం ఏమిటో!” అంతట్లోనే ఫోన్ కట్ అయింది. రుషికుమార్ ఆఫీసులో ఫోన్ అందుకున్న అతని అసిస్టెంట్ రైటింగ్ పాడ్ మీద ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ దిశ.. తిరుపతి.. అని రాసి రుషి టేబుల్ మీద వుంచి తన సీట్లోకి వెళ్ళిపోయాడు.

*                            *                                  *

ఆ రాత్రి దిశకు ఎందుకో నిద్ర పట్టలేదు.

మగత నిద్ర.. ఆ కాసేపు నిద్రలో మళ్ళీ రిపీట్ అయిన ఎర్రకోట మీటింగ్ కల…

ఒకే కల రెండుసార్లు రిపీట్ కావడం… చాలా అరుదయిన విషయము.

“నువ్వు ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావ్… అందుకే…” సవ్యసాచి నవ్వుతూ అన్నాడు మర్నాడు.

“లేదు డాక్టర్… నాకెప్పుడూ ఇలాంటి మానసిక పరిస్థితి ఎదురవలేదు” విషణ్ణ వదనంతో అంది దిశ.

“రుషికుమార్ దొరికారా?”

“లేదు డాక్టర్! మూడుసార్లూ ట్రై చేశాను. ఆయన సీట్లో లేరు” చెప్పిందామె.

అప్పటికి  ఢిల్లీలో ఎర్రకోట దగ్గర మీటింగ్ జరగడానికి ఇంకా 26 గంటల సమయం మాత్రమే వుంది.

*                            *                                  *

అదే రోజు రాత్రి రెండు గంటలు దాటింది…

రెడ్‌ఫోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ దాదాపు నిశ్శబ్దంగా వున్నాయి. ఎర్రకోటకు కొంచెం దూరంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.

జెండాలు, కటౌట్లు ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల నుంచి ఒక గంట క్రితం మాత్రమే అలంకరణ పూర్తిచేసి కార్యకర్తలు వెళ్ళిపోయారు.

మీటింగ్ వేదికకు ఎడంపక్క కొంచెం దూరంలో చిన్న ఐలాండ్, ఐలాండ్ మధ్యలో వాటర్ ఫౌంటెన్.

చుట్టూ రకరకాల చెట్లు…

సరిగ్గా రెండు గంటల పది నిమిషాలకు… నెమ్మదిగా ఒక మారుతీ కారు వచ్చి మెయిన్‌రోడ్డు మీద ఆగింది.

ఆ కారు డ్రయివింగ్ సీట్లోని వ్యక్తి విండో గ్లాస్‌ను కిందకు దించి నలువైపులా చూశాడు.

ఎక్కడా మనిషి అలికిడి లేదు.

కారు డోరు తెరుచుకుని బయటికొచ్చి, పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఐలాండ్ దగ్గరకొచ్చాడు.. వాటర్ ఫౌంటెన్ వైపు చూశాడు. ఆ ఫౌంటెన్ ఇటీవలి కాలంలో పనిచేసిన దాఖలాలు లేవు. ఆ ఫౌంటెను చుట్టూ పిచ్చి పిచ్చి మొక్కలు దట్టంగా, వత్తుగా పెరిగాయి.

రెండడుగుల ఎత్తున్న ఆ ఐలాండ్ గోడ మీద కాలేసి, లోనికి తొంగిచూసి, వేదిక వైపు చూశాడు.

ఆ వేదికమీద ఏ కార్నర్లో ఎవరు నిలబడినా, ఆ ఐలాండ్ దగ్గర్నించి గురిచూసి ఎయిమ్ చేస్తే తప్పించుకోలేరు.

సంతృప్తిగా చిన్నగా నవ్వుకుని, బ్లాక్ కలర్ జాకెట్‌లోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, అందులో వున్న ఒకే ఒక సిగరెట్ తీసుకుని, ఖాళీ సిగరెట్ ప్యాకెట్‌ను కింద పడేసి, గోల్డ్ కలర్ లైటర్తో ఆ సిగరెట్‌ను వెలిగించుకుని, ఒక పఫ్ లాగి, ఇలాండ్ గోడ దిగి, ఫౌంటెన్ దగ్గరకు నడిచాడు.

మరోసారి తననెవరూ గమనించడం లేదని నిర్థారణ చేసుకున్నాక ఫ్యాంటు కుడిజేబులో చేయిపెట్టి చిన్న వస్తువును పైకి తీశాడు.

స్పెషల్లీ మేడ్, హైరేంజ్, స్కాట్లాండ్ యార్డు రివాల్వరది. అంతక్రితమే దానినిండా బుల్లెట్స్ అమర్చాడతను.

నెమ్మదిగా కిందకు వంగి ఫౌంటెన్ కింది భాగంలో వున్న పిచ్చి మొక్కల్ని లాగేసి, వేళ్లతోనే మట్టిని తవ్వి, ఆ మట్టిలో ఆ పిస్టల్‌ని కప్పేసి, పిచ్చి మొక్కల్ని దానిమీద దట్టంగా పెట్టేసి.. బయటికి వఛ్ఛాడు…

ఆ వ్యక్తి శోభరాజ్.

మరొక అయిదు నిమిషాలసేపు ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరిగి.. తన కార్యక్రమం పూర్తయ్యాక ఎలా అక్కడ నుంచి తప్పించుకోవాలో, ఒక పకడ్బందీ ప్లాన్‌ని అప్పటికప్పుడే రూపకల్పన చేసుకున్నాడు.

కొన్ని లక్షలమందిలో  తననెవరూ గుర్తుపట్టలేరు. పట్టుకోలేరు…

కార్యక్రమం పూర్తయ్యాక కొన్ని గంటల్లోనే తను సురక్షితమయిన ప్రదేశానికి వెళ్ళిపోతాడు…

ఆలోచించుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు శోభరాజ్.

అప్పటికి అతని చేతిలోని రాయల్ సైజ్ సిగరెట్ సగం కూడా కాలలేదు… ఆ సిగరెట్‌ను కిందపడేసి, బూటు కాలితో తొక్కి కారు ఎక్కాడు.

మరో మూడు నిమిషాలలో ఆ కారు అక్కడ నుంచి మాయమయి పోయింది.

ఎంత గొప్ప ఇంటిలిజెంటు క్రిమినల్ అయినా తనని పట్టుకోడానికి తనె క్లూ అందిస్తాడన్నది ఓ ఇంగ్లీషు ప్రోవెర్బ్.

ఇరవై నిముషాల తర్వాత…

రుషికుమార్ ఆధ్వర్యంలోని ప్రైమ్‌మినిస్టర్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ అక్కడకొచ్చింది.

డయాస్ మీద ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో వారి వారి పొజిషన్స్‌కు సంబంధించి రిహార్సల్ వర్క్ జరిగింది.

వేదిక ప్రాంతంలోనే రుషికుమార్ ఓ నలభై నిమిషాల సేపు గడిపి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడు సమయం మూడూ ఇరవై అయిదు నిమిషాలు.

*                            *                                  *

సరిగ్గా అదే సమయంలో…

తిరుపతిలోని రూమ్‌లో వున్న దిశకు చటుక్కున మెలుకువ వచ్చింది.

లైటు వేసి గడియారంవైపు చూసింది.

అదే కల… వెంటాడుతున్న కల… ఫ్రిజ్‌లోంచి గ్లాస్‌తో చల్లని నీళ్ళు తాగి వరండాలో పచార్లు చేయడం మొదలెట్టింది.

తను రాసిన లెటరు ప్రధానికి అందే వుంటుందా?

అదే సమయంలో తను అందజేసిన మెసెజ్‌ని భారతి ప్రధానికి చెప్పే వుంటుందా?

తను అనుకున్నవన్నీ యధాప్రకారం జరిగితే తన మాటల్ని ప్రధాని విశ్వసిస్తే… ఆయన మీటింగులో పార్టిస్పేట్ చేయడు… చేసినా టైమింగ్ మార్చుకుంటారు. లేదా మీటింగునే కేన్సిల్ చేసే అవకాశం వుంటుంది.

అలాంటి నిర్ణయాన్ని ప్రధాని తీసుకుంటే.. ఆ న్యూస్ మార్నింగ్ వచ్చే పేపర్స్ అన్నీ కవరు చేస్తాయి.

ఆ ఆలోచన వచ్చిన తడపుగానే శాలువా తీసుకుని, కప్పుకుని రూంలోంచి రోడ్డుమీదకొచ్చింది.

ఎంత అర్థరాత్రయినా తిరుపతి రోడ్లు నిర్జనంగా వుండవు… దానిక్కారణం అది పిలిగ్రిమ్ సెంటరు కాబట్టి…

రెండు గజాల దూరంలో వున్న రైల్వేస్టేషన్ దగ్గరకు నడిచింది.

రేణిగుంట నుంచి వచ్చే డైలీ పేపర్లు మొట్టమొదట అక్కడికే వస్తాయి.

అంతక్రితం అయిదు నిమిషాల ముందు వచ్చిన పేపర్లను ఏరియా పద్దతిలో డివైడ్ చేస్తున్నారు పేపర్ బోయ్స్.

ఓ పేపర్ని తీసుకుని ఫ్రంట్ పేజీని గబగబా చూసింది. రెండో పేజీ… నాల్గో పేజీ… ఏ పేజీలోనూ మీటింగ్ రద్దయిన వార్త లేదు.

మొదటి పేజీలో పార్టీ మీటింగు సందర్భంగా ఢిల్లీని అందంగా అలంకరించిన విశేషాలు… ఫోటోల్తో సహా ప్రధాని, మాజీ ప్రధానుల కటౌట్ల చిత్రాలు… వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న లక్షలాదిమంది కార్యకర్తలకు అధికారులు అందచేస్తున్న సేవలు, ఆహారపు అలవాట్లు…

“నో… నో… నో… నో…” చిరాకుగా పేపర్ని అసహనంగా మడతలు పెట్టేసి గబగబా రూమ్‌లోకొచ్చేసింది.

అంటే స్పీడ్ పోస్టులో పంపిన లేటరు ప్రధాని చూడలేదా?

తన ఫోన్ మెసేజ్‌ని భారతి నమ్మలేదా?

అందుకే ఈ దేశం ఇలా తగలడుతోంది.. అంతా అయిపోయాక ఎంక్వయిరీలు, హడావుడి తప్ప ముందు ఎవరూ, ఏ ఒక్కదన్నీ పట్టించుకోరు.

ఏదో చేయాలి!

సమ్‌థింగ్ విల్ బీ డన్… ప్రధానిని మర్డర్ ఎటెంట్ నుంచి సేవ్ చేయాలి.

అంటే…

తను ఢిల్లీ వెళ్ళాలి… ఎలా?

మళ్ళీ రోడ్ మీదకొచ్చి తలకోన అడవుల్లో వున్న సవ్యసాచికి ఫోన్ చేసింది.

“అయితే… ఢిల్లీ వెళతావా?”

“ఎస్ డాక్టర్! డాక్టర్ నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి-హత్యాయత్నం నుండి పిఎమ్ రక్షింపబడితే, ఈ విషయం సరిగ్గా మీకు ఒంటిగంటకు తెలుస్తుంది, లేదా.. నేనాయన్ను రక్షించలేక పోతే… మన సంస్థలకు ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ శవాన్నయినా తీసుకువస్తాను. మీరు నాకు ఈ విషయంలో కోపరేట్ చేస్తానని మాటిచ్చారు.”

  సవ్యసాచి ఒకే ఒక క్షణంలో నిర్ణయం తీసుకున్నాడు.

“మిస్ దిశా! ఐ లవ్ యువర్ సిన్సియార్టీ. సో… ఐ బిలీవ్ యూ, మన ఎక్స్‌పరిమెంటుకు ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ శవాన్ని తీసుకొస్తాననే మీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది. గో ఎ హెడ్… ఎందుకైనా మంచిది… డా!!నవనీత్ మీ వెంట వస్తారు. హి ఈజ్ చిల్లర్ ఎక్స్‌పర్ట్. యూ నో దట్.”

“థాంక్యూ డాక్టర్! నవనీత్‌ను ఒక గంటలో నా దగ్గరకు మీరు పంపింగచలరా?”

“ఎస్.. వైనాట్…”

“థాంక్యూ ఎగైన్… అయిదున్నరకు తిరుపతి నుంచి మద్రాసు మీదుగా ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్‌లో మేం వెళ్తాం. సరిగ్గా ఒంటిగంటకు మీకు ఫోను చేస్తాం” రిసీవర్ని కట్ చేసి రూమ్‌కొచ్చింది దిశ.

దిశ ఫోను చేశాక చాలాసేపు ఆమె గురించే ఆలోచించాడు సవ్యసాచి. అప్పటికే అతను డా!!నవనీత్‌కు ఇన్‌స్ట్రక్షన్స్ యిచ్చాడు.

శవాన్ని చిల్లర్‌గా మార్చడానికి అవసరమైన సరంజామా వున్న కిట్‌ను పట్టుకుని నవనీత్ తలకోన అడవిలోంచి బయలుదేరాడు.

*                            *                                  *

ఆదివారం ఉదయం 5.30 నిమిషాలు…

రేణిగుంట ఎయిర్‌పోర్టు…

ఫ్లైట్లో తన సీట్లో కూర్చున్న దిశ మనసు వుద్వేగంగా వుంది. పక్కనున్న నవనీత్ మాత్రం కూల్‌గా వున్నాడు.

 

*                            *                                  *

 

ఉదయం 6.25 నిమిషాలు.

న్యూఢిల్లీలోని ప్రధాని రెసిడెన్స్-ప్రాణాయామం, యోగా పూర్తి చేసి హాల్లోకొచ్చి కూర్చుని పేపర్సు అన్నిటినీ ఒకసారి చూసి భారతి తెచ్చిచ్చిన కాఫీని తాగుతూ-

“భారతీ! ఇవాళ నేనడిగినదేదైనా కాదనకుండా నాకు నువ్వు వడ్డించాలి” నవ్వుతూ అన్నారు.

“చెప్పండి” చాల టెన్షన్‌గా ఉన్న సమయంలో తన మైండ్‌ను డైవర్టు చేసుకోడానికి విశ్వంభరరావు జోగ్గా, జోవియల్‌గా వుంటారు. ఆ విషయం భారతికి బాగా తెలుసు.

ప్రధాని చెప్పడం ప్రారంభించారు.

“బ్రేక్‌ఫాస్ట్‌లో… అల్లం పెసరట్లు… పచ్చిమిర్చి చట్నీ… మాచింగ్‌కి మొక్కజొన్న పొత్తు ఫ్రై. లంచ్‌కి ధనియాల కొబ్బరిపచ్చడి, గారేలు… పొట్లకాయ వేపుడు.. ములక్కాడ పులుసు… టమాటా సూప్” నిజంగా ఇవన్నీ తినాలని ఆయనకు చాలా రోజుల నుంచి కోరిక.

“అసలే… మీ జీర్ణశక్తి అంతంత మాత్రం. ఇవన్నీ తింటే..”

“డోన్ట్‌వరీ డర్టీ రాజకీయాల గరళాన్ని మింగుతున్న వాడ్ని… ఎ మాత్రం తిండిని జీర్ణించుకోలేనా?”

“ఓ.కె… అంకుల్! మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ నేను చెప్పినట్లు మీరూ చేయాలి” రుషికుమార్ తనతో చెప్పిన విషయం జ్ఞాపకానికొచ్చి అడిగింది భరతి.

“ఏం చేయమంటావ్?”

  “మీరీవేళ మీటింగ్‌కి వెళ్ళేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోండి.”

ఒక్కక్షణం తలెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడాయన.

“నాకు ప్రాణభయం లేదమ్మా.”

“మీకోసం కాదు అంకుల్.. ఈ దేశం కోసం.”

“నన్నెవరైనా చంపుతారని భయమా? చూడు భారతీ…! మనింట్లో మనం ఉన్నప్పుడు మనం ఎంత స్వేచ్చగా వుంటాం. అలా మన దేశంలో మనం వుండలేమా.. నేను నా ప్రజల ముందుకు వెళ్ళడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు ఎందుకు వేసుకోవాలి? స్పెషల్ కమెండోలు నా చుట్టూ ఎందుకుండాలి? దిసీజ్ అవర్ కంట్రీ భారతీ… అయినా భారతీ! నాకెప్పుడూ మృత్యువు మీద నమ్మకం లేదు.”

విచిత్రంగా విశ్వంభరరావు వైపు చూసింది ఆమె.

“అంటే?”

“పునర్జన్మ మీద నాకు నమ్మకం వుంది. నా జీవితకాలంలో నేనో మంచి పని చేయాలనుకుని చేయలేక చనిపోయాననుకో… ఆ పనిని చేయడానికి మళ్ళీ నేను జన్మిస్తాను.”

“అప్పుడు మీ స్వరూపం మారిపోదా?”

“ఆకృతికంటే ఆత్మ ముఖ్యం భారతీ.. 2001వ సంవత్స్వరానికి మన భారతీయ సమాజంలో చాలా అన్యూహ్యమైన మార్పులొస్తాయి. హింసోన్మాదాలు పెచ్చు పెరిగిపోతాయి. విలువలపట్ల మనిషికి నమ్మకం సడలుతుంది. మేధస్సు ద్వారా లభ్యమైన సుఖానికి మనిషి అంకితమయిపోయి, క్రియాశూన్యంగా కూర్చుంటాడు. అలాంటి సంధి సమయంలోనే మహాత్ములు మళ్ళీ పుడతారు.”

“అంటే.. గాంధీ మళ్ళీ పుడతాడని మీరనుకుంటున్నారా?”

“ఏం సందేహమా? ఒకచోట కొండలు పూర్తిగా క్రుంగిపోయి, నదులు పుడతాయి. ఇంకోచోట నదులు ఎండిపోయి కొండలు పుడతాయి. ఇదే సృష్టి.  ఈ దేశంలోఎక్కడో ఒకచోట గాంధీ పుట్టే వుంటాడు. లేదా పుడతాడు. కానీ ఆయన ఆకారంలో పంచె, కర్ర, కళ్ళజోడు యివేవీ వుండవు. చాలా మోడ్రన్‌గా వుంటాడాయన. ఏ పాప్ మ్యూజిక్ పాడుకుంటూనో.”

ప్రధాని విశ్వంభరరావు నోటివెంట వచ్చిన ఆ మాటకు ఫక్కున నవ్వింది ఆమె.

“నువ్వు చిన్నపిల్లవి… నీకీ విషయాలు తెలీవులే. చూడు భారతీ! నువ్వు చెప్పినట్లుగా నీకోసం బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటాను. నేనడిగే టిఫిన్ నాకు పెడతావు కదూ.”

“అలాగే” నవ్వుతూ ముందుకెళుతున్న భారతివైపు ప్రసన్నంగా చూస్తూ స్నానానికి లేచాడాయన.

 

*                            *                                  *

 

ఉదయం 7.30 నిమిషాలు.

ఢిలీలోని సప్డర్ జంగ్ రైల్వేస్టేషన్లోకి వరసగా దేశం నలుమూలల నుంచీ ఏర్పాటు చేసిన ఒక్కొక్క స్పేషల్ ట్రైన్ ప్రవేశిస్తున్నాయి.

స్టేషన్లోంచి రోడ్డుమీద కొస్తున్న వందలూ, వేలాదిమంది జనం… జనం….

అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి స్పేషల్ బస్సులు, వివిధ రకాల వెహికల్స్‌లో వస్తున్న జనం.

సరిగ్గా ఎనిమిది గంటలకి ఢిల్లీలోని ప్రధానమైన రోడ్లన్నీ కిక్కిరిసిన జన సమూహంతో నిండిపోయాయి.

పరుగెడుతున్న నాయకుల కార్లు, పెట్రోలింగ్ వ్యాన్లు, వైర్‌లెస్ సెట్లతో ఎక్కడికక్కడ నిఘా వేసిన ఇంటెలిజెన్స్ క్రూ… ఢిల్లీ అంతా అప్రమత్తమైన పహారా ప్రారంభమైంది.

 

*                            *                                  *

 

సరిగ్గా 10.10 నిమిషాలు…

మద్రాసు ఎయిర్‌పోర్టులో చిన్నపాటి సాంకేతిక లోపం మూలంగా దిశ ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్ అక్కడ గంటన్నరసేపు ఆగిపోయిది.

అదే కాకుండా, అదే ఎయిర్‌బస్‌లో తమిళనాడు చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఢిల్లీకి వెళుతుండడం వల్ల మరో పదినిమిషాలు లేట్.

ఆ ఆలస్యం. దుస్సహాంగా వుంది దిశకు.

తను సమయానికి ఢిల్లీ చేరుకోగలుగుతుందా?

నుదుట మీద పడుతున్న చెమటను పదే పదే హేండ్ కర్చిఫ్‌తో తుడుచుకుంటోందామె. ఆమెకు తెలీకుండానే ఉచ్చ్వాస నిశ్వాసల వేగం పెరిగింది.

 

*                            *                                  *

 

10.35 నిమిషాలు.

పార్టీ కేంద్ర భాగం ఆదేశల మేరకు ప్రోగ్రామ్ ప్రారంభమైంది.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యకర్తలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ ఇండియా గేటు దగ్గర మొదలైంది.

ముందు జాగ్రత్త చర్యగా సిటీలో పౌరుల వాహానాల రాకపోకల్ని నిషేధించారు.

ఎటు చూస్తే అటు జన ప్రవాహం.

దేశం యావత్తూ విశ్వంభరరావు నాయకత్వాన్నే కోరుకుంటోంది. అందుకు నిదర్శనం జరుగుతున్న ర్యాలీ… సముద్రపు తరంగాలా వినిపిస్తున్న నినాదాలు.

ర్యాలీలో పాల్గొన్న కొన్ని లక్షలమంది జనం… ర్యాలీలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రోడ్ల పక్కన బిల్డింగుల పై భాగంలోంచి స్పేషల్ కమెండోల నిఘా.. ఒక్కొక్క క్షణం భారంగా కదిలి పోతోంది.

 

*                            *                                  *

 

10.40 నిమిషాలు.

ప్రధాని రెసిడెన్స్ కేబినెట్ మంత్రులతోనూ, నాయకులతోను, అధికార, అనధికార ప్రముఖులతోనూ నిండిపోయి వుంది.

లోన పర్సనల్ రూమ్‌లో ప్రధాని విశ్వంభరరావు తన సన్నిహిత సహచరులతో సమాలోచన జరుపుతున్నారు.

విశ్వంభరరావు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు.

దానిక్కారణం ఎక్కువమంది పార్టీ ప్రతినిధులు పార్టీ అధ్యక్ష పదవికి ఆయన్నే సమర్ధిస్తున్నారు.

అదొక రాజకీయ జాతర-

సరిగ్గా అదే సమయంలో రుషికుమార్ తన చాంబర్‌లో సెక్యూరిటి ఆఫీసర్సుతో-

మీటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాడు.

“సీ మైడియర్ ఆఫీసర్స్… ప్రైమ్ మినిస్టర్ సరిగ్గా 1045 నిమిషాలకు రెసిడెన్స్ నుంచి బయల్దేరతారు. సరిగ్గా 12.15 నిమిషాలకు ఎర్రకోట దగ్గరకు చేరుకుంటారు. 12-15 నుంచి 12-25 నిమిషాల వరకూ తనను అభినందించడానికి వచ్చిన విదేశీ ప్రముఖుల్ని పలకరిస్తారు. సరిగ్గా 12-25 నిమిషాలకు వేదికవైపు నడుస్తారు. సరిగ్గా 12-30 నిమిషాలకు ఆయన మైక్ ముందు నుంచుంటారు. ఆయన ప్రసంగం దాదాపు ఎనభై నిమిషాలపాటు వుంటుంది.

ఆ సమయంలో ఎక్కడ, ఎవరికి, ఎలాంటి అనుమానం వచ్చినా ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ కండి. నాకు ఇన్‌ఫామ్ చెయ్యండి. మన పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్‌ని ఎవరూ వేలెత్తి ప్రశ్నించే పరిస్థితిలో మనం ఉండకూడదు ఓ.కే…”

ఒకటికి రెండుసార్లు రుషికుమార్ తీసుకునే జాగ్రత్తలు అక్కడి స్టాఫ్‌కు బాగా తెల్సు. మీటింగ్ అయిపోయాక రుషికుమార్‌కి సెల్యూట్ చేసి తమ తమ పొజిషన్స్‌లోకి వెళ్ళిపోయారు సెక్యూరిటీ స్టాఫ్.

 

*                            *                                  *

 

సరిగ్గా 11-10 నిమిషాలు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మద్రాసు నుంచి వచ్చిన ఎయిర్‌బస్ లాండ్ అయింది. వెంటనే దిశ, నవనీత్ అందులోంచి బయటపడ్డారు. మరో ఏడు నిమిషాల తర్వాత ఎయిర్‌పోర్టు లాంజ్‌లోని పబ్లిక్ టెలిఫోన్ బూత్‌వైపు పరుగెత్తింది దిశ.

మొదట ఆమె, భారతి రెసిడెన్స్‌కి ఫోను చేసింది.

ఎంగేజ్…

రుషికుమార్‌కి ఫోన్ చేసింది. ఎంగేజ్… మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే వుంది.

కానీ ఆ నెంబర్లు ఎంతకీ కలవలేదు.

“ఈ టైములో వాళ్ళు మనకు ఫోనులో దొరకడం కష్టం” పక్కనున్న నవనీత్ అన్నాడు.

“యూ ఆర్ రైట్… డైరెక్ట్‌గా వెళ్ళిపోతేనే మంచిది కదూ” ఆ మాట అంటూనే దిశ లాంజ్‌లోంచి బయటకు పరుగెత్తింది. ఆమె వెనక నవనీత్!

మరో అయిదు నిమిషాల తర్వాత.

ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని రెసిడెన్స్‌కు వెళ్ళే దారిలో టాక్సీలో వున్నారు దిశ, నవనీత్.

అప్పుడు టైం సరిగ్గా 11-45 నిమిషాలు.

అదే సమయయంలో…

ప్రధాని రెసిడెన్స్ దగ్గర్నుంచి ప్రైమ్‌మినిస్టర్స్ కాన్వాయ్ బయలుదేరింది.

 

*                            *                                  *

 

 అంతకు అయిదు నిమిషాల క్రితం…

11-40 నిమిషాలకు…

మీటింగ్‌కు బయల్దేరడానికి సిద్ధంగా వున్నారు ప్రధాని విశ్వంబరరావు. చివరిసారిగా తన ఉపన్యాసానికి సంబంధించిన పేపర్సును చూసుకుంటూ చిన్న చిన్న కరెక్షన్ చేస్తున్నారు.

తలెత్తి ఒకసారి భారతివైపు చూసాడాయన. ఆయన కళ్ళవైపే నిశ్శబ్దంగా చూస్తోందామె.

అంత టెన్షనులో అంత పీస్‌వుల్‌గా కనిపించడం చాలా అరుదు. అదే ఆశ్చర్యపోతోందామె.

చేతిలోని గ్రీన్ ఇంక్ పెన్నును పక్కన పెట్టి.

“పార్టీ చీఫ్ పదవికోసం, అసమ్మతి వర్గం పట్టుబడితే ఆ పదవిని వదిలేస్తాను” ఆయన కంఠంలో చిన్న మార్పును గుర్తించింది భారతి.

“మీ ఇష్టం” అందమె.

“మీ ఇష్టం! అనడానికి కాదు. నేను నా అభిప్రాయాన్ని చెప్పింది. నీ అభిప్రాయం కోసం పార్లైమెంటులో సభ్యుడిలా నువ్వు కూడా మీ యిష్టమే నా ఇష్టం అంటే ఎలా అమ్మాయ్…” నవ్వుతూ అన్నాడాయన.

“కీలకమైన సమస్యలకు వెంటనే జవాబు చెప్పడం కష్టం” నెమ్మదిగా అంది ఆమె. ఆమె కెందుకో లోలోపల ఆందోళనగా వుంది. అందుకే పరధ్యానంగా వుంది.

“కీలకమైన సమయంలోనే సమస్యలకు జవాబులు వెంటనే దొరుకుతాయి” అలా అంటున్న ప్రధాని విశ్వంభరరావు చూపులు టేబుల్‌మీద ఎడం ప్రక్కన ట్రేలో పేపర్ వెయిట్ కిందున్న బ్రౌన్ కలర్ కవరు మీద పడ్డాయి. కుడిచేత్తో ఆ కవర్ని అందుకున్నాడాయన.

కుదురుగా చేత్తో రాసిన అక్షరాలు ముచ్చటగా వున్నాయి. వెనక్కి తిప్పి చూశాడాయన.

ఫ్రమ్ దిశ…. డోర్ నెం.2-2-61/బి. తీర్థకట్టవారి వీధి-తిరుపతి.

ఆ పేరుని కలెక్ట్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారాయన. ఆ కవరు పైన కాన్ఫిడెన్షియల్ అండ్ పర్సనల్ అని వుండడంతో ప్రధాని ఆఫీసు స్టాఫ్‌లోని డిస్పాచింగ్ సెక్షనులోని క్లర్కు, ఓపెన్ చెయ్యకుండా లోనికి పంపించాడు.

కాన్ఫిడెన్షియల్ అండ్ పర్సనల్.. ఏమై వుంటుంది.. దేశ వ్యాప్తంగా మహిళల నుంచి, అమ్మాయిల నుంచి, తమకు జరిగిన అన్యాయం గురించి పట్టించుకొమ్మని లేదా ఆర్థిక సహాయం కోసమో అలాంటి వుత్తరాలు వస్తుంటాయి.

జన్యూన్ అనిపించే విషయంలో సంతకం చేసి పి.ఎ.కి ఇస్తారాయన.

నెమ్మదిగా కవరు కార్నర్స్‌ని చింపాడయన. లోన లెటర్ని బయటకు తీయబోతున్న సమయంలో-

బూటు అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు. ఎదురుగ రుషికుమార్ స్టిఫ్‌గా నిలబడి సెల్యూట్ చేస్తూ-

“సార్! ఎవ్విరిథింగ్ రెడీ సార్! అన్నాడు వినయంగా.

“హౌ ఈజ్ ర్యాలీ… ఎవ్విరిథింగ్ నార్మల్?” అడుగుతూ చేతిలోని కవరుని నెమ్మదిగా టెబుల్‌మీద పెట్టి పేపరు వెయిట్‌ని దానిమీద పెట్టాడాయన.

ఒక్కక్షణం గనుక ఆయన ఆ కవరులోని లెటరుని బయటకు తీసుంటే…

అందులో దిశ రాసిన మెటర్‌ని గనుక చదివుంటే…

విధిని ఎవ్వరూ తప్పించలేరు. అలాగే సైన్సును కూడా!!

“ఎన్సర్” జవాబిచ్చాడు రుషి చేతిలో ఫైలుతో.

సీట్లోంచి లేచి బయటికొచ్చి ముందుకడుగేశారు విశ్వంభరరావు.

ఆయనకు అటూ ఇటూ భారతీ, రుషి నడుస్తున్నారు.

నడుస్తున్న విశ్వంభరరావు ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూశారు. నిలబడి నలువైపులా చూశారు. అలా ఎప్పుడూ ఆయన చూడలేదు. మళ్ళీ ఈ ప్రదేశాన్నీ, ఈ ఇంటినీ చూస్తానో, లేదో అన్నట్టుగా ఆయనలా చూడడం విచిత్రంగా అనిపించింది ఆమెకి.

ఆయనకు మాత్రం ఎవరో చేయి పట్టుకోని వెనక్కి లాగుతున్నట్టుగా వుంది.

మళ్ళీ గబగబా ముందుకడుగేశాడాయన.అ హాలు దాటి విశాలమైన వరండా దగ్గరికి వచ్చారు.

అప్పటికే అక్కడ సెక్యూరిటీ స్టాఫ్, కేబినేట్ మంత్రులు, అధికారులు, అనధికారులున్నారు.

ఆయనక్కడకు రాగానే దూరంగా లాన్‌లో గుంపులు గుంపులుగా వున్న పార్టీ యూత్‌వింగ్ నాయకులు-

“ప్రధాని విశ్వంభరరావు జిందాబాద్… లాంగ్‌లివ్… లాంగ్‌లివ్” నినాదాలతో ఆ ప్రదేశం హోరెత్తి పోయింది.

సరిగ్గా 11-45 నిమిషలు.

ప్రధాని రెసిడెన్స్ నుంచి కార్లన్నీ వెళ్ళిపోయాయి. ఆటోమేటిగ్గా మనుషులూ మాయమైపోయారు. అంతవరకూ కిక్కిరిసిపోయిన ప్రదేశంలో సడన్‌గా ఏర్పడ్డ నిశ్శబ్దం గంభీరంగా వుంది.

రోడ్డు చివర కార్లన్నీ మలుపు తిరిగి వెళ్ళిపోయేవరకూ చూసి లోనికొచ్చింది భారతి.

మీటింగ్ సమయానికి ఎర్రకోట దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది భారతి ఏదో ఆలోచిస్తూ.

తన రెసిడెన్స్‌వైపు నడిచింది.

ప్రధాని పర్సనల్ రూమ్‌లో పేపరు వెయిట్ కింద దిశ రాసిన లెటరు అలాగే వుంది నిస్తేజంగా.

(చరిత్రలో ఇలాంటి సంఘటనే భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విషయంలో కూడా జరిగింది. ఎలక్షన్ల సమయంలో రాజీవ్‌గాంధీకి ఏదో ఒక ఘోర విపత్తు జరుగనున్నదని, ఆయన గ్రహబలం బాగోలేదని ఆయన జాతకాన్ని కూలంకషంగా పరిశీలించి తెల్సుకున్న కంచి కామకోటి పీఠాధిపతి స్వామీ జయేంద్ర సరస్వతి ఎలక్షన్ల పర్యటన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఒక ప్రత్యేకమైన లేఖను రాసి రాజీవ్‌గాంధీకి పంపారు. కానీ ఆ లేఖను రాజీవ్‌గాంధీ చూడలేక పోయారు. రాజీవ్‌గంధీ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ పర్సనల్ లేఖను రాజీవ్‌గాంధీ సతీమణి సోనియాగాంధీ చూశారు. కానీ జయేంద్ర సరస్వతి తన లేఖను సంస్కృతంలో రాయడంవల్ల ఆమెకు కూడా ఏమీ తెలియలేదు. రాజీవ్‌గాంధీ విశాఖపట్నం పర్యటన నుంచి తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ వెళ్ళడం, అక్కడ రాక్షసుల చేతిలో ఘోర దుర్మరణానికి గురికావడం మనకు తెల్సిందే. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి లేఖ వెలుగులోకి రావడం జరిగింది కానీ అప్పటికే ఈ దేశానికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది!_

చరిత్ర పునరావృతం కావడమంటే ఇదే! ఇప్పుడు కూడా విశ్వంభరరావు విషయంలో అలాగే జరగనున్నదా?

*                            *                                  *

 

ఇంకా ఉంది…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *